January 18, 2012

"కళ్ళు తెరిచిన సీత" _______రంగనాయకమ్మ కొత్త నవల






"కళ్ళు తెరిచిన సీత"

రంగనాయకమ్మ గారు చాలా రోజుల తరవాత రాసిన నవల. నవ్య వార పత్రికలో ధారావాహిక గా అనేక వారాలు వెలువడి విశేషంగా పాఠకులను ఆకట్టుకుని, అనేక చర్చలకు, వాదోపవాదాలకు దారి తీసిన నవల. అంతే కాక పాఠకుల ప్రశ్నలకు రంగనాయకమ్మ గారు ఈ నవల ప్రచురిస్తున్నపుడు జవాబులు కూడా ఇచ్చారు.

ఇది ఒక సాధారణమైన కథ! (నిజానికి ఇది కథ కాదు. నిజజీవిత గాధ) మీ ఎదురింట్లోనూ, మా పక్కింట్లోనూ, మా పై ఇంటివాళ్ల పై ఇంట్లోనూ కనపడే కథే! ఇందులోని సబ్జెక్ట్ తో ఒక డాక్యుమెంటరీ తీయొచ్చు. అయితే దీన్ని రంగనాయకమ్మ గారు అద్భుతంగా మలిచి చక్కని నవలా రూపాన్నిచ్చారు. యదార్థ గాథకు కల్పనను జోడించి కథలు రాసే ట్రెండ్ ఈ మధ్య అక్కడక్కడా చూస్తున్నాం! అయితే ఈ నవల మొత్తం యదార్థమే! ఇందులో సాక్షాత్తూ రంగనాయకమ్మ గారు, ఆమె కుటుంబ సభ్యులు, పరిచయస్తులు,పాఠకులు, పిల్లలు,వాళ్ళ పనమ్మాయి కూడా మనకు పరిచయం అవుతారు.

కథ విషయానికొస్తే చక్కగా చదువుకుని మైసూరు లో మంచి ఉద్యోగం చేస్తున్న హైద్రాబాదు సీత కి (మారు పేరు)కు అమెరికాలో ఉజ్జోగం చేస్తున్న నాగరాజుతో పెళ్ళి కుదురుతుంది. సీతవి అభ్యుదయ భావాలూ, నాగ రాజువి అట్టడుగు ఆలోచనలూ! ఈ ఆలోచనా ధోరణీ, భావాలూ ఇవన్నీ సీతకు పెళ్ళికి ముందే అర్థం అయ్యే అవకాశాలు అనేకం వస్తాయి. అయినా సీత ఒక పక్క కన్ఫ్యూజ్  అవుతూనే, నాగరాజునే పెళ్ళి చేసుకుంటుంది.(కట్నం వద్దన్నాడు గామరి!)

 పైగా నాగరాజు తీయని కబుర్లు చెప్తాడు. తనకు మూఢ నమ్మకాలు లేవనీ, ఇంట్లో తన పని తనే చేసుకుంటాననీ, ఇద్దరం కలిసి వంట చేసుకోవచ్చనీ... ఇలా! ఇవన్నీ మన సీత నమ్మి "ఇతనికి సాహిత్యం చదివే అలవాటు లేకపోతే ఏం? ప్రేమించే హృదయం ఉంది. అది చాలదూ" అని  తనని తనే మభ్య పెట్టుకుని పెళ్ళికి సిద్ధమవుతుంది.

 ముందు స్వీట్ హోమ్ బాబుతో పోల్చుకుని, తర్వాత ఇంట్లో   "సత్యం (జానకి విముక్తి లో జానకి అన్న) లాంటివాడు. అందుకే ఒప్పుకున్నా"  అని పొంతన లేకుండా మాట్లాడుతుంది.

సరే,.. పెళ్ళయి సీత చికాగో చేరుతుంది. వెళ్ళక ముందే అత్తవారింట్లో సంప్రదాయాలకీ, సీత భావాలకీ సరిపడకపోయినా సీత ప్రతి చోటా లొంగి ఉండి సర్దుకుంటుంది. అక్కడికి వెళ్ళాక సీత జీవితం దుర్భరమవుతుంది. అద్దె కలిసి వస్తుందని నాగరాజు అక్క ఇంట్లో ఉంటాడు. ఇంటిపనంతా సీత మీద పడుతుంది. నాగరాజు అతడి అక్క ఏ మాత్రం సంస్కారమూ, కన్ సర్నూ లేకుండా ప్రవర్తిస్తారు.

 ప్రతి చేష్టలోనూ, మాటలోనూ ఆధిపత్యం ప్రదర్శిస్తారు. సీత తమ ఇంట్లో పడి ఉండాల్సిందే అన్న భావం కల్గిస్తారు.ప్రతి సంఘటనలోనూ సీత మనసు ఘోరంగా గాయపడుతుంది. అక్కడి నుంచి బయట పడి తీరాలన్నంత విరక్తి కలుగుతుంది. ఎలా పడాలొ తెలీదు.అందుకే పూర్వ పరిచయాన్ని పురస్కరించుకుని తనకు సలహా ఇచ్చి కాపాడమని, అక్కడి నుంచి బయట పడేయమని రంగనాయకమ్మ గారిని కోరుతుంది.

అమెరికాలో రంగనాయకమ్మ గారి చెల్లెలి కొడుకు రవీ, పాఠకుడు, కుటుంబ సన్నిహితుడు ప్రసాదు,మరో పరిచయస్తురాలు శ్యామలా వీళ్ళంతా ఉంటారు. రంగనాయకమ్మ గారి నుంచి మెయిల్ అందుకున్న వీళ్ళంతా సీత అమెరికా నుంచి ఇండియా వచ్చేయడానికి అనేక రకాలు గా సహాయం చేస్తారు.

సీత ఇండియా వచ్చేస్తుంది. వచ్చేశాక, అక్కడ తను పడిన మానసిక హింసను అంతా కళ్ళకు కట్టినట్టు వివరిస్తుంది. నాగ రాజు మీద కేసు పెట్టాలా వద్దా అన్న దాని మీద అందరి మధ్యా చాలా చర్చలు జరిగాక,  చివరికి అతడికి విడాకుల కాయితాలు పంపడంతో (నాగరాజు మరో సీతను వెదుక్కునే మార్గం సుగమం చేయడం ) కథ ముగుస్తుంది

ఈ పుస్తకాన్ని  ‘నవల’ అనటానికి లేదు.  ఎందుకంటే వాస్తవానికి కల్పన ఏమీ జోడించలేదు కాబట్టి. ఇది, ఒక అమ్మాయి జీవితంలో  కొంత భాగం.

‘పాలల్లో నీళ్ళు కలిపినట్టూ, పట్టు తేనెలో బెల్లం పాకం కలిపినట్టూ , ఈ నిజ జీవితంలో  కల్పనలూ, ఊహా గానాలూ, కట్టు కథలూ , కలపలేదు’ అంటారు రచయిత్రి.

కథలో  ఉప కథగా శ్యామల విఫల ప్రేమ గాథ  వస్తుంది.  అసలు శ్యామలే మొదటి సీత అంటారు రచయిత్రి.  ఆమెకూ,  రచయిత్రికీ  జరిగే  ఫోను సంభాషణలు ఆలోచనాత్మకంగా ఉంటాయి.
శ్యామల కూడా ప్రేమ వివాహం చేసుకుని భర్తతో విభేదాలు వచ్చి, అతడితో కలిసే దాదాపు ఒంటరి గా పిల్లాడి కోసం బతుకుతూ ఉంటుంది.

సీత ఇక్కడికి వచ్చాక అమెరికాలో తనకు ఎదురైన చేదు అనుభవాలు వివరించే క్రమంలో అనేకమంది మనకు పరిచయమవుతారు. సందర్భానికి తగ్గట్టు రంగనాయకమ్మ గారి పదేళ్ళ మనవరాలూ, రెండేళ్ళ బుల్లి మనవడు స్పార్టకస్, పనమ్మాయి సువర్ణ, ఇంకా కోటయ్య చౌదరి..ఇలా అన్నీ నిజజీవిత పాత్రలే!

యదార్థ గాథ అయినప్పటికీ,   సీత ఐదునెల్ల  కాపురానికి సంబంధించిన  సూక్ష్మమైన  వివరాలు సైతం  విరివిగా  ప్రస్తావించినప్పటికీ  డాక్యుమెంటరీ లక్షణాలేమీ  లేకుండా ఆసక్తికరమైన నవలగా  ఇది  రూపుదిద్దుకుంది.

సీత  అమెరికాలో  భర్త ఇంటి నుంచి తప్పించుకు వచ్చిన  ఘట్టం ఉత్కంఠభరితంగా ఉంటుంది.

సీత ఆడపడుచు కస్తూరి ని  రచయిత్రి  కళ్ళకు కట్టిస్తారు.  ఆమెలోని  కపటత్వం,  మాటల్లో లౌక్యం,  చేతల్లో జిత్తులు  సహజంగా చిత్రిస్తారు.
సీరియస్ గా  కథ నడుస్తూ ఉంటే  చటుక్కున   రంగనాయకమ్మ గారి సహజసిద్ధమైన  హాస్యం , వ్యంగ్యం తళుక్కుమని మెరుస్తూ  పాఠకులను గిలిగింతలు పెడుతుంది.

సీత తండ్రి గురించి ఏమంటారో చూడండి-

‘సీత కథను సినిమాగా తీస్తే సీత మామ గారి పాత్రని పెట్టక్కరలేదు. ఆ పాత్రకి డైలాగులే  వుండవు. ఒక పాత్ర అక్కర్లేనందుకు ప్రొడ్యూసర్ కి చాలా లాభం! ’    

సీత చెప్పేది ఇంకా వినడానికి  విసుగెత్తిపోయానని చెపుతూ అంటారిలా-
ఈ చచ్చు పుచ్చు సీత కథని సినిమా తీస్తే , ప్రొడ్యూసరు మట్టికొట్టుకుపోతాడు.’ 

‘ఇంటి చుట్టూ గుడిసెల్లోనూ, బైటా, మొగాళ్ళందరి చేతలకీ రాఖీలే!  పాపాయి, తమ్ముడికి ఆ గుడ్డముక్క రాఖీ కట్టింది!  ఈ రెండేళ్ళ పురుషుడు , ఆ పదేళ్ళ స్త్రీని , రక్షిస్తూ ఉండాలని! ’

పుస్తకం చదువుతున్నంత సేపూ నవ్వొస్తూనే ఉంది నాకు చాలా చాలా చోట్ల!

కొన్ని ఘట్టాల్లో  సందర్భానుసారంగా  రచయిత్రి చేసే  ఆణిముత్యాల్లాంటి వ్యాఖ్యలు అర్థవంతంగా ఉంటాయి.  ఆలోచనలు రేపుతాయి.


‘చాలామందికి, ముఖ్యంగా ఆడవాళ్ళకి, అందులోనూ పెళ్ళీడు ఆడపిల్లలకి, ‘ప్రేమ’ కావాలి. కానీ, నిజంగా కావలసింది ప్రేమ కాదు; ప్రేమ మాటలు! ప్రేమను ప్రదర్శించే మాటలు!  ప్రేమను కురిపించే మాటలు! పైగా ఇంగ్లీష్ లో  చెప్పే ప్రేమ మాటలు!  ‘ఐ లవ్ యూ’ అంటే చాలు!  అది ప్రేమే!’

‘పూల మొక్క, భూసారంతో , సూర్యరశ్మితో, నీటి జల్లుతో , బతుకుతుంది. ఎదుగుతుంది, పుష్ఫిస్తుంది.
ప్రేమ లత, ఇరువైపులా హృదయ సౌందర్యాలతో, భావ సంస్కారాలతో, నిస్వార్థ అర్పణలతో, బతుకుతుంది, ఎదుగుతుంది, ఆనందాల్ని పుష్పిస్తుంది. ’

"ఆడవాళ్ళు భలే లాంటి వాళ్లు. వీళ్ళకు ఉత్తములైన భర్తలు కావాలి. అలాంటి భర్తల్ని పొందడానికి తాము అర్హులమేనా అన్న ప్రశ్న రాదు వాళ్ళకి. సీత సరిగ్గా అలాంటిదే! ఆమెకు కలలే తెల్సు! ఊహలే తెలుసు! పంజరంలో ఒదగడమే తెలుసు!"


ఇవన్నీ పాఠకుల్ని ఆలోచనలో పడేస్తాయి.


సీత భావాలు మొదటి నుంచీ వేరు.  కానీ ఆమె వాటిని నాగరాజుతో వివాహం కోసం వదులుకోడానికి సిద్ధపడుతుంది. మళ్ళీ  "వీళ్ళు అలా ఎందుకు చెయ్యాలి ? నాగరాజు ఇలా ఎందుకు ప్రవర్తించాలి?" అని ఆశ్చర్య పడ్డాలూ, తెల్లబోవడాలు చేస్తుంటుంది. ఆమెకు మంత్రాల పెళ్ళి ఇష్టం లేదు. అయితే నాగరాజు బలవంతం మీద ఒప్పుకుంటుంది.  ఆ పెళ్ళికి ఒప్పుకున్న సీతకి ఆ పెళ్ళి తాలూకూ ఫాలో అప్స్ కూడా అంగీకారం కావాలి. వ్రతాలు ఒద్దనీ,సూత్రాలు తీసేస్తాననీ వాదనలు (వాదనలు కాదులే, నిజానికి  beg  చేస్తుంది ) చేస్తుంది. 
రిజిస్టర్ పెళ్ళే  వద్దన్న వాడు వీటికొప్పుకుంటాడా? 


 అయితే ఈ విషయాలన్నింటికీ సీత ను రంగనాయకమ్మ గారు బాగా తల వాచేట్లు చీవాట్లు వేస్తారు కాబట్టి ఇక మనకా శ్రమ అక్కర్లేదు.:-))


లేని పోని ఆడంబరాలు పోయే వాళ్ళ మీదా, ఒళ్ళంతా కనిపించేలా బట్టలు ధరించి "ఇది మా హక్కు," అనో "ఫాషన్" అనో వాదించే వాళ్ళమీదా రచయిత్రి నిప్పులు చెరుగుతారు.(పదేళ్ల తన మనవరాల్ని కూడా వదిలిపెట్టరు) 


నిజానికి ఎన్నారై పెళ్ళిళ్ళలో ఇంత కంటే ఘోరంగా విఫలమై, తిట్లూ తన్నులూ, హత్యా ప్రయత్నాలూ,పిచ్చిదని కేసులు పెట్టడాలూ,పిల్లల్ని లాక్కుని వీధిలోకి తరిమేయడాలూ, మంచి మాటలతో ఇండియా పంపించేసి అమెరికా కోర్టుల్లో విడాకులు తీసుకోడాలు...ఇలాంటివి కూడా కోకొల్లలు,. అయితే ఇక్కడ "ఎన్నారై" పెళ్ళి కంటే కూడా....మనసులు కలవని,ధోరణులు సరిపడని ఒక పెళ్ళిగా మాత్రమే దీన్ని చూడాలి మనం! 


కాని, అమెరికా అల్లుడు గా ఉండటం ఒక ప్రత్యేకత గా నాగరాజు, అతడి అక్క,తల్లి అందరూ భావిస్తూ ఉండటం వల్ల సీతకు పీడన మరింత అధికమయింది. తప్పించుకోలేదనే ధీమాతో ఆ పీడనకు హద్దు లేకుండా పోయింది .


ఈ సీరియల్ నవ్యలో వస్తున్నపుడు  ఓ పాఠకుడు రంగనాయకమ్మ గారిని  ఇలా అడిగారు-  ‘కొందరు మగవాళ్ళకు కూడా భార్యల వల్ల ఇబ్బందులూ, అవమానాలూ ఉండడం మీకు తెలియకపోదు. ఆ కోణంతో, ‘కళ్ళు తెరిచిన రాముడు’ రాస్తారా?’ 
రంగనాయకమ్మ గారి  జవాబిది-  ‘సీత చెప్పినట్టే  , ఆ రాముడు కూడా తను పడ్డ అవమానాలు నాకు చెప్పుకుంటే , ఎందుకు రాయను? తప్పకుండా రాస్తాను. ఇష్టంగా, శ్రద్ధగా, రాస్తాను’.


అరుణా పబ్లిషింగ్ హౌస్ వారి ప్రచురణ ఈ  పుస్తకం. పేజీలు 352  (హార్డ్ బైండ్) 
ధర :120  రూపాయలు! 






43 comments:

A Homemaker's Utopia said...

పరిచయం బాగుంది సుజాత గారు..మీరు రాసిన బ్లాగ్ పోస్టులు చదువుతుంటే ఎదురుగా ఒక వ్యక్తి నుంచుని మాట్లాడుతున్నట్లే ఉంటుంది నాకు......నాకు రంగనాయకమ్మ గారి పుస్తకాలు ఇక్కడ దొరకలేదండీ ..మా నాన్నగారు సేకరించి పంపుతానని అన్నారు..మీ పుస్తక పరిచయం వల్ల ఏమి చదవాలో తెలుస్తోంది...ఇక్కడ బుక్ ఫెయిర్ జరిగినా,నా ఐరన్ లెగ్ వల్ల అనుకుంటా,ఈ ఇయర్ తెలుగు స్టాళ్లు పెట్టలేదు..లాస్ట్ ఇయర్ కూడా ఉన్నాయట.

Indian Minerva said...

ఈమధ్య రంగనాయకమ్మ పుస్తకాలు చదువుతున్నానండీ. సుదీర్ఘమైన మార్క్సిస్టు చర్చలూ, మార్క్సిజం ప్రచారం (మతప్రచారం లాగా అన్నమాట) మినహాయిస్తే మిగతావన్నీ నచ్చుతున్నాయి. ఈవిడ version of స్త్రీవాదం నచ్చింది.

Sujata M said...

CHALA BAVUNDI. CHADUVUTANU.

Praveen Mandangi said...

చిన్నప్పుడు ఓ పత్రికలో NRI పెళ్ళిళ్ళ గురించి చదివాను. NRI కొంచెం మతిస్థిమితం లేనివాడని తెలిసినా NRI సంబంధం మీద వ్యామోహంతో ఆ సంబంధానికి ఒప్పుకుంటారు అని. NRI పెళ్ళిళ్ళలో ఎన్ని మోసాలు జరిగినా కళ్ళ ముందు అబ్బాయి యొక్క డబ్బు, హోదా కనపడేసరికి ఆ మోసాలు గురించి విన్న వార్తలు మర్చిపోతారు.

ఆ.సౌమ్య said...

చాలా బాగా క్రోడీకరించారండీ. ఇందులో కథ తో పాటు రంగనాయకమ్మ గారు నడిపిన చర్చలు ఎంతో ఆసక్తికరం. చలం రచనల్లోనూ అదే కనిపిస్తుంది. ఇందులో సీత కథ ఒక భాగమైతే రంగనాయకమ్మ గారి అలోచనలని, జీవితాన్ని ఆమె నోటి ద్వారానే తెలుసుకోవడం చాలా అసక్తికరంగా ఉంది. సీత కథతో పాటూ రంగనాయకమ్మ గారి కథ కూడా తెలుస్తున్నాది.

చాలా ఎంజాయ్ చేస్తూ చదువుతున్నాను. తెరిస్తే ఆపబుద్దెయ్యదు. వేరే పని ఉంటుంది కాబట్టి బలవంతంగా మూసేయాలి తప్పితే ఎప్పుడెప్పుడు మిగతాది చదువుతానా అని ఉంటున్నాది.

Praveen Mandangi said...

ఇండియన్ మినర్వ గారు. మార్క్సిజానికీ, మతానికీ మధ్య పోలిక అనేది లేదు అని విశేఖర్ గారి బ్లాగ్‌లోనే స్పష్టంగా వ్రాసాను. చెప్పిన విషయం మళ్ళీ చెప్పడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి మీరు విశేఖర్ గారి బ్లాగ్‌లోనే ఆ విషయం చదవండి.

ఐదేళ్ళ క్రితం యాహూ గ్రూప్స్‌లో రంగనాయకమ్మ గారి సాహిత్యం గురించి చర్చ జరిగింది. అప్పట్లో నాకు ఒక విషయం అర్థమైంది. రంగనాయకమ్మ గారి అభిమానులమని చెప్పుకునేవాళ్ళలో చాలా మందికి ఆవిడ ఐడియాలజీ ఏమిటో కూడా తెలియదు అని. నేను పిల్లలు ఉన్న స్త్రీని పెళ్ళి చేసుకుంటానని వ్రాస్తే ఒక వ్యక్తి అది విశాల హృదయం అని అన్నాడు. నిజానికి పిల్లలు ఉన్న స్త్రీని పెళ్ళి చేసుకోవడానికి విశాల హృదయం అవసరం లేదు. పిల్లలు ఉన్న పురుషునికి భార్య చనిపోతే ఇంకో స్త్రీ అతన్ని ఎలా పెళ్ళి చేసుకుంటుందో, పిల్లలు ఉన్న స్త్రీకి భర్త చనిపోతే ఇంకో పురుషుడు ఆమెని అలాగే పెళ్ళి చేసుకోవచ్చు. ఇందులో తప్పేమీ లేదని చెప్పడానికి రంగనాయకమ్మ-గాంధీ గార్ల జీవితం గురించి ఉదాహరణగా చెపితే ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడొద్దు అని డొంకతిరుగుడుగా సమాధానం చెప్పేవాడు. సంకుచిత నమ్మకాలని వదులుకోలేని అతనికి రంగనాయకమ్మ గారి సాహిత్యంలో అర్థమైనది ఏమిటో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఒక పని తప్పు కాదు అనుకున్నప్పుడు అది రంగనాయకమ్మ గారు చేసినా, ఆవిడ రచనలు చదివిన పాఠకుడు చేసినా అది తప్పు కాదనే అనుకోవాలి కదా.

మార్క్సిజం గురించి వివరంగా వ్రాసే సమయం నాకు ఇప్పుడు లేదు కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెపుతాను. మార్క్సిజం లేకపోతే సామాజిక సంబంధాలలో మార్పులు రావు. సామాజిక సంబంధాలు మారడానికి ఒప్పుకోని వాళ్ళు స్త్రీ-పురుష సంబంధాలు మారడానికి కూడా ఒప్పుకునే అవకాశం లేదు. "ఇద్దరు వ్యక్తులు నిలబడి నాన్‌సెన్స్ మాట్లాడుకోవాలనుకుంటే ఎంతైనా మాట్లాడుకోవచ్చు" అన్న ఎంగెల్స్ కోట్ గుర్తు పెట్టుకోండి. స్త్రీ-పురుష సంబంధాలు ఎందుకు ఇలా ఉన్నాయి అని ఇప్పటివాళ్ళని అడిగితే "ఇది ఇంతే, ఇలాగే ఉంటుంది, కారణాలు అడక్కు" అని అంటారే కానీ శాస్త్రీయంగా కారణాలు చెప్పలేరు. ఈ విషయం మీకు ఇప్పుడు అర్థం కాదు కానీ జానకి విముక్తి నవలలోని ప్రభాకర్‌లాగ సమాజానికి మార్చడానికి ప్రయత్నించి, మార్చలేక ఆ తరువాత ప్రశ్నలు వేసుకుంటే అర్థమవుతుంది.

Praveen Mandangi said...

ఇండియన్ మినర్వ గారు, ఇంకో విషయం గుర్తుంచుకోండి, స్త్రీవాదం ఎక్కడైనా స్త్రీవాదమే. దానికి వర్సన్ తేడాలు ఉండవు.

ఉదహారణకి: బంధుత్వాలు, వావివరసల విషయంలో ఒక సమాజానికీ, ఇంకో సమాజానికీ మధ్య తేడాలు ఉంటాయి(ఇస్లామిక్ దేశాలలో పెద్దమ్మ గారి కూతురిని పెళ్ళి చేసుకునే ఆచారం ఉన్నట్టు, యూరోపియన్ దేశాలలో మేనత్త పిల్లలిని పెళ్ళి చేసుకోవడం కూడా నిషిద్ధమైనట్టు). కానీ స్త్రీవాదం అలా కాదు. స్త్రీవాదం అనేది ఎక్కడ ఉన్నా అది స్త్రీల హక్కులనీ, స్త్రీల స్వేచ్ఛనీ కాంక్షించాలి. అలా కాకపోతే స్త్రీవాదానికీ, సంప్రదాయవాదానికీ మధ్య తేడా ఉండదు. స్త్రీవాదానికీ, సంప్రదాయవాదానికీ మధ్య తేడా లేకపోవడం జరిగితే ఏమి జరుగుతుందంటే "అరబ్బీయులు పెద్దమ్మ కూతురిని పెళ్ళి చేసుకుంటున్నారు కనుకవాళ్ళు అనాగరికులు అని యూరోపియన్‌లు తీర్మానించినట్టు ఫలానా స్త్రీవాది యొక్క రచలు నా రచనలులాగ లేవు కనుక ఆ వ్యక్తి స్త్రీవాది కాదు అని ఇంకో స్త్రీవాది తీర్మానం చేసే పరిస్థితి వస్తుంది".

అందుకే ఇక్కడ వర్సన్‌ల ప్రస్తావన తీసుకురావద్దు అనేది.

సుజాత వేల్పూరి said...

ప్రవీణ్, ఇండియన్ మినర్వా గారు చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. స్త్రీ వాదాన్ని ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒకేరకంగా ప్రొజెక్ట్ చేయడం లేదు. ఈ వాదాలనంటింట్లోనూ నాకూ రంగనాయకమ్మ గారి వెర్షన్ నచ్చుతుంది. రంగనాయకమ్మ గారు "తప్పుగా ఆలోచించడం, లేదా తప్పు పనులు చేయడం" స్త్రీలు చేసినా క్షమించరు. ఈ నవల్లో నాగరాజు అక్క పాత్ర అలాంటిదే! జానకి అత్త పాత్ర అలాంటిదే! వాసంతి అలాంటిదే!

కానీ చాలా మంది స్త్రీ వాదులు "అసలు స్త్రీలు తప్పులే చేయరు" అనే కాన్సెప్ట్ తో ఆలోచించమంటారు. ఒక సెమినార్ లో ఇలాంటి వాదనే ఒకావిడ చేశారు. వరకట్నం కేసుల్లో అత్తలు అసలు తప్పులే చేయరనీ,వాళ్ళకు డబ్బు ఆశ అసలే ఉండదనీ, అది భర్త, లేదా కొడుకు బలవంతం వల్లే అలా ప్రవర్తిస్తారనీ ,...ఇలా చెప్పుకొచ్చారు. దీనికేమందాం మరి?

స్త్రీ వాదుల్లో కూడా రంగనాయకమ్మ గారి వైఖరి,శైలి వేరు. రంగనాయకమ్మ గారు నేర్చుకోమని చెప్పే మొదటి విషయం! ఆత్మ గౌరవం.

ఇక దీని మీద చర్చించి, టాపిక్ పక్క దారి పట్టకుండా.....నవల గురించి మాట్లాడండి.

ఎన్నారై పెళ్ళిళ్ళ విషయంలో మీరు చెప్పిన దానితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను,. ఎన్ని వార్తలు చదివినా అవి మన దాకా వచ్చే సరికి "మనకు అలా ఎందుకు జరుగుతుందిలెద్దూ" అనుకోడం మామూలే!

Praveen Mandangi said...

డబ్బున్న సంబంధం కనిపిస్తే అది వదులుకోకూడదు అనుకునేవాళ్ళు ఉన్నారు. అది NRI సంబంధమైనా, కాకపోయినా. మా బంధువులలో కుటుంబంలోనే ఒక కుటుంబంవాళ్ళు తమ అమ్మాయిని పదో తరగతి వరకు చదివించారు కానీ ఆ అమ్మాయిని సైంటిస్ట్ అయిన ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్ళి చెయ్యాలనుకున్నారు. సైంటిస్ట్ అయితే కట్నం ఎక్కువ అడుగుతాడు కనుక ఆ సంబంధం వద్దు అని మా అమ్మ గారు వాళ్ళకి చెప్పినా వాళ్ళు వినలేదు. NRI మాత్రం కట్నం ఎక్కువ అడగడా? ఈ విషయాలు తెలిసినా NRI సంబంధాలు అంటే వ్యామోహం చూపిస్తారు. కట్నం సంగతి సరే, ఆ దేశంలో విడాకుల చట్టాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. వాళ్ళు కట్నం తీసుకున్నా, తీసుకోకపోయినా ఆ విషయం తెలుసుకోవలసిన బాధ్యత అమ్మాయి తల్లితండ్రులకి ఉంది. ఎందుకంటే పెళ్ళి తరువాత మోసం జరిగితే కోర్ట్‌లో కేస్ ఫైల్ చెయ్యగలగాలి కదా. విశాఖపట్నంలో ఒక పోలీస్ అధికారి కూతురిని కూడా NRI మోసం చెయ్యడం జరిగింది. జనాన్ని మోసపోవద్దు అని చెప్పే పోలీస్ అధికారులు కూడా మోసపోతుంటారు.

Country Fellow said...

బాగ చెప్పారండీ :)

సీత చెప్పినట్టే , ఆ రాముడు కూడా తను పడ్డ అవమానాలు నాకు చెప్పుకుంటే , ఎందుకు రాయను? తప్పకుండా రాస్తాను. ఇష్టంగా, శ్రద్ధగా, రాస్తాను

కమనీయం said...

మా కుటుంబంలోను,మా దగ్గరి బంధుమిత్రుల కుటుంబాల్లోను ఇలాటి సంఘటనలు లేవు.ఇంటి విషయాలూఅడవాళ్ళకే వదిలేస్తాము.(వాళ్ళు చదువుకొని సంపాదిస్తున్నా )బయటి విషయాలు మగవాళ్ళు చూసుకొంటాము. భార్యరక్షణ ,ముద్దుముచ్చటలు తీర్చడమూ ' భర్తల ధర్మంగా భావిస్తాము.అక్కచెల్లెళ్ళని ఆదరించడం ,తల్లిని గౌరవించడం మన సంప్రదాయం.స్త్రీజనోద్ధరణ కు పాటు పడింది పురుషులేకదా!రాజారామ్మోహన్రాయ్ ,మహాత్మాగాంధి,వీరేశలింగం ,చలం ,ప్రభృతులేకదా. ఐనా స్త్రీ పురుషులకు బయలాజికల్ గా తేడాలు ఉన్నాయి.అవి వాళ్ళ స్వభావాలలో కనబడతాయి.పురుషులు Testosteronహార్మోన్ ప్రభావం వలన కొంచెం 'అగ్రెసివ్ ' గా పరుషంగా ఉంటారు.
ఏమైనా భార్యాభర్తలు ఒకరినొకరు ,అవగాహన చేసుకొని ,పరస్పరప్రేమానురాగాలతో జీవితాంతం కలిసి మెలసి జీవించడమే ఉత్తమం.దీన్ని male chauvinism గా భావించినా పరవాలేదు. రమణారావు.

సుజాత వేల్పూరి said...

ప్రవీణ్,
రంగనాయకమ్మ గారి అభిమానులమని చెప్పుకునేవాళ్ళలో చాలా మందికి ఆవిడ ఐడియాలజీ ఏమిటో కూడా తెలియదు_________ఇలాంటి స్వీపింగ్ స్టేట్మెంట్స్ త్వర పడి జారీ చేయకూడదు మీరు!మీ ఆదర్శాలు మీకు ఉండొచ్చు.కానీ అవి ఆచరించాక, నలుగురికీ తెలియాలే తప్ప ముందే ఇలా చెప్పేసుకోడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఇది ఇంతకు ముందు కూడా నేను మీకు ఒక సందర్భంలో చెప్పాను. గుర్తుందా మీకు?

Praveen Mandangi said...

అక్కడ కాంటెక్స్ట్ వేరు. ఐదేళ్ళ క్రితం యాహూ గ్రూప్స్‌లో జరిగిన చర్చ గురించి మీకు తెలియదు. యూరోప్‌లో ఒక ప్రముఖ చిత్రకారుడు 26 ఏళ్ళ వయసులో 52 ఏళ్ళ వయసున్న భర్త చనిపోయిన స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు. కానీ అది వార్త కాలేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక అమ్మాయి తన కంటే రెండేళ్ళు చిన్నవాడైన అబ్బాయితో లేచిపోయింది. అది ఇక్కడ వార్త అయ్యింది. ఇండియాలో కూడా పెళ్ళి విషయంలో వయసు, ఎత్తు లాంటి పట్టింపులు లేకపోతే ఇవి వార్తలు అవ్వవు కదా. కానీ యాహూ గ్రూప్స్‌లో కామెంట్లు వ్రాసిన వ్యక్తి ఈ విషయం అర్థం చేసుకోలేదు. పైగా అతను నాది ఊహాజనిత ఆదర్శవాదం అని అన్నాడు. నిజంగా రంగనాయకమ్మ గారి ఐడియాలజీ తెలిసినవాడు సంస్కరణని ఆదర్శవాదం అనుకోడు.

పెళ్ళి విషయంలో వయసు, ఎత్తు లాంటి చిన్న విషయాలని కూడా పట్టించుకునే పెద్దవాళ్ళు పెళ్ళి కొడుకు యొక్క వ్యక్తిగత ప్రవర్తనని చూడరు, ముఖ్యంగా అతను ఏ డాక్టరో, సైంటిస్టో, NRIయో అయితే. టాపిక్ ఎంత డైవర్ట్ చేసినా విషయం మళ్ళీ అసలు విషయానికే వచ్చింది ఇక్కడ. NRI మోసాల గురించి చిన్నప్పుడే ఇండియా టుడేలో చదివాను. కేవలం సెలవుల కోసం ఇండియాకి వచ్చి, కొన్ని రోజుల ఎంజాయ్‌మెంట్ కోసం పెళ్ళి చేసుకుని, కట్నం తీసుకుని వెళ్ళిపోయినవాళ్ళ కేస్‌లు అవి. అమెరికా వెళ్ళిన తరువాత నరకం చూసిన అమ్మాయిల గురించి అక్కడ వ్రాయలేదు. కానీ NRI సంబంధం అని తెలిస్తే పెళ్ళి కొడుకు కాస్త మతిస్థిమితం లేనివాడని తెలిసినా అమ్మాయిని ఇవ్వడానికి ముందుకొచ్చే ఇక్కడి తల్లితండ్రుల మానసిక బలహీనత గురించి మాత్రం వ్రాసారు.

కృష్ణప్రియ said...

ఈ పుస్తకం నవ్య లో సీరియల్ గా వచ్చినప్పుడు కొన్ని భాగాలు చదివాను.

సీత పెళ్లి చేసుకోవటం లో, మొదటి సారి కాంప్రమైజ్ అవుతుంది. తనకి నాగరాజు కుటుంబం తో పడకపోయినా సాధ్యమైనంత ఓపిక పడుతుంది, ఇక కుదరనప్పుడు వదిలి కొత్త జీవితాన్ని కోరుకుంటుంది.. ఇదంతా ఓకే. చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటుంది.

కాకపొతే విలన్లంతా సాంప్రదాయ వాదులూ (కనీసం వీరికి శుభ్రత,ఇంటి పనులు,వంటా రావు. జీవితం లో ఏ ఒక్క విషయం లోనూ చిన్నాతి చిన్న మంచి ఆలోచన ఉండదు).

మంచిదనం ఉన్నవారంతా కమ్యూనిస్టులూ అన్నట్టు ఉంది ఈ కథ. అదే నాకు చదువుతున్నంత సేపూ ఒకవైపు చిరాకు గా అనిపించింది.

కానీ ఒకసారి మొదలు పెడితే, పుస్తకం పక్కన పెట్టలేం. దానికి మాత్రం ఆవిడ కి 100% మార్కులు, ఈ వయసు లో అంత ఆసక్తిదాయకం గా రాయగలగటం అభినందనీయం!!

SHANKAR.S said...

"కానీ చాలా మంది స్త్రీ వాదులు "అసలు స్త్రీలు తప్పులే చేయరు" అనే కాన్సెప్ట్ తో ఆలోచించమంటారు."

నిజమే సుజాత గారూ స్త్రీవాదం అంటే పురుష ద్వేషమే అనే భ్రమలో చాలా మంది అమాయకులున్నారు. ఏంటో పిచ్చి జనం!!

జ్యోతిర్మయి said...

సుజాతగారూ మీ సమీక్ష బావుంది. నేను రంగనాయకమ్మ గారి అభిమానిని. నవ్యలో సీరియల్ వస్తున్నప్పుడు కొన్ని భాగాలు చాలా ఆసక్తిగా చదివాను. ఈ నవలలో రచయితకు నచ్చక పోయినంత మాత్రాన కొన్ని పాత్రల్లో అన్నీ అవలక్షణాలు చూపడం నచ్చలేదు.
రచన నడిపించిన పద్ధతి బావుంది. రంగనాయకమ్మగారి సెన్స్ అఫ్ హ్యూమర్ అడుగడుగా కనిపిస్తు౦ది.

వేణు said...

జ్యోతిర్మయి గారూ! ఏ పుస్తకమైనా అందరికీ నచ్చాలని లేదు. అభిమానులకైనా రచయితలు రాసే అన్ని పుస్తకాలూ నచ్చాలని లేదు. అయితే మీ వ్యాఖ్యలో నాదో సందేహం-

>> ఈ నవలలో రచయితకు నచ్చక పోయినంత మాత్రాన కొన్ని పాత్రల్లో అన్నీ అవలక్షణాలు చూపడం నచ్చలేదు. >>

ఇది యదార్థ గాథ కదా? లేని (అవ)లక్షణాలు చూపితే పాత్రల స్వభావాలే మారిపోయి, అవాస్తవ గాథ అయిపోతుంది. అలాంటి అవకాశం ఈ రచనలో లేదు కదా?

అయినా మీకలాంటి అభిప్రాయం ఏర్పడింది కాబట్టి- ఏయే పాత్రల్లో రచయిత్రి అలా.. అన్నీ అవలక్షణాలే చూపారనిపించిందో చెప్పండి!

శశి కళ said...

avunu nenu koodaa navya lo chadivaanu...baagundi

పద్మవల్లి said...

నవ్య లో సీరియల్ గా వస్తున్నపుడు మధ్యలో కొన్ని వారాలు చదివాను. ఇప్పుడు మొత్తం ఒకసారి చదవాలనిపిస్తోంది.

నాకు ఆవిడ శైలి ఇష్టం. అలాగే మీరన్నట్టు ఆవిడ స్త్రీవాదమ్ స్టైల్ ఇష్టం, మిగత వాళ్ళలాగా స్త్రీవాదం అని చూడగానే పారిపోవాలనిపించదు.

Praveen Mandangi said...

పద్మ గారు, ఇతర స్త్రీవాదుల రచనలలో భయపడడానికి ఏముంది? నిజానికి పురుషుల చేత వంటలు చెయ్యించాలనే రంగనాయకమ్మ గారి వాదన చూసి పురుషులు భయపడే అవకాశాలు ఎక్కువ. సోవియట్ యూనియన్‌లో వ్యవసాయ సమిష్టీకరణ సమయంలో పార్టీ కార్యకర్తలు భూస్వాముల చేత సమిష్టి వ్యవసాయ క్షేత్రాలలో ఎలా పనులు చెయ్యించారో, మగవాళ్ళ చేత కూడా అలాగే ఇంటి పనులు చెయ్యించాలని రంగనాయకమ్మ గారు అంటారు. జానకి విముక్తి నవల చదవండి, విషయం అర్థమవుతుంది.

నిజంగా భయపడితే చలం గారి రచనలు భయంకరంగా ఉంటాయి. ఆయన చిత్రాంగి నాటికలో సవతి తల్లి కొడుకుతో లేచిపోవడం తప్పు కాదని వ్రాసారు. బయట ఎవరైనా అలా మాట్లాడితే అతని పళ్ళు రాలగొడతారు. చలం గారి రచనలలో కొన్ని అంత భయంకరంగా ఉంటాయి. రంగనాయకమ్మ గారి రచనలలో భయపడడానికి ఏమీ లేదు. కానీ భయపడేవాళ్ళు ఉన్నారు. మగవాళ్ళు కూడా అంట్లు తోమాలి అని అంటే ఇప్పటి సమాజంలో అంగీకరిస్తారా?

Sharada said...

రంగనాయకమ్మ గారి లాజిక్కుకీ శైలికీ తిరుగేముంది? ఆ రకంగా ఈ నవల చదివితే ఆవిడ కలంలో పదును ఎప్పటికీ తగ్గదనిపిస్తుంది!

అయితే నాకు "జానకి విముక్తి" కున్నంత రెలవెన్సూ, రేషనాలిటీ ఈ నవలలో కనిపించలేదు. జానకి లాటి అమాయకురాళ్ళు ఆ రోజుల్లో చాలా మందే వుండే వారు. కానీ ఈ రోజుల్లో నాస్తికత్వమూ హేతువాదమూ నేర్చుకుని, బాగా చదువుకుని, పెద్ద ఉద్యోగం చేస్తూ వున్న అమ్మాయి కాబోయే జీవిత భాగస్వామి గురించి ఎక్కువగా తెలుసుకోకుండా పెళ్ళాడటం కొంచెం విచిత్రంగా అనిపించింది. పదో తరగతి చదువుకున్న పిల్లలు కూడా ఒకరినొకరు తెలుసుకోవలనుకుంటున్న రోజులివి! అయితే నవలలో వున్న పాయింటే అది కావొచ్చు.

కృష్ణప్రియ గారన్నట్టు, "మనకి నచ్చని వాళ్ళు చేసే పనులన్నీ చెడ్డవే" అన్న ధోరణి కొంచెం ఇమ్మెచ్యూర్ గా అనిపించింది నాకు.

నాకు కొరుకుడు పడని ఇంకొక విషయం- స్త్రీలకి ఒక వర్గం గా స్వాతంత్ర్యమూ, సెల్ఫ్-డిటర్మినేషనూ, వుండాలని వాదించే ఆవిడ మనుషులకి (స్త్రీలైనా- పురుషులైనా) కనీసం తమకిష్టం వచ్చినట్టు డ్రస్ చేసుకునే స్వాతంత్ర్యాన్ని హర్షించలేరు! ఈ నవలలోనే ఆవిడ జుట్టు వదిలేసుకునే వాళ్ళ గురించి చాలా నిర్దాక్షిణ్యంగా వ్యాఖ్యానిస్తారు. జుట్టు వదిలేసుకోవలా, జడ అల్లుకోవాలా అన్న మీమాన్స పక్కన పెడితే "ఇంత చిన్న విషయంలోనే పక్క మనిషి ఇష్టాఇష్టాల మీద అంత జడ్జ్మెంటల్ ఆటిట్యూడ్ అవసరమా" అనిపించింది.
శారద

Praveen Mandangi said...

ఈ నవల జానకి విముక్తి నవలలాగ లేదు అని రివ్యూ చదివినా అర్థమైపోతుంది. రివ్యూ నాకు అంత సంతృప్తికరంగా అనిపించలేదు. భర్త వేధిస్తున్నాడని భర్తకి విడాకులు ఇచ్చి ఉద్యోగం చూసుకోవడంతోనే సరిపెట్టుకోవడం అనేది స్త్రీవాదం గురించి ఏమీ తెలియని ఒక సాధారణ మహిళ కూడా చెయ్యగలదు. రెండో పెళ్ళి, పిల్లలపై సవతి తండ్రి బాధ్యతలు వంటి విషయాలు చర్చించినా ఈ నవల సమగ్రంగా ఉండేది. బండ్లు లాగే గాడిద కూడా లాగలేనంత బరువైన బండ్లు లాగిస్తే అది తప్పించుకుని అడవిలోకి పారిపోతుంది. భర్త భార్య చేత చెయ్యలేనంత అడ్డమైన చాకిరీ చెయ్యిస్తే భార్య భర్తని వదిలేసి వెళ్ళిపోయి ఉద్యోగం చూసుకోవడంలో విచిత్రమేముంది? మూగజీవాల కంటే మనుషులకే ఎక్కువ జ్ఞానం ఉంటుందనుకుంటే తన చేత గొడ్డు చాకిరీ చెయ్యించే భర్తని వదిలేసి వెళ్ళిపోయి భార్య ఉద్యోగం చూసుకోవడం సహజమైన పనే అనుకోవాలి. ఈ సహజమైన పనికి స్త్రీవాదం అని వేరే పేరు ఎందుకు?

సుజాత వేల్పూరి said...

ప్రవీణ్ శర్మ,
మీరు వ్యాఖ్యలు రాసే ప్రతి సారీ "ఇది ఒక యదార్థ గాధ" అని గుర్తుంచుకోవాలి. ఇది రిపోర్టెడ్ స్పీచ్ లో రాయబడిన నవల. దీనికీ జానకి విముక్తి కీ పోలిక ఎలా తీసుకొస్తాం? జానకి రంగనాయకమ్మ గారి చేతిలో రూపు దిద్దుకున్న పాత్ర. కానీ సీత నిజంగా ఇప్పుడు హైద్రాబాదులోనే ఉన్న ఒక మనిషి! అందువల్ల ఒక నిజజీవిత కథను యధా తథంగా ప్రెజెంట్ చెయ్యడమే తప్ప, దాన్ని మలుపులు తిప్పి చివరికి ఏదో ఒక జడ్జిమెంట్ ఇచ్చెయ్యడం ఈ నవల ఉద్దేశం కాదని గ్రహించండి మీరు!

భర్త భార్య చేత చెయ్యలేనంత అడ్డమైన చాకిరీ చెయ్యిస్తే భార్య భర్తని వదిలేసి వెళ్ళిపోయి ఉద్యోగం చూసుకోవడంలో విచిత్రమేముంది? ___________మళ్ళీ అక్కడికే రావాలి మీరు! విచిత్రాలు జరగడానికి ఇది కల్పిత కథ కాదు. డెయిలీ టివీ సీరియలూ కాదు. అయినా విచిత్రాలు జరగడమే నవల ప్రాథమిక లక్షణమూ, అర్హతానూనా?

ఈ సహజమైన పనికి స్త్రీవాదం అని వేరే పేరు ఎందుకు?______________ఈ ప్రశ్నకు నేను కాదు, రంగనాయకమ్మ గారైతే జవాబు చెప్పాలి మీకు

Praveen Mandangi said...

నిజంగా జరిగిన ఘటనలని చూసి వ్రాసినా అందులో ఆసక్తికరమైన మలుపులు లేకపోతే బోర్ కొడుతుంది. జస్వంత్ సింగ్ కాన్వాల్ వ్రాసిన "Dawn of the Blood" నవల కూడా నిజ జీవితంలోని ఘటనలు చూసి వ్రాసినదే. కానీ ఆ నవల చదివితే బోర్ కొట్టదు. ఈ నవల విషయం అలా కాదు. భర్తకి విడాకులు ఇచ్చేసి ఒంటరిగా ఉండేవాళ్ళని చాలా మందిని చూశాము కదా, ఇదేమైనా కొత్తా? అనే ప్రశ్న ఉదయిస్తుంది. రెండో పెళ్ళి, పిల్లలపై సవతి తండ్రి బాధ్యతలు లాంటివి కలిపి వ్రాసినా కథనం ఆసక్తికరంగా మారుతుంది. అవేమీ లేకపోతే ఏదో రొటీన్ కథ చదివినట్టు ఉంటుంది.

సుజాత వేల్పూరి said...

ప్రవీణ్, మీరు ఈ నవల చదివారా?

చదివితే ఎందుకు బోరు కొట్టిందో ఎక్కడ బోరు కొట్టిందో రాయండి.

చదవలేదా? చదివి రండి! అప్పుడే వ్యాఖ్య రాయండి

ఏ సబ్జెక్టు మీద ఎలా రాస్తే బాగుంటుందో, రంగనాయకమ్మ గారికి సూచించే స్థాయికి మనం ఎదగలేదని గుర్తించండి

Praveen Mandangi said...

ఈ రోజు సాయింత్రం విశాలాంధ్ర బుక్‌హౌస్‌కి వెళ్తున్నాను. చూస్తాను.

Anonymous said...

మీరు రాసిన రివ్యు చదివి పుస్తకం కొని 90% చదివాను. ఆమే రచనలు చదవాలనుకొంట్టున్న తరుణం లో, మీ రివ్యు చూసి ఈ పుస్తకం కొన్నాను. ఆమే నవల చదవటం ఇదే మొదటిసారి. ఇక ఈ పుస్తకం విషయం కొచ్చే సరికి నాకు సీత,ఆమే భర్త ఇద్దరు ఏ వర్గానికి చెందినవారో చెప్పి ఉంటే చదివే వారికి ఇంకా అవగాహన పెరిగి ఉండేది. ఆమే చెప్పిన దానిని బట్టిచూస్తే సీత, ఆమే భర్త ఇద్దరు చికెన్ తింటారు. అతను కాలిఫోర్నియా వేళ్లినపుడు చెడిపోయిన చికెన్ కూడా వదల కుండాతిన్నాడు. ఇంట్లో కూడా తింటారు. సీత కుటుమంబం అబ్రామ్హణూలను కొంటే, ఇంట్లో సీతభర్త పదే పదే కట్నం ప్రస్థావించటం చదివినా, అది తీసుకోక పోవటం తాను చేసిన గొప్ప త్యాగమ మని అతను భావించిన, అబ్రహ్మణ కులాలో కట్నాలు చాలా ఎక్కువ కనుక సీత భర్త అలా ఫీలవటం లో సమంజసముదేమో అనిపిస్తుంది. సీత ఏ వర్గమో ప్రస్తావించి ఉండిఉంటే బాగుండేది. అమే దానిని పక్కన పడేసి తన వాదనను, మొగుడు పెళ్ళాల కోణ0 లో నుంచి మాత్రమే రాశారు. అసలికి ఈ రోజులలో ఎవరైనా తమ పిల్లలను సంస్కారవంతులుగా కావలని చదివిస్తున్నార? ఆమే పెళ్ళి అయినా 6 నెలెలలోపే విడాకులు ఇప్పించటం ఘనవిజయం లాగా భావించారనిపించిది. చాలా సార్లు జానకి విముక్తి నవలను ప్రస్తావించటం ఎందుకో నచ్చలేదు.

రామ్ said...

పరిచయం బాగుందండి. ధన్యవాదాలు.

సుజాత వేల్పూరి said...

నాగిని గారూ, థాంక్యూ! మీరు ఆంధ్ర దేశానికి మరీ అంత దూరంలో లేరు కాబట్టి తెలుగు పుస్తకాలు సులభంగానే తెప్పించుకోవచ్చు.ఒకసారి హైద్రాబాదు వచ్చినపుడు వీలైనన్ని ఎక్కువ తెలుగు పుస్తకాలు కొనుక్కోడమే మార్గం! మీ బ్లాగు లో ఈ మధ్య పెట్టిన ఫొటోలు చాలా బాగున్నాయి.


ఇండియన్ మినర్వా గారు,

సుదీర్ఘమైన మార్క్సిస్టు చర్చలూ, మార్క్సిజం ప్రచారం.....ఇది కొంత వరకూ ఆసక్తిని తగ్గించే మాట నిజమే! లేకపోతే ఆవిడ రచనలు చాలా బాగుంటాయి. ఆమె గుడ్డిగా స్త్రీలను సమర్థించరు.

సుజాత గారూ,
థాంక్యూ! తప్పక చదవండి!

సుజాత వేల్పూరి said...

సౌమ్యా,
నా మొహం! మొత్తం ఎక్కడ క్రోడికరించానూ? నాగరాజు పాత్రని గురించి ఎంత రాయొచ్చు? కస్తూరి గురించి ఎంత రాయొచ్చు? బ్లాగు విస్తరణ భీతి వల్ల క్లుప్తంగా రాసేశాను.

వేణు గారూ,

నూతన భావాలు వల్లించడం తప్ప ఆచరణ ఏమీ పట్టని కమ్యూనిస్టుల్నీ, నాస్తికుల్నీ కూడా ఆమె వదిలిపెట్టలేదు! _______ఇదే అందరికీ నచ్చేది. నాకైతే బాగా నచ్చింది ఈ పుస్తకం!

Country fellow (భలే పేరు పెట్టుకున్నారండీ)గారూ,

రంగనాయకమ్మ గారే అలా చెప్పగలరు. స్త్రీలైనా పురుషులైనా మనుషుల్లా ప్రవర్తించాలనే ఆమె అంటారు

సుజాత వేల్పూరి said...

రమణారావు గారూ, మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు

సుజాత వేల్పూరి said...

కృష్ణప్రియ గారూ,

ఈ కథ నిజంగా జరిగిన యదార్థ గాధ! అందువల్ల ఉన్నది ఉన్నట్లుగానే రాశారు. కాకపోతే ఇందులో సీత కుటుంబానికి కమ్యూనిస్టు భావాలుండటం యాధృచ్ఛికం! అలాగే చెత్త బుద్ధులున్న నాగరాజు కుటుంబం సంప్రదాయ వాదులు కావడం కూడా యాధృఛ్ఛికమే!

ఈ నవల్లోనే కమ్యూనిస్టుల మీద బోల్డు విసుర్లున్నాయి, గమనించే ఉంటారు. సీత తండ్రి ని చాలా సార్లు విసుక్కుంటారు రచయిత్రి. అలాగే పెళ్ళిళ్ళ పేరయ్య అంటాడు "కమ్యూనిస్టులే పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నారండీ" అని!

మొత్తం మీద కమ్యూనిస్టు వాసనలు ఉన్నా, అవి కథ మొదట్లోనే ముగిసిపోవడం వల్ల మిగతా కథ అంతా సాఫీగానే సాగుతుంది.

SHANKAR.S...మరే!


జ్యోతిర్మయి గారూ, చాలా మంది దృష్టి ఈ అవలకక్షణాల సృష్టి మీదే పడింది. నిజానికీ నాకూ అలాగే అనిపించింది. కానీ ఇది నిజ జీవిత కథ కాబట్టి,అది రంగనాయకమ్మ గారు శ్రద్ధగా ఆ పాత్రల్ని అర్థం చేసుకున్నారని భావించడమే!

శశికళ గారూ,
థాంక్యూ!

పద్మ వల్లి గారూ,

థాంక్యూ! మీరన్నది నిజమే!

సుజాత వేల్పూరి said...

శారదగారూ,
జుట్టు వదిలేసుకుని తిరిగే వారి మీద ఈ నవల్లో అవసరానికి మించి విసురులున్న మాట నిజమే! కానీ ఈ పాయింట్ ని నేను రంగనాయకమ్మ గారికి శుభ్రత పట్ల ఉన్న కన్ సర్న్ గా అర్థం చేసుకున్నాను! తన పాయింటాఫ్ వ్యూలో శుభ్రతకు ప్రాముఖ్యం కాబట్టి, తన ఇంటికి వచ్చేవారు జుట్టు వదిలేసుకుని రావడాన్ని ఆమె హర్షించలేదు.

జుట్టుకు సంబంధించిన విషయాల మీద ఆమె వ్యాఖ్యలు జడ్జిమెంటల్ గానే ధ్వనించినా, అందరూ అలాగే ఉండాలని రచయిత్రి అనరు. తన ఇంట్లో మాత్రం శుభ్రతకే ప్రాముఖ్యం అంటారు. నిజానికి చెప్పులతో ఇంట్లోకి దూసుకు వచ్చేయడం,వంటింట్లో స్టవ్ దగ్గర నిలబడి బ్రష్ చేయడం వంటివి నాకు నచ్చవు. మా అతిథులు అలా ప్రవర్తిస్తే సున్నితంగానే అలా చేస్తే నాకు నచ్చదని చెప్పుకుంటాను. ఇదీ అలాంటిదే అనుకుంటాను.

మొత్తం మీద జుట్టు వదిలేసుకోడం మీద పుస్తకంలో ఎక్కువ పేజీలే ఆక్రమించాయని ఒప్పుకుంటాను.

Ramaగారు,

పెళ్ళి అనే బంధంలో డబ్బు (అది కట్నమైనా, కన్యా శుల్కమైనా) దూరడమే పెద్ద అసమంజసం! కట్నాలు ఎక్కువ తీసుకునే కులాల వాళ్ళు కట్నం తీసుకోనప్పుడు అందుకు ఫీలవడం ఎలా సమంజసం? ఇందులో ఇద్దరి కులాలు ఏవైనా అక్కడ జరిగిన విషయాలకు, వాటి పర్యవసానాలకే ప్రాధాన్యం!

ఇందులో సీత అమెరికా నుంచి బయట పడటానికి మాత్రమే రచయిత్రి పరోక్షంగా సహకరిస్తారు! విడాకులు పూర్తిగా సీత నిర్ణయమే! పైగా దాన్ని రచయిత్రి తన విజయంగా ఎక్కడ క్లైమ్‌చేసుకున్నారూ?

Ram garu,
Thank you!

Anonymous said...

* బంధంలో డబ్బు (అది కట్నమైనా, కన్యా శుల్కమైనా) దూరడమే పెద్ద అసమంజసం! *
ఈ వాక్యం ఆదర్శవాదం (ఐడిలిజం) కిందకు వస్తుంది. పైకి ఎవరెన్ని మాటలు చెప్పినా అది రూపం మారిందేగాని వివాహ వ్యవస్థ నుంచి మాయంకాలేదు. కాదు కూడాను. ఇప్పటివరకు నేను చూసిన పెళ్ళిలలో 99.9% అటువంటి వారే. పెళ్ళి కి ముందు అడగని వారు పెళ్ళీ అయిన తరువాత అత్తామామల నుంచి ఎలాగూ ఆస్తులు వస్తాయి కదా అని గమ్ముగా ఉంటారు. అలాగే అమ్మాయిలు కూడాను.

*ఇందులో ఇద్దరి కులాలు ఏవైనా అక్కడ జరిగిన విషయాలకు, వాటి పర్యవసానాలకే ప్రాధాన్యం.*
బలిపీఠం సినేమాను చూసాను. అందులో కులం పోషించే పాత్రను ఎలా చూపిస్తుందో తెలిసిందే. అలాగే ఇది రాసేటప్పుడు ఆమే దానిని ప్రస్థావించి ఉంటే మధ్య తరగతి అబ్రాహ్మణుల ఆచార, వ్యవహారాలు, కుటుంబ పరిస్థితులు , జీవన విధానం కూడా అందరికి తెలిసేది కదా అని అనిపించింది. ఎన్నో విషయాలను ప్రస్థావించిన ఈ పుస్తకం లో ,దీనిని కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. అదిగాక రంగనాయకమ్మ గారు నిజాయితిగా, కళ్ళకు కట్టినట్లు రాస్తారు కదా! ఆమే ఆ అవకాసం చేజార్చుకొనిందేమో అనిపిస్తుంది.ఎప్పుడు చూసినా చాలా మంది రచయితలు,దర్శకులు హిందూ సంస్కృతి లో భాగంగా బ్రాహ్మణ, దళితుల సంస్కృతులు గురించి రాయటం, చూపటం జరుగుతున్నాయి.

*విడాకులు పూర్తిగా సీత నిర్ణయమే! రచయిత్రి తన విజయంగా ఎక్కడ క్లైమ్‌చేసుకున్నారూ?*

విడాకులు పూర్తిగా సీత నిర్ణయమే అయినా, రచయితపోషించిన పాత్ర తక్కువైనది కాదు. ఆమే సహాయ సహకారాలు లేనిదే అసలికి అమేరికా వదిలే ప్రయత్నం చేయగలిగేదా?. రచయితకి మనస్పూర్తిగా సహాయం చేయగైలిగే వారు ఉండబట్టే సీత ఇండియాకు రాగలిగింది అని నాకు అనిపించిది. మిగతావారు అంత సహాయం చేయగలరని అనుకోను. సీత కళ్ళు తెరచిందని పుస్తకం పేరే పరోక్షంగా ఆ అర్థాన్ని ధ్వనింపజేస్తున్నాది.

Chandu S said...

సుజాత గారు, బాగుందండీ. నవల గురించి పరిచయం బాగా రాశారు.

మనోజ్ఞ said...

మీ రివ్యూ బాగుంది. పుస్తకం గురించి కొంత తెలిసింది. ఇక నేను చదవడమే తరువాయి. ఇండియా రాగానే చదవవలసిన పుస్తకాల్లో ఇదొకటి పెట్టుకున్నాను. బహుశా మొదట ఇదే చదువుతానేమో. దీని గురించి మా అక్క కూడా చెప్పింది. కొన్న సన్నివేశాలు చదివి వినిపించింది కూడా.

సుజాత వేల్పూరి said...

Rama గారూ,

మీరు నవలంతా చదివాను అంటున్నారు కాబట్టి మీకు అర్థమై ఉండాలి. ఇందులో మనుషుల చెత్త ప్రవర్తనల చిత్రణే తప్ప, కట్నాలు, కులాల మీద చర్చ చేసే ఉద్దేశం లేదు. అలాగే వివిధ కులాల వారి ఆచార వ్యవహారాలు,పద్ధతులు బోధించే ఉద్దేశం కూడా రచయిత్రికి లేదు. అందుకే సీత కూడా అవన్నీ చెప్పదు. తను అక్కడ పడిన బాధలు మాత్రమే చెప్తుంది. రచయిత్రి అవి మాత్రమే తన శైలిలో రాశారు.ఇందులో అవకాశాన్ని చేజార్చుకోవడం ఏముంది?

బలిపీఠం చదివానంటూనే మీరు మళ్ళి ఇతర కులాల వారి సంస్కృతిని చిత్రించే అవకాశం గురించి మాట్లాడుతున్నారు. బలి పీఠం నవలే దాని మీద కదా! ఒక దళితుడు,ఒక బ్రాహ్మణ యువతి మధ్య సంసారం! ఇదే కదా ఆ కథ! సీత కథ భిన్నమైనది.

ఇకపోతే..సీత అమెరికా నుంచి నాగరాజుని వదిలి పారిపోవాలని నిర్ణయించుకున్న క్షణమే ఆమె విడాకులు కూడా నిర్ణయమైపోయినట్లే! అతనితో కల్సి ఇకపై జీవించలేనని రచయిత్రి హెల్ప్ తో ఇండియా చెప్పకుండా పారిపోయి వచ్చిన పిల్ల తిరిగి అతడితో కలిసి జీవించే అవకాశాలెంత వరకూ ఉంటాయి?

ఆమే సహాయ సహకారాలు లేనిదే అసలికి అమేరికా వదిలే ప్రయత్నం చేయగలిగేదా?._____________సుబ్బరంగా చేయగలిగేదే! సీత అంటుంది కూడా ఒకచోట.."మీ సహాయం లేకుండా అయినా నేను తప్పించుకు రాగలిగే దాన్నే! కాకపోతే కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండేదాన్ని.ఇంత స్పష్టత ఉండేది కాదు" అని (అచ్చంగా ఇవే మాటలు కావనుకోండి)

నాగరాజు,కస్తూరిల ప్రవర్తన మరింతగా పెచ్చు మీరితే (ఒకవేళ రంగనాయకమ్మ గారి సహాయం లేని పక్షంలో) మరో రకంగా నైనా బయట పడేదే! గదిలో పెట్టి కొడితే పిల్లి ఏం చేస్తుందో సీతైనా అదే పని చేస్తుంది.

అప్పటికీ నవల్లో రంగనాయకమ్మ గారు సీతను అడుగుతారు కూడా "సరిగ్గా ఆలోచించుకున్నావా? విడాకుల నిర్ణయం గురించి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నావా?ఇంకో సారి ఆలోచించ రాదూ" అని!

సీత కళ్ళు తెరవడం అనేది ఆమె అమెరికా నుంచి బయట పడాలని నిర్ణయించుకున్న క్షణంలోనే జరిగింది. ఇండియా వచ్చాక కాదు.

సుజాత వేల్పూరి said...

chandu.s గారూ,
ధన్యవాదాలండీ!

మనోజ్ఞ,
తప్పకుండా చదువు! ఈ లోపు మీ అక్కే మొత్తం చదివి వినిపిస్తుందేమోలే! :-)

Anonymous said...

*బలిపీఠం చదివానంటూనే మీరు మళ్ళి ఇతర కులాల వారి సంస్కృతిని ఇతర కులాల వారి సంస్కృతిని చిత్రించే అవకాశం గురించి * బలి పీఠం నవలే దాని మీద కదా!
నేను సినేమా చుసానండి, నవల చదవలేదు. బలిపీఠం కూడా ఇలా నిజజీవితం లో జరిగిన కథ. ముర్తీ అనే వ్యక్తి వచ్చి తన జీవితం లో జరిగిన సంఘటనల ఆధారంగా నవల రాయమని కోరితే రాశానని, కాని తరువాత అతని గురించి చాలా విషయాలు తెలిసాయని, అతను నాలుగు పెళ్ళిళు చేసుకొన్నాడని చదివాను. ఇక కులాలు, సంస్కృతి అంటే ఎంతసేపటికి బ్రహ్మణ,దళితులే కాదు గదా! ఇతర కులాలు ఉన్నాయి. రచయిత గారు అనుకొని ఉంటే అక్కడక్కడా అయినా ప్రస్తావించి ఉండవచ్చనిపించింది. చూడబోతే వారికి బ్రహ్మణ,దళితుల మీద ఉన్న అవగాహన మిగతా కులాల వారిపై లేదేమో. కథ తో పెద్ద అవసరం లేక పోయినా,తన అభిప్రాయాలు ఆమే ఎన్నో చెప్పారు కదా!
__________________________________
*ఆమే సహాయ సహకారాలు లేనిదే అసలికి అమేరికా వదిలే ప్రయత్నం చేయగలిగేదా?*
ఆమే సహాయ సహకారాలు లేనిదే "అంత త్వరగా" అమేరికా వదిలే ప్రయత్నం చేయగలిగేదా?" రాసాను. ప్రచూరణలో ఈ రెండు పదాలు మిస్ అయ్యాయి. మీ అభిప్రాయం తో ఏకీభవిస్తున్నాను. అయినా ఈ రోజుల్లో పెళ్ళి కి వారంటి పిరియడ్ మూడు నెలల పది రోజులే.
ఆ మొదటి పది రోజులు పెళ్ళి హడావుడితో సరిపోతుంది. మూడు నెలలో మొగుడు పెళ్లాలు విడిపోవాలనే ఒక అవగాహన కు వచ్చేస్తారు.

Ruth said...

సుజాత గారు, మీ బ్లాగు జల్లెడలో రావట్లేదా? నేను మీ అప్డేట్స్ అనీ మిస్స్ అవుతున్నాను :(
ఇక ఈ పుస్తకం గురించి, రంగనాయకమ్మ గారి గురించి వినటమే గానీ ఎప్పుడూ చదవలేదు. ఎలాగైనా వీలు చూసుకుని, మీ దగ్గర పుస్తకాలు కొన్నైనా అప్పుతీసుకోవాలి

Unknown said...

Sujatha garu chala bagundi andi
Telugu intha baaga ela rayagalgutunaru
ee software use chestunaro cheppagalara :)

సుజాత వేల్పూరి said...

Ruth,

నేను కూడలి,మాలిక చూస్తాను. మిగతా అగ్రిగేటర్స్ లో ఈ బ్లాగు వస్తుందో రాదో తెలీదు. జల్లెడ కు ఉత్తరం రాస్తానుండండి! జల్లెడ లో కలపమని!

రండి ఒకసారి, పుస్తకాలు అప్పు తీసుకునేందుకు! :-)

రంగనాయకమ్మ గారి పుస్తకాలు నవలలతో మొదలుపెట్టమని నా సలహా!


రవి గారూ, నేను తెలుగు రాయడానికి లేఖిని వాడతాను. ఈ మధ్య కొత్తగా బ్లాగు మిత్రుడు అశ్విన్ రూపొందించిన epalaka కూడా ప్రయత్నించి చూడండి. అది కూడా సులభంగానే ఉంది

S said...

నిజం కథ అలాగే నిజంగా రాసేసారా! మరి నాగరాజు తాలూకా కుటుంబసభ్యులు ఎవరూ గోల పెట్టలేదా! ;)

పరిచయం బాగుంది. ధన్యవాదాలు.

Post a Comment