June 19, 2020

మలయాళ సినిమాల మాజిక్


లాక్ డౌన్ పుణ్యమా అని అందరూ గొప్ప ఖాళీగా ఉన్నమనేసుకుంటున్నారు గానీ ఎవరి పన్లు వాళ్ళకుండనే ఉన్నాయి. ఐనా ఇదివరకు బయటికి వెళ్ళే సమయాలన్నీ మిగులే కాబట్టి అందరూ Netflix , అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ ఇలా దిజిటల్ ప్లాట్ ఫాం లలో వందల కొద్దీ సినిమాలూ చూసేసారు.

నిజానికి ఈ డిజిటల్ ప్లాట్ ఫాం లేకుంటే ఇతర భాషా సినిమాలు చూడాలంటే అందరికీ అయ్యే పని కాదు.

అనేక భాషల సినిమాల్లున్నా, ఈ కోవిడ్ సీజన్ లో మాత్రం అందరి మనసులూ దోచి పారేసింది మాత్రం మళయాళ సినిమాలే

ఒకప్పుడు మళయాళ సినిమాలనగానే చిన్న చూపు ఉండేది. అది మన అజ్ఞానమే. సెక్స్ సినిమాలు తప్ప ఇక్కడ రిలీజ్ అయ్యేవి కాదు  కాబట్టి, అవొక్కటే తెలుసు మనకి




అలాటిది ఇప్పుడు పదుల కొద్దీ సినిమాలు అందుబాటులోకి వచ్చాక, ఆ సినిమా కథలు, నటులు వాళ్ళ నటన,జీవితాన్ని వాళ్ళు చూసే దృష్టి కోణం, వాళ్ల యాక్సెప్టెన్స్ లెవెల్స్, ఇవన్నీ చూస్తుంటే సినిమాలు తీసే వాళ్ళ కంటే ముందు చూసే వాళ్ళ మీద గౌరవంగా ఉంది. "మీరు చూస్తున్నారు కాబట్టి తీస్తున్నాం" అనే చెత్త వాదనకు అక్కడ చోటు లేదు



వాళ్ళు మంచి సినిమాలు తీస్తున్నారు. హీరో ఇమేజ్ కి చాలా తక్కువ ప్రాధాన్యం ఇస్తూ.

కమర్షియల్ సినిమాలు లేవని కాదు, ఉన్న వాటి స్వరూపాలు వేరుగా ఉన్నాయి.

ఇన్ని పాటలు, ఇన్ని ఫైట్లు, ఒక ఐటెం సాంగ్ అంటూ లెక్కలు లేవు.




ఫలానా వాడి కొడుకు కాబట్టి, వాడి వంశ చరిత్రను ఉద్దేశించి డైలాగులు, తొడలూ అవీ కొట్టుకోడాలు, సంక్రాంతి స్పెషల్  మసాలా సినిమాలు ఇవేవీ లేవు

చాలా సినిమాల్లో కేవలం జీవితం, దాని చుట్టూ తిరిగే  stories ,అంతే




మనో భావాలు చాలా తక్కువనుకుంటా కేరళైట్స్ కి. లేక పోతే "ట్రాన్స్" సినిమాకి మన దగ్గరైతే నానా గొడవా జరిగేది

జల్లి కట్టు
న్యాను ప్రకాశన్
వరణె ఆవశ్యముండ్
హెలెన్
నీలాకాశం పచ్చ కడల్ సువర్ణ భూమి
ఉండా
రెడ్ వైన్
బెంగుళూర్ డేస్
ఇష్క్
పెరంబు



ఇమ్మాన్యుయేల్
మనోహరం
గీతాంజలి
డ్రైవింగ్ లైసెన్స్
హే జూడ్
పదినెట్టాం పడి
అంబిలి
ఆర్టిస్ట్
ఓం శాంతి ఓ షణ
ఆండ్రాయిడ్ కుంజప్పన్
కూడె
ఒరు విశేష పెట్ట బిర్యాని కిస్సా


ఇంకా చాలా సినిమాలు

నజిరియా,నివిన్ పాలీ,ఫహాద్ ఫాజిల్,దులకర్ సరే సరి..ఎంత అద్భుతమైన నటన, ఎంత సహజమైన నటన

పాటల కోసమే హీరోయిన్ అనే కాన్సెప్టే లేదు
నజిరియా సినిమాలో ఉందంటే, మొత్తం షో అంతా తనదేగా! బెంగుళూర్ డేస్, ఓం శాంతి ఓ షణ, కూడె ఆ పిల్ల కోసమే చూడాలి

ఈ సినిమాలన్నీ చూశాక,కేరళ పోయి ఆ పచ్చ పచ్చటి వూళ్ళు మళ్ళీ తిరుగుతూ ఈ సారి ఆ మనుషౌలందర్నీ ప్రేమిస్తూ, అక్కడ థియేటర్లకు పోయి ఆ సినిమాలు చూడాలని అనిపించింది

మళయాళం సినిమాలు మాజిక్ అసలు

కొత్త తెలుగు సినిమాల మీద ప్రేమ అసలు లేనే లేదు నాకు. కనీసం టైం పాస్ కైనా చూడాలనే  కోరికను మళయాళం సినిమాలు పూర్తిగా తుడిచి పెట్టేశాయి

 




28 comments:

విన్నకోట నరసింహా రావు said...

ఆరేళ్ల తరువాత మళ్ళీ పోస్ట్ వ్రాశారా! వెల్క్ం బాక్.

అవునండీ, మలయాళం సినిమాలు చాలా చక్కటి కథతో తీస్తారు. సమకాలీనంగా ఉంటాయి. ఆలోచింప చేసేవిగా ఉంటాయి. మీరన్నట్లు ఈకాలపు తెలుగు సినిమాల కన్నా చాలా రెట్లు నయం. మీరిచ్చిన లిస్టులో నేను చూసినవి “ఉండా”, “డ్రైవింగ్ లైసెన్స్”, నాకు బాగా నచ్చాయి. తతిమ్మావి కూడా త్వరలో చూస్తాను.

(అన్నట్లు, “నీలాకాశం .........” సినిమా పేరులో ఆ చివరి పదం “సువర్ణ” కాదు, చువణ ... అంటే ఎరుపు. నీలాకాశం, ఆకుపచ్చ సముద్రం, ఎర్ర భూమి)

సుజాత వేల్పూరి said...

నరసింహారావు గారూ, చాలా థాంక్స్ పోస్ట్ చదివినందుకు

అవును అని చువణ భూమే, తప్పుగా రాసేశాను

మిగతావి కూడా చూడండి. ఆండ్రాయిడ్ కుంజప్పన్, న్యాను ప్రకాశం అసలు మిస్ కావద్దు

విన్నకోట నరసింహా రావు said...

తప్పక చూస్తానండి.
కొన్ని మలయాళ సినిమాలు కథాపరంగా బాగుంటాయి గానీ నాకు చిరాకు కలిగించే అంశం మాత్రం ఒకటుందండి .... అదే ఆ బవిరి గడ్డాలు. స్టైల్ అనుకుంటారో, తమ అందం(?) రెట్టింపు అవుతుంది అనుకుంటారో తెలియదు గానీ హీరోతో సహా సినిమాలో 90% నటులు పెద్గాచిన్నా తేడా లేకుండా భయంకరమైన గడ్జాలతో కనిపిస్తారు, చూడడానికి మహా చీదరగా ఉంటుంది.

అయితే వాళ్ళనే అనుకోనక్కరలేదు లెండి. దాదాపు అన్ని భాషల సినిమాల్లోనూ నటులు అలాగే దర్శనమిస్తున్నారు. తెలుగులో కూడా చూడడానికి కాస్త బాగున్నాడులే అనిపించే (pre-గడ్డం రూపంలో) నటులు కూడా ఈ గడ్డం మోజులో పడిపోయారు, ప్చ్ ప్చ్.

బుచికి said...

పాత తరం కథానాయకులు NTR ANR Krishna శోభన్ బాబు, చిరంజీవి ... 90ల వరకు అందరూ clean shaven look తో చక్కగా ఉండేవారు.

గడ్డం చక్రవర్తి నుంచి మారిపోయింది.

ఇప్పుడు మహేశ్ బాబు ఒక్కడే 🍫 బాయ్ లుక్ లో ఉన్నాడు.

కేరళ లో కొబ్బరి నూనె ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి అందరికీ జుట్టు గడ్డాలు నల్లగా నిగనిగ లాడుతూ ఏపుగా పెరుగుతాయి. 🐑🐕

Chiru Dreams said...

మీకు గడ్డం నచ్చకపోతే, ఇంకెవ్వరూ గడ్డం పెంచుకోవొద్దంటే ఎలా? ఇంకా నయ్యం... అప్పటివాల్లని చూపి వీళ్ళని కూడా కుక్క చెవుల చొక్కాలు... చీపిరి పాంట్లు వేసుకోని తిరగమనలేదు...

రవికిరణ్ పంచాగ్నుల said...

బాగా చెప్పారు..
లాక్డౌనుకి ముందు ఒకటీ అరా చూసినా, ఇప్పుడు మాత్రం "only మనసిలాయో" నే.. 😃

కానీ, ఇంకా మీరు ఇచ్చిన లిస్టులో అక్కడక్కడా కొన్ని బాకీలు ఉన్నాయి.. అవి కూడా లాగించేస్తానుండండి.. 🙂

Surabhi said...

Thank you for the list Sujatha Garu. Hope I can watch atleast few with my preteen boys. These days it has become so hard to watch a telugu/hindi movies with kids

సూర్యుడు said...

Good to know, except for those Sunday afternoon DD movies, never watched any Malayalam movie. I think many of those hit movies getting either dubbed or copied/remake

Sharada said...

తొట్టప్పన్ కూడా చాలా బాగుంది. అసలు తెల్లటి తెప్పలాగుండే హీరోయిన్ కాకుండా మామూలు దక్షిణ భారతీయుల కుండే చామన చాయలో వుండే హీరోయిన్ నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది.

విన్నకోట నరసింహా రావు said...

తల మాసిన, నొలు మాసిన,
వలువలు మాసినను బ్రాణ వల్లభునైనన్
కులకాంతలైన రోతురు
తిలకింపగ భూమిలోన దిరముగ సుమతి ||

సుజాత వేల్పూరి said...

నరసింహారావు గారూ,

గడ్డం, మీసం మన దక్షిణ రాష్ట్రాల కల్చర్ లోనే ఉంది కదండీ. మీసాలు లేకుండా నార్త్ హీరోలను చూస్తే ఏవిటో గా ఉంటుంది.

అయితే తెలుగు, కన్నడ సినిమాల కంటే, తమిళ, మలయాళ సినిమాల్లో మాత్రం హీరోలు బాగా పెరిగిన గడ్డంతోనే కనిపిస్తారు. ఆ సినిమాలు లేటెస్ట్ వే కాదు, పాత సినిమాల్లో కూడ్దా ఇంతే

సో, ఇది లోకల్ కల్చర్ కాబట్టి, అక్కడి ప్రేక్షకులకు కూడా అవే నచ్చుతాయి కాబట్టి మనకు తప్పదు చూడక :-)

సుజాత వేల్పూరి said...

Chiru Dreams గారూ, అలా రావు గారి ఉద్దేశం అది కాదు. మన తెలుగు వాళ్ళు అటు పూర్తిగా గడ్డాలు తీసేయరు, ఇటు ఫుల్ గా పెంచక మధ్యస్తంగా ఉంటారుగా, మనకి అది అలవాటు కాబట్టి,కేరళ, తమిళనాడు గడ్డాలు మరీ చిరాకు పుట్టిస్తాయన్నారు.

కొన్ని సినిమాల్లో నిజమే అనిపిస్తుంది అది

అనంతపురం సినిమాలో హీరో చూడండి.. అలా :)

సుజాత వేల్పూరి said...

Surabhi gaaru,

Yes, we need to check the ratings and watch. As my daughter is 16 now, most movies we watch together and discuss. She has a very good taste for movies. We both fell in love with the interpretational skills of Malyaali directors.

సుజాత వేల్పూరి said...

Sharadaగారూ, అవును, తొట్టప్పన్చాలా మంచి సినిమా. తొట్టప్పన్ గా వేసినతనూ, అతని కూతురూ కూడా ఎంతో సహజంగా నటించారు.

మీరు చూసుండక పోతే, "కరుపు దొరై" తమిళ సినిమా చూడండి. చాలా గొప్ప సినిమా

సుజాత వేల్పూరి said...

సూర్యుడు గారూ, ఆదివారం మధ్యాహ్నం 1;30 కి వేసే సినిమాలు అవార్డు సినిమాలు కాబట్టి అందరికీ నచ్చేవి కాదు. కానీ ఈ డిజిటల్ ప్లాట్ ఫాం పుణ్యమా అని అన్నీ మంచి సినిమాలే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మలయాళీ మూవీలేవీ అంతగా తెలుగులోకి డబ్ కావట్లేదు

సుజాత వేల్పూరి said...

రవి కిరణ్ గారూ, హహ అవును, మా ఇంట్లో కూడా "మనసిలాయో.."నే! ఇన్ని సినిమాలు చూడక ముదు, మలయాళం కష్టమే నేర్చుకోవటం అనుకునే దన్ని. ఇప్పుడు అంత పెద్ద కష్టమేం కాదని ధైర్యం వచ్చింది.

Sravan said...

మొత్తానికి FBనుంచి మాయమయ్యి ఇక్కడ తేలారా? 🙂 వరనే అవశ్యముండు, బెంగళూర్ డేస్ ఈ మధ్యే నేనూ చూశాను. 'వరనే...' మంచి ఫీల్ గుడ్ మూవీ. బెంగళూర్ డేస్ లో ఫాహిద్ ఫాజిల్ బాగా నచ్చాడు. ఇంటలిజెంట్ ఫేస్, యాక్షన్ కూడా బాగుంది.

విన్నకోట నరసింహా రావు said...

అంటే మీరు మలయాళ సినిమాలు చూసి మలయాళ భాష నేర్చుకున్నారా, సుజాత గారు? నాట్ బాడ్ 👏.

సుజాత వేల్పూరి said...

శ్రవణ్ అంటే డొక్కా వారి అబ్బాయా?లేక జర్నలిస్ట్ శ్రవణా బాబూ?

కొన్నాళ్ళు ఎఫ్బీ నుంచి బ్రేక్.

బ్లాగ్ వదిలి చాలా రోజులైందని ఇటు వచ్చాను

సుజాత వేల్పూరి said...

Narasimha rao gaaroo,ఇంకా నేర్చుకోలేదండీ. అర్థం అవుతోంది ప్రస్తుతానికి చాలా వరకూ

నేను చిన్నప్పుడు దూరదర్శన్ చూసి హిందీ నేర్చుకున్నా మాట్లాడటం. బెంగుళూరు లో చుట్టుపక్కల వాళ్ళ మాటలతో కన్నడ నేర్చుకున్నాను.

ఇదీ అంతే! చాలా కష్టమేమో అనుకునే దాన్ని, వాళ్ళు అలా రాగ యుక్తంగా మాట్లాడుతుంటే. కానీ చాలా వరకూ తమిళ పదాలు,మాటలు ఉన్నాయి

పర్లేదు, మరీ మాట్లాడేంతగా నేర్చుకోక పోయినా, అర్థమయ్యేంతగా నేర్చుకోవచ్చేమో అని ఆశ

Sravan said...

కుమార్ కాదు బాబును. 🙂 అప్పుడప్పుడూ భలేగా hibernation లోకి వెళ్ళిపోతుంటారుగా!

bonagiri said...

మళయాళ సినిమాలు చాలా సింపుల్ గా ఉంటాయి. చిన్న పాయింట్ మీద మొత్తం సినిమా తీసేస్తారు. నేను అప్పుడప్పుడు చూ‌స్తుంటాను.
పాతికేళ్ళ క్రితం బేచిలర్ గెస్ట్ హౌస్ లో ఉన్నప్పుడు దూరదర్శన్ లో బోరు బావిలో పడ్డ బాలుడిని రక్షించడం అన్న పాయింట్ మీద సినిమా చూసాను.

వేణూశ్రీకాంత్ said...

మీరు చెప్పిన లిస్ట్ లో బెంగళూర్ డేస్, ట్రాన్స్ తప్ప వేరే ఏ సినిమాలు చూడలేదండీ. ట్రాన్స్ చూసి నేనూ మీ లాగే ఆశ్చర్య పోయాను. ఏంటి వీళ్ళకి మనోభావాలే లేవా అని. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే దదాపు ఏడాది పాటు సెన్సార్ తోనే పెద్ద ఫైట్ నడిచిందట. అప్పటికైనా విడుదలవడం అదీ కేరళలో నిజంగా గ్రేట్.

Lalitha said...

మీరిచ్చిన లిస్ట్ బావుంది. వీలైతే అయ్యప్పనుమ్ కోషియుమ్ కూడా చూడండి.

సుజాత వేల్పూరి said...

bonagiriగారూ, నిజానికి సినిమా, జీవితాన్ని ప్రతిబింబించేలా ఉండాలంటే అలాగే కదంటీ తీయాలి?

మన లాగా ఫార్ములా ప్రకారం తీయక పోవడం నాకు బాగా నచ్చిన అంశం

సుజాత వేల్పూరి said...

వేణూ,సెన్సార్ తో ఫైట్ నడిచినా, పెద్ద గా కట్లు లేకుండానే వచ్చినట్టుంది బయటకి ట్రాన్స్ .

మిగతా సినిమాలు నెమ్మదిగా ఒక్కొక్కటీ చూడండి

బెంగుళూర్ డేస్ లాంటి సినిమా తెలుగు లో అయినా నాని, నాగ శౌర్య లాంటి వాళ్లను పెట్టి తీయాల్సిందే

మన మూస హీరోలు పనికి రారు

సుజాత వేల్పూరి said...

లలిత గారూ, రాయడం మర్చి పోయాను, అయ్యప్పనుం కోషియుం కూడా చూశాను

ఇమేజ్ జోలికి పోకుండా పృధ్వీ రాజ్ చేసిన వెరైటీ (అతను అనే కాదు, అందరూ) చాలానే ఉన్నాయి.

బిజు మీనన్ ఎంత గొప్పగా చేశాడసలు !!

Sujata M said...

హ హ. మళయాళం సినిమాల గురించి పోస్ట్ కూడా సూపర్ హిట్టే. ఇన్ని సినిమాలే!? బెంగుళూర్ డేస్ అనుకోకుండా సబ్ టైటిల్స్ లేకుండా చూసాను.‌ చాలా బావుంది.

Post a Comment