June 23, 2020

కరోనా కకావికలు
పొద్దున్నే లేచి జాగ్రత్తగా తలుపు తీసి,పాల పాకెట్లు తెచ్చి కడిగి కిచెన్ లో పెట్టి బ్రష్ చేసుకుంటుంటే, పాల పాకెట్లు కడిగాక చేతులు హాండ్ వాష్ తో కడుక్కోలేదని గుర్తొచ్చింది.

ఎలా ఇప్పుడు? సగం బ్రషింగ్ కూడా అయ్యేపోయింది. సరే గబ గబా చేతులు డబుల్ సైజ్ లో హాండ్ వాష్ తో కడిగి, కాఫీలవీ కానిచ్చి ఆదివారం కదా, ఆఫీసు పని లేని రోజు కాబట్టి, మిక్సీ రిపేర్ కి ఇవ్వాలని  బయలు దేరటానికి రెడీ అయి బయట పడ్డా

లిఫ్ట్ బటన్ మోచేత్తో నొక్కడం రెణ్ణెల్ల బట్టీ బాగానే అలవాటైంది. కానీ ప్రతి రోజూ అది నొక్కాక, మోచేతికి వైరస్ పట్టుకుంటే? అది పాక్కుంటూ చేతుల దాకా వచ్చి, మొహమో జుట్టూ సవరించుకున్నపుడు మొహం మీదికి ఎక్కేస్తే? అని వెధవ డౌట్ మాత్రం  మార్చ్ నుంచీ వస్తూనే ఉంది ప్రతి సారీ

లిఫ్ట్ ఆటోమాటిక్ డోర్స్  కాబట్టి లాగే పన్లేదు. అమ్మయ్య

కిందకి వచ్చి కారు డోరు తీసి ఎక్కాక, డోర్ హాండిల్ కి శానిటైజర్ పూయడం మర్చిపోయానని గుర్తొచ్చింది.

చచ్చాం! ఇప్పుడెలా

బాగు లోంచి శానిటైజర్ తీసి చేతుల నిండా పులిమి , స్టీరింగ్ పట్టుకోవడం

ఈ స్టీరింగ్ కి స్టైల్ కొద్దీ లెదర్ కవరింగ్ వేయించాం. లెదర్ మీద కరోనా ఎంత సేపు బతికి
ఉంటుందో గూగుల్ చేయాలి.

 పర్లేదులే, ఇదేమైనా నిజం లెదరైతే భయపడాలి.

సీ విటమిన్ సప్లిమెంట్స్ కొనాలని గుర్తొచ్చి, అపోలో ఫార్మసీ దగ్గర కారాపాను

తలుపు నెట్టుకుని లోపలికి వెళ్లాక,హాండిల్ పట్టుకుని నెట్టామని గుర్తు రావడం..ప్చ్, ఖర్మ

కెవ్వుమనబోయి "శానిటైజర్ పెట్టలేదా?" అంటే..

"అయిపోయింది మేడమ్"

అపోలో ఫార్మసీ లో క్రోసిన్, అమృతాంజన్ కూడా "లేవండీ" అని వినయంగా చెప్తారు

ఎటు చూసినా డైపర్లు, పాల డబ్బాలూ

పక్కనే వేరే షాపు కి పోయి "ఫలానా విటమిన్లూ, ఒక క్రోసిన్ చార్టూ ఇవ్వండి" అనగానే "క్రోసినా? ఎందుకూ, జ్వరమా? ఎప్పట్నుంచీ, తల్నొప్పి ఉందా? దగ్గుతున్నారా? పొడి దగ్గా తడి దగ్గా? ఒళ్ళు నొప్పులున్నాయా? బ్రీతింగ్ ఇబ్బంది ఉందా?"

కరోనా వచ్చిందా అని తప్ప మిగతా ప్రశ్నలన్నీ అడిగారు

"లేదయ్యా బాబూ, మా కుక్కకి జొరం వచ్చింది. దానికి ఇదే వెయ్యమన్నాడు డాక్టరు" అని చెప్తే అపనమ్మకంగా చూస్తూ దూరంగా నిలబడి చార్ట్ విసిరేశారు

సరే ఎవరినీ తాక కుండా మడి గట్టుకుని ఇల్లు చేరి డోర్ లాక్ తీయబోతుంటే గుర్తొచ్చింది. డోర్ హాండిల్ ని చున్నీ తో పట్టుకుని తీస్తే చేతికి డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదని.

చున్నీ తో పట్టుకుని డోర్ తీసి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి,బజారుకెళ్ళొచ్చిన బట్టలు బాత్ రూం లో వదిలేసి, కొత్త వస్త్రములు ధరించి బయటికి రాగానే చున్నీ మంచం మీద కనపడింది.

దేవుడా, దీన్ని ఇక్కడే వదిలేశానా?

గబ గబా గూగుల్ ఓపెన్ చేసి "బట్టల మీద కరోనా ఎంతసేపుంటుందని అడిగాను.

మూడు గంటలని ఒక చోటా, రెండు రోజులని ఒక చోటా, డిపెండ్స్ అని మరో చోటా  ఉంది

సరే అని కర్రతో ఆ చున్నీ తీసి బయట పడేసి, ఎందుకైనా మంచిదని మంచం మీది బెడ్ షీటు కూడా తీసేసి, కొత్తది వేశాను.

లంచ్ తర్వాత ఏదో బుక్ చదువుకుంటూ మంచం మీద వాలితే బ్రహ్మాండమైనదీ మరియఊ భయంకరమైనదీ అయిన డౌటొచ్చింది.

కరోనా చున్నీ మీద నుంచి బెడ్ షీటు మీదకి పాకిందేమో అని అది తీసేశాను. మరి ఈ పాటికే అది పరుపు మీదకి పాకి ఉంటే? ఈ బెడ్ షీట్ కింద కరోనా ఉంటే? అది అక్కడి నుంచి పాక్కుంటూ బెడ్ షీట్ మీదకి రావడానికి ఎంత టైము పడుతుందో?

దుబ్బున మంచం మీదనుంచి లేచి సోఫా ఎక్కాను. నా బట్టల మీద ఒక వేళ...

ష్.. మళ్ళీ బట్టలు మార్చుకోవడం అయింది

సాయంత్రం వంటింట్లో ఉండగా ఇంటాయన వర్క్ స్టేషన్ (స్టడీ రూమ్) లోంచి " సాంబారు పెడుతున్నావా? ఘుమ ఘుమ లాడి పోతోంది వాసన ?" అన్నాడు

వాట్? ఘుమ ఘుమలా ? నాకేమీ వాసన రావట్లేదే?

కరోనా ఎక్కేసిన వాళ్లకి వాసన తెలీదుట. ఇపుడెలా?

"నాకేం రావట్లేదు వాసన? నిజంగానే ఘుమ ఘుమలు వస్తున్నాయా నీ రూం లోకి?లేక నాకు కరో....."

"అబ్బ, ఆపు ఎప్పుడూ అదే ధ్యాస. వండే వాళ్లకి ఘుమ ఘుమలు తెలీవు. వంటింటి బయట ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తాయి. నీకింకా కరోనా రాలేదు"

అమ్మయ్య అనుకుని వంట అక్కడ పడేసి చల్లగాలికి బయట గార్డెన్ ఏరియా లోకి  వచ్చాను.

"మీ అమ్మాయి వయొలిన్ క్లాసు అడ్రస్ చెప్తాన్నావు?" దూరం నుంచి ఫ్రెండ్ కేకేసింది

చెప్దామని నోరు తెరవగానే అటేపు వ్యాహ్యాళికి పోతున్న దోమల్లో ఒకటి నా కుత్తుక జొచ్చింది. అనగా గొంతులోకి పోయి, ఆగకుండా దగ్గొచ్చింది

నా చుట్టు పక్కల కాస్త దూరంగా వాకింగ్ లకీ, కబుర్లకీ బయటకు వచ్చిన వాళ్ళంతా, బాంబు పేలినట్టు కకావికలై ఎక్కడో పడ్డారు

ఒక పదేళ్ళ పాప "ఆంటీ, యూ ఆర్ హావింగ్ డ్రై కాఫ్.." అంది భయంగా చూస్తూ.

ఈ విషయం అసోసియేషన్ కి తెల్సి , హెల్త్ డిపార్ట్మెంట్ కో, పోలీసులకో ఫోన్ చేసే లోపు, గబ గబా ఇంటికొచ్చి పడ్డాను.

ఇంతకీ కరోనా పరుపు మీద ఎంతసేపుంటుందో గూగుల్లో దొరకలేదు.అది ఈ పాటికి తలగడ మీద ఎక్కి బజ్జుని ఉంటే నా గతేం కాను?

21 comments:

teluguvision.com said...

Nice thoughts sir


visit my telugu website

bonagiri said...

ఆఫీసు లో బాత్ రూమ్ కి వెళ్ళినప్పుడు టిష్యూ పేపర్ తీసుకుని వెళ్లి, దానితో నాబ్ లు తిప్పమని ఒకరు చెప్పారు. అది పాటిస్తున్నాను. అలాగే లిఫ్ట్ బటన్ లకి టూత్ పిక్ వాడొచ్చు.

నేస్తం said...

నేను వదిలేసా...నా వల్ల కావట్లేదు బాబు..చేతులు కడక్కొవలసి వచ్చినప్పుడల్లా నాలుగు అంట్లు తోమేసుకుంటున్నా..పనిలో పని అవి ఇవి రెండూ శుభ్రం అయిపోతున్నాయి...ఈ శానిటైజర్ల వల్ల చేతులు సెన్సిటివ్ గా అయిపోతున్నాయి..:(

రవికిరణ్ పంచాగ్నుల said...

పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయండీ..

అప్పుడెప్పుడో మా డాక్టరుగారు మంచినీళ్ల కుండ / ఫౌంటైను లాంటివాటి పక్కనుండి వెళ్తుంటే ఓ గుక్కెడు నీళ్లు తాగి వెళ్లమని చెప్పారు. ఈ రోజుల్లో అయితే కుళాయి / వాష్ బేసిన్ పక్కనుండి వెళ్తుంటే చేతులు కడుక్కోని వెళ్లమని చెప్తారేమో..

విన్నకోట నరసింహా రావు said...

ఈ టైములో ప్రతి దానికీ అనుమానం పట్టి పీడిస్తుంటుందండీ 🙂.
అవునూ, మీరు భారతదేశానికి తిరిగొచ్చేశారా?

వేణూశ్రీకాంత్ said...

దినదినగండం అంటే ఏంటో కళ్ళకు కట్టినట్లు చూపించారు... ఏంటో ఈ జాగ్రత్తలు ఒకోసారి విసుగొస్తుంది కానీ తప్పడం లేదు..

బులుసు సుబ్రహ్మణ్యం said...

ఏదో ఒక నెల రోజులు ఇవన్నీ పాటించాను అతి కష్టం మీద. ఇప్పుడు వీరాభిమన్యుడు లాగ దూసుకెళ్ళిపోతున్నాను. కరోనా అయినా మరొకటి అయినా నా శరీరంలో బతకలేదని నాకో నమ్మకం. మా అమ్మాయి, అల్లుడు కోప్పడ్డారు. "నా శరీరంలో మరే రోగానికి చోటు ఉండదు, రావాల్సినవి అన్నీ వచ్చేశాయి" అని చెప్పాను............ మహా

సుజాత said...

నరసింహా రావు గారూ, మేమొచ్చేసి రెండేళ్ళు దాటిందండీ

ఇక్కడే ఇప్పుడు

సుజాత said...

అవును వేణూ, ఇలా అనుమానాలతో, అపోహలతో బతకడం కష్టంగా ఉంది

రాబోయేది వర్షాకాలం. మామూలు జలుబు చేసినా అనుమానంతో గుండె ఆగిపోయేలా ఉంది

సుజాత said...

రవికిరణ్ గారూ అవును,

చిన్నపుడు ఎవరైనా ఇంటికొస్తే కాళ్ళు కడుక్కోమని నీళ్ళిచ్చేదీమ్మ

ఇప్పుడు చేతులు కడుక్కోమని వాష్ బేసిన్ చూపిస్తున్నాం ఖర్మ

సుజాత said...

నేస్తం, అవును, అటు అంట్లు తోమీ, ఇటు సబ్బుతో కడిగీ, కొన్నాళ్లకి చేతులు ఉంటాయో పోతాయో తెలీట్లేదు
ఎన్ని జాగ్రత్తలని తీసుకుంటాం?

సుజాత said...

bonagiri garu అవునండీ, టుత్ పిక్ కూడా ఉంచుకుంటున్నాం దగ్గర

వీటన్నిటికీ అలవాటు పడతామని ఎన్నడూ ఊహించనే లేదు

సుజాత said...

బులుసు గారూ, బాబోయ్ మీరు అలా అనేసుకుని బయటికి వెళ్ళకండి. కరోనా తో గేములు వద్దు

మీరు మాకు చాలా ముఖ్యం

నీహారిక said...

Many Many Happy Returns Of The Day !

Sujata said...

కొత్తలో బాగా భయపడ్డాము. ఇప్పుడు ఫ్రెండ్స్, రిలెటివ్ ల వాట్సాపు/ఫేస్బుక్ ల 'అయామ్ టెస్టెడ్‌ పాసిటివ్' ప్రకటనల కి అలవాటు పడుతున్నాము. ఇపుడు వాట్ నెక్స్ట్ దశకి వచ్చేసామేమో.

Siddu said...

Nice
Leora News

Leora News said...

Nice
Leora News

ఇందు said...

మనలో మనమాట! కరోనా పాకుతుందంటారా??? కనపడిన ప్రతి వస్తువుకి శానిటైజర్ స్ప్రె కొట్టి కొట్టీ చచ్చిపొతున్నాం!

సుజాత said...

నిజం ఇందూ, ఏదో అవసరానికి బాగ్ లో ఉంచుకుని, పబ్లిక్ టాయిలెట్స్ అవసరం వస్తే తప్ప వాడక్కర్లేని శానిటైజర్ ఇప్పుడు పొద్దునే లేవడంతోనే పాల పాకెట్లతోనే మొదలై పోతోంది.

చాలా ఆశ్చర్యంగా, చిరాగ్గా ఉంది ఈ పరిస్థితి

సుజాత said...

అవును సుజాత గారూ, మన జాగ్రత్తలో మనం ఉండటం, అది మన దాకా వస్తే డీల్ చేయడం, ఇంతే .

సుజాత said...

నీహారిక గారూ, థాంక్ యూ, ఆలస్యంగా రిప్లై ఇస్తున్నందుకు సారీ!

Post a Comment