May 12, 2008

"బరువు "బాధ్యతలు

ఈ మధ్య సెలవుల వంకతో బాగా ఊళ్ళు తిరిగేసి రావడంతో దగ్గు పట్టుకుని ఎంతకీ తగ్గలేదు.
నా దగ్గు సంజ్ఞలతో మా వారికి పిచ్చెక్కింది. 'ఖళ్...' "గూడ్ మార్నింగ్"
' ఖళ్ళ్ ' "టిఫిన్ రెడీ"
'ఖళ్ ఖళ్ ఖ..' "సాయంత్రం తొందరగా వస్తారా"
'ఖళ్ళ్ళ్ళ్ళ్ ఖళ్ ' "అంతేలే! మాకు సాయంత్రాలెక్కడున్నాయి?" అబ్బా, నిష్టూరం కూడా పలికించగలుగుతున్నాను దగ్గులో!

ఇక ఈ గ్రుహ హింస తట్టుకోలేక, శ్రీనివాస్ నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఆవిడ మా ఫ్లాట్స్ లోనే ఉంటారు. రొటీన్ గా బరువు చెక్ చేసి ' మీరు ఉండాల్సిన బరువు కంటే 6 కిలోలు ఎక్కువ ఉన్నారు ' అంది.
నేను స్ప్రింగ్ లాగ కుర్చీలోంచి లేచి 'హారు కిలోలా' (దెబ్బకి దగ్గు పోయి మాటలొచ్చాయి నాకు) అంటూ వాసు వైపు చూసాను.
కిసుక్కుమనబోతూ, నేను చూడగానే గోడకున్న చికెన్ పాక్స్ టీకా ప్రకటన చూడ్డం మొదలు పెట్టాడు.
కూచోమంది డాక్టరు. కూచున్నాను.
"ఆరు కిలోలంటే మరీ డేంజరేం కాదు, కానీ మీరు డైటింగ్ చేస్తే మంచిది కొంచెం"
"డైటింగా" మళ్ళీ కుర్చీలోంచి లేచి నిలబడ్డాను.
"మీరు ఈ సిటప్స్ ఇంటిదగ్గర చేస్తే సగం బరువు తగ్గుతారు" అంది డాక్టరు, బొత్తిగా మొహమాటం లేదల్లే ఉంది.
"అంతే కాదు, కొంచెం శారీరక శ్రమ కూడా చేస్తే బెటరు. మీకు పని మనిషి ఉందా"
'ఉంది ''మీరు ఏం పని చేస్తారు, వంట కాకుండా?'అసలు ఏమీ చెయ్యనంటే బాగుండదని, 'బట్టలు ఉతుకుతాను ' అన్నాను.
'ఎన్ని, ఒక బకెట్?'కొంచెం ఆలోచించి, "వారానికి మూడు సార్లు, 5.5 కిలోల చొప్పున " అన్నాను.
డాక్టరమ్మ తలెత్తి " IFB కదూ" అంది.
"అవును " అని నాలిక్కొరుక్కుని, 'ఎల్లా కనిపెట్టారు?" అన్నాను.
'లెక్క అంత ఖచ్చితంగా ఉంటేనూ '
సరే, మొత్తం మీద డైటింగ్ చేయాలని నిర్ణయించుకుని ఇంటికొచ్చాను. కానీ ఎలా మొదలు పెట్టాలో, ఏం తినాలో అర్థం కాలేదు. పొద్దున్నే మా టివిలో ప్రక్రుతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు గారు 'ఆరోగ్యానికి అరవై రహస్యాలు ' చెప్తున్నారని తెలిసి పొద్దున్నే టివి పెట్టాను.ఆ కార్యక్రమం 7-30 నుండి 8 వరకూ! 7-30 కి పెట్టినా, 7-46 కి పెట్టినా, 7-59 కి పెట్టినా...ఆయన ఒకటే చెపుతున్నారు...దోసిలి చూపిస్తూ,"ఇన్ని బొప్పాయి ముక్కలు, ఇన్ని మొలకెత్తిన పెసలు.." లేదంటే, 'ఆపకుండా 3 లీటర్ల నీళ్ళు తాగాలి "
చాలా ఈజీ అనేస్కుని, మార్వాడీ షాపు వాడిని ఒక బస్తా పెసలు పంపించమన్నాను. 'ఏంటి, డైటింగా?' అన్నాడు వాడు చెవి దుద్దులు సవరించుకుంటూ! మళ్ళీ వాడే 'దానికి 100 గ్రాములు చాలు మేడం! ఎందుకంటే తర్వాత మీరు డైటింగ్ మానేస్తారుగా మీరు ' అన్నాడు .
బస్తా పెసలు పంపమని, అందులో 100 గ్రాములు వాడి మిగిలిన వాటిని రిటర్న్ చేసిన వాళ్లని బోలెడు మందిని చూశానన్నాడు. 'ఓరి దొంగ వెధవా ' అనుకుని, ఇలా కాదని jim (మా ఫ్లాట్స్ లోనే ఉంది)కి వెళ్ళాలని నిశ్చయించాను. డాక్టరు 'ముందు ట్రెడ్ మిల్ మీద నడవండి కొన్నాళ్ళు ' అంది.
ఆపరేషన్ లోకి దూకాను. Nike షూలు కొన్నాను. స్పోర్ట్స్ షోరూంకెళ్ళి, మంచి డ్రెస్ కొన్నాను(పింక్ కలర్లో)అన్నింటికంటె ముందు రెండువేల పాటలు పట్టే I-pod కొన్నాను. ఎందుకంటే మా ఫ్లాట్స్ లో jim కెళ్ళే వాళ్ళంతా ఇవన్నీ లేకుండా వెళ్ళరు మరి! ఈ ఏర్పాట్లు చూసి వాసు అమాయకంగా మొహం పెట్టడానికి ప్రయత్నిస్తూ, "ఇవన్నీ లేకుండా కూడా కెలోరీలు కరుగుతాయనుకుంటా 'అన్నాడు. పట్టించుకోదల్చుకోలేదు!

అట్టహాసంగా jim కి వెళ్ళే సరికి అక్కడ ఇద్దరు మగాళ్ళు వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ కనపడ్డారు. ట్రెడ్ మిల్ మీద అడ్డంగా పెద్ద కాయితం అంటించి ఉంది "under repair" !

గత నెల బట్టీ అది పనిచేయడం లేదట!అది తెల్సుకోకుండా ఇన్ని ఏర్పాట్లు చేసాను. వాసు నవ్వుతాడని గుబులుగా ఉన్నా ఇంటికెళ్ళక తప్పింది కాదు. బయట వాకింగ్ కి వెళదామంటే, మా ఇంటి దగ్గర రోడ్లు భయంకరమైన రష్ తో నిండి ఉంటాయి.ఇద్దరం కలిసి వెళదామంటే మా ఆయన "నన్నొగ్గేయ్ తల్లోయ్, నన్నొగ్గేసెయ్ ' అని తప్పించుకున్నాడు.

మర్నాడు డాక్టరు కనపడి, 'మా ఇంటికి రండి, కొన్ని లో కాలరీ రెసిపీలు ఇస్తాను. మీకు ఉపయోగంగా ఉంటుంది ' అంది. నిజంగా ఆవిడిచ్చిన వంటలు బాగున్నాయి. డైటింగ్ అంత ఈజీ అనుకోలేదు.రోటీలు,కూరలు, లో ఫాట్ చీజ్,!అవి తీసుకుంటుంటె, ఆకలి కూడా పెద్దగా వేయడం లేదు. నెల రోజుల తర్వాత రమ్మంది కదాని, వెళ్ళాను క్లినిక్ కి. ఆవిడ నా బరువు చూసి, నిట్టూర్చి, "రెండు కిలోలు పెరిగారు" అంది. స్ప్రుహ తప్పింది నాకు.

"ఎలా! మీరిచ్చిన రెసిపీలే ఫాలో అవుతున్నాను. ఆకలి కూడా వేయడం లేదు " అన్నాను.
'మీ ఇంట్లో మీరొక్కరేగా డైట్ చేస్తున్నారు? " అంది.అవునన్నాను.
'ఎంత పరిమాణంలో తీసుకుంటున్నారు 'అంది'
దీనిలో ఉన్న కొలతల ప్రకారమే ' అన్నాను ఆవిడిచ్చిన పేపర్లు చూపిస్తూ!ఈ సారి ఆవిడ స్ప్రింగులా లేచి నిలబడింది.
'మొత్తం తినేస్తున్నారా?' అంది పరమాశ్చర్యంగా!
"ఏం?" ఫేపర్లు లాక్కుని, 'ఇది చూళ్ళేదా ' అంది కాయితం అంచులో ఉన్న చీమ తలకాయంత అక్షరాలు చూపిస్తూ!
అవి చదివి నాకు మతి పోయింది. serves three people అని ఉంది చిన్న అక్షరాలతో!"అంటే" అన్నాను మళ్ళీ స్ప్రుహ కోల్పోతూ!
'అంటే, ముగ్గురు తినవలసిన పదార్థాలు మీరొక్కరే తినేస్తున్నారు. ఇక ఆకలెలా అవుతుందీ! అందుకే 2 కిలోలు పెరిగారు " తాత్పర్యం విన్నాక పడిపోయాను.
కట్ చేస్తే,
మా పాప సెలవుల పుణ్యమా అని రోజూ పొద్దున్నే అయిదింటికి లేచి మా ఇంటి దగ్గరే ఉన్న పార్కులో వాకింగ్, జాగింగ్ అన్నీ చేస్తున్నా! 3 కిలోలు తగ్గాను. ఇంకా అయిదు......!

ఫలశ్రుతి: ఈ టపా చదివిన వారు, కామెంట్లు రాసిన వారు కూడా నా వలెనే 3 కిలోలు తగ్గెదరు!

31 comments:

Raj said...

బాగుంది మీ dieting. మీ బరువు తగ్గాలని Best of Luck చెప్తున్నాను.

దైవానిక said...

అదిరింది. కాని కామెంట్ వ్రాసిన పాపానికి ౩ కిలోలు తగ్గాలని శపించడం ఏం బాలేదు.
నా మూడు కిలోలు కూడా మీరే తీసేసుకొని చల్లగా 8 కిలోలు తగ్గిపొండి :)

Kathi Mahesh Kumar said...

సుజాతగారూ, బాగా జరిగింది. మేమందరం ఇలాగే ఉంటే మీరుమాత్రం బరువుతగ్గేద్దామనే!హన్నా!

ఒకవేళ మీ కసరత్తు ఫలిస్తే మాకూ సలహాలు పడెయ్యండి. కష్టపడకుండా బరువు తగ్గే సగహాలే సుమండీ.

జ్యోతి said...

సుజాత గారు,మీ డైటింగ్ ఏమో కాని , మీ బరవు కంటే శ్రీనివాస్ గారి పర్సు బరువు తగ్గుతుందనుకుంటా. ఖర్చులేని పని బ్రిస్క్ వాకింగ్.. కానివ్వండి. ఆల్ ది బెస్ట్.

Srividya said...

Very nice mee dieting story. title koodaa bhale pettaaru.

Sujata M said...

దగ్గు కోసం వెళితే... బరువు సలహా లభించిందా ? అదేదో (రన్) సినిమా లో తలనొప్పి అని వెళ్తే.. కిడ్నీ తీసేస్తారు..అలా.. ! మీ టపా.. నాలుగు సార్లు చదివాను ( 4 X 3 Kg) + ఈ వ్యాఖ్య రాస్తున్నాను (1 X 3 Kg.) మొత్తం..15 కిలో గ్రాములు.. తగ్గిపోతానేమో .. అని దురాశ తో! ....ప్చ్! ఏమీ కాలేదు. ఉండండి వచ్చే ఆదివారం ప్రమదావనం లో మీ సంగతీ చెప్తా!

Bolloju Baba said...

మీ పోస్టంతా చదివాను. మీ శాపం ఫలిస్తే బాగుండును. అదే చివరలో పెట్టారుగా ఈ టపా చదివిన వారు మూడు కేజీలు తగ్గెదరు అని.

బహుసా అది శాపం కాదేమో? నాబోటివాండ్లకు వరమేమో?

సరదాగా

బొల్లోజు బాబా

మాలతి said...

చాలా బాగుందంజీ,దగ్గుబరువు కథ. వచ్చేఆదివారం దగ్గులబరువే సబ్జెక్టయితే చూడాలి gymవేదన. మీరు మళ్లీ రాయడంలోకి రావడం బాగుంది నాకు.
మీదగ్గూ, బరువూ (నిజంగా వుంటే) తగ్గాలని కోరుకుంటూ
మాలతి

రాధిక said...

ఖళ్..ఖళ్...ఖళ[నవ్వాను.అర్ధమయిందా?] నేనో ఐదు కామెంట్లు పెట్టేద్దామనుకుంటున్నాను ఇక్కడ.మీకేమన్నా అభ్యంతరమా? నేను మూడు కేజీలు తగ్గకపోతే మీరు ఓ మూడు కేజీలు బరువుపెరుగుతారు.ఇదే నా శాపం.

సుజాత వేల్పూరి said...

jimకెళ్లడం ఏమిటని ఎవరైనా పట్టుకుంటారని చూసాను. మా @gym ముందు jim అని బోర్డు ఉంటుంది. మాలతి గారు పట్టుకున్నారు. ఎంతైనా సీనియరు హాండు కదా!

@ మహేష్ గారు,
అలా కష్టపడకుండా ఉండే మార్గాలు వెదికే, ఇప్పుడు బ్రిస్క్ వాకులు చేస్తున్నది.

@ దైవానిక,
థాంక్సండీ!

@సుజాత గారు,
వచ్చే వారం అందరూ బరువు తగ్గే సలహాలు మీకిస్తారు చూడండి, confusionతో!
@ బాబా గారు,
బరువు తగ్గాలనుకునే వాళ్ళకు దీవెన అన్నమాటండీ! మనబోటి వాళ్లనండి, నేను బరువు తగ్గేదాకా!

మాలతి గారు,

దగ్గు తగ్గింది లెండి! బరువే ఇంకొంచెం తగ్గాలి!

రాధిక గారు,
అర్జెంటుగా నా ఫలశ్రుతి ఉపసం హరించుకుంటున్నాను!

జ్యోతి గారు,
శ్రీనివాసు 'పరుసు లేదని నీవు కలత పడవలదు! నా పరుసు నీదిగా చేసుకుని వాడు ' అని అభయమిచ్చాడు లెండి. మరేం పర్వాలేదు.

శ్రీవిద్య గారు,రాజ్ గారు,
థాంక్యూలు!

కొత్త పాళీ said...

H I L A R I O U S
నవ్వినందుకు నా పొట్ట ఒక జెల్లీ డ్రం లా షేకయ్యి ఆ అలజడికి ఒక అరకిలో తగ్గాను నేను.

సుజాతగారూ, jim విషయంలో మిరు పొరబడ్డారు. మేమంతా సిసలైన ఆంధ్రులం కాబట్టి అదే సరైన స్పెల్లింగని మాకు తెలుసు. మాలతి గారు పాపం చాన్నాళ్ళుగా అమెరికాలో పడిపోయారు కాబట్టి అమెరికా స్పెల్లింగు అనుకున్నారు.

మా చినబూషయ్య టెర్రరిజమ్మీద యుద్ధం ప్రకటించి నట్టు నేనూ ఈ అతి బరువు మీద యుద్ధం ప్రకటించి ఒక టపా రాద్దామనుకుంటూ వస్తున్నా. ఇంతలో మీరిలా ..

కొత్త పాళీ said...

@ Radhika .. మీకూ నాకూ పోటీ ఇప్పుడు - get .. set .. go!

Anonymous said...

ఇలా రాస్తే ఇంకేం చెబ్తాం..

ఏంటో ఈ మధ్య అందరూ ఇరగ రాసేస్తున్నారు. నా గడ్డం, కమండలం, రుద్రాక్ష మాల ఎక్కడుందో వెళ్ళి వెదుక్కోవాలి.

-- విహారి

తెలుగు'వాడి'ని said...

సుజాత గారు : మీరు మీ టపా కూడలి లో కనపడేలోపు టపా కట్టేస్తానేమో అనే దగ్గరనుంచి మీ టపాలు చదివి నవ్వి నవ్వి మేము టపా కట్టేసేటట్టు చేసేదాక మారిన మీ అక్షరక్రమం నిజంగా హర్షణీయం మరియు అభినందనీయం. హృదయపూర్వక అభినందనలు.

ఈ మధ్యకాలంలో రమణి గారి హ్హ! హ్హ! హ్హ టపా తరువాత ఇంతగా నవ్విన టపా ఇదే ... నాకు ఇంతగా ఈ టపాలు నచ్చటానికి కారణం : హాస్యం అంటే తిట్లు, యాస, చెత్త పేర్లు మొదలగునవి అనేవాటి నుంచి దూరంగా జరిగి(పి) ఎంతో విలక్షణంగా చెప్పిన వాక్యాల విరుపులు ("మీరు ఈ సిటప్స్ ఇంటిదగ్గర చేస్తే సగం బరువు తగ్గుతారు", "ఈ సారి ఆవిడ స్ప్రింగులా లేచి నిలబడింది." మొదలగునవి)

సుజాత వేల్పూరి said...

అబ్బా!అయితే , నేను హాస్యం మిడకగలనన్నమాట!

కొత్తపాళీ గారు,
మీరు మీరు మిమ్మల్ని నవ్వించి అరకిలో బరువు తగ్గించిందంటే, టపా హిట్టే!

విహారి గారు,
అంత నైరాశ్యం వద్దండీ! ఏదో పిల్లలం , మీ దరిదాపులకైనా రాగలమా చెప్పండి! 'నన్నొగ్గెయ్యక్కోయ్ నన్నొగ్గేసెయ్ ' డైలాగు మీరు జ్యోతి గారి టపాకి రాసిన వ్యాఖ్య నుంచి తీసుకున్నాను. అంటే కాపీ కాదు, మన కీరవాణి లాగా 'ప్రేరణ 'పొందానన్నమాట!

తెలుగువాడిని గారు,
మీకింకా గుర్తుందా నా మొదటి ' టపా 'గురించి! నాకు సున్నితమైన హాస్యం నచ్చుతుంది.
భానుమతి అత్తగారికథల్లాగా, రంగనాయకమ్మ గారి కొన్ని నవలల్లో లాగ! ధన్యవాదాలు!

సుజాత వేల్పూరి said...

'మీరు మీరు ' ముద్రా రాక్షసం!

నిషిగంధ said...

:)))చంపేశారు సుజాతా మీ టపాతో!! నిన్నంతా లాఫింగ్ క్లబ్ లో కొత్తగా జాయిన్ అయినదానిలా నవ్వుతూనే ఉన్నా.. ఇక మీకు మన (బ్లాగర్ల) ఆస్థాన విదూషకురాలి పదవి కట్టబెట్టాల్సిందే!

ఇకపోతే, ఇది చదివితే బరువు తగ్గుతారంటే నేను రోజూ పొద్దున్నే గాయత్రీమంత్రంలా ఓ 108 సార్లు చదువుతాను :)

సుజాత వేల్పూరి said...

నిషిగంధా,
'లాఫింగ్ క్లబ్ లో కొత్తగా జాయిన్ అయిన దానిలా ' కొట్టారు విట్టు! థాంక్యూ!

రానారె said...

ఈ టపాకు మీరు పెట్టిన పేరు చాలా బాగుంది. మిగతా ప్రహసనం పేరుకుతగ్గట్టేవుంది. కానీ 'పరుసు లేదని నీవు కలత పడవలదు - నా పరుసు నీదిగా చేసికొని వాడు' మాత్రం ఈ రెండింటినీ మించిపోయింది.

Srinivas said...

సరదాగా ఉంది. ఆ అయిదూ తగ్గేలోపు మీ జాగింగ్ మీదా రాయండి.

సుజాత వేల్పూరి said...

రానారె గారు,
ధన్యవాదాలు! 'పరుసు లేదని..' నా సొంతం కాదు. చిన్నప్పుడు మా అన్నయ్య ఆ పాత మధుర మైన పాటను 'ఇడ్లి పై సాంబారు పోసినాడూ, మనవాడు ప్లేటుకే అందాలు తెచ్చినాడూ ' అని పేరడీ చేసి పాడేవాడు. అందులోని వాక్యమే ఇది!

శ్రీనివాస్ గారు,
ధన్యవాదాలు! జాగింగ్ మీదే కాదు, డైటింగ్లో నాకెదురైన అవాంతరాల గురించి కూడా రాద్దామని ఉంది.

Anonymous said...

ఆ పేరడీ పాట మేమిలా పాడు కొనేవాళ్ళం.

ఇడ్లీల పై చెంచాలు చెక్కినారు.
మనవాళ్ళు అన్నానికే సాంబారు పోసినారు

-- విహారి

arunakiranalu said...

CHALA BAVUNDADI SUJATHA GARU..
MONNA 10TH CLASS RESULT VACHINAPPATI NUNDI.. NENU CHALA DULL GA VUNNANU.. MA AMMAIKU ANUKUNNATHA % RALEDU.. KANI MEE BARUVU BADYATHALU CHADIVINA THARUVATHA PADI PADI NAVVANU..
ARUNA

Kottapali said...

అన్నట్టు .. మీకూ డాక్టరుకీ భోజనం గురించి జరిగిన సంభాషణ చదివితే ఇంకో సంఘటన గుర్తొచ్చింది. ఒకాయన ఇలానే బరువు తగ్గాలని సలహా కోసం డాక్టరు దగ్గిరికి వెళ్ళాట్ట. డాక్టరు ఆయన ఆహారపు అలవాట్లు అన్నీ క్షుణంగా తెలుసుకుని "పూటకి రెండు చపాతీలు తినండి" అని సలహా ఇచ్చాడు. ఈ పెద్ద మనిషి చాలా సీరియస్ గా .."భోజనానికి ముందా, తరవాతనా?" అనడిగాట్ట!

సుజాత వేల్పూరి said...

అరుణ గారు,
మీరున్న మూడ్ లో మిమ్మల్ని నవ్వించగలిగిందంటే, ఈ టపా నిజంగా ధన్యమైనట్టే!

@కొత్త పాళీ గారు,అవును.
ఆ జోకు నేనూ విన్నానండీ!

Sujata M said...

సుజాత గారూ

మళ్ళీ చదువుదామని ఓపెన్ చేశా.. ఈ కామెంట్లు చూసి ఇంకా ఇంకా నవ్వొచ్చింది. బాబోయ్! ఇలాంటివి చదివితే.. వొంటి బరువు సంగతేమో కానీ మనసు బరువు చాలా తగ్గిపోతుంది. కామెంట్లు మాత్రం అదిరాయి. మీ అన్నయ్యకు కూడా వీర తాళ్ళు వెయ్యాలి. శ్రీనివాసుకీ జై.

sivaprasad said...

'ఆరోగ్యానికి అరవై రహస్యాలు ' చెప్తున్నారని తెలిసి పొద్దున్నే టివి పెట్టాను.ఆ కార్యక్రమం 7-30 నుండి 8 వరకూ! 7-30 కి పెట్టినా, 7-46 కి పెట్టినా, 7-59 కి పెట్టినా...ఆయన ఒకటే చెపుతున్నారు...దోసిలి చూపిస్తూ,"ఇన్ని బొప్పాయి ముక్కలు, ఇన్ని మొలకెత్తిన పెసలు.." లేదంటే, 'ఆపకుండా 3 లీటర్ల నీళ్ళు తాగాలి "

మధురవాణి said...

భలే భలే! ఇద్దరం ఒకే టైటిల్ పెట్టాం అనుకోకుండా! ఏం చేస్తాం లెండి.. విషయం అలాంటిది కదా మరి! మీ టపా చాలా చాలా నవ్వించింది. ఏది రాసినా మీకు మీరే సాటి :-)
నాకు డైటింగ్ అంత సీన్ లేదు కాబట్టి, జాగింగ్ ట్రై చేద్దామనుకుంటున్నా! ప్రస్తుతానికి నేను తగ్గాల్సింది 3 కేజీలు. ఏం చేస్తానో చూడాలి మరి! ;-)
నా బ్లాగులో ఈ టపా లింక్ ఇచ్చినందుకు థాంక్స్ :-)

గీతాచార్య said...

Naaku perige maargam cheppi punyam kattukondi

Anonymous said...

He is not a doctor.He dont have any scienfic knowledge.Following his diet may give bitter results. some of his tips are too dangerus.
1.abandoning salt may lead to hyponetremia.
2.Drinking 5 liters of water water dopits in brain.water toxicity.
3.Leaving non veg leads to vitamin b12 deficiency.
4.Raw vegetables had pesticides which leads slow poisioning.
5.Spourts relese toxins when they are growing.
This list goes on if research is done.

Kottapali said...

thanks to Chandu's comment above, read this again and had a good laugh. god bless you

Post a Comment