ఇవాళెందుకో వంట చెయ్యబుద్ధి కాక వంటిల్లు తాళం వేసి తాళం చెవులెక్కడో(తాళం చెవులనాలా, చేతులనాలా?) పారేశాను. వంట చెయ్యడం నాకు ఇష్టమైన పనే,వంట ఒక కళే! నన్ను నేనే పొగుడుకుంటే బాగోదు గానీ బాగా వండుతాను కూడా! కానీ పదేళ్ళుగా రోజూ ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం, రోజూ ఇదే పనా?
ఉద్యోగం చేసినప్పుడు, చెయ్యనప్పుడూనా?
ఏరోజు కారోజు మెనూ వెతుక్కోవడం! వారంలో రెండు సార్లు ఒకే మెనూ రిపీట్ కాకుండా చూడ్డం, పోపులు పెట్టడం, ఆవ నూరడం, పొడులు చేయడం,పచ్చళ్ళురుబ్బడం.ఓహ్..నో! ఇందులో మళ్ళీ పాప గారి కోసం కారాలు తక్కువ వెయ్యడాలు, నేతులు ఎక్కువ వెయడాలు! ఎంత ఇష్టమైన పనైనా రోజూ చేస్తుంటే మొనాటనస్ గా ఉండదూ!
'ఏమిటమ్మా అలా కూచున్నావు పొద్దున్నే?" అనడిగాడు మా ఆయన ప్రేమగా! 'నాకు వంట మీద విరక్తిగా ఉంది ' అని చెప్పానో లేదో, మొహం చిరాగ్గా పెట్టేసుకుని 'నేను బిజీగా ఉన్నప్పుడే నీకిలాంటి విరక్తులు కలుగుతాయి ' అని మనసులో తిట్టుకుంటూ (తను మనసులో ఏ భాషలో తిట్టుకున్నా సరే, నాకు తెలుగు అనువాదంతో సహా వినబడుతుంది, పొగడ్తలు అంతగా వినబడవు గానీ) "అలాగా, అయితే బయటినుంచి తెప్పించుకో నీకూ, పాపాయికీ, నేనెలాగూ ఆఫీస్ లోనే గా " అని డిస్కౌంట్ ఇచ్చి మాట్లాడాడు!
"నేను పదేళ్ళ బట్టీ, నాన్ స్టాప్ గా వంట చేస్తున్నాను కదా, ఇన్నేళ్ళ వంటంతా కలిపితే ఎంతమందికి భోజనాలు పెట్టచ్చంటావు?" అనడిగాను.
"బోల్డు మందికి! నువ్వసలే ఇద్దరికి అంటే నలుగురికి వండుతావు ! మా వూరి మావుళ్ళమ్మ జాతరలో ఒకరోజు అందరికీ సంతర్పణ చెయ్యొచ్చు నీ పదేళ్ళ వంటతో" అన్నాడు.
'అమ్మో నేనింత ప్రొడక్టివా ' అని మూర్చ పోయాను.
పెళ్లైన కొత్తలో నాకు ఎక్కువ వెరైటీలు చేయడం వచ్చేది కాదు.మా అత్తగారింట్లో నేర్చుకోవచ్చులెమ్మని సరిపెట్టుకున్నాను.మొదటి రోజే వాళ్ళింట్లో నాకొక పెద్ద పజిల్ ఎదురైంది. కంచంలో పప్పు తర్వాత నల్లటి లేహ్యం వడ్డించారు.. తర్వాత అన్నం! ఎంత ఆలోచించినా ఆ కపిల వర్ణ శాకమేమిటోఅర్థం చేసుకోలేక పచ్చడితో లాగించేస్తున్నా!
ఇంతలో "ఇవాళ వంకాయ కూర భలే కుదిరింది" అని మా మామ గారు ఆత్తగార్ని ప్రశంసిస్తున్నారు. నాకసలే వంకాయ కూరంటే ప్రాణం! 'ఎక్కడ, ఎక్కడ వంకాయ కూర ' అని చూడగా, మా వాళ్ల కంచాల్లో లేహ్యం మాయమై పోయి ఉండటం గహించాను. మా అమ్మ చేసిన వంకాయ ముద్దకూరలో వంకాయ ముక్కలు కనపడుతూ ఉంటాయి. ఇక్కడేమో ...!
"కలుపుకో, కలుపుకో " అని బలవంతం చేస్తున్నారు ఒక పక్క! పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం అంటె ఇదే కాబోలనిపించింది.
ఇహ ఆ తర్వాత ప్రారంభమైంది పండగ నాకు! వాళ్ళింట్లో ఉదయం, సాయంత్రం రెండేసి కూరలుండాలి. పొద్దున వండినవి రాత్రికి తినరు. వెరైటీలుండాలి. నా గుంటూరు వంటలు నచ్చేవి కావు. నాకు ఆశ్చర్యం కలిగించేదీ, కోపం కూడా తెప్పించేదీ ఏమిటంటేప్రపంచంలో పశ్చిమ గోదావరి వంటలు తప్ప ఇంకో వంటలు ఉంటాయని వాళ్ళొప్పుకోరు. నేనొకసారి అద్భుతం గా గోంగూర పచ్చడి చేస్తే మూడేసి వాయలు తినేసి...'ఇలా ఉందేమిటి గోంగూర పచ్చడి? ఇలా కాదు చెయ్యాల్సింది" అంది మా AP .
"మీరు డైలాగ్ తప్పు చెప్పారు! ఇదేమిటి ఇలా ఉంది అని కాదు, ఇలాక్కూడా చేస్తారా? " అనడగాలి అన్నాను కోపం కనపడకుండా!
ఇహ మేము USA వెళ్ళాక హాయిగా ఇద్దరికే వొండచ్చు అనుకుంటే అక్కడ ఇంకా కష్టాలెదురయ్యాయి. మేము ఎక్కువ రోజులు ఒక్లహోమా లోని Tulsa అనే వూర్లో ఉన్నాం! అక్కడ మన ఇండియన్స్ అంతా కలిపి 700 మందికి మించరు. తెలుగోళ్ళు 200 వేసుకోండి.తరచూ ఈ రెండొందలమందికీ వంట చేయాల్సిన పరిస్థితి వచ్చేది. ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు సత్యనారాయణ వ్రతం చేసుకోవడం, , వంటలో ఒక చెయ్యి వేయడానికి పిలవడం! అసలు USలో ఉన్న మూడేళ్ళలోనూ, పాతికవేల మిర్చి బజ్జీలు, ఒక టన్ను బియ్యం పులిహోర, చేసి ఉంటాను. ఒక లారీ లోడు టమాటాలతో ఊరగాయ పెట్టుంటాను. ప్రతి ఆదివారం ఒక పాట్ లక్! గాడిపొయ్యి మీద కూడా పెద్ద పెద్ద వంటలు చేసే కెపాసిటీ వచ్చేసింది. ఎంత విసిగి పోయానో!
ఏదో ఒక రోజు ప్రతి స్త్రీకీ వంటంటే విసుగు పుట్టే సందర్భం ఒకటుంటుందని నా నమ్మకం!
మా ఆడపడుచు (వర్కింగ్) పొద్దున్నే నాలుగున్నరకు లేచి కుక్కర్ పెట్టి "ఆ శాస్త్రి గాడు (పెళ్ళి చేయించిన పురోహితుడు) ఏ ముహూర్తాన తెల్లవారుజామున నా చేత స్థాళీపాకం వండించాడో గానీ, ఆ రోజు నుంచీ ఇహ రోజూ నాలుగింటికే కుక్కర్ పెడుతున్నాను" అని రోజూ శాస్త్రి గార్ని తిట్టిపోస్తుంది.
ఇండియా వచ్చేసాక ఒక రోజు(అప్పుడు మేము గుర్గావ్ లో ఉన్నాం) వంట్లో బాగోక వంట చేయలేదు. ఆంధ్రా భవన్ కి వెళ్ళొచ్చాక మా అత్తగారికి ఫోన్ చేస్తే ఆవిడ 'అదేమిటి, నువ్వు వంట చేయలేకపోతే వాడికొచ్చుగా, వండకపోయాడా ' అన్నారు. నేను భయంకరంగా ఆశ్చర్యపోయి 'నీకు వంటొచ్చా?"అనడిగాను.
దానికి మా ఆయన.. "అంటే అదీ అలాక్కాదులే, కొంచెం వచ్చు! నేనూ అన్నయ్యా రూం లో ఉన్నప్పుడు అన్నయ్యే వండేవాడు..అసలప్పుడు నాకు వంట సగమే వచ్చు, కాని తర్వాత మొత్తం మర్చి పోయి, కొంచెం నేర్చుకున్నాక, కాఫీ కలిపి..కూరలు తరిగి..అంటె అన్నయ్యకు హెల్ప్ గా,," అని ఏదేదో మాట్లాడ్డం మొదలు పెట్టాడు. నాకు మండిపోయి మా బావగారికి ఫోన్ చేసాను
"మీకు వంటొచ్చా, రూం లో మీరు, మీ తమ్ముడు ఉన్నప్పుడు వంటెవరు చేసేవాళ్ళూ" అనడిగాను ఫోనెత్తగానే!ఆయన కోపంగా
"ఏవమ్మో! మగాళ్ళు వంట చేయడం మా ఇంటా వంటా లేదు. నీకు మా తమ్ముడు చెప్పాడా నేను వంట చేసేవాణ్ణని...నాకసలు వంటే రాదు, నువ్విలా అవమాన కరమైన ప్రశ్నలు వేస్తే మా ఆవిడకు చెప్తా " అని బెదిరిస్తుండగా, వెనకనించి '"నాలుగైంది, ఇంత వరకూ కాఫీ లేదు నా మొహాన్న " అని మా తోడికోడలు గొంతు వినపడింది. 'ఇదీ సంగతి ' అనుకుని పెట్టేసాను. సో, తనకు వంటొచ్చన్న సంగతి నాకు తెలిస్తే నేను అడ్వాంటేజ్ తీసుకుంటానని ఈయన భయం !
అందువల్ల ఎప్పుడైనా మా ఆయన రహస్యాలు తెలియాలంటే మా అత్తగారికి ఫోన్ చేస్తే చాలు సమాచార హక్కు చట్టం ఉపయోగించినట్టు మొత్తం డేటా వస్తుంది!
ఈయన మాత్రం "నువ్వసలు తల్లివేనా" అని తల బాదుకుంటారు.
మా బంధువుల్లో కొందరు పుట్టుకతో వృద్ధులైన యువకులు 'ఏం, వంట రోజూ చేస్తే చచ్చి పోతారా ఆడాళ్ళూ! మీరు చేస్తే వంటిల్లు organised గా ఉంటుంది. ఆ టెక్నిక్ మాకు తెలీదు అని శుష్క వాదాలు చేస్తారు. నా కజిన్ రాధ కి భలే కోపం ఇలా మాట్లాడితే! "మీరు క్రికెట్టో, లేక ఇంకేదైన బయటికెళ్ళే ప్రోగ్రమో ఉంటె ఝామ్మని పెద్ద ప్రిపరేషన్ లేకుండా వెళ్ళిపోతారు. మేం మాత్రం ముందే వంటా అదీ చేసిపెట్టుకుని డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలన్నమాట! ఎప్పుడన్నా వంట చేయకుండా బయటికి వెళ్లామంటే ఇంటికొచ్చేదాకా మనసు మనసులో ఉండదు! అసలు వంటింటినే మనసులో పెట్టుకు తీసికెళ్ళిపోతాం ఎక్కడికెళ్ళినా! ఒక్క రోజు ఫ్రెండ్స్ తో బయటికెళ్లాలన్నా, తీరిగ్గా ఒక పుస్తకం చదవాలన్నా, కాసేపు డాబా మీదికెళ్ళి చంద్రుణ్ణో, చల్లగాలినో ఆస్వాదించాలన్నా, ఈ వంట ఒక పెద్ద ముల్లులా గుచ్చుతూ ఉంటుంది వెనకాల! నోరు మూసుకోండి వెధవ ఆర్గ్యుమెంట్లు చెయ్యొద్దు ' అని క్లాసు పీకేసింది ఒకసారి!
రాధ మాటలు నిజమే అనిపిస్తుంది! ప్రశాంతంగా మనది అంటూ ఆస్వాదించాలనుకున్న క్షణంలో కూడా నానబెట్టిన మినప్పప్పో,ఎండబెట్టిన వడియాలో, తరగవలసిన కూరలో, కాచాల్సిన పాలో గుర్తొస్తే జీవితం నిస్సారం అనిపించక మానదు.... కనీసం ఆ క్షణం!
భర్తల నుంచి కొంచెం co-operation, అప్పుడప్పుడు బ్రేక్ లేకపోతే వంట ఎప్పటికైనా బోరు కొట్టేస్తుందండి! అదేమిటో ఇప్పటికీ కూరలు తేవడం, వంటలో పెళ్ళానికి కాస్త సహాయం చెయ్యడం నామోషీ అనుకునే పురుష పుంగవులు కోకొల్లలు!
34 comments:
అలాంటి పుట్టుకతో వృధ్ధులైన యువకులని నేనూ చాలా మందిని చూశాను!!!! అలాంటి శుష్క వాదాలు వింటుంటే చాలా చిరాకుగా ఉంటుంది...
sujatha garu
chala manchi subject kani naka problem ledu iddaram kalise vanta chesukuntam.. okaru vantachesthe okaru akukuralu tharigi istham..naku ekkada problem avuthundemonanai thane modata munduku vastharu.. ee vishayam i am lucky ...
aruna
బాగుంది మీ వంటిల్లు కథనం. ఇంతకే ఈ రోజు వంట చేసార లేక బయట నుండి తెప్పించార.
సుజాత గారూ, చాలా బాగుంది మీ వంటింటి/వంటల పురాణం.
నేను మీరు చెప్పిన మగాళ్ళకి మినహాయింపులెండి. మా ఆవిడ బెంగాలీ కాబట్టి మా రాయలసీమ వంటలన్నీ మనమే నేర్పాం. అసలే మా వాళ్ళు నన్ను అభినవ నలభీముడని కీర్తిస్తారు లెండి.కాబట్టి ఇప్పటికీ మా ఆవిడకి బోర్ కొడితే, నా ప్రాణాల మీదికొస్తుంది.
రోలు వెళ్ళి మద్దెలతో మొరబెట్టుకోవడం అంటే ఇదే సుజాతగారు.నేనెవరితో చెప్పుకోను.నాకు విసుగొస్తుంది రోజు కూరలు వెతుక్కోవడం, తరగడం, ప్చ్..
మావారు వంట చేసుకుంటూ చదువుకున్నారు. ఇప్పుడూ కనీసం టీ కూడా చేసుకోరు. పైగా పాత కథలు చెప్తారు. నాకు మండుకొచ్చి. కథలొద్దు. ఇప్పుడు చేసి చూపిస్తే నమ్ముతా అని చెప్పా. కాని ఒకటి మావారికి, పిల్లలకు గట్టిగా చెప్పేసా .అది బాలేదు ఇది బాలేదు అది చేయి ఇది చేయి అని అడగొద్దు. నేను చేసింది తినండి. లేదా బయటనుండి తెచ్చుకోండి.లేదా చేసుకోండి అని..
ప్రతి రోజు లేవగానే అనుకుంటా.. హాయిగా పడుకుని లేవగానే ఏవరైనా టీ చేసి, టిఫిన్ , లంచ్ చేసి పెడితే బాగుండు అని. అది ఈ జన్మకు తీరదని తెలుసు.మనం హాస్పిటల్ బెడ్ ఎక్కితే తప్ప.
సుజాత గారు, సరిగ్గా చెప్పారు,
భలేగా రాశారు, మీకు వంటొచ్చా?అన్నదానికి మీవారి సమాధానం హ హ హా.. భలేగుంది:)
నేనూ మీలాగే (మనగొప్ప మనం చెప్పుకోకూడదు గానీ:)) సూపర్ గానే వంటచేస్తా,ఇంట్లో అంతా లొట్టలేస్తూ బావుందని మెచ్చుకుంటూ తింటారు గాని, అంతసేపూ వంటగది లో వాటిమధ్యే ఉన్నందుకేమో పెద్దగా ఇష్టం గా తినలేను.
ఎవరైనా వండిపెడతేనే ఆకలి తో ఇష్టం గా తినాలనిపిస్తుంది.
excellent narrative!
Some amazing (కళ్ళు మిర్మిట్లు గొలిపే) word play.
This tops your food vs. weight post.
maooDu vaayalu guTukkumanipimchi maree gunTooR gOngoora pacchaDikE vankalu peTTina mee AP ni talchukuMtae naaku navvAgalEdu :)
maa Ayana goppa viSAla hRidayamtO vamTa cheyyabOtaaru gaanee, aa tarvaata counters ye gaakuMDaa iMTi kappu, gODaloo kooDA kaDukkOvaalani nAkaE bhayaM
:(
సుజాత గారు : గుంటూరు మిర్చిలో ఘాటు ఎక్కువా, గోంగూర పచ్చడికి రుచి ఎక్కువా లేక ఈ టపాలో హాస్యం ఎక్కువా అంటే నేనైతే ఠక్కున చెప్పేస్తా నా ఓటు మాత్రం ఈ టపాకే అని ... (అన్నీ అక్కడ నుండే కాబట్టి పొటీ ప్రసక్తి లేదనుకోండి :-) )
టపా టపాకీ హాస్యపు పాళ్లు ఇంతింతై వటుడింతై అన్నట్టు పెరిగిపోతుంది ... చాలా చాలా బాగా రాశా(స్తున్నా)రు .. వేనవేల అభినందనలు.
ఈ టపాలో ఈ వాక్యాలు తెగ నవ్వించాయి అని చెప్పాలి అంటే అదో పెద్ద టపా అయిపోతుంది ... ఏ వాక్యం ఇంకొక వాక్యం కన్నా ఎక్కువగా నవ్వించింది అని చెప్పాలి అంటే ఒక దినం అయిపోతుంది .... అలా కాక సింపుల్ గా బాగుంది అంటే ఈ టపాకు అవమానం అయిపోతుంది .... ఇంతకు ముందు చెప్పిన వారికన్నా కొత్తగా చెపుదాము అంటే మనకి ఆయాసం అయిపోతుంది ... వెరసి ఈ టపాకి వ్యాఖ్య రాయాలి అంటే తెలుగులో మనకు తెలిసిన పదాలు చాలవు అనిపిస్తుంది ....
అయినా వదిలిపెడతామా మన ప్రయత్నం మనం చేయాలి కదా...
ఇది ఒక హాస్య పద గుళికల సముదాయం .... పాత్రలన్నీ చాలా స్వచ్చమైన సహజమైన సంభాషణలతో కళ్లముందే కదలాడుతున్నట్టు రాయగలిగిన మీ చాతుర్యం అద్వితీయం, అమోఘం ...
నవ్వుతూ ఈ రోజు ప్రారంభించేలా చేయగలిగిన మీ టపాకు, అందులోని ఇరగదీసిన హాస్యానికి, రాసిన మీకు మరొక్కసారి అభినందనలతో మరియు ధన్యవాదాలతో ...
మీ టపా నుండి నేను నేర్చుకున్న పాఠం:
*మనకు వంట వచ్చున్న అనుమానం కూడా ప్రజానికానికి తెలియనివ్వకూడదన్న మాట.
*ఎవరికైనా అనుమానం కలిగినా, మీ వారిలా మానేజ్ చెయ్యలి.
*ఈ ఇంటికే కాదు వంటింటికి కూడా మీరే రారాజులు అన్న ఫీలింగ్ తెప్పించాలి.
ఇన్ని సద్విషయాలు తెలిపిన మీకు థాంక్స్!! ;-)
On a serious note, a very good write up!!
సరదాగా చాలా కబుర్లు చెప్పారు. అయినా రుచిగా చేస్తూ ఉంటే, వంటొచ్చినా వచ్చనెవరు చెప్తారండీ? ఒక వారం చంఢాలంగా వండితే ఎవరెవరికి ఏ ఏ టాలెంట్లున్నాయో ఇట్టే తెలుస్తాయి :-)
సుజాత గారు,
చాలా బావుంది. మీరు పైకి మీవారిని అంటున్నారు గానీ, ఆయనే పూనుకొని బాగా వంట చేసి, మీ స్నేహబృందంలో మంచి పేరు తెచ్చుకుంటే, మీరు తప్పకుండా కుళ్ళుకుంటారని, పాపం ఆయన ముందే వూహించి, తనకి కూడా వంటొచ్చొన్న విషయం మీకు చెప్పకుండా ఉండి ఉంటారు :-). మేం కూడా టల్సా లో చాలా ఏళ్ళు ఉన్నాం, మీ వంట ఏదో ఒకసారి తప్పక తినే ఉండి ఉంటాను.
కరక్టుగానె చెప్పారు సుజాత గారు,
అమెరికాలో వున్నప్పుడు అంత మందికి వండి వండి hotel పెట్టుకునే experience వచ్చింది.తిరిగి చూసుకుంటె తెలుస్తుంది.
మా ఆయన గారు వాళ్ళ స్నేహితుని పెళ్ళి పార్తీకి 200ల మందికి వండారంట.ఇప్పుడు నాకొక్క రోజు బోరు కొడుతొంది వంట చేసి అంటె అయితె దిక్కుమాలిన restaurent ల్లో buffet పోదాం అంటారు.దానికన్న పచ్చ్అ డి మెతుకులు మిన్న అని ఇంట్లొనె తింటున్నం.పిచ్చ్చ్ ఏమి చేస్తాం ఖర్మ.
మేథ గారు,
రమ్య గారు,
కొత్తపాళి గారు,
పూర్ణిమ గారు,
కృష్ణుడు గారు
ధన్యవాదాలు!
తెలుగు వాడిని గారు, అంత పెద్ద వ్యాఖ్య రాసి మరీ మెచ్చుకున్నందుకు చాలా సంతోషం, మరియు ధన్యవాదాలు!
అరుణ గారు,
మీరు లక్కీ!
జ్యోతి గారు,
మీకెప్పుడైనా వంట బోరు కొడితే నేను కారేజీ పంపిస్తాను లెండి ఇకపై! దీని కోసం మీరు హాస్పిటల్ బెడ్ ఎక్కడం ఎందుకూ? ఇంట్లో బెడ్ ఎక్కి చదువుకుంటూ పడుకోండి!
మహేష్ గారు,
మీకు బ్లాగర్లు అందరూ కలిసి 'సకల కళా వల్లభ ' బిరుదు ఇవ్వాల్సిన తరుణమాసన్న మైనది. మీ ఆవిడ గారికి తరచూ బోరు కొడుతుందా? ఎప్పుడన్నానా?
తెరెసా గారు,
చూసారా అన్యాయం! గోంగూర ఎవరెన్ని రకాలు గా చేసినా, దాని మీద పేటెంట్ మాత్రం మా గుంటూరు ఆడపడుచులదే కదా!
వికట కవి గారు,
ఈ సలహా మొదట్లో ఎవరైనా చెపితే వర్కౌట్ అయ్యేది! ఇన్నేళ్ళు వండాక ఇప్పుడు లాభం లేదు!
సీనుగాడు గారు,
మీరూ టల్సా లో ఉన్నారా! కొంపదీసి వింబుల్డన్ ప్లేస్ లో కాదు కదా! ఎక్కడికెళ్ళినా ఈ శ్రీనివాస్ లు మాత్రం పదుల సంఖ్యలో ఉంటారు సుమా! (మా వారూ శ్రీనివాసే)అక్కడ కూడా కనీసం ఆరుగురు 'సీనులు ' ఉండేవారు! వైజాగ్ స్రీను, (ఈయన బలే విట్టీగా మాట్లాడేవారు, గాయకుడు కూడా) హైదరాబాదు సీను ఇలా! మీరు ఏ వూరి శ్రీను?
చైతన్య గారు, ధన్యవాదాలు!
నేను ఈ పోస్టు రాస్తూ కూచుంటె మా ఆయన వంట (అదే లెండి,అన్నం, బంగాళా దుంపల వేపుడు. ఎప్పుడూ ఇదే రెసిపీ) చేసి ఆఫీస్ కి వెళ్లారు.
meeree tapaa chadavalEnaTTu vunnaaru, oka saari choodandi.
http://oohalanni-oosulai.blogspot.com/2008/06/blog-post_18.html
ప్చ్....ఒక భారి నిట్టూర్పు.నాకు అస్సలు వంట రాదు.నేర్చుకోవాలనే ఆసక్తి కూడ లేదు.మీ టపా చదువుతుంటే నాకు నా భవిష్యత్తు కనిపించి భయమేస్తుంది.
సుజాతక్కయ్యా, చచ్చిపోయాను నవ్వుకోలేక. పొట్టచెక్కలైపోయింది కొన్ని డవిలాగులకి :)
వ్రాయడంలో తాళంచెవులన్న వాడుకే ఎక్కువ. మాట్లాడడానికి చెవులూ చేతులూ రెండూ వాడ్తారు.
మోనోటోనస్గా ఉంటుందనే మా అమ్మ ఎప్పుడు నాల్గు వెరైటీలు చేసినా మా చెల్లెలు "అమ్మా నువ్వు ఇంత కష్టపడి చేస్తే మేమందరం హాయిగా కూర్చుని తినేస్తున్నామని ఎప్పుడూ అనిపించలేదా?" అని అడుగుతుంది. మా అమ్మ మాత్రం ఎప్పుడూ చిరునవ్వుతోనే సమాధానం చెప్తుంది.
మీకో సీక్రెట్ చెప్పనా... నూటికి తొంభైతొమ్మిది మంది మగాళ్ళకి వంట చేయడం తెలిసే ఉంటుంది. వంటలో సహాయం చేయమంటే పర్వాలేదు కానీ పూర్తి వంట చెయ్యమంటే ఇబ్బందే. అయినా వికటకవి అన్నట్టు హాయిగా చేసిపెడుతూంటే ఎవరికి వంట చేయబుద్ధేస్తుందీ?
"అదేమిటో ఇప్పటికీ కూరలు తేవడం, వంటలో పెళ్ళానికి కాస్త సహాయం చెయ్యడం నామోషీ అనుకునే పురుష పుంగవులు కోకొల్లలు!"... trend కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే మారుతోంది, ఇంకా కొన్నాళ్ళు ఓపిక పట్టాలి.
వంట, ఇల్లు చక్కబెట్టడం అన్నవి చాలు రోజంతా ఏం చేశామో కూడా తెలియకుండా గడిపేయడానికి.
"ప్రతి రోజు లేవగానే అనుకుంటా.. హాయిగా పడుకుని లేవగానే ఏవరైనా టీ చేసి, టిఫిన్ , లంచ్ చేసి పెడితే బాగుండు అని. అది ఈ జన్మకు తీరదని తెలుసు.మనం హాస్పిటల్ బెడ్ ఎక్కితే తప్ప." జోతక్కా, అంత విరక్తా???
sujatha garu
mee blog chadivaanu, naku baagaa nacchimdi and ee madhyanee naaku pellaiyimdi 3vaarala numchi ma variki lunch box istunnanu.mee blog chadivaaka naku komcham bhayameesimdi, aina parvaleedulemdi daniloo vumdee samtrupi bagumtumdi.yeppatikaina manadee paicheyamdi.ma variki vankalu pettatam baganee vacchuleemdi:)))))
సుజాత గారు,
మీరు చాలా చక్కగా రాస్తారు. మీ టపాలన్నీ ఎంతో ఆనందిస్తూ చదువుతాను. ఈ టపాని మా ఆవిడకి కూడా చూపాను. పై కామెంటులో రాసిన వంకలు పెట్టే "వారిని" నేనే :-) మా ఆవిడ కామెంటుచూసి నాకు ముచ్చటేసింది.... తను వంటలు బాగా చేస్తుంది.
మీరు రాసిన కొన్ని విషయాలతో మేము పూర్తిగా రిలేట్ చేసుకోగలము, ఎందుకంటే, మాది కూడా ప.గో జిల్లా. పైగా, నేను మా అన్నయ్య కలిసి వుండేవాళ్లము, ఇంకా మా అన్నయ్య బాగా వంట చేస్తాడు. ఇహ ఇప్పటి సంగంతంటారా, ఇప్పుడు వారాంతాలలో కూరలు కొనడం, అప్పుడప్పుడు కూరలు తరగడం లాంటివి చేస్తుంటాను లెండి.
చాలా సరదాగా రాసినా, సున్నితమైన విషయాల గురించి ఆలోచించేలా రాస్తారు మీరు.
అయితే, రాఘవ గారన్నట్టు ఇప్పుడిప్పుడే కాలం కొద్దిగా మారుతోంది. ఈ మారేకాలానికి సంబంధించి ఒక విషయం చెప్పాలి. బ్రహ్మచారులుగా ఉన్నప్పుడు, పప్పు నానబెట్టి, పిండి బైట రుబ్బించి, కొబ్బరి - పల్లీ పచ్చడి ఇంట్లో రుబ్బి, ఓ వంద దోశెలు దాకా వేసుకున్న మేము, "కొత్త వైద్యుడు కంటే పాత రోగికే ఎక్కువ తెలుసు" అన్న సామెతని, "కొత్త పెళ్ళికూతురు కంటే, పాత బ్రహ్మచారికే ఎక్కువ వంటొచ్చు" అని మార్చాము :-)
మీ ఈ టపా ఎలా మిస్ అయ్యానబ్బా??
అందుకే ఇంకో ఆడపిల్ల ఇలాంటి కష్టాలు పడకూడదని మా అబ్బాయికి ఇప్పటి నుండే ఇంటి పని వంట పని అలవాటి చేస్తున్నాను.
@ తెరెసా గారు-నాదీ అదే భయం,కానీ మా వారు కూరగాయలు కోయటంలో మాత్రం expert,ఆ పని వరకు చేయనిస్తాను:).
చాలా ఆలస్యంగా వచ్చాననుకుంటున్నాను. మీరు అందరికీ ధన్యవాదాలు తెలియచేసేసి, పోష్టుకి మంగళ హారతి ఇచ్చేసినట్లనిపిస్తుంది. అయినా సరే....
నెను మాపుట్టింట్లో ఉన్నప్పుడు, (పెళ్లి కాకముందు), మాఇంట్లో పోకుండల దగ్గరనుంచి పలావుదాకా పెద్ద ఎక్స్పర్టుని.
చదువుకొనే రోజుల్లో ఫ్రెండ్స్ ప్రతీఆదివారం నారూముకు వచ్చి నాద్వారా, వారి సకల జిహ్వ చాపల్యాలు తీర్చుకొనే వారు. (దినుసులన్నీ వాళ్లే తెచ్చుకొనేవారు. తద్వారా నాకూ ఆ పూట ఖర్చు తప్పేది. కాన్నో కూన్నో సామాన్లు నొక్కేస్తే మిగిలిన వారం వెళిపోయేది. అవో great depression days).
ఇక పెళ్లయ్యాక
ఆనోటా, ఈ నోటా విని మా ఆవిడ ఓ రోజు నన్ను బాగా ఉబ్బేసి, నాలో దొంగ నిద్ర పోతున్న నలభీముడిని నిద్రలేపబోయింది. ఎందుకో ఆ రోజు వంట బాగా కుదరలా. (ఎందుకు కుదరలేదో నాకు మాత్రమే తెలుసు).
అలా అలా టీలు కాఫీలకే పరిమితమైపోయాను.
థాంక్యూ జ్ఞాపకాల చెట్టుని కదిలించారు.
బొల్లోజు బాబా
@ హర్ష - సతీసమేతంగా దర్శనమిచ్చినందుకు చాలా సంతోషం. పనిలో పని ఆ బ్లాగుని తిరగదోడి మళ్ళీ సాహితీ వంట ప్రారంభిస్తే ఇంకా సంతోషిస్తాం.
@బాబాగారు - ఆ రోజు వంటకం ఎందుకు కుదర్లేదో మాకు తెలుసు లేండి - కుదురిఉంటే ఆమె ప్రతాది వారం సెలవు తీసుకుని మీ నలభీముల్ని డ్యూటిలో పెట్టేవారు .. సుఖాన ఉన్న ప్రాణాన్ని కష్టాన పెట్టడం ఎందుకులే అని .. ముందు చూపుతో .. :-)
నకంచంలో నల్లటి పదార్థం, ఆడబడుచు స్థాళీపాకం... చదువుతుంటే నవ్వొచ్చేసింది అని ఇప్పటికే చాలామంది చెప్పేసారు కద. ఇంక నేనేం చెప్పను, సుజాతా, ఆసమ్..
రాఘవ గారు, ధన్యవాదాలండి!
క్రాంతి, భయపడినా తప్పదు,లైట్ దీస్కోండి!
మిస్టర్ అండ్ మిసెస్ హర్ష గార్లు,
థాంక్యూ! హర్ష 'కొత్త పెళ్ళికూతురు కంటె...చాలా బాగుంది సుమా!
వరుధిని గారు,
నిజమా! మీకు జేజేలు!
బాబాగారు,
మీకెందుకు వంట సరిగ్గా కుదర్లేదో మీ ఆవిడ గారిక్కూడా అర్థమయ్యే ఉంటుంది లెండి!
మాలతి గారు,
ధన్యవాదాలు!
నన్నెవరూ వూరిపేరుతో పిలిచే వారు కారు కానీ, నన్ను "పగోజి సీను" అని పిలవొచ్చు. మీ స్రీనివాసు గారికి ఎందుకు వెనెకేసుకు వచ్చానో ఇప్పుడు అర్థం అయి ఉంటుంది. వింబుల్డన్ ప్లేస్ లో KVR & సుధ అని ఉండేవారు, వాళ్ళూ, పూజారి గారూ తప్ప ఇంకెవరూ తెలీదండి. మేము బ్రోకెన్ ఏరోలో ఉండేవాళ్ళం.
సుజాతా, ముందుగా క్షమాపణలు.. ఈ టపా పోస్ట్ అయిన రోజే చదివాను కానీ కామెంటటానికి టైం లేకపోయింది.. కానీ చదవగానే మొదటగా నేను చేసిన పని మా గాంగ్ కి (అదే మన ఆడ లేడీస్ కి) ఫార్వార్డ్ చేశాను.. రెండు మూడు 'వా' లు అటూ ఇటూ అయినా కామన్ రెస్పాన్స్ "వాహ్వా వావా వావ్" :))
కొత్తపాళీ గారు అన్నట్లు నెరేషన్ అద్భుతం!!
నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే పెళ్ళయ్యేసరికి నేను వంటలో ఎంత కత్తి అయితే మావారు అంత సుత్తి! పైగా నాకు వంకాయ, బీరకాయ పడవు (అవేమైనా ప్రియురాళ్ళా పడటానికి) అని వంకలు.. ఇలా కాదని కొన్ని రోజులు పరిశీలించిన మీదట ఆయన బలహీనత మీడ దెబ్బకొట్టాను.. నేను వంట చేస్తున్నప్పుడు అత్యద్భుతమైన వెకేషన్ ని ఎంజాయ్ చెస్తున్నట్లు ఆనందంగా, నవ్వుకుంటూ చేయడం మొదలుపెట్టాను.. అంతే! ఆయనగారు ఇదేంటి నేను లేకుండా ఇంత ఎంజాయ్ చేసేస్తుంది అనేసుకుని మెల్లగా నా సామ్రాజ్యంలోకి వచ్చారు.. నా అంత బాగా అని చెప్పలేను కానీ ఇప్పుడు చక్కగా చేస్తారు :)
కానీ వంట జంటగా చేయడంలో ఉన్న థ్రిల్లే వేరు (పెళ్ళైన/కాని వంట రాని అబ్బాయిలకి, అమ్మాయిలకు చిన్న చిట్కా)..
నిషిగంధగారు, మీ చిట్కా అదిరింది. Will keep that in mind :)
:))
బాగుందండి సుజాత గారు. సుజాతశ్రీనుంచి మళ్ళా సుజాతగా మారినట్టున్నారు??
బెంగుళూరు పుణ్యమా అని వంటలు బాగానే వచ్చాయి.. ఇక పెళ్ళయ్యి ఆ ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బయ్యి మర్చిపోతానేమో చెప్పలేను :)
ఇంత మంచి బ్లాగు ఈ రోజే నాకు కనిపించిందంటే నా కళ్ళు ఎంత నెత్తికెక్కి తెలుగు బ్లాగులు చదవటం మానేసానో అర్ధం అయ్యింది :-(
సుధాకర్
http://sodhana.blogspot.com అను ఒక పాత బ్లాగు రచయత
అందుకనే వంట వచ్చిన వాడినే అవసరమైతే ఎక్కువ కట్నం ఇచ్చినా కొనుక్కోవాలి అని నేను చిన్నప్పుడే డిసైడ్ అయ్యాను. పాపం ఎక్కువ కష్ట పెట్టాను లెండి. ఆ కట్నం కొద్ది కొద్దిగా జీతం లాగా ఇస్తూ అది తీరగానే నేనూ మొదలెడతా. వారానికోరోజు సరదాగా. ;-)
aatanemaatakardham.blogspot.com
అడుగు జాడ గురజాడది అన్న టైపులో మీ బ్లాగును చూసే నేను బ్లాగును మొదలుపెట్టాను కదా. అప్పుడప్పుడు మాత్రమే అంతర్జాలంలోకి తొంగి చూడగలిగే రోజులలో వచ్చిన టపా అయి ఉంటుంది. ఇది.ఎలాగో నా దృష్టినుంచి తప్పించుకుంది. చాలా బావుందండీ. మంచి బ్లాగ్చాతుర్యం మీకే సొంతం. ఆఖరికి మార్తాండని హెచ్చరించినా కూడా మీ స్టైలే వేరు. వెరీగుడ్...బావుంది...బావుంది.
Post a Comment