September 9, 2009

ఇంకా పాడాలా?


సినిమా గాయకుల్లో నాకు శ్రీమతి పి.సుశీల గారి స్వరం అంటే చెప్పలేనంత అభిమానం! ఆరాధన,ఇష్టం, పిచ్చి! శాస్త్రీయ సంగీతాన్ని కొన్నాళ్ళు నేర్చుకున్నా, నాకు అటువైపు కంటే పాత సినిమా పాటల మీద మనసు పీకుతూ ఉండేది,(ఇప్పటికీ అనుకోండి)! దానికి ఇతోధికంగా దోహదం చేసింది విజయవాడ ఆలిండియా రేడియో! వాళ్లెప్పుడూ పా........త పాటలు తప్ప కొత్త పాటలు వెయ్యకూడని కంకణం కట్టేసుకుని ఉంటారు రెండు చేతులకీ!

అలా పాత సినిమా పాటల మీద వ్యామోహం పెంచుకుని  ఆనాటి సుశీల గారి పాటలు విని(ఈనాటికీ) పరవశించడం జీవితంలో ఒక భాగంగా మారిపోయింది.నా శాస్త్రీయ సంగీత సాధన చెట్టెక్కడానికి సుశీల గారే కారణం అని ఆరోపించడానికి కూడా సిద్ధమే!


పాత తెలుగు సినిమా పాటల్లో జానకి కి అంత ప్రాధాన్యం లేకపోవడం వల్లనో, మంచిపాటలు ఆమెకు దక్కకపోవడం వల్లనో ఇళయరాజా శకం వచ్చేదాకా జానకిపాటలు అంతగా నచ్చేవి కాదు. మొత్తం మీద ఇద్దర్లో ఎవరికి వోటంటే నిస్సందేహంగా నా వోటు సుశీలకే!


మహా కవి కాళిదాసు సినిమాలో జయ జయ జయ శారదా పాట వింటే సరస్వతి లేచి పరిగెత్తుకుంటూ వస్తుందేమో అనిపిస్తుందిప్పటికీ!



రాజేశ్వర రావు గారి సంగీత దర్శకత్వంలో సుశీల స్వరంలో ప్రాణం పోసుకున్న అమృత ధారలు కోకొల్లలు. ఆమెకు పెద్దగా పోటీ లేకపోవడం వల్ల,ఆమె గొంతులో ఉన్న క్వాలిటీ మిగిలిన గాయనీమణుల గొంతుల్లో లేకపోవడం వల్ల కాబోలు కొన్ని వేల పాటల్ని అలవోకగా పాడి తెలుగు సినీ సంగీత సామ్రాజ్యానికి దశాబ్దాల పాటు మహరాణిగా వెలుగొందారు సుశీల!



ఆమె స్వరంలో ఉన్న మాధుర్యం మెత్తదనం, మృదుత్వం,సౌకుమార్యం, భావ ప్రకటనా సామర్థ్యం,..అనితర సాధ్యం! సుశీల గారి పాటల్లో నేను ప్రాణాలిచ్చేపాటలు కొన్ని....(కొన్ని మాత్రమే)


కనరాని దేవుడే కనిపించినాడే.(రంగుల రాట్నం)


ఏమని పాడెదనో ఈ వేళ.(భార్యా భర్తలు)


మోగింది వీణ పదే పదే .(జమీందారు గారి అమ్మాయి)



జోరు మీదున్నావు తుమ్మెదా. (శివరంజని)



లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను. (కళ్యాణి)


ఇంకా అనేకం, సమయానికి గుర్తు రావు కానీ!



సుశీల గారి తర్వాత స్థానం జానకి కే! లతా మగేష్కర్ పాత హిందీపాటలన్నా సుశీల గారి తెలుగుపాటల స్థాయిలోనే మనసు పారేసుకుంటాను.


ఇక విషయానికొస్తే....


వృద్ధాప్యం ఎవరినైనా జయించి తీరుతుంది, మనసును కాకపోయినా , కనీసం శరీరాన్ని!



లతా మంగేష్కర్, సుశీల, జానకి వీళ్లంతా తెలుగు సినీ సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించి,సంగీత ప్రపంచాన్ని జయించినవారే! సందేహమే లేదు. కానీ వీరు వృద్ధాప్యం తమ స్వరంలో ప్రవేశించి దాన్ని జయించిందన్న కఠిన సత్యాన్ని అంగీకరించకపోవడం ఆశ్చర్యాన్ని, ఒకింత బాధను కల్గిస్తుంది నాకు!



ఏదొ ఒక సన్మాన సభలోనో, సంగీత కార్యక్రమం  లో న్యాయనిర్ణేతలుగా వచ్చినపుడో నిర్వాహకులు పాడమని అడిగినపుడు వీరు పాడాలని ప్రయత్నిస్తే  శ్రోతలకు(లేదా వీక్షకులకు)ఆ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది.



దానికి ఇంకో కారణం కూడా ఉంది.తమ అభిమాన గాయనీమణుల మీద అవధులు లేని అభిమానంతోనో, సభా మర్యాద కోసమో ఇప్పటికీ సంగీత దర్శకులు, సభ నిర్వాహకులు "ఆమె స్వరంలో ఇంకా మాధుర్యం లేశమైనా తగ్గలేదు"అని ఇచ్చే మొహమాటపు స్టేట్ మెంట్స్ వారి ఆత్మవిశ్వాసాన్ని "బూస్టప్" చేస్తుండవచ్చు!



ఆమధ్య జానకి గారు ఒక స్టేజ్ మీద  సిరి మల్లె పూవా. పాట పాడడానికి ఎంతో ప్రయాస పడటం చూసి చెప్పలేనంత విచారం వేసింది.నిజానికి కళ్ళు ముసుకుని ఆ పాట వింటుంటే పదహారేళ్ళ శ్రీదేవి ఊహల్లోకి పరుగెత్తుకు రావలసిందే! కానీ ఆమె ఆనాటి "స్థాయి"(pitch)ని అందుకోలేకపోయారు.



లతా మంగేష్కర్ పరిస్థితీ ఇదే! అలాగే ఆశా భోంస్లే  ఈ మధ్య చందమామ సినిమ కోసం పాడిన నాలో ఊహలకు. పాట వింటే ఆమె స్వరంలో మార్పు గమనించవచ్చు.


ఈ మధ్యనే ఒక టీవీ ఛానెల్లో గాయని, యాంకర్ సునీత "ఝుమ్మంది నాదం" అనే కార్యక్రమాన్ని సుశీల గారితో నిర్వహించడం చూశాను.(ఈ కార్యక్రమం పేరు కూడా సుశీల గారి సూపర్ హిట్ పాటే) అందులో శ్రీమతి సుశీల "ఏమని పాడెదనో" పాట పాడి వినిపించారు. (ఒరిజినల్ పాట పైన విన్నారుగా)



ఎంతో అద్భుతమైన పాట! చక్కని భావ ప్రకటన, అతి చక్కని సింపుల్ గమకాలతో అందంగా సుశీల గారు పాడిన పాట!



సుశీల ఈ పాటను "సరిగా" పాడాలని ఎంత ప్రయత్నించినా, ప్రయాస పడినా శ్రుతి, లయ తప్పనే తప్పాయి! . ఊపిరి తీసుకోడానికి మధ్యలో ఆగి,ఎలాగో మేనేజ్ చేయవలసి వచ్చింది, ఆర్కెస్ట్రా ఎంతగానో సహకరించినా!

అంతకు ముందే ఒరిజినల్ పాట చూసి ఉండటంతో ఈ పాట విని మనసు వికలమైపోయింది.

సునీత అతిశయోక్తులతో అ పాటను మెచ్చుకుని మళ్ళీ మళ్ళీ పాడించింది.

నా బాధాపూర్వక వినతి ఏమిటంటే 

"మీరంతా ఒకప్పుడు సంగీత ప్రపంచాన్ని ఏలి, అభిమానుల్ని పాదాక్రాంతుల్ని చేసుకున్నవారు! అమృతాన్ని తాగి మాకు పంచిన వారు! వయసు పైబడ్డ కారణంగా, వృద్ధాప్యం మీ స్వరం పై తన ప్రభావాన్ని నిస్సంకోచంగా చూపిస్తోందని గ్రహించండి. మీరు ఒకప్పుడు కర్ణపేయంగా పంచిన మధుర స్వరాలను మా మనసులో, ఊహల్లో,  మా చెవుల్లో నిలిచిపోనివ్వండి! ఆ పాటలను ఇపుడు  మళ్ళీ పాడాలనే ఉత్సాహంతో, మా కలలను చెదరగొట్టకండి!






ఏ స్టేజ్ మీదో మిమ్మల్ని పాడమని అభిమానులో, నిర్వాహకులో కోరితే స్వరం సహకరించడం లేదని చెప్పి సున్నితంగా తిరస్కరిస్తే మీ గౌరవం హెచ్చుతుందే గానీ తగ్గదు!మీ అద్భుతమైన గళంలో ఈ అనూహ్యమైన మార్పును అభిమానులు ఊహించుకోలేరు మరి!"

"జీవితపు చివరి క్షణాల వరకూ పాడుతూ ఉండాలనే"  కోరిక గాయకులందరికీ ఉండొచ్చు కానీ(వృద్ధాప్యం మీద పడ్డాక) అందులోని సాధ్యా సాధ్యాలను, అభిమానుల మనోభావాలను కూడా పట్టించుకుంటే బాగుంటుందేమో!



ఝుమ్మంది నాదం వీడియో క్లిప్పింగ్ నా దగ్గరుంది. కానీ అదొక బాధాకరమైన అనుభవం! దాన్ని అందరితో పంచుకోవడానికి కూడా మనస్కరించక  ఇక్కడ అప్ లోడ్ చేయలేదు!

ఈ గాయనీమణుల మీద నాకెలాంటి ఫిర్యాదూ లేదు. హద్దులు లేని అభిమానంతో రాసిందే ఈ టపా!

26 comments:

శేఖర్ పెద్దగోపు said...

ఇంకా పాడాలా అంటే నాకయితే పాడితే బాగుంటుందని అనిపిస్తుంది. కాకపోతే ప్రస్తుతం వారి గొంతు ఏ స్థాయి వరకు అయితే శృతిని చేరుకోగలదో ఆ స్థాయిలో ఉన్న పాటలు ఝుమ్మందినాదం లాంటి ప్రోగ్రాం లలో పాడితే మీ లాంటి అభిమానులను నిరాశపర్చకుండా, నాలాంటి అభిమానుల కోరిక తీర్చేటట్టు ఉంటుంది.
నేను సుశీలమ్మది ఝుమ్మందినాదం ప్రోగ్రాం మిస్సయ్యానండీ. దయచేసి మీరు ఆ వీడియోను మీ టపాలో పెట్టరూ!!

Vinay Chakravarthi.Gogineni said...

post chese mundu inkosaari alochinchukovalsindi.

Padmarpita said...

శేఖర్ గారిదే నా మనవి కూడా!

కామేశ్వరరావు said...

మొత్తానికి మీ మనోభావాలు దెబ్బతిన్నాయంటారు! :-)
నా సానుభూతి మీతోనూ ఆ గాయనీమణులతోనూ కూడా ఉంది.
మొన్నీ మధ్యనే మళ్ళీ మొదలుపెట్టిన ఝుమ్మందినాదం చూసారా? బాలమురళీకృష్ణగారి గొంతు ఆ ఎనభై ఏళ్ళ వయసులో పలుకుతున్న సంగతులు, అందులోని మాధుర్యం, ఆ శ్రుతి స్థాయి వింటున్నప్పుడు ఇది మామూలు మనుషులకి సాధ్యమా అనిపించింది. ఇది చాలా అరుదైన విషయం. బహుశా ఇలాంటి వాళ్ళనే గంధర్వులని అనేవారు కాబోలు అనిపించింది!

సుజాత వేల్పూరి said...

కామేశ్వర రావు గారు,

నా బాధను సరిగ్గా అర్థం చేసుకున్నారు! ఒక పక్క నా పై నాకు జాలి, మరో పక్క అంతటి మధురమైన గళాలు ఇలా అయిపోయాయే అన్న బాధ! బలవంత పెట్టి పాడించే యాంకర్లు, ఇవన్నీ ఈ టపాకు కారణాలే! మొన్నటి ఝుమ్మంది నాదం చూశాక రాయాలనిపించింది.


బాలమురళి గారి కార్యక్రమం చూశాక నాకు అర్థమయిందేమిటంటే గళంలో మార్పు సినిమా దర్శకులు చేసే ప్రయోగాల వల్లనో ఏమో కేవలం సినిమా గాయకులకు అందునా స్త్రీలకు అనివార్యంగా తోస్తోంది. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి గళంలో కూడా మార్పేమీ రాలేదు.అలాగే నూకల చినసత్యనారాయణ గారి స్వరంలో కూడా!

వినయ్ చక్రవర్తి!

నాకు ఈ గాయనీ మణుల మీద ఫిర్యాదు ఏమీ లేదు! హద్దులు మీరిన అభిమానంతోనే ఈ పోస్టు రాశానని గ్రహించండి!

మురళి said...

పాటల విషయంలో శేఖర్ పెద్దగోపు గారి అభిప్రాయమే నాదీను.. గతంలో వాళ్ళ పాటలని వాళ్ళు పాడడం మనం చూడలేకపోయాం.. ఇప్పుడు వాళ్ళు ఆ పాటను ఎలాంటి హావభావాలతో (జానకి ఐతే ముఖంలో ఎలాంటి భావమూ కనిపించకుండా) పాడుతున్నారో చూసే అవకాశం వచ్చింది ఇప్పుడు.. మన మధ్య లేని వాళ్ళు పాడడాన్ని ఎలాగూ చూడలేం.. వీళ్ళు పాడుతుంటే 'చూసే' అవకాశాన్ని మిస్ చేసుకోగలమా చెప్పండి?

సుజాత వేల్పూరి said...

మురళి,
గతంలో వాళ్ళ పాటలని వాళ్ళు పాడటం చూడలేకపోయామన్న విషయాన్ని నేనూ ఒప్పుకుంటాను.పాత పాటల తాలూకు ఒరిజినల్ శ్రుతిని ఏ మాత్రం చేరుకోలేని ఈ పరిస్థితిలో అదే పాటను పాడటం వల్ల పాత ఒరిజినల్ పట్ల మన ఫీలింగ్ దెబ్బ తినదా? మొన్న ఝుమ్మంది నాదం చూశాక నాకు కలిగిన ఫీలింగ్ అదే! అందుకే ఈ టపా! అదీ కాక, పాట "వినడం"ముఖ్యం గానీ, చూడడం ముఖ్యం అంటారా?

సుజాత వేల్పూరి said...

గడ్డిపూలు సుజాత గారు ఈ మెయిల్ ద్వారా పంపిన వ్యాఖ్య... Hello sujata garu
I couldnt post my comment in ur blog - so mailing u. -------------------------------

సుజాత గారూ -

Interesting. నా మనసు లో మాటని కేచ్ చేసేరు. జానకి గారి అవస్థ నేనూ చూశాను. (ఝుమ్మంది నాదం చూడలేదు) ఇంకో మాట - యూ ట్యూబ్ లో ఒక సారి లతా మంగేష్కర్, ఎ.ఆర్.రెహ్మాన్ ల లైవ్ రికార్డింగ్ వీడియో చూసి, అరే లతామంగేష్కర్ గొంతు ఎంత మారిపొయైందో కదా అనుకున్నా. [అది నాకు చాల ఇష్టమైన 'లుకా చుపీ బహుత్ హుయీ' పాట - 'రంగ్ దె బసంతి ' లోనిది] కానీ రికార్డింగ్ అయ్యాకా, ఆ పాట ఒక వండర్ ! కొన్ని పాటలు 'ఆ ఫలానా వారూ' తప్ప ఇంకోకరు పాడితే బాగోవేమో అనిపించేలా ఉంటాయి.

2. మీరన్నట్టు వృద్ధాప్యాన్ని ఆక్సెప్ట్ చేయడం, ఆ గ్రేస్ ని నిలుపుకోవడం, బోల్డంత మంది అభిమానులను కూడగట్టుకున్న కళాకారులకు అవసరం.

3. Another interesting aspect : బాల మురళీ కృష్ణ గారి 'ఝుమ్మంది నాదం ' ఎపిసోడ్లు అలరించాయి. బహుశా శాస్త్రీయ సంగీతపు ప్రత్యేకత కావచ్చు. హంగలు గారూ, పట్టమ్మాళ్ళ లాంటి శాస్త్రీయ సంగీత కళాకారుల్ని చూడండి ఎంత వృద్ధులయితే అంత గాత్ర శుద్ధీ, పరిపక్వతా కనిపిస్తాయి. (అది సాధన మహత్యం.) సినిమా పాటల్లో ఆ సౌకర్యం తక్కువ అనుకుంటాను.

సుజాత వేల్పూరి said...

శేఖర్ గారు,
మీ అభిప్రాయం చాలా బావుంది.కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే వారు ఇప్పుడు పాడగలిగిన అతి తక్కువ శ్రుతిలో "ఇదివరకటి పాతపాటలు" పాడి ఉండలేదు.ఆ పాత పాటలు ఎప్పుడైనా సరే ఒరిజినల్ శ్రుతిలో పాడకపోతే అట్టర్ ఫెయిల్యూర్ అయిపోతాయి!

వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు!

భాస్కర రామిరెడ్డి said...

ఇదో మరొక ఎపిసోడో కానీ నేనూ చూసాను. సుశీల గారి గొంతు పాత పాటలతో పోల్చుకోలెక పోయినా , ఈ వయసులో ఇలాంటి ఇబ్బందులు తప్పవు కదా అని సరిపెట్టుకొన్నాను.మరొక మాట, యాంకర్స్ బలవంతం కంటే, చూసే వారికి కూడా ఒక పాట పాడిస్తే వినాలని కోరిక వుంటుంది కదా?

కానీ నాకెందుకో పాత పాటలంటే పి.లీల గారి గొంతే గుర్తుకు వస్తుంది. మధ్య యుగం లో సుశీలమ్మ గారు ,జానకి గారు. కొన్ని పాటలు కొందరు పాడితేనే వినాలన్నంత బాగుంటాయి . అలాంటి అద్భుత గాయణీ మణుల్లో వాణీ జయరాం పాటలంటే మహా ఇష్టం.

వేణు said...

> స్వరం సహకరించడం లేదని చెప్పి సున్నితంగా తిరస్కరిస్తే మీ గౌరవం హెచ్చుతుందే గానీ తగ్గదు!

> మీరు ఒకప్పుడు కర్ణపేయంగా పంచిన మధుర స్వరాలను మా మనసులో, ఊహల్లో, మా చెవుల్లో నిలిచిపోనివ్వండి!

... మీ ఆవేదనా, ఆర్తీ సంగీతాభిమానుల అంతరంగానికి అద్దం పడుతోంది.

శ్రావ్యతా, మాధుర్యాలతో సుస్వర సంచారం చేసి శ్రోతలకు అమృత ధారలను పంచారు నాటి మేటి గాయనీ మణులు. వారే ఇప్పుడు ప్రాథమికమైన శ్రుతి లయలే తప్పుతూ, ‘పాడటానికి చేసే ప్రయత్నాలు’ ... ఎంత విషాదం!

మహాభారత యుద్ధం తర్వాత గాండీవాన్ని ఎక్కుపెట్టలేక, అర్జునుడు పరాజితుడైన ఘట్టం స్ఫురిస్తుంది, వీరి ఇప్పుడు పాడుతుంటే!

$h@nK@R ! said...

నేను ఇప్పటికి సుశీల & జానకి పాటలు వినడానికి చెవి కోసుకునే రకం.. ఈ టి.వి ప్రోగ్రాం లకు దూరంగానే ఉంటే మంచిదని నా అభిప్రాయం..

Anonymous said...

సుజాత గారు మీ బాధ సహజమే

కాని
ఈ మధ్య ఏదో సినిమాలో అన్నట్లు ఇష్టం వున్నా చోట తప్పులు కనపడవు/ కనపడకుడదు (నేను కొంచం మార్చాను :) )

దీనికీ ఒక ఉదాహరణగా చిన్నపిల్లలు ముద్దుగా పాడుతుంటే శ్రుతి లయ చూస్తామా చెప్పండి, ఒక వయసు దాటిన తరువాత అందరు చిన్నపిల్లతో సమానం అని అంటారు కదా :)

నాకు అయితే సుశీల గారు, జానకి గారు పాడుతుంటే చూడడం ఒక గొప్ప అనుభూతి

ఏదో నాకు తోచింది నేను చెప్పాను.. ఒకసారి ఈ విధంగా అలోచించి చూడండి :)

Srinivas said...

ఏదో ఒకనాటికి కళాకారుల జీవితాల్లో ఆ విషాద ఘట్టం తప్పదు. ఐచ్ఛికంగా విరమించుకోవడం ఒక్క శోభన్‌బాబుకే చెల్లిందేమో!

Anil Dasari said...

సుశీల గళంలో దాదాపు పదిహేనేళ్ల క్రితమే ఇబ్బంది వినిపించింది ('పాడుతా తీయగా' మొదలైన కొత్తలో). జానకి ఈ మధ్యదాకా బాగానే అనిపించేది. సుశీలకి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయినా జానకి అడపాదడపా పాడుతుండటానికి అదే కారణమేమో.

ఎందుకో నాకు సుశీల గాత్రంలో (ఆవిడ బాగా పాడిన రోజుల్లోనే) మాధుర్యం ఉంది కానీ తాదాత్మ్యత లేదు అనిపించేది. జానకి పాటలో భావాన్ని అనుభవించి మరీ పాడుతుంది, సుశీల ఆ పని చెయ్యదు అనిపిస్తుంది. నా మాట చాలామంది ఒప్పుకోకపోవచ్చనుకోండి .. 'మైనే ప్యార్ కియా' రోజుల్నుండీ హిందీలో లత కూడా అలాగే ఐపోయినట్లనిపించింది.

sunita said...

Interesting!!!

వేణూశ్రీకాంత్ said...

సుజాత గారు, శీర్షిక మరియూ విషయం చూసి మొదట ఇలా రాశారేమిటి అనిపించినా టపా పూర్తయే సరికి మీ ఆవేదన పూర్తిగా అర్ధమయింది. నేను సుశీల గారి కార్యక్రమం చూడలేదు, కానీ శ్రుతి లయల ఙ్ఞానం లేని నా లాటి వారు మాత్రం ఆస్వాదించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగ పడతాయేమో... కానీ ఆవిడ పాడటం లోని ఇబ్బంది ని గమనించి నడుచుకోవలసిన భాద్యత యాంకర్ దే..

అన్నట్లు ఈ వీడియో లు ఎక్కడ ఉన్నాయి. నేను బాలమురళి గారి రెండవ ఎపిసోడ్ మిస్ అయ్యాను మీకు ఎక్కడైనా దొరికితే నాకు లింక్ పంపగలరా.. venusrikanth@gmail.com

సుజాత వేల్పూరి said...

వినయ్ చక్రవర్తి,
మీరు కోరిన విధంగానే మీ కామెంట్ ని ప్రచురించలేదు. కానీ అది అంతగా దాచాల్సిన కామెంట్ ఏమీ కాదు.

ఒక్క విషయం మీకు క్లియర్ గా చెప్తాను. పాట నాణ్యత(కేవలం మెలోడీ కాదు)తెలియాలంటే కొద్దో గొప్పో సంగీత పరిజ్ఞానం ఉండి తీరాలి. నాకున్న ఆ కొద్దిపాటి పరిజ్ఞానం బేస్ చేసుకుని రాశాను ఈ టపా!

సంగీతం అంటే ఇష్టం లేనివారు కూడా వాళ్ళు ఈ వయసులో ఎంతో బాగా పాడుతున్నారని మెచ్చుకుంటుంటే...ఎవరో చెప్పండి వారు? ఇష్టం లేకుండా మెచ్చుకునే వారు!

నాది హద్దులేని అభిమానంగా మీకు అనిపించలేదని రాశారు...నా అభిమానాన్ని నేను ఇక్కడ నిరూపించుకోవలసిన అవసరం లేదనుకుంటాను. నా అభిప్రాయం మాత్రం నిక్కచ్చిగా చెప్పాను.

దయచేసి మీరు తెలుగులోనో, ఇంగ్లీష్ లోనో వ్యాఖ్యలురాయగలరా? నాకు చదవడానికి ఈజీగా ఉంటుంది. టింగ్లీష్ లో వద్దు

సుజాత వేల్పూరి said...

వేణూ శ్రీకాంత్,
వీడియో పంపడానికి ప్రయత్నిస్తానండీ!

Kathi Mahesh Kumar said...

ఇలాంటి పరిస్థితే నాకు "దిల్ తో పాగల్ హై" సినిమాలో లతామంహేష్కర్ గారు పాడిన పాటలు విన్నతరువాత వచ్చింది.

గొంతులోని వణుకుని దాచలేని సంగీతం అపస్వరాల్ని పలికిస్తుంటే, ఆ అపరసరస్వతి ఇంకా పాడాలా అనిపించింది.

Dhanaraj Manmadha said...

LOL and a half

Unknown said...

kani okati mathram angeekarinchlenandi sujatha garu...

Suseela gari tharuvaathe Jaanaki gari sthanam annaru... idi entha varaku nijam...

evari style vaaridi... okari laga marokaru paadaleru ga...

thay are unique andi... varini compare chesi manam thappu cheyyoddu..

సుజాత వేల్పూరి said...

uday garu,
"Suseela gari tharuvaathe Jaanaki gari sthanam annaru... idi entha varaku nijam... ?"

Its not a statement. It is purely my personal opinion. I like suseela'a voice more. It does not mean that there is a comparision.

May be both of them have their own styles. Out of them I like Suseela's style and melody. Thats what I wanted to express.

Thank you!

GKK said...

ఈ టపా ఇప్పుడే చదివాను సుజాతగారు! (దాదాపు ఏణ్ణర్ధం తరువాత) సుశీల గారిని మీరు ఇంతగా అభిమానిస్తారని నాకు చాలా సంతోషం కలిగింది.
’ఏ స్టేజ్ మీదో మిమ్మల్ని పాడమని అభిమానులో, నిర్వాహకులో కోరితే స్వరం సహకరించడం లేదని చెప్పి సున్నితంగా తిరస్కరిస్తే మీ గౌరవం హెచ్చుతుందే గానీ తగ్గదు’- agree with you. 60 70 80 లలో వారి గొంతు అత్యున్నత స్థాయిలో ఉండింది.
ఈ మధ్య నాలో నేనై అని స్వాతిలో ఆత్మకథ వ్రాస్తున్నారు.

శంకరాభరణంలో సుశీలగారికి పాటలు లేకుండా చేసినందుకు ఇప్పటీకీ నేను బాధపడుతుంటాను. వారికి పద్మభూషణ్ వచ్చినప్పుడు ఎంతో సంతోషపడ్డాను.

జైభారత్ said...

మేడం మీ భాద అర్ధం చేస్కోవాల్సిందే కాదనను కానీ ఒకప్పుడు తెలుగు ప్రజలను ఉర్రూగతలు ఊగించిన గొంతులు ఈ రోజున ఎలా పాడిన వాళ్ళ ఆనందం కోసం మనం వినాల్సిందే అప్పుడు విన్నది మనకోసం ఐతే ఇప్పుడు వాళ్ళ కోసం విందాం సుజాత గారు( సెలయేరు గారు అన్నట్టు.. చిన్నపిల్లలు ముద్దుగా పాడుతుంటే శ్రుతి లయ చూస్తామా చెప్పండి, ఒక వయసు దాటిన తరువాత అందరు చిన్నపిల్లతో సమానం అని అంటారు కదా ...)వాళ్ళకి మానసికంగా కావాల్సింది తరగని మన అభిమానం అని నా అబిప్రాయం.

sasi said...

నిజంగా సుశీలమ్మ పాటలు ఒక వరం.ఆవిడ ఆత్మకథ చదువుతుంటే ఎంత ఆనందం వేస్తుందో.నాకు ఆవిడ పాటలంటే ఎంతో ఇష్టం .
ఈ లింక్లో సుశీలమ్మ గొంతు వినండి ఎంత బాగుందో ఆ వయసులో కూడ

http://www.youtube.com/watch?v=clE_-fgFvk8

Post a Comment