October 27, 2009

జరుక్ శాస్త్రి పేరడీ "వెళిపోయిందెళిపోయింది..."కవితా ప్రియుల కోసం!

పేరడీ రారాజు జరుక్ శాస్త్రి గారు ఎన్నెన్నో అద్భుతమైన పేరడీలు కట్టినా వాటన్నింటిలోకీ బహుళ ప్రజాదరణ పొందింది ఆయన రాసిన "వెళిపోయిందెళిపోయింది..."అంటూ సాగే పేరడీ! అది ఎక్కడ వెదికినా,ఎంతగా సెర్చినా దొరకనే లేదు చాన్నాళ్ళుగా! చివరికి మొన్న ఒక ఫ్రెండ్ దాని కోసం వెదికితే మళ్ళీ ప్రయత్నించాను. తనకు ఇవ్వడం సంగతి అటుంచి అసలు అది ఎందుకు దొరకదో చూద్దామనే పంతం కొద్దీ,ఉక్రోషం కొద్దీ తీవ్రంగా ప్రయత్నించాను. ఎంతో మంది స్నేహితులని అడిగి చూశాను. చివరికి దొరికింది.  హాశ్చర్యం!  తెలుగు గడ్డ మీద కాదు. మరెక్కడో! ఒక మిత్రుడి  ప్రవాసాంధ్ర మిత్రుడి వద్ద!

ఇంతకీ ఈ పేరడీ పేరు "ఆశ్వాసాంతం"!




అది మీ అందరితో పంచుకోవాలని ఇక్కడ స్కాన్ చేసిన పేజీల రూపంలో ఉంచుతున్నాను. కవితా ప్రియులు, ఇష్టమైన వారు కాపీ చేసుకోవచ్చు. కేవలం పేరడీయే కాక అందులోని వ్యక్తులెవరో కూడా వివరించే వివరణ కూడా ఇక్కడ ఉంచుతున్నాను.


మీలో ఎవరివద్దైనా ఉంటే సంతోషం! లేనివారు....  పనిలో పడండి మరి!



 
 





28 comments:

భాస్కర రామిరెడ్డి said...

సుజాతగారూ పుస్తకాలు ( సాహిత్య/నవల) చదివే అలవాటు పెద్దగా లేకపోవడం వల్ల ఇది ఎంత అరుదైనదో తెలియదు కానీ డౌన్లోడ్ చేసుకొని దాచుకున్నాను.
అయినా ఇంత సెర్చి చేసినా మీకది దొరకలేదంటే ఇదికూడా "వెళిపోయిందెళిపోయింది..కళ్ళముందే ఎళిపోయిందెళ్ళిపోయింది" :)

Raj said...

నేను కవితా ప్రియుడిని అని చెప్పుకునే స్థాయికి ఇంకా రాకపోయినా, నేను కూడా ఈ టపాని ఆస్వాదించగలిగాను.
పాతంతా రోత, కొత్తంతా వింత అని అనుకునే చాల మందిని కట్టిపడేయగల పేరడి.

సుజాత గారికి
ఈ పేరడిని సంపాదించినందుకు అభినందనలు
పేరదిని పంచినందుకు ధన్యవాదములు

satya said...

జలసూత్రం రుక్మిణీ నాధ శాస్త్రి గారు ఎక్కువగా దేవులపల్లి వారిని టార్గెట్ చేసేవారనే సంగతి అందరికీ తెలిసిందే కదా?ఈ విషయమై ఎవరో కృష్ణశాస్త్రి గారిని వారి అభిప్రాయం చెప్పమంటే ఆయన ఏమన్నారో తెలుసా.......?
"అసలు ఆయన పేరే నాపేరుకి పేరడీ" అని............)

సుజాత వేల్పూరి said...

Satya,

అవునండి, నేనూ చదివాను ఈ సంగతి! కానీ అంత స్పాంటేనియస్ గా అలా మాట్లాడ్డానికి ఎంత సమయస్ఫూర్తి ఉండాలో కదా!

వేణు said...

ఇంటర్నెట్ లో ఎక్కడా దొరకని ఈ ప్రసిద్ధ పేరడీని అందించినందుకు అభినందనలు! కవితా ప్రియులకు ఇది సంతోషం కలిగిస్తుంది.

‘జరుక్ శాస్త్రి పేరడీలు’ పుస్తకంగా సంకలనం చేసింది కె.వి.ఆర్. విజయవాడ నవోదయ వారు ఈ పుస్తకం వేశారు. ఇలాంటి పుస్తకాలు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా రీ ప్రింట్లు జరిగితే బావుంటుంది.

కె.వి.ఆర్. గారి ఫుట్ నోట్లు ఈ పేరడీని అర్థం చేసుకోవటానికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి!

Bolloju Baba said...

సుజాత గారికి
చాలా థాంక్సండీ.
ఈ కవితను చాన్నాళ్లక్రితం చదివాను. ఆ తరువాత దీన్ని మరలా చదవాలంటే దొరకనే లేదు. ఒక సారి నాగమురళీ గారి బ్లాగులో ఈ కవిత గురించి ప్రస్తావించాను. ఎక్కడైనా దొరికితే పంచుకొమ్మని.
ఈ సంబాషణలోకి పరుచూరి శ్రీనివాస్ గారు కూడా వచ్చారు. ఆయనకూడా నా వద్దలేదని చేతులెత్తేసారు. (నా దౄష్టిలో ఆయనవద్ద లేని సమాచారం అరుదు)
మొత్తానికి మీరు సేకరించారు ఇలా చదవటం చాలా ఆనందంగా ఉంది.

ఇక ఈ కవిత విషయానికి వస్తే

జరుక్ శాస్త్రి గారి పేరు ఈ తరం పాఠకులకు పెద్దగా పరిచయం తక్కువే అవ్వొచ్చు. మహా అయితే మహాప్రస్థానం యోగ్యతా పత్రంలో చదివి ఉంటారు.
కానీ కృష్ణ శాస్త్రి, శ్రీశ్రీ నండూరి ల కవిత్వాల్ని తన పేరడీలతో ఒకాట ఆడించిన తుంటరి, అంతే కాక ఈయన మంచి కధకుడు.

ఈ కవిత నా దృష్టిలో తెలుగు సాహిత్యంలో వచ్చిన అత్యంత గొప్ప నాస్టాల్జిక్ పద్యం. నాస్టాల్జియా అంటే గతముతలచీ వగచే కన్నా సౌఖ్యమే లేదోయి అనే టైపు కాదు. గొప్ప మాధుర్యముంటుంది. చదువుతూంటే ఒక నాటి ప్రపంచం కళ్లకు కట్టినట్టుంది.

ఒక సాహిత్య కారుడు తనజీవితంలో చూసిన ఆకాశాన్నంటటినీ అక్షరాలలో ఒంపినట్లుంటుంది.

కవిత క్రింత ఉన్న అధోజ్ఞాపికలో కూడా ఈ కవితలోని రిఫరెన్సులను పూర్తిగా డీకోడ్ చెయ్యవు. ఇంకా చెయ్యాల్సింది చాలా ఉంది.
బహుసా ఒక పి.హెచ్ డీ కి సరిపోయేటంత. ఇరవైలనుంచి అరవైల దాకా జరిగిన తెలుగు సాహిత్య చరిత్ర అంతా ఓ మూడు పేజీలలో ఇమిడిపోయింది. చక్కగా. ఆశక్తికలిగించే సాహిత్య చీకటి కోణాలతో సహా.

గొప్ప కవితనu కాలగర్భంలో కలసిపోకుండా, అంతర్జాలంలో పాతారు . మీకు అభినందనలు మరియు ధన్యవాదములు

భవదీయుడు
బొల్లోజు బాబా
మరో కొసమెరుపు ఏమిటంటే, ఈ కవితను శ్రీరమణ గారు (ఆయనే అనుకొంటా) ఎనభైలలో పేరడీ చేసారు.

భావన said...

వావ్ ఎంత జీవితాన్ని కళ్ళ ముందు అలవోక గా అవిష్కరించారు.. బలే వుంది.. మీ పోస్ట్ దానికి అందరు రాసిన కామెంట్స్ కూడ చాలా బాగున్నాయి నా వంటి సాహిత్య శూన్యులకు తెలుసుకునేందుకు.. మీరందరు రాస్తుండాలి మేమిలా చదువుతూ వుండాలి..

$h@nK@R ! said...

సుజాత గారు..
భాస్కర్ గారన్నట్లు..పుస్తకాలు ( సాహిత్య/నవల) చదివే అలవాటు పెద్దగా లేకపోవడం వల్ల ఇది ఎంత అరుదైనదో నాకు తెలియదు.. వెళిపోయిందనుకున్నదాన్ని.. వెతికి మరి పట్టుకొని మాకు పంచుతున్నందుకు ధన్యవాదాలు.. ఒక లుక్కేస్తాను... ;)

Saahitya Abhimaani said...

సుజాతగారూ. మీరు ఈ పేరడీలను అందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఇలా మన ఒకరి దగ్గర ఉన్నది మరొకరికి పంచుకుంటేనే మన సాహిత్యం నిలవగలిగేది. పున:ముద్రణ అంటే వ్యాపార నిర్ణయం. ఇంతమందిమి ఈ పేరడీలకోసం కాచుకుని ఉన్నామని నవోదయా వారికి తెలియాలి కదా. మరొక్కసారి కృతజ్ఞతలు

Saahitya Abhimaani said...

జరుక్ పేరడీలమీద అభిరుచి ఉన్నవారు ఈ కింద లంకె నుంది ఒకే పి డి ఎఫ్ ఫైలును డౌన్లోడ్ చేకోవచ్చును.
http://rapidshare.com/files/299193870/JARUK_PAYRADEELU.pdf

సుజాతగారు ఇచ్చిన ఇమాజి ఫైళ్ళను ఒకే పి డి ఎఫ్ గా మార్చాను.

వేణూశ్రీకాంత్ said...

సుజాత గారు పేరడీ ఎంత అరుదైనదో నాకూ తెలీదు కానీ వెతికి పట్టుకుని అందరికి అందించినందుకు ధన్యవాదాలు. చదివి ఆనందించాను, భద్రపరచుకున్నాను.

గీతాచార్య said...

SIVA garu,

The first thanks is for you.

Sujatha garu,

Very nice of you to share with us

Anil Dasari said...

ఇది దేనికి పేరడీనో దాన్ని కూడా ఇస్తే బాగుండేది. నాలాంటి పాత సాహిత్యంపై అవగాహన లేని వారికి ఉపయోగపడి ఉండేది.

ఇక, ఈ పేరడీ పద్యంలో అంత గొప్పగా చెప్పుకోటానికి ఏముందో అర్ధం కాలేదు - బహుశా దాని చరిత్ర తెలీకేమో. పద్యం కన్నా రిఫరెన్సు మెటీరియల్ పొడుగ్గా ఉంది. చరిత్ర తెలిసినోళ్లకి పద్యం చదవాల్సిన అవసరం లేదు; తెలీనోళ్లకి ఇది చదివితే కొత్తగా తెలిసేదేమీ లేదు.

కానీ, అంతమందికి నచ్చిందంటే అందులో ఏదో ఉండే ఉండాలి :-)

Sreenivas Paruchuri said...

నా పేరు కామెంట్లలో ప్రస్తావించబడింది కాబట్టి ఈ కామెంటు :-)

ఈ జరుక్ పారడీ నాదగ్గర లేదన్నానా? అని వుండవచ్చు! ఈ మధ్య జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది :(. కెవియార్ గారు సంకలన పరచిన మొదటి ప్రచురణ, మరల రెండేళ్ళ క్రితం నవోదయ వాళ్ళే వేసిన ద్వితీయ ముద్రణ కూడా నా దగ్గరున్నాయి.

1996-97 ప్రాంతాల్లో "తెలుసా" గ్రూపులో దాదాపు జరుక్ పారడీలన్నీ పోస్ట్ చేయబడ్డాయి (అప్పట్లో Univ of Minnesota లో Chem. engg. లో Ph.D చేస్తున్న తంగిరాల గారి ద్వారా).

జరుక్ గారెత్తిన అనేక అవతారాల గురించి, దేవులపల్లికి ఆయనకు మధ్యున్న తేడాల గురించి వివరంగా మాట్లాడుకుంటే బాగుంటుంది. బోలెడంత explosive stuff :-).

-- శ్రీనివాస్

మరువం ఉష said...

జలసూత్రం గారు [మా కిట్టయ్య మాష్టారు] (బహుశా "జవిక్ శాస్త్రి" గారూను) నా బ్లాగులో సెప్టెంబర్ మాసంలో పెట్టిన వ్యాఖ్యల రీత్యా కాస్త అలా అలా చదువుతూ ఈ "జరుక్ శాస్త్రి" గారి గురించి చదవటం జరిగింది. ఆయ్, అనకండి. నాకూ భా.రా.రె. మాదిరిగా చదివిన పుస్తకాల సంఖ్య తక్కువే. కాగా పోగా, ముందు శీర్షిక చూడగానే నాకు గుర్తుకు వచ్చిన వారు బొల్లోజు బాబా గారే. ఆయన ఈ మధ్య ఈ పేరడీ గురించి అడగటం చూసాను. ఆయన వ్యాఖ్య పైనుంది కనుక వార్త అందిందిలే అని వూరుకున్నాను. బహుశా చాలా మందికి ఆనందాన్నిచ్చివుంటుంది మీ ఈ ప్రయత్నం. మీకు అభినందనలు, సుజాత.

Bolloju Baba said...

ఈ కవిత దేనికీ పేరడీ కాదు. స్వంత రచన.

పరుచూరి గారికి
గతసంవత్సరం పొద్దు వారు నిర్వహించిన గ్రూప్ చాట్ ప్రోగ్రాంలో మన మధ్య ఈ కవిత గురించి ప్రస్తావన వచ్చింది. బహుసా ఈ కవిత పేరుని నేను వెళిపోయాయ్ వెళిపోయాయ్ అని అడగి కన్ఫ్యూస్ చేసానేమో.

నాకూ జ్ఞాపక శక్తి తగ్గిపోతూంది :-))

మీరు చెపుతున్న పటాసు/టపాసు విశేషాలు కొన్ని ఇక్కడ వదలండి సార్. చదువుకొంటాం. :-)
థాంక్యూ
బొల్లోజు బాబా

Sreenivas Paruchuri said...

> ఇంతమందిమి ఈ పేరడీలకోసం కాచుకుని
> ఉన్నామని నవోదయా వారికి తెలియాలి కదా.

శివ-గారు,

ఆ పుస్తకం ఈ మధ్యే మరల పునర్ముద్రితం. మార్కెట్ లో చాలా తేలికగా దొరుకుతుంది. నవోదయ, విజయవాడ వారే మరల ప్రచురించింది.

-- శ్రీనివాస్

సుజాత వేల్పూరి said...

శ్రీనివాస్ గారు చక్రపాణి శరత్ అనువాదాల గురించి కూడా ఇదే మాట చెప్పారు (తేలిగ్గా దొరుకుతాయని)కానీ నేను కొనగా మిగిలిన భాగాలు నాకు ఈ హైదరాబాదు మహా నగరంలో ఎక్కడా దొరకలేదు. ఈ పుస్తకం సంగతి ఏమిటో చూడాలి మరి!ఇంతకీ నవోదయ వాళ్ళు ఎప్పుడు వేశారో చెప్తే విజయవాడ వెళ్ళైనా సాధిస్తాం!

మరువం ఉష said...

baabaa gaaru, well I stand corrected. I have already ACK'ed above that I knew very little about him and the only association to that name is very recent and that I remembered your name much more than the context though.

Sreenivas Paruchuri said...

హైదరాబాదులో పుస్తకాల షాపుల గురించి నాకు అంతగా తెలియదని ఇంతకుముందే చెప్పాను. కానీ ఈ పుస్తకం నవోదయ (కాచీగూడా) షాపులో March 2008 లో చూశాను. అట్ట మీద బాపు బొమ్ముంటుంది. ప్రచురించింది విజయవాడ నవోదయ వారు (అంటే: రామమోహనరావు గారు). ఈ రెండవ ముద్రణ 2007 లో జరిగింది.

చూడబోతే దేశానికి దూరంగా వుంటున్న నాకే పుస్తకాలు తేలిగ్గా దొరుకుతున్నాయనుకుంటాను :-).

-- శ్రీనివాస్

P.S. నాకో మైలు పంపితే రామమోహనరావు గారి మైల్ అడ్రెస్, ఫోను నంబరు ఇవ్వగలను.

సుజాత వేల్పూరి said...

శ్రీనివాస్ గారూ,
ఇలాంటి పుస్తకాలు స్వల్ప సంఖ్యలో మాత్రమే వేయడం, తిరిగి పునర్ముద్రించకపోవడం వంటి కారణాల వల్ల ఇవి దొరకటం కష్టమైపొతోంది. కాచిగూడ నవోదయ నాకు బాగా పరిచయమైన షాపే! వాళ్ల దగ్గర ఇప్పుడు లేదు. (అప్పుడు 2008 లో నాకు కనపడలేదు).

అయినా వారి దగ్గరే మరోసారి ప్రయత్నిస్తాను.
లేదంటే విజయవాడ వెళ్ళినపుడైనా సరే!

వేణు said...

అబ్రకదబ్ర గారూ, బొల్లోజు బాబా గారూ!

జరుక్ శాస్త్రి రాసిన ‘ఆశ్వాసాంతం’ను పేరడీగానే చెప్పుకోవాలి. (సంకలనం చేసిన కేవీఆర్ గారు కూడా పేరడీల్లోనే దీన్ని చేర్చారు)

శ్రీశ్రీ ప్రసిద్ధ గేయం ‘జగన్నాథుని రథచక్రాలు’ ‘పతితిలార భ్రష్టులార బాధా సర్పదష్టులార’ అంటూ మొదలవుతుంది కదా! మధ్యలో-

‘వస్తున్నాయొస్తున్నాయి..
జగన్నాథ జగన్నాథ జగన్నాథ రథచక్రాల్
...
రథ చక్రాలొస్తున్నాయొస్తున్నాయి
...
మొయిల్దారిని బయల్దేరిన
రథ చక్రాల్, రథచక్రాలొస్తున్నాయొస్తున్నాయి!’

అని వస్తుంది. ఈ ‘వస్తున్నాయొస్తున్నాయి’ వరకే తీసుకుని జరుక్ శాస్త్రి ‘వెళిపోయాయెళిపోయాయి’ అంటూ పేరడీ చేశారు. గేయం మొత్తాన్నీ ఆయన పేరడీ చేయలేదు. జరుక్ ‘ఐపోయిందయిపోయింది!' అనీ, ‘వొచ్చేశాయొచ్చేశాయి!' అనీ కూడా రాయటం గమనించొచ్చు.


శ్రీనివాస్ పరుచూరి గారూ!

‘తెలుసా’ గ్రూపు లో మీరన్నట్టే దాదాపు జరుక్ పారడీలన్నీ టింగ్లిష్ లిపిలో దొరుకుతున్నాయి.
ఒక్క ఈ 'ఆశ్వాసాంతం' తప్ప!

వేదాల రాజగోపాలాచార్య said...

చాలా చక్కని అభిరుచి ఉన్నట్లుంది. ఇలా పాత సాహిత్యాన్ని గురించి ఆలోచించే వారున్నారంటే ఆశ్చర్యానందాల్ కలుగుతున్నాయి.

Bolloju Baba said...

ఆ కాస్త ముక్కకే పేరడీ అనేయచ్చా? :-))

ఆలోచించండి.

బొల్లోజు బాబా

సుజాత వేల్పూరి said...

బాబాగారూ,
మొత్తం పేరడీ కాకపోవచ్చు కానీ జరుక్ శాస్త్రి గారు శ్రీ శ్రీ "జగన్నాథ రధ చక్రాలొస్తున్నాయి" ఆధారంగానే ఇది పారడీగా రాశారని విన్నానండీ నేను కూడా! పైగా ఈ కవిత జరుక్ శాస్త్రి "పేరడీలు" పుస్తకంలోనే ఉంది చూడండి!:-)

Bolloju Baba said...

సుజాత గారు అవునా?

ఏమో నేనింతకాలమూ దీన్ని పారడీగా అనుకోవటం లేదు.

అయినా పారడీ వ్యంగ్య ప్రధానంగా వక్రోక్తితో సాగుతుంది.
కానీ ఇది ఎన్నిసార్లు చదివినా అలా అనిపించటం లేదు.

మీరు చెపితే నమ్మరు.
నవ్వకూడదు మరి.....నిజంగా....

మా అమ్మ తన సంసారంలో వాడిన పింగాణీ జాడీలు, పొట్టుపొయ్యలు, పందిరిమంచము, పెద్దగదీ వంటివి వెళ్లిపోయాయని, ఇపుదు మా ఆవిడ వాడుతున్న గాసు స్టవ్వు మిక్సీ, టీవి గది, డబుల్కాటూ లు వచ్చేసాయనీ గత వారంరోజులుగా అనిపిస్తూంది చిత్రంగా.

అయిపోయిందేదో అయిపోయింది ఈ కవితను ఇప్పటి తరానికి పారడీగా పరిచయం చేయటం అనవసరమని నా వ్యక్తిగత అభిప్రాయం. పారడీ అనంగానె సదరు కవిగారి ప్రతిభను కొంచెం క్రిందికి లాగుతున్నట్లనిపిస్తూంటుంది. :-)

సుజాత వేల్పూరి said...

బాబాగారూ,
నిజమే! వెళిపోయాయెళిపోయాయి అని తప్ప మిగిలినది ఆయన స్వంతంగా రాసిందేగా!అందువల్ల అటు దీన్ని పారడీ అని కూడా అనలేం!

ఇకపోతే మీరు చెప్పినదాంట్లో నవ్వడానికేముంది? నిజం చెప్పాలంటే చాలా సీరియస్ విషయం!మా అమ్మ కుంపటి మీద చేసిన వంటే ఎంతో బావున్నట్లనిపిస్తుంది ఈ రోజుకీ కూడా!

కానీ పల్లెల్లోంచి అవన్నీ పూర్తిగా మాయమైపోలేదండీ! గాజుల మలారం తెచ్చే గాజులబ్బాయి, సవరాలు కట్టేవాళ్ళు, పొట్టుపొయ్యిలు,రోళ్ళు, తిరగళ్ళు అన్నీ కనిపిస్తూనే ఉంటాయి(ఇదివరకంత విరివిగా కాదు)! కానీ పట్నవాసానికి ఎగిరొచ్చిన మన జీవితాల్లోంచి మాత్రం అవన్నీ "వెళిపోయాయెళిపోయాయి"! పిల్లల జనరేషన్లో "అవెలా ఉంటాయెలా ఉంటాయి?"!

కదా!

సుజాత వేల్పూరి said...

పరుచూరి శ్రీనివాస్ గారూ,
కాచిగూడ నవోదయలో ఈ "జరుక్ శాస్త్రి పేరడీలు" పుస్తకం నిన్న దొరికిందండీ నాకు! ఇంతకు ముందు అడిగితే వీళ్ళే లేదన్నారు. ధన్యవాదాలు!

Post a Comment