November 23, 2009

వోట్లు- చెప్పరాని పాట్లు!

"చోద్యం చూస్తారా? కదలి వోటు వేస్తారా?"


"మంచివారు వోటు వెయ్యకపోతే దోపిడీదారులదే గెలుపు"


"అవినీతి పాలనను అంతమొందించాలంటే ఓటు వేసి తీరాలి"


"అవకాశం మీది. ఓటు వేయండి. సమర్థులను ఎన్నుకోండి"


"సామాన్యుడి చేతిలో పాశుపతాస్త్రం వోటు"


ఊహూ! ఎంత మంది ఎన్ని రకాలు గా చెప్పినా హైద్రాబాదు వోటరు చెవికెక్కలా!



విద్యాధికులైన వోటర్లు ఎక్కువగా కేంద్రీకృతమైన డివిజన్లలో నిజంగానే చోద్యం చూస్తూ ఇంట్లో ఉండిపోయారు కానీ పోలింగ్ స్టేషన్ కి వచ్చి ఓట్లు వేసిన వారే తక్కువ! హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న వార్డుల్లో పోలింగ్ 30 శాతం దరిదాపుల్లో ఉందంటే వోటరు మనోగతం ఏమనుకోవాలి?



నిరాసక్తతా?

బద్ధకమా?


నిర్లక్ష్యమా?


నిర్వేదమా?



ఇతర కారణాలు...



లాంగ్ వీకెండా?

ఇతర రాష్ట్రాలకు చెందిన నాన్ లోకల్స్ "మనం ఇక్కడ వోటేస్తే మనకు ఒరిగేదేం ఉందిలే"అనుకోడమా?



దాదాపు 40 ఖరీదైన అపార్ట్ మెంట్ భవనాలు  ఉన్న కాలనీలో(ఖరీదైన అని ఎందుకు వాడానంటే అంతా అధికంగా చదూకున్నవాళ్ళే ఇక్కడ ఉండేది అని చెప్పడానికి) అరవై డెబ్భై ఓట్లున్న ఒక్కో బిల్డింగ్ నుంచీ పోలయిన ఓట్లు ఆరు-ఏడు..మాగ్జిమమ్ 10 దాటలేదు ఒక డివిజన్లో!



కొంతమంది లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకుని జామ్మని వెళ్ళిపోయారు. మరికొంత మంది ఇంట్లోనే ఉండి కూడా దగ్గర్లోని పోలింగ్ స్టేషన్ కి రావడానికి "అబ్బ,పోనిద్దూ" అని బద్ధకించారు.



మరోపక్క ఉత్సాహంగా ఓట్లు వేయడానికి వచ్చిన వారికి ఎదురైన చేదు అనుభవాలు..

.వాళ్ళ పేర్లు జాబితాలో లోనుంచి సడన్ గా మాయమైపోవడం,

ఫొటోలు ఎవరివో ఉండటం వల్ల పోలింగ్ అధికారులు అంగీకరించకపోవడం,

లిస్టులో పేర్లున్నా కార్డు చేతికి రాకపోవడం!

 పేర్లలో భయంకరమైన తప్పులు, (కొన్ని చోట్ల మరీ ఘోరంగా) ఉండటం !


కొంతమంది చదువుకున్నవాళ్ళు కూడా , జాబితాలో పేరుంటే  ఫొటో ఐడీ ఏదైనా సరే పనికొస్తుందని తెలీక చేతులూపుకుంటూ వచ్చి వెనక్కి పోవడం!

--------------

ప్రతి ఎన్నికల ముందూ ఓటర్ల లిస్టుని తప్పకుండా "అప్ డేట్" చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ కి ఉందా లేదా నాకర్థం కావడం లేదు.

ఒక పోలింగ్ స్టేషన్ ఓటర్ల జాబితాను పరిశీలిస్తే..రెండేళ్ళ క్రితం ఇల్లు ఖాళీ చేసి దేశమే వదిలి వెళ్ళిపోయిన అనేకమంది పేర్లు భద్రంగా జాబితాలోనే ఉన్నాయి. అలాగే ఇక్కడినుంచి వేరే చోటికి వెళ్ళిన వాళ్ళు అక్కడ జాబితాలో పేరు నమోదు చేయించుకున్న తర్వాత కూడా వాళ్ల పేర్లు ఇక్కడ అలాగే ఉన్నాయి.

అంతెందుకు కొంతమందికి ఒకే జాబితాలో ఒక్కొక్కరికి మూడేసి వోట్లు ఉన్నాయి. మా వాచ్ మనే అందుకు సాక్ష్యం! అతనికి, అతని భార్యకు కలిపి 6 వోట్లు ఉన్నాయి...ఒకటే జాబితాలో! ఇక పేర్లలో, ఫొటోల్లో అవకతవకలకు అంతే లేదు! అదొక మహా సముద్రం!


ఒక ఇంట్లో అద్దెకున్నవాళ్ళకు, ఇంటి వోనర్లకు కూడా అదే చిరునామా మీద వోట్లు జారీ!


నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ జరగకముందున్న పాత కార్డులను మార్చుకోవాలని చా.....లా మంది ఓటర్లకు తెలీదు. ఆ కార్డులను గుర్తించి వాటి స్థానే కొత్త కార్డులను జారీ చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిది కాదా? ఎన్నికలప్పుడు ఊదర గొట్టడం తప్పించి రాజకీయ పార్టీలు ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టకపోవడం న్యాయంగా ఉందా?



ఒక వృద్ధాశ్రమానికి చెందిన అనేకమంది వృద్ధులు ఎంతో బాధ్యతతో ఉత్సాహంగా వోటు హక్కు వినియోగించుకోడానికి వస్తే ...వారి దగ్గరున్నవి పాత గుర్తింపు కార్డులు. అంత శ్రమ పడి చేతి కర్ర సహాయంతో  మరీ వచ్చిన వారిని "మీ పేర్లు జాబితాలో లేవు పొండి" అని చెప్పడం ఎంత బాధాకరం! వారు ఓపిగ్గా "ఇంతకు ముందు ఇవే కార్డులతో వేశాం వోట్లు! మేము వెదుక్కుంటాం"అని జాబితా తీసుకుని వెదుక్కుంటుంటే చూడ్డం ఎంత బాధాకరం!


ప్రతి జాబితాలోనూ సగానికి సగం బోగస్ వోట్లు!


ఈ లెక్కన నిజమైన genuine వోటర్ల జాబితా ఎప్పటికి తయారవుతుంది? అసలు అది జరిగే పనేనా?


ఇలాంటి వాతావరణంలో ఏ మాత్రం నిజాయితీ లేని, నిజం కాని వోటర్ల జాబితాలతో జరిగిన ఎన్నికలకు విలువ ఎంత? ఈ ఎన్నికల ఫలితాలకు మాత్రం విలువ ఎంత?

వోట్లు అడుక్కోడమే కానీ ఇంతవరకూ ఏ పార్టీ అయినా వీటిమీద దృష్టి పెట్టిందా?





కేవలం శాశ్వత చిరునామా కోసం ఒక గుర్తింపు కార్డుగా మాత్రమే ఓటర్ ఐడీ కార్డుని ఉపయోగించుకుంటున్న విద్యాధికుల ఉదాశీనతను ఏమని వర్ణించాలి?


ప్రభుత్వం మారాలనీ, బాగుపడాలనీ, సామాన్యుల వెతలను పట్టించుకోవాలని డిమాండ్ చేసే హక్కు ఇటువంటి ఉదాసీన ప్రజలకెక్కడిది ?వోటు తప్పకుండా వేయాలనే బాధ్యత తెలియని వాళ్లకు   నిలదీసే హక్కు మాత్రం ఎక్కడినుంచి వస్తుంది?

ఇదంతా ఎవరి బాధ్యతా రాహిత్యానికి చిహ్నం? దీనివల్ల చివరికి నష్టపోయేదెవరు?


ఏమిటో, ఇవాళ నాకన్నీ ప్రశ్నలే!

56 comments:

విజయ క్రాంతి said...

సిగ్గు లేని ఈ సమాజానికి ఇంతకన్నా గొప్ప నాయకులు కావాలా? ..

ప్రతి వాడు విమర్శలు చేసేవాడే ...కాని వోటు మాత్రం వేయరు ...

నిర్లిప్తత , నిరాసక్తి ...ఇలాంటివన్నీ ఎప్పుడో ఐపోయాయి వర్ణనకు ...
సామెత వుంది ...దున్న పోతు మీద వాన అని ..

Chirag Ali said...

Even so called Educated people are doing these kinds of acts.Why to unnecessarly blame our corrupt Politicians?.Does we really deserve good Governance?.In my opinion definately not.

Ali

జ్యోతి said...

నేనైతే కావాలని ఓటు వేయలేదు. మా ఇంట్లో ఎవ్వరూ వెళ్లలేదు. ఈ నాయకులనుచూసి చిరాకేస్తుంది. ప్రజలను వెధవలను చేసి తమ పబ్బం గడుపుకుంటున్నారు. అంతా అధికార దాహం. దానికి మనం పావులం. ఎవ్వడొచ్చినా ఉద్ధరించేదేమీ లేదు. అందుకే కోపం. చిరాకు ఇంకా చెప్పాలంటే అసహ్యం ..

Anil Dasari said...

మొన్న కూకట్‌పల్లిలో జేపీ కోసం విద్యాధికులందరూ వోటెయ్యటానికి కదలిరాలేదా? అభ్యర్ధి సరైనవాడు అనుకున్న సందర్భాల్లో ఎక్కువమంది తప్పకుండా వోటెయ్యటానికి వస్తారనుకుంటాను. ఎన్నికలంటే ఊర్లు పంచుకునే పర్మిషన్ దొంగలకి అప్పగించే ప్రహసనం అన్న అభిప్రాయం బలంగా ముద్రపడిపోయాక రాన్రానూ పోలింగ్ శాతం తగ్గకేం చేస్తుంది?

తృష్ణ said...

ఈ విషయం గురించి ఎవరన్నా ఇవాళ రాస్తారేమో అని చూసానండీ...మీరు రాసారు..!!

తృష్ణ said...

forgot towrite--

"మరోపక్క ఉత్సాహంగా ఓట్లు వేయడానికి వచ్చిన వారికి ఎదురైన చేదు అనుభవాలు.."

మాకూ ఇలాటిదే ఎదురై ఓటు వేయటానికి వీలులేక వెనక్కు వచ్చేసాము...:(

శరత్ కాలమ్ said...

కనీసం మన హైదరాబాద్ బ్లాగర్లు అయినా వోటు హక్కు వినియోగించుకున్నారా అని తెలుసుకోవాలని వుంది.

వేణు said...

విద్యాధికుల ఉదాసీనత- ప్రతి ఎన్నికల్లోనూ అద్భుతంగా రుజువవుతూనే ఉందిగా?

‘ఈ ఎన్నికలకూ, వాటి ఫలితాలకూ విలువ ఎంత?’ అనే సందేహం- ఎన్నికల తరుణంలో పౌరులకు ఏర్పడాల్సిన ‘వైరాగ్యం’ అనిపిస్తుంది! కానీ రాజకీయ పార్టీలకు ఈ ప్రశ్నలేమీ అక్కర్లేదు. పోలింగ్ తర్వాత అవి ఎంచక్కా సీట్ల, ఓట్ల లెక్కల్లో మునిగిపోతుంటాయి.

ఓటర్ల జాబితాల్లో లెక్కలేనన్ని
లోపాలుండటం కూడా ‘ప్రజాస్వామ్య వ్యవస్థ’లో అంతర్భాగమని అర్థం చేసుకోకతప్పదు!

శేఖర్ పెద్దగోపు said...

సుజాత గారు, ఈ రోజు పొద్దున్న పదిన్నరకు పోలింగ్ బూత్ కి వెళ్ళటానికి సిద్దపడి పెద్ద లైను ఉంటుందేమో అని ముందస్తుగా ఆఫీస్ కి ఫోన్ చేసి ఓ గంట ఆలస్యంగా వస్తానని చెప్పి బూత్ కి వెళ్తే అక్కడ నాతో కలిపి ఒకరిద్దరు తప్ప ఎవరూలేకపోవటంతో నాకు భలే ఆశ్చర్యం వేసింది. వేసొచ్చిన తర్వాత నాకు కూడా సవాలక్ష ప్రశ్నలు కళ్ళముందు కదిలాయి.
రాజకీయనాయకులను,వ్యవస్థను తిట్టడానికి మాత్రం ప్రతీవారు ముందుంటారు...కానీ నాయకుడని ఎన్నుకోవల్సివచ్చినప్పుడు మాత్రం ఉత్సాహంగా రాని వీళ్ళను ఎలా అర్ధం చేసుకోవాలో మరి...ఇంచుమించుగా అన్ని ఆఫీసులకి ఈ రోజు సెలవు ఇచ్చారు...అయినా ఎందుకీ ఉదాసీనతో? ఓ బ్లాక్ బస్టర్ మూవీకి టికెట్ల కోసం పేద్ద లైన్లలో నిలబడి ఉత్సాహం చూపించేవాళ్ళు ఓటు వేయడానికి ఓ అరగంట ఎందుకు కేటాయించలేరో అసలు...నాకు తెలిసి ఇది ముమ్మాటికి నిర్లక్ష్యమే...

Sky said...

సుజాత గారు,

మీకొచ్చిన సందేహం చాలామందికి ఈపూట వచ్చిందే.కాకపోతే దీనిమీద చర్చ మొదలుపెడితే అది ఎన్నటికీ తెగదు.... తప్పు అందరిలోనూ ఉంది. సంవత్సరం క్రితం కొందరు ఎలక్షన్ కమీషన్ ఆఫీసు చుట్టూ తిరిగి వ్యవస్థలో ఉన్న లోటుపాటులకు సరియైన పరిష్కారం చూపించటానికి నానా పాట్లు పడ్డారు...దీనికి సంబంధించిన ఒక సాఫ్ట్ వేర్ తయారుచేసి ఓటర్ల కార్డుల్లో ఉన్న లోపాలను సవరించటం ఎంత సులువో చూపించడానికి ఎంతో ప్రయత్నించారు.. కానీ అందరికీ ఎదురయ్యే అనుభవమే వారికీ ఎదురయ్యింది....ప్రస్తుతం ఓటర్ల గుర్తింపుకు సంబంధించి అవలంభిస్తున్న విధానాలలో లోపాలను చూపించారు - అయినా తోలుమందం బాపతులా అసలు స్పందనే లేదు...

ఓటరు గుర్తింపు కార్డు అప్ప్లై చేసినప్పుడు కొన్ని లక్షల మంది పడ్డ పాట్లు మీకు తెలియనివి కావు... తీరా నమోదు చేసుకున్నవారికి వచ్చిన కార్డులు ఎంత గొప్పగా తగలడ్డాయో కూడా నేను మీకు చెప్పనవసరం లేదు-- మీరే ఓ పోస్టు రాసారు.


ఎలక్షన్ కు ఒక రోజు ముందు నుండీ వైన్ షాపులు మూసేస్తారు కాబట్టి ఇంట్లో సరుకు నింపుకోవటం మీద చూపించే శ్రద్ధ ఓటింగ్ మీద చూపించలేదని మాత్రం మరో సారి రుజువయింది....-- మొన్న వైన్ షాపుల ముందు క్యూలు కట్టిన జనాలను చూసి ఆశ్చర్యం వేసింది.

మీరన్నట్టూ పోలయ్యింది 30 % ఓట్లు- అందులో మందుకు, డబ్బుకు ఇతర ప్రలోభాలకు పడ్డ ఓట్లు తీసేస్తే నిజాయితీగా పడే ఓట్లెన్నో తెలిస్తే నిజం ఇంకా భయంకరంగా ఉంటుంది....

రేపు చూడండి-అంతా మామూలే.... మళ్ళీ ట్రాఫిక్ జాములు, డ్రైనేజీలు పొంగిపొర్లడాలు, సిగ్నల్స్ దగ్గర ముష్టోళ్ళు,ఓ పెద్ద వర్షం పడితే ఏదో ఒక ప్రాంతం మునిగిపోవటం--బహుశా నగరజీవి ఇవి లేకపోతే ఉండలేడేమో. అందుకే మార్పు ఎందుకనుకుని ఓటు వేయలేదేమో...

హేమిటో--- కంఠ శోష తప్ప ఏమీ లాభం లేదండీ....

Lakshmi Naresh said...

sir...badhapadatam matram manam cheyagalige pani aithe,,daanivalla evaraina mare apani aithe..meeranukunna ,kavalanukunna marpu eppudo vachi undedi...inthaku meeru vote vesaara?

Lakshmi Naresh said...

ila badhapadithe meeru anukunna kavalasina marpu vasthe..ippatike mana desam bagundedi.manasu lo unde gajibiji ikkada pettaru,veelaithe mee chuttu unna vaallaki ,mee inti vaallaki cheppandi.nenu vote vesa,unna resources nunche manam bangaram pandiddam.meeru vote vesaaara?

సుజాత వేల్పూరి said...

@sky,
అవును, వోట్లు వేయడానికి బద్ధకించినా ముందే "స్టాకు" ఇంట్లో పెట్టేసుకోవాలన్న అవేర్ నెస్ మాత్రం జనాల్లో బాగానే ఉంది. సమస్య ఓటర్ల లిస్ట్ దగ్గర మొదలై, పోలింగ్ బూథ్ దగ్గర కూడా ముగియట్లేదు. అదేగా సమస్య!

మీరన్నట్లు కంఠశోష తప్ప మనకి ఏదీ మిగిలేలా లేదు. రేపట్నుంచి ఇవన్నీ కన్వీనియెంట్ గా మర్చిపోయి, కుడిపక్క పొర్లుతున్న డ్రైనేజ్ నీ, ఎడకమ పక్క పగిలిన మంచినీటి పైపునీ దాటేసుకుని రెండూ కల్సిన మంచి నీరు తాగుతూ మామూలుగా బతికేస్తాం అందరమూ!

సుజాత వేల్పూరి said...

lakshmi naresh,

మా కాలనీ వాళ్లందరికీ వారం రోజుల నుచే "ఎవరికో ఒకరికి వెయ్యండి. ఓటు మాత్రం వృధా చేయద్దు" అని ఎంత గానో చెప్పాకే కనీసం 40 శాతం వోట్లు పడతాయని చూశాను. అబ్బే, ఏమీ లాభం లేదు.

మా పోలింగ్ స్టేషన్లో పడిన మొదటి వోటు నాదే! ఏడుగంటల ఆరు నిమిషాలకు!

సుజాత వేల్పూరి said...

శేఖర్,
మరీ పొద్దున్నే చలిగా ఉందనిపించినా పది గంటల తర్వాతైనా ఈ హాలిడే మూడ్ లోంచి బయటికొస్తారేమో అని చూశాను. ఆ తర్వాత లంచ్ తర్వాత వేస్తారేమో అనీ, ఆ తర్వాత చివరి ఒక గంటలోనూ వస్తారేమో అనీ...ఉహూ! లాభం లేదు. పోలింగ్ ఆఫీసర్లు వచ్చిన ఒకరిద్దరు ఓటర్లనే అతిథులుగా భావించి 'రండి రండి " అని ఆహ్వానించి మరీ వోట్లు వేయించుకోవాల్సి వచ్చింది.

ఎలా? ఏం చెయ్యాలి వీళ్ళతో అనిపించింది నాక్కూడా!

సుజాత వేల్పూరి said...

శరత్ గారు,
అవును తెలుసుకోవలసిన విషయమే ఇది! నేనైతే వేశాను మరి.
ఇక్కడే అడిగేస్తే పోలా?

హైదరాబాదు తెలుగు బ్లాగర్లలో ఎంత మంది వోట్లేశారో చేతులెత్తండర్రా...!

తృష్ణ గారూ,
హయ్యో, వెనక్కి వచ్చేశారా? ఇలా నిరాశతో వెనక్కి వెళ్ళిన ఎంతో మందిని నిన్న చూశానండీ నేను! మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు జాబితాలో ఉన్న పేర్లు ఇప్పుడెందుకు లేవో చాలా మందికి అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది.

కొన్ని చోట్ల వందల కొద్దీ వోట్లు సాంకెతిక లోపాల వల్ల హార్డ్ కాపీలో ఉండి సాఫ్ట్ కాపీలోకి రాలేదట. చూడండి ఎన్నికల ముందు రోజు వరకూ ఇలాంటి లోపాల్ని పట్టుకోకుండా, సవరించకుండా వదిలేస్తున్నారో!

సుజాత వేల్పూరి said...

అబ్రకదబ్ర,
"అభ్యర్థి సరైన వాడైతే...."! ఎన్నాళ్ళీ పాత కబుర్లు చెప్పుకుంటూ కూచోవాలి? ప్రతి చోటా జేపీ లాంటి వాళ్ళే నిలబడాలంటే ఎక్కడవుతుంది? అలా అయితే ఇప్పుడు GHMC ఎన్నికల్లో ప్రతి డివిజన్లోనూ ఎంతో కొంత స్వార్థపురులూ, డబ్బు, మద్యాలను పంచిన వాళ్ళూ, డబ్బు ఆల్రెడీ విచ్చలవిడిగా పెట్టెల్లో మూలుగుతున్న వాళ్ళే! కార్పొరేటర్ గా నెలకు రెండు వేల రూపాయల జీతం తీసుకోవలసిన పనెవ్వరికీ లేదు. మరి అందరూ పనికి మాలిన వాళ్ళే కదా అని ఎవరికీ ఓటెయ్యకుండా కూచోమంటారా?

ఉన్నవాళ్లలో కుళ్ళిన వాళ్ళను పక్కన బెట్టి కాస్త పుచ్చులున్న వాళ్ళనైనా ఎన్నుకోవాలిగా పబ్బం గడవాలంటే! ఊళ్ళు దొంగలకు అప్పగించే ప్రహసనం అని తేలిపోయాక దొంగలకు కనీసం కర్ర అయినా చూపించాలిగా! కొట్టలేకపోయినా! జనాల్ని కేవలం ఎన్నికలప్పుడు పనికొచ్చే వోటు ముద్రలుగా వీళ్లంతా భావించేస్తుంటే ఎలా?

ప్రతి చోటా మాజీ కలెక్టర్లూ,జేపీ లాగా ప్రభావశీలంగా ప్రసంగించేవాళ్ళు కావాలంటే ఎలాగండీ? అలా చూసుకున్నా ఇప్పుడు పోటీ చేసిన అనేక పార్టీల వాళ్లలో విద్యాధికులకేం తక్కువలేదు. వాళ్ళకు బుద్ధి ఉందా లేదా అన్నదే పాయింటు!

సుజాత వేల్పూరి said...

జ్యోతిగారూ,
లాభం లేదు! మిమ్మల్ని ఒకసారి జేపీ దగ్గరకు తీస్కెళతా పదండి!

మిమ్మల్ని ఒప్పించాలంటే ఒక టపా రాయాల్సి వచ్చేట్టుంది.:-)

విజయక్రాంతి గారు,
అదే నా బాధ కూడా! ప్రతి నాయకుడినీ విమర్శిస్తాం! ప్రతి రాజకీయ పార్టీని తిట్టిపోస్తాం!వోటు వేసేటపుడు మాత్రం ఇంట్లో తొంగుంటాం!

కరక్టే! నా వర్ణనలు సరిపోవు. మీ వర్ణనే బావుంది...'దున్నపోతు మీద వాన"! ఎక్స్ లెంట్!

చదువరి said...

ఓటెయ్యకపోవడానికి సవాలక్ష కారణాలుండొచ్చు.. కానీ, ఈ నాయకులంటే చిరాకొచ్చి వెయ్యకపోవడం మాత్రం ఒప్పుకోలేనిది. వాళ్ళమీద కోపముంటే తప్పకుండా వెయ్యాలి. కోపమున్నవారు అందరికంటే తక్కువ వెధవెవరో చూసి వేస్తారు. అసలే వెయ్యకపోతే లాభపడేది పెద్దవెధవలే. అంచేతే, వోటు వెయ్యకపోతేనే మంచిదని నాయకులు కోరుకుంటారు. వాళ్ళు కోరుకొనేదే ప్రసాదిస్తున్నాం.

"ప్రతి చోటా జేపీ లాంటి వాళ్ళే నిలబడాలంటే ఎక్కడవుతుంది? " - బాగా చెప్పారండి.

Anonymous said...

Understandable pain! pch

శేఖర్ పెద్దగోపు said...

"ప్రతి చోటా జేపీ లాంటి వాళ్ళే నిలబడాలంటే ఎక్కడవుతుంది? "

మీరడిగింది వందశాతం కరెక్ట్...మా ఏరియాలో లోక్ సత్తా తరపున అబ్యర్ది మా ఇంటి ఓనరే(సత్తయ్య)...ఆయన ఇళ్ళకు ఉన్న సమస్యలే సరిగ్గా పట్టించుకోడు...మరి కాలనీని ఎలా అభివృద్ది చేస్తాడు అని సందేహించాను...కానీ జే.పీ మీద నమ్మకం ఉంచి ఓటేసాను.
అబ్యర్ది మంచివాడైతే లాంటి ఆలోచనలు అన్ని సమయాల్లోనూ పనికిరాదేమో!!.

Bolloju Baba said...

స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే, యూనివర్సల్ ఫ్రాన్ చైస్ ఇవ్వటం వల్లనే ఈ దౌర్భాగ్య స్థితికి కారణం అని ఒక విచిత్రమైన వాదన ఈమధ్య చదివాను. పటేల్ దశలు వారీగా, ప్రజలలో అక్ష్యరాస్యత పెంచి ఇద్దాం అని వాదించాట్ట.

బొల్లోజు బాబా

జ్యోతి said...

నాకు జేపీలాంటి నాయకులు కావాలి. కాని కనీసం బస్తీలో సమస్యలు పట్టించుకోరు. వాళ్ల మొహాలు కూడా చూసి ఎరగం. ఎన్నికలకు రెండు రోజుల ముందు వచ్చి ఓటేయండి అంటారు. పైగా నాకు ఒక ఘాట్టి నమ్మకం.గత ఎన్నికల్లో నేను ,మా ఇంట్లోవాళ్లు లోక్ సత్తాకి వేసిన ఓట్లు, అలాంటి మరెన్నో ఓట్లు కాంగ్రేసుకు వెళ్లాయని. ఈ.వీ.ఎమ్ లలో ఎవరు ఎవరికి ఓటేసినా కాంగ్రేసుకు వేళ్లేలా చేసిపెట్టారని. ఇది కాక వేరే పద్ధతి ఉంటే చెప్పండి. తప్పకుండా ఓటేస్తాను. కాని నా ఓటు ఎప్పటికి జె.పి గారికే.. అందుకే అది నా దగ్గరే పెట్టుకున్నా..:)

జాన్‌హైడ్ కనుమూరి said...

మా యేరియాలో
ప్రచారానికి పెద్దనాయకులు వచ్చి వెళ్ళారు కాని అభ్యర్తులెవరో కూడా తెలియలేదు
దానికితోడు నేను పనిచేస్తున్న కంపెనీ గ్రేటర్ పరిథిలో లేకపోవడంవల్ల సెలవుకూడా లేదు.

నేను, నా ప్రక్కటెముక ఓటువేసాను

చాలా క్యూ వుంటుందనుకున్నా కాని ఎవ్వరూలేరు
విచారకరం!

Sky said...

@ శరత్

నేను ఓటేశాను.

@సుజాత గారు

నిజం, ఓటేయకుండా ఇంట్లోకూర్చుని ఖారాలు, మిరియాలు నూరే వారిపై ఓ పోస్ట్ రాయాల్సిందే& వీలైతే జేపీ గారి వద్దకి తీసుకెళ్ళాల్సిందే.... :)ఎవరిమీదో అలగటం, ఓటువేయకుండా దాచుకోవటం నవ్వుతెప్పిస్తోంది.

@ చదువరి గారు,

కొందరు కావాలని ఓటు వేయలేదని అదేదో ఘనకార్యం చేసినట్టు చెప్తున్నారు... వారికి మీరిచ్చిన వివరణ సరియైనది...

@విజయక్రాంతి గారు
"సిగ్గు లేని ఈ సమాజానికి ఇంతకన్నా గొప్ప నాయకులు కావాలా?-ప్రతివాడూ విమర్శలు చేసేవాడే...ఓటు మాత్రం వేయడు"----సత్యం చెప్పారు. అత్తమీద కోపం ---సామెత గుర్తుకువస్తోంది... మళ్ళీ వీళ్లంతా చదువుకున్నవారు.. మేధావులు--- ఎంత హాస్యాస్పదమో కదండీ....

సుజాత వేల్పూరి said...

జ్యోతిగారు,
అయితే ఈ సారి ఎన్నికల్లో జేపీ ఎక్కడినుంచి పోటీ చేస్తారో కనుక్కుని మీ వోటు అక్కడికొచ్చేలా చూడాలి. లేదా ఆయన్నే ఈ సారి మీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేలా చూద్దాం!:-))

జాన్ హైడ్ గారూ,
అభ్యర్థులెవరో తెలీని పరిస్థితి ప్రతి చోటా ఉంది. రెబెల్స్, ఇండెపెండెంట్స్ ఎక్కువగా నిలబడ్డం వల్ల ఈ పరిస్థితి! అంతే కాదు అభ్యర్థులకు పోలింగ్ స్టేషన్లు ఎన్నో, ఎక్కడెక్కడున్నాయో కూడా తెలీదు. నవ్వాలో విసుక్కోవాలో, బాధపడాలొ తెలీలా!

సుజాత వేల్పూరి said...

chirag Ali,

I feel so too! we don't have any moral right to question or blame these corrupted politicians when we do not come out and vote.

సుజాత వేల్పూరి said...

Dear commentators,
there are so many spelling mistakes in my comments. please excuse me for that!

Dhanaraj Manmadha said...

What do you want people to vote? Is there any difference? ttyl.

Ruth said...

అస్సలు ఎలక్షన్ రోజు సెలవు ఇవ్వటం పెద్ద తప్పు. అందరూ హేపీగా, లాంగ్ వీకెండు ప్లాన్లు వెసుకుని, లెదా బద్దకంగా ఇంట్లోనే TV చూస్తూ ఉన్నరు తప్ప, వొటు వెయ్యాలని ఎవరికీ అనిపించలేదు. నాఉద్దేశం ప్రకారం, ఎలాగు, SEZ అని Govt. కి కంపనీలకి డీల్ ఉంది కాబట్టి, ఆ వోటింగ్ బూత్ లు ఆఫీసుల్లోనే పెట్టించాలి (సెలవు అస్సలు ఇవ్వకూడదు). ఇంకా, వొట్ వెయ్యని వాళ్ళకి అప్ప్రైసల్ లో ఒక రటింగ్ తక్కువ ఇవ్వాలి. అల్ల ఐనా జనాలు మారతారేమో.
షరా: నేను వోట్ వెయ్యలేదు. నాకు హైదరాబాదు లో వోట్ లేదు మరి :( కాని, పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని గుర్తుచేసిమరీ పంపించాను వోట్ వెయ్యడానికి.

సుజాత వేల్పూరి said...

వేణూ,
విద్యాధికుల ఉదాసీనత ప్రతి ఎన్నికలకీ పెరుగుతూ పోవలసిందేనా అయితే?

కొంపదీసి మీరు చెప్పిన వైరాగ్యం ఓటర్లలో ఇప్పటికే ఏర్పడ్డమే ఈ స్వల్ప ఓటింగ్ కి కారణం కాదు కదా!

పోతే, ఓటర్ల జాబితాలో లెక్క లేనన్ని తప్పులుండటం కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగమేనంటారా మీరు కూడా! మీరు మరీ డెమొక్రటిక్ గా ఉన్నారండీ!

సుజాత వేల్పూరి said...

రూత్,
నిజమే! టెలిఫోన్ బిల్లులు , క్రెడిట్ కార్డు బిల్లుల కోసం డ్రాప్ బాక్సులు ఎక్కడ బడితే అక్కడ పెట్టినట్లు ఆఫీసులున్నా ఎక్కడివాళ్ళక్కడ ఆన్ లైన్ లో ఐడీ కార్డ్ సహాయంతో ఓటేసే(డ్రాప్ బాక్స్ లాంటి) విధానం ఏదైనా ఆలోచించాలండీ! దొంగ పడకుండా కూడా ఉండాలి.

దీనికంటే అప్రైసల్ లో తక్కువ రేట్ ఇవ్వడం బాగా పని చేస్తుంది.:-)

సుజాత వేల్పూరి said...

చదువరి,
నిజమే! నాయకులంటే కోపముంటే ఇంకా కసి కొద్దీ వేసి తీరాలి వోటు.అందరూ వెధవలైతే కాస్త తక్కువ వెధవని ఎన్నుకుని పెద్ద వెధవలని రాకుండా చేయాలి.

పరిమళం said...

తృష్ణ గారి అనుభవమే మాదీనూ .....గుర్తింపు కార్డుతో వెళ్ళినా లిస్టు లో పేరు లేదన్నారు :(

నిషిగంధ said...

ఓటు వేసినవాళ్ళకే ఒక పెయిడ్ హాలిడే ఇస్తానంటే అప్పుడు వేస్తారేమో మన విద్యాధికులు?! మన ప్రాధమిక హక్కుని వినియోగించుకోకుండా వ్యవస్థని ఎంత తిడితే ఏం లాభం! చదువరిగారు చెప్పినట్లు, నాయకుల మీద కోపంతోనైనా వాళ్ళని మార్చడానికి వోటు వెయ్యాలి! ఎలెక్షన్స్ నిర్వహించడానికి వాడేది మనందరి డబ్బే, అది వృధా అవ్వకుండా చూడాల్సిన బాధ్యత మనదే అన్న ఒక చిన్న స్పృహ కూడా ఎందుకు కలగదో!!

Lakshmi Naresh said...

enti andaru JP untene vote chesthaaraaa? mari manam JP la enduku alochinchakoodadu..maname JP aithe?vote vesthaam kadaa?vote veyaali,manam anni gamanisthunnam ani , ee politicians ane DUNNAPOTHULA ki teleiyaali...ledaa,em chesina chelluthundi le..memanthaa praja abhimanam to gelichamani chankalu guddukuntaaru...vaallu gelichaaka prajala maanam teestharu..ayinaa manakendukulendi..emantaaru

Anil Dasari said...

నాయకులపై కసితో ఉన్న వెధవల్లో చిన్న వెధవకి ఓటేసి వాడిని గెలిపించమంటున్నారు కొందరు - బాగుంది. అయితే సమస్యేమిటంటే, అధిక శాతం ఓటర్లు ఏదో ఓ పార్టీకే ఎల్లప్పుడూ తమ ఓటు ప్రసాదిస్తారు .. అభ్యర్ధి ఎవరనేదానితో పని లేకుండా. అతి కొద్ది శాతం 'తటస్థ' ఓటర్లు మాత్రం అటొకసారీ ఇటొకసారీ ముద్ర గుద్ది ఎన్నికల ఫలితాలు తారుమారు చేస్తుంటారు - ఇది జగమెరిగిన సత్యమే. వీళ్లలో కొందరు విచక్షణతో ఉన్న వెధవల్లో చిన్న వెధవని ఎన్నుకుందాం అనుకుంటూ మొన్న మే నెల్లో లోక్ సత్తాకి ఓటేస్తే వచ్చిన ఫలితం - అతి చిన్న వెధవకీ, కొంత చిన్న వెధవకీ మధ్య ఓట్లు చీలిపోయి అందరికన్నా పెద్ద వెధవ గద్దెనెక్కటం! కాబట్టి కసితో ఓటేసినా, వెయ్యకపోయినా తేడా ఏమీ లేదు. సమస్యకి పరిష్కారం అది కాదు. నేను పుల్లయ్యకి ఓటేస్తే దానిక్కారణం పుల్లయ్య నాకు నచ్చటం కావాలి కానీ, గన్నయ్య నచ్చకపోవటం కాకూడదు.(లోక్‌సత్తా ఉదాహరణని తప్పుగా అర్ధం చేసుకోవద్దు. 'కసిగా ఓటెయ్యటం' అనే వాదనలో లొసుగు ఎత్తిచూపటానికి తెచ్చిన ప్రస్తావన అది. లోక్‌సత్తాకి పాజిటివ్ ఓట్లూ పడ్డాయి. ఎన్నికల పట్ల విసుగుతో ఎప్పుడూ ఓటే వెయ్యని వాళ్లూ కదలి వెళ్లి లోక్‌సత్తాకి ఓటేసిన దాఖలాలున్నాయి)

మీరు మందుకి, నోటుకి, ఉచిత వరాలకీ ఆశపడి ఓట్లమ్ముకునే వాళ్లని విమర్శించండి. ఎవరికి ఓటేసినా ఒరిగేదేమీ లేదన్న నిర్వేదంలోకి జారుకున్నవారి వాదన సానుభూతితో వినండి. ఓటు వెయ్యటం మన బాధ్యతైతే, వెయ్యకుండా ఈ ఎన్నికల వ్యవస్థపై అపనమ్మకాన్నీ అసహనాన్నీ ప్రదర్శించటం మన హక్కు. ఆ రకంగా అర్ధం చేసుకోండి.

మా ఊరు said...

ఓటు వెయ్యలేదని నిర్మొహమాటంగా చెప్పుతున్న వారికి ఇంకా ఎవరు చెపితే మారుతారో .

అన్నట్టు నేను కూడా ఓటు వెయ్యలేదు
ఎందుకంటే నేను గ్రేటర్ ఓటర్ని కాదు

గీతాచార్య said...

అబ్రకదబ్ర garu,

Claps.

సుజాత వేల్పూరి said...

I have some problem in posting comments here in Telugu. Getting some error message code bx-p43cdf.

can any one help me?

జ్యోతి said...

sujatagaru,

its blogger error. it will go after sometime.

సుజాత వేల్పూరి said...

Geetaachaarya,
I have to take you too, to JP! when are you coming hyd sir?

సుజాత వేల్పూరి said...

Jyoti garu,'
thanks a lot! In fact I thought of calling you to know how to fix this.

Anil Dasari said...

మీ బ్లాగులో మీరు తెలుగులో కామెంటుకోలేక పోవటమేంటి! Switch to WP :-)

Unknown said...

అబ్రకదబ్ర, మీ వాదన లొపభూయిష్టంగా వుంది. కి 10 వోట్లు లకి చెరొ 5 వోట్లు వచ్చాయనుకుందాం. మీరు కి గాని కి గాని వెయ్యకపొవటం వల్ల లాభపడేది ఎవరు.

వోటు వేసేవాళ్ళు తక్కువైతే ఆనందించేది ఎక్కువ వెధవలే. ఎందుకంటే వాళ్ళు కొనే వోటు ఖచ్చితంగా అప్పుడు పనిచేస్తుంది గనుక. వోటు వుండీ వెయ్యలేదని గర్వంగా చెప్తున్న వారు దాని వల్ల వారు సాధించింది ఏమిటో చెప్పాలి. చెరువు మీద అలిగి స్నానం చెయ్యటం మానేస్తే ఎవరికి నష్టం.

వోటు వెయ్యకపోవటం అనేది ప్రజాస్వామిక హక్కు కాదు. అది బాధ్యత విస్మరణ. అంతగా హక్కుల గురించి మాట్లాడెవారు 49ఓ ఉపయోగించుకోవాలి

భావన said...

ఓటు మన ప్రాధమిక హక్కు ఎవరి మీదో కోపం తో దానిని నిరుపయోగం చేస్తే ఎలా... ఈ రోజు ఇక్కడ మన ప్రధానిని పిలిచి స్టేట్ హౌస్ పార్టీ ఇస్తూ ఒబామా, టీవీ గోల గోల. తొమ్మిది శాతం జీడీపీ ను చేరుకుంటున్న ఇండియాకు మేము పూర్తి స్తాయి లో స్నేహితులం అంటూ. అంత అభివృద్ధి లోకి వస్తున్న దేశం లో వున్నారు వోటు హక్కు నిరుపయోగం చేస్తే ఎలా..

వేణూశ్రీకాంత్ said...

అబ్రకదబ్ర గారు, మొన్న ఎన్నికలలో జరిగిన ఉదాహరణ బాగానే చూపించారు. కానీ గద్దెనెక్కడమనే విషయాన్ని పక్కన పెడితే పోలయిన ఓట్ల శాతం నిజంగా సేవ చేయాలనే ఉద్దేశ్యమున్న పార్టీ శ్రేణులలో మరింత ఉత్సాహంగా పని చేయడానికి ఉత్తేజం నింపదా... ఎప్పుడూ 50-60 శాతాల మధ్య కొట్టుకునే పోలింగ్ ను 90-100 ల నడుమకి తెస్తే చిన్న పార్టీనైనా గద్దెనెక్కించడం సులువు కాదంటారా...

మందుకు, బిర్యానీకి, డబ్బుకు ఓట్లు అమ్ముకునే వాళ్ళు మారాలి, రాజకీయాన్ని రౌడీయిజాన్ని వేరుచేయాలి. ఎలక్షన్ కమిషన్ ఓటరు జాబితాను సరిచేసి ఈవియం లలో మోసాలు జరుగకుండా చూడాలి ఇలా అందరూ కలిసి చేయవలసిన పనులు చాలా ఉన్నాయ్ కానీ వాటన్నిటికీ మొదటి అడుగు ప్రతి ఒక్కరు పోలింగ్ కేంద్రం దిశగా వేసేదే.

ఓటు అనేది హక్కు కాదు బాధ్యత. ఎంత సానుభూతితో అర్ధం చేసుకోదగినదైనా నిర్వేదంతో నీరసపడడం సరికాదు. ఆ నిర్వేదాన్ని పోగొట్టి మీఓటు వృధాకాదు అని తెలియ చెప్పాలనే జేపీ లాటి వ్యక్తుల ప్రయాస. మీరు వెళ్ళిన మార్కెట్ లో కూరలు బాగోలేకపోతే పక్క మార్కెట్ కి వెళ్తాం అక్కడా ఇదే పరిస్థితి అయితే ఉన్నవాటిలో మంచివి ఎన్నుకుంటాం అంతే కానీ తినడం మానేయం కదా.

సుజాత వేల్పూరి said...
This comment has been removed by the author.
సుజాత వేల్పూరి said...

అబ్రకదబ్ర, జ్యోతిగారు చెప్పినట్లు బ్లాగర్ సమస్య తీరిపోయింది లెండి. ఇప్పుడోకే!

పార్టీలు కుళ్ళిపోయాయనో, స్వచ్ఛ శీలురు లేరనో ఓట్లు వేయకుండా నిర్వేదంగా కూచుంటే చెడేది ఓటరే! మద్యానికి, డబ్బుకు అమ్ముడు పోయే వాళ్ళని కాదు విమర్శించాల్సింది. వాళ్ళ జీవితాలు మురికి గుంటల్లో ఉండబట్టి వాళ్ళు దానికి అమ్ముడుపోతారు. మురికివాడల్లో వాళ్ళు వచ్చి వోట్లు వేస్తారంటే ఇందుకే మరి!

వాళ్ళకు ఆ ఎర వేసే వాళ్ళని ఉరి తీయాలనండి ఒప్పుకుంటాను.ఎవరికి ఓటేసినా ఒరిగేదేం లేదన్న వారి వాదనను నేను వినదల్చుకోలేదు. ఎందుకంటే మారాలని ఉన్నప్పుడు మార్పుకు దోహదం చేసే వారివైపు మొగ్గాల్సిన బాధ్యత వారిదే! ఇలాంటి నిర్వేదంలో ఉన్నవాళ్ళు గ్రేటర్ లో 57 శాతం మంది ఉన్నారన్నమాట. అంటే గెలుపుని నిర్ణయించే సంఖ్యలో!

లేదా ఓటే వెయ్యకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నపుడు, అది వారి హక్కుగా భావిస్తున్నపుడు, మరికొంతమందిని ప్రభావితం చేయాలి. అదొక ఉద్యమంగా చేపట్టి ఎంతో మంది ఓటు వెయ్యకుండా చూడాలి వాళ్ళు.lets not vote" అనేది ఉద్యమ రూపం దాల్చి మొత్తం మీద పది శాతం కంటే ఓట్లు పోల్ కాకుండా చూడాలి. అప్పుడు కనీసం ఈ నాయకులంతా కాసింత సేపయినా ఆత్మ విమర్శ చేసుకుంటారు.

ఆ స్థాయిలో చేయలేమనుకున్నపుడు ఓటు వేసి తీరాలి. అది ప్రాథమిక హక్కు! ఈ రోజు పేపర్లో జేపీ స్టేట్ మెంట్ కూడా అదే! వోటు వేయని వాళ్ళకు ప్రశ్నించే హక్కు ఎక్కడిది? ఎవర్ని ప్రశ్నిస్తారు?

Anil Dasari said...

ప్రశ్నించటానికి ఓటు వేసి తీరనవసరం లేదండీ, పద్ధతిగా పన్నులు కడుతూ ఉంటే చాలు :-) అధికారులూ, ప్రభుత్వమూ కేవలం ఓటర్లకు మాత్రమే జవాబుదారీ కాదు - టాక్స్ పేయర్స్ అందరికీ జవాబుదారీ. అయినా, ఓటు వేసినంత మాత్రాన ప్రశ్నించే హక్కొస్తుంది అనుకుంటే మీరు అమాయకులే. 'మీ ఓటు నాకే వేశావని నమ్మకమేంటి' అని దబాయించే పెద్దలున్నారు!

నేను ఎవరికీ ఓటెయ్యొద్దని ప్రభోధించటం లేదు. వెయ్యని వాళ్లని అంతగా వెక్కిరించనవసరం లేదంటున్నానంతే.

నా దృష్టిలో ఎన్నికల పద్ధతి మారినంత మాత్రానో, అందరూ ఓట్లేసినంత మాత్రానో దేశం బాగు పడిపోదు. మార్పు ప్రజల్లో రావాలి. అది నాయకులని నిలదీసే విషయంలో కాదు. అంతకన్నా ఫండమంటల్ ఛేంజ్ కావాలి. అవినీతికి మూలాలు మనలోనే, ప్రజల్లోనే ఉన్నాయి. నాయకులూ మనలోంచి పుట్టేవాళ్లేగా. వాళ్లు తేడాగా ఎందుకుంటారు? మతం పేరుతోనో, కులం పేరుతోనో రెచ్చగొడితే రెచ్చిపోయే ఓటర్లు మందలుగా తరలి పోలింగ్ కేంద్రాలకి వెళ్లినా వచ్చే ఫలితం ఏముంది? ఒకడు రాముడి గుడి కట్టిస్తానన్నోడికి ఓటేస్తాడు; ఒకడు మక్కా పంపిస్తానంటే ఓటేస్తాడు; ఒకడు ఫ్రీ కరెంట్ ఇస్తానంటే వేస్తాడు; ఒకడు రిజర్వేషన్ బుట్టలో పడతాడు; ఇంకొకడు ఫలానా నటుడి అభిమాని కాబట్టి ఆ పార్టీకే వేస్తాడు; వేరొకడు తన కులపు అభ్యర్ధికే వేస్తాడు. మీ ఫోకస్ వీళ్ల మీద పెట్టండి. వీళ్లని ఏకి పారేయండి; చేతైతే వీళ్లని మార్చండి. వీళ్ల కంటే అసలు ఓటీంగ్‌కే వెళ్లని వాళ్లే నా దృష్టిలో ఉత్తములు

ఇది చాలా పెద్ద చర్చలెండి. వదిలేయండి.

గీతాచార్య said...

Sure Madam, any time Ur highness please ;-)

But one thing, జేపీ గారు నాయకులుగా మిగిలుండాలని మీకుందా లేదా నాకు చెప్పండి. ఆయన కూడా నా పార్టీలోకి వచ్చేస్తారు. మళ్ళా మీ ఇష్టం :-D

అడ్డ గాడిద (The Ass) said...

nakkuda jp class. no seat anukunta kada :-D

గీతాచార్య said...

Wow. Hundred followers. Congrats. This is also the first instance in telugu blogs. But how many are regular and serious readers? :-D

Anonymous said...

నా సమాధానం

సుజాత వేల్పూరి said...

గీతాచార్య,
ఈ మధ్యనే ఈ ఫాలోయర్స్ సంఖ్య 100 కి చేరింది. మీది న్యాయమైన సందేహం! ఎంతమంది సీరియస్ గా చదువుతారన్నది. ఈ సందేహం నాకూ ఉంది. బ్లాగు రివ్యూ ఏదైనా పత్రికలో వచ్చినపుడు టపాలు నచ్చి, ఇలా ఫాలోయర్స్ సంఖ్య పెరగడం మామూలే! వీరిలో ఎంతమంది రెగ్యులర్ గా చదువుతారనేది చెప్పలేం!

అలా అయితే నాకు తెలిసి నా బ్లాగు రెగ్యులర్ గా చదివే వాళ్లలో చాలా మంది ఈ ఫాలోయర్స్ లో లేరు మరి!


హరీష్, మీ సమాధానం చూడబోతున్నాను. చూశాక వ్యాఖ్య రాస్తాను.

Kathi Mahesh Kumar said...

ఓటేసేదెప్పుడూ సామాన్యుడే. విద్యాధికులూ,మేధావులూ కేవలం lip service తప్ప ప్రజాస్వామ్యానికి మరేమీ చెయ్యరూ, కనీసం ఓటెయ్యడంతోసహా.

Post a Comment