August 30, 2010

తాడేపల్లి గారు రాసిన తెలుగుభాషా ప్రతిజ్ఞ

 తెలుగు బాట కార్యక్రమం కోసం శ్రీ తాడేపల్లి గారు స్వయంగా రాసి, సభికులందరి చేతా చేయించిన తెలుగు భాషా ప్రతిజ్ఞ!  




నా మాతృభాష తెలుగు! నేను నా మాతృభాషను ప్రేమిస్తున్నాను. అందరు తెలుగు 
కవులను,కళాకారులను ,రచయితలను నేను బేషరతుగా గౌరవిస్తాను. తెలుగులో ఉన్న అన్ని 
మాండలికాలూ,శైలులూ నాకు సమానమే! 


తెలుగు గడ్డ మీద అన్ని రంగాలలోనూ తెలుగే వ్యవహారంలో ఉండటానికి నేను అంగీకరిస్తున్నాను.
నేను నా సహోదర తెలుగువారితో ఎల్లప్పుడూ తెలుగులోనే మాట్లాడతాను. 
వారికి తెలుగులోనే లేఖలు రాస్తాను.తెలుగు రానివారు అది నేర్చుకోవడానికి నా ఇతోధిక సహకారాన్ని అందజేస్తాను.తెలుగుభాషకు,వారసత్వానికీ ఎక్కడా, ఏ సందర్భంలోనూ, ఎవరి వలనా అవమానం 
జరగకుండా అన్ని విధాలుగా జాగరూకత వహిస్తాను.


 తెలుగు భాష గురించిన సరియైన పరిజ్ఞానాన్ని 
సంపాదించే నిమిత్తం ప్రేరణ ప్రోత్సాహాలు కలుగజేస్తాను.నా తెలుగు భాషా వారసత్వాన్ని భావి తరాలకు 
యథా తథంగా అందించడానికి ఉద్దేశించిన ప్రతి కార్య కలాపానికీ నా మద్దతు ప్రకటిస్తాను.


రెండు వేల సంవత్సరాల చరిత్ర,సంస్కృతి,సాహిత్య సంప్రదాయమూ కలిగిన తెలుగు 
భాషా వారసత్వం నాకు చాలా గర్వ కారణం! ఈ వారసత్వాన్ని సగర్వంగానూ,బహిరంగంగానూ 
ప్రకటించుకోవడం నా కర్తవ్యం!  శాయశక్తులా దాన్ని నిలబెట్టడానికి కృషి చేయడం నా విధ్యుక్త ధర్మం! 


జై తెలుగు భారతి!

22 comments:

శ్రీనివాస్ said...

బాగానే ఉంది కానీ ఒక్క లైన్ కొద్దిగా అదోలా అనిపించింది.

అందరు తెలుగు కవులను,కళాకారులను ,రచయితలను నేను బేషరతుగా గౌరవిస్తాను.
_________________________________________

కొందరి వ్రాతలు బాగున్నా వారి వ్యక్తిగత ప్రవర్తన వల్ల గౌరవభావం కలగదు.

Shiva Bandaru said...

బావుంది. అన్ని స్కూల్ల లోనూ ఇలాంటి ప్రతిజ్జలు చేసేలా చేస్తే బావుంటుంది

శేఖర్ పెద్దగోపు said...

తాడేపల్లిగారు చాలా బాగుందండీ తెలుగుభాషా ప్రతిజ్ఞ...తప్పకుండా దీన్ని పాటించడానికి,ఆచరించడానికి ప్రయత్నిస్తాము...
సుజాతగారు మాతో పంచుకున్నందుకు నెనర్లు..(అమ్మో ఇక్కడ థాంక్స్ అనే పదం వచ్చేస్తుంది నాకు అలవాటులో పొరపాటుగా..ఇప్పుడే ప్రతిజ్ఞ చదివి అంతలోనే వదిలేస్తే ఎలా!)

కొత్త పాళీ said...

బాగుంది.

Indian Minerva said...

సరళ శైలిలో చాలా బాగుంది.

జయంత్ కుమార్ said...

చాలా.... చాలా.... బాగుంది...

Chari Dingari said...

బే షరతు గా...? హింది/ఉర్దు ?

vrdarla said...

బాగుంది.

Anonymous said...

అందరు తెలుగు కవులను,కళాకారులను ,రచయితలను నేను బేషరతుగా గౌరవిస్తాను..

తాడేపల్లిగారు గురి చూసి కుంభస్థలం మీద కొట్టారు. చాలా ముఖ్యమైన మాట రాశారు ప్రతిజ్ఞలో ! ఈ ఒక్క వాక్యం లేకపోతే ఈ ప్రతిజ్ఞంతా పూర్తి వృథా అయ్యుండేది. ఈ విషయంలో తెలుగువాళ్ళ సంకుచితత్వాన్ని ఇంత సీరియస్ గా ఇప్పటిదాకా ఎవరూ అర్థం చేసుకోలేదని నాకు అనిపిస్తున్నది.

మనవాళ్ళని మనం గౌరవించుకొని ఇతరభాషలవాళ్ళు కూడా మనవాళ్ళని గౌరవించేలా చేయడంలో విఫలం కావడం వల్లనే మనకు జ్ఞానపీఠాలూ, తతిమ్మా పీఠాలూ ఏవీ దక్కకుండా పోతున్నాయి. మన కులం కాదనీ, మన ప్రాంతం కాదనీ మరొకటనీ, మరొకటనీ మనవాళ్ళని మనమే పక్కన పెట్టేయడం, దూషించడం తెలుగునేల మీద ఒక అసహ్యమైన దురలవాటుగా పరిణమించింది. ప్రధానంగా ప్రాంతీయ ఉద్యమాల వేడిలో !

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ said...

ప్రతిజ్ఞ బాగుందండీ.

రవి said...

"నేను నా సహోదర తెలుగువారితో ఎల్లప్పుడూ తెలుగులోనే మాట్లాడతాను."

ఏమనుకోకండి. ఎంచేతో నవ్వొస్తుంది, ఈ వాక్యం చూసి. ఎగతాళిగా కాదు, మన దుస్థితి తలుచుకుని వచ్చే నవ్వు. ఓ సారి అలా గూగుల్ బజ్జులోకెళ్ళి చూసి రండి.

సుజాత వేల్పూరి said...

రవి గారూ,
నిజమే, నా తెలుగు బాట ప్రకటన పోస్టులో ఒక కార్టూన్ పెట్టాను చూడండి! పరిస్థితి అలాగే ఉంది!

ఇలా ఒక ప్రతిజ్ఞ చేసి కంకణం కడితేనైనా(నిజంగానే కంకణాలు కట్టుకున్నాం, ఫొటోలు పెట్లేదు కానీ)కాస్త తెలుగులో మాట్లాడతామని ఆశ! అంతే

durgeswara said...

చాలాబాగుంది తాడేపల్లిగారు .ధన్యవాదములు

చింతా రామ కృష్ణా రావు. said...

ఆర్యా! శ్రీ తాడేపల్లి లలితా సుబ్రహ్మణ్యమా!తెలుగు తల్లి నోముల పంటగా ఆమె గర్భాన వెలసిన ధన్య జీవీ!

ప్రతినలు బూనఁ జేయుచు ప్రభావము గొల్పిన ధన్యుఁడా! సుసం
స్తుత మతి వీవు.నీదు కృషి శోభిలఁ జేయును తెల్గువారలన్.
సతతము సజ్జనుల్ తెలుగు సభ్యత;సంస్కృతి వెల్గఁజేయు స
న్నుతమగు నీ హితోక్తులకు నూతన తేజముఁ నందుచుండుచున్.

మేధ said...

బావుందండీ..

నవ్వులాట శ్రీకాంత్ said...

నా మాతృభాష తెలుగు! నేను నా మాతృభాషను ప్రేమిస్తున్నాను. అందరు తెలుగు
కవులను,కళాకారులను ,రచయితలను నేను బేషరతుగా గౌరవిస్తాను

మాతృభాష, బేషరతుగా -సంస్కృత,ఉర్దూ పదాల మొదటి వాక్యము ఇబ్బందిగా ఉంది.వ్యవహారం లో అవి తెలుగులా అనిపించవచ్చు, గానీ వాటిని ప్రతిఙ లో వాడవచ్చా ?

సుభగ said...

>> తెలుగులో ఉన్న అన్ని మాండలికాలూ,శైలులూ నాకు సమానమే!
ఇది చెప్పడానికి సులువే కాని నిజంగా ఆచరించడం చాలా కష్టం. ఎవరి మాండలికం వాళ్ళకు ముద్దు.
అన్నీ సమానమే అనడానికి బదులు అన్నిటినీ గౌరవిస్తాను అనుంటే బాగుండేదేమో!

మొత్తానికి బాగుంది తెలుగు ప్రతిజ్ఞ

Unknown said...

బేషరతులాంటి ఉర్దూపదాలు తెలుగులో చాలా ఉన్నాయి. అక్షరాలా కొన్ని వందలు. ఇప్పుడు వాటన్నింటినీ కట్టగట్టి సముద్రంలో పారేయడం సాధ్యమా ? బేషరతు వాడొద్దంటే దానికి తెలుగులో ప్రత్యామ్నాయపదం ఏంటి ? ఒకవేళ ఉన్నా అది సామాన్యజనానికి అర్థమయ్యే అవకాశం ఉందా ? అది బేషరతిచ్చే బరువుని ఎక్స్‌ప్రెషన్ కి ఇవ్వగలదా ? ఇవన్నీ ప్రశ్నలే.

వంగూరి చిట్టెన్ రాజు said...

తెలుగు భాషా, సాహిత్యాల కోసం మీరందరూ తలపెట్టిన "తెలుగు బాట" బాగా జరిగిందని ఇప్పుడే చూశాను మీ బ్లాగులో. చాలా సంతోషం. మనందరం అలా "నడుస్తూ" ఉంటే, ఏనాటికైనా గమ్యం చేరుకుంటాం. నా నడక మొదలుపెట్టి చాలా ఏళ్ళయింది.
సమస్యల నిర్వచనమూ, కొన్ని, కొన్ని పరిష్కారాలూ చాలా మందికి తెలుసు. కానీ, రాజకీయ నాయకులకి వోట్లూ, ప్రెవేటు విద్యా సంస్థల యాజమాన్యానికి కావలిసిన ధన లాభాలూ మొదలైనవి తెలుగు భాష సంపాదించలేనంత వరకూ, మనలాటి మామూలు వాళ్ళే ఈ భారం మొయ్యాలి. ఈ నాటి పరిభాషలో దాన్నే "ఉద్యమం" అంటారు అనుకుంటాను.

---వంగూరి చిట్టెన్ రాజు

ప్రియ said...

GOD save Telugu!!!

BANGaRAM said...

తెలుగు పై మీకున్న అభిప్రాయంను నేను గౌరవిస్తున్నాను. తెలుగు భాష అభివృద్ది కొరకు మనం కూడ చేయవలసింది కొంత ఉంది. దానికి నా ఈ "నంబరు ప్లేట్" టపా చదవండి.
www.bangaraiahh.blogspot.com
http://www.youtube.com/watch?v=uyrovRwh9aQ

BANGaRAM said...

తెలుగు పై మీకున్న అభిప్రాయంను నేను గౌరవిస్తున్నాను. తెలుగు భాష అభివృద్ది కొరకు మనం కూడ చేయవలసింది కొంత ఉంది. దానికి నా ఈ టపా చదవండి. www.bangaraiahh.blogspot.com
http://www.youtube.com/watch?v=uyrovRwh9aQ

Post a Comment