May 24, 2011

మాగాయే మహా పచ్చడి ............!


ఏమిటో ఎండాకాలం రాగానే అంతా ఆవకాయ  ఆవకాయ  అని ఆవకాయ మానియా పట్టుకున్న వాళ్లలా కలవరిస్తున్నారు. కొత్తావకాయ మహారుచి, ఘాటూ కాబట్టి ఆవకాయ పెట్టిన కొత్తల్లో ఎన్ని వెరైటీలు చేసినా, ఎన్ని కూరలు చేసినా  ఇంట్లో  వాటికి సేల్సే ఉండవు. ఆ కొత్త మోహంలో మొదట మొదట లాగించేసినా వర్షాలు మొదలయ్యేసరికి ఆవకాయ   డిమాండ్ కాస్తా ఢామ్మని పడిపోతుంది.

కానీ ఈ మాగాయ ఉందే..ఇది అలాక్కాదు!

 మాగాయ పెట్టిన మొదటి రోజు నుంచి  ఇంగువ ఘుమ ఘుమలతో ఎంత  ఎంత పాత బడితే అంత రుచులూరుతూ, మతి పోగొట్టేస్తుంది. అందుకే నా వోటు మాగాయకే పడుతుంది.

గత రెండేళ్ళుగా నేను అమ్మ/అత్తల గైడెన్స్ తో ఆవకాయ మాగాయ సొంతగా పెట్టడం మొదలుపెట్టాను. నేను తప్ప మిగతా వాళ్లంతా(చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళూ కూడా)  అమ్మ దగ్గర్నుంచో, అత్తల దగ్గర్నుంచో తెచ్చేసుకుని హాయిగా మింగుతున్నారు.

 మా పెద్దక్క అంటుందీ (దీని కూతురికి పెళ్ళయి, దానికి కొడుకు కూడా పుట్టేసి ఇది అమ్మమ్మ కూడా అయింది) "ఎందుకే లేనిపోని లంపటం! హాయిగా అమ్మ పెట్టిస్తే తెచ్చుకోరాదూ! ఏమోనబ్బా, నాకైతే అమ్మ పెట్టిన రుచి రాదనిపిస్తుంది"(అంతా అవద్దం, పెట్టడానికి బద్ధకం).



నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలని నిర్ణయించుకుని మా అత్తగారి పాదాలకు నమస్కరించి రెండేళ్ళ క్రితం ఆవకాయ పెట్టాను. అది సూపర్ హిట్టయి కూచుంది. దాంతో మా అత్తగారు/అమ్మగారు ఇద్దరూ అడ్వాంటేజ్ తీసుకుని "ఇంకేం, మాగాయ కూడా నాలుక్కాయలు పడేసెయ్, ఎందుక్కుదరదో చూస్తాం" అన్నారు.

 పెట్టాను!

కుదిరింది!

అందువల్ల వీళ్ళిద్దరూ అందరికోసమూ ఆవకాయా, మాగాయా ఒక రెండొందల కాయలు పెట్టేసి నన్ను మాత్రం లిస్టు లోంచి తీసేశారు ."అబ్బే, అమ్మలు బ్రహ్మాండంగా పెట్టేస్తుంది ఆవకాయ" అని!

కాయలు తెద్దామని రైతు బజారెళ్దామంటే మా ఆయనకు ఇంతలావున కోపం వచ్చేసింది."అబ్బబ్బ, భలే చేస్తావు నువ్వు! అమ్మ ఇస్తే తీసుకోవచ్చు కదా!అక్కడ పార్కింగ్ దొరికి చావదు.కాయల సెలక్షన్ మనకు తెలీదాయె" అని విసుక్కున్నాడు. బాగా వెన్నపూస, నూజివీడు రసాలు వేసుకుని ఆవకాయ బుచ్చిబాబు లెవెల్లో గుండ్రాయంత ముద్దలు  మాయం చేసేటప్పుడు  ఈ విసుగుండదు మళ్ళీ!

రైతు బజార్లో తెల్ల జుట్టున్న వృద్ధ బామ్మలు బేరం చేస్తున్న మావిడ కాయల వాడి దగ్గరకెళ్ళిఒకావిడను పట్టుకుని " మామ్మగారూ, ఏవి కాయలు ఆవకాయకు  శ్రేష్టమో, మరియు ఏవి మాగాయకు శ్రేష్టమో వివరింపవలసింద"ని కోరాను. అప్పుడామె ఈ విధంగా చెప్ప దొడగింది

"నీ మొహమే పిచ్చి తల్లీ! ఈ ఆవకాయ కాయ సెలక్ట్ చేయడం బ్రహ్మ తరం కూడా కాదు. వీడు తెల్ల గులాబీలంటాడా, ముక్కేమో వారానికే మెత్తబడుతుంది. ఒకే చెట్టు కాయలంటాడా, పోయినేడాది కాస్త బూజు కూడా వచ్చింది. కాబట్టి కళ్ళు మూసుకుని తీసుకో, ఆ పై నీ అదృష్టం! గత నలభై ఏళ్ళుగా ఇలాగే నెట్టుకొస్తున్నా"  

ఎలాగో విజయవంతంగా ఆవకాయ పెట్టేశాను. మాగాయ ముక్కలు ఒక్క ఎండకే వడియాల్లా ఎండాయి. ఇంతలో మెంతిపిండి, ఆవపిండి కొలత మర్చిపోయాను. అత్తగారు ఈ ఎండల్లో ఢిల్లీ వెళ్ళారు(బాడ్ టేస్టు) . ఫోనేమో నాట్ రీచబుల్!

 అమ్మనడిగితే "ఏమోనే,, నువ్వు ఆరుకాయలు పదికాయలూ పెడితే నాకెలా తెలుస్తుంది,కనీసం నూట యాభై కాయలకైతే చెప్తా కొలత" అంది. "ఏడిసినట్టుంది. ఇప్పుడు నూటయాభై కాయలు పెట్టమంటావా? ఈ పదికాయలకే ఇక్కడ పేగులు తెగేలా ఉన్నాయి"అని విసుక్కుని తృష్ణకి. మెయిల్ రాశాను.

ఆవిడేమో ఒక టీ గ్లాసు కోలత తీసుకోండి అన్నారు. టీ గ్లాసంటే? మా మావగారు గజం పొడుగు గ్లాసుతో తాగుతారు టీ! నేనేమో ఔన్స్ గ్లాసుతో తాగుతాను! అదే అడిగా  "టీ గ్లాసంటే ...ఏదండీ?"అని!



తృష్ణ మనసులో "వెధవ డౌట్లు, ఏవీ తెలీదు, మళ్ళీ ఓ అని తయారైపోతారు ఆవకాయ మాగాయ అని"అనుకుంటూ "అదేనండీ, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ తో ఇచ్చే కప్ ఉంటుంది చూడండి, అందులో ముప్పావు వంతు" అని సౌమ్యంగా చెప్పారు.(జోక్కి రాశాలెండి, పాపం తృష్ణ ఏమి అడిగినా చక్కగా చెప్తారు విసుక్కోకుండా) !

అలా మాగాయ కూడా ఎలాగో విజయవంతంగా పెట్టేశాను.  ఇంగువ పోపు పెడుతుంటే ఏదో బాంక్ క్రెడిట్ కార్డు ప్రమోషన్ కోసం వచ్చి బెల్లు కొట్టినబ్బాయి లోపలికి తొంగి చూస్తూ" something smells good and yummy here " అన్నాడు! అమ్మయ్య, ప్రజాభిప్రాయం బాగనే ఉంది.



ఎప్పట్లాగే మా  ఇంటాయన ఆవకాయ కలుపుకుని "సూపర్ గా ఉందిరా" అన్నాడు. చెప్పాగా, తినేటపుడు విసుగుండదని!

నా ఊరగాయల సంగతి తెలిసి మా చెల్లెలు "నాక్కూడా ఒక డజను కాయలు మాగాయ పెట్టవే ప్లీజ్" అని అర్థించింది ఫోన్లో!

"రాంగ్ నంబర్" అని ఫోన్ పెట్టేశాను.

అమ్మో అమ్మో, మాగాయ కలిపిన రోజైతే ఏదో ఎండలో రాళ్ళెత్తే పని చేసినట్టు ఆదమర్చి నిద్రపోయాను.  భవసాగరం ఈదడమంటే ఏమిటో ప్రత్యక్షంగా తెలిసింది!   పది కాయలకే ఇంత హడావుడైతే, పాపం వందల కాయలు ఎలా పెట్టేవాళ్ళో అమ్మావాళ్ళు అని ఆలోచించా మొదటిసారి ఆ రోజు!


ఈ పోస్టు SHANKAR.S.గారికి సరదాగా అంకితం  !


46 comments:

ఆ.సౌమ్య said...

మీరు ఎన్నైనా చెప్పండి...ఈ మాగాయిలూ గీగాయిలు పచ్చావకాయ, ఎండావకాయ ల ముందు దిగదుడుపే...తొక్కుడు పచ్చడి కూడా మాగాయ కంటే బానే ఉంటుంది. మెంతిముక్కలు, పులిహార ఆవకాయ ఇలా ఇన్ని రకాలు వదిలేసి మాగాయ అంటే ఎలా అండీ....అబ్బే ఏం లాభం లేదు :)

(మాగాయ అభిమానులు వచ్చే ముందే నే పారిపోతున్నా...బాబోయ్ :P)

సుజాత వేల్పూరి said...

సౌమ్య, మాగాయ ప్రత్యేకత ఏంటంటే మిగతా ఆవకాయల్లాగా పాతబడదు. పాతబడిన కొద్దీ రుచిగా ఉంటుంది. పైగా మాగాయను పెరుగులో కలిపి, ముద్ద పప్పులో వేసి...ఇలా రకరకాల రెసిపీలు చేయొచ్చు! ఆవకాయ లాగా కొత్త మోజు తీరగానే పక్కన పెట్టేయలేం దీన్ని!

ఎవరక్కడ, ఆ మాగాయ అభిమానులందరినీ ఇలా పిలవండి

Praveen Mandangi said...

మా ఇంటిలో రెండు మామిడి చెట్లున్నాయి, మాగాయ చేసుకోవడానికి. హైదరాబాద్‌లో అపార్ట్మెంట్లలో ఉండేవాళ్ళు అంగట్లో మామిడి కాయలు కొనుక్కుని చేసుకోవాలి. మాకైతే కాయలు పుచ్చిపోవడం లేదా పురుగులు పట్టడం లాంటిది ఉండదు. తాజా కాయలతోనే మాగాయ సిద్ధమవుతుంది.

వేణు said...

"మాగాయే మహా పచ్చడి ....!" అంటూ ఒకనాటి మీ పోస్టులను గుర్తుకుతెస్తూ సరదాగా రాశారు.

ఈ టపా లింక్ Buzz చూస్తే... అక్కడ రెండు వైరివర్గాల హోరాహోరీ పారడీ పాటల పోరు హోరు..! అది చూశాక... ‘ఆవగాయ-మాగాయ: తులనాత్మక పరిశీలన’ అంటూ గంభీరంగా ఏదైనా రాయాలనే ఆలోచన వెనక్కిపోయింది. పోనీ శాస్త్రీయంగా ‘ఆవకాయ అయినా, మాగాయ అయినా ఆరోగ్యానికి మంచిది కాదు’ అని రాయటం ఆరోగ్యానికి అసలే మంచిది కాదని అర్థమైంది. :)

ఆవకాయో, మాగాయో- ఏదో ఒకటి గానీ, మీరు ఎంచుకునే మామిడికాయలు నూజివీడు రసాలు కాకపోతే మాత్రం ఏమీ లాభం లేదు!

బులుసు సుబ్రహ్మణ్యం said...

వచ్చేశాను మాగాయ కి కూడా అభిమానిని. మాగాయ వలన ఎన్నో ఉపయోగములు. మాగాయిలో కాసిన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు ఇత్యాదులు వేసి నూరుకున్నచో దోశల మరియూ ఇడ్లీ కి కూడా చట్నీ గా ఉపయోగపడును. ఎంతో బాగుండును. అన్నం లో అదిరిపోవును.

తొక్కుడు పచ్చడి కూడా ఒక విధం గా మాగాయ జాతికే చెందునని నా పరిశోధనలో తెలుసుకున్నాను. సౌమ్య గారు గమనించవలెను.

అమ్మయ్య బాగా సపోర్ట్ చేశానా? మరి నాకేంటి?
రెండు కే‌జి. మాగాయ పార్సెల్.

తృష్ణ said...

హై హై...నా పేరు..నా పేరు...భలే భలే.. !
ఏమండోయ్...నేనేమనుకున్నానో చెప్పనా? ఈవిడకి ఎంతవరకూ తెలిసా అని నన్ను టెస్ట్ చేస్తున్నారేమో అనుకున్నా. ఊరగాయలు పెట్టే అవతారం చాలించాకా మళ్ళి మీ మైల్ చూసి దురద పుట్టి ఓ రెండు కాయలు కొని కాస్తంత మాగాయ కూడా పెట్టేసా. అంతకు ముందు పెట్టిన తురుమ్మాగాయ కూడా చాలా బాగా వచ్చింది. నేనూ రెండేళ్ల నుంచే సొంత కొట్టు పెట్టుకున్నా !!

ఇక నేను ఎన్ని రకాలావకాయలు పెట్టేసినా నా వోటు మాగాయకే. పాత మాగాయలో పెరుగు వేసుకుని ఇడ్లీ లో నంచుకుంటే ఎంత బాగుంటుంది? కాస్త పాత మాగాయలో రెండు పచ్చి మిర్చి, కొత్తిమీర వేసి మాగాయ పచ్చడి చేసేది మా అమ్మ. ఆ రుచి కూడా సుపరే..!

Sudha Rani Pantula said...

వచ్చేసాం...మాగాయ అభిమానులం. ఏయ్...సౌమ్యా...మా మాగాయకే పేర్లు పెడతారా...ఆయ్( ...

మాగాయ మహా పచ్చడి పెరుగేస్తే మహత్తరి
అది వేస్తే అడ్డవిస్తరి...మానిన్యా మహాసుందరి
(అంటే ఏంటో నాకు సరిగ్గా తెలీదు అడగొద్దు)
పాట ద్వారా ప్రచారం కూడా చేయించాం. మాగాయలో పెరుగేస్తే ఉంటుందీ....అలాగే సుజాత చెప్పినట్టు...ఏ ఆకుకూరా, కనీసం కూరముక్కేనా దొరకని రోజుల్లో కందిపప్పు చేసుకోవాలనుకో...ఆ మాగాయని కాస్త వేణ్ణీళ్ళలో నానబెట్టి...పోపువేసి మాగాయ వేసి ఆపైన కందిపప్పు ముద్ద వేసారనుకో...మాగాయపప్పు ఇట్టే సిద్ధం...ఇంక దానికోసం చేసుకోవలసిందే ఇంట్లో యుద్ధం. అదోసారి లాగించి అప్పుడిటు వచ్చి మాట్లాడండి. అలాగే దోశల్లోకో ఇడ్లీలోకో సైడ్ పచ్చడి లేదనుకో..ఇంత పెరుగులో ఆ మాగాయపచ్చడి వేసి కలిపేస్తే సరి.పుల్లగా కారం కారంగా..యమగా....
హమ్మా....
మాగాయ ఇష్టం లేదనడమే.
సుజాతా..ఈ పోస్టు భలే రుచిగా ఉంది మాగాయ పచ్చడిలా.

ఆ.సౌమ్య said...

అక్కరకురాని నూనె,
పెట్టిన రుచి నీయని మాగాయ, చెక్కినమా
మామిడికాయ టెంకలు,
టక్కున పారవేయవలయు గదరా సుమతీ! :P

ఆ.సౌమ్య said...

సుధగారూ
అసలు ఒరిజినల్‌గా "మాగాయేం మహాపచ్చడి? పెరుగేస్తే ఓమోస్తరి, అదివేస్తే చెడ్డవిస్తరి" అని చెప్పారట వేటూరి...నాగరాజు పప్పుగారు చెప్పారు. :P

Sudha Rani Pantula said...

సౌమ్యా...
సరి సరి...
నువ్వు మహా గడసరి...

బులుసు సుబ్రహ్మణ్యం said...

మాగాయదేల యన్న మామిడ కాయల కాలం
ఏను మాగాయ ప్రియుండ ...
ఎల్ల జనులు మెచ్చ ఎరుగవే మాగాయది
ఊరగాయలందు మాగాయ లెస్స.

(యతి,గణం,ఛందస్సు, ఒరిజినల్ పద్యం మొదలగునవేవీ పట్టించుకోవద్దని ప్రార్ధన.)

మాగాయకి జయ కొట్టమని మనవి.

లచ్చిమి said...

అబ్బో అబ్బో అబ్బబ్బో
ఏంటి సుజాత గారు మీరు ఇలా రాసెస్తే ఎలా
నేను మా అమ్మ పెట్టిన ఆవకాయ మాగాయా తెచ్చుకోవాలంటె ఇంకో నెలైనా పడుతుంది
అప్పటిదాక ఏదో అలా అలా ఇంట్లో ఉన్న టమటా తొ గడిపేద్దాం అనుకున్నా !!!!
ఇలాంటి పోస్టులు చూస్తె ఇంకెలా ఉండగలం అండీ

Sudha Rani Pantula said...

బులుసు గారూ,
మీకూ మగాయకూ కూడా జయహో.

కృష్ణప్రియ said...

:) Very nicely written!
నేనూ మాగాయ ఫాన్.. మదరాసు లో మా బాబాయి గారుండేవారు.. చాలా కాలం క్రితం ఆయన ఇంటికి ఒకసారి వెళ్లినప్పుడు జ్వరం తగిలింది. ఆయన.. పథ్యానికి ఎన్ని రోజుల జ్వరమో .. దాన్ని బట్టి నాలుగేళ్ల క్రితం మాగాయ వేయాలా, లేక రెండేళ్ళ క్రితం దయితే చాలా అని చాలా సీరియస్ గా డిసైడ్ చేసి వేసారు. ఆ తర్వాత, నేనెప్పుడు జ్వరం వచ్చి లేచినా.. మాగాయ తోనే పథ్యం :) మా ఇంట్లో కూడా ౨ ఏళ్ల క్రితం మాగాయ నుండీ దాచాను..

@ సౌమ్య,
పద్యం బాగుంది.. :) కానీ.. అభిప్రాయం తోనే ప్రాబ్లం..

కొత్తావకాయ said...

చంపారు పొండి. ఉత్తరాంధ్ర అమ్మాయిని, ప.గో.జి అబ్బాయికి ఇచ్చి ఎనిమిదేళ్ళుగా ఎండావకాయ లేకుండా చేసేసారనే రోజుకొకసారి మా పుట్టింటి వాళ్ళని తిట్టేసుకుంటూ ఉంటాను. ఈ ఎండావకాయ, మామూలు ఆవకాయకే పోటీ సరిపోదన్నట్టు మీరు ఇప్పుడు మాగాయని బరిలోకి దింపారా!

సర్లెండి, తప్పేదేముంది. గురువర్యులు బులుసు వారిచ్చిన ఉత్సాహం తో, తూనీగ ఆ.సౌమ్య ఇచ్చిన ప్రేరణతో.. రాసేస్తున్నా తవిక.

ప్రేమలు విరిసిన వేళల పతిదేవుని విస్తరిలో
పప్పూ నేతిని కూడి అవ్కాయ్ కూర్మిన్
ధాటిగ ఘాటుగ ఎర్రగ ఓహోహో మహ నీటుగ
లొట్టలువేసిన మనుజుని మది అది నింపున్

కలహము వెలసిన క్షణమున వంటింట్లో
ఏదికానివేళను సతికిన్
ముచ్చటగా మాగాయను పెరుగును ప్రేమతొ కలిపి
తినిపించని మురిపించని మగడును మగడే!

అంచేత దేనికదే అద్భుతం. ఏదీ ఎక్కువని ఒప్పుకోలేను. తక్కువని తీసిపారెయ్యలేను.

kiranmayi said...

సుజాత గారు
ఫోటోలు భలే గా ఉన్నాయి. మీ మాగాయ వేనా? అయినా మీ మీద నాకు చాల కోపమోచేస్తోందంతే. మంచి మంచిగా బోల్డు బోల్డు పచ్చళ్ళు పెట్టేసికుని, సీజన్లో పచ్చళ్ళు దొరకని నా లాంటి వాళ్ళని బాధ పెడతారా? పైగా ఫణి బాబు గారు మీ ఇంటికొస్తే బోల్డు బోల్డు వంటలు చేసి పెడతారా? నాకు కొంచెం పంపించొచ్చు కదా?
నాకు కొత్త మాగాయంటే ఇష్టం కాని పాత మాగాయతో ఇన్ని టైపు లలో చట్నీలు చేయ్యోచ్చ్చని నాకు తెలీదు. అమ్మ తెచ్చిన పాత మాగాయ ఉంది. దాన్ని బయటికి తీస్తా.

జైభారత్ said...

మేడం మీరు గతంలో ఆంధ్రప్రదేశ్ పత్రికకి సంపాదకులు గా పనిచేశారా?

ఏల్చూరి మురళీధరరావు said...

పెట్టిన పేర్లను చూస్తే "ఆవ"కాయ, "మెంతి"కాయ మొదలైన అన్నిటిలో మామిడికాయ కంటె పోపు సామాన్లకే పెద్దపీట. వాటి ఎక్కువ తక్కువలను బట్టి రుచిలో తేడాలు వస్తాయని హెచ్చరిక. అయితే, ఒక్క "మా(o)గాయ"లో మాత్రమే మామిడి రుచి ముఖ్యం. అందుకే ఆ పేరు పెట్టారు. పోపు ఎంత కలిపినా, మరీ ముఖ్యంగా ఇంగువ, మెంతులతో ఎండు మిరపల పరుపు పరిచినా, రోగనాశకమైన పుల్ల మామిడి రుచికే ప్రాధాన్యం. అందుకే ప్రత్యేకంగా ఎండబెట్టి, ఉప్పు కలిపి, దాని ఆయుర్దాయం పెంచటం, శరీరారోగ్యానికి, వాజీకరణకు "పథ్యం"గా వాడటం.

మీ వ్యాసం, ఫొటోలు బాగున్నాయి.

- ఏల్చూరి మురళీధరరావు

వి.ఫ్రా said...

సుజాత గారూ, మాగాయ మీద ఇంత రాసి, ఇంతకంత రాయించిన మీ కౌశల్యం మెచ్చకుండా ఉండలేక రాస్తున్నానండీ. మాగాయ సంగతి నాకు తెలియదు గానీ తెలుగుదనం ఉట్టిపడుతోందిక్కడ! అందుకోసమైనా రాయాలనిపించి రాస్తున్నా.

ఇంతకీ గుర్తు పట్టారా?

సుజాత వేల్పూరి said...

పని ఒత్తిడిలో వ్యాఖ్యలకు వెంటనే స్పందించలేకపోయాను.

ప్రవీణ్ శర్మ,
మీరు అదృష్టవంతులండీ! రెండు చెట్లే మాగాయ చేసుకోడానికి? ఫ్రెష్ గా కూడా ఉంటాయి కదా! మా అపార్ట్ మెంట్స్ తోటలో కూడా మామిడిచెట్లున్నాయి కానీ అన్ని కాయలు కాయడం లేదు ఇంకా!

వేణు,

థాంక్యూ! మీ తులనాత్మక వ్యాసం మీరు రాద్దురూ! చదివి పెడతాం!నూజివీడు రసాలు అక్కడినుంచి పంపేవారుంటే నాకేం? హాయిగా అవే పెట్టేస్తా!ఆ ఏర్పాట్లేవో చూడండి.

"అనవసరంగా సలహా ఇచ్చి ఇరుక్కుపోయాను" అనే మీ డైలాగ్ ఇక్కడివరకూ వినపడుతోంది మరి!

సుజాత వేల్పూరి said...

సౌమ్య, బులుసు గారు, శంకర్ గారూ మీరంతా నా బజ్ లో చేసిన యుద్ధాలు తల్చుకుంటే చచ్చేంత నవ్వొస్తుంది.

నాకు సపోర్ట్ గా వచ్చినందుకు మీకు మాగాయ పార్సిల్ పంపుతాను! ఏలూరుకేగా!

తృష్ణ,
టెస్టా పాడా? అదేమే లేదు. మీ వంటలు చూస్తుంటే మా ఇంట్లో రుచుల్లాగే అనిపిస్తాయి, అందుకే మిమ్మల్ని అడిగాను. మొత్తానికి మీరూ మాగాయ పార్టీయే! థాంక్సు!

సుజాత వేల్పూరి said...

సుధగారూ,చాలా సంతోషం... మీరూ మా(గాయ)పార్టీయే సుమా! మాగాయకు లైఫ్ ఎక్కువ! అందుకే దాంతో ఇంకా అనేక రకాలు చేసుకోవచ్చు కూడా!మాగాయ ఉపయోగాలు బాగా గుర్తు చేశారు థాంక్యూ!

లచ్చిమి,
చాలా రోజులకు కనిపించావు. నీ ముఠా మేస్త్రీ పని ఎలా ఉన్నా, సరదాగా నాలుగు బ్లాగులు మాత్రం రాస్తూ ఉండాలి. దగ్గర్లో ఉంటే వచ్చి పట్టుకెళ్ళు ఆవకాయ మాగాయ రెండూనూ!

కృష్ణ ప్రియ గారు, మీరు మాగాయ దాచను కూడా దాచారా? అయితే మీకు మాగాయారాధ్య బిరుదు ఇవ్వాల్సిందే!

బులుసు గారు, మీ పద్యం అదిరిపోయింది. రాయల వారు లేచి పరుగెత్తుకు రావల్సిందే "ఎవర్క్కడ, మాగాయ వడ్డించే ఏర్పాటు చూడండి" అంటూ!

సుజాత వేల్పూరి said...

కిరణ్మయి,

అవునుతల్లీ ఈ ఫొటోలు మా ఇంట్లో ఆవకాయ ప్రిపరేషన్ మాగాయ జాడీలవే! ఫణిబాబు గారు మా ఇంటికొచ్చినపుడు పెద్దగా ఏమీ చేయలేదండీ! అదంతా వారి అభిమానం అంతే! సరే ఇంతకీ మీకేం కావాలో చెప్పండి. పంపిస్తాను పోనీ!

పచ్చళ్ళు పెట్టడం చాలా శ్రమ! పాపం పెద్దవాళ్ళు ఎలా పెట్టారో అంతంత మొత్తాల్లో! అందుకే నా వంతుగా వాళ్ళకి కష్టం తగ్గించాలని నేనే ట్రై చేశా! గొప్ప హిట్ కాకపోయినా ఓ యాభై రోజులాడేలా కుదిరాయి!

కొత్తావకాయ,

మీ బ్లాగు పేరే మహ ఘాటుగా ఉంది. అలా ఒక టూరేసి వచ్చాను.మరింత బాగుందనిపించింది.

నేనేమనుకోను? గుంటూరమ్మాయిని తెచ్చి వెస్ట్ గోదారిలో పడేశారు నన్ను! మా వెరైటీలు వీళ్లకి వింత! వీళ్లవి నాకు కొత్త! ఎలాగో పుష్కరం దాటింది కదాని లాక్కొస్తున్నా!

మీ పద్య రత్నాలతో కొంత వరకూ ఏకీభవిస్తున్నాను. రెండూ సమానమే కానీ మాగాయ కాస్త ఎక్కువ సమానం, శంకర్ గారు నా బజ్ లో చెప్పినట్టు

సుజాత వేల్పూరి said...

లోక్ నాథ్ గారూ, నేను ఆంధ్ర ప్రదేశ్ పత్రికకు పని చేయలేదండీ!కొన్నాళ్ళు వార్త దినపత్రికలో పని చేశానంతే

సుజాత వేల్పూరి said...

మురళి గారు,

మాగాయను ఎందుకు సపోర్ట్ చేయాలని ఎవరైనా ఆవకాయ ప్రియులు అడిగితే మీ వ్యాఖ్య చూపిస్తే చాలనిపిస్తోంది. అంత వివరణాత్మకంగా ఉంది. మామిడి రుచి అంతా మాగాయలోనే కానీ ఆవకాయ కు వర్తించదని చల్లగా చెప్పారు.

థాంక్యూ!

వి.ఫ్రా గారు
మీ బ్లాగు (సముద్రం) చూశాను. చక్కని సామాజిక స్పృహ తో రాసిన కవితలు కనిపించాయి. మీలాంటి సీరియస్ బ్లాగర్ కి ఈ సరదా పోస్టు నచ్చిందంటే సంతోషమే! తెలుగు దనం కనపడిందంటే మరింత సంతోషం!

ఇందు said...

అయ్యో! సుజాతగారూ...వెకేషన్ గొడవలో పడి అసలు బ్లాగులు చూడట్లేదు...మీ పోస్ట్ మిస్ అయ్యా!

అందరు భలె..భలె పాటలు...పద్యాలు రాసేసారే! :)) అయినా మా ఆవకాయ్ ముందు మాగాయా లేదు...తొక్కుడు పచ్చడీ లేదు...

ఆవకాయే మహా పచ్చడి :))మా ఆవకాయని ఇంతలేసి మాటలంటుంటే....ఇక్కడ వెన్నపూసలో ఆవకాయ నంజుకుని తింటాను అని నా బ్లాగులో బోలెడు కామెంట్లు పెట్టినవారందరు ఏరబ్బా??? హ్మ్!

కాని మీ పోస్ట్ అదిరింది :) నాకు బాగ నవ్వొచ్చింది మీవారు ఆవకాయ తినే విధానం....మీ అత్తగారి కాళ్ళకి దణ్ణం పెట్టి ఆవకాయ పెట్టడం :)))

Sravya V said...

చాల లేటు గా చూస్తున్న ఈ పోస్టు భలే రాసారు !
ఇక్కడ ఆవకాయ ని మెచ్చుకునే వాళ్ళందరికీ మాగాయ పచ్చడి రుచి తెలియదు అంతే ! ఎందుకంటే ఇది నా స్వానుభవం మాగాయ పచ్చడి రుచి చూసేవరకు ఆవకాయ మహ గొప్ప గా అనిపించేది , ఒక్కసారి తన రుచితో మాగాయ నా మాయ రుచి పొరలని తెరిచి మాగాయ గొప్పతనం అనే జ్ఞానాన్ని ప్రసాదించింది . ఇక్కడ ఆవకాయ ప్రియులు కు కూడా త్వరలో ఈ జ్ఞానాన్ని ప్రసాదించమని మాగాయ ని ప్రార్దిస్తున్నా :)))))

సుజాత వేల్పూరి said...

ఇందూ, ఇప్పుడే నీ పేరు పట్టుకుని పోయి నీ చిరుజల్లుల వేళ-ఆవకాయ హేల పోస్టు చూశాను. హమ్మ హమ్మ, అందుకేనేమో ఆవకాయ గొప్పల్ని ఎగరగొట్టాలనే ఈ టపా రాశానేమో అనిపించింది. వెన్న నంచుకు తింటావా ఆవకాయలో బంగారం? మనది గోదారి జిల్లానా ? అదీ సంగతి. మా ఇంట్లో కూడా ఈ గోదారి మనిషి ఫ్రెష్ వెన్న ఉంటే జాడీ ఖాళీ చేస్తాడు తెల్సా!

శ్రావ్య,

మొత్తానికి మీరూ మాగాయ మనుషులే! మాయ పొరలని తొలగించుకుని మరీ మీరు జ్ఞానం పొందారు,పైగా ఏకంగా మాగాయనే ప్రార్థిస్తున్నారు ఆవకాయ ప్రియులకు మాగాయ రుచి తెల్పమని! మీరే వీర మాగాయాభిమాని!

నేస్తం said...

నేనూ మాగాయ అభిమానినే ... అంటే ఆవకాయ కూడా ఇష్టమేకాని మాగాయంటే కొంచెం ఎక్కువ ఇస్టం

శ్రీ said...

అబ్బా..మీ టపా ఎలాగుందంటే అర్జెంటుగా కంచంలో అన్నం వేసుకుని మాగాయ ఫోటో చూస్తూ, అహ నా పెళ్ళంటలో కోటా లాగా, తినాలనుంది!

ప్రభాకర్ said...

పోస్ట్ సూపరు ...
"అత్తగారు ఈ ఎండల్లో ఢిల్లీ వెళ్ళారు(బాడ్ టేస్టు)" ఇది అక్షర సత్యం..

BVJ said...

బులుసుగరూ, మాగాయ పెరుగు పచ్చడి గుర్తుచేసినందుకు చాలా Thanks అండి. చిన్నప్పుడు, అదను దొరికితే చాలు వేడి వేడి అన్నంలో ఆవకాయ కలుపుకొని, పేరుకునెయ్యి, వెన్న, పెరుగు మీద మీగడలతొ ....నా సామి రంగా ...తొక్కుడే తొక్కుడు ...చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరకు రసాలు లాంటి మామిడిపండ్ల combination వుంటే ఇక చెప్పే పనే లేదు. కాని తరువాత నెమ్మది నెమ్మదిగా మాగాయ మీద ఇష్టం పెరిగి, పెద్దదయ్యి ...settle అయిపొయింది. My first preference is మాగాయ. మిగతావన్నీ పక్కన పెడితే, ఆవకాయ కన్నా, మాగాయి తిన్న తరువాత పొట్టలొ చొంఫొర్త్ ఎక్కువ; మాగాయతో, వేడి చెయ్యటం లాంటి problems లేవు :-).

సుజాత వేల్పూరి said...

నేస్తం, మీరు కూడానా! రైఠో! ఏమిటో, మన మాగాయ బలగం బాగా పెరిగిపోతోంది!:-))

శ్రీ గారు,ఏమిటి? మీకీ ఏడాది మాగాయ ఆవకాయలు లేవా అక్కడ?

ప్రభాకర్ గారూ,
థాంక్యూ! ఢిల్లీ ఎండకు నాకు పరిచయమే నండీ! అందుకే బాడ్ టేస్ట్ అన్నా!

BVJ, బులుసు గారిది మీ వూరే! అందుకే మాగాయ పెరుగు పచ్చడి గుర్తు చేశారు మరి!

Sravya V said...

హ హ సుజాత గారు అచ్చు మాగాయ లాగా మీ పోస్టు కూడా రోజులు గడిచేకొద్దీ రుచి సంతరించుకొని మన బలాన్ని పెంచుతుంది :)))))))))))))

Hemalatha said...

ఘుమ ఘుమలు ఎక్కడబ్బా అనుకుంటున్నా. బాగుంది సుజాత గారూ!

సుజాత వేల్పూరి said...

శ్రావ్య, కరెక్టే! పొద్దున ఎవరో సరిగ్గా ఇదే మాట అన్నారు, "మీ పోస్టు కూడా మాగాయ లాగే రోజులు గడిచే కొద్దీ ఘుమ ఘుమలాడుతోంది" అని!:-))

హేమలత గారూ, మరైతే వచ్చేయండి భోజనానికి! :-))

సరళ said...

అబ్బ ఇది చదివినప్పట్నుంచి వేడి వేడి అన్నం లొ నెయ్యి మాగాయ కలుపుకుని తినాలని ఎంత కోరిగ్గ ఉందో ...అన్నం అంత అయిపొయ్యాక మాగయ బుగ్గన పెట్టుకుంటె వుంటుంది ప్చ్.. (నాకు చిన్నప్పట్నుంచి పచ్చడిలో ముక్కలు కడుక్కుని తినడం చాలా ఇష్టం)

సుజాత గారు నోరూరించేస్తున్నారు...

సుజాత వేల్పూరి said...

బాలూ గారూ, మీ మాగాయ వ్యాఖ్య ఇంతకు ముందు టపాలో పెట్టారు పొరపాటున. సరే, పర్లేదు గానీ నీళ్ళ మాగాయ రెసిపీ మాత్రం అర్జెంటుగా పెట్టేయండి. మామిడి కాయలు, ఎండలూ పోయే లోపుగా! నీళ్ళావకాయ విన్నా కానీ నీళ్ళ మాగాయ పేరు ఇప్పుడే వింటున్నా

ఇందు said...

అయ్యోరామా! చంపేశారు! నాది గోదారి కాదు ;) అచ్చమైన గుంటూరు అమ్మాయిని! మిరపకాయలమీద+గోంగురమీద ఒట్టు :)) మా చందుది మాత్రం..తూర్పుగోదారి! ఆ అంటే...పంచదారా....ఊ అంటే బెల్లం! హుహ్! ఏంచేస్తాం!! అవును!! నాపోస్టుకి కౌంటరు పోస్టులా ఉంది మీది :(( దీన్ని నేను ఆ.అ.స [ఆవకాయ్ అభిమానుల సంఘం] నించి ఖండఖండాలుగా ఖండించేస్తున్నా ;)

రామ said...

లేటు గా వచ్చా కాని, ఏదో ఒకటి తెద్దాము అని "మాగాయ పచ్చడి" చేసే విధానం తెచ్చా..
దోసెడు మాగాయ, నాలుగు గరిటెల పెరుగు, రెండు పుంజీల పచ్చి మిరపకాయలు - మిక్సీ లో వేయుట, ముద్దగా తిప్పుట (ఇంకా ఉప్పు వద్దులెండి - మాగాయ లో బోలెడంత ఉంటుంది కదా)
మీకిష్టంఐతే పది కొత్తిమీర మొక్కలు అందులో పడేయ్యచ్చు. దానిలో మెంతులు, ఆవాలు, ఇంగువ, ఎండు మిరపకాయలు వేసి పోపు పెట్టేసి, ఫ్రిజ్జి లో పెట్టి రెండు రోజులు మరిచిపోయినట్టు నటించి మూడో రోజు తీసి తింటే .... ఇంకంతే.

పూర్ణప్రజ్ఞాభారతి said...

చాలా లేటుగా ఈ పోస్టు చూశా. అందుకే నా స్పందన ఇంత లేటు. మన్నించగలరు
ఆవకాయ అందరిదీ
మాగాయ కూడా మనదేలే
ఎందుకే రాధ ఈసునసూయలు
అన్నీ నూనెలో మునిగేవే
(ఎ.ఎం. రాజారి ధాంక్స్ తో)

పూజ్యాయ మాగాయా ఆవకాయ బ్రదరాయచ
మజ్జిగతో మహా టేస్టాయా, ఐ లవ్యూ మాగాయా

ఆవకాయ మా అమ్మలాంటిది, మాగాయ మా అమ్మమ్మలాంటిది.
(నేను అమ్మమ్మ దగ్గర పెరిగానులేండి)

Anonymous said...

మాగాయ భాగవతంలో మఱో స్కంధం :

మా నాన్నగారు పాతమాగాయతో మిళుసు అనే ఒక రకం ఆధరువు చేసేవారు. అంటే మాగాయని పెరుగులో లైట్ గా కలిపి ఆ మిశ్రమంలో మళ్ళీ పోపువేసి ఇడ్లీ, దోసె, వడ. ఉప్మాలాంటి అల్పాహార విందుల్లో కలుపుకోవడానికి ఉపయోగించేవారు. నెయ్యి కూడా వేసుకుని తింటే బావుంటుంది. నేనిప్పుడా ఆధరువు చేయడం మా ఆవిడక్కూడా నేర్పి అల్పాహారాలు ఎంజాయ్ చేస్తున్నాను. పాత మాగాయే కాదు కొత్తమాగాయ కూడా ఇందుకు పనికొస్తుంది.

సుజాత వేల్పూరి said...

పూర్ణ ప్రజ్ఞా భారతి గారూ.

పూజ్యాయ మాగాయా....చాలా రుచిగా ఉంది.
నిజానికి ఏ ఊరగాయ తిన్నపుడు దాని పార్టీ మనం! ఆ మాటకొస్తే చింతకాయ కేం? ఉసిరావకాయకేం?దబ్బకాయకేం? బేసిగ్గా పచ్చళ్ల ప్రాణిని నేను. వంద కూరలున్న రోటి పచ్చడి/ఊరగాయ లేక పూతే ముద్ద దిగందే!!

తాడేపల్లి గారూ,
మాగాయలో పెరుగు కలిపి పోపు పెట్టడం మా ఇంట్లో కూడా చేస్తాము. దాన్ని మాగాయ పెరుగు పచ్చడిగా వ్యవహరిస్తుంటాం.

Manasa Chamarthi said...

సుజాత గారూ,

పాత పోస్టే అనుకోండీ, మాలికలో మీ బ్లాగ్ పేరు కనపడితే మళ్ళీ ఈ ఏటి విశేషాలు రాసేరేమోనని ఆత్రంగా వచ్చాను. :) పోస్ట్ మాత్రం నిరాశపరచలేదు. ఒక్కసారిగా నాకూ నా కాళ్ళ మీద నేను నిలబడాలన్నంత ఆవేశం వచ్చింది. నేనూ మీలాగే అద్భుతంగా ఆవకాయ, మాగాయా పెట్టేసినట్టూ మా అక్క "నాక్కూడా నువ్వే పెడతావా ప్లీజ్" అని అడిగినట్టు పగటి ఊహలు కూడా తోడొచ్చాయ్! :)
అది జరిగే పని కాదు కానీ, మా వారిదీ గోదారే. ఈ వెన్నపూస ఆత్రం ఆ జిల్లా అందరికీ ఉంటుందా, మా ఇంట్లో కూడా వెన్న అరక్షణం మిగలదు ఈ పచ్చళ్ళు కనపడితే. :( . మాగాయ పెరుగుపచ్చడి మా ఇంట్లోనూ, అత్తవారింట్లోనూ కూడా రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం.
మీరు రాసే ఈ సరదా కేటగిరీ టపాలు నాకు భలే ఇష్టం. పక్కనే కూర్చుని ఇష్ట సఖి చెప్పిన కబుర్లలా ఆహ్లాదంగా ఉంటాయి.

ఇంతకీ అసలు విషయం - నేనూ మాగాయ అభిమానినే! :)

రామ్ said...

సరదా కబుర్లు చాలా బాగున్నాయని.... రివిజన్ కూడా చేసేసామనీ -ఈ కేటగిరి లో ఈ మధ్యన కొత్తవి రాలేదనీ ,మరిన్ని కావాలనీ ... నార్వే నించి రాముడు, సోముడు , భీముడు - నూజివీడు నుంచి అమల , కమల, విమల మరియు వారి కుటుంబ సభ్యులు రాస్తున్నారు

రామ్ said...

సరదా కబుర్లు చాలా బాగున్నాయని రివిజన్ కూడా చేసేసామనీ -ఈ కేటగిరి లో ఈ మధ్యన కొత్తవి రాలేదనీ ,మరిన్ని కావాలనీ ... నార్వే నించి రాముడు, సోముడు , భీముడు - నూజివీడు నుంచి అమల , కమల, విమల మరియు వారి కుటుంబ సభ్యులు రాస్తున్నారు

Post a Comment