మేమూ బాపూ బొమ్మల కొలువు పేరంటానికెళ్ళి వాయినం పుచ్చుకుని వచ్చాం! పైగా నిన్న ఎస్పీ బాలూ, ఏవీయెస్ ,శేఖర్ కమ్ముల,జనార్దన మహర్షి వంటి వాళ్ళతో కల్సి కూచుని కాసేపు బాపూ నామస్మరణ చేసుకున్నాం! కీర్తి కండూతి అస్సలు లేనందుకు బాపూని, ఆయనకు కీర్తి కావాల్సిందేనని దెబ్బలాడని తెలుగు వాళ్ళనీ(అంటే మనల్నే) కాసేపు తిట్టుకుని నిష్టూర పడ్డాం!
"అసలేమిటీ మనిషి"అని అని విస్తుపోయాం!
శ్రీరామ రాజ్యం సినిమా షూటింగ్ లో ఏవీయెస్ గారు బాపూని "దీని తర్వాత మీ ప్రాజెక్ట్ ఏమిటి సార్" అనడిగితే "ఇహ నేను చేయలేమోనయ్యా, నా వల్ల కాదేమో" అన్నారట!
"ఎందుకు సార్, ఓపిక లేదా?"
"రమణ లేడుగా!"అన్నారట డస్సిపోయి!
ఏవీయెస్ చెప్తుంటూనే అక్కడ ఉన్న వాళ్ళ హృదయాలు బరువెక్కిపోయాయి ఈ మాటకి.
జనార్దన మహర్షి ఒక మంచి మాట చెప్పారు. "మీడియా ఛానెళ్ళ వాళ్ళు,అయిన దానికీ కానిదానికీ ఎస్సెమ్మెస్ లు పంపించమంటుంటారు. అలాగే ఇన్ని కోట్ల ఆంధ్రులం ఉన్నాం, "మా బాపూకి గౌరవం,గుర్తింపు కావాల్సిందే" అని తెలుగు వాళ్ళంతా కల్సి ఒక ఉద్యయం లేవదీయాలి. లేవ తీద్దాం కూడా! ఎందుకు సాధ్యం కాదో నేనూ చూస్తాను"అన్నారు ఉద్వేగంగా!
ఏవీయెస్ ఒక చిన్న ఊహాత్మక సంఘటన చెప్పారు.ఒకరోజు ఆయన అర్థ రాత్రి టాంక్ బండ్ మీదుగా వస్తుంటే ఒక స్త్రీ తెలుగు తల్లి విగ్రహం దగ్గర కూచుని భోరున ఏడుస్తోందిట. ఈయన జాలిపడి ఎవరమ్మా నువ్వు?ఎందుకేడుస్తున్నావు?నీ పేరేమిటి? అనడిగితే ఆవిడ "నా పేరు పద్మండీ! ఢిల్లీలో వాళ్ళు నన్ను పెంచుకుంటున్నారు! అర్హత ఉన్నా లేకపోయినా ఎంతోమందిని ఆవహించాను గానీ ఈ బాపు అనే వ్యక్తిని మాత్రం చేరాలని ఎంత ఉత్సాహ పడుతున్నా ఆయన దగ్గరికి నన్ను వెళ్ళనివ్వడం లేదు. ఆయన నన్ను కోరడు. నేనే ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్తానా అని ఏడుస్తున్నా"అందిట! ఆ స్త్రీయే పద్మ అవార్డు!
అద్భుత చిత్ర ప్రపంచంలో ప్రతి దాన్నీ ఆస్వాదిస్తూ చూడాలంటే ఒక ఏడాది కావాలి. అది కుదర్దు కాబట్టి గంటల్లోనే ముగించుకుని, నచ్చిన వాటిని భద్రపరుచుకున్న్నాం! మా ఇంటికి దగ్గరే కావడంతో ఎక్కువ సేపూ ఉండగలిగాం, ఇల్లు ఎప్పుడు చేరాలో అనే బెంగ లేకుండా !
బొమ్మల కొలువుకి వచ్చిన అపూర్వ స్పందన వల్ల దీన్ని వచ్చే శనాదివారాలు కూడా (జూన్ 11,12 తారీకుల్లో) సందర్శకులకు అందుబాటులో ఉంచుతారట. మిస్ అయ్యామని బాధ పడేవారు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడొచ్చు!
28 comments:
ఎంత అదృష్టవంతులండీ...తొమ్మిదేళ్ళు భాగ్యనగరంలో ఉన్నాను, ఒక్కనాడూ ఇలాంటి భాగ్యం పట్టింది కాదు.
‘నను గోడలేని చిత్తరువుని చేసి
వెళ్ళిపోయిన నా వెంకట్రావు
కోటి కోట్ల జ్ఞాపకాలకు
సభక్తికంగా ’ .......ప్చ్ కన్నీళ్ళు వస్తున్నాయి. :(
అబ్బ, మీరూ నిన్ననే వచ్చారా? మేమూ ఆఖరి రోజే కదా అని నిన్నే తీరిక చేసుకుని వెళ్ళాము కానీ బాలూ గారి ప్రోగ్రాం వరకూ ఉండలేకపోయాం!
మీకు ఎంతైనా ఇలాటి కార్యక్రమలంటే బాగా శ్రద్ధండీ బాబూ! మీ పాపను కూడా తీసుకెళ్ళి, ఆ ప్రోగ్రాం అయ్యేవరకూ ఉన్నారా?
బొమ్మల కొలువు మాత్రం అద్భుతంగా ఉందండి! మీరన్నట్టు మొత్తం ఆస్వాదించాలంటే ఒక ఏడాదేం ఖర్మ, ఇంకా ఎక్కువే పడుతుంది. నాట్యరీతులు, గంగావతరణం, శివ కేశవం,షోడశ ద్వాదశి,
కథలకు ఆయన వేసిన బ్లాక్ అండ్ వైట్ బొమ్మలు, రాముడూ కృష్ణుడు ఇద్దరినీ నడిపిస్తున్న గాంధీ,ఇలా అన్ని బొమ్మలూ దాచుకోవలసినవి గానే కనిపించాయి. మీ బ్లాగ్ వల్ల తెల్సింది, వచ్చే వీకెండ్ కూడా ఉంటుందని! థాంక్యూ! మళ్ళీ ఇంకోసారి వెళ్తాను. తనివి పూర్తిగా తీరలేదు
మీ ఆవేదన సహేతుకమైనదే! మన వాళ్ళలోని ఆణిముత్యాలను మనమే గుర్తించలేని, గుర్తించినా గౌరవించలేని అభాగ్యులం మనం! బాపూ రమణలకు పద్మశ్రీ కాదు, వారి ప్రతిభకు పద్మభూషణ రావలసింది ఈ పాటికి! లాబీయింగులు, పైరవీలు చేసేవారు లేక ..ఆ అవార్డులు అలా మిగిలిపోయాయి.పద్మ ఏడ్చిందంటే ఏడవదూ?
అయినా మరేం పర్లేదు, వారి వల్ల అవార్డులకు గౌరవమే కానీ అవార్డుల వల్ల వాళ్ళకు కాదు!
బాగా రాశారు, కేవలం బొమ్మలు మాత్రమే చూసొచ్చి ఫొటోలు పెట్టకుండా,బాపూ గారి గురించి నాలుగు మంచి మాటలు చెప్పిన వాళ్ళను విని ఇక్కడికొచ్చి పంచుకున్నారు. ఫొటోలు ఎవరమైనా పెడతాంలెండి!
సుజాతగారూ!
భలే తీశారండీ ఫొటో, మీ అమ్మాయిని సరిగ్గా నా కథకి వేసిన బొమ్మ దగ్గర నిలబెట్టి. నాకు వెళ్ళడం కుదర్లేదు. మా పిల్లలు వెళ్ళొచ్చారు. వచ్చే వారమన్నా వీలవుతుందేమో చూడాలి.
సుజాతగారూ!
భలే తీశారండీ ఫొటో, మీ అమ్మాయిని సరిగ్గా నా కథకి వేసిన బొమ్మ దగ్గర నిలబెట్టి. నాకు వెళ్ళడం కుదర్లేదు. మా పిల్లలు వెళ్ళొచ్చారు. వచ్చే వారమన్నా వీలవుతుందేమో చూడాలి.
వావ్! అద్భుతంగా ఉన్నాయ్ పిక్స్! చూస్తేనే కడుపు నిండిపోతుంది! నాకు ఎప్పటినించో ఆశ! బాపుగారి ఆర్ట్ ఎక్జిబిషన్ పెడితే వెళ్ళి నచ్హ్చిన బొమ్మలు కొనేసుకుని ఇల్లంతా అలంకరించేయాలని! గుంటూరు 'వెంకటేస్వర విఙ్గ్నాన మందిరం'లో నవరసాల బాపుబొమ్మలు ఉంటాయి కదా...చిన్నప్పటినించి అవి చూసి...చూసి...ఎంత ఇష్టంపెంచేసుకున్ననో! హ్మ్! ఎప్పుడు చూస్తనో స్వయంగా నేను! :(
వేణూ, అవునండీ బాపూ మాటలు తల్చుకుంటే బాపూకేమో గానీ నాకు మాత్రం గుండె లో కలుక్కుమంది.
"గోడలేని చిత్తరువు.."బాధలో కూడా ఎంత కవితాత్మకంగా చెప్పారో చూడండి
నీలాంచల,
అవునండీ, నిన్న సాయంత్రం తీరిగ్గా వెళ్ళాము! చెప్పానుగా మా ఇంటికి దగ్గరే అవడం వల్ల కాస్త చల్ల బడ్డాక వెళ్దామనీ!ప్రోగ్రామ్ అయ్యేవరకూ ఉన్నామండీ!
అక్కడ ప్రతి బొమ్మా కోట్ చేసి రాసుకోవాల్సిందీ దాచుకోవలసిందీనూ! మీరన్నట్టు ఏడాది కాదు, ఇంకా ఎక్కువే పడుతుంది.
నేనూ వచ్చే వీకెండ్ ఇంకోసారి వెళ్దానుకుంటున్నా మళ్ళీ! మళ్ళీ మళ్ళీ రావు కదా ఇలాంటి అవకాశాలు!
సౌమ్య, ఇలాంటి అదృష్టాలు హైద్రాబాదులో వాళ్ళకి అపుడప్పుడూ పడుతూ ఉంటాయి. వీటిని మిస్ చేసుకోవడం ససేమిరా నా వల్ల కాని పని! ఎంత దూరమైనా వెళ్లడానికి రెడీ!
కిరణ్ కుమార్ గారు,
నిజమే! అవార్డులకు వారి వల్ల గౌరవమే కానీ వారికి అవార్డుల వల్ల గౌరవమేమిటి? ఇంతకీ మీరు ఇక్కడే ఉన్నారా? ఉంటే____చూశారా బొమ్మల కొలువు!
రాధిక గారూ,
కథలకు వేసిన బొమ్మల దగ్గర నాకు చాలా చాలా సమయం పట్టేసిందండీ! ప్రతి బొమ్మా పరిశీలనగా చూస్తూ కథను ఊహించడానికి సరదా ప్రయత్నం చేశాను.
మీ కథకు బాపు బొమ్మ వేశారంటే, తన స్వహస్తాలతో మీ పేరు రాశారంటే మీ అదృష్టానికి కుళ్ళిపోతున్నా ఇక్కడ!
ఇందూ,
ఈ ప్రదర్శనలో కూడా నచ్చిన బొమ్మలని ఎన్నుకుంటే వాటిని కావలసిన సైజులో ఎన్ లార్జ్ చేసి ఫ్రేమ్ చేసి ఇచ్చే సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.
ఈ ఏర్పాటు నవోదయ బుక్ స్టోర్స్ వద్ద కూడా ఉంది. మా ఫ్రెండ్స్ కొంతమందికి అక్కడే నేను బాపు పెయింటింగ్స్ ఫ్రేమ్ చేయించి ఇచ్చాను. ఈ సారి ఇండియా వచ్చినపుడు అక్కడ ప్రయత్నించండి. బాపూ బొమ్మలన్నీ ఒకే చోట దొరికే బుక్ హరివిల్లు! అందులో కూడా ఈ వివరాలు ఉన్నాయి
ఎంత చూసినా తనివి తీరని బొమ్మలు ఇవి! అసలు ఇంత బాగా ఎలా వేస్తరు అని ప్రతి బొమ్మకీ ఆశ్చర్యపోవాలనిపించేలా ఉంటాయి. మంచి బొమ్మలు పెట్టారు, అంతకంటే మంచి టపా రాశారు. థాంక్యూ!
ఫొటోలో ఉంది మీ పాపా? బాపూ బొమ్మ లాగే ఉంది.
Sujata garu,
Thanks a lot! nenu velli choosivachhinantasantosham kaliginidi! oka chinna help chesipettandi, malli vellinappudu, nannu manasulo taluchukoni(naa peru sreedevi!) mari choodand, malli choosivachinnatu feel avuta, nijamga chala chala thanks! Bapu gari bommalu ennisarlu choosina,roju choostunna kuda taniviteeradu..thanks again..
తెలుగోళ్ళ ట్యాలెంటికి ప్రజలిచ్చే గౌరవాల సంగతేమోగానీ, కులం,బలం,మందీమార్బలం లేకపోతే మాత్రం ప్రభుత్వం ‘పద్మ’ సత్కారాలకు రెకమండ్ చెయ్యదు. SPB లాంటోడికి కూడా తమిళనాడు నామినేట్ చేస్తే వచ్చిందేగానీ, మనోళ్ళుచేశారా!? భానుమతికీ అంతేగా! మనమింతే.
ఏంటి పద్మసత్కారాలకు కూడా కులం యాంగిల్ ఉందా అని తిట్టుకోకండి! అదే unfortunate నిజం మన రాష్ట్రంలో.
బాపూకి అవార్డు ఒక ఉద్యమంగా చెయ్యాలన్నారు జనార్థన్ మహర్షి...నేను రెడీ! ఏంచేద్దాం చెప్పండి.
ఎందరో మహానుభావులు.. ఒప్పుకోదగ్గమాట..
కాని ఆ మహానుభావులలో మహానుభావులు శ్రీ బాపుగారు.
వారి చిత్రాలలోని అందాన్ని ఆస్వాదించడమన్నంత అదృష్టం చేసుకోవడం తెలుగువారు చేసుకున్న పూర్వపుణ్యఫలం.
మంచి చిత్రాలు పెట్టారు. అక్కడి విశేషాలు బాగా చెప్పారు. ధన్యవాదాలు.
@ మహేష్ కుమార్: బాపుకైనా, మరెవరికైనా పద్మ అవార్డు తెప్పించటం కోసం ఉద్యమం చేయాల్సిరావటం ఘోరం కాదా? ‘కులం,బలం, మందీమార్బలం లేకపోతే మాత్రం ప్రభుత్వం ‘పద్మ’ సత్కారాలకు రెకమండ్ చెయ్యదు’ అని మీరే అంటున్నారు. అలాంటి అవార్డు వస్తే ఎంత? రాకపోతే ఎంత! బాపూ రమణలకు ఆ అవార్డేదో రాలేదని మనకెందుకూ బాధ!
ఉద్యమాలతో గానీ రాని అవార్డులకు ఏం విలువుంటుంది? బాపూకి అదేమంత గౌరవం? అసలు ఆ స్థాయి కళాకారుడికి పద్మ అవార్డు రాకపోవటం ఈ అవార్డుల డొల్లతనాన్ని మహా చక్కగా నిరూపిస్తోంది. దీన్నో ప్రబల ఉదాహరణగా మిగిలిపోనిద్దాం!
మహేష్, నిజానికి ఈ అవార్డుల వల్ల బాపు ప్రతిభకు మరింత మెరుగు వస్తుందనో మరోటనో ఆశలు ఎవరికీ లేవు. ఒరిజినాలిటీ ఉన్న కళాకారుడు కళకోసమే బతుకుతారు తప్ప అవార్డులో కోసమో ప్రజల కోసమో కాదు. కానీ పద్మ అవార్డులు ప్రతిభకు గుర్తింపనీ మన అందరి మెదళ్ళలోనూ నాటుకుపోయింది కాబట్టి ఆయనకు పద్మ అవార్డు ఇవ్వాలనీ (అరె, చివరికి టాబూకి కూడా ఇచ్చేశారే) అది పద్మ భూషణ కి తగ్గకూడదనీ అనుకుంటున్నాం!
దీన్ని ఉద్యమంగా చేపట్టి బాపూకి ఆ గౌరవం దక్కేలా చేయాలన్నది, తద్వారా బాపూని మనమంతా గౌరవించుకోవాలని జనార్దన మహర్షి అభిప్రాయం! ఆయన ఏదో మెహర్బానీకి సభాముఖంగా ప్రకటించి ఊరుకుంటే చాలదు. మొదలెట్టాలి. అలా మొదలెడితే అందరం చేతులు కలపడానికి సిద్ధంగానే ఉంటారు.
ఏం చేయాలో ఆయన్నే అడగాలి.
వేణు గారూ, ఈ అవార్డులు ఆశించే వారే అయితే బాపూ రమణలు ఎప్పుడో సంపాదించుకోగలిగేవారు. వాళ్ళకి వాటి మీద దృష్టి లేదు కాబట్టే నిష్కామ కర్మగా వారి పని వారు చేసుకుంటూ పోయారు.
ఇక్కడ అవార్డు బాపూకి ఇవ్వాలని కోరుతుంది బాపూ కాదు. మనం! ఆయన బొమ్మల్ని విపరీతంతా అభిమానించే సామాన్యులమైన మనం! పద్మ అవార్డు వస్తే తప్ప ప్రతిభకు గుర్తింపు లేదని నమ్మే అభిమానులం! ప్రతి అడ్డమైన వాళ్లకీ ఇస్తున్నారే? ఇంతటి ప్రతిభను ఇక్కడ పెట్టుకుని ఆయనను గమనించడం లేదే అన్న బాధతో ఉద్యమించి అయినా అవార్డు తెప్పించుకోవాలని జనార్దన మహర్షి అన్నారని నేను అనుకుంటున్నా! లేక ఆయన దీన్ని కేవలం సభా మర్యాద కోసం ఎటువంటి మోటివ్ లేకుండా ప్రస్తావించి ఉంటే అక్కడే వదిలేద్దాం(అదే నిజమయ్యే సూచనలే ఎక్కువ ఉన్నాయి)
కులం, బలం, ఇతర ప్రాపకంతో సంపాదించుకునే అవార్డుకు పూచిక పుల్ల విలువ కూడా ఉండదు.
చివర్లో మీరన్న మాట బాగుంది.
అసలు ఆ స్థాయి కళాకారుడికి పద్మ అవార్డు రాకపోవటం ఈ అవార్డుల డొల్లతనాన్ని మహా చక్కగా నిరూపిస్తోంది. దీన్నో ప్రబల ఉదాహరణగా మిగిలిపోనిద్దాం!_________కానీ ఇందులోని చేదు నిజాన్ని అంగీకరించడానికి నా మనసు మొరాయిస్తోంది. బాపూ అభిమానుల గుండెల్లో ఎప్పటికీ సుస్థిరమైన స్థానమే సంపాదించుకున్నా ఆ స్థాయి కళా కారుడికి ప్రభుత్వం ఇచ్చే మర్యాద ఇదేనా అన్న బాధ మాత్రం తొలుస్తూనే ఉంటుంది
చిరంజీవి బాపు రమణ లకు పద్మ అవార్డు కోసం రెండు సార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది అంటే ఆ అవార్డుల కోసం ఎంత మంది డబ్బుతో, బలంతో లాక్కుంటున్నారో తెలుస్తుంది.
కిరణ్ ప్రియ,థాంక్యూ!
మా పాప పెద్దయ్యాక కూడా బాపు బొమ్మలాగే ఉండాలని కోరుకోండి!
సిరి, వచ్చే వీకెండ్ మళ్ళీ తప్పక వెళ్తాను. మీరు చెప్పిన పని చేస్తాను, నిజంగానే మీకు సంతోషం కలుగుతుందంటే!
శ్రీలలిత గారూ,
ధన్యవాదాలండీ! మీరు వెళ్ళలేదా బొమ్మల కొలువుకు! వచ్చే శనాదివారాలు కూడా ఉంచుతున్నారు. వీలు చేసుకోండి
విజయవర్ధన్ గారు,
చిరంజీవి ప్రయత్నించారా? ఈ సంగతి నాకు కొత్త!
అయినా కొందరికి ఇవ్వడానికి ఈ అవార్డులు సరిపోవండీ! నాగయ్య, కన్నాంబ,సావిత్రి, సూర్యకాంతం, ఎస్వీ రంగారావు గార్లకు కూడా పద్మ అవార్డులు రాలేదు. దీన్ని నేను They are above these awards అని interpret చేస్తాను.
ఈ అవార్డులు డబ్బు పెట్టగల ప్రతి వారికీ అందుబాటులోకి వచ్చినప్పుడే వాటికి విలువ లేకుండా పోయింది. వేణు గారన్నట్టు అలాటి అవార్డు వస్తే ఎంత రాకపోతే ఎంత?
ఇంత చెప్పుకున్నా "టబూకి, సైనా నెహ్వాల్ కి కూడా పద్మశ్రీ ఇచ్చారు. బాపు కి మాత్రం......" అని తల్చుకున్నపుడు గొంతులో ఏదో అడ్డం పడుతోంది.
ఎవరిమీదో తెలీని ఉక్రోషం వస్తోంది.
అవునండి. చిరంజీవి బాపు గారిని bio-data + profile పంపించమంటే, బాపు గారు ఇబ్బందిపడ్డారు. చిరంజీవి గారు బలవంతపెడితే బాపు గారు నా లాంటి వాళ్ళను ఆ పని చూడమన్నారు.
సైఫ్ అలీ కి కాజోల్ కీ ఇచ్చిన పద్మశ్రీ అవార్డ్లు మాత్రం చాలా ఫార్స్ అనిపిస్తుంది.
మీ వ్యాసం చదువుతుంటే నాకు చాలా జెలసీ గా ఉంది.. మా ఊళ్లో మకాం ఎత్తేసి హైదరాబాదుకి వచ్చేయాలని కూడా అనిపించింది. మీదీ, తృష్ణ గారి పోస్టులు చూస్తుంటే...
బాపూ బొమ్మలు కార్టూన్స్ భలే ఉంటాయి
ఎక్కడ చూడొచ్చు మనం 11 & 12 తారీఖులలో ?
పైన నా వ్యాఖ్యలో నాగయ్య గారికి కూడా పద్మశ్రీ ఇవ్వలేదని రాశాక ఆయనకు పద్మశ్రీ ఇచ్చారని గుర్తొచ్చింది.ఎవరైనా సరిదిద్దుతారేమో అని 2 రోజులు చూశాను. ఎవరూ సరిదిద్దలేదు. నాగయ్యగారికి పద్మశ్రీ రాలేదనే అనుకుంటున్నారన్నమాట! :-)))
కృషణ్ప్రియ గారు, అవి ఎంచక్కా డబ్బెట్టి కొనుక్కోవచ్చని తెలిశాక చాలామందికి ఇచ్చినవి ఫార్స్ గానే కనిపిస్తున్నాయి నాకు. బెంగుళూరులో ఉన్నపుడు నేనూ మీలాగే హైద్రాబాదు వాళ్ళని చూసి ఈర్ష్య పడుతుండేదాన్ని! అప్పుడప్పుడూ జేపీ నగర్ లోని రంగ శంకర థియేటర్ లో ఏమైనా ప్రోగ్రాములుంటే మిస్ కాకుండా వెళ్ళేవాళ్ళం!(అప్పట్లో మేము బన్నేర్ ఘట్ట రోడ్ లో IIMB వెనుక ఉండేవాళ్ళం)
అప్పారావ్ శాస్త్రి గారు,
మాదాపూర్ లో ఉన్న స్టేట్ గాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో ఉంది ఈ ప్రదర్శన! మాదాపూరు పోలీస్ స్టేషన్ ఎదురు రోడ్లో సెకండ్ రైట్ తీసుకుంటే ఎడమ వైపు ఉంటుంది.
సుజాత గారు. ఎంతో బాగుంది ఈ టపా. బాపు గారు, బాలమురళి వీరిరువురు ఉన్న కాలం లో మనం కూడా ఉండటం ఒక గొప్ప వరంగా నేను భావిస్తాను. బాపు గారికి అలాగే నేదునూరి గారికి పద్మ భూషణ్ ఇచ్చే రోజు కోసం ఎదురు చూస్తున్నాను.
జులై 1-3 (2011) తేదీల్లో శాంటాక్లారాలో జరగబోతున్న 18వ తానా మహాసభల్లో బాపు చిత్రకళాప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. కావలసిన బొమ్మలకు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంటర్నెట్లో http://bapuartcollection.com/ లో చాలా బొమ్మలు కొనుక్కోవచ్చు.
నిజమేఅండి...ఎందరో అర్ధం కాని చిత్రాలు వేసి, భారతీయతను అవహేళన చేసికూడ అవార్డులు, రివార్డులు గెలుచుకున్నారు. అలాంటిది బాపుగారికి స గౌరవం ఇవ్వలేదు అనిపిస్తోంది అవార్డుల రూపేణా!!
బాపు బొమ్మలాగానే బాపు లిపి కూడా చాల ఆసక్తికరంగా ఉంటుంది. ఎవరయినా ఆయన లిపిని తెలుగు ఫాంటుగా చేస్తే బావుణ్ణు.
ఎన్ని రకాల భావాలు మదిలో కదిలాయో మీ ఈ పోస్ట్ చదువుతుంటే.. చాలా చాలా బావుంది సుజాత గారు.. పద్మశ్రీ కోసం ఎస్.ఎం.ఎస్ లు నిర్వహిస్తే కనీసం టెక్నాలజీకి సార్ధకత లభిస్తుంది.. రనణ లేని బాపు. ఈ వాక్యం అనుకోవడానికే బాధగా ఉంది.. ఇంక ఆయనకెలా ఉంటుందో ఊహించవచ్చు. చాలా మంచి బొమ్మలు, మంచి పోస్ట్.. థాంక్ యూ..
Post a Comment