August 8, 2011

బ్లాగా? బజ్జా?





ఒకరోజు మెయిల్ బాక్స్ లో ఉన్న ఒకటో పదహారో మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉండగా ఎడమ పక్కన నాలుగు రంగుల్లో ఒక అర్థ వృత్తాకారం కనపడి ఏమిటాయని దాని మీద నొక్కాను. హాచ్చెర్యం, .....ఆలిస్ ఇన్ వండర్ లాండ్ లా ఫీలైపోయాను. అక్కడ మన వాళ్ళు (అంటే బ్లాగర్లు) హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. హోరినీ ఇదేవిటా అని ఆరా తీస్తే దాన్ని బజ్ అంటారని తెల్సింది.

కొద్ది రోజులూ వాళ్లవీ వీళ్లవీ బజ్జులు చదివి నేను ఒక చిన్న కొటేషన్ బజ్జులో రాసినట్టు గుర్తు!దాన్ని నలుగురో ఎంతమందో లైక్ చేయడం, ఇద్దరో ముగ్గురో కామెంట్లు రాయడం ఇలాంటిదేదో జరిగింది. తర్వాత మరీ ఎక్కువగా కాకపోయినా అడపా దడపా బుల్లి సైజులో బజ్జులు రాశా నేను కూడా! రాస్తున్నా!

కానీ ఈ మధ్య చాలామంది బజ్జులొచ్చి బ్లాగుల్ని పడగొట్టాయని,బజ్జుల వల్ల బ్లాగుల్లో కామెంట్లే లేకుండా పోయాయని విచారం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంత వరకూ కరెక్టే!

ఈ మధ్య నేను రాసిన ఒక బజ్జులో మిత్రులమంతా దూరదర్శన్ కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటూ జ్ఞాపకాల పూలు ఆఘ్రాణిస్తూ ఉండగా తాడేపల్లి గారొచ్చి "ఇక్కడ కాలక్షేపం బాగానే అవుతుంది కానీ అక్కడ మీ బ్లాగు బజ్జుంది చూశారా?" అని చనువుతో కేకలేశారు.

మరో ఫ్రెండ్ ఈ మధ్య "ఏమిటండీ, ఈ మధ్య మీరసలు బ్లాగు రాయడం లేదు? ఫలానా బ్లాగర్ చూడండి, రోజూ ఏదో ఒక అంశం మీద టపాయిస్తారు?" అని దబాయించారు. ఇక్కడే చెప్తున్నా జవాబు.."నేను ఫలానా బ్లాగర్ని కాదు! రోజూ బ్లాగు రాసే కోరిక,ఓపిక ముఖ్యంగా తీరిక నాకు లేవు. బ్లాగు కంటే ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి నాకు! ఇష్టమైతే, కుదిరితే రాస్తాను.మొదటినుంచీ అల్లాగే చేస్తున్నా! బిజీగా లేనపుడే నెలకు నాలుగో ఐదో మించి రాయలేదు...ఇహ రోజూ ఎక్కడ రాయమంటావు నాయనా?"

నా పనులు నేను చేసుకుంటూనే అప్పుడప్పుడు బజ్జులో ఒకటి రెండు వాక్యాలు రాయడం,లేదా నచ్చిన ఫొటోలు పెట్టడం..అంతే!

బ్లాగు విలువ బ్లాగుకుంటే బజ్ విలువ బజ్ కుంది! ఒక చిన్న కవితో,నచ్చిన కొటేషనో, ఫొటోనో మరో జోకో పంచుకోవాలన్నా బజ్జే బాగుంటుంది.ప్రతి చిన్న విషయానికీ బ్లాగు రాయాల్సినంత ప్రాముఖ్యం లేకపోవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా కొంతమందికి బ్లాగు రాసే సమయం లేక ఒక చిన్న విషయాన్ని పంచుకోవాలనుకున్నపుడు క్లుప్తంగా బజ్ లో పెట్టొచ్చు!

బజ్జులో సమయం వృధా మాత్రం బాగానే జరుగుతుంది.ఒక్కోసారి బజ్  టాపిక్ ఏమిటో,,చివరికి వ్యాఖ్యలు ఎటునుంచి ఎటు పోతాయో చెప్పడం కష్టం కూడా! ఒకసారి అప్పటికే రెండొందల వ్యాఖ్యలు వచ్చిన ఒక బజ్ లో మన రహ్మానుద్దీన్ అడుగు పెట్టి "బాబూ ప్రతి వంద వ్యాఖ్యలకోసారి బజ్ సారాంశం ఏమిటో తెలపాలని కోరుతున్నా"అని విజ్ఞప్తి చేశాడు.

అయితే ఒక్కోసారి బ్లాగు కంటే బజ్జులో మంచి విషయాల గురించి చర్చలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. మంచి సంగీతం గురించి,సాహిత్యం గురించి,భాష గురించి,కవిత్వం గురించి మంచి మంచి కబుర్లు దొర్లుతాయి అక్కడ! అందరివీ నేను కోట్ చేయలేను..నా బజ్జులోనే ఒకసారి భగవద్గీత మీద సురేష్ కొలిచాల గారు,నాగరాజు పప్పు గార్ల మధ్య ఎంతో మంచి చర్చ జరిగింది.అలాగే,వేణూశ్రీకాంత్,మాయా సౌమ్య...ఛ కాదు, ఆలమూరు సౌమ్య,రహ్మానుద్దీన్ ల బజ్జుల్లో మంచి విషయాలు పంచుకున్నాం!

ఇంకో ముఖ్యమైన సంగతి...బ్లాగుల్లో ఉన్నపుడు కేవలం పరిచయస్థులుగా ఉన్నవారు బజ్జులో అతి దగ్గరి స్నేహితులుగా మారడం నేను చూశాను.సరదా కబుర్ల మూలంగా కావొచ్చు,కలిసిన అభిరుచుల మూలంగా కావొచ్చు! ఎందుకంటే బజ్జు స్వభావం వేరు. అదొక నిరంతర సంభాషణా ప్రక్రియ వంటిది కాబట్టి!


బజ్జులో అనానిమస్ కామెంట్స్ రాసే అవకాశం కూడా లేదు.(రకరకాల ఐడీలతో రాసే అవకాశం ఉంది. కానీ బజ్జులో అసభ్యంగా ఎవరూ  కామెంట్స్ రాయగా చూళ్ళేదు ఇంతవరకూ)

బ్లాగర్లు బజ్జుల్లో గంటల తరబడి గడుపుతూ బ్లాగుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని కొందరి ఆరోపణ!బ్లాగులు రాసేవాళ్ళు బజ్జుల్లో ఉండకూడదని,బజ్జుల్లో గడిపేవాళ్ళు బ్లాగులు రాయకూడదనీ రూలేమీ లేదుగా! బజ్జులో యాక్టివ్ గా ఉంటూనే బ్లాగులు కూడా తగు మాత్రంలో రాసేవాళ్ళు బులుసు గారు,మధురవాణి,రాజ్ కుమార్,ఆ.సౌమ్య...వీళ్ళంతా కనపడుతూనే ఉన్నారు! ఇంకా చాలామంది ఉండొచ్చు కానీ నేను ఎక్కువమంది బజ్ లు అనుసరించకపోవడం వల్ల అంతగా తెలీదు. ఎవరైనా బజ్జర్లు చెప్పండి!


నిన్న ఒక బజ్ లో ఒక వ్యాఖ్యను చూసి అక్కడి నుంచి శరత్ గారి బ్లాగుకెళ్ళి చూశా!   బజ్జుల వల్ల బ్లాగులకు లాభమా నష్టమా అనే పోస్టు కనపడింది.అందులో శరత్ గారు  " చెత్తంతా బజ్జుల్లో కొట్టుకుపోయిన్దనుకోవాలా లేక మేరునగ దీరులందరూ బ్లాగులని నిర్లక్ష్యమ్ చేస్తున్నారు అనుకోవాలా? అనే చఖ్ఖని ప్రశ్న వేసుకున్నారు.

అలా ఏమీ బేరీజులు వేయక్కర్లేదండీ!ఎవరి ఆసక్తి వాళ్ళది అనేసుకోండి చాలు! ఎవరు చెత్తో ,ఏది చెత్తో నిర్ణయించుకునే అవకాశం చదివే వాళ్ళకిచ్చేద్దాం!! ఎవరికి ఎందులో ఆసక్తి ఉంటే అందులో ఉంటారు! చెత్త రెండు చోట్లా ఉండొచ్చు,మంచి విషయాలూ రెండు చోట్లా ఉండొచ్చు! ఏవంటారు?

కాకపోతే బజ్జులో కెవ్వులూ కేకలూ మాత్రం ఎక్కువే!:-))

కామెంట్ల విషయానికొస్తే ఇప్పటికీ చాలా మంది కామెంట్ల సంఖ్యను బట్టే బ్లాగు పోస్టు విలువను నిర్థారించడం విచారం! అద్భుతంగా ఉంది అనిపించిన పోస్టుకి  మూడే కామెంట్లొస్తాయి. అంతగా ప్రాముఖ్యం లేని విషయం మీద చర్చను మొదలుపెట్టిన మొదటి కామెంట్ కి కొనసాగింపుగా  ఒక్కో బ్లాగుకి వంద కామెంట్లూ రావొచ్చు!

కానీ బ్లాగు పోస్టు లింకు ని బజ్ లో ఇస్తే మాత్రం ఆన్ లైన్లో ఉన్నవారు రాసే వ్యాఖ్య కాస్తా బజ్ లోనే రాసేస్తున్నారు. అందువల్ల బజ్ లో బ్లాగ్ పోస్టు లింక్ ఇచ్చేవాళ్ళు అక్కడ వ్యాఖ్యలను అచేతనం (commentsని disable చేయమని అర్థం) చేస్తే వ్యాఖ్యలు బ్లాగుల్లోనే పడతాయి.బ్లాగు నచ్చినపుడో, నచ్చనపుడో అభిప్రాయం మాత్రం తప్పక రాయాల్సిందే!

బజ్జులు మాత్రమే రాస్తూ బ్లాగుని నిర్లక్ష్యం చేస్తున్న మిత్రులు (అబ్బ, వేణూ శ్రీకాంత్ కి ఎంత కోపం వస్తోందో)మాత్రం బ్లాగు ని కూడా ఒక కంట కనిపెట్టి ఉంటూ పోస్టులు రాస్తూ ఉండాలి(నేనూ భుజాలు తడుముకుంటూ...)శంకర్ గారూ, మీరు కూడా! (అంచేత మీరు చెప్పొచ్చేదేమైనా ఉందా ఈ సందర్భంలో?)

ఎంతైనా బ్లాగులో రాసినవి భద్రంగా ఉంటాయి,వాటికో రిఫరెన్స్ గా చూసుకోనూ వచ్చు! అంశాల వారీగా విలువా ఉంది!
నేను  బజ్జు లో సమయం దాదాపుగా తగ్గించేశాను.

బ్లాగు మిత్రులు,బజ్జు మిత్రులు ఏవంటారు?



45 comments:

MURALI said...

దేనిలో ఉన్న సౌలభ్యం దానికుంది. అందుకే దేని ప్రాముఖ్యత దానికి ఉంటుంది. కవితలు వ్రాసే బ్లాగర్స్ ని అడిగి చూడండి, బ్లాగుల్లో వాళ్ళు కోల్పోయింది బజ్జుల్లో ఎలా దొరికిందో చెబుతారు. బ్లాగుల్లో కవితలు వ్రాస్తే ఎవరూ చూడక స్పందనలేక నొచ్చుకుని బ్లాగింగ్ అపేసిన వాళ్ళెందరో ఉన్నారు. "నేను కవిని కాదన్న వాడిని కత్తితో పొడుస్తా" అని శీర్షిక పెడితే, చాలామంది తిట్టారు. టైటిల్ చూసి కామెడీ కవితలనుకుంటారు అని. కానీ నిజానికి ఆ టైటిల్ పెట్టడం వలనే వచ్చి చదివారు. అంటే మంచి కవితలు వ్రాసిన పిచ్చి టైటిల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది.ఏదో బ్లాగు వ్రాసే మొదట్లో ఎక్కువ కామెంట్లు రావాలని కోరుకుంటారు. తర్వాత వాళ్ళే సద్దుకుంటారు. కానీ బ్లాగును చూసే జనాలు కూడా లేకపోతే బ్లాగు వ్రాయాలని ఎందుకనుకుంటారు.

అందుకే కవితలు వ్రాసే వాళ్ళకి బజ్జు సరైన ప్రత్యామ్నాయం. అందులోనూ నచ్చిన వాళ్ళకి కామెంటు వ్రాసే ఓపిక లేకపోతే కనీసం ఒక లైకు కొట్టిపోతారు.

MURALI said...

కధలు,వ్యాసాలు ఎలానూ పరిమాణంలో పెద్దవి ఉంటాయి కాబట్టి బజ్జుల్లో వ్రాయలేం. బ్లాగుల్లోనే వ్రాస్తాం. మరో ముఖ్యమైన విషయం చర్చలు. బజ్జుల్లో చర్చలు చాలా సులభం. అదే బ్లాగుల్లో అయితే కామెంట్లు వచ్చాయా, నేను వ్రాసిన కామెంటుకి స్పందనలు వచ్చాయా అని మాటి మాటికి బ్లాగు లంకె గుర్తు పెట్టుకుని మరీ తెరవాలి. సబ్‌స్క్రైబ్ కావొచ్చు కదా అని చెప్పొచ్చు. సబ్‌స్క్రైబ్ అయిన రోజు ఎవరూ స్పందించరు. ఒక నెలకో రెండు నెలలకో స్పందిస్తారు. అప్పటికి చర్చించే ఆసక్తి మనకి ఉండదు.

బజ్జుల్లో అప్పటికప్పుడే చర్చలు జరిగిపోతాయి. ఎంత విస్తృతంగా జరుగుతాయో చెప్పాలంటే మొన్నటి దెయ్యాల బజ్జులే ఉదాహరణ. ఇక టైము వేస్టు గురించి అంటారా? బ్లాగుల్లోకి వచ్చిన మొదట్లో కూడా కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లు కూడలిని రిఫ్రెష్ చేస్తూ గబ్బిలాల్లా కూర్చునే వాళ్ళం. టైము మేనేజ్ చేసుకోగలిగేవానికి బజ్జైనా బ్లాగైనా ఒకటే.

MURALI said...

సంస్కృతి,సంప్రదాయాల విషయంలోనే మార్పు అనివార్యమని, అది తమ హక్కని, దాన్ని సమాజం స్వాగతించాలని శ్లాఘించే బ్లాగర్లు ఎందరో. ఇలాంటి పరిస్థితుల్లో బ్లాగులు నాశనం అయిపోతున్నాయి, బజ్జుల వల్ల బ్లాగులు నిర్వీర్యమయిపోతున్నాయి అనటం హాస్యాస్పదం.

సిరిసిరిమువ్వ said...

మీతో నూరు శాతం ఏకీభవిస్తాను. బ్లాగా..బజ్జా అన్నది వ్యక్తిగతం. బజ్జులో ఉన్న ఓ ముఖ్యమైన సౌలభ్యం ఏంటంటే పోస్టు వ్రాయటం కానీ వ్యాఖ్య వ్రాయటం కానీ సులువుగా ఉంటుంది. మ పని మనం చేసుకుమ్టూనే ఎప్పుడో ఒకసారి అలా వచ్చి ఇలా లైకు పెట్టి వెళ్ళిపోవచ్చు. బ్లాగులో వ్యాఖ్య పెట్టాలంటే అదో పెద్ద పని..బ్లాగు తెరవాలి..కామెంటు బాక్సు తెరవాలి..కొండకచో ఈ కామెంటు బాక్సులు సతాయించవచ్చు..కొన్ని బ్లాగుల్లో వర్డు వెరిఫికేషన్ మొదలగు తలనొప్పులు...కొన్ని బ్లాగుల్లో అయితే ఏ వ్యాఖ్య వ్రాస్తే ఎవరి మనోభావాలు గాయపడతాయో అన్న భయం..వెరసి బ్లాగుల్లో వ్యాఖ్యలు వ్రాయకపోవటానికి లక్షా తొంభై కారణాలు చెప్పుకోవచ్చు. బజ్జులో ఈ గొడవలు ఉండవు..సరదా సరదాగా ఉంటుంది. మీరన్నట్టు చిన్న చిన్న విషయాలు పంచుకోవటానికి బజ్జే బాగుంటుంది..మనం చెప్పాలనుకుంది మన సర్కిల్‍లో ఉన్న చాలా మందికి చేరుతుంది కూడాను.

నేను బ్లాగు టపాలకి వ్యాఖ్యలు మాత్రం వీలయినంతవరకు బ్లాగులోనే పెడతా.

కృష్ణప్రియ said...

బాగా చెప్పారు.

నేను బజ్ చూడను
కానీ..ఒక్కోసారి చిన్న చిన్న విషయాలు, one liners పోస్ట్ చేయటానికి బ్లాగు సరైన మాధ్యమం కాదు. బజ్ మొదలు పెడదాం అనిపిస్తుంది ఒక్కోసారి. అలా అని బజ్ లోకం లోకి వెళ్లాలంటే భయం నాకు. సమయం సరిపోదని. ఇప్పటికే ఫేస్ బుక్, నెలకి రాసే 2-3 బ్లాగ్ టపాల వల్ల చదివే సమయం తగ్గిపోయింది. పెరట్లో కలుపు మొక్కలు నా అంత ఎత్తు పెరిగిపోయాయి :)

చివరగా ఎవరి ఆసక్తి వారిది. ఆసక్తి ఉన్నా సమయాభావం వల్ల కొన్ని పనులు ఇష్టమైనా చేయలేము అని అనుకుంటున్నాను.

Praveen Mandangi said...

నేను బజ్‌లో వ్రాయడం పూర్తిగా మానేశాను. అయినా నాది non-web based mail box. బజ్ నా మెయిల్‌లో కనిపించదు.

ఆ.సౌమ్య said...

ఇప్పటి వరకూ బజ్జు ని తిడుతూనే...బ్లాగులు నాశనమయిపోతున్నాయంటూ రాసిన పోస్టులే చూసానుగానీ బజ్జుని సమర్థిస్తూ బ్లాగు ప్రాముఖ్యతని కూడా వివరించే పోస్ట్ చూడడం ఇదే మొదటిసారి.

మీరన్నట్టు చిన్న చిన్న విషయాలు చర్చించుకోవడాంకో, లేదా నలుగురితో పంచుకోవడానికో బజ్జు మంచి వేదిక.

నా మటుకు నేను బ్లాగు ని ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యలేదు. బజ్జులో ఎంత ఎక్కువగా, ఉత్సాహం గా పాల్గొంటానో బ్లాగులోనూ అంతే. వారానికి ఓ పోస్ట్ రాస్తున్నాను. రోజుకి కనీసం 10-12 బ్లాగులైనా చదువుతున్నాను కామెంటు పెడుతున్నాను. ఒక్కోసారి హారంలో అజ్ఞాతల కామెంట్ల సంఖ్య కంటే నా కామెంట్ల సంఖ్య ఎక్కువగా ఉంటున్నాది. అది చూసి నేను మురిసిపోతుంటాను కూడా. :) బజ్జు రాకముందు ఇంతకన్నా ఎక్కువేమీ చేసేయలేదు బ్లాగుల్లో.
రెండిటినీ సమతూకంలో ఉంచవచ్చు, అనుకుంటే...ఒకదానివల్ల వేరొకదానికి నష్టం అనైతే నాకు అనిపించడం లేదు.

బజ్జులో చాలా కాలక్షేపం, కొండొకచో వృధా కూడా అవుతుండవచ్చు...కానీ దీన్ని నేను వృధా అనుకోవట్లేదు. మీరన్నట్లు చాలామందితో స్నేహం బలపడడానికి దోహదపడుతున్నాది. బ్లాగులో కామెంట్లు రాస్తుంటే..పరిచయం వరకూ మాత్రమే ఉంటుంది. కానీ బజ్జులోకొచ్చాక మంచి స్నేహిలయిపోయినవారెంతమందో! ఉదాహరణకి మధురవాణి, వేణూశ్రీకాంత్, రహ్మాన్, నాగరాజు పప్పు గారూ,లలితగారూ, వరూధిని గారూ, గీతిక గారూ, శివరంజని, ఇందు, తృష్ణగారూ, అవినేని భాస్కర్, Indian Minerva, నాగమురళీ...ఇంకా చాలామంది. అలాగే బ్లాగుల్లో లేకుండా బజ్జు ద్వారా మంచి స్నేహితులయినవాళ్ళూ ఉన్నారు...హర్ష, నాగప్రసాద్ నాసిక, సంతోష్....ఇంకా ఉన్నారు. అసలు ఈ బజ్జులే లేకపోతే నాగరాజు పప్పు గారూ, లలిత గారూ, వరూధిని గారూ, తృష్ణ గారూ ...ఇలాంటివారితో మాట్లాడే అవకాశమే ఉండేది కాదు నాకు.

దీనివల్ల లాభమేమిటి అంటారా...మంచి మంచి విషయాల మీద చర్చ,సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం. చాలామంది వల్ల మంచి పాటలు, మంచి పుస్తకాల గురించి తెలిసాయి నాకు...ఇంతకన్నా ఇంకేం కావాలి.

కాబట్టి బజ్జుకి నా ఫుల్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది...బ్లాగులకి అంతకన్నా ఎక్కువ ఉంటుంది...నాకూ రెండూ ఇష్టమే! ఏదీ వదులుకోలేను!

శరత్ గారి పోస్ట్ చూసాక ఇలాంటి పోస్ట్ ఒకటి బ్లాగులో రాద్దామనుకున్నాను...కానీ కుదరలేదు. మీరు రాసారు, చాలా బావుంది....అందుకే మీ పోస్ట్ కన్నా పెద్ద కామెంటు రాసా :D

ఆ.సౌమ్య said...

ఇంకో చిన్నమాట...ఇన్ని మాటలు చెప్పేసి మళ్ళీ చిన్న మాట ఏమిటి తల్లీ అనకండి...ఒక పాయింటు మరచిపోయా :)

అసలు బ్లాగుని, బజ్జుని కంపేర్ చెయ్యడం అనవసరం. రెండూ దేనికవే భిన్నమైనవి. బజ్జులో రాసే చిన్నచిన్నవిషయాలు బ్లాగుల్లో రాసేవి కావు. బ్లాగులో రాసే పెద్ద విషయాలు బజ్జులో చర్చించేవి కావు...రెండూ దేనికవే సాటి.

హమ్మయ్యా అన్నీ పాయింట్లూ చెప్పేసాను :)

Sri Kanth said...

అద్దేచ్చా, నేను ఈ సంధర్భంగా .. బ్లాగు అగ్రిగేటర్లకు విన్నవించుకునేదేంటాంటే.. బ్లాగులకు అగ్రిగేటరు ఉన్నట్టు, ఇక మీదట ఒక బజ్జు అగ్రిగేటరు పెట్టాలని. దాని ద్వారా, ఎవరెవరు తమ బజ్జును పబ్లిక్ గా షేర్ చేసుకోవాలనుకునే వాల్లందరూ .. ఆ అగ్రిగేటరుకు సమర్పించుకుంటే సరిపోతుందని. మిగిలిన వాటిని స్పామర్లు ఫాలో అవ్వకుండా ఉంటారని.

Sujata M said...

అదా సంగతి ? ఈ మధ్య బజ్జు లో కనిపీయట్లేదు - అనుకుంటున్నాను. ఇక్కడ ప్రస్తావించకూడదు గానీ వసుంధరలో మీ వ్యాసాలు చాలా బావుంటున్నాయి. అభినందనలు. మాటల తూటాల గురించి మీ వ్యాసంతో అంగీకరిస్తాను.

కొత్తావకాయ said...

మీరు అన్నట్టు బ్లాగుల్లో రాసేంత పెద్ద సంగతులు కావనుకున్నప్పుడు, ఏదైనా చర్చలకి బజ్జు బాగుంటుంది. నామటుకు నాకు బ్లాగే ముద్దు. బ్లాగు అభిమానపుత్రిక లాంటిది. మన ముద్ర కనిపించేలా తీర్చి దిద్దుకోవచ్చు. బజ్జు రచ్చబండ లాంటిది. ఊసుపోక ఓ మాటు వెళ్ళిరావడమంతే!

SHANKAR.S said...

కెవ్వ్ సుజాత గారూ. పోస్ట్ చదువుతూ హమ్మయ్య నా గురించి ఎత్తలేదు అనుకున్నా. చివరికి వచ్చే సరికి నాకు, వేణు గారికి సుతి మెత్తగా మొట్టికాయలు వేశారుగా. :)))). లాభం లేదు వీలయినంత త్వరగా ఒక బ్లాగు పోస్ట్ వేసి నేనూ బ్లాగరునే అని నిరూపించుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఎవరక్కడ తుప్పట్టిన నా బ్లాగ్ధనుర్బాణాలని తుడిచి తక్షణం తీసుకురండి. పోస్టులు సంధించెద.

Anonymous said...

ఇంగ్లీషులో బ్లాగులు మందగించి ఏడాదో, అంతకంటే ఎక్కువో అవుతోందట. వికీ కూడా మందగించిందని దాని వ్యవస్థాపకుడు వాపోతున్నాడు. బ్లాగులు తెలుగులో ఎదుగుతూ ఎదుగుతూ ఉండగా మధ్యలో ఈ బజ్జొచ్చిపడింది. దాన్తో బ్లాగుల్లో వ్యాఖ్యలు కూడా మందగించాయి.

నేనూ నా బ్లాగు మూసేయాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ వ్రాయక తప్పదులే అని వ్రాస్తున్నాను. నా పరిస్థితి ఎలా ఉందంటే "నేను సిగరెట్టు మానేశా" నన్నాడట ఒకాయన ముళ్ళపూడిగారితో. "నేనూ చాలాసార్లు మానేశాను" అన్నారట ముళ్ళపూడి.

తృష్ణ said...

సుజాత గారూ, తల్లా?పెళ్లామా? చెప్పవలెను..అన్నట్లుందండి మీ ప్రశ్న..:))(kidding)

వాదోపవాదాలన్నీ చాలావరకూ మీరే రాసేసారు. నాకనిపించేది ఏమిటంటే..బ్లాగేమో 'ఫ్రూట్ జూస్ '.బజ్జేమో 'ఏరేటెడ్ డ్రింక్ '. తాత్కాలిక ఆనందం కావాలో, ఆరోగ్యం కావాలో మనమే నిర్ణయంచుకోవాలి...:)
మీ ప్రోత్సాహంతో బజ్జుల్లోకి వచ్చినా, సమయాభావం వల్ల నేను బ్లాగ్ పోస్ట్ లింక్ లు పెట్టడానికి తప్ప పెద్దగా బజ్జును ఉపయోగించుకోలేకపోయాను. కానీ ఎవరే చెత్త వ్యాఖ్య రాస్తారో అని భయం లేకుండా మనల్ని అభిమానించే మిత్రులతో మనో భావాలు పంచుకోవటానికీ,సరదా కబుర్లు చెప్పుకోవటానికి, బజ్జు ఉపయోగకరం. కానీ ఇది ఎల్లవేళలా ఇంటర్నెట్ అందుబాటులో ఉండి, బజ్జుల బరువు తట్టుకునే నెట్ స్పీడ్ ఉంటేనే ఆనందంగా కొనసాగించగల సరదా ప్రక్రియ.

బ్లాగ్ కు అంత సమయం వృధా అవ్వాదు. అంటే అది బ్లాగ్లోక విహరణకు ఎంత సమయం కేటాయిస్తాం అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. But,ఒకప్పుడు జోరుగా టపాలు రాసిన నేనూ కూడా బ్లాగటం తగ్గించేసాను. రాయలేక కాదు..వృధా శ్రమ అనిపించి..! ఈ రెండిటికీ వాడే సమయాన్ని మరో హాబీకి వాడుకుంటే వచ్చే ఆనందం అధికం అనిపిస్తోందండి నాకు..!

Anonymous said...

సుజాత గారు, హహ్హ..హ్హ...నాకర్ధవయిపోయిందండీ _ అందుకే నో కామెంట్

వేణూశ్రీకాంత్ said...

ఊరికి నడిబొడ్దున ఉండే రచ్చబండ లాంటిది బ్లాగైతే..
మన ఇంటి గుమ్మం పక్కన ఉండే వీధి అరుగు లాంటిది బజ్..
మీ టపా బాగుంది.. చక్కగా విశ్లేషించి రాశారు :-)

Unknown said...

నాకు మీ పోస్ట్ బాగా నచ్చింది. బ్లాగ్ లో అయితే విషయం మరియు కామెంట్స్ శాశ్వతంగా ఉండిపోతాయి.

శరత్ కాలమ్ said...

బ్లాగుల్లో నిద్రపోకుండానే అప్పుడప్పుడు బజ్జోవడం బావుంటుందంటారు. యెప్. దేని ప్రాధాన్యత దేని ప్రయోజనాలు దానివే. బ్యాలన్స్ చేసుకోవడమే మన చేతిలోని పని. చిన చిన్న విషయాలకి బజ్జుండటం బావుంటుందంటున్నారు కాబట్టి నేను కూడా ఆ చిన్న చిన్న వాటి సంగతి చూడాలి. కాస్త వ్యక్తిగతమయిన ఫోటోలు, ముచ్చట్లు సన్నిహితమయిన వారితోనే పంచుకోగలం కాబట్టి వాటికి బజ్జే బెటరనుకుంటా. పబ్లిక్కుతో పంచుకోతగ్గ విషయాలూ, చర్చలూ, ముచ్చట్లూ పెద్దపెద్దవి అయితే బ్లాగెయ్యడం బెటరనిపిస్తోంది.

రాజ్ కుమార్ said...

బ్లాగు బ్లాగే.. బజ్జు బజ్జే కదండీ..
నా వరకూ కాస్త మనసు పెట్టి రాసింది మాత్రమే బ్లాగ్ లో రాసుకుంటున్నాను.
చిన్న చిన్న విష్యాలూ, ఆటలూ, పాటలూ, ఫైట్లూ, చాట్లూ అన్నీ బజ్ లోనే కానిస్తున్నాను.
బ్లాగ్ లో రాసుకున్న టపాకి పబ్లిసిటీ ఇచ్చుకోడానికి బజ్ చాలా బాగా ఉపయోగపడుతుందీ.
ఇంకో సంగతేమిటంటే బజ్ వచ్చాకే మీలాంటి పెద్ద పెద్దోళ్ళతో చాట్ చేసేంత పరిచయం ఏర్పడిందీ మరియూ తెలియని మంచి బ్లాగ్స్ తెలిసొచ్చాయి కూడానూ రీషేర్ చెయ్యటం వల్ల.బజ్ వల్ల బ్లాగ్ అన్యాయమయ్యి పోతుందీ అని మాత్రం నాకనిపించటం లేదండీ. ;)

బులుసు సుబ్రహ్మణ్యం said...

బజ్జా బ్లాగా అని బేరీజు వేసుకోవాల్సిన అవసరం లేదనే అనుకుంటాను. నేను బజ్జుల్లో పోస్టులు ఎక్కువుగా వ్రాయను కానీ బజ్జుల్లో చాలా సేపే ఉంటాను. సరదాగా కాలం గడిపేయవచ్చు.
బజ్జుల్లో మేరునగధీరులు లేరన్నా బజ్జుల్లో క్వాలిటీ లేదన్నా మాత్రం ఒప్పుకోను. బ్లాగర్ల గురించి బ్లాగుల్లో తెలియని కోణాలు బజ్జుల్లో చూస్తున్నాను.

>>> నేను బజ్జు లో సమయం దాదాపుగా తగ్గించేశాను.
తగ్గించి మీరు ఎన్ని టపాలు ఎక్కువగా వ్రాసారు బ్లాగులో? గణనీయం గా పెరగవనే అనుకుంటాను.

Vasu said...

ఆత్మలు అనుభవాలు లాటి అతి పెద్ద బజ్ గురించి ప్రస్తావించలేదు. ఇది నేను ఖండిస్తున్నా.

బజ్ లో చర్చలు చాల తేలిక. కంటెంట్ సునాయాసంగా పెరుగుతూ ఉంటుంది గ్రూప్ చాట్/ ఫోరమ్స్ లో లాగా. ఎక్కువ Interactive గా ఉండడం వల్ల తెలియకుండా బోలెడు సమయం గడిపేస్తాం ఇక్కడ. బ్లాగ్ లోలా ఎప్పుడు వ్యాఖ్యలు అప్రూవ్ చేస్తారు, దానికి బ్లాగరు/బ్లాగరి ఎప్పుడు రిప్లై ఇస్తారని ఎదురు చూడక్కర్లేదు. జిమెయిల్, జీ టాక్ ఎప్పుడూ తెరిచే ఉన్చేవాళ్ళకి బజ్ చాలా వీజీ గా ఉంటుంది.

".ప్రతి చిన్న విషయానికీ బ్లాగు రాయాల్సినంత ప్రాముఖ్యం లేకపోవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా కొంతమందికి బ్లాగు రాసే సమయం లేక ఒక చిన్న విషయాన్ని పంచుకోవాలనుకున్నపుడు క్లుప్తంగా బజ్ లో పెట్టొచ్చు"
సరిగ్గా ఇందుకే నేను బజ్ వాడతాను.

ఏదో విషయం మీద రాద్దామని మొదలెట్టి, ఈ మాత్రం దానికి పోస్ట్ అవసరమా అని చాలా సార్లు బ్లాగ్ లో వెయ్యకుండా వదిలేసా. అలాటి వాటికి బజ్ సరిగ్గ్గా సరిపోతుంది.

MURALI said...

నిన్నటి నుండి పదిసార్లు వచ్చి చూసాను. కామెంట్లు అప్రూవ్ చేసారా? చేస్తే మిగిలినవారు ఏం వ్రాసారా అని. అదే బజ్జులో అయితే ఎవరు ఏం వ్రాసినా వెంటనే తెలిసిపోతుంది.

ఇందు said...

చాలాబాగా వ్రాశారు సుజాతగారు :)

నాకు మొదట బజ్జు భలే రంజుగా అనిపించింది :) ఎంతో మంది స్నేహితులు...మాటలు...చాటులు...చాలా బాగుంది. నేను బజ్జు డెసెంబరులో మొదలుపెట్టా! కానీ ఏనాడూ బ్లాగుని నిర్లక్ష్యం చేయలేదు :) మనసులో ఉన్న ఊసులన్ని చెప్పుకునేది బ్లాగుతోటే.

కాని బజ్జువల్ల కూడా బోలెడు ఉపయోగాలున్నాయి. చలామందితో పరిచయం ఏర్పడుతుంది.కొత్తకొత్త స్నేహితులౌతారు. మన బుల్లిబుల్లి ఆనందాలు,సెమి-ప్రైవటు విషయాలు చెప్పుకోడానికి బ్లాగుకంటే బుల్లి బజ్జే బెస్ట్.అలాగే చిన్నచిన్న సందేసాలు,స్నేహితుల పుట్టినరోజు శుభాకాంక్షలు లాంటివాటికి కూడా బ్లాగుకంటే బజ్జే బెస్ట్!

ఎదైనా మనం చూసే తీరులో తేడా ఉంటుంది :) ఎవరి ఇష్టం వారిది :) బజ్జే నచ్చితే అందులోనే ఉండొచ్చు....బ్లాగు బాగా నచ్చితే అందులోనే బజ్జుకోవచ్చు :))) ఎవరి తీరుబడి వారిది కదా!

కాని ఒక్కటి మాత్రం నిజం. బ్లాగుల్లో పెట్టాల్సిన కామెంట్స్ బజ్జులోనే 'మమ ' అనిపిస్తుండడం వల్ల బ్లాగుల్లో పదిలంగా చూసుకునే కామెంట్లకు కరువొచ్చి పడింది. అందరూ కొంచెం శ్రమ అనుకోకుండా మంచి బ్లగుపోస్టుకు కామెంటు అక్కడే పెడితే రాసిన వారికి తృప్తి మిగులుతుంది.

హా! బాగా వాయించేశా కదా! ఇక చాల్లే :))

సుజాత వేల్పూరి said...

బజ్జుకి అనుకూలంగా స్పందించిన మిత్రులందరికీ థాంక్యూలు!

సుజాత వేల్పూరి said...

మూళీ, కవితల గురించి మీ అభిప్రాయంతో ఎకీభవిస్తున్నా! కాకపోతే కవితల జడివాన బ్లాగుల్లో మరీ ఈ మధ్య ఎక్కువైపోవడం వల్ల "ఎవరు రాశారు" అని చూసుకుని బ్లాగర్ విలువ ప్రకారం చదవాల్సి వస్తోంది. బజ్జులో అయితే మీరన్నట్లు కామెంట్ రాసే తీరిక లేకపోయినా(కవితలకు కామెంట్ రాయడం ఆషామాషీ కాదుగా)కనీసం లైక్ చేస్తాం! తన కవితను ఇష్టపడ్డామనైనా సదరు కవికి తెలుస్తుంది.

అలాగే సత్వర చర్చ కూడా బజ్జులోనే సాధ్యం! బ్లాగు అయితే అగ్రిగేటర్లో వెనక్కి పోతుంది కాబట్టి ఆ చర్చును చూడాలంటే ఆ బ్లాగు వెదికి పట్టుకుని చూడాలి.


సిరి సిరి మువ్వ గారూ,

బ్లాగుల్లో ఈ మధ్య ప్రాంతీయ వాదాల వంటి సీరియస్ చర్చల జోలికి నేను కూడా పోవడం లేదు. అక్కడ అపార్థాలకే తప్ప పాజిటిక్ కోణం ఉండటం లేదు.చిన్న చిన్న సరదా విషయాలకు బజ్జే మంచిది. ఏ విషయమూ సీరియస్ గా పరిణమించదు.

సుజాత వేల్పూరి said...

వేణు గారూ, మీరు మొదటి నుంచీ బజ్జుకు వ్యతిరేకమేగా! అసలు మీరు అటు బ్లాగూ రాయరు, ఇటు బజ్జూ రాయరు , మీ ఉద్దేశమేమిటి?

మీరు చెప్పిన పోలికలు బాగున్నాయి. బజ్జు డైలీ సీరియ లాంటిదైతే బ్లాగు వార్తా ఛానెల్ అనుకోమంటారా లేక దూరదర్శన్ అనుకోమంటారా?:-))

ఒక్కోసారి ముందే తయారు చేసిన ప్రసంగ పాఠం కంటే పిచ్చాపాటీ కబుర్లే ప్రమాదం లేకుండా ఉంటాయి. ఏవంటారు?

కృష్ణ ప్రియ గారూ,

నేను బ్లాగులు రాయడం కంటే చదవడానికి ఎక్కువ సమయం ఖర్చుపెడతాను. ఆ విధంగా మొదట్లో నేనూ బోల్డు కలుపు మొక్కలు సాగు చేసి కొన్నాళ్ళకి పెరట్లోకి పామొచ్చాక, కళ్ళు తెరిచి బ్లాగు కూడా తగ్గించాను. అయినా మీరూ బజ్జులోకి వద్దురూ, అప్పుడప్పుడూ సరదాగా పలకరించుకోవచ్చు! (ఇలాగే తృష్ణని లాక్కొచ్చా)

సుజాత వేల్పూరి said...

ప్రవీణ్,

అవును, ఈ మధ్య మీరు బజ్జుల్లో కనపడటం లేదు ఎందుకని?. మీ బ్లాగు పొస్టులన్నీ బజ్జులో పెడితే ఇక్కడే చదువుతాంగా! బ్లాగు వెదుక్కోకుండా?

సౌమ్య, నువ్వు బజ్జులోకొచ్చాక ఎక్కువ బ్లాగులు రాస్తున్నావు, గమనించావా?:-))

స్నేహం బలపడే విషయంలో నా వోటు బజ్జుకే! అక్కడ మనం మాట్లాడేది అవతలి వారు సరిగా అర్థం చేశుకోలేకపోతే అపార్థానికి తావు లేకుండా వెంటనే వివరణ ఇవ్వొచ్చు. బ్లాగులో మనం వివరణ ఇచ్చేలోగానే అవతలి వారు మనల్ని పూర్తిగా అపార్థం చేసేస్కుని శత్రువు కింద పరిగణించడం జరిగిపోతుంది.

బ్లాగు విలువ బ్లాగుదే, బజ్జు విలువ బజ్జుదే_______ఇదేగా నా బ్లాగు సారాంశం? మళ్ళీ కొత్త పాయింట్ చెప్పానంటావేం?

మొత్తానికి నిజంగానే నీ వ్యాఖ్య నా టపాకంటే పెద్దగానే ఉందోయ్!

సుజాత వేల్పూరి said...

శ్రీకాంత్,

బజ్జులకు అగ్రిగేటరా? కెవ్వు!(బజ్జు బుద్ధి పోలేదు చూశా, కెవ్వు మన్నాను)

సుజాత వేల్పూరి said...

సుజాత గారూ
వసుంధర వ్యాసాలు మీకు నచ్చుతున్నందుకు థాంక్యూ!

కొత్తావకాయ గారూ,

అవును. బజ్జులో ఎన్ని కబుర్లు చెప్పుకున్నా బ్లాగులో టపాలు ఇనప్పెట్టెలో దాచిన నగల వంటివి కాదూ?

శంకర్ గారూ,
మీ ధనుర్బాణాలు చేతికొచ్చాయా? లేవండి మరి, కర్తవ్యోన్ముఖుడు కండి!

Kranthi M said...

"బ్లాగు విలువ బ్లాగుకుంటే బజ్ విలువ బజ్ కుంది! ఒక చిన్న కవితో,నచ్చిన కొటేషనో, ఫొటోనో మరో జోకో పంచుకోవాలన్నా బజ్జే బాగుంటుంది.ప్రతి చిన్న విషయానికీ బ్లాగు రాయాల్సినంత ప్రాముఖ్యం లేకపోవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా కొంతమందికి బ్లాగు రాసే సమయం లేక ఒక చిన్న విషయాన్ని పంచుకోవాలనుకున్నపుడు క్లుప్తంగా బజ్ లో పెట్టొచ్చు!"

ఇది అక్షరాలా నిజం సుజాత గారు.

మురళీ అన్నట్టూ నాకైతే చాలా తేడా కనపడింది బ్లాగుకీ,బజ్జుకీ. ఎందుకూ అంటే నేను మనసుకి తోచినప్పుడో, ఏదన్నా పుస్తకాలు చదువుతున్నప్పుడు కలిగే భావాలనో అక్షరాల రూపంలోకి మారుస్తాను.రాసాను కదా అని వెంటనే పోస్టు కూడా పెట్టే వాడిని కాదు బ్లాగులో. ఎదో నాకు సమయం కుదిరినప్పుడూ అన్నీ కలిపి రాసేసి రోజుకోకటి చొప్పున పెట్టేవాడిని.

అనుకోకుండా ఒకసారి "తెలుగు బాట" గురించి తనికెళ్ళ భరణి గారిని కలిసే అదృష్టం కలిగింది. అప్పుదు ఆయన ఇచ్చిన సలహా ప్రకారం ఎక్కువ భావాన్ని తక్కువ మాటల్లో పెట్టడాం మొదలేట్టా. అప్పుడే ఈ బజ్జు కూడా పెరిగి పెద్దవటం మొదలెట్టింది.ఇది బాగుంది అని పించి ఇక్కడ మొదలెట్టా.నిజంగానే ఇక్కడ నాకు బ్లాగు తేలేని స్నేహితులు దొరికారు.మంచి స్పందన దొరికింది.నాలో తప్పొప్పులు కూడ ఇక్కడ బాగా తెలిసాయి.చర్చలంటారా నా కవితల్లాంటి విషయాలకి చర్చల విషయంతో సంబందమె ఉండదు కాబట్టీ ఆ భయమేమి లెదు.

కానీ చర్చ అనేది మన ఇష్టాఇష్టాల మీదే ఉంటుంది కాబట్టీ టైం వేస్టవుతుంది అనేది సరైన వాదన కాడన్నది నా అభిప్రాయం. నాలా ఎప్పుడొ రాశే వాళ్ళకీ చిన్న చిన్న విషయాలు చెప్పడానికీ ఈ బజ్జే ఉపయుక్తమైనదని నా భావన. ఇక్కడ ఏవి రాసినా అన్నీ నా బ్లాగులోకి కచ్చితంగా చేరతాయి. "బజ్జు పారే నది లంటి దైతే, బ్లాగు నదులు కలిసే సముద్రం లాంటిది".

అలాగని బ్లాగులో ప్రాచుర్యం పొందలేమని కాదు. అలా కవితలతో ఉండీ పేరు సంపాదించినా "రాధిక గారి స్నేహమా.. " మరియు "బొల్లోజు బాబా గారి సాహితీయానం" లాంటీ బ్లాగులు కూడా చాలానే ఉన్నాయి.కాక పొతే మంచి బ్లాగులా నిలిచిపోవటానికి, తరచూ రాయటం మరియు పదాల పొందికలో చదివించగలిగే పటుత్వం లాంటి లక్షణాలు కావాలి(నాకు లేనివి ;-)). అమ్మో చాలా పెద్ద సమాధానమే చెప్పినట్టూన్నా కొంచం ఓపిగ్గా చదువుకోండే :-)

Praveen Mandangi said...

నాకు మెయిల్‌లో బజ్ లింక్ కనిపించదని ఇందాకే చెప్పాను కదా. అర్థం కాకపోతే ఈ వీడియో చూడండి: http://learnlinux.greenhostindia.com/configuring-kmail-client-in-ubuntu-linux-natt జిమెయిల్ కూడా వెబ్‌లో ఓపెన్ చెయ్యకుండా అలా ఈమెయిల్ క్లైంట్ సాఫ్ట్‌వేర్‌లో ఓపెన్ అయ్యేలా చెయ్యొచ్చు. అదెలాగో గూగుల్ హెల్ప్‌లో వ్రాసి ఉంటుంది. ఈ-మెయిల్ క్లైంట్ సాఫ్ట్‌వేర్‌లో ఓపెన్ చేసినప్పుడు బజ్‌లు కనిపించవు. ఆ క్లైంట్ సాఫ్ట్‌వేర్‌ల నుంచి బజ్‌లోకి పోస్ట్ చెయ్యడానికి అవ్వదు కానీ బ్లాగ్‌లోకి పోస్ట్ చెయ్యడానికి అవుతుంది. నేను post@posterous.com అనే అడ్రెస్‌కి మెయిల్ చేస్తే అది telugu.stalin-mao.in బ్లాగ్‌లో పోస్ట్ అవుతుంది. అది నేను బ్లాగ్ సెట్టింగ్స్‌లో అనుమతించిన మెయిల్ అడ్రెస్‌ల నుంచి పంపితేనే పోస్ట్ అవుతుంది. బజ్‌లో అటువంటి సెట్టింగ్స్ ఉండవు కదా.

సుజాత వేల్పూరి said...

తృష్ణ,అవును, సమతూకంగా రాద్దామనే ప్రయత్నంలో వాదోపవాదాలన్నీ నేనే చేసేశా?

బ్లాగు ఫ్రూట్ జూసు, బజ్జు ఏరేటెడ్ డ్రింకు...భలే చెప్పారే మీరూ? బజ్జులో కనిపిస్తూనే బ్లాగు రెగ్యులర్ గా రాసే బ్లాగర్లలో మీ పేరు రాయడం మర్చిపోయానండీ! మీరు ఎక్కువగా బ్లాగు లింకులే ఇచ్చినా వాటికీ మంచి స్పందనే వస్తుంది బజ్జులో! మీకు గుర్తుందా? మినప్పప్పు, బార్లీ గింజలు ప్రఖ్య కలిపేసినపుడు మీరు రాసిన బజ్జుకు ఎంత స్పందన వచ్చింది? ఆ దెబ్బతో మీరు మినబార్లీ దోశలనే కొత్త రెసిపీ కూడా కనిపెట్టారు.:-))

మీరన్నట్టు బజ్జుకు బోలెడు సమయం ఖర్చు పెట్టగలిగిన స్థోమత ఉండాలి.

వేణూ శ్రీ, థాంక్యూ! బ్లాగుకు ఎపుడు మేలుకొలుపు? అది చెప్పండి.

శైలబాల గారూ,

మీ బజ్జులకు కూడా మంచి స్పందన వస్తుంది కదూ! బ్లాగ్ విషయంలో నాదీ అదే అభిప్రాయం!

సుజాత వేల్పూరి said...

శరత్ గారూ:-))
అయితే ఈ పోస్టుతో మిమ్మల్ని కూడా బజ్జులో చేర్చేస్తున్నానన్నమాట! హాపీసు!

రండి మరి మంచి మంచి బజ్జులతో!

రాజ్,బజ్జు వల్ల బ్లాగులు అన్యాయం కావు కానీ, బజ్జుల్లో సమయం ఎక్కువగా గడిపేస్తే బ్లాల్గు రాసే సమయం ఉండదు కదా! అదీ పాయింటు! అయినా మీరు రెంటిలోనూ యాక్టివ్ గా ఉండటం సంతోషం!

బులుసు మాష్టారండీ,

మీతో పూర్తిగా ఏకీభవించేస్తున్నా! పూర్తిగా అంటే పూర్తిగా!

బజ్జుల్లో గడపటం తగ్గించింది బ్లాగులో రాయడం కోసం కాదండీ~! అసలు నిజంగానే చేతిలో సమయం లేక!

వాసు గారు,
నిజమే! ఆ బజ్జులు చదివితే భయం వేసింది. బ్లాగర్ రిప్లై కోసం ఎదురు చూడనక్కర్లేకపోవడం,interaction పెరగడం ఇవి బజ్ కి ప్లస్ పాయింట్లు!

మీ చివరి పేరా నాకూ అనుభవమేనండోయ్!


ఇందు,పుట్టినరోజు శుభాకాంక్షల వంటి వాటికి బజ్జే బెస్టు! నిజమే!
ఎదైనా మనం చూసే తీరులో తేడా ఉంటుంది :)________మరే, నా ఉద్దేశం కూడా అదే!

కామెంట్స్ బ్లాగులోనే పడాలంటే బజ్ లో లింక్ ఇచ్చినా కామెంట్స్ అచేతనం చేయడమే మార్గం!

హా! బాగా వాయించేశా కదా!______మరే, ఇందూనా మజాకా?

సుజాత వేల్పూరి said...

క్రాంతి కుమార్ గారూ, చాలా వివరంగా మీ అభిప్రాయం రాశారు!
"బజ్జు పారే నది లంటి దైతే, బ్లాగు నదులు కలిసే సముద్రం లాంటిది". ___________బాగా చెప్పారు!

చాలా విశ్లేషణతో కూడిన వ్యాఖ్య బావుంది.

నిన్నటి నుండి పదిసార్లు వచ్చి చూసాను. కామెంట్లు అప్రూవ్ చేసారా? చేస్తే మిగిలినవారు ఏం వ్రాసారా అని. అదే బజ్జులో అయితే ఎవరు ఏం వ్రాసినా వెంటనే తెలిసిపోతుంది.

మురళీ, నిజమే! :-)) ఇదే బజ్జులో అయితే ఈ పాటికి ఎంత చర్చ నడిచేదో కదా!

సుజాత వేల్పూరి said...

బజ్జు లో సౌకర్యం ఎలాంటిదంటే...పొద్దున కామెంట్స్ కి జవాబులు రాస్తుండగా కరెంట్ పోయి, మొత్తం పూర్తి చేయలేకపోయాను. ఇహ సాయంత్రం వరకూ కుదరలేదు. ఈ లోపు లలిత గారు బజ్జులో నన్ను నిలదీసేశారు:-)

అందుకే లలిత గారికి ప్రత్యేకంగా జవాబు. కరెంట్ పోయిందండీ లలితా! లేకపోతే మీ వ్యాఖ్యకు జవాబు రాయనూ? మీకు బాగానే అర్థమైందన్నమాట!

BVJ said...

I don't understand any of these things, ladies & gentlemen; i don't (plan to) have any time to pass. ;-)

శరత్ కాలమ్ said...

మీ టపా వల్ల, వ్యాఖ్యల వల్ల బజ్జుల మీద కాస్త క్లారిటీ వచ్చింది. నా సంశయాలు కొన్ని నివృత్తి అయ్యాయి. నెమ్మదిగా నేనూ చిన్న చిన్న విషయాల కోసం, పంచుకోతగ్గ వ్యక్తిగత విషయాల కోసం బజ్జుతాను. మీ అహ్వానానికి సంతోషంగా వుంది. అయితే ఒక విషయంలో నాకు ఇంకా క్లారిటీ లేదు. గూగుల్ ప్లస్ లో వ్రాసినా అది బజ్ అవుతుందా లేక బజ్ లొనే వ్రాయాలా? ప్రయోగాలు చేస్తుంటాను కానీ ఈలోగా ఈ సందేహానికి జవాబు చెబితే సంతోషం.

ఇంకో సందేహం ఏంటంటే ఎవరికయినా మన బజ్ అడ్రస్ ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి? ఇతరులవి ఎలా తెలుసుకోవాలి?

Sharada said...

నా అఙ్ఞానాన్ని పది మంది ముందూ బయట పెట్టుకుంటే కానీ నాకు నిద్ర పట్టదు!
అసలు బజ్ లోకి ఎలా వెళ్ళాలండీ? నా జిమెయిల్ లో పక్కన నేనూ చూసాను. లోపలికి వెళ్ళి చూస్తే ఏమీ కనపడలే! సెర్చి కొట్టి ఏవో కొన్ని తెలిసిన పేర్లు ఇచ్చినా, "ఆ, నీ మొహానికి బజ్ ఒకటి తక్కువైందా" అన్నట్టు "నో బడీ ఫౌండ్" అని వస్తూంది.

శారద

సుజాత వేల్పూరి said...

BVJ, ఇది నీలాంటి Busy bee లకు కాదులే! అయినా ఫేసు బుక్కులో ఉన్నావుగా, అలాంటిదే ఇదీ! నువ్వు అక్కడ రాస్తే మేము బజ్ లో రాసుకుంటాం! అంతే తేడా!

సుజాత వేల్పూరి said...

శారద గారూ, మీరు నీలాంబరి శారద గారేనా?

సుజాత వేల్పూరి said...

శరత్ గారూ, మీ బజ్ చూశాను! by now, మీ సందేహాలు కొంత వరకూ తీరి ఉంటాయి. గూగుల్ ప్లస్ ఈ మధ్యే ప్రారంభమైంది. బజ్ ఎప్పటినుంచో ఉంది. ఈ మధ్య పాత బజ్ లు చూడాలని వాటి మీద క్లిక్ చేస్తే అవి గూగుల్ ప్లస్ లో చూపిస్తోంది జీ మెయిల్.

మీరు రాసిన బజ్ కి కుడి వైపు డేట్ కనపడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు రాసిన బజ్ లింక్ వస్తుంది. అది పంపడమే మిత్రులకు

Sharada said...

అవునండీ. నేను నేనే, అంటే నీలాంబరి శారద. (ఏదో సినిమా అడ్వర్టైజ్మెంట్ లాగుంది!) :)
శారద

sphurita mylavarapu said...

సుజాత గారూ,

ఈ Buzz ఏమిటండీ (మా ఆయన దెప్పినట్టూ... మళ్ళీ నేనొక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నీ :) ). మీ టపా చూసాక అర్ధమయ్యింది నా బ్లాగుకి బోలెడు వ్యాఖ్యలొచ్చేవి (ఆరూ ఏడూ ...:)) ఇప్పుడు రెండూ మూడికి ఎందుకు పడిపోయాయో...అది ఎలా వాడాలో కాస్త చెప్పి పుణ్యం కట్టుకోండీ...అదెక్కడుందో కనిపెట్టాకానీ bloggers ని add చేస్కోవాలంటే వాళ్ళ e-mail Id's అన్నీ వెతికి పట్టుకుని Add చేస్కోవాలా??

సుజాత వేల్పూరి said...

స్ఫురిత గారూ,అదెక్కడుందో కనిపెట్టారు కదా! మీతో రెగ్యులర్ గా జీ మెయిల్లో టచ్ లో ఉండేవారెవరైనా బజ్ రాస్తున్నారేమో చూడండి.వారి ఫాలోయర్స్ లో చేరి, మిగతా ఫాలోయర్స్ ఎవరున్నారో చూడండి. ఆ తర్వాత మీరో బజ్ రాయండి. మీకూ ఫాలోయర్లు వస్తారు. అంతటితో మీరూ బ్లాగర్ మరియు బజ్జర్ గా మారిపోతారు! అంతే!

pradeep said...

intaki mana vaallandaru unna aa buzz address emito cheppandi... nenu kood ajoin avutanu :)

Post a Comment