Showing posts with label కబుర్లు. Show all posts
Showing posts with label కబుర్లు. Show all posts

September 2, 2011

పండగ దండగలు !

మా ఇంటి గణపతి___పూజకు ముందు!

హమ్మయ్య! అయిపోయింది పండగ! జరిపేసుకున్నాం! పత్రీ,పువ్వులూ,వినాయకుడి బొమ్మా,మావిడాకులూ,అన్నీ కొని పండగ చేశాం! మళ్ళీ వచ్చే ఏడాదే ఇహ!

ఎప్పుడూ లేనిది మొదటి సారి మా ఇంట్లో మట్టి వినాయకుడిని కాక ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయకుడిని పెట్టాము పూజలో! ఏం చెయ్యమంటారు? ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చినట్టు "మట్టి వినాయకుడినే పూజిద్దాం , పూజించాల్సిందే..పూజించకపోయారో...."అని రక రకాల FM రేడియోల వాళ్ళూ, తొమ్మిదో టీవీ వాళ్ళూ, వీళ్ళంతా వారం నుంచీ ఊదరగొట్టేస్తుండటంతో, పోయినేడాది వరకూ దీనంగా మొహం పెట్టుకుని ఒక మూల ఉండే మట్టి విగ్రహాలు ఈ ఏడాది బోల్డంత గర్వం వచ్చేసి ఠీవీగా ముందు వరసలో నిలబడ్డాయి. కానీ కదిలిస్తే మాత్రం షాక్ కొట్టే ధరలు!

ప్రజల పల్స్,బలహీనతలు ఈ అమ్మేవాళ్ళు భలే పట్టుకుంటారు! మట్టి విగ్రహాలనే పూజించాలని అందరం కట్ట కట్టుకుని నిర్ణయించుకునే సరికి జానెడు బొమ్మ నూటయాభై రూపాయలూ,బెత్తెడు బొమ్మ వంద రూపాయలూ!అచ్చంగా మట్టి విగ్రహాలే! రూపాయి కూడా డిస్కౌంట్ లేదు!జూబిలీ హిల్స్, బంజారాహిల్స్ వంటి చోట్ల ఇంకో యాభై కలుపుకోండి! అందుకే కోపమొచ్చి (ఎవరి మీదో నాకూ తెలీదు) ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మ కొనేశాను !


ప్లాస్టిక్ కవర్లు తీసేశారమ్మా అంటూ , జూట్ తో చేసిన పల్చటి కవర్లు ప్రతి చోటా అయిదేసి రూపాయలకు అమ్మడం మొదలైంది. ఆర్గానిక్ కూరలు మంచివి అనగానే వాళ్ళెవరో సూపర్ మార్కెట్ వాళ్ళు కిలో వంకాయలు అరవై రూపాయలకు అమ్ముతారు. అలోవెరా జూస్ మంచిదని మంతెన గారు చెప్తే ఇంకెవరో అలోవెరా జుస్ చిన్న డబ్బా అయిదొందలంటాడు.


పత్రి కూడా అంతే!అందులో ఒక్కటీ వ్రతకల్పం పుస్తకంలో చెప్పిన రకం లేదు. పార్కుల్లోవో ఎక్కడివో మరి అన్నీ క్రోటన్ మొక్కల ఆకులే! మచ్చలవీ, చారలవీ, గీతలవీను!వంద రూపాయలకు నాలుగు రకాలు కలిపి ఒక టేకు ఆకులో చుట్టి (పాపం, ప్లాస్టిక్ నిషేధం కదా మరి) పెట్టి ఇవ్వడం! ఒక్క తామర పువ్వు నలభై రూపాయలు! "అమ్మో" అని తెల్లబోతే.."ఇవాళొక్కరోజే కదమ్మా" అనడం!

ఇంటికొచ్చాక మా ఇంటి తోటలో వెదికితే మారేడు,నేరేడు,మరువం,మాచీ పత్రం లతో సహా అన్ని రకాల పత్రీ ఇక్కడే దొరికింది! :-)) (మారేడు చెట్టు మా ఇంట్లో ఉందని ఇప్పుడే చూశా అసలు)

అసలు పండగలన్నీ ముఖ్యంగా సిటీల్లో ఎవరో వెనకనుంచి తోసినట్టు, లేదా అర్జెంట్ టెలిగ్రామేదో వచ్చినట్టు ఆదరా బాదరా శాస్త్రార్థం జరుపుకోడం అలవాటైపోయింది. నాలుగైదు రకాల వంటలతో ఆలస్యంగా భోజనాలు చేసి సాయంత్రం వేళ సెలవు రోజు తాలూకు విశ్రాంతిని హాయిగా ఆఘ్రాణిస్తూ గడపటం మర్చిపోయాం! "ఉన్నది ముగ్గురమేగా, ఏం తింటాం లెద్దూ" అని ఏవో రెండు రకాలతో కానిచ్చేయడం,వందలూ వేలూ పెట్టి మావిడాకులూ అవీ తెచ్చి కాసేపు ఆర్భాటం చెయ్యడం! సాయంత్రానికి తిరిగి చూస్తే దండగ ఖర్చూ, నిరుత్సాహం, రేపటి ఆఫీసూ, ఇస్త్రీ చేయాల్సిన యూనిఫాములూ...!

"ఇవాళ పండగ" అని ఉత్సాహంతో నిద్ర లేవడానికి బదులు "అమ్మో, ఇవాళ పండగ కదూ" అని గాభరాతో లేవడం!

ఆఖరి పోరాటం నవల్లో ప్రవల్లికతో విహారి ఒక సందర్భంలో "మీకేమండీ, సి బి ఐ ఆఫీసరు" అంటే ఆవిడంటుంది_____ "ఏమి సి బి ఐ లెండి! చూసేవాళ్ళకే ఈ గొప్ప! నాకైతే ఏదో ఒక మారుమూల పల్లెటూర్లో నాలుగు మేకలూ కోళ్ళూ పెంచుకుంటూ ప్రశాంతంగా బతికేయాలని ఉంది"

ఈ సిటీ హడావుడిలో, సంస్కృతి పేరు చెప్పుకుంటూ చప్పటి పండగల్ని నిస్సారంగా జరుపుకుంటున్నపుడు నేనూ ఇదే అనుకుంటాను. హాయిగా ఏ దోసకాయల పల్లో,రావిపాడో,దాచేపల్లో,ఉప్పులోరో,ఆకివీడో పోయి ప్రశాంతంగా పత్రి అంతా కొనకుండా చుట్టు పక్కల కోసుకొచ్చి పండగ మజా పిల్లలతో కల్సి ఆస్వాదించాలని! ఎప్పటికి కుదుర్తుందో!