Showing posts with label సరదా కబుర్లు. Show all posts
Showing posts with label సరదా కబుర్లు. Show all posts

July 16, 2012

ప"జీళ్ళ" పాకం!



ఆ మధ్య ఒక పత్రికలో క్రాస్వర్డ్ పజిల్ పూర్తి చేస్తూ ఒక అడ్డం, నిలువు దొరక్క తన్నుకుని, అదేదో ప్రాణం మీదికొచ్చినట్టు, చివరి తేదీ లోపుగా ఆ క్లూ దొరుకుతుందో, సాల్వ్ చేసి పంపగలనో లేదో అని పుస్తకాలు, రిఫరెన్స్ పుస్తకాలు వెదుకుతూ, బెంగెట్టుకుని జ్వరాలు తెచ్చేసుకుని ఎలాగో ఇహ రెండు రోజులు టైముందనగా సాధించేసి పంపేశాను.

అది పంపేశాక ఎంత ఆకలి వేసిందో! ఆ తర్వాత ఎంత నిద్ర ముంచుకొచ్చేసిందో! తపన అంటే అలా ఉండాలి.(చాల్లే వెధవ గొప్పలు అంటారా? :-P) 

ఈ పిచ్చి మా ఇంట్లో అందరికీ మా అమ్మ పట్టించింది. వనిత,జ్యోతి మంత్లీ,ఆంధ్ర ప్రభ వీక్లీ,ఇంకా చాలా చాలా పత్రికలు తెప్పించి వాటిలో పజిల్స్ అన్నీ అలవోగ్గా పూర్తి చేసి పంపేస్తూ ఉండేది. అదొక వ్యసనం ఆమెకి. మేము కూడా ఆంధ్ర దేశపు లెక్కల మాష్టారి. శిష్యులమై పోవడం వల్ల మేథ మేట్రిక్స్ నేర్చుకుంటూ, ఆ పజిళ్ళన్నీ  ఛేదిస్తూ సాధిస్తూ ఉండేవాళ్ళం.

అమ్మే కాకుండా అత్తగారు కూడా పజిల్స్ నింపడంలో నిష్ణాతురాలు కావడం విచిత్రమే!  పెళ్ళయిన కొత్తలో మా అత్తగారు నేను పజిల్స్ నింపడం లో పడి ఎవర్నీ పట్టించుకునే వాళ్ళం కాదు. ఇంత అనుకూల వతి అయిన కోడలు దొరకడం కొడుకేమో గానీ తన అదృష్టంగా భావించి ఆవిడ నన్ను బాగా గారాబం చేసేవారు.  మనం చేతులకు గోరింటాకు పెట్టేసుకుని వంటింటి గట్టు మీద కూచుని పజిల్స్ కి క్లూలు ఆలోచిస్తుంటే ఆవిడ పెసరట్లు వేసి తినిపిస్తూ ఉండేవారు.

ఆ తర్వాత మేము అమెరికా వెళ్ళిపోయాక ఆవిడకు ఫోన్లు చేస్తే "ఎలా ఉన్నారు?ఏవిటి?" అని అడిగే వారు కాదు."మొన్నొక పజిల్ చూశాను సుజాతా! అందులో......(అని ఫోన్ పక్కన పెట్టి పుస్తకం తెచ్చుకోడానికి వెళ్తారు).....పదమూడు అడ్డం, 24 నిలువూ కలవడం లేదు. దాని క్లూ ఏంటంటే.." అని క్లూ వివరించేసి..ఏ అక్షరాలు కలిశాయో చెప్పేవారు. అలా మేము వేరే టాపిక్ లేకుండా క్రాస్వర్డ్ పజిల్స్ మీదే ఇంటర్నేషనల్ కాల్స్ గంటల కొద్దీ మాట్లాడేసుకుంటుంటే వాళ్లబ్బాయి దుఃఖం వర్ణనాతీతంగా ఉండేది.

ఇప్పటికీ ఆవిడ అతి కఠినమైన క్రాస్వర్డ్ పజిల్స్ పూర్తి చేసేస్తుంటారు. రచన మాస పత్రిక పజిల్స్ ప్రతి నెలా ఖచ్చితంగా పంపిస్తుంటారు.అది చాలదన్నట్టు ఆన్ లైన్ పత్రికల్లో పజిల్స్ ఉన్నాయేమో ప్రింట్స్ తీసి ఇమ్మంటారు. బహుమతి కొట్టడం కాదు టార్గెట్ .... పజిల్ సాల్వ్ చేస్తే కానీ ఆ ఆకలి తీరదు.

అదొక అడిక్షన్!

ఇంకో బలమైన కేసు బాబాయిది. .బాబాయికేమో పజిల్స్ పిచ్చి. నిద్రలో కూడా "పదకొండు నిలువు, ఒకటి అడ్డం,కలిస్తే...మరి పదహారు నిలువు ఎలా కలుస్తుంది? అది ఒకటే అక్షరం కదా?" అని పేరాగ్రాఫుల చొప్పున మాట్లాడుతుండే వాడుట!

తను పూర్తి చేసి పంపిన పజిల్స్ రిజల్ట్స్ కోసం వాడు ఎగ్జాంస్ రిజల్ట్స్ కంటే ఉత్కంఠగా ఎదురు చూసేవాడు.
నేను ఆరో క్లాసు లో ఉండగా బాబాయి పెళ్ళి జరిగింది. పాపం పిన్ని అప్పుడు డిగ్రీ సెకండియర్ లో ఉంది. ఎంచక్కా పెళ్ళయిపోతే చదువు మానేసి సాయంత్రాలు జడ ముందుకేసుకుని చివర్లు అల్లుకుంటూ, బాబాయి కోసం చూస్తూ కిటికీ దగ్గర నిల్చోవచ్చని కలలు కంటుందనుకుంటాను. బొత్తిగా పుస్తకాల గొడవ పట్టేరకం కాదు.

 బాబాయి పెళ్ళి రోజు సాయంత్రం వాడి ఫ్రెండ్స్ రాగానే "ఏరి? ఎక్కడ ? నా ప్రభా, నా జ్యోతి,.వనిత,వచ్చారా? ఎంత కలవరిస్తున్నానో మీకేం తెల్సు? తీసుకొచ్చారా?" అని ఫ్రెండ్స్ ని ఆత్రంగా అడగటం చూసి పెళ్ళి కూతురు వైపు చుట్టమొకావిడ నిర్ఘాంత పోయి లోపలికి పరుగు తీసింది(ట).

ఇంకేముంది? కాసేపట్లో పెళ్ళి కూతురి ఏడుపూ, వాళ్ల నాన్న పరిగెత్తుకుని విడిదింటికి రావడమూ...సీన్ అంతా గుర్తు లేదు గానీ మొత్తానికి పెద్ద గొడవే అయింది. బాబాయి అప్పటి వరకూ కల "వరించింది"  జ్యోతి మంత్లీని,ప్రభ వీక్లీని అని తెలిశాక  తెల్లబోయి   గొల్లుమన్నారు.

ఆ జోకు చాలా రోజులు చుట్టాల్లో సర్క్యులేషన్లో ఉండిపోయింది.

అది అంతటితో ముగియక, బాబాయ్ పెళ్ళి తర్వాత కూడా అర్థ రాత్రుల వరకూ పజిల్స్ సాల్వ్ చేస్తూ టేబుల్ మీదే పడి నిద్ర పోవడమూ, వాళ్లావిడను సినిమాలు షికార్లకు తిప్పక అడ్డాలు, నిలువులు కూర్చుకుంటూ కుచోడంతో , అంతా కొద్ది కాలం ఆమెని బాబాయి పజిల్స్ పిచ్చితో సర్దుకోమన్నారు. ఆవిడ వినక పుట్టింటికి పెట్టె సర్దుకుంది.

కొన్నాళ్ళకి బాబాయికి మధ్య ప్రదేశ్ కి ట్రాన్స్ఫర్ అయి వెళ్లిపోయారు. తర్వాత తెలిసిందేమిటంటే బాబాయి ఆ పిచ్చి పిన్నికి కూడా పట్టించాడు. ఇద్దరూ కల్సి అడ్డాలూ నిలువులూ పూరించుకుంటూ నాలుగేళ్ళ కొడుకుని పట్టించుకునే వారు కాదు .


పొద్దు పత్రికలో పజిల్ ఇచ్చేటపుడు చాలా సరదాగా ఉండేది. సుగాత్రి అనే బ్లాగర్ ఒకావిడ పొద్దులో అలా పజిల్ ఇవ్వగానే ఇలా బ్లాగ్ లో ఒక టపా రాసేవారు.దానికి స్లిప్పుల సర్వీసు .అని పేరు అందులో అసలు పజిల్ ఆధారాలకు క్లూ లు ఉండేవి. పజిల్ పిచ్చి ఉన్న వాళ్లంతా అక్కడ చేరి(భైరవ భట్ల కామేశ్వర రావు గారు, జ్యోతి, కొత్తపాళి గారు,నేను...ఇంకా మరికొందరూ)క్లూలు  ఇచ్చేసుకుంటూ అసలు పజిల్ కి క్లూలతో ఇంకో పజిల్ తయారు చేసేవారు.

పొద్దులో పజిల్ మానేశాక, నిరాశ పడి ఊరుకున్నాం. మాలికలో పజిల్ మాలికా పద చంద్రిక మాత్రం నాకు బాగా నచ్చేస్తోంది. ఈ సారి ఎలాగైనా పూర్తి చేసి ప్రైజ్ కొట్టేస్తాను!

క్రాస్ వర్డ్ పజిల్ కూర్చడానికి ఎంత ఓపిక,యుక్తి తెలివి కావాలో నిజంగా! పూర్తి చెయ్యడానికే మనం ఇన్ని తంటాలు పడుతున్నామంటే కూర్చే వాళ్ల సంగతేంటి?

శ్రీ శ్రీ జ్యోతి మంత్లీలో కూర్చిన పజిల్స్ ఆధారాలు చూస్తే భలేగా ఉన్నాయి.

"తల తిరుగుడు రచయిత్రి"(2)అని ఇచ్చారుట.ఎవరో కనుక్కోండి? :-P

శ్రీ శ్రీ కూర్చిన పదబంధ ప్రహేళిక ఒకటి దశాబ్దాల నాటిది దొరికింది.

(జవాబుల ప్రింట్ కూడా ఉంది. ఆసక్తి గల వారు పూరించుకోవచ్చు)


జ్యోతిలోనే ఆరుద్ర కూర్చిన పజిల్స్ కూడా (ఈ మధ్య వరకూ కూడా మా ఇంట్లో పాత కాపీలుండేవి, వాటిలో చూశాను)చాలా బాగున్నాయి.

తెలుగు నిఘంటువులూ, వ్యాకరణాలు వెదికిపట్టుకునే క్లూల కంటే యుక్తితో, కాస్త బుర్ర ఉపయోగించి పట్టుకునే క్లూలే బాగుంటాయి. రచన మాస పత్రికలో ఎన్ సురేంద్ర గారు పజిలింగ్ పజిల్ ఇచ్చినన్ని రోజులు చాలా ఉత్సాహంగా పూర్తి చేసేదాన్ని. పూర్తి చేయడమే తప్ప పంపడంలో అంత శ్రద్ధ ఉండేది కాదు.

ఈ పిచ్చి ఎంత ముదురుతుందంటే ఈనాడు ఆదివారం ఎడిషన్లో కూడా , అది పేపర్తో పాటు రాగానే దాని కోసమే చూస్తున్నట్టు...అది పూర్తి చేసి అక్కడ పడేస్తే కానీ(అది పిల్లల స్టాండర్డ్ అయినా సరే)బావుండదు.

దీన్ని వదిలించుకోవాలని లేదు నాకు.. ఇంకా ముదిరితే బాగుండని ఉంది .

I really enjoy this..! Then why to get rid of....? :-)




May 24, 2011

మాగాయే మహా పచ్చడి ............!


ఏమిటో ఎండాకాలం రాగానే అంతా ఆవకాయ  ఆవకాయ  అని ఆవకాయ మానియా పట్టుకున్న వాళ్లలా కలవరిస్తున్నారు. కొత్తావకాయ మహారుచి, ఘాటూ కాబట్టి ఆవకాయ పెట్టిన కొత్తల్లో ఎన్ని వెరైటీలు చేసినా, ఎన్ని కూరలు చేసినా  ఇంట్లో  వాటికి సేల్సే ఉండవు. ఆ కొత్త మోహంలో మొదట మొదట లాగించేసినా వర్షాలు మొదలయ్యేసరికి ఆవకాయ   డిమాండ్ కాస్తా ఢామ్మని పడిపోతుంది.

కానీ ఈ మాగాయ ఉందే..ఇది అలాక్కాదు!

 మాగాయ పెట్టిన మొదటి రోజు నుంచి  ఇంగువ ఘుమ ఘుమలతో ఎంత  ఎంత పాత బడితే అంత రుచులూరుతూ, మతి పోగొట్టేస్తుంది. అందుకే నా వోటు మాగాయకే పడుతుంది.

గత రెండేళ్ళుగా నేను అమ్మ/అత్తల గైడెన్స్ తో ఆవకాయ మాగాయ సొంతగా పెట్టడం మొదలుపెట్టాను. నేను తప్ప మిగతా వాళ్లంతా(చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళూ కూడా)  అమ్మ దగ్గర్నుంచో, అత్తల దగ్గర్నుంచో తెచ్చేసుకుని హాయిగా మింగుతున్నారు.

 మా పెద్దక్క అంటుందీ (దీని కూతురికి పెళ్ళయి, దానికి కొడుకు కూడా పుట్టేసి ఇది అమ్మమ్మ కూడా అయింది) "ఎందుకే లేనిపోని లంపటం! హాయిగా అమ్మ పెట్టిస్తే తెచ్చుకోరాదూ! ఏమోనబ్బా, నాకైతే అమ్మ పెట్టిన రుచి రాదనిపిస్తుంది"(అంతా అవద్దం, పెట్టడానికి బద్ధకం).



నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలని నిర్ణయించుకుని మా అత్తగారి పాదాలకు నమస్కరించి రెండేళ్ళ క్రితం ఆవకాయ పెట్టాను. అది సూపర్ హిట్టయి కూచుంది. దాంతో మా అత్తగారు/అమ్మగారు ఇద్దరూ అడ్వాంటేజ్ తీసుకుని "ఇంకేం, మాగాయ కూడా నాలుక్కాయలు పడేసెయ్, ఎందుక్కుదరదో చూస్తాం" అన్నారు.

 పెట్టాను!

కుదిరింది!

అందువల్ల వీళ్ళిద్దరూ అందరికోసమూ ఆవకాయా, మాగాయా ఒక రెండొందల కాయలు పెట్టేసి నన్ను మాత్రం లిస్టు లోంచి తీసేశారు ."అబ్బే, అమ్మలు బ్రహ్మాండంగా పెట్టేస్తుంది ఆవకాయ" అని!

కాయలు తెద్దామని రైతు బజారెళ్దామంటే మా ఆయనకు ఇంతలావున కోపం వచ్చేసింది."అబ్బబ్బ, భలే చేస్తావు నువ్వు! అమ్మ ఇస్తే తీసుకోవచ్చు కదా!అక్కడ పార్కింగ్ దొరికి చావదు.కాయల సెలక్షన్ మనకు తెలీదాయె" అని విసుక్కున్నాడు. బాగా వెన్నపూస, నూజివీడు రసాలు వేసుకుని ఆవకాయ బుచ్చిబాబు లెవెల్లో గుండ్రాయంత ముద్దలు  మాయం చేసేటప్పుడు  ఈ విసుగుండదు మళ్ళీ!

రైతు బజార్లో తెల్ల జుట్టున్న వృద్ధ బామ్మలు బేరం చేస్తున్న మావిడ కాయల వాడి దగ్గరకెళ్ళిఒకావిడను పట్టుకుని " మామ్మగారూ, ఏవి కాయలు ఆవకాయకు  శ్రేష్టమో, మరియు ఏవి మాగాయకు శ్రేష్టమో వివరింపవలసింద"ని కోరాను. అప్పుడామె ఈ విధంగా చెప్ప దొడగింది

"నీ మొహమే పిచ్చి తల్లీ! ఈ ఆవకాయ కాయ సెలక్ట్ చేయడం బ్రహ్మ తరం కూడా కాదు. వీడు తెల్ల గులాబీలంటాడా, ముక్కేమో వారానికే మెత్తబడుతుంది. ఒకే చెట్టు కాయలంటాడా, పోయినేడాది కాస్త బూజు కూడా వచ్చింది. కాబట్టి కళ్ళు మూసుకుని తీసుకో, ఆ పై నీ అదృష్టం! గత నలభై ఏళ్ళుగా ఇలాగే నెట్టుకొస్తున్నా"  

ఎలాగో విజయవంతంగా ఆవకాయ పెట్టేశాను. మాగాయ ముక్కలు ఒక్క ఎండకే వడియాల్లా ఎండాయి. ఇంతలో మెంతిపిండి, ఆవపిండి కొలత మర్చిపోయాను. అత్తగారు ఈ ఎండల్లో ఢిల్లీ వెళ్ళారు(బాడ్ టేస్టు) . ఫోనేమో నాట్ రీచబుల్!

 అమ్మనడిగితే "ఏమోనే,, నువ్వు ఆరుకాయలు పదికాయలూ పెడితే నాకెలా తెలుస్తుంది,కనీసం నూట యాభై కాయలకైతే చెప్తా కొలత" అంది. "ఏడిసినట్టుంది. ఇప్పుడు నూటయాభై కాయలు పెట్టమంటావా? ఈ పదికాయలకే ఇక్కడ పేగులు తెగేలా ఉన్నాయి"అని విసుక్కుని తృష్ణకి. మెయిల్ రాశాను.

ఆవిడేమో ఒక టీ గ్లాసు కోలత తీసుకోండి అన్నారు. టీ గ్లాసంటే? మా మావగారు గజం పొడుగు గ్లాసుతో తాగుతారు టీ! నేనేమో ఔన్స్ గ్లాసుతో తాగుతాను! అదే అడిగా  "టీ గ్లాసంటే ...ఏదండీ?"అని!



తృష్ణ మనసులో "వెధవ డౌట్లు, ఏవీ తెలీదు, మళ్ళీ ఓ అని తయారైపోతారు ఆవకాయ మాగాయ అని"అనుకుంటూ "అదేనండీ, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ తో ఇచ్చే కప్ ఉంటుంది చూడండి, అందులో ముప్పావు వంతు" అని సౌమ్యంగా చెప్పారు.(జోక్కి రాశాలెండి, పాపం తృష్ణ ఏమి అడిగినా చక్కగా చెప్తారు విసుక్కోకుండా) !

అలా మాగాయ కూడా ఎలాగో విజయవంతంగా పెట్టేశాను.  ఇంగువ పోపు పెడుతుంటే ఏదో బాంక్ క్రెడిట్ కార్డు ప్రమోషన్ కోసం వచ్చి బెల్లు కొట్టినబ్బాయి లోపలికి తొంగి చూస్తూ" something smells good and yummy here " అన్నాడు! అమ్మయ్య, ప్రజాభిప్రాయం బాగనే ఉంది.



ఎప్పట్లాగే మా  ఇంటాయన ఆవకాయ కలుపుకుని "సూపర్ గా ఉందిరా" అన్నాడు. చెప్పాగా, తినేటపుడు విసుగుండదని!

నా ఊరగాయల సంగతి తెలిసి మా చెల్లెలు "నాక్కూడా ఒక డజను కాయలు మాగాయ పెట్టవే ప్లీజ్" అని అర్థించింది ఫోన్లో!

"రాంగ్ నంబర్" అని ఫోన్ పెట్టేశాను.

అమ్మో అమ్మో, మాగాయ కలిపిన రోజైతే ఏదో ఎండలో రాళ్ళెత్తే పని చేసినట్టు ఆదమర్చి నిద్రపోయాను.  భవసాగరం ఈదడమంటే ఏమిటో ప్రత్యక్షంగా తెలిసింది!   పది కాయలకే ఇంత హడావుడైతే, పాపం వందల కాయలు ఎలా పెట్టేవాళ్ళో అమ్మావాళ్ళు అని ఆలోచించా మొదటిసారి ఆ రోజు!


ఈ పోస్టు SHANKAR.S.గారికి సరదాగా అంకితం  !


March 10, 2011

అన్నం మానేయడం ఎలా?





టైటిల్ చూసి అన్నం మానేయడానికి అరవై సులభ చిట్కాలు చెప్తానని అనుకున్నారో ఏమో...అదేం కాదు!


"అన్నంమానేయడం ఎలా? అసలెలా సాధ్యం? ఎలా? ఎలా?" అని విస్తుపోతున్నానన్నమాట

మొన్న ఒకాదివారం ఉదయం పదకొండు గంటల వేళ

ఆవ కలిపిన పనసపొట్టు కూర(వంటలు రాసే  బ్లాగర్లకు  మంచి  అవిడియా) లో, అప్పుడే వేయించిన మినపవడియాలు కలిపి, గోంగూర పచ్చడిలో ఇంగువ పోపు పెట్టి,వేడి వేడి పాఠోళీ బౌల్ లోకి తీసి, వంకాయ పచ్చి పులుసు(పులుసు పచ్చడి)లో కొత్తిమీద కత్తిరించి వేస్తుండగా "హా....పనస పొట్టు..పనస పొట్టు..." అంటూ కేకలు వినపడి వంటింట్లోంచి తొంగి చూశాను. మురళి!

కుంకుమ పువ్వు రేకలతో లేత  బంగారు రంగులో అలరారుతున్న చక్రపొంగలిలో బాదం పప్పు చీలికలు సర్దుతూ "రారా! మొన్న మంగళవారమేగా వచ్చావు?మళ్ళీ అప్పుడే వచ్చావేం?" అన్నాను.

"ఏంట్రా?ఈ మధ్య కనపడ్డమే మానేశావు? నల్లపూసైపోయావు"వంటి ప్రశ్నలకు వాడసలు అవకాశమే ఇవ్వడు.
"అత్తా, అబ్బ, ప్రతి వీకెండూ ఇంత భారీ మెనూ ఉంటుందా ఇక్కడ?" అన్నాడు పాఠోళీ స్పూన్ తో తీసుకుని తినేస్తూ!

"అంత లేదురోయ్, ప్రతి వీకెండూ మీ అత్త వంటే చెయ్యదు, ఏదో ఇవాళ నా పుట్టినరోజని...." అన్నాడు వాళ్ళ మామయ్య. ఇలాంటి అలవోక అబద్ధాలు తన దగ్గర చాలా ఉంటాయి. మురళి   నా మేనల్లుడు. ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ మధ్యే కండలు పెంచాలని, బొజ్జ తగ్గించాలని జిమ్ములో చేరాడు.

"ఏంటి? ఇప్పుడు ఇవన్నీ తింటారా మీరూ"అన్నాడు వాడు చూపులు కల్సిన శుభవేళ సినిమాలో బ్రహ్మానందాన్ని గుర్తుకు తెస్తూ!

"మరి?నీకు వడ్డించి, నువ్వు తృప్తిగా తింటుంటే కన్నీళ్ళు తుడుచుకుంటామనుకున్నావా ?"

"ఇవన్నీ మీకు అరగవు. నేను రొట్టెలు తింటుంటే మీరు ఇన్ని రకాలు వేసుకుని భోజనం చేస్తే అది మీకు విషంగా మారి...."అని శపించబోయాడు.

 "నీక్కూడా కొద్దిగా వేస్తాంలేరా! ఇంతకీ  నీ జిమ్ము ఎంత వరకూ వచ్చింది?" అడిగాను.

మురళి నీరసంగా నా వైపు ఒకకాగితం విసిరేశాడు. "ఇదిగో, నా డైట్ ఛార్టు, చూడు" అని!

1. పొద్దున్నే ఒక కప్పు గ్రీన్ టీ,నానపెట్టిన బాదంపప్పులు 4

2. గంటన్నర సేపు రకరకాల వర్కవుట్లు

3. పోస్ట్ వర్కవుట్ కి రెండు ఎగ్ వైట్స్, తర్వాత ఒక కప్పు కార్న్ ఫ్లేక్స్ విత్ డబుల్ టోండ్ మిల్క్,

4. మధ్యాహ్నం లంచ్ కి రెండు రోటీలు,కూరగాయల సలాడ్,కప్పు మొలకలు

5. రాత్రికి డిన్నర్ రెండు రోటీలు,గ్లాసు వెన్న లేని మజ్జిగ,నాలుగు కీరా ముక్కలు!

"ఇదేంట్రా, మరి అన్నమెప్పుడు తింటావు?"అన్నాను తెల్లబోయి.

"అన్నమా? నా మెనూలో అసలు అన్నమే లేదు. అన్నం తినొద్దన్నారు"

వాళ్ళ మామయ్య కాస్త జాలిపడి "పోనీ వాడికి రెండు పుల్కాలు  చేసెయ్యి, లంచ్ చేసి వెళ్తాడు."అన్నారు.


వాడు వంటింట్లోకి తొంగి చూసి "ఇవాళొద్దు మామయ్యా, అన్నమే తినేస్తా! పనసపొట్టు కూర వదిలే ప్రసక్తే లేదు.రేపటినుంచీ తింటాలే పుల్కాలు "అన్నాడు. వాడు రోజూ ఇదే డైలాగు కాస్త అటూ ఇటూగా చెప్పేసి అన్నమే తినేస్తున్నాడని నాకు తెలుసు.

రోజూ ఒకపూటయినా అన్నం తినకుండా జనాలు ఎలా బతికేస్తారో నాకు అర్థం కాని విషయం! (ఇప్పుడు సాయంత్రాలు మా ఇంట్లో పుల్కాలే  అనుకోండి)నా చిన్నప్పుడు గోధుమ రొట్టెలంటే అమ్మ శనివారం రాత్రో,ఆదివారం ఉదయమో చేసే టిఫినే! బంగాళాదుంప కూరతో!అది మెయిన్ కోర్సు ఎప్పుడూ కాదు. దానికెప్పుడూ చిరుతిండి స్థానమే తప్ప, భోజనం స్థాయి లేదసలు!

చెప్తే నవ్వుతారేమో,పెళ్ళయ్యేదాకా నాకు  జనాలు చాలామంది మెయిన్ కోర్స్ గా రొట్టెలు తింటారని తెలీదు. ఈ లోగా తను నాకు ఉత్తర భారతదేశమంతా చూపిద్దామని పది రోజుల ట్రిప్ ప్లాన్ చేశాడు. అంత వరకూ నాకు రెండు పూట్లా పప్పు, కూర, పచ్చడి ,చారు వగైరాలతో సుష్టుగా తినడం తప్ప థాలీలు,రోటీలు తెలీవు.మూడు రోజులయ్యేసరికి ఎక్కడా నాకు కావలసిన అన్నం దొరక్క పిచ్చెక్కి,ఏడుపొచ్చి,ఆ బాధనంతా మొహమాటపడి బయటికి చెప్పకుండా దాచడంతో అది పెద్ద పెట్టున జ్వరంగా పరిణమించింది. నిద్రలో "అన్నం ......పప్పు " అని కలవరింతలు! 

చివరికి ఒక హిల్ స్టేషన్ లో వాళ్ల ఆఫీసు గెస్ట్ హౌస్ లో వంటవాళ్లకి పరిస్థితి వివరించి చెప్పి తనే దగ్గరుండి పొడి పొడిగా దక్షిణ భారత స్టైల్లో అన్నం,పాలకూరపప్పు చేయించాడు. అది తిన్నాక గానీ నా జ్వరం తగ్గుముఖం పట్టలేదు.

ఏ దేశమేగినా ఎందుకాలిడినా మంచి సోనా మసూరి బియ్యం ఉన్నాయో లేవో వెదుక్కుంటాను. గుర్గావ్ లో ఉన్నపుడు అక్కడి ఆంధ్రా స్టోర్స్ నిరంజన్ కిలోకి 26 రూపాయలు వేసుకుంటున్నాడని తిట్టుకుంటూనే(అప్పట్లో ఇక్కడ కిలో పన్నెండు రూపాయలే)తెమ్మని చెప్పేదాన్ని!

ఉద్యోగ రీత్యా దేశంలోని అన్ని నగరాల్లోనూ స్థిరపడ్డ నార్తిండియన్స్ వాళ్ల మెయిన్ కోర్స్ ని విజయవంతంగా సిటీ ప్రజల మెయిన్ కోర్స్ గా దాదాపుగా మార్చేశారని నా ఫిర్యాదు . ఏ రెస్టారెంట్ కైనా వెళ్లండి...."తందూరీ రోటి, బటర్ రోటీ, నాన్,రుమాలీ రోటీ,కుల్చా,కడాయి పనీర్,పనీర్ బటర్ మసాలా,పనీర్ దో ప్యాజా,దాల్ మఖనీ...."ఇవే వంటకాలు!సౌత్ ఇండియన్ థాలీలో సౌత్ ఇండియా ఎంతవరకూ ఉంటుందో మీకు బాగా తెలుసు!

అన్నం,పప్పు,పచ్చడి,పులుసు అంటూ తెలుగు భోజనం వడ్డించే రెస్టారెంట్లు నగరాల్లో అరుదుగా కనపడతాయి.బెంగుళూరులో కాస్త నయం! నాగార్జున,నందిని వంటి రెస్టారెంట్లు ఉన్నాయి.

అన్నం తింటే కార్బోహైడ్రేట్స్ బాగా పెరిగి డయాబెటిస్ వస్తుందట....! మా పక్కింటి యూపీ అమ్మాయి... చెప్తుంది వారానికి సరిపడా పది కిలోల బంగాళాదుంపలు తీసుకుంటూ!

కడుపారా తిని,ఒళ్ళొంచి శారీరక శ్రమ చేసేవాళ్లు అన్నం తినడానికి ఇంత భయపడక్కర్లేదని నా అభిప్రాయం!

తినండి,పని చేయండి!ఇదే నా ఫిలాసఫీ!

ఆరోగ్యపరంగా ఎన్ని జాగ్రత్తలు పాటించినా,అన్నం విషయానికొచ్చేసరికి మాత్రం నేను కాంప్రమైజ్ కాను. ఒక్క పూటయినా ఇష్టప్రకారం పచ్చళ్ళూ పప్పూ వగైరాలతో తెలుగింటి భోజనం చేయాల్సిందే!

సెలవుల్లో ఒక వారం రోజులపాటు ఎక్కడికైనా వెళ్ళి , తిరిగి ఇంటికొచ్చిన రోజు బయటి తిండి తిని వారం పాటు పిచ్చెక్కి ఉంటుందా....అందుకే హాయిగా రైస్ కుక్కర్ మాత్రమే పెడతాను. హాయిగా ఆవకాయ,మాగాయ,పండుమిరపకాయ పచ్చడి,ఉసిరావకాయ,గోంగూరపచ్చడి వగైరాలతో హాయిగా తినేసి సాయంత్రం దాకా  విశ్రాంతి తీసుకుంటే ప్రపంచం ఎంతో అందంగా కనపడి ఊర్నుంచి వచ్చామని తెల్సీ రాని పనిమనిషిని,మంచినీళ్ళ డబ్బా తీసుకురాని బిస్లరీ వాడిని,హోటల్ రూములో సెల్ ఫోన్ ఛార్జర్ మర్చిపోయిన మొగుడు గారిని   కూడా క్షమించబుద్ధేస్తుంది.  

February 10, 2010

అందమైన ఫొటోలు !

 photography is all about timing! నిజమే అని ఈ ఫొటోలు చూసి ఒప్పేసుకోవాలి!

ఫొటోగ్రఫీ అంటే నాక్కూసింత సరదానే! డిజిటల్ కెమెరా కాదని , ఎస్సెల్లార్ లో ఫిల్మ్ రోల్స్ చాలా తగలేస్తూ ఉంటా. కాసిన్ని మంచి ఫోటోలు కూడా తీశాను. తర్వాతెప్పుడైనా చూపిస్తాలెండి!




నా బ్లాగు క్రమం తప్పక చదివే ఒక ఫ్రెండ్ ఈ ఫొటోలు నిన్న పంపారు నాకు. అద్భుతమనే మాట చాలదు.



ఇంత పవర్ ఫుల్ కెమెరా కొనడానికి ఎంతవుతుందో , నేనెప్పుడు కొంటానో, నాకెప్పుడు ఇంత స్కిల్ వస్తుందో..ఏమిటో..అంతా మాయ!


.ఈ ఫొటోలు ఇంతకు ముందు మీరు చూసుంటే సరే, చూడకపోతే ఒకసారి .......!



ఫొటోలు పంపిన ఫ్రెండ్ కి థాంక్యూలు!
                                                         I'm a disco dancer....!

                                         ఎంతైనా అమ్మ వొడి భలే వెచ్చగా ఉంటుంది కదండీ!
                                               ఏమిటింతాలస్యం? ఆకలి దంచేస్తోంది

                   There is no excuse for lazyness here! But I'm working on that!

ఎంత ముద్దొస్తున్నావో తెలుసా! హు, మా పిల్లలూ ఉన్నారు, ఇంతింత మెడలేసుకునీ....


ఇట్నుంచి తీసినా వస్తుందా పొటిగరాఫు?


                                             అద్దిరా దెబ్బ! జాక్ పాట్ కొట్టానివ్వాళ!                        

          
                                               అమ్మతోటే ఉంటాము.. అమ్మ మాటే వింటాము!
                                              బాబోయ్, అరుపులా ఆవలింతలా?

                                             నేనూ మీతోనే ఉంటా..!



                                                ఆవురావురు...!

                                           Mow, Curly, and Larry..the three stooges!
                                                      తువ్వాయి తువ్వాయి...!




                                                కాసేపు పిచ్చాపాటీ కబుర్లాడుకుందాం!


                                                    వదల బొమ్మాళీ వదల!



                                           సెలవుల్లో సరదాగా జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటున్నా!



 
అయ్యో పప్పోతున్నా! హెల్ప్ హెల్ప్!



వీళ్ళమ్మ షాపింగ్ నుంచి వచ్చేదాకా బుజ్జి ముండ నా దగ్గరే ఉంటుందిలెండి!

నేనూ నేర్చుకుంటా, ఫుడ్డు సంపాయించుకోడం!


ఆటాడుకుందాం రా !


December 31, 2009

(నెరవేరని) నా కొత్త సంవత్సరం తీర్మానాలు!



ప్రతి ఏడాదీ డిసెంబర్ వస్తోందనగానే ఆలోచనలు మొదలవుతాయి, కొత్త కొత్త తీర్మానాలేం చేసుకోవాలా అని! అందునా ఇప్పుడు మరీ ఈ టీవీ ఛానెళ్ళు  ,వార్తా పత్రికలు   ఏం తీర్మానాలు చేసుకుంటే బావుంటుందో వాళ్లే చెప్పేస్తారు, కనీసం మన తీర్మానాలు ఆలోచించుకునే అవకాశం కూడా మనకివ్వకుండా!

వాళ్ళు చెప్పే తీర్మానాలు ఇలా ఉంటాయి...మచ్చుకు కొన్ని


1.పాజిటివ్ గా ఆలోచించడం


2.సహనం అలవర్చుకోవడం


3.ఈ ఏడాది కనీసం ఒకరికన్నా అవసరంలో సహాయం చేయడం


4. ఒక్కసారన్నా రక్తదానం చేయడం.


5. కోపం తగ్గించుకోవడం

6. డబ్బు ఖర్చుపెట్టేముందు అవసరమా?అని ఆలోచించడం!

ఇలా మల్టిపుల్ ఛాయిస్ ఇచ్చి ఒకటి టిక్కు పెట్టమంటారు.


ఫర్గెటిట్! అన్నీ తూచ్ కొట్టాల్సినవే!



నిజంగా అయితే...సామాన్య జనం చేసే తీర్మానాలు కొన్ని చూద్దాం!


అన్నింటికంటే ప్రాధాన్యం ఉన్నది "బరువు తగ్గడం"(దీనికి మీలో ఎంత మంది వోటేశారో ఊహిస్తున్నా)

మంచి స్నేహితుల్ని సంపాదించుకోవడం

ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చేలా కష్టపడి పని చేయడం

కారు కొనడం

ఇల్లు కొనడం


వీటిలో మాత్రం నేను ప్రతి ఏడాదీ మొదటి దానికే టిక్కెడతాను.ప్రతి ఏడాదీ తీర్మానాలు మార్చేస్తే ఏం బావుంటుంది లెద్దూ అని!



ఏమిటీ..అమలు చేయడమా? ఇదిగో....ఇలాంటి ప్రశ్నలేస్తేనే మరి.......!



నా ఫ్రెండ్స్ లో శ్రీలక్ష్మి అనే పిల్ల ఉండేది. అది ప్రతి యేడాదీ " ఈ ఏడాది నేను నర్సిమ్ములు ని పెళ్ళాడేస్తాను"అనేది. నర్సిమ్ములంటే వాళ్ల బావో, బాయ్ ఫ్రెండో అనుకునేరు.మా కాలేజీ రోడ్లో ఉండే మిర్చిబజ్జీల బండివాడు.ఆ బజ్జీలంటే అంత ఇష్టం దానికి!


దాన్ని పెళ్ళికూతుర్ని చేసిన రోజు సాయంత్రం వాళ్ల తమ్ముడు తెచ్చిన బజ్జీలు ఖాళీ చేస్తూ కూడా ఇదే డైలాగ్ చెప్పింది శ్రీలక్ష్మి! తీర్మానమంటే అలా ఉండాలి.ఎప్పటికీ నెరవేరకుండా!

తీర్మానాలు చేసుకునే వారు ప్రతి యేడాదీ మర్చిపోకుండా డిసెంబర్ చివరి వారంలో మంచి లెటర్ పాడ్ ఒకటి కొనో, లేక ఒక తెల్ల కాయితం మీదో తీర్మానాలు రాసుకోవడం మామూలే! జనవరి నెల మొదటి వారం తప్పకుండా పాటించడం మామూలే! రెండో వారం ఉత్సాహం తగ్గడం, మూడోవారం నీరసం రావడం..ఎలాగో లాక్కొచ్చి ఫిబ్రవరి నెలాఖరుకు పరుపు చుట్టేసి, డిసెంబర్లో చూద్దాం లెద్దూ అనుకోవడం...అన్నీ మామూలే!



నా తీర్మానమే చూద్దాం! పోయిన డిసెంబర్లో "అమ్మో! మళ్ళీ కిలో బరువు పెరిగాను. లాభంలేదు.జనవరి నుంచి రైస్ తగ్గించాలి.నెయ్యి మానేయాలి! పళ్ళు , జూసులూ ఎక్కువగా తీసుకోవాలి"అనేసుకున్నా గాట్టిగా!జనవరి మొదటివారమంతా చాలా సీరియస్ గా పుల్కాలు,పళ్ళు..ఇలా లాగించా!

 రెండో వారానికి అన్నం లేకపోతే చచ్చిపోతాననిపించింది .

"పోన్లే, ఒకపూట పుల్కాలు తింటానూ"అని (నా అంతరాత్మకి) సర్ది చెప్పి  ఒకపూట హాయిగా అన్నం మొదలెట్టాను.

తర్వాత రెండు రోజులకి ....

సంక్రాంతికి చేసిన నేతి అరిసెలు,వెన్న కాచిన ఫ్రెష్ నెయ్యి రెండు కిలోలు ఊర్నుంచి రాగానే వాటిని డైనింగ్ టేబుల్ మీద పెట్టి చూస్తూ నరకమంటే ఎలా వుంటుందో తెలుసుకోగలిగాను! తర్వాత నా తీర్మానం మట్టిగొట్టుకుపోయిందని మీకు వేరే చెప్పాలా ఏమిటిలెండి!



మా అన్నయ్య 'పొద్దున్నే లేవగానే దుప్పటి  మడతపెట్టాలి" అనే తీర్మానం నా చిన్నప్పటినుంచీ చేస్తున్నాడు. అలాగే  వదిన "పొద్దున్నే ముఖం కడుక్కోగానే బొట్టుపెట్టుకోవాలి. నుదురు బోసిగా ఉండకుండా"అనే తీర్మానం పెళ్ళయిన ఏడాదినుంచీ(వాళ్ల పెళ్ళయి పదిహేడేళ్ళు) చేస్తోంది.ఇద్దరూ రెంటినీ అమలు చేయరు.



మా ఎదురింటివాళ్లబ్బాయి ఈ ఏడాదైనా పదోక్లాసు పూర్తి చేయాలని తీర్మానించాడు. వాళ్ళ నాన్నేమో ఎలాగైనా ఈ వయసులో టెన్నిస్ ప్లేయర్ కావాలని...(సడే సడే!ఇలాంటి తీర్మానాలు అసలు తీరేవేనా!)

నేను ప్రతి యేటా క్రమం తప్పక చేసుకునే తీర్మానాలు...



1.ప్రతి రెండు రోజూలకీ ఇల్లంతా డస్టింగ్ చేయాలి లేదా చేయించాలి.


2. నెలకోసారి కర్టెన్లు మార్చాలి.


3.చెల్లెలుతో పోట్లాడకూడదు(ఇది చిన్నప్పటినుంచీ వస్తోన్న తీర్మానం)

4.బద్ధకించకుండా చలికాలమైనా సరే వాకింగ్ కి వెళ్ళాలి.



5.రోజూ బద్ధకించకుండా ఇంగ్లీష్ పేపర్ కూడా చదవాలి.


6.వృధా ఖర్చులు పెట్టకూడదు(అసలు వృధా ఖర్చుల్ని ఇంకా నిర్వచించలేదు నేను)


7.క్రమం తప్పక డ్రైవింగ్ ప్రాక్టీస్ చేయాలి.  ఈయన గారి చేత చీవాట్లు తినకుండా కారు నడపాలి.


8.వార్డ్ రోబ్ లోంచి  వాడనిబట్టలు అన్నీ తీసి పెట్టాలి.


9. పనమ్మాయి సరిగా పనిచేయకపోయినా సహనంగా ఉండాలి.


10. పాపాయి తో గొడవ పడకూడదు.వాదన అసలే పెట్టుకోకూడదు.


11. పీజా హట్, డామినోస్ వాళ్ళ నంబర్లు నా ఫోన్ లోంచి తీసేయాలి.


12 .కాఫీలు తగ్గించాలి.



చూడ్డానికి అన్నీ తేలిగ్గానే ఉన్నాయి కదూ! ఒక్కటి కూడా పూర్తిగా ఆచరించిన పాపాన పోలేదు.

ఈ ఏడాది మాత్రం ఒకే ఒక తీర్మానం...టీవీ9 చూడ్డం మానేయాలి. అంతే ఇంకేమీ లేవు.


అదండీ సంగతి! మీకు కూడా పాటించాలనుకుని పాటించలేకపోతున్న తీర్మానాలు ఉండే ఉంటాయి.ఒకసారి గుర్తు తెచ్చుకోండి.



ఒక్కక్షణం ఆగండి,డామినోస్ వాడితో మాట్లాడివస్తా! నా తీర్మానాలు పాటించాల్సింది రేపటినుంచి కదా!

September 21, 2009

అలగకపోతే చూడాలి !

చీటికీ, మాటికీ అలిగి కూచునే వాళ్లని చూస్తే ఇదివరలో భలే కోపం వచ్చేది. ఇప్పుడు అలవాటైపోయింది....కోపం రావడం! మా అమ్మాయి నేను కొంచెం కంఠం గట్టిగా చేద్దామని అనుకుంటూ ఉండగానే "నువ్వు నన్ను తిట్టావు"అని మొహం అటు తిప్పేసుకుని కూచుంటుంది, స్కూలు బస్ రెణ్ణిమిషాల్లో వస్తుందనగా!
బీపీ పెరుగుతుందా పెరగదా?

పైగా  "నీతూ వాళ్ళమ్మ .నీతూని ఏమీ అనదట  ." అని ఇంకొకరిని తోడు తెచ్చుకుంటుంది. పాపం ఆ  నీతూ వాళ్ళమ్మకు ఇహ ఆ ఓపిక కూడా లేదన్నమాట.




అసలు ఎవరైనా "అలక" ఎందుకు పూనుతారో, దీనెకేదైనా సైంటిఫిక్ కారణాలేమైనా ఉన్నాయా అని తెలుసుకోవాలని కోరిక నాకు! పైగా అలిగినపుడు ఆ కోపం "తిండి" మీద ఎందుకు చూపిస్తారా అని ఇంకో ఆశ్చర్యం!(చిన్నప్పుడు నేనూ అంతే లెండి)



మా ఇంట్లో ఎప్పుడూ ఎక్స్ కర్షన్ కి పంపించే వాళ్ళు కాదు.  అన్ లెస్..ఇటీజ్ కొండవీడు లేక అమరావతి!  ఇవి రెండూ దగ్గర కాబట్టి, సాయంత్రానికి ఇంటికొచ్చేస్తాం కాబట్టి! (ఇది తల్చుకుంటే కడుపు రగిలిపోతుంది నాకు. స్నేహితులందరితో కలిసి ఎక్స్ కర్షన్ కి వెళ్ళని జన్మా ఒక జన్మేనా అసలు?)  ఒకసారి మా స్కూలు వాళ్ళు శ్రీశైలం టూర్ కి ప్లాన్ చేశారు. మామూలే! మా ఇంట్లో వద్దనేశారు.

"ఏమిటి మతిపోయిందా? శ్రీశైలమే? అంతా కొండ, అడవి,నీళ్ళూనూ! (ఇవి లేని చోటికి ఎవరైనా ఎందుకెళ్ళాలో మరి) మనమందరం కలిసి వెళ్దాం లే" అనేశారు.(ఇంట్లో వాళ్ళతోనా? ఛీ)

ఆ రోజంతా అలిగి కూచునున్నాను, అన్నం తినకుండా!ఇలాంటి సందర్భాల్లో అమ్మ మా తిక్క భలే కుదురుస్తుంది. శరన్నవరాత్రులు కావడంతొ అమ్మవారికి చేసే నైవేద్యం కాక, దానితో పాటు ఆవడలు చేసింది అసందర్భంగా! సందర్భం చూసుకోకుండా అలిగినందుకు చింతిస్తూ..భోజనాల టైముకు మామూలుగా ఉండే ప్రయత్నం చేశాను,  అమ్మ గమనించకుండా కాజువల్ గా ఉండేలా జాగ్రత్త పడుతూ!!

కానీ ఆవిడ పది నిమిషాలకోసారి 'అమ్మలేమో అలిగి కూచుందాయె, ఇవాళల్లా తిండి తినదు,!ఎంత మొండితనమో"అని ఎవరో ఒకరితో అంటూనే ఉంది.



"అలగడం నీ హక్కు! నీ హక్కుని పరిరక్షించడం మా బాధ్యత" అన్నట్లు ప్రవర్తించేది అమ్మ. అసలు బతిమాలేది కాదు.అంత స్ట్రిక్టు!

 అసలావిడది స్టీవెన్ సీగల్  స్టైలు! ఏం జరిగిందో తెలిసే సరికి చెంప ఛెళ్ళుమనడం జరిగిపోయేది.(ఇదెప్పుడూ అన్నయ్యకే)


 అమ్మాయిలెప్పుడూ నాన్న కూతుళ్ళు కాబట్టి నానగారు మాత్రం "అదెందుకు అలిగిందీ"అని అలక తీర్చే ప్రయత్నాలు మొదలెట్టేవారు. ఈ  డిస్కౌంట్లు అబ్బాయిలకుండవు.  అన్నయ్య కి కోపం వచ్చిందంటే చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయి ఏ రాత్రికో ఇల్లు చేరేవాడు. ఒకసారి వాడు రాత్రియినా ఇల్లు చేరకపోయేసరికి నాకు అందమైన కలలొచ్చాయి కూడా!



వాడు అలా అలిగి వెళ్ళిపోయి ఏ వంతెన కిందో డబ్బు , రత్నాలు పంచుకుంటున్న దొంగల ముఠాలో చేరి పెద్ద "డాన్"  అయిపోతాడు. ఈ లోపు నేనొక అందమైన పోలీసాఫీసరుని (ఎస్పీకి తక్కువ రాంక్ కాకుండా చూసి)పెళ్ళాడేస్తాను. ఒకరోజు నేను నాగదేవత గుడికి వెళ్ళి పాము తో పిచ్చాపాటీ మాట్లాడుతుండగా అన్నయ్య నన్ను గుర్తుపట్టి ఆ తర్వాత రోజు వచ్చే రాఖీ  నాడు మా ఇంటికి ఒక బస్తాడు రత్నాలతో వస్తాడు.

అదే టైములో ఎస్పీ గారు....! ("ఈ సినిమామీరు చూశారు " కదూ  )

ఇంత సస్పెన్స్ లో ఉండగా అమ్మ లేపేసింది. లేచి చూస్తే... మడతమంచం మీద ఉన్న ముసుగు వీరుడు అన్నయ్యే అని తెల్సి నిరాశపడ్డాను. ఆ తర్వాత వాడు అలకలు మానలేదు కానీ నా కల మాత్రం నిజం చేయలేదు.



మా అమ్మాయి ఏ యే మాటలకు అలుగుతుందో చూడండి!

"ఏమిటి, ఇంకా ఆ రెండిడ్లీ తినడం అవలేదా?"(రెండు ఇడ్లీ ఇచ్చి అప్పుడే ఇలా అడిగేస్తారా ఎవరైనా?)

"నీ క్లాసులో అనన్య భలే ముద్దుగా ఉంటుంది" (అంటే నేను ఉండననేగా?)


"హాండ్ రైటింగ్ ఇలా ఉందేమిటి?"(మొన్నేగా నా హాండ్ రైటింగ్ బావుందని మెచ్చుకున్నావూ?అప్పుడే ఇలాగంటావా?")



"త్వరగా నడువ్, బస్సొచ్చేస్తుంది"(అంటే నేను లేట్ మాస్టర్ అనేగా నీ భావం?")


"డ్రస్ ఎందుకు అంతలా మాసిపోయింది?"(అంటే? నాకు నీట్ నెస్ తెలీదనేగా?)

"ఈ ఫ్రాక్ వద్దు, ఆ జీన్సు వేసుకో" (అంటే నేను ఫ్రాక్ లో సిండరెల్లా లాగా ఉండననేగా?")


ఈ మధ్య కౌన్సిలింగ్ లు ఎక్కువై  అలకలు తగ్గించింది కానీ,  లేకపోతే రెండు సార్లు పిలిచినా నేను పలక్కపోతే అలిగేస్తుంది.


భయపెట్టి అలకలు మానిపిద్దామంటే కుదరదు. దెయ్యాలు, బూచాళ్ళు ఉండరని నేనే చెప్పాను. ఇక దేనికి భయపడుతుందీ? టీచర్లని చూపించి భయపెట్టడం నాకిష్టం లేదు.

 తొమ్మిదో టీవీ లో క్రైం వాచ్ యాంకరంటే కూడా భయపడని పిల్లని ఏం చూపించి భయపెట్టాలో మరి!


ఇవాళ పొద్దున్నే అలిగి కూచుంది, ఎందుకంటే...Monday అంటే మంగళవారం కానందుకు! మంగళవారం దసరా సెలవులకు అమ్మమ్మ దగ్గరికి వెళ్తోంది మరి!

April 10, 2009

హాస్యగుళిక_ఓటరు గుర్తింపు కార్డు !

నాకు వోటరు గుర్తింపు కార్డు వచ్చిన విధమెట్టిదో ఇంతకు ముందొక టపా రాశాను.(భయపడొద్దు, ఆ టపా  లింకు ఇవ్వటం లేదు.)"మీ ఇంటికే వస్తుంది కార్డు" అని చెప్పడంతో చాలా నెలలు వేచి చూసి ఇక లాభం లేదని వెబ్ సైట్ లో కార్డు వివరాలు తీసుకుని మునిసిపల్ ఆఫీసుకు వెళ్లాను. సాధారణంగా ఇలాంటి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళేటపుడు దార్లో రెండు చార్టుల బీపీ టాబ్లెట్లు కొనుక్కుని వెళ్తాను నేను.

ఇంతకు ముందు జరిగిన అనుభవంతో "ఆస్తిపన్ను" అనే గదిలో కార్డు అడగటానికి వెళ్లాను.  అక్కడ ఇద్దరు స్వీపర్లు కూచుని పేలు చూసుకుంటున్నారు. మరో ఇద్దరు పురుషులు(బంట్రోతులనుకుంటా)టీ సేవిస్తున్నారు. అందులో ఒకడు నిర్లక్ష్యంగా ఒక చూపు విసిరి "ఎవలు? ఏం కావాలె?" అన్నాడు. అతడి చూపుకి నా బీపీ థర్మా మీటర్లో పాదరసంలా సర్రున పైకి పోయింది. వెంటనే ఒక టాబ్లెట్ మింగి కార్డు సంగతి చెప్పాను. అతడు టీ తాగుతూనే "ఆ పక్కన"అని చెయ్యి ఊపాడు.



ఓహో, ఎన్నికల సమాచారం ఈ సారి "పట్టణ దారిద్ర్య నిర్మూలన పథకం" గదిలో లభిస్తుందన్నమాట! లోపలికి వెళ్ళి విషయం చెప్పి నా వివరాలిచ్చాక, అక్కడ ఉన్న ఇద్దరు  కాంట్రాక్ట్ క్లర్కులు ఒక కార్డుల కట్ట తీసి నా మీదకు దాదాపు 'విసిరారు'. మరో రెండు టాబ్లెట్లు మింగి కట్టలో వెదికాను.నా కార్డు లేదు. వెబ్ సైట్లో ఉన్న వివరాల ప్రకారం నా పోలింగ్ స్టేషన్ నంబర్ చెప్పాను. ఆ క్లర్కు కుర్చీలోంచి ఎగిరిపడ్డంత పని చేసి "ఫలానా నంబరా? అదెట్లయితది?"అన్నాడు. అదెట్లయితదో నాకూ తెలీకపోవడంతో జవాబు చెప్పలేకపోయాను.

మరో నాలుగు కట్టలు వెదికాక, నా కార్డు నాకు ఏవిధంగానూ సంబంధం లేని నంబర్ పోలింగ్ స్టేషన్ కట్టలో దొరికింది.నా పక్కనే ఉన్న మా ఆయన (ఈయనకసలు బీపీ రాదు.) ఆ కార్డు చూస్తూనే "పేరు ఇదే గానీ ఫొటో మావిడది కాదండీ"అని తేల్చేసి వెనక్కిచ్చేసారు. ఆ క్లర్కు ఒకసారి నాకేసి కార్డుకేసి మార్చి మార్చి చూసి" ఏమి సారూ, ఇంత సక్కగ గొడుతుంటే? మేడమే ఇందులున్నది"అని తీర్మానించాడు. ఆ ఫొటో నాదే అని ఒప్పుకోడానికి మెదడు మొరాయిస్తోంది.



ఘోర రోడ్డు ప్రమాదాల్లో మొహం ఆనవాలు తెలీకుండా గాయాలపాలై మరణించినవాళ్లని ఒంటిమీదున్న వస్తువుల్ని బట్టి గుర్తుపట్టినట్లు, నేను కూడా కాసేపు పరికించి చూసి సంతోషంతో కెవ్వుమన్నాను."ఏవండోయ్, ఇవిగో, ఈ ఇయర్ రింగ్స్ నావే! నాదే ఈ ఫొటో" అని ప్రకటించాను. తనేమో కథల్లో రాసినట్లు స్థాణువై పోయాడు కాసేపు.

"ఇదేమిటి? ఇలా ఉందేమిటి ఫొటో" అని బాధపడ్డాడు .

'అదే నా నిజస్వరూపం! ఊరుకోండి" అని ఓదార్చాను.

ఇంతా చేసి కార్డులో మా ఇంటి నంబర్ తప్పు, కాలనీ పేరు లేదు, ఏరియా తప్పు. తప్పుడు అడ్రసు...పైగా అచ్చుతప్పులతో! దీనివల్ల మా కాలనీ వాళ్లంతా ఒక చోట, నేనొక్కదాన్నీ వేరేచోట వెయ్యాల్సివస్తుంది ఓటు!

ఒక్క ఊరట ఏమిటంటే భర్త పేరు అనే చోట పేరు సరిగా ఉండటం. కొంతమందికైతే  వాళ్లనీ మార్చేశారు.

"ఇదేమిటి ఇన్ని తప్పులు ?" అనడిగితే,

"మాకేమెరిక ? మేమేమన్నా ప్రింట్ కొడుతున్నామా"- మళ్ళీ ఒక టాబ్లెట్!

"మరి ఈ కార్డు పనికొస్తుందా?"

"ఈసేవా కేంద్రానికెళ్ళి సరి చేయించుకోవాలె"

"ఏ ఈసేవా కేంద్రం?"

"మాకేమెరిక? న్యూస్ పేపర్లో ఇస్తారు, చూసుకోండి"

"ఎప్పుడిస్తారు?"

"మాకేమెరిక? రోజూ చూసుకోండి, ఇస్తారొక రోజు" గుప్పెడు టాబ్లెట్లు మింగి కార్డు తీసుకుంటుండగా క్లర్కు ఐదారు కార్డులు తీసి "గివి మీ బిల్డింగ్ కార్డులు మేడము! నువ్వు దీస్కబోవాలె" అన్నాడు కొంచెం మర్యాదగా!

'నేను తీసుకెళ్లను " అందామనుకుని "నేను తీసుకెళ్లడమేమిటి? వాళ్ళకు మీరు పంపరా"అన్నాను.


"పంపాలంటే ప్రాపర్టీ టాక్స్ బిల్ కలెక్టరు రావాలె! గాయన లీవ్ లో ఎల్లిండు, మీరు దీస్కోని దస్కత్ పెట్టండమ్మా "అన్నాడు. సరే ఇలాంటి సంఘసేవ చేస్తే మనక్కూడా మన బిల్డింగ్ లో వెయిట్ ఉంటుందని తీసుకుని, సంతకం పెట్టి వచ్చాను.



ఇంటికొచ్చాక ఆ కార్డులు ఒక్కోటీ ఒక్కోరకంగా భయంకరంగా నవ్వించాయి మమ్మల్ని! ఈటీవీ లో సుమన్ గారి "శ్రీకృష్ణ బలరామ యుద్దం" చూసినప్పుడు కూడా అంతగా నవ్వలేదంటే నమ్మండి.



మచ్చుకు నా కార్డు చూడండి.


 "బికశ్రీపత్తి నగర్" అంటే "భిక్షపతి నగర్" అని అర్థం కావాలంటే మెదడులో కొంచెం ఎక్కువ గుజ్జు ఉండాల్సిందే! అది మాకంటే మా వాచ్ మన్ కి ఎక్కువగా ఉండటం వల్ల తను కనుక్కున్నాడు. భిక్షపతి నగర్ అనేది ఎక్కడుందో మాకెవ్వరికీ తెలీదు. "గోపాల రెడ్డి.న ...." అని సగంలో వదిలేశారు. ఆయనెవరో నిజంగా నాకు తెలీదు. ఒకవేళ అది గోపాలరెడ్డి నగర్ అయితే, అది ఈ చుట్టుపక్కల ఎక్కడుందో మాకు తెలీదు. kondapur village అనే మాటలు యధాతథంగా తెలుగులోకి కొండాపూర్ "విళ్గే" అని దించారు. ఇంతా చేసి మేముండేది కొండాపూర్ విలేజ్ లో కాదు.



మా వాచ్ మన్ కార్డులో భర్త పేరు అని రాసి దాని కింద తండ్రిపేరు వేసారు.మరొకరికి తండ్రిపేరు అని వేసి భర్త పేరు ! మా కిందింటి సుధా రామనాధన్ గారి పుట్టిన తేదీ పదేళ్ళు వెనక్కి జరిపారు. "భర్త పేరు మారినా ఒప్పుకుంటాను కానీ దీనికి మాత్రం ఒప్పుకో"నంటుందావిడ! అమ్మో ఏకంగా పదేళ్ళే? 29 నుంచి 30 దాకా డేకడానికే ఆరేళ్లు తీసుకుందాయెను!



నాలుగో ఫ్లోర్ లో ఉండే వైభవ్ చోప్రా గారి పేరు తెలుగులో "విధవ్ చోప్రా"గా పడింది.ఇది మరీ ఘోరం! తెలుగులో దానర్థం వివరించేసరికి అసలే తెల్లగా ఉండే ఆయన మొహం ఇంకా పాలిపోయింది.మరొకావిడ కార్డులో ఆవిడ ఫొటోకి బదులుగా పురుషుడి ఫొటో పెట్టారు.అది మేము చాలాసేపటికి గానీ పట్టుకోలేకపోయామనుకోండి:-)!



ఇక లాభం లేదని ఒక శనివారం పొద్దున్న (మా కాలనీలో ఎక్కువమందికి శనివారమే తీరికుండేది)మా నియోజకవర్గానికి నిర్దేశించిన ఈ సేవా కేంద్రానికి వెళ్లాము. వాళ్ళు "ఇక్కడ కాదు, మార్చేశాం, వేరే చోటికి వెళ్లాలి" అని అడ్రసు ఇచ్చారు.మళ్ళీ వెనక్కి! ఇక్కడికొచ్చాక ఇక్కడి వాళ్ళు కనీసం మా దరఖాస్తులైనా చూడకుండా, తలైనా తిప్పకుండా పదో తారీకు వరకూ టోకెన్లిచ్చేసాం పొండి. పదో తారీకు తర్వాత రండి. వీలుంటే చూస్తాం. లేదంటే ఎన్నికలయ్యాకే ఇహ"అన్నారు.



వైభవ్ కి ఒళ్ళుమండిపోయి(పేరు విషయంలో తీరని అన్యాయం జరిగింది కదా పాపం) "ఈ కార్డుల తాలూకు డేటా ఎంట్రీ ఎవరు చేసారు?ఈ ప్రింటింగ్ తప్పులకు కారణమెవరు? వాళ్ల మీద పగ తీర్చుకోవాలంటే ఏం చెయ్యాలి" అనడిగాడు.



"దానికి సాయంత్రం 5-6 మధ్యలో తీసుకుంటున్నాం అప్లికేషన్లు, సాయంత్రం త్వరగా రండి! ఎందుకంటే రష్ ఎక్కువగా ఉంటుంది."అని జవాబిచ్చారు వాళ్ళు తలకూడా తిప్పకుండా!





గమనిక: నా కార్డులో ఉన్న అడ్రసు ఆధారంగా మా ఇల్లు గూగుల్ ఎర్త్ వాడు కూడా కనుక్కోలేడు. ఈ చిరునామా ఆధారంగా మా ఇంటికి ఎవరైనా రావాలని ప్రయత్నించి తప్పిపోతే నా పూచీ లేదు.



NOTE నేను ఇదంతా సరదాగా రాశాను గానీ నగరంలో లక్షల కార్డుల్లో అచ్చుతప్పులే!పోలింగ్ స్టేషన్ కి వెళ్ళాక, వోటు వెయ్యడానికి వీల్లెదంటే ఏం చెయ్యాలో చాలా మందికి తెలీదు. అందువల్ల వోటర్ గుర్తింపు కార్డుతో పాటు ఇతర గుర్తింపు కార్డు(బాంక్ పాస్ బుక్,డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్) తీసుకెళితే మంచిది.(తెలీనివాళ్లకోసం).

January 20, 2009

ఎవరికి తెలియని కథలివిలే!

ఆ మధ్య శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారు రచన మాస పత్రికలో "సంకట్ కాల్ మే బాహర్ జానేకా మార్గ్" అని ఒక కథ రాశారు. ఆ మాటకు "ఎమర్జెన్సీ ఎగ్జిట్" అని అసలర్థం! కానీ కథా పరంగా మాత్రం అమెరికాలో మన వాళ్ళు చీటికీ మాటికీ చేసుకునే సత్యనారాయణ వ్రతం అని అర్థం! అక్కడ పుట్టి పెరిగిన ఆడపిల్లలు ఇండియా సంబంధాలు ఒప్పుకోకపోవడం, పిల్లలకు మంచి యూనివర్సిటీల్లో సీట్లు రాకపోవడం వంటి సంకటాల్లోంచి బయట పడటానికి(బాహర్ జానేకేలియే) ఈ వ్రతం మొదలెడతారంటూ సరదాగా సాగుతుంది.




నిజానికి ఇలా సత్యనారాయణ వ్రతం తరచూ చేసుకునే సంప్రదాయం/అవసరం/అలవాటు చాలా ఇళ్లలో ఉంటుంది. నా చిన్నప్పుడు మేము, మా అత్తలు, పిన్నులు, పెద్దమ్మలు, మామయ్యలు అంతా కట్ట గట్టుకుని ఒకే వూళ్ళో ఉండటం వల్ల పెళ్ళి రోజనో, పుట్టిన రోజనో మరోటనో నెలకు రెండు వ్రతాలు గ్యారంటీగా జరిగేవి మా కుటుంబంలో! ఏ ఇంట్లో వ్రతం జరిగినా అంతా కట్టుగట్టుకుని హాజరు! బోలెడంత మంది కజిన్లు!మా ఇంట్లో వ్రతానికి మా నాన్నారు సాంబమూర్తి గారనే పురోహితుడిని పిల్చేవారు. ఆయన వృద్ధుడు. కొడుకులు సరిగా చూసేవారు కాదు. ఆయనకు కొంచెం జరుగుబాటు ఉంటుందని నాన్న ఆయన్ను పిల్చేవారు. పాండిత్యం ఉన్నా,వృద్ధాప్యం వల్ల మాట సరిగా వచ్చేది కాదు. కోపంలో మాత్రం దూర్వాసుడే!



మేము ఆరేడు తరగతుల్లో ఉన్నపుడు మా అక్కలు, కజిన్లు కాలేజీని ఉద్ధరిస్తూండేవాళ్ళు. సాంబమూర్తి గారు వ్రత కథలు చెపుతున్నపుడు వీళ్ళంతా గుడగుడ లాడుతూ కబుర్లు చెప్పుకుంటుండే వాళ్ళు.

ఆయన కళ్ళలో నిప్పులు కురిపిస్తూ "అబ్బబ్బ, కాసేపు గమ్మున కూచోండమ్మా(మీ నోళ్ళు పడా)" అనేవాడు సౌమ్యంగానే,బ్రాకెట్లోని మాటను "కుంజరః "టైపులో పలుకుతూ!
వీళ్ళు సంతాప సభకు వచ్చినట్టు రెండు నిమిషాలు మౌనం పాటించి, మళ్ళీ నెమ్మదిగా కబుర్లలోకి దిగేవాళ్ళు. కథలయ్యేదాక కదలడానికి వీల్లేదు మరి.


మా ఇంట్లో వాళ్ళకు ఇంకో ప్రత్యేక సౌకర్యం ఉంది. మా ఇంటికి దగ్గర్లో శ్రీ రమా మేదినీ సమేత సత్యనారాయణ స్వామి ఆలయం ఉంది. ఆ గుళ్ళో ప్రతి వారం పూజారి చక్రవర్తి సామూహిక వ్రతం జరిపించేవాడు. జరిపిస్తే నీకేం అని మీరనడానికి లేదు.గుడికి ధర్మకర్త వెంకటేశ్వర్లు గారు కొన్న నాలుగు మైకుల్నీ మా కాలనీ వైపు పెట్టి కథలన్నీ వినిపించేవాడు.ప్రతి వారమూ కథా శ్రవణమే! ఇహ కార్తీక మాసం, ధనుర్మాసం వస్తే చెప్పక్కర్లేదు. రోజూనూ! ఒక్కోసారి విరక్తి కలిగేది.



మేం అమెరికాలో ఉన్నపుడు ఇహ చెప్పేదేముంది,చిట్టెన్ రాజు గారు చెప్పినట్టే జరిగింది. నెలకు రెండు సార్లన్నా వ్రతం తప్పనిసరి గుడిలో! అన్ని భాషలవాళ్ళు ఉంటారు కాబట్టి, వారిలో కొంత మంది తమ అమెరికన్ స్నేహితుల్ని కూడా తీసుకొస్తారు కాబట్టి పూజారి గారు అందరి సౌకర్యార్థం ఆంగ్లంలో పూజ జరిపించే విధానం భలే వినోదభరితం!



"put flowers"

"take water into the hand"

"sprinkle chandan"

"put dakshina in the pan leaf"

"Do aatma pradakshina" అంటూ సాగేది పూజ! కథలన్నీ ఆంగ్లం లోనే!



మేమున్న వూర్లో తెలుగువారందరికీ ఒక పెద్ద ఉండేవాడు. ఆయన చాలా కలుపుగోలుగా, అందర్నీ కలుపుకోని ముందుకుపోవాలనుకునే తత్వం గల మనిషి. ఈయనకు ఒక అలవాటుండేది.

ప్రద్దానికీ "మన" "మన" అని తగిలిస్తుండేవాడు. "మన సంసారాలు, మన పిల్లలు, మన దాంపత్యాలు" అంటు అవి అక్కడ అందరికీ ఉమ్మడిగా ఉన్నట్టు మాట్లాడుతుండేవాడు.

కూతురితో నడిచొస్తున్న ఒకావిడతో "ఏమిటీ మన పాపే? ఎంత ఎదిగిపోయిందీ?" అని హాశ్చర్యం పడ్డాడొకసారి. ఆవిడ మనసులో మండిపడుతూ పైకి సౌమ్యంగానే "మన పాప కాదండీ, మా పాప! మీ పాప అదిగో స్నేహితులతో ఉంది" అని చూపించి వెళ్ళిపోయింది. ఆ తెలుగు పెద్దాయన కలుపుగోలుతనం మా అందరికీ చచ్చే చావుగా ఉండేది.



సరే, ఆయన "మన పిల్లలకు భక్తి అంటే ఏమిటో తెలియాలి" అని ఒక పని చేశాడు. సత్యనారాయణ స్వామి వ్రత కథలను చీల్చి చెండాడి, ఘోరంగా ఎడిట్ చేసి పారేసి ఒక్కో కథా అరఠావు లో వచ్చేలా కుదించి ఒక్కో కథా ఒక్కో పిల్ల /పిల్లాడి చేత చదివించేవాడు. ఆ కాపీలు మాకు కూడా ఇచ్చి ఫాలో అవమనే వాడు. ఈ ఫొటోలో చూడండి, అందరూ ఎలా అనుసరిస్తున్నామో కథలను! కొన్నాళ్ళకు పిల్లల్లో భక్తి నశించి గుడికి రావడం మానేశారు.




ఒకసారి ఒక తెలుగు స్నేహితుల కుటుంబం గుడిలో వ్రతం చేసుకుంటూ కథలు తెలుగులో చెప్పాలని పూజారి గార్ని కోరారు. ఆయన బ్రతుకు జీవుడా అని వెంటనే ఒప్పుకున్నారు.

నా పక్కన కూచున్న రాజు, అతడి భార్య రమ ఏదో విషయం మీద వాదించుకోడం మొదలెట్టారు గుసగుసల్తోనే! ఇంట్లో అత్తగారొక్కరే ఉన్నారట, వెళ్ళిపోదామని రమ, వద్దని రాజూ!
 చివరికి సహజంగానే రమ మాట నెగ్గి వెళ్దామని లేస్తుండగానే పూజారి గారు ఇలా చెప్పారు ...

."ఆ విధంగా కళావతి పూజ మధ్యలో లేచి వెళ్ళిపోవడం వల్ల, ఆమె భర్త తాలూకూ ఓడలన్నీ నీటిలో మునిగిపోయి, అతడు కూడా నీటిలో..మునిగి మర....."

ఇద్దరూ అదిరిపడి వెర్రిగా చూసుకుని చతికిల బడ్డారు.


నవ్వాపుకోవడం కష్టమనిపిస్తోంది నాకు.

చివరి కథ జరుగుతోండగా ఇంట్లోంచి అత్తగారి ఫోను."అమ్మాయ్, ఎవరో వచ్చారే, తలుపు తియ్యనా వద్దా" అని!

"ప్రసాదం తర్వాత తీసుకుందాం లే, పదండి వెళ్దాం"అని రమ లేచింది.

ఇంతలో పూజారి గొంతు వినపడింది.

"ఆ విధంగా ఆ రాజు గారూ, ఆ గొల్లవాడి నుంచి స్వామివారి ప్రసాదం తీసుకోకుండా వెళ్ళేసరికి స్వామి వారి ఆగ్రహం వల్ల అతడి నూర్గురు కొడుకులు విగతజీవులైరి. అతడి సంపదలన్నీ నశించి..."


"సంపదలన్నీ నశించి..."రమ గొణుక్కుని "అమ్మో ' అని 'అల్మైరా తాళాలెక్కడ పెట్టారూ" అంది.

"కాఫీ టేబుల్ మీదా" అన్నాడు రాజు ఇంకెక్కడ పెడతానూ అన్నట్టు.

"మీకసలు బుద్ధుందా" అంది రమ పదునుగా.

"అదుంటే పెళ్ళెందుకు చేసుకుంటాను" అన్నాడు రాజు అవమాన పడి.

"అయినా అక్కడ మనకేం ఓడలు లేవులే మునగడానికి" అన్నాడు వెటకారంగా.

"హబ్బో, తమరు ఓడలు కూడా సంపాదిస్తారా? ఉన్నవి నాలుగూ ఊడితే చాల్దూ" అంది రమ కోపంగా. ఈ లోపున కథ అయిపోయి పూజ ముగిసింది.ప్రసాద వితరణ కూడా జరిగింది.

ఇలాంటివాళ్ళు పక్కన చేరితే ఒక్క కథ కూడా వినలేం! అందుకే నేను మాత్రం కథలు విన్నా వినకపోయినా చివర్లో

"మంత్ర హీనం, క్రియా హీనం, భక్తిహీనం...."ఇది మాత్రం మనస్ఫూర్తిగా చదువుకుంటాను.


ఈ కార్తీక మాసం నుంచి సంక్రాంతి వెళ్ళేలోపుగా ఎన్ని వ్రతాలకెళ్ళానో! లెక్కేలేదు. విదేశాలనుంచి బ్రేక్ తీసుకుని వచ్చిన మా వారి అన్నగారింట్లో వారం క్రితం!

రెండు రోజుల క్రితం మా కిందింటి రెడ్డిగారి భార్య వచ్చి "మా ఇంట్లో సత్ నారాణ్ కత ఉంది రమ్మం"ది.


 ఇవాళ పొద్దునే మా పక్కింట్లో ఉండే బిదిషా దాస్ అనే బెంగాలీ అమ్మాయి వచ్చి "సత్యనారాయణ పూజ చేస్తున్నాం. భోజన్ కూడా ఏర్పాటు చేసాం ,తప్పక రావాలని హిందీలో పిల్చింది. కథలు బెంగాలీలో చెప్తారా అన్నాను భయంగా! అలా అయితే రాను అందామనుకుని.

"ఏమో, మా అమ్మనడగాలి" తెలుగు హీరోయిన్లా అనేసి వెళ్ళిపోయింది బిదిష!


"హమ్మయ్య,ఇవాళ వంటింటికి విడాకులు" అనేసుకుని శ్రీఖండ్, రస్ మలాయ్ వంటి బెంగాలీ రుచులు ఊహిస్తూ ఒంటిగంటి వరకూ గడిపి వాళ్లింటికి వెళ్లాను.

తీరా చూస్తే అక్కడ భోజనం ఏర్పాట్లు ఏమీ లేవు గానీ భజన మాత్రం జోరుగా సాగుతోంది.

భోజన్=భజన్! అదీ సంగతి. బెంగాలీ "ఓ" మహాత్మ్యం!

నీరసంగా ఇంటికొచ్చి నా టిఫిన్ల లిస్టులో చివ్వర్లో ఉండే "ఉప్మా" చేస్తూ, అదయ్యే లోపున ఈ టపా రాద్దామని ........!

హెచ్చరిక..ఛ..గమనిక(నీరసంలో మాటలు కూడా సరిగా రావడం లేదు) ఈ టపా శ్రీ సత్య నారాయణ స్వామిని గానీ, వారి భక్తుల్ని గానీ కించపరుచుటకు రాసింది కాదు.

November 7, 2008

హింస ధ్వని




మొన్నొక రోజు మా చిన్నత్త నళిని ఫోన్ చేసి వాళ్ళింటికి ఆహ్వానించింది. వాళ్ళబ్బాయి సంగీతం వినడానికి. నిజానికి నాకు వెళ్ళాలని లేకపోయినా ఆమె దగ్గర నావి రెండు పుస్తకాలుండిపోయాయి. అవి ఆవిడ ఎలాగూ తిరిగివ్వదు, నేను వెళ్లయినా తెచ్చుకోవాలనే ఉద్దేశంతో వాళ్లింటికి వెళ్ళాను.

లోపలికెడుతుండగానే గదిలోంచి,గుండెలు జలదరించే బీట్ తో మ్యూజిక్ తారాస్థాయిలో వినపడుతోంది. లోపలి గదిలోంచి వాళ్ళ పుత్ర రత్నం కిరణ్, తలుపు తీసి నన్ను చూసి "హాయ్ వదినా" అంటూ ఆహ్వానించాడు.

 "హాయ్ రా కిరణ్" అంటూ లోపలికి వెళ్ళేసరికి పక్క గదిలోంచి, కాలి మీద బూటు కాలు పడితే అప్రయత్నంగా వెలువడే కేకల్లాంటి కేకలు వినపడుతున్నాయి.

"ఆ కేకలేమిట్రా" అంటే వాడు మెరిసే ప్లాస్టిక్ చొక్కాని చూసుకుంటూ, నవ్వుతూ,

"పో వదినా, మేము ఒక ఆల్బం చేస్తున్నాం, దాని ట్రాక్ అది" అని వివరించాడు.

అంతలోంచి పై నుంచి నళిని ఆంటీ దిగొచ్చి, అందుకుంది.

"ఏమిటో నమ్మా, వాళ్ల నాన్న ఎంత చెప్పినా వినట్లేదు వీడు. "టోకీ" గారు వీడి వాయిస్ ని తెగ మెచ్చేసుకున్నారా, అప్పటినుంచీ ఆల్బం చేసే తీరాలని పట్టుకున్నాడు. ఎంత కష్టపడుతున్నాడో బిడ్డ..." అంది మురిపెంగా
వాడిలో "ఎన్రిక్ ఇగ్లేసియాస్" ని చూసుకుంటూ!

మీకేమీ అర్థం కావట్లేదు కదూ, నాకూ అంతే లెండి మొదట్లో! విషయమేమిటంటే ..
వాడు ఒక మొబైల్ ఫోన్ వాళ్ళు నిర్వహిస్తున్న ఒక "కింగ్ ఆఫ్ ఇండియా" పాటల
కార్యక్రమంలో మూడు రౌండ్లు దాటాడు.

దానికి జడ్జీగా వచ్చిన "టోకీ" అనే సంగీత దర్శకుడు(పాపం వీళ్ళ నాన్నగారు పాత తరంలో మెలోడీ కి ప్రాణం పోసిన పాటలెన్నిటినో కూర్చిన ప్రఖ్యాత సంగీత దర్శకుడు)

"సూపర్బ్, నీకు తిరుగు లేదు, నీకు మంచి ఫ్యూచరుంది, రెచ్చిపో" అనడంతో మనవాడు నిజంగానే చదువు చెట్టెక్కించి..(ఇంజనీరింగ్) వాళ్ళ నాన్న సొంత డబ్బులు (లేకపొతే వీడిని ఎవరు స్పాన్సర్ చేస్తారో)ఖర్చు పెట్టి ఒక ప్రైవేట్ ఆల్బం చేసే ప్రయత్నంలో ఉన్నాడు. దీనికి నళిని గారి సపోర్ట్ ఎంతైనా ఉందని నాకు తెలుసు.

ఇంతలో కిరణ్ నా గుండె గుభిల్లుమనే వార్త ఇంకోవార్త వినిపించాడు.


"మేమొక మ్యూజిక్ ట్రూప్ తయారు చేస్తున్నాం, మంచి పేరు కోసం చూస్తున్నాం
తెలుసా వదినా?"

"పెట్టండి, bad boys అనో, Road Romeos అనో, లేకపోతే Street hawkers అనో "

అన్నాను గొంతులో కసిని నవ్వు కింద మారుస్తూ!

వాడు అది గమనించకుండా "ఆ పేర్లతో  ఆల్రెడీ ట్రూపులున్నాయి. అందుకే కొత్త పేరొకటి సెలెక్ట్ చేసాం" అన్నాడు.

గుండె చిక్కబట్టుకుంటూ.."చెప్పూ" అన్నాను.

వాడు కొంచెం సిగ్గుపడుతూ,"డర్టీ ఫెలోస్" అన్నాడు.

"ఎవరూ" అన్నాను అయోమయంగా!

"మేమే" అని అంతలోనే కంగారు పడుతూ సరిదిద్దుకుని.."అంటే...మా ట్రూపు పేరు" అన్నాడు.

"సూపర్ గా ఉందిరా పేరు. "ఒక్కడికీ వాయిస్ లేదు" అనో,

 "సింగిల్ పాటతో చంపేస్తారు"  అనో టాగ్ లైను పెడితే బాగుంటుందేమో ఆలోచించు" అన్నాను.
వాడు ఆలోచించబోయి,

నా మాటల్లో వ్యంగ్యం అర్థమైనట్టు "పో వదినా, నువ్వు!సరే ఆల్బం విందువు గానీ, రా" అని లోపలికి తీస్కెళ్ళాడు. ఆ రూమంతా ఆదిత్య 369 సినిమాలో టైం మెషీన్లా ఉంది. ఒక కంప్యూటర్, దానికి అనుసంధానించి కీ బోర్డు, వగైరాలు...స్పీకర్లు...వైర్లు, కేబుల్స్....!


ఆ తర్వాత నేను పడ్డ హింస చెపితే అర్థం కాదు. అనుభవించాల్సిందే!

పొద్దున్న నేను చిన్నత్త వాళ్లింటికి వెళతానంటే ఈయన జాలిగా ఎందుకు చూసారో నాకిప్పుడు అర్థమైంది.



* * *

ఇప్పుడు రాత్రి prime time లో మనం ఏ తెలుగు చానెల్ పెట్టినా , ఇదే గోల!

ప్రతి చానెల్లో ఒక్కో మొబైల్ ఫోన్ కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేసే పాటల

ప్రోగ్రాములు! "బోర్ ఆఫ్ ఆంధ్రా" అని ఒకడు పేరు పెడితే," సూపర్ లూజర్" అనే పేరుతో మరొకడు(ఈ మాత్రం క్లూ లు చాలవూ మీరు ఆ కార్యక్రమాల పేర్లు కనుక్కోడానికి?) మరో చానెల్లో " స ని ద ప మ " అనే పేరుతో!

సోనీ టీవిలో ఇండియన్ ఐడల్ జరిగినప్పటినుంచీ, మన వాళ్ళు కూడా

పిచ్చెత్తినట్టు ఈ కార్యక్రమాలకు ఆంధ్ర దేశం నిండా ఆడిషన్లు పెట్టి "సా పా సా" అనడం వచ్చిన వాళ్లందరినీ టోకున సెలెక్ట్ చేసి పారేసి, మన ఖర్మ కాల్చడానికి ప్లాను వేసేసారు.

ఈ కార్యక్రమాలకు జడ్జీలు గా వచ్చే "గాయ"కులు(నీ మణులు) బుద్ధ విగ్రహాలల్లే కూచుని అపశ్రుతులతో పాడిన వాళ్ళను కూడా "నీ గొంతు "యూనిక్" గా ఉంది. ఇలాంటి గొంతులు అందరికీ ఉండవు(అది నిజమేలెండి)
అని ఓ మెచ్చేసుకోవడం!

ప్రతి చానెల్లో ఈ ప్రోగ్రాములు ఉండటం వల్ల, పోటీ ఎక్కువై, ఎక్కువమందిని ఫిల్టర్ చేసే అవకాశం లేక కనపడిన వాళ్ళందరి చేతా పాడించెయ్యడం మొదలెట్టారు. ఆ పాట పాడిన వాళ్ళకు గాత్ర శుద్ధి లేదని, శ్రుతి అవుట్ అయిపోతోందని,తెలియడానికి సంగీతం తెలియక్కర్లేదు. కనీసం సినిమా పాటలు వినడం తెలిస్తే చాలు.

అయినా జడ్జీలు "I have no words. excellent" , "I'm speech less" అంటారు.

ఈ మధ్య మా స్నేహితుడొకరు(సంగీత దర్శకుడు)తను కూర్చిన పాటల ట్యూన్లు వినడానికి పిలిస్తే వెళ్లాము. అతను చెప్తే తెలిసింది. ఈ కార్యక్రమాల్లో పాడేవాళ్లందరినీ అలా మెచ్చేసుకోవాలని జడ్జీలకు ముందే నిబంధనట!

ఎందుకంటే ఎవర్నీ నిరాశపర్చకూడదట!


ఒక జాతీయ హిందీ చానెల్ పెట్టిన పాటల పోటీలో రన్నరప్ గా నిలిచిన నల్లాన్ చక్రవర్తుల వారి అబ్బాయి వారుణ్య, ఆ పోటీ తర్వాత ఎప్పుడైనా కాసేపు శాస్త్రీయ సంగీతం ప్రాక్టీస్ చేసుంటాడంటారా? చెమికీలు, అద్దాలు, పూసలు, కుందన్స్,బల్బులు వగైరాలు కుట్టిన మెరిసే చొక్కాలు వేసుకుని,స్టీలు బెల్టులు, పూసల గొలుసులు వేసుకుని ప్రస్తుతం పాటల ప్రోగ్రాములకు యాంకర్ గా చేస్తున్న అతడిని చూస్ట్తే ఎంత బాధ వేస్తుందో!

ఈ రోజు వారీ సంగీత హింసే కాక, కొన్ని చానెళ్ళు "ఒక్కతే" అని, "ఏడే స్వరాలు" అనే పేర్లతోనూ పాపం డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా అయిన ఒక గాయనిని యాంకర్ గా పెట్టుకుని వారాంతంలో కూడా టీవీ వైపు చూడాలంటే దడ పుట్టేట్లు చేస్తున్నారు.


కొన్ని చానెళ్ళలో అన్ని రౌండ్లూ ముగిసి, ఫైనల్ కి వచ్చే వాళ్ళు ప్రేక్షకుల SMS ల దయతో కాస్త మంచి వాళ్ళే మిగులుతున్నారు.కొన్నింటిలో అదీ లేదు. ఇంతా చేసి ఈ గాయనీ గాయకుల అంతిమ లక్ష్యం ..
"సినిమాల్లో పాడటం"! ఇంతవరకు గెలిచిన వాళ్లకు ఎంత మందికి సినిమా అవకాశాలొచ్చాయో అందరికీ తెలిసిందే!

సెమీ ఫైనల్స్ కి చేరిన వాళ్ల ఇంటికి చానెళ్ళ వాళ్ళు కెమెరాలు పట్టుకుని వెళ్ళి,వాళ్ల ఆవకాయ జాడీలు, సింకులో అంట్లూ,బాత్ రూములో బకెట్లు, ఇంటి ముందు ముగ్గూ, కుంపట్లో బొగ్గు,వాళ్ళ బొచ్చు కుక్కపిల్ల, దాన్ని ఆడించే పని పిల్ల,వాళ్ల తలుపు గొళ్ళెం, తోమని హారతి పళ్ళెం, అన్నీ పడేట్టు చిత్రీకరిస్తూ వాళ్ల ను ప్రోత్సహిస్తారన్నమాట.


ఇహ, వోడిన వాళ్ళు భోరున ఏడవటం! యాంకర్లు, జడ్జీలు.. వాళ్ళ చుట్టాలెవరో పోయినట్టు విషణ్ణ వదనాలు పెట్టుకుని వాళ్ల భుజం తట్టి "this is what life!(ఇదేనట జీవితం)  నీ ఓటమి మరో గెలుపుకి పునాది" అని సోది ఓదార్పులతో కన్నీళ్ళు తుడవటం..ఇవన్నీ మనకి కూడా(ఎందుకు చూస్తున్నామురా దేవుడా అని) కన్నీళ్ళు తెప్పించే డ్రామాలు!


అవన్నీ పక్కనపెడితే,పట్టుమని నాలుగేళ్ళు నిండని పసి మొగ్గల చేత ఈ పోటీల్లో little buds అనీ 'చిన్నారుల సరాగాలు అనే పేర్లతో పాడించడాన్ని నేనసలు సహించలేకపోతున్నాను. గంట ప్రోగ్రాం రికార్డింగ్ కి రోజంతా పట్టే సందర్భాలుంటాయి.

అలా పసి బిడ్డల్ని రోజంతా కూచో బెట్టి హింసించి పాడిస్తే తల్లి దండ్రులకు ఏం వొరుగుతుందో అర్థం కాదు. అంత చిన్న పిల్లల గొంతుల్లో మెలొడీని, శృతి, లయలు పర్ఫెక్ట్ గా ఉండాలని ఆశించలేం! అయినా ఆ పిల్లల కంటే ముందు తల్లుల(తండ్రుల పాత్ర తక్కువే ఈ ఆరాటంలో) టెన్షన్ చూడాలి!


చెపితే నమ్మరు(చూసి ఉంటే సరే),  స ని ద ప మ కార్యక్రమంలో ఒక పదేళ్ళ పాప బాగా పాడుతున్నా కొన్ని చిన్న పొరపాట్ల వల్ల eliminate అయి తొలగవలసి వచ్చింది. వెంటనే వాళ్ళమ్మ ఘొల్లున ఏడుపు. "మా అమ్మాయి ఫైనల్స్ కి వెడుతుందని టోకీ గారు చెప్పారు. ఇక్కడ రాజకీయం జరిగింది. పిల్ల తెల్లవారుజామునే లేచి ప్రాక్టీస్ చేసింది..(ఎవరి కోసమో)" అని గోల గోల చేసింది. అందరూ ఆవిడను ఓదార్చడం!


ఇదంతా ప్రేక్షకులకు అవసరమా?ఆ తర్వాత (ఆ పాపను ఎంతగా హింసించారో), వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తిరిగి వచ్చి..పాడి నెగ్గింది ఆ రౌండ్! వాళ్ళమ్మ మళ్ళీ ఘొల్లుమంది....ఈ సారి ఆనందంతో!

ఈ చిట్టి మొగ్గల చేత "హుషారు గొలిపే "పాటల రౌండ్ లో పాడించే పాటలు వింటే జన్మ రాహిత్యం కలుగుతుంది.

"ఓరోరి యోగి .."(ఆ తర్వాత రాయలేను, క్షమించండి)

"వంగతోట మలుపు కాడ" ..ఇవీ!


"అబ్బో, ఈ పాటలకు పసి పిల్లలు రక రకాలు మూమెంట్స్ తో డాన్సాడుతుంటేనే చూసేశాం, పాట వినలేమా "అంటారా? సరే, అలాగే కానీండి!

న్యాయనిర్ణేతల గురించి రాయకపోతే నాకు నిష్కృతి లేదు. పాడిన ప్రతి వాళ్ళనూ యధాశక్తి మెచ్చుకోగలగడం వీళ్ల ప్రాథమిక అర్హత.భాష గురించి పట్టింపు లేదు. మొన్నొక కార్యక్రమంలో తెలుగు పాటలోని ఉచ్చారణా దోషాన్ని మలయాళీ మాల్గాడి శుభ పట్టుకుని చూపించేదాక ఎవరికీ తెలీకపాయె!

 మరో పాటల కార్యక్రమంలో ఒక కుర్ర జడ్జీ చిరంజీవి పాట ఒక పాప పాడుతుంటే హుషారుగా లేచి కుర్చీ దిగొచ్చి డాన్సాడేశాడు, చిరు స్టెప్పులతోనే!

టోకీ గారికి ఆ సదరు స ని ద ప మ వాళ్ళు ఎంత డబ్బిస్తారో గానీ రోజుకొక సారి
" ఈ చానెల్ కి నేను రుణ పడ్డాను..పడ్డాను..పడ్డాను" అని చెపుతూనే ఉంటారు!

నన్ను తిట్టుకుంటే తిట్టుకోండి..బాల సుబ్రహ్మణ్యం నిర్వహణలో జరిగిన

కార్యక్రమాల నాణ్యత ఇప్పుడు నడుస్తున్న వాటిలో ఒక్క దానికీ లేదంటే లేదు. గొంతు లో నాణ్యతను పట్టుకోగలిగే శాస్త్రీయ సంగీతం తెలిసీన న్యాయ నిర్ణేతలు ఉండేవారు బాలు ప్రోగ్రాముల్లో!

మన  గురువు గారికి అసలే భాషంటే ప్రాణం,పట్టింపూనూ!!
 "చాలా చక్కగా పాడావమ్మా "నా దేషం " అని ఒక్క విసురు విసిరితే ఇక జీవితాంతం "శ" కి "ష" కీ మధ్య తేడాని మర్చిపోలేరు ఎవరూ!


* * * *

కట్ చేస్తే....

మా కిరణ్ గాడి మూడో సెమిస్టరు తన్నేయడంతో వాళ్ళయ్య బెల్టు పుచ్చుకుని వెంట బడ్డాడు.(ఇదేదో మొదటే చేయవలసింది)దానితో వాడు ఆల్బంల గోల ( ప్రస్తుతానికి) వదిలి పుస్తకాలు పుచ్చుకుని స్టడీ రూములో సెటిలయ్యాడు.
* * *
మొన్నొక రోజు రాత్రి తొమ్మిందింటికి టివీ లో ఏ చానెల్ వెదికినా ఇవే పాటల ప్రోగ్రాములు వస్తుండటంలో తప్పక , మేము ఒక మూవీ చానెల్లో 'గోమాత వ్రత మహాత్మ్యం" సినిమా చూసాము! చాలా నచ్చింది నాకు. పాత సినిమాల విశ్లేషణ కింద నవతరంగం వాళ్ళు వేసుకుంటారేమో అడిగి, రాయాలి!



తాజాకలం:నాకు విదేశాల్లో ఉండాలని కోరికేం లేదు గానీ, ఇలాంటి కష్టాలెదురైనప్పుడు మాత్రం తెలుగు టీవీ చానెళ్ళు చూడలేని ప్రవాసాంధ్రులందరి పట్లా అసూయతో రగిలిపోతుంటాను.




October 30, 2008

సెంచరీ కొట్టేశాను!

సెప్టెంబర్ 29 న నేను రాసిన "మీ చదువులే మా చావులు" టపా అక్షరాలా వంద వ్యాఖ్యలను సంపాదించింది. వీటిలో నా ప్రతిస్పందనలు కూడా ఉన్నాయి. వాటిని మినహాయించినా అత్యధికంగా కామెంట్లకు నోచుకున్న టపా గా దీన్ని భావిస్తున్నాను. నేను కూడలికి చేరి ఆరు నెలలే కాబట్టి అంతకు ముందు ఏ టపాకైనా ఇంత ప్రతిస్పందన వచ్చిందేమో నాకు తెలియదు.



టపా అంశం ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అనుభవించిందీ, ఇప్పుడు పిల్లల కోసం అనిభవిస్తోందీ కావడంతో ప్రతి ఒక్కరూ వారి అనుభవాలనూ, అభిప్రాయాలనూ పంచుకోవడంతో ఇన్ని వ్యాఖ్యలు వచ్చాయి. నాకెదురైన అనుభవాలను పంచుకుందామనుకున్నానే గానీ ఇంత మంది విద్య కు అయ్యే వ్యయం గురించి ఇంతగా ఆలోచిస్తున్నారనీ, కొంత మంది ఈ చదువు ఖర్చుల గురించి ఆందోళన పడుతున్నారనీ నాకు ఇప్పుడే తెలిసింది.


వ్యాఖ్యాతలందరికీ శతకోటి ధన్యవాదాలు.

వందో వ్యాఖ్య రాసిన సత్యాన్వేషి గీతాచార్య కు ప్రత్యేక ధన్యవాదాలు!

September 5, 2008

రివర్స్ గేర్ సంగీతం!

ఇవాళ పొద్దున్నే చాలా bad mood లో నిద్ర లేచాను! మిశ్రా గారిని ఎలాగైనా ఇవాళ పట్టుకుని సాయంత్రం ఇంటికొచ్చే ఉద్యోగం లోకి మారతాడా, లేక కారు మారుస్తాడా, లేక కారు రివర్స్ గేరు ట్యూన్ మారుస్తాడా తేల్చెయ్యాలని నిర్ణయించుకున్నాను.


అర్థ రాత్రి రెండు గంటల సమయంలో ఎంత గాఢ నిద్రలో ఉంటాం? అంత అద్భుతమైన నిద్రలో కర్ణ కఠోరంగా "సారే జహాసే అచ్చా" పాట తాలూకు instrumental tune ఒక పావు గంటసేపు నాన్ స్టాప్ గా అదీ పెద్ద వాల్యూం తో వినిపిస్తే ఏమనిపిస్తుంది మీకు? నిద్రా భంగమవుతుందా లేదా? ఒళ్ళు మండిపోతుందా లేదా అసలు?

అసలేం జరిగిందంటే...

రాత్రి రెండున్నరకి డెలాయిట్ లో పని చేసే మిశ్రా గారు ఆఫీసు నించి వచ్చి కారు పార్క్ చేయడానికి నానా తంటాలూ పడుతున్నాడు. ఆయన పార్కింగ్ లాట్ ఏమో ఒక కార్నర్ లో ఉంది. అందువల్ల అక్కడ ఆయన ఒక ఇరవై సార్లు అంగుళం ముందుకు, నలభై సార్లు రెండంగుళాలు వెనక్కి ఈ నిష్పత్తిలో పావుగంట ప్రయత్నించి ఒకటి రెండు స్క్రాచులతో సఫలమయ్యాడు. ఈ రివర్స్ గేరు వేసినప్పుడు సారే జహాసె అచ్చా ట్యూన్ పెట్టుకున్నాడు చూడండి, విరక్తి పుట్టింది. పగలైతే అంతగా పట్టించుకోకపోదును.


ఈ రివర్స్ గేర్ ట్యూన్లు బలే తలనొప్పి! కారు తీసేటపుడు, పార్కింగ్ చేసేటపుడు రకరకాల పాటల ట్యూన్లు వినలేక విసుగేస్తుంది. రచనా పటేల్ అని మా పొరుగింటి పిల్ల కారు యూపీ లో కొన్నది కాబోలు, ఆవిడ రివర్స్ గేరు ట్యూన్ చూడండి!

"మేరే అంగనేమే తుమ్హారా క్యా కాం హై" ఈ అమ్మాయి చాలా ఈజీగా పార్క్ చేయదగ్గ స్థలంలో కూడా పాట మొత్తం పూర్తయ్యే దాకా పార్క్ చెయ్యలేదు. ఒకరోజు పట్టుకుని "నువ్వు పార్కింగ్ అన్నా నేర్చుకో, లేదా ఆ పాట పీకి పడెయ్యి" అని వార్నింగ్ ఇస్తే బబుల్ గమ్ము నవులుతూ విలాసంగా నవ్వుతోంది.

మరొకాయన కారు రాత్రి పదకొండింటికి "ఓం జై జగదీశ హరే" అని పాడుతుంది.

మరోక మూడు కార్లు ఎయిర్ టెల్ ట్యూన్!

మరొకరిది అజంతా గడియారాల పాట, మరొకటి టైటాను వారి పాట, ఇంకొకరిది పేరు తెలియని ఇంగ్లీష్ పాట.

మరో రెండు కార్లు "కూకు కుక్కు కూకు కుక్కు " అని తీతువు పిట్ట లాగా గంట సేపు కూసి గాని పార్కింగ్ లో కూచోవు.(ఇలా ఏ పక్షి కూస్తుందో సిబి రావు గార్ని అడిగి తెలుసుకోవాలి ఈ సారి)

"కొంచెం ఆ వాల్యూం తగ్గించుకునే ప్రయత్నం చేయండి సార్" అని పళ్ళు నూరుకుంటూ చిరునవ్వుతో ఒకళ్ళిద్దరిని అర్థిస్తే "పాసిబుల్ నహీ హై బోల్ రహా హై సుజుకి వాలా" అన్నారు .

మరి మీ కారు పాడదా అని అడక్కండి, అక్కడికే వస్తున్నా!

కర్ణాటకలో కారు కొన్నప్పుడే మేము హ్యుండాయి షోరూం లో ఉన్న అన్ని ట్యూన్లు పరిశీలించి అన్నింటికంటే కొంచెం smooth గా ఉన్న Titanic theme tune ని ఎన్నుకున్నాం!

హైదరాబాదు వచ్చాక మా పార్కింగ్ లాట్ కొంచెం పక్కకే ఉండటం వల్ల, పార్కింగ్ సమయంలో మా accent కూడా పాడటం మొదలు పెట్టింది. "you too.." అనేసి ఊరుకోవాల్సి వచ్చింది.


ఈ పాట వల్ల నాకు మరో సమస్య కూడా వచ్చింది. ఐదో ఫ్లోర్లో ఉండే ఒక థాయిలాండ్ ఆయన కారుకి కూడా రివర్స్ గేరు ట్యూన్ టైటానిక్ పాటే! ఆయన ఆరింటికే ఇంటికొచ్చి కార్ పార్క్ చేస్తుంటే ఆ పాట విని నేను మాదే అనుకుని "అబ్బ, ఆరింటికి కూడా వస్తారా ఈయన " అనుకుంటూ కారిడార్లోకి వెళ్ళి చూసానొక రోజు. ఈయన కనపళ్ళేదు గానీ ఆయన పైకి వెళుతూ కనపడ్డాడు. అలా రెండు మూడు సార్లు జరిగింది.

అప్పటిగ్గానీ నేను మరో కారు ఇదే పాట పాడుతోందని గ్రహించలేకపోయాను. ఈలోపల థాయిలాండ్ బాబు కారు పార్క్ చేస్తూనే నేనొచ్చానా లేదా అని పైకి చూడ్డం మొదలెట్టాడు.


మేము టైటానిక్ ట్యూన్ సెలెక్ట్ చేసుకున్నపుడే "రాత్రి వేళల్లో ఆలస్యంగా వచ్చినపుడు ఈ ట్యూన్ ఆఫ్ చేసి, రివర్స్ చేసుకునే సదుపాయం ఉందా" అనడిగాము. షోరూం వాడు కొంచెం ఆలోచించి 'కావాలంటే ఏర్పాటు చెయ్యొచ్చ"న్నాడు. చెయ్యమన్నాం!ఒక చిన్న స్విచ్ ఏర్పాటు చేస్తానన్నాడు అతను.

కారు చేతికొచ్చాక ఆ స్విచ్ ఎక్కడుందని అడిగితే
"బోనెట్ లోపల ఉంటుంది సార్! కావాలనుకున్నపుడు బోనెట్ పైకెత్తి అది ఆఫ్ చేసి అప్పుడు కారు రివర్స్ చేసుకోవ"చ్చన్నాడు.
ఇదేమిటి నాయనా అంటే "అంతకంటే కుదరదు మేడం, అందుకే అక్కడ పెట్టాను" అన్నాడు.

అంత శ్రమ తీసుకోలేక ఇంతవరకు దాన్ని ఉపయోగించలేదు. కాకపోతే అదెక్కడుందో అని ముచ్చటపడితే ఒకరోజు మా వారు బోనెట్ పైకెత్తి చూపించారు.

అసలింతకీ ఈ సంగీతాలు లేకుండా కారు రివర్స్ చేసుకునే మార్గం లేదా! ఇదివరలో ఇవి ఉండేవి కాదుగా!

ఇదో పెద్ద సమస్యా అనకండి,30 కార్లున్న చోట ప్రతి పది నిమిషాలకొక సారి వివిధ రకాల గీతాలు నాన్ స్టాప్ గా వింటే అప్పుడు తెలుస్తుంది మీకు!

ఈ రోజు మిశ్రా సంగతి తేల్చాల్సిందే!

August 27, 2008

నా ఓటర్ గుర్తింపు కార్డు- చిరంజీవి

ఇవాళ పొద్దున్న GHMC(Greater Hyderabad Municipal Corporation) ఆఫీసుకి వెళ్ళాను నా వోటర్ గుర్తింపు కార్డు విషయమై!ఇంతకు ముందు అది processingలో ఉండగా మేము బెంగుళూరు వెళ్ళిపోవడం జరిగింది. నా కార్డు ఒక్కటే పెండింగ్ అనుకుంటే మా వారి కార్డులో తండ్రి పేరు స్థానంలో అసలు ఆయన తండ్రి పేరు కాక వేరివరినో తండ్రిగా నిర్ణయించేసారు.

నా కార్డు జారీ, మా వారి కార్డులో మార్పు --ఈ రెండు విషయాలూ తేల్చాలని బయలుదేరాం! ఎప్పటిలాగానే ఆఖరు తేదీకి నాల్రోజులు ముందు!(ఈ నెల 31 ఆఖరు తేదీ) .

గచ్చి బౌలి మెయిన్ రోడ్ మీద, రోడ్డుకు కొంచెం దూరంగా అందంగా ఠీవిగా ఉంది భవనం! లోపలికి వెళ్ళాక "వోటరు గుర్తింపు కార్డు" పేరుతో కౌంటర్ ఏదీ కనపడలేదు. చివరికెవర్నో పట్టుకుని అడిగితే "ఆస్తిపన్ను" పేరుతో ఉన్న కౌంటర్లోకెళ్లమన్నాడు. అక్కడ మా చిరునామా వింటూనే
"మీ ఏరియా ఇప్పుడు సర్కిల్ 2 కిందకు వస్తుంది. ఇక్కడ కాదు! చందానగర్ లో ఉన్న ఆఫీసుకు పొ"మ్మన్నాడు రంగస్వామి. అప్పుడు టైము లెవెన్ పదిహేను!

"అమ్మో, నాకు మరో అరగంటలో ఇంటర్వ్యూలున్నాయి, నువ్వు ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళు, రేపు చూద్దాం " అని డబ్బులు తీసుకోకుండా సలహా ఇచ్చి తను ఆఫీసు కు వెళ్లాడు.

నాకు పనేం లేదు కనుక నేను చందా నగర్ GHMC ఆఫీసుకు వెళ్ళాను.

అక్కడ నాలాగే చివరి వారంలో వచ్చినవాళ్ళు వందమంది ఉన్నారు. అప్లికేషన్లు తీసుకునే అమ్మాయి, గుప్పెడు వేస్తే మానెడయ్యేట్టు మొహం చిరాగ్గా పెట్టుకుని,ఇచ్చిన వాళ్లని ఏదో ఒక వంక పెట్టి చీవాట్లేస్తూ రిసీట్లు వాళ్ళ మొహాన్న కొడుతోంది.
నా చిరునామా చెప్పగానే "ఇక్కడ కాదు ఇక్కడ కాదు! గచ్చ్చిబౌలియే వెళ్లాలి మీరు! వాళ్ళకు పనెక్కువై మా మీద తోస్తున్నారు! అక్కడికే పొండి" అంది.

ఎంత చెప్పినా వినలేదు. సరే పైన MANAGER అని బోర్డు కనపడి ఫస్ట్ ఫ్లోర్ కెళితే ఆయన ఇంకా రాలేదు.పన్నెండున్నరకి!
ఒక సీనియర్ క్లర్కు దగ్గరకెళ్ళి మళ్ళీ మొత్తం కథంతా చెప్పగా ఆయన కొంచెం దయగా ఓటర్లు లిస్టు తెప్పించి అందులో మా వారి పేరు చూసి
"ఇక్కడే ఇవ్వాలి మీరు! ఇంతకు ముందు enumeratorsఇచ్చిన రిసీట్ ఉందిగా! దాని కాపీ పెట్టి అప్లికేషన్, ఫొటోతో సహా ఇచ్చి వెళ్లండి" అన్నాడు.

నేను ఫొటోలు వాళ్ళే తీస్తారనుకుని చేతులూపుకుంటూ వెళ్ళాను.ఇంతా చేసి వాళ్ల దగ్గర అప్లికేషన్లు లేవు. ఎదురుగా ఫొటోస్టాట్ వాడు ఒక్కోటీ నాల్రూపాయలకు(సింగిల్ పేపరే) అమ్ముతున్నాడు. ఒకటి తీసుకుని ఫొటోతో సహా ఇహ రేపు వద్దామని నిర్ణయించుకుని వస్తుండగా ఒక పాతికమంది తో ఒక గుంపు ఎదురైంది ఆఫీసు గేట్లోనే!

పక్కకు తప్పుకోబోతుండగా "ఏంది మేడం, ఇక్కడున్నరు?" అన్న గొంతు వినపడి చూస్తే...నిజమే, నన్నే!అడిగిన వ్యక్తి లావుగా , ఎత్తుగా ఉన్నాడు. మెడలో స్టీలు గొలుసు,చేతికి పంచలోహాలవో ఏవో కంకణాల్లాంటివి...! చూసిన గుర్తే కానీ ఎక్కడో అర్థం కాక, వెర్రి నవ్వొకటి నవ్వి
"వోటర్ ఐడీ కార్డు గురించి.." అన్నాను. ఎవరా అని ఆలోచిస్తూ!నేను గుర్తు పట్టలేదని అతడికి అర్థమైంది.

"నేను మేడం, సబ్జీ పాండు తమ్ముడిని,బిచ్చయ్యని" అన్నాడు.హమ్మయ్య! అవును, కూరలు, మినరల్ వాటర్ ఇచ్చే పాండు తమ్ముడు!
పలకరించాక "నువ్వేంటి, వీళ్లంతా ఎవరు?" అనడిగాను.
వాళ్ళందరినీ గర్వంగా చూసి "ప్రజారాజ్యం యూత్ వింగ్ మేడం" అన్నాడు.
"ప్రజా రాజ్యమా?" అని తెల్లబోతుండగా..
"ఔ మేడం, చిరంజీవి పార్టీ! పొద్దుగాల్నే వచ్చినం తిర్పతికెల్లి!ఇక్కడ వోటర్ ఐడి కార్డులిప్పించే పని నా మీద బెట్టిండు అన్న"
"అన్నా? చూశావా నువ్వు చిరంజీవిని?"
"ఔ మేడం! నేనైతే స్టేజీ కాణ్ణే ఉన్నా, బారికేడ్లు గూడెక్కినా! చెయ్యూపిండు నాదిక్కు జూసి"
పొంగిపోతున్నాడు బిచ్చయ్య!
త్రీడీ ఫొటోలాగా అందరూ ఇదే అనుకొని ఉంటారు.
"నన్నే చూసి నవ్వాడు, నాకే చెయ్యి వూపాడు,.."అని!

అదీ సంగతి! లోకల్ లీడరెవరో బిచ్చయ్యకు ఈ పని అప్పజెప్పాడు.కాసేపు శివమెత్తినవాడిలాగా సభ విశేషాలన్నీ నాకు వివరించాడు"నేను మొత్తం లైవ్ చూసాన్రా బాబూ" అన్నా వినిపించుకోకుండా!
నేను వచ్చిన పని కనుక్కుని, ఆగ్రహం చెందాడు."ఇటియ్యుండ్రి" అని నా అప్లికేషన్ లాక్కునాడు.
ఫొటోలేదని తెలుసుకుని లాక్కెళ్ళినంత పని చేసి వీధి చివర స్టూడియోలో పావుగంటలో ఫొటో రెడీ చేయించాడు, తన డబ్బుల్తోనే!
నా పాత రెసీట్ కాపీ చేయించి, అప్లికేషన్ సిద్ధం చేసి, మిగతా వాళ్లతో పాటు కలిపాడు.

తన పక్కనున్న సబ్ లీడర్లకు "గీ మేడం ఇల్లు మా షాప్ దగ్గర్నే ఉంటది! మస్తు మంచిది మేడం"అని పరిచయం చేసాడు(వాళ్లన్న ఎంత ధర వేసుకున్నా నేను దెబ్బలాడను మరి)
గుంపంతా ఒకేసారి చిరంజీవి అనుకూల నినాదాలు చేస్తూ ఒకేసారి వెళ్ళి అప్లికేషన్లు ఇచ్చారు. ఇందాకటి అమ్మాయి విసుక్కునే చాన్స్ లేక ఓపిగ్గా రసీదులు ఇచ్చింది.
నన్నేదో అడగాలనుకుని 'ప్రజారాజ్యం యూత్ వింగ్' తరఫు మనిషిని అని తెలుసుకుని విరమించింది.
"థాంక్యూ బిచ్చయ్యా" అనగానే కొంచెం నసుగుతూ....
"పర్లేదు మేడం, మీరు మాత్రం అన్నయ్యకే వోటెయ్యాలి, సారుతో గూడా ఏపియ్యాలి" అన్నాడు.
"ఓ అదా, దాందేముంది, వేస్తాం లే! ఇంకా చాలా రోజులున్నాయిగా ఎలక్షన్లు" అన్నాను.
"ఔ మేడం,ఎందుకు అడుగుతున్ననంటే మీ కారు మీద లోక్ సత్తా స్టారు స్టిక్కరుండేటిది కదా మేడం, అప్పుడు?"
అదిరిపోయాను.
మా పాత కారు మీద, అవును....ఉండేది! నాకే గుర్తు లేదు.
"నాంపల్లి గ్రౌండ్స్ లో మీటింగ్ కి రమ్మని అప్పుడు మీరు మమ్మల్ని పిలిస్తిరి గదా
" దేవుడా, వీడిని కూడా పిలిచానా?"

"ఓ, అదా బిచ్చయ్యా, మేము ఆ తర్వాత ఇక్కడ లేము కదా! ఇప్పుడు కారు మీద లేదు ఆ స్టిక్కర్, చూడు"
"సరే మేడం, సరే మేడం" సిగ్గుపడిపోయాడు ఆ సంగతి అడిగినందుకు.

నేనే గాక, మా కాలనీలో ఉన్న నలభై అపార్ట్ మెంట్ల వాళ్ళ చేతా వోట్లేయించాలట చిరంజీవి పార్టీకి!"కార్డు రాగానే చెప్తాం మేడం, వచ్చి తీసుకొండ్రి" అని భరోసా ఇచ్చాడు.
"అక్కా, మర్చిపోకక్కా" అని వచ్చేటప్పుడు సడన్ గా నాకు తమ్ముడై పోయి వోట్లు అర్థించాడు.

చిరంజీవి సంతోషాంధ్ర ప్రదేశ్ తెస్తాడో లేదో నాకు తెలీదు గానీ , నాకు మాత్రం వోటర్ ఐడీ కార్డు ఇప్పించాడు. వోటెయ్యాల్సిందే! ఇహ తప్పదు!

August 25, 2008

బ్రేక్ ఫాస్ట్ రెడీ!

బ్లాగాడిస్తా రవి గారి దోశ పురాణం చదివాక నాకూ మన బ్రేక్ ఫాస్ట్ గురించి చిన్న టపా రాయాలనిపించింది. "మన" అంటే తెలుగు అని కాదు, మన దక్షిణ భారత ఉపాహారం అన్నమాట!

మొన్నీ మధ్య మా చుట్టాలింటికి వెళ్లాను. పొద్దున్నే కాఫీ తాగుతూ పేపరు చదువుతుంటే గలగలా చప్పుడు వినపడింది. ఏమిటా అని చూస్తే ఇంటావిడ(అంటే ఇంటి ఓనర్ భార్య కాదండీ, ఇంటి తాలూకు ఆవిడ అని)
అనగా నా కజిను స్కూలుకెళ్లబోతున్న పిల్లలిద్దర్నీ కూచోబెట్టి ఆ 'గల గల్లాడేవి ' కుక్క పాలు తాగే బౌలు లాంటి పాత్రలు వాళ్లముందు పెట్టి పోస్తోంది వాటిలో!
కార్న్ ఫ్లేక్స్! విత్ చల్లని పాలు!
పిల్లల మొహాలు చూశాను ఆత్రుతగా...ఎందుకంటే పొద్దున్నే కార్న్ ఫ్లేక్స్ అనబడే పదార్ధాన్ని నవ్వుతూ, సంతోషంగా తినే పిల్లలని నా జీవితంలో ఇంతవరకూ చూళ్ళేదు. నేనూహించినట్టే వాళ్ళ మొహాలు ఏ భావమూ లేకుండా ఉన్నాయి.

"పొద్దున్నే నీకిదేం పోయేకాలం రాధా, హాయిగా ఏ ఇడ్లీలో, దోశలో రుచిగా వేసిపెట్టకుండా ఈ గల గలలేమిటి" అనడిగితే రాధ నవ్వుతూ "చాల్లే, పొద్దున్నే అంత భారీగా తింటే క్లాసులో నిద్ర పోతారు. ఇవైతే లైట్ గా ఉంటాయి. పైగా వాళ్ళు ఇడ్లీలో మరోటో తింటే ఇహ పాలు తాగరు. ఇదనుకో, ఇందులోనో పాలు కలిపి ఇస్తాను కాబట్టి రెండూ తీసుకున్నట్టే" అంది.

మీలో ఎంతమంది పొద్దున్నే కార్న్ ఫ్లేక్స్ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటారో నాకైతే తెలీదు గానీ, ఆరోగ్య సూత్రాలు పక్కనపెట్టి, వాటిని నిజంగా సంతోషంగా ఇష్టంగా తినేవాళ్ళు చేతులెత్తండి అంటే ఒక్కళ్ళు చేతులెత్తరు.
అది మాత్రం గ్యారంటీ గా చెప్పగలను.అదోరకమైన మైల్డ్ వాసనతో కర కర లాడే కార్న్ ఫ్లేక్స్ ని పాలతో పొద్దున్నే...!ఎలా తింటారబ్బా?

ఈ మధ్య మరో బ్రేక్ ఫాస్ట్ తయారైంది. అది 'ఓట్స్ '! మా అన్నయ్య హైదరాబాదు నించి తెప్పించుకుని మరీ ఓట్స్ తో గంజి కాచి, అదే లెండి కొంచెం పాలిష్డ్ గా చెపుతాను...porridge తయారు చేసి, అది తాగుతాడు. అదీ వాడి బ్రేక్ ఫాస్ట్!

ఎప్పుడన్నా టూర్లలో ఉన్నప్పుడు మనం దిగిన హోటలు వాడు courtecy breakfast ఏర్పాటు చేసినపుడు కూడా నేనైతే ఇడ్లీలు, ఊతప్పాలు,దోశలు, వడలు(అదే..గారెలు) ఇవే వెతుక్కుంటాను. మా వారు సగం కాలిన బ్రెడ్ ముక్కలు(మీకన్నీ వివరంగా చెప్పాల్సిందేనా...అదేనండీ టోస్టులు) , బటర్,జాం, నాలుగు పుచ్చకాయ ముక్కలు పెట్టుకుని కానిస్తారు.

నాకు అన్ని దేశాల వెజిటేరియన్ ఫుడ్ ఇష్టమే! మెక్సికన్ మరీ! అసలు మా గుంటూరు వాళ్ళే ఎప్పుడో వేల ఏళ్ళ క్రితం వెళ్ళి మెక్సికోలో స్థిరపడి అలా ఖారం ఖారంగా వండడం వాళ్లకు నేర్పి ఉంటారని నా ప్రగాఢ విశ్వాసం! లంచ్ కి ఏదైనా ఓకే! కానీ బ్రేక్ ఫాస్ట్ సాలిడ్ గా సౌత్ ఇండియన్ స్టైల్ లో లేకపోటే అసలు నేనేంటో తెలుస్తుంది చుట్టుపక్కలున్న వాళ్లకి.
ప్రపంచంలో ఎవరైనా సరే పొద్దున్నే ఇడ్లీలు, దోశలు తినకండా రోజుని ఎలా ప్రారంభిస్తారా అని ఒకప్పుడు భలే ఆశ్చర్యపొయేదాన్ని!

మేము ఒక్లహోమాలో ఉన్నపుడు మా వారి బ్రహ్మచారి ఫ్రెండ్స్ రోజూ "మా ఇంటిమీదుగా" ఆఫీసుకు వెళ్లడానికి ఇష్టపడేవాళ్ళు. వేడి వేడిగా ఇడ్లీలు, ఫిల్టర్ కాఫీ దొరుకుతాయని! హోటల్లో లాగా బోలెడంత ఇడ్లీ పిండి స్టాక్ లో ఉంచాల్సి వచ్చేది!

మల్లెపువ్వుల్లాంటి మెత్తని ఇడ్లీ, పల్చని రేకుల్లాంటి దోశలు, వడలు, జీడిపప్పు ఉప్మా, పూరీ,(బంగాళాదుంప కూరతో) కారప్పొడి,కొబ్బరి చట్నీ, ఎర్రగా కాలిన పెసరట్లు(అల్లం పచ్చడితో) ఇవీ బ్రేక్ ఫాస్ట్ కి నేను ఇష్టపడేవి! మా ఇంట్లో రోజూ నేను చేసేవి కూడా ఇవే! వీకెండ్స్ పెసరట్లు వేయకపోతే నాకు నిష్కృతి లేదు.

అమ్మో, ఇన్ని ఆయిల్ ఫుడ్సా, మరి కాలరీలో? అనుకుంటున్నారా! పరిగెత్తండి బాబూ, రన్నింగ్ , జాగింగ్, వర్కౌట్లు, ఇవన్నీ ఎందుకున్నాయి మరి? ఏదో ఒకటి చేసి వదిలించుకోండి!నోరు మాత్రం కట్టుకోకండి, నలభై దాటితే ఎలాగూ తప్పదు!
నా పాలసీ అదే! సాలిడ్ గా బ్రేక్ ఫాస్ట్ పడితే లంచ్ గురించి నాకు పట్టింపు లేదు. పూరీల్లాంటివి చేసామా, extra physical exercise సృష్టించుకుంటాను గానీ, నో చెప్పే ప్రసక్తే లేదు!

మంచి బ్రేక్ ఫాస్ట్ లాగించాలని ఉంటే వీకెండ్స్ మా ఇంటికొచ్చేయండి మరి!

August 21, 2008

మా ఇంటాయన కథ

టైటిల్ చూసి ఇదేదో మా ఆయన గారి కథ అనుకునేరు , కాదు సుమండీ, ఒకప్పటి
మా ఇంటి ఓనరు కథ!
హైదరాబాదులోని అశోక్ నగర్లో విశాలమైన ఖాళీ స్థలం, ఆవరణ నిండా బోలెడు చెట్లూ, మొక్కలూ,
దగ్గర్లోనే బస్టాపూ వంటి సుగుణాలున్న ఇల్లు తక్కువ అద్దెకే దొరికితే మీరేం చేస్తారు?
మేమూ అదే చేసాము లెండి!
వరసకు తమ్ముడయ్యే కజినొకడు ఈ ఇల్లు చూపించి పుణ్యం కట్టుకున్నాడు.
వాడికి వెంఠనే రాఖీ కట్టాలన్నంత ప్రేమ కలిగింది నాకు వాడిమీద!
అందుకే వాడి గురించి కుంచెం చెపుతాను ! వాళ్ళింటిపేరు ద్వివేదుల. వాడి పేరు శ్రీకాంత్!
అందుకని వాడు "ద్విశ్రీ" అని కలం పేరు పెట్టుకుని పుంఖాను పుంఖాలుగా కవిత్వ సృష్టి చేసి
సమాజం మీదికి విసిరేస్తుండేవాడు.
(అప్పట్లో త్రిపురనేని శ్రీనివాస్ గారు త్రిశ్రీ పేరుతో రాస్తుండేవారు. ఆయనే
వీడి కలం పేరుకు ప్రేరణట) సమాజం వాడి కవిత్వాన్ని మొహమాటం లేకుండా తిరస్కరించడం వల్ల,
వీకెండ్స్ మా ఇంటికి వచ్చి వారం రోజులూ తను రాసిన కవిత్వాన్ని మాకు వినిపిస్తుండే వాడు.
ద్విశ్రీ కవిత్వం నిండా వాడి ఊహా ప్రేయసి ని ఆహ్వానించడం, ఆవిడ కోసం నిరీక్షించడం సబ్జెక్టు!
'రావా ప్రియా.
.''నీ కోసం వేచి చూస్తూ
''ఎన్నాళ్ళీ నిరీక్షణ ''
నువ్వొచ్చే దారిలో గుండెను పరిచాను.
''నీ నీడ కోసం ' ఇవే వాడి కవితల శీర్షికలు.
నాకసలే ఈ 'నిరీక్షణ ' కవిత్వమంటే ఒళ్ళు మంట.
ఇన్ని కవితలు రాసినా ఆ ఊహా ప్రేయసి కరుణించినట్టు లేదు. ఎంతకీ రాదు.
ఆదివారం పొద్దున్నే ఇలాంటి కవితలు వినే మూడ్ ఉండాలంటే గుండె రాయి అయి
ఉండాలి, లేదా ఖాళీ బుర్రయినా కలిగి ఉండాలి.
"పొగ బారిన నా గుండె గోడలకు మల్లెపూలతో వెల్ల వేశాను(సిగరెట్లు తాగుతున్నాడా ఏమిటి)
నువ్వొస్తావని విషాద తుషార(అంటే ఏమిటబ్బా) బిందువులను పోగు చేసాను
నీ నీడలో విశ్రమిద్దామని డస్సిపోయాను(ఎవరన్నా డస్సి పోతే విశ్రమిస్తారు
గానీ వీడు విశ్రమించడానికే డస్సిపోతాడులా ఉంది)
ఎంతకీ రావేం?(దబాయింపు)
నా మీద జాలి లేదా(వేడుకోలు)
నా చివరి క్షణాలకైనా వస్తావా(బ్లాక్ మెయిల్)
ఇక అడగనులే(అలక, నిష్టూరం)

ఇత్యాది భావాలతో వాడు పెట్టిన హింస తల్చుకుంటే కవిత్వమంటేనే విరక్తి కలుగుతుంది.
నా మటుకు నాకు కవిత్వం అంటే 'కదిలేదీ కదిలించేదీ ' గా ఉండాలి(బొల్లోజు బాబాగారి కవితల్లాగా)
లేదంటే వేసవి ఉదయాన కిటికీ తలుపు తీస్తే చల్లగా పలకరించే
చిరుగాలిగా ఉండాలి(చూ:రాధిక, నిషి, దిలీప్ ల బ్లాగులు)
ద్విశ్రీ గాడి కవిత 'పెను నిద్దర వదిలించేది(అనగా పీడకల) గా ఉండేది.
చిరుగాలి లా కాక, వడగాలిని తలపిస్తూ ఉండేది.
వాడు వెళ్ళిపోయాక, ఇద్దరం సారం లేని తోలు బొమ్మల్లాగా అలా పడి ఉండేవాళ్లమంతే!
"ఒరే, అంతగా రాను మొర్రో అని ఆ ఊహా సుందరి మొత్తుకుంటుంటే ఎందుకురా '
రావా రావా వా వా ' అని చంపుకు తింటావు?ఇంకేమన్నా రాయి" అని సలహా ఇస్తే
వాడి బుర్రకెక్కలేదు.
ఇక లాభం లేదని ఒకరోజు మేమిద్దరం వాడిని కూచోబెట్టి తలంటాము.
'నువ్వు రాసేది కవిత్వం కాదు! ఇలాంటివి ప్రతి కాలేజీ మాగజైన్లోనూ
చూడొచ్చు! మూడో క్లాసు వాళ్ళు కూడా రాయగలరు!నువ్వింకా బాగా మంచి
కవిత్వం చదవాలి. తిలక్, శ్రీ శ్రీ , దేవులపల్లి వీళ్లందరి పుస్తకాలూ చదువు! తర్వాత రాయి"
అని బోలెడంత సేపు క్లాసు పీకి కొన్ని పుస్తకాలిచ్చి పంపాము.
తర్వాత నెల రోజులకు వాడు ఇల్లు చూసానని ఫోన్ చేశాడు.
"పోన్లే, మనం క్లాసు పీకినందుకు ఏ మాత్రం కోపగించుకోకుండా మనకు ఇల్లు
చూపాడు " అని నెక్స్ట్ వీక్ భోజనానికి పిలిచేసాను వాడి కవితలకు మెంటల్
గా సిద్ధమైపోయి! వాడు రాలేదు.

* * * *
గోడలకు మాచ్ అయ్యే అందాల కర్టెన్లు అవీ కొని, సామాన్లతో సహా మేమిద్దరం
ఇల్లు చేరే సరికి మా ఇంట్లో నలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో యుద్ధ రంగ భీభత్సాన్ని చిత్రించిన కర్టెన్లు అన్ని కిటికీలు, వాకిళ్ళకు తగిలించి కనపడ్డాయి. అవి చూసి దిమ్మెర పోయాము!
శాస్త్రి గార్ని పిలుద్దామనుకుంటుండగానే మాకు శ్రమ లేకుండా ఆయనే వచ్చాడు.

"వచ్చార్టే అమ్మడూ(రిటైర్ అయ్యి పదేళ్ళు అయింది లెండి ఆయన), ఈ ఇంటి వాస్తు కి అనుగుణంగా కర్టెన్లు కొనేసి ఉంచాను. ఈ రంగుల్లో కర్టెన్లు కడితే శుభ శక్తులన్నీ ఇంట్లో చేరి తలా ఒక కుర్చీ వేసుక్కూచుంటాయి" అన్నాడు.
ఖండించాలో, వద్దో అర్థం కాలేదు.
"లేదండీ, మేము ఇప్పుడే కొత్తవి కొని తెచ్చాము. మీకుందుకూ శ్రమ! అవి మీరు
తీసేసుకొండి, " అని మేము చెప్పబోతుంటే ఆయన అసలు వినిపించుకోలేదు.
"పిల్ల కుంకలు! మీకేం తెలుస్తుంది! అయినా మీ వాటా కోసం ఎప్పుడో
కొనేసానవి! సర్లే, ఎప్పుడు తిన్నారో ఏవిటో, పదండి భోజనానికి" అన్నాడు.
మేమిద్దరం మొహాలు చూసుకున్నాం! ఈ లోపు కామేశ్వరమ్మ(ఆయన భార్య) గారు
భోజనాలు వడ్డించేసి మమ్మల్ని పిలిచారు.
ఒక నాల్గు రోజులు గడిచే సరికి మా జీవితాలు మా చేతుల్లో లేకుండా
పోయాయి. శాస్త్రి గారి ప్రమేయం లేకుండా ఏదీ జరగడం లేదు."ఏవిటయ్యా, సంధ్య వార్చలా ఇంకా?" అనడిగేవాడు
మా వారిని.
"పని మనిషిని వంటింట్లోని రానివ్వకూడదు. రోజూ వంటిల్లు కడగాలి" అని
చెప్పారు నాకు. మేము ఇద్దరం ఆఫీసులకి వెళ్లినపుడు మాక్కూడా కూరలు కొనేసి ఏ రోజు ఏం
తినాలో కూడా వాళ్ళే నిర్ణయించేవాళ్ళు.ఆదివారాలు ఇంట్లో ఉండాలంటే భయం!
స్నేహితులొస్తే వాళ్లతో మాట్లాడాలంటే
భయం! (అసలు ఆ కర్టెన్లు చూసి భయపడి స్నేహితులు రావడం మానేశారు
లెండి!) మా లివింగ్ రూముకీ, వాళ్ళింట్లో ఒక గదికీ కామన్ గోడ! దానితో మేము
ఏమి మాట్లాడుకుంటున్నా సరే శాస్త్రి గారు ఆ రూంలోంచే మా మాటల్లో పాలు
పంచుకుంటుండేవాడు. అది మరీ దారుణంగా ఉండేది.టివీ కార్యక్రమాల గురించి కూడా మాట్లాడ్డానికి లేదు.
పక్క గదిలోంచి శాస్త్రి గారు "ఆ, ఇప్పుడెక్కడున్నాయి, మంచి ప్రోగ్రాములు! రామానంద సాగర్
తీసిన రామాయణం లో అసలు సీత .." అని ఆపకుండా అరగంట
మాట్లాడేవాడు.
అందువల్ల మేం విసిగిపోయి, ఆదివారం మధ్యాహ్నం దూరదర్శన్లో వచ్చే బధిరుల వార్తల్లో లాగా గుప్పెళ్ళు మూసి తెరుస్తూ, గాల్లో గుండ్రాలు చుడుతూ, నెత్తి మీద రౌండ్లు చుట్టుకుంటూ, వేళ్ళతో అంకెలు లెక్కెడుతూ కమ్యూనికేట్ చేసే విధానం ప్రాక్టీస్ చేసాం!
కామేశ్వరమ్మ గారు "అబ్బాయి స్నేహితులు వచ్చినప్పుడు నువ్వెందుకూ అక్కడ, మా
ఇంటికి రావే తల్లీ! " అనేది.
అప్పుడప్పుడూ "ఇవాళ ఆఫీసుకు సెలవెట్టు! ఫలానా రాజేశ్వరి గారు పదహారు
ఫలాల నోము నోచుకుంటున్నారు. నీకు వాయనం ఇమ్మన్నాను. మధాహ్నం వస్తారు"
అని చెప్పేసేది.
"నాకు ఆఫీసులో పనుందండీ, కుదరదు" అని చెపితే " ఏం పనీ! అసలు హాయిగా ఇంటిపట్టున కూచోక అసలు నీకుద్యోగాలెందుకే పిచ్చితల్లి!" అనేది.
ఆ చుట్టుపక్కల వీధిలో ఎవరు ఏ నోము నోచుకున్నా వాయనాలివ్వాల్సిన
ముత్తైదువుల జాబితాలో నాకు తెలీకుండా, చెప్పకుండా నా పేరు ఇచ్చేసింది.
మేమిద్దరం ఎక్కడికన్నా బయలు దేరుతుంటే చాలు, "ఆగమ్మా, లక్ష్మి గారు
వస్తారు ఇవాళ!గ్రామ కుంకుమ నోము నోచిందావిడ" అనేది.
తప్పించుకు పోవడానికి వీల్లేదు.వాకిట్లోనే అరుగు మీద చేరో వైపూ కూచుని
ఉండేవాళ్ళు మిస్టర్ అండ్ మిసెస్ శాస్త్రి! ఇంకా విడ్డూరమైన సంగతి మేము ఏ షాపింగ్ కో బయలు దేరుతుంటె మాతోపాటు వచ్చేవాళ్ళు. నా చీరెలు ఆవిడే సెలెక్ట్ చేసిందో సారి!
క్షీరాబ్ది ద్వాదశి నోము రోజు బలవంతంగా ఉపవాసం ఉంచారు నన్ను.
తప్పించుకోడానికి ఆదివారం అయింది ఆరోజు. సాయంత్రానికి కళ్ళు తిరిగి పడిపోయాను.
అప్పుడు కూడా పూజయ్యేదాకా ఏమీ తినడానికి వీల్లేదన్నారు శాస్త్రి గారు.

ఇహ ఇల్లు మారక తప్పలేదు. నాలుగు నెలలు మా జీవిత రిమోట్లు వాళ్ల చేతిలో
పెట్టి బతికేసాం!
మరో నెలకు ద్విశ్రీ గాడు వచ్చాడు చాటంత మొహంతో!"ఒరేయ్,నీకు శాస్త్రి గారిల్లు గురించి ఎవరు చెప్పార్రా! అమ్మో నరకం రా బాబూ" అన్నాను.
వాడు విలాసంగా కాళ్ళుపుతూ "ఆ సంగతి నాకెప్పుడో తెలుసు! అసలు మీరే నాలుగు నెల్లుంది అక్కడ.ఇంతకు ముందు అందరూ నెలకో రెణ్ణెల్లకో ఖాళీ చేసారు! సారీ, పారిపోయారు . ఆయన పేరు T.S.Sastry కదా! అందరూ ఆయన్ని ముద్దుగా TroubleSome Sastry అని పిలుస్తారు" అని చెప్పాడు.
నాకు మాట రాలేదు.
"మరి నీకేం మాయరోగమొచ్చి మమ్మల్ని చేర్చావు అక్కడ!నీ మొహం తగలెయ్య,
మీ నాన్నతో చెప్తానుండు" అన్నాను.
"సారీ అక్కా, అ రోజు మీరు నా కవిత్వం బాగా లేదని తిట్టారుగా! నాకు
కోపం వచ్చి, చిన్న రివెంజ్ తీసుకోవాలనుకున్నా! అందుకే....." అని నవ్వి
నవ్వి చచ్చాడు.
ఆరోజు వాడికి కోపం ప్లేట్లో తిట్ల టిఫిను, శాపనార్ధాల భోజనం దండిగా
వడ్డించాను. ద్విశ్రీ గాడు సాయంత్రం రూముకి బయలుదేరుతూ "చెప్పడం మర్చిపోయానే
అక్కా!మీరిద్దరూ ఇచ్చిన పుస్తకాలు బాగానే పనికొచ్చాయి. ఫలానా ఊర్లోని
కళాపీఠం వాళ్ళు పెట్టిన కవితల పోటీల్లో నాకు మూడో బహుమతి
వచ్చింది." అంటూ ఒక నోట్ బుక్ తీశాడు."ఇదే ఆ కవిత" అంటూ!నాకు ఆశ్చర్యం వేసింది.
"పోనీలే బాగుపడ్డాడు" అనుకుంటూ పుస్తకం లాక్కుని
చూశాను.
"ప్రియా ఎన్నాళ్ళీ నిరీక్షణ " అంటూ మొదలైంది కవిత.

August 12, 2008

నాకు సైడ్ లోయర్ బెర్తు ఎందుకొద్దంటే.....!




కొన్ని కొన్ని అదృష్టాలు అందరికీ పట్టవు! అవి పట్టాలంటే పెట్టి పుట్టాలి! నేను ఆ కోవలోనే బాగా పెట్టి పుట్టేశాను మా అమ్మకి! అవి చూసేవాళ్ళకి పెద్ద 'విషయాలు ' గా అనిపించవు గానీ అందులోని మజా అనుభవిస్తేనే గానీ తెలియదు లెండి!

నేను సిటీ బస్ నించి సెమీ లగ్జరీ బస్ దాకా(వోల్వో లో ఎండ సమస్య ఉండదు కాబట్టి వాటిని వొదిలేసాను) ఎప్పుడెక్కినా, కరెక్టుగా ఎండ వచ్చి మొహాన్ని కాల్చేసే దిశలో కూచుంటాను. కాసేపటికి అనుభవమై, లేచి సీటు మారదామనుకుంటే అప్పటికే బస్సు నిండిపోయి, నేను లేస్తే నా సీటు ఆక్రమించడానికి పదిమంది రెడీగా ఉంటారు.
అలా ఒకసారి నేను హైదరాబాదు నుంచి మా వూరెళ్లడానికి(ఆరు గంటల ప్రయాణం)ఏప్రిల్ నెల్లో బస్సెక్కి ఎప్పట్లాగానే ఏ దిక్కు ఎటో అంచనా వెయ్యడం చాతకాక, డ్రైవరు వెనకాల మూడో సీట్లో కూచున్నాను. బస్సు వూరు దాటే సరికి మొహం మాడిపోవడం మొదలెట్టింది. ఎలాగో మధ్యాహ్నం అయ్యాక, సంతోషించాను,

"అమ్మయ్య, ఇహ పొద్దు పడమరకు వాలుతుంది కాబట్టి ఎండ అటువేపు వాళ్లమీద పడుతుంది" అని! నార్కెట్ పల్లి దాటాక బస్సు సడన్ గా వేరే దిశలో ప్రయాణించడం మొదలెట్టింది. సో, మళ్ళీ ఎండ మొత్తం నాకే!
అలా సాయంత్రం దాకా ఎండలో వడియం లాగా వేగిపోయాను.

ఇంకో అదృష్టం...మఫిసిల్ బస్సుల్లో డ్రైవరు వెనకాల రెండో సీటుకి అద్దం ముందుకీ వెనక్కీ జరపడానికి వీల్లేకుండా బిగించి ఉంటుంది.(అదొక్కటే అలా ఎందుకుంటుందో)
మా వూర్నించి ఎప్పుడు గుంటూరెళ్ళినా కరెక్టుగా నేను అదే సీట్లో కూచుంటాను. గంట ప్రయాణమే అయినా బయటినించి గాలి రాకుండా, మచ్చలు పడ్డ అద్దంలోంచి బయటి ప్రకృతిని పరిశీలించడం ఎంత చిరాగ్గా ఉంటుందో!

మరో యాధృచ్చికం.....నేనెప్పుడు Domestic flight ఎక్కినా నాకెప్పుడూ విమానం రెక్క మీద సీటే దక్కుతుంది!గంటా రెండు గంటల ప్రయాణంలో కూడా దూది పింజల్లాంటి మబ్బుల్ని చూస్తూ, నారదుడెక్కడైనా కనపడతాడెమో అని వెదుకుదామంటే నాకెప్పుడూ ఆ చాన్స్ రాలేదు.వెర్రి మొహమేసుకుని విమానం రెక్క మీద బోల్టులు లెక్కెడుతూ కూచుంటా!

అసలన్నిటికంటే పెద్ద దరిద్రం ఏంటంటే రాత్రి రైలు ప్రయాణాల్లో సైడ్ లోయర్ బెర్తు దొరకడం! నేను ఒక వెయ్యి సార్లు రైలు ప్రయాణం చేసుంటే , కనీసం 970 సార్లు నాకు సైడ్ లోయర్ బెర్తే! ఇది చూడ్డానికి వెడల్పుగా, సుఖంగా ఉంటుంది గానీ ఇందులో సుఖం అనుభవిస్తే గానీ తెలీదు. సైడ్ లోయర్ బెర్తు మీద వాళ్ళు రైల్లో ఉన్న మిగతా బెర్తుల వాళ్లందరికీ లోకువే!

మొదటి విషయం...అది సీటుగా ఉన్నప్పుడు ఇద్దరూ ఎదురెదురుగా కూచోడానికి ఇరుగ్గా ఉంటుంది, కాళ్ళు పెట్టుకోడానికి. అలాగని దాన్ని బెర్తుగా మార్చామనుకోండి,నడుము విరిగిన వాళ్లలాగా వెనక్కి ఆనుకుని కూచోవాలి. లేదా కాళ్ళు చాపుకుని కూచోవాలి. దారి పక్కనే ఉంటుంది కాబట్టి, అటూ ఇటూ టాయిలెట్ల కొసం తిరిగేవాళ్లకో, రైలు బయలుదేరిన అరగంట వరకూ కూడా తమ సీటెక్కడో కనుక్కోలేక లగేజీతో సహా తిరిగే వాళ్ళకో మనం బలవ్వాలి! ఎడాపెడా తగిలేస్తూ ఉంటారు. కనీసం తిరిగి కూడా చూడరు.

కాఫీలు, టీలు, సమోసాలు, సెనగల మసాలాలు అమ్మేవాళ్ళందరికీ మన సైడు లోయరు బెర్తు వేదిక!
"కొంచెం జరగండి" అని, మనం జరిగామో లేదో కూడా చూడకుండా కాలే కాలే స్టీలు కాఫీ కాన్ మనకు ఆనించి పెట్టి అవతల బెర్తు వాళ్లకు కాఫీ వొంచుతాడు అబ్బాయి! చురుక్కుమని మనం అవతలికి జరిగితే మన అదృష్టం అన్నమాట.

అక్కడికది అయిందా!పడుకుందామంటే రెండు వైపులా ఎలైన్మెంట్ కుదరదు. ఒకవైపు ఎత్తుగా, రెండోవైపు ఎత్తు తక్కువగా...తెల్లవారే సరికి నడుము నొప్పి ఖాయం!

ఇహ మన పక్క బ్లాకులో వాళ్ళు ఎంతకీ లైట్లార్పరు. ఆ లైట్లేమో మన మొహాన పడుతుంటాయి. పన్నెండైనా గుడ గుడ కబుర్లాడుతుంటారు. వాళ్ళకి మనం కనపడుతుంటాం కాబట్టి వాళ్ళు మెలకువగా ఉన్నతసేపూ మనం ఫ్రీగా పడుకోలేం! అది ఏసీ కోచయితే మన మొహానే ఉంటుంది ఏసీ వెంట్!

ఇంకో సంగతి ఏమిటంటే మన బ్లాకులోని మూడు అప్పరు బెర్తుల వాళ్ళూ(కొండొకచో మిడిల్ బెర్తుల వాళ్ళూనూ)మన బెర్తు ను ప్రథమ సోపానంగా ఉపయోగించి పాపం వాళ్ల బెర్తులెక్కుతారు. ఈ లోపు మనం పడుకున్నామనుకోండి, మన కాళ్ళూ, జుట్లూ తొక్కేస్తే, వాళ్ల పూచీ ఏమీ ఉండదు మరి. అలా ఒకసారి ఒకమ్మాయి మాయా శశిరేఖ లక్ష్మణ కుమారుడి కాలు తొక్కినట్టు నా కాలు తొక్కేసింది. ప్రాణం పోయినంత పనైంది. బూతులొచ్చేస్తాయేమో అన్నంత కోపమొచ్చేసింది, కానీ సింపుల్గా సారీ చెప్పేసింది ఆ పాపాయి మరి, ఏం చెయ్యడం?

మధ్య మధ్య స్టేషన్లలో రైలెక్కినవాళ్ళు కూడా యథాశక్తి మన భుజాలూ, కాళ్ళు విరగ తొక్కేసి(వాళ్ల వాళ్ళ బాగేజీ సహాయంతో) గమ్యం (వాళ్ల బెర్తు) కనిపెడతారు.

అందువలన చేత నాకు సెకండ్ లోయరు బెర్తంటే చచ్చేంత భయం, చిరాకు! ఇదంతా ఎందుకు చెప్పానంటే....వచ్చే నెల్లో సరదాగా ఎటైనా వెళదామనుకున్నాం! ఇందాకా మా వారు ఫోన్ చేసి "ఒక అప్పరూ (తనకి), ఒక సైడ్ లోయరూ (నాకు) ఉన్నాయి...తీసుకోనా" అనడిగారు.
" ఈ ఏడాదంతా వెకేషన్ మాటెత్తకుండా అయినా ఉంటా గానీ, సైడ్ లోయరు తీస్కున్నారంటే, మా పుట్టింటికి తీస్కుంటా వెకేషన్" అని చెప్పాను!
మీరెప్పుడైనా అనుభవించారా సైడ్ లోయర్ బెర్తు సుఖాలు?