Showing posts with label పుస్తకాలు/సాహిత్యం. Show all posts
Showing posts with label పుస్తకాలు/సాహిత్యం. Show all posts

December 20, 2012

వోడ్కా విత్ వర్మ ........!!!!





సంచలనాత్మకమైన టైటిల్ తో,  గొప్ప ప్రచారం తో  అట్టహాసంగా మార్కెట్లో కి వచ్చిన కొత్త పుస్తకం !!

వర్మ మాట్లాడినా, సినిమా తీసినా, ప్రెస్ మీట్ పెట్టినా, ఒక ఛానెల్ స్టూడియో కూచుని వాళ్ళనే ఉతికి ఆరేసినా...సంచలనమే! ఇది ఎప్పుడో రుజువై పోయిన విషయమే! (Note: వర్మకీ నేనూ అభిమానినే)

ఆల్రెడీ రుజువైపోయిన విషయాల్ని ఏ కొత్త దనమూ లేకుండా మరో చప్పగా చెప్తే......ఎలా ఉంటుంది. సిరాశ్రీ  ఓడ్కా విత్ వర్మ లాగా ఉంటుంది.

 వర్మ ఏం చేసినా సంచనలం కోసమే అన్నట్టు ఉంటుంది. ఆయన తన మానాన తాను ఉన్నా అదొక సంచలనమై కూచుంటుంది.

పబ్లిషర్స్ ఇలా అంటారు ముందు మాటలో  "ఇది పూర్తిగా చదివిన తర్వాతైనా వర్మ కొంచెమైనా అర్థమైతే మా ప్రయత్నం సఫలమైనట్లే"!

అసలు వర్మ ఎందుకు అర్థం కావాలి? వర్మను ఎవరు అర్థం చేసుకోవాలి? ఆయన కుటుంబం, సన్నిహితులు, ఆయనతో కల్సి పని చేసే వాళ్ళకి ఆయన అర్థమైతే చాలుగా! ప్రపంచానికి అంతటికీ వర్మ ఎందుకు అర్థం కావాలి?

వర్మ లాగా ఎవరినీ లెక్క చెయ్యకుండా తమ ఇష్టమైనట్లు తాము బతికే వాళ్లు మన చుట్టు పక్కలే ఉండొచ్చు. కానీ సెలబ్రిటీలు కాకపోవడం వల్ల వాళ్లను మనం గుర్తించం..మీరైనా నేనైనా....!

సరే..పూరీ జగన్నాథ్ ముందు మాట లో వాక్యాలు చూడండి..

"ఆయన మాటలు వింటుంటే మనకి ఇంత వయసొచ్చినా ఇన్ని విషయాలు ఎలా తెలీలేదు సుమీ అనిపిస్తుంది."

"ఈయనున్నాడనే ధైర్యంతో అయాన్ రాండ్ ని చదవడం మానేశాను"

"పుస్తకానికి వొడ్కా విత్ వర్మ అని పేరు పెట్టడం వల్ల ఆయన్ని మీరంతా తాగుబోతు అనుకుంటారేమో....! ఆయన తాగుబోతు కాదు. అనాధలా ముంబాయిలో తిరుగుతున్న వోడ్కా ని చేర దీశాడంతే"

"ఆయన సినిమాని కిందేసుకోని, మీదేసుకోని, పక్కలో ఏసుకోని పడుకుంటాడు" (ఈ వాక్యాన్ని కోట్ చేస్తున్నందుకు క్షమించాలి) 

ఇలాంటి  అతిశయోక్తులతో మొదలైన పుస్తకంలో కంటెంట్ ని ఊహించడం కష్టమేం కాదు.

వర్మ అదీ వర్మ ఇదీ..వర్మ అలాగ..వర్మ ఇలాగ!
వర్మ అంతటి వాడు, ఇంతటి వాడు......
(పొగడ్తలు కూడా నెగటివ్ షేడ్స్ లో ఉంటాయి..బహుశావర్మకి నచ్చేలా)


 ఈ పుస్తకం మొత్తం మీద కాస్త ఆసక్తి కరంగా అనిపించినవి జేడీ చక్రవర్తి ఎపిసోడ్, వర్మ మేనమామ గారు మురళి రాజు ఎపిసోడ్!

వర్మ సొంత పుస్తకం నా ఇష్టం  లా ఆసక్తి తో పేజీల వెంట కళ్ళు పరుగులు తీసేలా చేయలేకపోయింది. త్వర త్వరగా పేజీలు తిప్పేస్తూ...అనవసర విశ్లేషణలని స్కిప్ చేస్తూ పోవడమే! కాబట్టి త్వరగా పూర్తయిపోతుంది.

ఇంతకంటే  విశ్లేషించాల్సింది ఈ పుస్తకంలో నాకేమీ కనిపించలేదు. ఇంతకంటే ఎక్కువ మాట్లాడుకోవడం కూడా అనవసరం !!

ప్రతి పెగ్గు కీ (చాప్టర్ కి రచయిత పెగ్గు అని పేరెట్టారు) వర్మ సూక్తులు అలవాటైనవే అయినా ఎప్పుడు చదివినా ఫ్రెష్ గానే ఉంటాయి కాబట్టి బాగున్నాయి.

ఇంతా చేసి ఈ పుస్తకం చదివాక వర్మ మీద కురిసిన  పొగడ్తల  వర్షమే తప్ప,వర్మని ఈ పుస్తకం ద్వారా అర్థం చేసుకోవాలనుకునే  పాఠకులకు  ఆయన కొత్తగా  ఏమీ  అర్థం కాడు. ఇది తెలిసే కాబోలు పబ్లిషర్లు "కొంతయినా అర్థమైతే......." అని కండిషన్ పెట్టారు.

ఈ లెక్కన వర్మ గురించిన మరో బుక్ వచ్చే బుక్ ఫేర్ సమయానికి సిద్ధం అయ్యే అవకాశాన్ని తోసి పుచ్చలేం! (ఎలాగూ ఇప్పుడు కొంతయినా అర్థం కాడు కాబట్టి )


త్వర త్వరగా పేజీలు తిప్పేసి ...ముగించి....పుస్తకం మూశాక....తెలుగులో వస్తున్న అత్యుత్తమ సాహిత్యం లో కనీసం ఒక్క పుస్తకానికైనా దీనికి లభించిన ప్రచారంలో పదో వంతు ఐనా  లభిస్తే ఎంత బాగుండు అనిపించక మానదు. 

ఇంతకీ ఈ పుస్తకం మీద వర్మ అభిప్రాయం ఏమిటో చెప్తే బాగుండు :-)))

అసలు ఇది సిరాశ్రీ ఆత్మ కథేమో అన్న సందేహం చాలా చోట్ల వచ్చింది నాకు  :-P


అన్నట్లు కవర్ పేజీ మీద ఫొటో ఆకర్షణీయంగా ఉంది. (నా ఇష్టం కవర్ పేజీ మీద ఫొటో నాకు అసలు నచ్చలేదు )

ఎమెస్కో వేసిన ఈ పుస్తకం వెల 125 రూపాయలు. ప్రస్తుతం అన్ని చోట్లా లభ్యం!

September 5, 2012

సహజ (ఓల్గా)





ఎప్పుడైనా స్కూలు నాటి స్నేహితుల్నో, కాలేజీ నాటి స్నేహితులనో  కల్సుకుంటే..వాళ్లలో ఎవరైనా

"నువ్వేం మారలేదే,, నీ అభిరుచులు, నీ మాటలు..ఉహూ..ఏం మారలేదు" అనంటే , ఒకప్పుడు "ఏం మారతాం ఎవరమైనా?" అనిపించేది కానీ, నిజంగా పెళ్ళి తర్వాత మారకుండా ఉండటం ఎలా సాధ్యమనే ఆలోచన వచ్చేది కాదు.

పెళ్ళి ఎవరి జీవితంలో అయినా ఒక జెర్క్!

 పెళ్ళికి ముందు ఉన్నట్లు ఉండాలంటే మన చుట్టూ ఉన్న మనుషులు అతి మంచి వాళ్ళై ఉండాలి. లేదా సంసార సాగరాన్ని ఈదుతూనే, బాధ్యతల సుడి గుండాల్లో పడి, అందులో మాయమై పోకుండా నేర్పుగా వ్యవహరించే తెలివి తేటలైనా ఉండాలి..!

కరెక్టా? ఉహూ .....కాదు! ఇంకేదో ఉంది...!!:-)

పెళ్ళి తర్వాత ఆడపిల్లలో ఎందుకు మార్పు వస్తుంది? వంటిల్లే లోకంగా,పిల్లలు, సేవింగ్స్...ఇవే ప్రపంచంగా ఎందుకు దాంట్లో కూరుకుపోతారు? పాత రోజుల నాటి అభిరుచులని, ఉల్లాసాన్ని,స్నేహాలను కూడా మర్చిపోయేంతగా అందులో ఎలా మమేకమై పొతారు?

అందరూ అలాగే ఉంటారా? అందరూ ఇష్టంగానే అందులో పడి మగ్గిపోయి అదృశ్యమైపోతారా? లేక వేరు దారి లేక అందులోనే తమను తాము ఇముడ్చుకుంటారా? యిది ఇష్టపూర్తిగా జరిగేదా లేక ఇందులో ఆత్మ వంచన ఉందా?
ఎక్కడికి పారిపోతాయి ఆ యవ్వన మధుమాసంలోని  నవ్వులూ, తుళ్ళింతలూ?
ఏ మలుపులో దారి తప్పి పోతాయి ఆ ఆశలూ, జీవితం మీది మధురోహలూ?
ఏ బాధ్యతల బరువు జీవిత సౌందర్యం వైపు తల తిప్పనివ్వకుండా చేస్తుంది ??

ఓల్గా రాసిన మొదటి నవల "సహజ" నవల్లో ఈ ప్రశ్నలన్నీ పాఠకులకు ఎదురవుతాయి. ఇది అప్పట్లో చతుర నవలగా వచ్చింది  .ఓల్గా మిగతా నవలల్లాగే సరళంగా సాగిపోయే శైలి ! ఆలోచింపజేసే కథా!!

ఓల్గా తర్వాతి రచనలతో పోలిస్తే ఇందులో కొంత పరిణతి తక్కువగా కనిపిస్తుంది రచనా పద్ధతిలో, ఎక్స్ ప్రెషన్ లోనూ!  

గుంటూర్లో తను కల్సి చదువుకున్న స్నేహితురాళ్ళు శారద, ఉష,రమ లను కలుసుకునేందుకు ఎన్నో ఏళ్ళ తర్వాత ఉద్యోగ రీత్యా బదిలీ అయి వచ్చిన సహజ కోటి జ్ఞాపకాలతో, సరికొత్త ఊహలతో పరిగెత్తుకొస్తుంది.

కానీ ఆమెకు నిరాశే ఎదురవుతుంది. ఆ ముగ్గురిలోనూ ఎంతో మార్పు.

కాస్తలో కాస్త ఉష తప్ప, మిగతా ఇద్దరిలోనూ ఘోరమైన మార్పు.

బాల మురళీ కృష్ణ పాట విన్నాక చచ్చిపోతే మాత్రమేం? అని ప్రాణాలివ్వడానిక్కూడా సిద్ధ పడ్డ రమ అదే బాల మురళి కచేరీ లోంచి  "అమ్మో, పాలు కాయాలే! అవి విరగాయంటే...మా అత్తగారి నస తట్టుకోలేను బాబూ" అని లేచెళ్ళి పోయే దశలో ఉంటుంది.

అద్భుతమైన పెయింటింగ్స్ ని అలవోగ్గా చిత్రించే శారద మిలిటరీ క్రమశిక్షణ నడిపించే భర్తకు, పిల్లలకు అన్నీ అందిస్తూ మాటలు రాని మూగదాని మల్లే అయిపోతుంది. భర్తకు ఇష్టం లేదని బొమ్మలు వెయ్యడం మానేస్తుంది.

సినిమా పిచ్చి లో పడి తిరిగే భర్తను ఏమీ అనలేక తనదైన పుస్తకాల లోకంలో ఆనందాన్ని వెదుక్కుంటూ కొంతలో కొంత నయంగా ఉంటుంది ఉష!

వీళ్ళు ముగ్గురిలోనూ ఈ మార్పు సహజకు జీర్ణించుకోవడం కష్టమైపోతుంది.కానీ సహజ ఆ వూరు వచ్చాక,  శారద  ఉషల జీవితాల్లో కొంత సంచలనం కల్గుతుంది. రమ ఎవరి మాటలూ వినపడనంతగా సంసారంలో పూడుకుపోయి ఉంటుంది.

సహజ  పంచిన స్నేహ పరిమళాలతో ఉష, శారద ల జీవితాల్లో సుగంధాలు విరబూస్తాయి. శారదలో బలవంతాన హత్య చెయ్యబడిన కళ తిరిగి జీవం పోసుకుంటుంది. ఉష భర్త తన కొలీగ్ ని పెళ్ళి చేసుకోవాలనే నిర్ణయాన్ని ఉష  ధైర్యంగా అంగీకరించి ఏ మాత్రమూ ఆనందం కల్గించని అతని సహజీవనానికి స్వస్తి పలుకుతుంది.

తన ఆధిపత్యానికి తిరుగు లేదని విర్రవీగే రామారావు మీద తన ఆత్మ గౌర్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో గొంతెత్తి నిలువరిస్తుంది శారద! ఇంకా చావని తన కళకు ప్రాణం పోసి బొమ్మలు గీస్తుంది.

ఈ కథంతా పక్కన పెడితే....

తమలో నిశ్శబ్దంగా జరిగిపోయే మార్పుని స్త్రీలు గుర్తిస్తారా? గుర్తించి కూడా గుర్తించనట్లు ఆత్మ వంచనతో నటిస్తారా అన్నది వేసుకోవలసిన ప్రశ్నే!


ఈ నవల 1986 లో రాసింది. అప్పటికీ ఇప్పటికీ సమాజం మారింది. ఇళ్ళలో పరిస్థితులు మారాయి. వంటింట్లో మగవాళ్ళు అడుగు పెట్టడమే వింతగా చూసి, మెచ్చుకునే పరిస్థితి ఈ నవల్లో ఉంది కానీ ఇవాళ చాలా వరకూ మారింది. అప్పటికీ ఇప్పటికీ ఉద్యోగాలు చేసే స్త్రీల సంఖ్య కూడా గణనీయంగానే పెరిగింది. మనుషుల ఆలోచనా విధానాల్లోనూ, స్వేచ్చా దృక్పథాల్లోనూ ఎంతో మార్పు వచ్చింది.

కానీ...పెళ్ళి వల్ల జీవితంలో చోటు చేసుకునే మార్పులో మాత్రం..పెద్దగా మార్పు లేదు. అభిరుచుల్ని, అభిప్రాయాల్ని సైతం మార్చేసుకుని...పూర్తిగా తామూ మారిపోయే వాళ్ల శాతం ఇంకా ఎక్కువగానే ఉంది.

ఈ నవల్లో "ఎందుకిలా మారిపోయావు రమా? ఏం కావాలి నీకు? ఎంతసేపూ డబ్బు,బాంక్ బాలెన్స్, పిల్లల్ని పెంచడం..ఇవేనా నీ జీవితాశయాలు" అని సహజ ప్రశ్నిస్తే రమ అవునంటుంది.

"అవునే, అదే నా జీవితాశయం! పిల్లల్ని పెంచి పెద్ద చేయడమే!! పిల్లల ఉన్నతిని చూడ్డం కంటే జీవితంలో ఏం కావాలి! ఏదో పెళ్ళికి ముందు మన సరదాలు మనకి ఉంటాయి. నీ జీవితాశయం ఏమిటో చెప్పు?పాట కచేరీలకు వెళ్ళడమూ, ఊళ్ళు పట్టుకు తిరగడమూనా? వాటి కంటే..నేను పిల్లలని చదివించుకుంటానంటే తప్పయిందా...." అని కడిగి పడేస్తుంది.

"నీ జీవితాశయం ఏమిటో చెప్పు" అని రమ నిలదీస్తే జవాబు వెంటనే చెప్పలేకపోతుంది సహజ! ఎందుకంటే సహజకు జీవితాశయం అంటూ ఒక భౌతికమైన టార్గెట్ లేదు.

స్నేహం..ప్రేమ....! అందరితోనూ స్నేహంగా ఉండటం, స్నేహం చేయడం, ప్రపంచాన్ని ప్రేమించడం..ఇవే సహజ కోరుకునేది! ఇవి గొప్పవే కావొచ్చు....కాని ఎవరికీ అర్థమవుతాయి?

ఆ రెండు ఉంటే  జీవితం అందంగా మారిపోతుందని ఎవరు చెప్తారు రమ  లాంటి వాళ్లకి?

కానీ ..ఇవి జీవితాశయాలంటే ఎవరు నమ్ముతారు మరి!!

నిజానికి పాతికేళ్ళ క్రితం రమ లాంటి పాత్రలు ఉండటం ఎంత సహజమో, ఇవాళ్టి రోజుల్లో కూడా రమ కంటే ఎక్కువ చదివి, మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు సైతం రమ స్థాయి కోరికలు దాటి ముందుకు పోలేని దశలోనే ఉండటము అంతే  సహజంగా అంగీకరిస్తున్నాం!

డబ్బు చుట్టూ తిరిగే జీవితపు చక్రాల మధ్యలో ఒడుపుగా తిరిగేస్తూ..వాటి కింద పడి నలగ కుండా జాగ్రత్త పడుతూ...పిల్లని చదివించడమే జీవితాశయంగా బతికేస్తూ.....జీవిత సౌందర్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ.. పగళ్ళూ రాత్రులూ గడిపే వాళ్ళు ఎంతమంది??

ఒక సోషల్ కమిట్ మెంట్ కి ఇంత శక్తి ఉందా? ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా తనకేం కావాలో మర్చిపోయేంత  గా మార్చి  వేస్తుందా వివాహం?

చాలా మందికి పెళ్ళి కి తాము ఏమిటన్న దానికి జవాబే గుర్తుండదు. . తమ అభిరుచులేమిటో...వేటిని ప్రాణంగా భావిస్తూ బతికారో....గుర్తుండదు.

మంచి గాయనిగా ఉన్నావిడ "పెళ్లయ్యాక ఇంకా అవన్నీ ఎక్కడ కుదురుతాయి" అంటుంది. నెమలికి నడకలు నేర్పే నాట్య కారిణి అయినా పెళ్ళితో స్వస్థి చెప్పాల్సిందే! ఉద్యోగాల్లో పడి ఒకప్పుడు తాము ఏమిటి అన్న ప్రశ్న వేసుకోడమే మానేస్తారేమో!

తమిళ రచయిత్రి శివశంకరి ఇలాంటి సున్నితమైన విషయాలను చాలా చక్కని సాధికారాత తో విశ్లేషిస్తారు. ఆమె రాసిన ఒక నవల "నేను నేనుగా"!!

ఇందులో పిల్లలు చదువులకెదిగిన ఒక తల్లి జీవితంలో ఏదో శూన్యత్వం ఆవరించిందని గ్రహించి....పెళ్ళికి ముందు సాధన చేసిన శాస్త్రీయ నృత్యాన్ని తిరిగి సాధన చేసి ప్రదర్శనలిచ్చే స్థాయికి చేరుతుంది.

జీవితంలో ఎప్పటికీ ఆ యవ్వన కాలపు మధురిమల్ని, ఆశల్ని, కాంతుల్ని,పరిమళాన్ని పొగొట్టుకోకుండా ఉండగలగడం ఎంత గొప్ప విషయం??మన అభిరుచుల్ని మర్చిపోకుండా ఉండటం, వాటిని కాపాడుకోవడం ఇవన్ని మనల్ని మనం మర్చిపోకుండా ఉండటం కాదా !! మనల్ని మనం కోల్పోకుండా  ఉండటం కాదా?

మనలో ఎంతమంది అలా జీవిస్తున్నామో ఎవరికి వారు ప్రశ్నించుకోవలసిందే !!

ఈ నవల చదివాక నాకో సందేహం వచ్చింది.

స్త్రీల జీవితంలో వంటిల్లు ప్రముఖ పాత్ర, పిల్లలు, వాళ్ళ పెంపకమ మరో అద్వితీయ పాత్రా వహిస్తాయి కాబట్టి పెళ్ళి వాళ్ళ జీవితాల్ని కబ్జా చేస్తుందని రుజువైనట్లే!

మరి పెళ్ళి..పురుషుల జీవితాల్ని మార్చదా? మారిస్తే ఎలాగ?
పెళ్ళికి ముందు వాళ్ళ జీవితంలో ఉన్న సౌందర్యారాధనా,ఉల్లాసమూ,పరుగులెత్తే ఉత్సాహమూ...ఇవన్నీ పెళ్ళి తర్వాత అలాగే ఉంటాయా? క్రమ క్రమంగా మసకేసి మాయమైపోతాయా?

ఈ కోణంలో  రచనలేమైనా వచ్చి ఉంటాయా? ప్రత్యేకించి ఇదే కోణంలో....!!

April 25, 2012

ఈ దేశంలో ఒక భాగమిది


(ఈ ఫొటోలో మొదటి వ్యక్తి స్వర్గీయ డాక్టర్ కొమ్మూరి వేణు గోపాల రావు గారు. నా దగ్గరున్న పుస్తకానికి కవర్ పేజీ లేకపోవడంతో గూగుల్ సౌజన్యంతో ఈ ఫొటో పెట్టాను  )


ఈ మధ్య మన సినిమాల్లో ఉమ్మడి కుటుంబాల హడావుడి ఎక్కువైపోయింది. నాలుగైదు ఫామిలీలు కల్సి ఉండటం, వాళ్ళు ఎప్పుడూ సరదాగా కులాసా కబుర్లు చెప్పుకుంటూ ఆనంద బాష్పాల్లో స్నానాలవీ కానిచ్చేసి,ఆప్యాయతలు భోంచేస్తూ,అనురాగాల్లో మునిగి తేలుతూ ఉంటారు. ఎప్పుడూ హాస్యాలే! గొడవలే రావు. ఇంకో ముఖ్యమైన సంగతి ఆ ఇళ్ళలో ఎవరూ ఉజ్జోగాలూ ఇతర పన్లూ చెయ్యరు. అంతా హాల్లో జేరి సోఫాల్లో కబుర్లాడుకుంటూంటారు. లేదా పిక్నిక్స్...!

నిజానికి ఉమ్మడి కుటుంబం స్వరూపం ఎంతో భిన్నమైనది.  అనురాగాలు,ప్రేమలతో పాటు ఇతర రకాల జాడ్యాలు దీని సొంతం! పాత సినిమా తోడి కోడళ్ళు చూస్తే తెలుస్తుంది ఎన్నెన్ని అపార్థాలు, ఎన్నెన్ని గొడవలూ,కాలుష్యాలు,కుట్రలు,కుతంత్రాలు,కడుపు మంటలూ!సినిమా కాబట్టి చివరాఖరి సీన్లో అందరూ నవ్వుతూ ఒకటైపోతారనుకోండి.


ఉమ్మడి కుటుంబాలు ఒకటో అరో మిగిలున్న కాలంలో దివంగత రచయిత శ్రీ కొమ్మూరి వేణు గోపాలరావు గారు రాసిన మంచి నవల "ఈ దేశంలో ఒక భాగమిది"!

ఆయన పోయాక ఆయన నవలలన్నీ రీ ప్రింట్స్ వచ్చినా, ఇదొక్కటీ మాత్రం రాలేదు. నాకు పెంకుటిల్లు,, హౌస్ సర్జన్ నవలల కంటే ఈ నవలబాగా నచ్చుతుంది. ఈ నవల కోసం ఏళ్ళ తరబడి అన్వేషించి, ఈ మధ్య విజయవాడ లో పట్టుకోగలిగాను !

ప్రతి మనిషికీ తనదిన ఇష్టం ప్రకారం స్వేచ్ఛగా జీవించాలని,చిన్న చిన్న సరదాలను తీర్చుకోవాలని  ఉండటం సహజమే!మనలో చాలామందికి అవి కూడా తీరవు ఈ నవల్లో కుమార్ కి మల్లేనే!

కుమార్ ది ఉమ్మడి కుటుంబం! అంటే మరీ మూడు నాలుగు తరాలు కల్సి ఉండకపోయినా, అతడు,పెళ్ళయిన మరో తమ్ముడి కుటుంబం,పెళ్ళి కాని తమ్ముడు,చెల్లెలు,అమ్మా నాన్నా!

కుమార్,అతని తండ్రి రంగా రావు డాక్టర్లు. సొంత హాస్పటల్ ఉంది.60ల్లో కథ కాబట్టి తల్లి దండ్రులంటే భక్తి తో కూడిన గౌరవాలు వగైరాలు పిల్లల సొంతం. తండ్రి మాటలకు ఎదురు చెప్పాలని ఉన్నా , తిరస్కరించాలని,వ్యతిరేకించాలని ఉన్నా చెప్పలేని అశక్తత,కొడుకుల సొంతం.

ఇద్దరు కోడళ్ళూ మంచి వాళ్ళే కానీ ఉమ్మడి కుటుంబానికి అలంకారమైన చిన్న చిన్న మనస్పర్థలకు వాళ్ళు అతీతులు కాదు. నిజానికి నెలకో సారో ఆర్నెల్ల కోసారో కలుసుకునే తోబుట్టువుల కుటుంబాల్లోనే పిల్లల వల్ల అరగంటలో ఆప్యాయతలు మసకేసి పోతాయి.

"పిల్లలే కదా" అని తేలిగ్గా తీసుకునే స్వభావం మనకున్నా అవతలి పిల్లల తల్లి దండ్రులకుండాలని లేదు. అది కూడా కాదనలేం! ఎవరి పిల్లలు వాళ్ళకు ఎక్కువ!

రాత్రి కంటినిండా నిద్ర పోవాలని,పొద్దున్నే లేచి వేడిగా చిక్కని ఫిల్టర్ కాఫీ తాగుతూ పేపర్ చదవాలని, పూరీలూ,పెసరట్లూ టిఫిన్ గా తినాలనీ,పొద్దున్నే పెళ్ళాం గారు చిరు నవ్వుతో "ఏవండీ, లేచారా" అంటూ ఎదురు రావాలని కుమార్ కోరికలు.
కానీ యదార్థ పరిస్థితి ఇలా ఉంటుంది.....:-))

అర్థరాత్రి వేళ కరెంట్ పోతుంది. గుయ్యి మని దోమలు. చెమట!ఈ లోపు పక్కలో పిల్ల తండ్రి మెడ చుట్టూ చెయ్యి బిగించి, ఎద్దులాగా మీద కాలు వేస్తుంది.
పొద్దున్నే లేచేసరికి గీజర్ లో వేన్నీళ్ళు మరదలు తన పిల్లలకు పోసేస్తుంది.
కాఫీ పల్చగా ఉంటుంది.
పేపర్ వివిధ భాగాలుగా విడిపోయి తలా ఒక రూములోనూ ఉంటుంది.
వాళ్ళమ్మ రోజూ లాగే ఉప్మా వడ్డిస్తుంది.
అతడి టిఫిన్ చేస్తుంటే రంగారావు గారు "అయిందా,అందుకే టైమ్ సెన్స్ ఉండాలంటాను నేను"అని నిమిషానికోసారి వాచీ చూసుకుంటూ తొంగి చూస్తుంటారు.

జాలేస్తోంది కదూ కుమార్ మీద!
తోటి కోడళ్ళిద్దరూ  స్వతహాగా మంచి వాళ్ళే! బాగానే ఉంటూనే, ఎందుకొస్తుందో తెలీకుండా కోపాలు తెచ్చేసుకుని క్షణంలో మొహాలు మాడ్చుకుని కూచుంటారు. అంతటితో ఊరుకోకుండా ఆ కోపం పిల్లల మీద చూపించి వాళ్ళను చావగొడుతుంటారు.

అత్తగారు అడ్డు పడితే "మా పిల్లల్ని మేము కొట్టుకోడానికి కూడా స్వేచ్ఛ లేదా"అంటుంటారు.

ఇహ ఇంట్లో ఎప్పుడూ జనాలు! మామ్మగారికి మడి! ఇల్లంతా ఎంత సర్దినా చిందరవందర! క్రమ శిక్షణ లేని పిల్ల రాక్షసులు!ఎప్పుడూ ఇంట్లో ఏదో ఒక construction  పని నడుస్తూ ఉంటుంది. సింకులు బాగు చేయించడమో,ప్రహరీ గోడకు పెచ్చులు ఊడితే పెట్టించడం,లేదా గేటు బాగు చేయించడం, ఇలాటి పనుల్తో ఇంటి ముందూ ఎప్పుడూ ఇసక కుప్ప,ఇటుకలు!

ఇవే కాక,రంగారావు గారు ప్రతి అరగంటకీ "నేను పడ్డ కష్టం నా పిల్లలు పడకూడదని నేను మీకు అంతా రెడీగా ఉంచాను.మీరు ఈ కాస్త కూడా కష్టపడలేరేం"అని కుమార్ ని చిన్నబుచ్చేట్టు నలుగురిలోనూ మాట్లాడ్డం,కుమార్ దానికి ఎదురు చెప్పలేక పోవడం మామూలుగా రోజూ జరిగే విషయం. ఎప్పుడో  కొన్న  ఆయన పాత కారు మీద అడుగడునా ఓనర్ షిప్ ప్రకటిస్తూ "అది నా కారు" అంటూ ఉండటం కుమార్ కి మింగుడు పడదు. ఆయన అలా మాట్లాడడం ససేమిరా అతనికి  ఇష్టం ఉండదు . చనువు తీసుకుని చెప్పే ధైర్యం చేయలేడు!

కొంత మందికి మనం మాట్లాడే మాటల్లో తప్పులుంటే ఎంత మంది మధ్యలో అయినా, ఎంత సీరియస్ విషయమైనా సరే అప్పటికప్పుడు సరిదిద్దెయ్యడం అలవాటుగా ఉంటుంది. రంగారావుగారిలాగా!

కుమార్ ఒక సీరియస్ చర్చలో "అతడు ఒట్టి మేనర్స్ లెస్ ఫెలో" అనగానే వాళ్ళ నాన్న "మేనర్స్ లెస్ కాదు,మేనర్ లెస్ అనాలి" అని దిద్దడంతో గాలి తీసిన బెలూన్ లాగా పాపం కుమార్ కి ఇహ మాట్లాడే ఆసక్తి పోతుంది.

ఇలా నిమిష నిమిషానికీ చిరాకు పుట్టిస్తూ,వ్యక్తి స్వేచ్ఛను పూర్తిగా హరించే పెద్దలు అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటారు మనకి కూడా! మా మావయ్య కూతురికి పెళ్ళయి ఏడేళ్ళు. ఇద్దరు పిల్లలు. అయినా ఇప్పటికీ దాని అత్తా మామలు ఏదైనా సందర్భం వచ్చినపుడు "మీ ఇంట్లో అయితే ఏం చేస్తారు?" " మీ ఇంట్లో అయితే ఇంతేనా? " మీ వాళ్ళంతా.." ఎంత సేపూ " ఈ ఇంట్లో మీ వాళ్ళు, మీ ఇంట్లో"! మీ ఇంట్లో అంటే మీ పుట్టింట్లో అని అర్థం!

పెళ్ళయి ఇన్నేళ్ళయినా దాన్ని "తమలో" కలుపుకుని మాట్లాడరు.   పైగా వాళ్ళకి ఇంకో ఫీలింగ్. కొడుకుని తాము కష్టపడి పెంచి పెద్ద బాంకు ఉజ్జోగిని చేస్తే కోడలు ఎక్కడినుంచో ఊడిపడి చక్కగా అనుభవిస్తోందని! నలుగురూ కల్సినపుడు "ఎంత కష్టపడ్డాం వాడి కోసం? అనుభవించే రాత ఉన్నవాళ్ళకే దక్కుతాయి అన్నీ" అంటూ ఎవరికో తగలాలన్నట్టు మాట్లాడుతుంటారు. కోడలు ఉద్యోగం చేస్తున్నా అది లెక్కలోకి రాదు. ఉమ్మడి కుటుంబాల్లో సమస్యలు బయటికి చెప్పుకోనన్నాళ్ళు అవి పచ్చని సంసారాలుగానే కనిపిస్తుంటాయి. చెప్పుకోడం మొదలు పెడితే అక్కడ ఆడా మగా తేడా లేకుండా ఎవరికీ మనశ్శాంతే ఉండదు.

కథలోకొస్తే..కుమార్,హరి ఇద్దరూ వీలైనంతగా ఇంట్లో చిన్న చిన్న గొడవల్ని పట్టించుకోకుండా ఉండాలనే ప్రయత్నిస్తారు. కానీ అవి రోజు రోజుకీ తీవ్ర తరమై పోతాయి. మధ్యలో పిల్లలు బలి పశువులై దెబ్బలు తింటూ ఉంటారు. వీటికి తోడు,ఇంట్లో తిష్ట వేసే చుట్టాలు.మర్యాదలు సరిగా లేవని అలకలు! చాకిరీతో ఆడాళ్ళు సతమతమై పోతుంటారు. అనారోగ్యాలు! చేసేవాళ్ళు కరువై అసహనాలు,కోపాలు పెచ్చు మీరతాయి.

ఈ పరిస్థితి చూసి మూడో వాడు అసలు పెళ్ళే చేసుకోకూడదని నిర్ణయించుకుని,ఒక అమ్మాయి మీద మనసు పడి కూడా,దాన్ని చంపేసుకుని వెళ్ళి ఆర్మీలో చేరతాడు.

ప్రతి గొడవనూ తోటి కోడళ్ళిద్దరూ భర్తలతో చెప్పుకోవడం పరిపాటే!అన్న దమ్ములిద్దరూ ఏమీ పట్టనట్టు వదిలేయడం వాళ్ళకు నచ్చదు. తమ వైపు మాట్లాడాలని ఆశిస్తుంటారు. పిల్లల విషయంలో మొదలైన ఒక గొడవ చిలికి చిలికి గాలివానగా మారి కుమార్ తన భార్య మీద చేయి చేసుకోవడంతో ఆమె ఆత్మ హత్యా ప్రయత్నం చేస్తుంది. దానికి నువ్వే కారణమని తమ్ముడు మరదలి మీద చేయి చేసుకుంటాడు.

ఈ గొడవల నేపథ్యంలో రంగారావు గారు కుటుంబాలు విడిపోయి ఎవరి దారిన వాళ్ళు విడిగా ఉంటూ అప్పుడపుడూ కలుసుకోవడం ఉచితంగా ఉంటుందనే నిర్ణయానికి వచ్చి రెండో కొడుకూ కోడాలికి ఒక చోట ఇల్లు చూసి,తామూ వేరే ఇల్లు చూసుకుంటారు.

ఈ నిర్ణయం నిజానికి ఎవరికీ ఇష్టం ఉండదు. ఏళ్ళ తరబడి కలిసి ఉంటున్నారాయె! ఈ విషయం వినగానే తోటి కోడళ్ళిద్దరూ కావిలించుకుని గొల్లున ఏడుస్తారు. కానీ విడిపోవాలనే నిర్ణయం మాత్రం మారదు.
అంతా కుటుంబాల వారీగా విడిపోవడంతో కథ ముగుస్తుంది.

ఈ నవల్లో కుమార్,హరీ ఇద్దరూ కూడా గొడవ అయినపుడల్లా "మీకేం తక్కువ? తిండి తక్కువా?గుడ్డ తక్కువా?కావలసినవన్నీ తెచ్చి పడేస్తున్నాంగా?ఇంకా ఎందుకు వస్తాయి మీకు గొడవలు"అని భార్యల్ని అడుగుతూ ఉంటారు!
"తిండీ,బట్టా తప్ప మాకు ఇంకేమీ వద్దా?
 మాకు ఇహ విశ్రాంతి వద్దా? ఉల్లాసం అక్కర్లేదా" అన్న తమ భార్యల ప్రశ్నలకు మాత్రం జవాబు చెప్పరు.
పిల్లలకు చదువు చెప్పడమో,వాళ్ళతో ఆడుకోవడమో,సమయం గడపడమో ....ఏమీ చేయరు. చాకిరీ చేస్తున్నారు కాబట్టి, భార్యల ఆరోగ్యాలు బాగానే ఉండుంటాయి లెద్దూ అనేసుకుని  "ఒంట్లో ఎలా ఉంది"అనైనా అడగరు.  స్టోర్ రూము నిండా సరుకులూ,బీరువా నిండా బట్టలూ తెచ్చి పడేస్తే చాలనుకుంటారు.
రచయిత కూడా తిని కూచుని పని లేక గొడవలు పడుతుంటారు ఉమ్మడి కుటుంబాల్లోని ఆడాళ్ళు అనే ఉద్దేశం చూపిస్తారు.
కథంటూ ప్రత్యేకంగా ఏమి లేకపోయినా,ఉమ్మడి కుటుంబంలోని వాస్తవ పరిస్థితుల్ని కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తూ సాగే ఈ నవల చాలా ప్రజాదరణ పొందింది.
కొమ్మూరి వేణుగోపాల రావు గారి రచనల్లో బెస్ట్ అనిపించుకోదగ్గ నవల. కథా గమనం చాలా ఆసక్తి కరంగా, వాస్తవికంగా నడుస్తుంది.ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు లేవు గానీ 60 ల్లో ఇంకా మాసి పోలేదు కాబట్టి ఆనాటి వాతావరణం ఈ నవల్లో బాగా ఆవిష్కృతమవుతుంది.
ఆయన నవలలు అన్నీ రీ ప్రింట్ కి వచ్చినా ఇది మాత్రం రాలేదు. ఎక్కడైనా లైబ్రరీలో దొరికితే చదవొచ్చు

February 26, 2012

శ్రీరామ రాజ్యం పుస్తకం..కాసిన్ని కబుర్లూ,బొమ్మలూ!


నిజంగా ఈ పుస్తకం చదవడానికంటే చూడ్డానికే ఎక్కువ టైము పట్టేట్టుంది. బాపు ప్రతి దృశ్యానికీ గీసుకున్న బొమ్మలూ, రాసు కున్న రాతలూ ఇవన్నీ హడావుడిగా పేజీ తిప్పి వదిలేయలేడానికి కుదరదు. కొంచెం కొంచెంగా ఊరించుకుంటూ ప్రతి పేజీ నెమ్మదిగా పూర్తి చేసి, తర్వాతి పేజీకి వెళ్ళాల్సిందే!



సినిమాలో  ఉండవలసిన దృశ్యాలు ఇందులో చాలా ఉన్నాయి. అవి సినిమాలో లేకపోవడం వల్ల "రమణ మార్కు" సినిమాలో కొంత వరకూ తగ్గి పోయిందని కూడా అనిపించింది ఈ సీన్లు చదువుతుంటే!



సీత కు ఊర్మిళ తల దువ్వుతుంటే మిగతా చెల్లెళ్ళూ పక్కనే కూచుని అడవిలో సంగతులూ, అక్కడ వాకిలి ఎవరు ఊడ్చేవారూ,ముగ్గెవరు పెట్టేవారు,తల దువ్వుకుంటే అద్దం ఉంటుందా వంటి ప్రశ్నలు వేయడం..అక్క చెల్లెళ్ళు కలిసి కబుర్లు చెప్పుకోవడం ...దృశ్యం చాలా బాగుంది చదువుతుంటే!


ఆ సీన్ ఉండుంటే బాగుండనిపించింది. ఇలాగే మరి కొన్ని సీన్లు! పాటలు!




చెప్పడం కంటే బొమ్మలు చూడ్డం, పుస్తకం తెచ్చుకుని చూడ్డం, చదవడం బాగుంటుంది. అందుకే ఇంతకంటే ఏమీ రాయడం లేదు.


                                                          తాంబూల రాగాల ప్రేమామృతం
                                                          తమకించి సేవించు తరుణం

February 11, 2012

పుస్తకంగా శ్రీరామ రాజ్యం !



ముళ్ళపూడి వెంకట రమణ గారు మనకు దూరమై అప్పుడే ఏడాది (ఫిబ్రవరి 24)అవుతోంది. ఆయన చివరగా రచన అందించిన సినిమా శ్రీరామ రాజ్యం శతదినోత్సవం ఆయన తొలి వర్థంతి నాడే కావడం యాధృచ్ఛికం! 

ఈ సందర్భంగా మిత్రులందరితో ఒక మంచి వార్త చెప్తా వినండి!

శ్రీరామ రాజ్యం శతదినోత్సవం రోజుని,రమణగారి తొలి వర్థంతి రోజుని ...ఆయన అభిమానుల కోసం చిరస్మరణీయంగా చేయాలని రచన శాయి గారు సంకల్పించారు.

శ్రీరామ రాజ్యం కోసం ముళ్ళపూడి వెంకట రమణ గారు రాసిన స్క్రిప్టు యథాతధంగా (సినిమా కోసం ఎడిట్ చేసింది కాదన్నమాట)పుస్తక రూపంలో వాహినీ బుక్ ట్రస్ట్ విడుదల చెయబోతోంది.

రమణ గారి స్క్రిప్టుతో పాటు సీనిక్ ఆర్డర్, బొమ్మలూ, స్వదస్తూరీ తో కూడిన బాపూ గారి స్టోరీ బోర్డూ కూడా కలిపి ఈ పుస్తకం నయన మనోహరంగా తనదైన శైలిలో రూపు దిద్దుకుంటోంది.

దాదాపు 400 పేజీలతో రాబోతున్న ఈ పుస్తకంలో 32 పేజీల వరకూ రంగుల్లో ఉంటాయట.

అంతే కాదు, శ్రీరామ రాజ్యంలోని పాటలన్నీ బాపూ దస్తూరీతో ఈ పుస్తకంలో లభిస్తాయి.
'
శ్రీరామ రాజ్యంలో కొన్ని చోట్ల సినిమా  వేగంగా నడిచిపోయినట్లు అనిపిస్తుంది. 'ఇక్కడ ఎడిటింగ్ బాగా జరిగిపోయినట్లుంది" అనే భావం కలిగింది. ఈ పుస్తకం వల్ల ఆ "ఎడిట్ అయిపోయి ఉండొచ్చు" అనుకున్న సీన్లు కూడా మనం చదవొచ్చన్నమాట!

భవిష్యత్తులో ఏ సినిమా అయినా ఈ తరహా పుస్తకంగా ఎంత సమగ్రంగా వచ్చినా, వచ్చినా,అది బహుశా స్టోరీ బోర్డుతో  వచ్చే అవకాశం లేదు. బొమ్మలతో కూడిన స్టోరీ బోర్డు తెలుగు దర్శకుల్లో బాపూకి మాత్రమే సొంతంగా మరి!

పుస్తకం విశేషాలు,పేజీలు,క్వాలిటీ అన్నీ చెప్పాను కాబట్టి, ధరను అంచనా వేసి రెడీగా ఉండండి మరి!

UPDATED



రచన శాయి గారి నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం
ఈ పుస్తకం లో పేజీలు 472. అందులో 40 పేజీలు రంగుల్లో ఉంటాయి. ధర రూ.800/-
మార్చి ఒకటి నుంచి ఈ పుస్తకం నవోదయ కాచిగూడ లో లభ్యం 

 

January 18, 2012

"కళ్ళు తెరిచిన సీత" _______రంగనాయకమ్మ కొత్త నవల






"కళ్ళు తెరిచిన సీత"

రంగనాయకమ్మ గారు చాలా రోజుల తరవాత రాసిన నవల. నవ్య వార పత్రికలో ధారావాహిక గా అనేక వారాలు వెలువడి విశేషంగా పాఠకులను ఆకట్టుకుని, అనేక చర్చలకు, వాదోపవాదాలకు దారి తీసిన నవల. అంతే కాక పాఠకుల ప్రశ్నలకు రంగనాయకమ్మ గారు ఈ నవల ప్రచురిస్తున్నపుడు జవాబులు కూడా ఇచ్చారు.

ఇది ఒక సాధారణమైన కథ! (నిజానికి ఇది కథ కాదు. నిజజీవిత గాధ) మీ ఎదురింట్లోనూ, మా పక్కింట్లోనూ, మా పై ఇంటివాళ్ల పై ఇంట్లోనూ కనపడే కథే! ఇందులోని సబ్జెక్ట్ తో ఒక డాక్యుమెంటరీ తీయొచ్చు. అయితే దీన్ని రంగనాయకమ్మ గారు అద్భుతంగా మలిచి చక్కని నవలా రూపాన్నిచ్చారు. యదార్థ గాథకు కల్పనను జోడించి కథలు రాసే ట్రెండ్ ఈ మధ్య అక్కడక్కడా చూస్తున్నాం! అయితే ఈ నవల మొత్తం యదార్థమే! ఇందులో సాక్షాత్తూ రంగనాయకమ్మ గారు, ఆమె కుటుంబ సభ్యులు, పరిచయస్తులు,పాఠకులు, పిల్లలు,వాళ్ళ పనమ్మాయి కూడా మనకు పరిచయం అవుతారు.

కథ విషయానికొస్తే చక్కగా చదువుకుని మైసూరు లో మంచి ఉద్యోగం చేస్తున్న హైద్రాబాదు సీత కి (మారు పేరు)కు అమెరికాలో ఉజ్జోగం చేస్తున్న నాగరాజుతో పెళ్ళి కుదురుతుంది. సీతవి అభ్యుదయ భావాలూ, నాగ రాజువి అట్టడుగు ఆలోచనలూ! ఈ ఆలోచనా ధోరణీ, భావాలూ ఇవన్నీ సీతకు పెళ్ళికి ముందే అర్థం అయ్యే అవకాశాలు అనేకం వస్తాయి. అయినా సీత ఒక పక్క కన్ఫ్యూజ్  అవుతూనే, నాగరాజునే పెళ్ళి చేసుకుంటుంది.(కట్నం వద్దన్నాడు గామరి!)

 పైగా నాగరాజు తీయని కబుర్లు చెప్తాడు. తనకు మూఢ నమ్మకాలు లేవనీ, ఇంట్లో తన పని తనే చేసుకుంటాననీ, ఇద్దరం కలిసి వంట చేసుకోవచ్చనీ... ఇలా! ఇవన్నీ మన సీత నమ్మి "ఇతనికి సాహిత్యం చదివే అలవాటు లేకపోతే ఏం? ప్రేమించే హృదయం ఉంది. అది చాలదూ" అని  తనని తనే మభ్య పెట్టుకుని పెళ్ళికి సిద్ధమవుతుంది.

 ముందు స్వీట్ హోమ్ బాబుతో పోల్చుకుని, తర్వాత ఇంట్లో   "సత్యం (జానకి విముక్తి లో జానకి అన్న) లాంటివాడు. అందుకే ఒప్పుకున్నా"  అని పొంతన లేకుండా మాట్లాడుతుంది.

సరే,.. పెళ్ళయి సీత చికాగో చేరుతుంది. వెళ్ళక ముందే అత్తవారింట్లో సంప్రదాయాలకీ, సీత భావాలకీ సరిపడకపోయినా సీత ప్రతి చోటా లొంగి ఉండి సర్దుకుంటుంది. అక్కడికి వెళ్ళాక సీత జీవితం దుర్భరమవుతుంది. అద్దె కలిసి వస్తుందని నాగరాజు అక్క ఇంట్లో ఉంటాడు. ఇంటిపనంతా సీత మీద పడుతుంది. నాగరాజు అతడి అక్క ఏ మాత్రం సంస్కారమూ, కన్ సర్నూ లేకుండా ప్రవర్తిస్తారు.

 ప్రతి చేష్టలోనూ, మాటలోనూ ఆధిపత్యం ప్రదర్శిస్తారు. సీత తమ ఇంట్లో పడి ఉండాల్సిందే అన్న భావం కల్గిస్తారు.ప్రతి సంఘటనలోనూ సీత మనసు ఘోరంగా గాయపడుతుంది. అక్కడి నుంచి బయట పడి తీరాలన్నంత విరక్తి కలుగుతుంది. ఎలా పడాలొ తెలీదు.అందుకే పూర్వ పరిచయాన్ని పురస్కరించుకుని తనకు సలహా ఇచ్చి కాపాడమని, అక్కడి నుంచి బయట పడేయమని రంగనాయకమ్మ గారిని కోరుతుంది.

అమెరికాలో రంగనాయకమ్మ గారి చెల్లెలి కొడుకు రవీ, పాఠకుడు, కుటుంబ సన్నిహితుడు ప్రసాదు,మరో పరిచయస్తురాలు శ్యామలా వీళ్ళంతా ఉంటారు. రంగనాయకమ్మ గారి నుంచి మెయిల్ అందుకున్న వీళ్ళంతా సీత అమెరికా నుంచి ఇండియా వచ్చేయడానికి అనేక రకాలు గా సహాయం చేస్తారు.

సీత ఇండియా వచ్చేస్తుంది. వచ్చేశాక, అక్కడ తను పడిన మానసిక హింసను అంతా కళ్ళకు కట్టినట్టు వివరిస్తుంది. నాగ రాజు మీద కేసు పెట్టాలా వద్దా అన్న దాని మీద అందరి మధ్యా చాలా చర్చలు జరిగాక,  చివరికి అతడికి విడాకుల కాయితాలు పంపడంతో (నాగరాజు మరో సీతను వెదుక్కునే మార్గం సుగమం చేయడం ) కథ ముగుస్తుంది

ఈ పుస్తకాన్ని  ‘నవల’ అనటానికి లేదు.  ఎందుకంటే వాస్తవానికి కల్పన ఏమీ జోడించలేదు కాబట్టి. ఇది, ఒక అమ్మాయి జీవితంలో  కొంత భాగం.

‘పాలల్లో నీళ్ళు కలిపినట్టూ, పట్టు తేనెలో బెల్లం పాకం కలిపినట్టూ , ఈ నిజ జీవితంలో  కల్పనలూ, ఊహా గానాలూ, కట్టు కథలూ , కలపలేదు’ అంటారు రచయిత్రి.

కథలో  ఉప కథగా శ్యామల విఫల ప్రేమ గాథ  వస్తుంది.  అసలు శ్యామలే మొదటి సీత అంటారు రచయిత్రి.  ఆమెకూ,  రచయిత్రికీ  జరిగే  ఫోను సంభాషణలు ఆలోచనాత్మకంగా ఉంటాయి.
శ్యామల కూడా ప్రేమ వివాహం చేసుకుని భర్తతో విభేదాలు వచ్చి, అతడితో కలిసే దాదాపు ఒంటరి గా పిల్లాడి కోసం బతుకుతూ ఉంటుంది.

సీత ఇక్కడికి వచ్చాక అమెరికాలో తనకు ఎదురైన చేదు అనుభవాలు వివరించే క్రమంలో అనేకమంది మనకు పరిచయమవుతారు. సందర్భానికి తగ్గట్టు రంగనాయకమ్మ గారి పదేళ్ళ మనవరాలూ, రెండేళ్ళ బుల్లి మనవడు స్పార్టకస్, పనమ్మాయి సువర్ణ, ఇంకా కోటయ్య చౌదరి..ఇలా అన్నీ నిజజీవిత పాత్రలే!

యదార్థ గాథ అయినప్పటికీ,   సీత ఐదునెల్ల  కాపురానికి సంబంధించిన  సూక్ష్మమైన  వివరాలు సైతం  విరివిగా  ప్రస్తావించినప్పటికీ  డాక్యుమెంటరీ లక్షణాలేమీ  లేకుండా ఆసక్తికరమైన నవలగా  ఇది  రూపుదిద్దుకుంది.

సీత  అమెరికాలో  భర్త ఇంటి నుంచి తప్పించుకు వచ్చిన  ఘట్టం ఉత్కంఠభరితంగా ఉంటుంది.

సీత ఆడపడుచు కస్తూరి ని  రచయిత్రి  కళ్ళకు కట్టిస్తారు.  ఆమెలోని  కపటత్వం,  మాటల్లో లౌక్యం,  చేతల్లో జిత్తులు  సహజంగా చిత్రిస్తారు.
సీరియస్ గా  కథ నడుస్తూ ఉంటే  చటుక్కున   రంగనాయకమ్మ గారి సహజసిద్ధమైన  హాస్యం , వ్యంగ్యం తళుక్కుమని మెరుస్తూ  పాఠకులను గిలిగింతలు పెడుతుంది.

సీత తండ్రి గురించి ఏమంటారో చూడండి-

‘సీత కథను సినిమాగా తీస్తే సీత మామ గారి పాత్రని పెట్టక్కరలేదు. ఆ పాత్రకి డైలాగులే  వుండవు. ఒక పాత్ర అక్కర్లేనందుకు ప్రొడ్యూసర్ కి చాలా లాభం! ’    

సీత చెప్పేది ఇంకా వినడానికి  విసుగెత్తిపోయానని చెపుతూ అంటారిలా-
ఈ చచ్చు పుచ్చు సీత కథని సినిమా తీస్తే , ప్రొడ్యూసరు మట్టికొట్టుకుపోతాడు.’ 

‘ఇంటి చుట్టూ గుడిసెల్లోనూ, బైటా, మొగాళ్ళందరి చేతలకీ రాఖీలే!  పాపాయి, తమ్ముడికి ఆ గుడ్డముక్క రాఖీ కట్టింది!  ఈ రెండేళ్ళ పురుషుడు , ఆ పదేళ్ళ స్త్రీని , రక్షిస్తూ ఉండాలని! ’

పుస్తకం చదువుతున్నంత సేపూ నవ్వొస్తూనే ఉంది నాకు చాలా చాలా చోట్ల!

కొన్ని ఘట్టాల్లో  సందర్భానుసారంగా  రచయిత్రి చేసే  ఆణిముత్యాల్లాంటి వ్యాఖ్యలు అర్థవంతంగా ఉంటాయి.  ఆలోచనలు రేపుతాయి.


‘చాలామందికి, ముఖ్యంగా ఆడవాళ్ళకి, అందులోనూ పెళ్ళీడు ఆడపిల్లలకి, ‘ప్రేమ’ కావాలి. కానీ, నిజంగా కావలసింది ప్రేమ కాదు; ప్రేమ మాటలు! ప్రేమను ప్రదర్శించే మాటలు!  ప్రేమను కురిపించే మాటలు! పైగా ఇంగ్లీష్ లో  చెప్పే ప్రేమ మాటలు!  ‘ఐ లవ్ యూ’ అంటే చాలు!  అది ప్రేమే!’

‘పూల మొక్క, భూసారంతో , సూర్యరశ్మితో, నీటి జల్లుతో , బతుకుతుంది. ఎదుగుతుంది, పుష్ఫిస్తుంది.
ప్రేమ లత, ఇరువైపులా హృదయ సౌందర్యాలతో, భావ సంస్కారాలతో, నిస్వార్థ అర్పణలతో, బతుకుతుంది, ఎదుగుతుంది, ఆనందాల్ని పుష్పిస్తుంది. ’

"ఆడవాళ్ళు భలే లాంటి వాళ్లు. వీళ్ళకు ఉత్తములైన భర్తలు కావాలి. అలాంటి భర్తల్ని పొందడానికి తాము అర్హులమేనా అన్న ప్రశ్న రాదు వాళ్ళకి. సీత సరిగ్గా అలాంటిదే! ఆమెకు కలలే తెల్సు! ఊహలే తెలుసు! పంజరంలో ఒదగడమే తెలుసు!"


ఇవన్నీ పాఠకుల్ని ఆలోచనలో పడేస్తాయి.


సీత భావాలు మొదటి నుంచీ వేరు.  కానీ ఆమె వాటిని నాగరాజుతో వివాహం కోసం వదులుకోడానికి సిద్ధపడుతుంది. మళ్ళీ  "వీళ్ళు అలా ఎందుకు చెయ్యాలి ? నాగరాజు ఇలా ఎందుకు ప్రవర్తించాలి?" అని ఆశ్చర్య పడ్డాలూ, తెల్లబోవడాలు చేస్తుంటుంది. ఆమెకు మంత్రాల పెళ్ళి ఇష్టం లేదు. అయితే నాగరాజు బలవంతం మీద ఒప్పుకుంటుంది.  ఆ పెళ్ళికి ఒప్పుకున్న సీతకి ఆ పెళ్ళి తాలూకూ ఫాలో అప్స్ కూడా అంగీకారం కావాలి. వ్రతాలు ఒద్దనీ,సూత్రాలు తీసేస్తాననీ వాదనలు (వాదనలు కాదులే, నిజానికి  beg  చేస్తుంది ) చేస్తుంది. 
రిజిస్టర్ పెళ్ళే  వద్దన్న వాడు వీటికొప్పుకుంటాడా? 


 అయితే ఈ విషయాలన్నింటికీ సీత ను రంగనాయకమ్మ గారు బాగా తల వాచేట్లు చీవాట్లు వేస్తారు కాబట్టి ఇక మనకా శ్రమ అక్కర్లేదు.:-))


లేని పోని ఆడంబరాలు పోయే వాళ్ళ మీదా, ఒళ్ళంతా కనిపించేలా బట్టలు ధరించి "ఇది మా హక్కు," అనో "ఫాషన్" అనో వాదించే వాళ్ళమీదా రచయిత్రి నిప్పులు చెరుగుతారు.(పదేళ్ల తన మనవరాల్ని కూడా వదిలిపెట్టరు) 


నిజానికి ఎన్నారై పెళ్ళిళ్ళలో ఇంత కంటే ఘోరంగా విఫలమై, తిట్లూ తన్నులూ, హత్యా ప్రయత్నాలూ,పిచ్చిదని కేసులు పెట్టడాలూ,పిల్లల్ని లాక్కుని వీధిలోకి తరిమేయడాలూ, మంచి మాటలతో ఇండియా పంపించేసి అమెరికా కోర్టుల్లో విడాకులు తీసుకోడాలు...ఇలాంటివి కూడా కోకొల్లలు,. అయితే ఇక్కడ "ఎన్నారై" పెళ్ళి కంటే కూడా....మనసులు కలవని,ధోరణులు సరిపడని ఒక పెళ్ళిగా మాత్రమే దీన్ని చూడాలి మనం! 


కాని, అమెరికా అల్లుడు గా ఉండటం ఒక ప్రత్యేకత గా నాగరాజు, అతడి అక్క,తల్లి అందరూ భావిస్తూ ఉండటం వల్ల సీతకు పీడన మరింత అధికమయింది. తప్పించుకోలేదనే ధీమాతో ఆ పీడనకు హద్దు లేకుండా పోయింది .


ఈ సీరియల్ నవ్యలో వస్తున్నపుడు  ఓ పాఠకుడు రంగనాయకమ్మ గారిని  ఇలా అడిగారు-  ‘కొందరు మగవాళ్ళకు కూడా భార్యల వల్ల ఇబ్బందులూ, అవమానాలూ ఉండడం మీకు తెలియకపోదు. ఆ కోణంతో, ‘కళ్ళు తెరిచిన రాముడు’ రాస్తారా?’ 
రంగనాయకమ్మ గారి  జవాబిది-  ‘సీత చెప్పినట్టే  , ఆ రాముడు కూడా తను పడ్డ అవమానాలు నాకు చెప్పుకుంటే , ఎందుకు రాయను? తప్పకుండా రాస్తాను. ఇష్టంగా, శ్రద్ధగా, రాస్తాను’.


అరుణా పబ్లిషింగ్ హౌస్ వారి ప్రచురణ ఈ  పుస్తకం. పేజీలు 352  (హార్డ్ బైండ్) 
ధర :120  రూపాయలు! 






January 12, 2012

మల్లి పూయించిన జాజులు ...!!


 ఉజ్జోగాలు,బాంక్ అకౌంట్లు,డబ్బులు,క్రెడిట్ కార్డులు, స్కూలు అడ్మిషన్లు,వీటన్నింటి మధ్యా ఇరుక్కుపోయిన  జీవితాల్లో అపుడప్పుడు కాసేపు మనిషిలా మానవీయ కోణంలో.... కరువవుతున్న మమతల గురించో,చేరువవుతోన్న ప్రపంచీకరణ గురించో,బంధుత్వాలు, వాటి బాధల గురించో మొత్తం మీద సాటి మనిషి గురించి స్వేచ్ఛగా ఆలోచిస్తూ గమ్యం సినిమాలో గాలి శీనులా కాసేపు బతికేస్తే....? మనసు తేలికవదూ?

రోజులో కనీసం ఒక్కసారైనా సమాజపు అడ్డుగోడలు దాటి మనిషిగా ఆలోచిస్తున్నామా మనం? అసలు అంత సమయం ఉందా మనకి? ఎక్కడికి పరిగెడుతున్నాం మనం? ఎక్కడికి చేరతాం?

మనిషిగా ఆలోచిస్తూ మజాగా బతికే క్షణాల గురించి జాజి మల్లి బ్లాగర్ మల్లీశ్వరి గారు విడుదల చేసిందే ఈ "జాజిమల్లి" బ్లాగ్ కథలు! ఇవన్నీ జాజి మల్లి బ్లాగులో వచ్చినవే!

 నిజాయితీగా చెప్తున్నా___________వీటిలో సగం నేను చదవనే లేదు బ్లాగ్ లో!:-))
 పుస్తకం చేతికొచ్చాక చదవడమే!

మీలో చాలామంది చదివే ఉండొచ్చు వీటన్నింటినీ! ప్రతి ఒక్కరూ ఐడెంటిఫై చేసుకునే అంశాలెన్నో ఈ కథల్లో కనిపించి కదిలించి కలవర పెడతాయి.

జాబిలి లోని చల్లదనం, జిలేబీలోని తీయదనమూ కల్సి అవతరించిన పాతూరింట్లో నాల్గో ఆడపిల్ల..... ప్రేమతో, రాసేటపుడు పెదవుల మీదకు తోసుకొస్తున్న చిరునవ్వు సాక్షిగా తవ్వి తీసిన జ్ఞాపకాల నిధి ఈ కథా సమాహారం!

తీయని బాల్యస్మృతుల్ని పంచుతూనే చివర్లో  సడన్ గా ఇచ్చే కొసమెరుపు ముగింపు ప్రతి కథలోనూ గుండె ఝల్లుమనిపిస్తుంది. ఒక్క క్షణం మూగబోయేలా చేసి, కఠొర వాస్తవాన్ని కళ్ళ ముందు నిల్పిపరుచుకున్న   చిరునవ్వుని పక్కకు జరిపి నిట్టూర్పుకు దారినిస్తుంది.

నలుగురు ఆడపిల్లలున్న ఇంట్లో పుట్టిన ఆఖరమ్మాయిగా ఎన్నో జ్ఞాపకాలను మల్లి కలబోసుకుంటారు. అప్పటి జీవితాన్ని, అనేక కోణాల్లో విశ్లేషిస్తూ ఇప్పటి రోజులతో బేరీజు వేసి మనతో అవుననిపిస్తారు.  అలాంటిదే ఈ "మా ఇంట్లో వాడుక పాలు పోసేది చంద్రబాబు నాయుడు" కథ ! మల్లి తన బాల్యం లోని అందమైన ఉదయంతో ఈ కథను ప్రారంభించి  చివరికి నివ్వెరబోయేలా ముగిస్తారు.

మనిషికీ మనిషికీ మధ్య అడ్డుగోడలు ఎందుకు లేస్తాయో అంటూ ఇందులో కొన్ని కథలు ప్రస్తావిస్తాయి.
అవి లేకుంటే ఎంత బాగుండు?
ఒక చిన్న స్నేహ స్పర్శ, ఒక చిన్న చిరునవ్వు,  ఒక ప్రేమ పూర్వక పలకరింపు, ఇవన్నీ కోల్పోయి, లోపించి మనం రాను రాను మర మనుషుల్లా తయారైపోతున్నామని కొన్ని కథలు సున్నితంగా వాత పెడుతూ చెప్పేస్తాయి.

బేగం ఎంత సొగసు కత్తె
నేను కొల్లగొట్టిన హృదయాలు
రిక్షా రంగదాసు-చాకలి దాలమ్మ
చిటికీసర చెట్టుకు కాసిన తియ్య మావిడి పండు __ఈ కథలు అవే చెప్తాయి!

దాదపు ప్రతి కథా మన హృదయంలోకి తొంగి చూసుకుని ఒక్కొసారి భుజం తట్టుకునేలా,... మరో సారి వీపు చరుచుకునేలా చేస్తుంది. మరి కొన్ని కథలు పుస్తకాన్ని పక్కకు పెట్టి హాయిగా కుర్చీలో వెనక్కు వాలి బాల్యపు రోజుల్లోకి ప్రయాణించడానికి బండిని సిద్ధం చేస్తాయి.

మనిషిని కావిలించుకునే ఉత్తరం(దీన్ని నేను అప్పట్లో బజ్ లో కూడా షేర్ చేసుకున్నాను)
నాన్న చేతి కొత్తావకాయ ముద్ద
ఎన్ టీ ఆర్ కొడుకు పుణ్యమా అని
పొలం అమ్ముకోడమంటే
ప్రైవేట్ స్పేస్, 
అక్కా చెల్లెళ్ళ ఆస్తిపంపకాలు
పారిపోయిన తొలి యవ్వనం..

ఇవన్నీ అలా బండెక్కించేవే!

ఒక అందమైన కుటుంబాన్ని ఆవిష్కరిస్తూనే, మల్లి తనకెదురైన స్త్రీల జీవితాలని అన్నికోణాలనుంచీ విశ్లేషిస్తారు.
"ఇపుడు స్త్రీలు సాల్మన్ చేపలు కారు"
"మా అమ్మ అనూరాధ ఎప్పుడైందంటే"
"అమ్మ నేర్పిన ఆర్థిక సూత్రం.." ఇంకా మరి కొన్ని!

ఈ పుస్తకానికి కె.శ్రీనివాస్ గారు రాసిన ముందు మాట ఎంతో అద్భుతంగా అమరిపోయింది కానీ, పాఠకులకు నా సలహా...పుస్తకమంతా పూర్తయ్యాక ఆ ముందు మాట చదివితే కథల తాలూకు ఎస్సెన్స్ అప్పటికీ మనసంతా ఆవరించి ఉండటం వల్ల మరింతగా దాన్ని ఆస్వాదించగలం!

నిజానికి ప్రతి మనిషీ, బాల్యాన్ని రికార్డు చేసుకుంటూ ఉండాల్సిందే! బాల్యపు జ్ఞాపకాలు పూర్తిగా మాసిపోకముందే, వాటిని చేతనైనట్టు చిత్రించుకుని ఆ బ్లాక్ అండ్ వైట్ చిత్తరువుల్ని అప్పుడప్పుడూ తీసి చూసుకుంటూ ఉండాలి. లేకపోతే కొన్నాళ్ళకి ఏమీ మిగలవు.

చక్కని బ్లాగ్ పోస్టులు రాశామని అనుకున్న వారికి జాజిమల్లి గారి ప్రయత్నం అనుసరణీయం కావాలి!


ఇది టైమ్ పాస్ కి చదివే పుస్తకం మాత్రం కాదు! చదవడం పూర్తయ్యాక..ఒక వెచ్చని అనుభూతిని మనసు నిండా నింపి, ఒక చల్లని వణుకుని వెన్నులో పాకించి, ఒక భయాన్నీ, ఆలోచన్నీ,కన్ సర్న్ నీ రేకెత్తించేది టైమ్ పాస్ పుస్తకం ఎలా అవుతుంది?

చక్కని డిజైన్ తో మార్కెట్లోకి వచ్చిన ఈ పుస్తకాన్ని వేసింది perspectives వాళ్ళు!

వెల 80 రూపాయలు!



December 22, 2011

కొత్త పుస్తకం పచ్చి వాసన ....!





ఎంత బావుందో! ఎటు చూసినా ఊరిస్తూ కొత్త పుస్తకాలు! మనం చదివినవీ, చదవనివీ, ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నవీ, ఒకసారి పోగొట్టుకుని మళ్ళీ కొనాలని చూస్తున్నవీ,సరి కొత్త కలెక్షన్లూ, చడీ చప్పుడూ కాకుండా మార్కెట్లోకి సింగారించుకుని వచ్చేసినవీ, యదార్థ గాథల ఆధారంగా రూపొందిన కల్పితాలూ, ఒకటా రెండా...బోల్డన్ని!

నాల్రోజుల క్రితం నేనూ కాసిన్ని పుస్తకాలు కొందామని బుక్ ఫేర్ కి వెళ్ళాను. స్టాళ్ళూ సందర్శకులతో కళ కళ్లాడి పోతున్నాయి. చూడటమే కాక, చాలా మంది బోల్డన్ని పుస్తకాలు కొని పట్టుకెళుతుండటం సంతోషించదగ్గ విషయం!

అన్ని స్టాళ్ళూ తిరిగి చూస్తూ, పుస్తకాల గురించి, రచయితల గురించి మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ మంచి స్నేహితులతో కలిసి పుస్తకాలు కొనుక్కోడం చాలా బాగుంటుంది.

కొన్ని పుస్తకాలు కొన్నాక, నవోదయా స్టాల్ కెళ్తే నేను వేరే స్టాల్స్ లో కొన్ని తెలుగు పుస్తకాలు కొనేశానని తెల్సుకుని నన్ను బాగా చీవాట్లేశారు. "మన స్టాలు ఇక్కడుందని తెలీదా మీకు?" అని నిలదీశారు. నిజంగా నవోదయ "మన"దే అనిపిస్తుంది నాకు! షాపు కెళ్ళినా సరే, మన అభిరుచి ప్రకారం "ఇది కొత్తగా వచ్చింది చూశారా?" "ఇది తీసుకున్నట్టు లేదే మీరు?" "పోయిన సారి వచ్చినపుడు ఇది చూడలేదనుకుంటాను" అని చక్కగా సజెస్ట్ చేసి మరీ మంచి పుస్తకాలు చూపిస్తారు. కొనిపిస్తారు కూడా!


సరే, "అలా తిట్టకండి సార్" అని ప్రాధేయపడి వాళ్ళ దగ్గర కూడా పుస్తకాలు కొన్నాను. పిల్లలతో షాపింగ్ కి వెళ్ళ కూడదని మా అమ్మాయి మరో సారి రుజువు చేసింది. దానికిష్టమైన పుస్తకాలన్నీ సెలెక్ట్ చేసేసుకుని "డబ్బులు అమ్మ ఇస్తుంది" అని ముందుకెళ్ళిపోయింది. ఒక scholastic స్టాల్లోనే, 30 పేజీలదొకటీ, యాభై పేజీల దొకటీ, వంద పేజీల దొకటీ...ఈ మూడు పుస్తకాలకీ కలిపి పదమూడు వందలు...అదొక కడుపు మండించే సన్నివేశం! వదిలేయండి!


సందట్లో సడేమియా లాగా ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మే స్టాళ్ళు కూడా పుస్తకాల స్టాళ్ళ మధ్య కనపడి ఆశ్చర్యం కల్గించాయి. ఇంకా ఆశ్చర్యం..ఆ స్టాళ్ళ వద్ద కూడా బోల్డు మంది జనం గుమికూడి ఉండటం!

ప్రజాశక్తి,విశాలాంధ్ర,నవోదయ,కొత్తపల్లి.ఎమెస్కో.. ఇవే కాకుండా ఇంకా పబ్లిషర్లూ, స్టాళ్ల పేర్లూ చూసుకోకుండా కాళ్ళు నొప్పేట్టేదాక తిరిగి కొన్ని పుస్తకాలు కొన్నాను.

చలం రచనలు ఆకట్టుకునే అందమైన డిజైన్లో కనపడి ఊరించేయడంతో నా దగ్గర అన్నీ ఉన్నా, కథలన్నీ ఒకచోట పడి ఉంటాయి లెద్దూ అని సర్ది చెప్పుకుని మళ్ళీ కొనేశాను కథా సంకలనాలు!ఏడుతరాలు నా దగ్గరున్న దాన్ని ఎవరో పుణ్యాత్ములు పట్టుకెళ్ళి చివరి పేజీలు చింపేసి ఇచ్చారు. అలా చివరి పేజీలు లేని దాన్నే మరొకరికి ఇచ్చా చదవమని! ఎలాగైనా కొత్తది ఉండటం అవసరమని అది తీసుకున్నాను!

చలం కొత్త కలెక్షన్లో కథా సంకలనాలు,
బీనా దేవి సమగ్ర రచనలు,
వాసిరెడ్డి సీతాదేవి గారి "మట్టి మనిషి" (ఇది నా దగ్గరుంది ఎవరికో ఇచ్చాను)
పిలకా గణపతి శాస్త్రి గారి ప్రాచీన గాథా లహరి,(ఈ సారి ఇది నా ఫేవరిట్ పుస్తకమై కూచుంది)
చెళ్ళ పిళ్ళవెంకట శాస్త్రి గారి "కథలూ గాధలూ"

అంటరాని వసంతం,
కాశీభట్ల వేణు గోపాల్ పుస్తకాలు,
రంగనాయకమ్మ గారి కొత్త పుస్తకం "కళ్ళు తెరిచిన సీత"
మరి కొన్ని ఇంగ్లీష్ పుస్తకాలు....కొన్నా!



కొమ్మూరి వేణు గోపాల రావు గారి పుస్తకాలు మళ్ళీ వేశారంటే ఆయన రాసిన "ఈ దేశంలో ఒక భాగమిది" పుస్తకం కోసం వెదికాను ఆత్రంగా( పోయిన సారీ ఇలాగే వెదికా దీని కోసం)! పోయిన సారి లాగే అది నాకు దొరకలేదు. ఆయన పుస్తకాలన్నింటిలోనూ అదే నాకు నచ్చుతుంది బాగా!

వనవాసి కొత్త కాపీ (నా దగ్గరుంది ఎప్పుడో యాభైల్లో వేసింది. పట్టుకుంటే పొడి ఐపోతోంది)తీసుకున్నా !

ప్రదర్శన అయిపోయే లోపు మరి కొన్ని పుస్తకాలు కొనాలి.

పుస్తకాలు చదివే వాళ్లనీ, కొనే వాళ్ళనీ ఒక చోట చేర్చి, తమ పఠనానుభవాల్ని ఒకరితో ఒకరు పంచుకునేలా చేయడంలో ఆన్ లైన్ తెలుగు ప్రపంచం, ముఖ్యంగా తెలుగు బ్లాగులు చాలా ఉపయోగపడ్డాయనడంలో నాకెలాంటి సందేహమూ లేదు.

నీ దగ్గర ఈ పుస్తకముందా?... ఈ పుస్తకం మీకు దొరికిందా? అంటూ పలకరించుకుంటూ, దూరాన ఉన్న స్నేహితులకు పుస్తకాలు కొని పంపడం వరకూ చేరింది ఇది. (దూరాన ఉన్న స్నేహితుల కోసం నేనూ కొన్నాను పుస్తకాలు! నాతో పాటే మరి కొందరు బ్లాగ్ మిత్రులు కూడా విదేశాల్లోని మిత్రుల కోసం పుస్తకాలు కొన్నారు)

కాబట్టి, తెలుగు బ్లాగులున్నంత వరకూ, పుస్తక పఠనానికి, పఠనానుభవాల పంపకాలకు మాత్రం లోటు జరగదు.

September 23, 2011

రామలింగ రాజు అంతరంగం... కవిత్వంగా!



విజయానికి చుట్టాలెక్కువే గానీ అపజయానికి మాత్రం పాపం బంధు గణమే ఉండదుట! రామలింగ రాజు గారు ఎప్పటిలాగానే "రాజు గోరు"లా ఉండి ఉంటే ఈ సాదా సీదా పుస్తకానికి ఎంత హడావుడి జరిగి ఉండేదో?

ఆకాశమంత పందిరి,భూదేవంత అరుగు వేసి రతన్ టాటా లాంటి తెలుగేతరుడిని పిల్చి, హంగామా చేసి ఆవిష్కరించే వాళ్ళేమో! ఏ తొమ్మిదో టీవీనో దాన్ని 45 నిమిషాల ప్రోగ్రాములో ఊదరగొట్టేసేది.ఇంగ్లీషు,తెలుగు దినపత్రికలు కూడా ఈ పుస్తకాన్ని ఆకాశానికెత్తేస్తూ "గొప్ప" రివ్యూలు రాసేసి రాజుగార్ని సంతోష పెట్టేవాళ్ళు.

కానీ ఇవేమీ జరగలేదు, నెమ్మదిగా ఈ పుస్తకం ఎలాంటి హడావుడీ లేకుండా మార్కెట్లోకొచ్చింది. సత్యం రామలింగ రాజు తీరిక వేళల్లోనో,మనసులో ఆలోచనలు రేగిన వేళలోనో ఎప్పటికప్పుడు రాండమ్ గా రాసుకున్న కవితల్ని ఆయన భార్య నందిని పుస్తకంగా తెచ్చారు. ఇందులో ఏ కవితలు ఎప్పుడు రాసుకున్నారో వివరం లేదు. అందువల్ల ఈ కవితల్లో ఏవైనా ఆయన ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులను ముందుగానే సూచించాయా అనే కుతూహలంతో చదవడం సహజమే కానీ గట్టిగా ఒక నిర్థారణకు వెంఠనే రావడం కష్టం!

మనసులో కవిత్వ భావనలుండి, భాష కూడా ఎంతో కొంత ఉంటే కవిత్వం కాస్త నాలాంటి కవితా సువాసనలు అర్థం కాని వాళ్ళక్కూడా అర్థమయ్యేలా బయటికి వస్తుందనుకుంటా!

రామలింగ రాజు గారికి భాష అంతగా సహకరించకపోవడంతో కవితా భావనలు అంత refined గా కాక raw గా కనిపిస్తాయి. అయితే ఆయన స్వతహాగా కవి కాదని అందరికీ తెలుసు కనుక ఆ భావాలు raw గా ఉండటమే బాగుంది. వాటిని refined గా తీర్చి దిద్దాలని ప్రయత్నించి ఉంటే ఆ ప్రయత్నం తేటతెల్లంగా కనపడిపోయేది!

కొన్ని కవితలు మరీ సాదా సీదాగా ఉండి, మరీ ఎప్పుడో ఎనభైల్లో సామాజిక స్పృహ పేరుతోనో,జీవితాన్ని నిర్వచించే అత్యుత్సాహంతో ఔత్సాహిక కవి కుమారులు రాసిన కవితలు గుర్తొచ్చేలా ఉన్నాయి.

టికెట్ లేని ప్రయాణీకుడు_____కవితలో జీవితం రైలు ప్రయాణంలా ఎంత రద్దీగా ఉంటుందో చెప్తూ

"ఏ క్షణాన్నైనా టికెట్ కలెక్టర్ రావొచ్చును,
ఆ వచ్చేదే నీ ఆఖరి స్టేషన్ కావొచ్చును"
అంటాడు రాజు! ఈ లైన్ల వెనుక ఏముందనేది వెంటనే ఊహించాలనిపిస్తుంది. ఇలాంటివే మరికొన్ని చోట్ల కూడా కనిపిస్తాయి.

"ఆటలో దెబ్బలను ఎలా తట్టుకోను?
అన్యాయపు ఆటగాళ్లను ఎలా వదుల్చుకోను (ఎన్ని ఆటలు నేను ఆడను?)

నిజం రూపాన్ని కొద్ది కొద్దిగా చెక్కాలి
నిర్థారించిన నిజాలు చిరకాలం నిలవాలి(సాక్ష్యాలే)

"వంచనలన్నీ మించిన వచన
నాకు నువ్వే చేసుకునే మహా వంచన
ఆత్మవంచన

ఇలాంటి కొన్ని లైన్లు ఆయన జీవితానికి అద్దంపడతాయేమో అన్నట్లు అక్కడా తోస్తాయి. (అయినా కాకపోయినా)

ఇందాక చెప్పినట్టు భాష మీద పట్టు లేకపోయినా కొన్ని భావాలు బాగున్నాయి,చాలా కామన్ గా అందరిలో మెదిలే ఆలోచన్లే అవి! అలాగే ఒక కవితా వస్తువంటూ ఎంచుకోకుండా, అప్పుడప్పుడూ మదిలో అప్పటికప్పుడు తోచిన ఆలోచన్లను రాసి పెట్టుకున్నారంతే! కొన్ని కవితలు ఎందుకు రాశారో నాకర్థం కాలేదు.

"ఓ కోడి పుంజా!"
"అలవాట్లు"
"అభాగిని" _____ఇలాంటివి!

దాదాపుగా ప్రతి కవితా రేడియో కవితల్లాగా మొదటి పాదం మళ్ళీ మళ్ళీ మధ్యలో రిపీట్ అవడం ఎందుకో అంతుపట్టలేదు నాకు!

ఇవన్నీ రాయడానికి ఆయన కు సమయం దొరకడమే గొప్ప విషయం!
మొన్నొకాయన నిర్వచించారు "అడ్డంగా రాసే పేరా గ్రాఫు ని నిలువుగా రాస్తే అదే కవిత్వం అవుతుంద"ట!

ఆ కోవ కవిత్వం ఈ మధ్య ఎక్కడ చూసినా గుర్రపుడెక్కలా విస్తరించి చుట్టేస్తోంది. పువ్వులూ,పిట్టలూ,ప్రేమా,మనసూ,జీవితం,నువ్వూ నేనూ,అంతరంగం,వెన్నెలా,వర్షమూ _______ఇవే వస్తువులు తిరగా మరగా వేసి అవే కవితలు!

వాటితో పోల్చుకుని చూస్తే రాజు కవితలు చాలా ఉత్తమస్థాయిలోనే ఉన్నాయి.

విశ్వం,సృష్టి,వైజ్ఞానిక ప్రగతి,సమాజ వైఖరిమీద నమ్మకమూ,విస్మయమూ,మనుషుల పట్ల సుహృద్భావం,ఇవన్నీ ఈ కవితల్లో చోటు చేసుకున్నాయి!

రామ్ గోపాల్ వర్మ "నా ఇష్టం" పుస్తకానికి ప్రచురణ సంస్థ ఎంత హడావుడి చేసిందో అందరికీ గుర్తుండే ఉంటుంది.

రాజు గారు కుప్ప కూలకుండా ఉండుంటే ఈ ఏడాది పుస్తకాల సంతలో కూడా ప్రత్యేకంగా ఒక స్టాలు పెట్టి మరీ అమ్మేవాళ్ళే ఈ పుస్తకాన్ని!

కవర్ పేజీ మీద రాజుగారే! ఎందుకో మనసు చివుక్కుమంది ఆ కవర్ పేజీ చూస్తే! రాజు మీద నాకున్న అభిమానమే తప్ప మరో దీనికి కారణమేదీ కనపడలేదు. (కారణం లేని హీరో వర్షిప్ అని విమర్శకులెవరన్నా వచ్చేస్తారేమో... రాకండి! నా అభిమానం నా ఇష్టం!)

ఎమెస్కో వాళ్ళు వేసిన ఈ పుస్తకం వెల 90 రూపాయలు!


June 6, 2011

శబ్బాష్ రా భరణీ....!


కొంతమంది మనుషుల్ని చూస్తుంటే పరిచయం ఉన్నా లేకపోయినా ఎప్పుడో మాట్లాడినట్టే అనిపిస్తుంది. మాట్లాడితే మరింత అనుబంధమేదో ఉందనిపిస్తుంది.తనికెళ్ళ భరణి ఈ కోవకే చెందుతారు .సరళమైన భాష, అందులో తళ తళ మెరిసే చమక్కులు, మాటల్లో ఆప్యాయత,ఆహార్యంలో నిరాడంబరత...ఇవన్నీ భరణిని మనకి దగ్గర చేస్తాయి. అంతెందుకు...."పరికిణీ" చదివితే చాలు అసలు మన ప్రమేయంలేకుండానే భరణి మనసులో (మెదడులో కాదు) అలా ఒక పేము కుర్చీ వేసుక్కూచుంటాడు దర్జాగా!ఒక్కో కవితా ఒక్కో ఆణిముత్యం!  

అలాంటి భరణి మహాదేవుడికి మహాభక్తుడు. పరమ శివుడికి పరమ ప్రీతిపాత్రుడు. ఆటగదరా శివా   అంటూ చనువుగా ఒరే అని పిలిచి మరీ తత్వాలు రాశాడు.




శివాలయాలన్నీ తిరిగి ప్రతి మూల విరాట్టుకీ కమ్మగా పాడి వినిపించాడు. దానితో శివుడికీ అత్యాశ కల్గినట్టుంది. ఇంకా రాయాల్సిందేనని ముద్దుగా మారాం చేసినట్టున్నాడు.

శివుడే రాయమన్నాక భరణి ఆగుతాడా! అయితే ఈ సారి తెలంగాణా యాసలో రాసి చూపిస్తా కాస్కోమన్నాడు!

అయితే ఓకే, రాస్కోమన్నాడు పెద్దాయన!అంతే శివాజ్ఞ  అయిందన్నమాట.భరణి దాన్ని ఇలా చెప్తాడు

శంకర అంటేనే నాకు 
శక్కర లెక్కన ఉంటదయ్య
శివునాగ్నైతది.....సీమనైత
శబ్బాష్ రా శంకరా

అలా పుట్టినవే ఈ "శబ్బాష్ రా శంకరా" తత్వాలు!

ఆడియో సీడీ సైజులో ఎక్కడికెళ్ళినా బాగులోనో జేబులోనో పడేసుకుని తీసుకెళ్ళేలా ప్రింటు కొట్టిన భరణి తెలివికి నేను ఫిదా!

తెలంగాణా యాసలో రాస్తూనే "వాడు ప్రాసకీ యాసకీ లొంగుతాడా" అంటాడు మళ్ళీ!

ఇవి మనసులో ఉద్భవించిన భక్తి,ప్రేమ,చనువు,ల్లోంచి పుట్టినవే తప్ప భరణి కలంలోంచి అప్పటికప్పుడు "రాసినవి కాదు"! అందుకే నాకు వీటిలో మహాదేవుడితో మరింత సాన్నిహిత్యం,ఇంకా ఇంకా భక్తితో దగ్గర కావాలన్న తపన కనిపించాయి. ప్రతి తత్వంలోనూ కొంత ఆర్దృత కనిపిస్తుంది.అందుకే ఇవి రాస్తున్నపుడు కన్నీళ్ళు వచ్చేసేవిట భరణికి!

అందుకే అంటాడు

కన్నీళ్లల్లనె బుట్టిన పెరిగినా
కన్నీళ్లల్లనే కాలినా!
ఒక్క  బొట్టయిన  స్ఫటిక లింగమైతే
శబ్బాష్ రా శంకరా! 

నాకు నచ్చిన కొన్ని తత్వాలు కొన్ని

ఖానాకైతే అన్నపూర్ణమ్మ
పీనేకో గంగమ్మ
సోనా యాడైతేంది సోనానె
శబ్భాష్ రా శంకరా

ఏనుగునెల్క మోస్తది
నెమలేమో పాముతో దోస్తీ జేస్తది
శైవ కుటుంబమంటే అది
శబ్బాష్ రా శంకరా!

ఎన్నో గుళ్లలో దేవులాడి
యాష్టొచ్చి  గూసుంటే
నా గుండేలొ ఘల్లుమన్నవులె
శబ్బాష్ రా శంకరా!

ఇంకా చాలా ఉన్నాయి గానీ అన్నీ చెప్పేస్తే భరణి గుస్స జేస్తడేమో!

కేవలం భక్తి భావనే కాక లోకంలో కళ్ళముందు కనపడే బాధల్ని,లోకం పోకడలని కూడా శివుడితో చెప్పుకుని "ఇదేంటయ్యా?"అని ఆవేదన చెందే ధోరణి, బాధపడే ధోరణి కొన్ని తత్వాల్లో కనిపిస్తుంది.

లింగం మింగెడి దొంగనాకొడుకులు
గుడినే మింగెడు నీ కొడుకులు 
మూడో కన్నును తెర్వవేమిటికి రా
శబ్బాష్ రా శంకరా!

కుత్కెలు గోసుకుంటరు 
కులాల మతాల పేరుజెప్పి
పెద్ద కులపోనికి పెద్ద సావొస్తదా
శబ్బాష్ రా శంకరా!


జాతకమంటడు..చెక్రమంటడు
గాచారమంత గలతండడూ 
పైసలతోనే ఫైసలంటడూ
శబ్బాష్ రా శంకరా 


మరి కాసేపు వైరాగ్య ధోరణి

మాంకాళమ్మకు పులిని బలినెయ్యి
నీకంత దమ్ముంటె
అని మేకలన్నయయ్యా 
శబ్బాష్ రా శంకరా

ఇల్లాలంటడు పిల్లలంటడు
ఎన్నో ఇండ్లూ బండ్లంటడు
నువ్వు బిల్వంగనే కాట్ల పంటడు
శబ్బాష్ రా శంకరా!

నాకు అన్నింటికంటే నచ్చిన ఆణిముత్యం

శివుడిని చూడండి భరణి ఎలా వర్ణిస్తాడో..

బైటికి "బండ" బూతువి
అర్థంకాని లోలోతువి
కరిగే రాతివి పరంజ్యోతివి
శబ్బాష్ రా శంకరా!

పేజీకి రెండు చొప్పున తత్వాలు తాపడం చేసి 64 పేజీల్లో అచ్చు తప్పుల్లేకుండా అందించిన ఈ పుస్తకం వెల యాభై రూపాయలు.అన్ని పుస్తకాల షాపుల్లోనూ లభ్యం!

 ఈ తత్వాలన్నీ స్వయంగా భరణి గానం చేసిన సీడీ వెల అరవై రూపాయలు.

జూన్ 5న శిల్పకళావేదికలో బాల గాంధర్వం పేరిట బాలూకి జరిగిన సన్మాన సభలో ఈ పుస్తకాన్ని సీడీనీ ఆవిష్కరించారు! పుస్తకమేమో ప్రకాష్ రాజ్ కీ ఆడియో సీడీ ని బాల సుబ్రహ్మణ్యంగారికీ అంకితమిచ్చారు భరణి!

ఈ తత్వాలను చూసి సుద్దాల అశోక్ తేజ ఇలా అన్నారు

"జబర్దస్త్ గుంది ఉస్తాద్
నువు కయిగట్న పజ్యాలు, శంకరుని మెడలున్న పాముకి సమజైతే
కుత్తుకలున్న విసం అమృతమైతది


గంతెందుకు  శంకరుని  మూడోకన్ను నిప్పులకు బదులు కన్నీళ్లు పెట్టుకుంటదిగదే......


బస్..ఖుషీతో ఫిదా అయిపోతున్నా! 

నల్లని కవర్ పేజీమీద ఎర్రని "శబ్బాష్ రా శంకరా! "అన్న అక్షరాలు కొట్టొచ్చినట్టు కనపడకపోవడం ఒక్కటే చిన్న అసంతృప్తి!

January 31, 2011

మన తర్వాత...ఆస్తులు సరే,...మరి వీటి సంగతేంటి?




ఎంతో కొంత ఆస్తులూ పాస్తులూ సంపాదించిన వాళ్ళందరికీ వాటిని పంచుకోడానికి పిల్లలో చుట్టాలో ఉంటారు. నగలూ,డబ్బూ,స్థలాలూ పొలాలూ వీటన్నింటినీ క్లెయిం చేసుకునే వాళ్ళుంటారు. ఇంకా ఇంట్లో వస్తువులు తీసుకునే వాళ్ళుంటారు. మరి మనం పోగేసిన పుస్తకాలెవరు తీసుకుంటారు? ఎవరికి కావాలవి?

మా ఇంట్లో చిన్నప్పుడు ఎప్పటెప్పటివీ మాస పత్రికలూ(విజయ,యువ,జ్యోతి, వనిత, మహిళ మొదలైనవి)పాత నవలలూ,ఎప్పటివో డెబ్భైల్లోని వారపత్రికలూ, భారతులూ కట్టలు కట్టలు ఉండేవి.అప్పట్లో వాటి విలువ తెలీదు. తెలిసే సరికి అవి పర హస్త గతమైపోయాయి. మా అమ్మకు మరీ మొహమాటమెక్కువ!

నా సంగతే కాదు, మంచి పుస్తకాలు సేకరించి మంచి గ్రంథాలయాలు సొంతంగా ఏర్పాటు చేసుకున్నవాళ్ళంతా ఈ సంగతి ఆలోచిస్తారంటారా? "నా తర్వాత నా లైబ్రరీ సంగతేంటి, ఎవరు చూస్తారు దాన్ని? ఈ పుస్తకాలన్నీ ఎవరు భద్ర పరుస్తారు?ఏం చేస్తారు వీటిని" అని మీలో ఉన్న పుస్తక ప్రియులంతా ఆలోచిస్తుంటారా?

అప్పుడప్పుడు ఈ ఆలోచన వస్తుంటుంది నాకు. మా పాప తెలుగు చదవగలిగినా ,నా పుస్తకాలన్నింటినీ తనూ అంతే శ్రద్ధతో ప్రేమతో కాపాడుతుందని నాకేం నమ్మకం లేదు. నాలాంటి సందేహం మనలో చాలామందికి ఉండొచ్చు!



ఆ మధ్య విజయవాడ వెళ్ళినపుడు వంశీ బుక్ స్టోర్స్ (వంశీ ప్రాచీనాంధ్ర గ్రంథమాల ) జగన్మోహన రావు(నాగేశ్వర రావు)గారితో మాట్లాడుతుంటే ఈ విషయమే ప్రస్తావించారు ఆయన. "కొంతమంది శోత్రియ బ్రాహ్మణ కుటుంబాల్లో ఎంతో అద్భుతమైన ప్రాచీన సంప్రదాయ సాహిత్యం ఉంటుందమ్మా! కానీ వాటిని అన్నాళ్ళూ కాపాడిన వ్యక్తులు పోయిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళకి వాటి విలువ తెలీక ఎవరడిగితే వాళ్ళకిస్తారు. లేదా పాత పేపర్ల వాళ్ళకి కిలోల్లెక్కన అమ్మేస్తారు. లేదా "నాన్న గుర్తు" అనో "తాతయ్య జ్ఞాపకం" అనో దాన్ని చెదలు పట్టేదాకా దాచి, పొడి పొడిగా రాలిపోయాక చింతించి బయట పారేస్తారు తప్ప వాటిని అందరికీ అందుబాటులోకి తెద్దామనే ఆలోచన ఉండదు. ఆ ఆలోచన రావడానికి వాటి విలువ వాళ్ళకు తెలీదు" అన్నారు.


అలాంటి విలువైన పుస్తకాలెన్నో "స్క్రాప్" కింద రాజమండ్రి పేపర్ ఫాక్టరీకి తరలి పోతున్నాయని బాధపడ్డారు ఆయన. అందుకే పాత పేపర్లు కొనే హోల్ సేల్ వ్యాపారుల వద్దకు ఆయన తన కుర్రాళ్ళని పంపిస్తూ ఉంటారట...వాటిలో కల్సి విలువైన పుస్తకాలేమైనా తుక్కు కింద కలిసిపోతున్నాయేమో అని! ఈయన్ని చూసినపుడల్లా ఆశ్చర్యానికి గురైపోతుంటాను నేను,.

ఒక పాత పుస్తకాల వ్యాపారి దృక్పథం కంటే ఒక కళా ఖండాల సేకరణ కర్త ధోరణి కనిపిస్తుంది. ఎంతో మంది రచయితలతో పరిచయాలు. ఎన్నెన్నో పుస్తకాల గురించి అపారమైన అవగాహన, అభిరుచి! కేవలం పుస్తకాలు అమ్మడం, వాటి వివరాలు దగ్గర పెట్టుకోవడమే కాదు,శ్రద్ధగా చదువుతారు కూడానూ! మొన్నొకసారి నేనొక పుస్తకం అడిగితే "ఉందమ్మా నా దగ్గర, నేను చదువుతున్నాను,. వచ్చేవారం రండి" అని చెప్పారు.




అక్కడే ఉన్న మరి కొన్ని షాపుల వాళ్ళు కేవలం తమ దగ్గర ఉన్న పుస్తకాలు అమ్మడం తప్ప, ఆ పుస్తకం తాలూకు గత చరిత్ర,రచయిత తాలూకు వర్తమానం ఇవేవీ తెలుసుకోవాలనుకోరు. నిజానికి ఆ అవసరం వాళ్ళకి లేదు కూడానూ!



అలాగే వచ్చిన పుస్తకాలు వచ్చినట్లు కట్టలు కట్టలుగా పడేసి ఉంచడమే తప్ప,వాటిని బైండ్ చేసి, చక్కని ఫ్లోరసెంట్ ఆకుపచ్చ కాగితం అంటించి,దాని మీద పుస్తకం పేరు,రచయిత వివరాలు రాసి ఉంచడం, సబ్జెక్టుల వారీగా సర్ది ఉంచడం ఇవన్నీ జగన్మోహనరావుగారు చేసినట్లు ఇంకే షాపు వాళ్ళూ చేయడం గమనించలేదు. ఏ పుస్తకం ఎన్ని ఎడిషన్లు పడిందీ,ఏ ఎడిషన్లలో ఎక్కువ తప్పులున్నాయి,ఇలాంటి వివరాలు కూడా అలవోగ్గా చెప్పేస్తుంటారాయన!

చాలా మంది రచయితలు రాసేయడమే తప్ప వాటిని భద్రపరుచుకోరు. (కొ.కు,దాసరి సుబ్రహ్మణ్యం,ఆరుద్ర ఇంకా అనేక మంది రచయితలు ఈ కోవలోకి వస్తారు)రచయితల వద్ద కూడా లేని వారి వారి పుస్తకాల జాడ జగన్మోహనరావు గారి దగ్గర ఉంటుంది. రచయితలే ఫోన్ చేసి "నా ఫలానా పుస్తకం మీ దగ్గరుందా" అని అడగడం నాకు తెలుసు.



తన దగ్గరకు పుస్తకాల కోసం వచ్చేవారిని చూసి వారి అనుభవాలేమిటో గ్రంథస్థం చేయాలనీ కోరికతో "గ్రంథ సేకరణ" చేసేవారి అనుభవాలను రికార్డ్ చేయడానికి ఒక పెద్ద పుస్తకం తయారు చేశారు. అందులో ఆయన దగ్గరికొచ్చేవారు తాము ఫలానా పుస్తకం కోసం ఎంత శ్రమపడిందీ,గ్రంథ సేకరణలో వారి అనుభవాలేమిటీ ఇలాంటి ఆసక్తికర విషయాలు రాస్తుంటారు.

ఇటీవల జగన్మోహనరావుగారికి మరొక ఆలోచన వచ్చింది.పుస్తక ప్రేమికులు వందల సంఖ్యలో పోగేసిన పుస్తకాల భవిష్యత్తు ఏమిటి? వీరి తర్వాత ఆ పుస్తకాలనెలా కాపాడాలి? అందుకే తన వద్దకొచ్చే వారి నుంచి మరికొన్ని వివరాలు సేకరించడం మొదలుపెట్టారు.ఇప్పటివరకూ వారి వద్ద ఎన్ని పుస్తకాలున్నాయి?ఏ యే పుస్తకాలు ఇంకా సేకరించాల్సి ఉంది? ఇంకా మొత్తం ఎన్ని పుస్తకాలు కొనే ఆలోచన ఉంది? మీ తర్వాత ఆ పుస్తకాలను ఏదైనా గ్రంథాలయానికి ఇచ్చే ఆలోచన ఉందా?

అరుదైన పుస్తక సంపద కొందరి వద్దనే కేంద్రీకృతమైపోగూడదనీ, అది పుస్తక ప్రేమికులందరికీ అందుబాటులో ఉంచాలని ఆయన ఆకాంక్ష! అందుకే కథా నిలయం లాగా, ఒక పెద్ద గ్రంథాలయాన్ని స్థాపించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు!

ఇంతటి శ్రద్ధ ఉండబట్టే కాబోలు గ్రంథాలయ ఉద్యమ సారథి వెలగా వెంకటప్పయ్య గారి అవార్డ్ ఆయనకు ఇటీవల ఇచ్చారు.

ఇలాంటి గ్రంథాలయం స్థాపించే ఆలోచన ఎవరికైనా ఉంటే నా వీలునామాలో ఆస్థీ పాస్తీ,కొంపా గోడూ,పొలమూ పుట్రా,నగలూ గిగలూ ఎవరికి రాసినా పుస్తకాలు మాత్రం వాళ్ళకే రాస్తా! పుస్తకాలు అందరికీ అందుబాటులో ఉండాలి! వాటికి మరణం ఉండకూడదు. మరణించే పరిస్థితిలో ఉంటే,తిరిగి ముద్రించే అవకాశం లేకపోయినా వాటిని డిజిటలైజ్ చేసి అందరికీ అందించాలి.

మహా రచయితలు,కవుల పిల్లలకు ఎంతో కొంత సాహితీ సువాసనలు అబ్బి ఉంటాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ తండ్రుల గ్రంథాలయాలను కొంత వరకూ కాపాడతారనుకుందాం! మరి వాళ్ళ పిల్లలు?
ఆ పిల్లల పిల్లలు?
ఆ తర్వాత తరం?
చెప్పలేం? ఏం చేస్తారో ఆ పుస్తకాలని!

అందుకే ఇంటి గ్రంథాలయాల వారసత్వాన్ని కాపాడి,అరుదైన పుస్తకాలను భద్రపరిచి ముందు తరాలకు అందుబాటులో ఉంచాలంటే జగన్మోహనరావు గారి మెదడులో మొలిచిన ఆలోచనకు ప్రాణం పోయాలి.అటువంటి లైబ్రరీ ఒకటి ఉండాలి.

ఇంతకీ మీ మీ లైబ్రరీల గురించి మీరేం ఆలోచిస్తున్నారు?



January 28, 2011

వచ్చేశాయి...అద్భుత జానపద నవలలు !




పుస్తకావిష్కరణ సభలంటే నాకు భయం! ఏం చేస్తాం పూర్వానుభవాలు ఆ విధంగా ఉన్నాయి మరి! కానీ, జానపద నవలా సమ్రాట్ దాసరి సుబ్రహ్మణ్యం గారి పుస్తకాలు మూడు ఒకేసారి ఆవిష్కరిస్తున్నామని ఆహ్వానం రాగానే ఎలాగైనా వీలు చేసుకుని వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. నిన్న సాయంత్రం అశోక్ నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో జరిగింది ఈ ఆవిష్కరణ సభ! చందమామ పత్రిక మీద ప్రేమాభిమానాలతోనూ,జానపద సాహిత్యం మీద ఇష్టంతోనూ వచ్చినవారే సభికులంతా!పైగా ఈ సభలో ఊకదంపుడు ఉపన్యాసాలుండవని నిర్వాహకులు ముందే హామీ ఇవ్వడం తో వెళ్లడానికి సంకోచం లేకపోయింది.:-))


చందమామ, బొమ్మరిల్లు పత్రికల్లో ఎన్నో జానపద కథల్ని సీరియల్స్ ని అజ్ఞాతంగా రాసి మరణానంతరం అభిమానుల చొరవ వల్ల లోకానికి వెల్లడైన మహానుభావుడు శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం!

 ఒక కథో కవితో వ్యాసమో పత్రికల్లో పడితే మామూలు మనుషుల మైన మనం ఎంతోమందికి ఆ విషయాన్ని చెప్పుకుంటాం! లింకులు పంపుకుంటాం! ఆ విజయోత్సాహంతో కనీసం పది రోజుల పాటు తొమ్మిదో నంబర్ మేఘమెక్కి కూచుంటాం.(cloud 9  అని చెప్పాలనీ..) కానీ అసంఖ్యాక కథలూ, అద్భుతమైన సీరియల్సు, పుంఖానుపుంఖాలుగా సాంఘిక కథలూ రాసి కూడా జీవితమంతా తనెవరో ప్రపంచానికి తెలియాలన్న కోరిక లేకుండా జీవించిన మనిషి ఒకరుంటారని దాసరి గారి గురించి తెలుసుకునే దాకా నేను ఊహించలేదు. ఆయనకు అలా ఉండగలగడం ఎలా సాధ్యమైందో కూడా అంతు పట్టదు!


అయితే...చందమామ అంటే పడి చచ్చే అభిమానులు (అభిమానులూ..ఏమీ అనుకోకండి..)ఊరుకుంటారా?ఆయన చరమాంకంలో ఆయన ఎక్కడుంటారో తెలుసుకున్నారు. కలుసుకున్నారు కూడా! ఆయన్ని నలుగురి మధ్యకూ తేవడానికి ఒప్పించేవారేమో కానీ ఈ లోపే ఆలస్యమై ఆయన దివికేగారు.

ఆ తర్వాత ఆయన జానపద నవలల్ని,ఇతర రచనల్ని  సేకరించడం,వాటిని తిరిగి అచ్చు వేయడం అభిమానులు చేసిన పని. ఇందులో పాలు పంచుకున్న వారి గురించి రాయాలంటే ఒక్కొక్కరికీ ఒక్కో టపా అవసరమవుతుంది. శ్రీ దాసరి వెంకట రమణ,శ్రీ వేణు,శ్రీ v3 రమణ, శ్రీ దాసరి రామచంద్ర రావు, శ్రీ వివిన మూర్తి, వసుంధర దంపతులు! ఇంకా మరెందరో!


అలా ...ఈ పుస్తకాలు సిద్ధం అయ్యాయి! వాటిని బాల సాహిత్య పరిషత్ నిన్న ఆవిష్కరించింది. వందల కొద్దీ కథలు చందమామకు రాసిన వసుంధర దంపతులు, బొమ్మరిల్లు సంపాదకుడు విజయబాపినీడు,వాసిరెడ్డి నారాయణ రావు ఆవిష్కర్తలు!


చెన్నై  నుంచి వచ్చిన ఆత్మీయ అతిథి(చందమామ అసోసియేట్ ఎడిటర్)  శ్రీ రాజశేఖర రాజు గారు!

1947 చందమామ తొలి సంచికలో కథ రాసిన శ్రీ అవసరాల రామకృష్ణా రావు గారు ఈ సభకు రావడం నాకు చాలా సంతోషన్నిచ్చింది. మేథ మే ట్రిక్స్ నిర్వాహకులుగా,గొప్ప లెక్కల మాష్టారుగా  నాకు ఆయనంటే ఎంతో గౌరవం. నిన్న పరిచయం చేస్తే నమస్కారం పెట్టి ఊరుకున్నాను.

 "మీరంటే నాకు అభిమానమండీ"అనో  "మీరు భలే రాస్తారండీ" అనో అంటే ఫూలిష్ గా ఉంటుందనిపించి...! ఆయన లెక్కల నవల  గణిత విశారద.గురించి నేను నా బ్లాగులో రాశాను కూడా!

ఇంకా ఈ సభకు ధనికొండ హనుమంతరావు గారి కుమారుడు శ్రీ ధనికొండ శ్రీధర్,చిత్రకారుడు శ్రీ చంద్ర, శ్రీ రామవరపు గణేశ్వర రావు,మంచిపుస్తకం సురేష్,గురు తుల్యులు శ్రీ వేదాంత సూరి ఇంకా అనేకమంది వచ్చారు.(వారిలో చాలామంది నాకు తెలీదు)


బ్లాగుల నుంచి భండారు శ్రీనివాసరావు,సీ బీ రావు,వేణు,జ్వాలా నరసింహారావు గార్లు వచ్చారు.

ఈ మంచి పుస్తకాలని బయటికి తీసుకొచ్చే బాధ్యత భుజాల మీద వేసుకుని, అనుక్షణం శ్రమించి,అందంగా ముద్రించి, కార్యక్రమంలో మాత్రం కనీసం వేదిక సమీపానికి కూడా  రాకుండా పుస్తకాలు సర్దుకుంటూ కూచున్న రచన శాయి గారిని చూస్తే ఏమనాలో తెలీలేదు. ఈయన కూడా దాసరి గారు లాంటి మనిషే అనిపించింది!
                                                                 చిత్ర కారుడు చంద్ర


ఎప్పటికీ దొరకవని అనుకున్న పుస్తకాలివి. వీటిని సాధించి అందరికీ అందుబాటులోకి తెచ్చింది వాహినీ బుక్ ట్రస్టు. మూడు పుస్తకాలూ కలిపి (అగ్నిమాల,మృత్యులోయ,దాసరి సుబ్రహ్మణ్యం కథలు)360 రూపాయలకే అందిస్తోంది.

మీ కోసమూ, పిల్లల కోసమూ కొని దాచుకోవలసిన పుస్తకాలు!


దాసరి సుబ్రహ్మణ్యంగారి ఈ మూడు పుస్తకాలూ వాహిని బుక్ ట్రస్ట్ వద్ద లభ్యం! ప్రముఖ పుస్తకాల షాపుల్లో కూడా!

మీలో ఎవరివద్దనైనా అలనాటి జానపద సాహిత్యం పాకెట్ పుస్తకాల రూపంలో ఉంటే వాటిని తిరిగి ముద్రించేందుకు బాల సాహిత్య పరిషత్ కృషి చేస్తుంది.!

పంచుకునే వారుంటే ముందుకు రండి


January 5, 2011

ఒక అద్భుత నవల ఎమిల్ జోలా "భూమి"



 ఈ పుస్తకం కోసం దాదాపు పన్నెండేళ్ళు వెదికాను నేను.కొన్ని పుస్తకాల కోసం అలా వెదకాల్సి వస్తుంది మరి! అప్పుడెప్పుడో చదువుకునే రోజుల్లో ఈ పుస్తకాన్ని మా వూరి లైబ్రరీలో ఒక రోజు సగం చదివి మిగతాది రేపు చదువుదామని ఇంటికెళ్ళిపోయాను . మర్నాడు వచ్చి చూస్తే ఆ పుస్తకం కనపడలేదు. వేల పుస్తకాలుండే  మా లైబ్రరీని ఆసాంతం వెదికాను. ఎవరో నొక్కేసినట్లున్నారు. దొరకనే లేదు. ఆ తర్వాత ఎంత వెదికినా, ఎక్కడ వెదికినా దొరకలేదు.

 అప్పట్లో నేను చదివిన కాపీకి లైబ్రరీ సంప్రదాయం ప్రకారం ముందు పేజీ లేకపోవడంతో  పబ్లిషర్స్ ఎవరో కూడా తెలీలా! రచయిత, అనువాదకుడి పేరు ఆధారంగా వెదికాను.ఎన్నో పాత పుస్తకాల షాపులు తిరిగాను.లెనిన్ సెంటరంతా జల్లెడ పట్టాను. ఊహూ! ఆ పుస్తకాన్ని పబ్లిషర్స్ మళ్ళీ ముద్రిస్తారనే నమ్మకం లేదు. అది చదవకుండానే జీవితం ముగిసిపోతుందేమో అని దిగులు వేసింది. ఆ పుస్తకం సగమే చదివానన్న ఒక  ఖాళీతనం, శూన్యత్వం  అలా మనసులో ఒక మూల ఉండిపోయింది. చివరికి ఒక శుభ ముహూర్తాన,విజయవాడ నుంచి ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి "దొ..రి..కిం..ది , భూ.....మీ" అని చెప్పడంతో కథల్లో రాసినట్లు నా చెవులను నేనే నమ్మలేకపోయాను! చెక్కు చెదరని స్థితిలో చక్కగా నా చేతికొచ్చిన ఆ పుస్తకమే...  

"భూమి"..! 

ఎమిల్ జోలా రాసిన ఫ్రెంచ్ నవల. 

ఎమిల్ జోలా గురించి మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు! తెలీకపోతే గూగులించండి, టైమున్నపుడు. ఈ నవలకు సంబంధించి మాత్రం జోలా గురించి చెప్తాను. గ్రామీణ నేపథ్యంలో భూమి కోసం మనుషుల మధ్య, సొంత కుటుంబ సభ్యుల మధ్య జరిగే సంఘర్షణ ని జోలా ఇందులో చిత్రించినట్లు  రైతు జీవన చిత్రణ ఇంకే ఇతర నవల్లోనూ కనపడదు. ఈ నవల రాయడానికి ఆయన గ్రామీణ నేపథ్యం ఉండాలని, అక్కడి మనుషుల్ని,పరిస్థితుల్నీ చదవాలని ఒక గ్రామంలో ఇల్లు కొనుక్కుని కాపరం పెట్టాడు. కొన్నాళ్ళయ్యాక అక్కడ మునిసిపల్ కౌన్సిలర్ గా కూడా పని చేశాడు. ఫ్రెంచ్ వ్యవసాయం మీద, రైతాంగ తిరుగుబాట్ల మీద పరిశోధన చేశాడు.కొడుకులు, మనవలు ఇలా వంశపారంపర్యంగా భూమిని పంచుకుంటూ పోతే అది ఎలా చీలికలైపోతుందీ,,దానివల్ల మానవ సంబంధాలెలా ప్రభావితమవుతాయీ ఇవన్నీ ఈ నవల్లో ఎంతో అద్భుతంగా ఆవిష్కృతమవడానికి ఆయన అధ్యయనమే కారణం! .పూసలలో దారంలా కథను అనుసరిస్తూనే అనేక సమస్యలు సాగుతాయి నవలపొడుగూతానూ! !


భూమి నవల్లో ఒక పరిపూర్ణమైన కథ కనిపిస్తుంది. ఒక పెద్ద కథ!

ఎంతో కొంత భూమి చేతిలో ఉన్న సంప్రదాయ వృద్ధ వ్యవసాయదారుడు పువాన్. భార్య రోజ్! వాళ్ళకి ముగ్గురు పిల్లలు ....జీసస్,బ్యుతో కొడుకులు కాగా, ఫానీ కూతురు! వృద్ధాప్యం మీద పడ్డ కారణంగా ఆయన తన భూమిని ముగ్గురు పిల్లలకూ పంచడంతో కథ ప్రారంభమవుతుంది. ముగ్గురిలో కొంత రౌడీ వేషాలున్న బ్యుతోకి ఈ పంపకాల వాటాలు నచ్చక అసలు భూమే తీసుకోనంటాడు. పెళ్ళీ పెటాకులూ లేకుండా ,తాగి జులాయిగా తిరుగుతుండే జీసస్ మాత్రం "దీన్ని అమ్మితే ఎన్నాళ్ళు తాగొచ్చా"అని ఆలోచిస్తూ ఇచ్చింది తీసుకుంటాడు. పువాన్ తమ్ముడు మోషేకి ఇద్దరు ఆడపిల్లలు. లిజా,ఫ్రాంస్వాజ్ లు! మోషే మరణించడంతో ఇద్దరూ కష్టపడి వాళ్ళకున్న కొద్ది భూమినీ సాగుచేసుకుంటుంటారు. ఒకరంటే ఒకరికి వల్లమాలిన ప్రేమ.బ్యుతో లిజా ని గర్భవతిని చేసి వదిలేస్తాడు(యురోపియన్ సమాజంలో చెల్లెలు వరసైన స్త్రీతో సంబంధం పెట్టుకోవడం తప్పుకాదు)  

మరొక భూస్వామి కమతంలో పని చేస్తున్న జాన్ ఫ్రాంస్వాజ్ మీద ప్రేమ పెంచుకుంటాడు. కానీ గర్భవతి అయినా లిజాను పెళ్ళాడితే తను కూడా స్థిరపడవచ్చన్న  చిన్నపాటి స్వార్థంతో లిజాను పెళ్ళాడ్డానికి ఒప్పుకుంటాడు ! అంతలో బ్యుతో వచ్చి లిజాను వివాహమడతానని  ఒప్పుకోవడంతో  తన పనుల్లో తాను పడతాడు జాన్! లిజాను పెళ్ళాడి వాళ్ళింట్లోనే కాపరం పెట్టిన బ్యుతోకి పదహారేళ్ళ ఫ్రాంస్వాజ్ ని సైతం సొంతం చేసుకోవాలనే దుర్బుద్ధి పుడుతుంది. అతడిని  అసహ్యించుకుంటూ నిరంతరం తన్ను తాను రక్షించుకుంటుంది ఫ్రాంస్వాజ్! అతడు కనపడితే చాలు ఒళ్ళు మండిపోతుంది ఆమెకి!

రోజ్ మరణంతో (  రోజ్ మరణానికి కారణం బ్యుతోనే! తల్లితో దెబ్బలాడి ఒక్క తోపు తోయడంతో కిందపడి గాయాలపాలై మరణిస్తుంది ) ఒంటరి వాడైన పువాన్ కి ఒప్పందం ప్రకారం నెల నెలా ఇవ్వాల్సిన డబ్బు,ధాన్యం ఇవ్వడం మానేస్తారు జీసస్,బ్యుతోలు! ఫానీ తన వద్ద వచ్చి ఉండమంటుంది కానీ ఆవిడ పరిశుభ్రతా నియమాలు తట్టుకోలేక పారిపోతాడు పువాన్.అతడి దగ్గర మిగిలున్న కాస్త డబ్బూ కాజేయడానికి తన వద్దకు రమ్మంటాడు జీసస్.అతడి ఇల్లొక మురికి కూపం! అక్కడ ఉండలేకపోతాడు పువాన్.గతిలేక వృద్ధాప్యంలో ఒంటరితనాన్ని భరించలేక బ్యుతో ఇంటికి చేరతాడు. అక్కడ అనుక్షణం బ్యుతో ఫ్రాంస్వాజ్ ని  లొంగదీసుకుని అత్యాచార ప్రయత్నాలు చేయబోవడం చూసి సహించలేకపోతాడు.

 ఆ పిల్ల పడే యాతన ఊరంతటికీ తెల్సు. ఇల్లంతా ఈ విషయమై గొడవలు, లిజాకి బ్యుతో చేతిలో తన్నులు! తన మొగుడితో గడపడానికి ఒప్పుకోమని చెల్లెలికి లిజా వేడుకోళ్లు. 

ఇహ బ్యుతో బాధలు పడలేక అతడిని తీవ్రంగా ద్వేషిస్తూ జాన్ ని పెళ్ళి చేసుకుంటుంది ఫ్రాంస్వాజ్! మరదలు,ఆమె భూమీ తనకి దక్కకుండా పోయినందుకు పీక్కుంటాడు బ్యుతో!లిజా,ఫ్రాంస్వాజ్ ల మధ్య శతృత్వం ప్రారంభమవుతుంది.ఒకరికొకరుగా బతికిన ఆ ఇద్దరూ ఆస్థి వల్ల బద్ధ శత్రువులైపోతారు. ఫ్రాంస్వాజ్ గర్భవతి అవుతుంది. ఆమెకు పిల్లలు లేకుండా చేస్తే ఆమె భూమికి తామే వారసులమవుతామని లిజా, బ్యుతో ఆలోచించి ఒక మూఢ నమ్మకం ప్రకారం ఆమె పొట్టమీద శిలువ ఆకారంలో చేత్తో గీయాలని నిర్ణయించుకుంటారు.

ఒంటరిగా పొలానికొస్తున్న ఆమెను బ్యుతో అటకాయిస్తాడు.ఆమెపై అత్యాచారం చేసాడు.అందుకు లిజా సహకారం! 

అక్కాచెల్లెళ్ళ మధ్య భీకర పోరాటం! ఆవేశంలో లిజా  తోసిన తోపుకు  ఫ్రాంస్వాజ్ కొడవలిమీద పడుతుంది . ఈ ఘాతుకాన్నంతా గడ్డివాము వెనుకనుంచి పువాన్ చూస్తాడు. ఫ్రాంస్వాజ్ మాత్రం పట్టుతప్పి కొడవలిమీద పడ్డానని అందరికీ చెప్పి మూడురోజుల తర్వాత మరణిస్తుంది. ఆస్థి మొత్తం లిజా బ్యుతోలపరమవుతుంది. 

ఫ్రాంస్వాజ్ హత్యను పువాన్ చూశాడని తెలుసుకున్న బ్యుతో దంపతులు అతడినీ హతమారుస్తారు. 
జాన్ ఒంటరివాడైపోతాడు. ఫ్రాంస్వాజ్ ఆస్థి తనపేరుపై రాయనందుకు  నొచ్చుకున్నా, ఇక అక్కడ  ఉండబుద్ధి కాక యుద్దంలో  చేరేందుకు వెళ్ళిపోతాడు!

ఇంకా ఈ నవల్లో అనేక పాత్రలు కనిపిస్తాయి. పువాన్ సోదరి లగ్రాంద్,ఊళ్ళోని మరో భూస్వామి అలెగ్జీ, అతనిమీదా అతని కమతం మీదా పెత్తనం చెస్తూ పరాయి మగాళ్ల కోసం పాకులాడే దాసీ జాక్ లిన్, పట్నంలో వ్యభిచార గృహం యజమనిగా జీవితాన్ని గడిపే కూతురు ప్రభావం మనవరాలు మీద పడకుండా ఆ పిల్లను ఒకమేదకురలిగా పెంచే చార్లెస్, ఎలొదీ...ఇంకా ఊళ్ళోని పెద్దమనుషులూ..ఎన్నో పాత్రలు! అన్నీ పొలం చుట్టూనే తిరుగుతూ భూమికి సేవ చేయడానికి పరితపించే పాత్రలే! అంతే కాదు ..వీళ్ళు భూమి కోసం ఎంత దారుణాలకైనా ఒడిగడతారు. పగలూ కక్షలూ పెంచుకుంటారు. అత్యాచారాలకు, హత్యలకు పాలపడతారు. ఒక ఇంటిమనుషులే బద్ధ శత్రువులైపోతారు. అందరు కలిసినపుడు సంప్రదాయం ప్రకారం తాగి తందనాలాడతారు.  

ప్రతి పాత్రనూ ఎమిల్ జోలా తీర్చిదిద్దిన పనితనం ప్రతి అక్షరంలోనూ కనిపిస్తుంది.ఇక్కో పాత్ర మనోగతం ఆ పాత్ర చుట్టూనే నవలంతా తిరుగుతుందేమో అనిపిస్తూ ఉంటుంది చదువుతుంటే. ఆస్థి పిల్లలకిచ్చి దిక్కులేని చావు చచ్చిన భూస్వామి పువాన్ లాంటి వృద్ధులు మన చుట్టూ ఉన్నారేమో అని వెదకబద్ధేస్తుంది.(పెద్దగా వెదక్కుండానే కనపడతారు)  తన పేరుమీద కొంతైనా ఆస్తి దాచుకోకుండా పిల్లలకు సర్వం సమర్పించే తల్లి దండ్రులకు ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే గతి పడుతుందన్న సత్యం ఈ నవలలో పువాన్ కథ రుజువు చేస్తుంది.

ఫ్రాన్స్ లోని పొలాల వర్ణనా,ఆ వ్యవసాయ క్షేత్రాల వాతావరణం,వాళ్ళ తిండీ తిప్పలూ ఇవన్నీ కథ తాలూకు చిక్కని పరిమళాన్ని అద్దుకుని మరింత అందంగా కనిపిస్తూ ఉంటాయి.అదే సమయంలో యూరోపియన్ సమాజపు వావీ వరసలేని విచ్చలవిడి శృంగార సంబంధాలు వెగటు పుట్టిస్తాయి కొన్ని చోట్ల! 

ఫ్రాంస్వాజ్ తనకంటే పదిహేనేళ్ళు చిన్నదన్న ఎరుకతో ఆమెకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తూనే ఆమ పట్ల తన ప్రేమను తెలియపర్చాలన్న జాన్ తహతహ చాలా సున్నితంగా కనిపిస్తుంది. మరో వైపు  జీవితంలో అనుక్షణం అసహ్యించుకున్న బ్యుతో తన మీద అత్యాచారం జరిపిన క్షణాల్లో ఫ్రాంస్వాజ్ పరవశించి ఆనందించడం పాఠకుడిని ఉలిక్కిపడేలా చేస్తుంది. బ్యుతోని తాను తీవ్రంగా అసహ్యించుకున్నప్పటికీ తాను ప్రేమించింది అతడినే అని  గ్రహించి సిగ్గుతో కుంచించుకుపోతుంది.   తన ఆస్థిని సైతం జాన్ పేరుమీద రాయక తన చావుకి చారకురాలైన అక్కకే వదిలి పోయి అందరిలోకీ ప్రేమాస్పదురాలిగా మిగిలిపోతుంది.

అడుగడుగునా స్వార్థపరులైన మనుషులు .రైతుల మొండితనం, మూర్ఖత్వం,స్వలాభం,కృతఘ్నత, కుట్ర   ,మోసం,దగా ఇలాంటి వాటినన్నిటినీ వాళ్ళ కఠోర శ్రమ,కటిక దారిద్ర్యాల వెలుగులో సరిగ్గా అర్థం చేసుకోవాలని ముందుమాట రాసిన డగ్లస్ పార్మీ అంటాడు. వాటన్నిటికీ ఒక కారణం ఉంటుంది కాబట్టి ఆ గుణాల ఆధారంగా వాళ్ళని అసహ్యించుకోకూడదంటాడు.
వాళ్ళని "చెడ్డవాళ్ళు" గా కాక మామూలు మనుషులుగా అర్థం చేసుకోవాలంటాడు

ఈ నవలకోసం జోలా అనేక విషయాలపై సేకరించిన నోట్సు  కట్టలు కట్టలుగా  పారిస్ నేషనల్ లైబ్రరీలో భద్రంగా ఉందట!

ఎమిల్ జోలా రాసిన పుస్తకాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ నవల ఒక్కటీ ఒక ఎత్తు! ఆయన అభిమాన రచన కూడా!

భూమే ఈనవల్లో నాయకుడు,నాయిక,ప్రతినాయిక,అన్నీ!దాని చుట్టూ పాత్రల్లనీ తిరుగుతాయి తప్ప వాటి కంటూ ఇతరత్రా సాధించాల్సిన జీవన సాఫల్యమంటూ ఏమీ కనపడదు.రుతువులు,పంటలు,ఊడ్పులు,కోతలు,నూర్పిళ్ళు, అతివృష్టి,అనావృష్టి..ఆధునిక పరికరాలవల్ల జీవనోపాధి కోల్పోయే కూలీలు ...సర్వం ఈ నవల్లో అత్యద్భుతంగా వర్ణితమవుతాయి.  

ప్రపంచ సాహిత్యంలో ఎప్పటికీ నిలిచిపోయే కొన్ని పుస్తకాల్లో ఈ నవలకు తప్పక చోటు దొరుకుతుంది. సహవాసి గారి అనువాదం సంగతి మళ్లీ మళ్ళీ చెప్పడం అబ్బురపడటం అనవసరం! కానీ చెప్పకుండా ఉండలేనంత సహజత్వం, అందం! ! 

అచ్చతెలుగు గ్రామీణ పదాలు, మాండలికాలు ఫ్రెంచ్ నవల అనువాదంలో వాడుతూనే కథ నేటివిటి ఏ మాత్రం చెడకుండా తీర్చి దిద్దడం చూస్తే  సాక్షాత్తు అనువాదకుడే ఫ్రాన్స్ వెళ్ళొచ్చి ఈ నవల రాసాడా అనిపించక మానదు. బాటిల్స్ అనేమాట వాడాల్సిన చోటల్లా అనువాదకుడు "బుడ్లు" అనేమాట వాడతాడు. అలాగే "ఇటు వచ్చేతలికి(వచ్చేసరికి)" "పడ్డ"(గేదె) ,"మూడడుగులకోతూరి ( మూడడుగులకోసారి)..ఇలా అనేక పచ్చి తెలుగు పదాలు తగులుతుంటాయి. స్వేచ్చానువాదం లో రారాజు సహవాసేనని ఒప్పేసుకుంటూ  ఇంకోసారి టోపీలు తీసేస్తున్నా!

అయితే ఈ నవల వెలువడిన 50 ఏళ్ళ తర్వాత ఎమిల్ జోలా  అల్లుడు నవల్లో వర్ణితమైన గ్రామానికి వెళ్ళాడట. ఆ నవల్లో ఉన్నవన్నీ స్వార్థం మూర్తీభవించిన పాత్రలు కాబట్టి,వాటికి మోడళ్ళు ఆ గ్రామస్థులే కాబట్టి వాళ్ళేమైనా నొచ్చుకున్నారేమో అని విచారించాడు. ఆ నవల గ్రామస్థులందరికీ పరిచితమే! కొట్టిన పిండే !

అయితే వాళ్ళు తమ పల్లెను, పల్లీయుల్ని దారుణంగా పోల్చాడని కించిత్తైనా ఎమిల్ జోలా మీద కోపం తెచ్చుకోలేదట. కానీ ఎవరికి వారు ఆయా పాత్రలతో తమను మాత్రం పోల్చుకోకుండా "ఫలానా చెత్త పాత్ర మాత్రం..అదిగో ఆయనదే"అంటూ ఇరుగు పొరుగుల్ని మాత్రం చెత్త పాత్రలతో ఇట్టే పోల్చేశారట.

ఈ నవలను  1983 లో వేసింది హైదరాబాద్ బుక్ ట్రస్ట్. మళ్లీ ఇంతవరకు వేయలేదు. వేస్తారో వేయరో కూడా తెలీదు. కాని ఇలాంటి అత్యద్భుతమైన  పుస్తకాలను మళ్లీ మళ్లీ  జన బాహుళ్యంలోకి   తీసుకొచ్చి పాఠకులకు  ఉత్తమప్రపంచ సాహిత్యాన్ని అందుబాటు లో ఉంచాల్సిన బాధ్యత మంచి పబ్లిషర్లు తీసుకోవాలి  . వాటికి  పాఠకాదరణ  తప్పకుండా ఉంటుంది కూడా. వనవాసి నవల కు లభించిన ఆదరణే  ఇందుకు తార్కాణం!

ప్రస్తుతం  ఈ పుస్తకం బయట ఎక్కడా లభ్యం కావడం లేదు.  అప్పట్లో కొని దాచుకున్న వారి వద్ద తప్ప! 

నా కలెక్షన్లో ఉన్న ఒక అద్భుతమైన నవల ఎమిల్ జోలా భూమి! దొరికితే మాత్రం చదివే అవకాశం వదులుకోవద్దు!









November 23, 2010

అనైతికం

 అనైతికం నవల గురించి రాయాలని ఎప్పటినుంచో అనుకున్నాను. సగం రాసి ఎక్కడో పడేశాను. అది నిన్న పాత ఫైల్స్ లొ కనపడి మొత్తం పూర్తి చేసి ఇవాళ బ్లాగులో పెడుతున్నా! :-))




నిస్సందేహంగా యండమూరి ఒక సంచలన రచయిత. (మంచి రచయితా కాదా అనేది మీరు చదివిన నవలలల్ని బట్టి మీరే నిర్ణయించుకోండి) కుటుంబ కథలే నవలలుగా చెలామణీ అవుతున్నరోజుల్లో ఒక ప్రభంజనం లా దూసుకొచ్చి సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. అద్భుతమైన శైలి అతని సొంతం. సస్పెన్స్ తో వచ్చేవారం దాకా ఎదురు చూడ్డం లోని మజా మా తరం పాఠకులకు అనుభవంలోకొచ్చేలా చేశాడు.

ఎన్నో నవలలు రాసినా నాకు అన్నింటికంటే నచ్చేవి అనైతికం, వెన్నెల్లో గోదారి. రెంటి కథనాల్లోనూ చక్కని బిగి ఉంటుంది.అన్ని మూలల నుంచీ సూత్రాలను లాగి చక్కగా ముడివేసిన నేర్పు ఉంటుంది.

ఇతనివే కొన్ని నవలలైతే ఇప్పుడు చదువుతుంటే "ఒకప్పుడు ఎంతో ఉత్కంఠగా ఈ పుస్తకం ఎలా చదివానా?" అని గొప్ప సందేహం వచ్చే పుస్తకాలు కూడా ఉన్నాయి.ఉదా:రక్త సింధూరం,లేడీస్ హాస్టల్,అగ్నిప్రవేశం(ఇంకా ఉన్నాయి..)మొదలైనవి. అతడి శైలి మీద ఇష్టంతో ఒకప్పుడు కొనిపెట్టుకున్న నవలలు బుక్ షెల్ఫ్ లోంచి వెక్కిరిస్తుంటాయి నన్ను!

ఎవరికైనా కావాలంటే అవి ఇచ్చేస్తాను. ఎప్పటికీ..అచ్చంగా!

అనైతికం నవల ఆంధ్ర ప్రభ లో సీరియల్ గా వచ్చింది. అప్పుడు మొత్తం చదవకపోయినా తర్వాత నవల కొన్నాను.(దాన్ని మా ఆడపడుచు పట్టుకెళ్ళి పేజీలన్నీ ఊడగొట్టిన సంగతి ఇంతకు ముందొకసారి. రాశాను! తర్వాత మళ్ళీ ఇంకో కాపీ కొన్నాను)

ఒక మనిషికి సంబంధించి ఏది నైతికం?
ఏది అనైతికం?
దీన్ని ఎవరు నిర్ణయిస్తారు? ఎందుకు నిర్ణయించాలి? ఎవరికేది కావాలో వేరొకరు ఎందుకు నిర్ణయించాలి?
అసలు నైతికత వ్యక్తిగతమా? సామాజికమా?

ఇవన్నీ అందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ప్రశ్నలే! మనకు నైతికమే అనిపించింది ఇంకొకరికి అనైతికంగా కనిపించవచ్చు! ఈ విశ్లేషణే ప్రధానంగా ఈ నవల సాగుతుంది.

మీలో చాలా మంది ఈ నవల చదివే ఉంటారు.అయినా పరిచయం రాసేటపుడు పాత్రల్ని పరిచయమో, విశ్లేషణో చేసి ఊరుకోకుండా కథ కూడా చెప్పడం నాకలవాటు కాబట్టి చెప్తాను.

ఈ నవల్లో ముఖ్య పాత్రలు మూడూ స్త్రీలే! ఈ ముగ్గురికీ బంధుత్వం ఉంటుంది. వీరు జీవితాలను కొంతమంది పురుషులు ప్రభావితం చేస్తారు. స్త్రీ వాదానికి వ్యతిరేకంగా రచించిన ఒక పుస్తకాన్ని నిషేధించాలని కోరుతున్న స్త్రీవాదుల లాయర్ గా లండన్ కోర్టులో షాంలా( శ్యామల)మనకు పరిచయమవుతుంది. ఆమె తన తల్లితో కలసి లండన్లో ఉంటుంది. తల్లి  డైవర్సీ! ఇక్కడ స్త్రీవాదం పై కొన్ని వాదప్రతివాదాలు నడుస్తాయి.

చివరికి శ్యామల కేసులో ఓడిపోతుంది. ఇంతలో మరో పక్క తన తల్లి తండ్రులు విడిపోవడానికి కారణం తన పెదనాన్నతో తల్లికి గల అక్రమ సంబంధమే అని తెలుస్తుంది...తన సవతి తమ్ముడి ద్వారా!తల్లి మీద కోపంతో మండిపడుతూ తండ్రిని చూడ్డానికి ఇండియా బయలుదేర్తుంది.

ఇక్కడినుంచి ఆమె తల్లి అహల్య తన గతం మనకి చెప్పడం ప్రారంభిస్తుంది.వివిధ కారణాల వల్ల ఆమెకు తన భర్త అన్నతో(బావగారితో) శారీరక సంబంధం ఏర్పడుతుంది. అవి నవల్లో చదివితేనే బాగుంటుంది. చివరికి అది బయటపడి ఆమె విడాకులు తీసుకుంటుంది.

నవల్లోని మరో ముఖ్య పాత్ర అహల్య వదిన(అన్న భార్య)అచ్చమ్మ!(అవును అచ్చమ్మే)! దళిత స్త్రీ!ఒకతనితో ప్రేమ(అనుకుని)లో పడి రెండేళ్ళపాటు పెళ్ళి లేని సహజీవనం చేసి విడిపోయి అహల్య అన్నను పెళ్ళాడుతుంది.

శ్యామల తండ్రిని కలుసుకుందా? మామయ్య,అత్తల ను కలిసి తల్లి ఎందుకలా చేయవలసి వచ్చిందో తెలుసుకుందా? అపార్థం తొలగిపొయిందా? ఇవన్నీ నవల్లో చదివితే బావుంటాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నవలే కాబట్టి ముగింపు చెప్పడం లేదు.(దొరకని పుస్తకం అయితే కథ మొతం చెప్పేద్దును)

ఈ నవల ముందు మాటలో యండమూరి స్త్రీ వాదం గురించి కర్ర విరక్కుండా, పాము చావకుండా కొన్ని మాటలు రాశారు.అవి అప్రస్తుతం!నవలను పక్కనపెట్టి బోల్డంత చర్చకు దారితీసే వాక్యాలు అందులో ఉన్నాయిమరి!

పాత్రల వ్యక్తిత్వాలను తీర్చి దిద్దడంలో యండమూరిది అందె వేసిన చేయి. వాటి మనో భావాలను, ముసుగుల్లేని అంతరంగాలను,అత్యంత ప్రతిభావంతంగా చిత్రీకరిస్తాడు. అహల్య అత్తగారింట్లో వాతావరణాన్ని,జాణ లాంటి అత్తగారిని,పాఠకులు ఎగ్జైట్ అయిపోయేంత అద్భుతంగా చిత్రీకరించాడు.

యండమూరి నవలల్లో స్త్రీ పాత్రలు అద్భుతమైన తెలివితో, ఇనీషియేటివ్ గా, మేథస్సూ ఉట్టిపడుతూ ఉంటాయి.మరోపక్క స్త్రీ సహజమైన సున్నితత్వం, భావుకత, ప్రేమ వీటన్నితో పరిపూర్ణంగానూ ఉంటాయి.అన్నింటికంటే ముఖ్యంగా ఆత్మవిశ్వాసం యండమూరి హీరోయిన్లకు పెట్టని ఆభరణం! అనూష,రమ్య, సౌదామిని,వైజయంతి,లక్ష్మి,ప్రవల్లిక,ప్రమద్వర,ఎవరినైనా తీసుకోండి!వీళ్లలోవాళ్ళే అహల్యా,అచ్చమ్మానూ!

యండమూరి వ్యక్తిత్వ వికాసం పుస్తకాల వైపు మళ్ళినా, నాకెందుకో వాటిలో లేని మనోవిశ్లేషణ అతని(కొన్ని)  నవలల్లోనే కనిపిస్తుంది. అతని పాత్రల స్వభావాలే పెద్ద పాఠాలు!  

ఈ నవల్లోని రెండు ముఖ్య పాత్రలు అహల్యా, అచ్చమ్మ ఇద్దరూ ఉన్నతమైన వ్యక్తిత్వం గల వాళ్ళుగా రచయిత ఎస్టాబ్లిష్ చేస్తాడు. వ్యక్తుల సెక్స్ జీవితమే ప్రాతిపదికగా,వాళ్ళ ఇతర ప్రవర్తన వ్యక్తిత్వం ఏమీ అర్థం చెసుకోకుండానే (అర్థం చేసుకునే కెపాసిటీ లేకనొ)  వాళ్ళకు వ్యభిచారులనో,మరోటనో టాగులు  అంటగట్టే  మనస్తత్వం ఉన్నవాళ్ళకు ఈ నవల అర్థం కాదు.కాబట్టి అలాంటి ఆలోచనలుంటే ఈ నవల చదవకపోవడమే మంచిది.

 జీవితంలోని ఇతర సంఘర్షణల వల్ల ఎటూ తప్పించుకోలేని స్థితిలో ఇలాంటి బంధాల మధ్య ఇరుక్కునే పరిస్థితి ఎవరికీ రాదనీ, అలా వచ్చిందంటే అది ఆడాళ్లు కొవ్వెక్కి చేసే పనే అని నిర్ణయించేసే వాళ్లకి ఏమని చెప్పగలం? ఎక్కడో యండమూరే అనుకుంటాను అన్నాడు, అవకాశం రానంత వరకూ అందరూ మాట్లాడే మాటలే ఇవి! నవల సీరియల్ గా వస్తున్నపుడే దీని మీద బోలెడు చర్చలు నడిచాయని గుర్తు!

మొదట్లో అహల్య కూడా భర్తను ఎంతగానో ప్రేమిస్తూ కోటి ఆశలతో అతనిజీవితంలోకి ప్రవేశిస్తుంది. కానీ పుట్టింట్లో అందర్నీ వదులుని అక్కడ అడుగుపెట్టిన ఆమెకు ఎదురైన పరిస్థితి ఏమిటి? చదువుకుని మంచి వ్యక్తిత్వాన్ని సంతరించుకున్న ఒక ఆడపిల్ల ఎంతమాత్రమూ దిగమింగుకోలేని పరిస్థితులు అక్కడ ఎదురవుతాయి. అవి కావాలని తెలివిగా సృష్టించబడతాయి. పెళ్ళి రోజు నాడు సరదాగా భర్తతో కాసేపు కల్సి కబుర్లు చెప్పుకోవాలన్న చిన్న కోరిక కూడా  భగ్నమైపోతుంది,.... ఎవరికీ అదొక కారణమే అనిపించని అతి చిన్న సాకుతో! కానీ ఇలాంటివి మనసులో ఎంతగానొ గుచ్చుకుపోతాయి.

అటువంటి డెస్పరేట్ కండిషన్ లో ఆమె మానసిక పరిస్థితిని వాడుకుని ఆమె తెలివి తేటల్ని(యండమూరి హీరోయిన్లు భలే తెలివిగా ఉంటారు కదా) పొగిడి,తన జీవితలోని ప్రేమ రాహిత్యాన్ని ఆమె ముందు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి ఆమెతో సంబంధం పెట్టుకుంటాడు ఆమె భర్త అన్న!

తనకు అతనితో సంబంధం ఇష్టమా కాదా అన్నది కూడా తేల్చుకోలేని సందిగ్ధంలో ఉంటుంది అహల్య! ఆమె మానసిక స్థితిని రచయిత చాలా బాగా చిత్రీకరిస్తాడు ఇక్కడ!

విషయం తెలియగానే తన జీవితం సర్వనాశనమైపోయిందని గోల చేసిన అహల్య భర్త(అహల్య భర్త,బావగారు పాత్రలకు పేర్లు కూడా ఉండవు ఈ నవల్లో) గొప్ప నీతిపరుడని మనం కూడా అయ్యో అని జాలిపడతాం! కానీ అహల్య తోడికోడలి చెల్లెలికి గర్భం రావడానికి కారణం అహల్య భర్తే అని తెలుస్తుంది !

మరీ ఎక్కువగా నీత్యుపన్యాసాలు ( నీతి+ఉపన్యాసాలు = యణాదేశ సంధి) దంచే వారి అసలు రంగులు ఇలాగే ఏడుస్తాయి.

అచ్చమ్మ సంగతికొస్తే ...... తెలివైనదైనా ఆడపిల్ల కావడంతో సురేష్ చూపించిన కన్ సర్నూ, అతడి లెక్కలేని తనమూ ,నిర్లక్ష్య ధోరణీ చూసి హీరో వర్షిప్ తో ప్రేమలో పడుతుంది. నవల చదువుతున్నపుడు మనకూ అతడు నచ్చుతాడు. తర్వాత వాడో పెద్ద అవకాశ వాదనీ వెధవనీ తెలుస్తుంది. అతడితో కల్సి జీవించి,అతడి గురించి మొత్తం తెలిశాక డిప్రెస్ ఐపోయి ఎలాగో బయటపడిన ఆమెను అహల్య అన్న శ్రీకాంత్ పెళ్ళాడతాడు.

సెక్సే ప్రాతిపదికగా పాతివ్రత్యాలను,పవిత్రతను నిర్ణయించుకుంటూ పోతే ఈ నవల్లో కనపడేవన్నీ అనైతిక కథలే!(గమనిక:ఈ నవల్లో సెక్స్ వర్ణనలూ,దృశ్యాలూ వగైరాలేవీ ఉండవు)  కానీ పాఠకులు దీన్ని అంతగా ఎందుకు ఆదరించారంటే స్త్రీ పురుష   సంబంధాల్లోని సంక్లిష్టతను,మనసు లోతుల్లో నైతికత ముసుగేసిదాచుకునే భావాలని యండమూరి ఇందులో దిగంబరంగా చూపించేశాడు. ఈ నవల రాయడంలో అతని ప్రతిభకు హాట్సాఫ్ చెప్తాను నేను!. (అతడి  చాలా నవలల విషయంలో తల పట్టుక్కూచుంటాను....అది వేరే సంగతి)


ఈ మధ్య నేనో కోర్సు చదవడం మొదలుపెట్టాను. అందులో భాగంగా ఎన్నో కేసులు పరిశీలించాల్సి వస్తుంది. కొంత వరకూ వివాహేతర సంబంధాలున్న కేసులు!

ఇవి సమాజంలో ఎంత మామూలైపోయాయంటే "పరిస్థితి ఇలా ఉందా? ఇంత సర్వ సామాన్యమైపోయిందా?"అని నిర్ఘాంత పోయేంత. మారిన జీవన ప్రమాణాలు,విధానాలు,పరిస్థితుల కారణంగా ఇలాంటి పరిణామాలు సంభవిస్తున్నాయి.

కానీ అలాంటి పరిస్థితులు ఎందుకేర్పడ్డాయి,కారణాలేమిటనే విషయం పరిశీలించాలి. ఆ బంధం లో " ప్రేమ" ఉందా లేదా అన్నది తప్పకుండా పరిశీలించాలి.  అహల్య సంబంధంలో ప్రేమ లేదు..లేదు..! భర్త మీద ఉన్న నిరాసక్తత, వ్యతిరేకత ఆ బంధానికి దారి తీస్తాయే తప్ప అందులో ప్రేమ,కంపాషన్  లేనే లేవు.


 అచ్చమ్మదీ, అహల్యదీ మాములుగా గడిచే సాధారణ   జీవితం కాదు.చాలా డెస్పరేట్ పరిస్థితిలో వాళ్ళు అలాటి పరిస్థితికి గురవుతారు.నవల చదువుతున్నంత సేపూ అహల్య, అచ్చమ్మల నిస్సహాయ పరిస్థితుల పట్ల పాఠకుడు చలించిపోతాడు. మనసున్న మనిషిగా స్పందిస్తాడు.

చివర్లో శ్రీకాంత్ అచ్చమ్మల కొడుకు హోమ్ సైన్స్ చదువుతూ ఉండటము,కూతురు ఇంజనీరింగ్ చదివి ఉండి కూడా  గృహిణిగా స్థిరపడాలని ఉందని చెప్పడమూ చాలా టచింగ్ గా అనిపిస్తుంది.

డబ్బు కోసం కాక మనసు పెట్టి రాస్తే యండమూరి మంచి నవలలు రాయగలడని చెప్పడానికి ఉదాహరణలు రెండు నవలలు! వెన్నెల్లో గోదారి,అనైతికం! (ఆనందోబ్రహ్మ కమర్షియల్ నవలే)

ఎవరి నైతికత పట్ల వాళ్లకి నిబద్ధత ఉంటే చాలని,వారితో సంబంధం లేనివాళ్ళకు వాళ్ళను ప్రశించే హక్కు లేదనీ యండమూరి గట్టిగా నొక్కి వక్కాణిస్తాడు ఈ నవల్లో!

అద్భుతమైన శైలీ ,కథనంతో చదివించే ఈ నవల అన్ని పుస్తకాల షాపుల్లోనూ లభ్యమే!


 ప్రస్తుతం ఈ నవల ఎవరికో ఇచ్చి ఉండటం వల్ల (రాజ్ కి అనుకుంటా) కవర్ పేజీ ఫొటో పెట్టలేకపొతున్నాను! పైగా కవర్ పేజీ అంత సెన్సిబుల్ గా కూడా ఉండదు లెండి! :-))

చదివిన వాళ్ళు మీకెలా అనిపించిందో చెప్పండి. చదవని వాళ్ళు చదివి చూడండి!