Showing posts with label కళలు. Show all posts
Showing posts with label కళలు. Show all posts

June 7, 2011

మేమూ పేరంటానికెళ్ళాం!




మేమూ బాపూ బొమ్మల కొలువు పేరంటానికెళ్ళి వాయినం పుచ్చుకుని వచ్చాం! పైగా నిన్న ఎస్పీ బాలూ, ఏవీయెస్ ,శేఖర్ కమ్ముల,జనార్దన మహర్షి వంటి వాళ్ళతో కల్సి కూచుని కాసేపు బాపూ నామస్మరణ చేసుకున్నాం! కీర్తి కండూతి అస్సలు లేనందుకు బాపూని, ఆయనకు కీర్తి కావాల్సిందేనని దెబ్బలాడని తెలుగు వాళ్ళనీ(అంటే మనల్నే) కాసేపు తిట్టుకుని నిష్టూర పడ్డాం!
"అసలేమిటీ మనిషి"అని అని విస్తుపోయాం!





శ్రీరామ రాజ్యం సినిమా షూటింగ్ లో ఏవీయెస్ గారు బాపూని "దీని తర్వాత మీ ప్రాజెక్ట్ ఏమిటి సార్" అనడిగితే "ఇహ నేను చేయలేమోనయ్యా, నా వల్ల కాదేమో" అన్నారట!

"ఎందుకు సార్, ఓపిక లేదా?"

"రమణ లేడుగా!"అన్నారట డస్సిపోయి!

ఏవీయెస్ చెప్తుంటూనే అక్కడ ఉన్న వాళ్ళ హృదయాలు బరువెక్కిపోయాయి ఈ మాటకి.



జనార్దన మహర్షి ఒక మంచి మాట చెప్పారు. "మీడియా ఛానెళ్ళ వాళ్ళు,అయిన దానికీ కానిదానికీ ఎస్సెమ్మెస్ లు పంపించమంటుంటారు. అలాగే ఇన్ని కోట్ల ఆంధ్రులం ఉన్నాం, "మా బాపూకి గౌరవం,గుర్తింపు కావాల్సిందే" అని తెలుగు వాళ్ళంతా కల్సి ఒక ఉద్యయం లేవదీయాలి. లేవ తీద్దాం కూడా! ఎందుకు సాధ్యం కాదో నేనూ చూస్తాను"అన్నారు ఉద్వేగంగా!

ఏవీయెస్ ఒక చిన్న ఊహాత్మక సంఘటన చెప్పారు.ఒకరోజు ఆయన అర్థ రాత్రి టాంక్ బండ్ మీదుగా వస్తుంటే ఒక స్త్రీ తెలుగు తల్లి విగ్రహం దగ్గర కూచుని భోరున ఏడుస్తోందిట. ఈయన జాలిపడి ఎవరమ్మా నువ్వు?ఎందుకేడుస్తున్నావు?నీ పేరేమిటి? అనడిగితే ఆవిడ "నా పేరు పద్మండీ! ఢిల్లీలో వాళ్ళు నన్ను పెంచుకుంటున్నారు! అర్హత ఉన్నా లేకపోయినా ఎంతోమందిని ఆవహించాను గానీ ఈ బాపు అనే వ్యక్తిని మాత్రం చేరాలని ఎంత ఉత్సాహ పడుతున్నా ఆయన దగ్గరికి నన్ను వెళ్ళనివ్వడం లేదు. ఆయన నన్ను కోరడు. నేనే  ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్తానా అని ఏడుస్తున్నా"అందిట! ఆ స్త్రీయే పద్మ అవార్డు!



అద్భుత చిత్ర ప్రపంచంలో ప్రతి దాన్నీ ఆస్వాదిస్తూ చూడాలంటే ఒక ఏడాది కావాలి. అది కుదర్దు కాబట్టి గంటల్లోనే ముగించుకుని, నచ్చిన వాటిని భద్రపరుచుకున్న్నాం! మా ఇంటికి దగ్గరే కావడంతో ఎక్కువ సేపూ ఉండగలిగాం, ఇల్లు ఎప్పుడు చేరాలో అనే బెంగ లేకుండా !



బొమ్మల కొలువుకి వచ్చిన అపూర్వ స్పందన వల్ల దీన్ని వచ్చే శనాదివారాలు కూడా (జూన్ 11,12 తారీకుల్లో) సందర్శకులకు అందుబాటులో ఉంచుతారట. మిస్ అయ్యామని బాధ పడేవారు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడొచ్చు!














February 19, 2011

మహా శివతాండవం-నయన మనోహరం




ఈ ఫిబ్రవరి నెల్లో చక్కని సంగీత నాట్య ప్రదర్శనలు చూసే అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది  నాకు ! Times Hyd festival తర్వాత నాట్య తరంగిణి వాళ్ళ ప్రదర్శనలు వరుసగా! మంచి తరుణం మించితే దొరకదు కాబట్టి పన్లు వాయిదా వేసి మరీ చాలా వరకూ అటెండ్ అయ్యాను. శుక్రవారం సాయంత్రం గచ్చిబౌలి లోని బ్రహ్మకుమారీస్ ఆడిటోరియం లో రాజా రాధా రెడ్డి బృదం కూచిపూడి ప్రదర్శన "మహా నటం" రూపకం ....జరిగింది.



భగవంతుడు కళ్ళు ఇచ్చినందుకు ఇలాంటి కళా ప్రదర్శనలని అప్పుడప్పుడూ చూస్తేనే గానీ సార్థకత లేదనిపించేంత అద్భుతంగా ఉంది.



అరవై పై బడ్డ రాజారెడ్డి గారి వేగం, అమితమైన ఎనర్జీ లెవెల్స్ అబ్బరపరిచాయంటే నమ్మండి. రాధారెడ్డి ఆహర్యంలోనూ, కదలికల్లోనూ వార్థక్యపు జాడలు అనివార్యమైనా....అద్భుతమైన అభినయం వాటిని దాదాపుగా మరుగు పరిచింది .





వాళ్ళ కుమార్తెలు యామిని, భావన మిగతా శిష్యులు శ్లోక వైద్యలింగం, అల్ల ఆర్థర్,అపర్ణ కృష్ణ,చిత్కళా బాలన్,నేహా కృష్ణ, షాం కె సంసి,జ్యోతి,...ఇక్కడున్న ఫొటోల్లో వీళ్ళంతా ఉన్నారు.


ప్రమథ గణాల ప్రణతులు, మనోహరమైన ప్రకృతి మధ్య  పార్వతీ శంకరులుగా రాజా రాధా రెడ్డి అపూర్వంగా నాట్యం చేశారు. శివుడు గా రాజారెడ్డి అరగంట సేపు చేసిన తాండవం ఆడిటోరియాన్ని ముందు పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉంచినా ఆ తర్వాత కరతాళ ధ్వనులతో నింపేసింది. ఎక్కువ చెప్పడం కంటే..... ఫొటోలు చూడండి!





ఆ బ్రహ్మకుమార్ ఆడిటోరియం కాస్త జనాలకు తెలిసే చోట, కాస్త ఊరిమధ్యలోనూ ఉంటే ఇంకా ఎక్కువమంది వచ్చేవారేమో! ఆడిటోరియమ్ లో వెనుకవరసలన్నీ ఖాళీగా ఉండిపోవడం ఆశ్చర్యపరిచింది. 



విదేశీ నృత్యప్రదర్శనలకిచ్చిన కవరేజ్ వార్తా పత్రికలు కూచిపూడి ప్రదర్శనకివ్వకపోవడం కొంచెం అసంతృప్తిని మిగిల్చిన విషయం!