మీ సంబంధం మాకు నచ్చలేదు
"రేపు పదింటికల్లా రెడీ గా ఉండు"
మోహిత్ మాట విని విద్య కి ఒక్క క్షణం ఎందుకో చిరాకు కల్గింది
ఎప్పటికైనా తప్పదు గా వెళ్ళక, మాట్లాడక ?
" నువ్వేం కంగారు పడాల్సిన పన్లేదు. మా ఇంట్లో అందరికీ తెల్సు కదా ! నువ్వు ఇంజనీరింగ్ చేస్తున్నావని, కాంపస్ లో సెలెక్ట్ అయ్యావని తెల్సీ మా నాన్న చాలా సంతోషించారు తెల్సా! మా ఇంట్లో అంతా ఫ్రెండ్లీ గా ఉంటుంది వాతావరణం. మా అత్తయ్య కూడా వస్తుంది రేపు "
"అత్తయ్యా?"
"అవును, రేపు నువ్వొస్తావని చెప్పాను. మేనల్లుడి కాబోయే భార్య ఎలా ఉంటుందో చూడాలని ఆ మాత్రం తహ తహ ఉండదా? నన్ను చిన్నప్పుడంతా అత్తయ్యే పెంచింది. పొద్దున్నే బయల్దేరి వస్తుంది. విజయవాడేగా? తొమ్మిదింటికల్లా వచ్చేస్తుంది. "
ఆవిడెవరో తనని చూడ్డానికి వస్తుందంటే ఇంకా చిరాకు పెరిగింది
ఈ పరిస్థితిని అవాయిడ్ చేస్తే బాగుండనిపిస్తోంది.
"నిన్ను చూశాక,అప్పుడు మీ ఇంట్లో వాళ్లతో మాట్లాడతారు . మీ అమ్మ ఇంకా మీ మావయ్యా?... ఎవరాయన మీ కాలేజీ కి వస్తుంటారు"
"అవును, మా మావయ్య. అమ్మ కి బాబాయి కొడుకు"
" ఆ ఆయనే! ముందు నువ్వు మా ఇంట్లో అందరినీ కలువు. ఎంత ఫ్రెండ్లీ గా ఉంటారో నీకే తెలుస్తుంది. ఆ తర్వాత మీ మావయ్య , అమ్మ వచ్చి మాట్లాడచ్చు"
"మాట్లాడొచ్చు అంటే?ఏం మాట్లాడాలి?"
"కట్నం అదీ అడగరులే కంగారు పడకు"
"నాకిట్టాంటి జోకులు నాకు నచ్చవబ్బాయ్ "
"అబ్బ, ఊరికే అన్నాను లే! పెళ్ళి గురించి మాట్లాడుకోవాలి కదా? విద్యా, నీకెప్పుడో చెప్పాను, నా వైపు నుంచి అంతా ఓకే! నీ వైపు నుంచి అభ్యంతరం ఉండటానికేముంది? "
"నా వీసా రాగానే ఎక్కువ టైముండదు ప్రయాణానికి. నెల రోజుల్లో వచ్చేస్తాను గా తిరిగి "
"ఎన్నింటికి వెళ్దాం రేపు? అమ్మతో కూడా ఒకసారి చెప్తాను"
మోహిత్, తనూ ఒకరినొకరు ఇష్టపడ్డం, కల్సి తిరగడం బానే ఉంది గానీ, ఇట్లా వాళ్ళింటికి పోవడం, వాళ్ల చేత "ఓకే, టెస్టెడ్" స్టాంప్ వేయించుకోవడం.. ఇదంతా బాగా అనిపించడం లేదు
.మొదటి సారి మోహిత్ ఇంటికి వచ్చినపుడు అమ్మమ్మ డాన్స్ ఫొటోలూ, తాతయ్య తబలా వాయిస్తున్న ఫొటోలూ చూసి చాలా ఆశ్చర్య పోయాడు.
"నిజమా?నమ్మలేక పోతున్నా. భలే అందంగా ఉన్నారు మీ అమ్మమ్మ " అన్నాడు.
అమ్మ కాస్త కలవరపడింది, మోహిత్ తనని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పినపుడు . నాలుగు రోజులు ఆలోచించింది. మావయ్యతో చెప్పింది.
మావయ్య ఏమీ మాట్లాడలేదు. "దాని ఇష్టం కనుక్కో" అన్నాడు
"అన్ని వివరాలూ మీ ఇంట్లో చెప్పి అందరికీ ఇష్టమైతేనే మాట్లాడుకుందాం! మా అమ్మ రికార్డింగ్ డాన్సులు చేసేది. మా నాన్న తబలా వాయించే వాడు. నన్ను చదివించి బాంక్ లొ ఉద్యోగం వచ్చాకే పెళ్లి చేశారు. ఇష్టపడే వెంటబడి మరీ చేసుకున్నాడాయన. ఆయనా బాంక్ ఎంప్లాయీ నే , వేరే బాంక్ లో !
పాప పుట్టాక నన్ను వదిలేసి వెళ్లిపోయాడు. కారణం మా అమ్మ రికార్డింగ్ డాన్సర్ కావడమే! ఆమెను చూసుకోవాల్సిన బాధ్యత నా మీదనే ఉండేది. అతనికి అది ఇష్టం లేదు. తన స్నేహితులో, చుట్టాలో వచ్చినపుడు ఆ అయిష్టంమరింత పెరిగి పోయేది. మా అమ్మ ఇంట్లో ఉండటం తనకు నచ్చేది కాదు. ఎప్పుడైనా అతని స్నేహితులు వస్తే మా అమ్మ పెరట్లోనే ఉండేది. లేదా గుడికి పోయి కూచునేది.
అలా జరగడానికి వీల్లేదని చెప్పేశానొక రోజు. పెద్ద గొడవ జరిగింది. అది మొదలుకొని తరచూ గొడవలు జరిగేవి. ఒకసారి అతను ఎటో వెళ్ళి పోయి మా అమ్మ ను హోమ్ లో చేర్పిస్తే కానీ ఇంటికి రానని ఉత్తరం రాశాడు. నేను చేర్పించలేదు
అతను తిరిగి రానూ లేదు.
ఇలాటి ఇబ్బందులేవీ విద్యకు రానే కూడదు "
అమ్మ చెప్తుంటే ఇష్టంగా చూస్తూ కూచుంది అమ్మని! ఎంత గొప్పది అమ్మ!
చిన్నప్పుడు ఇంట్లో జరుగుతుండే గొడవలు గుర్తున్నాయి ఇంకా
తను నాలుగో తరగతి లో ఉండగా నాన్న వెళ్ళిపోయాడు.
తర్వాత వేరే పెళ్ళి చేసుకున్నాడని ఎవరో చెప్పారు. ఆ పెళ్ళి చెల్లదనీ కేసు వెయ్యమనీ, భరణం అడగమనీ అమ్మకి సలహాలు ఇచ్చారు స్నేహితులు. అతనే అవసరం లేనప్పుడు అతని డబ్బు అవసరం లేదంది అమ్మ
అమ్మకి ఉద్యోగం లేక పోయినా అతని డబ్బు తీసుకునేది కాదు .
అమ్మమ్మ మాత్రం చాలా దిగులు పడి చచ్చిపోయింది. తన వల్లే అమ్మ ఒంటరిదై పోయిందనీ, తను వెళ్ళి పోతాననీ అమ్మమ్మ ఇంటి వెనక బాదం చెట్టు కింద కూచుని ఏడ్చే దృశ్యం గుర్తుంది.
ఆ వయసులో అది పెద్ద సమస్యగా తెలీలేదు.
నాన్న లేడనే బెంగ కూడా ఉండేది కాదు.
వేరే పనేదీ చేతకాక, దొరక్క, కాసిన్ని ఎక్కువ డబ్బులొస్తాయని ఆశపడి తన మీద ఆధారపడ్డ వాళ్ల కోసం చేసిన డాన్సులు.. చివరికి కూతురు బతుకు నాశనం చేశాయన్న దిగులుతో అమ్మమ్మ ఎక్కువ రోజులు బతక లేదు
మోహిత్ కి అదంతా చెప్పినపుడు తనకంటే ఎక్కువగా దుఃఖ పడ్డాడు.
తన గురించి తనకు బాగా తెలుసు. వాళ్ళింట్లో కుల మతాల ప్రసక్తి లేదనీ, అందరూ చదువుకున్న వాళ్ళే అనీ, చక్కగా ఆలోచిస్తారనీ ఎంత చెప్పినా, వాళ్ళింటికి వెళ్ళాలంటే మాత్రం ఎందుకో కొంచెం సంకోచంగా అనిపిస్తోంది. వాళ్ళన్నది కూడా కులాంతర వివాహమేనని చెప్పాడు మోహిత్.
అయినా ఎందుకో ఇష్టం గా లేదు ఈ మీటింగ్
తన కుటుంబం గురించో, అమ్మమ్మ గురించో చప్పున వాళ్ళేదైనా మాట్లాడితే? ఎలా రెస్పాండ్ అవాలి?
కోపం వస్తే తనకి?
అబ్బ, అలా ఏం జగరదులే ! ఇట్టా పోయి అట్టా మాట్టాడి వచ్చేస్తే పోలా ?
తన వైపు నుంచి సమస్యే రాదని మోహిత్ చెప్పాక ఇంకేంటి? ఇదొక కాజువల్ మీట్ అంతే!
"రేపు మోహిత్ వాళ్ళింటికి వెళ్తున్నా " చెప్పింది అమ్మతో
"తను వచ్చి తీస్కెళతాడా?"
"ఊ, ముందు నేను వెళ్ళి కాజువల్ గా కల్సి వస్తాను. తర్వాత నువ్వూ మావయ్యా వెళుదురు లే! లేదా వాళ్ళోళ్ళు మాట్లాడతారట"
"వాళ్ళొస్తారా?"
"అవును, వాళ్ళకు అట్టాంటి పట్టింపులేం లేవంట. ఆడపిల్ల గలోళ్ళే వచ్చి మాట్టాడాలని"
" సర్లే, పెందలాడే పడుకో, అర్థరాత్రి దాకా చదువుతూ కూచోవాకు"
అమ్మకసలు కంగారే లేదు. !
********** ************ *************
వాకిట్లో అడుగు పెడుతుండగానే లోపల నుంచి వినపడుతున్న సంగీతం విద్య కి హాయిగా అనిపించింది
డాబా మీద నుంచి కరివేపాకు కోసుకుని మెట్లు దిగి వస్తున్న మోహిత్ వాళ్ళమ్మ విద్యను చూస్తూనే చిరునవ్వుతో దగ్గరికి వచ్చి చేతులు పట్టుకుంది
"రా..రా " అంటూ లోపలకి దారి తీస్తూ "ఎవరొచ్చారో చూడండందరూ " అంది పెద్దగా
అందరూ బాగానే రిసీవ్ చేసుకున్నారు.
గదిలో ఉన్న తాతగారు కూడా లేచి వచ్చారు మనవడికి కాబోయే పెళ్ళాన్ని చూడ్డానికి
పొద్దున్నే వచ్చిన మేనత్త విద్యను చూసి"కుందనపు బొమ్మలా ఉంది రా, ఎంతైనా అందం వాళ్ళ సొత్తనుకో" అని బుగ్గలు నొక్కింది .
మోహిత్ తల్లి వచ్చి " అక్కడే నిలబడ్డావేం? రా వంటింట్లోకి వెళ్దాం. కబుర్లు చెప్పుకుంటూ వంట చేసేద్దాం రా" చనువుగా చేయి పట్టుకుని తీసుకెళ్ళింది.
అమ్మయ్య అని తేలిగ్గా ఊపిరి తీసుకుంది విద్య. బెండకాయల కవరు విద్యకిచ్చి "సన్నగా తరుగు. మోహిత్ చెప్పాడా ? మా ఇంట్లో అందరూ వెజిటేరీయన్లు. మీరు నాన్ వెజ్ అనుకుంటాను. కానీ పర్లేదులే. పెళ్ళయ్యాక అంతా ఒక చోట ఉండంగా! నువ్వూ వాడూ ఏం వొండుకున్నా, తిన్నా పర్లేదు "
అందరూ చాలా కలుపుగోలుగా అనిపించారు . కాస్త ఊపిరాడినట్లయింది. అనుకున్నంత చిరాగ్గా ఏమీ లేదిక్కడ
మోహిత్ చెల్లెలు కాలేజీ నుంచి వస్తూనే "విద్యా? అబ్బ, ఎంత బతిమిలాడించుకున్నావో మా ఇంటికి రావడానికి" అని నిష్టూరమాడింది
రోజూ భోజనం గదిలోనే చేసే తాతా బామ్మలిద్దరూ ఆ రోజు టేబుల్ దగ్గరికి వచ్చారు కాబోయే మనవరాలితో కల్సి తినాలని.
" కోటప్ప కొండ తిరణాలంటే చాలు, ఎంత హడావుడో, ఎంతమంది వచ్చేవారో డాన్సులాడ్డానికి. అందరూ నాణ్యమైన వాళ్ళుంటారా ఏవిట్లే గానీ జూనియర్ శ్యామలని ఒకావిడ ఉండేది. దేవకన్యంటే నమ్మాలి మరి. కళ్ళకి కాటిక పెట్టుకోక పోయినా నల్లగానే ఉండేవి. ఎంత పెద్ద కళ్ళనీ !!
శ్యామల డాన్సు ఉందంటే మాత్రం నేనూ, మా అన్నయ్యా, ఫ్రెండ్సూ తప్పకుండా నాన్నగారికి తెలీకుండా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడివన్నీనిషేధించామంటారుగానీ అప్పుడు ఆ డాన్సులే ఆకర్షణ తిరణాలకి "
తాతయ్య జ్ఞాపకాలన్నీ తవ్వుతున్నాడు
విద్య మొహంలోకి నవ్వొచ్చి చేరింది.
"ఆ మనిషి అందమైనమనిషనుకున్నావు? ప్రభల మీద డాన్సు చెయ్యమంటే చేసేది కాదు. స్టేజీ మీద తప్ప చెయ్యననేది. ఏం జేస్తారు ? ఎంత డబ్బైనా ఇచ్చి తెచ్చే వాళ్లు . పల్చటి చీరగట్టి ఒళ్ళు కనిపించీ కనిపించకుండా అర్థ రాత్రి దాటాక ఆవిడ చేసే డాన్స్ కోసం బళ్ళు కట్టుకుని వినుకొండ, మార్కాపురం, దోర్నాల, అసలు శ్రీశైలం నించీ కూడా బళ్ళు కట్టుకునీ, ట్రాక్టర్ల మీదా వచ్చే వాళ్ళు జనం.
అందని జాంపండల్లే ఊరించి పారేసేది కుర్రోళ్ళందర్నీ
అయితే మాత్రం? ఒక్కరితో కూడా మాట్టాడేది కాదు. ఎక్కువ తక్కువ ఎవడూ అనడానికి లేదు. డాన్సు అయిపోగానే చీర బుజాల చుట్టూ కప్పేసుకుని వెళ్ళి పోయేది. స్ట్రిప్పింగ్ చెయ్యమంటే ఒకడిని చెప్పు తీసుకుని కొట్టిందట కూడా . పైసా తక్కువిచ్చినా వూరుకునేది కాదట. ఒక్క మనిషితోనే జీవితాంతం ఉందంటారు. అసలు ఎంతమందితో ఉంటే మనకేం గానీ గొప్ప ఆడది. నలభై వచ్చినా వన్నె తగ్గని మనిషి..."
"జూనియర్ శ్యామలే మా అమ్మమ్మ" విద్య గొంతు తో అందరూ సైలెంట్ గా ఒక్క క్షణం ఆగి "నిజవా?" అనరిచారు పెద్దగా
తాతయ్య తెల్లబోయాడు. వెంటనే తేరుకుని "ఏవిటే అమ్మడూ, నిజమా ?” మూర్ఛ పోయినంత పని చేశాడు
అందరూ విద్య చుట్టూ చేరారు. "ఎలా ఉండేది మీ అమ్మమ్మ""ఆమె డాన్స్ వీడియోలున్నాయా?"
"ఫొటోలున్నాయా?"
"మీ తాతయ్యని చూశావా?"
అన్నిటికీ విద్య నవ్వుతూ జవాబులు చెప్పింది.
తన పర్స్ లో ఉన్న అమ్మమ్మ ఫొటో చూపించింది తీసి
మేనత్త ఆ ఫొటో చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచింది.
"ఈవిడేనా? కాంచన మాల లా ఉంది. నలుగురి ముందూ డాన్స్ చేయగదగిన మనిషి కాదు . ఆవిడ పోలికే నువ్వు. ఆ జుట్టూ, కళ్ళూ.."
మోహిత్ నాన్న ఆ ఫొటో చూసి "ఎప్పటి నుంచో చూడాలని అనుకునే వాడిని. ఇప్పటికి చూశా నీ పుణ్యమా అని. మీ వాళ్లంతా ఒరవకట్ట మీద ఉండేవాళ్ళు కాదూ? మీ అమ్మమ్మ కూడా అక్కడే ఉండేదా?"
"అవునండీ, అక్కడే ఉండేది ఇల్లు. ఆ ఇల్లు తర్వాత అమ్మేశాం"
"మంచిదేలే. అక్కడ ఉండటం దేనికి ఇంకా? అక్కడ ఇంకా ఉన్నారా మీ వాళ్ళెవరైనా?"
"మాకెవరూ లేరు ! మా తాతయ్య వైపు గానీ అమ్మమ్మ వైపు గానీ. అందరూ అమ్మమ్మ సంపాదనతో సెటిల్ అయ్యాక ఆమెను దూరం పెట్టారు. అమ్మ ఒక్కతే కూతురు అమ్మకి "
"అయ్యో పాపం, పోన్లే! నువ్విలా మంచి ఇంట్లో పడ్డావని తెలిస్తే ఆవిడ పై నుంచే ఎంతో సంతోషిస్తుంది. వీడు చెప్పే ఉంటాడు , మా ఇంట్లో కులాలూ పాడూ ఏమీ లేవు. ఏముంది నాల్గు రోజుల జీవితం. ఇవన్నీ పెట్టుకుని క్షోభలు పడ్డం దేనికి"
" మీరంతా మంచోళ్ళు నిజంగా" నవ్వింది విద్య
"మంచీ చెడూ ఏముంది లేమ్మా. ఉన్నంతలో ఆనందంగా ఉండే ప్రయత్నం. పిల్లల ఇష్టాల్ని కాదని మనం బావుకునేదేముంది? " వాళ్ళమ్మ ఆప్యాయంగా విద్య జుట్టు సవరించింది
"మొత్తానికి జూనియర్ శ్యామల మనవరాలు మనింటి కోడలవుతుందని మీరు ఆవిడ డాన్సులు చూసినపుడు అనుకున్నారటండీ?" బామ్మ అంది
"ఆవిడ చెంగైనా కనపడితే చాలని అనుకోడమే తప్ప ఇంతదూరం ఆలోచిస్తామా? ఆ డాన్సులు చూడ్డానికెళ్ళామని తెలిస్తే తాట తీయరూ ఇంట్లో? అసలే కాలేజీ లో ఉన్నాను "
మళ్ళీ నవ్వులు
విద్య బయలు దేరుతుంటే మోహిత్ వాళ్ళమ్మ బొట్టు పెట్టి, కొత్త చీర, పూలు ఇచ్చింది. పూలు తీసుకుని చీరను మర్యాదగా తిరస్కరించింది విద్య.
"తీసుకునే రోజు వస్తుంది గా, అప్పుడు ఇద్దురు లెండి! నాకిట్టాంటియ్యి ఇష్టముండదు"
"మీ మావయ్యని, అమ్మనీ రమ్మను ఒక రోజు. సింపుల్ గా రిజిస్టర్ మారేజ్ పెట్టుకుందాం . మీ వాళ్ళూ మా వాళ్ళూ అంతే! తరవాత చెప్పొచ్చు లే అందరికీ . ఊరికే చుట్టాలందరితో హడావుడెందుకు?" అంది మేనత్త
"అమ్మకి చెప్తా"
"మోహిత్ అమెరికా వెళ్తున్నాడు కదూ ! వాడొచ్చే సరికి నెల రోజులవుతుంది. వాడు వూళ్ళో లేడు కదాని రాకుండా ఉండకు. ఈ ఇంటి పిల్లవి నువ్విక. వస్తూ పోతూ ఉండాలి సరేనా"
"సుబ్బరంగా వొస్తా "
బుగ్గలు సాగదీసి విద్య నుదుటి మీద ముద్దు పెట్టుకుందావిడ
"మొత్తానికి రంభ లాంటి పెళ్ళాన్ని తెచ్చావ్ రా "
మోహిత్ మొహం విప్పారి పోయింది
" యూ ఎస్ నుంచి రాగానే ఇక ఆలస్యం చెయ్యొద్దు, ఆగడం కష్టమే నిన్ను ఎదురుగా పెట్టుకుని"
ఎందుకో విద్య గొంతులో ఏదో అడ్డం పడి మింగుడు పడలేదు .
బహుశా దుఃఖమేమో !
***** ******* **********
ఫోన్లో వీడియో ప్లే అవుతోంది . ఎన్నోసారో లెక్కలేదు
"మోహిత్, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నానని నమ్ముతున్నా. నిన్ను ఒద్దనుకున్నాక బాధ ఉండదా అంటే ఉంటది. ఇంకా కొన్నాళ్ళు ఉంటది గూడా.
ఏ కోటప్ప కొండ మీద అమ్మమ్మ రికార్డింగ్ డాన్స్ చేసిందో, అక్కడికి మనిద్దరం కల్సి పెళ్ళయ్యాక వెళ్ళాలని చిన్న కోరిక ఉండేది.
నన్ను రిసీవ్ చేసుకున్న పద్దతీ, ఆ పలకరింపులూ.. ఇయ్యన్నీ నార్మల్ గా కనిపించేలా ఉన్నా , అవి నార్మల్ కాదు .
నేనొక "మంచి" ఇంట్లో పడ్డానని అమ్మమ్మ సంతోషించాలని మీ వోళ్ళనుకుంటున్నారు
అమ్మమ్మ ఎట్టాటిదో , ఎక్కడెక్కడ డాన్స్ చేసిందో అవన్నీ ఆమె కళ గా కాక, నిబద్ధత గా కాక, కనీసం వృత్తిగా కాక, గుణ గణాల గురించి మాట్టాడారు కనీసం నేనున్నానని చూడకుండా.
"ఎంతైనా అందం "వాళ్ళ" సొత్తే" ఈ మాట మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వదనే భరోసా తో అక్కడ అడుగు ఎట్లా పెడతా నేను?
అమ్మమ్మ అందాన్ని పొగుడుతూనే "ఎంత మందితోనో" ఉండే ఉంటుందని తీర్మానించారు.
"నలుగురి ముందూ డాన్స్ చెయ్యదగ్గ మనిషి కాదట
నలుగురి ముందు ఆవిడ సరదాకి డాన్స్ చెయ్యలేదు మోహిత్.
బతకడానికి చేసింది. తన మీదే ఆధారపడ్డ నలుగురి కోసం చేసింది
వొరవకట్ట మీద డాన్స్ పార్టీల కుటుంబాలు ఉండటం నిజమే. దాన్ని "మీ వాళ్ళంతా అక్కడేగా ఉంటారు " అని నాకు గుర్తు చెయ్యక పోయినా పర్లేదుగా ?
అమ్మమ్మ జీవితం గురించి చెప్పినపుడు నువ్వు నా కంటే దుఖ పడ్డావు. ఆమె బతికి ఉంటే పువ్వుల్లో పెట్టి చూసుకునే వాళ్ళమని మనస్ఫూర్తిగా నువ్వున్నపుడు నాకు నిజంగా ఏడుపొచ్చింది.
కానీ నువ్వేమన్నావ్ ? నా వైపు నుంచి అభ్యంతరం ఉండటానికేముందన్నావ్ . సరే పొరపాటుగా అనేశావనుకుందాం
నువ్వు , నీ ఫామిలీ కూడా నన్ను జూనియర్ శ్యామల మనవరాలుగా సగర్వంగా ఆహ్వానించాలి.
అలా కాక పోయినా నన్ను కేవలం "విద్య" గా మీ ఇంట్లోకి పిలవాలి
కానీ వాళ్ళు నన్ను "రికార్డింగ్ డాన్సర్" ఫామిలీ నుంచి వచ్చిన దానిగా మాత్రమే ఆహ్వానిస్తున్నారు. అదీ..మోహిత్ నన్ను కావాలనుకున్నాడు గాబట్టి.
పెళ్ళయ్యాక నా లైఫ్ వాళ్ళ మధ్య ఎలా ఉంటుందో నాకు నిన్ననే అర్థమైంది.
వాళ్ళు చూపించే ప్రేమ, దయ, పెద్ద మనసు..ఇవేవీ నాకొద్దు.
నేనేదో మురుగు గుంటలో ఉన్నట్టూ , నాకు నువ్వు కొత్త జీవితం ఇస్తున్నట్టూ …ఇదే అక్కడ ఆ గది లో తిరిగిన గాలి అభిప్రాయం కూడా
నాకు నాతో మామూలుగా ఉండేవాళ్ళు కావాలి. అందుకే చెప్తున్నా,
మీ సంబంధం నాకు నచ్చలేదు.
నా పెళ్ళి గురించి ఇప్పుడే నేను ఆలోచించాలి అనుకోవటల్లేదు
మా మూర్తి బావ తెలుసుగా ?. నేను వాడిని చేసుకోవాలని మూర్తి కీ, అత్తయ్యకీ కూడా ఉంది
వాళ్ళింట్లో నన్నెవరూ నన్నెవరూ వింతగా చూడరు.
నా ఫామిలీ హిస్టరీ గురించి ప్రశ్నలుం డవు.
ఆశ్చర్యార్థకాలుండవు.
జాలి ఉండదు, సానుభూతి ఉండదు
నన్ను ఉద్ధరించిన ఫీలింగ్ ఎవరికీ ఉండదు.
అత్తయ్య మావయ్య అందరూ నన్ను చిన్నప్పటి నుంచీ ఎరుగుదురు.
మూర్తి గురించి కూడా నేనింకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు
నిన్ను వదులుకోవడం పెద్ద నిర్ణయమే!
కానీ నీ కోసం వాళ్ళను ఎదుర్కొంటూ జీవించలేను
నాకు జీవితమంటే ప్రేమ, గౌరవం, ఇష్టం.
బతకాలన్న కాంక్ష బలమైనది నాలో. సంతోషంగా బతకాలని ..
అమ్మ మాత్రం బాధపడి ..... "
పాజ్ చేశాడు వీడియో ని . కళ్ళలో వూరబోతున్న నీళ్లను తిరస్కరించే ప్రయత్నం విఫలమవుతోంది
"ఇంకా నయం చేసుకున్నాం కాదు. చేసుకున్నాక వదిలేసి పోతే తలెత్తుకోలేక పోయే వాళ్లం.
ఏదో వీడు ఇష్టపడ్డాడు కదా, దానికీ ఒక మంచి బతుకు ఉంటుంది లే అని ఒప్పుకుంటే “
అత్తయ్య మాటలు వినపడుతున్నాయి ఇంట్లోంచి
**************************************
----సుజాత వేల్పూరి
(అక్టోబర్ 2019 సారంగ లో ప్రచురితం)
Pic; Google