June 21, 2008

గూర్ఖా..ఎండ్లూరి సుధాకర్

కాలేజీ రోజుల్లో రాత్రి రెండు గంటలకు (ఒక్క నిమిషం అటూ ఇటూ కాకుండా) మా వీధిలోకి గూర్ఖా వచ్చేవాడు! దొంగలు తిరుగుతున్నారు, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్న కాలంలో రెండు గంటల అర్థరాత్రి వేళ గేటు మీద గూర్ఖా కొట్టిన కర్ర చప్పుడు విన్నాక నిశ్చింతగా నిద్ర పట్టేది. అలాంటి గూర్ఖాకి నెల మొదటివారంలో రెండేసి రూపాయలు ఇవ్వడానికి కూడా పది సార్లు తిప్పేవాళ్ళని చూస్తే నాకైతే చంపేయాలని ఉండేది. ఒక ఆదివారం నాటి ఉదయం దినపత్రికలో శ్రీ ఎండ్లూరి సుధాకర్ రాసిన గూర్ఖా కవిత చదివి మనసు కరిగి కన్నీరై ప్రవహించింది. ఈ కవిత కనీసం వారం రోజులు నన్ను వేదనకు గురి చేసింది. అందుకే జాగ్రత్తగా కత్తిరించి దాచుకున్నాను. మీ అందరితో పంచుకోవాలని....ఇక్కడ..!


అతడు రాత్రి సూర్యుడు
కళ్ల బొరియల్లోనిదుర చాప మడత పెట్టి
దొంగ చీకటిని వెంటాడుతుంటాడు
వీధి మలుపులోంచే అతడి పద ధ్వనుల్నీ, వాసనల్నీ పసిగట్టి
గల్లీ కుక్కలు గౌరవ సూచకంగా తోకలూపుతాయి
వేగుచుక్క పొడిచిందనడానికి
బీడీ ముక్క విశ్రాంతిగా పొగలు వదులుతూ ఉంటుంది
అతడు ఆరు రుతువుల చెలికాడు
కాలం అతడి చేతిలో టార్చి లైట్
భార్య తన ప్రేమంతాచేతివేళ్లలోకి
ఊలు సూదుల్లోకి నింపిఅల్లిన స్వెట్టెర్
వెచ్చని జ్ఞాపకమై హత్తుకుపోతుంది
ప్రతి నడిరేయి
ప్రతి తెల్లవారుజామున
వేల వేల ఆలింగనాలూ,చుంబనాలూ
వేడి నిట్టూర్పులూ, వేడికోళ్ళూ,
రహస్య రసోద్రేకాల మీదుగా
నిర్లిప్త పరివ్రాజకుడై నడిచిపోతుంటాడు
అతడికి సెలవులుండవేమో
అతడి అపరిపక్వ కోర్కెలు పండవేమో
అర్థ రాత్రి భార్యా బిడ్డల్ని విడిచి
ప్రతి రాత్రీ గౌతమ బుద్ధుడవుతాడు
ఎక్కడివాడో తెలియదు గానీమనకత్యంత ఆప్తుడనిపిస్తాడు
తలపై కత్తుల కరచాలనం గుర్తు లాంటి ఉన్ని టోపీ
బాగా మాసిన ఖాకీ దుస్తులు
గొప్ప గౌరవం పుట్టిస్తూ గంభీరంగా కనపడతాడు
మంత్రదండం లాంటి అతడి చేతికర్ర చప్పుడు
మన భయోద్వేగాన్ని తగ్గించే మందు
మధ్య రాత్రులు మన గేటు తట్టి
నిద్రా భంగంలోనూకొండంత ధైర్యాన్ని కరపత్రంలో పంచి పోతాడు
ఏ జ్వరమో వచ్చి అతడు రాని రోజు
చిక్కని రాత్రి కళ్ళు చీకటి కన్నీళ్ళు రాలుస్తాయి
అతడి జీతభత్యాల గురించి ఎవరికీ తెలియదు
అతడి జీవిత సత్యాల గురించి ఎవరికీ పట్టదు
ఒక్క తన పెంకుటిల్లు తప్ప
అందరిళ్ళకూ పహరా కాస్తాడు
మనకు జీతం వచ్చిన రోజు నుంచీ
అతడు తన జీతం తాడు పేనుకుంటూ పోతాడు
ఒక్క రూపాయి బిళ్ళో, రెండు రూపాయల కాయితమో చాలు
అవనత శిరస్కుడై'అచ్చా సాబ్' అంటూ వినమ్రంగా నిష్క్రమిస్తూ ఉంటే
అతడి జేబు బావి లోంచి
చిల్లర గొంతులు బాధగా మూల్గుతాయి...

12 comments:

Rajendra Devarapalli said...

శభాష్ అది కవి హృదయమంటే!దాన్ని బాగా పట్టారు మీరు.చాలా మంచి కవిత చదివించారు సుజాత గారు ధన్యవాదాలు.ఒక్కసారిగా దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన పోస్ట్ మాన్ కవిత జ్ఞప్తికి వచ్చింది.ఇవ్వాళ రకరకాల సెక్యూరిటీ సర్వీసులొచ్చి గూర్ఖాల కడుపులు కొట్టాయి,కధాచిత్తుగా ఎక్కడో తప్ప ఇవ్వాళ బహదూర్ లు కనిపించంటం లేదు,బహుదూరులయ్యారేమొ!?

Bolloju Baba said...

ఒక మంచి కవితకు ఒళ్లెందుకు పులకరిస్తుంది?
ఒక మంచి కవితను ఎందుకు కటింగ్ చేసి దాచుకోబుద్ది వేస్తుంది?
ఒక మంచి కవిత ఓ జీవిత కాలం పాటు హాంటింగ్ గా ఎందుకుంటుంది?
ఒక పేజీ కవితలో అనంత విశ్వాన్నీ కవెలా భంధించగలుగుతాడూ?
ఒక వాక్యంలో ఉండే నాలుగుపదాల్లో, నాలుగు దిక్కుల్నీ కవెలా పాత గలుగుతాడు?
కవి వాడిన ఒక పదాన్ని తీసి మరొకటి పెట్టటానికి, సమానార్ధకం ఈ ప్రపంచం లో ఎందుకు దొరకదు?

ఏమో నాదగ్గరైతె సమాధానాలు లేవు. మీదగ్గరేమైనా ఉన్నాయా?

ధన్యవాదాలు సుజాత గారు.
బొల్లోజు బాబా

Kathi Mahesh Kumar said...

చాలా మంచి కవితని పరిచయం చేసారు.
"అర్థ రాత్రి భార్యా బిడ్డల్ని విడిచి
ప్రతి రాత్రీ గౌతమ బుద్ధుడవుతాడు"...అబ్బ ఏంచెప్పాడు కవి అనిపించింది. అసలు కవితలూ,కథలూ రాసేవాళ్ళంటే ఆసూయేసేస్తోంది ఈ మధ్య.

ఒక పక్క నిషిగంధ,పుర్ణిమ,కల్హర లు కథలతొ మనసు పిండేస్తోంటే, మరోవైపు బాబాగారు ఈ మధ్య ఆ విలేఖరి చెంప పగలగొట్టి కవితాగ్నిని రగిలించారు. ఇప్పుడు...ఈ గూర్ఖా నాకు నిద్ర లేకుండా చేస్తాడేమో!

Bolloju Baba said...

భావా ఆవేశం ఇంకా తగ్గలేదు. అందుకె ఇలా మళ్లీ...........

ఒక అద్బుతమైన కవితను ప్రదర్శనకు పెట్టారు.
ఎన్ని మంచి పదచిత్రాలున్నాయండీ ఈ కవితలో
ప్రతీ వాక్యమూ ఒక చక్కటి చిత్రమే.

దొంగ చీకటి: చీకట్లో దొంగని వెంటాడటం అనే అర్ధం కూదాలేదూ?

గల్లీ కుక్కల గౌరవం: అవి చేసే పని కూడా ఇదే అన్న సూచన:

వేగుచుక్క పొడిచిన తరువాతే విశ్రాంతి దొరకటం.

ఆరురుతువుల చెలికాడు: ఎండలో, వానలో, ఎముకలుకొరికే చలిలో, మంచులో, వెన్నెలలో అతను డ్యూటీ చెయ్యాలిగా.
వేల వేల ఆలింగనాలూ........... "etc తను కాపలాకాస్తూంటే మనం చేసే పనులివి.
గొప్ప గౌరవం పుట్టిస్తూ గంభీరంగా కనపడటం వంటి పదాల గాంభీర్యం చూసారా?
అతను రాని రోజు చీకటి కన్నీరు కార్చటం ఎంతటి ఆర్ధ్రత.

ఈ కవితమొత్తంలో నాకు నచ్చిన గొప్ప ఇమేజెస్:
1. భార్య తన ప్రేమంతాచేతివేళ్లలోకి
ఊలు సూదుల్లోకి నింపిఅల్లిన స్వెట్టెర్
వెచ్చని జ్ఞాపకమై హత్తుకుపోతుంది
2.మనకు జీతం వచ్చిన రోజు నుంచీ
అతడు తన జీతం తాడు పేనుకుంటూ పోతాడు
ఇంటింటికీ తిరిగి రూపాయి , రూపాయి పేనుకొంటూ తన జీతం తాడుని తయారుచేసుకోవటం అని చెప్పటం,
డ్యూటీ చెయ్యటం ఒకేత్తు, జీతం కోసం అంతకు మించి శ్రమించటం ఒకేత్తు అని చెప్పటం కాదూ?

ఎండ్లూరి సుధాకర్ గారు నా అభిమాన కవి. ఆయన కవితను మళ్లీ ఇలా చదివె అవకాశం ఇచ్చిన సుజాత గారికి ధన్యవాదాలు.
బొల్లోజు బాబా

Kathi Mahesh Kumar said...

బాబా గారు & సుజాత గారూ,
ఇలాంటి అవేశకావేశాల్ని బ్లాగుల్లో చూసి, చాటుగా నేనూ ఈ రోజొక కవితని తెగించేసా...అదీ ‘బుసాని పృధ్వీరాకు వర్మ’ గారి చిత్రాన్ని చూస్తూ... ఇక్కడ http://pruthviart.blogspot.com/2008/06/blog-post_18.html

ఆ కవితలో అంత లోతులు లేవుగానీ...కాస్త చిన్న గోతులైనా తియ్యడం లో సఫలమయ్యానేమో, కాస్త చూసి చెప్పండి.

సుజాత వేల్పూరి said...

రాజేంద్ర గారు,
నాకెందుకో జీవితపు లోతుల్ని స్పృశించకపోతే అది కవిత్వమే కాదనిపిస్తుంది. అందుకే నేను ఎండ్లూరి, తిలక్,(పోస్ట్ మాన్,సైనికుడి ఉత్తరం కూడా ఇలాగే నన్ను వెంటాడాయి), శివారెడ్డి లాంటి కవుల్ని ప్రేమిస్తాను. ఈ మధ్య బొల్లోజు బాబా గారు బాగా రాస్తున్నారు. 'రక రకాలు సెక్యూరిటీ కంపెనీలొచ్చ్చి గూర్ఖాల పొట్ట కొట్టాయి '! ఎంత నిజం!
కనీ ఇప్పటికీ మా వూరు వెళ్ళినపుడు రాత్రైతే వచ్చే గూర్ఖా కోసం నేని నిద్ర కాచి మరీ ఎదురు చూస్తాను.

బాబా గారు,
నేను కూడా నాకు నచ్చిన పాదాలనన్నింటినీ విశ్లేషిద్దామనుకున్నాను,! కానీ కవిత అంతా పోస్ట్ చేసాక(మళ్ళీ చదివాను కాబట్టి) హృదయం బరువెక్కి ఇక ఏమీ రాయలేకపోయాను. ఎలాగూ మీరు రాసింది చదువుతానని తెలుసు

ముఖ్యంగా
ఆరు రుతువుల చెలికాడు

వేల వేల ఆలింగనాల మీదుగా
నిర్లిప్త పరివ్రాజకుడై నడిచిపోతాడు

తన పెంకుటిల్లు తప్ప
అందరిళ్లకూ పహరా కాస్తాడు

మనకు జీతం వచ్చిన రోజు నుంచీ....మొదలైనవి ఎండ్లూరి కి మాత్రమే సాధ్యమేమో!

ఈ మధ్య ఆయన అసలు రాయడం లేదు! కొన్నాళ్ల క్రితం వాళ్ళ అమ్మాయిని హాస్టల్ లో చేరిచిన సందర్భంగా 'లేడీస్ హాస్టల్ ' అనే కవిత (నవ్య లో అనుకుంటా) రాశారు.

మహేష్,
'అర్థ రాత్రి భార్యా బిడ్డల్ని విడిచి.." గుండె ఝల్లుమంటుంది కదూ! కదిలించేదే కవిత్వమని నా అభిప్రాయం!

MURALI said...

thanks for prsenting a nice piece of work

MURALI said...

naa prayatnanni kuda oka kanta chusi pettandi http://muralidharnamala.wordpress.com/

Unknown said...

sujatha gaaru chala manchi realistic kavitha post chesaaru ...danyavadamulu :)

pruthviraj said...

సుజాత గారు నమస్కారము. గూర్ఖా పై మీ మనసులొని మాట చాలా బాగా చెప్పారు.ఇలా ఇంప్రెస్ ఐన ప్రతిదానిని వ్యక్తీకరించగలిగితే రాసిన కవితలన్నీ చాలా బావుంటాయి. హృదయానికి హత్తుక పోతాయి అవును కదూ..

Unknown said...

hai sir iam Radhakrishna nenu bangaloure university lo parisodhna vidhyarti nenu mi rachanalapai research chestunna mi kavitalo manavathavadanni bahirkrutham cheyadam naparishodanalo mukyaamsam. danigurunchi kasta samacharanni pampandi. plz send that matter dis mail (bujjivarapvg@gmail.com)

Unknown said...

sir mi rachanalo "chakana ane word ni vadarukada a padam mida nenu chala reserch chesi andari abinandanalu pondanu a padanni andari munduku techinnanduku tnx sir

Post a Comment