July 27, 2008

అల్లరా? అంత అదృష్టం కూడానా!

నా చిన్నప్పుడు స్కూళ్లలో (కనీసం నేను చదివిన స్కూళ్ళలో) ఒక రూలుండేది. "బాగా చదివే పిల్లలు అల్లరి చేయరాదు! చదువు రాని మొద్దులే అల్లరిలో ఫస్టుంటారు" అని!
అందువల్ల ఏడో క్లాసు వరకు చదివిన స్కూల్లో అల్లరికి అవకాశం దొరక్క ఊరుకున్నాను. పైగా ఆ స్కూలు మా ఇంటికి దగ్గరే! అందునా మా నానగారు మా స్కూలు ముందు నించే ఆఫీసుకు వెళ్ళేవారు. ఏమైనా అల్లరి చేసామంటే, ప్రభావతీ టాన్యా టీచర్ మా నాన గార్ని దార్లోనే ఆపి నివేదిక సమర్పించేసేది.
దానితో మా చిన్నన్నయ్యకి చేంతాడుతో వివాహం జరిగేది మంత్రోచ్చారణ  సహితంగా! వాతలు తేలేవి వీపుమీద! అవి చూసాక కూడా అల్లరి చేయడానికి మనకి గుండె ఇంకా మిగిలుంటేనా?

"నాన గారండోయ్, ఇంకెప్పుడూ అల్లా చెయ్యనండోయ్, నానగారండోయ్" అని వాడు బావి గట్టు చుట్టు పరిగెత్తడం ఇప్పుడు గుర్తొస్తే నాకు నవ్వాగదు.

హైస్కూల్లో బాగా అల్లరి చేయొచ్చని సర్ది చెప్పుకుని అల్లా కాలం గడిపేసాను.

అమ్మాయిల హై స్కూల్లో నన్ను చేర్చడానికి తీసుకెళ్ళినపుడు మా నాన్నగారిని చూస్తూనే హెడ్ మిస్ట్రెస్ వసుంధరా దేవి మేడం "రండి రావు గారూ, మీ మూడో అమ్మాయా? ఈవిడ కూడా 'పాడు ' పిల్లేనా " అని గౌరవంగా ఆహ్వానించింది. నాన్నగారు సంతోషించి.."అవునండీ, ఈ పాప సంగీతం కూడా ఫలానా వారి దగ్గర నేర్చుకుంటోంది, ఇష్టం వచ్చినట్టు వాడేసుకోండి దీని టాలెంటుని " అని భరోసా ఇచ్చేసారు.

మేడం గారు అదే స్కూల్లో చదివిన మా అక్కలిద్దర్నీ పొగడ్డం మొదలు పెట్టారు.
"ఏమి వినయం, ఎంత తెలివి, మర్యాదా..మీ ఇద్దరక్కలూ ఎంత మంచి పేరు సంపాదించారో తెలుసా? ఈ స్కూలు కోసం ఎన్నెన్ని బహుమతులు సంపాదించారో తెలుసా...? ఎంత నెమ్మదైన పిల్లలో తెలుసా?...తెలుసా తెలుసా తెలుసా..." ఇదే సరిపోయింది ఒక గంట.

"మీ మొహాలు ఈడ్చా, మిమ్మల్ని తగలెయ్యా,మీ దుంపలు తెగా " అని మా అక్కల్ని మనసులోనే శతమానం పెట్టాను.

"నానగారూ, ఈ స్కూలొద్దండీ" అనడానికి ఎంత ప్రిపేరైనా నోట్లోంచి మాట బైటికి రానిదే! అలా ఆ స్కూలుకి షీల్డులు, కప్పులూ సంపాదించే ఆస్థాన గాయనిగా సెటిలవ్వాల్సి వచ్చింది. అల్లరి చేయడానికి అవకాశం సృష్టించుకోలేక ఊరుకున్నాను.

ఈ లోపుగా NCC లో చేరి తురాయి టోపీ పెట్టుకుని కవాతు చేయడం, స్కౌట్స్ అండ్ గైడ్స్ లో చేరి ముడులు వేయడం నేర్చుకున్నాను. దానితో "మంచి అమ్మాయి"గా పేరొచ్చింది. పాడు పేరు! అల్లరి చేస్తూ తిరిగే పిల్లల్ని చూస్తూ మనసులో ఎంత కుళ్ళిపోయానో, కుమిలిపోయానో ఎవరికి తెలుసు?

పదో క్లాసులో "ఇంకెలాగూ వెళ్ళీపోతాం గదా, ఈ ఏడాది చించెయ్యాలి, బాగా గోల గోల చేసెయ్యాలి"అనుకుంటుండగా ఆ మార్గాన్ని శాశ్వతంగా మూసేస్తూ నన్ను SPL చేసేసారు.జెండా ఎగరేయడానికొచ్చిన మునిసిపల్ కమిషనర్ కీ, చైర్మన్ కీ సెల్యూట్లు చేయడమే నా పనైపోయింది.

కట్ చేస్తే
కాలేజీ....!

ఇక్కడ నా ఇంటరెస్ట్ ప్రకారమే నేను ఒక విద్యార్థి సంఘంలో చేరాను. సరి! బాధ్యతాయుతమైన విద్యార్థి సంఘ మెంబరుగా ఉన్నవాళ్ళు అల్లరి చేసేవాళ్ల పని పట్టాలే గానీ స్వయంగా వారల్లరి చేయలేరు అనే చేదు నిజం తెలిసే సరికి ఆలస్యమైపోయింది.పైగా కాలేజీలో నన్ను ఎవరూ కనీసం కామెంట్లు కూడా చేయకుండా మా అన్నయ్య ప్రతినిధులు మారు వేషాల్లో తిరుగుతుండేవాళ్ళు.

ఈ రెండు కారణాలవల్లనే అయిదేళ్లలో ఒక్క ప్రేమలేఖ కూడా అందుకోలేకపోయానని చెప్పుకోడానికి సిగ్గుపడుతున్నాను.

డిగ్రీ ఫైనలియర్ లోకొచ్చాక,మా స్టూడెంట్స్ అసోసియేషన్ వాళ్ళే "ఈ సారి freshers Day కి కొంచెం హడావిడి చేద్దాం!కొత్తవాళ్లని కొంచెం అల్లరి పెడదాం!సరదాగా" అన్నారు.

ఉత్సాహం పొంగుకొచ్చి "వాకే" అనేసాను.
"ఎలా చేయాలో, ఏం చేయాలో ఇక్కడ మాట్లాడుకోవద్దు, గోడలకు చెవులుంటాయి" అన్నారు.
"మా ఇంటికెళదాం! మా అన్నయ్య కూడా ఊళ్లో లేడు" అన్నాను ఊరుకోకుండా!

మా ఇంటికెళ్ళి కొబ్బరి చెట్టుకింద కుర్చీలేసుకుని అందరం చర్చిస్తుండగా ఏదో పరిచితమైన శబ్దం విని ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగానే అన్నయ్య స్కూటర్ స్టాండేసి లోపలికొచ్చాడు.

నా పక్కన ఉన్న ఐదుగురూ స్ప్రింగుల్లాగా లేచి నిలబడి "నమస్తే అన్నయ్యా" అని ప్రమాదం లేని వరస కలిపారు ఎందుకైనా మంచిదని.

వాడు చిర్నవ్వి లోపలికెళ్లాడు.

"అమ్మలూ" అని లోపలినుంచి పిలుపు రాకముందే నేనే వెళ్లాను లేచి.

"ఎవరే వాళ్ళు, జులాయి వెధవల్లా ఉన్నారు?" అన్నాడు.

నిజానికి అన్నయ్యంటే వాళ్లకి హీరో వర్షిప్పు!

అందుకే వాళ్ల గుణగణాల్ని వర్ణిద్దామని షణ్ముఖి ఆంజనేయరాజు కి మనసులో నమస్కరించి "పతితులు కారు, నీ యెడల భక్తులూ" అని రాయబారం పద్యం అందుకోబోయాను గానీ శ్రుతి చాలక విరమించాను.
కానీ దాన్నే గద్య రూపంలో చెప్పాను.

"అన్నయ్యా, వాళ్ళు చెడ్డవాళ్ళేం కాదు, నువ్వంటే భలే గౌరవం " (పతితులు కారు, నీ యెడల భక్తులు)
"బాగా చదువుతారు కూడా!(శుంఠలు కారు, విద్యలన్ చతురులు)
"పాపం,మంచివాళ్ళు(మంచివారు...)

తర్వాత లైను నాకు గుర్తు లేదు.

"మొన్న మంగతాయారు ని ఈవ్ టీజింగ్ చేసిన సుబ్బారాయుడు గ్రూపుని చావగొట్టింది వీళ్ళే" (రణ శూరులు..పాండవులు)

వాడు ఈ గద్యాన్నంతా ఎగర గొట్టి "నేను స్నానం చేసి వచ్చేలోపుగా మంచిగా వాళ్లను పంపించెయ్" అని నిష్క్రమించాడు.
ఫ్రెషెర్స్ డే మామూలుగానే జరిగింది అల్లరీ పాడూ లేకుండా.
* * *

ఆ తర్వాత ఫిబ్రవరిలో శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి రోజున స్నేహితులతో కలసి కోటప్పకొండకి వెళ్ళాం! పండుగ రోజైతే చుట్టు పక్కల పల్లెటూర్లనుంచి ప్రభలూ, ట్రాక్టర్లు కట్టుకుని జనం ఎక్కువగా వస్తారని మాకు ఏకాదశి రోజే పర్మిషన్!

మాలో మా జూనియర్లు కూడా ఉన్నారు.
సగం మెట్లెక్కాక(అప్పుడు ఘాట్ రోడ్డు లేదు) ఏదో బయటి ఊరునించి వచ్చిన ఒక ఏడుగురు అబ్బాయిల కాందిశీకుల బృందం కనపడింది. దాంతో మా జూనియర్ పిల్లకాయలు వాళ్లని ఏడిపించడం మొదలుపెట్టారు.
మేము, అనగా సీనియర్లం వారిద్దామనుకుని కూడా "పోన్లెద్దూ, పిల్లలు సరదా పడుతున్నారు " అనే ఫాల్స్ వంకతో, వాళ్లని కళ్ళతోనే ప్రోత్సహించాము.

కాందిశీకులు కాసేపు భరించి, సహనం చచ్చి ,ఎదురు తిరిగి మాటకు మాటా బదులివ్వడం మొదలు పెట్టారు.

ఇంతలో ఒక మీసాల పల్లెటూరి పెద్దాయన మా మధ్యలోకొచ్చి..

"ఏందబ్బాయ్ మీరు, సదూకోలా? ఆడకూతుళ్ళు కనపడితే సాలంట్రా? ఇట్టయితే ఎట్ట? ఇదాకట్నించీ సూత్తన్నా,వొరె వొరె , ఏమి సతాయిత్తన్నారూ? మిమ్మల్ని పొయిలో బెట్టా!ఇంగా ఈణ్ణే ఉన్నారంటే చెమడాలెక్కదీస్తా" అని పాపం వాళ్లని తిట్టి తరిమేసాడు వాళ్ళు చెప్పేది వినిపించుకోకుండా!

"ఏందమ్మాయ్ మీరు గూడా? పెద్దోళ్ళేరి? కిందనే ఉండారా ? లేగదూడల్లాగా పరిగెత్తుకొస్తే ఇగో, ఇట్టనే జరిగేది? ఈడనే కూకోని, అమ్మోళ్ళు వొచ్చేదాకా ఆగి,కలిసి ఎక్కండి. ఒంటిగా ఒద్దు తల్లా! దొంగెదవలుంటారు, సీతాకోకచిలకల్లాగా చల్లగా నవ్వుతున్నారే,నవ్వుతానే ఉండాలమ్మా మీరు?" అనేసి గబగబా కొండెక్కడానికి ముందుకెళ్ళిపోయాడు. ఆ దెబ్బతో అల్లరి బంద్!

ఇక ఇన్నేళ్ళు గడిచాక ఇప్పుడు అల్లరి ఏం చేస్తాం? మా పాపతో పాటు ఇంటిదగ్గర పిల్లల్ని పోగేసి చల్లని సాయంత్రాలు ఇసుక కుప్పలమీద పిచ్చుక గూళ్ళు కడుతూ,బంక మట్టి తో బొమ్మలు చేస్తూ...వాళ్ల కేరింతల్లో పాలు పంచుకోవడమే ఇప్పుడు నేను చేసే అల్లరి!

(ఇవాళ పని మీద గుంటూరు వచ్చి, ఇక్కడన్నా నెట్టు స్పీడుగా ఉంటుందేమో ననే ఆశతో శంకర్ విలాస్ రోడ్లో ఓవర్ బ్రిడ్జి (దీన్ని ఫ్లై ఓవర్ అనొచ్చని నాకు హైదరాబాదు వచ్చాక తెల్సింది)దాటాక ఉన్న ఒక ఇంటర్నెట్ కెఫేకి వచ్చాను. చూస్తే కూడలిలో నేను చదవాల్సినవి కోటి టపాలున్నాయి! హారి భగవంతుడా...ఎంతటి లీలలయ్యా నీవి!
ఇది చాలదన్నట్టు జ్యోతిగారి బ్లాగులో ఈ పక్షం విషయం అంటూ "మీరెప్పుడైనా అల్లరి చేసారా"(మీ మొహానికి అదొక్కటే తక్కువ) అనే ఇన్ విజిబుల్ టాగుతో కనపడింది.

సరే, రేపటి వరకూ గుంటూర్లోనే గా ఉంటాను, కాసేపు టైము తీసుకుని రాసేద్దాం, మళ్ళి హైదరాబాదు వెళ్ళేటపటికి ఎప్పుడవుతుందో అని ఇన్ స్టంట్ గా రాసేసా ఈ టపా! తప్పులు మీరే లెక్కెట్టాలి!

20 comments:

Purnima said...

Instant coffee లా అదిరిపోయిందీ Instant టపా!! చాలా బాగుంది.

అయినా లాస్ట్ బెంచీలో చేస్తేనే అల్లరి ఎందుకంటారో?? మొదటి బెంచిలో కూర్చిని వేస్తేనే.. అల్లరికూడా ఒక కొత్త అందం. మూడు వారాల వరకూ మీ నుండి టపా ఆశించకూడదు అని ఎంతెలా మనసును ఊరుకోబెడుతున్నా.. ఊ..హు.. వినడం లేదు!! అర్జెంటుగా అల్లరి మీద టపాయించిన్నందుకు ధన్యవాదాలు!!

చైతన్య.ఎస్ said...

ఇన్ స్టంట్ గా అయిన బాగుంది. మీరు అల్లరి చెయ్యడానికి ఎంతగా తాపత్రయపడ్డారో అర్థం అయ్యింది. భవిష్యత్తులో మీఅమ్మాయి తో కలిసి రెచ్చిపోండి. .....

cbrao said...

గుంటూర్ నెట్ సెంటర్లలో ఉండే సమస్యేమంటే చాలా చోట్ల Win Xp వాడక పోవటం వలన మన కు వచ్చే ఉత్తరాలలో తెలుగు బదులు పెట్టెలు కనిపిస్తాయి. పైగా నిదానమైన ఇంటర్నెట్. ఇలాంటి పరిస్తితులలో కూడా ఇంత చక్కటి టపా రాసినందులకు అభినందనలు. అల్లరి చెయ్యక పోతేనేమి, అల్లరి చేసే వారిని చూసి సంతోషించారుగా. దీపావళికి నేను టపాకాయలు కాల్చక పోయినా, చుట్టూ వున్న వారు కాలుస్తుంటే చూసి ఆనందిస్తా. పిల్లల అల్లరిలో ఆనందం పొందలేమా? మనమే అల్లరి చెయ్యాలా?

GIREESH K. said...

మీ అల్లరోపాఖ్యానం చాలా బాగుందండీ...

Kathi Mahesh Kumar said...

మొత్తానికి ఇప్పుడైనా మీ కోరిక తీరిందా? టపా మాత్రం అల్లరే అల్లరి.

Saraswathi Kumar said...

సుజాతా గారూ!

మీ శైలి అద్భుతం.సాధారణమైన విషయాన్ని మీరు అసాధారణమైన కథనంతో నడిపిస్తారు.అలాగని మీరు చెప్పే విషయాలు సాధారణమని కూడా అనుకోకూడదు.ఉదాహరణకు ఈ టపాలోని విషయాన్నే తీసుకోండి. 'సైకాలజీ'ని వివరించారు.హాస్యాన్ని రంగరించారు.కాన్వెంట్ సంగతులు..స్కూలు కబుర్లు..కాలేజీ సరదాలు..అన్నింటినీ పంచుకున్నారు.పల్నాటి యాసను రాసారు. ఓ ఇంటిలో ఓ తండ్రిని,ఓ అన్నను కళ్ళకు కట్టారు. చల్లని సాయంత్రాలు..పిచ్చుకగూళ్ళు..ఇసుక కుప్పలు..ఓహ్..! సంగీతం విన్నట్లుగా ఉన్నది. కేవలం కూడలిలో ఒక టపాను చూడటం తోడనే ఇన్ని ఆలోచనలను మాకందివ్వగలిగారంటే..ఈ అదృష్టం మాకు మాత్రమే పరిమితమవ్వ కూడదు.మీ రచనలు పుస్తకాలుగానో లేక దినపత్రికలలోనో ప్రచురితమై విస్తృతమైన పాఠకలోకాన్ని అలరించాలని కోరుకుంటున్నాను.

krishna rao jallipalli said...

శంకర్ విలాస్ లో కమ్మటి కాఫీ తాగినంత బాగుంది మీ టపా. నిజం... మంచి అబ్బాయి.. మంచి అమ్మాయి అని అనిపించు కొన్న వారెవరికి అల్లరి చేసే అద్రుష్టం లేదు. కలలో తప్ప.

Subba said...

సుజాత గారు,
చాల బాగా రాసారండి. దురద్రుష్టం నాది ఒక్కడి దే అని అనుకోనేవాన్ని. కాని నాకు తోడు మీ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని ఇపుడే తెలిసింది. నేను ఒక తొమ్మిదో తరగతిలో తప్ప మిగతా అన్నీ తరగతుల్లో తరగతి లీడర్ గానే ఉండేవాణ్ణి. చాల రోజుల తరువాత, నా స్కూల్ జీవితంలోకి తీసుకెళ్ళింది మీ బ్లాగ్. దన్యవాదములు.

Anonymous said...

అంత తక్కువ సమయంలో ఇంత చక్కగా ఎలా రాయగలరండీ మీరు!!:-). మీరు రాసిన యాస అదిరింది.

"నా చిన్నప్పుడు స్కూళ్లలో (కనీసం నేను చదివిన స్కూళ్ళలో) ఒక రూలుండేది. "బాగా చదివే పిల్లలు అల్లరి చేయరాదు! చదువు రాని మొద్దులే అల్లరిలో ఫస్టుంటారు" అని!

ఇది నాకు చాలా అనుభవం. అందులో మా నాన్నకి ఊర్నిండా వేగులే. స్కూలు జీవితమంతా ఫస్ట్ బెంచ్ లో కూర్చుని విసిగిపోయి, ఇంటర్మీడియట్లో ఆ గొడవ వదిలించుకున్నా(అసలు ఓ నాలుగు నెలలు కాలేజికి వెళ్ళలేదు లెండి(క్రికెట్ పిచ్చి). దాంతో ఇంట్లో గొడవ మొదలయ్యింది. మళ్ళీ back to normal.

REC Warangal కి వచ్చాక మాత్రం, పూర్తిగా వెనక బెంచే. కాని అల్లరి మాత్రం చాలా నిల్ అని చెప్పుకోవచ్చు.

నేను రెగ్యులర్ గా టాగ్ చేసుకొని చదివే బ్లాగ్స్ లో మీదీ ఒకటి. కొంచెం frequent gaa గా రాస్తూ వుండండి. లేకపోతే బోర్...

PS: రాహుల్ సాంకృత్యాయన్ 'ఓల్గానుంచి గంగకు" last weekend మొదలెట్టా. కొంచెం కష్టంగానే ఉందండి బాబోయ్! తనదే కొన్ని సంవత్సరాల క్రితం ఏదో పుస్తకం చదివా. అది చాలా ఇంట్రస్టింగ్ గా ఉండింది.

Rajendra Devarapalli said...

జల్లిపల్లికృష్ణారావు గారు,ఆకాఫీ శంకర్ విలాస్ లొచపాతీ తిన్నాకా?వట్టికాఫీ యా?మీ సంగతి నాకు తెలీదు గానీ నావరకు ఇదీవరుస..శంకర్ విలాస్-చపాతీ,గీతాకేఫ్-మైసూరు బజ్జీ,ఇడ్లీ-రామచంద్ర(నాజ్ సెంటర్)పూరీ-హనుమాన్ స్వీట్ షాప్,దోశే-వెంకటేశ్వరా విలాస్(రెండూ జిన్నా టవర్ దగ్గర)భోజనం-ఆనందభవన్,ఇక పాయా లాంటి మాంసాహారాలు-బుడే హోటలూ,కింగ్స్ హోటలు(రెండూ మాయాబజారు దగ్గర)చాట్ లాంటివి-లీలామహల్ గేటు ఎదురుగా,
ఇంతకీ సుజాత గారి టపాకి కామెంటేది?రాద్దాం

వేణూశ్రీకాంత్ said...

Instant టపా అయినా ఎంత అందం గా వ్రాసారండీ... Hats off

మీనాక్షి said...

సుజాతా..గారు..అయ్యో..అల్లరి..
చేయలేకపోయారా..?
టపా ..మాత్రమ్..కేక

మాలతి said...

హా హాహా. సుజాతా, తెలుసా, తెలుసా ... రోకంటిపాటలా ... తురాయి టోపీ కవాతు .. పద్యానికి గద్యం .. అద్భతంగా వున్నాయి. అవును మరి, అల్లరి అరవైనాలుగు కళల్లో చేర్చవలసిన ఆర్టు. ఇప్పుడింక అల్లరేం చేస్తాం ... అంటే ఒప్పుకోను ... అల్లరి అనేక రకములు .. అందులో నీబ్లాగుట ఒకటి
మాలతి

Sujata M said...

hi. ఇపుడు మీ అమ్మగారు కులాసా నా ? మీ పోస్ట్ చదవలేదు. (మీ లానే హడావుడి గా తెరిచాను.) మీరు అల్లరేంటా ! అనిపిస్తూ ఉంది. తరవాత చదువుతాను. ప్రస్తుతం హై చెప్పడానికే ఈ కామెంట్ రాస్తున్నాను.

Saraswathi Kumar said...

రెంటాల కల్పన గారితో మీ వివాదం చదివాను.సరైన సమాధానం ఇచ్చారు.అసూయలు ఒక్కోసారి ఇటువంటి పరిణామాలకు కారణమౌతుంటాయి.

మీరు మీ టపాలలో,కామెంట్లలో కొన్ని చోట్ల రాసిన దాన్ని బట్టి నాకో విషయం అర్థమైనది.అదేమంటే (బ్లాగర్ లో)టపాలను ఎడిట్ చేస్తే తప్పనిసరిగా పబ్లిష్ చేయాలి..లేదంటే డ్రాఫ్ట్ గా సేవై టపా బ్లాగ్ లో కనిపించదు ' అనే ఉద్దేశం లో మీరు ఉన్నారు.

ఇది కొంతవరకే నిజం.ఎందుకంటే అలా డ్రాఫ్ట్ గా సేవ్ అయిన టపాను వెంటనే తిరిగి ఎడిట్ లోకి తీసుకెళ్ళి ఏమీ ఎడిట్ చేయకుండా సేవ్ చేస్తే ఈ సారి డ్రాఫ్ట్ గా కాక మామూలు పోస్ట్ లా సేవ్ అవుతుంది..కనుక బ్లాగ్ లో కనిపిస్తుంది.

ఈవిధంగా మరలా పబ్లిష్ చేయవలసిన అవసరాన్ని మనం ఎవాయిడ్ చేయవచ్చు.ప్రయత్నించండి.

maa godavari said...

సుజాత గారూ
అవును. నిన్న సాక్షి లో భూమిక హెల్ప్ లైన్ గురించి వచ్చింది.చాలా మంది ఆడవాళ్ళకి చాలా రకాల సమస్యలుంటాయి.2006 లో హెల్ప్లైన్ మొదలు పెట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఎన్నో కేసులు వచ్చాయి.భిన్నమైన సమస్యలు.ఇద్దరు కౌన్సిలర్స్ ఉదయం 8 నుండి రాత్రి 11 వరకు సేవలందిస్తారు.సలహా, సమాచారం ఇస్తారు.మీరు ఉండేది హైదరాబాద్ లోనే కదా వీలైతే ఒక సారి కలుద్దాం.

సుజాత వేల్పూరి said...

పూర్ణిమ,
చైతన్య గారు,
గిరీష్ గారు, థాంక్యూ!

రావు గారు,
నేనూ ఇప్పటికీ దీపావళి మందులు పిల్లలో పెద్దలో కాలుస్తుంటే చూసి సంతోషిస్తాను గానీ కాల్చను.అదేమిటో!

మహేష్ కుమార్ గారు,
మీ అల్లరి టపా ఎప్పుడు?

cheekatiman గారు,
ఏం చేస్తాం? ఈ జన్మకింతే అని సరిపెట్టుకోవాల్సిందే!

independent గారు,
నాలాగ ఎందరో అన్నమాట! వోల్గా సే గంగా కొంచెం బోరేనండీ!

వేణూ,
మీనాక్షి,
థాంక్యూ!

సుజాత వేల్పూరి said...

కృష్ణారావు గారు,
ఇదివరలో ఒక్కోసారి కేవలం శంకర్ విలాస్ లో తిండి కోసం ఆదివారం గుంటూరు చెక్కేసేవాళ్లం NRPT నుండి! ఈ మధ్య కాలంలో వెళ్లలేదు.

రాజేంద్ర కుమార్ గారు,
గుంటూరులో ఏ ఫుడ్ ఎక్కడ శ్రేష్టమో మిమ్మల్ని అడిగితే చాలన్నమాట. మిగతా వాటి సంగతి నాకు తెలియదు గానీ, గీతాకేఫ్ లో (అరండల్ పేట) మైసూరు బజ్జీ మాత్రం మరపు రానిదే!

మాలతి గారు,
ధన్యవాదాలు! పద్యానికి గద్యం నాకూ నచ్చింది, కానీ మీరు తప్ప దాన్నెవరూ పట్టించుకున్నట్టు లేదు.

సుజాత గారు,
మా అమ్మ ఇప్పుడు క్షేమమే నండి! ఆవిడ హార్ట్ పేషంట్. అప్పుడప్పుడు ఇలా టెన్షన్ తప్పదు మాకు.

సరస్వతీ కుమార్ గారు,
ఎవరో అసూయ పడెంత పాండిత్యం నాకుందని నేను భావించను. కాకపోతే ఆమె సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి నా రచనలోని వ్యంగ్యం బాధ గలిగించి ఉండొచ్చు. కానీ బ్లాగు లోకంలోకి ప్రవేశిస్తూనే టపాల సంగతి చూడకుండా, ఇతర్ల మీద దాడికి దిగడం నాకు విస్మయాన్ని కల్గించింది. అంతే!

కూడలిలో మళ్ళి మళ్ళీ వచ్చే టపాల సమస్య వీవెన్ గారు పరిష్కరించారు. చూసారా? మీకు కూడా థాంక్యూ, నా టపా ఇంతగా నచ్చినందుకు.

trk said...

బాగుందండి మీ టపా.
మధురమైన బాల్యాన్ని గుర్తు చేసారు.
నేనెంత అల్లరి చేసినా లక్కీగా క్లాసులో ర్యాంకు నన్ను ట్రంప్ కార్ద్ లా చాలా సార్లు కాపాడింది.
లేదంటే దొరికిన ప్రతిసారీ నా మిత్రుల్లాగే బుఱ్ర రామ కీర్తనలు రాక్ సాంగ్ లా పాడివుండేది.
-రఘు

కల said...

అయ్యో ఇంతవరకు నేను ఈ టపానే చదవలేదు సుమీ,
సూపరు, అంత టెన్షన్ లో కూడా చాలా బాగా రాసారు.
మీ అమ్మగారు తొందరగా కోలుకోవాలని ఆ బాబా (సాయిబాబా లెండి, బొల్లోజు బాబా గారు కాదులెండి) ని వేడుకొంటున్నాను.
అల్లరి చెయ్యడం కన్నా, అల్లరి చెయ్యాలి అనే కోరికని అప్పుకోవడం కష్టం అండీ. మంచి అనిపించుకొంటే ఇక అంతే సంగతులు. నాకా సమస్యే ఎదురు కాలేదు. తొందరలోనే నా అల్లరిని మీకందిస్తాను.

Post a Comment