May 4, 2009

వీళ్ళనేం చేద్దాం?

అప్పుడెప్పుడో ఎవరో స్నేహితులు నాకు "what to expect when you are expecting" అనే పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు! ఆ పుస్తకాన్ని నేను ఆ తర్వాత అనేకమందికి ఇచ్చాను ఉపయోగపడుతుందని. కొన్నేళ్ళుగా అది నా దగ్గర కనపడటం లేదని గ్రహించి చివరిసారిగా ఎవరికిచ్చానా అని చాలా సేపు ఆలోచించగా ఒక ఫ్రెండ్ భార్యకు ఇచ్చినట్లు గుర్తొచ్చింది. నాలుగేళ్ల క్రితం ఆమెకి అవసరమైనపుడు !


ఫోన్ చేసి అడిగితే "అవును నా దగ్గరే ఉంది" అని ఒప్పుకుంది.

"మరి తిరిగివ్వాలని తెలీదా?" అనడిగితే "sorry! any way, I'm thinking to plan my second baby. let it be with me. I will give you later on, may be next year.ok?" అంది. చివరికెలాగో చీవాట్లు పెట్టి పుస్తకం వెనక్కి తెప్పించాను మరో ఫ్రెండ్ కోసం!

ఇలాంటి వాళ్ళు నా సర్కిల్లో బోలెడు మంది ఉన్నారు. పుస్తకాలు పట్టుకెళ్లడం, తిరిగి ఇవ్వకపోవడం,కవర్ పేజీలు నలిపేసో, చించేసో ఇవ్వడం, కుట్లు వూడగొట్టి ఇవ్వడం, చదువుతున్న పేజీని గుర్తుగా మడతలు పెట్టడం, పేజీ తిప్పేచోట చివరల్ని మెలికలుగా మడిచెయ్యడం, పుస్తకాన్ని మడిచి చదవడం...ఇలా చేసి పుస్తకాన్ని సగం చంపేసి ఇవ్వడం..ఇదీ వీళ్లపని. కొంతమంది అయితే అసలు పుస్తకం తీసుకున్న సంగతే మర్చిపోయి, నేను అడిగినపుడు "ఓ, అది మీదా? (నాది కాక? పుస్తకం కొన్న వెంటనే పేరు రాసేస్తాను నేను) ఎవరిదా అని ఆలోచిస్తున్నాను" అని అయిష్టంగా ఇచ్చారు.కొందరైతే అదీ లేదు. ఎంచక్కా వాళ్ల లైబ్రరీలో దాచుకున్నారు.

నేను స్కూలు చదువులో ఉన్నపుడు మా మావయ్య(అమ్మ వాళ్ల అన్నయ్య) వాళ్ళిల్లు మా ఇంటిపక్కనే ఉండేది. మధ్యలో ప్రహరీ గోడ కూడా ఉండేది కాదు. మా స్కూల్లో బహుమతులుగా పుస్తకాలిచ్చే మంచి అలవాటుండేది. బహుమతి రాగానే పరుగెత్తుకెళ్ళి మావయ్యకు చూపించడం నాకలవాటు.

"అదీ! అమ్మలు (నేను) అంటే అల్లా ఉండాలి. ఏదీ ఆ పుస్తకం ఇలా ఇవ్వు, నేను చదివి నీకిస్తాను" అని తీసుకునేవాడు మావయ్య. నవలలూ, కావ్యాలూ..ఇలాంటివే కాక డిక్షనరీలు, జీవిత చరిత్రలూ కూడా ఇలాగే తీసుకునేవాడు.

కొన్నాళ్ళయ్యాక అడిగితే "ఎక్కడే అమ్మలూ, టైము దొరకట్లేదు(ఆయన ఆర్డీవో గా పని చేసేవాడు)ఇంకా అవలేదు. అవగానే ఇస్తాను" అనేవాడు. చదువులో పడి మర్చిపోయేదాన్ని నేను కూడా!కప్పులూ, షీల్డులూ తెస్తే అంతగా సంతోషించేవాడు కాదు మావయ్య.నేను డిగ్రీ ఫస్టియర్ లో ఉండగా మావయ్య పోయాడు. హైదరాబాదులో ఉన్న వాళ్ళబ్బాయి, ఇల్లు అద్దెకిచ్చేసి వెళ్లాలని వచ్చి, "అమ్మలూ, కొంచెం ఇల్లు సర్దడానికి సాయం  చేద్దువు రా" అని పిలిస్తే నేనూ, చెల్లాయీ వెళ్లాము.మావయ్య పుస్తకాల బీరువా సర్దుతుంటే మూర్ఛ వచ్చింది నాకు.

ఒక పుస్తకం మీద "అమ్మలు జ్ఞాపకంగా" అని రాసి ఉంది. ఆ తర్వాత తీస్తున్న కొద్దీ వస్తున్నాయి అమ్మలు జ్ఞాపకాలు.

మొత్తం పదిహేడు!అచ్చంగా అన్నీ నావే!  ఇంకా .......

"జానకి జ్ఞాపకంగా" -రెండు

"సుబ్బారావు జ్ఞాపకంగా" -మూడు

"శాస్త్రి జ్ఞాపకంగా" -రెండు


"కృష్ణారెడ్డి జ్ఞాపకంగా"-నాలుగు

"శాఖా గ్రంథాలయం జ్ఞాపకంగా" - పన్నెండు

ఇలా రకరకాల మనుషుల,  సంస్థల  జ్ఞాపకాలుగా వారి నుంచి నొక్కేసిన పుస్తకాలన్నీ బయటపడ్డాయి.
బీరువా తలుపు లోపల వైపు 'గ్రంథ చౌర్యం తప్పు కాదు." అని రాసి ఉన్న పోస్టరు కనపడింది.


"ఒరేయ్ ప్రసాదూ, మీ నాన్న చూడరా" అని నేను ఆక్రోశిస్తే,వాడు విరగబడి నవ్వుతూ


"నాకెప్పుడో తెలుసు మా నాన్న సంగతి! అందులో నీకేం పుస్తకాలు కావాలో తీసుకో" అన్నాడు.
నా పుస్తకాల వరకూ నేను తీసుకున్నాను. మిగిలిన పుస్తకాలు తీసుకుంటే మావయ్య ఆత్మ పైకి పోకుండా నా చుట్టూనే తిరుగుతుందేమో అని భయం వేసింది.
 
 ఆ (నా)పుస్తకాల్లో "చాసో కథలు" అనే అద్భుతమైన పుస్తకం ఉంది. దాంట్లో మావయ్య అండర్ లైన్లు చేయని కథ లేదు. సొంతగా వ్యాఖ్యలు రాయని పేజీ లేదు.పైగా అన్నీ రెడ్ ఇంకు, గ్రీన్ ఇంకు పెన్నులతో! ఆఫీసులో కూడా చదివేవాడేమో!  విసుగేసి కొత్త కాపీ కొనుక్కుని పాత కాపీకి అట్టవేసి "మావయ్య జ్ఞాపకంగా" అని రాసి పెట్టుకున్నాను.

ఆ తర్వాత చాలా రోజులు నాకు తెల్లవారుజామున ఒక కల వస్తూ ఉండేది. నేను మావయ్యకు ప్రైవేటుచెప్పేస్తున్నట్లూ, మావయ్య నా ముందు తల దించుకుని చేతులు కట్టుకుని నిలబడ్డట్లూ! ఈ ఒక్క కోరికా మాత్రం తీరకుండా ఉండిపోయింది!, (నేను వెళ్ళి మావయ్యను కలిస్తే తప్ప తీరేది కాదు!).అలా, చచ్చి....(నా చేతిలో)  బతికిపోయాడు మావయ్య!అప్పటినుంచీ అమ్మ ఎప్పుడైనా "మా పుట్టిల్లు..."అని ఏదైనా మాట్లాడబోతే

"ఆపవోయ్!  మీ పుట్టిల్లు గొప్ప మీ అన్న అమ్మలు పుస్తకాలు నొక్కేసినపుడే హుష్ కాకి అయిపోయింది" అని నాన్నారు అడ్వాంటేజ్ తీసుకోడం మొదలెట్టారు.ఈ మధ్య పిల్లల పార్కులో రాంచీకి చెందిన ఒక రిటైర్డ్ ఆర్మీ మేజర్ పరిచయం అయ్యారు. మార్క్ ట్వైన్ పుస్తకాల గురించి మాటల్లో వచ్చి "నా దగ్గర మొత్తం కలెక్షన్ ఉంది"(ఇది నేను సెయింట్ లూయిస్ లో టామ్ సాయర్, హకల్ బెరీ ఫిన్ ఆడిపాడిన మిస్సిసీప్పి నది ఒడ్డున ఉన్న ఆర్చ్ మ్యూజియంలో సగర్వంగా కొనుక్కున్నాను)అని నోరు జారాను.

ఇంకేముంది? ఇవ్వాల్సి వచ్చింది.

అది తీసుకున్నాక ఆయన చెప్పా పెట్టకుండా ఊరికెళ్ళాడు. ఎప్పుడొస్తాడో తెలీదు, పుస్త్తకం గురించి వాళ్ళ కోడల్ని అడిగితే బాగుండదేమో!పైగా పోతే పోనీ అనుకోడానికి అది నేను మార్క్ ట్వైన్ వాళ్ల ఊళ్ళో కొనుక్కున్నాను. తర్వాతెప్పుడో మూడునెల్లకి వచ్చి "ఇక్కడే ఉందమ్మా పుస్తకం, అదితి ని అడిగి తీసుకోవలసింది" అన్నాడనుకోండి. అది తిరిగి చేతికొచ్చేదాకా మనసు మనసులో లేదనుకోండి!

ఆ పుస్తకంతో పాటు మార్క్ ట్వైన్ దే "Mark Twain's selected sketches and short stories-(limited edition) " కూడా కొన్నాను. అది ఈ మధ్య  ఒక బ్లాగరు మిత్రుడికి ఇచ్చాను. అదెప్పుడొస్తుందో అని బెంగ. అది ఇంకో కాపీ సెయింట్ లూయిస్ వెళ్ళినా దొరకదు.(గీతాచార్య ఈ టపా చదవకపోతే బాగుండు). బెంగుళూరు బ్లాగర్ మిత్రుడొకరు తను తీసుకున్న పుస్తకాలను జాగ్రత్తగా అట్ట వేసి మరీ అప్పగించారు. (బ్లాగర్లు మంచివాళ్ళు) యండమూరి నవలల్లో నాకు "అనైతికం" బాగా నచ్చుతుంది.మా బంధువుల్లో నాలాగే ఒకావిడకి ఈ నవల బాగా నచ్చేసి తీసుకెళ్లారు. ఇష్టం కొద్దీ మళ్ళీ మళ్ళీ చదివే ప్రాసెస్ లో పుస్తకం మొత్తం చచ్చి ఊరుకుంది. పుస్తకం కావాలని అడిగితే "అది కొంచెం కుట్లూ అవీ ఊడిపోయిందోయ్, బైండ్ చేయించి ఇస్తాను" అంటారు. ఇవ్వరు! ఏదో పాత పుస్తకాలైతే తప్పనిసరై బైండ్ చేయించుకోవాలి కానీ కొత్త పుస్తకాలు బైండ్ చేయించి, చదివేటపుడు నానా ఇబ్బందులూ పడటం నాకిష్టం ఉండదు. దాని కోసం చింతించి, ఆపై  కొంచెం నువ్వులతో నీళ్ళు కలిపి చెయ్యి కడుక్కుని  కొత్త కాపీ కొన్నాను.మరొక సారి నేను జాగ్రత్తగా దాచి ఉంచిన ఎప్పటిదో 1995 నాటి ఇండియా టుడే సాహిత్య వార్షిక సంచిక ని ఒక స్నేహితుడి భార్య మా ఇంటికి వచ్చినపుడు తీసుకున్నారు. ఆవిడ వచ్చే సమయానికి నేను అందులో కుప్పిలి పద్మ రాసిన కథ ఒకటి వందోసారి చదువుతున్నాను. 

ఇల్లంతా తిరిగి చూస్తూ పుస్తకాన్ని గొట్టంలా చుట్టేసిందామె! నా ప్రాణం గిలగిల్లాడిపోతోంది. అలా చెయ్యొద్దని చెప్తే బాగోదేమో! కాసేపయ్యాక వాళ్ళ బాబు ఏదో అల్లరి చేస్తే ఆ గొట్టంతో రెండు దెబ్బలు వేసింది. ఇంటికెళ్ళాక దానితో ఇంకా ఏమేమి చేస్తుందో అని ఊహించడానికే భయం వేసి

"అది ఇప్పుడు దొరకదండీ, కొంచెం జాగ్రత్తగా ఉంచండి"అని చెప్తుండగానే ఆవిడ
 "కొత్త ఇష్యూ దార్లో కొనుక్కుంటాలెండి" అని కొంచెం కోపంగా పుస్తకం ఇచ్చేసింది.

 దశాబ్దం పై నాటి అపురూప సంచికకూ, మార్కెట్లో ఉన్న ఫ్రెష్ రాజకీయ వార్తల సంచికకు ఆమెకు తేడా తెలియనందుకు సంతోషిస్తూ అందుకున్నాను.అలాగే నాకో కజిను ఉన్నాడు. వాడిసంగతి ఎన్నాళ్లకూ అర్థం కాదు. ఒక పక్క విశ్వనాథ వారంటే ప్రాణం, ధర్మారావు మన సంస్కృతికి ప్రతిరూపం,వారినెవరైనా ఒక్కమాటంటే ఊరుకోనంటాడు. మరోవైపు శ్రీ శ్రీ కవిత్వం వింటే రక్తం పరుగులెత్తుతుంది, నిషా ఎక్కుతుందంటాడు. ఈ వైరుధ్యం ఏమిటో మరి! ఇంతా చేసి ఈ ఇద్దరి పుస్తకాలూ నా దగ్గరినుంచే నొక్కేసాడు.వేయిపడగలు నాకు నచ్చలేదు కాబట్టి పోయినా ఓకే!ఖడ్గసృష్టి, మహా ప్రస్థానం? ఇప్పటికి పది సార్లైనా కొనుంటాను. అన్నిసార్లు పోయాయి అవి!అమృతం కురిసిన రాత్రి ఒక నాలుగు సార్లు!ఇంత జరిగినా, ఎవరైనా 'ఫలానా పుస్తకం మీ దగ్గరుందా" అనడిగితే "ఓ యెస్" అని ఇచ్చేస్తా! ప్చ్! కొన్ని జీవితాలింతే అనుకుంటా!

ఎక్కడో చదివాను"fools lend books, and only greater fools return them" అని! నా విషయానికొస్తే నేను రెండూనూ!

ఎవరి దగ్గరైనా తీసుకున్న పుస్తకాల విషయంలో ఇంత అలసత్వంతో, నిర్లక్ష్యంతో ఉండేవారిని ఏం చెయ్యాలో నాకు తోచదు. మీకేమైనా తోస్తోందా?

60 comments:

Kathi Mahesh Kumar said...

టపా శీర్షిక చూసి యండమూరి కొత్త నవలని పరిచయం చేస్తున్నారేమో అనుకున్నాను.కానీ మొత్తాని పుస్తకచౌర్యం గురించి బహుచక్కని అనుభవాల్ని పంచుకున్నారు. అటూఇటూగా నావీ ఇలాంటి అనుభవాలే ఒక్క మీ మామయ్యగారి "పుస్తకవాటం" మినహా. బహుశా చాలా మందివి ఇలాంటి అనుభవాలేనేమో!

Anonymous said...

సుజాత గారు మీ దగ్గర ఇంకా ఏమేమి పుస్తాకాలు ఉన్నాయో చెప్తారా కాస్త
నేను కూడా నొక్కేస్తా ;);)

జ్యోతి said...

ఏమి చేస్తాం. మన పుస్తకాలని కనపడకుండి దాచుకోడమే. అడిగినా లేదనడమే. తప్పదు. నాకు ఒకట్రెండుసార్లు ఇలాటి అనుభవం కలిగింది. అంతే నా పుస్తకాల కప్ బోర్డ్ కి తాళం పెట్టేసాను. మరచికూడా బయట ఒక్క పుస్తకం కనపడనివ్వను. అంత్య నిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు కదా!!

Bolloju Baba said...

మీ ప్రపంచం విశాలంగా ఉంది.
మీదగ్గర పుస్తకాలు తీసుకొన్నవాళ్లు నిజాయితీ పరులల్లే ఉన్నారు.
నేను కానీ నావద్ద తీసుకొన్నవారు కానీ ఆ టైపు కాదు లెండి. :-)

Ramani Rao said...

ఇలా అభిమాన పుస్తకాలన్ని కూడా...స్నేహపూర్వక పుస్తక చౌర్యానికి గురి అవ్వడం మాములే తరుణోపాయం లేని చౌర్యాలివి . :-(

మేధ said...

నిజమే, పుస్తకం ఇవ్వడమే ఒక ఎత్తైతే, వాళ్ళ దగ్గర నుండి తీసుకోవడం ఇంకో ఎత్తు.. నేను నా పుస్తకాలని, నా కంటే జాగ్రత్తగా చూసుకుంటా... అలాంటిది వేరే వాళ్ళకి ఇవ్వాలంటే, విలవిలలాడిపోతుంది మనసు.. కానీ, అలాగని ఇవ్వకుండా ఉండాలేను.. ఏమి చేస్తాం, అలా ఇచ్చి మళ్ళీ క్రొత్త పుస్తకాలు కొనుక్కున్న సందర్భాలు కోకొల్లలు... ఇంతే, ఇవి ఇలానే సాగిపోతూ ఉంటాయి... :)

దైవానిక said...

సుజాత గారు, పొగడ్తలకి థాంక్స్.. నాకు కొన్ని పుస్తకాలు కావాలి. ఎప్పటినుంచో తీసుకుందాం అనుకుంటున్నా!!!
మా చిన్నప్పుడు యండమూరివి చాలా నవల్స్ ఉండేవి మా ఇంట్లో. అప్పుడు చదివే వయస్సు కాదు. ఇప్పుడు చదువుదామని మా అమ్మని అడిగితే, తీసుకెళ్ళిన వాళ్ళని పిచ్చి తిట్లు తిట్టింది మా అమ్మ. ఇన్నేళ్ళయ్యాక ఇహ వాళ్ళు తిరిగిచ్చినట్టే కనుక కొత్తవి కొని చదువుదామనుకుంటున్నాను.

bphanibabu said...

సుజాత గారూ,

మా పరిస్థితీ ఇల్లాంటిదేనండి. 1972 లో ఒకావిడ మా ఇంటికి వచ్చి చలం " మైదానం " తీసికెళ్ళి మళ్ళీ తుపాకి గుండు కి దొరక్కుండా మాయం అయిపోయింది. అప్పటినుంచీ మళ్ళీ ఎవరినీ నా పుస్తకాలు , రికార్డ్ లూ, ఎవరినీ బయటకు తీసికెళ్ళనీయమ. కోపం వచ్చినా సరే. " నందికేశుడి నోములా " మా ఇంట్లోనే వాటిని ఆనందించాలి, చూరు దాటకూడదు.------ లక్ష్మీఫణి

గీతాచార్య said...

:=()

హరేఫల said...

సుజాత గారూ,

పై కామెంట్ పోస్ట్ చేసిన తరువాత ఈ పుస్తకాల విషయం లో ఈ మధ్యన, జరిగిన ఒక సంగతి గుర్తుకొచ్చింది. చెల్లెలి కూతురి పురిటికొచ్చి, తిరిగి వెళ్ళేడప్పుడు , వీళ్ళ లైబ్రరీ నుంచి కొన్ని పుస్తకాలు తీసికొని ఆటో ఎక్కేడప్పుడు " మమ " అనేసికొని , ఆపసిబిడ్డ కు చెప్పేసి వెళ్ళింది ఆవిడ. ఎలాగైనా వీడు ఆ ఇంటి వాడేగా. చెప్పినట్లుగానూ ఉందీ, " ఇదిగో కొన్ని పుస్తకాలు తీసికెళ్తున్నానూ పిల్లాడికి చెప్పాన్లే ", అని!!

గీతాచార్య said...

>>>పాత కాపీకి అట్టవేసి "మావయ్య జ్ఞాపకంగా" అని రాసి పెట్టుకున్నాను.
*** *** ***

LOL

Nobody said...

Nobody neither lends books nor takes hem from others.

Hima bindu said...

:)

Anonymous said...

సుజాత గారూ, పుస్తకాలు పోగొట్టుకోవడం గురించి రాసి మంచి పనిచేశారు. ఇలాగే కాకపోయినా రకరకాలుగా నేను పోగొట్టుకున్న పుస్తకాల్లో అర్జెంటుగా ఇప్పుడు నాక్కావలసింది వెల్చేరు నారాయణరావు గారి "తెలుగులో కవితా విప్లవ స్వరూపాలు" మీ దగ్గరగాని, ఈ కామెంట్లు, పోస్ట్ చదువుతున్న మరెవరి దగ్గరయినాగాని, పాతకాపీ ఒకటుందా - నాకివ్వడానికి!

Anonymous said...

పుస్తకాన్ని అరువు ఇవ్వడం - ఇవ్వక పోవడం ఇచ్చే వారి ఇష్టం

ఒక చిన్న పుస్తకం లో - తీసుకున్నవారితోనే పుస్తకం పేరు - పుస్తకం వ్రాసిన వారి పేరు, తీసుకున్న తేది, ఇస్తానన్న తేది వివరంగా వ్రాయించుకోవాలి. ఎక్కడో ఒకచోట నమోదు ఐ ఉంటే - మరిచిపోవడం జరగదు.

ఎప్పుడైన ఒకే ఒక పుస్తకం మాత్రమే ఇవ్వడం. అది తిప్పి ఇచ్చిన వారికే మరొక పుస్తకం ఇవ్వడం.

ఇది వరకు ఇక్కడో అన్నట్టు - డి.వి. నరసరాజు గారు అనేవారు, "పుస్తకాలు ఉన్నదే పదిమంది చదవడానికి..దానిని అలమరలో పెట్టి తాళం వెయ్యడం పెద్ద తప్పు" అని. అలాగే పుస్తకం తీసుకెళ్ళి వెనక్కివ్వని వాడు పెద్ద చవట వెధవ .

ఇది చదివిన తరువాత కూడ మారని వాడు ఇంకా పెద్ద వెధవ.

చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవా అంటారు.

భావకుడన్ said...

సుజాత గారు,
ఒకసారి విసిగిపోయి పుస్తకాలు, సిడీలు అరువిచ్చిన వారి వివరాలకై ఒక బుక్ కూడా పెట్టాను ......బద్దకంతో అది ఎక్కడో ఉండిపోయింది..మళ్ళీ మొదలెట్టలేదు :-)

Anonymous said...

పుస్తక ప్రియులందరూ ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే సమస్యనే ఇది. ఇలా పుస్తకాలు అడిగి తీసుకువెళ్లే వారికొరకు ఒక రిజిస్టరు పెట్టి అందులో పుస్తకం వివరాలు రాసి తీసుకెళ్లమనే పెద్దాయన గురించి విన్నాన్నేను. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం బెటరు కదా...

asha said...

నేనూ ఒకప్పుడు పుస్తకాలను తీసుకొని తిరిగి ఇచ్చేదాన్ని కాదు.
కావాలని ఉంచేసుకోవాలని కాదు. బద్దకం, నిర్లక్ష్యం, బుద్ధి లేకపోవటం..
ఇలాంటివన్నమాట. లైబ్రరీకి అత్యంత ఎక్కువ ఫైనులు కట్టుంటాను.
ఒకసారి ఒక ఫ్రెండు దగ్గర తీసుకొని అలానే చేశాను. ఆమె కొంచెం కఠినంగా
వ్యవహరించేసరికి చాలా బాధపడిపోయాను. తరువాత ప్రశాంతంగా ఆలోచించి
నా తప్పు తెలుసుకున్నాను. ఇంకెప్పుడూ అలా చేయకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నాను.
ఇప్పటికీ ఆ ఫ్రెండుకి క్షమాపణలు చెప్పలేదు. ఈగో ప్రాబ్లం. కానీ ఆ అమ్మాయి వల్లే
నాకు జ్ఞానోదయమయ్యింది. మేమిప్పటికీ అన్నీ మాట్లాడుకుంటాం ఆ ఒక్క విషయం తప్ప.:)

sunita said...

ఇంకా మీరు అద్రుష్టవంతులండీ పోగొట్టుకున్న బుక్స్ గుర్తున్నాయి. నా కేసులో సంవచ్చరాల కలెక్షన్ మా సంచార జీవనవిధానం వల్ల మటుమాయం ఐపొయాయి.ఎవరు తీసుకున్నారో గుర్తు కూడా లేదు. "అన్నా కరినానా" ఐతే ఆ కొత్త వాసన ఇంకా గుర్తుంది.ఎవరిదైనా చిత్తుముక్క మా ఇంట్లోకి వచ్చినా సరే మా నాన్న ముందు దానికి అట్ట వేయించేవాడు. బ్రౌన్ పేపెర్ దొరక్కపోతే నూస్ పేపెర్ ఐనా సరే. మరలా దాన్ని ఆ పుస్తక కర్త కు తిరిగి ఇచ్చినప్పుడు ఎంత సంతోషించేవారో.అట్ట వేసి నందుకు. ఆ హాబిట్ ఇప్పటికీ ఉంది నాకు.

శ్రీనివాస్ పప్పు said...

ఇదంతా చదివాక నాకు అనిపించిందేంటంటే "అమ్మలు" విజ్ఞానాన్ని(పుస్తకాలు)డబ్బెట్టి కొనుక్కుని ఉచితంగా అందరికీ(అంటే కావాల్సినవాళ్ళకి)అందజేస్తోందీ అని...ఏతంతారు సుజాత గారూ.

వేణూశ్రీకాంత్ said...

"మావయ్య ఙ్ఞాపకంగా.." బాగుంది సుజాత గారు :)

నాదీ ఇదే బాధ కాకపోతే డీవీడీ ల విషయం లో.. పుస్తకాలు అట్ట చిరిగినా కాసిని కుట్లు ఊడినా మనసు బాధ పడుతుంది కానీ కనీసం వాటి ప్రాధమిక ఉపయోగమైన చదవడానికి ఎటువంటి ఆటంకమూ కలుగదు. కానీ డీవీడీ మీద రెండు గీతలు పడ్డాయంటే కాఫీ కప్పుల కింద టేబుల్ మ్యాట్ లా కూడా పనికి రావు.

ఎంతో ఖర్చు పెట్టి కొనుక్కున్న ఒరిజినల్ డీవీడీ లు ఇలా తీసుకు వెళ్ళి పాడు చేసే వాళ్ళని చూస్తే చాలా చిరాకు వేస్తుంది ఎంత క్లోజ్ ఫ్రెండైనా... ఇంకా కొందరైతే డీవీడీ వెనక్కి అడిగితే "అదేంటి ఆ సినిమా నువ్వు చూసేసావు కదా ఇంకా నీకెందుకు ?" అని అడుగుతారు !!

రాధిక said...

చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అంటారు వినలేదటండీ....ఏ జన్మలో ఎవరి పుస్తకాలు నొక్కేసిన పాపమో ఇలా తగులుతుంటుంది.అనుభవం తో చెపుతున్నాను .అదన్న మాట :)

Anil Dasari said...

అవిడియా. మీ పుస్తకాలకి ఇన్స్యూరెన్స్ చేయించండి.

hrudaya said...

మీ మామయ్య మిగతా జ్ఞాపకాలు బాగానే ఉన్నాయి, కాని "శాఖా గ్రంథాలయం జ్ఞాపకం" మాత్రం బాగా లేదు.....ఇక మీ బాధ పుస్తక ప్రేమికులందరి బాధే.... మనకేమో ఒక పుస్తకం చదివిన ఆనందం లో అది అందరితో చదివించాలని ఉంటుంది....దాంతో అడిగిన వాళ్ళకు,అడగని వాళ్ళకు (ఇది నా విషయం లొ) అందరికి ఇస్తాం....నేను చూశాను కదా...ఈ పుస్తకాలు తీసుకున్న వాళ్ళెవరు కూడ మళ్ళీ ఇవ్వాలనే ఆలొచనలో మాత్రం ఉండరు......నేను మాత్రం మిత్రులకు ఒక పుస్తకం ఇచ్చిన తరువాత (జ్ఞాపకం ఉంటే) ఆ పుస్తకం చదివారా అని అడుగుతాను....చదువలేదంటే మాత్రం ఒళ్ళు మండి వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పుస్తకం తీసుకు వస్తాను....ఆ పుస్తకం వాళ్ళు తిరిగి ఇవ్వక పొయినా నేను బాధ పడను కాని....చదువ లేదంటే మాత్రం చాలా బాధ తొ కూడిన కోపం వస్తుంది......ఇంకా కొద్దిమంది ఉంటారు.....వాళ్ళు ఆ పుస్తకం చదివినట్టు ప్రదర్శించాలనో లేక తమ పాండిత్యం ప్రదర్శించాలనో కాని పుస్తకం నిండా అండర్లైన్లు చెయ్యటం,గీకి గీకి పెట్టడం....ఇక మనం దాన్ని చదువాలంటే మన వల్ల కాదు....... ఈ జనాలను మార్చటం మన వల్ల కాదు..... .కాబట్టి మనమే కొద్దిగా మారాలి...అంటే పుస్తకాలు తీసుకున్న వాళ్ళ పేర్లు వెంటనె ఒక రిజిస్టర్ లొ రాసుకొని ...అప్పుడప్పుడు వాళ్ళను అడుగుతూ ఉండాల్సిందే.....పుస్తకాలను ఎలా తీసుకున్నారో అలాగే ఇవ్వమని...వాళ్ళు బాధ పడతారని తెలిసినా చెప్పాల్సిందే.....ఇలా చెయ్యకపోతే మాత్రం....చివరకు మనకు పుస్తకాల షెల్పులు మిగిలి ఉంటాయి...అందులో పుస్తకాలు మాత్రం ఉండవు....

జీడిపప్పు said...

చాలా అమాయకులుగా ఉన్నారు సుజాత గారు. "పుస్తకం, వనిత, విత్తం పరహస్తం past is past" అనే సామెత మర్చిపోయారా :)

సుజాత వేల్పూరి said...

మొత్తానికి నాకు చాలా మంది తోడున్నారన్న సంగతి నా పుస్తకాలు పోగొట్టుకున్న బాధ నుంచి తేరుకునేలా చేస్తోంది. అంటే వాళ్లవి కూడా పోయాయి కదా అన్న తృప్తితో!

మహేష్,
ఆ నవల గురించి గొప్ప రివ్యూ ఒకటి బ్లాగుల్లోనే ఎక్కడో చదివిన గుర్తు! ఆ తరవాత పుస్తకం చదివితే అదేమో నాకసలు నచ్చలేదు.

.........

లచిమి,
ఇంటికొచ్చేసెయ్ ఈ సాయంత్రం..

.......

జ్యోతి గారు,
నిజమే కానీ ఇలా అందరితో ఖరాఖండీగా ఉండటం సాధ్యం కాదు కదండీ..

........

బాబాగారు,
నా ప్రపంచం విశాలంగా ఏమీ లేదు. నావెన్ని పుస్తకాలు పోయాయో రాశానుగా!

.........

రమణి గారు,
నిజమే మీరన్నది! ఈ చౌర్యాలకు తరుణోపాయాలు లేవు.

.......

మేథ,
నేనూ మీలాగే!

.......

దైవానిక,
పొగడ్డ లేదు. ఉన్నమాట చెప్పాను. ఈ సారి ఇక్కడికొచ్చినపుడు తప్పకరండి. మీకు కావలసిన పుస్తకాలు తీసుకోండి, నా లైబ్రరీ లోంచి.

............

లక్ష్మి ఫణి గారు,
"నందికేశుడి నోములా" ...భలే చెప్పారు.అంతే కాదు మార్క్ ట్వైన్ వాళ్ళ ఎదురింటాయన కూడా ఇంతేట. ఏదైనా పుస్తకం కావాలంటే "మా ఇంట్లో కూచుని చదువుకో"మంటాడట. అయితే అప్పుడే పుట్టిన పసివాడికి చెప్పి పట్టుకెళ్ళినా ఇంట్లోవాళ్లకు చెప్పినట్లే అంటారు. సరే, నాకు ఎక్కడైనా వర్కవుట్ అవుతుందేమో చూద్దాం!

.........

గీతాచార్య,
అబ్బ, చదివేశారా మీరూ! ఇంతకీ పుస్తకం అయిందా లేదా?

..........
Nobody,
You are a good boy!

..........

చిన్ని గారు,
:))

సుజాత వేల్పూరి said...

రవి కుమార్ గారు,
మీరు చెప్పిన పుస్తకం నా దగ్గర లేదు. ఎవరైనా మిత్రుల వద్ద ఉందేమో ప్రయత్నిస్తాను.

.........
నెటిజెన్,
నరసరాజు గారితో ఏకీభవించడం వల్లనే అడిగిన వారందరికీ పుస్తకాలివ్వడం. రిజిస్టరు లో రాయడం అంత సీరియస్ గా తీసుకోలేదు మొదటినుంచీ, ఆ నలుగురు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్లు "మనిషిని నమ్మాలయ్యా" అని! ఎన్ని సార్లు శాస్తి జరిగినా "నమ్మడం" మాత్రం మానలేకపోతున్నా!

"ఇది చదివిన తరువాత కూడ మారని వాడు ఇంకా పెద్ద వెధవ."...అది సరే ఈ ఫలశ్రుతి ఏమిటీ?

.......

భావకుడన్ గారు,
పైన నెటిజెన్ గారికి రాసిన జవాబు చూడండి. మొదలు నేనూ పెట్టానండీ! తర్వాత ఆ రిజిస్టరు ఎక్కడుందో మరి...వెదకాలి ఎప్పుడైనా!

..........

దిలీప్ గారు,
ఇలా "ప్రజా సమస్య" మీద రాస్తే గానీ మీ వ్యాఖ్య రాదన్నమాట!:))నా బ్లాగులో మీ మొదటి వ్యాఖ్యకు సంతోషం!

...........

మీరు చెప్పింది నిజమే కానీ ఆచరణలో కష్టంగా ఉంది, తీసుకునే వాళ్ళు స్నేహితులూ, చుట్టాలూ అయ్యేసరికి. "ఏమిటీ, మేమేమన్నా పారిపోతామా" అన్నట్లు చూస్తుంటే ఏమిటి చెయ్యడం?

...........

భవాని,
బాగుంది. ఎంత ప్లెయిన్ గా చెప్పేస్తున్నారండీ!

...........

నా బ్లాగు,
పుస్తకాలు పోగొట్టుకోవడం చాలా చాలా బాధ కలిగించే విషయమండీ! నా చిన్నప్పుడు మా ఇంట్లో కొమ్మూరి సాంబశివరావు గారి డిటెక్టివ్ నవలలు చాలా ఉండేవి. అప్పుడు తెలీలేదు. మేం పెద్దయ్యేసరికి అవి ఎవరెవరి చేతుల్లోకో వెళ్ళిపోయాయి. ఇప్పుడు బయటేమో దొరకవు.ఎంత నిస్పృహ అనిపిస్తుందో! మీ అలవాటు చాలా బాధ్యతాయుతమైంది.

సుజాత వేల్పూరి said...

పప్పు గారు,
అమ్మలు కు కొనుక్కోగలిగే స్థోమత ఉన్నవాళ్ళకు ఉచితంగా పుస్తకాలు ఇచ్చే సదుద్దేశం లేదండీ! అది సరే, ఏమిటి గోదావరి నుంచి శ్రీకాకుళం వెళ్ళారు సడన్ గా?

వేణూ,
DVDలు పట్టుకెళ్ళి తిరిగివ్వని వాళ్ళ మీద నాక్కూడా కంప్లైంట్ ఉంది. మీకు నా సంతాపం!కాఫీ కప్పులు డిస్క్ మీద నిలవ్వు, జారిపోతాయి, మీరు చెప్పింది నిజం!

రాధిక,
హెంత మాటనేశారండీ!

అబ్రకదబ్ర,
ఇక అదొక్కటే మిగిలింది.

HRUDAYA గారు,
నా బాధ సరిగ్గా అర్థం చేసుకున్నారు! మన దగ్గరున్న మంచి పుస్తకాన్ని బలవంతమగానైనా మరొకరి చేత చదివంచాలని నేనూ అనుకుంటాను ఎంచేతో మరి! అలాగే మన దగ్గర నుంచి తీసుకున్న పుస్తకాన్ని చదవలేదంటే ఎంత బాధ వేస్తుందో! 'మరెందుకు తీసుకున్నారు?" అని దెబ్బలాడాలనిపిస్తుంది. సో, అందువలన చేత మీ అభిప్రాయం కూడా రిజిస్టరు పెట్టాలనే! సరే అయితే పెట్టేస్తా, రేపే!

జీడిపప్పు గారు,
మరే, బాగా గుర్తు చేసారు సుమా!

మురళి said...

కొంచం ఆలస్యంగా వచ్చానిటు.. 'నవీన్' ఆటోగ్రాఫ్ తీసుకున్న 'అంపశయ్య' నవల పోగొట్టుకున్న రోజున తీవ్రంగా నిర్ణయించుకున్నా ఎవరికీ పుస్తకాలు ఇవ్వకూడదని. చిన్న మినహాయింపు ఏమిటంటే.. బాగా తెలిసిన వాళ్ళు, పుస్తకాన్ని బాగా చూసుకుంటారన్న నమ్మకం ఉన్నవాళ్ళకి ఇచ్చి, వాళ్లకి రెండురోజులకి ఓ సారి ఫోన్ చేస్తూ ఉంటా..'ఎన్ని పేజీలు చదివారు?' అంటూ.. మీకు 'పట్టు చీర' సామెత గుర్తొచ్చిందా? నా చిన్నప్పుడోసారి అమ్మ పక్కింటావిడకి పుస్తకం ఇస్తే, మూడో రోజున ఆవిడ అదే పుస్తకం చింపి ఏదో చిరుతిండి పొట్లం కట్టి పంపింది మాకు. ఇది నాకు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం. నా దగ్గరనుంచి తీసుకునే వాళ్ళలో అట్టవేసి భద్రంగా చదివే వాళ్ళు, పుస్తకం నలిగితే కొత్తది కొనిచ్చేసే మొహమాటస్తులు ఉన్నారు.. ఇలా రాస్తూపోతే ఓ టపా అయ్యేలా ఉంది..

సుజాత వేల్పూరి said...

మురళి గారు,
మీరు ఈ విషయం మీద నాకంటే సాధికారికంగా రాయొచ్చు టపా! పుస్తకాలంటే మీకెంత passion ఉందో చాలామందికి తెలుసు నాతో. అర్జెంట్ గా టపా డిమాండ్ చేస్తున్నా!

మీలాగే నేనూ నామిని "మా సుజాతకు ప్రత్యేకంగా" అని రాసిచ్చిన 3 పుస్తకాలు(సినబ్బ కతలు,పచ్చనాకు,మునికన్నడి సేద్యం) ఒకేసారి పోగొట్టుకున్నాను. తీసుకున్నవాళ్ళు తిరిగివ్వలేదు. ట్రాజేడీ ఏమిటంటే తీసుకున్నది నామిని గారే కావడం.

Anonymous said...

బాగుంది ఎప్పట్లాగే మీ పోస్టు! మీ పోస్టులు చదువుతుంటే హాయిగా ఉంటుంది!

అన్నట్లు, వేయి పడగలు సరే, రామాయణ కల్పవృక్షం నచ్చలేదా మీకు? ఎందుచేత?

సుజాత వేల్పూరి said...

నీలాంచల,
thanks for your compliemnt. నాకు రామాయణ కల్పవృక్షం కూడా నచ్చలేదు. పూర్తిగా చదవలేకపోయాను కూడా. ఇందుకు కారణం అంతకు ముందే నాకు రామాయణ విషవృక్షం నచ్చడం కావొచ్చు.

Anonymous said...

సుజాత గారు..
నేను మీ లానే చాలా పోగుట్టుకున్నాను... సాఫ్ట్ వేర్ పుస్తకాలు.. సి. డి. లు.. ఎన్నెన్నో ..; -( :-(

వేణు said...

ఇష్టపడి కొనుక్కున్న పుస్తకాలను పోగొట్టుకోవటం బాధ కలిగించే విషయం. అవి అరుదైనవయితే ఇక ఆ వేదన తీరేది కాదు. పఠనాభిలాషతో పాటు పుస్తకాలను తిరిగి ఇచ్చే సిన్సియారిటీ ఉన్నవారికి మాత్రమే పుస్తకాలు ఇవ్వటం చేస్తుంటే పెద్దగా పశ్చాత్తాపపడే అవసరం ఉండదు. ఇచ్చిన పుస్తకాల వివరాలు నోట్ చేసుకోవడం, తిరిగి రాకపోతే అడుగుతూ ఉండటం చెయ్యాల్సిందే.

పుస్తకాలు తీసుకొని తిరిగి ఇవ్వని వాళ్ళను ఏం చేస్తాం? ఏమీ చెయ్యలేం. (వాళ్ళు బ్లాగర్లయితే వాళ్ళ పేర్లను ప్రకటించవచ్చుననుకోండీ) వాళ్ళకు మళ్ళీ పుస్తకాలు ఇవ్వటం ఆపెయ్యటం మాత్రమే మన చేతిలో ఉన్న పని!

Mahesh Telkar said...

సుజాత గారు ... ఈ టపా చదువుతుంటే చిన్నప్పుడు స్కూల్ లో 'సొంత పుస్తకం' అంటే పాఠం గుర్తొచింది. ఈ మధ్య మీ బ్లాగ్ గురించి 'ఈనాడు' లో చదివాను .. కొన్ని టపాలు చదివాకా .. తప్పక ఫాలో అవ్వాల్సిన బ్లాగ్ అనిపించింది ... glad to know about you and your blog ...
- మహేష్

రాఘవ said...

విసుగేసి కొత్త కాపీ కొనుక్కుని పాత కాపీకి అట్టవేసి "మావయ్య జ్ఞాపకంగా" అని రాసి పెట్టుకున్నాను.
పొట్ట చెక్కలైపోయిందంటే నమ్మండి.

నేను కొనే పుస్తకాలు నాకు తెలిసినవారిలో ఎవరికీ నచ్చవు. కాబట్టి ఇబ్బందే లేదు. ఐనా కూడా పొరబాట్న ఎవరైనా నన్ను పుస్తకం అడిగితే వాళ్లకి నేను ఒకటి బహుమతిగా కొనిస్తాను తప్పితే నా పుస్తకాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ ఇవ్వను. ఆఁ.

cbrao said...

పుస్తకాల విషయంలో జ్యోతి చెప్పింది అబద్ధం. ఆమె మాట కరకైనా మనసు వెన్నే. వాళ్ల ఇంటికెళ్లి ఫలానా పుస్తకం కావాలనండి. వెతికి మరీ ఇస్తారు. మా ఇంట్లోని సుమారు 30 తెలుగు, ఆంగ్ల పుస్తకాలు జ్యోతక్క ఇచ్చినవే.

మరువం ఉష said...

నిజమండి ఈ సమస్యకి శాశ్వతపరిష్కారం లేదు. ఒకటే మంత్రం అందరికీ పనిచేయదు. నాకు పరిచయమైన అందరికీ నా వస్తువుల పట్ల నాకు కలిగే మమకారాన్ని పరిచయం చేస్తాను. అవతలివారిలో ఆ గ్రహింపు వుంటే బయటకి వెళ్ళినవి తిరిగి ఇంటి దారి పడతాయి, లేదా అలా వూళ్ళపాలౌతాయి. నా అనుభవల్లో కొన్ని.

ఒకరు దేశం విడిచి వెళ్ళిపోతూ నా పుస్తకాలన్ని రీసైకిలింగుకి వేసామని చివరి రోజున చెప్పటం

ఒకరి మెయిలు బాక్స్ లో పెట్టమని ఏదో కార్డ్ ఇస్తే మా మనిషి తిరిగొచ్చి నీ పుస్తకాలు అందులో వున్నాయి అని చెప్పటం, అంటే "అత్త సొమ్ము అల్లుడి దానం" తంతు. నా వద్ద తీసుకున్న మరొకరి ఉదారస్వభావం అది.

మరొకరు నా ముందే వాళ్ళ బుజ్జాయి ముఖచిత్రం మీద ఎడా పెడా గీస్తుంటే "ఆంటీ గారిదది, కోపమొస్తే కొడతారు" అని మురిపాలు పోవటం. ఆ నా పుస్తకం నేను నీకేమీ కానా నన్నిలా బాధింపచేస్తున్నావు అని అడిగినట్లనిపించింది.

ఈ మధ్య ఒకరు ఒక సంచి నిండా పుస్తాకాలిచ్చి చదివి అవతల పడేయండి నాకు మాత్రం తిరిగివ్వొద్దీచెత్త అనటం. అవి ఎవరో వారి బంధువులు విడిచివెళ్ళారట. అందులోని కొన్ని అరుదైన పుస్తకాలు చూస్తే మతి పోయింది.

ఒకరి తండ్రి కాలక్షేపానికని తీసుకుని "అమ్మా,నీ పుణ్యమాని ఏనాటి పుస్తకాలు చదవగలిగానివి" అని ఈ పైన చెప్పిన వాటి గురించి సంబరపడటం.

ఇప్పటికీ అలా క్రొత్త అనుభవాలు, కొన్ని చేదు కొన్ని అనివార్యమైనవీను. జీవితంలో వున్న ఎన్నో సమస్యల్లో ఇదొకటి, ఎంతో మంది కారకుల్లో వీరు కొందరు. ఏమీ చేయలేము, కానీ మరీ బాధ పడనవసరం లేని విషయమిది నా వరకు.

సుజాత వేల్పూరి said...

nelabaludu,
మీకు నా సంతాపం! అవునూ, ఇలా ఎన్నెన్నో పోగొట్టుకున్నా మళ్ళీ ఎప్పటిలాగే ఉంటామెందుకబ్బా మనం?

సుజాత వేల్పూరి said...

వేణు గారూ,
పుస్తకాలను తిరిగిచ్చే సిన్సియారిటీ ఉన్నవాళ్ళో కాదో తెలియాలంటే కొన్ని పుస్తకాలు పోవాలిగా మరీ! అలా పోయినవే నా పుస్తకాలు కొన్ని!

మొత్తానికి "వీళ్లనేం చేద్దాం" అన్న ప్రశ్నకు మీరొక్కరే జవాబు చెప్పారు. "ఏమీ చెయ్యలేం, వాళ్ళు పుస్తకాలివ్వకుండా ఆపేయడమే" అని! నిజమే!అదొక్కటే మార్గం!

మహేష్ గారు,
బ్లాగ్ నచ్చినందుకు, అనుసరిస్తున్నందుకు థాంక్స్! మీ బ్లాగ్ చూశాను. రెగ్యులర్ గా రాయడం లేదు ఎంచేత?


రాఘవ గారు,
మీ లైబ్రరీ అర్జెంట్ గా చూడాల్సిందే! మీ పుస్తకాలు నాకు నచ్చవని మీరెలా చెప్తారు? నాకు కూడా పుస్తకాలు బహుమతిగా ఇవ్వాల్సి వస్తుందేమో చూడండి మరి!

రావుగారు,
ఇదన్యాయం కాదూ! జ్యోతిగారివి 30 పుస్తకాలు మీ లైబ్రరీలో ఉన్నాయా? జ్యోతి గారు మళ్ళీ ఒకసారి ఈ టపా చూస్తే బాగుండు.

ఉష,
మీ అనుభవాలు మీ స్టైల్లో కవితాత్మకంగా చెప్పారండీ! అలా పాత పుస్తకాలు ఇచ్చే స్నేహితులున్నారంటే అసూయగా ఉంది సుమా! కానీ ఏమిటో నాకు పుస్తకాలు పోగొట్టుకోవడం మాత్రం బాధపడాల్సిన విషయమే అనిపిస్తుంది.

జ్యోతి said...

సుజాతగారు,

నన్ను గుర్తుచేసుకుంటునట్టున్నారు. నేను నా అనుభవంతో ఎవ్వరికీ పుస్తకాలు ఇవ్వలేదు, కాని ఒకానొక పరిస్థితిలో నా దగ్గరున్న సుమారు 400 పుస్తకాలు పంచేసాను బ్లాగులోకంలో కొచ్చిన కొత్తలో. వాటిలో రావుగారికి యండమూరి నవలలు,మరికొన్ని చేరాయి. షాడో ఫుస్తకాలు చావాకిరణ్.. ఇలా ... పుస్తకాలని భద్రంగా చూసుకుంటారనే నమ్మకంతో ఇచ్చాలెండి. కొమ్మనాపల్లి గణపతిరావు నవలలు కొన్ని ఉన్నాయి. మీకు సస్పెన్స్ కథలు ఇష్టమైతే మా ఇంటికి వచ్చి తీసికెళ్లండి.. :)....నిజంగా...

మాలతి said...

41 కామెంట్లతరవాత నేను రాయడానికేం వుంది. బాగుంది :)

KumarN said...

నాకూ "అనైతికం" బాగా నచ్చింది. తను రాసిన వాటిల్లో "అంతర్ముఖం" అత్యుత్తమమయినది అతను చెప్పుకున్నప్పటికీ, నాకు "అనైతికం" బెటర్ అనిపిస్తుంది, దానికంటే.

నా దగ్గర భద్రంగా ఉంది ఇప్పటికీ, కావాలంటే చెప్పండి పంపిస్తా :-). మళ్ళీ ఇవ్వకపోయినా పరవాలేదు, నేనెలాగూ మళ్ళీ చదవబోవట్లేదు దాన్ని.

Kumar N

Anonymous said...

ఒకరికి ఇద్దామనుకుని వారికి చదివే ఓపిక వుందో లేదో అని ఆగిపోయాను. ఇల్లేరమ్మ కథలు ఒక స్నేహితురాలికి ఇచ్చాను. వెనక్కి తీసుకునేటప్పుడు ఎంత బాధ వేసిందో. ఆవిడ మడిచి చదివిన చోట అట్ట నలిగిపోయి తెల్లగా చార లాగ పడింది. ఈ సారి అత్తగారి కథలు కావాలని వెళ్ళేటప్పుడు అడగటం మరచిపోయింది నా అదృష్టం కొద్దీ. చదివే రోజుల్లో మా స్నేహితుడు ఎవరన్నా పుస్తకం అడిగితే ఒక పుస్తకంలో వారి వివరాలు రాసి వారి వస్తువు ఏదైనా ఒకటి వుంచి పుస్తకం తీసుకు వెళ్ళమనే వాడు!

చాసో కథలు నాకు దొరకటం లేదండి. మీరు మళ్ళీ కొన్నానన్నారు. ఎక్కడ?

సుజాత వేల్పూరి said...

మాలతి గారు,
థాంక్యూ!

@కుమార్,
అనైతికంలో పాత్రలన్నీ మన చుట్టూనే ఎక్కడో ఉన్నాయనిపిస్తుంది కదా! అంతర్ముఖం నాకు బోరు కొట్టేసింది.

అదిసరే నేను కొత్త కాపీ కొనేసానని చెప్పాక ధైర్యంగా చెప్పేస్తున్నారేం, కావాలంటే పంపిస్తానని!వద్దు, మీరే ఉంచుకోండి.

@iddaru,
చాసో కథలు నేను విశాలాంధ్రలోనే కొన్నాను గానీ చాలా రోజుల క్రితం. ఇప్పుడు దొరకడం లేదనుకుంటున్నాను. చాలా అద్భుతమైన సంకలనం!

మధురవాణి said...

సుజాత గారూ..
బాగున్నాయండీ.. పుస్తకాలు పోగొట్టుకున్న కబుర్లు.. కామెంటులూ కూడా..
నాకు పుస్తకాల విషయంలో పెద్దగా ఇలాంటి అనుభవాలు లేవు గానీ.. dvd ల విషయంలో మాత్రం.. వేరే వాళ్లకి ఇచ్చామంటే.. ఇంక అది మర్చిపొమ్మనే అర్ధం.

Malakpet Rowdy said...

హతోస్మి! మీ ముద్దు పేరు కూడా అమ్మలేనా? అయితే ఇవాల్టినించీ మీరన్నా నాకు గజగజా వణుకే!

సుజాత వేల్పూరి said...

రౌడీ గారు,
Good to hear. అయితే అరుణ గారి ముద్దు పేరు కూడా ఇదేనన్నమాట.

సుజాత వేల్పూరి said...

మధురా,
మీరు నా ప్రతి పోస్టూ ఓపిక్క చదివి చక్కగా కామెంట్ రాస్తారు. చాలా థాంక్స్!నేనీ మధ్య ఇకDVDలు ఎవ్వరికైనా ఇవ్వడం మానేశానండీ! నా దగ్గర మంచి కలెక్షన్ ఉంది. అవి పోతే ఇక దొరకవు, అందుకే!

కొత్త పాళీ said...

హ హ హ. బాగుంది.
కానీ గ్రంధచౌర్యం అంటే ఇలాంటి చౌర్యం కాదనుకుంటా

సుజాత వేల్పూరి said...

కొత్తపాళీ గారూ,
"గ్రంథచౌర్యం" అంటే తెలుసులెండి! అయినా పాపం ఇది కూడా "చౌర్యమే" కదాని...!

Nagaraju said...

Vastayi sujatha gaaru... mee books mottam edo oka roju tirigi mee daggarake vastayi (Nuvvu naku nachav movie lo sunil styllo )

చందు said...

నేను కూడా మీలాగే. కాకపోతె కొన్ని రోజులు బాధపడ్డాక, పుస్తకాలు చదివే అవకాశం వాళ్ళకి కల్పించాననే ఆనందంతో సరిపెట్టుకుందామని అనుకున్నాను. ఎప్పుడైనా వాళ్ళు ఎదురు పడితే పుస్తకం గురించి అడిగితే వాళ్ళు తెల్ల మొహం వేసి "ఏ పుస్తకం?" అని అడిగినప్పుడు మళ్లీ కడుపులో బాధ. మళ్లీ ఇంటికి ఎవరైన వొస్తే అదే పద్దతి, మన బుద్ధి కుక్క బుద్ది

S said...

మీరప్పుడెప్పుడో రాస్తే, ఇవాళ చదివా :)
నాకేవో ఒకట్రెండు పుస్తకాలు తప్పితే ఇలా పోలేదు కానీ, దర్జాగా దొరతనంగా పుస్తకాలు తీస్కెళ్తున్నా, అచ్చంగా, అని చెప్పేసి వెళ్ళినా ఏమీ చేయలేని నిస్సహాయత మాత్రం జీవితంలో ఒకసారి ఎదురైంది!

భాను said...

బాగుంది. అమ్మలు జ్ఞ్యాపకంగా.. మీ మామయ్యా భలే తెలివి గల వాడండి మీరే ఎక్కువ బలి అయినట్లుడ్ని . "శాఖా గ్రంథాలయం జ్ఞాపకంగా" హహ్హహః భలే జోక్ మొతానికి మీ టపా బాగుంది

తృష్ణ said...

మా నాన్న తన పుస్తకాల బీరువా మీద
"పుస్తకం వనితా విత్తం
పరహస్తం గతం గత:" అని రాసిపెట్టి ఉంచేవారు. ఆయన పుస్తకాలు, కేసెట్లు ఎన్ని పోయాయో లెఖ్ఖలేదు...వాటి గురించి రాస్తే పెద్ద గ్రంధం అవుతుంది..:)

వనజ తాతినేని/VanajaTatineni said...

సుజాత గారు..పోస్ట్ చాలా బాగుంది. పుస్తకాలు తిరిగి ఇవ్వని వారికి జ్ఞానోదయం.ఒక చిన్న మాటండి సరాదాకే!!! పుస్తకాలు పోగొట్టుకున్న వాళ్ళ బాధలు చూడలేక పునర్ముద్రణ లు వచ్చాయోచ్ . అలాగే డిజిటల్ లైబ్రరి కూడా.. మీ టపా,కామెంట్స్ అన్నీ..రోలు వెళ్లి మద్దెలుతో..చెప్పుకున్నట్లు ఉన్నాయి.:((((

Unknown said...

పుస్తకాలు ఎరువు తీసుకునేవాళ్ళు...
1. తాముకూడా చదవాలన్న కోరికతో తీసుకుంటారు. తిరిగి ఇచ్చేస్తారు. మరొకటి ఎప్పటికీ ఇవ్వరేమోనన్న ఉద్దేశంతో...
2. తామూ పుస్తక పురుగులమేనని చాటుకోవడానికి తీసుకుంటారు. వీళ్ళు చచ్చిపోతే తప్ప వెనక్కి రావు.
3. మరికొందరు అద్వైత పాఠకులుంటారు. ఏదీ మనది కాదనే బాపతు. వీళ్ళు మరీ డేంజర్. మన పుస్తకాన్ని అందుకుని మరొకరికి బట్వాడా చేస్తారు. ఆ మరొకరు ఎవరో వీళ్ళకు గుర్తుండదు. మనకి బుక్ వెనక్కి రాదు.
4. కొందరు సి.పి.ఐ.లుంటారు. అంటే Cover Page Intellectuals. వీళ్ళు చాలా బుక్సుని బుక్ హౌసుల్లోనే కవర్, బ్లర్బ్, ఇన్నర్ కవర్, బ్యాక్ కవర్ చదివేసి మనతో వాదిస్తారు. వీళ్ళ మాయలో పడి మనం బుక్స్ ఇచ్చామా అంతే సంగతి.
5. నిజమైన ఆసక్తితో తీసుకుని ఇవ్వనివాళ్ళుంటారు. వీళ్ళకు ఒళ్ళంతా బద్దకం, మనకేమో పుస్తకం ప్రాణం! గట్టిగా అడిగితే, 'పుస్తకమే కదండీ, చూడాలి ఎక్కడుందో, పంపిస్తాలెండి' అంటారు. (మనసులో... 'ఏదో ఆస్తి పట్టుకుపోయినట్టు ఏడుస్తావేం' అనుకుంటారు!)
6. నా వరకూ పుస్తకం పోయిందన్న బాధకన్నా... దానిలో రిఫరెన్స్ మార్క్స్, కామెంట్స్ రాసి ఉంటాను. అవి మళ్ళీ ఉండవుకదా అనే ఏడుపు ఎక్కువ.

ఇంకా చాలా ఉన్నాయి.

Unknown said...

పుస్తకాలు ఎరువు తీసుకునేవాళ్ళు...
1. తాముకూడా చదవాలన్న కోరికతో తీసుకుంటారు. తిరిగి ఇచ్చేస్తారు. మరొకటి ఎప్పటికీ ఇవ్వరేమోనన్న ఉద్దేశంతో...
2. తామూ పుస్తక పురుగులమేనని చాటుకోవడానికి తీసుకుంటారు. వీళ్ళు చచ్చిపోతే తప్ప వెనక్కి రావు.
3. మరికొందరు అద్వైత పాఠకులుంటారు. ఏదీ మనది కాదనే బాపతు. వీళ్ళు మరీ డేంజర్. మన పుస్తకాన్ని అందుకుని మరొకరికి బట్వాడా చేస్తారు. ఆ మరొకరు ఎవరో వీళ్ళకు గుర్తుండదు. మనకి బుక్ వెనక్కి రాదు.
4. కొందరు సి.పి.ఐ.లుంటారు. అంటే Cover Page Intellectuals. వీళ్ళు చాలా బుక్సుని బుక్ హౌసుల్లోనే కవర్, బ్లర్బ్, ఇన్నర్ కవర్, బ్యాక్ కవర్ చదివేసి మనతో వాదిస్తారు. వీళ్ళ మాయలో పడి మనం బుక్స్ ఇచ్చామా అంతే సంగతి.
5. నిజమైన ఆసక్తితో తీసుకుని ఇవ్వనివాళ్ళుంటారు. వీళ్ళకు ఒళ్ళంతా బద్దకం, మనకేమో పుస్తకం ప్రాణం! గట్టిగా అడిగితే, 'పుస్తకమే కదండీ, చూడాలి ఎక్కడుందో, పంపిస్తాలెండి' అంటారు. (మనసులో... 'ఏదో ఆస్తి పట్టుకుపోయినట్టు ఏడుస్తావేం' అనుకుంటారు!)
6. నా వరకూ పుస్తకం పోయిందన్న బాధకన్నా... దానిలో రిఫరెన్స్ మార్క్స్, కామెంట్స్ రాసి ఉంటాను. అవి మళ్ళీ ఉండవుకదా అనే ఏడుపు ఎక్కువ.

ఇంకా చాలా ఉన్నాయి.

రహ్మానుద్దీన్ షేక్ said...

ఈ టపా ఎందుకు మళ్ళీ వెలికితాసారు?

అన్నట్టు సుజాతగారి జ్ఞాపకంగా నా వద్ద కొన్ని పుస్తకాలు ఉన్నాయి.

అలానే సిటీ గ్రంథాలయ సంస్థ జ్ఞాపకంగా

స్కూలు జ్ఞాపకంగా

ఫలానా మాష్టారు జ్ఞాపకంగా ఎన్నో పుస్తకాలు నావద్ద ఉన్నాయి.
నా జ్ఞాపకంగా పుస్తకాలు కూడా ఎందరి వద్దనో ఉన్నాయి. పుస్తకాలు ఎన్ని చేతులు మారతాయో అంత జ్ఞానం విస్తరించినట్టని నేను భావిస్తాను.
కానీ పుస్తకాలకు దెబ్బ తగిలినా నాకది నచ్చదు.
అందుకే చేయి మారి నాచేతికొచ్చే ప్రతి పుస్తకాన్ని జాగ్రత్తగా దెబ్బలు మాన్పించడం చేస్తాను.

Post a Comment