June 14, 2010

షాడో గారూ-మధుబాబు గారూ !షాడో

ఆ పేరు వింటేనే గొప్ప థ్రిల్లింగా ఉంటుంది!


ఒకప్పుడు (ఆ మాటకొస్తే అభిమానులైన వారిని ఇప్పుడూనూ)యువతరాన్ని ఆ డిటెక్టివ్ పుస్తకాలు ఎంతగా ఉర్రూతలూగించాయో చాలా మందికి తెలుసు!ముఖ్యంగా మా అన్నయ్య కాలేజీ రోజుల్లో(మాకు ఆ పుస్తకాలు చదివే పర్మిషన్ ఉండేది కాదు మరి)వాడు, వాడి స్నేహితులు,కజిన్సూ చచ్చిపోతుండేవాళ్ళు షాడో అడ్వంచర్స్ చదవడానికి! వాడు ఇంట్లో లేనపుడు రెండు నవారు మంచాల మధ్య ఒక స్థావరం తయారు చేసి అక్కడ కూచుని నేనూ, మామయ్య కూతురు విశాలీ చదివే వాళ్ళం!
స్కూల్లో చదివే పిల్లకాయలం కాబట్టి ఎప్పటికైనా షాడోని చూస్తామంటావా అని దిగులుపడేవాళ్ళం!మా కంటే చిన్న వాళ్ళను పోగేసి షాడో వీరగాధల్ని సాయంకాలాల్లో బుర్రకథ టైపులో చెప్తుండేవాళ్ళం!షాడో అసలు పేరు "రాజు" కావడం మాకు నచ్చేది కాదు.షాడోనే ఎందుకు కాకూడదని బాధపడేవాళ్ళం!అసలింతకీ షాడో అంటే అసలర్థం ఏమిటని ఆలోచించాలని కూడా తట్టేది కాదు మాకు! అంతగా పర్సనలైజ్ చేసేసుకున్నాం!మా ఇంట్లో ఈ క్రేజు ఎంతవరకూ పోయిందంటే మా అన్నయ్య కి కొడుకు పుట్టినపుడు (ఇప్పుడు వాడు CA ఇంటర్ చదువుతున్నాడు)అన్నయ్య వాడికి శ్రీకర్(షాడో అసిస్టెంట్,జూనియర్ ఏజెంటు)అనే పేరు ఖాయం చేసేశాడు కనీసం వాళ్ళావిడ అభిప్రాయం కనుక్కోవాలన్న ఇంగిత జ్ఞానం లేకుండా!అంతగా క్వాలిటీ లేని పేపర్ తో ముద్రించిన ఆ పాకెట్ సైజు నవలలంటే ఇప్పటికీ క్రేజున్నవాళ్ళు చాలామంది ఉన్నారు. విజయవాడ,గుంటూరు బస్టాండుల్లో పుస్తకాల షాపుల్లో వేలాడుతూ ఇప్పటికీ కనిపిస్తాయి.ఇప్పుడు చదివితే కొంచెం నవ్వొస్తుంది కానీ అప్పట్లో నరాలు తెగే టెన్షన్!

బిందు,గంగారాం,కులకర్ణి,ఆయన పైపు,వీళ్లంతా ఒక ఫాసినేషన్!అలవోగ్గా దొర్లే ఇంగ్లీషు పదాలు,సన్నగా వళ్ళు జలదరించడం, ఊపిరి బిగపట్టడం,దవడ కండరం బిగుసుకోవడం,విదేశీ వీధుల్ని సైతం స్వయంగా చూసినట్లు రచయిత వర్ణించడం, మార్షల్ ఆర్ట్స్ లో కిక్ లు, పంచ్ లను సైతం వివరించడం, ఇంకా ధృడకాయుడు, బే వంటి పదాలు ఇవన్నీ షాడో నవలల్లో మాత్రమే కనిపిస్తాయి.సంగతేమిటంటే షాడో సృష్టికర్త శ్రీ మధుబాబు కూడా ఒక బ్లాగు ప్రారంభించారు. తనదైన శైలిలో అద్భుతమైన టెంప్లేట్ కూడా సిద్ధం! కాకపోతే మధుబాబుగారు ఇంకా తెలుగు బ్లాగుల సంగతి,తెలుగులో రాయొచ్చన్న సంగతీ అంతగా పట్టించుకున్నట్లు లేదు.ఆ సంగతంతా ఆయనకు   తెలిసేలా చెప్పేశాం లెండి. అంతే కాదు, అప్పుడెప్పుడో బ్లాగాడిస్తా రవిగారు  ఆయన రచనల మీద రాసిన ఒక సరదా పేరడీ.కూడా పంపాం! త్వరలోనే మధుబాబుగారు తెలుగులో బ్లాగు రాస్తారని చూద్దాం!ఇదిగో షాడో మధుబాబు గారి బ్లాగు! .


అన్నట్లు మధుబాబు గారు కొన్ని దశాబ్దాలుగా ఆనాటి ఇద్దరు రచయితల ఆచూకీ గురించి ప్రయత్నిస్తున్నారట. వారి పేర్లు శ్రీ విజయాత్రేయ, శ్రీ ద్వారకానాథ్ ! మీలో ఎవరికైనా వారెక్కడ ఉన్నదీ, కనీసం చిరునామా అయినా తెలిస్తే వారికి తెలియపరిస్తే సంతోషం!

13 comments:

శ్రీనివాస్ said...

మీ టపా చదువుతుండగా నా ఆలోచనలు ఒక పదేళ్ళ వెనక్కి పరుగులు తీశాయి. చివరికంటా కాలిన సిగిరెట్ వెళ్ళని చురుక్కుమనిపించడంతో ఉలిక్కిపడి లేచి కాఫీ ఆర్డర్ ఇచ్చాను. పొగలు కక్కే కాఫీ అతను తేగానే వాలెట్ లోనుండి ఒక జాట్ తీసి అందించాను.వాడు సలాం సాబ్ అంటూ వెళ్ళిపోయాడు. సాలోచనగా తల పంకించి కాఫీ సిప్ చేశాను. ఆకస్మాతుగ్గా నా వెన్ను జలదరించింది. రోమాలు నిక్క బోడుచుకున్నాయి. అనేక ప్రమాదాల్లో ఇర్రుక్కుని ఉండడం వల్ల వచ్చిన సిక్త్స్ సెన్స్ అది . అప్రయత్నగా బూతు లో ఉంచిన దాగర్ ని చేతితో నిమురుతూ సందు చివరకి చూశాను. కొందరు దృడకాయులు అటువైపే వస్తున్నారు. ఇంతలో తల మీదా ఎవరో రాడ్ తో కొట్టారు కళ్ళ ముందు నక్షత్రాలు కనిపిస్తుండగా స్పృహ తప్పాను.


తల మీద సుత్తి తో ఎవరో కొడుతున్నట్టు నెప్పిగా అనిపిస్తుండడంతో మెలకువ వచ్చి కామెంట్ రాస్తున్నాను :)

Ravi said...

హో...ఆయనకు బ్లాగుందని నాకిప్పటిదాకా తెలీదు. తెలుగు డెటెక్టివ్ సాహిత్యానికి సరికొత్త సొబగులద్దిన మధుబాబు గారంటే నాకూ అభిమానమే. అసలు నన్ను స్వాతికి ( స్వాతి అంటే అమ్మాయనుకొనేరు :-) ) చేరువ చేసిందే ఆయన ధారావాహికలు. మంచి పరిచయం చేశారు.

Kathi Mahesh Kumar said...

ఈ మధ్యనే తమిళ్,మరాఠీ, హిందీ పల్ప్ ఫిక్షన్ ని ఇంగ్లీషులోకి తర్జుమాచేసి,(తమతమ భాషల్లో చదవలేని) కొత్త జనరేషన్ కు అందించే ప్రయత్నం జరుగుతోంది (http://www.blaft.com/)

అలాంటి ప్రయత్నం చెయ్యడానికి మధుబాబుగారు సుముఖంగా ఉంటే,నేను వీళ్ళతో మాట్లాడతాను.Our next generation should also enjoy the pleasure of SHADOW.

Anonymous said...

ఒక్కసారిగా కాలేజీ రోజులన్నీ గుర్తుకు తెచ్చారు! ఆ నవలలు ఇప్పుడు చూస్తే కొద్దిగా ఆశ్చర్యమేస్తుంది కానీ చదవడం మొదలు పెడితే మాత్రం ఇప్పటికీ ఆపకుండా చదివేస్తాను.

మధుబాబు గారికి బ్లాగుందని తెలిసి ఆశ్చర్యం, ఆనందం వేసింది. ఆయన బ్లాగులో సస్పెన్స్ కథలు రాస్తే ఎంతో బాగుంటుంది.

శ్రీనివాస్ గారూ, మీ కామెంట్ కేక! ఒక్కసారిగా షాడోని కళ్ళముందు నిలిపారు.

రవి said...

వావ్. భలే సమాచారం. ఈ మధ్య ఆయన రచనలు పునర్ముద్రిస్తున్నారు. నా వద్ద ఓ ఇరవై దాకా ఉన్నాయి.

నాకు అన్నిటికన్నా నచ్చిన నవల "బంజాయ్". ఇప్పుడు చదివినా ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అలాంటి స్క్రీన్ ప్లే, కథ చెప్పడం ఇంకెవరికీ రాదేమో.

Prasad Samantapudi said...

మధుబాబు గారి గురించి, ఆయన బ్లాగ్ గురించి రాసినందుకు ధన్యవాదాలు. మీ బ్లాగ్ ఎన్నో సృతులను రేపింది.
* * *
"భయ్యా!" అన్న ఆర్తనాదం ఆ నిశ్శబ్ద నిశీధిలో మార్మోగింది. సడెన్ గా షాడో కాళ్ళకి బ్రేకులు పడ్డాయి. :-)

సూర్యుడు said...

Thanks for the info

Anil Dasari said...

ముఖేష్‌నీ, కులకర్ణిగారి డాడ్జ్ కారునీ వదిలేశారు! (అప్పట్లో ఇండియాలో డాడ్జ్ కార్లెక్కడివో .. 'సిఐబీ' వారు ప్రత్యేకంగా ఇంపోర్ట్ చేయించారేమో ఆయనకోసం :-) )

షాడోకి క్లోన్స్ కూడా ఉండేవారు: డబల్ షాడో, వైట్ షాడో, వగైరా. 'మధురబాబు' అని రచయిత పేరు కూడా కాపీ కొట్టేసి రాసేస్తుండేవాడెవరో. మనమేం తక్కువ తిన్నాం అనుకుంటూ ఎనిమిదో క్లాసులో ఉండగా నేనూ 'షాడో ఇన్ సింగపూర్' అని నా నోట్ పుస్తకంలో ఓ అరవై పేజీల డిటెక్టివ్ నవల గిలికిపారేశా .. విత్ ఇలస్ట్రేషన్స్.

సుజాత వేల్పూరి said...

అబ్రకదబ్ర,
మీ అరవై పేజీలూ ఇంకా మీ వూళ్ళోనే ఉన్నాయా? లేకపోతే మీ బ్లాగులో సీరియల్ గా బొమ్మలతో పాటు పెట్టొచ్చుగా! సైకో అనాలిసిస్ కలిపి ముగింపు కూడా రాద్దురూ!

మధురబాబు సంగతి నిన్న మావారు చెప్పారు.

మా అన్నయ్య రెండో కొడుక్కు ముఖేష్ అని పెట్టబోతుంటే మా అమ్మ తిట్టి వాడిని బాలమురళీ కృష్ణని చేసేసింది తన టేస్టు ప్రకారం!

నేస్తం said...

శ్రీనివాస్ భలే రాసారు
అబ్రకదబ్ర గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్..... ఆ నవలేదో పోస్టండి..మీరెలా రాసారో చదవాలని ఉంది :)

Ramu S said...

సుజాత గారూ...
మంచి పోస్ట్. ఈ షాడో చిన్నప్పుడు నన్ను నీడలా వెంటాడాడు. బూటులో డాగర్, రంగూన్ టౌన్...ఎప్పుడూ గుర్తు వుంటాయి. లెక్కలేనన్ని పుస్తకాలు స్కూల్లో ఉన్నప్పుడే చదివి మైమరచి పోయేవాడిని. ఏ సన్నివేశమైనా కళ్ళకు కట్టినట్లు అందించడంలో మధుబాబు గారు దిట్ట. ఫ్రేం లో ప్రతి చిన్న డిటైల్ ను అద్భుతంగా వర్ణిస్తారు ఆయన.
రాము

Krishnarjun said...

చిన్నప్పుడు వెర్రి గా షాడో కథలు చదివినా, పదొ తరగతికి వచ్చాక ఇంగ్లీషు సినిమాలు చూడడం మొదలెట్టాక నాకు అనిపించెది మధుబాబు గారు ఆ హలీవుడ్ సినిమాలను మక్కీకి మక్కీ దింపేసేవారని. ఒక రాంబో సినిమా చూస్టుంటే నాకు తెలిసొచ్చింది, నెక్స్ట్ సీను అర్థం అయిపొయేది. మంకా కాలంలో అందరికీ హలీవుడ్ సినిమాలు చూసే భాగ్యం లేదు కాబట్టి షాడో నవలల్తో అంతగా మమేకం అయ్యేవాళ్ళం.

Anwar dudekula said...

Anwar Basha

Tanq Srinivas Gaaru! Madhu Babu gaari gurinchi Manchi infrmatin icharu... Shadow ni gurthu chesthoo... Tanqs a lot.


Krishnarjun Gaari reply koncham ibbandi pettindi, Madhu Babu gaarini copy writter gaa chithrinchinanduku.

Post a Comment