July 8, 2010

లెక్కలొచ్చా మీకు?లెక్కలంటే మీలో చాలామంది లాగే నాక్కూడా చచ్చేంత భయంగా ఉండేది చిన్నప్పుడు. పదో క్లాసు ఎప్పుడైపోతుందా లెక్కల బెడద వదిలించుకోవచ్చని ఎదురు చూసిన క్షణాలు బోల్డు.ఆల్ జీబ్రా కల్లో దెయ్యమల్లే వెంటబడి పీడకలలు తెప్పించిన రోజులు అసంఖ్యాకం! రైల్వే ప్లాట్ ఫాముల పొడవులు, వెడల్పులూ మనమెందుకు కొలవాలో,రైలెక్కేది మనం కానపుడు వాటి వేగాలు మనమెందుకు తెలుసుకోవాలో తెలీక బుర్ర వేడెక్కిపోయేది.అందుకే శేఖర్ పెద్దగోపు లెక్కల టపా .రాసినపుడు సంఘీభావం తెలుపుదామని వెళ్తే అక్కడ నాలాంటోళ్ళు బోల్డుమంది ఉన్నారని తెలిసి సంతోషపడ్డాను.చాలా ఏళ్ళ క్రితం బాలజ్యోతి అని ఒక పిల్లల  మాస పత్రిక(ఆంధ్ర జ్యోతివాళ్లది)వచ్చేది. బోల్డన్ని మంచి కథలూ(అందులో రెంటాల గోపాల కృష్ణ గారు రాసిన బొమ్మలు చెప్పిన కథలు నా ఫేవరెట్ గా ఉండేది)అవీ ఉండేవి.అన్నింట్లోనూ అందరి హాట్ ఫేవరెట్ గా ఉండే శీర్షిక,అప్రతిహతంగా పాతికేళ్ళు సాగిన శీర్షిక ఒకటుండేది. అదే "మేథ మే ట్రిక్స్"! అవసరాల రామకృష్ణా రావుగారు నిర్వహించే పజిలింగ్ శీర్షిక!చక్కని చిక్కని చిక్కు లెక్కల్తో బుర్ర వేడెక్కిపోయే శీర్షిక! లెక్కలంటే భయం ఉన్నా,ప్రతి నెలా ఆ శీర్షికలో ఇచ్చే పజిల్స్ మాత్రం జుట్టు పీక్కుని అయినా సాధించే వాళ్లం!


శ్రీ రామకృష్ణా రావుగారు మెదడుకి మేతలాంటి అద్భుతమైన లెక్కల పజిల్స్ తో పాటు చక్కని జానపద కథని కలిపి మల్లెలు,మరువం కలిపిన దండలా ఒక నవల రాశారు.ఆ నవల గురించే నాలుగు మాటలు రాద్దామని!

ఇందులో మామూలుగా ఒక రాజకుమారి,ఆవిడని రాక్షసుడో మాంత్రికుడో ఎత్తుకుపోడం,వాడెవడో రాజకుమారుడొచ్చి కాపాడ్డం..ఇవేవీ ఉండవు. యండమూరి నవలల్లో హీరోయిన్ లాంటి ఒక తెలివైన రాకుమారి,అద్భుత శాస్త్రజ్ఞుడైన రాకుమారుడు ఉంటారు.

కథ కొద్దిగా అయినా చెప్పకుండా పరిచయాలు రాయడం నాకంతగా రాదు.చెప్తాను!:-(


ఒక రాజుగారికి పెళ్ళయి ఎన్నాళ్ళయినా పిల్లలు కలగరు.రాణీగారికి ఒక పిల్లి తల్లి(లేదా తల్లిపిల్లి) ఇచ్చిన శాపం కారణంగా! తర్వాత ఆ పిల్లి,  రాణిగారికి పిల్లలు కలుగుతారని శాపం సడలిస్తుంది కానీ కొన్ని కండిషన్స్ పెడుతుంది.

 రాణిగారికి ఆడపిల్ల పుడుతుంది. ఆ పిల్లకు లెక్కలంటే ఎంతో ప్రాణం.అందుకే పేరు శారద అయినా అందరూ గణిత విశారద అని పిలుస్తుంటారు.పెరిగి పెద్దయ్యాక పెళ్ళి చేసుకోమంటే లెక్కల్లో తనని ఓడించిన వాడినే పెళ్ళాడతానని చెప్పేస్తుంది.ఆమెకో ఇద్దరు చెలికత్తెలు. గిలిగింతా,చికిలింతానూ!వాళ్ళూ గణితంలో ఉద్దండులే!

చెలికత్తెలిద్దరి ప్రశ్నల్నీ దాటుకుని రాకుమారి వద్దకెళ్ళాలి.అక్కడ ఓడిపోతే సరాసరి విషమందిరంలోకి పంపి మరణ దండన విధిస్తారు!ఇవీ షరతులు! అలా చాలామంది వచ్చి కొన్ని లెక్కల్ని విప్పి,మరికొన్ని చిక్కుల్ని విప్పలేక విషమందిరంలోకి పోతారు,.


మరోచోట పెరుగుతున్న కథానాయకుడు (ఇతడి తల్లి రాకుమారి తల్లికి స్నేహితురాలే!వీరిద్దరి జననానికీ ఒక లింక్ ఉంటుంది కూడా)విజ్ఞానవర్మ జీవశాస్త్రంలో ఆసక్తి కొద్దీ ప్రయోగాలు చేసి మరణాన్ని జయించే సంజీవని కనిపెడతాడు.ఇతడి పక్కన చిన చిలిపిశ్రీ,పెను వెకిలిశ్రీ అనే బావామరుదులు శిష్యులు!

రాకుమారి చేతిలో చస్తున్నవారి సంఖ్య రాజుగారిని కలవరపెడుతుంది.ఇంతలో శారద చేతిలో హతుడైన పొరుగుదేశ యువరాజు తండ్రి ఆగ్రహించి వీరి రాజ్యం పైకి దండెత్తే  సన్నాహాలు చేస్తాడు.ఈ లోపు విజ్ఞానవర్మ రాజ్యప్రవేశం చేసి ఎవరికీ తెలీకుండా విషమందిరం నుంచి పొరుగు దేశ యువరాజునేకాక అందరినీ బతికిస్తాడు. దానితో శారద అతడిని ఎలాగైనా ఓడించి చంపాలనుకుంటుంది(మరోపక్క అతడి పట్ల ఆకర్షితురాలవుతూనే...)

చివరికి శారద,వర్మల మధ్య లెక్కల చిక్కులతో పోటీ జరుగుతుంది.వర్మ గెలుస్తాడు.ఇంతలో వర్మ అకాలమరణం చెంది కథ అనుకోని మలుపు తిరుగుతుంది.మలుపేమిటో,కథ సుఖాంతం అయిందో లేదో తెలుసుకోవాలంటే ఈ నవల తప్పక చదవాల్సిందే!

నాకు వారం పట్టింది పూర్తిచేయడానికి!ఎందుకంటే వీలైనన్ని పజిల్స్ సాల్వ్ చేసుకుంటూ చదివాను.కొన్ని నా వల్ల కాక వదిలేసి,రాకుమారి జవాబు కోసం వెదుక్కున్నాను.కొన్ని పజిల్స్ సరదాగా!

1."ఒక మార్గశిర మాసంలో చెట్టుకు రెండు వందల చొప్పున మల్లె మొగ్గలుంటే ఐదు చెట్లకెన్ని మొగ్గలుంటాయి?"2.అందమైన సరోవరంలో కొన్ని పద్మాలు కొన్నితుమ్మెదలూ ఉన్నాయి.రెండేసి తుమ్మెద లు ఒక్కొక్క పద్మం మీద వాలితే ఒక  పద్మం మిగిలిపోతుంది.అలా కాక ఒకే తుమ్మెద రెండేసి పద్మాల మీద వాలితే ఒక తుమ్మెద మిగిలిపోతుంది.పద్మాలెన్ని? తుమ్మెదలెన్ని?3.ఎనిమిది నాలుగులు ఉపయోగించి ఎలాగైనా 500 తెప్పించాలి!4.రెండు కుంచాల సెనగలు నానవేస్తే నాలుగు కుంచాలు అవుతాయి.రెండు నానేస్తే ఎన్ని అవుతాయి?:-))5.పదిమంది గల కుటుంబంలో ఇద్దరు తాతలు,ఒక అమ్మమ్మ,ముగ్గురు తండ్రులు,ముగ్గురు కొడుకులు,ముగ్గురు కూతుళ్ళు,ఇద్దరు అత్తగార్లూ,ఇద్దరు మామగార్లూ,ఒక అల్లుడు,ఒక కోడలు,ఇద్దరు అన్నదమ్ములు,ఇద్దరు అక్కచెల్లెళ్ళూ ఉన్నారు!ఎలాగ?


ఇవి గిలిగింతా,చికిలింతా అడిగే ప్రాథమిక ప్రశ్నలు మాత్రమే! ఇంకా రాకుమారి అడిగే ప్రశ్నలు ఇవ్వలేదు.

ఇలాంటి మరెన్నో లెక్కలు ఈ పుస్తకం నిండా ఉన్నాయి.అందుకే ఈ పుస్తకం పిల్లల నవల మాత్రమే కాదు,పెద్దలు చదివాక పిల్లలకు విడమర్చి చెప్పాల్సిన నవల.


ఈ నవల మొదట ముద్రణ పడింది 1973లో! కొన్నాళ్ళకి ఆ నవలని అందరూ మర్చిపోయారు! అయితే ఆ నవలను చదివి అప్పట్లో తెగ సంబరపడిన యల్లంరాజు శ్యామసుందర్ అనే ఎన్నారై గారు దాని మీద అభిమానంతో మళ్ళీ ముద్రించడానికి ముందుకొస్తే రచన శాయిగారు దాన్ని  సంపాదించి ముద్రించేశారు.

నూటపాతిక పేజీల ఈ మంచి నవల ధర కేవలం..కేవలం నలభై రూపాయలు!

నేను మాత్రం ఈ పుస్తకాన్ని కొనలేదు. దాసరి సుబ్రహ్మణ్యం గారి "ప్రత్యేక రచన"లో ఇచ్చిన ప్రత్యేక చందమామ పజిల్ సాల్వ్ చేసి బహుమతి గా సంపాయించుకున్నా!


పెద్దల్ని పిల్లల్ని కూడా అలరించే ఈ పుస్తకం

వాహినీ బుక్ ట్రస్ట్,


1-9-286/3,విద్యానగర్,హైద్రాబాదు వద్ద దొరుకుతుంది.వాహినీ బుక్ ట్రస్ట్ వారు పుస్తక ప్రియుల కోసం ఈ నవలను 30 రూపాయలకే అందిస్తున్నారు...పది రూపాయల ప్రత్యేక తగ్గింపుతో! కాపీలు అయిపోతే మళ్ళీ వేస్తారో లేదో,త్వర పడండి!

ప్రముఖ పుస్తక కేంద్రాలన్నింటిలోనూ కూడా లభ్యం!

17 comments:

రవి said...

నాకు అసూయగా ఉంది. దాసరి వారి ప్రత్యేక రచన దొరకలేదు నాకు. రచన వారికి ఫోను చేసి మనియార్డరు చేసినా ఫలితం లేదు.

బాలజ్యోతి మా ఇంట కూడా జ్యోతులు వెలిగించింది. మేధమేట్రిక్స్ ను పుస్తకం లో నేను పరిచయం చేశాను చూడండి.

ఈ పుస్తకం తప్పక చదువుతాను.

సుజాత వేల్పూరి said...

రవి గారూ. మరేం పర్లేదు. దాసరి గారి ప్రత్యేక సంచికలు నా వద్ద ఉన్నాయి. మీకోటి ఉంచుతాను!

మధురవాణి said...

ఆహా.. మీ పరిచయం చదువుతుంటే అర్జెంటుగా ఈ పుస్తకం చదివేస్తే బాగుండు అనిపిస్తోంది. కథ బాగుంది, వాళ్ళ పేర్లు భలే బాగున్నాయి. పజిల్సు పూర్తి చేయగలనో లేదో మరి.. ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న లెక్కలు కదా! పిల్లలకి ఇలాంటి పుస్తకాలు అందుబాటులో ఉంటే ఎంత బాగుంటుంది కదా! Thanks a lot for introducing such a nice book :-)

ఆ.సౌమ్య said...

నే చెప్తా నే చెప్తా మీరడిగిన్ నాలుగవ ప్రశ్నకి సమాధానం రెండు సెనగలు నానేస్తే రెండే అవుతాయి :D

ఈ పుస్తకం పేరు విన్నా కానీ చదవే అవకాశం రాలేసు. ఈ సారి కొనేసి మరీ చదువుతా, నాకూ లెక్కకంటే భయమే :P

స్థితప్రజ్ఞుడు said...

మీరు రాసింది చదువుతుంటే ఎప్పుడెప్పుడు చదవాలా అనిపిస్తోంది....

యండమూరి రాసిన భేతాళ ప్రశ్నలు చదివారా....కథ రూపం లో లేకపోయినా, ఇలాంటి బుర్ర తినే ప్రశ్నలు చాలానే ఉన్నాయ్.

నాకు పూణే లో ఈ పుస్తకం దొరికే ఆవకాశం ఎమన్నా ఉందంటారా..

అసలు ఆన్ లైన్ లో తెలుగు పుస్తకాలు దొరికే సైట్ ఎమన్నా తెలుసా మీకు......

Anonymous said...

అమ్మో, ఐతే వెంటనే కొనాలండోయ్!

అయినా మార్గశిర మాసంలో మల్లెపూలేమిటండీ చోద్యం! ఇదేగా ఆన్సరూ?

మధురవాణి said...

@ స్థితప్రజ్ఞుడు,
http://www.avkf.org/ వెబ్సైటు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికైనా తెలుగు పుస్తకాలు పంపిస్తారండి. నేను కొన్ని పుస్తకాలు జర్మనీకి తెప్పించుకున్నాను. కాకపోతే, అన్నీ పుస్తకాలు దొరకవు. అయినా చాలానే ఉన్నాయి. మీరొకసారి చూడండి.

వేణు said...

రవి గారూ, రచన మే సంచిక (దాసరి గారి సంస్మరణ సంచిక) మీకు అందని విషయం ప్రస్తావిస్తూ ‘రచన’ సంపాదకుడు శాయి గారికి మెయిల్ రాశాను. ఆయన ఇలా జవాబిచ్చారు.

From: sai yvsrs

rachanapatrika@gmail.com

Dear Sri Venu garu:

Namaste!

Thank you for the feed back.

I don't remember Mr Ravi's request. If I had received his MO I should have sent it on the same day. Any way if you have his email pl let me know so that I can sort out the issue. If you have his postal address please send it so that I can send him May issue.

with best wishes

yours

sai

ఈ- మెయిల్ పంపి, శాయి గారు ఫోన్ కూడా చేశారు. మీ పోస్టల్ అడ్రసును పైన ఉన్న మెయిల్ ఐడీకి పంపండి రవి గారూ!

మరో విషయం చెప్పనా? రచన మే సంచిక 153 పేజీలో చందమామ పత్రిక గురించి రాసిన తెలుగు బ్లాగుల జాబితాను బాక్సుగా ఇచ్చారు. అందులో మీ బ్లాగు కూడా ఉంది! :)

రవి said...

వేణు గారు, కృతజ్ఞతలండి. మా ఆవిడ ఫణిజ్యోతి 040-27071500 నంబరుకు ఫోను చేసి, రచన పబ్లికేషన్స్ అన్న మాట విని, ఆ మాట్లాడిన వారితోనే అడిగి M.O. ఆమె పేరు మీదే పంపడం జరిగింది. ఏదో కమ్యూనికేషన్ గాప్ అనుకుంటాను. నేను మెయిల్ చేస్తాను.

మీకు, సుజాత గారికి అనేక వందల కృతజ్ఞతలు.

A K Sastry said...

అవసరాల రామకృష్ణారావుగారి కృషిని కొనియాడుతూ......

ఈ లెఖ్ఖలన్నీ "భాస్కర గణితం" లోవి. 1950 ల్లో లీలావతీ భాస్కరాచార్య ప్రచురించిన భాస్కర గణితం అట్టమీద "తుమ్మెదలూ, కలువ పువ్వులూ" సమస్య ముద్రించి వుండేది.

మేము ఆ లెఖ్ఖలు చేసి, చాలా ట్రిక్కులూ, గమ్మత్తులూ, నిజమైన గణితమూ నేర్చుకున్నాము.

ఇప్పుడు "భాస్కర గణితం" లభిస్తోందో లేదో! (మా చిన్నప్పుడే అసలు పుస్తకం కాకుండా, లీలవతి పుస్తకం మాత్రమే లభ్యం!)

భావన said...

బావుందే కధేదో... అబ్బ ఇన్ని పుస్తకాలు ఎలా అబ్బ కుళ్ళేస్తోంది..
ఏంటీ సమాధానాలు సరిగా చెప్పక పోతే విష మందిరం లోకి పంపుతావా ఏమి నువ్వు కూడా.. అమ్మోవ్ నేను చెప్పను బాబోయ్.. ఏదో బతికి బాగుంటే చలికి వణుక్కుంటూ ఎండకు ఎండుకుంటూ బతుకుతాము. ;-)

padmasri said...

sujata garu
manchi pustakala gurinchi chakkaga rastunnaru. vahini book trust phone no. kooda iste hyderabad lo teligga vellagalugutamu. aa punyam kooda kattukoroo?
padma

శేఖర్ పెద్దగోపు said...

నేటివిటీతో కూడిన ఇలాంటి పజిల్స్ చాలా బాగుంటాయండీ..చాలా థాంక్స్ మంచి పుస్తకం పరిచయం చేసారు...

Raj said...

When I saw the book on the table in your house when I reached your house... Then itself I thought you are gonna write a post on this book...

Good intro..

mEE daggarE maLLi ee book thEEsukunTanEmo...
cHUddaam...

సి.ఉమాదేవి said...

మెదడుకు మేత కావాల్సిందే.పజిలాసక్తితోపాటు పఠనాసక్తిని రేకెత్తించే గణిత విశారద నవలల్లో లెక్కింపదగినదే!మీ విశ్లేషణ గణణీయంగా ఉంది సుజాతగారూ.

చింతా రామ కృష్ణా రావు. said...

మీ విశ్లేషణ అద్భుతం.

రామ్ said...

చాలా బ్రమ్హాండం గా ఉంది మీ review.

అవసరాల వారికి నమోన్నమహ

Post a Comment