November 23, 2010

అనైతికం

 అనైతికం నవల గురించి రాయాలని ఎప్పటినుంచో అనుకున్నాను. సగం రాసి ఎక్కడో పడేశాను. అది నిన్న పాత ఫైల్స్ లొ కనపడి మొత్తం పూర్తి చేసి ఇవాళ బ్లాగులో పెడుతున్నా! :-))




నిస్సందేహంగా యండమూరి ఒక సంచలన రచయిత. (మంచి రచయితా కాదా అనేది మీరు చదివిన నవలలల్ని బట్టి మీరే నిర్ణయించుకోండి) కుటుంబ కథలే నవలలుగా చెలామణీ అవుతున్నరోజుల్లో ఒక ప్రభంజనం లా దూసుకొచ్చి సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. అద్భుతమైన శైలి అతని సొంతం. సస్పెన్స్ తో వచ్చేవారం దాకా ఎదురు చూడ్డం లోని మజా మా తరం పాఠకులకు అనుభవంలోకొచ్చేలా చేశాడు.

ఎన్నో నవలలు రాసినా నాకు అన్నింటికంటే నచ్చేవి అనైతికం, వెన్నెల్లో గోదారి. రెంటి కథనాల్లోనూ చక్కని బిగి ఉంటుంది.అన్ని మూలల నుంచీ సూత్రాలను లాగి చక్కగా ముడివేసిన నేర్పు ఉంటుంది.

ఇతనివే కొన్ని నవలలైతే ఇప్పుడు చదువుతుంటే "ఒకప్పుడు ఎంతో ఉత్కంఠగా ఈ పుస్తకం ఎలా చదివానా?" అని గొప్ప సందేహం వచ్చే పుస్తకాలు కూడా ఉన్నాయి.ఉదా:రక్త సింధూరం,లేడీస్ హాస్టల్,అగ్నిప్రవేశం(ఇంకా ఉన్నాయి..)మొదలైనవి. అతడి శైలి మీద ఇష్టంతో ఒకప్పుడు కొనిపెట్టుకున్న నవలలు బుక్ షెల్ఫ్ లోంచి వెక్కిరిస్తుంటాయి నన్ను!

ఎవరికైనా కావాలంటే అవి ఇచ్చేస్తాను. ఎప్పటికీ..అచ్చంగా!

అనైతికం నవల ఆంధ్ర ప్రభ లో సీరియల్ గా వచ్చింది. అప్పుడు మొత్తం చదవకపోయినా తర్వాత నవల కొన్నాను.(దాన్ని మా ఆడపడుచు పట్టుకెళ్ళి పేజీలన్నీ ఊడగొట్టిన సంగతి ఇంతకు ముందొకసారి. రాశాను! తర్వాత మళ్ళీ ఇంకో కాపీ కొన్నాను)

ఒక మనిషికి సంబంధించి ఏది నైతికం?
ఏది అనైతికం?
దీన్ని ఎవరు నిర్ణయిస్తారు? ఎందుకు నిర్ణయించాలి? ఎవరికేది కావాలో వేరొకరు ఎందుకు నిర్ణయించాలి?
అసలు నైతికత వ్యక్తిగతమా? సామాజికమా?

ఇవన్నీ అందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ప్రశ్నలే! మనకు నైతికమే అనిపించింది ఇంకొకరికి అనైతికంగా కనిపించవచ్చు! ఈ విశ్లేషణే ప్రధానంగా ఈ నవల సాగుతుంది.

మీలో చాలా మంది ఈ నవల చదివే ఉంటారు.అయినా పరిచయం రాసేటపుడు పాత్రల్ని పరిచయమో, విశ్లేషణో చేసి ఊరుకోకుండా కథ కూడా చెప్పడం నాకలవాటు కాబట్టి చెప్తాను.

ఈ నవల్లో ముఖ్య పాత్రలు మూడూ స్త్రీలే! ఈ ముగ్గురికీ బంధుత్వం ఉంటుంది. వీరు జీవితాలను కొంతమంది పురుషులు ప్రభావితం చేస్తారు. స్త్రీ వాదానికి వ్యతిరేకంగా రచించిన ఒక పుస్తకాన్ని నిషేధించాలని కోరుతున్న స్త్రీవాదుల లాయర్ గా లండన్ కోర్టులో షాంలా( శ్యామల)మనకు పరిచయమవుతుంది. ఆమె తన తల్లితో కలసి లండన్లో ఉంటుంది. తల్లి  డైవర్సీ! ఇక్కడ స్త్రీవాదం పై కొన్ని వాదప్రతివాదాలు నడుస్తాయి.

చివరికి శ్యామల కేసులో ఓడిపోతుంది. ఇంతలో మరో పక్క తన తల్లి తండ్రులు విడిపోవడానికి కారణం తన పెదనాన్నతో తల్లికి గల అక్రమ సంబంధమే అని తెలుస్తుంది...తన సవతి తమ్ముడి ద్వారా!తల్లి మీద కోపంతో మండిపడుతూ తండ్రిని చూడ్డానికి ఇండియా బయలుదేర్తుంది.

ఇక్కడినుంచి ఆమె తల్లి అహల్య తన గతం మనకి చెప్పడం ప్రారంభిస్తుంది.వివిధ కారణాల వల్ల ఆమెకు తన భర్త అన్నతో(బావగారితో) శారీరక సంబంధం ఏర్పడుతుంది. అవి నవల్లో చదివితేనే బాగుంటుంది. చివరికి అది బయటపడి ఆమె విడాకులు తీసుకుంటుంది.

నవల్లోని మరో ముఖ్య పాత్ర అహల్య వదిన(అన్న భార్య)అచ్చమ్మ!(అవును అచ్చమ్మే)! దళిత స్త్రీ!ఒకతనితో ప్రేమ(అనుకుని)లో పడి రెండేళ్ళపాటు పెళ్ళి లేని సహజీవనం చేసి విడిపోయి అహల్య అన్నను పెళ్ళాడుతుంది.

శ్యామల తండ్రిని కలుసుకుందా? మామయ్య,అత్తల ను కలిసి తల్లి ఎందుకలా చేయవలసి వచ్చిందో తెలుసుకుందా? అపార్థం తొలగిపొయిందా? ఇవన్నీ నవల్లో చదివితే బావుంటాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నవలే కాబట్టి ముగింపు చెప్పడం లేదు.(దొరకని పుస్తకం అయితే కథ మొతం చెప్పేద్దును)

ఈ నవల ముందు మాటలో యండమూరి స్త్రీ వాదం గురించి కర్ర విరక్కుండా, పాము చావకుండా కొన్ని మాటలు రాశారు.అవి అప్రస్తుతం!నవలను పక్కనపెట్టి బోల్డంత చర్చకు దారితీసే వాక్యాలు అందులో ఉన్నాయిమరి!

పాత్రల వ్యక్తిత్వాలను తీర్చి దిద్దడంలో యండమూరిది అందె వేసిన చేయి. వాటి మనో భావాలను, ముసుగుల్లేని అంతరంగాలను,అత్యంత ప్రతిభావంతంగా చిత్రీకరిస్తాడు. అహల్య అత్తగారింట్లో వాతావరణాన్ని,జాణ లాంటి అత్తగారిని,పాఠకులు ఎగ్జైట్ అయిపోయేంత అద్భుతంగా చిత్రీకరించాడు.

యండమూరి నవలల్లో స్త్రీ పాత్రలు అద్భుతమైన తెలివితో, ఇనీషియేటివ్ గా, మేథస్సూ ఉట్టిపడుతూ ఉంటాయి.మరోపక్క స్త్రీ సహజమైన సున్నితత్వం, భావుకత, ప్రేమ వీటన్నితో పరిపూర్ణంగానూ ఉంటాయి.అన్నింటికంటే ముఖ్యంగా ఆత్మవిశ్వాసం యండమూరి హీరోయిన్లకు పెట్టని ఆభరణం! అనూష,రమ్య, సౌదామిని,వైజయంతి,లక్ష్మి,ప్రవల్లిక,ప్రమద్వర,ఎవరినైనా తీసుకోండి!వీళ్లలోవాళ్ళే అహల్యా,అచ్చమ్మానూ!

యండమూరి వ్యక్తిత్వ వికాసం పుస్తకాల వైపు మళ్ళినా, నాకెందుకో వాటిలో లేని మనోవిశ్లేషణ అతని(కొన్ని)  నవలల్లోనే కనిపిస్తుంది. అతని పాత్రల స్వభావాలే పెద్ద పాఠాలు!  

ఈ నవల్లోని రెండు ముఖ్య పాత్రలు అహల్యా, అచ్చమ్మ ఇద్దరూ ఉన్నతమైన వ్యక్తిత్వం గల వాళ్ళుగా రచయిత ఎస్టాబ్లిష్ చేస్తాడు. వ్యక్తుల సెక్స్ జీవితమే ప్రాతిపదికగా,వాళ్ళ ఇతర ప్రవర్తన వ్యక్తిత్వం ఏమీ అర్థం చెసుకోకుండానే (అర్థం చేసుకునే కెపాసిటీ లేకనొ)  వాళ్ళకు వ్యభిచారులనో,మరోటనో టాగులు  అంటగట్టే  మనస్తత్వం ఉన్నవాళ్ళకు ఈ నవల అర్థం కాదు.కాబట్టి అలాంటి ఆలోచనలుంటే ఈ నవల చదవకపోవడమే మంచిది.

 జీవితంలోని ఇతర సంఘర్షణల వల్ల ఎటూ తప్పించుకోలేని స్థితిలో ఇలాంటి బంధాల మధ్య ఇరుక్కునే పరిస్థితి ఎవరికీ రాదనీ, అలా వచ్చిందంటే అది ఆడాళ్లు కొవ్వెక్కి చేసే పనే అని నిర్ణయించేసే వాళ్లకి ఏమని చెప్పగలం? ఎక్కడో యండమూరే అనుకుంటాను అన్నాడు, అవకాశం రానంత వరకూ అందరూ మాట్లాడే మాటలే ఇవి! నవల సీరియల్ గా వస్తున్నపుడే దీని మీద బోలెడు చర్చలు నడిచాయని గుర్తు!

మొదట్లో అహల్య కూడా భర్తను ఎంతగానో ప్రేమిస్తూ కోటి ఆశలతో అతనిజీవితంలోకి ప్రవేశిస్తుంది. కానీ పుట్టింట్లో అందర్నీ వదులుని అక్కడ అడుగుపెట్టిన ఆమెకు ఎదురైన పరిస్థితి ఏమిటి? చదువుకుని మంచి వ్యక్తిత్వాన్ని సంతరించుకున్న ఒక ఆడపిల్ల ఎంతమాత్రమూ దిగమింగుకోలేని పరిస్థితులు అక్కడ ఎదురవుతాయి. అవి కావాలని తెలివిగా సృష్టించబడతాయి. పెళ్ళి రోజు నాడు సరదాగా భర్తతో కాసేపు కల్సి కబుర్లు చెప్పుకోవాలన్న చిన్న కోరిక కూడా  భగ్నమైపోతుంది,.... ఎవరికీ అదొక కారణమే అనిపించని అతి చిన్న సాకుతో! కానీ ఇలాంటివి మనసులో ఎంతగానొ గుచ్చుకుపోతాయి.

అటువంటి డెస్పరేట్ కండిషన్ లో ఆమె మానసిక పరిస్థితిని వాడుకుని ఆమె తెలివి తేటల్ని(యండమూరి హీరోయిన్లు భలే తెలివిగా ఉంటారు కదా) పొగిడి,తన జీవితలోని ప్రేమ రాహిత్యాన్ని ఆమె ముందు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి ఆమెతో సంబంధం పెట్టుకుంటాడు ఆమె భర్త అన్న!

తనకు అతనితో సంబంధం ఇష్టమా కాదా అన్నది కూడా తేల్చుకోలేని సందిగ్ధంలో ఉంటుంది అహల్య! ఆమె మానసిక స్థితిని రచయిత చాలా బాగా చిత్రీకరిస్తాడు ఇక్కడ!

విషయం తెలియగానే తన జీవితం సర్వనాశనమైపోయిందని గోల చేసిన అహల్య భర్త(అహల్య భర్త,బావగారు పాత్రలకు పేర్లు కూడా ఉండవు ఈ నవల్లో) గొప్ప నీతిపరుడని మనం కూడా అయ్యో అని జాలిపడతాం! కానీ అహల్య తోడికోడలి చెల్లెలికి గర్భం రావడానికి కారణం అహల్య భర్తే అని తెలుస్తుంది !

మరీ ఎక్కువగా నీత్యుపన్యాసాలు ( నీతి+ఉపన్యాసాలు = యణాదేశ సంధి) దంచే వారి అసలు రంగులు ఇలాగే ఏడుస్తాయి.

అచ్చమ్మ సంగతికొస్తే ...... తెలివైనదైనా ఆడపిల్ల కావడంతో సురేష్ చూపించిన కన్ సర్నూ, అతడి లెక్కలేని తనమూ ,నిర్లక్ష్య ధోరణీ చూసి హీరో వర్షిప్ తో ప్రేమలో పడుతుంది. నవల చదువుతున్నపుడు మనకూ అతడు నచ్చుతాడు. తర్వాత వాడో పెద్ద అవకాశ వాదనీ వెధవనీ తెలుస్తుంది. అతడితో కల్సి జీవించి,అతడి గురించి మొత్తం తెలిశాక డిప్రెస్ ఐపోయి ఎలాగో బయటపడిన ఆమెను అహల్య అన్న శ్రీకాంత్ పెళ్ళాడతాడు.

సెక్సే ప్రాతిపదికగా పాతివ్రత్యాలను,పవిత్రతను నిర్ణయించుకుంటూ పోతే ఈ నవల్లో కనపడేవన్నీ అనైతిక కథలే!(గమనిక:ఈ నవల్లో సెక్స్ వర్ణనలూ,దృశ్యాలూ వగైరాలేవీ ఉండవు)  కానీ పాఠకులు దీన్ని అంతగా ఎందుకు ఆదరించారంటే స్త్రీ పురుష   సంబంధాల్లోని సంక్లిష్టతను,మనసు లోతుల్లో నైతికత ముసుగేసిదాచుకునే భావాలని యండమూరి ఇందులో దిగంబరంగా చూపించేశాడు. ఈ నవల రాయడంలో అతని ప్రతిభకు హాట్సాఫ్ చెప్తాను నేను!. (అతడి  చాలా నవలల విషయంలో తల పట్టుక్కూచుంటాను....అది వేరే సంగతి)


ఈ మధ్య నేనో కోర్సు చదవడం మొదలుపెట్టాను. అందులో భాగంగా ఎన్నో కేసులు పరిశీలించాల్సి వస్తుంది. కొంత వరకూ వివాహేతర సంబంధాలున్న కేసులు!

ఇవి సమాజంలో ఎంత మామూలైపోయాయంటే "పరిస్థితి ఇలా ఉందా? ఇంత సర్వ సామాన్యమైపోయిందా?"అని నిర్ఘాంత పోయేంత. మారిన జీవన ప్రమాణాలు,విధానాలు,పరిస్థితుల కారణంగా ఇలాంటి పరిణామాలు సంభవిస్తున్నాయి.

కానీ అలాంటి పరిస్థితులు ఎందుకేర్పడ్డాయి,కారణాలేమిటనే విషయం పరిశీలించాలి. ఆ బంధం లో " ప్రేమ" ఉందా లేదా అన్నది తప్పకుండా పరిశీలించాలి.  అహల్య సంబంధంలో ప్రేమ లేదు..లేదు..! భర్త మీద ఉన్న నిరాసక్తత, వ్యతిరేకత ఆ బంధానికి దారి తీస్తాయే తప్ప అందులో ప్రేమ,కంపాషన్  లేనే లేవు.


 అచ్చమ్మదీ, అహల్యదీ మాములుగా గడిచే సాధారణ   జీవితం కాదు.చాలా డెస్పరేట్ పరిస్థితిలో వాళ్ళు అలాటి పరిస్థితికి గురవుతారు.నవల చదువుతున్నంత సేపూ అహల్య, అచ్చమ్మల నిస్సహాయ పరిస్థితుల పట్ల పాఠకుడు చలించిపోతాడు. మనసున్న మనిషిగా స్పందిస్తాడు.

చివర్లో శ్రీకాంత్ అచ్చమ్మల కొడుకు హోమ్ సైన్స్ చదువుతూ ఉండటము,కూతురు ఇంజనీరింగ్ చదివి ఉండి కూడా  గృహిణిగా స్థిరపడాలని ఉందని చెప్పడమూ చాలా టచింగ్ గా అనిపిస్తుంది.

డబ్బు కోసం కాక మనసు పెట్టి రాస్తే యండమూరి మంచి నవలలు రాయగలడని చెప్పడానికి ఉదాహరణలు రెండు నవలలు! వెన్నెల్లో గోదారి,అనైతికం! (ఆనందోబ్రహ్మ కమర్షియల్ నవలే)

ఎవరి నైతికత పట్ల వాళ్లకి నిబద్ధత ఉంటే చాలని,వారితో సంబంధం లేనివాళ్ళకు వాళ్ళను ప్రశించే హక్కు లేదనీ యండమూరి గట్టిగా నొక్కి వక్కాణిస్తాడు ఈ నవల్లో!

అద్భుతమైన శైలీ ,కథనంతో చదివించే ఈ నవల అన్ని పుస్తకాల షాపుల్లోనూ లభ్యమే!


 ప్రస్తుతం ఈ నవల ఎవరికో ఇచ్చి ఉండటం వల్ల (రాజ్ కి అనుకుంటా) కవర్ పేజీ ఫొటో పెట్టలేకపొతున్నాను! పైగా కవర్ పేజీ అంత సెన్సిబుల్ గా కూడా ఉండదు లెండి! :-))

చదివిన వాళ్ళు మీకెలా అనిపించిందో చెప్పండి. చదవని వాళ్ళు చదివి చూడండి!

66 comments:

భాను said...

ఈ మధ్యే మళ్ళీ చదివాను. మీరన్నట్లు యండమూరి నవలల్లో మంచి నవల .ముందు మాటలో తను అంటాడు ఈ నవల ముగింపు పట్ల అసంతృప్తే కాదు చదువుకున్నంత సేపు మనసంతా దేవేసినట్లు ఒక రకమయిన ఫ్రస్టేషన్ కలుగుతున్నట్లు ....వాస్తవాన్ని చెప్పాలన్న తాపత్రయంతో వ్రాసిన నవల అని. మీ విశ్లేషణ బాగుంది. మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే పుస్తకం

నిషిగంధ said...

చాలా బావుంది, సుజాతా.. ఈ నవల విశ్లేషణని ఇంతకన్నా బాగా చేయలేరేమో! ఈ పుస్తకం చాలా సంవత్సరాల తర్వాత ఆ మధ్య మళ్ళీ చదివి, ఆ భావోద్వేగంలో విశ్లేషణ రాసేయాలని కూర్చున్నా.. 2,3 పేరాలు రాసాక అర్ధమైంది, అదెంత కష్టమైన పనో! సో, హ్యాట్సాఫ్ టు యు!

"యండమూరి వ్యక్తిత్వ వికాసం పుస్తకాల వైపు మళ్ళినా, నాకెందుకో వాటిలో లేని మనోవిశ్లేషణ అతని(కొన్ని) నవలల్లోనే కనిపిస్తుంది. అతని పాత్రల స్వభావాలే పెద్ద పాఠాలు! "

So true!

మధురవాణి said...

యండమూరి అనైతికం, వెన్నెల్లో గోదారి.. నేను కొనుక్కోవాల్సిన లిస్టులో చేరుస్తున్నా! అన్నట్టు, నా దగ్గర 'అంతర్ముఖం' పుస్తకం ఉంది సుజాత గారూ..ఇంకా చదవలేదు.. దాని గురించి మీరేవంటారూ? :)

MURALI said...

రివ్యూ సగం చదివి టైం చూసా. 9 కావస్తుంది. బుక్‌షాప్ మూసే టైం అని పరిగెట్టుకుంటూ వెళ్ళా కానీ నాకు ఈ పుస్తకం దొరకలేదు. వా :( మీ దగ్గర తీసుకుందామంటే చివర్లో ఝలక్ ఇచ్చారు వా:(

Raj said...

heheh.. you gave it to me only...

but it is yet to be read :)
will complete some day..

KumarN said...

అంతకుముందు కూడా మీ బ్లాగులో ఇదే కామెంట్ ఎక్కడో రాసినట్లున్నాను. యండమూరి తనకు "అంతర్ముఖం" అన్నిటి కన్నా ఎక్కువ నచ్చిన నవల అంటారు కానీ, నాకు మాత్రం ఆయన రాసిన వాటిల్లో "అనైతికం" బెస్ట్ అనిపిస్తుంది. నాకు చాలా దగ్గరయిన ఫామిలీ లైఫ్ ఎక్స్పెరీయన్స్ లోంచి వెళ్తున్నప్పుడు, నేనా నవల చదవడం జరిగింది. కొన్ని డ్రమాటిక్ థింగ్స్ తప్పితే ఆ నవల నిజానికి ఎంత దగ్గరగా ఉంటుందనేది నాకప్పుడే షాకింగ్ ఇంపాక్ట్ తో అనుభవమయింది. ఇట్ వాజ్ పెయిన్ ఫుల్ టు రీడ్ ఫర్ మి.

రచయితలు వారు కాని జీవితాల్లోకి ఎలా వెళ్ళిపోతారో అనేది, నాకెప్పటికీ ఆశ్చర్యమే.

నా దగ్గరుంది అనైతికం.

పోతే, ఆయన రాసిన వాటిల్లో అనందో బ్రహ్మ అప్పటికీ, ఇప్పటికీ నా ఫేవరేట్. కొన్ని కొత్త ఫీలింగ్స్ ని నాకు పరిచయం చేసిన నవల నాకది అప్పట్లో. కాకపోతే "మందాకిని" లే కనపడట్లేదు బయట నాకు :-(

సుజాత వేల్పూరి said...

భాను గారూ, అవును, ఈ నవల చదువుతుంటే మనకే ఆ ఫ్రస్ట్రేషన్ కలుగుతూ ఉంటుంది. "అయ్యో, అహల్య ఎంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తోంది" అని కంగారు వేస్తూ ఉంటుంది. కానీ అహల్య స్థానంలో ఎవరున్నా ఇంకా సెల్ఫ్ కంట్రోల్ కోల్పోయి ప్రవర్తించే వారే కానీ అంతకంటే బెటర్ గా కాదు.

యండమూరి నవలల్లో "ఇది బావుంటుంది చదవండి" అని నా అంతట నేను రిఫర్ చేసి ఇచ్చే పుస్తకాల్లో ఇదొకటి!

సుజాత వేల్పూరి said...

నిషి,

అవును, చాలా కష్టమనిపించే సగం రాసి ఎక్కడో పడేశాను. మళ్ళీ నిన్న ఒకసారి చదివితే ఇక రాయాల్సిందే అనిపించేంత నచ్చింది. అందుకే ఎలాగో లాగించేశా! ఇంకా అహల్య , అచ్చమ్మల గురించి సరిగ్గా విశ్లేషించలేకపోయాననే గాఠ్ఠిగా అనిపిస్తోంది.

మధూ,

నువ్వు ఈ పాటికే ఈ రెండూ కొనేసి ఉంటావనుకుంటున్నా!:-((
అంతర్ముఖం తన నవలల్లో బెస్ట్ అని యండమూరి చెప్తారు గానీ,నాకూ అనైతికమే గొప్పగా అనిపిస్తుంది. చదివి చూడు, నువ్వు నిజంగా అహల్య, అచ్చమ్మలతో ప్రేమలో పడతావు. శ్రీకాంత్ పాత్ర నాకు చాలా ఇష్టం!

సుజాత వేల్పూరి said...

మురళీ,
పర్లేదు, ఆ పుస్తకం త్వరలోనే నా దగ్గరికొస్తుంది. ఆఫీసుకెళ్తూనో, వచ్చేప్పుడో తీసుకుని ఖాళీ ఉన్నప్పుడు చదివేయండి.నచ్చితే పుస్తకాల పండగలో కొనేసుకోవచ్చు!

బాబూ రాజేంద్రా,
ఇంకా........చదవలేదా? ఈ సారి నుంచీ ఇలాక్కాదు. నాల్రోజుల్లో ఇచ్చేయాలని షరతు మీద ఇస్తాను పుస్తకాలు! అర్జెంట్ గా చదివి తొందరగా తెచ్చేయండి.

సుజాత వేల్పూరి said...

కుమార్,
.

స్వానుభవాలు కాకుండానే జీవితాలను ఊహించి రాయగలరు కాబట్టి వాళ్ళు రచయితలవుతారు. అంతమాత్రం చేత రచయిత రాసే ప్రతిదీ వాళ్ళ జీవితంలోంచి ఊడిపడిన అనుభవమే అని భావిస్తే అది మూర్ఖత్వం అవుతుంది!

మీ వ్యాఖ్య నా బ్లాగులోనే రాశారు, గుర్తుంది.నాకూ అంతర్ముఖం కంటే అనైతికమే నచ్చుతుంది.నిజానికి ఎంతో దగ్గరగా ఉంటుంది. అంతే కాదు, ఇంట్లో కూచుని అన్నింటిమీద విశ్లేషణలు చేయడం సులభమే! బయటికెళ్ళి చూస్తే కానీ పరిస్థితులు ఎంతో దారుణంగా ఉన్నాయని తెలియడం లేదు.మనం నీతి నీతి అని గగ్గోలు పెట్టే విషయాలు చాలా మంది చాలా ఈజీగా తీసుకుంటున్నారు.

ఇకపోతే, మందాకిని పాత్రలు నిజజీవితంలో తక్కువే! ఆ మాటకొస్తే సోమయాజి పాత్ర కూడా నాకెక్కడా కనపడలేదు. ఆ అబ్బాయి ఎప్పుడూ "నన్నెందుక్ మోటివేట్ చేయవు?, నా మీద ఎందుకు జాలి చూపించవు?" అనే కంప్లెయింట్ తో ఉండటం నాకు నచ్చదు. అఫ్ కోర్స్ మందాకిని కి కూడా నచ్చదు.! అందుకే ఒక చోట "నువ్వు అన్నం తినలేదని చెప్పగానే నేను జాలి పడి, విస్తరి వేసి వడ్డించి, నువ్వు ఆకలితో తింటూ ఉంటే గోడకు చేరబడి కన్నీళ్ళతో చూస్తూ ఉంటాననుకున్నావా? దున్నపోతులా ఉన్నావు, ఏదైనా పని చేసుకోరాదూ" అని చీవాట్లేస్తుంది. ఆ సీన్ చాలా నచ్చుతుంది నాకు!

భాను said...

"వ్యక్తుల సెక్స్ జీవితమే ప్రాతిపదికగా,వాళ్ళ ఇతర ప్రవర్తన వ్యక్తిత్వం ఏమీ అర్థం చెసుకోకుండానే (అర్థం చేసుకునే కెపాసిటీ లేకనొ) వాళ్ళకు వ్యభిచారులనో,మరోటనో టాగులు అంటగట్టే మనస్తత్వం ఉన్నవాళ్ళకు ఈ నవల అర్థం కాదు"
కానీ జీవితంలోని ఇతర సంఘర్షణల వల్ల ఎటూ తప్పించుకోలేని స్థితిలో ఇలాంటి బంధాల మధ్య ఇరుక్కునే పరిస్థితి ఎవరికీ రాదనీ, అలా వచ్చిందంటే అది ఆడాళ్లు కొవ్వెక్కి చేసే పనే అని నిర్ణయించేసే వాళ్లకి ఏమని చెప్పగలం?
మీ విశ్లేషణ ఇంకా ఆ ఆలోచనల్లో ఉండగానే ఈ రోజు సాక్షి లో చుసిన కథా పరిచయం చూసి మళ్ళీ రాయాలనిపించింది.ఇద్దరి మధ్య ఏర్పడ్డ బంధం గురించి రాస్తూ "ఆమె డబ్బు అతడికక్కరలేదు, అతడి డబ్బు ఆమెకివ్వడు. అతడి కష్ట నష్టాలకు ఆమె భాద్యత లేదు. ఆమె ఇబ్బందులకు అతడు పూచీ కాడు. కాని - గాలి వీచినప్పుడు, వాన కురిసినప్పుడు కుదుళ్ళు కదిలినప్పుడు అతడొక కర్రపుల్ల వలె ఆమెను ఆదుకుంటాడు. ఆమె ఈ కాసిన్ని నీళ్ళల్లోనే ప్రాణాలు నిలుపుకుంటుంది.మొప్పలు ఆడించుకొనే ఉపిరి పీల్చుకుంటుంది.....అతడికి-అంతవరకే, ఆమెకూ - అంతవరకే. ..వస్తాయి బతుకులో కష్టాల వలలు. ఎగరేసుకపోతాయి సంతోషాన్ని. నీళ్ళల్లో నుంచి లేపి అమాంతం గట్టున పడేస్తాయి.మనుషుల్ని. మగవాలయితే పర్లేదు. ఆడవాళ్ళు విలవిలలాడిపోతారు. కలవరపడిపోతారు.గట్టున తనుకులాది తనుకులాది ఎండి ప్రాణాలు విడవడం కన్నా , కాసిన్ని నీళ్ళను తామే కల్పించుకున్దామని ఇదిగో ఎల్లాంటి సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఇది తప్పు అమి చెప్పదానికిలేదు. ఇది కాడు అని చెప్పడానికి లేదు ఇది వద్దు అని చెప్పడానికి లేదు. వారి దారిలో వాళ్ళను వేల్లనీయడమే కనీసం అ దారిలో కొత్త అడ్డంకులు సృస్టించకుండా ఉండడమే" నిజమే కదండీ. వాళ్ళ జీవితాల్లోకి పోయి ఆలోచిస్తే ఇలాగే ఉంటుదేమో. మీరనట్లు ఒక మనిషికి సంబంధించి ఏది నైతికం?ఏది అనైతికం? అది వాళ్ళ పరిస్తితుల్ని బట్టి ఉంటుందేమో కాని జనరలిసేడ్ గా ఉండదనుకుంటా.

Kathi Mahesh Kumar said...

నైతికత అనేది మనిషికి సంబంధించిన విషయం కాదు. సమాజం యొక్క నిర్వచనానికి సంబంధించింది.ఆ సమయానికి సంబంధించింది. కాబట్టి,అది మనిషి నడవడికని వేరేవాళ్ళ దృష్టితో చూసి నిర్ణయించేదేగానీ నిజంగా ఆ పరిస్థితిలో ఉన్న మనిషికి సంబంధం లేనిది.

ముఖ్యంగా సెక్స్ విషయంలో పితృస్వామ్య సమాజపు నిర్వచనాలన్నీ స్త్రీల వ్యక్తిగత స్వేచ్చను భావస్వాంతంత్ర్యాన్నీ హరించేవే. అందుకే నైతికతను వ్యక్తిస్వాతంత్ర్యం - సామాజిక బాధ్యతల త్రాసులో తోసేసి అందరూ ప్రశ్నించే బాధ్యతను తీసుకోదలుచుకోవట్లేదు.ఇలాంటి uncomfortable ప్రశ్నల్ని సంధించడంలో యండమూరి దిట్ట ;)

సుజాత వేల్పూరి said...

భాను గారూ,
ఇంకా చూడలేదు సాక్షి! మీరు కోట్ చేసినదంతా ఇలివి రిలేషన్ షిప్ కి సంబంధించిది అయి ఉంటుంది! ఈ నవల్లో సందర్భం వేరు కదా! అహల్య కాపురంలోని సంఘర్షణ బయటివాళ్ళకు ఏమీ అర్థం కాదు. డబ్బుంది, ఉద్యోగం ఉంది,ఇంకా కష్టాలేమిటి? అనే ఆలోచిస్తారు! అందువల్ల ఆమెకు తన బావగారితో సంబంధం ఉందలి తెలీగానే అందరూ ఆ బావగారినేమీ ప్రశ్నించకుండా అహల్య మీదనే విరుచుకు పడతారు.ఇక్కడే అహల్య పరిస్థితిని అర్థం చేసుకోవాలంటాను నేను.

ఇకపోతే, లివిన్ రిలేషన్ షిప్స్ మీరు చెప్పినట్లు ఉంటే ఎంతో బాగుండు! కానీ అందరూ అలా లేరు. అలాగే ఉంటే వారి మధ్య డబ్బు ప్రసక్తే రాకూడదు. కానీ వాస్తవాలు చూస్తున్నారుగా,కోర్టుకెక్కడాలు, మెయింటెనన్స్ కోరడాలు....ఇలాంటి వారికి వారి బంధంలో కమిట్ మెంట్ ఉందని చెప్పుకోడానికి హక్కు లేదంటాను నేను.

సుజాత వేల్పూరి said...

మహేష్,

అవును, ఇలాంటి ప్రశ్నల్ని రేకెత్తించడంలో యండమూరి దిట్టే! భావ సంఘర్షణను ఈ నవల్లో ఎంత ప్రతిభావంతంగా చిత్రించాడా అని అబ్బురపడతాను నేను.

నీహారిక said...
This comment has been removed by the author.
సుజాత వేల్పూరి said...

వేణు గారూ,
ఇక్కడున్న ఎవరికీ ఆ నవలలంటే పెద్ద ఆసక్తి ఉన్నట్లు కనిపించడంలేదు. మీరు కావాలని అడిగితే ఎందుకివ్వను? వచ్చి పట్టుకుపోండి, కొంత స్థలం కల్సి వస్తే కొత్త
పుస్తకాలు కొని సర్దుకుంటాను.

రచయిత ముందుమాటలోని భాగం కోట్ చేసినందుకు థాంక్స్! పుస్తకం నా వద్ద లేకపోవడంతో ఇలాంటివి కూడా గుర్తుంచుకోలేకపోయాను. .

Anonymous said...

నీహారిక,

సమాజం యొక్క నిర్వచనానికి సంబంధించింది.ఆ సమయానికి సంబంధించింది. కాబట్టి,అది మనిషి నడవడికని వేరేవాళ్ళ దృష్టితో చూసి నిర్ణయించేదేగానీ నిజంగా ఆ పరిస్థితిలో ఉన్న మనిషికి సంబంధం లేనిది...మరి మీరెందుకు దీన్ని సరిగా అర్థం చేసుకోలేక జడ్జిమెంట్ పాస్ చేసి ఒక సీరియల్ చదివే వాళ్ళందరికీ వ్యభిచారం అంటగట్టారు? కొంత మంది వ్యక్తుల్ని ఉద్దేశించి అలా వ్యాఖ్యానించే హక్కు మీరు వాక్స్వాతంత్ర్యం అనుకుంటున్నారా?

అక్రమ సంబంధాలను ఎవరూ పబ్లిగ్గా సమర్థిచరు. ఒక రచయిత/త్రి ఆ కథాంశంతో కథ రాస్తే దానికొక కంక్లూజన్ ఉంటుంది. అది వచ్చేదాకా వేచి చూడాలి! ఈ లోపే లూజ్ టంగ్ తో మాట్లాడ్డం మంచిది కాదు. (మీ వ్యాఖ్యలు ఇంతకు ముందు చూశాను కానీ ప్రతిస్పందించలేదు..)

అందరూ ఏది అంటే అదే అందరూ చేస్తారు....ఎవరు చేస్తారు? ఒక సొంత వ్యక్తిత్వం అంటూ లేక, సమాజం ఏమంటుందా, దాని ప్రకారం పోదామని చూసేవాళ్ళు చేస్తారేమో! ఎవరి వ్యక్తిగత జీవితం ప్రకారం వాళ్ళు ప్రవర్తిస్తారు. మీరు మీ వ్యక్తిగత జీవితాన్ని మీ బ్లాగులో రాసుకున్నారు.అప్పుడు సమాజం ఏమి చెప్తుందో దాని ప్రకారం మీరు ప్రవర్తించారా? లేక మీ మనస్సాక్షి ప్రకారం, మీ పరిస్థితుల కనుగుణంగా ప్రవర్తించారా? మీ మనస్సాక్షి ప్రకారమేగా!

అలాగే అందరి పరిస్థితులూ మీలాంటివే అని గుర్తించండి.మీ పరిస్థితుల్ని అందరూ సానుభూతితో అర్థం చేసుకోవాలి..సానుభూతి వర్షించాలి, అవతలి వారిని మీరు పట్టించుకోకపోగా, కారెక్టర్ అసాసినేషన్ చేస్తారా?

ఇంకోటి..."భ్రష్టు" పట్టడానికి అక్రమ సంబంధాలే అక్కర్లేదు. సైకో మనస్తత్వం ఉన్నా చాలు!

సంయమనంతో వ్యవహరించండి.

సుజాత వేల్పూరి said...

కిరణ్ కుమార్ గారూ,
మీ రెండో వ్యాఖ్య నేను ప్రచురించడం లేదు. మన్నించాలి! వ్యక్తిగత ఆవేశ కావేశాలకు ఈ చర్చలో తావు లేదు. మీరు పుస్తకం చదివి ఉంటే దాని గురించి మాట్లాడండి!సంయమనం మీరు కూడా పాటించగలరు. థాంక్యూ!

Anonymous said...

తన్ హాయీ సీరియల్ చదివే పాఠకుల్లో నేనూ ఉన్నాను సుజాత గారూ! వ్యాఖ్యలు రాసినట్లు గుర్తు లేదు. నీహారిక చేసిన వ్యాఖ్యలు అదే "మానసిక వ్యభిచారం" వ్యాఖ్యలు నాకూ వర్తిస్తాయి కదా! అందుకే అలా రాశాను. క్షమించగలరు.

మనసు పలికే said...

సుజాత గారు, చాలా మంచి టపా :). నాకు యండమూరి నవలలు కొన్ని నచ్చుతాయి. ముఖ్యంగా అంతర్ముఖం.. చాలా చదివాను కానీ అనైతికం మాత్రం చదవలేదు. మీరు ఇంతగా చెప్పారు కదా, ఈసారి కొనెయ్యాలి..:))

సుజాత వేల్పూరి said...

కిరణ్ కుమార్ గారూ,

ఎవరి అభిప్రాయాలు వాళ్లకుంటాయి. అందులో విలువ ఇవ్వాల్సినవేవో, బుట్ట దాఖలు చేయాల్సినవేవో నిర్ణయించుకోవలసిన విజ్ఞత మనది! అసలు సీరియల్ రచయిత్రే పట్టించుకోనక్కర్లేదని వదిలేశారు కదా, మీరూ వదిలేయండి!

సుజాత వేల్పూరి said...

మనసు పలికే,

థాంక్యూ అండీ!

రమణ said...

నవలలు చదవటం యండమూరితో మొదలు పెట్టినా ఇప్పుడు ఆయన నవలలు చదవటం మానేశా. ఐతే మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే అనైతికం, వెన్నెల్లో గోదారి నవలలు చదవాలని ఉంది. ఇప్పటివరకైతే నాకు ఆయన నవలల్లో అంతర్ముఖం, పర్ణశాల మంచి నవలలుగా తోచాయి.

Kathi Mahesh Kumar said...

@నీహారిక: మీ వ్యాఖ్యలో చాలా మోరలిస్టిక్ జడ్జిమెంటులు ఉన్నాయి. నవల చెప్పిందైనా నేను చెప్పేదయినా, బయటి వ్యక్తులుగా ఆ మోరల్ జడ్జిమెంటులు మన ఆధిపత్యాన్ని (confirming the existing norms)తెలియజెప్పడానికి తప్ప నిజంగా పరిస్థితిని objective గా అర్థం చేసుకోవడానికి పనికిరాదు. ఎందుకంటే ఆ సంబంధం ఉన్న వ్యక్తులకు ఆ సంబంధం/అనుబంధం extreme subjectivity కి సంబంధించింది. Most of the times, they cannot reasonably explain why the situation is the way it is.

అది "తప్పు" అనేది మీ దృష్టి. అంతమాత్రాన్ని దాన్ని "అక్రమం" అనెయ్యడం అంత అభిలషనీయమైన పరిణామం కాదు. సామాజిక మూసల కన్నా వ్యక్తి స్వాతంత్ర్యం నాకు ముఖ్యం.

నీహారిక said...
This comment has been removed by the author.
Anonymous said...

వ్యాఖ్యలు రాయడం, అవసరం తీరగానే వాటిని డిలీట్ చేయడం మీకలవాటే అయినా మీరేం రాశారో నాకు గుర్తుంది. "చదివి వ్యాఖ్యలు రాసిన వారంతా" అని రాశారు.


పైగా బుర్రలేదని నోటిదూల ప్రదర్శించడం ఒకటి! మీ విమర్శల్లో ఏమాత్రం పస ఉందో అందరికీ మీరే స్వయంగా మీ వ్యాఖ్యల ద్వారా తెలియజేస్తూనే ఉన్నారు!

నీతి సూత్రాలు చెప్పేవారందరికీ తమకు అవకాశం రాకపోవడం ఒక కారణం!

సాటి స్త్రీని (రచయిత్రి) గురించి చెత్తగా మాట్లాడకూడదనే కనీస సంస్కారం కూడా లేని మీరు నీతులు బోధిస్తూ.....పైగా నీతులు బోధిస్తున్నారని అందరినీ అంటున్నారు!

ఆ.సౌమ్య said...

యండమూరి పుస్తకాలంటే కాస్త వెనకడుగేస్తాను...కొన్ని నవలల ప్రభావం...అసలు ఈయనగారు ఎందుకు రాస్తున్నారబ్బా, మా తల తినడానికి కాకపోతే అని వాపోయి పోయి ఇక ఎప్పుడూ చదవకూడదని ఒట్టుపెట్టేసుకున్నా. ఇప్పుడూ మీ పోస్ట్ చదివాకా ఆ ఒట్టు తీసి గట్టున పెట్టేస్తున్నా. అనైతికం చదువుతాను. చదివి అప్పుడు చెబుతా నా అభిప్రాయం. :)

మేధ said...

అనైతికం చదవలేదు నేను.. ఇప్పుడు చదవాలి.. అందుకే మీ పరిచయం పూర్తిగా చదవలేదు.. ఇక ఆనందోబ్రహ్మ గురించి:

>>"నువ్వు అన్నం తినలేదని చెప్పగానే నేను జాలి పడి, విస్తరి వేసి వడ్డించి, నువ్వు ఆకలితో తింటూ ఉంటే గోడకు చేరబడి కన్నీళ్ళతో చూస్తూ ఉంటాననుకున్నావా? దున్నపోతులా ఉన్నావు, ఏదైనా పని చేసుకోరాదూ" అని చీవాట్లేస్తుంది. ఆ సీన్ చాలా నచ్చుతుంది నాకు

నాకు బాగా నచ్చిన భాగం ఇది..

నీహారిక said...
This comment has been removed by the author.
సవ్వడి said...

ఈ " అనైతికం " నవలను లైబ్రేరి నుండి తెచ్చి ముందు మాట చదివాక... " ఇప్పుడిది చదవకపోతే కొంపలేం మునిగిపోవు " అని ఆనుకుని పక్కన పడేసాను. మామూలుగానే ఇటువంటివి నచ్చవు. మీరు ఇంత బాగా చెప్పాక కూడా నాకు చదవాలనిపించట్లేదు. తన నవలల్లోనే మంచిది అన్నారు కాబట్టి చదవాలనుకుంటున్నాను.
మా అమ్మగారు చదివారు. ఎలా ఉంది అని అడిగితే " చదవవలసిన అవసరం లేదు " అన్నారు. ఆవిధంగా నేను అది చదవలేదు. కుదిరినప్పుడు చదువుతాను.

ఇకపోతే యండమూరి సంచలన రచయిత ఐతే అవ్వొచ్చు గాని గొప్ప రచయిత కాదు. నాకు తన రచనల కంటే " కొమ్మనాపల్లి " రచనలు ఇష్టం. వీళ్లిద్దరిలో నేను కొమ్మనాపల్లి నే గొప్ప రచయిత అంటాను.
యండమూరి హీరోయిన్ల కన్నా కొమ్మనాపల్లి హీరోయిన్లే చాలా తెలివిగా ఉంటారు. ప్రపంచ విషయాలు అన్నీ తెలుసుకుని ఉంటారు. హీరోలతోనే చాలెంజెస్ కాస్తారు. ఇంకా చెప్పాలంటే హీరోలనే శాసిస్తారు. ప్రణయ, మేనక, షర్మిలి, ఆశ్రిత, సామ్రాజ్యం.... ఈ పాత్రలన్నీ హీరోలను డామినేట్ చేసేవే! ఇక యండమూరి నాయికల్లో రమ్య తప్ప ఎవరూ గుర్తు లేరు.
కథల్లో కూడా అంతే! యండమూరివి ఓ 10 నుండి 15 వరకూ చదివుంటాను. కొమ్మనాపల్లి వి ఓ 20 నుండి 25 వరకూ చదివి ఉంటాను. కొమ్మనాపల్లివి చాలావరకూ కథలన్నీ గుర్తున్నాయి. యండమూరివి మూడో నాలుగో గుర్తున్నాయి. ఐతే యండమూరి వ్యక్తిత్వ వికాస పుస్తాకాలు బాగున్నాయి. అవి చదివిన తరువాత తన నవలలు చదవడం మానేసాను. ఇదే స్థాయిలో విశ్లేషణ కొమ్మనాపల్లి నవలల్లో కూడా నాకు కనిపించేది.
ఆర్థ్రత కొమ్మనాపల్లి రచనల్లో నాకు బాగా నచ్చుతుంది. ఇది ఏమాత్రం యండమూరి నవలల్లో కనిపించదు.
స్వాతి పత్రిక వచ్చినప్పటినుండి అదే నెంబర్ 1 లో ఉంది. అందులో కొమ్మనాపల్లి నవలలు వస్తుంటే మిగిలిన జ్యొతి, ప్రభ పత్రికల్లో యండమూరివి వచ్చేవి. అని మా అమ్మగారు చెప్పారు. ఈవిధంగా కూడా కొమ్మనాపల్లి నే నేను గొప్ప రచయిత అంటాను. సో నా ఓటు కొమ్మనాపల్లికే(వీళ్లిద్దరిలో మాత్రమే)!
మరి మీరు ఏమంటారు! బ్లాగర్లందరూ స్పందించాల్సిందిగా కోరుకుంటున్నాను. సుజాత గారు! ముందు మీరు చెప్పండి.

సుజాత వేల్పూరి said...

నీహారిక,
ఒక కామెంట్ రాసి, దానికి అవతలి వారు అదే స్థాయిలో జవాబు రాశాక, మీ కామెంట్స్ ని డిలీట్ చేయడం చాలా చెత్త పని. ఈ పని మీరు ఇంతకు ముందు చాలా బ్లాగుల్లో చేశారు(సత్యవతి గారి బ్లాగులో ఫెమినిజం మీద మీకు శంకర్ జవాబులిచ్చాక మీ కామెంట్స్ ని డిలీట్ చేయడంతో శంకర్ గారి వ్యాఖ్యలకు అర్థం లేకుండా పోయింది) అవతలి వాళ్ళను ఫూల్స్ ని చేసే ఇలాంటి ఉద్దేశం మీకు ఉంటే నా బ్లాగులో కామెంట్స్ రాయవద్దు!

Kathi Mahesh Kumar said...

@నీహారిక: పెళ్ళికి సంబంధాలకు ఏమిటి లంకె? Why should every physical relationship needs social sanction? Can't it just be one of the aberrations. Can't we accept them as facts of life?

దొంగచాటు అనేది పబ్లిక్ అంగీకరిస్తే అవసరం లేదు. కానీ మనుషులు మారుతున్న వేగంగా సమాజం మారటం లేదు. మొన్నకు మొన్న తన సంబంధాన్ని కప్పిపుచ్చడానికి కన్నతల్లి చిన్న కూతుర్ని కాల్చి చిత్రహింసలు పెట్టలేదూ...ఎందుకంటారూ!! ఈ సమాజం దొంగచాటుతనాన్ని కోరుకుంటుంది గనక! అంతేగా!

అమెరికాలో వ్యక్తిగత స్వేచ్చ మీరు అనుకున్నంత నెగిటివ్ గా ఏమీ లేదు. They value family more than us. That is among very few countries where family values become an election issue. Let's not pat our hypocritical backs by showing America.

సుజాత వేల్పూరి said...

సవ్వడి,
మీ అమ్మగారు "చదవక్కర్లేదు" అని చెప్పినపుడు మీ వయసెంతో గుర్తు తెచ్చుకోండి! బహుశా స్కూల్లోనో, కాలేజీ లోనో ఉండి ఉంటారని అనుకుంటున్నా!ఆ వయసులో ఇంత సంఘర్షణ, ఉన్న నవల మీకు ఆ వయసులో అవసరం లేదని అలా అన్నారేమో! లేదా ఆమెకు కూడా నచ్చలేదేమో!

ఇక కొమ్మనాపల్లి గారి నవలలు నేను పెద్దగా చదవలేదు. అసలు చదివిన గుర్తే లేదు. అందువల్ల ఇద్దరినీ కంపేర్ చేయలేను.

యండమూరి విషయానికొస్తే కొన్ని నవలలు గొప్ప రచయితగానూ, కొన్ని ఫక్తు కమర్షియల్ రచయితగానూ రాశారు. గొప్పగా రాసినవాటిలో అనైతికం,వెన్నెల్లో గోదారి నాకు నచ్చుతాయి. ఆ తర్వాత స్థానం పర్ణశాలది!

సవ్వడి said...

సుజాత గారు! అప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను.
మీరన్నట్లుగా మా అమ్మగారికి నచ్చలేదేమో!

నాదో పెద్ద సందేహం! అన్ని పుస్తకాలు చదివే మీరు కొమ్మనాపల్లి వి ఎందుకు చదవలేదండి. నిజానికి మీరు అన్నీ చదివేసి ఉంటారు అనుకున్నాను. ఇలా షాక్ ఇస్తారని అనుకోలేదు.

వేణూశ్రీకాంత్ said...

సుజాత గారు విశ్లేషణ చాలా బాగుందండి, చక్కగా రాశారు. నాకు కూడా చాలా ఇష్టమైన నవల ఇది. నిషి చెప్పినట్లు ఈ నవలపై బెస్ట్ విశ్లేషణ ఇది అనిపించేలా రాశారు. అంతర్ముఖం కూడా మీరన్న ఈ రెండు నవలల సరసన చేరుతుందని అనుకుంటున్నాను. హమ్మయ్య మళ్ళీ మరోసారి నేను చదివిన పుస్తకం గురించి రాశారు :)

అన్నట్లు మీరు ఒక్క లైన్ లో సూటిగా చెప్పిన ఈ మాట నాకు చాలా నచ్చింది. >>"ఎవరి అభిప్రాయాలు వాళ్లకుంటాయి. అందులో విలువ ఇవ్వాల్సినవేవో, బుట్ట దాఖలు చేయాల్సినవేవో నిర్ణయించుకోవలసిన విజ్ఞత మనది!"<< very well said.

Kalpana Rentala said...

సుజాత,
సారీ. నేను ఈ నవల చదవలేదు కాబట్టి ఏమీ చెప్పలేను. ఇప్పుడిప్పుడే చదివే అవకాశం కూడా లేదు కాబట్టి మీ పరిచయం చదివాను. బాగా రాశారు.
చిన్నతనం లో కుమార్ గారు లాగానే నేను కూడా ఎలా రాస్తారు అనుకోని ఆశ్చర్యపోయేదాన్ని. ఇంట్లో మా నాన్నగారే రచయిత అవటం వల్ల ..ఆ రెంటిని ఎలాంటి వివేచన తో చూడాలో ఒక పిసరంత తెలిసిందేమో.
రచన కి, రచయిత కి వున్న తేడా ని గుర్తించే పరిణితి లేకపోతే సాహిత్యాన్ని అర్థం చేసుకోలేము, అనుభవించలేము కూడా అన్నది మొదటి సూత్రం.
కిరణ్ కుమార్ గారు, మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. నవల అయిపోయిన తర్వాత , చర్చించాల్సిన విషయాలు చాలా ముఖ్యమైనవి అని నా ఉద్దేశం. చూద్దాము.అది ఎప్పుడూ జరుగుతుందో.

సుజాత వేల్పూరి said...

సవ్వడి,ఏమిటో మరి! ఎందుకు చదవలేదో మరి, గుర్తు రావడం లేదు. అన్ని పుస్తకాలూ చదవాలంటే ఎలా కుదురుతుంది చెప్పండి? అప్పుడప్పుడూ అయినా కాస్త క్లాసు పుస్తకాలు చదవాలి కదా! అలా తప్పించుకుని ఉంటాడు కొమ్మనాపల్లి!

సవ్వడి,ఏమిటో మరి! ఎందుకు చదవలేదో మరి, గుర్తు రావడం లేదు. అన్ని పుస్తకాలూ చదవాలంటే ఎలా కుదురుతుంది చెప్పండి? అప్పుడప్పుడూ అయినా కాస్త క్లాసు పుస్తకాలు చదవాలి కదా! అలా తప్పించుకుని ఉంటాడు కొమ్మనాపల్లి! :-))

వేణూశ్రీకాంత్,
చదివారన్నమాట! అంతర్ముఖం కంటే నాకు పర్ణశాల నచ్చుతుంది.

థాంక్యూ!

సుజాత వేల్పూరి said...

కల్పనా,
అయ్యో, మీరు చదవలేదా? చదువుతానంటే ఎలాగైనా చేరవేస్తాను మరి మీ ఇష్టం!

మీ నాన్నగారు రచయిత అవడం మంచి పుస్తకాలు చదవడంలో మీకో ప్లస్ పాయింట్ అయి తీరాలి. కానీ రచనకీ, రచయిత వ్యక్తిగత జీవితానికీ సంబంధం ఉండదనే విషయం తెల్సుకోడానికి ఇంట్లో రచయితలుండాలా? కామన్ సెన్స్ ఉంటే చాలదూ?

రచన కి, రచయిత కి వున్న తేడా ని గుర్తించే పరిణితి లేకపోతే సాహిత్యాన్ని అర్థం చేసుకోలేము......

మరే, బాగా చెప్పారు!

Kalpana Rentala said...

సుజాత,

యండమూరి నవలలు జ్యోతి కేసు బయటకు వచ్చాక ఇక చడవొద్దని ఒక ఆవేశపూరిత యవ్వనోద్రేకంలో తీసుకున్న నిర్ణయం. ఆ తర్వాత అది కరెక్ట్ కాదని అర్థమయినా మళ్ళీ చదవలేదు తన పుస్తకాలు. మీరు పంపిస్తానంటే ఎలాగోలా...ఎగిరి...గంతులు వేసి...(వేయగలనా? అనుకుంటున్నారా?)మరీ అందుకుంటాను.
ఇంట్లో రచయితలే ఉండక్కరలేదు. కామన్ సెన్స్ ఉంటే...:-))

భాను said...

సుజాత గారూ
నాకు ఒక్కటి అర్థం కాలేడుండి. నిజంగా అహల్య అంత చదువుకున్నది. తెలివి కల్లది. బావ తో సంబంధం పెట్టుకొనే సమయం లో ఉద్యోగం చేస్తుంది. అంటే ఆర్థికంగా ఆమె పర్వాలేదు. లేనిదల్ల ఆమె భర్త తో సరిగా లేక పోవడం . ఎంత డెస్పరేట్ గా అయినా అస్సలు ఇలాంటి సంబంధానికి ఎలా ఒప్పుకొందంటారు. అఫ్కోర్స్ బావ ఆ పరిస్తితుల్ని ఎంక్యాష్ చేసుకున్నదనుకోండి. కాని అహల్య ఎందుకు యీల్డ్ అయ్యిన్దంటారు ఆమెకు ఇష్టం లేదు అనటందుకు వీల్లేదు. ఎందుకంటే మొదటిసారే " వద్దు అనాలన్న స్పృహ నాకులేదు. బహుశా నేను ఎంజాయ్ చేస్తున్నననుకుంటుంది. తనకు తానూ అతనికి దగ్గరయి ఆనందిస్తుంది. దీనిపట్ల గిల్టీ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదనుకుంటుంది. తనకు ఆనందం. దొరికే దారి వెతుక్కున్నందుకు తనకు తానూ సమర్తిన్చుకుంటుంది. నా డౌట్ ఏంటంటే ఆమె అల్లాంటి పరిస్తితుల్లోకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది. ఆవేశం తో నో తెలియక జరిగిన పొరపాటో కాదు కదా. ఆమె ఇష్టం తోనే ఎందుకు అలా చేసిందంటారు.ఒక్క సారి నేనే అతన్ని ఎంకరేజ్ చేశానని కుడా అనుకుంటుంది. దీనికి కారణం మీరేమయినా చెప్పగలరా.

సుజాత వేల్పూరి said...

భాను గారూ,

నిజంగా అహల్య అంత చదువుకున్నది. తెలివి కల్లది. బావ తో సంబంధం పెట్టుకొనే సమయం లో ఉద్యోగం చేస్తుంది. అంటే ఆర్థికంగా ఆమె పర్వాలేదు. లేనిదల్ల ఆమె భర్త తో సరిగా లేక పోవడం . ఎంత డెస్పరేట్ గా అయినా అస్సలు ఇలాంటి సంబంధానికి ఎలా ఒప్పుకొందంటారు

అదే అహల్య తెలివి తక్కువ తనం! తనను ఒక మనిషిగా కూడా గౌరవించకుండా,తమ మధ్య ఉన్న పర్సనల్ విషయాలు కూడా తల్లితో పంచుకుంటూ ఆమెనొక దోషిగా అనేక సందర్భాల్లో దోషిగా నిలబెడతాడు ఆమె భర్త! "మేమంతా ఒకటి, నువ్వు బయటినుంచి వచ్చావు" అన్నట్లు ప్రవర్తిస్తాడు. "మా ఇంట్లో బంధాలు వేరు, మేమలా పెరగలేదు" అని అనుక్షణం ఆమెను వేరు చేసి మాట్లాడతాడు. ఆమె మనోభావాలు గ్రహించే కనీస ప్రయత్నం చేయడు.ఆమెకు ఉద్యోగం వస్తే మరొకజీతం వస్తుంది కదాని సంతోషిస్తాడు తప్ప కనీసం అప్రీషియేట్ చేయడు. అతనితో ప్రేమను పంచుకోవాలనుకున్నపుడు కూడా అతడు అది గ్రహించకుండా మరేదో మాట్లాడతాడు. ఇంకా అనేక సంఘటనలు (నవల నా దగ్గర లేదు, లేకపోతే ప్రతి ఒక్కటీ కోట్ చేసేదాన్ని)! ఇలాంటి పరిస్థితిలోనే ఆమె బావగారు షేర్స్ కొనే విషయంలో ఆమె సలహా తీసుకోవడం, ఆమె సలహా ఫలించినందుకు చిన్న బహుమతి తెచ్చివ్వడం లాంటి పనులతో ఆమె పట్ల తనకు "కన్ సర్న్"ఉన్నదన్న విషయాన్ని కమ్యూనికేట్ చేస్తాడు.

చదువుకోమని ప్రోత్సహిస్తాడు. అసంతృప్తి తో రగిలిపోతున్న అహల్య తాను ఏం చేస్తున్నానో తెలీని స్థితిలో అతడు ప్రపోజ్ చేసినపుడు తిరస్కరించలేకపోతుంది. ఆ క్షణంలోనే పాఠకులకు 'అరెరె, అహల్య తప్పులో కాలేసిందే"అని జాలి వేస్తుంది.

ఆ బంధం పట్ల ఆమెకు మోహం లేదు. అందుకే అతనితో తెంచుకోవలసి వచ్చినపుడు కొద్దిగా కూడా బాధపడదు.అలాగని పశ్చాత్తాపమూ పడదు. ఒకవేళ ఈ సంబంధమే లేకపోయినా అహల్య కాపురం నిలబడేది కాదు! ఆమె నిరాశ, అసంతృప్తి ఆ స్థాయిలో ఉంటుంది.

ఎంతో ఉన్నతంగా ఊహించుకున్న వైవాహిక జీవితం బురద గుంటలా ఉండటం, ముఖ్యంగా భర్త సరైన వాడు కాకపోవడం ఆమె బంధానికి కారణమనుకుంటాను. అది కరెక్టా కాదా అనేది ఆ పరిస్థితుల్లో ఆమె నిర్ణయించుకోవలసిందే కానీ, పాఠకులుగా మనం నిర్ణయిచలేం!

ఇదీ నా అభిప్రాయం!

KumarN said...

కల్పన గారూ,

క్షమించాలి, unsolicited volunteering కి.

నా దగ్గర్ యండమూరివి కింద నవలలు ఉన్నాయి. ఎవరు తీసుకెళ్ళారో తెలీదు కానీ, "అంతర్ముఖం", "ఆనందో బ్రహ్మ" రెండూ ఎగిరి పోయాయి. నేనుండేది కాన్సాస్ సిటీ లోనే కాబట్టి, మీకు చాలా తేలిగ్గ పంపించ గలను. You will get them in 1 or 2 days.

ఇలాంటి పుస్తకాలు పెట్టుకున్నానేంటీ అని, నన్ను judge చేయకండి. ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఏదో కాలక్షేపం కోసం కొనేవి ఇవ్వి, to kill the time in flight.

1. ప్రేమ
2. అనైతికం
3. అగ్ని ప్రవేశం
4. వెన్నెల్లో గోదారి
5. ధ్యేం
6. స్వర భేతాళం
7. రెండు గుండెల చప్పుడు
8. సిగ్గేస్తోంది
9. మరో హిరోషిమా
10. మంచి ముత్యాలు
11. మిమ్మల్ని మీ పిల్లలు ప్రేమించాలంటే
12. విజయం వైపు పయనం
13. మిమ్మల్ని మీరు గెలవగలరు
14. విజయంలో భాగస్వామ్యం
15. విజయానికి అయిదు మెట్లు

Let me know what and when you want, I can ship them to you. It would be my pleasure

Kalpana Rentala said...

కుమార్ గారు,

దేశంలో ఇంకా ఇంత మంచివాళ్ళున్నారా? అడిగి పుస్తకాలు పంపించేవాళ్ళు. అయ్యో...జడ్జ్ చేయతమేముందండీ.. యండమూరి ని నచ్చని వాళ్ళు, మెచ్చని వాళ్ళు ఎవరుంటారు? ఒక ఆడపిల్ల జీవితం తో ఆయన ఆడుకున్న వైనం తో బాధ కలిగి ఆ వయసు లో తీసుకున్న నిర్ణయం అది. నా ఈమైల్ kalpanarentala@yahoo.com కి ఒక మైల్ చేస్తే నా అద్రెస్స్ పంపిస్తాను.
చాలా చాలా థాంక్స్..

Kathi Mahesh Kumar said...

ఋషి, పర్ణశాల నవలలు ఏమాత్రం కమర్షియాలిటీ ప్రభావం లేనివి. రాయాలనుకుని రాసినవి.రాయాలి కాబట్టి రాసినవి కావు. నాటకరచనలోని నిబద్ధతని ఇంకా యండమూరి వదిలెయ్యని కాలం నాటివి. అందుకే నాకు అవి బాగా నచ్చుతాయి. ఆ తరువాత ఆనందోబ్రహ్మ. అంతర్ముఖంలో తను కామూ నీ కాఫ్కానీ కలగలిపి తెలుగుతనానికి తీసుకొచ్చిన తీరు నచ్చుతాయి. మిగతా నవవలలన్నీ టైంపాస్ ;)

Anonymous said...

ఇదిగో "పులి అంటే అదిగో తోక" అనే సమాజమిది. ముఖ్యంగా మగవాడు చెడ్డవాడంటే రెడీమేడుగా నమ్మేస్తుంది సమాజం. దురదృష్టవశాత్తు మగవాడికి ఫేస్ వ్యాల్యూ లేదు. ఎండమూరి అంటే పడిచచ్చే ఆడపిల్లలు ఆ రోజుల్లో చాలామంది ఉండేవాళ్ళు దక్షిణభారతదేశంలో ! కానీ ఆయన ఎవరినీ దగ్గరికి రానివ్వలేదు. ఆ చచ్చిపోయిన జ్యోతి ఒక extreme case. Immature కూడా. ఆమె యండమూరిని వ్యక్తిగతంగా meet అయి తనను పెళ్ళి చేసుకొమ్మని బలవంతపెట్టింది. ఆయన అప్పటికే married కనుక ఆమెకు సౌమ్యంగా బుద్ధి చెప్పి పంపేశాడు. ఆమె వెళ్ళి ఆత్మహత్య చేసుకుంది. ఆమె బంధువులు ఆ శోకంలో ఎండమూరి మీద అనవసర నింద వేశారు. అంతే తప్ప ఆయన ఎవరికీ గాలం వేసినదీ లేదు. ఎవరినీ ఆడుకున్నదీ లేదు, వాడుకున్నదీ లేదు. ఆమె చచ్చిపోయి హీరోయిన్ అయింది. బుద్ధి గరపిన పాపానికి అప్పట్లో ఎండమూరి విలన్ అయ్యాడు.

Anonymous said...

They (Americans) value family more than us. That is among very few countries where family values become an election issue. Let's not pat our hypocritical backs by showing America.

ఆహాహా ! ఏమి చెప్పారు ? అయితే మరి ఈ క్రింది లంకెలో చూడుడీ !

http//www.divorcerate.org

రవి said...

మీ పరిచయం బావుంది. అనైతికం నవల నేను చాలా యేళ్ళ క్రితం చదివాను. ఇప్పుడు లీలగా మాత్రమే గుర్తుంది.నాకు తెలిసి ఈ నవల యండమూరి నవలలకు క్రేజ్ తగ్గుముఖం పట్టడం మొదలవుతున్న రోజుల్లో వచ్చింది. కాస్తంత artificial గా ఉంటుంది.

పొద్దు ముఖాముఖి లో పాఠకులకు ఫాల్స్ ఇమేజ్ క్రియేట్ చేస్తానని ఆయనే అన్నారు. ఆ ప్రయత్నం ఈ నవల్లో కనిపిస్తుంది. ఈ కారణం చేతనే నాకు మల్లాది అంటే ఉన్నంత ఇష్టం యండమూరి పైన లేదు.

KumarN said...

అవును, ఋషి, పర్ణశాల, ఆనందో బ్రహ్మ, అంతర్ముఖం అన్నింటి కన్నా నాకు నచ్చిన నవలలు. పోతే మందాకిని, లక్ష్మి, ప్రవళ్ళిక, అనూష వీళ్ళంటే కూడా చాలా ఇష్టం. ఇంకో ఒకరిద్దరి పేర్లు గుర్తు రావటం లేదు. నిజానికి యండమూరి నవలల కన్నా, ఆయన హీరోయిన్లే బావుంటారు. వాళ్ళు లేకుండా ఆయన నవలలని చూడలేము.

అనైతికం నాకు డిఫరెంట్ కాటగిరీ లో నచ్చిన నవల. ప్రేమ అనుకుంటా, అందులో భావుకత్వపు లైన్స్ కూడా బావుంటాయి.

పోతే చనిపోయిన అమ్మాయి గురించి, చిన్నప్పుడు మా ఊర్లో పేపర్లో ఏదో చదివాను, ప్రపంచం గురించేం తెలీదప్పుడు, ఏదో ఈనాడు మధ్య(బ్రౌన్)పేపర్ లో బాటం రైట్ కార్నర్ లో పాండవుల గురించి కార్టూన్స్ చదువుకుని బతికే రోజులు.

ఒక సంవత్సరం క్రితమనుకుంటా "జుగల్బందీ" అని యండమూరిని, మల్లాదినీ కలిపి చేసిన ఇంటర్వ్యూ వచ్చింది. దాంట్లో నాకు అర్ధమయ్యిందేంటంటే, మల్లాది ఒక ప్ఫ్లాంబాయంట్ పర్సనాలిటీ అనీ, యండమూరి అలాక్కాదనీ అనిపించింది. ఇప్పుడు మల్లాది గారు స్పిరిట్యువాలిటీ వైపెళ్ళినట్లున్నారు కాని, అప్పట్లో ఆయన కొంచెం చిలిపనుకుంటా. గమ్మత్తేంటంటే యండమూరికి జ్యొతి తో చెడ్డ పేరొచ్చేసింది.

Kathi Mahesh Kumar said...

@దేవనకొండ ఓబుల్ రెడ్డి: వివాహం అంటే జీవితాంతం బలవంతంగా కలిసుండటం కాదు. కుటుంబ వ్యవస్థ అంటే నానా మోసాలూ చేసుకుంటూ ఒక చూరు కింద కలిసుండటం కాదు. అందుకే వివాహవ్యవస్థ అర్థవంతంగా ఉండాలంటే విడాకులు అనే ఛాయ్స్ కావాలి. Divorce would only strengthen the marriage as long as Individuals in marriage have that commitment and love for that relationship.అవి లేని నాడు విడాకులు తీసుకుని విడిపోతారు. అమెరికాలో విడాకులు ఒక అవసరమైన ఛాయ్స్. అర్థవంతమైన పెళ్ళి వ్యవస్థకు విడాకులు ఒక అవసరం.

Anonymous said...

మహేష్ గారూ ! విడాకులు అనే ఎంపిక ఉండకూడదని నేననట్లే. ఒక సమాజం ఆ ఎంపికని ఎంత విచ్చలవిడిగా వాడుకుంటున్నదనేదాన్ని బట్టి అక్కడి వివాహవ్యవస్థ ఎంత బలహీనంగా ఉన్నదో చెప్పవచ్చునంటున్నానంతే. ఆ దృష్టితో మీరు అమెరికన్ సమాజంతో భారతీయసమాజాన్ని పోల్చి మనవి hypocritical backs అనో bottoms అనో నిందించడం సరికాదంటున్నాను. మనకూ విడాకుల ఎంపిక ఉంది. కానీ దాన్ని మనం మరీ అంత పచ్చిగా, పిచ్చిగా వాడుకోవట్లేదుగా !

ఇహపోతే వైరుద్ధ్యాలతో ఒకే చూరు కింద కలిసుండడం ఇండియాలోనే కాదండీ, అమెరికాలో కూడా ఉంది.. విడాకుల ఎంపిక ఆ phenomenon ని నివారించలేకపోతోంది. విడాకులిచ్చిన తరువాత కూడా ఒక సగటు అమెరికన్ తండ్రి తన మాజీభార్య దగ్గర పెరుగుతున్న తన పిల్లలు ఏం చదవాలో, ఏం తినాలో, ఏ విద్యాసంస్థలో చేరాలో నిర్దేశిస్తూనే ఉంటాడు.

మరి ఎవరివి hypocritical backs ?

సుజాత వేల్పూరి said...

మహేష్,

they value family more than us ! ఎలా చెప్పగలిగారు ఈ మాట? పిల్లలు చిన్నగా ఉన్నపుడు వారిని క్రమశిక్షణ తో ప్రైవసీ ఇస్తూ, ఎంతో చక్కగా పెంచుతారు. child rearing వీళ్లదగ్గరే నేర్చుకోవాలనిపించేంతగా! అదే వారు యుక్తవయసుకొచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తున్నా అది వ్యక్తిగత స్వేచ్ఛకిందికి వస్తుందని వదిలేస్తారు.

ఫామిలీకి విలువ ఇవ్వడం అనేది అమెరికాలో ఎక్కువగా బ్లాక్స్ లో గమనించాను నేను. మా స్నేహితుల్లోనే ఒక జంటకు (వైట్స్)రెండు వైపులా బోలెడు విఛ్ఛిన్న మైన ఫామిలీలు ఉన్నాయి. ఈ జంట కూడా అలా విచ్ఛిన్నమైన రెండు జంటల్లోంచి వచ్చి కలుసుకున్న జంటే!

ఆమె కో కొడుకున్నాడు. ఆమె ఇతడితో కలిసి జీవిస్తున్నా మొదటి మొగుడు పిల్లాడి విషయంలో వీళ్ళింటికి వచ్చి గొడవలు చేయడం వాడు తన ఇష్టం ప్రకారం పెరగాలని, ఫుట్ బాల్ నేర్చుకోవాలని గోల చేయడం ఇవన్నీ చూశాను నేను.(వాళ్ళు ఇప్పటికీ మాకు స్నేహితులు! ఇండియా వస్తుంటారు కూడా)

విడాకుల విషయంలో నేను ఓబుల్ రెడ్డిగారితో ఏకీభవిస్తున్నాను! విడాకలనే ఛాయిస్ ని ఇష్టం వచ్చినట్లు వాడేసే జంటల బట్టే ఆ బంధం ఎంత బలహీనమైనదో ఊహించవచ్చు.

విడాకులనే ఒక ఛాయిస్ ఉంది కాబట్టి "హమ్మయ్య, పర్లేదులే, అంతగా పడకపోతే విడాకులిచ్చేస్తాను" అనే ధైర్యంతో జీవించడం లో సంతోషం ఏముంది? సేఫ్టీ ఎక్కడుంది?

lalithag said...

సుజాత గారూ, మీ బ్లాగు చదివి ఎన్నో పుస్తకాల గురించి తెలుసుకుంటుంటాను.
ఎప్పుడూ వ్యాఖ్య రాయను, ఆ పుస్తకాలు చదవలేదు కాబట్టి.ఇక్కడా అదే చేద్దామనుకున్నాను. కాకుంటే వివాహ వ్యవస్థ గురించీ, అమెరికా, ఇండియాల పోలికలూ వైపు చర్చ మళ్ళడంతో,ఏదో చెప్పగలనేమో అనే ప్రయత్నం.
ఇక్కడ ప్రస్తావించిన రచయిత్రి బ్లాగులో కూడా ప్రస్తావించాను. Eat Pray Love మరియు Committed చదవగలరు. ఇవి ఒక ఆధునిక అమెరికా మహిళ సంఘర్షణలు చూపిస్తాయి. ఆమె పై సానుభూతి అక్కర్లేదు. కానీ, ఒక ఆధునిక మహిళ మనసులోని సంఘర్షణలు స్పష్టమగా మన ముందు పెట్టారామె. విడిపోయే దారి ఉన్నా కలిసి ఉండగలగడం బంధం యొక్క బలాన్ని సూచిస్తుంది. అంతే కానీ, విడిపోయే దారి లేనందు వల్ల చచ్చినట్టు కలిసి ఉండడం కాదు. అంతే కాక, పైనెవరో చెప్పినట్టు విడిపోయే అవకాశం ఉన్నంత మాత్రాన నిజంగా విడిపోతే లాభపడగలిగే సంబంధాలలో విడిపోతున్నారా? విడిపోవడం అంత సులభమా? చట్టాలు కాదు మనసుల మీద ఆధారపడిన విషయం అది. అణచివేతను ఎదుర్కోవడానికి చేసిన చట్టాలను ఎంత మంది అటు దళితులైనా, ఇటు స్త్రీలైనా నిజంగా అవసరం కొద్దీ వాడుకోగలుగుతున్నారు? వాదనగా ఈ విషయం మీద ఎంతైనా వాదించ వచ్చు. కానీ, మీరు చెప్పినట్టు బహుశా ఈ ఒక్క నవల విషయంలోనే కాక చాలా విషయాలలో మనం వ్యక్తిగత నిర్ణయాలను ఆయా వ్యక్తులకు వదిలేయడమో ఉచితమేమో? మనకు దగ్గరి వారైతే ఆ వ్యక్తులలో మనమూ ఉంటాము. నవలలల్లో తెలిసినట్టు (పూర్తిగా తెలుస్తాయా, అక్కడైనా, మన అనుభవాల, మన నిజాల ప్రభావం ఉంటుంది కదా) నిజ జీవితాల్లో మనకి స్పష్టంగా తెలియవు ఎవరు తప్పు అన్నది. ప్రతి ఒక్కరూ తమ point ఎక్కువ చేసి చూపించుకుంటారు, అందులో తెలిసీ తెలియక అబద్ధాలూ, పొరపాట్లూ జరుగుతాయి. ఏ ఒక్కరో పూర్తిగా సత్యవంతులైతేనే వారి మీద సానుభూతి చూపిస్తామంటే అయ్యే పని కాదు. తప్పు చేశారు, శిక్ష పడాలో, విడిపోవాలో అనేదీ సమస్యకు పరిష్కారం కాదు. కలిసి ఉండడం పవిత్రతకూ, నిబద్ధతకూ నిదర్శనం కాదు, అలాగని ఏ మాత్రం తప్పినా విడిపోవాలనీ కాదు. పెళ్ళి అనేది ఒక వ్యవస్థ. దానిని ఒక ఇద్దరి అనుబంధం కింద ఊహించుకుని తియ్యని కలలు కని ఆ కలలు నిజానికి విరుద్ధంగా ఉన్నాయని ఎవరినో దేన్నో నిందించుకుంటూ జీవితం గడపడం కాదు. కళ్ళు తెరుచుకుని పెళ్ళిలోకి ప్రవేశించే వారెందరు? చాలా మందిమి అడుగు లోతు కూరుకు పోయిన తర్వాతే కళ్ళు తెరుచుకుంటాము. అప్పుడు ప్రశ్నించుకుని విశ్లేషించుకుని ఉన్న మార్గాలలో ఒకటి ఎన్నుకుని జీవనం కొనసాగిస్తాము, ఆ దారిలో ఎదురైనవి భరిస్తూ జీవిత పాఠాలు నేర్చుకుంటాము, తర్వాత చెప్తుంటాము. ఇదొక చక్రం, జీవిత చక్రం. ఒక్కో సారి మన అనుభవాలను బట్టి సానుభూతి తప్పు చోట్ల చూపిస్తాము. అందరమూ అందరమే.
ఆనందం కావాలి అనుకుంటే అది అందుకునే మార్గాలు అన్వేషించుకుంటాము. ఎంపిక వల్ల కాదు ఆ ఎంపికను మనం అర్థం చేసుకుని ఆ దారిని మలచుకునే దారిని బట్టి మన ఆనందం ఉంటుంది. ఒకటి మాత్రం నిజం choice ఉండాలి. Because none of us us are god (in way of expression not in spiritual terms).

KumarN said...

lalitha jee(not g),
Amen..
Imagine me bowing my head.

Kumar N

సుజాత వేల్పూరి said...

లలిత గారూ, మీ వ్యాఖ్య చాలా సెన్సిబుల్ గా ఉంది. కానీ అంత లోతుల్ని అర్థం చేసుకునే స్థాయికి మనలో చాలామంది ఎదగలేరు. అదే సమస్య ఇక్కడ1 వారికర్థమైన దాన్ని బట్టి, వారి స్థాయి ప్రకారం ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం తప్ప!

విడిపోయే దారి ఉన్నా కలిసి ఉండగలగడం బంధం యొక్క బలాన్ని సూచిస్తుంది. ..అవును, నిజమే!

చట్టాలు కాదు మనసుల మీద ఆధారపడిన విషయం అది...అవును, కరెక్టే!

మనం వ్యక్తిగత నిర్ణయాలను ఆయా వ్యక్తులకు వదిలేయడమో ఉచితమేమో? మనకు దగ్గరి వారైతే ఆ వ్యక్తులలో మనమూ ఉంటాము. నవలలల్లో తెలిసినట్టు (పూర్తిగా తెలుస్తాయా, అక్కడైనా, మన అనుభవాల, మన నిజాల ప్రభావం ఉంటుంది కదా) నిజ జీవితాల్లో మనకి స్పష్టంగా తెలియవు ఎవరు తప్పు అన్నది....

ఎవరిది తప్పు అన్నది నిజజీవితాల్లో స్పష్టంగా తెలుస్తున్నా కూడా నిర్ణయం ఆ ఇద్దరు వ్యక్తులకే వదిలి వేయాలి....unless మన సహాయం,సలహా వాళ్ళు అడిగితే తప్ప!

పెళ్ళి అనేది ఒక వ్యవస్థ. దానిని ఒక ఇద్దరి అనుబంధం కింద ఊహించుకుని తియ్యని కలలు కని ఆ కలలు నిజానికి విరుద్ధంగా ఉన్నాయని ఎవరినో దేన్నో నిందించుకుంటూ జీవితం గడపడం కాదు. కళ్ళు తెరుచుకుని పెళ్ళిలోకి ప్రవేశించే వారెందరు? చాలా మందిమి అడుగు లోతు కూరుకు పోయిన తర్వాతే కళ్ళు తెరుచుకుంటాము. అప్పుడు ప్రశ్నించుకుని విశ్లేషించుకుని ఉన్న మార్గాలలో ఒకటి ఎన్నుకుని జీవనం కొనసాగిస్తాము, ఆ దారిలో ఎదురైనవి భరిస్తూ జీవిత పాఠాలు నేర్చుకుంటాము, ......అవును పాఠాలు నేర్చుకోవాలి. వాటి సారాన్ని జీవన మార్గాలకు ఆపాదించుకోవాలి.

అర్థవంతమైన వివాహ వ్యవస్థకు విడాకులు అవసరం అని మహేష్ అంటున్నారు. అర్థవంతమైన వివాహ వ్యవస్థకు అంతకంటే అవసరమైనవి చాలా ఉన్నాయి. అవన్నీ ఉంటే విడాకుల అవసరం రాదు. విడాకులు అనేది చిట్ట చివరి ఛాయిస్ మాత్రమే కావాలి.

Gowri Kirubanandan said...

యండమూరి కలం నుంచి జాలు వారిన ప్రతి రచనను చదవాలని నా కోరిక. ఆయన రాసిన నవలలన్నీ నా పర్సనల్ లైబ్రరీలో ఉన్నాయి. నేను తమిళంలో అనువదించిన మొదటి నవల అంతర్ముఖం. అదే పేరుతో వచ్చింది. అనైతికం "బంధం పవిత్రం" అన్న టైటిల్ తొ వెలువడింది. నాకు చాలా నచ్చిన నవల్లలో ఇది ఒకటి.

BVJ said...

హలో వేణుగారు, మా book shelf లోని యండమూరి, మధుబాబు నవలలజోలికి వస్తే నేను వూరుకోను. ఆవిడ ఇవ్వటానికి వీల్లేదు, మీరు తీసుకోవటానికి వీల్లేదు. అవన్నీ నావి.

సుజా, మన చుట్టూ మందాకినిలు, సోమయాజిలు చాలమందే వున్నారు. మందాకినిలు తమ, తమచుట్టూ వున్నవాళ్ళ జీవితాలని successful గా mould చేసుకుంటూ ఉన్నారు; వీరికి 'టాం టాం' అవసరంలెదు. ఇక మిగిలినవాళ్ళలో చాలమంది సొమయాజిలే. వీళ్ళు motivate చెయ్యమని direct గా అడుక్కోకపోయిన, మమ్మల్ని గుర్తించండి మొర్రో అని ప్రాణాలు తీస్తూ వుంటారు.

వేణు said...

బీవీజే గారూ! యండమూరి నవలలు అచ్చంగా నా దగ్గరికి వచ్చేస్తాయని ఆశపడిపోయానండీ. ససేమిరా... ఇవ్వననేశారుగా. సరే. ఏం చేస్తాం? :)

పద్మవల్లి said...

సుజాత గారూ
ఈ నవల గురించి చాలా బాగా రాశారు. ఇది చదివాక మళ్లీ ఇంకో సారి ఈ నవల చదివాను.
నాకు చాలా ఇష్టమైన పాత్ర శ్రీకాంత్ , తరువాత అచ్చమ్మ. అహల్య వైవాహిక జీవితంలో ఉన్న అసంతృప్తి, ప్రేమ రాహిత్యం (పెద్ద మాట?), తన మానసిక పరిస్థితి అర్ధం చేసుకోగలిగితే అహల్య మీద జాలి కలగక పోయినా కోపం మాత్రం రాదు.

ఈ మధ్యనే కుప్పిలి పద్మ గారి "మహీ" చదివాను. అందులో విజయ పాత్ర గురించి చదువుతుంటే అహల్య గుర్తుకు వచ్చింది.

చిన్నప్పుడు ( వెన్నెల్లో ఆడపిల్ల టైం నుండి ) ఆంధ్రభూమి ప్రతి వారం వచ్చేసరికి ఇంట్లో అందరం కొట్టుకొనే వాళ్ళం ముందు చదవటానికి. దొరికిన యండమూరి గారి పుస్తకాలన్నీ వదలకుండా చదివేసేదాన్ని. కానీ కొన్నేళ్ళ నుండి ఎందుకో విరక్తి వచ్చింది ఆయన రచనలంటే. అనైతికం, అంతర్ముఖం, వెన్నెల్లో గోదారి, పర్ణశాల లాంటి కొన్ని తప్ప మిగతావన్నీ అందరికి ఇచ్చేసి, మళ్ళీ ఇవ్వమని కూడా అడగలేదు. కానీ ఇప్పటికి ఆనందోబ్రహ్మ, వెన్నెల్లో ఆడపిల్ల లాంటివి నచ్చుతాయి వాటిలో ఉన్న భావుకత్వం, మనోవిశ్లేషణల గురించి .
సారీ, చాలా లేట్గా కామెంట్ పెడుతున్నందుకు.

పద్మవల్లి

pavan said...

ఃహార్డ్ కాపి దొరకని వాల్లు , ఇక్కడ డొwన్లoaడ్ చెసుకోన్డి
http://teluguebooks4u.blogspot.com/2011/02/anaithikam-by-yandamuri-verendhranadh.html

pavanrgv29@gmail.com

గీతిక బి said...

యండమూరిగారి రచనల్లో నేను చదివినది ఒకే ఒక్కటి... ఈ అనైతికం నవల. అదీ కొన్ని నెలలక్రితం అనుకోకుండా చదివాను. మొదలుపెట్టాక సాయంత్రం అవుతున్నా కదలకుండా (కనీసం మధ్యాహ్నం భోజనం కూడా చెయ్యకుండా) పూర్తిచేసిన ఒకే ఒక్క నవల కూడా.

అందులో ప్రతీ వ్యక్తిత్వాన్నీ... బలంగా, స్పష్టంగా, ఎక్కడా తప్పు అనలేనివిధంగా పరిస్థితుల్ని కల్పించి చూపిస్తూ... చివరికి మనం ఎన్నాళ్ళుగానో ఏర్పరుచుకున్న నైతిక, అనైతికాలమధ్యున్న హద్దురేఖల్ని మనచేతే చెరిపించేస్తారు రచయిత.

ఒక్కసారే చదివినా ఆ క్యారెక్టరైజేషన్.. తలుచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది నాకు. యండమూరిగారి విషయంలో నాకు చాలా ఆశ్చర్యం కలిగించే విషయం... రచనల్లో ఒక్కో పాత్ర స్వభావాన్నీ సమర్థవంతంగా తాను అనుకున్న గమ్యంవైపు నడిపించగల రచయిత అయి ఉండీ ఆయన వ్యక్తిగత జీవితంలో (ఇంటర్వ్యూల్లో చెప్పిన కొన్ని మాటల్లో) చాలా సాధారణ వ్యక్తిలా భావోద్వేగాలకి లొంగిపోవడం..!!
---------------------------------------------------

అనైతికం మీద చాలా అద్భుతమైన వివరణ. చదవాల్సిన ఒక మంచి (అనొచ్చంటారా..? ధైర్యం చేసేశాను) నవల పరిచయాన్ని (ఏ అనవసర మెచ్చుకోళ్ళూ, విమర్శలూ లేకుండా) ఉన్నదున్నట్టుగా వ్రాశారు. తోచక తిరుగుతూ ఉంటే ఈ పోస్ట్ కనిపించి ఇప్పుడు... ఇన్నేళ్ళకి కామెంట్లతో సహా చదివాను.

వ్యాఖ్యానించకుండా ఉండలేనంత బాగా వ్రాశారు.

గీతిక బి

KANDI RAVI said...

అనైతికం నేను చదవలేదు. నాకు అంతర్ముఖం చాలా చాలా నచ్చింది. నేను యండమూరి రచనల అభిమానిని ! ఈ రివ్యూ, ఇందరి కామెంట్స్ చదివాక ఇవ్వాలే అనైతికం కొని చదవాలని డిసైడు అయ్యాను :)

Anil Dasari said...

నేనీ పుస్తకం చదవలేదు. ఇక ముందు చదవను కూడా. మనుషుల, మనసుల విశ్లేషణలూ గట్రా చదవటం (అవి నవలల్లోనైనా, వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లోనైనా) టైం వేస్ట్ అని నా నమ్మకం. విశ్లేషణలు చదివి జీవితాన్ని మలచుకోవటం అంటే 'అంబడిపూడి ముప్పై రోజుల్లో ఆనంద్ అవటం ఎలా' చదివి చెస్ ఛాంపియన్ ఐపోవటమే ;-)

కాబట్టి ఆ తరహా చర్చోపచర్చల కథాంశాలు నాకు పట్టవు. ఇవి రాయటానికి పెద్దగా తెలివితేటలక్కర్లేదు. వేళ్లు నెప్పెట్టినా రాస్తూనే ఉండేంత ఓపికుంటే చాలు. వీటికన్నా యండమూరి రాసిన సస్పెన్స్ నవలలే మెరుగని నా అభిప్రాయం. అవి రాయటం ఆషామాషీ కాదు. ఇక్కడ వ్యాఖ్యలు రాసినోళ్లలో చాలామంది 'అనైతికం' తరహా నవల రాయగలరు - తలచుకుంటే (కొన్ని వ్యాఖ్యల్లో ఎంత లోతైన విశ్లేషణలున్నాయో చూడండి మరి). వీళ్లలో ఎంతమంది ఓ 'అష్టావక్ర' లేకపోతే 'తులసిదళం' .... కనీసం 'లేడీస్ హాస్టల్' రాయగలరు? మాటల గారడీకి మించిన చాతుర్యం కావాలి అవి రాయాలంటే.

So, please do not dismiss Yandamuri because he mostly wrote sensational thrillers.

Ashok8734 said...

సుజాత గారు మీ విశ్లేషణ బాగుంది. ఆద్యంతం ఆపకుండా చదివించే నవల ఇది. కానీ మీరు యీ నవలలో ఇంకో ముఖ్యమైన పాత్ర గురించి చెప్పకపోవటం బాధనిపించింది. ఒక నిస్సహాయ స్థితిలో తన అక్క ఇంటిలోకి వచ్చి అందరి చేత అందంగా మోసగించబడుతూ, తనని "ఉపయోగించుకొని" అహల్య కోసం విధి లేని పరిస్థితులలో ఆత్మహత్య చేసుకుని తనల మోసగించబడుతున్న అహల్యను కాపాడటానికి తనకి ఆమె భర్తకి ఉన్న సంబందాన్ని గురించి, మగవాళ్ళ బుద్ధి గురించి నిప్పులాంటి నిజాలు చెప్పి సంసారం, తన భర్త పట్ల అహల్య దృక్పదాన్ని మార్చిన ఆమె గురించి ఒక్క మాటలో ముగించటం బాధనిపించింది. ఇంత మంచి పుస్తకాన్ని మల్లి చదవాలనిపించేలా ఉన్న మీ వ్యాఖ్యానానికి ధన్యవాదాలు

Indian Minerva said...

ఈ 'అనైతికం' చదవాలని అనుకున్నానుకానీ ఎందుకో పక్కన పెట్టేశానండీ. అది చదివాక మీ పరిచయం/సమీక్ష చదువుతాను.

Indian Minerva said...

ఇన్నాళ్ళకి చదివానండి. ఈనవలని.

యండమూరి నవలల్లోని పాత్రలతో నాకున్న ఒక పెద్ద complaint ఏమిటంటే అవి మీరన్న నీత్యుపదేశాలతోబాటు, జ్ఞానోపదేశాలుకూడా చేస్తాయి. అవన్నీ ఇజ్రాయెల్ గురించో, ప్రఛ్చన్న యుధ్ధంగురించో, ఎఫ్‌బీఐ గురించో కాఫీలు తాగుతూ మాట్లాడుకుంటాయి. అవసలు అవసరమే లేకపోయినా. అనితికంలోమాత్రం దొరికిందికదా అని స్టాక్ మార్కెట్ గురించి పాథకుల్ని ఎడ్యుకేట్ చేసే పనిపెట్టుకోలేదు.

ఇప్పటివరకూ నేను చదివినపుస్తకాల ఆధారంగా, యండమూరి ఇలాగే రాస్తారు అన్నఒక అభిప్రాయం ఏర్పరచుకొని ఉన్నాను. అది ముక్కలైపోయింది దీన్ని చదివాక. మీరన్నట్లుగానే ఆ చెడ్డపాత్రలన్నింటి వర్ణనా చాలా కన్విన్సింగా ఉండి, మనల్నికూడా మంచివిగా భ్రమింపజేస్తాయి. చివర్లో అలాక్కాదనితెలుసుకొన్నప్పుడు, పెద్ద శ్రమలేకుండానే 'మనలాగే మోసపోయిందన్నమాట' అన్నభావం కలిగించడంలో చాలా బాగా సఫలమయ్యారు. నైతికత గురించి ఆయా పాత్రలుచేసే వ్యాఖ్యానాలుకూడా చాలా underlinableగా ఉన్నాయి. పాత్రల్లో వచ్చే step-by-step maturityకూడా బాగుంటుంది.

Indian Minerva said...

ఇన్నాళ్ళకి చదివానండి. ఈనవలని.

యండమూరి నవలల్లోని పాత్రలతో నాకున్న ఒక పెద్ద complaint ఏమిటంటే అవి మీరన్న నీత్యుపదేశాలతోబాటు, జ్ఞానోపదేశాలుకూడా చేస్తాయి. అవన్నీ ఇజ్రాయెల్ గురించో, ప్రఛ్చన్న యుధ్ధంగురించో, ఎఫ్‌బీఐ గురించో కాఫీలు తాగుతూ మాట్లాడుకుంటాయి. అవసలు అవసరమే లేకపోయినా. అనితికంలోమాత్రం దొరికిందికదా అని స్టాక్ మార్కెట్ గురించి పాథకుల్ని ఎడ్యుకేట్ చేసే పనిపెట్టుకోలేదు.

ఇప్పటివరకూ నేను చదివినపుస్తకాల ఆధారంగా, యండమూరి ఇలాగే రాస్తారు అన్నఒక అభిప్రాయం ఏర్పరచుకొని ఉన్నాను. అది ముక్కలైపోయింది దీన్ని చదివాక. మీరన్నట్లుగానే ఆ చెడ్డపాత్రలన్నింటి వర్ణనా చాలా కన్విన్సింగా ఉండి, మనల్నికూడా మంచివిగా భ్రమింపజేస్తాయి. చివర్లో అలాక్కాదనితెలుసుకొన్నప్పుడు, పెద్ద శ్రమలేకుండానే 'మనలాగే మోసపోయిందన్నమాట' అన్నభావం కలిగించడంలో చాలా బాగా సఫలమయ్యారు. నైతికత గురించి ఆయా పాత్రలుచేసే వ్యాఖ్యానాలుకూడా చాలా underlinableగా ఉన్నాయి. పాత్రల్లో వచ్చే step-by-step maturityకూడా బాగుంటుంది.

Post a Comment