December 13, 2010

తెలుగు బ్లాగర్లకు విజ్ఞప్తి!

           నిన్నటి బ్లాగర్ల సమావేశానికి వచ్చిన కొందరు బ్లాగర్లు.ఈ నెల పదహారో తారీకు నుంచి నెక్లెస్ రోడ్డు లోని పీపుల్స్ ప్లాజాలో పుస్తకాల సంత ప్రారంభం కానున్న సంగతి మీ అందరికీ తెలుసు! ఇది 26 వరకూ కొనసాగుతుంది.

ఎప్పటిలాగానే ఈ తెలుగు సంస్థ ఈ సంతలో  ఒక స్టాలుని నిర్వహించబోతోంది. పోయినేడాది ఈ తెలుగు స్టాల్ కి అనూహ్య స్పందన లభించింది. అనేకమంది కవులు, రచయితలు, కళా కారులు,జర్నలిస్టులు స్టాలుని సందర్శించి కంప్యూటర్లో తెలుగుని ఎలా ఉపయోగించాలో నేర్చుకుని సీడీలు పట్టుకుని వెళ్ళారు. శ్రీయుతులు తనికెళ్ల భరణి,బీ వీ పట్టాభిరామ్,జయప్రభ, భారవి, భాస్కర భట్ల రవి కుమార్,తెలకపల్లి రవి,ఇంకా అనేకులు కంప్యూటర్లో తెలుగు వికాసాన్ని తెలుసుకోవటం పట్ల అమితాసక్తిని చూపించారు.

దీనివల్ల మాకు అర్థమైందేమిటంటే ఈ మెయిల్సూ, సోషల్ నెట్ వర్కింగ్ సైట్లూ ఉపయోగించే అనేకమంది ప్రముఖులు ఈ పనులన్నీ తెలుగులో చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారనీ, స్టాలుని సందర్శించే దాకా అవి తెలుగులో కూడా చేయొచ్చని వారికి తెలీదనీ!

తెలుగు బ్లాగర్లను మినహాయిస్తే చాలామంది  తెలుగువారు ఆన్ లైన్లో వార్తా పత్రికలు చదువుకోవడం తప్ప ఇంటర్నెట్ లో తెలుగు వికాసానికీ, తెలుగు విజ్ఞాన సర్వస్వం వికీ పీడియా, బ్లాగులు మొదలైన వాటికి చాలా దూరంలో ఉన్నారు.

స్టాల్ కి లభించిన ఆదరణకు మరో నిదర్శనం...ఆ తర్వాత ఈ తెలుగు నిర్వహించిన రచయితల అవగాహనా సదస్సుకు తెలుగు రచయితలు  వెల్లువెత్తినట్లు రావడం. ఏర్పాటు చేసిన హాలు చాలక మరో రెండు గదుల్లో విడివిడిగా ఏర్పాట్లు చేయవలసి వచ్చింది.

ఈ ఏడాది కూడా పుస్తకాల సంతలో ఈ తెలుగు నిర్వహించబోతున్న స్టాలుకు కొంతమంది వలంటీర్లు కావాలి. ఈ తెలుగు సభ్యులే కాక ఔత్సాహిక తెలుగు బ్లాగర్లు కూడా ఇందులో పాలు పంచుకుంటే బాగుంటుందని సంస్థ భావిస్తోంది. ఇప్పటికే కొంతమంది తెలుగు బ్లాగర్లు ప్రతి రోజూ సాయంత్రం వేళ వచ్చి స్టాలు లో ఉండటానికి సంసిద్ధతను తెలియజేశారు. అక్కడ చేయాల్సిన పనల్లా..సందర్శకులకు కంప్యూటర్లో తెలుగుని ఎలా ఉపయోగించవచ్చో సంక్షిప్తంగా వివరించడం!సీడీలు ఎలాగూ ఉంటాయి!

ఈ తెలుగు సభ్యులు ప్రతి రోజూ అక్కడ ఉంటారు. సంత ఎలాగూ సాయంత్రం నాలుగు తరవాతే ఊపందుకుంటుంది కాబట్టి ఆ సమయానికి ఆసక్తి గల తెలుగు బ్లాగర్లు స్టాలులో ఉంటే బాగుంటుంది. రెండు వారాంతాలూ నేను రాగలను. వీలు చూసుకుని ఈ మధ్యలో కూడా!

అక్కడికి వచ్చే రచయితలు, కవులు, కళా కారుల్ని కలుసుకుని వారికి సాంకేతికాల్ని వివరించే అవకాశం ఉంటుంది. పన్లో పనిగా పుస్తకాలూ కొనుక్కోవచ్చు! అంతే కాదు..అక్కడ పోయినేడాది లాగానే ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్నాము. వచ్చిన వారు తమ బ్లాగు పేరుని అక్కడ స్వయంగా రాసి ప్రదర్శించుకోవచ్చు!

ఇంకోటి..సరదాగా అందరమూ కల్సి కాసిన్ని మంచి కబుర్లు చెప్పుకోవచ్చు:-))

ఏమంటారు? హైద్రాబాదు బ్లాగర్లకే కాక ఇతర ప్రాంతాల నుంచి వచ్చే తెలుగు బ్లాగర్లకు కూడా ఆహ్వానం! (ఫణిబాబు బాబాయి గారు చదువుతూ ఉండాలి ఈ టపా)

ఎవరెవరొస్తున్నారో చేతెలెత్తండి! అంతటితో సరిపెట్టక ఇక్కడ వ్యాఖ్య రాయండి!

36 comments:

కౌటిల్య said...

సుజాత గారూ..ఏంటండీ...పుస్తకాల పండగని "సంత" చేసేశారు....ః))...

సుజాత వేల్పూరి said...

కౌటిల్యా, నిజానికది "సంతే! (fair)! అందరం కలుస్తాం కాబట్టి, పుస్తకాలంటే మనకు సంతోషం కాబట్టి పండగ చేసుకుంటామన్నమాట. :-))

ఇంతకీ బట్టలు సర్దుకున్నారా లేదా?

karthik said...

ఆ ఫోటోలో ఉన్న వాళ్ళ పేర్లు రాసుంటే బాగుండు.. నేను మన రవిచంద్ర గారిని మాత్రమే గుర్తుపట్టగలిగాను..
నేను బేసిగ్గా హై. కి బద్ద వ్యతిరేకిని.. కానీ ఇలాంటివి చదివినప్పుడే హై. ఉంటే బాగుండేది అనిపిస్తుంది :)
మన స్టాల్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను..

వేణూశ్రీకాంత్ said...

ప్రతి ఏటా జరిగినట్లుగానే ఈ ఏడుకూడా ఈ పండగ మరింత విజయవంతం కావాలని కోరుకుంటున్నాను.

జాన్‌హైడ్ కనుమూరి said...

గతంలో ఒక్కసారికూడా నేను రాలేకయాను
ఈ సారైనా చూడాలి

మనసులో ఉత్సాహం ఉన్నా చేతులెత్తడానికి ధైర్యం సరిపోవడంలేదు

రవి said...

క్రితం యేడాది రావాలనుకున్నా రాలేకపోయాను. ఈ సారైనా వచ్చే వీలుంటుందో లేదో? చూద్దాం.

ఆ.సౌమ్య said...

అబ్బ, చా నేను మళ్ళీ మిస్ అవ్వబోతున్నాను. ఇంతదూరంలో ఉన్న మాలాంటి ఔత్సాహిక బ్లాగర్ల కోసం మీరేమీ చేయలేరా? :D

సుజాత వేల్పూరి said...

కౌటిల్య-గుంటూరు
రవి, బెంగుళూరు
కార్తీక్-బెంగుళూరు(కరెక్టేనా)
వేణూ శ్రీకాంత్-బెంగుళూరు
సౌమ్య -ఢిల్లీ...

వేణు,జాన్ హైడ్ గారు, ఈ ఇద్దరు తప్ప హైద్రాబాబు బ్లాగర్లంతా ఏమయ్యారబ్బా? టపా చూళ్ళేదా, చూసీ చూడనట్లు ఊరుకున్నారా?:))

కృష్ణప్రియ said...

నేను 23 -28 డిసెంబర్ హైదరాబాద్ లో ఉంటాను. ఒకరోజు వస్తాను. డైరెక్ట్ గా వచ్చేయవచ్చా? వివరాలకి ఎవరిని సంప్రదించాలి?

సుజాత వేల్పూరి said...

కృష్ణప్రియ గారూ,

స్వాగతం మీకు! క్రిస్మస్ సెలవులకొస్తున్న్నారనుకుంటాను. ఆ రోజుల్లో మీకు కుదిరిన రోజు సాయంత్రం వేళ వచ్చి కాసేపు స్టాల్లో ఉండి(మేము కూడా ఉంటాం లెండి),సందర్శకులకు ఇంటర్నెట్లో తెలుగు గురించి నాలుగు ముక్కలు చెపితే చాలు! మీరు డైరెక్ట్ గా బుక్ ఫేర్ కి వచ్చేసి ఈ తెలుగు స్టాల్ కి వచ్చేయండి. చాలు,

మిమ్మల్ని మేము గుర్తు పట్టడానికి ప్రయత్నించి విఫలమవుతాం:-))! అప్పుడు మీరే పరిచయం చేసుకుందురుగాని!

Thanks very much for comingforward!

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

నేను కూడా తప్పకుండా వీలు చేసుకొని ఒక రోజు వస్తాను.

హరేఫల said...

చుట్టాలొచ్చారు. లేకపోతే తప్పకుండా వచ్చేవాడిని. ప్రత్యేకంగా గుర్తుపెట్టుకున్నందుకు చాలా సంతోషం.

భాను said...

బ్లాగర్ల మీటింగ్ కి వద్దామనుకున్న కాని నాకు వీలు కాలేదు, దీనికి మాత్రం తప్పకుండ ఒక రోజు రావతందుకు ప్రయత్నిస్తా.

Anonymous said...

బ్లాగర్లేనా? లేక ఎవరైనా రావొచ్చాండీ?

శరత్ కాలమ్ said...

నాకూ అక్కడికి వచ్చి మీతో పాటు సంతలో పాలుపంచుకోవాలని వుంది కానీ...కర్సవుద్దని ఆగిపోతున్నా.

సుజాత వేల్పూరి said...

వీకెండ్ పొలిటీషియన్, భాను గార్లు, మీ కోసం చూస్తాము!

ధన్యవాదాలు!

నీలాంచల,
బ్లాగర్లనే కాదు. ఎవరైనా స్టాలు నిర్వహణలో పాలు పంచుకోవచ్చు. మీరు హైద్రబాదులోనే ఉంటే, మీకు వీలు కుదిరితే మీరూ ఓ చేయి వేయవచ్చు!

శరత్ గారూ,

తెలుగుబాటలో మీరు ఉత్సాహంగా పాల్గొనడం గుర్తుంది. ఏడాదికోపాలి వచ్చేది ఈ పండగ. పైగా మొన్న ఒక టపాలో తెలుగు పుస్తకాలేవీ కొనలేదని బాధ పడ్డారు కూడానూ! పుణ్యం, పురుషార్థం రెండూ కలిసొస్తాయి. వచ్చేయండి.

సుజాత వేల్పూరి said...

ఫణిబాబు గారూ,

ధన్యవాదాలు! మీకు వీలుంటే తప్పకవస్తారని తెలుసు.మీరు వచ్చి ఇక్కడ చాలా పుస్తకాలు కొంటారని అనుకున్నాను.

Malakpet Rowdy said...

Shall I come down too? I guess all ithers would run away :)

Unknown said...

''ఏమండీ మన అబ్బాయి పెళ్ళికి మీరు తప్పకుండా రావాలి '' అని వొక భార్య తన భర్త ని పిలిస్తే
యెంత అపశ్రుతో హైదరాబాద్ బ్లాగర్స్ ని మీరు బొట్టు పెట్టి పిలవడం లో నాకు అదే శ్రుతి గోచరిస్తోంది .
ఆ ''సంత'' లో ఏ ''సొంత'' గోలలు లేకుండా మనసంతా మనమై వసుదైక కుటుంబం లా ఏ అపశ్రుతులు
పలకకుండా ఉంటుందన్న నమ్మకం తో వారంతరాలు వాలి పోదామని సంకల్పం .

Kathi Mahesh Kumar said...

నేనూ వస్తానుగానీ...

సుజాత వేల్పూరి said...

Malakpet rowdy,
You are most welcome! No one will runaway from there, moreover we will have to make extra seating arrangement for "malakpetrowdy visitors"!

సుజాత వేల్పూరి said...

రవి గారూ,
వాలిపోండి! సొంత గొడవలు ఎత్తేవారెవరూ ఉండరనే ఆశిద్దాం! వసుధైక కుటుంబంలా కాకపోయినా స్నేహితుల్లా కల్సి రెండు రోజులు పని చేద్దాం! పన్లో పని పిల్లలకు గేములూ, పుస్తకాలూ కొనేసుకుందాం

మహేష్,
ఇంకా ...కానీ...ఏమిటి? వచ్చేయండి!

Anonymous said...

దేశం గొడవల మీద కొట్టుకుచచ్చేకన్నా వ్యక్తిగత గొడవల గుఱించి మాట్లాడుకోవడం ఎక్కువ సుఖం.

విరజాజి said...

సుజాత గారూ,

బ్లాగర్ల సమావేశానికి రావాలని చాలా అనుకున్నాను! మా పాప ఆరోగ్యం సరిగ్గా లేక, తనతోనే సరిపోయింది. తనకి తగ్గితే - ఒక్క వారాంతమైనా వచ్చే ప్రయత్నం చేస్తాను. 2008 లో మనం అందరం కలసుకున్న అనుభూతి నా మనసులో ఇంకా తాజా గానే ఉంది. ఆ రోజులా మళ్ళీ మిరపకాయ బజ్జీలు కూడా కొనుక్కోవాలండోయ్! అందరినీ కలిసే అవకాశం వదులుకోవాలని ఎవరికి మాత్రం ఉంటుంది చెప్పండి?

మరి కలుద్దాం ! పుస్తకాల సంతలో!

శిరీష.
(విరజాజి)

సుజాత వేల్పూరి said...

విరజాజి గారూ, మీరు చక్కని పోచం పల్లి చీరె లో అచ్చ తెలుగు ఆడపడుచులా రావడం కూడా గుర్తుందండీ! మీరు తప్పక రండి, బజ్జీలు ఎంతసేపట్లో వస్తాయి లెండి!

సుజాత వేల్పూరి said...

తాడేపల్లి గారూ, మీతో విభేదిస్తున్నాను. హాయిగా మన వ్యక్తిగత విషయాలకు సంబంధం లేని దేశం గొడవల గురించే మాట్లాడుకోవడం మేలు! సొంత గొడవలు, బ్లాగుల గొడవలు అయితే మళ్ళీ రేప్పొద్దున మొహాలు (బ్లాగుల్లో) చూసుకోవాలంటే తలనొప్పి!

శ్రీను .కుడుపూడి said...

సుజాత గారు !నేను ఈ మద్యే సాహిత్య లోకం లోకి ...అటునుంచి బ్లాగు లోకం కి అడుగు పెట్టిన 'బుల్లి బ్లాగర్ 'ని .
నేను కూడా బుడి బుడి అడుగులతో మీ అందరి మద్యలో తిరగాలని చిన్ని ఆశ !

సుజాత వేల్పూరి said...

తువ్వాయి గారూ,
ఇక్కడ పెద్దా చిన్నా బుల్లీ అంటూ తేడాలేమీ లేవు. తప్పక రండి!

tarakam said...

మీ ఆహ్వానానికి ధన్యవాదాలు.బ్లాగు లోకంలోకి ఈమధ్యనే అడుగు పెట్టాను.రావడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను.

శ్రీను .కుడుపూడి said...

సుజాత గారు !మీ ఆహ్వానానికి ధన్యవాదాలు .:)

Paddu said...

సుజాత గారూ,
నాకూ రావాలనే ఉంది కానీ చాలా దూరం (బోస్టన్) లో ఉన్నాను. సంత విశేషాల కోసం ఎదురుచూస్తూ ఉంటాను.

శ్రీ హర్ష PVSS Sri Harsha said...

ఈ-తెలుగు స్టాలులో, ఆ ఆనందంలో పాలు పంచుకోవడానికి నేను కూడా వస్తున్నానండి.

చెప్పాలంటే...... said...

repu ellundi vastanani cheppanu kaani anukokundaa vijayawada vellalsi vachindi.Maa naanna gariki baaledu. raaleka potunnanu eami anukokandi veelite next weekend vastanu.rao gaariki cheppandi

సుజాత వేల్పూరి said...

తారకం గారూ, మీ కోసం చూస్తాము!

పద్దు గారూ, ఏం చేస్తారు మరి! సరే ఈ సారికి సంత విశేషాలతో సరిపెట్టుకోండి!

హర్ష, మీరు తప్పక వస్తారని తెలుసండి!

మంజు,అలాగే వెళ్ళి రండి! వచ్చే వారం వద్దురు గానీ!

Kalpana Rentala said...

రానివాళ్ళు కూడా చేతులెత్తోచ్చు అంటే..నేను రెడీ..ఇలా దూరం గా వున్నవాళ్లను వూరించి...ఏడిపించే పోస్ట్ లు అసలు అంత కర్కోకటం గా ఎలా రాస్తారో....నేను దీన్ని ఖండిస్తున్నాను..( ఇంకెమి చేయాలో తెలియక...)

రాధేశ్యామ్ రుద్రావఝల said...

పుస్తక ప్రదర్శనకు నేనుకూడా వచ్చాను. అయితే చంచల్ గుడా దగ్గరనుంచీ వైజాగ్ ట్రైన్ కి వెళ్ళిపోతూ మనసాగక ఒక పావుగంటైనా కొత్తపుస్తకాల గాలిపీల్చుకొని వెళదామని, సామాన్లతో సహా ఊడిపడ్డాను. సరిగ్గా పదే నిముషాలు ఆవరణంతా పరుగెత్తేసి, కొన్ని పుస్తకాలు కొనేసి, కినిగె వారి స్టాల్ లో బహుమతి కూడా గెలిచి సికిందరాబాదు స్టేషన్ లో బయల్దేరి పోతున్న ట్రైన్ ఎక్కేశాను. హు.. హు.. ఇప్పటికీ ఆయాసం వస్తోంది తలుచుకుంటే..!!

Post a Comment