సినిమా లో కేవలం వినోదం ఉంటే చాలా సందేశం ఉండాలా అనే పాయింట్ అప్పుడప్పుడూ ఎంత వద్దనుకున్నా చర్చకు వస్తూనే ఉంటుంది.ఈ ప్రశ్న ఏ మాధ్యమానికైనా వర్తిస్తుందేమో ! అయితే సినిమా అనేది బహుళ ప్రజాదరణ పొందిన కళారూపం కాబట్టి,దీనిమీద ప్రజలకు ఆసక్తి ఎక్కువ! దీని ప్రభావం మాత్రం ఎంతో కొంతమంది ప్రేక్షకుల మీద ఉండి తీరుతుంది కాబట్టి గొప్ప సందేశాలివ్వకపోయినా జనాల బుర్రల్లో పురుగు పుట్టించే సినిమాలు తీయకపోతే కొంతలో కొంత నయం!
పెద్ద హడావుడి,హంగూ ఆర్భాటం లేకుండా నిశ్శబ్దంగా విడుదలై ప్రేక్షకుల మెదళ్లలో మాత్రం కోటి ప్రశ్నలు రేపే సినిమాలు కొన్ని ఉంటాయి. "అంకురం" ఇంకా మరికొన్ని సినిమాలు! అలాంటి సినిమాల కోవలోదే
"నాలాగా ఎందరో"!
1978లో విడుదలైన ఈ నలుపు తెలుపు సినిమా మధ్యతరగతి ప్రేక్షకుల ఆలోచనల్ని సుడిగుండంలోకి నెట్టిపారేసింది.
పక్షవాతం వచ్చి కచేరీలు మానేసిన వైణికుడు పార్వతీశానికి ఇద్దరు కూతుళ్ళు. పెద్దమ్మాయి కళ్యాణి ని చిన్నప్పటి నుంచీ మేనత్త కొడుకు చలపతి పెళ్ళాంగా పిలుస్తుంటారు.ఆమె ఇంట్లోనే ఉంటుంది. రెండో పిల్ల కాలేజీలో చదువు!
తనతో చనువుగా ఉండటానికి ఒప్పుకోని కళ్యాణి మీద కోపంతో చలపతి మరో అమ్మాయిని పెళ్ళాడతాడు. చలపతి నే భర్త గా ఉహించుకున్న కల్యాణి హతాశురాలై పోతుంది.
అప్పటి నుంచీ కళ్యాణికి బయట సంబంధాలు చూడటం మొదలుపెడతాడు పార్వతీశం! ఒకడు అవడానికి ఎమ్మెల్యే కొడుకే కానీ మూర్ఛ రోగం,ఒకడికి బోల్డు కట్నం కావాలి,ఒకడికి ఇది రెండో పెళ్ళని పెళ్ళి చూపుల్లో తెలుస్తుంది,మరొకడు మరొకటీ! ఇలా ఎన్ని సంబంధాలు చూసినా పెళ్ళి కుదర్దు. ప్రతి పెళ్ళి చూపుల్లోనూ మధ్య తరగతి కళ్యాణి ఇదే కుదిరి పోతుందని భావిస్తూ పెళ్ళి కొడుకు ఫొటో ని ఫ్రేమ్ లో తన ఫొటో పక్కన పెట్టుకుని కాబోయే భర్త గా ఊహించుకుంటుంది.
ఏదీ కుదరదు. ఈ లోపు చలపతి భార్య చనిపోతుంది. కొడుకు మేనకోడల్ని చేసుకోలేదన్న కోపంతో అతడి తల్లి ఆస్తి అంతా కళ్యాణి పేర రాస్తుంది. వాడు ఆస్తి మీద ప్రేమతో వచ్చి పార్వతీశం ఇంట్లో మకాం పెడతాడు. ఎలాగూ ఇంతకు ముందే అనుకున్న సంబంధం కాబట్టి, ఎలాగు ఇప్పుడు అతనికి భార్య లేదు కాబట్టీ ..అతడీకే కళ్యాణిని ఇచ్చి చేస్తేనో.. అన్న ఆలోచన కళ్యాణి తల్లికి వస్తుంది.
కానీ అతడి ప్రేమ కళ్యాణి పేరు మీద ఉన్న ఆస్తి మీదే అని రుజువైపోతుంది. అతడు వెళ్ళిపోతాడు..
ఆస్తి తీసుకుని.....కళ్యాణిని వదిలేసి..!
ఈ లోగా పక్కింట్లోకి అద్దెకి వచ్చిన ఒకాయనకు ఒక గుడ్డి తమ్ముడు ఉంటాడు.(నారాయణ రావు)వీణలో ప్రవేశం ఉండటంతో పార్వతీశం వద్ద వీణ నేర్చుకోడానికి వస్తుంటాడు. మంచి మనసున్న అతడు కళ్యాణి ప్రతి పెళ్ళి చూపుల్లోనూ ఇది కుదిరిపోతుందనే ఆశతోనే ఉంటాడు.
ఇంతలో కళ్యాణి చెల్లెలు వీణ ఎవరినో ప్రేమించి గర్భవతి అవుతుంది.. కళ్యాణికి కాకుండా రెండోపిల్లకు పెళ్ళి కావడం మంచిది కాదు కాబట్టి కళ్యాణికి వెంటనే సంబంధం చూడాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఒక్క సంబంధమూ కుదరదు.
గుడిలో కూచుని రాగాలు సాధన చేస్తున్న ప్రభాకరాన్ని చూసి కళ్యాణి మనసులో ఆలోచన వెల్గుతుంది."ఆణిముత్యం లాంటి ప్రభాకరాన్ని కళ్ళ ముందే ఉంచుకుని ఎన్ని సంబంధాలు చూస్తున్నాం?"అని "నన్ను పెళ్ళి చేసుకుంటావా ప్రభాకరం" అని అడుగుతుంది. ఇష్టం తోనే!
ప్రభాకరం అన్నా వదినా పార్వతీశం ఇంటికొచ్చి కళ్యాణిని ప్రభాకరానికి ఇచ్చి పెళ్ళిచేయమని అడుగుతారు. పార్వతీశం కూతురు మీద ఉన్న ప్రేమతో మండిపడి "తాను అసమర్థుడైతే కావొచ్చు కానీ దారే పోయే కుంటి వాళ్ళకీ గుడ్డి వాళ్ళకీ ఇవ్వనని తెగేసి చెప్పి పరుషంగా మాట్లాడి వాళ్లను వెళ్ళగొట్టినంత పని చేస్తాడు. తర్వాత కళ్యాణి ద్వారా ఆమే ప్రభాకరాన్ని ఇష్టపడి పెళ్ళి ప్రస్తావన తెచ్చిందని తెలుసుకుని కూతురు ఇష్టాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తాడు.
ఈ వార్త ప్రభాకరం కుటుంబానికి తెలిసే లోపే_______పార్వతీశం మాటలకు మనసు గాయపడిన ప్రభాకరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటాడు.
వీణ పెళ్ళిలోనే కళ్యాణికి మతి చలిస్తుంది. రోజూ దగ్గర్లోని రైల్వే ట్రాక్ మీద నుంచి రైలు వెళ్ళే సమయానికి జుట్టు పీక్కుంటూ పరిగెత్తుకెళ్ళి "నువ్వే చంపావు నా ప్రభా ని! చావు ! చావు!"అని రైలు మీద రాళ్ళు విసురుతూ ఉంటుంది.
ఇదే కథ!
కళ్యాణికి పిచ్చి కుదిరితే గానీ పెళ్ళి కాదు.పెళ్ళి అయితే కానీ పిచ్చి కుదరదు.
ఉత్తమ కుటుంబ విలువలని ఈ సినిమాలో దర్శకుడు ఈరంకి శర్మ ఆర్భాటం లేకుండా చూపిస్తారు.
మేనల్లుడు వేరే పిల్లను పెళ్ళి చేసుకొచ్చినపుడు అక్కడే ఉన్న పార్వతీశం ఆవేశపడి శాపనార్థాలు పెట్టడానికి సర్వ హక్కులూ అవకాశాలూ ఉన్నా ,"అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు చలపతీ"అని సంయమనం పాటించడం,
కూతుర్ని చేసుకోమని అడగడానికి వెళ్ళినపుడు, టైప్ రైటింగ్ మాస్టారు తన కూతురి స్నేహితురాలినే ఆ ముందు రోజే వివాహం చేసుకున్నాడని తెలిసి కొండంత నిరాశను దాచి "దీర్ఘ సుమంగళీ భవ"అని దీవించడం ఇవి అద్భుతంగా తోస్తాయి.
రెండో సారి చలపతి తనను ఆస్తి కోసమే వివాహం చేసుకోవాల్ని భావించిన కళ్యాణి మేనత్త రాసి ఇచ్చిన ఆస్తిని అతని పేర రాసేస్తే తల్లీ దండ్రీ "పోన్లెమ్మా, మంచి పనే చేశావు. అసలు ఆస్థి ఎవరిక్కావాలి? అనడం.....
..ఇవన్నీ మనుషుల్లో ఇంకా మిగిలి ఉన్న మానవీయ కోణాల్ని స్పృశిస్తాయి.
నిజంగా ఇలాంటి పాత్రలన్నీ ఏమైపోయాయి? ఏ కమర్షియల్ సినిమాల జోరులో అదృశ్యమై కొట్టుకుపోయాయి?
ఈ సినిమా పూర్తిగా పార్వతీశం గా నటించిన హేమ సుందర్ దే! ఇందులో రూప కి కూడా నటనకు అంత పెద్ద అవకాశమేమీ లేదు. విలువల్ని పాటించే మధ్య తరగతి తండ్రిగా హేమ సుందర్ నటన ఆకాశాన్ని తాకుతుంది. అందుకే ఆ ఏడాది ఆయన్ని నంది అవార్డు వరించింది.
అభిమానం,కూతుళ్ళ మీద ప్రేమ,నిస్సహాయత,మంచితనం,సంయమనం ఇవన్నీ అద్భుతంగా పండిస్తాడు.
ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా నంది అవార్డు దక్కడమే కాక,హేమ సుందర్ కి కూడా నంది అవార్డు వచ్చింది. బాల సుబ్రహ్మణ్యానికి తొలి నంది ఈ చిత్రంతోనే దక్కింది. రూప,పల్లవి ఇద్దరు ఈ చిత్రంతోనే పరిచయం! రూప చాలా బాగా చేసింది .
ఇవాళ చెణుకుల వంటి పంచ్ డైలాగులకు ఆహా ఓహో అనేస్తున్నాం. ఈ సినిమాలో పాత్రోచితంగా, సందర్భోచితంగా చెంప దెబ్బల్లా తగిలే గణేష్ పాత్రో డైలాగులు అద్భుతంగా అమరిపోయాయి.
సామాజిక సమస్యల మీద వచ్చిన సినిమాల్లో కొన్ని సమస్యను స్పర్శించడమే కాక,దానికి పరిష్కారాలను కూడా సూచిస్తాయి..రుద్రవీణ,అంకురం.. బలిపీఠం,కాలం మారింది, ఇలాంటి సినిమాలు!
కొన్ని సినిమాలు మాత్రం సమస్యల్ని చర్చించి వదిలేస్తాయి.
ఈ వదిలేయడంలోనే ఒక పరిష్కారం ఉంది. సమస్యకు పరిష్కారాన్ని పరిస్థితిని బట్టి, సమస్యను బట్టి మనమే వెదుక్కోవాలనేదే ఆ పరిష్కారం!
నిజానికి సామాజిక సమస్యను గుర్తించి, దాని మీద చర్చ లేపి వదిలేయడం రచయితలు,దర్శకులు చేసే పని. ఎందుకంటే కొన్ని సమస్యలకు ఒకే పరిష్కారం ఉండదు. అనేక పరిష్కరాలు ఉండొచ్చు. వాటిలో ఏది సరైనదో ఎంచుకునే స్వేచ్ఛ పాఠకుడికో,ప్రేక్షకుడికో ఉండాలి.అందుకే సమస్యను చర్చించి వదిలేయడం
ఈ సినిమాలో కూడా అంతే! కళ్యాణి పిచ్చిదై పోవడంతో కథ ముగుస్తుంది. ఆమె రైలు మీద రాళ్ళు విసురుతూ గోడల మీద "భరత మాతా, నీకు పెళ్ళయిందా? నాకు కాలేదు" లాంటి రాతలు రాస్తూ ఉండగా వెనుక నుంచి వ్యాఖ్యానం వినిపిస్తుంది. సమస్యకు పరిష్కారమేమిటని ప్రశ్నిస్తుంది. పెళ్ళి చూపులంటే నలుగురి ముందూ పది సార్లు కూతుళ్ళను కూచో బెట్టి ఆ ఆడపిల్లల మనసుల్లో "ఇతడే నా భర్తేమో" అన్న ఊహలని కల్పించే సంప్రదాయాన్ని, కూడా ప్రశ్నిస్తుంది.
కళ్యాణి గోడల మీద రాసే రాతల్ని "మసి గీతలు కావివి, ఆమె కసి గీతలు" అని వ్యాఖ్యానిస్తుంది.
కళ్యాణమే ఎరగని,జరగని పాత్రకు కళ్యాణి అని పేరు పెట్టడం దర్శకుడి ఐరనీ!
ఇందులో రెండు మంచి పాటలున్నాయి. గుడ్డి వాడైన ప్రభాకరం "నిన్ను చూడాలని ఉంది కళ్యాణీ, నువ్వు ఎలా ఉంటావో చెప్పవూ?" అన్నపుడు కళ్యాణి పాడే పాట.."కళ్యాణినీ...కనులున్న మనసుకు కనిపించు రూపాన్ని,చెవులున్న మనసుకు వినిపించు రాగాన్ని"
ఈ పాటఇక్కడ..వినండి
అలాగే అనుభవాలకు ఆది కావ్యం ఆడదాని జీవితం అనే మరో మంచి పాట. ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీతంలో ముచ్చటగా రూపు దిద్దుకున్న ఈ రెండు పాటలూ ఎప్పటికీ ఆణిముత్యాలే! టిపికల్ ఎమ్మెస్ స్టైల్ పాటలు.కళ్యాణి నీ పాటలో బాలు ఆలాపనలు మధురాతి మధురం!
అయితే కల్యాణి పెళ్లి తప్ప మరో ఊసు లేక ఉహల్లో గడపటం, చదువుకున్నా,కనీసం ఉద్యోగ ప్రయత్నం లాంటిది చేయకపోవడం ఇవాల్టి రోజుల్లో కాస్త ఎబ్బెట్టుగా అనిపించినా సినిమా ముప్ఫై ఐదేళ్ళ నాటిది కాబట్టి పెద్దగా పట్టించుకోక వదిలేయాల్సిందే!
ఈ వీడియో బయట ఎక్కడా లభ్యం కావడం లేదు, కళా ఖండాల్ని భద్రంగా దాచుకునే ఒక మిత్రుడి నుంచి నాకు దొరికింది. ఎపుడైనా టీవీలో చూసే అవకాశం లభిస్తే చూడండి.ఇలాంటి పాపులారిటీ లేని సినిమాలు వీక్ డేస్ లో ఉదయం వేళల్లో వేస్తుంటారు.
24 comments:
మధ్యతరగతి కుటుంబాలు ‘గుండెల మీద కుంపటి’లా తలచే సమస్యను పదునుగా చిత్రించిన ఈ సినిమా దశాబ్దాల క్రితమే చూసినా బాగా గుర్తుంది. ఈ చిత్రానికి సంభాషణలు రాసింది గణేశ్ పాత్రో అని అప్పట్లో తెలియదు. భావగర్భితంగా, మధ్యతరగతి వేదనలకూ, సంస్కారానికీ అద్దం పట్టేలా ఉంటాయి సంభాషణలు.
సినిమా ముగింపు గుండెలను పిండేలా ఉంటుంది. అయినప్పటికీ అదెంతో వాస్తవికం. కమర్షియల్ గిమిక్కుల్లేకుండా చెప్పదల్చుకున్నది నిజాయతీగా చెప్పిన దర్శకుడు ఈరంకిశర్మ, చిత్ర బృందం అభినందనీయులు!
ఆత్రేయ రాసిన రెండు పాటలూ అర్థవంతమైనవీ, శ్రావ్యమైనవీ. ఇప్పటి తరానికి ఇంత చక్కని సినిమాని పరిచయం చేయటమే కాకుండా రెండు మంచి సన్నివేశాలను వీడియో బిట్లుగా అందించినందుకు మీక్కూడా అభినందనలు!
అవునండీ మంచి సినిమా,దర్శకుడు ఈరంకి శర్మ చేసినవి ఒకటి-రెండు సినిమాలయినా అతనిలో కొంత బాలచందర్ బాణీ ఉంటుంది.అందుకే గణేష్ పాత్రో,ఎమ్మెస్ ఆత్రేయ సహకారం.
హేమసుందర్ మనకున్న మంచి కారక్టర్ ఏక్టర్స్ లో ఒకడు.రూపాచక్రవర్తి బాగా చేస్తుంది,కొన్ని సినిమాల తర్వాత మెల్లిగా వెండి తెర మీంచి బులితెరమీదకి జారుకుంది.
మంచిసినిమా పరిచయం చేసారు.
ఈ సినిమా పేరు కూడా ఇప్పటివరకూ వినలేదండీ..ఏక్టర్స్ కూడా తెలీదు నాకు. బట్ ఈ సారి ఏటీవీ లోనో వస్తే చూడాలనిపించేలా ఉంది ఇది చదివాక. కళ్యాణి రైల్ బండి మీద రాసిన రాతలు బ్రెయిన్ట్విస్టర్స్ లాగా ఉన్నాయ్.
ఓ మంచి సినిమాని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
మంచి విశ్లేషణ... ధన్యవాదాలు..
నాకు ఈ సినిమా గురించి తెలియదు.బాగా రాసారు. ఎలాగైనా ఒకసారి చూడాలి అని ఉంది.
మంచి సినిమా గురించి పరిచయం చేశారండీ... హేమసుందర్ గారు నాకు కూడా నచ్చుతారు మంచి నటుడు, శ్యామల గారు, రూప వీళ్ళంతా సినిమా నటులుగా కన్నా టీవీ నటులుగా బాగా గుర్తుండిపోయారు నాకు. ఇది నిజంగా 35 ఏళ్ల క్రితం సినిమా అంటే ఆశ్చర్యంగానే ఉంది. వీళ్ళందరిని నిన్నమొన్నటివరకూ టివిలో చూడటం వలననేమో.
ఈ సినిమా టీవీలో చాలాసార్లు వచ్చింది. నేను అక్కడక్కడా చూసాను కానీ పెద్దగా పట్టించుకోలేదు. ఈసారి మొత్తం చూస్తాను.
మంచి సినిమా గురించి పరిచయం చేసారు.ధన్యవాదాలు.కళ్యాణి పాట బాగుంది :)
సుజాతగారూ,
మంచి సినిమా గురించి ముచ్చటించేరు. చెప్పిన విధానం చక్కగా ఉంది. ఈ సినిమా నేను చూసేను. పాటలు ఎంతో ఇష్టంగా వినేవాడిని. ముఖ్యంగా "కళ్యాణినీ"
పెళ్ళి కుదరదు అని రాయకుండా కుదర్దు అని రాసేరు, అది చాలా బాగుంది, ఎదురుగా కూర్చుని మీరు చెపుతుంటే వింటున్నట్టుగా.
మీరు సంగీత సాహిత్యాలను (పాటలను) విశ్లేషించే తీరు బాగుంది. నా దగ్గర రెండు పాటల సీడీలున్నాయి, బాలుగారూ, వారి చెల్లెలు శైలజా ఒక సీడీలోనూ, ప్రస్తుతం సినిమాలలో పాడుతున్న మాళవికా, కారుణ్యా ప్రణవీ తదితరులు మరో సీడీలోనూ కొన్ని పాటలు పాడేరు.ఆ పాటలు నా ఇంటి నాలుగు గోడల మధ్య ఉన్నాయేతప్ప మరెవ్వరూ ఇప్పటి దాకా వినలేదు. వాటిని విని మీరు కాస్త వాటి గురించి చెపుతారేమో అడగాలని అనుకుంటునాను. ఆ సీడీలు మీకు ఎలా పంపగలను??
దయచేసి మార్గాంతరం తెలియచెప్తారా??
అసలు ఈ సినిమా పేరు ఇంతకముందు ఎప్పుడూ వినలేదు. తప్పక చూస్తాను!
చాలా మంచి చిత్రం ని పరిచయం చేసారు సుజాత గారు. మన అదృష్టం ఏమిటంటే.. సినిమాలలో సామాజిక సమస్యలని చైతన్యంగా మలచి చూపిన కాలంలో మనం ఉండి..మంచి చిత్రాలను చూసి కొద్దిగా గొప్పో ఆలోచింప జేసేవి. ఇప్పటి సినిమాలలో అవేమి లేవు. కొంత కాలం వైరాగ్య భావం లో మునిగిన తర్వాత.. ఇంటికి వచ్చే అతిదుల కోసం అయినా తప్పదు కనుక
ఆరు నెలల తర్వాత నిన్ననే మాఇంట టీవి మ్రోగుతుంది .(రీచార్జ్ చేసుకుని ) కొన్నాళ్ళు మంచి సినిమాలని చూస్తూ ఉంటాను లెండి. ధన్యవాదములు.
ఈ సినిమా అయితే చూడలేదు కానీ మీరు రాసిన రెండు పాటలు రేడియోలో చాలాసార్లు విన్నాను. భారమైన ఈ కథ చదివి,నిన్న రెండు మూడు సార్లు ఇటు వచ్చి కూడా వ్యాఖ్య రాయలేకవెళ్పోయా..కథానాయికలాంటి ఇద్దరి అమ్మాయిల బరువైన జీవితాలు గుర్తుకు వచ్చి..!
రూపాదేవి సినీనటిగా కన్నా 'బంగారు చిలక', 'ఋతురాగాలు' మొదలైన టివీసీరియల్స్ నటిగానే గుర్తుండిపోయింది.ఆవిడ ఈలపాట రఘురామయ్యగారి అమ్మాయి.ఈ సంగతి ఆవిడ ఒక టివీ షోలో చెప్పారు.
చాలా మంచి సినిమాని అంటే అద్భుతంగా అన్నీ కోణాలు స్పృశిస్తూ పరిచయం చేసారు...అభినందనలు
Interesting.
సుజాత గారు: ’కళ్యాణినీ’ పాటను మెల్లిసై మన్నన్ ఎమ్మెస్ స్వరపరచిన తీరు బాగుంది. (పల్లవి ఒకటో చరణం ధర్మావతి/గౌరిమనోహరి, రెండో చరణం కళ్యాణిలోను ). చిత్రం పున: పరిచయం బాగుంది.
మీ సినిమా పరిచయం బాగుందండి !!
అయితే రోజులు మారిపోయాయి .. మగాళ్ళు రైలు పట్టాలేక్కేంతగా :)
ఈరంకి శర్మ గారి తో పాటు ఆలోచింప చేసే సినిమాలు తీసిన వారు వేజెళ్ళ సత్యనారాయణ . ఆయన సినిమాల ని కూడా మీరు కొత్త తరానికి పరిచయం చేస్తే బాగుంటుంది.
సుజాత గారు, ఈ సినిమా మీద సమీక్ష బాగుంది. ఇలాంటి ఆణిముత్యాలు నా లాంటి సినిమా పిచ్చి వాళ్ళకి కుడా పంచుకుంటే సంతోషిస్తాము. మొన్న ఎనిమిదో తారిఖు విజయవాడలోనే మిమ్మల్ని కలవాల్సింది, అనుకోకుండా వచ్చిన ఒక ముఖ్యమైన పని వల్ల రాలేకపోయాను.
అన్నట్లు ఆ రోజు ప్రెస్సు క్లబ్బు లో పుస్తకావిష్కరణలో పాల్గొన్న విశ్వేశ్వరరావు గారు నాకు మామయ్య.
రాజేష్ గారూ,
థాంక్యూ! విశ్వేశ్వర రావు గారు మీకు మావయ్య గారా? గూగుల్ ప్లస్ లో అనూరాధ గారు ఆయన తనకు బాబాయి అవుతారని చెప్పారు. మీరు, అనూరాధ గారు మీరూ కజిన్సా?
మొత్తానికి మీరు సభకు రాలేకపోవడం కాస్తంత విచారించ దగిన విషయమే!
చాలా మంచి పోస్టు రాసారు సుజాత గారు.ఈ సినిమా గురించి మునుపెన్నడూ వినలేదు.
ఈ సినిమా తేజాలో చాలాసార్లు వేసేవాడు. కానీ, పేరు ఇదని మీరు చెప్పేదాకా తెలీదు :)
venkata sailaja.I
chala chala bagundi, enthamanchi cinima ekamundu kuda avaru theeyaleremo bahusa, thanks to introduce this movie
elanti adbuthamina movie ekamundu avaru theyaleru kuda, chala chala bagundi,chakani saramsam kalginadi,thanks to introduce
sujata garu,
same director di anukunta madam..
chilakamma cheppindi ane oka cinema vundi...adi kooda bagtuntundi..kshaminchandi..aayaana ee movie ki director ki kaakapothe.
excellent review madam..thanks once again for the youtube uploads..
keep up the great work madam..
appati jnaapakaalani ..idigo..ilaa ..thavvukone chance icchinanduku..thanks..once again madam..
చిన్నప్పుడు చూసినట్లు గుర్తు....సినిమ ఆఖర్లో హీరొయిన్ పిచ్చిది అయ్యి,రైలు మీద రాళ్ళు వేస్తు....ఎదొ అంటుంది,అది తూర్పుకి వెళ్ళే రైలు అనుకుంట,మళ్ళీఎప్పుడూ చూడలేదు,ఈ సినిమ చూడాలంటే ఎలా? అన్లైనె లో దొరకదు,టి.వి లో వచ్చినప్పుడు కుదరదు,బుత్ సినిమ స్టొరీ పిండేస్తుంది
Post a Comment