September 5, 2012

సహజ (ఓల్గా)





ఎప్పుడైనా స్కూలు నాటి స్నేహితుల్నో, కాలేజీ నాటి స్నేహితులనో  కల్సుకుంటే..వాళ్లలో ఎవరైనా

"నువ్వేం మారలేదే,, నీ అభిరుచులు, నీ మాటలు..ఉహూ..ఏం మారలేదు" అనంటే , ఒకప్పుడు "ఏం మారతాం ఎవరమైనా?" అనిపించేది కానీ, నిజంగా పెళ్ళి తర్వాత మారకుండా ఉండటం ఎలా సాధ్యమనే ఆలోచన వచ్చేది కాదు.

పెళ్ళి ఎవరి జీవితంలో అయినా ఒక జెర్క్!

 పెళ్ళికి ముందు ఉన్నట్లు ఉండాలంటే మన చుట్టూ ఉన్న మనుషులు అతి మంచి వాళ్ళై ఉండాలి. లేదా సంసార సాగరాన్ని ఈదుతూనే, బాధ్యతల సుడి గుండాల్లో పడి, అందులో మాయమై పోకుండా నేర్పుగా వ్యవహరించే తెలివి తేటలైనా ఉండాలి..!

కరెక్టా? ఉహూ .....కాదు! ఇంకేదో ఉంది...!!:-)

పెళ్ళి తర్వాత ఆడపిల్లలో ఎందుకు మార్పు వస్తుంది? వంటిల్లే లోకంగా,పిల్లలు, సేవింగ్స్...ఇవే ప్రపంచంగా ఎందుకు దాంట్లో కూరుకుపోతారు? పాత రోజుల నాటి అభిరుచులని, ఉల్లాసాన్ని,స్నేహాలను కూడా మర్చిపోయేంతగా అందులో ఎలా మమేకమై పొతారు?

అందరూ అలాగే ఉంటారా? అందరూ ఇష్టంగానే అందులో పడి మగ్గిపోయి అదృశ్యమైపోతారా? లేక వేరు దారి లేక అందులోనే తమను తాము ఇముడ్చుకుంటారా? యిది ఇష్టపూర్తిగా జరిగేదా లేక ఇందులో ఆత్మ వంచన ఉందా?
ఎక్కడికి పారిపోతాయి ఆ యవ్వన మధుమాసంలోని  నవ్వులూ, తుళ్ళింతలూ?
ఏ మలుపులో దారి తప్పి పోతాయి ఆ ఆశలూ, జీవితం మీది మధురోహలూ?
ఏ బాధ్యతల బరువు జీవిత సౌందర్యం వైపు తల తిప్పనివ్వకుండా చేస్తుంది ??

ఓల్గా రాసిన మొదటి నవల "సహజ" నవల్లో ఈ ప్రశ్నలన్నీ పాఠకులకు ఎదురవుతాయి. ఇది అప్పట్లో చతుర నవలగా వచ్చింది  .ఓల్గా మిగతా నవలల్లాగే సరళంగా సాగిపోయే శైలి ! ఆలోచింపజేసే కథా!!

ఓల్గా తర్వాతి రచనలతో పోలిస్తే ఇందులో కొంత పరిణతి తక్కువగా కనిపిస్తుంది రచనా పద్ధతిలో, ఎక్స్ ప్రెషన్ లోనూ!  

గుంటూర్లో తను కల్సి చదువుకున్న స్నేహితురాళ్ళు శారద, ఉష,రమ లను కలుసుకునేందుకు ఎన్నో ఏళ్ళ తర్వాత ఉద్యోగ రీత్యా బదిలీ అయి వచ్చిన సహజ కోటి జ్ఞాపకాలతో, సరికొత్త ఊహలతో పరిగెత్తుకొస్తుంది.

కానీ ఆమెకు నిరాశే ఎదురవుతుంది. ఆ ముగ్గురిలోనూ ఎంతో మార్పు.

కాస్తలో కాస్త ఉష తప్ప, మిగతా ఇద్దరిలోనూ ఘోరమైన మార్పు.

బాల మురళీ కృష్ణ పాట విన్నాక చచ్చిపోతే మాత్రమేం? అని ప్రాణాలివ్వడానిక్కూడా సిద్ధ పడ్డ రమ అదే బాల మురళి కచేరీ లోంచి  "అమ్మో, పాలు కాయాలే! అవి విరగాయంటే...మా అత్తగారి నస తట్టుకోలేను బాబూ" అని లేచెళ్ళి పోయే దశలో ఉంటుంది.

అద్భుతమైన పెయింటింగ్స్ ని అలవోగ్గా చిత్రించే శారద మిలిటరీ క్రమశిక్షణ నడిపించే భర్తకు, పిల్లలకు అన్నీ అందిస్తూ మాటలు రాని మూగదాని మల్లే అయిపోతుంది. భర్తకు ఇష్టం లేదని బొమ్మలు వెయ్యడం మానేస్తుంది.

సినిమా పిచ్చి లో పడి తిరిగే భర్తను ఏమీ అనలేక తనదైన పుస్తకాల లోకంలో ఆనందాన్ని వెదుక్కుంటూ కొంతలో కొంత నయంగా ఉంటుంది ఉష!

వీళ్ళు ముగ్గురిలోనూ ఈ మార్పు సహజకు జీర్ణించుకోవడం కష్టమైపోతుంది.కానీ సహజ ఆ వూరు వచ్చాక,  శారద  ఉషల జీవితాల్లో కొంత సంచలనం కల్గుతుంది. రమ ఎవరి మాటలూ వినపడనంతగా సంసారంలో పూడుకుపోయి ఉంటుంది.

సహజ  పంచిన స్నేహ పరిమళాలతో ఉష, శారద ల జీవితాల్లో సుగంధాలు విరబూస్తాయి. శారదలో బలవంతాన హత్య చెయ్యబడిన కళ తిరిగి జీవం పోసుకుంటుంది. ఉష భర్త తన కొలీగ్ ని పెళ్ళి చేసుకోవాలనే నిర్ణయాన్ని ఉష  ధైర్యంగా అంగీకరించి ఏ మాత్రమూ ఆనందం కల్గించని అతని సహజీవనానికి స్వస్తి పలుకుతుంది.

తన ఆధిపత్యానికి తిరుగు లేదని విర్రవీగే రామారావు మీద తన ఆత్మ గౌర్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో గొంతెత్తి నిలువరిస్తుంది శారద! ఇంకా చావని తన కళకు ప్రాణం పోసి బొమ్మలు గీస్తుంది.

ఈ కథంతా పక్కన పెడితే....

తమలో నిశ్శబ్దంగా జరిగిపోయే మార్పుని స్త్రీలు గుర్తిస్తారా? గుర్తించి కూడా గుర్తించనట్లు ఆత్మ వంచనతో నటిస్తారా అన్నది వేసుకోవలసిన ప్రశ్నే!


ఈ నవల 1986 లో రాసింది. అప్పటికీ ఇప్పటికీ సమాజం మారింది. ఇళ్ళలో పరిస్థితులు మారాయి. వంటింట్లో మగవాళ్ళు అడుగు పెట్టడమే వింతగా చూసి, మెచ్చుకునే పరిస్థితి ఈ నవల్లో ఉంది కానీ ఇవాళ చాలా వరకూ మారింది. అప్పటికీ ఇప్పటికీ ఉద్యోగాలు చేసే స్త్రీల సంఖ్య కూడా గణనీయంగానే పెరిగింది. మనుషుల ఆలోచనా విధానాల్లోనూ, స్వేచ్చా దృక్పథాల్లోనూ ఎంతో మార్పు వచ్చింది.

కానీ...పెళ్ళి వల్ల జీవితంలో చోటు చేసుకునే మార్పులో మాత్రం..పెద్దగా మార్పు లేదు. అభిరుచుల్ని, అభిప్రాయాల్ని సైతం మార్చేసుకుని...పూర్తిగా తామూ మారిపోయే వాళ్ల శాతం ఇంకా ఎక్కువగానే ఉంది.

ఈ నవల్లో "ఎందుకిలా మారిపోయావు రమా? ఏం కావాలి నీకు? ఎంతసేపూ డబ్బు,బాంక్ బాలెన్స్, పిల్లల్ని పెంచడం..ఇవేనా నీ జీవితాశయాలు" అని సహజ ప్రశ్నిస్తే రమ అవునంటుంది.

"అవునే, అదే నా జీవితాశయం! పిల్లల్ని పెంచి పెద్ద చేయడమే!! పిల్లల ఉన్నతిని చూడ్డం కంటే జీవితంలో ఏం కావాలి! ఏదో పెళ్ళికి ముందు మన సరదాలు మనకి ఉంటాయి. నీ జీవితాశయం ఏమిటో చెప్పు?పాట కచేరీలకు వెళ్ళడమూ, ఊళ్ళు పట్టుకు తిరగడమూనా? వాటి కంటే..నేను పిల్లలని చదివించుకుంటానంటే తప్పయిందా...." అని కడిగి పడేస్తుంది.

"నీ జీవితాశయం ఏమిటో చెప్పు" అని రమ నిలదీస్తే జవాబు వెంటనే చెప్పలేకపోతుంది సహజ! ఎందుకంటే సహజకు జీవితాశయం అంటూ ఒక భౌతికమైన టార్గెట్ లేదు.

స్నేహం..ప్రేమ....! అందరితోనూ స్నేహంగా ఉండటం, స్నేహం చేయడం, ప్రపంచాన్ని ప్రేమించడం..ఇవే సహజ కోరుకునేది! ఇవి గొప్పవే కావొచ్చు....కాని ఎవరికీ అర్థమవుతాయి?

ఆ రెండు ఉంటే  జీవితం అందంగా మారిపోతుందని ఎవరు చెప్తారు రమ  లాంటి వాళ్లకి?

కానీ ..ఇవి జీవితాశయాలంటే ఎవరు నమ్ముతారు మరి!!

నిజానికి పాతికేళ్ళ క్రితం రమ లాంటి పాత్రలు ఉండటం ఎంత సహజమో, ఇవాళ్టి రోజుల్లో కూడా రమ కంటే ఎక్కువ చదివి, మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు సైతం రమ స్థాయి కోరికలు దాటి ముందుకు పోలేని దశలోనే ఉండటము అంతే  సహజంగా అంగీకరిస్తున్నాం!

డబ్బు చుట్టూ తిరిగే జీవితపు చక్రాల మధ్యలో ఒడుపుగా తిరిగేస్తూ..వాటి కింద పడి నలగ కుండా జాగ్రత్త పడుతూ...పిల్లని చదివించడమే జీవితాశయంగా బతికేస్తూ.....జీవిత సౌందర్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ.. పగళ్ళూ రాత్రులూ గడిపే వాళ్ళు ఎంతమంది??

ఒక సోషల్ కమిట్ మెంట్ కి ఇంత శక్తి ఉందా? ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా తనకేం కావాలో మర్చిపోయేంత  గా మార్చి  వేస్తుందా వివాహం?

చాలా మందికి పెళ్ళి కి తాము ఏమిటన్న దానికి జవాబే గుర్తుండదు. . తమ అభిరుచులేమిటో...వేటిని ప్రాణంగా భావిస్తూ బతికారో....గుర్తుండదు.

మంచి గాయనిగా ఉన్నావిడ "పెళ్లయ్యాక ఇంకా అవన్నీ ఎక్కడ కుదురుతాయి" అంటుంది. నెమలికి నడకలు నేర్పే నాట్య కారిణి అయినా పెళ్ళితో స్వస్థి చెప్పాల్సిందే! ఉద్యోగాల్లో పడి ఒకప్పుడు తాము ఏమిటి అన్న ప్రశ్న వేసుకోడమే మానేస్తారేమో!

తమిళ రచయిత్రి శివశంకరి ఇలాంటి సున్నితమైన విషయాలను చాలా చక్కని సాధికారాత తో విశ్లేషిస్తారు. ఆమె రాసిన ఒక నవల "నేను నేనుగా"!!

ఇందులో పిల్లలు చదువులకెదిగిన ఒక తల్లి జీవితంలో ఏదో శూన్యత్వం ఆవరించిందని గ్రహించి....పెళ్ళికి ముందు సాధన చేసిన శాస్త్రీయ నృత్యాన్ని తిరిగి సాధన చేసి ప్రదర్శనలిచ్చే స్థాయికి చేరుతుంది.

జీవితంలో ఎప్పటికీ ఆ యవ్వన కాలపు మధురిమల్ని, ఆశల్ని, కాంతుల్ని,పరిమళాన్ని పొగొట్టుకోకుండా ఉండగలగడం ఎంత గొప్ప విషయం??మన అభిరుచుల్ని మర్చిపోకుండా ఉండటం, వాటిని కాపాడుకోవడం ఇవన్ని మనల్ని మనం మర్చిపోకుండా ఉండటం కాదా !! మనల్ని మనం కోల్పోకుండా  ఉండటం కాదా?

మనలో ఎంతమంది అలా జీవిస్తున్నామో ఎవరికి వారు ప్రశ్నించుకోవలసిందే !!

ఈ నవల చదివాక నాకో సందేహం వచ్చింది.

స్త్రీల జీవితంలో వంటిల్లు ప్రముఖ పాత్ర, పిల్లలు, వాళ్ళ పెంపకమ మరో అద్వితీయ పాత్రా వహిస్తాయి కాబట్టి పెళ్ళి వాళ్ళ జీవితాల్ని కబ్జా చేస్తుందని రుజువైనట్లే!

మరి పెళ్ళి..పురుషుల జీవితాల్ని మార్చదా? మారిస్తే ఎలాగ?
పెళ్ళికి ముందు వాళ్ళ జీవితంలో ఉన్న సౌందర్యారాధనా,ఉల్లాసమూ,పరుగులెత్తే ఉత్సాహమూ...ఇవన్నీ పెళ్ళి తర్వాత అలాగే ఉంటాయా? క్రమ క్రమంగా మసకేసి మాయమైపోతాయా?

ఈ కోణంలో  రచనలేమైనా వచ్చి ఉంటాయా? ప్రత్యేకించి ఇదే కోణంలో....!!

48 comments:

A Homemaker's Utopia said...

మాటల్లో చెప్పలేనంత బాగా రాశారు సుజాత గారు..:-) .ప్రతి పెళ్లి అయిన అమ్మాయి తనను తాను పోల్చుకొనే విధం గా ఉంది ఈ రివ్యూ...నాకు పెళ్లి అయిన తరువాత చాల మార్పులు వచ్చాయి,చాలా విషయాలలో రాజీ పడవలసి వచ్చింది....ఇంకా పిల్లల బాధ్యత విషయానికి వస్తే ఇంట్లో ప్రతి ఒక్కరు ఏదో ఒకటి సాధించే దిశ లో వెళ్తే,ఇంట్లో ఉండి వారి అవసరాలు తీర్చే వ్యక్తులు ఎవరు ఉంటారు ?? ఈరోజుల్లో ఉద్యోగం చేసే లేక వేరే కెరీర్ ఏదైనా ఉన్న స్త్రీ లు పిల్లలని పని వారికి అప్పగించవలసి వస్తున్నది..అటువంటి పరిస్థితులలో,ముఖ్యం గా పెద్దవారి సాయం లేనప్పుడు ఒక వ్యక్తి ఇంట్లో ఉండి,ఇంటి బాధ్యత , పిల్లల బాధ్యత తీసుకోవడం అనేది అవసరం..అలా అని ఉద్యోగం చేసే వారిని నేను తక్కువ చేసి మాట్లాడటం లేదు..మా అమ్మగారు Govt ఉద్యోగి..అటు ఇటు professional లైఫ్ ని personal life ni బాలన్సు చేసుకోవడానికి ఆవిడ ఎంత కష్ట పడేవారో నేను కళ్ళారా చూశాను..ఆవిడ మాకు ఎంత సమయం కేటాయించినా,ఆవిడ ఇంట్లో లేని లోటు మాకు చాలా సార్లు కనిపించేది..నేను అందుకే పిల్లలు పుట్టాకా House వైఫ్ గానే ఉండాలని నిర్ణయించుకున్నాను.ఇందులో నేను నష్టపోయింది గానీ త్యాగం చేసింది గానీ ఏమీ లేదు..ఇవి అన్నీ ఒక్కొకరి Priorities ని బట్టి ఉంటాయి అంతే..Sorry if I wrote some thing not related to the post..:-)

Sujata M said...

ఎంత బావుందో మీ సమీక్ష. పెళ్ళయ్యాక స్త్రీ జీవితమే మారుతూంటుంది. చాలా మటుకూ, భర్త మాత్రం తన జీవితాన్ని మార్చికోడు. ఇవి 'ఇలానే ' వుండి తీరాలని మన పాత తరం మనల్ని పెంచుకుంటూ వొచ్చింది. అది భర్త ప్రోవైడ్ చేస్తూంటే, భార్య అన్నీ కంఫర్టబుల్ గా పెడుతూ ఉండాలనే అభిప్రాయం పాతుకుపోయి, ఇలా తయారయ్యేం. మొదట 'ఇండియన్ మేల్' మనస్తత్వం మారాలి. మారుతుంది కూడా. మనమైనా మన రాబోయే తరాలకి, మన పిల్లలకీ, మన కొడుకులకీ, కూతుర్లకీ, ఎవరూ ఏమీ వొదులుకోనక్కర్లేదనే స్పష్టతని కలిగించేలా పెంచితే బావుంటుంది. అసలు ఆవేశం తో పాటూ ఆలోచనలు కనిగించే రచనలు చెయ్యడం జయ ప్రభ గారికే చెల్లింది.


వేణు said...

‘సహజ’ గురించి మీ పరిశీలన బాగుంది. ఈ నవల కొద్దికాలం క్రితం చదివాను. వివాహం స్త్రీల జీవితాల్లో, ఆలోచనా ధోరణిలో కలిగించే పెనుమార్పులను దీనిలో రచయిత్రి బాగా చర్చించారు. అత్తింటి పెత్తనాన్ని సమాజ ప్రభావంతోనో, సహజ పరిణామంగా భావించి- ఇష్టంతోనో ఆమోదించేవారికి ఈ కోణం అంత త్వరగా బోధపడకపోవచ్చు.

పెళ్ళి అనేది మగవారి జీవితాల్లో కూడా మార్పులు తీసుకొస్తుంది. కానీ ఇప్పటి సమాజంలో అవి పెనుమార్పులుగా ఉండే అవకాశాలు తక్కువే!

వేణు said...

Sujata గారూ, ‘సహజ’ నవలా రచయిత్రి ఓల్గా కదా? మీ వ్యాఖ్య చివర్లో ఓల్గా బదులు జయప్రభ అని వచ్చింది. మరోసారి చూడండి! :)

Manasa Chamarthi said...

సుజాత గారూ - పుస్తక పరిచయాల్లో మీదొక ప్రత్యేకమైన శైలి. పుస్తకం గురించీ, అందులో మెరుపుల గురించీ ప్రస్తావిస్తూనే అది మీలో రేపిన ఆలోచనలను చక్కగా కూర్చి రాస్తారు. అదే నాకిష్టం :)

మహిళలు మారిపోవడం తెలిసిందే కానీ, ఎందుకన్నది నాకూ అంతుపట్టదు. భారతీయ స్త్రీలకి కుటుంబం తమ చేతి మీద నడుస్తోందన్న భావన చాలా సంతోషానిస్తుందని నా అభిప్రాయం. ఎక్కడ పని ఆపుకోవాలో, "ఇక చెయ్యలేను- సాయం కావాలి" అని ఎక్కడ అడగాలో చాలా మందికి తెలియక, అనవసరపు పనులన్నీ భుజాల మీద వేసుకుని, చివరికి తీరికెలాగూ చిక్కదు కనుక, వ్యక్తిగత ఇష్టాలన్నింటినీ గంగలో కలిపేస్తారని అనిపిస్తూ ఉంటుంది.

పని మొత్తం పూర్తి చేసి, వంటిల్లు గట్టు సర్దుకుని, ముగ్గులేసుకుని, మర్నాటికి పాలు తోడూ పెట్టుకుని, సోలిపోతున్న కళ్ళతో నిద్రకుపక్రమించినప్పుడు, మనసుల్లో మొత్తం సంతోషమే ఉంటే మనం ఇంకా బానే ఉన్నట్టు - లేకపోతే తక్కెడ కాస్త అటూ ఇటూ అయినట్టు. :)

- ఇక మీరడిగిన ఆఖరు ప్రశ్నకు, అట్లా ఏం గుర్తు రావడం లేదు కానీ, యండమూరి నల్లంచు తెల్ల చీరలో, హీరో రవితేజ పెళ్ళయ్యకా మెల్లిమెల్లిగా భావుకత్వాన్ని ఎట్లా కోల్పోయాడో, నేత నేస్తూ అది కట్టుకోబోయే ఆడపిల్ల గురించి ఆలోచించడంలోని సున్నితత్త్వాన్ని వ్యాపారపు రేసుల్లో పడి ఎలా మర్చిపోయాడో కొద్దిగా రాసే ప్రయత్నం చేస్తారు.

Anonymous said...

సుజాత గారూ, చాలా రోజుల తర్వాత మంచి పుస్తకం పరిచయం చేసారు. ఎప్పటిలాగే మీ ఆలోచనల్ని పంచి, పాఠకుల్లో కూడా ఆలోచనలని రేపారు...మీ శైలిలో!

మగవాళ్ల కోణం అడిగారు కాబట్టి చెప్తున్నా..!! పెళ్ళి జెండర్ తేడాలు లేకుండా ఎవరి జీవితంలో అయినా మార్పు తెస్తుంది. సహజమే అది! ఆర్థిక బాధ్యతలనేవి స్త్రీలకు అన్ని సార్లూ కంపల్సరీ కాదు. ఆ బాధ్యత మగవాడికి తప్పదు.

కుటుంబాన్ని కంఫర్ట్ జోన్ లో ఉంచాలని ప్రయత్నిచే క్రమంలో మగవాడు చాలా నలిగిపోతాడు. బయటికి కనిపించని ఒత్తిడి అది. సోషల్ స్టేటస్ ని మెయింటైన్ చెయ్యాలి రావడం, మిగతా వారి కంటే బెటర్ గా ఉండాల్సి రావడం, ఇంట్లో అసంతృప్తులూ...ఇవన్నీ మగవాడి లో సౌందర్యాభిలాషనూ, ఉల్లాసాన్ని..ఆసక్తినీ చంపేస్తాయి.....చాలా మందిలో!

వాళ్ళు బయట ఫ్రెండ్స్ తో గడిపే సోషల్ జీవితం మాత్రమే కనిపించడంతో...వాళ్ళు మారలేదనీ, వాళ్ళ ప్రయారిటీలు మారలేదనీ నిర్ణయానికి వచ్చేస్తారు జనం సాధారణంగా!

అసంతృప్తి, కష్టాలు అందరికీ ఉన్నా...అది ప్రకటించుకునే అవకాశం స్త్రీలకు ఎక్కువ..!!దురదృష్ట వశాత్తూ మగాళ్ళు ఏడవలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి చెప్పుకోలేరు.

ఒకప్పుడు ప్రపంచం ఇంత చిన్నదై పోలేదు కాబట్టి, ఇలా ఎవరి అసంతృప్తుల్ని, భావాల్ని వాళ్ళు ప్రకటించుకునే వారేమో కానీ...ఇవాళ ఈ అసంతృప్తుల్ని కళ్ళు మూసుకుని దాటడానికి అంతర్జాల స్నేహాలు, చాట్ రూములతో సహా బోల్డు మార్గాలు.

అందుకనే వైవాహిక జీవితంలో ఎదురయ్యే అసంతృప్తులు ఇవాళ లీస్ట్ డిస్కస్డ్ పాయింట్ గా ఉంది. Nobody cares...!!

Sorry...If I wrote too much..:-((

సుజాత వేల్పూరి said...

నాగిని గారూ,
పెళ్ళి తర్వాత దాదాపు ప్రతి అమ్మాయీ కొత్త ఇంట్లో, కొత్త మనుషులు, కొత్త మనస్తత్వాల మధ్య రాజీ పడి తీరాల్సిందే!

ఉద్యోగిని అయినా, గృహిణి అయినా ఈ పరిస్థితి అనివార్యమే! ఉద్యోగిని అయినా, గృహిణి అయినా, పాత రోజుల నాటి అభిరుచుల్ని మర్చిపోయి తనను తాను కోల్పోకుండా ఉండటం ఎంత ముఖ్యం అన్నదే సహ్జ నవల్లో చర్చాంశం!

మీ అభిప్రాయం, మీ నిర్ణయం రెండూ అభినందనీయమే. పైగా, మీరు ఏమీ నష్టపోలేదని చెప్పడం మీరు మీ ఆత్మ విశాసాన్ని పూరిగా మీతోనే ఉంచుకున్నారన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇది గొప్ప విషయమే నాకు!

సుజాత వేల్పూరి said...

sujata గారూ,
I would rather say this as sharing of my random feelings than a సమీక్ష!! :-)
అది భర్త ప్రోవైడ్ చేస్తూంటే, భార్య అన్నీ కంఫర్టబుల్ గా పెడుతూ ఉండాలనే అభిప్రాయం పాతుకుపోయి, ఇలా తయారయ్యేం_________ కరెక్టే! కానీ ఉద్యోగినులుగా ఉన్న వాళ్ళకు అటు ఆర్థిక బాధ్యతల్లో వాటా, ఇటు కుటుంబ బాధ్యతలూ..రెండూ లభిస్తాయి. రెంటినే బాలెన్స్ చేసుకోడం రాకపోతే...బోల్డన్ని నిందలు కూడా పడాలి.

ఈ రెంటినీ బాలెన్స్ చేసుకుంటూ..హడావుడిగా రోజులు దొర్లించడం తప్ప, ఒకప్పుడు నేనెలా ఉన్నాను...అనే ప్రశ్న వేసుకోడానిక్కూడా సమయం దొరకని జీవితాలు ఎన్నెన్నో!!

వీటి లోంచి వచ్చే నిస్సహాయత..మరో పక్క సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడుకోవాలనే తపనా.. బలహీనతగా మారితే..అంతకంటే విషాదం ఉండబోదు..

ఓల్గా రచనల్లో మనకు మనం కనిపిస్తాం. గొప్ప గొప్ప విప్లవాల జోలికి వెళ్ళకుండా...మనసులో రేగే చిన్న చిన్న సంఘర్షణలు పెద్దవై ఎలా ఆక్రమిస్తాయో ఓల్గా చెప్పినట్లు ఎవరూ చెప్పలేరు.

స్వేచ్ఛ చదివినపుడు కూడా నాకు ఇలాగే అనిపించింది.

Anonymous said...

నాకు చాలా ఇష్టమయిన వోల్గా నవల సహజ. చదివినప్పుడల్లా ఆలొచనల్లో కూరుకుపోకుండా బయటపడటం ఎంత కష్టంగా వుంటుందో.
పెళ్ళితో కొందరు మారితే, మరికొందరు మార్చబడతారు. మొత్తానికి మార్పు అందరిజీవితాల్లోనూ వుంటుంది అది ఆడయినా మగయినా .
వివాహం ఆడవారి జీవితాల్ని ఎలా మార్చేస్తుందో చాలా సీరియస్ కథలు నవలలు వచ్చాయి . అదే మగవారిమీదయితే నాకు తెలిసినంతవరకూ సినిమా పాటలూ, జోక్సూ వచ్చాయి సిల్లీగా. ఈ మారిపోవటం అనే విషయాన్ని మనం తీసుకున్నంత సీరియస్ గా మగవారు తీసుకోవటం లేదేమో.

శశి కళ said...

చాలా చక్కగా వ్రాసారు సుజాత గారు.నిజంగానే ఆలోచింప
చేస్తుంది.పాపం భాద్యత గల వాళ్ళు అయితే మొగ వాళ్ళు మారిపోతారు.అంతకు ముందు సినిమాల పిచ్చి ఉన్నా ఇప్పుడు వదిలెయ్యటం.ఇంకా చాలా ...పక్క వారికి మనం సమయం ,ప్రేమ ఇవ్వాల్సినపుడు సర్దుబాటు తప్పదు

భండారు శ్రీనివాసరావు said...

అబ్బో ఎన్ని కామెంట్లో! సుజాతగారా మజాకా! నాకూ రాయాలనిపించింది కాని ఒక్కోదంట్లో ఒక్కో వాక్యం తీసుకుని రాసారనుకుంటారేమోనని వెనక్కు తగ్గా. నిజం నిష్టూరంగా వుంటుందంటారు. శ్రీ శ్రీ మహాప్రస్థానానికి చలం ముందుమాట లాగా మీ సమీక్షే చాలా చాలా బాగుంది. ఆ పుస్తకం గురించి కాకుండా దానిలోని వస్తువుకు ఈనాడు కూడా ఎంతో ప్రాముఖ్యం వుంది. మీలాటివారందరూ పూనుకుని 'పెళ్ళికి ముందూ తరువాత' అనుభవాలు వరుసగా రాస్తూ పోతే ఇంకా బాగుంటుంది. అసలామాటకు వస్తే, మీరంతా వొప్పుకుంటే పెళ్లి తరువాత మా ఆవిడ మారిన వైనాన్నే రాయాలనుకుంటున్నాను. కాకపొతే ఆడా మగా వైరుధ్యాలను పక్కనబెట్టి ఓపెన్ మైండ్ తో చదివితే బాగుంటుందేమో. చక్కని చర్చాంశాన్ని ముందుకు తెచ్చినందుకు సుజాత గారికి ధన్యవాదాలు.

సుభ/subha said...

మీ విశ్లేషణలు చాలా చదివా.. కానీ ఎప్పుడూ కామెంటలేదు.. ఇప్పుడు కామెంటకుండా ఉండలేకపోతున్నా..నాకంతలా నచ్చింది ఈ రివ్యూ..ఎందుకూ అంటే ప్రతి విషయమూ ఆ పుస్తకం రాసే సమయానికి, ఇప్పటికీ పెద్దగా మార్పు లేకపోవడం.ఏదేమైనా మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలండీ..

నేస్తం said...

పెళ్ళి తరువాత జీవితం స్త్రీపురుషుల బేధంలేకుండా మారిపోతుంది..ఎవరికి వాళ్ళం మన అభిప్రాయలు ఎదుటివాళ్ళ పై బలవంతంగా రుద్దేయాలని చూడటం ...అలాగే పెళ్ళంటే ఇద్దరు వ్యక్తులకు మాత్రమే సంబంధించిందికాకుండా రెండు కుటుంభాలకు సంబంధించినది అయిపోవడంతో ఇష్టంలేకున్నా బలవంతంగా మార్చబడతాము.. ఎవరు ఎక్కువ సఫర్ అవుతారంటే ఆయా కుటుంభం మీద, వ్యక్తుల మనస్తత్వాల మీద ఆధారపడినప్పటికీ..ఒకప్పటి రోజుల్లో ( అంటే ఒక అయిదేళ్ళ క్రితం వరకూ)ఎక్కువ శాతం అమ్మాయిలే ఎక్కువ సఫర్ అయ్యారు..(ముఖ్యంగా రెండు కుటుంభాల వైపు నుండి ఆడపిల్ల మీదే ఒత్తిడి ఉంటుంది కదా ..అమ్మో ఎదురు చెప్పకు మీవాళ్ళకు తొక్కలో బొమ్మలేకదా అనో మరొకటో అనో పుట్టింటివారే మొదట వెనక్కిలాగుతారు..) ఈ మధ్య మరి ప్రతి ఒక్కరూ ఉధ్యోగస్తులు అయ్యారు వేరుకాపురాలు పెట్టేస్తున్నారు ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఆ త్యాగల శాతం అమ్మాయిలది తగ్గిందేమో తెలియదు..

Anonymous said...
This comment has been removed by the author.
సుజాత వేల్పూరి said...

వేణు గారూ,
అత్తింట్లోనే కాదు, ఎక్కడైనా పెత్తనాలను తప్పని సరి పరిస్థితి లోనే ఎవరైనా ఆమోదిస్తారు కానీ ఇష్ట పడి కాదు.

పెళ్ళి మగవారి జీవితాల్లో మార్పులు తెస్తుందంటూనే అవేమిటో చెప్పకుండా ముగించారే!! వివరిస్తే బాగుండేది

సుజాత వేల్పూరి said...

అన్నట్లు వేణు గారూ,
sujata గారి ఉద్దేశించింది ఓల్గానే! జయప్రభ అని పొరపాటుగా రాశారు

సుజాత వేల్పూరి said...

మానసా,
పుస్తకాన్ని పరిచయం చెయ్యడంలో నా ఉద్దేశం నా అభిప్రాయం పంచుకోడమే! అందుఏ నేను పుస్తకాలను సంకీక్షించను. పరిచయం చేస్తాను...నా వైపు నుంచి!
నీ అభిప్రాయం చాలా కాలిక్యులేటెడ్ గా, పరిణతితో ఉంటుందని తెల్సు! అలాగే రాశావు.
అనవసరపు పనులన్నీ భుజాల మీద వేసుకుని, చివరికి తీరికెలాగూ చిక్కదు కనుక, వ్యక్తిగత ఇష్టాలన్నింటినీ గంగలో కలిపేస్తారని అనిపిస్తూ ఉంటుంది. ______ఇది చాలా నిజం! ఇంకోటి, స్త్రీలలో చాలా మంది, చిన్న పాటి మెప్పుకోసం ఏకధాటిగా 24 గంటలు పని చేయమన్నా చేస్తారు. వ్యక్తిగత ఇష్టాలు గంగలో కలవడానికి ఇదొక గట్టి కారణం


పని మొత్తం పూర్తి చేసి, వంటిల్లు గట్టు సర్దుకుని, ముగ్గులేసుకుని, మర్నాటికి పాలు తోడూ పెట్టుకుని, సోలిపోతున్న కళ్ళతో నిద్రకుపక్రమించినప్పుడు, మనసుల్లో మొత్తం సంతోషమే ఉంటే మనం ఇంకా బానే ఉన్నట్టు ___________హ హ హ ! బతికించావు..తక్కెడ ఇంకా అటూ ఇటూ కాలేదు..హమ్మ్మయ్య! :-))

సుజాత వేల్పూరి said...

కిరణ్ కుమార్ గారూ,
ఇలాటి కామెంట్ కోసమే చూస్తున్నాను! వివాహం పురుషుల జీవితల్లో ఎలాటి మార్పు తీసుకొస్తుందో గమనిస్తున్నా..అది ఒక పురుషుడి కోణం నుంచి అర్థం చేసుకోవడం, పరిశీలించడం పనికొస్తుంది.

మీరన్నట్టు కుటుంబ బాధ్యతలని మోయడంలోని స్ట్రె లో పురుషులు కూడా తమ వ్యక్తిగత జీవితాన్ని, ఆసక్తులను, అభిరుచులను చంపేసుకోవలసిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. కానీ boys don't cry అన్నట్టు దాచేసుకుని గాంభీర్యం నటిస్తుంటారేమో మరి!

ఇవాళ ఈ అసంతృప్తుల్ని కళ్ళు మూసుకుని దాటడానికి అంతర్జాల స్నేహాలు, చాట్ రూములతో సహా బోల్డు మార్గాలు.__________ ఇది రెండు వైపుల నుంచీ ఉంటుంది కాబట్టి...నో కామెంట్స్!

సుజాత వేల్పూరి said...

లలిత గారూ,
మీకు ఓల్గా రచనలు ఇష్టమని నాకు తెలుసు! ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పుకున్నట్లు ఉన్నాం కదా !

పెళ్ళితో కొందరు మారితే, మరికొందరు మార్చబడతారు. మొత్తానికి మార్పు అందరిజీవితాల్లోనూ వుంటుంది అది ఆడయినా మగయినా _____కరెక్ట్ లలితా..బాగా చెప్పారు ప్రిజుడిస్ లేకుండా!



ఈ మారిపోవటం అనే విషయాన్ని మనం తీసుకున్నంత సీరియస్ గా మగవారు తీసుకోవటం లేదేమో___________అని అనుకుంటున్నాం కానీ పైన కిరణ్ కుమార్ గారి వ్యాఖ్య చూశాక వాళ్ళూ సీరియస్ గానే తీసుకుంటున్నారనిపిస్తోంది.

మొత్తం మీద ఈ మార్పు అందరూ ఆలోచించ దగిందే అన్నమాట

సుజాత వేల్పూరి said...

సుభ గారూ, '
థాంక్యూ!ఈ నవల చదివారా మీరు?

సుజాత వేల్పూరి said...

శశికళ గారూ,
కరెక్టే! మన కుటుంబం మనకి ఏర్పడ్డాక, మన సమయాన్ని కొంత కోల్పోవాల్సి వస్తుంది. మనల్నే మనం కోల్పోయేలా ఉండే పరిస్థితి వస్తే...కష్టమే! చాలా థాంక్స్ వ్యాఖ్య రాసినందుకు

సుజాత వేల్పూరి said...

భండారు గారూ,హ హ హ
మీరు నిస్సంకోచంగా నిష్కర్షగా వ్యాఖ్య రాయొచ్చు. మీకు ఆ స్వేచ్ఛ ఉంది. ఏమీ వెనక్కు తగ్గనవసరం లేదు సార్!

పెళ్ళి తర్వాత మీ ఆవిడ గారు మారిన సంగతి ఆవిడ చెప్తే వింటాం! మీరు ఏం మారారో, ఎలా మారారో మాకు కావాలి. ఆ కోణంలో చెప్పాండి.:-))
కాకపొతే ఆడా మగా వైరుధ్యాలను పక్కనబెట్టి ఓపెన్ మైండ్ తో చదివితే బాగుంటుందేమో_________నేను అడుగుతోందీ కూడా అందుకే!

నవల ఫెమినిస్ట్ కోణంలో రాశారు కాబట్టి ఎక్కువ ఫోకస్ ఆడవాళ్ళు మారడం మీదే ఉంటుంది మరి!

మీ బ్లాగ్ పోస్టు కోసం చూస్తుంటా మరి...!!

సుజాత వేల్పూరి said...



నేస్తం,
మంచి పాయింట్ చెప్పారు. ఇద్దరి జీవితాలూ మారతాయి. ఎలా మారతాయన్నది వాళ్ళ వాళ్ళ మధ్య ఉన్న బంధాలు, వాళ్ళ కుటుంబాల నేపథ్యాన్ని బట్టి కూడా ఉంటుందేమో కదూ!

మొత్తం మీద మార్పు తప్పకపోయినా...ఇది వరకటి కంటే కొంత శాతం తగ్గిందని ఒప్పుకోవలసి వస్తుంది. ఆర్థికంగా వెసులుబాటు పెరిగాక

ఓరి నాయనోయ్,
మీ కామెంట్ లో ఎత్తి పొడుపు, తెల్సినదంతా చెప్పేయాలనే తపన తప్ప పాయింట్ లేదు. టపా లో విషయానికి దూరంగా ఉంది.
దీని మీద స్పందిచడానికేమీ లేదు.

వ్యాఖ్యానించినందుకు చాలా థాంక్స్!

జ్యోతిర్మయి said...

సుజాత గారూ ఈ నవల నేనూ చదివానండీ. ఈ పుస్తకంలోని పాత్రలు ఎన్నో ఆలోచనలను రేకెత్తిస్తాయి. మీ సమీక్ష చాలా బావుంది. మీరన్నట్లుగా ఈ నవల రాసినప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు కొంతవరకు మారాయి. కాని మారాల్సింది ఎంతో వుంది.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

చాలా బాగా రాశారు. ఆసలు నవల గురించి చెప్తూనే మీ ఆలోచనలనీ, చదువరులు ఆలోచించవలసిన విషయాలనీ చెప్పడం నాకు బాగా నచ్చింది.

పెళ్ళి తరవాత పురుషుల్లో కూడా చాలానే మార్పులొస్తాయండీ. కాకపోతే.. ఆ మార్పులని జీర్ణించుకుని వీలైనంత బాలన్స్ చేసుకునే వెసులుబాటు మన సమాజంలో పురుషులకి ఎక్కువ కాబట్టి అది పెద్ద సమస్యగా బయటకి కనిపించదు.

వెధవ రూల్సూ, అర్థంకానీ, అర్థం లేనీ సాంప్రదాయాల్ని పక్కనబెట్టి స్త్రీలైనా పురుషులైనా తమకి ఏమికావాలో, వ్యక్తిగత అభిరుచులకీ ఉమ్మడి సౌజన్యానికీ సమతుల్యత ఎవరికి వారు తెలుసుకునే ప్రయత్నం చేసుకునే ప్రయత్నం చేస్తే అందరికీ బావుంటుంది.

ఆ.సౌమ్య said...

బాగా రాసారు. నాకు మానవి కన్నా సహజే ఎక్కువ నచ్చింది. సహజ లో నాకు నచ్చిన విషయం ఏమిటంటే...ప్రసాద్ తనని తాను చాలా మంచివాడని, భార్యకు సహాయం చేస్తూ గొప్పపని చేస్తున్నానని అది సహజ గుర్తించాలని ఆరాటపడతాడు. అప్పుడు సహజ చెప్పే మాటలు నాకు చాలా నచ్చాయి. భార్యాభర్తలంటే ఇంట్లో సమానంగా పనులు చేసుకోవాలని కాకుండా భార్యకి సహాయం చేస్తూ ఉద్ధరిస్తున్నాడని, పురుషోత్తముడనీ, గొప్పవాడని గుర్తిని దాసోహం అనడం ఎంత అవివేకమో చెబుతుంది. నాకు ఆ మాటలు చాల నచ్చాయి. ఇల్లు, ఇంట్లో పనులు భార్యభర్తలిద్దరివీను. బయట ఉద్యోగాలు చేస్తే ఇద్దరూ ఇంటి పనులు కూడా చెయ్యాలి. అవి వాళ్ళ పనులు. చేసుకుంటే దానిలో గొప్పతనమో, మరోటో ఏమీ లేదు. ఈ విషయాన్ని కూడా నవలలో చర్చించడం నాకు బాగా నచ్చింది.

ఇంక పెళ్ళి తరువాత జీవితాలు మారిపోవడం విషయానికొస్తే...ఆడ, మగా ఇద్దరికీ కాస్త మారుతాయి అది సహజం కూడా. కాకపొతే మన సమాజంలో ఆడపిల్లలకి చిన్నప్పటినుండీ పెళ్ళి, పెళ్ళి తరువాత జీవితం గురించి నూరిపోస్తుంటారు. పెళ్ళయ్యాక ఎలా ఉండాలో ముందే prepare చేస్తుంటారు. దాని వల్ల ఆడవాళ్ళ జీవితాలు ఎక్కువ మారిపోతాయి. మగవాళ్ళకు ఆ ఇబ్బంది లేదు. అయితే సంపాదనలో పడ్డాక కాస్త వాళ్ళ జీవితాలు మారుతాయి కానీ చెప్పుకునేంతగా కాదు. ఒకవేళ మారినా వాళ్ల అభిరుచులను పునరుద్ధరించుకునే అవకాశం మగవాళ్ళకి ఉంది, ఆడవాళ్ళకి ఆ అవకాశం చాలా తక్కువ.

ఈ రోజుల్లో అంత అమారిపోయింది అనుకుంటున్నారుగానీ పెద్దగా మారింది ఏమీ లేదు. నూటికో కోటికో ఒకరు మారుంటారు. ఆడవాళ్ళు బయటికెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారన్నది ఎంత వాస్తవమో బయట ఉద్యోగం, ఇంటి పనులూ రెండూ కూడా మోయాల్సి వస్తోంది అన్నది కూడా అంతే నిజం.

భార్యాభర్తలిద్దరూ పెళ్ళి అయ్యాక కాస్త జీవితాలు మారినా మళ్ళీ వాటిని అదుపులోకి తెచ్చుకుని అభిరుచులు కలబోసుకుని, పెంపొందించుకుని, పంచుకుంటే ఆ అనందమే వేరు.


Surabhi said...

Sujatha Gaaru,
As usual another nice write up. as many of them have shared their thoughts i do agree that the change in womens life after marriage is not that bad these days as compared to earlier years. and also feel that both men and women will change after marriage.
My perspective is, I believe the change is quite a natural process ( specially after having kids) and as per nature women in form of mother can compromise on anything anything when kids come in to picture. majority of mothers ( these days parents) will never dare to put kids at risk ( there might be few exceptions)how well any person ( male or female) can retain their individuality with out screwing up the family life depends on the individuals social, economic, intellectual and individuals will power.
May be I am thinking too narrowly but I have seen few real life ladies from different backgrounds who proved it to be an individual choice rather than someone pushing it on women.
Also may be as we grow not only physically but mentally one feels more happy/satisfied when they make others happy (and not just themselves) for which reason most of them change and still be confident and content rather than feeling compromised. We see this in nature too.
I think I posted too much which is irrelevant. I will stop here.
Please find some time to post regurarly.

Surabhi

kiran said...

పెళ్లి అంటేనే పెద్ద మార్పు కదా...!!..అసలు పెళ్లి అంటేనే..ఈ మార్పుకు మనం adjust అవుతామో లేదో అని చాల అలోచించి..చించి...నిర్ణయాలు తీసుకుంటాం...!!

ఒక సరి దిగాక...ఇద్దరూ ఏదో ఒక చోట compromise అవుతూ ఉంటారు..!!

ఆ compromise అనే పరిస్థతి ఎప్పుడో ఒక సారి వస్తే..బానే ఉంటుంది..చాలా సార్లు వస్తే చిరాకు వస్తుంది..

అమ్మాయిలే..కాదేమో..అబ్బాయిలు కూడా మారిపోతు ఉండటం నేను చూసాను....!!

ఇది gender తప్పు కాదు,..మనసు..మనుషులు..వాళ్ళు ఆలోచించే విధానం వల్లే..ఇంకొకరు వారి వారి ఇష్టాలకు దూరంగా ఉంటారు...!!

ఇలా ఎందుకు సర్దుకుంటారు అంటే.....వీలైనంత వరకు సంతోషంగా గొడవలు లేకుండా గడపటానికి...!!

కాలం మారింది..కానీ పెళ్లి విషయం లో ఎవరి అభిప్రాయాలూ మారలేదు అనే అనిపిస్తుంది...

శ్రీలలిత said...


నా అభిప్రాయం కాస్త పెద్దగా అయినట్టుంది. అందుకని రెండు, మూడు టపాల్లో పెడుతున్నాను..


సుజాతగారూ,
మంచి విషయాన్ని చర్చకు యెంచుకున్నారు. ఈ విషయం ఎప్పటికీ నిత్య నూతనమే..
పెళ్ళయాక పురుషులలో మార్పు వస్తుందా.. అని అడిగారు. వస్తుందండీ.
పెళ్ళయాక రెండు కుటుంబాలనుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒక గూటిలో కలిసి వుండాలంటే ఇద్దరిలోనూ మార్పు తప్పనిసరి. ఎటొచ్చీ ఆ మార్పు ఎటువంటిదీ, ఒకరిని బాధపెట్టేదా, సంతోషపెట్టేదా అన్నది వారిరువురి మనస్తత్వాలమీదా ఆధారపడి వుంటుంది. ప్రతి మనిషికీ హక్కులే కాదు బాధ్యతలు కూడా వుంటాయన్నది పెళ్ళయాక తెలిసే నగ్నసత్యం.
ప్రపంచం మొత్తంలో కేవలం మగవాడికే కుటుంబాన్ని పోషించే బాధ్యత వుంది. అలా పోషించలేనప్పుడు చేతకానివాడనే పేరు నెత్తిమీదకొస్తుంది. పెళ్ళవుతూనే దానిని సాధారణంగా తీసుకుంటాడు కనకే అది కథ కాలేదు. అలా తీసికోనివాడి మీద కథ వస్తుంది.
స్త్రీల చదువూ, ఉద్యోగం ప్రాధాన్యతలు చూసుకుంటే అవి రెండో స్థానంలోకి వస్తాయి.
చాలామంది నేటి తరం అమ్మాయిలు కూడా దీనిని ఆమోదిస్తున్నారనడానికి ఉదాహరణ చెప్పాలంటే..
ఈ రోజుల్లో ఉన్నత విద్య, ఉద్యోగం వున్న ఏ అమ్మాయి అయినా తన కన్న తక్కువ చదువుకున్న వాడినీ, కాస్త తక్కువ పొడుగు వున్నవాడినీ పెళ్ళి చేసుకుంటుందేమో అడగండి.. ఊహు.. నాకు తెలిసినంతవరకూ నేను ఎంతమందొ అమ్మాయిలని అడిగాను.. ఒప్పుకోలేదు.. అన్నింటా తనకన్న ఎక్కువగా వుండాలి.. మళ్ళీ తనను సమానంగా చూడాలి..
రెంటికీ పొత్తు ఏమిటంటారా. ఇప్పుడు అమ్మాయిలు తక్కువ వున్నారు.. అందుకు ఛాయిస్ మాదే.. అంటున్నారు.. సంతోషమే..

శ్రీలలిత said...


(contd)

స్త్రీలు కూడా పెళ్ళికి ముందులాగే వారి అభిరుచులను తీర్చుకుంటుంటే అది కథ అవదు కదా.. మామూలు విషయమె అవుతుంది. ఎప్పుడైతే స్తీలలో మానసిక సంఘర్షణ మొదలయిందో, ఎప్పుడయితే వారు అసంతృప్తులుగా వున్నామని గుర్తించారో అక్కడినుంచే కథ వస్తుంది.
ఈ నవల వ్రాసి ఇప్పటికి రెండు దశాబ్దాలయింది. అప్పటి పిల్లలు ఇప్పటి గృహస్థులయ్యేరు. అప్పటి ఇల్లాళ్ళు ఇప్పటి అత్తగార్లు అయ్యేరు. ఈ నవల చదివినవారిలో ఎంతమంది తమను తాము సంస్కరించుకున్నారన్నది తెలియాలంటే కొంచెం కష్టమే..
నా అభిప్రాయంలో మనం పుస్తకాలు చదివి సమాజాన్ని అంచనా వేస్తున్నాము. సమాజం, అందులో స్త్రీ, పురుషుల మధ్య వివక్ష ఎంతవరకూ మారాయంటే అప్పటి సమాజ పరిస్థితులను అద్దం పడుతూ వచ్చిన పుస్తకాల మీద ఎంత శాతం అధారపడడం అన్నది మన మనస్తత్వాలమీద ఆధారపడి వుంటుంది.
ఉదాహరణకి,
(cond)

శ్రీలలిత said...


స్త్రీలని వెనకపడకుండా సమాజంలో ఉన్నతస్థితిలోకి రమ్మని ప్రోత్సహించడానికి మనం ఒక ఇందిరాగాంధీని, ఒక సునీతా విలియమ్స్ నీ, ఒక కిరణ్ బేడీని ఉదాహరణలుగా చూపిస్తాం. కాని ఎన్ని కోట్లమందిలో కేవలం వేళ్ళ మీద లెక్కించదగ్గ మహిళలే అలా ముందుకు రాగలిగారు? అలా ముందుకు రాగలగడానికి వారికి వున్న అనుకూల, ప్రతికూల పరిస్థితులు ఏవిధంగా దోహదపరిచాయి వంటి వంటి పరిశోధనలు పాశ్చాత్యదేశాలకన్న మనం చాలా తక్కువ చేసాం.
కేవలం స్త్రీలు, హరిజన,గిరిజనులు వెనకబడ్డారని ప్రభుత్వం వారి మీద చేసిన పరిశోధనలో కూడా పూర్తిస్థాయి న్యాయం జరిగిందనుకోను. ఒక న్యాయమూర్తి తన తీర్పు ప్రకటించేముందు వాద, ప్రతివాదుల ఇద్దరి వాదనలూ వింటారు. కాని మనవాళ్ళు మహిళాభ్యుద్యం పేరుతో చేసిన సర్వేలు కేవలం స్త్రీల నుంచే డేటా తీసుకున్నాయి.
ఏదైనా సమాజంలో సమతూకం లెదంటే రెండువైపులా త్రాసు సరిగా చూసుకోవాలి కదా.
పది సంవత్సరాలక్రితం దీనిమీద చర్చ కూడా జరిగి పురుషుల అభిప్రాయసేకరణ కూడా వుంటే బాగుంటుందనే సూచన వచ్చింది.
సమాజంలో స్త్రీపురుషులు ఒకరినొకరు అర్ధం చేసుకుంటేనే సమాజం ప్రగతి సాధిస్తుంది. అంతేకాని మగవాళ్ళందరూ దుర్మార్గులు, వారితో మాకు పని లేదు అనే అర్ధం లేని వాదనలు చేస్తే బండిలో ఓ చక్రం విరిగిపోయినట్టే కదా. మన సమాజంలో అదే జరిగిందనిపిస్తోంది.
(contd)

శ్రీలలిత said...


ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో స్త్రీలు విద్యా, ఉద్యోగరంగాల్లో మంచి ప్రగతి సాధించారు. మగవారి తోడు లేకుండా మేము బ్రతకగలమని వారు చెపుతున్నారనడానికి సాక్ష్యం ఈనాడు పెరుగుతున్న విడాకుల కేసులే. ఇదే అభ్యుదయం అనుకుందామనుకుంటే ఈ తరం బాలలయిన రేపటి తరం పౌరులు సింగిల్ పేరెంట్ దగ్గర పెరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
అలా పెరిగినప్పుడు వారిలో పెరిగే అభద్రతాభావం గురించి పరిశోధించి చాలామంది పుస్తకాలు రాసారు. కొంతమంది యువత సహజీవనానికి మొగ్గు చూపుతున్నారు. ఇవన్నీ అభివృధ్ధికి సూచనలే అంటే నేనేమీ చెప్పలేను కానీ రేపటితరం మటుకు ఇప్పటి తరాన్ని మించి స్వార్ధపరులవుతారన్న విషయం మటుకు ఖచ్చితంగా చెప్పగలను.
ఎందుకంటే.. ఇప్పటికే ఒక్కరూ లేక ఇద్దరే పిల్లలవడం వలన ఏదైనా వస్తువు మరొకరితో పంచుకోవాలన్న ప్రాధమిక విషయం కూడా వాళ్ళకి పని కట్టుకుని చెప్పవలసివస్తోంది. తన ప్రేమని కాదన్న అమ్మాయిపై యాసిడ్ పోసే యువత తయారవుతున్నారు.
ఒక మనిషి మనస్తత్వ చిత్రణకు కథ, నవల ఫొటోల్లాంటివి. కాని ఆ ఫొటోఫ్రేము తగిలించడానికి ఒక గోడ వుండాలి. లేకపోతే ఆ ఫ్రేము కిందపడి బద్దలౌతుంది. అలా ఫ్రేము తగిలించడానికి గోడలాంటిదే సమాజం.
ఫొటోలోని మనుషులందరూ ఆడా, మగా, చిన్నా, పెద్దా తమతమ స్థానాల్లో వుంటే ఫ్రేమ్ బాగుంటుంది. అది గోడ మీద నిలుస్తుంది. అలాగే నీకు హక్కులతో పాటు బాధ్యతలు కూడా వున్నాయని తెలుసుకుని, తన ప్రవర్తనను సంస్కరించుకున్న వ్యక్తి ఫ్రేములో చక్కగా ఇముడుతాడు. వ్యక్తి తోనే కుటుంబం, కుటుంబం తోనే సమాజం అభివృధ్ధి చెందుతాయనేది అందరికీ తెలిసిన విషయమే కదా..
రేపటి తరానికి నీడ నివ్వాలని మన తరం చెట్లు నాటుతోందే..
మరి రేపటితరం మంచి విలువలు పెంచుకోవాలంటే నేటితరం కొన్ని బాధ్యతలు స్వీకరించక తప్పనప్పుడు మనకి ఇష్టం వున్నా లేకపోయినా స్త్రీపురుషులిద్దరూ ఒక కుటుంబాన్ని నిలుబెట్టుకుందుకు మారక తప్పదనే నా అభిప్రాయం..









Anonymous said...

శ్రీలలిత గారి గోడ-ఫోటో ఫ్రేము వుదాహరణ బాగుంది. దాసరి నారాయణరావు గారు కూడా ఇలానే అంగీకరింప చేసేవారు.

Anonymous said...

/స్త్రీపురుషులిద్దరూ ఒక కుటుంబాన్ని నిలుబెట్టుకుందుకు మారక తప్పదనే నా అభిప్రాయం.. /

ఏకీభవిస్తున్నా.

మార్పు ప్రకృతి సహజం. పరిస్థితులకు అనుగుణంగా మారలేని జీవులు నశిస్తాయని డార్విన్, పరిశీలించి, తేల్చి చెప్పారు.

పరిమళం said...

చాలా ఏళ్ళ క్రితం చదివి మరిచిన నవలను గుర్తుచేశారు థాంక్స్ సుజాతగారు!

Anonymous said...

ఇది వ్యవస్థా కాదు, భర్తల ఆధిపత్యమూ కాదు. నా తలకాయా కాదు. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి సంసారలంపటం, తాపత్రయాలూ చాలా చాలా ఎక్కువ. ఎన్నోరెట్లు ఎక్కువ. వాళ్ళు దానికోసమే పుట్టారేమో అనిపిస్తుంది. పెళ్ళయ్యాక వాళ్ళు స్వచ్ఛందంగానే మారిపోతారు. ఎవఱూ మార్చనక్కఱలేదు. ఎవ్వఱూ డామినేట్ చేయనక్కఱలేదు. మగవాళ్ళూ మారతారు. కానీ సమూలంగా మారరు. కారణం నాకూ తెలీదు.

నాకు తెలిసిన ఒక కుటుంబంలో ఆ భర్త తన భార్యకి చాలా స్వేచ్ఛ ఇచ్చాడు. కానీ ఆమె అంతకుముందు తనకున్న సాహిత్య ఆసక్తులన్నీ పక్కన బెట్టి తన కొడుకుని ఒక గొప్ప బిజినెస్ మేనేజర్ ని చేయాలనీ, ISB లో చేర్చాలనీ ఏవేవో ప్లాన్లు వేస్తోంది. "వాడు ఏదో ఒకటి అవుతాడులేవే. దాని గుఱించి ఊరికే టెన్షన్ పడొద్దు." అని ఆయన చెప్పినా ఆమె వినదు. క్రమశిక్షణ పేరుతో ఆ అబ్బాయిని కనీసం రోజుకు నాలుగు దెబ్బలు వేస్తుంది. ఆమెని చూస్తే "ఆనాటి ఆ మనిషేనా ? ఈ మనిషి ?" అనిపిస్తుంది. ఆడవాళ్ళని శాసించేది భర్తలు కాదు, పిల్లలు. అది పైకి కనిపించని చండశాసనం.

సుజాత వేల్పూరి said...

జ్యోతిర్మయి గారు
థాంక్యూ!! కరెక్ట్ గా చెప్పారు. మార్పు ఎప్పుడూ జరుగుతూ ఉండాల్సిందే! అదొక నిరంతర ప్రక్రియ.అవసరం కూడానూ కదా!


weekend politician గారూ,
వెధవ రూల్సూ, అర్థంకానీ, అర్థం లేనీ సాంప్రదాయాల్ని పక్కనబెట్టి స్త్రీలైనా పురుషులైనా తమకి ఏమికావాలో, వ్యక్తిగత అభిరుచులకీ ఉమ్మడి సౌజన్యానికీ సమతుల్యత ఎవరికి వారు తెలుసుకునే ప్రయత్నం చేసుకునే ప్రయత్నం చేస్తే అందరికీ బావుంటుంది.________ చక్కగా చెప్పారు. ఈ మాట కోసమే చూస్తున్నాను.:-)

సౌమ్యా,
మానవి, సహజ రెండు విబిన్న కోణాల్ని స్పృశిస్తూ రాసిన నవలలు కదా! నాకు రెండూ నచ్చాయి! మానవి ముగింపు నచ్చదు కానీ!

ఈ నవల్లో నువ్వు చెప్పిన సీన్ నాకు కూడా నచ్చుతుంది. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్న ఈ రోజుల్లో ఇద్దరూ ఇంటి పనుల్ని కూడా కలిసి పంచుకోవడం అవసరం..అది సహజం కూడానూ!

ఏమైనా, వైవాహిక జీవితంలో అడ్జస్ట్ కావాల్సి రావడమంటూ జరిగితే ఆ మహదవకాశం ఎప్పుడూ ఇంటావిడకే దక్కడం...తరాల నుంచీ చూస్తున్న సత్యం! ఈ క్రమంలోనే అభిరుచుల్ని సైతం కోల్పోవాల్సి రావడం.

భార్యా భర్తల్లో ఇద్దరి అభిరుచులూ విభిన్నమైన సందర్భాల్లో కలబోసుకోకపోయినా ఎవరి space వాళ్ళు ఉంచుకోవాలి. ఎదుటి వారికి స్పేస్ ఇవ్వాలి. అప్పుడే జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి.



సుజాత వేల్పూరి said...

Dear Surabhi garu,

Nice to see you in my blog after a long time.

I agree that change in life after marriage is a quite inevitable thing in men and women. And as you said when kids come in to the pictutre, priorites are definitely changed and we get used to adjustments.

No matter whether they are home makers or, job holders, women always take the responsibility of making others happy and just because of this they accept too many responsibilities. And naturally they lose more time from their life and their personal interests.

>>>>I have seen few real life ladies from different backgrounds who proved it to be an individual choice rather than someone pushing it on women_________ yes, we need women like this...!!

Thanks very much for a thought provoking comment.

I'll definitely find time to keep posting regularly.:)

సుజాత వేల్పూరి said...

శ్రీలలిత గారూ,
శ్రమ తీసుకుని వివరంగా వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు!

కాకపోతే మీ వ్యాఖ్యలో మీ తరం ఆలోచనలకు ఈ తరం ఆలోచనలకు మధ్య ఉన్న జనరేషన్ గాప్ చక్కగా ఆవిష్కృతమైంది.ఒక సాంఘిక బంధంలో ఉన్నాం కాబట్టి తనను తానే కోల్పోయేంతగా మారిపోయినా పర్లేదనే ఆలోచన 40 ఏళ్ళ క్రితం ఇల్లాళ్ళు అంగీకరించారు.

కాలం మారి,చదువుకుని అన్నింటా ముందుండి, వేలూ లక్షలూ సంపాదిస్తూ కూడా ఆనాటి పరిస్థితే ఇంకా కొనసాగుతుందేం అన్న ప్రశ్న ఈ నవల్లో ఎదురవుతుంది పాఠకులకు.అంతే తప్ప మగవాళ్లంతా దుర్మార్గులనీ, వాళ్ళని వదిలేసి రమ్మనీ ఈ నవల చెప్పదు.

పుస్తకాలు చదివి సమాజాన్ని అంచనా వేస్తున్నారనే మీ అభిప్రాయాన్ని నేను సుతరామూ అంగీకరించను. పాత తరం అనుభవం లో లేని,ఊహకు కూడా అందని సమస్యలు ఇవాళ స్త్రీలకు ఉన్నాయి. "నా అజ్ఞానమే నా ఆనదం" అనుకుని గృహమే స్వర్గ సీమగా భావించిన రోజుల్లో లేని సమస్యలు చదువుకుని, కొత్త భావ చైతన్యంతో ఆలోచనా పరులై, చైతన్య వంతులైన స్త్రీలు ఇవాళ ఎదుర్కొంటున్నారు.

పుస్తకాలు చదివి, స్త్రీల జీవితాల్ని అంచనా వేయడం నిజానికి పాత తరం పద్ధతి. ఈ బండి చక్రాలు, ఫ్రేములో ఇమడటాలూ ఈ నిలవ ఉదాహరణలన్నింటికీ ఎప్పుడో కాలం చెల్లిపోయింది. ఒక ఫ్రేములో ఇండటం ఎప్పుడైతే మనిషి మొదలు పెడతాడో, అప్పుడే స్వచ్చందంగా స్వేఛ్చ్ఛను కోల్పోవడానికి సిద్ధ పడినట్లే! అలాగే మగవాళ్లంతా దుర్మార్గులనే ఆలోచనలో కూడా ఏ స్త్రీలూ లేరు. కల్సి ఇంటి పన్లు పంచుకుంటున్న ఈ రోజుల్లో అలాంటి అభిప్రాయాలు అరుదే!

ఇంటా బయటా లక్షా ఇరవై సమస్యలతో నెగ్గుకొస్తున్న స్త్రీలనా బాధ్యతలు నేర్చుకోమని చెప్తాం? ఎక్కడో తీవ్ర అభిప్రాయాలను వ్యక్తం చేసే వాళ్ళ కోవలోకి అందరినీ కట్టేసి, మీ మీ స్థానాల్లో ఉండండి అని నిర్దేశించడం ఏం న్యాయం! ఎవరు ఏ స్థానంలో ఉండాలో, ఎలాంటి పాత్ర పోషించాలో వారి స్వంత నిర్ణయాలు.ఇందులో సమాజానికి ఏమీ బాధ్యత లేదు.

ఒక్కసారి సమాజానికి మన జీవితాన్ని నిర్దేశించే హక్కు అప్పగిస్తే జీవితం నేలమట్టం జరిగే వరకూ అది మన మీద అధికారం చెలాయిస్తూనే ఉంటుంది.



సుజాత వేల్పూరి said...

#SNKR# :-))
పరిమళం గారూ, థాంక్యూ

సుజాత వేల్పూరి said...

తాడేపల్లి గారూ,
భలేగా చెప్పారు! పెళ్ళి అవుతునే ఈ లంపటాలు, తాపత్రయాలు భలే పట్టుకుంటాయి ఆడవాళ్లను. దానికోసమే పుట్టారా అన్నట్లుండే వాళ్ళను నేనూ ఎంతో మందిని చూశాను.ఎంత సేపూ ఇంటికీ, పిల్లలకూ అంకింతమై పోవడం తప్ప కాస్త భర్తతో కల్సి మనోల్లాసకరమైన విషయాలు మాట్లాడాలని ఏమీ అనూకోరల్లే ఉంది. వీళ్ళను ఎవరూ మార్చలేదు. వీళ్ళ తాపత్రయాలు సంతకెళ్ళ!

సహజ నవల్లో రమ పాత్ర కూడా అలాంటిదే!

దీనికి జన్యుపరమైన కారణాలేమైనా ఉన్నాయా అని వెదుకుతున్నాను, ఆసక్తి కొద్దీ!

మగవాళ్ళు ఇలా సమూలంగా మారకపోవడానికి, ఈ సంసార తాపత్రయాలు వారికి అంటక పోవడానికి కారణాలేముంటాయో మీరు చెప్తారని ఆశపడ్డాను.:-((


Anonymous said...

మిమ్మల్ని నిరాశపఱిచినందుకు క్షమించాలి. కారణాలు నిజంగా తెలిస్తే కక్కేసేవాణ్ణే తప్ప దాచుకునేవాణ్ణి కాదు. కారణం అనను గానీ ఒక Process ఉంది male brains లో ! అదేంటంటే ప్రతి మగవాడూ జీవితాంతం అవివాహితుడే (బ్రహ్మచారి మాత్రం కాదు), మానసికంగా ! ఇంటి గడప దాటితే చాలు, ఏ మగవాడికీ పెళ్ళాం బిడ్డలు గుర్తుకు రారు. అందుకనే పెళ్ళి అనేది అన్ని దేశాల్లోనూ ప్రాథమికంగా Female festival గా మిగిలిపోయింది. అయితే సమాజంలో ఆడవాళ్ళంత సున్నితమైన మగవాళ్ళు కూదా పుట్టడం మొదలయ్యాక ఇప్పుడు కాస్తో కూస్తో Male festival కూడా అయిందనుకోండి.

మీరన్నట్లు ఇందులో జన్యువుల పాత్ర ఉందనే నా అనుమానం. Nurture కంటే nature ఎక్కువుంది. ఉదాహరణకి - మావాడు చాలా చిన్నబిడ్డగా ఉన్నప్పట్నుంచే ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసేవాడు. ఇంకా రెండున్నరేళ్ళు నిండకుండానే "నేను బడికెళ్ళిపోతున్నా" నంటూ రాత్రి 8 గంటల వేళ ఒక బ్యాగేదో భుజాన వేసుకొని బయటికి పరిగెత్తాడు. ఏమైపోతాడోనని నేనూ నా భార్యా, కొంపా గోడూ అలా వదిలేసి వాడివెంట పరిగెత్తాం. ఇలా బయటికెళ్ళిపోవాలనే కోరిక మగపిల్లల్లో చాలా స్ట్రాంగ్ అని అప్పుడే నాకు అనిపించింది.

తమ అభిరుచుల పట్ల ఆడవాళ్ళకి ఇలాంటి స్ట్రాంగ్ ప్రేరణ గనక ఉంటే వైవాహిక జీవితం ఒక అడ్డంకి కాదు. ఒక స్త్రీ పెళ్ళయ్యాక కూడా పూర్వ అభిరుచుల్ని యథాపూర్వంగా కొనసాగించగలుగుతోందంటే అందుకు ఆమె కుటుంబసభ్యుల ప్రోత్సాహం తప్పకుండా ఉండే ఉంటుంది.

Ravi said...

Great to see a sage discussion after a long time.
Way to go Sujatha garu.

శ్రీలలిత said...

సుజాతగారూ,
చర్చకు నాకు చాలా ఇష్టమైన విషయాన్ని ఎత్తుకున్నారు.
చిన్నపుడు స్కూల్ లో డిబేట్ లో పాల్గొంటున్నంత ఆవేశం, ఆనందం కలిగాయి.
ఇన్నాళ్ళూ అంతర్జాలం అందుబాటులో లేనందువల్ల అభిప్రాయం తెలపడం ఆలస్యమయింది.
మీరు అన్నది అక్షరాలా నిజం.
పుస్తకాలు చదివి జీవితాన్ని అంచనా వెయ్యకూడదనే నేనూ చెప్పేది. ఎప్పుడైనా సరే తరాల అంతరాలు తప్పకుండా కనపడతాయి. నిజం చెప్పాలంటే ఆ రోజుల్లో ఓల్గాగారి రచనలు ఎంతో ఇష్టంగా చదివేవారిలో నేనూ ఒకదాన్ని. ఆవిడ తర్కం నాకు నచ్చుతుంది. ఆ రోజుల్లో అటువంటి రచనలు చదివాము కనకే మాలాంటి ఆతరం ఇల్లాళ్ళకు కాస్తైనా వాళ్ల అభిప్రాయాలు ప్రకటించుకోవాలనే ఆలోచన వచ్చింది.
కాని ఈ నవలా కాలం కూడా పాతికేళ్ళ క్రితందే. అప్పటికింకా ఆడవారికి ఇప్పుడున్నన్ని అవకాశాలు లేవు. అప్పుడప్పుడే కాలేజీలకెళ్ళి చదువుకుని తమకంటూ కొన్ని అభిప్రాయాల నేర్పరచుకున్న ఈ నవల్లో స్నేహితురాళ్ళు ఇంకా వేలూ, లక్షలూ సంపాదించుకునే స్థితికి రాలేదు. అదంతా కేవలం పది, పదిహేనేళ్ళనుంచే సాధ్యపడింది. ముఖ్యంగా ఇండస్ట్రీలు ప్రైవటైజ్ అయ్యాక, ఐటి జాబ్స్ అందుబాటులోకి వచ్చాకే అంతంత సంపాదనలున్నాయి. ఆర్ధికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడితే స్త్రీ స్వతంత్రు రాలయినట్టే అని ఆరోజుల్లో నమ్మేవారు. అదొక పెద్ద స్లోగన్ లా కూడా వుండేది. కాని యదార్ధం పరికిస్తే ఉద్యోగినులయిన స్త్రీలు తమ సంపాదన మొత్తం తీసికెళ్ళి భర్త చేతిలో పెట్టేవాళ్ళే ఎక్కువమంది కనిపించేవారు.
ఆ రోజుల్లో అంటే ముఫ్ఫైయేళ్ళ క్రితమే నా స్నేహితురాలొకావిడ భర్తతో సమానంగా అదే కాలేజిలో లెక్చరర్ గా చేసేది. మధ్యాహ్నం లంచ్ టైమ్ లో భర్త పనిచేసే డిపార్ట్ మెంట్ కి వెళ్ళి, కేరేజీ విప్పి, ప్లేట్ లో అతనికి వడ్డించి, తినేదాకా వుండి, అన్నీ శుభ్రం చేసుకునేసరికి లంచ్ టైమ్ అయిపోయేది. అంతే.. మరింక ఆమెకి లంచ్ తినే టైమ్ వుండేదికాదు.
ఈ విషయం చెపితే నేను అడిగాను..
"అలాంటప్పుడు ఆ ఉద్యోగం చెయ్యడమెందుకు? కష్టపడగా వచ్చిన డబ్బూ అతనికే ఇచ్చి, తిండి కూడా తినకుండా ఎందుకా ఉద్యోగం చెయ్యడం?"అనడిగితే తను ఇలా చెప్పింది.
"నాకు తిండీ, డబ్బూ కాదు ముఖ్యం. నామీద నాకు నమ్మకం జారిపోకుండా వుండడం ముఖ్యం. ఈ ఉద్యోగానికి కనక నేను రాకపోతే ఎందుకూ పనికిరానిదాన్ననే భావం నాలో కలుగుతుందేమోనని భయం.." అంది.
అంటే దానర్ధం. ఆమెనూ, ఆమె భావాలనూ ఇంట్లో ఎవరూ గుర్తించలేదనే కదా..
తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుందుకు నా స్నేహితురాలు అంత తపన పడింది.
నేను చెప్పదలచుకున్నది అదే..
వృత్తి అయినా ప్రవృత్తి అయినా అభిరుచి అయినా మనిషిలో మగయినా. ఆడయినా ఆ తపన వుండాలి. తనలోని ఆర్తిని, ఆరాటాన్ని బయటపెట్టాలన్నంత ఆవేశం వుండాలి.
మీరు అన్న మరో మాట కూడా నిజం. ఈ తరంలో స్త్రీలకి ఇదివరకటి సమస్యలు లేవు. మరో రకం సమస్యలున్నాయి.

శ్రీలలిత said...

మళ్ళీ మరో ఉపమానం అనుకోకపోతే ఈ రోజుల్లో స్త్రీ పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టే అయింది. ఇంటా, బయటా ఒత్తిడికి గురవుతోంది.
తమ తరంలో లాగా తమ పిల్లలు నలిగిపోకూడదని అన్నివిధాలుగానూ స్వేఛ్ఛా, స్వతంత్రం ఇచ్చి ఇప్పటి తరానికి చదువు చెప్పించింది అప్పటి తరం తల్లులే. ఆ చదువులతో పాటు మంచి విలువలు కూడా నేర్చుకున్న ఇప్పటి తరం బాధ్యతగానే వుంది. డబ్బే లోకంగా భావించే కొంతమంది వల్ల నేటి సమాజం కుటుంబాన్ని కోల్పోతోంది అని మాత్రమే నేను చెప్పాను. అలా కోల్పోవడం వలన సింగిల్ పేరెంట్ దగ్గర పెరిగిన పిల్లల్లో కలిగే అభద్రతాభావం వలన వారిలో నేరప్రవృత్తి పెరిగే అవకాశాలున్నాయి. అంటే మనం సమాజానికి ఒక నేరగాణ్ణి అందిస్తున్నట్టే కదా..
ఆ ఉద్దేశ్యంలో నేను చెప్పాను.. సమాజం సవ్యంగా వుండాలంటే కుటుంబం పునాది బాగుండాలని.
అంతేకాని స్త్రీలని వారి వారి ప్రవృత్తులను,అభిరుచులను వదులుకుని కుటుంబమనే చట్రంలో బిగుసుకుపొమ్మనలేదు. ఇదివరకటి రోజులుకావు. స్త్రీలు ఎంతో స్వేఛ్ఛగా, స్వతంత్రంగా బతుకుతున్నారు. కాని కొంతమంది ఆ స్వేఛ్ఛను దుర్వినియోగపరుస్తున్నారేమోనని కాస్త అనిపించింది.
సమాజానికి మన జీవితాన్ని నిర్దేశించే శక్తి మనం ఎప్పుడూ ఇవ్వకూడదు. కాని అదే సమయంలో మనం కూడా సమాజంపట్ల బాధ్యతగా వుండాలనే నా అభిప్రాయం.
ఈకాలంలో చాలామంది స్త్రీలు వారికున్న exposure వల్ల సమాజం పట్ల వారి బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూనే, వారి వారి అభిరుచులను కూడా కొనసాగిస్తున్నారు. కాని కొంతమంది (సంఖ్య తక్కువే కావచ్చు) ఈ స్వేఛ్ఛను దుర్వినియోగ పరుస్తున్నారన్నదే నా ఉద్దేశ్యం.
ముఖ్యంగా మీరడిగిన ఆఖరి మాటకి నేననుకునేదేమంటే..
స్త్రీలయినా, పురుషులయినా పెళ్ళికి ముందు వారిలో వున్న సౌందర్యారాధనా, ఉరకలేసే ఉత్సాహమూ కూడా వారి వారి లోపలి తపనను బట్టి పెళ్ళయాక కూడా కొనసాగుతుంది. మనిషిలోని సృజనాత్మకత ఒకరు ప్రోత్సహించినంతలో రాదు, ఒకరు ఒద్దంటే పోదు. దీనికి స్త్రీపురుషభేదం లేదనే నేననుకుంటాను.
ఆడవారైనా, మగవారైనా బాధ్యత మీద పడ్డాక వారి వారి ప్రాధాన్యతలు మారతాయి. సాధారణంగా ముందు జీవితానికి కూడు, నీడ, భద్రత చూసుకున్నాకే మిగిలినవాటి గురించి ఆలోచిస్తారు. ఆ అవకాశాలు సమాజ వ్యవస్థ మీద ఆధారపడి వుంటాయి. అందుకే వ్యక్తి ఎప్పుడూ సమాజం నుంచి వేరు కాడు..కాలేడు. ఎంతవరకూ తన స్వార్ధం చూసుకున్నాడూ అన్నది చాలా విషయాలపై ఆధారపడి వుంటుంది.
ఇలాగే పురుషులు కూడా కుటుంబ బాధ్యతలు మీద పడ్డాక వారి వారి అభిరుచులని పక్కన పెట్టినవారు కూడా వున్నారు. అటువంటి కథలు కొన్ని చదివినట్టే గుర్తు.








Unknown said...

సుజాత గారూ పుస్తకం గురించీ, అందులో కధగురించీ ప్రస్తావిస్తూనే అది మీలో రేపిన ఆలోచనలను చక్కగా కూర్చి రాసేరు. చాలా బాగుంది కానీ పెళ్లి వలన మగవారు ఆడవారికన్నా చాలా భాద్యతలలో ఇరుక్కుంటారన్నది నా అభిప్రాయం. ఉదాహరణకి పండగకి బట్టలు కొనాలనుకోండి ఆఖరి పేరు ఇంటి మగవారిదే వుంటుంది . కాదంటారా అలాగే మగవారు మన కోరికలు తీర్చడానికి కుటుంబం అవసరాలు తీర్చడానికి చాలానే తమని తాములిస్టు లో ఆఖరులోనే వుంచుకున్తరనేది నా అభిప్రాయం. కేవలం వారు కోరుకునేది నాకుతెలిసి టైం కి రుచికరమైన భోజనం కంటినిండా నిద్ర . ఆ పాటి కేర్ తీసుకోవడం ఆడవాళ్ళకు ఇబ్బంది ఇటే ఎలా చెప్పండి. ఇలా రాయడం తప్పైతే sorry.

Unknown said...

సుజాత గారూ పుస్తకం గురించీ, అందులో కధగురించీ ప్రస్తావిస్తూనే అది మీలో రేపిన ఆలోచనలను చక్కగా కూర్చి రాసేరు. చాలా బాగుంది కానీ పెళ్లి వలన మగవారు ఆడవారికన్నా చాలా భాద్యతలలో ఇరుక్కుంటారన్నది నా అభిప్రాయం. ఉదాహరణకి పండగకి బట్టలు కొనాలనుకోండి ఆఖరి పేరు ఇంటి మగవారిదే వుంటుంది . కాదంటారా అలాగే మగవారు మన కోరికలు తీర్చడానికి కుటుంబం అవసరాలు తీర్చడానికి చాలానే తమని తాములిస్టు లో ఆఖరులోనే వుంచుకున్తరనేది నా అభిప్రాయం. కేవలం వారు కోరుకునేది నాకుతెలిసి టైం కి రుచికరమైన భోజనం కంటినిండా నిద్ర . ఆ పాటి కేర్ తీసుకోవడం ఆడవాళ్ళకు ఇబ్బంది ఇటే ఎలా చెప్పండి. ఇలా రాయడం తప్పైతే sorry.

తెలుగోడు_చైతన్య said...

మీరు అడిగిన ప్రశ్నకు నా సమాధానం సుష్మాస్వరాజ్ గారు అన్నట్లు పురుషసంఘం ఒకటి పెట్టి అందులో చేరి మేము కూడా కూడా రచనలు చేసి చెప్పుకోవాలిసిన సాహిత్యం ఎంతైనా ఉంది...అనిపిస్తుంది..😀 మీరేమంటారు సుజాతగారు?...ధన్యవాదాలు.

Post a Comment