పరదేశం పోయి ఏళ్ళ తరబడి నువ్వు అక్కడ నివసించినా..నీ మూలాలు మాత్రం నువ్వు బయలు దేరిన చోటే ఉంటాయి. నువ్వెక్కడ పుట్టావో అదే నీ వూరు! వూరు మారినా ఉనికి మారదు..... చెప్పడానికి వాక్యం చిన్నదే అయినా తవ్వి తీస్తే ఈ వాక్యం వెనుక బోల్డు కథలు ఉంటాయి. ఆ కథలు బతకడానికి పరదేశం పోయిన ఏ మనిషి వైనా కావొచ్చు! అలాంటి ఒక పరదేశీయుని కథే "టుడేస్ స్పెషల్"! సినిమా! అంతే కాదు, కమ్మని భారతీయ వంటకాల చుట్టూ , ఒక తందూరీ రెస్టరెంట్ చుట్టూ నడిచే ఈ సున్నితమైన హాస్య కథ ఈ మధ్య కాలంలో నేను చూసిన ఒక సరదా సినిమా!మంచి సినిమా కూడా!
నల్లని మబ్బులు కమ్మి, ఊరంతా చీకటై పోయి, సన్నని జల్లులు కురిసే ఒక సాయంత్రం వేళ నెట్ ఫ్లిక్స్ లో ఏదైనా మంచి సినిమా చూద్దామని వెదుకుతుంటే దొరికింది ఈ సినిమా! వంట శ్రద్ధగా ,ఇష్టంగా చేసేవారికి ఈ సినిమా మరింత ఆసక్తి కరంగా ఉండే అవకాశం లేకపోలేదు. వంట అంటే మొదట్లో ఎవరికైనా విసుగే! కానీ...ఏళ్ళు గడిచే కొద్దీ ఒక పక్కన విసుగేస్తున్నా..మరో పక్క ఏ రోజుకారోజు కొత్తగా అనిపించే పని ఇదేనేమో!
నా వరకు నేను వంట మాలతీ చందూర్ గారి పుస్తకం చదివి మాస్టర్ షిప్ సంపాదించినా...శ్రద్ధగా, ఇష్టంగా, వండటాన్ని ఎంజాయ్ చేయడం మాత్రం సంజీవ్ కపూర్ దగ్గరా, తర్లా దలాల్ దగ్గరా నేర్చుకున్నాను. ముఖ్యంగా సంజీవ్ కపూర్ చిటికెలో అద్భుతమైన వంటకాలు సృష్టిస్తుంటాడేమో....వాహ్ వాహ్ అని మాటి మాటికీ ఆశ్చర్య పోతుంటాను. ఇప్పటికీ కొంచెం స్పెషల్స్ కావాలంటే యూ ట్యూబ్ లో పడి సంజీవ్ కపూర్ వంటలు వెదుకుతాను.
ఇహ ఈ సినిమా విషయానికొస్తే ఇదొక ఇండో అమెరికన్ సినిమా! మన్ హటన్ లో సాగే ఒక చిన్న కథ!
మూడు దశాబ్దాలకు పూర్వమే భారత దేశం నుంచి అమెరికా వచ్చిన ఒక ముస్లిం కుటుంబానికి మన్ హటన్ లో నష్టాల్లో నడిచే ఒక చిన్న రెస్టరెంట్ ఉంటుంది. వాళ్లబ్బాయి సమీర్....మరో చోట ఒక పెద్ద రెస్టారెంట్ లో చెఫ్ గా పని చేస్తూ..హెడ్ చెఫ్ అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. "నువ్వు మహా గొప్ప కుక్ వి" అని ప్రశంసలు పొందిన మర్నాడే అనుకోని పరిస్థితుల్లో అతడు తన ఉద్యోగాన్ని వదిలి వేయాల్సి వస్తుంది. పారిస్ వెళ్ళి ఒక ఫ్రెంచ్ రెస్టారెంట్ లో అప్రెంటిస్ గా చేరాలని నిర్ణయించుకుని...తండ్రికి ఆ విషయం చెప్పాలని వస్తాడు. పెద్ద కొడుకు మరణించగా...ఒక్క ఒక్క కొడుకూ తనకు అండగా ఉండక పారిస్ వెళ్తాననడంతో ఆవేశపడిన తండ్రి (హరీష్ పటేల్) కి అక్కడే హార్ట్ అటాక్ వస్తుంది.
విధి లేని పరిస్థితిల్లో తండ్రి నడుపుతున్న ఆ చిన్న పాటి ఇండియన్ రెస్టరెంట్ పగ్గాలు చేతిలోకి తీసుకోవాల్సి వస్తుంది సమీర్! పుస్తకాలు తిరగేస్తే అన్నీ నష్టాలే...అప్పులే! అక్కడ సరదా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చెయ్యడానికి వచ్చే తండ్రి స్నేహితులు ముగ్గురు తప్ప..ఒక్క కస్టమర్ ఉండడు రెస్టరెంట్ లో!
కిచెన్లో చూస్తే బొత్తిగా ఇంగ్లీష్ రాని అసిస్టెంట్ ఒకడు, ప్లాస్టిక్ గ్లాసోటి పక్కన పెట్టుకుని పాన్ నముల్తూ నిమిషానికోసారి అందులో ఉమ్మేస్తూ పరమ అసహ్యంగా కనిపించే హెడ్ కుక్ !! అతన్ని అలా పాన్ ఉమ్మేయద్దని సమీర్ వార్నింగ్ ఇవ్వడంతో అతడు కోపగించి వెళ్లిపోతాడు. దిక్కు తోచని ఆ స్థితిలో సమీర్ ని ఆదుకుంటాడు అక్బర్...అనగా నసీరుద్దీన్ షా! నిజానికి అక్బర్ ఒక టాక్సీ డ్రైవర్. ఒకసారి సమీర్ అతని టాక్సీ ఎక్కినపుడు తాను ఇండియాలో వంట వాడిగా పని చేశానని తన పరిచయం చెప్పుకుంటాడు. ఆ పరిచయంతో సమీర్ అతన్ని వెదికి పట్టుకుంటాడు.
టిపికల్ ఇండియన్ స్టైల్లో అక్బర్ గా అడుగు పెడతాడు నసీరుద్దిన్ షా! చేతిలో ఒక డబ్బా టేప్ రికార్డరూ, అందులో మోగే పాత హిందీ పాటలు, మసాలాలు నూరడానికి ఒక కల్వం....మసాలా పొడులూ...వీటితో సహా! వంట చేయడం లో "ఆత్మ" ఉండాలని, ప్రేమ, పాషన్ ఉండాలనీ అతడిని చూసి తెలుసుకుంటాడు సమీర్.
సమీర్ చెఫ్ గా ఉన్నపుడు అందులో హార్డ్ వర్క్ తప్ప "కళ" లేదు మరి! ఆడుతూ పాడూతూ వంట చేయడమే కాక, నాటు కోళ్ళని తెప్పించి రెస్టరెంట్ వెనక వాటిని కోయడం వంటి "ఇల్లీగల్" పన్లు కూడా చేస్తాడు అక్బర్. రెస్టరెంట్ కి కష్టమర్లు విపరీతంగా పెరుగుతారు. దాంతో రెస్టరెంట్ ని చక్కగా తీర్చి దిద్దాలని కోరికతో తన గర్ల్ ఫ్రెండ్ తో(ఈమె ఇంతకు ముందు సమీర్ తో కల్సి పని చేసిన చెఫ్ కూడా) ఆ రెస్టరెంట్ కి రంగులు వేసి అందంగా తీర్చి దిద్దుతాడు.
తండ్రిని తీసుకొచ్చి చూపించి సర్ప్రైజ్ చేయాలనుకుంటాడు. తండ్రి అదంతా చూసి ఆశ్చర్య పడినా... "ఎందుకు చేసావ్ ఇదంతా? ఇప్పటికే పీకలోతు అప్పుల్లో ఉంది ఇది. దీన్ని అమ్మకానికి పెట్టేయడం, బేరం దాదాపుగా కుదిరి పోవడం జరిగి పోయింది...." అని చెప్పి వెళ్ళి పోతాడు బాధ పడుతూనే!
చేసేది లేక సమీర్ రెస్టరెంట్ మూసేయక తప్పదని అక్బర్ తో సహా అందరికీ చెప్పి పంపేసి ఈడ్చుకుంటూ తను పని చేసిన పాత రెస్టరెంట్ కే వెళ్తాడు ఉద్యోగం అర్థించేందుకు. అతడు అక్కడికి ఎందుకొచ్చాడో తెలీని అతడి గర్ల్ ఫ్రెండ్ "ఇక్కడేం చేస్తున్నావ్. పేపర్ చూశావా? మీ తందూరీ పాలస్ కి New york Times వాళ్లు రివ్యూ లో మూడు స్టార్లు ఇచ్చారు" అని చెప్తుంది. ఆ పేపర్ పట్టుకుని అక్బర్ దగ్గరికి పరిగెడతాడు. కానీ ఆ సరికే అక్బర్ మరో వూరికి మకాం మార్చేయడానికి సామాను అంతా సర్దేసుకుని సిద్ధమై పోతాడు. తన ప్రయాణం మానుకోడానికి అతడు సిద్ధంగా లేడు.
సమీర్ తిరిగి వచ్చేసరికి ......రివ్యూ చదివి.....ఎంతో మంది కస్టమర్లు తందూరీ పాలస్ ముందు గుమికూడి ఉంటారు. తప్పని సరి పరిస్థితుల్లో సమీర్ వంటలోకి దిగుతాడు.
తను ఎన్నడూ వండని, వండుతానని ఉహించని భారతీయ వంటలోకి!
అక్బర్ ని తల్చుకుని ఇష్టంతో, అదొక ఆర్ట్ గా భావించి మొదలు పెడతాడు. కొద్ది సేపట్లోనే అద్భుతమైన భారతీయ వంటకాల్ని అతిధులకు వడ్డిస్తాడు ఆ అంతర్జాతీయ చెఫ్.
తండ్రి వచ్చి ఆ వంటను రుచి చూసి అదిరి పోయి కొడుకుని ఆలింగనం చేసుకోడంతో కథ సుఖాంతం!
హడావుడేమీ లేకుండా మన్ హట్టన్ వీధుల వెంట, ఎక్కువ సేపు రెస్టరెంట్లోనూ,సమీర్ ఇంట్లోనూ సాగే ఈ సినిమా ఇందులో సమీర్ గా నటించిన ఆసిఫ్ మాండ్వి సొంతగా రాసిన నాటకం "సకినాస్ రెస్టరెంట్" ఆధారంగా తయారైంది. అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలూ, అవార్డులూ దక్కించుకుంది కూడా! ఇందులో సమీర్ తల్లిగా నటించిన మాధుర్ జాఫ్రీ స్వయంగా వంటల పుస్తకాల రచయిత్రి కావడం విశేషమే!
ఈ సినిమాలో మార్కులన్నీ ఆసిఫ్ మాండ్వి, నసీరుద్దీన్ షా పంచేసుకుంటారు. మొదటి తరానికి చెందిన భారతీయులుగా ఆ సంప్రదాయాల్ని, మత సంప్రదాయాల్ని వదులుకోలేని తల్లి దండ్రులకు, వాటిని పెద్దగా పట్టించుకోనక్కర్లేదని భావించే అమెరికన్ సిటిజెన్లు...అంటే ఆ తర్వాతి తరానికి చెందిన పిల్లలకు మధ్య ఏర్పడే చిన్న చిన్న విభేదాలు, సాంస్కృతిక భేదాలు...అతి సున్నితంగా ఈ సినిమాలో ఆవిష్కృతమవుతాయి.
వంట చేయడం అంటే ఇష్టపడే వాళ్ళు, వంటని ఆర్ట్ గా భావించే వారికి మాత్రమే కాదు..ఎవరికైనా నచ్చుతుంది ఈ సినిమా!
నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. లేదా డీవీడీ గా కూడా దొరుకుతోంది..
వీలుంటే చూడండి...సరదాగా!
10 comments:
కొన్ని మంత్స్ క్రితం చూశాను సుజాత గారు .....I Must say it's a good movie....
Today's Special - 'Trust Me'
Love's kitchen movie is also same genre.U can give a try watching :)
ఇండియన్స్ తీసిన ఒకట్రెండు ఇంగ్లీష్ సినిమాలు చూసి విసుగేసి, వాటి మీద ఇంట్రస్ట్ పోయిందండీ. మీరు పరిచయం చేసిన విధానం నచ్చింది. దొరికితే చూడాల్సిందే! :)
రివ్యూ బావుందండి సినిమా చూడాలి అనిపించేలా !
మీ రివ్యు చదివాక ఈ సినిమా తప్పకుండా చూడాలనిపిస్తోంది...
బాగుంది సుజాతగారూ. మీ సమీక్షలోనూ ఒక ఆత్మ ఉంది. ఈ సినిమా చూడాలన్న ఆసక్తిని కల్గించింది.
ప్లజంట్ మూవీ బాగుంటుందండీ.. వంట ఇష్టమైన వాళ్లకి ఇంకా నచ్చుతుంది :) నసీరుద్దిన్ షా డైలాగ్స్ కొన్ని భలే ఉంటాయ్. మీ పరిచయం చాలాబాగుంది.
<< నల్లని మబ్బులు కమ్మి, ఊరంతా చీకటై పోయి, సన్నని జల్లులు కురిసే ఒక సాయంత్రం వేళ >>
బాగుందండి ..వర్ణన ..:)
మీ పోస్ట్ చూసాక ఈ సినిమా చూసానండీ నిన్న.. సినిమా, మీ పరిచయం రెండూ బాగున్నాయి. Thanks for suggesting a nice movie! :)
Sujata garu, I read this in a internet cafe. I am looking forward to watch this movie, once i am settled with my work. I like madhur jafri. watched an Indian movie of hers, by Ivory Merchant. What a talented actor she is.
మీరు రాసిన విధానం చాలా బాగుంది.
Post a Comment