January 26, 2013

యదార్థ జీవన వ్యధార్త దృశ్యాలు పెద్ది భొట్ల సుబ్బ రామయ్య గారి కథలు..

రోడ్డు మీద నడుస్తుంటాం, ఆఫీసులో పని చేస్తుంటాం,.ఏదో ఒక వూరు వెళ్తాం….! ఈ సందర్భాలు అన్నింటిలోనూ కళ్ళ ముందు ఎంతో మంది మనుషులు కనిపిస్తారు. వారిలో కొందరు మనల్ని ఆకర్షిస్తారు. కొందరితో మాట్లాడతాం. కొందరితో స్నేహం కూడా చేస్తాం! మరి కొందరిని అసలు పట్టించుకోకుండా, లక్ష్య పెట్టకుండా, గమనించకుండా వదిలేస్తాం..!! అదిగో ఆ వదిలేసిన వాళ్ళే సుబ్బ రామయ్య గారి కథలకు వస్తువులుగా తిరిగి మనకు పరిచయం అవుతారు. మనసులోకి వచ్చిన ఒక ఆలోచనో స్పందింప జేసే ఒక సంఘటనో కాక, తన చుట్టూ ఉన్న మనుషుల్లోంచి సమాజం సులభంగా విసర్జించి పారేసిన వారిని తాను ఎన్నుకుని పరిశీలిస్తూ..ఆ అభాగ్యులతో పాటు ప్రయాణిస్తూ మనల్ని కూడా తనతో పాటు చేయిపట్టి ఈ కథల పొడుగునా తీసుకు పోతాడు రచయిత. ఒకటో అరో తప్పించి ప్రతి కథలోనూ జీవిత మధుర ఫలాలు చేతికందే లోపున చేజార్చుకున్న నిర్భాగ్యులూ, చేతికి అందకుండానే కాలాన్ని దాటిన అభాగ్యులూ….మనసుండి నలిగిపోయే మనుషులూ, కాల చక్రం కర్కశ హస్తాల్లో చిక్కిన అమాయకులూ…వీళ్ళే అడుగడుగునా పలకరిస్తారు మనల్ని.

లబ్ధ ప్రతిష్టులెంతమందో సుబ్బ రామయ్య గారి గురించి మంచి ముక్కలు చెప్పనే చెప్పి ఉంచారు.  అయితే ప్రముఖ కవి ఖాదర్ మొహియుద్దీన్ ఆ మాటల గురించి ఏమంటారంటే ” ఎందరు ఎన్ని రకాలు గా చెప్పినా అవన్నీ పాక్షిక సత్యాలే ననీ, వాటన్నింటినీ ఒక చోట చేర్చి చూస్తే ఆ పాక్షిక దృశ్య శకలాల్లోంచి లీలగా నైనా సుబ్బరామయ్య గారి సాక్షాత్కరిస్తుంది అంటారు. నూటికి నూరు  పాళ్ళూ ఏకీభవించాల్సిన విషయం ఇది.

 సుబ్బ రామయ్య గారి చాలా కథల్లో మృత్యుగీతం తో మొదలవడమో, అంతం కావడమో జరుగుతాయి. ఇది పాఠకుడిని మొదట్లో ఉలిక్కి పడేలా చేసినా రాను రాను ఆ పరిస్థితిని ఒకింత స్థైర్యంతో మామూలుగా కొద్ది పాటి విషాద భావనతో వాస్తవ భావనతో అంగీకరించే స్థాయికి పాఠకుడు చేరతాడు. నీళ్ళు కథలో కథానాయకుడు నీటిలోనే ప్రమాద వశాత్తూ మునిగి మరణించినపుడు గుండె జలదరిస్తుంది. ఆ తర్వాత  ముసురు కథలో కిరసనాయిలు తాగి ప్రాణం పోగొట్టుకున్న సింగార వేలు, నిప్పు కోడి కథలో తిండికి అలమటించి దిక్కు లేని చావు చచ్చే రామ కోటి, పూర్ణాహుతి లో రోడ్డు దాటుతూ దుర్మరణం పాలయ్యే రామేశం, కళ్ళ జోడు కథలో హటాత్తుగా గుండె పోటు పాలై మరణించే అవధాని, సతీ సావిత్రి కథలో పొట్ట కూటి కోసం సావిత్రి ఎవరితోనో గడపడానికి వెళ్తే పాలకు అలమటించి గొంతెండి ప్రాణాలు వదిలే పసి పాప, ఆకలి నొప్పితో విలవిల లాడి ఒకానొక వర్షపు వేళ కన్ను మూసే పీనుగలు మోసే కనకయ్య, పాటలు పాడి పాడి గొంతు కాన్సర్ తో దీన స్థితితో పోయే పంకజ వల్లి…. (కొంప మాత్రం మిగిలింది) స్టేజీ మీద గుండెపోటుతో ప్రాణాలొదిలే సత్యం,  వీళ్లందరి మరణాలు కథలు చదువుతున్న కొద్దీ ప్రతి కథకూ గుండెను కలచి వేస్తూనే….చావుని సైతం మౌనంగా అంగీకరిచగల స్థితికి పాఠకుడిని చేరుస్తాయి.______________________

మిగతా పరిచయం సరి కొత్త ఆన్ లైన్ పత్రిక "వాకిలి" లో చదవండి.......

ఇక్కడ నొక్కండి .




5 comments:

Anonymous said...

వాకిలిలో ముందే చదివేసాను .
సుజాత గారు ఇన్ని విషాద కథలు ఒకేసారి చదివితే తట్టుకోగలమంటారా!
వీరు రాసిన ఇంగువ కథ గురించి చాలా విన్నాను. ఎక్కడ దొరుకుతుందో?

సుజాత వేల్పూరి said...



లలిత గారూ, ఇవన్నీ ఒక్క సారిగా చదవలేమండీ! ఒక్కొక్కటిగా సమయమున్నప్పుడు చదవాల్సిందే! లేకపోతే గొప్ప వైరాగ్యం మనసుని ఆవరిస్తుంది.

ఇంగువ కథ విషయానికొస్తే పెద్ద ప్రత్యేకత లేకుండా అతి మాములుగా కనిపించే ఆ కథలో సాధారణంగా మనం పట్టించుకోకుండా వదిలేసే ఒక ముఖ్యమైన పాయింట్ ఉంటుంది. ఒక పెద్ద మనిషికి "ఇంగువ" అంటే ఏమిటి? అది రసాయనిక పదార్థమా? లేక వృక్ష సంబంధ పదార్థమా , అసలు అది ఎక్కడ పుడుతుంది? ఎలా తయారవుతుంది అనే సందేహం ఉంటుంది. సందేహం చిన్నదే! కానీ అది ఎన్నాళ్ళకూ ఎవరూ తీర్చరు. చివరికి అతడు మరణ శయ్య మీద ఉన్నపుడు అతని మిత్రుడు చూడడానికి వెళ్లినపుడు అపస్మారకం లో కూడా ఇంగువ గురించి గొణుగుతాడు.

చివరికి అదేమిటో తెలీకుండానే అతని ప్రాణం పోతుంది. కొన్ని చిన్న విషయాలు తెలుసుకోవాలని ఉండి, తెలుసుకోకుండానే మనుషుల జీవితాలు అలా అలా గడిచిపోతాయని ఈ కథ చెప్తుంది.

ఇంతా చేసి ఇంగువ అంటే ఏమిటో రచయిత కూడా చెప్పకుండానే కథ ముగిస్తాడు :-))

Zilebi said...

మన (సు) లో మాట సుజాత గారు,

ఇంగువ వంట లో కి కావాలి.
కాని మోతాదు మించ కూడదు.
లేకుంటే ఏదో లోటు.
ఉంటే టేష్టు బెటరు.
ఎక్కువైతే వాక్ !

అదన్న మాట

జిలేబి.

సుజాత వేల్పూరి said...

జిలేబి గారూ, స్వాగతం

ఒక్కొక్కరికీ ఒక్కోలా అర్థమవుతుందేమో సాహిత్యం! చూసే దృష్టిని బట్టి....కదా!

కరెక్టే..మోతాదు ఏది ఎక్కువైనా యాక్ అనిపించక మానదు :-))

BVJ said...

http://en.wikipedia.org/wiki/Asafoetida

Asafoetida - 'మన' ఇంగువ

Post a Comment