బ్లాగ్ చాలా రోజుల కిందటే వదిలేసి రికామీ గా ఉన్న నన్ను మాలతీ చందూర్ ఇలా లాక్కొచ్చింది ఇవాళ !
మనలో చాలా మంది కి "వంట చేయడం" ఒక తల్నొప్పి. వంట చేయడం రాదని చెప్పుకోడం ఒక
గొప్ప. వచ్చని చెప్పుకోడం నామోషీ కూడాయేమో!
I hate cooking అని చెప్పుకోడం ఫాషనూ!
ప్రతి రోజూ జవాబు ఇల్లాలు జవాబు చెప్పుకోవాల్సిన ప్రశ్న "ఇవాళేం వండాలి?" అనే రొటీన్ ప్రశ్న! ఏళ్ళ తరబడి....రోజూ..ప్రతి రోజూనా!!
కొన్ని సందర్భాల్లో "దీనికిహ విముక్తి లేదా?" అన్న విసుగు వొచ్చి పడ్డప్పుడు "చీ, వంట ఒక పెద్ద బెడద,ఒక తల్నొప్పి" అనిపించే సందర్భాలు ఎదురవుతాయి.
ఇంట్లో చివరాఖర్న పుట్టడం ఆడపిల్లలకు పాపం పుట్టింట్లో అడ్వాంటేజీయే కానీ పెళ్ళయ్యాక పేగులు తెగుతాయి వంట నేర్చుకునే సరికి. కుక్కర్ మూత మీద "వెయిట్" పెట్టాలి విజిల్ రావడానికి______ అని కూడా నేర్చుకోకుండా రికామీగా చదువుకుంటూ, ఉజ్జోగం చేసుకుంటూ బతికేసిన నా లాంటి వాళ్ళకి మరీను
అందుకేనేమో మా అమ్మ నేను అత్తింటికి బయలు దేరుతుండగానే తళ తళ లాడే "వంటలు-పిండి వంటలు" పుస్తకం తెచ్చి నా వి ఐ పీ సూట్ కేసులో పడేసింది. నా కుడి కన్ను అదిరింది .
"ఏంటిదీ?"అన్నాను వెర్రిగా చూస్తూ!
మా అమ్మ చల్లగా నవ్వి "ఇన్నాళ్ళూ చేసి పెడితే మింగావే, దాని తాలూకు "కీ" అన్నమాట " అంది
కొత్త కాపరం పెట్టాక వంట బ్రహ్మ ప్రళయమే అయింది నాకు. వెధవది రోజూ టమాటా పప్పూ, బంగాళా దుంప వేపుడూ ఎన్నాళ్ళని తింటారు ఎవరైనా?
సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చాక ఓపిక చచ్చి , ఒండుకునే ఓపిక లేక పొద్దున వండిందే ఏడుస్తూ తినడం!
ఈ టమాటా,బంగాళా దుంపల జోడీని భరించలేని మా ఆయన పాపం తన బాచెలర్ లైఫ్ లో నేర్చుకుని నాకు తెలీకుండా దాచి పెడదాం అని ఆశ పడ్డ విద్యను బయటికి తీసి వంకాయ వేపుడు, పప్పు పులుసు వంటివి చేసే వాడు.
వీకెండ్ మా ఆడపడుచో, అక్కయ్యో (అంతా హైద్రాబాదేగా) భోజనానికి పిలిస్తే బాగుండు అని ఎదురు చూడ్డం ఆశగా!
మా అమ్మకు చెప్తే చచ్చేట్టు తిట్టింది. "నీకు మాలతీ చందూర్ పుస్తకం ఇచ్చింది ఎందుకు? అందులో పోపులో ఆవాలు ఎంత వెయ్యాలో కూడా ఉంటుంది. చూసుకుని ఏడువ్" అని!
సరే అని ఆ పుస్తకం తీసి బేసిక్ కూరలు నేర్చుకుని విజయం సాధించానని గర్విస్తూ ఉండగా... ఇంటాయన ఒక శుక్రవారం సాయంత్రం మంచి స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ తాగిన (ఇది నాకు పుట్టకతోనే వొచ్చు బగా వొండటం) తాగిన ఆనందంలో ఉండగా
"ఆదివారం మా ఫ్రెండ్స్ ని పిలుస్తున్నా భోజనానికి" అన్నాడు
సరే పొమ్మని వరమిచ్చేశాను.
శనివారం ఈస్ట్ ఆనంద్ బాగ్ సెంటర్లో ఉండే కూరల షాపుకు వెళ్ళి కూరలవీ తెచ్చి పడేసాడు. ఆదివారం తెల్లారు జామున నాలుగింటికి అలారం పెట్టి "ఇక లేచి వంట మొదలెడదామా?" అన్నాడు !
"ఇప్పుడేం వంట?" అని విసుక్కుంటూ, అంతలోనే భయంగా లేచి కూచుని "ఎంతమందిని పిలిచావు స్వామీ" అంటే
"ఎంతా? పన్నెండు మందే" అని నసిగాడు.
అంతే! ఆ తర్వాత సీన్ అంతా ఫాస్ట్ ఫార్వర్డ్ లో నడిచింది.
పన్నెండు మందికి, ఎనిమిది రకాల వంటలు ..! లెక్క తెలీక, సలహా ఇచ్చే వాళ్ళు లేక
ఎనిమిది మందికి కప్పుల రైస్ తోఅన్నం,
ఎనిమిది మందికి 8x3= 24 చపాతీలు
ఎనిమిది మందికి 8x3= 24 బొబ్బట్లు ఇలా చేస్తూ ఒంటిగంట వరకూ వండాం
ఆ రోజు నాకిప్పటికీ ఆశ్చర్యమే! అన్నీ సూపర్ హిట్సే! ప్రతి కొలతా అంత ఖచ్చితం
ఈ నాటికీ పసుపు, నూనె మరకలతో, పాటలు వింటూ నచ్చిన లైన్లు అప్పటికప్పుడు ఆ పుస్తకంలో రాసేయగా ఏర్పడ్డ కొటేషన్లూ, ఫోన్ నంబర్లూ, అండర్ లైన్లూ, అడ్రసులూ, ప్రెగ్నెంట్ గా ఉన్నపుడు అమ్మాయిల పేర్లు వెదుకుతూ , ఎప్పటికప్పుడు రాసిన పేర్లూ...
ఇలా సర్వాలంకారాలతో ఆ పుస్తకం భద్రంగా (కుట్లూ అవీ వూడి, అట్టలు పోయి...) ఉంది నా దగ్గర ! ఎప్పటికీ ఉంటుందేమో కూడా
ఇప్పుడు లేటెస్ట్ వంటలనగానే "వారెవా" అంటూ వచ్చేస్తాడుగా సంజయ్ తుమ్మా, యూ ట్యూబ్ రథంలో!
* * * *
మొత్తం వంటల గురించే రాశాను కదా అని ఆమెతో అది మాత్రమే కాదు నా అనుబంధం! స్వాతి లో పాత కెరటాలు మా ఇంట్లో ఎంతెంత వేగంగా పరవళ్ళు తొక్కేవో!
ఇంగ్లీష్ చదవడం రాని మా అమ్మ సైతం మేము ఇంగ్లీష్ పుస్తకాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే మాట కలిపి, ఒక్కోసారి మమ్మల్ని వాయించి పారేసేది.
వేసవి సెలవుల్లో మంటలు రేపే ఎండల్లో, వట్టి వేళ్ల చాపల నుంచి ప్రసరించే మధ్యాహ్నపు చల్ల గాలిలో, వంటింటి గడపలో పడుకున్న అమ్మ నిద్రలో కదిలిపుడు వినిపించే మట్టి గాజుల సవ్వడి తప్ప అంతటా పరుచుకుని ఆవరించిన నిశ్శబ్దంలో పాత ఆంధ్ర ప్రభల్లో "ప్రమదావనం" శీర్షికలన్నీ వరసబెట్టి చదివేసే ఉత్సాహం స్కూలు రోజుల్లో!
ఆమె రేకెత్తించిన పాత కెరటాల్లో కొట్టుకు పోయిన వేళల్లో వాటి ఒరిజినల్స్ చదవాలన్న తపన.... నా తెలుగు మీడియం హై స్కూలు చదువుకి అప్పట్లో!
తర్వాత ఒరిజినల్ నవలలు చదువుతూ ఉన్నపుడు కొంత అనువాదాల మీద కొంత నిరుత్సాహం అనిపించినా....ఆమె అనువాద పటిమ మీద ఎప్పుడూ గౌరవమే
మలయన్ మరుపక్కం అనే శివ శంకరి నవలను ఆమె వనిత మంత్లీ కోసం ఎపుడో అనువదిస్తే అది కాలేజీలో ఉండగా చదివాను. ఆ కథ ఇంకా నా కళ్ళ ముందే జరిగినట్లు గుర్తుంది.
శతాబ్ది సూరీడు నాకు బాగా నచ్చే నవల. కొన్ని నవలలు అసలు నచ్చవు!! మనసులోని మనసు, శిశిర వసంతం (ఇది కాన్సర్ రోగి మీద నడిచే కథ.. అని గుర్తు),మనసులోని మనసు, ఏమిటీ జీవితాలు మరి కొన్ని నాకు నచ్చనివాటిలో చేరతాయి.
కానీ ఒక వ్యక్తిగా ఆమె విజయ సాధన నన్ను ఎప్పుడూ అబ్బుర పరుస్తూనే ఉంటుంది. ఎంత చదివి ఉంటారు, ఎంత విజ్ఞానం, ఎంత సమాచారం..ఒక సెర్చ్ ఇంజన్ ఆమె అప్పట్లో
స్వాతి లో "నన్ను అడగండి" శీర్షిక నాటికి ఆమె పాఠకుల పట్ల కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారేమో అనిపిస్తుంది. ప్రమదావనం నాటి డెప్త్, శ్రద్ధ , దాదాపుగా నాకు ఎక్కడా కనిపించలేదు. కొన్ని సార్లు విసుగు, చిరాకు పుట్టించేవి ఆమె జవాబులు.
చాలానే!
అది ఆమె పాఠకుల మీద చూపించిన నిర్లక్ష్య ధోరణి పట్లే తప్ప ఆమె పట్ల కాదు ! కానీ "అబ్బ, ఈవిడెందుకు ఇలా రాస్తున్నారు? నాకు నచ్చడం లేదు" అని చిరాకు పడితే మా అన్నయ్య ....
"నీకెందుకు నచ్చాలసలు? ఒక శీర్షిక ను బట్టి ఇలా జడ్జ్ చేయాలనుకుంటే నీ వ్యక్తిత్వాన్ని ముందు ప్రశ్నించుకో ముందు" అని క్లాసు తీసుకున్నాడు. కొద్దిగా కళ్ళు తెరిచాను దాంతో !
ఆమె వయసు, ఓపిక సన్నగిల్లడం , ఇతర వ్యాపకాలు ఆమె జవాబుల ధోరణికి కొంత దోహదం చేసి ఉండొచ్చు. రాయలేని పరిస్థితి ఉన్నపుడు విరమించుకోవడం మంచిదేమో ఇలాటి సందర్భాల్లో అనిపిస్తుంది నాకు!
ఏమైనా ...మాలతీ చందూర్ ఒక విద్య, ఒక విజ్ఞానం, ఒక అన్వేషణ, ఒక చదువు, ప్రాక్టికాలిటీ , ఒక స్నేహం, కమ్మగా వండిపెట్టే ఒక అమ్మ..... ఇంకా చాలా !!
మిస్ యూ మాలతి చందూర్ గారూ
18 comments:
వెళ్ళిపోయిన కాలంలోంచి జ్ఞాపకాలు తొంగిచూస్తాయి.
ఇక్కడ కూడా ` లైక్'బటన్ వుంటే బాగుండేది టైప్ చేయాల్సిన అవసరం లేకుండగా...చాలా బాగా చెప్పారు మాలతిగారూ...ఇవి మా అందరి మనోభావాలూనూ...
వీక్లీలు చదివే ప్రతి ఇంటికి ఆమె పరిచయమే! మీ జ్ఞాపకాలలో ఆమెని మళ్ళీ ఇప్పుడే చూసినట్టు ఉంది.
చాలా చక్కగా రాశారు.
నేనూ మీలాగే పెళ్లి కి ఇచ్చిన గిఫ్ట్ మాలతీ చందూర్ వంటల పుస్తకం తోనే ఆరంగేట్రం చేశాను.అంతకు ముందు టమాటో పప్పు, ఆలుగడ్డ వేపుడు :)
ఒక వంటల పుస్తకం కూడా చదివించేలా రాయడం ఆవిడకే చెల్లింది. ఒక్కోసారి చేస్తున్న వంట ఆపేసి కూడా ఏదో కథల పుస్తకం చదివినట్లు ఆవిడ పుస్తకం చదివిన గుర్తు :) ఈ పుస్తకం చదివాకా, ఇంక ఎప్పుడూ ఏ వంటల పుస్తకం నేను చదవలేదు. (గూగుల్ లో చూడటమే)
వెర్సటైల్ రీడర్.. మీరన్నట్టు తెలుగు గృహిణులు ఆకాలం లో ఆంగ్ల పుస్తకాల గురించి ధైర్యం గా మాట్లాడ గలిగారంటే, అది ఆవిడ చలవే.
మీరు చెప్పినట్లు.. తర్వాత తర్వాత ఆవిడ కాలమ్ లో సమాధానాలు.. మాత్రం నాకు బాగానే చిరాకు తెప్పించి.. చదవడం మానేశాను. ప్రశ్న కీ సమాధానానికీ బొత్తి గా పొంతన లేకుండా.. జ్ఞాన ప్రదర్శన కోసం రాసినట్లుండేవి.
ఈ ఆర్టికల్ నాకు చాలా నచ్చింది. వెరీ నైస్.
చాలా బాగా రాసారు మీరు . ఆంధ్రప్రభ రాగానే ముందు ప్రమదావనం చదివేదాన్ని .మాలతి చందూర్ అంటే నాకు అదే జ్ఞాపకం వస్తుంది .అమ్మా వాళ్ళు సీరియళ్ళ తోపాటు అవికూడా బైండ్ చేయించారు. ఎవరో చదవడానికి తీసుకుని ఇవ్వలేదంటే బాధనిపించింది .
"ఏమైనా ...మాలతీ చందూర్ ఒక విద్య, ఒక విజ్ఞానం, ఒక అన్వేషణ, ఒక చదువు, ప్రాక్టికాలిటీ , ఒక స్నేహం, కమ్మగా వండిపెట్టే ఒక అమ్మ..... ఇంకా చాలా"....ఈ ఒక్క వాక్యంలో మాలతి గారి వ్యక్తిత్వాన్ని ఎంత చక్కగా ఆవిష్కరించారో!
ఆమె ఒక విజ్ఞాన సర్వస్వం.
మాలతీ చందూర్ గారిని ఒక రచయిత గా గుర్తుపెట్టుకోవటం కన్నా ఒక విఖ్యాత చదువరిగా గుర్తు పెట్టుకోవటమే ఆమెకు ఇచ్చి ఘనమైన నివాళి అనిపిస్తుంది.
గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్లు లేని రోజుల్లో 'ప్రమాదవనం, పాత కెరటాలు' లాంటి శీర్షిక లని దశాబ్దాల తరబడి నిర్వహించారంటే ఆమె ఎంత గొప్ప చదువరి అయి ఉండాలి?
చిన్ననాటి జ్ఞాపకాల్లో మలూతి చందూర్ గారు స్వాతిలో రాసే నన్ను అడగండి చెపుతాను అనేది నాకి ఇష్టమైన శిర్షిక.... మలూతి చందూర్ గురించి చాలా బాగా రాసారు ....
నాకు మాలతీ చందూర్ పరిచయం చేస్తేనే 'చెలియలి కట్ట' గురించి తెలిసింది. నాక్కూడా వంట రాదనడం ఫేషన్ అయినా ముళహాప్పొడి మాత్రం ఆవిడ దగ్గరే నేర్చుకున్నా. ప్రభ లో ప్రమదావనం నచ్చేదనుకోండి. శిశిరవసంతం నచ్చలేదు. కానీ మంచి పుస్తకమే అది. ఆవిడ దృష్టి లో మంచి మొగ వాళ్ళు ఆ నవల్లో డాక్టర్ లా వుండాలన్నమాట. నాకెపుడో ఎకో కార్డియో గ్రాం చేసినపుడు డాక్టర్ నా మొహం చూళ్ళేదు. అపుడీ నవలే గుర్తొచ్చింది. ఆవిడ చాలా మంది జీవితాల్ని స్పృశించారు. కోతి కొమ్మచ్చి లో కూడా ఆవిడ మెన్షన్ నచ్చింది. నేను కూడా మిస్ చేస్తానామెను. గొప్ప గొప్ప పుస్తకాల్ని పరిచయం చేసిన మంచి స్నేహితురాలామె. RIP Malathi garu.
సుజాత గారూ .... బహుకాలదర్శనం ..
గొల్లపూడి గారి వెర్షన్ సదూకోండి ..
http://www.koumudi.net/gl_new/082613_malathi_chendur.html
chala baaga rasaru..maa amma to paatu pramadavanam chadivanu..
aa pata keratalu..
annattu nenu kuda vantalu pindi vantalu shishyuraline nandoy..
thanku ..
b.lalitha..
సుజాత గారు, భలేగా రాశారండి. ముఖ్యంగా వంటల తంటాలు. పేగులు తెగడం, బ్రహ్మ ప్రళయ సృష్టి, పుట్టుకతో అబ్బిన పాకశాస్త్ర ప్రావిణ్యం ఇవన్నీ నవ్వుల పువ్వులు పూయించాయి. మాలతీ చందూర్ గారి పుస్తకాల పరిచయం బాగా చేశారు. మా జెనరేషన్ సీనులోకి వచ్చేనాటికి ఆమె స్వాతిలో నన్ను అడగండి అంటూండేవారు. మీరు బ్రీఫ్ గానే అయినప్పటికీ చాలా విషయాలు రాశారు ఆమె గురించి.
chaala navvochindi. kaani manasulo maata simply superb.
totalgaa post adubutamgaa undi
http://www.googlefacebook.info/
Sujatha garu,
Endukintha mounam? We are waiting for your posts badly.
Madhavi
సుజాత గారు.. సూపరండీ. ఈ ఆర్టికల్ చదువుతుంటే
మా ఆవిడ పడిన పాట్లు గుర్తొచ్చాయి. ఆవిడ మీలాగే
బంగాళ దుంపల వేపుడూ, టమాటా పప్పుతో నెలలు గడిపేశాం. అయితే నేను బ్రహ్మాండంగా వండుతానండోయ్.
ఆ విషయం ఆవిడకు కావాలనే కొన్నాళ్లు చెప్పలేదు. ఇద్దరం ఉద్యోగస్తులం. పాపాం రోజూ నాకేదో వెరైటీ చేసిపెట్టాలని
ట్రై చేస్తే అది కాస్తా బెడిసికొట్టేది. ఇలా కాదని ఓ రోజు మా ఆవిడ ఉద్యోగం నుంచి వచ్చేసరికి బ్రహ్మాండమైన వంటకాలతో భోజనం సిద్దమైపోయింది. నేను సరిగ్గా వండటం లేదని హోటల్ నుంచి తెచ్చుకున్నారు కదా.. నా పాపిష్టి చేతులు పడిపోనూ అని ఏకరువు పెట్టింది. అవన్నీ నేనే వండేనే బాబూ నీకోసమే అని ఆమెను నమ్మించేసరికి తలప్రాణం తోకకి వచ్చింది. ఇప్పటికీ ఆదివారం కిచెన్ కింగ్ నేనే. మా అవిడకు నాకొచ్చిన వంటలన్నీ నేర్పేశాను. ఇప్పుడు కథ సుఖాంతం. ఈ రకంగా జ్ఞాపకాలు గుర్తుచేసినందుకు థాంక్యూ సుజాత గారు...
మనుష్యల మీద ఆవిడ చూపే శ్రద్ద అపారం.నేను విజయవాడ డివిమ్యానర్ హొటల్లో పని చేస్తున్నప్పుడు ఆమె ఒకసారి అందులో దిగారు.నేను ఆమెతో మాట్లాడుతూ కేసరి గారి చిన్ననాటి ముచ్చట్లు ఎక్కడా దొరకటం లేదని చెప్పాను.ఆమె మద్రాస్ వెళ్ళగానే ఆపుస్తకం పోస్టులో పంపారు.నాకు కళ్ళల్లో నీరు తిరిగింది.నాలాంటి చిన్న ఉద్యోగిని కూడా గుర్తుంచుకున్నందుకు
Sujatha Garu....Supper andi. Chala baaga rasaru. Mukhyamga konni telugu padaalu vintuntee chala santosham vesindi chala rojula tharvata. Avunandoi...!! chepatam marchipoyanu...maadi East Anandhbagh eehh. Milanti manchi rachayitha ma prantham lo vundatam or miru vunde prantham lo memu vundatam...chala santhoshadayakam maku.
Post a Comment