January 8, 2014

ఒక ఆత్మహత్య



 ..."ఆత్మ హత్య శక్తి నిశ్శేషంగా నశించిన వాళ్ల అధిక శక్తి" ___________  చలం ఒక కథలో అంటాడు!!

జీవితమంటే అధైర్య పడ్డ వాళ్ల అద్భుత సాహసం, 
జీవితం దుర్భరమైనపుడు నిష్క్రమించే ఏక కవాటం...., ఎంత శక్తివంతమైన వ్యక్తీకరణ! ఎంతటి సహానుభూతి!!

మొపాసా ఒక కథ రాశాడు.  జీవితం మీద ఇక ఏ ఆశా లేని వాళ్లు సుఖంగా ఆత్మ హత్య చేసుకుని ఈ లోకాన్ని వీడి పోవడానికి ఒక క్లబ్ ఉంటుంది ఆ కథలో! అక్కడికి వెళ్ళిన వాళ్లని ఓడిపోయిన వాళ్లుగా చూడరు.  అక్కడికి వెళ్ళిన వ్యక్తుల కష్టం ఏమిటో తెల్సుకుని వీలైతే దాన్ని తీర్చి మరణం వరకూ వెళ్లకుండా ఆపుతారు.
లేదా అది తీర్చలేని కష్టమైతే.. మరణం భయంకరంగానూ, వేదనా భరితంగానూ రక్త సిక్తంగానూ ఉండక ఆ చివరి క్షణాలు శారీరకంగా ఎలాటి వేదనా లేకుండా సుఖంగా ఉండేందుకు ఆ క్లబ్ ని ఆహ్లాదకరంగా ఉంచుతారు.

ఆ కథ ఒక ఊహ . ఆ కథలో కూడ ఇది కలే ! శరీరాన్ని హింసించి నరక యాతన పడి ప్రాణాలు తీసుకునే వారి పట్ల మొపాసా ప్రకటించిన బాధ అది !

పేపర్లో వార్తలు చూస్తుంటాం, పుట్టింటికి వెళ్ళొద్దంటే కిరోసిన్ పోసుకుని కాల్చుకుందనో, బెండకాయలు తెమ్మని పెళ్ళాం పట్టు బట్టిందని ఉరేసుకున్నాడనో .. !
పోయిన వాళ్లెలాగూ వచ్చి నిజాలు చెప్పలేరు కాబట్టి ఇవి అప్పటికప్పుడు పుట్టే ఆలోచనలే తప్ప అసలు కారణాలు ఎప్పుడో పుట్టి పెరుగుతూ ఉంటాయి, ఆ క్షణం ముంచుకొచ్చే వరకూ....ఆబ్వియస్ లీ !

ఆత్మ హత్యలెప్పుడో తప్ప క్షణికావేశాలు కావు.వాటికి రూట్స్ చాలా బలమైనవి. ఎప్పటి నుంచో పేరుకున్న బాధ, జీవితం పట్ల నిరాశ, దుఖం , నిరసన పెరిగి పెరిగి ఆ క్షణానికి దారి తీసిన క్షణాన ఒక్కోసారి "కడుపు నొప్పి " వంటి కారణాలతో ఉత్తరాలు గా దర్శన మిస్తుంటాయి.

ఇక మామూలుగానే మనలో చాలా మంది పోయిన వాళ్ల పెయిన్ ఏ స్థాయిలో ఉందో అంచనా వేయడానికి కనీసం రెండు రోజులైనా తీసుకోకుండా "నువ్విలా చేసుండకూడదోయ్ వెధవాయ్ "  అని సలహాలిచ్చేస్తుంటారు.........  గట్టున క్షేమంగా కూచుని!

లేదా "పిల్లల బాధ్యత లేదా , కట్టున్నదాని/వాడి బాధ్యత లేదా ?" అని ప్రశ్నలు! అంటే ఆ బాధ్యతలు తీర్చేస్తే పోయినా పర్లేదు!

ఇహ .... జీవితాన్ని గౌరవించాలని మరో పక్క పాఠాలు! జీవితం కడు చేదుగా నిమిష నిమిషమూ తినే కంచంలో విషం కక్కుతుంటే, ఒళ్లంతా అనుక్షణం ఎగతాళిగా మంటలు రేపుతుంటే  ఎక్కడి నుంచి వచ్చి పడుతుందో గౌరవం?

ఐదు వేలు అప్పు తీర్చలేక కుటుంబం మొత్తం ప్రాణాలు తీసుకున్న రైతు గురించి చదివాను మొన్న పేపర్లో! ఐదు వేలు మనలో చాలా మందికి ఒక పెద్ద మొత్తం కాక పోవచ్చు. అయినా ఆ రైతు మనకు తెలిసిన వాడైనా ఎంతమంది ఆ డబ్బు (తిరిగి రాదనే నమ్మకంతో) ఇవ్వగలం? అంతటి చిన్న మొత్తం కోసం కుటుంబం అంతా ప్రాణాలు వదిలే పరిస్థితి వస్తుందని అది జరిగే వరకూ ఎవరమూ ఊహించం!

ఆత్మ హత్యలు చేసుకునే వాళ్లు అర్జెంట్ గా పిరికి వాళ్ళై పోతారు మన కేటలాగ్ (కేవలం టాపిక్ ఉంటే తప్ప రాయలేని వాళ్ళు) రచయితల చేతిలో పడి!

రేపటి నుంచి మన ఉనికి ఉండదని, రేపటితో మన చరిత్ర ముగిసి పోతుందని, ఇక బంధాలేవీ మిగలవని, తను ఇక కొన్నాళ్ళు మాత్రమె ఒక జ్ఞాపకమని ఆ పైన గత చరిత్రగా మారతాననీ తెల్సి జీవితాన్ని విసిరి కొట్టడానికి ఎంతో ధైర్యం కావాలి.

కను చూపు మేరలో దిక్కు తోచని అంధకారమే తప్ప వెలుగు తోచని నిస్సహాయతలో తీసుకున్న ఆ నిర్ణయం వెనుక ఉన్న నొప్పిని  మనుషులుగా  అర్థం చేసుకోగలుగుతున్నామా?

"బంగారం పడితే మన్నైన వాళ్ళు, అన్ని ఆశలూ, ఆనందాలూ నశించిన వాళ్ళు, ఈ  జన్మంతా  కఠోరమైన కాలు కింద రాసిన విధి, అనంతరము కరుణ చూపుతుందనే ఆశతో మరణ దేవిని కావలించుకుని ఈ మాయా జగత్తు నించి నిష్క్రమించిన వాళ్ళు"_________అన్న దృష్టితో ఆ నొప్పిని చూడగలుగుతున్నామా?

సందు చిక్కితే చాలు, 'ఇది సమాజం చేసిన హత్య ' అనో, 'ఈ కుళ్లు వ్యవస్థ చేసిన దురాగతం'  అనో మొత్తం సమాజం మీదికి నెట్టేసి ఒక పనై పోయిందనుకోవడం!

ఇలాటి స్పందనలు అసంకల్పిత ప్రతీకార చర్య గా అలవాటు పడ్డాం!

ఎంతగా మరణించాం మనం !! 

గుండె రాయి చేసుకుని పిల్లలతో సహా బావిలో దూకే తల్లులూ, అప్పులు తీర్చలేక, కుటుంబం తో సహా కడతేరి పోయే సన్నకారు మనుషులూ, ఆ పని చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఇక ఏ వెలుగూ లేదని గట్టిగా రూఢిగా నిర్థారణ అయిన క్షణానే అంతటి దారుణానికి ఒడిగడతారు. ప్రాణాలు పోయే ఆ చివరి క్షణాల్లో బతకాలనే ఒక ఆశ ఉప్పెనలా ముంచుకొచ్చినా అప్పటికే ఆలస్యమై పోయిన అభాగ్యులెంతమందో మనకేం తెలుసు??

వ్యక్తులు అలాటి స్థితిలో మన కళ్ల ముందే ఎంతో మంది కనిపిస్తూ ఉంటారు. మనలో ఎవరమూ వారి బాధలేమిటో తెలుసుకుని మాట సాయం అయినా చేస్తున్నామా?

ఆ బాధ్యతలు మనకు అక్కర్లేదు. కానీ వాళ్లు జీవితాన్ని ముగిస్తే, పోరాడాలని, అలా చేసుండకూడదని, ఎంతో భవిష్యత్తు ఉందని ప్రవచనాల చిట్టా విప్పుతాం!

ఆత్మ హత్యలు జరగని సమాజం కావాలంటే ప్రపంచం లో ఎక్కడా వీలు కాదేమో! ఎందుకంటే ప్రపంచం నిండా బాధ ఉంది. నొప్పి ఉంది. వేదన ఉంది.

కష్టాన్ని తట్టుకుని నిలబడే శక్తి ఉన్నా ,నష్టం నుంచి తేరుకోవాలనే ఆశ ఉన్నా , అందుకు తగిన అవకాశాలు అందరికీ రావు.

ఒక ఆత్మ హత్య జరిగితే దాని దానికి వెనుక ఎంతోమంది వ్యక్తులు ఉంటారు పలు రకాలుగా దోహదం చేస్తూ!
ఒక్కోసారి కనీసం మాట సాయమైనా చేయని మనం కూడా ఆ జాబితాలో ఉండొచ్చు మనకు తెలీకుండా!

చావడానికి ఉన్న ధైర్యం బతకడానికి లేక పోయిందంటే ఆ పరిస్థితి ఎంత దుర్భరం!!

నేను పోతే లోకులేమనుకుంటారో అన్న ఆలోచన లేకుండా,   ఆ పనికి ఒడిగట్టే వారు "లోకులేమనుకుంటే నాకేం? నా ఇష్టం వొచ్చినట్టు నేను బతుకుతా" అనే ధైర్యాన్ని కూడగట్టుకోలేని నాడు ఆత్మ హత్యే శరణ్యం అవుతుందేమో!

కొద్దిగా దయ ఉంటే కష్టం లో ఉన్న మనిషికి చేయి అందించాలి. అది చాత గాని నాడు గుండెలో తడి మిగిలి ఉంటే ఒక చుక్క కన్నీరు రాల్చాలి. అంతే తప్ప శవాన్ని టీవీలో చూస్తూ వ్యక్తిత్వ వికాస పాఠాలు మొదలెడుతుంటే మరింత నొప్పిగా ఉంటుంది

జీవితాన్నే కాదు, అభాగ్యుల మరణాల్ని కూడా గౌరవించడం ఎప్పుడు నేర్చుకుంటామో !!







57 comments:

మనోహర్ చెనికల said...

sarigaa chepparu.

Indian Minerva said...

Exactly!

Suicide is a form of expression : I care about this-something more than anything else and living devoid of that means I have been insincere about my love for that.
It's an expression of sincerity : I don't wanna live in-any-way-possible. I have a standard for living. Either I live conforming to the standards or not. A policy called "Omnia aut nihil". One need to be hypocrite in order to live but not in order to die.
An expression of courage : I don't care about the pain (of death , of parting the things, relations I never get to enjoy) and I can handle that.

People choose to live (don't die) even after a severe failure not because they love life but fear the pain and/or death.

I think the reason why society condemns suicide is because it gets nothing out of that death. If the person were to die in an army, for someone, for nomatter-how-absurd-a-cause the society gets something out of that. It would rather like the person to be alive (and let it derive schadenfreude) than seeing a person punch in its face and set him/herself free.

Surabhi said...

Sujatha Gaaru,
Believe it or not these are the copy paste of my thoughts too. Infact at home we had a very heated argument about this topic yesterday. I think,if we can not understand or atleast recognize the pain and suffer of the people who took such a decision then there is no point of us being called as Humans

Sravya V said...

Well written Sujatha gaaru !

జీవితాన్నే కాదు, అభాగ్యుల మరణాల్ని కూడా గౌరవించడం ఎప్పుడు నేర్చుకుంటామో !!
------------------------
చక్కగా చెప్పారు ఒక లైన్ లో ! Basic human dignity అనేది ఉంటుంది మర్చిపోయి మరణించిన వాళ్ళ జీవితాల్ని పోస్ట్ మార్టం చేస్తున్న తీరు చూస్తుంటే దిగజారటానికి చివరి మెట్టు కూడా దాటిపోయామేమో అనిపిస్తుంది.

వాత్సల్య said...

నిజమే, మన పరిధిలో మనం అవసరమైన వారికి ఎంత మందికి ఆసరా ఇస్తున్నాము??అభిమానులు పోటెత్తారు అన్న వార్త చూసి నవ్వొచ్చింది. నిజం గా వాళ్ళందరూ అభిమానులా?? కనీసం ఒక వారమైనా ఆడుండాలి ఉదయ్ కిరణ్ చివరి సినిమాలు, ఇంత అభిమాన గణం ఉంటే..

నాకు దాదాపు దారి తోచని స్థితి లోకి వెళ్ళే పరిస్థితి వచ్చింది ఒకప్పుడు,ఆ సమయం లో ఒకరిద్దరు ఆత్మీయులు అందించిన సహాయం మరువలేను.మాట సాయమే వాళ్ళు చేసింది..కానీ ఎంత మనో నిబ్బరానిచ్చేదో అదే. పాపం అదే కొరవడుతోంది ఇలాంటి దారుణాలకి ఒడి గట్టే వాళ్ళకి.

ఉజ్వల భవిష్యత్తు ఉన్న హీరో లాంటివి సంతాప సందేశాల్లో వింటొంటే ఏమనాలో అర్ధం కావట్లేదు.

అయినా కాణీ ఖర్చు లేనిది సలహా నే కాబట్టి ఇవ్వడం సులువు.

ఈ కింది వాక్యాలు చూడండి, ఇది రాసినవాళ్ళని ఏమనాలి
"14 నెలలుగా కాపురం చేస్తున్న భార్యా భర్తల మధ్యలో ఇంకా "ఐ లవ్యూ" అని మెసేజ్ లు వెళ్తున్నాయంటే వాళ్ళిద్దరి మధ్యా సఖ్యత లేదని తెలుస్తోంది"


రహ్మానుద్దీన్ షేక్ said...

మానవత్వం కొద్దికొద్దిగా తగిపోతోంది అంటే ఏమిటో అనుకున్నాను! యాంత్రిక జీవితాల నుండి ఎప్పుడో ఒకసారయినా బయటకొస్తే ఇలాంటివి అర్ధమవుతాయి.

telugushorts said...

chala baagaa chepparu baasu... meetho nenu poorthigaa ekeebhavisthanu. nenu koodaa aa stage varaku velli thirigi vachhanu kaabatti chebuthunnanu.

telugushorts said...

100% correct gaa chepparandi, mee abiprayam tho nenu poorthigaa ekeebhavisthunnanu. nenu koodaa suicide stage varaku vellanu kaabatti chebuthunnanu. aa time lo entha manasika vedhana anubhavisthamo...!

సుజాత వేల్పూరి said...

Manohar garu,

Thanks for understanding the pain

సుజాత వేల్పూరి said...

Indian Minerva,

People choose to live (don't die) even after a severe failure not because they love life but fear the pain and/or death._____________ yes..these cowards teach people how to live!

What an irony!!

సుజాత వేల్పూరి said...

Surabhi garu,

Thank you! When we can not heal their pain, at least we should try to recognize the root cause and have some empathy..!!

సుజాత వేల్పూరి said...

శ్రావ్య,

ఈ పోస్ట్ మార్టం లు మీడియాకు అలవాటే! అయితే ఇది ఇప్పుడు సోషల్ నెట్ వర్క్ లకు కూడా పాకింది. జీవితాలను జడ్జ్ చేసి పారేయడం!

థాంక్ యూ

సుజాత వేల్పూరి said...

వేణుగారూ,
థాంక్యూ! టీవీ ఛానెల్స్ గురించి అసలు మాట్లాడుకోనక్కర్లేదు. ఇప్పటికే ఉదయ్ కుటుంబ వ్యవహారాల్ని వీధిలో పెట్టి సగానికి పైగా దర్యాప్తు చేసేశారు. నేను మాట్లాడేది వాళ్ళ గురించి కాదు.

టీవీల్లో వార్తలు చూస్తూ "నువ్విలా చేసుండకూడదోయ్, నువ్వింకా రాటు దేలాలోయ్"అంటూ కుషన్ ఛైర్లలో వెనక్కి వాలి లాప్ టాపుల్లో రాసి మన మొహాల మీద పారేస్తున్న వాళ్ళ గురించి

సుజాత వేల్పూరి said...

రిషీ,
నిజమే! ఇవాల్టి దుఃఖం రేపటికి మాసి పోయాక ఉద్య ఒక గతం మాత్రమే! కనీసం జ్ఞాపకం కూడా కాదు

ఇక ఉజ్వల భవిష్యత్తు (ఎక్కడో?) లాటి పడి కట్టు పదాలు, కష్టం రాటు దేల్చాలి,. నష్టం నిలబెట్టాలి వంటి స్టాక్ నీతులూ మనకి బాగానే అలవాటైపోయాయిగా...

మీరు కోట్ చేసిన చివరి వాక్యం చదివితే నాకు ఎలా స్పందించాలో కూడా తెలీడం లేదు. విపరీతమైన కోపం తో శాంతం వహిస్తున్నాను

సుజాత వేల్పూరి said...

royal kumar గారూ, అవును ఆ మానసిక వేదన ను వాళ్ల కోణం నుంచి చూసి అర్థం చేసుకోవాలనే నేను కూడా అంటున్నాను
థాంక్ యూ!

సుజాత వేల్పూరి said...

రహ్మాన్, ఇలాటివి ఎవరికైనా జరిగినపుడు అంత్య క్రియలు జరిగేంత వరకూ యాంత్రిక జీవితాల్లోంచి బయటకు వచ్చి కాసిన్ని ప్రవచనాలు గుప్పించి మళ్ళి రొటీన్ లో పడుతున్నారు చాలా మంది

మనిషి మనిషిగా జీవించడం మానేసి చాలా రోజులైంది. ప్రతిదీ బూటకంగానే ఉంది స్నేహాలు,బంధాలు అన్నీ ఏదో ఒక స్వార్థాన్ని ఉద్దేశించే ఉంటున్నాయి.

Unknown said...

ఐదు వేలు అప్పు తీర్చలేక కుటుంబం మొత్తం ప్రాణాలు తీసుకున్న రైతు గురించి చదివాను మొన్న పేపర్లో! ఐదు వేలు మనలో చాలా మందికి ఒక పెద్ద మొత్తం కాక పోవచ్చు. అయినా ఆ రైతు మనకు తెలిసిన వాడైనా ఎంతమంది ఆ డబ్బు (తిరిగి రాదనే నమ్మకంతో) ఇవ్వగలం? అంతటి చిన్న మొత్తం కోసం కుటుంబం అంతా ప్రాణాలు వదిలే పరిస్థితి వస్తుందని అది జరిగే వరకూ ఎవరమూ ఊహించం!

సుజాత గారు మీ పోస్ట్ కి ధన్యవాదాలు
మనిషి క్రుంగిపొతే కొంచం ధైర్యం చెప్పే మనసు మనకి కావాలి
అసలు నీ సమస్య ఏమిటి నేను ఏదైనా సాయం చేయగలనా .. అని అడిగే మానవత్వం కావాలి
ఎదుటి వారి కష్టాన్ని వ్యాఖ్యానించకుండా ...ఇదేమి పెద్ద సమస్య కాదు అని మాటలు విసరకుండా కనీసం వినగల సంస్కారం కావాలి
ఏమాత్రం అవకాసం ఉన్న సాయం అందించగల మంచితనం కావాలి ...

మీ పోస్ట్ చదివాక కొందరయినా కనీసం ఆలోచించగలిగితే ... ఆ ఆలోచన ఎదుటి వాళ్ళనుంచి కాకుండా ఎవరికీ వాళ్ళుగా మొదలు కావాలని ఆశిస్తూ
మరోసారి మీకు ధన్యవాదాలు తెల్పుకుంటూ ...

మధురవాణి said...

Thanks for writing this Sujatha gaaru!

శ్రీనివాస్ said...

యాంత్రిక జీవితం లో పక్కవాడిని పట్టించుకోవడం మానేసి చాలా కాలం అయింది మనలో చాలా మంది ఒప్పుకుతీరాలి . కాని కొన్ని ఘటనలు అందునా బాగా పాపులర్ అయేవి ... ఉదాహరణ కి అందమైన సాఫ్ట్వేర్ అమ్మాయిల రేపులు ( దళిత పేద అమాయక గిరిజనుల సామూహిక రేపులు మనకి పట్టవ్), వోల్వో బస్సుల దహనాలు ( పొట్ట కూటి కోసం రోజూ పడవ లో అవతల వొడ్డు కెళ్ళి కూలి చేసుకునే వాళ్ళు ఒక రోజు పడవ మునిగి చనిపోతే మనకి అనవసరం) సెలిబ్రిటీల ఆత్మహత్యలు జరిగినప్పుడు ఆ రోజు ఆ పూట కి మనలో ఎక్కడ లేని సామాజిక స్పృహ తన్నుకోచ్చేసి, అర్జంటుగా స్పంచించేసి, ప్రభుత్వాన్నో ఎవర్నో ఒకర్ని నిన్దిన్చేసి తెల్లారగానే మళ్ళీ మిషన్లైపోవడం ఈ మద్య కామన్ అయిపోయింది.

అసలు ఒక్కోకసారి కొన్ని కొన్ని అంశాల పట్ల స్పందించే అర్హత కోల్పోతున్నామా అనిపిస్తుంది.

సుజాత వేల్పూరి said...

శ్రీనివాస్,

అవును, సెలబ్రిటీల్ గురించే అంతా మాట్లాడతారు తప్ప రోజూ అనేక కారణాలతో ఉసురు తీసుకునే వాళ్ళెందరో, కారణాలేమిటో ఎవరికీ పట్టవు! కుటుంబాలు కుటుంబాలు కడతేరి పొతున్నా, ఎవరి బతుకు వాడిదే ఇక్కడ! నిన్న ఒక తల్లి ప్లాస్టిక్ కవర్లు పిల్లల మొహాలకు తొడిగి చంపేసి తనూ అలాగే చనిపోయిందన్న వార్త గాలికి కొట్టుకు పోయింది.

రోజూ చచ్చే వాడికొసం ఎవరేడుస్తారని ఒక సామెత ఉంది. అలాగే అందరూ!
సెలబ్రిటీ అయినా ఈ హడావుడి అంతా ఇవాళే! రేపటి నుంచీ ఎవరూ ఆయన పేరే ఎత్తరు. కొత్త టాపిక్ కోసం చూస్తారు.

సుజాత వేల్పూరి said...

శైలబాల గారూ,

అవును, సుఖాల్లోనే చిన్ని చిన్ని కష్టాలు వెదుక్కుంటూ వాటినే భూతద్దంలో చూస్తూ జీవితాలు నరకం చేసుకునే మనుషులకు ఎదుటి వాడి కష్టానికి స్పందించాలని తోచదు. తీరా ఆ మనిషి ఉనికే లేకుండా పోయాక "కష్టాల్ని ఎదుర్కోవాలి,ఇది కాక పోతే మరో ఉజ్జోగం వెదుక్కోవాలి"అని చెప్తుంటే ఏమనాలో తోచదు.

మీరనట్టు వినగల సంస్కారం కావాలి. తన కష్టం వినే మనిషి దొరకడం ఎంతో అదృష్టం ఈ రోజుల్లో

సుజాత వేల్పూరి said...

Thank you Madhu!

Shakti said...

సాటి మనిషిని మాటలతో , చేతలతో హింసించి, ఆనందించే శాడిజం , పక్క మనిషిలోనే ఉండడం మానవ జాతికి దేవుడిచ్చిన శాపం ...

ఇలాంటి మనుష్యుల మధ్య ఇమడలేక , మనో వ్యధలకు మరణంతో తప్ప ముగింపు ఉండదని భావిస్తూ , ఈ లోకం నుండి నిష్క్రమించడానికి సన్నాహాలు చేస్తున్నవాళ్లు క్షణ క్షణం ఉంటున్నారు..


ఇంతటి వర్ణనాతీతమైన ఆవేదనను ఆ దేవుడు సృష్టించకుండా ఉంటె యెంత బావుండేది .

తీవ్రమైన బాధను చెప్పుకోడానికి ఒక్క సరైన మనిషి లేక , కన్నీళ్లను ఆశ్రయించే కొంతమంది అభాగ్యులకు , ఇప్పుడు ఇలా షేర్ చేస్కోగలిగే అవకాశం దొరకడమే మహా వరం లా అనిపిస్తోంది ...


శైలబాల గారు , మీరు చెప్పినట్టు ఆలోచించే వాళ్ళు ప్రతి కుటుంబంలో ఒక్కళ్ళున్నా , ఆత్మహత్యలనేవి ఉండేవి కావేమో ... నాది అత్యాశ కదూ .....

Unknown said...

'చావడానికి ఉన్న ధైర్యం బతకడానికి లేక పోయిందంటే ఆ పరిస్థితి ఎంత దుర్భరం!!
నిజం. అలా అనుకుంటె సమాజంలో 75 శాతం జీవితాలు ముగించుకోవాలి? ఎంత సానుబూతి చూపించ ప్రయత్నించినా ఒకటి మాత్రం నిజం. సమాజంలో తమ అంతస్తు ఏమాత్రం తగ్గిపోగూడదు ఎంతమంది కి అసలు అంతస్తులే లేక పోయినా వారికి ఏ బాధ వుండదు. తాము మాత్రం ఈ సమాజానికిమించి గొప్పావాళ్లు అనుకోవటమే కారణం. తాము సాటి మనుషులమే అనేసాధరన అభిప్రాయం ఉన్నట్లైతే నూటికి నూరుశాతం ఈలాంటి ఆత్మ హత్యలను ఆపవచ్చు. మనదేశంళొ గౌరవ హత్యలు ఉన్నట్లే గౌరవ ఆత్మ హత్యలు కూడ ఉన్నాయన్నమాట?!' వీటి గురించి ఓడి పోవటానికి ఇష్టపడని అహాంకారౌలు తప్ప మరేమి కాదు.

sphurita mylavarapu said...

చాలా బాగా రాసారండీ... Thanks for writing this.

సెన్సిబిల్ గా ఆలోచించడం, సెన్సిటివ్ గా వుండడం కూడా తప్పే ఐపోతోంది అనిపుస్తోంది. ప్రతీదీ రెండో రోజు తర్వాత మర్చిపోతున్నాం. మూడో రోజు కూడా అదే ఆలోచిస్తున్నామని తెలిస్తే మనల్ని వింతగా చూస్తారేమో...

ఏదో వొక కారణం చెప్పేసుకుంటే...అది తప్పు అని తేల్చేస్తే ఎవడికి వాడికి ఒక తృప్తి వచ్చేస్తుందనుకుంటా... ఏ విషయం లో ఐనా సరే...



MURALI said...

కష్టాల్ని పోరడటానికి చాలమందికి కావాల్సింది ఒక తోడు. ఆ బాధని జడ్జ్ చెయ్యకుండా వినగలిగి, మేమంతా ఉన్నాం కదా మెల్లిగా దాటేద్దాం అని చెప్పగలిగే సెన్సిటివ్ తోడు. నా బాధ ఎవడికీ పట్టదు, నన్ను ఎవరూ అర్ధం చేసుకోరు, నా సమస్యని ఎవరూ గౌరవించరు అనుకున్న నాడే ఈ లోకంతో మనకి ఋణం తీరిపోయింది అని నిర్ణయించేసుకుంటారు.

మన పరిధిలో మనం ఆ తోడవ్వగలిగితే, ఒక్క ప్రాణాన్నైనా కాపాడగలం

Shakti said...

సుజాత గారు నమస్కారాలు .
ఇప్పటికి 30 సార్లు చదివేను మీరు రాసింది . మీరు నాలో దూరిపోయి , నా మనసులో భావాలు చదివేసి , రాసినట్టుగా ఉంది .

పక్క వారి జీవితం లో ఏం జరుగుతోందనే ఉత్సుకత .
తెలిసీ ,తెలియకుండా , వాళ్ళ వాళ్ళ కుసంస్కారానికి సాక్ష్యంగా , వీలైనన్ని కామెంట్లు , విసిరే రాళ్ళు .
సాయం చేసే నెపంతో , సాయం చేస్తున్నామనే ముసుగులో, దేప్పిపోడిచేవారు , అవకాశవాదులు .
బాగా జరిగిందని పైశాచికానందం పొందే , మానవ రూపంలో ఉండే పిశాచాలు ...
అప్పటికే ముక్కలై , రక్తసిక్తమై మండుతున్న గుండె . దానిపై పెట్రోల్ పోసి వికటాట్టహాసం చేసే క్రూరులు .
ఇలాంటివాళ్ళ నే చాలామందిని చూసి చూసి , విసుగెత్తి , ఒక రకమైన ఏహ్య భావంతో , మనుషులంటే భయపడే పరిస్తితి వచ్చింది .

సోషల్ నెట్వర్క్ సైట్స్ పుణ్యమా అని , తోటి మనిషి ఆవేదనను అర్ధం చేసుకోగలిగే సంస్కారం ఉన్న వాళ్ళను కనీసం ఇద్దరు , ముగ్గురినైనా చూడగలుగుతున్నందుకు కాస్త ఊరటగా ఉంది .
ధన్యవాదాలు

సుజాత వేల్పూరి said...

శక్తి గారూ, మీరు చాలా సున్నితంగా స్పందించారు. థాంక్యూ!
మీది అత్యాశే అయినా అది తీరదనే నమ్మకంతో పెట్టుకోం కదా! మనుషుల్లోనే అన్ని రకాలూ ఉన్నారండీ! ఇలా ఇతర్ల జీవితల్లోకి తొంగి చూసి, సలహాలిస్తూ మనశ్శాంతిని ఛిద్రం చేసే వారు కొందరైతే .... మౌనంగా మరొకరికి సాయ పడుతూ తమ దారిలో తాము సాగి పోయే వారు మరి కొందరు

ఆవేదనను అర్థం చేసుకునే వారూ,వ్యక్తి గత జీవితాల్లోకి చొరబడే వాళ్ళూ _________రెండు రకాల వాళ్ళూ సోషల్ మీడియాలో ఉన్నారు.

మీ ఆసక్తులు నచ్చాయి నాకు. (మీ ప్రొఫైల్ చూశాను). అభినందనలు!(Birds of the same feather feeling)

సుజాత వేల్పూరి said...

తిరుపాలు గారూ, ఈ పోస్టులో ఒక వాక్యం గమనించారా?

నేను పోతే లోకులేమనుకుంటారో అన్న ఆలోచన లేకుండా, ఆ పనికి ఒడిగట్టే వారు "లోకులేమనుకుంటే నాకేం? నా ఇష్టం వొచ్చినట్టు నేను బతుకుతా" అనే ధైర్యాన్ని కూడగట్టుకోలేని నాడు ఆత్మ హత్యే శరణ్యం అవుతుందేమో!__________అలా ఎదురు తిరగ గలిగిన నాడు చాలా వరకూ ఆత్మ హత్యలు మాసి పోతాయి. నూరు శాతం ఆపడం ఎవరి వల్లా కాదు! ఎందుకంటే ఆత్మ హత్యలన్నీ ఒకటే కారణంతో జరగవు. టపాలో రాసినట్టు అయిదు వేల రూపాయలు రేప్పొద్దున్న కల్లా తీర్చక పోతే పంచాయితీ ఎదుర్కోవలసి రావడం, ఊరు విడిచి వెళ్లాల్సి రావడం వంటి కారణాలు చాలవా ఒక రైతు ప్రాణాలు తీసుకోడానికి? "నువ్వూ మనిషివే"అని మనం చెప్పే పాఠాలు అతడిని రక్షిస్తాయా ఆ విపత్కర క్షణంలో?

కానీ సమాజం నిర్ణయించిన పరిథుల్లో, దానికి అనుగుణంగా, దానికి తల వంచి బతకడానికి అలవాటు పడినపుడు ఇలాటి శిక్షలు వేసేసుకుంటారు చాలా మంది!

కేవలం గౌరవం కోసమే కాదు, కుసింత మాట సాయం కూడా దొరకని నిస్సహాయ స్థితిలో ఆ నిర్ణయం తీసుకున్నారని అర్థం చేసుకుందాం

సుజాత వేల్పూరి said...

స్ఫురిత గారూ, నిజమే! మనుషులు రాటు దేలి పోవడం కళ్ళ ముందే చూస్తున్నాం కదా!40 మంది దహనమైన బస్ యాక్సిడెంట్ అయినా, రైలు పెట్టెలు కాలి పోయినా, బోరు బావిలో పిల్లాడు పడినా...అన్ని దుఃఖ స్పందనలూ ఆ రోజు వరకే

మర్నాటికి మరో వార్త రెడీగా ఉండటం వల్ల కాబోలు ముందు రోజు విషాదాన్ని మర్చిపోయి కొత్త దాంట్లో పడుతున్నాం!

ఏదో వొక కారణం చెప్పేసుకుంటే...అది తప్పు అని తేల్చేస్తే ఎవడికి వాడికి ఒక తృప్తి వచ్చేస్తుందనుకుంటా... ఏ విషయం లో ఐనా సరే...______________అంతేగా మరి! తప్పులెన్నడంలో తమని తాము రక్షించుకునే భావన కూడా ఉంటుంది, ఆత్మ వంచనతో పాటుగా!

సుజాత వేల్పూరి said...

మురళీ, ఆ తోడు ప్రతి ఒక్కరికీ ఉండాలి. డబ్బు కమ్మేసిన ప్రపంచంలో రేసు లో పరిగెత్తడం తప్ప ఒకరికి ఆసరాగా ఉండే తీర్క ఎవరికీ లేదిప్పుడు నిత్య జీవితాల్లో!

ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే ఇలా ఉదయ్ కిరణ్ విషయం లాంటివి జరిగినపుడే మనలో అలా "ఒకరికైనా ఆసరా ఇవ్వాలి" అనే ఆలోచనలు వస్తాయేమో అని! అవి ఆ తాత్కాలికావేశంలోంచి వచ్చినవి కాక నిలబడాలి. అది ముఖ్యం! అప్పుడు మన ఆవేదనకు ఆవేశానికి అర్థం ఉంటుంది

సుజాత వేల్పూరి said...

మురళీ, ఆ తోడు ప్రతి ఒక్కరికీ ఉండాలి. డబ్బు కమ్మేసిన ప్రపంచంలో రేసు లో పరిగెత్తడం తప్ప ఒకరికి ఆసరాగా ఉండే తీర్క ఎవరికీ లేదిప్పుడు నిత్య జీవితాల్లో!

ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే ఇలా ఉదయ్ కిరణ్ విషయం లాంటివి జరిగినపుడే మనలో అలా "ఒకరికైనా ఆసరా ఇవ్వాలి" అనే ఆలోచనలు వస్తాయేమో అని! అవి ఆ తాత్కాలికావేశంలోంచి వచ్చినవి కాక నిలబడాలి. అది ముఖ్యం! అప్పుడు మన ఆవేదనకు ఆవేశానికి అర్థం ఉంటుంది

Karthik said...

Chalaa baagaa cheppaaru.

Siri said...

Sujatha garu, Udaykiran news chusinappatinunchi manasulo terige aalochanalaku maata rupam ichharu.. I am not a fan of his but, as a human it hurts when someone takes such an extreme step, what a pain must have he experienced, manishi aasa unnantha varaku poradatanike prayatnam chestadu, anni daarulu musukunnapude kada, ee aakhari daari.. just imagining a situation like that, I feel so overwhelmed.. Human to Human connection is gone from the world.. RIP to all those who suffered.
Sreedevi

raghava said...

సుజాత గారూ!ఒట్టి మాటల వల్ల ఏం ప్రయోజనం..అన్న మీ వేదన అర్ధమవుతున్నది.అయితే వ్యవస్థను ప్రస్తావించడం ’ఒక పనైపోయిందని అనుకోవడం’ ఎలా అవుతుంది?..ఇంతకీ ఎలా స్పందించాలని మీరంటారు? "జీవితమంటే అధైర్యపడ్డవాళ్ళ అద్భుత సాహసం"అని చెప్తే ఎవరైనా ఊగిసలాటలో ఉన్న
వాళ్ళు ఎటువైపు మొగ్గుతారు?..గత్యంతరం లేని స్థితిలోనే వాళ్ళు అలాంటివాటికి పాల్పడతారు అన్నదాన్ని అర్ధం చేసుకోవచ్చులే గానీ "అద్భుతసాహసం"లాంటి వర్ణనలు చేయడం..ప్రోత్సహించడమవదూ?అధైర్యపడే సందర్భాలు ఎదురుకాని జీవితాలెక్కడుంటాయ్?
ఒక 5000కోసం రైతు చనిపోవడమనేది దాతృత్వానికి సంబంధించిన విషయమా? లేక ప్రభుత్వ ఆర్ధికవిధానాలకు సంబంధించిన విషయమా?...

sravi said...

Sujata garu,
Don't know why but when i read Uyad Kiran news, first thing i did was check your blog....may be looking for some kind of insight or meaningful answer that might bring some closure about his death... i don't think anyone would have said it better than what you have written... Thank you.

ప్రవీణ said...

చాలా చాలా బాగా రాసారు సుజాత.
రెండు మూడు సంవత్సరాల క్రితం నాకు తెలిసిన ఒకావిడ ఆత్మహత్య ప్రయత్నం చేసింది.పెద్ద ప్రమాదం తప్పింది. ఇద్దరు పిల్లల తల్లి ఆవిడ. ఆ సమయంలో అక్కడ వినిపించిన మాటలు ఇవి, "అన్నీ ఎకరాల పొలం ఉంది, అంత ఆస్తి ఉంది..ఇంకేం ఇబ్బంది తనకు". ఈ మాట అన్నది ఎవరో తెలుసా! స్వయానా ఆవిడని కన్న తండ్రీ. ఆ మాట నన్ను ఎంత కలిచివేసిందంటే, కొన్ని రోజులు ఆ భావం నన్ను వెంటాడింది. ఓ కధ రాసుకుని , నా ఎమోషన్ ని తృప్తి పరుచుకున్నాను.
ఎక్కడో ఎదో తప్పు జరుగుతుంది...మనలోని సున్నితమైన భావాలు బండబారిపోతున్నాయి.

వాత్సల్య said...

సామాన్య ప్రజానీకం సినిమా వాళ్ళమీద, సినిమ వాళ్ళు కుటుంబ సభ్యుల మీద నెట్టేసి మనల్ని వంచించుకుంటున్నాము అనిపించింది.

నేనూ ఆ తాను లో ముక్కనే..ఉదయకిరణ్ సినిమా తో పాటు మంచక్కయ్య సినిమానో, రామపాదం(రాం చరణ్) సిన్మానో విడుదల అంటే మిగతా రెండు సినిమాలకే ప్రాముఖ్యత ఇస్తాను. అవేవో బాగుండి నిజం గా రంజింపచేస్తాయి అని కాదు.

నిత్యం లైం లైట్ లో ఉంటూ, తరచూ వెబ్, వార్తా పత్రికల ద్వారా వాళ్ళ గురించి వింటూ చూస్తూ ఉంటాను .వాక్చాతుర్యం,ముఖ సౌందర్యం లేకపోయినా కానీ తమ గురించి తాము చెప్పుకునే, చెప్పించుకునే,రాయించుకునే న్యూస్ చదువుతూ
ఉంటాను కాబట్టి అప్పుడప్పుడయినా.


పాపం ఉదయ్ కిరణ్ కి ఇలాంటివి చేతకాలేదు.ఎందుకో తెలీదు ఆ అమాయక సొట్ట బుగ్గల మొహమే గుర్తొస్తోంది.పాపం పెట్టుబడి,పలుకుబడీ రెండూ లేకపోయాయి.

సగటు మధ్య తరగతి కుర్రాడిలా సమాజ కట్టుబాట్లని ఎదిరించలేకపోయాడు.ఒక వేళ నిజం గా అతనికి సపోర్టింగ్ రోల్స్ ఎవరైనా ఇస్తామని వచ్చి అతను తిరస్కరించి ఉంటే మాత్రం అది ఉదయ్ చేసిన పొరపాటు. అసలు మనస్సుకి ఎవరైనా దగ్గరి వాళ్ళు ఉండి ఉంటే మనల్ని సరైన మార్గం లో పయనించేటట్లు చూస్తారు.నిజం గా స్నేహితులందరూ అతన్ని దూరం పెట్టారో,ఉదయే తనంతట తాను ముడుచుకుపోయాడో తెలీదు. పోయిన మనిషి ఎలాగూ తిరిగి రాడు,నిజం చెప్పలేడు. మనం మర్చిపోయేవరకు ఈ "అలాగట,ఇలాగట " లే దిక్కు.

Unknown said...

Sujatha gaaru,
అయిదు వేల రూపాయలు రేప్పొద్దున్న కల్లా తీర్చక పోతే పంచాయితీ ఎదుర్కోవలసి వస్తుందని ఆత్మ హత్య చేసుకోవ్డం గానీ, పెద్ద కార్పోరేటర్ కంపెనీ దివాళ తీసింద ఆత్మ హత్య చేసుకోవడం గాని__ ఈ ఇద్దరి మనస్తత్వాలు ఒకే పాదులో పుట్టిన మట్టలే. ఇద్దరిది ఒకే బావజాలమే. అదే పోటీ ప్రపంచంలో ఉన్నత శిఖరాన్ని అందుకోవాలనే పరుగుపందేం. ఈ పరుగు పందెం ఇంకా తీవ్ర రూపం దాలుస్తుంది. ఈ అవగాహణతో మెట్చ్యురుటీ పొందలేని వారు ఇలా శలబాలవక తప్పదు.
ఆత్మ హత్యలకు అందరికీ ఒకే కారణం ఉండక్కర్ళెదు ఏ కారణమైనా ఈ వ్యవస్త ఛట్రంలో బిగించబడి ఉన్నదే అనే విషయం వాస్తవం.- అది ఆర్దికం కావచ్చు సామజికం కావచ్చు.

రమాసుందరి said...

రైతుల ఆత్మహత్యలకు కాని, తాము కోరుకొన్న జీవితం దొరకని నిసృహలో జరిగిన ఆత్మహత్యలకు కాని వేరు వేరు సూత్రాలు పని చేస్తాయి. రెంటికి కలిపి ఇంకో సార్వజనీయమైన సూత్రం పని చేస్తుంది. ఇక ఆత్మహత్యలలో పర్టిక్యులారిటీకి కొద్దిగానే అవకాశాలు ఉంటాయి. ఆ పర్టిక్యులారిటీకి ప్రాముఖ్యత ఇచ్చీ ఆ కారణాన్ని మీరు గౌరవించాలని అనటం నేను అంగీకరించలేను. మొపాసా కధలో మీరు ఉదహరించిన సంస్థ, మీరు చెబుతున్న వ్యక్తిగత వికాస సంస్థలలాంటిదే.చావులను రొమాంటిసైజ్ చేసే భావజాలం పాశ్చాత్యదేశాల్లో ఉంది. ఒక వర్గ ప్రయోజనం కోసం ఉన్న వ్యవస్థలో హత్యలనయినా, ఆత్మహత్యలనయినా, ఆకలి చావులనయినా ఆ వ్యవస్థ అవకతవకలలో భాగంగానే చూస్తాము. అది బాధ్యతారాహిత్యం కాదు. "సమాజమార్పు కోసం పని చేయనవసరం లేదు... మన పక్కింటివాళ్ళను, ఎదురింటివాళ్ళను, ఇంట్లో వాళ్ళను మార్చితే చాలు" అనే వ్యక్తిగతవాదానికి దీనికి తేడా లేదు.

సుజాత వేల్పూరి said...

ఎగిసే అలలు,
సిరి గారు,

థాంక్ యూ

సుజాత వేల్పూరి said...

రాఘవ గారూ

ప్రతి సమస్యకూ మూలాలు వ్యవస్థలోనే ఉంటాయి.కాదన్లేరు ఎవరూనూ! కానీ సమస్య ఎదురైనపుడు పడి కట్టు పదాలతో కుళ్ళు వ్యవస్థను కొద్ది సేపు నిందించి, రొటీన్ గా పనిలో పడిపోతూ సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నాం అని ఫీల్ అయ్యే మనుషుల గురించే ఈ టపా!

ఆత్మ హత్య ఆదర్శం కాక పోవచ్చు. కానీ దానికి చాలా ధైర్యం కావాలి. అద్భుత సాహసం అనేది కవితాత్మక వర్ణన బై చలం!:-)

"నీ సమస్యలు ఎవరూ తీర్చలేరు,చావడం మంచిది"అని ఎవరూ ప్రోత్సహించరు. కానీ వాళ్ళ బాధ ఏ స్థాయిలో ఉండి ఆ పనికి ఒడిగట్టి ఉంటారో అర్థం చేసుకోక, వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పే వాళ్ళ గురించే ఈ టపా నిరసన వ్యక్తం చేస్తోంది.

రైతు ఉదాహరణకూ ఇదే వర్తిస్తుంది. రైతు చనిపోగానే సామాజిక కార్య కర్తలు నిద్ర లేచి వర్గాల్నీ, వ్యవస్థనూ, ఆర్థిక విధానాలనీ తిట్టి ప్రసంగించి అలిసి పోయి వెళ్ళి బజ్జుంటారు. ప్రతి ఆత్మ హత్యకూ ఇదే తంతు!


సుజాత వేల్పూరి said...

రిషీ,

ఉదయ్ సెలబ్రిటీ కాబట్టి, అతడు మనకి దగ్గరగా అనిపించాడు కాబట్టి నిజానికి ఇంత బాధ పడుతున్నాం! రోజూ ఇలాటి ఆత్మ హత్యలు వందల్లో జరుగుతుంటాయి. జస్ట్ రెలేటివిటీ మాత్రమే!

సపోర్టింగ్ కారెక్టర్స్ చేస్తే జనం ఏమనుకుంటారో అని ఆలోచించాడు తప్ప నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను అని అనుకునే ధైర్యం లేక పోయింది పాపం!దానికి మీడియా రంగులద్ది చెప్పే కథలు అనేకం

సుజాత వేల్పూరి said...

Sravi, ప్రవీణ,

థాంక్ యూ ! బతికున్నాం కాబట్టి చచ్చిన వాడి కష్టాల్ని జడ్జ్ చేయడం సులభమే! వాళ్లు ఏ నిస్సహాయ స్థితిలో ఆ నిర్ణయం తీసుకుని ఉంటారో ఊహించే సాహసం కూడా లేని వాళ్ళం!

పైన ఒకరు చెప్పినట్లు బతికున్న వాళ్లలో చాలా మంది జీవితం మీద ప్రేమ కంటే చావంటే భయంతో బతుకుతున్న వాళ్ళే

జయహొ said...

సుజాత గారు,
తిరుపాలు గారు చెప్పేది ఎమిటంటె ఉదయకిరణ్ లాంటి ఓడి పోవటానికి ఇష్టపడని అహాంకారులు ఆత్మహత్య చేసుకొంటారు. ఎందుకంటే వారు అంతస్తు తగ్గిపోగూడదు, తాము ఈ సమాజానికిమించి గొప్పావాళ్లు అనుకోవటం వలన.
ఆయన దృష్టి లో ఉదయకిరణ్ కి అహంకారం ఎందువలన అంటే, ఆయన సమాజానికిమించి గొప్పావాళ్లు అని అనుకోవటం వలన. అసలికి ఉదయకిరణ్ లాంటి సాదాసీదా మధ్య తరగతి మాములు మనిషికి ఉన్న అంతస్తు ఎమిటి? ఎమీలేదు. ఆయనకి సినేమా రంగంలో హిట్లవలన పేరు వచ్చింది గనుక ఆ రంగంలో స్థిరపడడామనుకొన్నాడు. దానికి తగిన ప్రయత్నం చేశాడు. అంతకు మించి ఉదయకిరణ్ గొప్పవాణ్ణి అనుకోన్నట్లు ఈయనకి మాత్రం కనిపించి ఉందంటే, బహుశా అది ఉదయకిరణ్ కులాన్ని బట్టి అయి ఉండవచ్చు. బ్లాగులోకంలో ఎంతోమంది కి సమాజంలో అసలు అంతస్తులే లేక పోయినా బాధపడని వారు, ఈ రోజు ఉదయకిరణ్ సంఘటన చూసి బాధపడుతున్నారు అంటే కులమే ప్రధాన కారణమని అంతర్లీనంగా ఆయన భావన. ఇంతక్రితం మిధునం సినేమా మీద జరిగిన చర్చలో కూడా ఆయన ఇదే ధోరణిలో చర్చ లో పోల్గొన్నారు. అది అర్థం చేసుకోకుండా మీరేదో ఉదాత్తమైన తాత్విక సమాధానం ఇచ్చారు. ఆ సమాధానం చదివి వారు,'అదే పోటీ ప్రపంచంలో ఉన్నత శిఖరాన్ని అందుకోవాలనే పరుగుపందేం అంట్టూ' .... ప్లేట్ ఫిరాయించారు. అసలికి పోటిలేని ప్రపంచం ఎక్కడుందో, మీకే వరికైనా తెలిస్తే చెప్పగలరా?

సుజాత వేల్పూరి said...

@రమా సుందరి,

ఆత్మ హత్యల్ని గౌరవించాలని, అవి సమాజానికి ఆదర్శమని టపా ఎక్కడా వ్యక్తీకరించలేదు. టపా ఉద్దేశాన్ని మీరు గమనించండి. కష్టంలో ఉన్న మనిషికి చేయూత ఏ మనిషి అయినా ఇవ్వొచ్చు. అది చేయకుండా (ఉదయ్ కిరణ్, రైతుల ఉదంతాలు ఉదాహరణలు మాత్రమే ఇక్కడ), ప్రభుత్వాలు ప్రజలకు బాధ్యత వహించాలి కాబట్టి మనం చేయగలిగింది కూడా చేయక్కర్లేదని వ్యవస్థ మీదో, ఆర్థిక విధానాల మీదో దుమ్మెత్తి పోస్తూ ఇంటికెళ్ళి ఫారిన్ నుంచి వచ్చిన లాప్ టాపుల్లో సోషల్ మీడియా లో స్టేట్మెంట్స్ జారీ చేసే సామాజిక కార్య కర్తల్ని ఎందరిని చూడట్లేదు? అసంఖ్యాక గురివిందల్ని?

వ్యక్తులు మరణించాక వారి వ్యక్తి గతజీవితాల్ని గౌరవించమని, ఏ పరిస్థితులు ఆత్మ హత్యకు దారి తీశాయో అర్థం చేసుకుని "అలా చేసుండకూడదనీ, ధైర్యంగా బతకాలనీ" ఒడ్డున కూచుని కులాసా కబుర్లు జారవిడిచే వ్యక్తుల పట్ల నిరసనే ఈ టపా!

పాశ్చాత్య సమాజమైనా, మన సమాజమైనా మనుషుల సమస్యల స్వభావాలు ఒకటే! డబ్బు, లేదా కుటుంబం చుట్టూనే తిరుగుతాయి. ఆత్మ హత్యల్ని రొమాంటిసైజ్ చేస్తూ ఒక కళాకారుడు రాసిన కథగా మాత్రమే, బాధితుల పట్ల వ్యక్తం చేసిన సహానుభూతిగా మాత్రమే దాన్ని చూడాలి తప్ప ఏకంగా దానికి వర్గ స్వభావాన్ని అంటగట్టడం, వారి దోపిడీ ని గ్లోరిఫై చేయడం భావ్యం కాదు.

వ్యవస్థ లో అవక తవకల్ని చూడ్డం సహజమే! కానీ వ్యక్తి గత స్థాయిలో బాధ్యత ను తలకెత్తుకోడానికి ముందుకురాకుండా, తాము తప్ప మిగతా వారంతా బాధ్యతగా ఉంటే చాలని ఉపదేశాలు ఉచితంగా పంచే వాళ్లను ఏమనాలో మరి?

అసలు ఎవరినీ ఎవరూ మార్చక్కర్లేదు. ఎవరి పరిథిలో వాళ్ళు సక్రమంగా ఉంటే చాలు!

మాట్లాడితే వ్యవస్థ, వర్గం అంటూ పరిగెత్తుకొచ్చే వాళ్ళు సమాజంలో ఏ మార్పు తేగలుగుతున్నారో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం కదా రోజూ!


Unknown said...

పాపం ఉధయకిరణ్‌ గారిది ఏ కులమో నాకు తెలియక పోయె! జయహో గారన్న మెన్షన్‌ చేసి ఉంటే తెలుసుకొందు! ఆయన ఇక్కడ కులం కార్డు ఎందుకు ఏస్తున్నాడో పాపం! ప్రాణం అన్నది కులాన్ని బట్టి ఉండదు. దిక్కు తోచక మరణించిన ఉధయకిరణ్‌ గురించిన సానుబూతి లేక నేను ఇలా రాయలేదు. వ్యవస్త పోతపోసిన మనస్తత్వం వల్లే ఆయన పోయాడు. ఆయనకు బ్రతకాలంటే చోటే లేకపోయిందా? ఆయన్ని ఇలాంటి మనస్తితికి తెచ్చింది వ్యవస్త కాదంటారా? ఈలాంటి ఆత్మ హత్యలకు కృత్రిమ కారణాలే తప్ప ప్రాకృత్రిక కారణాలుండవు. వాటినే వ్యవస్త ఏరపర్చిన కారణాలు అన్నది.
మీ సహానుభూతిని అర్ధం చేసుకున్నాము సుజాత గారు! కానీ ఉధయకిరణ్‌ మరణానికి కారణం ఈ వ్య్వస్తలో తప్ప మరింకెక్కడా వెతకలేము. కారణమని ప్రజాలు అనుకుంటున్న వాల్లని వ్యక్తులుగా చూస్తే చూడవచ్చు వ్యక్తులు అలా కావడనికి కూడా వ్యవస్తే!

సుజాత వేల్పూరి said...

జయహో గారూ,

నా జవాబు తాత్విక ధోరణిలో కనిపించిందా :-) అయ్యో!

తిరుపాలు గారు రాసింది నాకు అర్థమైంది. కానీ ఈ టపా ఉద్దేశం వేరు. మామూలుగానే ఇక్కడ ఎవరు అర్థం చేసుకున్న కోణం బట్టి ఆ రీతిలో కామెంట్స్ సాగుతూ కొంత వరకూ టపా ఉద్దేశం పక్క దారి పట్టి వర్గ పోరాటాల వైపు పాకుతోంది!

అహంకారం అంతో ఇంతో ప్రతి ఒక్కరికీ ఉంటుంది. విజయావకాశాలు దొరికిన వారిలో అది ఉదయ్ కిరణ్ ధోరణిలో ప్రకటించుకోవల్సిన అవసరం రాదు.

కాకపోతే కులం గురించి తిరుపాలు గారు ప్రస్తావించారని నాకు అనిపించలేదు

మీరన్నదే నా బాధ కూడా! రోజూ జరిగే ఎన్నో ఆత్మ హత్యల్ని చూసీ చూడనట్లు వదిలేస్తున్నాం మనం అని! కాక పోతే ఒక మనిషిని ఏదో రకంగా రిలేట్ చేసుకుంటే అది సహజమే కదా!

ఈ టపా ఆత్మ హత్యలు చేసుకునే వారందరినీ ఉద్దేశించి రాసిందే. అందుకే టపాలో ఉదయ్ కిరణ్ పేరే ఎత్తలేదు నేను!

సుజాత వేల్పూరి said...

తిరుపాలు గారూ, కేవలం బతకడమే ముఖ్యం అనుకుంటే ఈ ప్రపంచంలో ఆత్మహత్య అనే కాన్సెప్టే ఉండదు. ఎలాగోలా బతికేద్దాం అనుకోక కాస్తో కూస్తో జీవితాని ఆస్వాదిస్తూ "జీవిద్దాం" అనే మనస్తత్వం ఉంటేనే ఓటమిని ఎదిరించి పోరాడటమో, లేక దానికి ఇలా లొంగి పోవడమో జరుగుతుంది.

ఉదయ్ కిరణ్ గానీ మరొకరు కానీ... ఎవరైనా సరే వాళ్ళ ఆత్మ హత్యలకు కారణాలేమిటనే ప్రశ్న నేను టపాలో లేవనెత్త లేదు. అలా దిక్కు తోచక ఓడి పోయి మరణించిన వారికి వాళ్ళు పోయాక కూడా "నువ్వు అలా చేసుండాల్సింది, ఇలా చేసుండాల్సింది"అని సలహాలు చెప్పక, వారి వ్యక్తిగత జీవితాల్ని తవ్వి తీసి పోయకుండా కనీసం చచ్చాకైనా వారి దారిన వార్ని వదిలేయండి బాబూ అని మాత్రమే టపా ఉద్దేశం!

జీవితంలో ఏ మార్పులు సంభవించినా దానికి అంతో ఇంతో కారణం వ్యవస్థే అయి ఉంటుంది లెండి. దాన్ని ఎవరూ కాదనలేరు.

జయహొ said...

సుజాత గారు,
తలాతోకా లేని విశ్లేషణలు చేయటంలో కంచా అయ్యలయ్య గారిని మించిన వాళ్లు బ్లాగు లోకంలో కొదవలేదు. అలా అనుకుంటె సమాజంలో 75 శాతం జీవితాలు ముగించుకోవాలి? అని రాయావలసిన సందర్భమా ఇది? కష్టాలు, నష్టాలు పేదవారికి / రైతులకి, సినేమావారికి ఉన్నా వాటిలో ఎంతో వ్యత్యాసం ఉంట్టుంది. అయిన దానికి కాని దానికి వ్యవస్థ లో అవక తవకలే అసలు కారణం అంటే అర్థం లేని వాదన. ఉదయకిరణ్ చావుకి వ్యవస్థలో అవకవతవకలు అనే దానికన్నా , పనిగట్టుకొని పీడించుకుతున్నారనేది వాస్తవం. ఆయనకు బ్రతకాలంటే చోటే లేకపోయిందా? అని సులువుగా రాయవచ్చు. కష్టాల్లో ఉన్న వారు కనిపిస్తె ఎక్కడ సహాయం, డబ్బులు అడుగుతారో అని పారిపోయే వారు ఉన్న సమాజం . ఉదయ్ కిరణ్ ఇతర వేషాలు, కెరక్టర్ చేయకుడదా అని సలహాలు ఇచ్చేవారుగమనించనిదేమిటంటే, తెలుగు సినేమాలలో నటులకున్న పాత్రలు ఎమిటి? గత పది సంవత్సరాలుగా హీరో గారిదే రాజ్యం, టైటిల్స్ నుంచి శుభం కార్డ్ వరకు ఆయనే కనిపించాలి , లేకపోతే బ్రహ్మానందం. ఇదే తంతు. http://kalkiavataar.blogspot.in/2014/01/blog-post_5790.html

రమాసుందరి said...

"అసలు ఎవరినీ ఎవరూ మార్చక్కర్లేదు. ఎవరి పరిథిలో వాళ్ళు సక్రమంగా ఉంటే చాలు!

మాట్లాడితే వ్యవస్థ, వర్గం అంటూ పరిగెత్తుకొచ్చే వాళ్ళు సమాజంలో ఏ మార్పు తేగలుగుతున్నారో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం కదా రోజూ!"
ఈ ఆలోచనపరిధిలోనే మీ పోస్ట్ ఉంది. ఎవరెంత చీత్కారాలు ప్రదర్శించినా వర్గ సమాజాలు ఉన్నంత వరకూ అదే పదజాలం ఉంటుంది. అవే వాస్తవాలు ఉంటాయి.

Unknown said...

నిజమే సుజాత, చాలా బాగా చెప్పేవు... ఇలాంటి చావులు చిన్నప్పటి నుంచి ఎన్నో విని బండబారిపోయాము. అవునట అయ్యో పాపం అని లేదా ఏదో నేలబారు వ్యాఖ్య ఒకటి చేసి అక్కడికి ఆ విషయం అంతా తేల్చి ఇక చేతులు దులుపుకుని వెళిపోతాము. మార్పు ఎక్కడో కాదు మనలోనే ముందు మొదలవ్వాలి. తోటి మనిషిని చూసి దయ, ప్రేమ కలగటం అనే ప్రాధమిక లక్షణం తిరిగి మళ్ళీ మన జీవిత పుటలలోకి మనమే ఎక్కించుకుందాము.

అరుణ పప్పు said...

చాలా మంచి ఆలోచన రేకెత్తించారు సుజాతగారు. రాయటం కూడా చాలా బాగా రాశారు.

సుజాత వేల్పూరి said...

రమా సుందరి గారూ, My way is more practical! సమాజం మారాలి, వ్యవస్థ మారాలి అని కంప్యూటర్ల ముందు కూచుని, కేకలు పెట్టే వాళ్ల కంటే (అది సమాజ వాదం అనుకుంటే)దానికంటే, ముందుకు కదిలి చేతగలిగినంత సాయాం/పని వ్యక్తిగత స్థాయిలో చేయగలిగితే ఆ వ్యక్తిగత వాదాన్నే నేను అభిమానిస్తాను.

ఎవరి ఆలోచనా పరిథుల్లోనే వాళ్లు రాస్తారు. అయితే చాలా మంది ఆలోచనలొక రకంగా ఉన్నా, బయటికి మరో రకంగా వోట్ల కోసం ప్రామిస్ లు చేసే రాజకీయ నాయకుల మల్లే రాస్తున్నారు. బహుశా ఆ స్థాయికి ఎదగక (?) పోవడమే బెటర్ అనిపిస్తోంది.

వర్గ సమాజాలు ఉన్నంత వరకూ పదజాలాలు అవే ఉంటాయి. వ్యవస్థ మారాలి మారలి అని ఉపన్యాసాలు దంచే వారున్నంత కాలం. పరిస్థితులూ అలాగే ఉంటాయి.మారవు. కరెక్టే

సుజాత వేల్పూరి said...

అరుణ గారూ,థాంక్ యూ

ఉమా... చాల్రోజులకు కనిపించావు.. థాంక్యూ

raghava said...

సుజాత గారూ!-"ఆత్మహత్యలు పిరికితనం" అని అనడం ఎలాంటిదో "ఆత్మహత్యలు పిరికితనం"అనడం మాత్రం అలాంటిది కాదంటారా?కాకుంటే మొదటి స్టేట్మెంట్ జీవితాన్ని ముగించేప్రయత్నాన్ని కొంత నిరుత్సాహపరిస్తే రెండోది ఉత్సాహపరురుస్తుందేమో!
బతికుండగా ఆయా దీనుల కన్నీళ్ళు తుడిచేందుకు నయాపైస ప్రయత్నం చేయనివాళ్ళు కూడా చనిపోయాక పెద్ద పెద్ద కబుర్లు చెప్పడం ఏమాత్రమూ బాగ లేదనే మీ అభిప్రాయం అనేకమందికి ఉన్న ఆవేదనే..
ఐతే ఈ విషయాన్ని వ్యక్తీకరించే క్రమం లో మీరు వెలిబుచ్చిన కొన్నిఅభిప్రాయాలతో విభేదించక తప్పడం లేదు..
చెలం అన్నా మరొకరన్నా ఆత్మహత్యలెన్నటికీ’అద్భుత సాహసాలైత” కావు..రక్షకతంత్రాలు మాత్రమే.భరించలేని వేదననుంచి బయటపడేందుకు మరో మార్గం కనిపించక ఆ దారిని ఎంచుకుంటారంతే.కదా?
నువ్విలా చేసుకోకూడదోయ్ వెధవాయ్ అనేవాళ్ళు గానీ,పిల్లల బాధ్యత లేదా అనేవాళ్ళు గానీ అందరూ కార్యశీలురైతే కాకపోవచ్చులే గానీ ’ఇలాంటి సంఘటనలు జరక్కపోతే బావుణ్ణు’అనే వాళ్ళ అభిప్రాయం మాత్రం ఆహ్వానించదగిందే గదా.వాళ్ళ సలహాలు చనిపోయిన వాళ్ళకు గాక బతికున్న,ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు గదా.
’సమాజాన్ని’దోషిగా చూపడం అంటే ’వ్యక్తి’ గా తప్పించుకోవడం ఎలా అవుతుందండీ?’సమాజం’అంటే ఆ వ్యక్తి మాత్రం అందులో బాగం కాదా? కేవలం మాటలు మాత్రమే చెప్పి బజ్జునేవాళ్ళు బోలెడు మంది ఎప్పుడూ ఉంటారు..అలా కాక తమ జీవితాల్ని సమాజం కోసమే వెచ్చిస్తోన్న సామాజిక కార్యకర్తల్ని కొందరినైనా మనం చూస్తున్నాం గదా.
’ఎవరికి వాళ్ళం బాగుంటే చాలు..అంతా బాగైపోతుంది’అనే వ్యక్తివాదాన్ని ఎలా సమర్ధిద్దాం సుజాత గారూ? మీరే ఉదహరించినట్లుగా అప్పులపాలై రైతులు ఆత్మహత్యలకు పాల్పడాల్సి రావడం లాంటి సంఘటనలు ఏ వ్యక్తి బాగ లేకపోవడం వల్ల జరుగుతున్నాయి?ఒక వ్యక్తి ఎలా ఉంటాడు అనేది కేవలం అతని స్వీయచైతన్యం మీదనే ఆధారపడి ఉంటుందా..?రాజ్యస్వభావం అనేది పట్టించుకోవాల్సిన అంశం కాదా?దేన్ని బట్టి ఏది మారుతుందండీ?
’వర్గం’అనేది అత్యంత కీలకమైన,మాట్లాడితీరాల్సిన అంశం ఏ సంఘటన ను విష్లేషించేటప్పుడయినా..-భయంకరమయిన పోటీ,డబ్బుకు విపరీతమైన ప్రాధాన్యత,గెలిచేవాళ్ళకే బతికే అవకాశం..ఇవన్నీ వర్గసమాజపు ధోరణులు కావా?
జరుగుతోన్న సంఘటనల పట్ల తమ తమ అభిప్రాయాల్ని చెప్పాలనుకోవడం మానవసహజలక్షణమే గదా..మనందరమూ ఇక్కడ మనమన అభిప్రాయాల్ని చెబుతున్నట్లే.
’చనిపోయిన వాళ్ళకు సలహాలిస్తారు’అని మనమనుకోవడం కూడా భావ్యంగా లేదండీ.బతికుండి ఇబ్బందులు పడేవాళ్ళనుద్దేశించిగదా ఈ సలహాలు.అవి నిర్మాణాత్మకమా కాదా అనేది వేరు.తక్షణ స్పందనలన్నీ ఆలోచనాత్మకంగా ఉండాలని ఎలా ఆశిస్తాం?
కేవలం కన్నీరుకార్చి ఊరుకోవడం కంటే చర్చ ద్వారానే మేలుంటుందని అనిపిస్తోంది.

సుజాత వేల్పూరి said...

రాఘవ గారూ, ప్రతి ఆత్మ హత్య వెనుక తప్పకుండా సమాజం ఉంటుంది. కానీ ప్రతి ఆత్మ హత్య వెనుకా రాజ్య స్వభావం ఉండదేమో ఆలోచించండి. ఆత్మ హత్యల్ని సమర్థించడం ఈ టపా ఉద్దేశం కాదని మీరు గ్రహించే ఉంటారు. మనకు రాజ్య స్వభావం తెలుసు. ఏదైనా సంఘటన జరిగినపుడు "అది రాజ్య హింస , సమాజం కుళ్ళి పోయింది" అని ఒక స్టేట్మెంట్ పారేసి చేత్లు దులుపుకునే వారి సంగతీ తెల్సు. వీరిలో చాలామంది మంది వ్యక్తిగతంగా తగిన సౌకర్యాలతో విలాసాలతో జీవించేస్తూ ఏదైనా ఉపద్రవం జరిగినపుడు వచ్చి స్టేట్మెంట్స్ ఇచ్చేవారు ఉంటారనే సంగతీ అందరికీ తెల్సిందే! సమాజాన్ని దోషిగా చూపడం అందరికీ చేతనవుతుంది. కానీ ఖర్చు లేదు కాబట్టి. ఒక మనిషి కష్టంలో ఉంటే చేయి చాచి అందించడానికి మాత్రం అడుగు ముందుకు పడదు!

సమాజం కోసం పాటు పడే కార్య కర్తల గురించి నేను రాయలేదు, రాయను కూడా! ఎందుకంటే వాళ్ళు ఇలా స్టేట్మెంట్స్ ఇచ్చి వదిలేయరు. వాళ్ల సమయాన్ని ఇందుకు వినియోగించరని నా నమ్మకం!

ఇక చలం వర్ణించినా, మొపాసా వర్ణించినా అది చెప్పాలనుకున్న విషయానికి గాఢత చేకూర్చే ప్రయత్నము, బాధల్ని తప్పించుకోవాలనుకునే వారి పట్ల సహానుభూతి (సానుభూతి కాదు, empathy) వ్యక్త పరిచే ప్రయత్నమే అని గ్రహించండి.

మనలో మన మాట..ప్రాణం తీసుకోడానికి ఏ మాత్రమూ ధైర్యం అక్కర్లేదంటారా? అదంత సులభమే అయితే రోజుకెన్ని ఆత్మ హత్యలు జరగాలో ఆలోచించండి??

సానుభూతో సహానుభూతో వ్యక్త పరిచే హక్కు, హృదయం అందరికీ ఉంటుంది. కానీ సలహాలిచ్చే వాళ్లలో చాలా మంది రోజు వారీ పోసుకోలు కబుర్లలో దీనికీ ఒక ఐదు నిమిషాలు కేటాయించేసి , ఆ మరు క్షణం నుంచీ జగజీత్ సింగ్ గజల్స్ లో మాధుర్యాన్నీ ఆస్వాదిస్తూనో, బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లోని గొప్ప దనం గురించి ప్రసంగిస్తూనో గడుపుతున్నారే! అటువంటి వారి గురించే నేను రాసింది.

అంతకు మించి అభిప్రాయాలో, సానుభుతో వ్యక్తం చేసే ప్రతి ఒక్కరూ దీని గురిచి తమను తాము తరచి చూసుకోనక్కర్లేదండీ!

క్రియా హీనంగా, రాజ్య స్వభావాన్నో, హింస నో వేలెత్తి చూపుతూ ప్రసంగాలు ఇచ్చే కంటే ఒక మనిషి ప్రాణాన్ని కాపాడగలిగితే దాన్ని మించిన సమాజ వాదం ఉంటుందని నేను అనుకోడం లేదు. ఎవరికి వారు బాగుండాలని నేను చెప్పడం లేదు, ఎవరి పరిథిలో వారు ఎదుటి వారు బాగుండాలని కోరుకోవాల్ని, వీలైతే అందుకు ఒక చేయి ముందుకు చాచాలని భావిస్తున్నాను.

ప్రతి వారూ సామూహిక స్థాయిలోనో, ఆర్గనైజేషన్లు స్థాపించో సహాయాలు చేయలేరు.

ఇవాళ ఆవేశ పడి, రేపు సాయంత్రం ఏడింటికల్లా మర్చి పోయే చర్చల కంటే, సహాయం చేయలేనపుడు కాసేపు బాధ పడి బరువు దింపుకోవడం ఉత్తమం!అలాటి వృధా చర్చల వల్ల ఒరిగేదేమీ లేదు

చర్చ కార్య వాదుల మధ్య మాత్రమే ఎప్పుడూ సఫలం అవుతుంది

ఈ టపాలో జరిగిన చర్చ వల్ల కూడా ఉపయోగం ఏముంటుందో నాకు తెలీదు కానీ, కొందరైనా ఈ అత్యవసర వ్యక్తిత్వ వికాస పాఠాల పట్ల విరక్తి చెంది ఉన్నారని అర్థమైంది