June 26, 2008

అమ్మాయిలు - ఆంటీలు

తెలుగులో కొన్ని కొన్ని మాటలు ఇతర భాషల నుండో, లేక సరదా కోసం పుట్టించినవో లేక మరో రకంగానో వచ్చి చాలా జెన్యూన్ గా చెలామణి అయిపోతుంటాయి. 'సుత్తి ' , 'అంత సీన్ లేదు ' 'కాలింది '(మండిపోయింది) మొదలైనవి..ఇంకా చాలా ఉన్నాయి గాని ఇప్పుడు విషయం వాటి గురించి కాదు.

ఇలా పుట్టిన మాటల్లో నాకు ఒళ్ళు మండించే మాట ఒకటుంది. అదే "ఆంటీ" ! ఆ మధ్య ఒక బ్లాగులో 'ఆంటీ 'అని పిలవడం పట్ల కొందరు స్త్రీ బ్లాగర్లు బాధ పడ్డారు కూడా! కేవలం బాధ బాధ పడి ఊరుకుంటె లాభం లేదని, ఒక టపా రాసేయాలని అనిపించి రాస్తున్నాను.

నా చిన్నప్పుడు మా అమ్మ స్నేహితుల్ని 'సుశీలత్త ''రాధత్త ' 'కమలత్త 'ఇలాగే పిల్చేదాన్ని! హైస్కూలుకొచ్చాక ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మల్ని 'అత్తా 'అని పిలుద్దామంటె కొంచెం సంకోచంగా ఉండేది.పైగా నా ఫ్రెండ్స్ అన్నలెవరూ అంత పెద్ద అందగాళ్ళు కుడా కాదని తెలిసిపోయింది. ఈ లోపు నా స్నేహితురాళ్ళు మా అమ్మను 'ఆంటీ ' అని పిలిచి నాకు దారి చూపించారు.

ఆడవాళ్ళను గౌరవంగా పిలవడానికి ఉపయోగించే మాటగా దీనికేమైనా నిఘంటువు అర్థం ఉందేమో గానీ నాకు మాత్రం భలే మంట! ముక్కూ, మొహం తెలియనివాళ్ళు వచ్చి 'ఆంటీ' అని పిలవడమేంటి?

మొదట నన్ను మా ఇంటి వోనర్ గారి అమ్మాయి, నా ఈడుదే, పెళ్లైన కొత్తలో వాళ్ళింట్లో చేరిన నాల్రోజుల కల్లా "ఆంటీ అమ్మ మీకు ఇమ్మంది 'అని పాయసమో నా పిండాకూడో ఏదో ఇచ్చి శుభారంభం చేసింది. ఆ రోజు నుండి ఆంటీగా ఫిక్సయి పోయాను. నేను అప్పుడే నన్ను అక్కా అని పిలవమని చెప్పాను సౌమ్యంగానే!

ఆ పిల్ల 'సరే అక్కా ' అని సంతోషంగా ఒప్పేసుకుంది. ఆ మర్నాడు నుంచి మా వారు ఆఫీసు నుంచి రాగానే
' బావా, అక్క నీకు తాళాలియ్యమంది ' అనగానే పాపం తను ఎగిరి పడి పారిపోయారు.
అయినా ఆ అమ్మాయి రూటు మార్చుకోక,
' బావా, అక్క ఇంకా రాలేదా,
బావా అక్క ఆఫీస్ ఎక్కడ,
'బావా ఏడికెల్లొస్తున్నవ్ ' అంటూ బావా బావా బావా అని ఊదరగొట్టేసింది.!
నేను కనపడితే 'అక్కా, బావ డ్యూటీకి పొద్దున్నే పోతడా?'
'బావ నీకంటె స్మార్ట్ కొడుతున్నడు కదా, నిన్నెట్ల షాది చేసుకుంటుండె?' అని మాట్లాడ్డం మొదలెట్టింది.
దీనితో తను ఆఫీస్ అయిపోయాక రోడ్లమ్మట తిరిగి అర్థ రాత్రులు ఆ పిల్ల నిద్రపోయాక ఇంటికి వచ్చి, తిరిగి మరదలు నిద్ర లేవకముందే ఆఫీస్ కి పారిపోవడం ప్రాక్టీస్ చేసాడు.
దానితో నేను మళ్ళీ ఆంటీగా మారడానికి నిశ్చయించుకున్నాను. అదే మొదలు!

సిటీ బస్సులో అయిటే స్కూలు పిల్లలు, కాలేజీ పిల్లలు, పరిచయం లేని మగవాళ్ళు అందరూ 'ఆంటీ ' అనే పిలవడం! పెళ్ళి వల్ల జరిగే నష్టాల్లో ఇదొకటన్నమాట! ఇక లాభం లేదని, వాడుతున్న సబ్బు మానేసి, సంతూర్ సబ్బు మొదలెట్టాను.వాళ్ళూ ఆ మోడల్ కి ఎంత డబ్బిచ్చారో గానీ, సబ్బు వాడాక కూడా నన్ను మాత్రం ఒక్కళ్ళు కూడా ఆంటీ అనడం మానలేదు.

ఇక మా పాప పుట్టాక పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఇదివరలో ఎవరో ఒక్కళ్లన్నా, 'దీదీ' అనో, మేడం అనో పిలిచేవాళ్ళు! ఇప్పుడు చాలా మామూలుగా అదేదో నా పేరన్నట్టు నన్ను 'ఆంటీ' ని చేసేశారు.
పెళ్ళవగానే 'శ్రీమతి ' తో పాటుగా 'ఆంటీ' కూడా బోనస్ గా వచ్చి చేరుతుందని అనుభవ పూర్వకంగా తెలిశాక, ఇహ ఏమీ చెయ్యలేకపోయాను. ఎంతమందికని చెప్పడం "నన్ను పేరుతో పిలవండి ' 'నన్ను ఆంటీ అని పిలవకండి ' అని?

పాలు, పేపరు వేసే వాడు (వయసు నలభై కి తక్కువుండవు) 'ఆంటీ , సారు లేరా? " అని అడిగినపుడు ఒళ్ళు మండి పోతుంది! నేనేమో ఆంటీ, ఆయనేమో 'సారు '!
బయటి నుంచి వస్తుంటే,సెక్యూరిటీ 'ఆంటీజీ,ఆప్ కేలియే కొరియర్ " ఆంటీజీ !,ఇందులో బోడి మర్యాదొకటి!
ఎల్కేజీ చదువుతున్న పాపను స్కూల్లో దింపడానికి వెళితే పదేళ్ళ కొడుకుని తీసుకునొచ్చిన చిన్ని నాయన 'ఆంటీ, వేర్ కెన్ ఐ మీట్ ద ప్రిన్సిపాల్?" అనడుగుతాడా?
మా ఇంటి దగ్గర కడుతున్న ఒక బిల్డింగ్ లో పని చేసే తాపీ పని వాడు "ఆంటీ టైమెంత?" అని అడుగుతాడు.పాతిక నిండకుండానే పదివేల మంది నన్ను ఆంటీ అని పిల్చేసారు.

ఇక చెత్త తీసుకెళ్ళే వాడైతే బెల్లు కొట్టి "చెత్తాంటీ!" (చెత్త ఉందా.ఆంటీ అనడం అన్నమాట) అని అరుస్తాడు. ఇదీ మరీ భయంకరంగా అనిపించింది నాకు. ఎన్ని సార్లు చెప్పినా ప్రతి ఇంటి ముందూ ఇదే కేక! గట్టిగా చీవాట్లేసానొకరోజు "చెత్తాంటీ ఏమిటి నీ మొహం " అని!
మర్నాటినుంచీ వాడు "ఆంటీ, చెత్త " అనరవడం మొదలు పెట్టాడు. "ఒరే నాయనా, చెత్తాంటీ అన్నా, ఆంటీ చెత్త అన్నా తేడా లేదురా " అని చెపితే ఈ లాజిక్ వాడికర్ధం కాలేదు.
పైగా విసుక్కుని "అబ్బ ఏంటాంటీ మీరు, ఒక పని చేయండి మీరంతా, నా బండి పదింటిదాకా ఈ ఏరియాలోనే ఉంటది.తొమ్మిదింటికి మీరు నాకో missed call ఇయ్యండి, నేనొచ్చి చెత్త దీస్క పోతా'నన్నాడు.
అందువల్ల వాడు పైకి రాకుండా చెత్త అంతా కింద కలెక్ట్ చేసుకునే పద్ధతి పెట్టి వాడి నుంచి తప్పించుకున్నాం!

కూరల వాడు, బస్టాప్ లో పక్కన నిల్చున్న కాలేజీ అమ్మాయిలు,పాత పేపర్లు కొనేవాడు,పక్కింటి సాఫ్ట్ వేర్ ఇంజనీర్, (వాళ్ళు నార్త్ ఇడియన్స్ అయితే వాళ్ళ నాన్న కూడా),పై ఇంటి పిల్లల తల్లి, కిందింటి కొత్తగా పెళ్ళైన జంట(ఇద్దరూ) ...అరె ఒకళ్ళా ఇద్దరా!

మగవాళ్ళ కి 'అంకుల్ ' పిలుపు ప్రాబ్లం ముప్ఫై కూడా నిండకుండా ఇంత తీవ్రంగా ఉంటుందనుకోను. అందుకే వాళ్ళు మరణ మృదంగం నవల్లో బిలహణుడిలాగా 'అల్లనల్లన జుట్టు తెల్ల బడినా, ఏ పిల్లా నన్నింత వరకూ అంకులనలేదు ' అని మురిసి పోతుంటారనుకుంటా!

నన్ను ఆంటీ అని పిలిచేవాళ్ళెవరూ మా ఆయన్ని 'అంకుల్ ' అని పిలవగా నేను చూళ్ళేదు. పోయిన వేసవి లో నాలుగేళ్ళ మా అమ్మాయిని స్విమ్మింగ్ క్లాసులకి తీసుకెళ్ళినపుడు ఒక ప్రబుద్ధుడు ఒడ్డున ఉన్న నాతో 'your daughter is an excellent swimmer aunty, where is her dad? అనడిగాడు. అతని పదేళ్ల కొడుకు దున్నపోతులా ఈదుతున్నాడో పక్క!పళ్ళు నూరుతూ 'అదిగో అక్కడున్నార 'ని చూపించాను.
' పేరేంటీ అనడిగి మరీ వెళ్ళి 'మిస్టర్ శ్రీనివాస్, యువర్ డాటరీజ్ గోయింగ్ టు బి ఏ చాంపియన్ ' అని అభినందిస్తుంటే నాకు నిజంగా మండిపోయింది.
ఇలా సింపుల్ గా ఉంటే లాభం లేదు, మా బిల్డింగ్ నిండా లుక లుక లాడుతూ ఉండే నార్త్ ఇండియన్స్ లాగే మనమూ ఫాషన్ గా ఉండాలని నిశ్చయించుకుని VLCC కి వెళ్ళి, బ్యూటి 'ఫుల్లు 'గా మారిపోయి (మారిపోయాననుకుని) ఇంటికొచ్చి బెల్లు కొట్టాను.మా ఆయనఒచ్చి తలుపు తీసి "ఓహ్, సారీ అండి , మా ఆవిడ ఇంట్లో లేదు, తర్వాత రండి! sorry for the inconvenience అని తలుపేశాడు..!
తర్వాత విషయం తెల్సుకుని విసుగ్గా 'అబ్బ, ఎవరేమని పిలుస్తే ఏముందిలెద్దూ!నువ్వెంచక్కా ఎప్పటి లాగా హాండ్లూం చీరెలూ, డ్రెస్సులూ వేసుకో"అన్నాడు.
మనకు ఇంట్లోనే ప్రోత్సాహం లేకపోతే బయటివాళ్లననుకుని ప్రయోజనం ఏముందని నిరాశగా సర్దిచెప్పుకున్నాను!

ఇలా ఉండగా వినాయక చవితి కి మా కమ్యూనిటీలోనే ఒక మండపం పెట్టి కనీసం 5 రోజులు పూజ జరపాలని కాలనీవాళ్ళు నిర్ణయించారు!

అందుకని వినాయకుడు పుట్టినప్పటి నుంచి (అదేలెండి తయారైనప్పటినుంచి) చంద్రుడు పగలబడి నవ్వేంత వరకు పదిహేను సీన్లతో ఒక నాటకం తయారు చేసి పిల్లలతో ప్రాక్టీస్ చేయించి విజయవంతంగా ప్రదర్శించాము! పైగా నాటకం హిందీలో! (ఇక్కడంతా వాళ్ళే ఎక్కువ! మేమేదో సొంత ఇళ్ళల్లోనే చత్రపతి సినిమాలో శరణార్ధుల్లా బతికేస్తున్నాం) తెలుగులో రాసి, దాన్ని ఒక గుజరాతీ అమ్మాయికి ఇంగ్లీషులో వివరించగా ఆవిడ హిందీలో తిరగ రాసింది. నాకు హిందీలో ఇరవై వరకు నెంబర్లే మధ్యలో ఎవరన్నా అందించాలి.


ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్న లలిత్ చోప్రా కి ఇంకా పెళ్ళి కాలేదు.ఎందుకు చెప్పానంటే నన్ను ఆంటీ అనడానికి చోప్రాకి సర్వ హక్కులూ ఉన్నాయన్నమాట!రోజూ సాయంత్రం mind space నుంచి డైరెక్టుగా ప్రాక్టీస్ కి వచ్చి కావాలని ఒకటికి పది సార్లు 'బలే ఉందాంటీ నాటకం ' అనేవాడు. '
'ఇదిగో చోప్రా, నన్ను ఆంటీ అని పిలిచావంటే నిన్ను చంపుతాను ' అని బెదిరించి చూసాను.

చివరి రోజున నాటకం పూర్తయ్యాక, పిల్లలందరికీ బహుమతులు ఇచ్చి, 'మేకప్ చేసిన రాధాంటీ కి, లైట్లు పోకుండా చూసిన సుమన్ ఆంటీకి....అంటూ పిలిచి ఏవో మెమెంటోలు ఇచ్చాడు. నేను స్టేజీ కిందనుంచే 'నన్ను ఆంటీ అని పిలిచావో.....చూడు" అని సైలెంట్ గా తర్జని చూపించాను.

లలిత్ గాడు నవ్వుతూ.."చివరగా ఈ కార్యక్రమం విజయవంతంగా నడిపించిన బేబీ సుజాతని వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాను " అన్నాడు. 'పార్వతిగా వేసినమ్మాయి వల్ల నాటకం రక్తి గట్టిందనుకున్నాం గానీ ఆ పాప పేరు అది కాదే ' అని ఆలోచిస్తుండగా , మా వారు నన్ను చూసి నవ్వుతూ "లలిత్ నిన్నే పిలుస్తున్నాడు ,నువ్వు ఆంటీ అనొద్దన్నావుగా ' అని ముందుకు నెట్టారు.
ఈలోపుగా లలిత్ నాలుగైదు సార్లు 'బేబీ సుజాత , ఎక్కడున్నా స్టేజీ మీదికి రావలెను ' అని అనౌన్స్ చేసాడు. ఆడాళ్లంతా వాడిని కొట్టినంత పని చేసారు. 'మేమంతా ఆంటీలా,తనేమో బేబీనా ' అని!
నేనేమో 'ఓరి దొంగ చచ్చినాడా " అనుకుంటూ లేచాను.
ఆ దెబ్బతో ఒక నాలుగైదు నెల్ల పాటు నేను 'బేబీ' గానే చెలామణి అయ్యాను.
సో, మొత్తానికి పెళ్ళై పిల్ల(లు) పుట్టాక ఎంతటివారలైనా ఆంటీలు అయిపోతారనడానికి ఎంతమాత్రమూ సందేహం లేదు. మీ వయసెంతైనా సరే! మీలో ఎంతమంది ఆంటీలున్నారో, లేక 'ఆంటీ' అని పెళ్లైన ఆడవాళ్లని పిలిచేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులెత్తండి!

83 comments:

ఓ బ్రమ్మీ said...

ఒక్కా నా అర్దాంగే అనుకున్నా .. అలాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారన్నమాట. పోన్లేద్దురుఅంటీ.. మీమ్మల్ని కాకపోతే మమ్మల్నంటారా..

దేనికైనా పెట్టి పుట్టాలంటారు. మేము ఎంత ప్రయత్నించినా మమ్మల్ని ఎవ్వరూ ’అంకుల్’ అనో.. ’పెంకుల్’ అనో .. పిలుస్తారని ఎదురుచూస్తోంటే... మధ్యలో వచ్చి (తారగా.. ఈ పదాన్ని ఎలా వ్రాయాలో తెలియక వదిలేశాను) ’ఆంటీ’ అనే పిలుపుని కొట్టేసి.. పైగా ఎదో పోయినట్లు ఫోజు కొడుతున్నారే.. బాగుందండీ మీ వరస.

రవి said...

మీకు ఆంటీ అంటే ఎంత బాధో మగవాళ్ళకు అంకుల్ అంటేనూ అంతే. ఇక్కడ బెంగళూరుకు వచ్చిన కొత్తల్లో యశ్వంతపూర్ లో ఓ హాస్టల్లో ఉండే వాణ్ణి. అక్కడ నీళ్ళు వాడి జుట్టు కాస్త నెరిసింది. ఓ రోజు క్షురకర్మ కు వెళితే అక్కడ ఓ అబ్బాయి వెకిలి నవ్వు నవ్వి అన్నాడు, "ఏంటి అంకుల్, హాస్టల్లో ఉంటున్నారా? ". అప్పుడు మొదలయిన బాధ ఇప్పటికీ అలా కంటిన్యూ అవుతూనే ఉంది.

మెహెర్ said...
This comment has been removed by the author.
ravindra said...

nice narration aunty(sorry.... :) )

kasturimuralikrishna said...

ఆంటీ, అంటే, కాంటా లగా, అన్నమాట. బాగుంది.సాధారణంగా అందరూ పడే బాధని అసాధారణ రీతిలో ప్రకటించారు.తనని చూసి నవ్వుకునేవాడే నిజమయిన తెలివయిన వాడు.

nageswar said...

mee sto chalaaa bagundi aunty baby! {sorry}

Vasavi said...

Baby Sujatha garu...

Congratulations andi...final ga mee aunty pilupu nunchi konnallu ayina tappinchukunnaru :-)

Nenu kooda ade probelm face chestunannu :-( ...Just after my marriage...

Intermediate chaduvutunna pilladu kooda nannu aunty ani pilustadu...nenu valla amma ni aunty ani pilavakoodadu ata...Enta daarunam andi...

Anyways nice narration...

Chetta aunty dagga navvu aapukolekapoyanu...lage raho...

చిలమకూరు విజయమోహన్ said...

మిమ్ములనేమని సంభోదించాలో తెలియడంలేదుగానీ చాలా బాగా మీ బాధని వ్యక్తం చేశారు మమ్మల్ని కడుపుబ్బా నవ్వించారు.నా బాధ మీకు నవ్వులాటగా వుందా అని మాత్రం అనుకోకండి.

Kathi Mahesh Kumar said...

ఆంటీ/బేబీ (ఇందులో ఛాయ్స్ మీదే) సుజాతగారు, బాగుంది. ఈ ఆంటీలూ అంకుల్లగోల పెళ్ళైన మరునాటినుండే మొదలౌతాయి. భరించి, సహించి లేక ఇలా బ్లాగుల్లో తపించి సర్దుకోక తప్పదన్నమాట.

Anonymous said...

మీకు ఇంకా నయం. పెళ్లి అయిన తర్వాత బోనస్ గా వచ్చే పిలుపు అది. మమ్మల్ని పెళ్లి కాకుండానే అంకుల్ అని పిలుస్తున్నారు..

Anonymous said...

బాగా వ్రాసారు ఆంటీ !

Unknown said...

మీ బాధలు చాలా బాగా వివరించారు. :)
మా బాధలు కూడా అలాంటివే.. పదో తరగతి దాటగానే, తొమ్మిదో తరగతి పిల్లలు కూడా అంకుల్ అనేస్తారు.. :(

జ్యోతి said...
This comment has been removed by the author.
జ్యోతి said...

భలే రాసారు.నవ్వాపుకోలేకపోయాను. నేను చెప్తా వినండి. మా పైనింటివాళ్ళూ మార్వాడీస్. అరవై ఏళ్ళ అత్తగారు, నా వయసు ఉన్న కొడుకు, ముప్పైకి పైగా ఉన్న కోడలు, పదిహేనేళ్ళ మనవడు అందరు నన్ను ఆంటీ అంటారు. నవ్వాలా ఏడవాలా? అర్ధం కాదు. చెప్పినా వినరూ. వదిలేసా.

అసలు సంగతి చెప్పనా. ఆడవాళ్ళని పేరుపెట్టి సంబోధించే ధైర్యం లేక అలా ఆంటీ అని తోక తగిలిస్తారు. నా అదృష్టం బ్లాగుల్లో అన్ని వయసుల వారు అక్క అంటారు.బ్రతికిపోయా..

balasubrahmanyam.b said...

ఒక సారి మా ఇంట్లో అద్దె కు వుండే అతను నన్ను అడిగిన ప్రశ్న " ఆంటీ రాలేదా అంకుల్ మీరు ఒక్కరే వచ్చారు? ఇంకా నయం వాళ్ళ మనవరాలితో కూడా మా నాలుగేళ్ళ పాపని ఆంటీ అని పిస్తాడేమో

జాన్‌హైడ్ కనుమూరి said...

leave the feeling

wonderful writeup!
Congratulations

dhrruva said...

baby gaaru.. wonderful post !!

same to same feeeling ikkada :(

UNCLE antye maa HEART PENKU laaga paguluddhi telusaaa maa badhalu maaku unnayi.

naa age 27 years... ippatiki school pillallu vandallo UNCLE ani pilichesaru ... vaaa:((((

Anonymous said...

"ఆడాళ్లంతా వాడిని కొట్టినంత పని చేసారు. 'మేమంతా ఆంటీలా,తనేమో బేబీనా ' అని!
నేనేమో 'ఓరి దొంగ చచ్చినాడా " అనుకుంటూ లేచాను." ఇది చదువుతుంటే నవ్వాగ లేదు. సుజాతక్కా, నీ బ్లాగు సమీక్ష చేస్తే బాగుండనిపిస్తుంది.

హర్షోల్లాసం said...

నమస్కారం సుజాత గారు,
కశేపు భలేగా నవ్వించారండి బాబు,
నాకు ఇలాంటి్దే జరిగింది.naaku ee madhyane pellaiMdani cheepaanu kadamdi:)
oka saari sarukulakani spencers ki veditee
aa ammai nakanaa oka yedaadi chinnadeemoo may i help u aunty aneesimdi naaku okka sari yevarini ani chusanu vennaki tirigi oka smile icchimdi no thanks ani nenu iccha oka smile(ikkilimchanu):)
malli remdoo roju veditee adee mata nenu mohamatam leekumda am i looking like an aunty annanu sorry madam ta madam abba appatinumchi malli aa ammai alla aunty amtee vottu
prati nela yemiti inchuminchu ga rooju vidachi rooju velledanini aitee ippudu koncham alavatai nelaki saripada okee sari tecchestunnanu aitee ee madhya ma varu yemiti roju spencers ki vellatam leeda vaallu bhadapadaruu ani yekkiristaaru(ma imtiki adee deggara and sodexolu teesukumtaa ఆడ దాన్ని kada aa coupons avvagootaalani(kakurthi అనుకున్న పరవా లేదు లెండి) alaga vedutumtaanu :)
వుంటాను
నమస్తే.:)

చదువరి said...
This comment has been removed by the author.
Kranthi M said...

"ఆడాళ్లంతా వాడిని కొట్టినంత పని చేసారు. 'మేమంతా ఆంటీలా,తనేమో బేబీనా ' అని!
నేనేమో 'ఓరి దొంగ చచ్చినాడా " అనుకుంటూ లేచాను." ఇది super andi.santoor soap kooda keka.'chettanti' mee intlo chetta vadiki ichhesi maaku mee navvulni pancharu nenarlu.(ha ha haaaaaa)

Naga said...

చాలా బాగా రాసారు :-D అమెరికాలో పెద్ద వయసులో ఉన్నవారిని పేరుతో పిలువడం మొదట్లో ఇబ్బందిగా అనిపించేది, టపా చదివిన తరువాత ఈ పద్దతే బాగుందనిపిస్తుంది.

నిషిగంధ said...

:))) సుజాతాంటీ టపా అదుర్స్!

Unknown said...

పొద్దున్నే భలే నవ్వించారు!
:))

నవ్వు దాతా సుఖీభవ !

Purnima said...

super o super!! :-)

చైతన్య కృష్ణ పాటూరు said...

మీరు మరీనండి. ఆంటీని ఆంటీ అనక పాపా అంటారా ఏమిటి? మేము బ్రహ్మచారులుగానే పక్కింటి పిల్లలతో అంకుల్ అని పిలిపించుకుంటున్నాం. మీరు ఇంకా గింజుకుంటే ఎలాగండి. రాత్రే మిష్టర్ పెళ్ళాం సినిమా చూసాను, అందులో లక్ష్మీదేవిని నారదుడు నాయనమ్మా అని పిలవగానే ఉరిమి చూస్తుంది. మీ వ్యాసం చదవగానే ఆ సీనే గుర్తుకొచ్చింది. వయసైపోయిందని గుర్తుచేస్తే ఆది దంపతులకైనా కోపమే మరి. మొత్తానికి టపా అదరగొట్టారు.

Srividya said...

అదిరింది. నవ్వాపుకోలేక చచ్చా..

రాధిక said...

కొన్ని అలా జరిగిపోతాయంతే.బాధపడి ప్రయోజనం లేదు.
డోలు వచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్టుంది.దానికన్నా ఈజన్మకింతే అని సరిపెట్టుకోడం మేలు.
టపా కేక.

Unknown said...

అదేంటో ఈ మధ్య బ్లాగుల్లో కామెడీ కింగులూ, ఆంటీలూ ఎక్కువయిపోయారు.

"చెత్తాంటీ" సీను మాత్రం సూపరు.

వేణూశ్రీకాంత్ said...

హ హ సుజాత గారు భలే నవ్వించారండీ. అసలే జలుబూ దగ్గు తో అవస్థ పడుతున్నానేమో మీ టపా చదివినంత సేపు నవ్వుతూ దగ్గుతూ ఊపిరందక ఉక్కిరిబిక్కిరి అయ్యాను. సంతూర్ సోప్, చెత్తాంటీ, బావా అదుర్స్.

నిఘంటువుల సంగతేమో కాని ఆంటీ అంటే బోలెడు మర్యాద గా పిలిచినట్లు అని నేనూ కాలేజి కి వచ్చే వరకూ అనుకునే వాడ్ని. ఓ రోజు కాలేజి దగ్గర టెలిఫోన్ బూత్ అటెండెంట్ ని అలానే అంటే ఆవిడ "ఎద్దులా పెరిగావు నీకు నేను ఆంటీనేంటి" అని నిలబెట్టి కడిగేసింది అప్పట్నుండీ జాగ్రత్త పడుతూ వస్తున్నా.

GIREESH K. said...

మీ టపా చదవగానే వెళ్ళి, ఎందుకైనా మంచిదని జుట్టుకు రంగేయించుకొచ్చానండీ... ఎవ్వరూ అంకుల్ అని పిలవకుండా.. :)

కథనం అదిరిందండీ! superb!

Srinivas said...

మీ బాధని మా నవ్వుల్తో కడిగేసుకోండి.

నిజంగా ఇది తమాషా పదం. పిలిచే వాళ్ళకి సులువు, పిలిపించుకునేవాళ్ళకి బరువు. అయినా ఆ పదానికి నిఘంటు అర్థం మార్చుకుంటే సరిపోతుందేమో!

krishna said...

చాలా బాగా చెప్పారు.కడుపునొప్పి వచ్చేసింది నవ్వి నవ్వి.

Thanks.

సుజాత వేల్పూరి said...

వావ్,నిన్న పొద్దున టపా కట్టి(అదే, పెట్టి) ఇవాళ పొద్దున్నే చూస్తే ఇన్ని స్పందనలా!

చక్రవర్తి గారు,
మీకు అంకుల్ అని పిలిపించుకోవాలని అంత కోరికా! స్వాతి నంబరివ్వండి ప్లీజ్!(మీరు స్వాతి గారి చక్రవర్తి గారేగా)

ఫణీంద్ర, శివ, రవీంద్ర, నాగేశ్వర్ గార్లు,
ఎక్స్పెక్ట్ చేశా....ఇలా 'ఆంటీ ' అని కొందరైనా అటునుంచి ఎదురొస్తారని!
కానీ, నిషి..you too..

రవి, ప్రతాప్, ప్రదీప్, బాలసుబ్రహ్మణ్యం,మహేష్,ధృవ,మరియు గిరీష్ గార్లు,
మీకూ ఉన్నాయా ఈ బాధలు? స్కూలు పిల్లలతో నేను డిగ్రీలో ఉన్నప్పుడే ఆంటీ అనిపించుకున్నాను. మనకంటే పెద్ద వాళ్ళు, ముసలాళ్ళు కూడా ఆంటీ అంటె మండుతుందా, మండదా?

మురళీక్రిష్ణ గారు, జాన్ హైడ్ గారు,శ్రీవిద్య, పూర్ణిమ విజయమోహన్ గార్లు,కృష్ణుడుగారు, శ్రీనివాస్ గారు, వేణు, మరియు వేణూ శ్రీకాంత్ గార్లు..ధన్యవాదాలు!

ప్రవీణ్ గారు,
కామెడీ ఒంటికి మంచిదే కందండీ! ఎక్కువైనా పర్వాలేడు. హాయిగా నవ్వుకోవచ్చు! సమస్యలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయిగా వద్దన్నా వింటాయా? నేనూ హ్యూమరస్ గా ఎవరు రాశారా అని చూస్తుంటా! ధన్యవాదాలు!

జ్యోతి, రాధిక,హర్షోల్లాసం,వాసవి,క్రాంతి,
ఏదీ ఒక సారి గిల్లేసుకోండి మరి! క్రాంతీ, మీ ఇంటివాళ్లమ్మాయి మా ఇంటివాళ్లమ్మాయిని గుర్తుకు తేవడంతో మొదలైందీ టపా! మీకు స్పెషల్ థాంక్స్!

నాగరాజా గారు,చైతన్య కృష్ణ గారు,
మీరు చెప్పింది నిజమే! నాకేదో వయసైపోయినట్టు బాధపడటం హాస్యం కోసం రాశాను గానీ, 'ఆంటీ' అనే మాటే నచ్చదు. నేను ఇక్కడ కూడా పెద్దవాళ్ళని 'గారు ' చేర్చి పేరుతోనే పిలుస్తాను. లేని చుట్టరికాల్ని కలుపుకోవడం నాకు చిరాకు.

రావు గారు,
మీకు నచ్చిందంటే టపా హిట్టేనండీ! ధన్యవాదాలు! నా బ్లాగు వయసు నాలుగు నెలలు మాత్రమే! ఇంత త్వరగా మీ చేతిలో పడే అదృష్టమా! గ్రేటే!

మాలతి said...

మంచి విషయమే తీసుకున్నావు సుజాతా. నేను దేశంలో లేను కనక నాకు ఈబ్లాగులలో సంబోధనలు కూడా కన్ఫ్యూజనుగానే వున్నాయి. బామ్మగారులూ, అక్కలూ కనిపించినంతగా తాతగార్లూ తమ్మయ్యలూ, అన్నయ్యలూ కనిపించడంలేదు ఏంచేత :))

జ్యోతి said...

ఐతే ఈసారి ప్రమదావనంలో హాట్ సీట్‍పై సుజాతాంటీ!!

అమ్మాయిలు అందరూ వచ్చేయండి...

ఎల్లుండి ఆదివారం సాయంత్రం....

Bolloju Baba said...

చాలా బాగుంది పోష్టు.
సాయింత్రానికల్లా ఇన్ని కామెంట్లా అనుకుంటున్నారా?
అంటే ఈ టాపిక్కు బహు సార్వజనీనం అన్నమాట.

బొల్లోజు బాబా

ramya said...

సుజాత పాపం మీకష్టాలు చూస్తే జాలేసింది.
మీరు చెప్పినంతగా ( కూరగాయలవాళ్ళూ వగైరా) నన్నెవరూ అలా పిలవలా. ఇప్పుడైతే చాలా మటుకు మేడమనే అంటారు. పెళైన కొత్తల్లో పాప అనే వారు:)

నా చదువు పూర్తికాకుండానే పెళైన కారణం గా, అప్పుడింకా పాపనే:)

ఓ సారి మావారు ఉండే ఊరెళ్ళాను, పోస్ట్ మేన్‌ వచ్చి పాపా మీ నాన్నని పిలువు అన్నాడు:)
అంతే ఆ దెబ్బకి ఇద్దరం డైటింగ్ మొదలెట్టాం. నేను లావడానికి, మా వారేమో సన్నబడ్డానికి.

(అప్పుడే పుట్టిన కజిన్‌ చెల్లి, తమ్ముడికి అక్కనైన నేను:( పక్కింటి టెంత్ క్లాస్ అబ్బాయి,అతని చెల్లితో ఆంటీ అని పిలిపించుకుని మురిసి పోయా అక్కడున్నన్నాళ్ళూ(టీనేజ్ ఆంటీ నయ్యా ).

ఇప్పుడు ఆ పిల్లలు తాటిచెట్టంత ఎదిగి ఆ మధ్య కనిపించి ఆంటీ అంటుంటే ఏదోలా అనిపించింది:)

Anonymous said...

post rocks auntyyyyyyy:D...(naaku inka pelli kaaledu..so aunty ani pilavadaaniki anni vidhala arhunni anukunta...:p)

oka chinna sincere doubt. Aunty ani evarini pilavavachuno kastha vivarinchagalaraa...

maa pakkinti Auntyni(????), Aunty ante maha chedda kopam.... Bhabhiii anamani oka vandasaarlu cheppi vuntundi anukondi....Naaku ippatiki artham kaadu Aunty ante enduko anthaa badhoo??

BTW Mindspace ante Mumbai Maladenaa??

సుజాత వేల్పూరి said...

బాబా గారు
థాంక్యూ !
మాలతి గారు,
తాతయ్యా, తమ్మయ్యా అంటే మగాళ్ళు గింజుకుంటారు కదా!

రమ్య గారు,
నిజంగానా! ఎంత అదృష్టమండీ!

వంశీ,
మొత్తం చదివాక కూడా అర్థం కాలేదూ, పెళ్ళైన లేడీస్ అందర్నీ ఆంటీ అని పిలవొచ్చు!
mind space అంటే ఇక్కడ హై..లో సైబర్స్ టవర్స్ వెనక TCS పక్కన ఉండే బిల్డింగ్.

మిమ్మల్ని మీకంటే పెద్ద అమ్మాయిలు ఎవరైనా వచ్చి 'అంకుల్ ' అంటే అర్థమవుతుంది ఆ మంట, నొప్పి! హ హ హ !

Ashok Chary Maheshwaram said...

chla bagundi aunty koppada vadu nenu chala chinna vanni nenu ninnu akka annanante nenu uncle ni aipotanu
sirimalli

Anonymous said...

ఆమె: "ఏవండీ, అవిడ వయస్సు, మా అంమ వయస్సుండదూ?" ,
అతను: "ఉండచ్చు, ఏం?"
ఆమె: "నన్ను ఆంటీ అని పిలుస్తూన్నదండీ, ఆవిడ.!!!"
అతను: "ఆ?!?"

ముందుంది ముసళ్ళ పండగ,
"ఆ అమ్మమ్మ ని చూడు...",
"తాతగారు రా కన్నా, ఏడవకు.."

ఒక మంచి టపా,
బై
ఒక చెత్త ఆంటీ :)
తె.తూలిక గారి టపాలోసి.బి.రావుగారు కమెంటు పంపింది ఇక్కడికి.

దైవానిక said...

సుజాత గారు, అందరివి ఇవే కష్టాలు.. మా పక్కింటావిడ, నా అంత కూతురుంది, నన్ను అంకుల్ అని పిలుస్తుంది. నేనూరుకుంటానా, ఆవిడని ఆంటీ అని పిలుస్తా :)
మొత్తానికి మీ పోస్టుల్లో హాస్యం బాగుంటుంది.

ప్రియ said...

అహాంటీ గారు! మీ బాధ అర్ధం అయింది. నన్నూ ఈ మధ్య మా బంధువుల అమ్మాయి ఆంటీ అంది. ఎదుటి వాళ్ళేదో అన్నారని మనం బాధ పడుతుంటే మన పని చినిగి చేటంతై బ్లాగంతౌతుంది. ఎందుకీ బాధ... హాయిగా ఎవరెట్ట పిలిచినా పలికేస్తేపోలా... అదీ మనకి ఇష్టం ఉంటేనే. ఆంటీ అంటే ఉడుక్కున్నందుకు బేబీ అన్నారు. వాడేదో చేత్తంటీ అంటీ మనం కూడా చెత్తబ్బాయి అంటే సరిపోతుంది. పాపం వాళ్ళని కూడా అలాగే చాలా మంది పిలవటం చూసాను. మరి వాళ్ల బాధో? ఏయ్ రిక్షా, ఓయ్ ఆటో, ఐసబ్బాయ్, పళ్ళబ్బాయ్ ...

టేకిటీజీ ఆంటీ! సారీ మాకు వరసలు నచ్చావు కదా! మేడం.

మాలతి said...

పొద్దులో నీమూడు బ్లాగులు గుర్తించినందుకు అభినందనలు. ఎలాగైనా చేయితిరిగిన జర్నలిస్టువి కదా.
నాకు చాలా నచ్చింది పెళ్లంటే నూరేళ్లపంట. ఎందుకంటే నేను కూడా అలా అండీలకొద్దీ వంటలు చేసి వున్నాను కనక :)
పోతే ఆంటీ మాట ఎందుకులే ...

Anonymous said...

hi sujatha garu.
bavundi mee post.

Kamaraju Kusumanchi said...

మీ టపా సూపర్ ఆంటీ... I mean బేబీ సుజాత గారూ!

Seshu said...

Great Narrating...

Seshu said...

Great Narrating...

Unknown said...

సుజాత గారు సింప్లీ సూపర్బ్ పోస్ట్. ఎంత హ్యూమరస్ గా ప్రజెంట్ చేశారూ.. అర్థరాత్రి 12 గంటలకు చదువుతున్నా ఉదయం నుండి పడిన అలసట మొత్తం మీ పోస్టు చదవడం వల్ల మటుమాయమైంది. థాంక్యూ!

సుజ్జి said...

సుజాత గారు.. నేను మీ తో ఏకీబవించినా,
మొన్న మా ఇంటి ఓనరు అబ్బాయ్ , నన్ను పేరు పెట్టి పిలిచేసరికి నాకు కాలిపోయంది. వాడి వయసు తిప్పి కొడితే, నాలుగు.
ఆంటీ అంటావా లేదా అని ఒక్కటి ఇచా .
అలా ఉంటుందంది కొన్ని విషయలు

సుజ్జి said...

సుజాత గారు.. నేను మీ తో ఏకీబవించినా,
మొన్న మా ఇంటి ఓనరు అబ్బాయ్ , నన్ను పేరు పెట్టి పిలిచేసరికి నాకు కాలిపోయంది. వాడి వయసు తిప్పి కొడితే, నాలుగు.
ఆంటీ అంటావా లేదా అని ఒక్కటి ఇచా .
అలా ఉంటుందంది కొన్ని విషయలు

Unknown said...

Sujatha gaaru,

Nenu telugu blogs chadavatam ee madhya ne modalu pettanu. Annitilo meedi okati asalu aapakunda chadivisthuu unnadi andi. Mee rachana saili chaala bagundi andi.

Ee tapa aithe annitilo kanna baaga nachindi. Enka Aunty vishayam ki vasthe koncham maa friends group gurinchi cheppali ...Evari pelli jarigina vaallani - "wish you happy marriage day aunty and uncle" ani abhinandichatma maaku oka sarada..

Vasu said...

chaala bavundandi. Chetta teesukellevadi missed call and akka-bava adiraayi.

Anonymous said...

బాగుంది. పదునైన హాస్యం.

-మురళి

lakki said...

nice narration sujatha garu

మధురవాణి said...

అయ్యో.. నేను ఈ పోస్టు ఇంతకు ముందు చదవనే లేదు. మాలతి గారి పుణ్యమా అని ఇవ్వాళా చదివాను.
అదరగొట్టేసారు సుజాతాంటీ..మీరు కూడా అలాగా మధురాంటీ అనేయండి మరీ.. చాలామంది ఇలా కూడా అనుకుంటారు ;)

తృష్ణ said...

మీ టపా ,వచ్చిన వ్యాఖ్యలు రెండూ పోటీ పడ్తున్నాయి..సూపర్..బాగా రాసారు.

గీతాచార్య said...

ఓ ఇదా ప్రియ చెప్పే ఆంటీ అంకుళ్ళ ఫైటింగ్. హ్మ్. నాకూ ఆ పదమే అంత నచ్చదు. ఈ మధ్య మరీ చవక చేసేశారు.

ఆంటీ సరే. మొన్నీ మధ్య మా కాలేజ్ లో కొత్తగా వచ్చిన డిప్ స్టూడెన్టొకడు తమ్ముడూ... ఫిజిక్స్ డిపార్ట్‍మెంట్ ఎక్కడ అని అడిగేసరికి కళ్ళు తేలేసి మీసం పెంచుకున్నా (క్యాంటీన్ నుంచీ వస్తున్నప్పుడు).

గీతాచార్య said...

"ఎల్కేజీ చదువుతున్న పాపను స్కూల్లో దింపడానికి వెళితే పదేళ్ళ కొడుకుని తీసుకునొచ్చిన చిన్ని నాయన 'ఆంటీ, వేర్ కెన్ ఐ మీట్ ద ప్రిన్సిపాల్?" అనడుగుతాడా?"

LOL. బాబోయ్ నవ్వలేక చచ్చాను. It's just like you.

Praveen Mandangi said...

లాజికల్ గా ఆలోచించండి. బంధువుల్ని మాత్రమే బంధుత్వం పేరుతో పిలిస్తే సరిపోతుంది. ఎవర్ని పడితే వారిని బంధుత్వం పేరుతో పిలిసే కంఫ్యూజన్స్ వస్తాయి. అన్నకి కాబోయే భార్య వదిన అవుతుంది. నేను ఒక అమ్మాయిని ప్రేమించానని తెలియక మా తమ్ముడు ఆమెని అక్క అని పిలిస్తే ఎలా ఉంటుంది?

Praveen Mandangi said...

అదేదో సినిమాలో డైలాగ్ ఉంది "అందరినీ అక్కచెల్లెళ్ళనుకుంటే భార్య ఎలా వస్తుంది?" అని. ఆ డైలాగ్ కూడా నిజమే. పాతికేళ్ళ కొత్తగా పెళ్ళైన అమ్మాయి నుంచి డబ్బై ఏళ్ళ ముసలావిడ వరకూ అందరూ ఆంటీలైతే వరసలు మారిపోవా? ఆంటీ యొక్క తల్లిని లేదా అత్తగారిని కూడా ఆంటీ అనడం!

Dhanaraj Manmadha said...

@ప్రవీణ్ శర్మ,

"నేను ఒక అమ్మాయిని ప్రేమించానని తెలియక మా తమ్ముడు ఆమెని అక్క అని పిలిస్తే ఎలా ఉంటుంది?"

LOL. No no, ROFL.

అంటే కనిపించిన ప్రతి అమ్మాయినీ "నిన్ను మా అన్నయ్య ప్రేమిస్తున్నాడా?" అని కనుక్కుని మరీ మీ తమ్ముడు ప్రొసీడ్ అవ్వాలా?

బాబోయ్. నవ్వలేక చస్తున్నాను స్వామీ.

Still LOLOLOLOLOL.

Praveen Mandangi said...

ఒక అమ్మాయి పేరు దీపిక అనుకుందాం. ఆమెని దీపిక గారు అని పిలిస్తే సరిపోతుంది. ఆమెని అక్కా అనో ఆంటీ అనో పిలవడం అంత అవసరమా?

Malakpet Rowdy said...

పోస్ట్ బాగుందండీ బేబీ బ్లాగాంటీ గారూ!

గీతాచార్య said...

"అంటే కనిపించిన ప్రతి అమ్మాయినీ "నిన్ను మా అన్నయ్య ప్రేమిస్తున్నాడా?" అని కనుక్కుని మరీ మీ తమ్ముడు ప్రొసీడ్ అవ్వాలా?"

LOL and a quarter.

ధనా, ధనా! పోస్టే పెద్ద కామెడీ, దీనికి అన్నగారి వ్యాఖ్య ఇంకా పెద్ద కామెడీ. నువ్వూ చేరావా?

కడుపునెప్పి కాదు... laugharia (లాఫేరియా) వస్తుందేమో అందరికీ నవ్వీ, నవ్వీ...

ROFL

Unknown said...

sujathagu..........

ee athipedda bhari samasyaki voka maanchi chitka vundandi.....

mana peruki mundu manam akka ano anna ano thagilinchesukoni parichayam chesukunte siri....

for exp: sujathakka, susheelakka...radhakka...

ila manalni manam andariki introduce chesukunte chaalu...vallaki ade alavataipothundi.....

kadu kadu....manam alavatu chesukovali...thappadu.

Anonymous said...

sujatha gaaru,
chaala rojula tharvaatha manasaara navukunnanu, ee post chadivina tharvaatha, nijjanga chaala baavundi

సుజాత వేల్పూరి said...

Heart strings,
thankyu...!

swapna@kalalaprapancham said...

thega navvinchesaaru. naku baga ekkada navvu vachhindi ante "chetthaunty", "auny, chettha" ani vaadu annapudu. inka miru fullga thayaratyithe mi vaaru mimmalni gurthu pattakapodamu, inka miru lalith ki aunty anavaddu ani cheppinanduku balega "baby" ani touch ichhinaduku.

super post.

naku epudu reverse ayitundedi na age vishayamlo. kaani ninnane first time okame shock ichindi valla babutho aunty undi ani anesindi nanu chusi. ide intha varaku naku jarigina mottamadati incident. naku inka pelli kooda kaledu :(

nijaaniki ammayilaki pelli ayithe age tho sambandam lekunda evarina aunty ane pilustaru. so emi feel avvakarledu. pelli kakunda pilupinchukunte matuku konchem baadhe.

jeevani said...

chala bavundandi :))

pavan said...

chala manchi post sujatha gaaru..
first of all , nenu edo manchi comedy scene chsutunnattu baga navvanu.

ee problem nenu kuda face chesaanu,
ikkada problem enti ante, ela pilavalo artam kaadu.

kondarkini akka ani pilistaanu,
andarini akka ani pilavalemu
adi problem.

mmd said...

i am bit disappointed why i didn't view this post all these days.

Praveen Mandangi said...

మీరు కామెడీగా ఈ పోస్ట్ వ్రాసి ఉండొచ్చు కానీ నేను మాత్రం సీరియస్‌గా ఈ ఆర్టికల్ వ్రాసాను: http://praveensarma.in/blog/true-kinship-and-false-kinship/ ఇందులో కామెడీ ఉండదు కానీ ఇది చదవండి.

Lakshmi Naresh said...

అక్కా అంటే అదో గొడవ...లేదా అత్తా అనో పిన్ని అనో పిలవాలి. వాళ్ళకి అమ్మాయో అబ్బాయో ఉంటె అదో కష్టం..ఏవండి అనాలి...ఎలా పిలిస్తే ఎటు వస్తుందో తెలీక అదే మధ్యే మార్గం అని అలా కనిచ్చేస్తారు...ఇలా చెప్తే నాకో పెద్ద కథే ఉంది..ఒక ఆంటీ లా కనిపించే అమ్మాయిని ఆంటీ అని పిలిచి ఇరుక్కుపోయాం...

బాగా రాశారండి...అంకుల్ అని పిలిస్తే భుజం చెయ్యేసి మాట్లాడ్డమే..నొక్కి వదలాలి..అదే ఖర్మ దున్నపోతుల్లా ఉంది కూడా అంకుల్ అంటారు...

రామ్ said...

"అందుకని వినాయకుడు పుట్టినప్పటి నుంచి (అదేలెండి తయారైనప్పటినుంచి) .... "

రివిజన్ ఇన్ ప్రోగ్రెస్ ...


"ఓరి దొంగ చచ్చినాడా " అనుకుంటూ లేచాను.. "

ఇది హిందీ లో ఎట్లనవలెను ?

Unknown said...

https://www.facebook.com/anuradha.gutti.7/posts/248090435353965:0

ఇప్పటికీ ఈ పోస్ట్ లైవ్ గానే ఉంది సుజాత గారూ... (కాకపోతే మీ పేరు బదులు వాళ్ళ పేరు వేసుకున్నారంతే...)

సుజాత వేల్పూరి said...

సురేష్ గారూ, నిజమా? నేను ఫేస్బుక్ లో లేను. నిజంగా ఇది యధావిధిగా కాపీ చేసి ఉంటే, ఈ బ్లాగ్ పోస్ట్ లింక్ అక్కడ ఇవ్వగలరా?

ఈ మధ్య ఇదో జాడ్యం అయింది. ఎక్కడెక్కడివీ కాపీ చేసి సొంత పేరుతో వాడేయడం. అడిగితే జవాబు ఇవ్వకుండా ఉండి పోవడం

విషయం చెప్పినందుకు థాంక్యూ

Unknown said...

నిజమేనండి... ఈ పోస్ట్ లింక్ అక్కడ పెట్టి అడిగాను కూడా... నేను పెట్టిన లింక్ తీసేసింది ఆమె.

సుజాత వేల్పూరి said...

సురేష్ గారూ థాంక్యూ అండీ! అక్కడ మీరే కాదు మరో ఇద్దరు ముగ్గురు మిత్రులు ఈ లింక్ పెడితే కూడా తీసేసారట. మీరు కూడా లింక్ షేర్ చేసినందుకు మరో సారి ధన్యవాదాలు!

Krishna said...

Adbutaha. chala bagundi andi

సతీష్ కొత్తూరి said...

మీరు రాసిన నేరేషన్ కి నవ్వలేక చచ్చానండి. మా ఆవిడ ఇప్పుడీ సమస్యను ఎదుర్కొంటోంది. ఏదోరోజు ఎవరినో
కొట్టేట్టుంది. ఇది నవ్వుతూనే రాస్తున్నాను... సుజాత గారు.

vaagdevi said...

పోస్ట్ చాలా బాగుంది.మొన్నొకరోజు పిల్లల్ని స్కూల్ లో దింపి ఇంటికొస్తూ ముగ్గురు కాలేజీ అమ్మాయిల్ని దాటి ఇలా ముందుకెళ్ళానో లేదో ఆంటీ ఆంటీ అని వాళ్ళు కేకేయడం వినిపించింది. నా చున్ని కాని వెనక టైర్ లో పడిందా అని గాభరాపడుతూ గబుక్కున బండాపి వెనక్కి చూద్దునుకదా వాళ్ళు రోడ్డవతల ఎవర్నో పిలుస్తూ ఏదో చెప్తున్నారు. హతవిధీ, మైండ్ మాపింగ్ ఎంత దారుణంగా జరిగిపొయిందీ?

Post a Comment