June 4, 2010

డియర్ బాలూ..ఇదిగో నీకోలేఖ!



ప్రియమైన బాలూ,


ఏం చేస్తున్నావు? ఈ పాటికే బోలెడన్ని శుభాకాంక్షలు వచ్చేసి ఉంటాయి! ఏమిటో, నిన్ను మీరు అనాలనిపించదు మరి! నువ్వే అలా చేసుకున్నావు. గంభీరంగా ఉండవు, పండితారాధ్యుడవైనా పండితుడి భేషజాలు చూపించవు,పండితులతోనూ,పామరులతోనూ కలిసిపోగలవు....మరి నిన్ను మీరు అని గౌరవిస్తూ పదడుగుల దూరంలో నిలబడాలని ఎలా అనిపిస్తుంది?



అన్నట్లు ఎన్నో పుట్టినరోజు ఇది? ఎన్నోదైతే ఏం లే గానీ ఎప్పుడూ పాడుతూనే ఉంటాననీ అమృతాన్ని మా అందరికీ పంచుతూనే ఉంటాననీ మాటివ్వరాదూ?

అమృతం తాగినవాళ్ళు దేవతలూ దేవుళ్లైతే...నువ్వు దేవుడివే!సందేహం లేదు.


నిజానికి ఇలా నీలాంటి ప్రముఖుల పుట్టినరోజు నాడో, అవార్డులు వచ్చిన నాడో మాత్రమే వాళ్ళ గురించి తల్చుకోవడం నాకిష్టం ఉండదు. కానీ రాత్రి నీ పాటలు వింటూ ఉంటే ఇవాళ నీ పుట్టినరోజని గుర్తొచ్చింది. సరే నీకో ఉత్తరం రాయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా! అడ్రసా ..తెలీదు! రాసి పబ్లిగ్గా నా బ్లాగులో పెట్టేస్తే నువ్వు చదవకపోయినా పర్లేదు, బోల్డుమంది చదివేస్తారని పొద్దున్నే రాస్తున్నా!



అసలేంటి నీ స్వర మాధుర్యం రహస్యం చెప్పు! ఏం తింటావు? ఏం తాగుతావు? అమృతమా?(కేవలం అమృతమైతే ఆ సైజులో ఎందుకుంటావులెద్దూ)

ఏ దేవుడు ఇంతటి వరమిచ్చాడు నీకు?ఏ దేవత కరుణించింది ఇంత దయతో!



ఇక నువ్వు ఎక్కాల్సిన ఎత్తుల్లేవు! ఇంత ఎత్తుకెదిగినా "శాస్త్రీయ సంగీతం నేర్చుకోకపోవడమొక్కటే లోటు! ఇప్పటికైనా నేర్చుకుంటాను"అని చెప్పగలిగే వినయం ఎక్కడినుంచి వచ్చిందోయ్ నీకు!మన రియాలిటీ షోల్లో చూడు,పదేళ్ల పసి గుడ్లు సైతం శ్రుతులూ,నొటేషన్ల గురించి ఎంత అలవోగ్గా మాట్లాడేస్తారో?వాళ్ళను చూసైనా నేర్చుకోవూ!అంతేనా ..!జడ్జీలు మాత్రం...!పాడే పిల్లల్ని ఏడిపించి,వాళ్ళ కంట నీరు చూసి గానీ వదలరు.

వాళ్ళలా నువ్వుండవెందుకని?నీ ముఖాన చిరునవ్వు ఎప్పుడూ చెరగదెందుకని?



పాట సాహిత్యంలోని మాధుర్యాన్ని,భావాన్ని అర్థం చేసుకుని అనుభవించి ఆస్వాదిస్తూ పాడే నీలాంటి గాయకులు లేక,ప్రతి పదాన్నీ ఒత్తొత్తి పలికే ఉత్తుత్తి నారాయణుల పాలిట పడి అలమటిస్తున్నాం!వాళ్లకు తగ్గట్లే కాన్ టెంపరరీ సాహిత్యాలూ,నెట్లో దొరికే ఇంగ్లీషు విడియోల నుంచి ఎత్తేసిన బాణీలూ!



నీకు భాషంటే ప్రాణం! "శ"ని "ష"అని పలికేవాళ్ళంటే మంట!

సంగీతమంటే జీవితం!సాహిత్యమంటే ఆరాధన!



నువ్వొక లెజెండ్ వి!సంగీత సరస్వతి ముద్దు బిడ్డవి!

నువ్వు మా అందరివాడివి!


ఎవరన్నారు శాస్త్రీయ సంగీతమే గొప్పదని!

జనహృదయాన్ని గెల్చేదేదైనా గొప్పదే!



కుశలమా....నీవు కుశలమేనా అని శృంగారాన్ని పలికించినా

ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా అంటూ విషాదాన్ని ఒలికించినా


సిరిమల్లె నీవే విరిజల్లు కావే అంటూ ప్రేమను పండించినా

ఓయబ్బో ఏమి సింగారం...ఓయబ్బో లేతబంగారం అంటూ వెటకారం వడ్డించినా..


శివానీ భవానీ..అంటూ  ఎలుగెత్తి ఆలపించినా


లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను..అంటూ వినమ్రంగా లాలిత్యాన్ని వెలిగించినా



నీకు నువ్వే సాటి! నీకెవరూ లేరు పోటీ!ఎప్పటికీ!

ఇదే నిజం!నిఝంగా నిజం!



నీ మాటలు ఛలోక్తులు వింటుంటే నువ్వెవరో పరాయివాడివనిపించదు.

ఇంట్లో మనిషివనిపిస్తుంది.బాబాయో,మావయ్యో,అన్నయ్యో పక్కన కూచుని మాట్లాడుతున్నట్లనిపిస్తుంది.ఒక్కోసారి "అచ్చం మనలాగే మాట్లాడుతున్నాడే"అనిపిస్తుంది.



అందుకే నిన్ను మీరనాలనిపించదు.దూరం చేసుకున్నట్లుంది మరి!



నువ్వు భారంగా నడిచి వస్తున్నపుడు,కుర్చీలోంచి లేవడానికి ఇబ్బంది పడుతూ నీ "లావు" మీద నువ్వు జోకులేసుకుంటుంటే నాకేం నవ్వు రాదు తెలుసా!



భయమేస్తుంది.దిగులేస్తుంది. కంగారు పుడుతుంది

నీ మీద కోపం వస్తుంది. నిన్ను నాలుగు చీవాట్లేయాలనిపిస్తుంది


"అమ్మో,బాలూకేమైనా అయితే" అన్న ఊహ వణికిస్తుంది.



దానిగురించి ఏమీ చేయవా నువ్వు? అద్నాన్ సమీ చూడు!ఎలాంటివాడు ఎలా ఐపోయాడో!నువ్వు కూడా కాస్త ఒళ్ళు తగ్గించుకోరాదూ!

 నీకోసం కాదు, నీకోసం చూసే మాకోసం!



సంగీతాన్ని ఆస్వాదించి అనుభవించేవారి గుండె ఎప్పుడూ పదిలంగా ఉంటుంది.నీ గుండెకేం ఢోకా లేదు.

కానీ ఈ చిన్న సర్దుబాటుతో సమాధానపరచుకోవడం కష్టంగా ఉందోయ్! ఆలోచించుమరి!


బాలూ ఎప్పుడూ పాడుతూ ఉండాలి హాయిగా, తీయగా!


బాలూ చల్లగా ఉండాలి.

నీ పాటల లింకులేవీ ఇక్కడివ్వట్లేదు!

ఎవరు వినలేదని?ఎవరికి తెలీవని?


ఏమిటో సంగీత కారులంతా జూన్ లోనే పుట్టినట్లున్నారు..నువ్వూ,ఇళయరాజా,నేనూ...:-))

హాపీ బర్త్ డే బాలూ!

55 comments:

రాధిక said...

అవునండీ గొప్పోళ్ళందరూ జూన్లోనే పుట్టారు.నేను సంగీతకారిణి కాకపోయినా నేనూ జూన్లోనే పుట్టాను :) చూద్దాం గొప్పదాన్నైపోతానేమో.బాలూ గారి మీద మీ అభిమానం నాకర్ధం అయిపోయింది. ఎప్పుడైతే అప్పుడు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

నేస్తం said...

చాలా బాగా రాసారు.. అంత మాధుర్యం ఆయన గొంతులో ఎలా ఇమిడిపోయిందో..ఒకరా ,ఇద్దరా ఎంతమంది హీరోలకైనా వారికి అనుగుణంగా ఎలా పాడేస్తారో నాకిప్పటికి అర్ధం కాదు .. :)

నీహారిక said...

ఈ పోస్ట్ కి మాత్రం నాకు ఒక పాట పాడాలని అనిపిస్తుంది! సుజాత ఐ లవ్ యు సుజాత...ఐ లవ్ యు సుజాత ...బాలు గారి స్టైల్లో పాడేస్తున్నానని ఊహించుకోండి.మీరు జూన్ లో పుట్టినా 20 తర్వాత పుట్టారనుకున్నానే???మీలో gemini కంటే cancer
లక్షణాలు ఎక్కువగా కనపడుతున్నాయి.

HAPPY BIRTHDAY TO BALU.

వేణు said...

బాలూకి రాసిన మీరు రాసిన లేఖ సరదాగా, ఆప్యాయంగా, ఆత్మీయంగా ఉంది. అభిమానాన్నంతా అక్షరాలుగా పేర్చినట్టుంది!

‘వాళ్ళలా నువ్వుండవెందుకని? నీ ముఖాన చిరునవ్వు ఎప్పుడూ చెరగదెందుకని?’ అంటూ బాలూ విలక్షణతనూ, స్వభావాన్నీ చక్కగా ప్రతిఫలించారు.

హృదయపూర్వక అభినందనలు... పుట్టిన రోజు సందర్భంగా బాలూకీ, చక్కని టపా రాసినందుకు మీకూ!

కవిత said...

Very Happy B'day to you balu....

Sangeetha kaarulantha june lone puttaru annaru kada..adi nijame nemo...nenukuda june lone putta mari....anyhow...Happy b'day(advance/belated) to you sujatha garu and ilaya raja garu.

భావన said...

అధ్బుతం సుజాత అధ్బుతం.. అదుర్స్.. ఏంటి నా సెక్షన్ నువ్వు తీసుకున్నావు? నేను అనుకున్నా బాలు కు వుత్తరం రాయాలని కాని నువ్వే రాసేసేవు. హుం నేను అలిగేను. ఎంత బాగా రాసేవు ఎంత రాసినా తక్కువేలే ఆయనకు. నే చిన్నప్పుడూ బాలు ను పెళ్ళి చేసుకుందామనుకునే దానిని. నిజం... చిన్నప్పుడు, బాగా చిన్నప్పుడు కూడా బాలు పాటలంటె చాలా ఇష్టం, అలా రేడియో లో వస్తుంటే ఆగిఫొయే దానిని. అని అందరు ఏడిపించేవారు ఏమే బాలు ను పెళ్ళి చేసుకుంటావా పెద్దయ్యాక అని. నాకేం తెలుసు నిజమే అనుకున్నా. తరువాత చాల హర్ట్ అయ్యా పెద్దయ్యాక ఆయనకు అప్పటీకే పెళ్ళి ఐపోయిందని తెలిసి. ;-) మేము మొన్న నార్త్ కెరోలినా లో ఆయన కాన్సర్ట్ కు వెళ్ళేము. నాకు ఆయన పాటల మీద వున్న ప్రేమ తెలిసి నా స్నేహితురాలు మదర్స్ డే కు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఆ షో టికెట్స్. అందరు భయపడ్డారు షో కు వెళ్ళి గట్టీ గా అరిచి గోల గోల చేస్తానేమో అని. హి హి హి.
ఎన్ని పాటలు.. ఎన్ని పాటలు... ఆయన గొంతులో మధురిమ కు పులకరించని వేళ వుంటుందా, అ పాటల నుంచి జాలు వారే భావం పలకరించని సంధర్బం వుంటుందా.. పాటలా అవి తేనె తేటల వూటలా... మాటలా అవి పలుకు రాగ ధారలా... బాలు అన్న పేరే ఒక మధుర రాగాల స్వరధుని కి మారు పేరు...
అబ్బ ఇంక మాటలేమి చెప్పలేని ఒక అవ్యక్తానుభూతి ఆయన పాట..ఏ మాటైనా ఆ గొంతులో అలవోక గా పలికి కొత్త కులుకు ను సంతరించుకున్న కలికి. ఆయన గొంతు లో నాకు వినిపించే భావాలు.......
ఆర్ద్రతా... అది నెగడు కాచుకుంటున్న నేస్తపు పిలుపు లోని వెచ్చదనం --- నీ వుంటే వేరే కనులెందుకు నీ కంటే వేరే బతుకెందుకు....వూహు హు హు... హ హహ హా హా లాల లాల లలలాల... ...

అనురాగం.. అది గుండెల నిండుగ కొలువై గొంతు అంచులు దాటి పొర్లుతున్న నిండు సముద్రపుటల కురిసె నా ముంగిట పాట గా ..గోదరల్లే ఎన్నెట్లో గోదారల్లే ఎల్లువ గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లే...

చిలిపితనం... ఎక్కడో పుట్టిన వాగు వురికురికి నా ఇంటి ముందుకొచ్చిన గల గలలు వినాలే కాని చెప్ప తరమా ...వో కోయిలా రమ్మన్న రామచిలుకా బొమ్మ లాగ వులకదు పలకదు వో కోయిలా

ప్రణయం.... అది దివినుండి భువి కి దిగి వచ్చిన అమర భావం అలవోక గా గొంతున పలికిన వైనం -- ఏ దివి లో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెదిలిన ప్రేమ గీతమో.. నా మదిలో నీవై నిండిపోయెనే....

విరహం -- గుండె లోతుల వూట లో మాట ను ముంచి రాగ మాధుర్యాన్ని పూత పూసి దుఃఖపు చెమరింతల చినుకు గుండె మీద మెరిపించ గల మంత్రజాలం... ఎదుట నీవే ఎదలోనా నీవే ఏతు చూస్తే అటు నీవే మరుగైనా కావే....
ఇంక నేను రాయలేక పోతున్నా గుండెలోని బరువు కలానికంటీందో ఏం పాడో.. బాలు మీకు జన్మదిన శుభాకాంక్షలు...మీ గానం మనసున సదా పలికించే సరాగం, మీ స్వరం మా హృదిని మాయం చేసే ఇంద్ర జాలం.. నమస్సులతో....

ఆ.సౌమ్య said...

హ హ హ...భలే రాసారండోయ్ బాలు కి లేఖ.....చివరికి మిమ్మల్ని కూడా బాగా కలిపేసుకున్నారే, బావుంది. ఇంతకీ మీ పుట్టినరోజు ఎప్పుడో? బాలు గారు 1946 లో పుట్టారండీ. ఇప్పుడూ మీరే లెక్కేసుకోండి ఆయనకి ఇది ఎన్నో పుట్టినరోజో. నాకు ఆశ్చర్యమేసింది 60 యేళ్ళు పైబడిన "బాలు"డా ఇతడు అని.

ఆయన అఫీషియల్ వెబ్సైటు http://www.spbindia.com/

చూసి ఆనందించండి.

Ravi said...

ఒత్తొత్తి పాడే ఉత్తుత్తి నారాయణ్ లు..

హ హ :-) ఏం చెప్పారండీ....LOL

చెప్పాలంటే...... said...

ento goppagaa evaru raayani vidham gaa baalu gaari gurinchi raasaaru balu gaaru nijam gaa chadivite enta santoshapadataaro!!!

Vasu said...

beautiful.

నీ మాటలు ఛలోక్తులు వింటుంటే నువ్వెవరో పరాయివాడివనిపించదు.ఇంట్లో మనిషివనిపిస్తుంది.బాబాయో,మావయ్యో,అన్నయ్యో పక్కన కూచుని మాట్లాడుతున్నట్లనిపిస్తుంది.ఒక్కోసారి "అచ్చం మనలాగే మాట్లాడుతున్నాడే"అనిపిస్తుంది.

మీరు ఎలా రాస్తారు ఇలా. అందరికీ నేనూ ఇలాగే అనుకుంటానే అనిపించేడట్టు.

"శ"ని "ష"అని పలికేవాళ్ళంటే మంట."
ఇది మాత్రం ఒప్పుకోను. బాలు కూడా 'ష' ('ష' కి 'శ' కి మధ్యలో) అని పలుకుతారు. సుశీలమ్మ లాగా 'శ' అని పలకరు. ఎందుకో మరి.

మా బాలు కి పుట్టినరోజు శుభాకాంక్షలు

వాసు

veera murthy (satya) said...

చారిత్రాత్మక శబ్ధవిప్లవం ఆయన కంఠ స్వరం...

పాటల్లో ఎంతటి స్పష్థత ఉంటుందో ఆయన జీవన శైలిలో అంతటి స్వచ్చత ఉంటుంది.ఒక స్తాయి వచ్చిన తరువాత వల్గర్ సినిమా పాటలు పాడనని నిర్నయించుకొని,అందరి లా కాకుండా,కమర్షియల్ సినిమా కొరల్లోంచి సగం బయట పడ్డ అదృష్టవంతుడు మన బాలు గారు.

Kathi Mahesh Kumar said...

అబ్బ భలే లేఖ...
మా అందరికీ cc చేసినందుకు ధన్యవాదాలు.

శివరంజని said...

హ హ హ... బాలు పాట పాడినంత మధురంగా ఉందండీ మీ లేఖ

శేఖర్ పెద్దగోపు said...

బాగుందండీ మీ ఉత్తరం...ఆయన అరవైకి పైగా సినిమాలకు సంగీతం కూడా సమకూర్చారంటండీ..మొన్న పాడుతా తీయగా లో ఆయనే చెప్పారు...కానీ మనకు తెలిసిన సినిమాలు మాత్రం బాగా తక్కువ...

హ్యాపీ బర్త్ డే టూ బాలు గారు...

సుజాత గారూ, పార్టీ గట్రా అడిగేస్తామని భయపడి మీ పుట్టిన తేదీ చెప్పనేలేదు కదూ...అయినా సరే...మీరెప్పుడు జరుపుకుంటే అప్పుడు...మీకు కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...
నాకెందుకో ఈ రోజే మీ బర్త్ డే అని అనిపిస్తుందండీ..:-)

Ramu S said...

మొత్తానికి బాలూ ను డైటింగ్ చేయమని సలహా ఇచ్చారు!
లేఖ బాగా రాసారు
రాము

నిషిగంధ said...

సుజాతా, ఎంత ఆత్మీయంగా ఉందో నీ ఉత్తరం!!
పాటలు అంత మధురంగా పాడటం ఒక ఎత్తైతే వాటిగురించిన వివరాలన్నీ ఒక్కటీ మర్చిపోకుండా గుర్తుంచుకుని అందరితో పంచుకోవడం ఒక ఎత్తు.. అసలు ఆయన చెప్పే ఆ వివరాలకోసమే పాడుతా తీయగా చూడాలనిపిస్తుంది..

"పండితారాధ్యుడవైనా పండితుడి భేషజాలు చూపించవు,పండితులతోనూ,పామరులతోనూ కలిసిపోగలవు...."
ఇది మాత్రం అక్షరాలా నిజం.. పోయిన నెల్లో అనుకోని విధంగా ఆయన్ని కలిసినప్పుడు చాలా తక్కువ సమయం ఉన్నా ఎంత చక్కగా, సరదాగా మాట్లాడారో! తలచుకుంటుంటే ఆ అనుభూతికి ఇప్పటికీ గుండె ఉన్నట్టుండి వేగం పెంచేస్తుంది!

మరి నీక్కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు (belated or advanced) :-)


భావనా, నేనూ అదే కాన్సర్ట్ కి వచ్చాను.. multi-lingual concert అయినా చాలా చాలా ఎంజాయ్ చేశాము :-) కాకపోతే చాలా తొందరగా ముగిసిపోయినట్లు అనిపించింది :(

సుజాత వేల్పూరి said...

నీహారిక,
వామ్మో!మీకు స్టాక్ మార్కెట్ వగైరాలతో పాటు హారోస్కోపులు వగైరాలు కూడా తెలుసా? నేను 20 తర్వాతే పుట్టాను.

రాధిక,సౌమ్య,శేఖర్ పెద్దగోపు గార్లు,

నా పుట్టినరోజు 28 జూన్ ! ఆ రోజు నాతో పాటు (అంటే నాకంటే ఎన్నో దశాబ్దాల ముందు) ఒక మాజీ ప్రధానమంత్రి కూడా పుట్టారు తెలుసా! ఎవరో కనుక్కోండి!

Unknown said...

పి వీ నరసింహారావు గారు మీరు ఒకేరోజు పుట్టారా వేరు వేరు సంవత్సరాలలో


ఏప్రిల్29న తన జన్మదినం జరుపుకొనే ప్రముఖుడు ఎవరు

హింట్: ఈ మధ్యనే మొదటిసారిగా బ్లాగర్ల సమావేశానికి  కృష్ణకాంత్ ఉద్యానవనం లో  823 రూపాయలు చార్జి కట్టుకొని మరీ వెళ్ళిన వ్యక్తీ

మధురవాణి said...

ఎంత బాగా రాశారండీ సుజాత గారూ! సూపర్బ్ :-)
జూన్లో పుట్టిన ఆ గోప్పోళ్ళ లిస్టులో నేనూ ఉన్నానోచ్! అందుకే నాకు ఈ పాటలు వినే పిచ్చేమో! హీ హీ హీ ;-)
మీ పుట్టినరోజు పుట్టింది పీవీ నరసింహారావు గారు :-)

Anonymous said...

"పండితారాధ్యుడివైనా"....ఆయన ఇంటిపేరు శ్రీపండితారాధ్యుల కదూ! భలే రాశారే! ఎంతో ప్రేమతో ఆర్తితో , ఇష్టంతో రాశారనుకుంటాను.పైనెవరో అన్నట్లు ఈ లేఖను బాలూ చదివితే నిజంగా సంతోషిస్తాడు.

అన్నట్లు మీరూ సంగీతకారులేనా? ఏమిటా విశేషాలు?

సుజాత వేల్పూరి said...

నీలాంచల,
అంటే చిన్నపుడు కొన్నాళ్ళు కర్నాటక సంగీతం నేర్చుకుని అది మధ్యలో ఆపి లలిత సంగీతం వెంటబడి, దాని అంతు తేల్చి, ఆ తర్వాత పెద్దయ్యాక కీ బోర్డు కుయ్ కుయ్ మనిపించి ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకుంటున్నా సంగీతం వింటూ! అదీ నా జైత్రయాత్ర!

మాస్టర్ ఆఫ్ నన్!

Unknown said...

ఇంత వెరైటీగా కోప్పడుతూ, మరోపక్క ఇష్టంగా, హెచ్చరిస్తూ,మరో పక్క రియాలిటీ షోలకు చురకలేస్తూ....జన్మదిన శుభాకాంక్షలు ఎవరైనా చెప్పగలరా? భలే ఉంది మీ ఉత్తరం! పావురం తో పంపకూడదూ బాలూకి!

ఇకపోతే మీరు,మధురవాణి గారు,రాధిక గారు ఇంకా జూన్లో పుట్టిన గొప్పోళ్ళంతా కల్సి జూన్లో పుట్టిన గొప్పోళ్ళ సంఘం ఒకటి పెట్టాల్సిందే అయితే!

Wanderer said...

బాల గంధర్వుడి మీద మీ పోస్టు చాలా బావుంది. బాలు స్థూలకాయాన్ని చూసినప్పుడల్లా మనకందరికీ కలిగే ఆందోళనని, ఆదుర్దాని చక్కగా చెప్పారు. అదొక్కటే బెంగ బాలు విషయంలో. "వొత్తొత్తి పాడే ఉత్తుత్తి నారాయణలు" బావుంది.

రవి said...

ఓ వంద వావ్ లు.

అవును, బాలు ఓ ఫ్రెండులానే ఉంటాడు, తెలిసిన, తెలియని వారికీనూ.

పూలుగుసగుసలాడేనని,వీణవేణువైన,తొలిసారి నిన్ను చూశాను నేను, చినుకులా రాలి ..ఇలా ఓ బేద్ద లిస్టు. ఇవి వారానికోసారైనా తీరిక చేసుకుని వినకపోతే మీల్సు కూడా అంటదు నాకు.

కమల్ said...

బాగుందండి మీ లేఖ..! ఉత్తిత్తి నారాయణ హ హ హ హ ఈ పదం నేను చాన్నాళ్ళుగా వింటున్నా సినిమా ఇండస్ట్రీలో " కోట శ్రీనివాసురావు " గారు ఈ పదాన్ని కనిపెట్టారు మొదట..ఆయన ఒక జోక్ కింద తరుచుగా వాడుతూఉంటారు..! అదే పదం మీరు వాడడం యాదృచ్చకమే అయినా సందర్భానుగుణంగా బాగుంది.

Unknown said...

Many many happy returns of the day sir.......

Unknown said...

hi sir belated happy birth day and i am very lucky and happy that i am contemporary of padma sri spb sir

సుజాత వేల్పూరి said...

వ్యాఖ్యాతలందరికీ థాంక్యూలు!

భావనా, అయితే బాలూని పెళ్ళి చేసుకోవాలనుకునే వాళ్లలో నువ్వు మా అక్కకి పోటీ అన్నమాట! అదీ ఇలాగే అనుకునేదిట!అహ, తెలీక అడుగుతానూ, నువ్వు లేఖ రాస్తే బాలూ నా లేఖ మొహమైనా చూస్తాడా అంట! ఈ సారికి గమ్మున ఊర్కో!

నిన్ను కదిలిస్తే కవిత్వం ప్రవహిస్తుందని తెలుసుగా! చూడు ఎన్ని మంచి పాటల్ని ఎలా ఆల్లేశావో!

వాసూ,
సుశీల గారు "శ" ని "సె" లాగా పలుకుతారని నా అబ్జర్వేషను! బాలూ కరెక్ట్ గా పలుకుతాడని నమ్మకం! :-))

నిషి,
ఆయన అన్ని మైన్యూట్ వివరాలు గుర్తు పెట్టుకోవడం నాక్కూడా ఎంతో ఆశ్చర్యాన్ని కల్గించే విషయం! అందుకే ఝుమ్మంది నాదం సీడీలు సంపాదించా!

(సీడీ దాతా సుఖీభవ)అప్పుడప్పుడూ చూసి మురుస్తుంటాను.

Raj said...

post baavundhandi....

very first line chadavagaane.. ee post sujatha gaarena raasindhi?? balu ante ee maatram gauravam lekunda nuvvu ani sambodisthunnaaru enti anukunna... kaani rendo line chadavagaane mee bhaavam naaku ardham ayindhi...

kachitamga meeru gemini kaadhu ani decide cheyyagaligina Neharika gaariki abhinandanalu :)

Raj said...

neharika spelling tappaithe kshaminchandi....

Lalitha said...

balu garu ee lekha chadavali elagaina!!! chala baga rasaru!

Sujata M said...

kinda santakam maa andaridee pettandi sujata garu....

mee jarnalistula bhaashaloa 'baalu koa bahiranga lekha'..raasaaru.

INDIA TODAY lo oka saari (long long long ago) Rehman pratyeakamgaa enchukunea singer gaa (Maya matyeandra..) Balu gurinchi Article vachindi. I hope u have that copy !

సవ్వడి said...

సుజత గారు! మీ లేఖ అత్భుతం. బాలుని మీరు ఎంత అభిమానిస్తున్నారో నేను కూడా అంతే అభిమానిస్తున్నాను. నాకైతే నేను చెప్పాలనుకున్నవన్నీ మీరు చెప్పేసారు అనిపిస్తుంది. మా అమ్మగారు కూడా బాలు గారికి వీరాభిమానే! అతన్ని ఎప్పటికైనా కలవాలని అంటూ ఉంటుంది. ఆ చాన్స్ ఎప్పుడు వస్తుందో!
బాలు గారికి బెలేటడ్ గా.. మీకు ముందుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు.

సవ్వడి said...

మీ బ్లాగుని నేను చూస్తుంటాను కాని చివరగా చూస్తాను. అందుకే మరి కామెంట్ పెట్టను. ఈసారి లేట్ ఐనా పెట్టేటట్లు చేసారు!

bonagiri said...

ఈ టపా ఆలస్యంగా చదివాను.
నేను కూడా బాలు గారి పాటలు వింటూ పెరిగినవాడినే.
ఆయన ఎంత గొప్ప గాయకుడో అంత గొప్ప సంగీత దర్శకుడు (మయూరి మొ.).
అలాగే మంచి ఏంకరు కూడా.
నొప్పింపక, తానొవ్వక అన్నట్టు ఏంకరింగు చేయడం తెలుగులో ఆయనకే సాధ్యం.

మీలాగే నాకూ ఒక కోరిక ఉంది. కొన్ని రోజులు బాలు గారింట్లో పని చేసైనా సరే ఆయన గాత్రమాధుర్యాన్ని, కూనిరాగాలని ఆస్వాదించాలని.
ఎవరైనా బాలు గారికి చెప్తారా?

గీతాచార్య said...

Toughest people born Jun 2nd. Hehehe. Also they are late bloomers. After many failures they became legends.

Illayaraja struggled till 30 years.

Maniratnam 3-4 flops b4 becoming this gr8, and getting first success.

Steve Waugh before settling, and becomong a legend, despite the iceman tag, was considered a bits and pieces player :D

keerthana4ever@gmail.com said...

వావ్.....నాకు తెలీదు,మీరు కూడ బాలు ఫాన్ అని. మీ ప్రొఫైల్ లో మ్యూజిక్ లిస్ట్ లో ఆయన పేరు లేకపోవడం చూసి మీకు ఆయన పాటలు నచ్చవు కాబోలనుకున్నాను.ఇది చూసాక చాలా హాపీస్.

గీతాచార్య said...

The most underestimated aspect of balu is his acting prowess. Many people felt liking having a father like him after watching Kaadhalan/Premikudu.

Indeed he acted in nearly all the movies he sang. Sometimes his singing, and dubbing made those characters our own. The prime example is the character of S Benerjee in Sirivennela. Without Balu's voice in the songs, however best he might act, we can not feel like owning him.

Also, I feel singing in movies can be comparable to acting, 'cause, u have to sing according to the situations. To create such effects... I hope u can guess the rest :D

GKK said...

సుజాతగారు: like to copy వేణుగారి వ్యాఖ్య. అంత బాగుంది. 'ఒత్తొత్తి పాడే ఉత్తుత్తి నారాయణ్ లు..' my god it is very good.

@నీహారిక : మీ వ్యాఖ్యలో సమయస్పూర్తి నచ్చింది.
thank you.

సీత said...

kaadu kaadu.. june anakunda cancerians anaalemo.. balu exception kaakapothe :D

Jawahar said...

First of all -- Balu gariki HAPPY BIRTH DAY wishes. Naa train one year late gaa vachinaa... correct day ki vachindi :)

Sujatha garu - Accidental gaa chusaanu. Nice letter and equally good response from other netizens.

My Opinion -- Madhyalo Baludu daari thapparu kaani, malli konni paatlu paadanu ani sari ayina maargam loki raavatame migilina vaariki kudaa daari chupinatlu ayindi.

-- Jawahar
-- San Diego, CA
-- www.dandimarch2.org

రాజ్ కుమార్ said...

సూపర్ పోస్ట్ అండీ... చాలా లేట్ గా చదివాను.. ;(
బాలూ గారికి జన్మదిన శుభాకాంక్షలు.. (కొంచేం లేట్ గా..)

శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ said...

మీ ఆర్టికల్ బాగుంది సుజాత గారూ
బాలూ గారి అభిమానులలో నేనొకణ్ణీ, వారిపై వ్రాసిన పద్యం ఒకటి మీ అనుమతి ఉంటే ఇక్కడ వేద్దామని అనుకుంటునాను.

సుజాత వేల్పూరి said...

కామేశ్వర శర్మ గారూ, నమస్కారం! నా బ్లాగులో మీ కామెంట్స్ అడపా దడపా రాస్తున్నారు. సంతోషమండీ! మీ పద్యం తప్పకుండా ఇక్కడ రాయండి. ఈ లేఖకు అదొక అలంకారం అవుతుంది.

శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ said...

నాదమూర్తి హరుడు నాదార్ధమా యుమన్
కూడ గలిగినట్టి కొమరుడితడు
పద్మసంభవురాణి పడయచో సుతులిర్వు
రన్న నారదుడేని అనుజుడితడు
నాకగానము నాంధ్రవాకిటన్ వెలయింప
నుర్వి మైగొన్న గంధర్వుడితడు
మంజువౌ కఛ్ఛపీ మహతీ శృతులు స్వర
మంజూషమందున్న మర్త్యుడితడు

మణిత మధుకర శింజాన మధుక ఇతడు
సామ పాధోధిపైదేలు చంద్రుడితడు
గట్టువిలుకాని మెప్పించు దిట్టయితడు
వసుధ ప్రధగొన్న పుంభావ వాణియితడు

Unknown said...

chala baga rasaru.balu laga padevaru inakaevaru leru raru kukuda ade balu prathekatha

Anonymous said...

/నీకు భాషంటే ప్రాణం! "శ"ని "ష"అని పలికేవాళ్ళంటే మంట!/
ఎప్పటినుంచో!? 'షంకరా నాదశరీరా పరా ' అని ఎలుగెత్తినప్పుడు అలా పలకడం స్టైల్ అనుకునేవారేమో. :)

మిమిక్రీ పాటలకు(అల్లు, రాజబాబులను) బాలునే గొప్ప. నాకు మటుకు, తెలుగులో ఘంటసాల తరవాతే ఎవరైనా.

శ్రీ said...

సుజాత గారూ!
నేను మీ బ్లాగ్ మొదటిసారి చూస్తున్నాను..
చాలా బాగుంది మీ బాలు( మన బాలు ) అభిమానం...:-)
వ్యాఖ్యల్లో snkr గారి వ్యాఖ్య చూసి ఇలా వచ్చాను..
అన్నీ చదివాను...
వాసు గారి స్పందనకి మీ ప్రతిస్పందన చదివాను...
ఉత్తరాదిన 'శ' ని 'శ' కి 'ష' కి మధ్యగా పలుకుతారు...
మీ సౌత్ వాళ్ళు 'శివుడిని' 'సివుడంటారు' అంటారు.
ఆ ఉచ్చారణ ఆయన అందుకే చాలా కాలం నుంచి అనుసరిస్తున్నారేమో అనుకుంటున్నాను.
గమనిక: స్వాతికిరణం లో వాణీ జయరాం గారు కూడా అలాగే పాడారు శివానీ...అంటూ...
నా అభిప్రాయాన్ని ఉంచాను మీ ముందు...
ఇది ఎవరి స్పందనకూ సమాధానంగా దయచేసి తీసుకోనవద్దు.
రియాలిటీ షోల్లో ఆయన పిల్లలను వెన్ను తట్టి ప్రోత్సహించడం ఆయన సంస్కారానికి నిలువెత్తు దర్పణం.
అభినందనలు మంచి పోస్ట్....
@శ్రీ


Surabhi said...

Hello Sujatha gaaru,
Small request, Can I use this article along with your credentials to publish in a regional telugu magazine ( we are publishing this magazine on ocassion of SPB concert in US )
Please let me know. Will be waiting for your response in the comments section of this post.

సుజాత వేల్పూరి said...

Dear Surabhi garu,

You are most welcome.
By the way where are you un US!

Im living in Chicago now :-))

Surabhi said...

Dear Sujatha garu,,
Thank you for letting me use this article. Sorry, couldn't get back to you earlier. The programm is in Connecticut on Sept 30th. I live in connecticut.
( small request, please dont publish the last line about where I live )

Surabhi

Zodiac said...

సుజాత గారూ. చాలా చాలా బాగా రాసారు..! నేను బాలు గురించి తలచుకున్నప్పుడల్లా నాకు ఏం అనిపిస్తుందో..correct గా అదే రాసారు..!! ముఖ్యంగా "నిన్ను మీరు అనాలన్పించదు .. నువ్వే అలా చేసుకున్నావు మరి.." అనే వాక్యం..."లావు మీద జోకులు వేసుకున్తప్పుడు నవ్వు రాదు భయమేస్తుంది.. అమ్మో బాలుకేమన్నా అయితే... అన్న ఊహే వణికిస్తుంది..." అన్నదీ...

అన్నిటికంటే ముఖ్యం గా..
"వాళ్ళలా నువ్వెందుకు ఉండవని..? నీ ముఖాన చిరునవ్వు ఎప్పుడూ చెరగదెన్దుకని.." అన్నదీ...!!!
బాలు తెలుగు వాదు అయి పుట్టడం తెలుగు వాడు చేసుకున్న అదృష్టం... బహుశా బాలు చేసుకున్న దురదృష్టం కూడానూ .. (ఇది నా ఉద్దేశ్యం మటుకే..ఎకీభవించాలని లేదు..!)

అవును గొప్పవాళ్ళు అందరూ జూన్ లోనే పుడతారు (భవదీయుడు including.. :))

రాం చెరువు said...

అనుమతిస్తె.. ఈ మీ బ్లొగ్ పొస్ట్ ని బాలు గారికి అందజేయగలను...

రవికిరణ్ పంచాగ్నుల said...

మీ టపా చదువుతుంటే నాకు బాలుగారిదే ఓ పాట గుర్తొచ్చిందండీ.. 🙂

"ఇదే నా మొదటి ప్రేమ లేఖ | రాశాను నీకు చెప్పలేక
ఎదుటపడి మనసు తెలుపలేక | తెలుపుటకు భాష చేతకాక | "

సుజాత వేల్పూరి said...

రవి కిరణ్ గారూ, ఎప్పుడో ఎనిమిదేళ్ళ క్రితం బాలూకి రాసిన లేఖ ఇది

నా బ్లాగ్ చాలా రోజులు ఇన్వైటెడ్ రీడర్స్ మోడ్ లో ఉంచాను. ఈ మధ్య ప్లబ్లిక్ చేశాను. అందుకే ఇది బయట పడింది.

థాంక్ యూ

Post a Comment