August 2, 2010

టీచరమ్మ మొగుడు

నేను మూడో క్లాసు చదువుతున్నపుడు ఆ క్లాసుకు అన్ని సబ్జెక్టులూ చెప్తూ క్లాస్ టీచర్ గా శ్రీమతి శ్రద్ధా దేవి ఉండేవారు.అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు పాఠం చెప్పడమే కాక మాతో బోలెడన్ని ఆటలు ఆడి,వీలైతే హోమ్ వర్క్ కూడా స్కూల్లోనే చేయించేసి,"ఇంటికిపోయి హాయిగా ఆడుకోని తిని పడుకొండి"అని భరోసా ఇచ్చేది ఆమె.అందుకని ఆమె అంటే భలే ప్రాణంగా ఉండేది మాకు.ఒక్కరోజు కూడా స్కూలు ఎగ్గొట్టకూడదని తపించేంతగా! సన్నగా తెల్లగా, పెద్ద జడతో(అంటే జడకాదు తెల్లగా ఉండేది),జడలో ఎర్రని గులాబీతో, ఇస్త్రీ చేసిన లేతరంగు కాటన్ చీరెల్లో మెరుపుతీగలా ఉండేది ఆమె.




ఒకరోజు మధ్యాహ్నం లంచ్ టైమ్ లో నల్లగా లావుగా ఉండే ఒకాయన వచ్చి చెట్టు కింద ఆడుకుంటున్న మమ్మల్ని "శ్రద్ధా టీచరుందా" అనడిగాడు.

అంతలో ఆమె చిరునవ్వుతో ఆయన వద్దకు ఎదురెళ్ళి కాసేపు మాట్లాడి పంపేసింది. తర్వాత తెలిసింది ఆయన టీచర్ గారి భర్త అని!

గొప్ప షాక్ తగిలింది.

టీచర్ గారికి మొగుడేంటి అని తెల్లబోయాము!  ఎందుకంటే అప్పటిదాకా అసలు టీచర్ గారికి భర్త పిల్లలు,వంటివి ఉండొచ్చని మాకు తట్టలేదు.పైగా టీచర్ గారికి ఆయన తగిన మొగుడుగా అనిపించలేదు.

తర్వాత ఆయన ఎప్పుడు స్కూలుకొచ్చినా చూడలేక కుమిలిపోయేవాళ్ళం! ఆయన రాగానే ఇంత అందమైన టీచరమ్మ పరుగెత్తుకుంటూ వెళ్ళడం నచ్చేది కాదు!పెద్ద పొసెసివ్ నెస్ తో రగిలిపోయేవాళ్లం!ఆయనకు వేరే వూరు ట్రాన్స్ ఫర్ అయిపోవాలని కోరుకునేవాళ్ళం!



కానీ అలా జరగలేదు..పైగా వాళ్ళు స్కూలుకు దగ్గర్లోనే ఇల్లు కట్టుకుని సెటిల్ కావడంతో ఆయన రోజూ స్కూలు ముందునుంచే పదిసార్లు తిరుగుతూ కనపడేవాడు.


తర్వాత హైస్కూల్లో తెలుగు మేడమ్ అవివాహిత. తల్లితో కల్సి ఉండేది.ఎప్పుడూ మాకు బోలెడన్ని పుస్తకాలు ఇస్తూ, మమ్మల్ని వ్యాసరచన పోటీలకు ప్రిపేర్ చేస్తూ ఎక్కడా ఎవరికీ బహుమతులు రాకుండా మా స్కూలుకే అన్నీ వచ్చేలా ఎంతో కృషి చేస్తుండేది.

ఒక ఫ్రెండ్ లా మాతో కల్సిపోయి పాటలు కూడా పాడుతుండేది.మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళి టిఫిన్లు పెట్టేది. ఒకరోజు పిడుగులాంటివార్త తెల్సింది!

ఆమెకు పెళ్లి కుదిరిందని!

ఇక మేము ఎంతగా ఏడ్చామంటే ఆమె పెళ్ళి ఆగాలని ఎంతో కోరుకున్నాం గానీ ఈసారి కూడా అలా జరగలేదు.పెళ్ళి అయిపోయింది.ఈ సారి పెళ్ళికొడుకు అందంగా ఉన్నా మాకు నచ్చలేదు. "ఏడిసినట్టున్నాడు"అని తిట్టుకున్నాం.అసలు టీచర్లకు పెళ్ళి పెటాకులేమిటని విసుక్కున్నాం!

మాకు లెక్కలు,పీ ఎస్ చెప్పడానికి మగపిల్లల హైస్కూలు నుంచి ఒక మాస్టార్ని  డెప్యుటేషన్ మీద పంపారు.ఆయన చలవతో లెక్కలంటే భయం పోయింది.అంత బాగా చెప్పేవారు. ఖాళీ పీరియడ్లు ఉంటే స్టాఫ్ రూములో కూచోకుండా క్లాసుకు వచ్చి ఎక్ స్ట్రా క్లాసులు తీసుకునేవారు. అలాంటిది మా స్కూల్ డే రోజు మాత్రం ఆయన్ని చూస్తే "ఈయనెవరో మాకు తెలీ"దనిపించింది.

అప్పటివరకూ ఆయనకోభార్య ఉంటుందని తల్చుకోని కూడా తల్చుకోని మేము ఆయన ఏకంగా ఒక పిల్లను నడిపించుకుంటూ మరో పిల్లనో పిల్లాడినో ఎత్తుకుని వాళ్ళకు డ్రింకులూ అవీ ఇవ్వడం,కర్చీఫ్ తో వాళ్ళ ముక్కులూ మూతులూ తుడవడం,ఒకట్లకీ రెండ్లకీ బాత్ రూములకేసి తీసుకెళ్లడం వంటి "సామాన్యమైన పనులు " చేస్తుంటే తెల్లబోయాం.మా "ఐడియల్ హి"  అసలు స్వరూపం ఇదా అనిపించింది.ఆయన్ని మాస్టారు పాత్రలో తప్ప ఇలా మొగుడు,తండ్రి పాత్రల్లో  ఊహించుకోకపోడం వల్ల ఆయన సంసార తాపత్రయం చూస్తుంటే చీదర పుట్టింది. టీచర్లూ,మాస్టార్లు పెళ్ళి చేసుకోకుండా ఉంటే బావుంటుందనిపించింది.


ప్రతి విద్యార్థి దశలోనూ టీచర్లు మన సొంతం అనే ఫీలింగ్ ప్రతొక్కరికీ ఉంటుందేమో!వాళ్ళకంటూ పర్సనల్ లైఫ్,పిల్లలు, సంసారం ఉంటాయని తోచదెందుకో! చాసో రాసిన ఒక కథలో(రథ యాత్ర అనుకుంటాను) తిరణాలకు పెళ్ళాం పిల్లల్తో వచ్చిన మాష్టారిని చూసి విస్తుపోతాడు ఆరేళ్లకుర్రాడు."మాష్టారికీ పెళ్ళాముంటుందా"అని ఆశ్చర్యపోతాడు.



 రెండో క్లాసు చదూతున్న మా   పాపాయి నిన్న స్కూలు నుంచి వస్తూనే"ఇవాళ మా విద్యా మేమ్ హజ్బెండ్ వచ్చారు స్కూలుకు"అంది సంభ్రమంగా! "ఏం వస్తే?" అనడిగితే కొంచెం సిగ్గుపడి కాసేపు నానుస్తూ "మరేంటంటే...విద్యా మేమ్‌కి హజ్బెండ్ ఉంటాడని మేమెవరమూ అనుకోలేదు" అంది.



తర్వాత లోపలికెళుతూ వెనక్కి చూసి"ప్చ్,ఆయనసలేం బాలేదు. మా మేడమే బాగున్నారు"అని నిరాశపడుతూ వెళ్ళిపోయింది.

దానితో ఇదంతా గుర్తొచ్చింది! :-))

48 comments:

Ravi said...

తరాలు మారినా అభిప్రాయాలు మారలేదన్న మాట.:) :) లేదంటే మీ చిన్నప్పటి లక్షణాలు మీ పాపకు అలాగే వంటపట్టినట్లున్నాయి.

Ram Krish Reddy Kotla said...

హ హ హ...చాలా బాగా వ్రాసారు సుజాత గారు.. నిజమే చిన్నప్పుడు టీచర్లకు కూడా ఒక లైఫ్,పెళ్లి,పెళ్ళాం ఉంటుందని తోచదు వెంటనే...అలా పెళ్ళాంతోనో మొగుడితోనో టీచర్ని చూసినప్పుడు ఏదో కొత్తగా ఒక ఏలియన్ చూసిన ఫీలింగ్..నేను చిన్నప్పుడు ఓ రోజు మా సార్ తో ఒక లేడీని బజారులో చూసి, ఇంటికి వచ్చి తెగ ఆలోచించాను..ఆవిడ ఎవరయి ఉంటుందని..చెల్లా? వదినా? అక్కా?...అని ఒక రెండు రోజులు బుర్ర బద్దలు కొట్టుకున్నాను కానీ..ఆవిడ మా సార్ ఆవిడ అని అసలు థాట్ కూడా రాలేదేమిటో.. :)

KumarN said...

:-)
Hmm
ఈ ఐడియల్ హి ల గొడవ అమ్మాయిలకి ఉంటుందనుకుంటా..అందుకే కాబోలు "రాజును చూసిన కళ్ళతో, మొగుణ్ణి చూస్తే" అనే సామెత పుట్టింది.

వేణు said...

భలే ఆసక్తికరమైన పాయింట్..!
ఐడియల్ హీ/ఐడియల్ షీ అందరిలాగే ‘సామాన్యమైన పనులు’ చేస్తారని నమ్మటం నాక్కూడా కష్టంగానే ఉండేది, మొన్నమొన్నటివరకూ!

>> ఈ సారి పెళ్ళికొడుకు అందంగా ఉన్నా మాకు నచ్చలేదు. "ఏడిసినట్టున్నాడు"అని తిట్టుకున్నాం. అసలు టీచర్లకు పెళ్ళి పెటాకులేమిటని విసుక్కున్నాం!:)

కొత్త తరం పిల్లలు కూడా టీచర్ల గురించి సరిగ్గా అదే రకంగా ఆలోచించటం విశేషమే!

హరేఫల said...

చాలా బావుంది.

సుజాత వేల్పూరి said...

రవిచంద్ర,

మీ మొదటి పాయింటే కరెక్టు! సంకీర్తనతో పాటు తన ఫ్రెండ్స్ కూడా టీచరమ్మకు వాళ్ళాయన ఉంటాడని ఊహించలేదట. టీచర్ల గురించి చిన్నప్పుడు అంతా ఇలాగే అనుకుంటారేమో!

Anonymous said...

నాకైతే ఒక కథ చదువుతున్నట్లనిపించింది. ఇంత మంచి పాయింట్ ని బ్లాగ్ పోస్టుతో సరిపెట్టారా? ఇలాంటి భావాలు నాక్కూడా ఉండేవి. మా లెక్కల టీచర్ వాళ్ళింటికి వెళ్ళినపుడు ఆవిడ బట్టలారేస్తుంటే చూసి "ఆఖరుకు గాయత్రీ టీచర్ కూడా బట్టలుతుకుతారా"అనుకున్నాను. బట్టలు ఎవరైనా ఉతుక్కుంటారనే అయిడియా రాలేదు! :-))

శేఖర్ పెద్దగోపు said...

హా..హా..
మాకు కూడా ఇలానే అనిపించేది...మా ఎన్.ఎస్ టీచర్ చాలా చక్కగా, ఆకట్టుకునే రూపంలో, ఇంట్రరెస్టింగా చెబుతూ ఉంటారు..ఓ సారి ఆవిడ ఇన్విజిలేషన్ చేస్తుంటే ఎవరో ఒక ఒకాయన చీకేసిన తాటి టేంకలాంటి నెరిసిన జుట్టు వేసుకుని వచ్చాడు...ఆయన టీచర్ భర్త అని తెలిసి చాలా ఫీలయిపోయాం మేమందరం...

మొత్తానికి థర్డ్ జనరేషన్ అమ్మాయి సంకీర్తనకు కూడా ఈ అనుభవం ఎదుర్కోక తప్పలేదన్నమాట.. :)

నేస్తం said...

భలే పోయింట్ మీద రాసారు..నిజమే కదా అలాగే అనుకుంటాము చాలామంది

..nagarjuna.. said...

హ్హ హ్హ హ....

యథారాజా తథాప్రజా..

krishna said...

చాలా బాగా రాసారు అండి! అబ్బ ఇలాంటి టాపిక్కులని( అందరి జీవితం లో జరిగిన అని అర్ధం ) ఇంత బాగా , ఇంత సులువుగా ఎలా రాయగలరు! నేను ఒక టాపిక్ మీద గత వారం రోజులగా ఎలా రాయాలా అని కొట్టుకు చస్తున్నాను.


అన్నట్టు నాకు మా తాతగారి అవసాన దశలో జరిగిన ఒక సంగతి గుర్తుకు వచ్చింది ఈ టపా చదివితే! ఆయన దగ్గరకి నన్ను మా మామయ్య తీసుకు వెళ్లి చూడండి ఎవరు వచ్చారో ? అంటే ఆయన పాపం పోల్చుకోలేక పోయారు. ఎవరబ్బాయివి రా నువ్వు అని అడిగితే.. ఏమి చెప్పాలో తెలియక మా అమ్మకి కొడుకుని అన్నాను :)

అప్పటి వరకు అమ్మకి ఒక పేరు వుంటుంది అని కూడా తెలియదు నాకు :)

సుజాత వేల్పూరి said...

రామకృష్ణా రెడ్డి గారూ,బాగా చెప్పారు!

ఆవిడ మా సార్ ఆవిడ అని అసలు థాట్ కూడా రాలేదేమిటో.. :)....అదే ఈ టపా ఎస్సెన్స్!

కుమార్!

ఆడైనా మగైనా ఇద్దరికీ "ఐడియల్ హి" "ఐడియల్ షి "అంటూ ఉంటారుగా!అబ్బ, మీ సామెత మరీ అన్యాయమండీ బాబూ!

వేణు గారూ,అవును, మనం ఆరాధించే వాళ్ళు "సామాన్యమైన పనులు" చేయడం దుస్సహంగానే ఉంటుంది.

ఒకసారి మా టీచర్ వాళ్ళింటికి వెళ్ళినపుడు ఆవిడ కూరలు తరగడం చూసి నిరాశపడ్డాను.

సుజాత వేల్పూరి said...

ఫణిబాబు గారు,
థాంక్యూ!

శేఖర్,
కొన్ని జెన్యూన్ భావాలు తరాలు మారినా మారకుండా ఉండిపోతాయనుకుంటాను.ముఖ్యంగా బాల్యంలో అందరమూ ఒకేరకంగా ఆలోచిస్తామేమో కదా!

సౌమ్య,

అవును, టీచర్లకు పెట్ గా ఉండటంలో ఒక గొప్పతనం ఉంటుంది. విద్యార్థులుగా ఉన్నపుడు ఆ గొప్పను అనుభవించడం లో ఒక కిక్ ఉంటుంది.

నేస్తం,
థాంక్యూ!

నాగార్జున గారూ,
like mother like daughter అన్నారా?

సుజాత వేల్పూరి said...

కృష్ణ గారూ,థాంక్యూ!

మీరు అలవోగ్గా రాసేస్తారని నాకు తెలుసులెండి!:-))

"అమ్మ" కు పేరు ఉండదనుకోవడం అనే పాయింట్ చాలా స్వీట్ గా ఉంది.

kiranpriya said...

అప్పుడపుడూ జీవితంలో ఇలాంటి మధుర జ్ఞాపకాల పుటలను తిరగేస్తూ ఉండాలి. అప్పుడే వర్తమానం కూడా అందంగా కనపడుతుంది.

టీచర్ల పిల్లల మీద నాక్కూడా అసూయగానే ఉండేది. లంచ్ టైములో వాళ్ళు ఎంచక్కా అమ్మల దగ్గరకు వెళ్ళి తినడం మా అబ్బాయిలందరికీ దుర్భరంగా ఉండేది.

టీచర్ల భర్తలు,మాష్టార్ల భార్యలు ఎలా ఉంటారో చూడాలనే ఉబలాటం మాకు చాలానే ఉండేది.

జయ said...

నాకసలు 'టీచర్లు-పెళ్ళిళ్ళూ' అనే టాపిక్ తో సంబంధమేలేదు. వాళ్ళంతా 'సిస్టరమ్మలే':) ఆ టెన్షన్ మాధుర్యమే తెలియకుండా గడిచిపోయింది.నాకు ఈ అనుభవం లేదే అని మీ టీచరమ్మగారిని చదువుతున్నాకొద్దీ ఇప్పుడు నాకు చాలా దిగులేస్తుంది. కుళ్ళుబుద్ధి కూడా వచ్చేస్తోంది.

durgeswara said...

ఇలాంటి భావనమాకెప్పుడు కలగలేదుగాని .చిన్నపిల్లలకు తల్లిమీద సంపూర్న అధికారం మాదే అనేభావన ఉంటుంది .ఆతరువాత స్థానమైన గురువులపట్ల కూడా ఇదే భావం ఉంటుందని అర్ధమవుతుంది మీ రచనచూస్తుంటే.

సుజాత వేల్పూరి said...

కిరణ్ ప్రియ గారు,
థాంక్యూ!

జయ గారూ,మీరు మిషన్ స్కూల్లో చదివారన్న మాట అయితే! అయితే మీరు చాలా చాలా మిస్ అయినట్లే! కాకపోతే క్రమశిక్షణ ఎక్కువే అంటారి మరి అక్కడ! మీరే చెప్పాలి.

థాంక్యూ!

దుర్గేశ్వర గారూ,
నా టపాలోని ముఖ్యమైన పాయింట్ మీరు చటుక్కున పట్టేశారు.

Unknown said...

సుజాత గారు మీరు కూడా శ్రద్దా దేవి లాగే వుంటారు .
మరి వారు ?ఏమో యి పోస్టింగ్ లో దానికి భిన్నం గా
. వుంటారనే అనుకుంటున్నా అంటే మీరు రాసింది
టీచర్స్ కే వర్తిస్తుందని అనుకోవాలి .
అది కాక బ్లాగర్స్ అంతా బానే వుంటారు (వుహలకే పరిమితం కదా ) )----

Vasu said...

నిన్న ఈనాడు ..ఈనాడు రేపు.
కొని బంధాలు మాత్రము ఎన్నడు మారవు :)

బావుంది.

సుజాత వేల్పూరి said...

రవి గారూ,
నేను మరీ శ్రద్ధా దేవి లా ఉంటానంటే నమ్మను లెండి! వాసు కూడా శ్రద్ధా టీచర్ వాళ్ళాయన్లా ఉండడు. నా ఆర్కుట్ లో కొన్ని ఫొటోలున్నాయి చూడండి వీలైతే!

వాసు గారూ,
కొన్ని బంధాలు అలా ఎప్పటికీ మారకుండా ఉంటేనే బావుంటాయి కదూ!

సుభగ said...

దాదాపుగా అందరు పిల్లలు ఇలాగే అనుకునేవాళ్ళేమో. ఇదంతా మీరు ఏ తరగతి లో ఉన్నప్పుడు జరిగిందో తెలియదు కాని మేము ఆరో తరగతి లో ఉన్నప్పుడు (అంత పెద్దయ్యాక కూడా) మాకెంతో ఇష్టమైన ప్రీతి మేడం పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే మాకేదో ద్రోహం చేసినట్టు ఫీల్ అయ్యి ఆవిడతో తర్వాత చాలా రోజులు మాట్లాడలేదు నేను :-)

సుజాత వేల్పూరి said...

వేణు గారూ,
నేనూ నిన్ననే గమనించాను. వందో పోస్టుకు లక్ష హిట్లు దాటటం తమాషాగా అనిపించింది. అభిననందనలను థాంక్యూలు!

సుభగ గారూ,అవును, టీచర్ల మీద ఆ పొసెసివ్ నెస్ పిల్లలందరికీ ఉంటుందనుకుంటాను!
శ్రద్ధా టీచర్ మూడో క్లాసులోనూ, తెలుగు టీచరూ, లెక్కల మాష్టారేమో ఎనిమిదో క్లాసులోనూ మాకు ద్రోహం చేశారండీ!:-))

శ్రీనివాస్ said...

నాకు కూడా మా శరత్ బాబు మాష్టర్ గారు ఐడియల్ .. పెద్దయ్యాక నేను ఈయన లాగానే సఫారీ డ్రెస్ వేసుకుని హుందాగా నడుస్తూ తిరగాలని అనుకునే వాడిని.. కానీ ఆయనిప్పుడు పూర్తిగా బాబాసేవలో సాయినాధుని శరత్ బాబూజీ అనే పేరుతో ఉన్నారని తెల్సింది :) నా డెస్టినీ ఏంటో మరి :)

సుజాత వేల్పూరి said...

శ్రీనివాస్,
మీకో ఇంటెరెస్టింగ్ న్యూస్ చెప్పనా? శరత్ బాబూజీ భరద్వాజ మాస్టారి మరదలినే(అలివేలు మంగమ్మ గారి చెల్లెలినే)వివాహం చేసుకుని షిరిడీలో సాయిపథం ఆశ్రమం అనే నిర్మించుకుని అక్కడ ఉన్నారు చాలా రోజులు. ఇప్పుడు అక్కడ లేరట. ఆయన్ని ఎప్పుడూ చూడలేదు కానీ ఆయన రాసిన పుస్తకాలు మాత్రం అద్భుతంగా ఉంటాయని మాత్రం చెప్పగలను. అవి చదివాను నేను.ఆయన మీ ఐడియల్ అయితే మంచిదే!అలాంటి జీవితం అందరికీ లభిస్తుందా?

కొంపదీసి ఇవన్నీ మీకు ముందే తెలుసా?:-))

తార said...

శరత్ బాబు గారు అంటే నేను ఎవరో అనుకున్నాను..
అవును మీకు అంత చిన్నప్పటి విషయాలు ఎలా గుర్తున్నాయండి??
మీరు ఈ టపా రాసాక నేను ఎప్పుడైనా అలా అలోచించానా అని తల బాదుకున్నా ఒక్కటీ గుర్తుకు రాలేదు..

Malakpet Rowdy said...

శరత్ బాబూజీ భరద్వాజ మాస్టారి మరదలినే
_______________________________

మా మరదల్ని శరత్ పెళ్ళి చేసుకోవడమేంటి?

Anonymous said...

వి.బి.సౌమ్యగారి బ్లాగు చాలా కాలం క్రితమే లక్షహిట్లు దాటిందని జ్ఞాపకం. అలాగే కత్తి మహేష్ గారి పర్ణశాల కూడా. కలగూరగంప బ్లాగు 1,14,000 హిట్ల దాకా వచ్చాక ఆ రచయిత ఎందుకనో స్టాట్ కౌంటర్ తీసేసారు.

ఆ.సౌమ్య said...

ఓహ్ మీ వందో పోస్ట్ అన్న సంగతే మరచిపోయానండి....congratulations!

Raj said...

All the while when I was reading the post I wondered... How come Mrs. Sujata is feeling bad for their teacher's spouse... At the end I understood that its Possessiveness. We(at least I) in the class never had that Possessiveness towards teachers... We always cared for the children of our teachers, when they came to school...

But we had this "Ideal He/She" concept.. I liked my Maths sir a lot... Out of my interest towards Maths as first point and the way he solves the problem as second point... None of our classmates dared to pose a question to him... They always used to come to me for the solutions.... This way sir liked me a lot too... I was always in his good books...


Another incident I can recall is... My Mother and Father are also school teachers... We(Me and My Brother) used to go to their schools at times. The astonishment in the faces of the school children confused me for the first time when I went to my Mom's school.. Later when I asked my Mom about that.. she told me that the Children never expected that she had that big child(This happened when I was in intermediate). Children thought that we would be of the age of fifth or sixth... This shows how they thought of my Mom.. Of course they love her a lot... They used to come to my home also at times.. watch some movie.. take some snacks.. sit and sing for some time.. collect flowers for the small small plants that we have in our lawn etc...

We enjoyed their company.. Such an innocent children

సుజాత వేల్పూరి said...

@తార,
అవును మీకు అంత చిన్నప్పటి విషయాలు ఎలా గుర్తున్నాయండి??....

నాకు మెమొరీ కొంచెం ఎక్కువ! అదీకాక పాత విషయాలను మర్చిపోకుండా తల్చుకుంటూ ఉండటం రెఫ్రెషింగ్ ఫీలింగ్ ని ఇస్తుంది నాకు. మా పాప బాల్యంతో నా బాల్యాన్ని ఐడెంటిఫై చేసి చూసుకోవడం మరో సరదా!

మలక్పేట్ రౌడీ!
:-))
పాపం, మీ ఇద్దరికంటే వాళ్ళిద్దరూ పూర్తిగా భిన్నమండీ!

ఓబుల్ రెడ్డి గారూ,
అవునండీ, ఇంతకుముందే కొంతమంది బ్లాగులు లక్ష హిట్లు దాటాయి.

రాజేంద్ర,
పొసెసివ్ నెస్ ఒక్కటే కాదు, రోజూ కనపడే టీచర్లకు కూడా "కుటుంబ బంధాలు"ఉంటాయి అని ఆ చిన్న వయసులో తట్టకపోవడం అనేది కూడా ఇక్కడ పాయింట్. మీ అమ్మానాన్నగార్లు టీచర్లు అంటున్నారు కదా, ఈ పాయింట్ మీకు అనుభవం లోకి వచ్చి ఉండదు. మా అత్తామామగార్లు కూడా టీచర్లే!అందుకే మా వారికి ఈ పాయింట్ అర్థం కాలేదు."టీచర్లైతే వాళ్ళకి ఫామిలీలూ ఉండవా ఏంటి"అని ప్రశ్నలు వేశారు ఇది చదివి.

krishna said...

శరత్ బాబూజీ భరద్వాజ మాస్టారి మరదలినే
_______________________________

మా మరదల్ని శరత్ పెళ్ళి చేసుకోవడమేంటి?

దీని బట్టి తెలిసొచ్చే నిజం ఏమిటి అంటే శరత్ గారి బావ మరెవరో కాదు, మలక్కే :):):)

భావన said...

గొప్పోరే మంచి పాయింట్ మీద రాసేరు. నాకెప్పుడు చిన్నప్పుడు అనిపించలా మా ఇంటి పైన ఒక మాస్టారు వాళ్ళు వుండే వారు అందుమూలం గానేమో. వందో పోస్ట్ లక్షో హిట్ దాటినందుకు కంగ్రాచ్యులేషన్స్ సుజాత.

సుజాత వేల్పూరి said...

Oh,krishna,,

అటునుంచి వచ్చారా? :-))

Siri said...

chala bagundandi sujata garu,

Raj said...

@Mrs. Sujatha,

Might be true...

వేణూశ్రీకాంత్ said...

భలే టాపిక్కులు దొరుకుతాయండీ మీకు :-) మాంచి అబ్సర్వేషన్... నిజమే టీచర్లకి ఫ్యామిలి గురించి ఆలోచించడానికి మనసొప్పేది కాదు చిన్నపుడు. నూరు టపాలు, లక్ష హిట్లు దాటినందుకు అభినందనలు.

మాలా కుమార్ said...

బాగా రాశారండి . లక్ష హిట్లు , వంద టపాలకు అభినందనలండి .

కొత్త పాళీ said...

నిజమే. :)

Sky said...

ఇడియల్ షీ- చంపేశారండీ బాబు... నాకు మా ఇంగ్లీష్ టీచర్ గుర్తొస్తున్నారు. నేను పదవతరగతిలో ఉన్నప్పుడు ఆవిడ మా స్కూల్ లో జాయన్ అయ్యారు- అప్పటికింకా పెళ్ళి కాలేదు. కాటన్ చీర, పేద్ద జడలో గులాబీ పువ్వు, అది కనపడని రోజున మేము మధ్యాహ్నం లంచ్ కి ఇంటికెళ్ళి ఇంటి పెరట్లోనుండీ కోసుకెళ్ళి ఇచ్చిన రోజులూ అన్నీ గుర్తొస్తున్నాయి. ఓ రోజు ఆవిడ తన పెళ్ళి కుదిరిందని చెప్పటం, జీవితంలో సర్వస్వం మేమేకాదు ఆవిడ కూడా కోల్పోతోంది అన్న భావన అన్నీ గుర్తొస్తున్నాయి.

ఈ సారి పెళ్ళికొడుకు అందంగా ఉన్నా మాకు నచ్చలేదు. "ఏడిసినట్టున్నాడు"అని తిట్టుకున్నాం. అసలు టీచర్లకు పెళ్ళి పెటాకులేమిటని విసుక్కున్నాం! అక్షరాలా నిజం.

అడ్డ గాడిద (The Ass) said...

LOL. Well written

రుక్మిణిదేవి said...

సుజాతగారూ,టీచరమ్మకి మొగుడేంటి....బాగుందండీ...........అందుకే కాబోలు మా స్టూడెంట్స్ "మేడమ్,,మీకు పెళ్ళి ఐందా? మీకు పిల్లలు ఎంతమందీ? ఇలాంటి ప్రశ్నలూ,,, పిల్లలు వున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తారు,,ఎలా వుంటారు,ఏం చదువుతారు,,ఇత్యాది ఫ్రశ్నలు,,,,,,,,,అర్ధమవుతుంది వాళ్ళ ఫీలింగ్స్....చాలా క్లియర్గా తెలుస్తుంది........అసూయలాంటి లేదా అంతకన్నా ఎక్కువ ఫీలింగ్..........మా టీచర్ మాదే............. అన్న ఫీలింగ్...................... ఒక రోజ్ ఫ్లవర్ ఇచ్చి సంతోషపెట్టాలని,, చాక్లెట్ కూడా వాళ్ళు తినకుండా తమకు ప్రియమైన టీచరుకు అందరికంటే ముందు తామే ఇవ్వాలని,,,,,,,,,,ఏం చెప్పను?///////////// ఎ వెరీ వండర్ ఫుల్ ఫీలింగ్స్............... హట్సాఫ్ మై డియర్ చిల్డ్రన్..........వాళ్ళ ప్రేమకి ఏం ఇవ్వగలము బదులుగా....

రుక్మిణిదేవి said...

సుజాతగారూ,టీచరమ్మకి మొగుడేంటి....బాగుందండీ...........అందుకే కాబోలు మా స్టూడెంట్స్ "మేడమ్,,మీకు పెళ్ళి ఐందా? మీకు పిల్లలు ఎంతమందీ? ఇలాంటి ప్రశ్నలూ,,, పిల్లలు వున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తారు,,ఎలా వుంటారు,ఏం చదువుతారు,,ఇత్యాది ఫ్రశ్నలు,,,,,,,,,అర్ధమవుతుంది వాళ్ళ ఫీలింగ్స్....చాలా క్లియర్గా తెలుస్తుంది........అసూయలాంటి లేదా అంతకన్నా ఎక్కువ ఫీలింగ్..........మా టీచర్ మాదే............. అన్న ఫీలింగ్...................... ఒక రోజ్ ఫ్లవర్ ఇచ్చి సంతోషపెట్టాలని,, చాక్లెట్ కూడా వాళ్ళు తినకుండా తమకు ప్రియమైన టీచరుకు అందరికంటే ముందు తామే ఇవ్వాలని,,,,,,,,,,ఏం చెప్పను?///////////// ఎ వెరీ వండర్ ఫుల్ ఫీలింగ్స్............... హట్సాఫ్ మై డియర్ చిల్డ్రన్..........వాళ్ళ ప్రేమకి ఏం ఇవ్వగలము బదులుగా....

Vinay Chakravarthi.Gogineni said...

mee way of narration baaguntundi ......
but ila nenu eppudu aalochinchaledu.
gud ila kooda vuntaaru annamata

Anonymous said...

మా సర్ పెళ్ళికి మేమంతా వెళ్ళినప్పుడు స్కూల్ స్టాఫ్ మొత్తం వాళ్ళ ఫామిలీ తో వచ్చినపుడు ఫ్రెండ్స్ అందరం ఇలానే ఆలోచించాం.

Swathi said...

avunandi..aa age lo valla jeevitham lo kuda pellillu etc untaayani tochadu..

srinu said...

soo funny

మాగ్నెట్ ని కట్ చెస్తే అప్పటిదాక ఉన్న సౌత్ నార్త్ గా మారుతుంది
మీరు అప్పటి దాక నార్త్ లో ఉన్నరన్నమాట

భాల్యం వ్యక్థిగత స్వతంత్రాన్ని కోరుకుంటుందనటానికి మీ బ్లాగ్ ఒక ఉదహరన , మీ గ్నాపకం ఒక సాఖ్సం

Unknown said...

మీ రచలను చాలా బాగున్నాయండి...తెలుగు మీద తీరని మమకారం తో ఈ మధ్య నేను మొదలుపెట్టిన చిన్ని ప్రయత్నం www.sayamkalamkaburlu.com..ఒకసారి చూసిమీ అనుభవం తో కుదిన్ అభిప్రాయం చెప్తారని ఆశిస్తున్నాను

Post a Comment