ఆ మధ్య ఒక పత్రికలో క్రాస్వర్డ్ పజిల్ పూర్తి చేస్తూ ఒక అడ్డం, నిలువు దొరక్క తన్నుకుని, అదేదో ప్రాణం మీదికొచ్చినట్టు, చివరి తేదీ లోపుగా ఆ క్లూ దొరుకుతుందో, సాల్వ్ చేసి పంపగలనో లేదో అని పుస్తకాలు, రిఫరెన్స్ పుస్తకాలు వెదుకుతూ, బెంగెట్టుకుని జ్వరాలు తెచ్చేసుకుని ఎలాగో ఇహ రెండు రోజులు టైముందనగా సాధించేసి పంపేశాను.
అది పంపేశాక ఎంత ఆకలి వేసిందో! ఆ తర్వాత ఎంత నిద్ర ముంచుకొచ్చేసిందో! తపన అంటే అలా ఉండాలి.(చాల్లే వెధవ గొప్పలు అంటారా? :-P)
ఈ పిచ్చి మా ఇంట్లో అందరికీ మా అమ్మ పట్టించింది. వనిత,జ్యోతి మంత్లీ,ఆంధ్ర ప్రభ వీక్లీ,ఇంకా చాలా చాలా పత్రికలు తెప్పించి వాటిలో పజిల్స్ అన్నీ అలవోగ్గా పూర్తి చేసి పంపేస్తూ ఉండేది. అదొక వ్యసనం ఆమెకి. మేము కూడా ఆంధ్ర దేశపు లెక్కల మాష్టారి. శిష్యులమై పోవడం వల్ల మేథ మేట్రిక్స్ నేర్చుకుంటూ, ఆ పజిళ్ళన్నీ ఛేదిస్తూ సాధిస్తూ ఉండేవాళ్ళం.
అమ్మే కాకుండా అత్తగారు కూడా పజిల్స్ నింపడంలో నిష్ణాతురాలు కావడం విచిత్రమే! పెళ్ళయిన కొత్తలో మా అత్తగారు నేను పజిల్స్ నింపడం లో పడి ఎవర్నీ పట్టించుకునే వాళ్ళం కాదు. ఇంత అనుకూల వతి అయిన కోడలు దొరకడం కొడుకేమో గానీ తన అదృష్టంగా భావించి ఆవిడ నన్ను బాగా గారాబం చేసేవారు. మనం చేతులకు గోరింటాకు పెట్టేసుకుని వంటింటి గట్టు మీద కూచుని పజిల్స్ కి క్లూలు ఆలోచిస్తుంటే ఆవిడ పెసరట్లు వేసి తినిపిస్తూ ఉండేవారు.
ఆ తర్వాత మేము అమెరికా వెళ్ళిపోయాక ఆవిడకు ఫోన్లు చేస్తే "ఎలా ఉన్నారు?ఏవిటి?" అని అడిగే వారు కాదు."మొన్నొక పజిల్ చూశాను సుజాతా! అందులో......(అని ఫోన్ పక్కన పెట్టి పుస్తకం తెచ్చుకోడానికి వెళ్తారు).....పదమూడు అడ్డం, 24 నిలువూ కలవడం లేదు. దాని క్లూ ఏంటంటే.." అని క్లూ వివరించేసి..ఏ అక్షరాలు కలిశాయో చెప్పేవారు. అలా మేము వేరే టాపిక్ లేకుండా క్రాస్వర్డ్ పజిల్స్ మీదే ఇంటర్నేషనల్ కాల్స్ గంటల కొద్దీ మాట్లాడేసుకుంటుంటే వాళ్లబ్బాయి దుఃఖం వర్ణనాతీతంగా ఉండేది.
ఇప్పటికీ ఆవిడ అతి కఠినమైన క్రాస్వర్డ్ పజిల్స్ పూర్తి చేసేస్తుంటారు. రచన మాస పత్రిక పజిల్స్ ప్రతి నెలా ఖచ్చితంగా పంపిస్తుంటారు.అది చాలదన్నట్టు ఆన్ లైన్ పత్రికల్లో పజిల్స్ ఉన్నాయేమో ప్రింట్స్ తీసి ఇమ్మంటారు. బహుమతి కొట్టడం కాదు టార్గెట్ .... పజిల్ సాల్వ్ చేస్తే కానీ ఆ ఆకలి తీరదు.
అదొక అడిక్షన్!
ఇంకో బలమైన కేసు బాబాయిది. .బాబాయికేమో పజిల్స్ పిచ్చి. నిద్రలో కూడా "పదకొండు నిలువు, ఒకటి అడ్డం,కలిస్తే...మరి పదహారు నిలువు ఎలా కలుస్తుంది? అది ఒకటే అక్షరం కదా?" అని పేరాగ్రాఫుల చొప్పున మాట్లాడుతుండే వాడుట!
తను పూర్తి చేసి పంపిన పజిల్స్ రిజల్ట్స్ కోసం వాడు ఎగ్జాంస్ రిజల్ట్స్ కంటే ఉత్కంఠగా ఎదురు చూసేవాడు.
నేను ఆరో క్లాసు లో ఉండగా బాబాయి పెళ్ళి జరిగింది. పాపం పిన్ని అప్పుడు డిగ్రీ సెకండియర్ లో ఉంది. ఎంచక్కా పెళ్ళయిపోతే చదువు మానేసి సాయంత్రాలు జడ ముందుకేసుకుని చివర్లు అల్లుకుంటూ, బాబాయి కోసం చూస్తూ కిటికీ దగ్గర నిల్చోవచ్చని కలలు కంటుందనుకుంటాను. బొత్తిగా పుస్తకాల గొడవ పట్టేరకం కాదు.
బాబాయి పెళ్ళి రోజు సాయంత్రం వాడి ఫ్రెండ్స్ రాగానే "ఏరి? ఎక్కడ ? నా ప్రభా, నా జ్యోతి,.వనిత,వచ్చారా? ఎంత కలవరిస్తున్నానో మీకేం తెల్సు? తీసుకొచ్చారా?" అని ఫ్రెండ్స్ ని ఆత్రంగా అడగటం చూసి పెళ్ళి కూతురు వైపు చుట్టమొకావిడ నిర్ఘాంత పోయి లోపలికి పరుగు తీసింది(ట).
ఇంకేముంది? కాసేపట్లో పెళ్ళి కూతురి ఏడుపూ, వాళ్ల నాన్న పరిగెత్తుకుని విడిదింటికి రావడమూ...సీన్ అంతా గుర్తు లేదు గానీ మొత్తానికి పెద్ద గొడవే అయింది. బాబాయి అప్పటి వరకూ కల "వరించింది" జ్యోతి మంత్లీని,ప్రభ వీక్లీని అని తెలిశాక తెల్లబోయి గొల్లుమన్నారు.
ఆ జోకు చాలా రోజులు చుట్టాల్లో సర్క్యులేషన్లో ఉండిపోయింది.
అది అంతటితో ముగియక, బాబాయ్ పెళ్ళి తర్వాత కూడా అర్థ రాత్రుల వరకూ పజిల్స్ సాల్వ్ చేస్తూ టేబుల్ మీదే పడి నిద్ర పోవడమూ, వాళ్లావిడను సినిమాలు షికార్లకు తిప్పక అడ్డాలు, నిలువులు కూర్చుకుంటూ కుచోడంతో , అంతా కొద్ది కాలం ఆమెని బాబాయి పజిల్స్ పిచ్చితో సర్దుకోమన్నారు. ఆవిడ వినక పుట్టింటికి పెట్టె సర్దుకుంది.
కొన్నాళ్ళకి బాబాయికి మధ్య ప్రదేశ్ కి ట్రాన్స్ఫర్ అయి వెళ్లిపోయారు. తర్వాత తెలిసిందేమిటంటే బాబాయి ఆ పిచ్చి పిన్నికి కూడా పట్టించాడు. ఇద్దరూ కల్సి అడ్డాలూ నిలువులూ పూరించుకుంటూ నాలుగేళ్ళ కొడుకుని పట్టించుకునే వారు కాదు .
పొద్దు పత్రికలో పజిల్ ఇచ్చేటపుడు చాలా సరదాగా ఉండేది. సుగాత్రి అనే బ్లాగర్ ఒకావిడ పొద్దులో అలా పజిల్ ఇవ్వగానే ఇలా బ్లాగ్ లో ఒక టపా రాసేవారు.దానికి స్లిప్పుల సర్వీసు .అని పేరు అందులో అసలు పజిల్ ఆధారాలకు క్లూ లు ఉండేవి. పజిల్ పిచ్చి ఉన్న వాళ్లంతా అక్కడ చేరి(భైరవ భట్ల కామేశ్వర రావు గారు, జ్యోతి, కొత్తపాళి గారు,నేను...ఇంకా మరికొందరూ)క్లూలు ఇచ్చేసుకుంటూ అసలు పజిల్ కి క్లూలతో ఇంకో పజిల్ తయారు చేసేవారు.
పొద్దులో పజిల్ మానేశాక, నిరాశ పడి ఊరుకున్నాం. మాలికలో పజిల్ మాలికా పద చంద్రిక మాత్రం నాకు బాగా నచ్చేస్తోంది. ఈ సారి ఎలాగైనా పూర్తి చేసి ప్రైజ్ కొట్టేస్తాను!
క్రాస్ వర్డ్ పజిల్ కూర్చడానికి ఎంత ఓపిక,యుక్తి తెలివి కావాలో నిజంగా! పూర్తి చెయ్యడానికే మనం ఇన్ని తంటాలు పడుతున్నామంటే కూర్చే వాళ్ల సంగతేంటి?
శ్రీ శ్రీ జ్యోతి మంత్లీలో కూర్చిన పజిల్స్ ఆధారాలు చూస్తే భలేగా ఉన్నాయి.
"తల తిరుగుడు రచయిత్రి"(2)అని ఇచ్చారుట.ఎవరో కనుక్కోండి? :-P
శ్రీ శ్రీ కూర్చిన పదబంధ ప్రహేళిక ఒకటి దశాబ్దాల నాటిది దొరికింది.
(జవాబుల ప్రింట్ కూడా ఉంది. ఆసక్తి గల వారు పూరించుకోవచ్చు)
జ్యోతిలోనే ఆరుద్ర కూర్చిన పజిల్స్ కూడా (ఈ మధ్య వరకూ కూడా మా ఇంట్లో పాత కాపీలుండేవి, వాటిలో చూశాను)చాలా బాగున్నాయి.
తెలుగు నిఘంటువులూ, వ్యాకరణాలు వెదికిపట్టుకునే క్లూల కంటే యుక్తితో, కాస్త బుర్ర ఉపయోగించి పట్టుకునే క్లూలే బాగుంటాయి. రచన మాస పత్రికలో ఎన్ సురేంద్ర గారు పజిలింగ్ పజిల్ ఇచ్చినన్ని రోజులు చాలా ఉత్సాహంగా పూర్తి చేసేదాన్ని. పూర్తి చేయడమే తప్ప పంపడంలో అంత శ్రద్ధ ఉండేది కాదు.
ఈ పిచ్చి ఎంత ముదురుతుందంటే ఈనాడు ఆదివారం ఎడిషన్లో కూడా , అది పేపర్తో పాటు రాగానే దాని కోసమే చూస్తున్నట్టు...అది పూర్తి చేసి అక్కడ పడేస్తే కానీ(అది పిల్లల స్టాండర్డ్ అయినా సరే)బావుండదు.
దీన్ని వదిలించుకోవాలని లేదు నాకు.. ఇంకా ముదిరితే బాగుండని ఉంది .
I really enjoy this..! Then why to get rid of....? :-)
30 comments:
పజిల్ నింపడంలో మజా అంతా ఇంతా కాదండీ. (మేము తూగోజీలం, చివర్లు సా...గదీస్తాం.)
శ్రీశ్రీ చెప్పిన తల తిరుగుడు రచయిత్రి = లత (తెన్నేటి హేమలతగారు "లత" పేరిట రాసేవారు).
పజిల్స్ ఎన్నిరకాలున్నాయో ఈసారి రాయండి. మంచి ఆర్టికల్.
Nice post Sujatha garu..
తల తిరుగుడు రచయిత్రి - ’లత’
ఇంతకీ మొదటి పజిల్ ఏ పత్రిక లోనిదో చెప్పండి. లేకపోతే నాకు నిద్ర పట్తదు.
our family is also in the same bandwagon. nice post.
కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ ఈ పజిళ్ళ గోల మా పెద్దాయనకీ తద్వారా నాకూ కూడా వచ్చాయి.చాలా రోజులకి మళ్ళీ మీ బ్లాగ్ లో పోస్ట్ కేకంతే
ఆదివారం ఉదయం నిద్ర లేవగానే నేను చేసే పని బయట పడీ ఉన్న ఈనాడూ పేపర్ తీసుకొచ్చి పుస్తకాన్ని బయటకు తీసి కళ్ళు నులుముకుంటూ పజిల్ చకా చకా పూర్తి చేసేయడం.
మళ్ళీ మధ్యాహ్నం ఖాళీ దొరికినప్పుడు మాకు సాక్షి రాదు కాబట్టి ఆన్లైన్ లోనే ఇమేజ్ డొన్లోడ్ చేసి పెయింట్ లో పూరించడం :-)
Naa chinnappudu eenaadu book lo cross word ni pattukoni amma nanna kusteelu padatam gurtu andee
Kaanee meelaagaa,mee vaalla laaga peak stage lo unnollu untaarani teleedu kikikiki
Nice
Welcome back :)
చాలా రోజుల తరువాత కనిపించారు! నిజంగానే పజీళ్ళ పాకమేనండీ. మా తమ్ముడూ నేనూ దీనికోసం కొట్టుకునేవాళ్ళం. వాడయితే ఏకంగా అన్నిటినీ దాచేసి ఇవాళ ఇంకా రాలేదక్కా అని చెప్పేవాడు. వాడు వ్రాస్తుంటే మధ్యలో లాక్కుని వచ్చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఒక్కోసారి ఇద్దరం కలిసి కూర్చుని చేస్తూ ఉంటాం. పొరపాటున ఏదయినా రాలేదో ఇకా రోజంతా విపరీతంగా ఆలోచిస్తూ కూర్చుంటాం. అంత శ్రద్ధ చదువు మీద పెట్టండర్రా, వీటి మీద కాదు అనేవారు మా తాతగారు. నైస్ పోస్ట్ అండీ!
mI mansulomate naadi kuda. mI picche naadi kuuDaa. poddu gadi nilipeyadam to vfjgdyogulaipoyina vaallano nEnokadini.
mi vadda unna pata gaLLu scan chesi peTTagalaru.
cr picchi ilaagE prakopinchi kaaka!
Satyasai Kovvali
mI picchE naadi kuuDa. poddu baLLu gaDi nilipEsaaka nirudyogulaina vaaLLalO nEnokaDini.
mI daggarunna hel pajiLLu scan chEsi peTTi puNyam kaTTukOnDi
Satyasai Kovvali
I posted my comments twice but do not know what happened- they disappeared. like the Gadi in Poddu. I was one of the unemployed after Poddu stopped Gadi. pl scan and upload the puzzles you have with you for all of us.
may the madness of you and your tribe (includes us) grow bountifully
Satyasai kovvali
ఈ పిచ్చి వదిలించుకుంటే పోయేది కాదు. పోవాలనీ లేదు. బావుంది సుజాతగారూ..
సుజాతగారూ..అదిరిందంటే అదిరిందంతే. పద సంపద పెరగాలంటే పజిళ్ళు.. గణ సంపద పెరగాలంటే సుడోకులతో కుస్తీ పట్టాల్సిందే మరి..
మణిభూషణ్ గారూ,
పజిల్స్ లో రకాలా? నాకు టెన్షన్ గా ఉంది.అవేంటో నాకు తెలీట్లేదు. మీరు చెప్పకపోతే నిద్ర పట్టేట్టు లేదు:-)
ప్రసీద గారూ థాంక్యూ!
రవి గారూ...పట్టేశారు..:-)
సూర్యలక్ష్మి గారూ, మొదటి పజిల్ ఏ పత్రికలోదో నాకు తెలీదు. ఇంతకీ ఇక్కడ శ్రీ శ్రీ పజిల్ పూర్తి చేశారా లేదా? జవాబులు కూడా ఉన్నాయి, పూర్తి చేశాక చెప్పండి పంపిస్తాను. సరి చూసుకోడానికి!
ఫణీంద్ర గారూ, నిజమా..? Nice to know, Same pinchi!
వేణు గారూ,
థాంక్యూ! గళ్ళ నుడి కట్లు అందరికీ చీవాట్లే తినిపిస్తాయి. నాకు మాత్రమే ప్రత్యేకంగా పెసర్ట్లు! :-))
మా అత్తగారి సంగతి మీకు తెలీనిదా? మీకు కూడా వస్తుంటాయిగా ఫోన్లు...క్లూలు కనుక్కునే దార్లో..:-)
పప్పు గారూ,
మీకూ ఉందా ఈ పిచ్చి? చెప్పారు కాదేం? ఈ సారి స్లిప్పుల సర్వీస్ లో మిమ్మల్నీ చేర్చేస్తా ఉండండి
రవిచంద్రా,
నీక్కూడా ఉందా ఈ పిచ్చి? అసలు మీకు టైమెలా దొరుకుతోందబ్బా?
రాజ్,
థాంక్యూ! ఎన్ని పజిల్స్ పూర్తి చేసినా ఇప్పటికీ ఈనాడు పజిల్ వదలను నేను కూడా :-)
రసజ్ఞ గారూ,
నిజమే అండీ! ఇది ఓ పట్టాన వదిలేది కాదు. మా ఇంట్లో చీవాట్లు పెట్టడానికి మా అమ్మకి కుదిరేది కాదు, ఎందుకంటే ఆమె వేరే పజిల్ పట్టుకుని బిజీగా ఉండేది.:-)) థాంక్యూ
సత్యసాయి గారూ,
మిమ్మల్ని ఈ సందర్భంగా మిమ్మల్ని గుర్తు చేసుకోకపోవడం మహాపరాథం! ఎంత మంచి పజిల్స్ కూర్చారో మీరు పొద్దుకి!!
పాత పజిల్స్ సంపాదించే ప్రయత్నంలో ఉన్నాను. దొరికితే తప్పక స్కాన్ చేసి పెట్టేస్తాను. మీ దీవెనలు (నా ఈ పిచ్చి ఇంకా ప్రకోపించాలని) నాకెంతో సంతోషాన్ని ఇస్తున్నాయి.
ధన్యవాదాలు
జ్యోతిర్మయి గారూ,
థాంక్యూ!'
శ్రీనివాస కుమార్ గారూ,
బాగా చెప్పారు. మీ మాటే నా మాట కూడా! ఈ మధ్య సుడోకు పిచ్చి కొంత వదిలింది. లేకపోతే ఏదైనా రెస్టరెంట్ కి వెళ్ళ్నపుడు వాళ్ళిచ్చే పిల్లల స్థాయి సుడోకు పజిల్స్ కూడా నేనే లాక్కుని పూర్తి చేసి పడేస్తుండేదాన్ని :-))
సుజాత గారూ,
ఎన్ని రోజులైందో మీ బ్లాగ్ చూసి. అసలు మీరు కూడా ఏమీ రాస్తున్నట్టు లేరే? రాస్తూ ఉండండి సుజాతా!మీ రాతలు చదూతుంటే చక్కగా ప్రియ నేస్తం పక్కనే కూచుని కబుర్లు చెప్తున్నట్టే ఉంటుంది.
ఈ పోస్టు కూడా అలాగే ఉంది. ఇంత గాప్ తీసుకోకండి
మీ బ్లాగ్ కొత్త టెంప్లేట్ చాలా చాలా బాగుంది. ఇంతకీ ఆ pink bird మీరేనా?:-)))
ఎప్పటిలాగే మీ స్టైల్లో చాలా బాగుందండీ సుజాత గారూ!చాలా రోజుల తర్వాత రాసినట్టున్నారు. మంచి పుస్తకం ఏదైనా చదివి మాక్కూడా పరిచయం చెయ్యకూడదూ!I miss your reviews madam..!!
వావ్! నీకసలు 'కాదే విషయం టపాకనర్హం' అనుకుంటా! హ్యూమర్, సెటైర్ -- ఏది ఎక్కడ ఎంతపాళ్ళలో ఉండాలి అనేది నీ పోస్ట్స్ చూసి నేర్చుకోవాలి.. పజిల్స్ కి నేను దూరమై చాన్నాళ్ళైంది.. ఇప్పుడు వీర బద్దకం.. బుజ్జి మెదడుకి అంత కష్టం అవసరమా అనిపిస్తుంది ;-)
బైదవే, టైటిల్ భలే ఉంది :))
అసలు మీరు సుపరండి విషయం లేని విషయాన్నీ కూడా ఇంత బాగా చెప్పడం మికే చెల్లింది. అందుకే మీ టపాలు అంటే నాకు చాల ఇష్టం కానీ కాస్త తొందర తొందరగా రాయండి.
కిరణ్ కుమార్ గారూ,
పుస్తకాలు చదూతూనే ఉన్నాను కానీ రాయడానికే బద్ధకిస్తున్నా వాటి గురించి!
రాయాలి రాయాలి! థాంక్యూ!
నీలాంచల గారూ,
అవును చాలా రోజులైంది నేను రాసి. మిమ్మల్ని చూసి కూడా!
టెంప్లెట్ మరీ girly గా ఉందని జనాభిప్రాయం. బాగుందా? ఉంచెయ్యనా?
పింక్ బర్డ్ బావుందా? అయితే నేనే అనేసుసుకుందాం :-P
నిషీ థాంక్యూ
సాయరాం గారూ,
హ హ హ ! రాయాలి రాయాలి! టపాలు నచ్చుతున్నందుకు థాంక్యూ!
అయ్యో..ఇది చాలా విషయం ఉన్న విషయమేనండీ. బహు కష్టం కూడా పజిల్స్ పూర్తి చేయడం.
థాంక్యూ!
సుజాత గారు.. చాలా రోజుల టైం తరవాత రాసి....మంచి బాన్గింగ్ ఎంట్రీ ఇచ్చారు.. అప్పట్లో ఆంద్రప్రభ లో గడి-నుడి అని వచ్చేది..బాగుండేది..ఎప్పుడూ కంప్లీట్ చేసింది లేదనుకోండి ..ఒకటి రెండు మిగిలిపోయేవి ..క్లూస్ గమ్మత్తుగా ఉండేవి..తిరగబడ్డ రామాయణం రచయిత్రి..చంద్రుడి లో సగం..
పల్లకి అని ఒక వీక్లీ వచ్చింది కొన్నాళ్ళు..వీరేంద్రనాథ్ కంపైల్ చేసేవాడు..బాగుండేది..నాకొక ఫామిలీ తెలుసు..ఈనాడు సండే ఎడిషన్ లో..ఈ పజిల్ పేపర్ ని జిరాక్స్ తీయించి..తలో ముక్క పట్టుకుని సెటిల్ అయిపోతారు.. యువ, ప్రభ , పల్లకి వీటితో కంపేర్ చేస్తే ..ఈ ఈనాడు నతింగ్ ..ఈ మద్య అసల పేపర్ చదవడానికి ఖాళి వుండడం లేదు..ఇంక ఈ పజిల్స్ వరకు ఎక్కడ
చాల బాగా రాసారు. పనులెక్కువైపోయి పొద్దునుంచి తప్పుకున్నాక, నేను కూడా గడి విషయంలో ప్రొఫెసరుగారి లాగనే నిరుద్యోగినైపోయా. గడి పూడ్చడానికి మీకందరికీ ఎంతటైంపట్టేదో నాకు తెలీదుగాని, కూర్చటానికి నాకైతే ఐదారు రాత్రులు పట్టేది, చివర్లో త్రివిక్రము, నేను జీటాకులో రాత్రంతా కుస్తీలు పట్టి చివరి ఆరేడు పదాలు పూర్తిచేసేవారం.
సుగాత్రి "ఆవిడ" కాదు :)
ఇందాకా వచ్చాక, బుర్ర తినకుండా పోతే భావ్యం కాదు కదా - ఎన్నాళ్ళనుంచో నా దగ్గర ఉండిపోయిన ఆధారం మీకే ఇచ్చేస్తున్నా - "మామగారి సాని పని సరి" (స్లిప్పు: ప్రొఫెసరుగారైతే ఇట్టే విప్పెస్తారు)
సిముర్గ్ గారూ,
లాభం లేదు.కానీ మీరు జవాబు చెప్పకండి. నేను ప్రయత్నించి చెప్తాను. ఇది ఎన్ని అక్షరాలో మీరు చెప్పలేదు. అడ్డాలు నిలువులూ ఎలా కలుస్తాయో తెలీదు:-))
దీనికి సప్తస్వరాల ఆధారంగా వెదకాలని తోస్తోంది. కనుక్కుంటాను. అప్డేట్ ఇద్దామని రాస్తున్నా...జవాబు నేనే కనుక్కుంటాను
Post a Comment