January 1, 2014

I am not scared (ఇటాలియన్ సినిమా )

                               



నాకు హారర్లు, థ్రిల్లర్లు చూడ్డం అంతగా అలవాటు లేదు.  మరీ ఎప్పుడైనా చూడాలి అనిపిస్తే రాత్రి పది తర్వాత న్యూస్ ఛానెల్స్ చూస్తాను. వాళ్ళైతే నిజ జీవితం లో జరిగే నేరాలకు కల్పనలూ తళుకులూ అద్ది, బ్రహ్మాండంగా స్క్రీన్ ప్లే రాసి, పాత్రలవీ పెట్టి నిజానికి అసలు నేరం అలా జరిగి ఉండక పోయినా, అది సమాచారం కోసం గాక సస్పెన్స్ కోసం చూస్తున్నట్టు ఆ భ్రమలో మనల్ని ముంచెత్తుతారు. కార్యక్రమానికి తగ్గ ఆహార్యంతో యాంకర్స్ ని పెట్టి మరీ!
 మొన్న ఒకరోజు అనుకోకుండా ఈ సినిమా నాకు పబ్లిక్ లైబ్రరీ లో దొరికింది. థ్రిల్లింగ్ సినిమా అని బ్లూరే కవర్ మీద కనిపిస్తున్నా ఆ పిల్లాడి కళ్ళలో ఉన్న తీవ్రమైన ఆకర్షణ నన్ను కట్టి పడేయడం తో అప్రయత్నంగానే దీన్ని ఎంచుకుని తెచ్చాను.  ఇంటికి వచ్చాక ఇది Netflix లో కూడా ఉందని తెల్సింది :-)

సినిమా చూశాక ఇది థ్రిల్లర్ గా ఎలా ముద్ర వేసుకుందో తెలీదు కానీ అరమరికలు లేని బాల్యాన్ని, స్వచ్ఛ మైన పసి హృదయానికి అద్భుతమైన ఆవిష్కరణ అని మాత్రం గట్టిగా అనిపించింది.

దక్షిణ ఇటలీలో ఒక గ్రామం లో దిగంతాల వరకూ వ్యాపించిన బంగారు రంగు గోధుమ పొలాల్లో వేసవి సెలవుల్లో స్నేహితులతో కల్సి విచ్చల విడిగా  ఆడుకుంటూ హద్దులు లేని బాల్యపు ఆందాన్ని మూటగట్టుకుంటూ ఉంటాడు పదేళ్ళ మిఛెల్!వాడికిహ వేరే పనేమీ లేదు. తిని, తిరిగి ఆడుకోడం! ప్రపంచమంతా వాడిదే! సంతోషాలన్నీ వాడివే! సెలవులన్నీ వాడివే 


 ఆ పొలాల చివర ఉన్న పాడు బడ్డ ఇంట్లో శిధిలమైన దూలాలు వాసాలు ఎక్కి అవి విరక్కుండా దిగడం లాంటి పందాలు,ఆ పొలాల మధ్య సైకిళ్లు వేగంగా తొక్కుతూ ఇంటికి ఆలస్యంగా చేరుకోడం,  కారణం తెలీని బాల్యపు పిచ్చి సంతోషం తో కేకలు వేస్తూ ఆ పొలాల్లో పడి దొర్లడం , వాడికీ వాడి తోకగా తిరిగే వాడి చెల్లి కీ అలవాటు. వాళ్ళ నాన్న  ట్రక్ డ్రైవర్ కావడం వల్ల  ఇంటికి అపుడపుడు వస్తుంటాడు.  పిల్లలంటే అమిత ప్రేమ!

ఒకరోజు బాధ్యతలే లేని ఆ రికామీ బాల్యపు ఆటల తర్వాత ఇంటికి అన్నాచెల్లెళ్ళు తిరిగి వచ్చాక చెల్లి గారి కళ్ళ జోడు ఆ పాడు బడ్డ కొంప దగ్గరే ఎక్కడో పడిపోయిందని గ్రహిస్తారు. ఆ కళ్ళ జోడు తేవడానికి మిఛెల్ ఒక్కడే సైకిలేసుకుని వెళ్తాడు. అక్కడ వెదుకుతూ ఉండగా మిఛెల్ కాలు బోలుగా ఉన్న ఒక   రేకు మీద పడుతుంది. దానికింద ఏదో గోతిలా కనిపించడంతో ఆ రేకు తొలగించి చూస్తాడు. నిజంగానే ఒక గోతి. అందులో ఒక నల్లని దుప్పటి కింద ఒక చిన్న పిల్లాడి పాదం కొద్దిగా బయటికి వచ్చి కనిపిస్తుంది. మిఛెల్ కి గుండె ఆగినంత పనవుతుంది.  భయంతో పారి పోయి వచ్చేస్తాడు. 
 తర్వాత కొద్దిగా ధైర్యం తెచ్చుకుని అది ఎవరో తెల్సుకోడానికి ప్రయత్నిస్తాడు. అక్కడ ఒక పిల్లాడిని ఎవరో దాచి ఉంచారని మాత్రం వాడికి అర్థం అవుతుంది.



తర్వాత ???

ఏం చెయ్యాలి? వాడితో "నువ్వెవరు, ఇక్కడున్నావేంటి?" లాంటి ప్రశ్నలు వేసినా సరైన జవాబులు రావు కానీ ఆ పిల్లాడు లేచి నిలబడేసరికి వాడిని చూసి హడలి పోయి దడుచుకుంటాడు ఫిలిప్పో! చింపిరి చుట్టు, ఒంటి మీద రక్తం చిందే గాయాలు, సరిగా చూపు ఆనని సగం మూసుకు పోయిన కళ్ళూ ఇదీ వాడి ఆహార్యం!
 తర్వాత కొద్దిగా భయం తగ్గి ఆ పిల్లాడికి దాహం వేస్తుందంటే ఒక చేద సంపాదించి కాసిన్ని నీళ్ళు లోపలికి దించుతాడు. వాడు ఆకలేస్తుంది ఏమైనా పెట్టమంటాడు. ఏం పెట్టాలో తెలీదు. "నా దగ్గరేమీ లేదు" అని ఇంటికి తిరిగి వచ్చేస్తాడు.

అక్కడ ఒక పిల్లాడిని దాచి ఉంచారన్న సంగతి స్నేహితులకు కానీ ఇంట్లో కానీ చెప్పడు. అదేదో తనకు మాత్రమే సంబంధించిన రహస్యం గా భావిస్తాడు.మర్నాడు ఒక కిరాణా కొట్టు కెళ్ళి , తన దగ్గరున్న డబ్బుతో ఏదైనా కొని పట్టుకెళ్ళాలి అనుకుంటాడు. \
కిట్ కాట్ కొంటే బాగుంటుందా చాక్లెట్ కొంటే బాగుంటుందా అని ఆలోచిస్తాడు. కొట్లో ఆమెని "ఆకలేస్తే ఏం పెడితే బాగుంటుంది ఎవరికైనా?" అని అడుగుతాడు.
 "ఆకలేస్తే ఏమి తింటారెవరైనా? బ్రెడ్" అని  అని ఆమె ముద్దుగా విసుక్కుని బ్రెడ్ ఇస్తే అది తీసుకెళ్ళి వాడికి పెడతాడు. ఇలా వాడితో రహస్య స్నేహం కొనసాగిస్తుంటాడు. వాడిని  వాడిని ఎలా కాపాడాలో, ఏమి చెయ్యాలో వీడికి తెలీదు . గోతిలోంచి బయటికి లాగి కాసేపు ఆ గోధుమ పొలాల్లో పడి దొర్లడం లోని ఆనందాన్ని   చూపిస్తూ ఆడిస్తాడు. బంధించి బంధించి ఉండటం వల్ల ఫిలిపో కాళ్ళు బిగుసుకు పోయి నడవలేక పొతే వాడిని వీపున ఎత్తుకుని మోస్తాడు.


ఇంతలో వాళ్ళింటికి నాన్న ఒక గెస్ట్ ని తీసుకొస్తాడు. ఆ గెస్ట్ చూడ్డానికే ఎంతో క్రూరంగా ఉంటాడు. రాత్రిళ్ళు పిల్లలు నిద్ర పోయాక నాన్న స్నేహితులు మరి కొందరు కలిసి టీవీలో వార్తలు చూసి తాగుతూ మాట్లాడుకోవడం ఫిలిప్పీ తన గది తలుపులు ఓరగా తీసి గమనిస్తాడు. ఆ టీవీ వార్తల్లో వాడికి ఒక విషయం తెలుస్తుంది. 

ఫిలిప్పోని కిడ్నాప్ చేసింది తమ ఇంట్లో ఉన్న గెస్ట్ సెర్జియో, తన తండ్రి, అతని స్నేహితులు అనే సంగతి!

అప్పుడు కూడా వాడు దిగ్భ్రాంతి చెందుతాడు తప్ప ఆ పిల్లాడిని రక్షించాలని తోచదు. ఎలా రక్షించాలో కూడా తెలీదు. ఇంతలో మిఛెల్ బాల్య  చాపల్యం తో  ఒక చిన్న కారు బొమ్మ కోసం ఆశపడి ఒక స్నేహితుడితో ఫిలిప్పో సంగతి చెప్తాడు.
 ఆ స్నేహితుడి వల్ల కిడ్నాపర్స్ కి విషయం తెలుస్తుంది. వాళ్ళలో ఒకడు (మిఛెల్ తండ్రి కాదు) మిఛెల్ ని రెడ్ హాండెడ్ గా ఫిలిప్పో దగ్గర ఉండగా పట్టుకుని చెయ్యి చేసుకుంటాడు. ఫిలిప్పోని అక్కడి నుంచి వేరే చోటికి తరలించి దాస్తారు.

మిచెల్ స్నేహితుడు ఫిలిప్పో ని ఎక్కడ దాచారో చెప్పేస్తాడు మిచెల్ స్నేహాన్ని తిరిగి సంపాదించడానికి ! నిజానికి వాడు కూడా ఒక చిన్న ఫాంటసీకి ప్రలోభ పడి మిచెల్ ఫిలిప్పోని కలుస్తున్న సంగతి కిడ్నాపర్స్ లో ఒకడికి చెప్తాడు. వాడికి కారు నడపాలని ఎన్నాళ్ళ నుంచో కోరిక! కిడ్నాపర్స్ లో ఒకడికి ఒక డొక్కు కారు ఉంది. ఆ కారు కాసేపు నడపడానికి ఒప్పుకునే షరతు మీద వాడు మిచెల్ ని పట్టిస్తాడు మొదట్లో!

ఇంతలో డిమాండ్ చేసిన మొత్తం చేతికి  రాక  పోగా కిడ్నాప్  పోలిస్ హెలికాప్టర్స్ మిఛెల్ గ్రామం మీద చక్కర్లు కొడుతూ ఉండటంతో  దిక్కు తోచని స్థితిలో , ఫిలిప్పోని చంపక తప్పదని నిర్ణయించుకుంటారు కిడ్నాపర్లు. వాడిని ఎలాగైనా రక్షించాలని మిఛెల్ అర్థ రాత్రి ప్రాణాలకు తెగించి సైకిల్ మీద ఆ పొలాలకు అడ్డం పడి వెళ్ళి వాడిని తాళం వేసి ఉన్న గేటు ఎక్కించి తప్పిస్తాడు. ఈ క్రమంలో వాడే ఫిలిప్పోకి నిచ్చెన అవుతాడు. తను మాత్రం ఎక్కలేక పోతాడు. ఆ గేటు తీసుకుని లోపలికి వచ్చిన మిఛెల్ తండ్రి అక్కడ ఉన్న పిల్లాడిని చీకట్లో ఫిలిప్పోగానే భావించి కాల్చేస్తాడు. 

తండ్రి గుర్తించే లోపుగానే ఆలస్యం అయిపోతుంది. ఆ శబ్దం విని పారి పోతున్న ఫిలిప్పో వెనక్కి వస్తాడు. చంపుత్గారేమో అన్న భయం లేకుండా మిచెల్ కోసమే వస్తాడు. రక్త  సిక్తమైన దేహంతో కళ్లు తెరిచిన మిచెల్ చాచిన చేతిని ఫిలిప్పో అందుకోవడం, అదే సమయంలో పోలిస్ హెలికాప్టర్లు అక్కడికి రావడం తో కథ ముగుస్తుంది.



సినిమా మొత్తాన్ని మిచెల్ గా చేసిన గిసెప్పే క్రిస్టియానో సినిమా మొత్తాన్ని నడిపించేస్తాడు. ఈ సినిమా ఒక హిప్నోటిక్, మర్డర్ సస్పెన్స్ అదీ ఇదీ వర్ణించినా ఇది నాకు మాత్రం ఒక పసివాడి మనసుని యధా తధంగా చిత్రించిన రంగు రంగుల కేన్వాస్ లా కనిపించింది.

పదేళ్ళ పిల్ల వాడిగా మిచెల్ అంతరంగాన్ని మొత్తం వాడి కళ్లలోనే చదివేయొచ్చు. వాడి ఆశ్చర్యం, భయం ,బాధ, నిర్వేదం, కోపం, సంతోషం అన్నీ వాడి కళ్ళే చెప్పేస్తాయి. ఫిలిపో ని గోతిలో చూశాక వాడిని కాపాడాలనో పోలీసులకు చెప్పాలనో ఆలోచన వాడికి రాదు. కథ ఈ నాటిది కాక పోవడం కూడా దీనికి కారణం అయి ఉండొచ్చు. 

ఇప్పటి పిల్లలకు అవేర్ నెస్ ఎక్కువే పోలీసుల గురించి!ఫిలిపో మంచి నీళ్ళు అడిగినపుడు పాడు బడ్డ ఇంట్లో, మిచెల్ కి అచ్చు తమ ఇంట్లో ఉన్న పింగాణీ గిన్నెల సెట్ లో లాంటిదే ఒక గిన్నె అదే డిజైన్ లో అక్కడ కనిపిస్తుంది. దాంతో వాడికి ఫిలిప్పో అక్కడ ఉండటానికి తండ్రికీ ఏదైనా సంబంధం ఉందా అన్న అనుమానం మనసులో రేకెత్తుతుంది. 
అలాగే చెల్లెలు ముందు రోజు డిన్నర్ లో తినకుండా వదిలేసిన మాంసాన్ని తండ్రి ఫ్రిజ్ లో పెట్టడాన్ని కూడా జాగ్రత్త గా గమనించి మర్నాడు ఫిలిపోని అడుగుతాడు "నిన్న నువ్వేమైనా మాంసం తిన్నావా?"(తండ్రి అది తెచ్చి పెట్టాడేమో అని) అని!

అయితే అది కిడ్నాప్ అని వాడి ఊహకు అందదు. ఒక్కడే గదిలో ఒక కథ ఊహించుకుని రాసుకుంటాడు. ఒక జంటకు ఇద్దరు పిల్లలు పుట్టారనీ, వాడిలో ఒకడు గుడ్డివాడు  కావడం వల్ల వాడిని వాడి తండ్రి ఒక గోతిలో ఉంచి చావకుండా ఆహారాన్ని తెచ్చిస్తూ ఉంటాడనీ.. ఇలా సాగుతాయి ఆ కథలో ఊహలు!అచ్చంగా పిల్లల మనసులో రేగే రూపం లేని అస్పష్టమైన గీతల్లా 

ఫిలిపో ఆకలేస్తున్నపుడు వాడికేం పెట్టాలో మిచెల్ కి అర్థం కాదు. ఆకలేస్తే ఎవరైనా బ్రెడ్ తినాలి అనే పరిజ్ఞానం వాడికి లేదు. ఎందుకంటే ఆకలి వేయక ముందే వాళ్ళమ్మ వాడికి బ్రెడ్ పెడుతుంది,. అందుకే గోతిలో అలమటిస్తున్న ఫిలిపో కి చాక్లెట్, కిట్ కాట్ వంటి పిల్లల ఫాంటసీ తిండ్లు తీసుకెళ్దాం అనుకుంటాడు.

మిచెల్ అమాయకంగా కనిపిస్తూనే వివేకంతో ఆలోచిస్తాడు ఈ సినిమాలో!ఫిలిప్పో విషయంలో తండ్రి పాత్ర ఉందో లేదో నిర్థారించుకోడానికి వాడు రక రకాలుగా ప్రయత్నిస్తాడు. కిడ్నాప్ వార్తలు టీవీలో దొంగచాటుగా చూశాక "నాన్నా, సెర్జియో నీ బాస్ కదు" అని అడుగుతాడు. ఫిలిప్పోని కలవడానికి వీల్లేదని వాళ్ళ నాన్న ఒట్టు వెయ్యమంటే "తండ్రి చచ్చినంత ఒట్టు, వాడిని కలవను" అని ఒట్టేస్తాడు. వేస్తున్నపుడు కూడా వాడి ఆలోచనలన్నీ ఆ పసి పిల్లాడి మీదే ఉంటాయి.

వాడిని చావు నుంచి కాపాడాలన్న తపనతో ఒట్టుని గట్టున పెట్టి అర్థ రాత్రి భయం వేస్తున్నా ఏవో మంత్రాల్లాటివి చదువుకుంటూ సైకిలేసుకుని వెళ్తాడు .
మానవ ప్రవర్తనలోని సహజ వైరుధ్యాన్ని దర్శకుడు ఒక విషయం ద్వారా ఆవిష్కరిస్తాడు. మిఛెల్ తండ్రికి తన ఇద్దరు పిల్లలన్నా ఎంతో ప్రాణం. వాళ్ళమ్మ గట్టిగా కోప్పడ్డా ఊరుకోడు. వాళ్లని ఎంతో ముద్దు చేస్తాడు. ఇంటికి అలసి పోయి వచ్చాక కూడా వాళ్లతో ఆడతాడు. అంత ప్రేమాస్పదమైన మనసు గల వ్యక్తి తన కొడుకు వయసే గల మరో కుర్రాడిని చీకటి గోతిలో కుళ్లు, మురికి, పురుగుల మధ్య వదిలేస్తాడు. 
మనిషి లో "తన " అనే స్వార్థం ఎంతగా జడలు విప్పి విచక్షణకు తావు లేకుండా చేస్తుందా అనిపిస్తుంది దీన్ని గమనిస్తే! మన కళ్ళెదురుగా ఉన్న సమాజాం లో కూడా ఇంతేగా.. పసి పిల్లని నిర్దాక్షిణ్యంగా డబ్బు కోసం కిడ్నాప్ చేసే వ్యక్తులకు పిల్లలుంటారు. ఆ పిల్లల కోసమే వాళ్లు అమానుష ప్రవర్తనకు పాల్పడతారు కాబోలు!

 Niccollo Ammaniti రాసిన నవల Lo non ho paura ఆధారంగా ఈ సినిమా తయారైంది. ఈ నవల మొత్తం 20 భాషల్లో ఏడు లక్షల కాపీలు అమ్ముడయ్యాయట. ఈ నవల ఇటలీలో టెర్రరిజం  సంక్షోభం నెలకొన్న సమయంలో జరీగ్న ఒక యదార్థ సంఘటన ఆధరంగానే రాశాడట రచయిత!బోల్డన్ని అవార్డులు దక్కించుకున్న ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ, రీ రికార్డింగ్ పెట్టని ఆభరణాలు!సినిమా మొత్తం వెంటాడే వయొలిన్ తరంగాలూ, నీలాకాశమూ, కాంట్రాస్ట్ గా గోధుమ పొలాలూ, ఎర్రని ఎండల్లో దక్షిణ ఇటలీ పల్లె సౌందర్యం అంతా కేన్వాస్ మీద  వర్ణ చిత్రం లా ఆవిష్కృతం !
ఈ సినిమా ట్రైలర్ ఇక్కడుంది  

ఒక పక్క థ్రిల్ కలిగిస్తూనే, పిల్లల మానసిక చిత్రావిష్కరణ చాటున దాన్ని దర్శకుడు మలిచిన తీరు భలే ఉంటుంది. ఒక విపత్కర పరిస్థితిలో పదేళ్ల పిల్లాడిలో రేగే కన్ ఫ్యూజన్, భయం, ఆందోళన, అంతకు మించి ఉప్పొంగే స్నేహ భావన వీటన్నిటినీ కళ్ళెదురుగా చూస్తున్న భావన! మనసు లోతుల్లోకి ఇంకి పోయెలా మిచెల్ మానసిక సంఘర్షణ డిక్షనరీ అవసరం లేకుండానే ప్రేక్షకుడికి అర్థమై పోతుంది. 

 ఈ సినిమా దర్శకుడి గురించి (గాబ్రియేల్ సాల్వతోరెస్) గురించి చదివాక ఆయన మిగతా సినిమాలన్నీ (హాపీ ఫామిలీ తప్ప ఇంకేమీ చూడలేదు) చూసెయ్యాలని నిర్ణయించుకున్నాను.
చూసే అవకాశం వస్తే వదులుకోకండి 

14 comments:

రాజ్ కుమార్ said...

Bagundandi review:)

Chandu S said...

రివ్యూ చాలా బాగుందండీ. సినిమా చూసేయాలి అనిపించేంత బాగా రాశారు.

నాగరాజ్ said...

సినిమాను బాగా పరిచయం చేశారండి. అంతా చదివాక లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, మదర్ ఆఫ్ మైన్, బాయ్ ఇన్ స్ట్రయిప్డ్ పైజమాస్ లాంటి సినిమాలూ గుర్తుకొచ్చాయి. వ్యవస్థలో విపరీతంగా పెరిగిపోతున్న అభద్రత మనుషుల్లో conscienceను సైతం చంపేసి, struggle for existence ను అత్యంత అసహ్యకర రీతిలో బట్టబయలయ్యేలా చేస్తుందేమోననిపిస్తుంది నాకు. మంచి సినిమాను పరిచయం చేశారు. ఇలాగే ఈ ఏడాదంతా మీరు వారానికి కనీసం ఒక మంచి సినిమానన్న పరిచయం చేస్తారని బోల్డంత ఆశలు పెట్టుకుంటాం :)

Anonymous said...

Hello sujatha garu, meeru cinemanu baaga choopinchaaru mee rachanalo. Dhanyavadaalu. Naaku oka sandeham ..meeru ee blog lo ads pettukovachu kada..yenduku meeru vupayoginchukoledu..?

సుజాత వేల్పూరి said...

రాజ్, శైలజ గారు,

థాంక్యూ

సుజాత వేల్పూరి said...

వేణు గారూ

నిజమే పిల్లల మనస్తత్వాన్ని విశ్లేషించే ప్రతి అంశం నన్ను వెంటనే ఆకర్షిస్తుంది.

ఈ సినిమా పూర్తిగా మిచెల్ దృష్టి లోంచే సాగుతుంది. అందుకే వాడి కళ్ళతోనే చూసి, వాడి మనసుతోనే మనకు తెలీకుండా మనం ఆలోచిస్తాం.

సుజాత వేల్పూరి said...

నాగరాజ్ గారూ, యూరోపియన్ సినిమాల్లో చాలా వాటిలో ప్రేక్షకులని మనసుతో (మెదడుతో కాదు) ఆలోచింపజేసే అంశాలు ఉంటాయన్న సంగతి మీకు తెల్సిందేగా!ఇది కూడా అంతే!

చివర్లో మిఛెల్ తండ్రి తను దొరికి పోయినా పర్లేదని (అంతకు మించి చాయిస్ ఉండదు కూడా)తప్పిచుకునే ప్రయత్నం చేయకుండా కొడుకుతో సహా అక్కడే కూలబడి పోవడం మంచి మలుపు.

వాడిలోని నిజమైన తండ్రి అప్పుడు మేలుకుంటాడు.

మిఛెల్ స్నేహానికి ఇందులో వెల కట్టలేం

వారానికో సినిమానా? నయం...

సుజాత వేల్పూరి said...

javabynatarajగారూ

పరిచయం మీకు నచ్చినదుకు థాంక్స్! బ్లాగ్ లో యాడ్స్ పెట్టుకోవాలనే ఆలోచన నాకెప్పుడూ లేదండీ! ఇది పూర్తిగా నా పర్సనల్ బ్లాగ్. నా అభిరుచి మేరకే ఉండాలి. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండకూడదని అనుకుంటాను.

ఏదో అప్పుడప్పుడు తోచుబాటుకోసం రాసుకునే బ్లాగ్ .. బ్లాగ్ లాగే ఉండాలి. ఇదేదో సాహిత్యాన్నో, సినిమానో మరో దాన్నో ఉద్ధరిస్తున్నానే ఉద్దేశంతో రాయడం లేదు. అలాటి బ్లాగ్స్ కి ప్రచారం అవసరం అనుకుంటాను.

ధన్యవాదాలండీ

మధురవాణి said...

​As usual, మీరు రాసింది చదవగానే సినిమా చూసెయ్యాలనిపిస్తోంది. ఇలా మనసుని మెలిపెట్టే సినిమాలు చూడాలంటే కాస్త ధైర్యం తక్కువ నాకు. చాలారోజుల దాకా ఆలోచనలని గాఢంగా కమ్మేస్తాయి. అయినాసరే ఎప్పుడో అప్పుడు ధైర్యం చేసెయ్యాలనే ఉంది. :-)

సుజాత వేల్పూరి said...

సినిమా గొప్ప దనమే అది కదా మధూ! సరదా సినిమాలతో ఒక్కోసారి టైం పాస్ చేసెయ్యాలనిపించినా, ఒక్కోసారి ఇలా మనసుని మెలిపెట్టే సినిమాలు చూసి ఆ వేదనను అనుభవించడంలో హాయిని చవి చూడాలనిపిస్తుంది కదూ!

నీకు నచ్చుతుంది, చూడు దొరికితే

సతీష్ కొత్తూరి said...

నేను కూడా సినిమా పిచ్చోణ్ణేనండి. వందకు పైగా బెస్ట్ క్లాసిక్
హాలివుడ్ మూవీస్ నా దగ్గర ఉన్నాయి. 1940ల నాటి నుంచి.
ఇన్నాళ్లూ బ్లాగుల్లో మీలా క్లాసిక్ మూవీస్ విశ్లేషణ చేసే వారు పరిచయం కాలేదు. మీ విశ్లేషణ చాలా బాగుంది. సుజాత గారు.

సుజాత వేల్పూరి said...

సతీష్ గారూ, థాంక్ యూ!

నా దగ్గర కూడా వెయ్యికి పైగా వరల్డ్ సినిమాలు ఒక హార్డ్ డిస్క్ నిండా ఉన్నాయి. ఏం చేస్తాం, పిచ్చి అలాటిది

అయితే వరల్డ్ సినిమా రుచి చూసాక ఇక మన మామూలు ఫార్ములా సినిమాలు, అందునా లేటెస్ట్ సినిమాలు చేదుగా అనిపించడం సహజం కదా!

మరి కొన్ని మంచి వరల్డ్ సినిమాల్ని పరిచయం చేసే ఆలోచనలో ఉన్నాను.

సతీష్ కొత్తూరి said...

మీరు చెప్పింది నిజం.. హాలివుడ్ లో కొన్ని క్లాసిక్స్ చూశాక
ఇప్పుడు తెలుగులో వస్తున్న మూస సినిమాలు అస్సలు చూడలేకపోతున్నాను. ముఖ్యంగ షిండ్లర్స్ లిస్ట్, ఏ బ్రిడ్జ్ ఆన్ రివర్ క్వాయ్, కాసాబ్లాంకా, సిటిజన్ కేన్ లాంటి మువీలు చూసిన తర్వాత... ఇలాంటి చిత్రాలను మనం తెలుగులో చూసే అవకాశం లేదా అని బాధ కలుగుతుంది. మీరు కంటిన్యూ చేయండి. ఐయామ్ ఈగర్లీ వెయిటింగ్...

Unknown said...

Sujathagaru, I am a great fan of you. I am not able to see your blog in google and after almost 2 years I am able to come into your blog. Pls advice why I am not able to come into your blog.
Pls reply to me.

Post a Comment