October 27, 2020

గుండె గూడు "రిక్షా" ("పల్నాటి వాకిట్లో" ) కథ 1




"ఒరే ముండ నాయాలా, ఇంకొక్క మాట మాట్టాడావంటే పొడిసి పారనూకుతా నిన్ను, పోతావ్ దెబ్బకి" తిరపతి

ఉగ్రుడై పోయి చేతి లో ఉన్న గాజు గ్లాసు నేలకేసి కొట్టాడు.

భళ్ళున పగిలి ముక్కలన్నీ చెల్లా చెదురుగా వాకిట్లో బేతంచెర్ల నాపరాళ్ళ నిండా పర్చుకున్నాయి. 

సాయంకాలపు ఎండ వాటి మీద పడి ఇంట్లోకి వెలుగుల్ని పంపించింది అర్జెంటుగా.

వేప చెట్టు అరుగు మీద గొంతుక్కూచుని టీ తాగుతున్న కోటేస్రావు నింపాదిగా టీ మొత్తం తాగి 

"సంపూర్ణా, ఇట్రా,గళాసు తీస్కబో! మా నాన కాక మీదుండాడు. ఎన్నని కొనేది ఈడి మొహానికి! ఇది ఆరోదో ఏడోదో" అని గ్లాసు

సంపూర్ణం చేతికిచ్చి నిట్టూర్చాడు

"నా, వస్తండావా" ఆటో హారన్ కొట్టారెవరో బయట్నుంచి.

" ఎక్కి కూసో. ఒంటేలు కు బొయ్యొస్తా, ఎక్కి కూసో" పెద్దగా అరిచి చెప్పి ఇంటి పక్క సందులోకి నడిచాడు

"నువ్వొంటేలుకు పొయ్యేది ఊరంతా తెలవాల్నా ఏంది?"విసుక్కుంటూ చేట చీపురు తీసుకొచ్చి గాజు పెంకులు ఊడ్చే పనిలో పడింది సంపూర్ణ

"రేయ్ ముండా, రేపు మాపిటేల కల్లా నా రిచ్చా బాగు చేయించలేదనుకో! సచ్చావే నా చేతిలో కొడకా! తేలి పోవాల

నువ్వో నేనో! కోటయ్య సావి మీద ఆన బెట్టి సెవుతున్నా “

"సర్లే సావీ, నువ్వు పొణుకో పో కాచేపు. రేత్తిరంతా దగ్గు నీకు. సరిగ్గా పొణుకోలా నువ్వు. బాగు చేపిత్తాలే"


"అట్ట ఊరికే మాటలు చెవితే వూరుకోన్రరేయ్ కొండా! దానికి చానా రిపేర్ల్లుండై. ముందు టైర్లో గాలి నిలవట్లా. 

గాలికొట్టిత్తేనో, పంచరేయిస్తోనో సాల్దు. మొత్తం టైరే మార్పిచ్చాల. బెల్లు తాడు తెగిపోయింది. ఎనకమాల మెట్టు చెక్క

ఇరిగి పోయింది.మొన్నొక పేడు ముక్క చపోటు పెట్టి తాడు గట్టా! అహా.. ఉండ్లా

ఆ సైకిల్ షాపోడు సెయ్డు అది. వడ్ల నాగాచారికి చెప్పు. అత్తారబతంగా సేసిత్తాడు. ఆళ్ళ పిల్లల్ని నేనేగా రిచ్చాలో

దింపింది బడికి ! మొన్న మొన్నట్టే అగుపిచ్చిద్ది గానీ ఆ పిల్లలు ఇంజినీర్లై ఉజ్జోగాలు సేస్తన్నారంట.."


ఈ వాగుడంతా కొండ అనబడే కోటేస్రావు కి అలవాటే

"సర్లే నానా" అని వాకిట్లో కి పోబోతుంటే "ఊరికే వాగుతున్నాడని అనుకోబాక. రేపు రిపేరైపోవాల. రేపు మాపిటేలకి నేను

బండెయ్యాల"

"ఎట్టేత్తావయ్యా బండి నువ్వూ?" గాజు పెంకులు గోడవతల పాడేసి వొస్తూ సంపూర్ణ తగులుకుంది మావని

"ఎట్టేద్దావని? ఆ కాళ్ళలో సత్తవుందా? నాలుగడులేత్తేనే అయిదో అడుక్కి మనిషి తోడు గావాల్నే నీకు? నాలుగు ముద్దలు అన్నవైనా సరిగ్గా తినక పోతుంటివే? బండేత్తాడంట బండి. అసలు నీ బండెవరెక్కుతారు?

వూరంతా ఆటోలు తిరుగుతుంటే, రిచ్చాలెవరెక్కుతారియ్యాల? రత్తాలు మొగుడు గూడా ఆ పాత రిచ్చాని గూడుపీకేసి, సిమెంటు బస్తాలెయ్యటానికి తీస్క  పోతుండాడు. బర్రుమని రెండు నిమిసాల్లో తీస్క పోయే ఆటో కి, గంట సేపు

నువ్వు తొక్కితే గానే నాలుగడుగులు పోని రిచ్చాకి తేడా ఉండిద్ది గా?

కొండ బావేత్తన్నాడుగా ఆటో? నువ్వు ఇంట్లో కూకోని ఉంటానికేం? నేనేవన్నా సెయ్యనన్నానా? సెందనన్నానా ?

కాస్త మంచీ సెబ్బరా సూత్తా కూసోమంటే రోగవా? చిన్నోడు అడ్డరోడ్డు కాడ ప్రెండ్సు తో పోయి శాపలు పట్టి

దెచ్చాడు. కూరొండా, తిని పొణుకో మావయ్యా" చివర్లో కాస్త నెమ్మదితనం తెచ్చుకుంది


తిరపతి కి తిక్క రేగి పోయింది


"సేయ్, మేనగోడలివని గూడా సూణ్ణు. కొండ గాడు రిపేరు సేపిస్తానన్నా, నువ్వడ్డం పడేతట్టుగుండావే ? నా రిచ్చామూల బట్టానికి నేనొప్పుకోను. నా వొంట్లో సత్తవుంది. ఎవరెక్కేదేందే ఎవరెక్కేది? మనం రిచ్చా ఏస్తే ఎవురైనా

ఎక్కుతారు. మనం బండెయ్యక పోతే ఎట్ట దెలుసుద్దీ ఈడ బండుందని?

ఐ స్కూలు టీచరు జోస్పేనమ్మ కి నేను గాదంటే బండేసిందీ? రోజూ ఆయమ్మని బడి కాడ దింపి, కబేళా బడిపంతులు గారి పెళ్ళాన్ని కూడా నేనే గదే ఆపీసు కాడ దింపేదీ? నేను రిచ్చా ఎయ్యలేనని నువ్వెట్ట జెవుతావే

నీయమ్మ దొంగ ముండా…? కొడితే లింగంగుంట లాకుల దగ్గర పడతావ్”

సంపూర్ణకి నవ్వొచ్చింది.

తిరపతి చెప్పేవన్నీ పాతికేళ్ళ నాటి సంగతులు. నిన్నో మొన్నో జరిగినట్టు చెప్తున్నాడు.

"సరే యేద్దువుగాని లే రిచ్చా. బయల్దేరాడు ముసలి రాజు గారు యుద్దానికి. లేసి పంపు కాడ రెండు సెంబులు బోసుకోన్రా ! కంచంలో బువ్వేసి తెత్తా”

“నేందిన్ను”

"యా? ఏవొచ్చింది గత్తర ? బానే ఉన్నావు గా? ఇదిగో నాకు మండిందంటే ,మావయ్యా గొంతు బిసికి గోడవతలేస్తా నీకన్నం బెట్టి నేను మిరగాయలు  కొయ్టానికి పోవాల . మూడైద్ది నేనొచ్చే తలికి . పో నీళ్ళు బోసుకో పో


"నీకెన్ని సార్లు జెప్పాలే ముండకానా ? ఆడు రిచ్చా బాగు సెయించాల. నేనన్నం దినాల . వూరుకుంటన్నా గదాని యేసాలెయ్యవాకండి .మొగుడూ పెళ్ళాం ఇద్దరూ దొంగనాటకాలడబాకండి. ముసలోడు రిచ్చా తొక్కలేడని మీరిద్దరూ

అనుకుంటన్నారు గానీ నాకు రిచ్చా ఇచ్చి చూడండి, నల్లుగురిని ఎక్కించుకోని, మల్లమ్మ సెంటర్లో బిజ్జి (బ్రిడ్జి)

ఎక్కిచ్చి సంజా టాకీసు కాడ దింపక పోతే నన్నడగండి. అంతే కానీ వూరక ముండమోపి కబుర్లు చెప్పబాకండి. నీ మొగుడికి జెప్పుకో పో

రేయ్, కొండ నా కొడకా, రేపు మాపిటేల నేను బండెయ్యాలంతే"

సంపూర్ణ కొంచెం తగ్గింది

"సేపిత్తాళ్ళే! నువ్వు తొక్కలేవని మా బయం. ఆ రిచ్చా సంగతీ, నీ సంగతీ మాకు తెలవగ్గాదు . తొక్క లేక

పడిపోతావని కొండ బావకి బయ్యం"

కోడలు తగ్గిన కొద్దీ తిరపతి రెచ్చి పోయాడు

"మీ సావులు మీ జావండి. రిచ్చా రిపేర్ చేపిచ్చరా లంజ కొడకా అని మొన్న తిరణాలకి ముందు నించీ సెవుతున్నా ఇనిపిచ్చుకోట్లా! దాని మీదెందుకు డబ్బులు బెట్టేది, కోకో రెయికో కొనవని సెప్పుంటావు ..ఆడంగి నా

కొడుకు సరే అనీ..." దగ్గు తెర అడ్డొచ్చి, ఆపకుండా దగ్గుతూ వొంగి పోయి కూలబడ్డాడు

"ఇదుగో ఇందుకే జెప్పేది. ఇంకా వాగు. వాగయ్యా వాగు. సచ్చి పోతావు, పీడా బోయిద్ది. నీ కొడుకొచ్చి నన్నుజంపి పార్నూకి ఇద్దర్నీ ఒలుకుల్లో పొణుకోబెడతాడు పోదాం పా! అరె, తొక్కలేవయ్యా అని ఎంత జెప్పినా ఇనే పనే లేదు, ఒదినా , ఓ మానిక్కెవొదినా , ఇట్రా ఇట్రా, మావయ్యకిమందెయ్యాల, పొట్టుకో, ఏపిచ్చుకోని సావడు, ఈడికి వాయవ రానూ"  పక్కింటి మాణిక్యాన్ని కేకేస్తూ , మందుసీసా కోసం ఇంట్లోకి పరిగెత్తింది


###########


"ఈ ముసలోడితో నా వల్ల గాదయ్యోవ్" టీ తాగుతూ దాదాపు ఏడ్చినంత పని చేశాడు కొండ

"మళ్ళీ ఏం జేశాడ్రా ?" కొట్టు నాగయ్య పొంగుతున్న టీని గరిటె తో కలుపుతూ అడిగాడు

తిరపతి చేసే రచ్చ మీద ఎవరికీ సందేహాలే లేవు

"ఏందనా, రిచ్చా బాగు జేపిచ్చే దాకా తిండి తిండంట. మాడి పోతన్నాడు. రేప్మాపిటేల కల్లా రిచ్చా రిపేర్

చెయ్యిచ్చాలంట. అదేసుకోని తొక్కుతాడంట. అసలెట్టా తొక్కుదావనీ? ఎవరెక్కుతారు? సరే ఎవురో ఒకేక్కుతారు

సరే, ఈ మడిసి ఎట్టా తొక్కుతాడు? తొక్కే సెత్తి ఉందా అసలు? ఊ అంటే, ఆ రిచ్చా మా కంటే ముందొచ్చిందంటాడు.

దాని మీద అందర్నీ పెద్ద జేశానంటాడు. ఎవరు గాదన్నారు? ఇన్ని ఆటోల మజ్జెన, మన సేరింగాటోలకే ఫుల్లు గిరాకి గతి లేక పాయెనే , ఆయన రిచ్చా ఎవడెక్కుతాడు? రిచ్చా ఎక్కితే ఎప్పటికి జేరతాం లే అనే గదా అందరూ

ఆటోలెక్కేది? అసలు ఆటోలొచ్చినాక ఇంకా రిచ్చా ఎక్కే ముండ నాయాళ్ళెవురైనా ఉండారా? ఉంటారా? మొన్న ఈస్పర మహలు కాడ జూశా, మా నాన లాంటోడే, మొండి ముసలోడొకాయన ఎవుర్నో రిచ్చా ఎక్కిచ్చుకోని , లాక్క

పోతండాడు . ఆ రిచ్చా కదల్దే? నాకే జాలేసి, ఆ ముసలాయన చేతిలో యాబై రూపాయలు బెట్టి "ఇంగ బోయ్యోవ్, కాస్త తాగేసి ఇంటికి పొయ్

పొణుకో, అందుకేగా ఈ తిప్పలు?" అన్నా

ఇప్పుడు మా నాన రిచ్చా మీద డబ్బులు బెట్టేదెందుకు? ఆయనేవైనా రోజూ తొక్క బోతాడా? ఒక్క రోజు ఎక్కితే గా

తెల్చేది? ఇంటాడా? ఇనడు "


"పోన్లేరా కొండా, ఏదో పై పైన జేయిచ్చు. ఊరికే దాన్ని తుడుచుకోనైనా, 'నా రిచ్చా' అని సూసుకోని మురుస్తాడు"

ఎవరో సలహా ఇచ్చారు

"సాల్లేయ్యోవ్, మా నాన ఆ టైపు గా కనపడతుండాడా? ఆ వజాన ఎవర్నో ఒకర్ని ఎక్కిచ్చుకోని తొక్కాలంట. ఇంగా దానికి అడ్డమైన సోకులన్నీ జెయ్యాలంట." 

"రిచ్చాలో సోబన బాబు పుటోలు

 బెట్టాలంటనా ఏంది?" పొగాకు కాడలు విడదీస్తూ అడిగాడు నాగయ్య

"అబ్బ, అవును బాబాయ్, సాయిత్రీ,కిష్న కుమారీ ఎప్పటోళ్ళు? వాళ్ళ ఫుటోలు ఎవరు జూత్తారంటే ఇని సావడు!

అసలు ఆ ఫుటోలు యాడ  దొరుకుతయ్యిప్పుడూ? ఆపోజిట్టు సైడు పక్కల సూసుకోటానికి అద్దాలు బెట్టాలంట " నిస్పృహ గా అన్నాడు కొండ

"నాగయ్య బాబాయ్, నువ్వు రిచ్చా మానేశావుగదా, ఏం జేత్తన్నా?"

సిగిరెట్ ముట్టిస్తూ అడిగాడు ఆటో రాములు

"రిచ్చా పాతబడి పోయిందబ్బాయ్!రేత్తిరి కాడ కళ్ళు కనబడి సావట్లా! అదీ గాక  రిచ్చాలు ఎవురెక్కుతున్నారు? తొక్కే సత్తవ గూడ లేదులే

అందుకే, అంకమ్మ గారి పొలంలో కావిలికి ఉంటన్నా రేత్తిర్లు"

కొండ కి గుండెలో కలుక్కుమంది. 'కళ్ళు సరిగా ఔపడక పోయినా పాపం చీకట్లో పోయి ఆ చలి కి ఎట్ట కావిలి కాత్తాడీ

మడిసి?' అనిపించింది.

"బాబాయ్, ఎవరూ లేరనుకోమాక. ఏదన్నా అవుసరం బడితే దబ్బున కేకెయ్యి. డబ్బులైనా సరే, ఒక రూపాయ్ నీకిస్తే నాదేం వొరగబడి పోదులే! రేత్తిరికి మా ఇంటికి రా, అందరం కల్సి తిందాం ఇయ్యాల. శానా రోజూలైంది నువ్వు

ఔపడి"

నవ్వాడు నాగయ్య చుట్ట పొగ పీల్చి.

"ముసిల్దానికి బాగలేదు కొండా! దాన్నొదిలి పెట్టి యాడికి రమ్మంటా?" అన్నాడు

అసలే కొండ మనసు మెత్తన. ఆ ఇద్దరు ముసలోళ్ళూ ఒంటరిగా పొలం కావిలి తో వచ్చే నాలుగు డబ్బుల్తో

బతుకీడిస్తున్నారని తెల్సి కుదేలై పోయాడు

"ఇదిగో, నువట్టా మాట్టాడబాక. ముందీ రెండొందలుంచు. అన్నానికి రాబోతేమాల్లే "

నాగయ్య మొహమాటపళ్ళేదు. మొహమాటం తనలాంటోళ్ళకి పనికి రాదని ముసలి ప్రాణానికి తెలుసు.

"మాయ్యే" అని తీసుకున్నాడు. 

కళ్ళు తడవుతుంటే మొహం అటు తిప్పుకున్నాడు కొండ ఉమ్మేసే వంకతో


###############


చెక్క గేటు ఎత్తి పెట్టి, నిశ్శబ్దంగా ఇంట్లోకొచ్చాడు కొండ.

ఆటో దూరంగా వేపచెట్టు కింద పెట్టి వచ్చాడు అయ్య లేస్తాడని.

నిద్ర కి భంగం అని కాదు, మెలకువతో ఉంటే నానా బూతులూ లంకిచ్చుకుంటాడు రిచ్చా రిపేరు చెయ్యిచ్చలేదని

"తిన్నాడా నాన?" గొంతు తగ్గించి అడిగాడు

"తిన్లా! పిలగాళ్ళు చాపలు పట్టి తెస్తే తీసుకున్నా. కూర చేసినా తినకుండా పడుకున్నాడు" అంది

వేపచెట్టు కిందున్న చెక్క బల్ల మీద అటు తిరిగి పడుకున్న తిరపతిని దిగులుగా చూశాడు కొండ

చిరిగి పోయిన లుంగీ కాళ్ళ మీద రెప రెప లాడుతోంది. మాసి పోయిన బనీను. ఒంట్లో కండే లేదు. రిచ్చా ఎట్టు దొక్కుతాడీ మడిసి?

"సరే, లేస్తే తింటాళ్ళే, నాకన్నం పెట్టు, ఉడుకు నీళ్ళున్నయ్యా? స్తానం జేత్తా" తడికల గదికేసి నడిచాడు


###########

"నానా, రిచ్చా పనైంది ! నువ్వు రోజూ రిచ్చా తొక్కుతానంటే నేనూరుకోను. వూరక అట్ట బోయి ఇట్ట రావాల. అది గూడ ఎప్పుడన్నా.

ఊరుకుంటన్నా గదాని ఎగస్ట్రాలు చెయ్యబాక . నీ వొంట్లో సత్తవ లేదు. నీ ఎమ్మడి బాలిగాణ్ణి పంపిత్తా"

"బాలిగాడా, ఆ నా కొడుకు …..."

"ఇంగాపెయ్" కొండ గొంతులో కోపం చూసి తగ్గాడు తిరపతి.

"బాలిగాడు నిన్నెక్కిచ్చుకోని, సిత్రాలయ సినిమాహాలు కాడ దింపుతాడు. ఆణ్ణించి ఏవైనా బేరాలొస్తే తొక్కు. ఎక్కువ దూరాలు పోబాక. దగ్గర దగ్గర్నే జూసుకో . మళ్ళా ఇంటిదాకా బాలిగాడే తెత్తాడు నిన్ను. ఇంత దూరం

తొక్కలేవు నువ్వు. ఒప్పుకుంటావా రిచ్చా తీస్కో! లేదంటే అమ్మి పార్నూకుతా, సెప్పే పని గూడ లేదు సూస్కో మరి"

రిక్షా వైపు చూశాడు తిరపతి. టైర్లు మార్పించాడు కొడుకు. రిక్షా ఎక్కే చెక్క మెట్టు కొత్తది పెట్టించాడు. 

గూడు లోపల అటూ ఇటూ రెండు అద్దాలు. వాటి పక్కనే పాతయ్యే గానీ, జై ప్రదా, రామారావు ఫొటోలు

  రిక్షా టాప్ అటూ ఇటూ కిందకి దిగే చోట రెండు పక్కలా కూడా నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్న రామారావు, నాగేస్రావు బొమ్మలు.

సీటు నొక్కి చూశాడు. 

పాతదే కానీ బానే ఉంది

హాండిల్ దగ్గర్నుంచి రిమ్ముల మీదుగా తాడుతో కట్టిన బెల్లు ని లాగి చూశాడు. 

ఖంగున మోగిన బెల్లు తిరపతిని

ఏవో లోకాలకి తీసుకుపోయింది. గుంటలు పడ్డ కళ్ళు మిల మిలా మెరిసి పోయాయ్

రోజంతా బండేసి, రేత్తిరికాడ మళ్ళా రైసు మిల్లు బస్తాలేసిన రోజులు గుర్తొచ్చాయ్. స్కూలు పిలకాయల్ని ఉదయం,

సాయంత్రం దింపిన రోజులు, ఒంటి పూట బడప్పుడు ఎర్రటి ఎండలో ఉషారుగా రిక్షా తొక్కిన రోజులూ !

తనూ, మల్లమ్మా పిల్లల్ని నాగయ్య పాకలో వదిలేసి తన రిక్షా మీదనే సెకండ్ షో కి నేల టికెటు కి పోయిన రోజులు గుర్తొచ్చాయ్

కూతురు పెళ్ళికి రిచ్చా తాకట్టు పెట్టిన రోజులూ, అది లేక ఏం చెయ్యాలో తెలీక, అద్దె రిక్షా తొక్కడం ఇష్టం లేక నలిగి

పోయిన రోజులు, ఎండా కాలం లో పల్నాడు బస్టాండ్ కాడ యాప సెట్టు కింద మజ్జానాలు మగత గా నిద్ర పోయిన

రోజులూ, గడియార స్థంబం కాడ సలివేంద్రం లో నల్లకుండలో నీళ్ళు తాగి ,గోనె పట్టా చుట్టిన ప్లాస్టిక్ సీసాలో నీళ్ళు నింపుకోని మాట్నీలకి పోయే పోయే ఆడోళ్ళని తన రిక్షాలో ఏంజెల్

టాకీసు కాడా, నాగూర్ వలీ టాకీస్ కాడా దింపిన రోజులు గుర్తొచ్చాయి. 


రిక్షాల పోటీలు జరిగినప్పుడు తనూ,

నాగయ్యేగా గెల్సేదీ? నూట పదార్లిస్తే ఎంత గొప్ప గా ఉండేది!

అందులో యాబై రూపాయలు తనకియ్యాలని మల్లమ్మ ముందే చెప్పేది. సచ్చి యాడుందో గానీ, పిల్లల కోసం యాడాడ డబ్బూ దాచాల్సిందే అనేది. 

కడుపు నిండా తినకనే గా ఆ మాయరోగం ఒచ్చి మిత్తవ పట్టక పోయింది

ఇప్పుడెవురెక్కుతారు రిచ్చాలు! పది రూపాయలు సేతిలో పెట్టి ఎక్కి కూసుంటే బర్రుమని నిమిసాల్లో దింపేసుద్ది

ఆటో. 

ఒక్కో ఆటోలో కుక్కి కుక్కి ఎనిమిది పది మంది దాకా ఎక్కిత్తారు. కొండా కూడా అట్నే ఎక్కిచ్చి, ఒక్క పిర్ర మీద కూసోని తోల్తాడు. ఎంత పీడు గా పోనిత్తాడో ముండ నాయాలు! అంత పీడు గా పొయ్యే ఆటో, అదీ పది

రూపాయలకే ఎక్కిచ్చుకుంటంటే, ఇరై ముప్పయి రూపాయలిచ్చి డొక్కు రిచ్చా ఎవుడెక్కుతాడు నిజంగానే

ఏట్లో నీళ్ళే గాదు, ఎయ్యయినా సరే, కొత్తయి ఒచ్చినయ్యంటే పాతయి పోవాల్సిందే! మరి రిచ్చా తొక్కటవే తెల్సినోళ్ళంతా ఏవై పోవాల? సచ్చి పోవాలా? తనకంటే కొడుకుండాడు, ఇంత ముద్దేత్తాడు, మరి నాగయ్య లాంటోళ్ళు

ఇంగో పని చాతగాకే గా పొలం కావిలి కి బొయ్యేది? 

ఆటో తొక్కేది యాడొచ్చిద్ది ముసిలోడికి? డబ్బులెయ్యి?

సత్తవేది? యాపారాలు జేసేదానికి డబ్బు దాపెట్టుకునే సందేదీ? 

ఏ రోజు తొక్కిన డబ్బులు ఆ రోజుకే తిండి తిప్పలకే పాతండె !


"మావో" బాలయ్య గట్టిగా పిల్చాడు

తెప్పరిల్లి చూస్తే, తన వైపే చూస్తూ కొడుకు కొండ

దిగులుగా నవ్వాడు తిరపతి "సరే, ఎప్పుడన్నా యాస్తా బండి" ఒప్పుకుని, సీటు నిమిరి రిక్షా ఎక్కి కూచున్నాడు,

బాలయ్య సీటెక్కడం చూస్తూ


# ## ##

చెట్టు కింద రిక్షా లో కాళ్ళు వేలాడేసుక్కూచుని రెండు గంటలవుతున్నా ఒక్కళ్ళూ రాలేదు రిక్షా ఎక్కడానికి

తిరపతికి ఉక్రోషం, కోపం, నిస్సహాయతా..అన్నీ కలిపి వచ్చేస్తున్నాయి.

కొడుకు ముందు యెదవలా నిలబడాలేమో అన్న భయం కూడా

ఒక్కరైనా రిక్షా ఎక్కరా అన్న ఆశ! ఆటోనే కాదు, రిక్షా కూడా గమ్యం చేరుస్తుందని ఒక్కరైనా నమ్మరా అని ఎదురు చూపు


ఆటోలదే రాజ్జెం ఇంగ..అని అంగీకరింపు

" యోవ్ , ఒచ్చిద్దా రిచ్చా ?” ఉలిక్కి పడి చూశాడు

ఎదురుగా ఎవరో పల్లెటూరు మడిసే, చేతిలో కూరల సంచీ, మరో చేతిలో టిపినీ డబ్బా

ఆలస్యం చేయకుండా లేచి కండవా దులిపి బుజాన వేసుకుని 

"యాడికయ్యా?" అన్నాడు అటెన్షన్ లోకి వచ్చేస్తూ

"ఈడేలే! అల్లక్కడ ఇనుకొండ రోడ్ లో రైసు మిల్లు కాడికి"

"వత్తా, ఎక్కయ్యా" సీటు తుడిచి ఎక్కాడు

అతడు ఎక్కి కూచున్నాక తొక్కడం మొదలు పెట్టాడు. అలవాటైన తొక్కుడు, అలవాటైన రిక్షా, అలవాటైన రోడ్డు.

కానీ అలవాటు చేసుకోని ముసలి తనం తొక్కుడికి అంతగా చెయ్యి ఇవ్వటల్లా

"రోడ్డు మెరక లో ఉందయ్యా, తొక్కుతుండా" అతను అడక్కుండానే సంజాయిషీ ఇచ్చాడు

"ఆ ఆ, తొందరగా బోవాల! కానీ" మధ్యలోకి జరిగి అద్దం చూసుకున్నాడా మనిషి

రిక్షాకి అటూ ఇటూ ఆటోలు రయ్ రయ్ మని దూసుకు పోతున్నాయి. అవి అలా తనని దాటి పోతుంటే, కాసింత రోషం వచ్చింది గానీ, రోషం వల్ల శక్తి రాలేదు.

తను ముసలోడై పోయి, తన స్థానంలో కొండా ఇంటి పెద్ద అయినట్టే, రిక్షా పాత బడి పోయి, దాని స్థానాన్ని ఆటో

ఆక్రమించిందని అకస్మాత్తు గా తిరపతి కి తోచింది.

"ఈడే, ఆపాపు"

ఆటో దిగి ఎంత అని అడక్కుండానే 40 రూపాయలు తీసి తిరపతి చేతిలో పెట్టి "ముసలోడివై పోలా? ఇంగా ఏం తొక్కుతావు లే రిక్షా! గడిస్తే ఇంటి కాడ కూసో. లేదంటే ఏరే పని జూస్కో రాదూ. “ అని ముందుకు నడిచాడా మనిషి

రైసు మిల్లు కాడ అని చెప్పి ముందే ఎందుకు దిగాడో అర్థం కాలేదు తిరపతికి. కానీ చాలా రోజుల తర్వాత తను

సంపాదించిన నలభై రూపాయలు చేత్లో మెత్తగా తగిలాయి.

ఖాళీ రిక్షా తొక్కుకుంటూ తిరిగి మల్లమ్మ సెంటర్ కి వచ్చే సరికి నరాలు ఊడి పోయినట్టనిపిచ్చి, చెమట

తుడుచుకుంటూ రిక్షా లో కూల బడ్డాడు ఎదురొచ్చాడు బాలయ్య

"బేరం దొరికినట్టుందే మావకి? పద పద, ఎండగా ఉంది. సంపూర్ణమక్కాయ్ తిట్టిద్ది నన్ను నీకేదైనా అయితే, ఇంగ

జాల్లే పా, ఎక్కు "రిక్షా హాండిల్ చేతిలోకి తీసుకున్నాడు


##### ##########

"తొందరగా రా "  ఎదురుగా వచ్చిన కోటయ్య చేతిలో 50 రూపాయలు పెట్టాడు కొండ


"యోవ్ కొండా, రిచ్చా లేదు బొచ్చా లేదు. ఇంగాపెయ్ ఆయన్ని ఏదో ఒగటి జెప్పి. లేదంటే నీకే కష్టమై పోయిద్ది

యాడన్నా పడ్డాడంటే! ఎట్నో తొక్కాడు గానీ ఆడ ఒంట్లో ఓపిక లేదు తొక్కాలనే మొండితనం దప్ప" డబ్బు

తీసుకుని ఉచిత సలహా ఒకటి పారేసి వెళ్ళి పోయాడు తిరపతి రిక్షా ఎక్కి దిగిన కోటయ్య 

 

రాత్రికి ఇంటికొచ్చిన కొండ చెట్టు కింద అరుగు మీద కూచుని చుట్ట కాల్చుకుంటున్న తండ్రిని చూశాడు


"యారా? పెందలాడొచ్చావేంది?" అన్న ప్రశ్నకి "ఏం లా" అన్నట్టు తలూపి "బేరం దొరికిందంటగా ఇయాల?

బాలిగాడు చెప్పాళ్ళే! రేప్పొద్దున ఇసప్పాలెం కాళికమ్మ గుడి కాడికి పో నానా ! ఎవురో ఒకరు ఎక్కుతార్లే" అన్నాడు

జవాబు చెప్పలేదు తిరపతి

"తిన్నాడా?" పెళ్ళాన్ని అడిగాడు గొంతు తగ్గించి 

"నిన్న పెట్టిన చాపల కూర ఏసుకోని కడుపు నిండా తిన్నాడు" చాటంత మొహం చేసుకుంది

"సరే, అన్నవేసి కూర పడెయ్. తినేసి పోవాల. దేవరం పాడు తిరణాల కి పోతా. బేరం బాగుంటది. రికార్డింగ్ డాన్సుందంట, జనం బాగొత్తారు .నాలుగైదు ట్రిప్పులేస్తే కాసిని డబ్బులొస్తాయి. రమేషు కి స్కూలు బట్టలు కొనాలగా "

"మయ్య నా పోలికే" పైకే అనుకున్నాడు తిరపతి 

------------------------------------------------

---సుజాత వేల్పూరి 

(సెప్టెంబర్ 2019 సారంగ పత్రికలో ప్రచురితం) 

13 comments:

విన్నకోట నరసింహా రావు said...

మీ నరసారావు పేట యాస ఎంత బాగా వ్రాశారండి!అక్కడే పుట్టి పెరిగినా కొంత మందికి బయట వినిపించే ఆ పదజాలం, యాస పట్టుబడడం కష్టం. ఎవరైనా మాట్లాడుతుంటే అర్థమవుతుంది, వ్రాతలో ఉంటే చదివి అర్థం చేసుకోవచ్చు ... కానీ ఆ రకంగా మనం మాట్లాడగలగడం కొంచెం అరుదు. ఇంక దాంట్లో వ్రాయడం అంటే .... మరింత కష్టసాధ్యం. మీరు బాగానే పట్టుకున్నారే. ఒక సీనియర్ మహిళా బ్లాగర్ గారు విశాఖపట్నం యాస బాగా వ్రాస్తారు. మరొక సీనియర్ బ్లాగర్ “కష్టేఫలి” శర్మ గారు కూడా తూర్పు యాస బాగా వ్రాయగలరు. మీరు కూడా ఆ కోవకే చెందుతారు. పైన మీరు వ్రాసినది సుళవుగానే అవుతోంది ఒకటి రెండు పదాలేవో మినహా (ఒలుకులు, వాయవ) (బహుశః, వేణుశ్రీకాంత్ వంటి నరసారావు”పేట్రియాట్” లకు ఇబ్బందుండదేమో లెండి 🙂)

తండ్రి పట్టుదల చూసి కొడుకు ఎవరికో డబ్బులిచ్చి, వెళ్ళి తన తండ్రి రిక్షా బేరమాడుకుని కట్టించుకోమనడం ... అద్భుతమైన gesture. అసలు తండ్రి తిరుపతి ఆత్మగౌరవాన్ని బాగా చిత్రీకరించారు. వయసు పెరిగినా కూడా ఇంకా స్వతంత్రంగా బతకాలనే కోరిక వయసు పెరిగే కొద్దీ మనిషిలో చాలా బలంగా తలెత్తుతుంటుంది. అది బాగా చూపించారు మీ కథలో.

మంచి ఇతివృత్తంతో చక్కటి కథ అందించారు.

విన్నకోట నరసింహా రావు said...

గూడు రిక్షా ఫొటో పెట్టారు. అంటే అవి ఇంకా తిరుగుతున్నాయాండి? ఆ రిక్షావాశ్ళు బహు ఆశాజీవు ల్లాగా ఉన్నారే ?

సుజాత వేల్పూరి said...

చాలా చాలా ధన్యవాదాలు నరసింహా రావు గారూ

అక్కడ పుట్టి పెరిగి ఆ జీవితాలను గమనిస్తూ ఉండటం వల్ల కొంత వరకూ రాయగలిగానేమో. కానీ పూర్తిగా కాదు

ఇంట్లో మాట్లాడే భాష ఇది కాక పోవడం వల్ల, టౌన్ లో ఉండటం వల్ల, ఆ పచ్చి భాషను పూర్తిగా అవలోకనం చేసుకోలేక పోయాననే ఒప్పుకుంటాను

ఆ వూరు వదిలి పాతికేళ్లయింది. ఎప్పుడ్దైనా పుట్టింటికి వెళ్లడం తప్ప.
కొన్నాళ్ళు ఇలాగే ఉంటే అసలు పూర్తిగా మర్చిపోతానేమో అనిపించి ఇలా రాయడం మొదలు పెట్టానండీ

ఓపిగ్గా చదివారు, (మనది కాని భాష చదవడానికి ఆ మాత్రం ఓపిక కావాలి కదా సార్)



ఇక ఈ గూడు రిక్షా ఫొటో పాతదేనండి (వేణూ శ్రీకాంత్ ఈ ఫొటోని వినుకొండ లో తీశారు)

రిక్షాలు ఇప్పుడు కూడా అరుదుగా ఒకటీ అరా కనిపిస్తూనే ఉంటాయి గానీ, కథలో చెప్పినట్టు గానే ఎవరూ ఎక్కడం లేదు

Harshavardhan said...

అద్భుతం గా రాశారండీ సుజాత గారు. నరసారావు పేట యాస మా నెల్లూరు యాసకి ఇంత దగ్గర గా ఉంటుందని నాకు తెలియదండి. మా అందరికి సంపూర్ణ పాత్ర చాలా నచ్చిందండి. మీరు అనుమతి ఇస్తే మేము హర్షణీయం లో మీ కథ ని ఆడియో రూపం లో ప్రచురిస్తామండీ.

శ్యామలీయం said...

చాలా సజీవమైన కథ. బాగుంది. తొలకరి వాన తెచ్చే మట్టివాసన పరీమళం సెంటుసీసాల్లో దొరికే సువాసనల కన్నా భిన్నంగానే కాక మిన్నగా ఎలా హృదయంగమంగా ఉంటుందో అలా ఉంది జనంభాషలో కథనం. నగరాల్లో కలగాపులగం భాషనీ టీవీ చానెళ్ళ వింతవింతల భాషనీ భరించలేక చేస్తున్న వాళ్ళకు జీవద్భాషని రుచిచూపించారు.

సుజాత వేల్పూరి said...

ధన్యవాదాలు హర్షవర్ధన్ గారూ, హర్షణీయం మీ బ్లాగా? యాస అందం చెడకుండా చదవగలిగితే చదివి ఆడియో పెట్టండి. యాసే ఆ మాండలికాలకు అందం కదా

పెట్టాక ఇక్కడ లింక్ ఇవ్వండి. నేను కూడా వింటా

సుజాత వేల్పూరి said...

శ్యామలీయం గారూ, ధన్యవాదాలు సర్. కల్తీ లేని భాష ఎప్పుడూ కమ్మనిదే కదా

సిటీల్లో చేరి కలగా పులగం చేసుకున్నాం గానీ


నీహారిక said...

కధ ఇతివృత్తం అధ్భుతం. కధ మొత్తం ఒకే యాసలో వ్రాయలేదు. పాత్రలు ఒక యాస మాట్లాడుతుంటే కధకుడు/రాలు ఒక యాసలో చెపుతున్నారు.
చదువుతున్నపుడు రెండూ కలగలుపుకోవలసి వచ్చింది.
అయినా బాగుంది.

సుజాత వేల్పూరి said...

అవును నీహారిక గారూ, కథ మొత్తం ఒకటే యాస లో లేదు.సంభాషణలు మాత్రమే యాసలో ఉన్నాయి. నెరేటర్ భాష జనరల్ వ్యావహారికంలో ఉంది. ఈ పద్ధతి ప్రిఫర్ చేస్తాను నేను

ఎందుకంటే ఈ యాస ను నేను చుట్టు పక్కల చూడటమే కానీ, నేను మాట్లాడే భాష కాదు. అందుకే నేను పరిశీలిచిన మనుషులను వారి యాసలోనే మాట్లాడనిస్తూ, కథ రూపంలో నా భాషలో పరిచయం చేయాలని సంకల్పించాను

కథ నచ్చినందుకు థాంక్ యూ

ఇంకా రాశాను.అన్నీ పల్నాడు జీవిత కథలే

ఒక్కొక్కటీ పబ్లిష్ చేస్తాను

Harshaneeyam said...

Madam can we have your Gmail I’d please

సుజాత వేల్పూరి said...

హర్షణీయం గారూ,

క్షమించాలి, ఈ మధ్య సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకోవడంతో, మీ కామెంట్ ని పొరఫాటున రిప్లై ఇవ్వకుండా ముందుకు వెళ్ళిపోయాను

నా మెయిల్ ఐడీ

VLSUJATHA98@GMAIL.COM

సుజాత వేల్పూరి said...


హర్షవర్ధన్ గారూ, మీరే హర్షణీయం పేరుతో కూడా వ్యాఖ్య రాశారనుకుంటాను. నా ఈ మెయిల్ ఐడీ ఇచ్చాను చూడగలరు.

థాంక్ యూ

Harshavardhan said...

Thank you Sujatha garu. We will contact you.

Post a Comment