February 4, 2021

సైదమ్మ వీలు నామా ((పలనాటి వాకిట్లో కథ)

 

       (సోషల్ మీడియా నుంచి కొంత బ్రేక్ తీసుకోవడంతో ఆల్స్యంగా మూడో కథ ప్రచురిస్తున్నాను ) సైదమ్మ వీలు నామా

“ఏం పిన్నావో ? జాం  సేపు గాలా నువ్వొచ్చి? పిలుత్తుంటే పలకవే?  పొణుకున్నావా ఏంది ?” చిల్ల కంప దడి అవతల్నుంచి సాంబ్రాజ్యం కేక విని , చిక్కుడు కాయలు బుట్ట నిండా నింపుకుని పందిరి కింద నుంచి ఇవతలికొచ్చింది సైదమ్మ

పని చేయాలన్న ఉత్సాహం ముందు, వంగి పోయిన నడుం ఎప్పుడూ అడ్డం కాదాయె

” మాయ్ సాంబ్రాజ్యం, ఇయాల జాంకాయలు మొత్తం అమ్మలా! గుండె దడ గా ఉండి కాచేపు పొణుకోవాలనిపిచ్చి బడి వొదిలే దాక ఉండ్లా! ఇంటికొచ్చేశా. ఆ బుట్టలో ఉండయ్యి !  మస్తాన్ ని రమ్మను. తీస్కబోతాడు”

“సిక్కంగా టీ పెట్టి పంపిత్తా, పొణుకో నువ్వు, నీ సిక్కుడు కాయలు తగలబడ ”  దడి అవతలికి వినపడేలా అరుస్తూ పొయ్యి కింద పుల్లలు పెట్టింది సాంబ్రాజ్యం

“ఎవురే ఈ ముసల్ది? ఎప్పుడూ అవుపించలా?” ఇప్పర్ల నుంచి “ఏం పిన్నావో ? జాం  సేపు గాలా నువ్వొచ్చి? పిలుత్తుంటే పలకవే?  పొణుకున్నావా ఏంది ?” చిల్ల కంప దడి అవతల్నుంచి సాంబ్రాజ్యం కేక విని , చిక్కుడు కాయలు బుట్ట నిండా నింపుకుని పందిరి కింద నుంచి ఇవతలికొచ్చింది సైదమ్మ

“నువ్వొచ్చిందెప్పుడే అసలు ! ఈ గుడిసె లో ముప్పై ఏళ్ల  నించీ ఉంటంది.ఎంత పెద్ద తోటో చూశావా? ఒంటి సేత్తో పెంచింది.   కూరా నారా యేసి అమ్మిద్ది . జాంకాయలు కోసక పోయి బడి కాడ కూసుంటది”

“వాయబ్బో! శానా యావుందే . మొగుడు పొయ్యాడా ఏంది? ఎవరూ లేరా ? పిల్లలో?” మట్టి నేల  అలకడానికి పుట్టమట్టి తడిపి పేడలో కలిపింది

“ఎందుకడుగుతావు లే! పాపం పిన్నావది ఏడుపు కతే! ఆ మడిసి కాబట్టి అంత గుండె దైర్నం తో ఉంది కానీ ఇంకోళ్ళయితే ఏ సాగర్ లోనో, సత్రశాల్లోనో దూకి సచ్చే వాళ్ళే”

సైకిల్ టైరుని కర్రతో తిప్పుకుంటూ పరిగెత్తుకు వస్తూనే జాంకాయల సంగతి విని ఉషారు గా సైదమ్మ గుడిసెలోకి పోయాడు  మస్తాన్

“ఏరా దొంగ నా బట్టా, నిన్న మాయిటేల కాళ్ళు   తొక్కటానికి  రమ్మంటే రాలా?ఏం వాయవొచ్చింది?”  జాంకాయలు ఒక బొచ్చెలో వేసి వాడికిచ్చింది

 

“పోమ్మోవ్, నేను సదువుకుంటుండా అప్పుడు! మా లెక్కల మాష్టారు బో రాచ్చసుడు. సేతులు ఎనక్కి తిప్పి బొమికల మీద కొడతాడు. పేణం పోయిద్ది. అందుకే లెక్కలు సేసుకుంటన్నా అప్పుడు నాకు లెక్కల్లోతొంబై  యేడు  మార్కులొచ్చినై మూణ్ణెల్ల పరీచ్చల్లో ! ఆర్నెల్ల పరీచ్చల్లో వంద రాబోతే గొంతు మీద కాలేసి తొక్కుతాడంట” ”

"మయ్యే, సదూకో సదూకో! మీ నాన లాగ నువ్వు గూడా మట్టి పనికి పోబాక . సర్లే గానీ,ముందు  కాచేపు కాళ్ళు తొక్కి పోరా”

“మరి రేపు ఉసిరి కాయలు కోసుకుంటా . ఉసిరి కాయ తిని  మంచినీళ్ళు తాగితే నోరు బో తీపి ”

“సచ్చినోడా, మళ్ళీ బేరం పెట్టా? సరే కోసుకుందువు లే”  వాకిట్లో అరుగు మీద నడుం వాల్చింది సైదమ్మ. రోజంతా తిరిగి తిరిగి సాయంత్రానికి కాళ్ళ నొప్పులతో మస్తాన్ ని పిలుస్తుంది కాళ్ళు తొక్కించుకోడానికి

నున్నగా అలికిన  నేల మీద తడిపిన సున్నంలో పుల్ల ముంచి  చుక్కల ముగ్గులు పెడుతోంది సాంబ్రాజ్యం.

“అది గాదే, ఓ  అరెకరం ఉండదూ ఆ ఇంటి స్థలం? ఏం జేసుద్దీ ? అటాత్తుగా పోతే చూసే దిక్కులేదంటుంటివి” చెల్లెలు కుతూహలం మళ్ళీ

“నీకెందుకే ఆత్రం ముండా ? సవితి కొడుకున్నాడు లే . ఆయనొచ్చి చూసి పోతాడు అప్పుడప్పుడూ”

“ఆళ్ళ కాడే పడుండచ్చు గా ఈ ముసల్ది?”

ముగ్గేయడం ఆపి చెల్లెలు మొహంలోకి చూసింది దీర్ఘంగా “అట్టా “పడుండే రకం” కాదు పిన్నాం!బో రోసగత్తె

పెళ్ళయిన ఆరేడేళ్ల దాకా పిల్లలు పుట్లేదని మొగుడు సడి సప్పుడూ లేకుండా రెండో పెళ్ళాన్ని తెచ్చుకున్నాడు. ఎప్పుడూ? ముప్పయ్యేళ్ల  పై మాటేనంట. మనం పుట్లా  అప్పటికి.

మొగుడి మీద తిరగబడిందంట. పుట్టింటి నుంచి కూడా ఎవురూ రాలేదంట మాట్టాడే దానికి. సర్దుకోని ఉండమన్నారంట. గొడ్రాలు కదా యాడకి బోయిద్ది లే అనుకున్నారట్టుగుంది

మెళ్ళో తాడు గూడా తెంపి మొగుడి మొహాన పార్నూకి కట్టుగుడ్డల్తో వొచ్చేసిందంట. కోటప్ప కొండ కాడ ఏదో సత్రం లో ఒండుకుంటా.. పిడకలు చేసి,  కలుపుకి, నాట్లకి పొయ్యి పొట్ట బోసుకుందంట.  “పెద్ద  ఆసామి  గారి పెళ్ళాం కూలి పనికి పోతుందని ఊరంతా చెప్పుకుంటన్నారని ఆయనకు మండి పోయిందంట

“డబ్బులిస్తా, ఒక ఇల్లు కట్టిచ్చి ఇత్తాను వొచ్చి సుకంగా ఏరేగా ఉండమన్నాడంట. ”

“పొయ్యిందా? ఏం రోగం డబ్బులిత్తానంటే? తీసుకుంటే పొయ్యేదానికి” చెల్లెలు అడ్డం పడింది

ఎర్రగా చూసింది  సాంబ్రాజ్యం .”మేయ్, ఏందా వాగుడు? డబ్బులిత్తే పొయ్యే మడిసైతే, బైటికెందుకొచ్చిద్ది?”

 

” తాడు నీ మొహాన తెంపి పారేసొచ్చినపుడే నీ నగలూ డబ్బులూ నీ మొకాన కొట్టుకోమని అర్దం. నేనేం దొంగతనం  సెయ్యట్లా, లంజతనం అంతకంటే సెయ్యట్లా! రెక్కలిరిచి కష్టం చేసుకుంటన్నా” ” అని, ఆ పాట్న పోయి వాగు లో కాస్త మెరగ్గా ఉన్న సోటు సూసి, యానాది రావుడని ఉండేవాడు లే , ఆయన్ని పిలిపిచ్చి ఈ గుడిసె ఏపిచ్చుకుందంట”

“వాగులోనా?”

“ఇదంతా వాగే మరి అప్పుడు. ఆ సుట్టు పక్కలంతా పక్కలంతా , మట్టి తవ్వి తెచ్చి పోసుకోని మెరక పెంచుకుందంట.

పొలాలన్నీ  స్థలాలై పోయినై గదా! దాంతో వాగు ఎండే పోయింది. పాతికేళ్ల కింద,  తాసీల్దారు గారి ఆపీసులో గుమాస్తా  ఒకాయన “అడ్డెడ్డె, ఆడకూతురు మొగరాయుడల్లే ఎంత కష్టపడతంది రా”  అని  ఆ పోరంబోకు వాగులో అరెకరం స్థలానికి  పట్టా ఇప్పించాడంట.

ఏందో సెప్పిద్దామ్మా ఆయన పేరు, గుమాస్తా గారి పేరూ…. ఆ, ఆ, శామ్యూల్ రాజంట .  ఎంత మన్నన జేసిద్దో ఆయన్ని!

ఇంట్లో దీపం బెట్టాడని రోజూ దణ్ణ దణ్ణాలు పెట్టిద్దనుకో

మొగుడూ, ఆ రెండో పెళ్ళాం కూడా పొయ్యి శానా రోజులైంది.  ఆ సవితి కొడుకు ఒట్టి తాగుబోతు ఎదవ.

గారాబం గజ్జెలకేడిస్తే, ఈపు దెబ్బలకేడ్చిందనీ …సదువబ్బలేదు గానీ, పేకాట బానే అబ్బింది. తండ్రి సచ్చాక పిన్నాం కాడికి వొచ్చి పోతా ఉంటాడు. కోడో , యాటో కోసినప్పుడు ఇంటికాణ్ణించి తెస్తాడు. పిన్నాం కి కూడా ఆడంటే ఇష్టవే నట్టుగుంది . బానే మాట్టాడిద్ది

ఒక్కతే ఉండీ ఉండీ పాపం ఇసిగి పోయిందేమో, ఎంతైనా మొగుడి కొడుకు గదా! ఎప్పుడొస్తాడాని సూసిద్ది. ఆ ఇంట్లో మాత్రం అడుగు బెట్టదు. వొదిలేసి వొచ్చిన్నాడే ఋణం తీరినట్టే.. అంటది ”

మాటల్లో పడి చేతిలో సున్నం డబ్బా చూసి ” సేయ్ , గాబులో నీళ్ళుండయి తీసకరా బో  పో. ఎండి పోయిందిది” అంది

సున్నంలో నీళ్ళు కలుపుతూ కొనసాగించింది “ఈ స్థలంలో కూరా నారా యేసి, కాయలమ్మి, ఎండ కన్నెరక్కుండా పెరిగిన పిన్నాం శానా కష్టపడింది .ఇప్పుడు పని చేసే అక్కర లేక పోయినా, కాళీ గా కూసోదు. అదే ఆ మడిసి గొప్పతనం.

ఎవురైనా సరే, పని సెయ్యాలంటది. ఈ వొయిసు లో పోయి కాయల బుట్ట తో బడి కాడ కూసుంటది.  డబ్బు యావ ఎక్కువేనబ్బా ఆ మడిసికి. అంతా ఆ కొడుకెదవకే గదా! రాజుల సొమ్ము రాళ్ల పాలనీ… సెమట్లు కక్కి సంపాదించిందంతా వాడి పాల బడితే రుదా అయిపోద్ది గదా ” మెట్ల మీద చివరి గీత ముగించి, చుక్క పెట్టి “ఓయమ్మో.కోటయ్య సావీ. ” అని నడుం పట్టుకుని  లేచి సున్నం డబ్బా కొబ్బరి చెట్టు మొదట్లో కోళ్ళగూడుమీద పెట్టింది

****                                                                       *********                                                

 

“పండక్కి నువ్వు రావాలంటంది నీ కోడలు. ఒక్కసారైనా రావు” నిష్టూరమాడాడు బాలచంద్రుడు. పల్నాటి  చరిత్ర నాటకం చూసి రాగానే పుట్టాడని ఆ పేరు పెట్టారు

"రమ్మని పిలిచారు. అది చాల్లేయ్యా  !

ఇదుగో బాలా, మరే.. అట్ట  ఎండలో తిరగబాక. చూడు, ఎట్టా నల్లంగా అయిపొయ్యావో” మొగుడి కొడుకు మీద ప్రేమ పొంగిపొర్లింది

“యాటని కోశారు సుబ్బారావోళ్ళు. నీ కోడలు నీ కోసమని కూర పంపింది” మూడు గిన్నెల ఇత్తడి కారేజీ అరుగు మీద పెట్టాడు కారేజీ చూస్తేనే నూరూరింది

“మాయ్యే! ఎంత గుర్తుగా తెస్తావయ్యా” మురిసి పోతూ బొడ్లోంచి చిన్న గుడ్డ సంచీ తీసి రెండువేలు తీసి బాల చంద్రుడి చేతిలో పెట్టింది .

రెండు వేలు!! ఈ మజ్జ కాలంలో కళ్ళజూళ్ళా. పెళ్ళాం ముండ పైసా దక్కనీటల్లా  పేకాడతాడని

“మొన్న మనవడి పుట్టిన రోజంటివే! తీసకొస్తావనుకున్నా. అబ్బాయికియ్యి. ఏదైనా కొనుక్కోమను”

డబ్బు జేబులో పెట్టేసుకుని “ఇప్పుడెందుకియ్యన్నీ! నువ్వొచ్చి మాతో ఉండాల! ఈ వొయిసు లో నువ్వింక కష్టం సెయడానికీల్లేదు. ఆయి గా కానగ సెట్టు కింద మంచవేసుకోని కూసో. అబ్బరంగా సూసుకోనీ మమ్మల్ని!మా నానేం జేశాడో నాకు దెలవదు. మాకు మాత్రం నువ్వు గావాల. ఇంటో పెద్ద దిక్కుండాల”

ఎప్పుడో ఆరి పోయిన సైదమ్మ కళ్ళలో చెమ్మ పొర ఒకటి నెమ్మది గా వచ్చి చేరింది, బాల చంద్రుడి మాటలు వింటూ.

“పండగ ముందే వొస్తానయ్యా! కాస్త ఈ సెట్లూ పాదులూ ఎవురో ఒకరికి అప్పగియ్యాల గా? ఎంత వొద్దనుకున్నా , డబ్బులొస్తున్నయ్యి గా తోట మీద ”

“సరే అట్టనే గానీ ! నెల రోజుల్లో పొయ్యేదేముంది లే .. జాగర్త.  కారేజీ లో ఏడన్నం పెట్టింది కోడలు. తినేసి పొణుకో! అది కడిగే పని  పెట్టుకోవద్దు! రేపొచ్చి తీస్క పోతాలే”

బాల చంద్రుడి చెయ్యి పట్టుకోవాలన్న కోరికను అణుచుకుంది సైదమ్మ. “సొంత కొడుకైతే సెయ్యి పట్టుకోటానికి ఇంత ఆలోచన సెయ్యను గదా “అనుకుంది కొంచెం దిగులుగా

### #####

“మీ పెద్దమ్మని ఎవరూ మోసం చేయ్యలేదు. ఆమే వచ్చి కాయితాలు రాయించి రిజిస్టర్ చేయించింది. దసరాకి ముందే జరిగి పోయింది ఇది” అడ్వకేట్ శర్మ మాటలు ఇంకా మింగుడు పడటల్లేదు బాల చంద్రుడికి

“పెద్దమ్మ కాడ డబ్బులు గూడా ఉండై! నాకు దెల్సు.." ఉగ్రంగా లేవబోయాడు

సైదమ్మ శవం చుట్టూ ఇంటి పక్కల వాళ్లు పది మంది చేరారు.

సాంబ్రాజ్యం  గుండెలు బాదుకుని ఏడుస్తోంది

మూత తెరవని ఇత్తడి కారేజీ అరుగు మీద నిశ్చలంగా కూచునుంది

“మీ పెద్దమ్మ దగ్గర ఏమేమున్నాయో, నీకేం తెలుసో మాకు తెలీదు. గుడిసె ఉన్న అరెకరం స్థలాన్నీ హరిజన కాలనీ కమ్యూనిటీ హాల్ కోసం రాసిచ్చింది. దీన్ని అమ్మి, ఆ డబ్బుని హాలుకి వాడమని కోరిందామె ”

“అట్ట మీరు చెప్తే సరి పోదు” కళ్ళెదురు గా కాయితాలు కనపడుతుంటే,  పోట్లాడే దమ్ము లేక పోయినా.. బింకంగా ఎగిరాడు బాల చంద్రుడు

“మరి సైదమ్మ వొచ్చి చెప్పిద్దా?” ఎవరో  గుంపులోంచి అన్నారు

“రిజిస్టర్ ఆఫీసుకు వచ్చి ఆమె స్వయంగా రాయించి ఇచ్చిన కాయితాలివి. నువ్వెంత అరిచినా ఏమీ లాభం లేదు. బాంక్ లో డబ్బున్న మాట నిజమే

దాన్నిజెడ్పీ స్కూలు దగ్గర, గవర్నమెంట్ ఆస్పత్రి దగ్గర  బస్ షెల్టర్లు కట్టటానికి రాసింది   సాంబ్రాజ్యం కొడుకంట… మస్తాన్ అనే పిల్లవాడి చదువుకు ఇమ్మని పాతిక వేలు రాసింది”    శర్మ కాయితాలు కట్ట గట్టాడు

చివరి మాట వింటూనే ” ఓ పిన్నావో” అంటూ పెరిగిన సాంబ్రాజ్యం ఏడుపు గుంపులో జనం చెవుల తుప్పు వదలగొట్టింది

గబగబా సిగరెట్ ముట్టించి ఆ చివర్న ఉన్న చెట్టు కిందకి పోయాడు బాల చెంద్రుడు .

“లంజ , ఎంత పని చేసింది రా! దీని ముసలి కంపు బరిస్తా దీనికి సికెన్లూ మటన్లూ తెచ్చిచ్చేదానికి నేనేమైనా దీన్ని ఉంచుకున్న మొగుణ్ణా? ? మా యమ్మ సచ్చినపుడు,మెడ్రాస్ పేకాట క్లబ్బులో ఉండి సూట్టానికి కూడా రాలా నేను . ఇదంటే ప్రేవా నాకు? యాణ్ణుంచి వొచ్చిద్దయ్యా  మా లావు ప్రేవ? హమ్మ హమ్మ… ముష్టి ముండ , దీన్తల్లి , అయ్యా కొయ్యా అంటూనే ముడ్డి కింద మంట బెట్టింది ” ఎన్ని బూతులు చెరిగినా కసి తీరటల్లేదు.

లక్షల స్థలం  ఎవరో ఎగరేసుకు పోయారంటే కడుపు మండి పోతోంది

“ఎవురయ్యా అసలు హరిజన్ కాలనీ లో కమ్యూనిటీ హాల్ కావాలని అడిగింది? ఆ పని నెత్తినేసుకుందెవురు? ఎవురా పెద్ద మడిసి? చర్చి పాస్టరేనా? ఆ నా కొడుకు…”

“కాదు, థామస్ రాజు..! పీటీ   మాష్టారు డేవిడ్ రాజు కొడుకు

వాళ్ల తాత  ఆర్దీవో ఆపీసు లో గుమాస్తాగా చేసేవాడంట  శామ్యూల్ రాజంట తెల్సా  నీకు?” ఎవరో అడుగుతున్నారు

 

సాంబ్రాజ్యం ఏడుపాపి విచిత్రంగా సైదమ్మ శవం వైపు  చూసింది

“శామ్యూల్ రాజా ?”

జీవం ఆరిన సైదమ్మ మొహంలో చాలా జవాబులే దొరికాయి సాంబ్రాజ్యానికి

(కథా కాలం 1980-90)

-సుజాత వేల్పూరి  

 (pic: Google images) 

 

 

 

1 comments:

విహారి said...

నరసరావుపేట బ్లాగ్ కి ఏమైంది

Post a Comment