అదీ సంగతి!
ఇహ నుంచి టీచర్లు రోజూ వొణికి ఛస్తూ ఉండాలి! ఏ పిల్లాడు ఏ కత్తి పొట్టలో గుచ్చుతాడో, ఏ పిల్ల ఏ బాణం గుండెలో విసురుతుందో అని!
ఎందుకంటే ఒక్కోసారి ఇలాంటి సంఘటనలు గొలుసుకట్టులాగా వరసాగ్గా జరుగుతాయి.
కాబట్టి కొన్నాళ్లు టీచర్లు పిల్లల్ని గారాబం చేస్తూ గడిపెయ్యాలి.పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి శ్రద్ధగా చదవాలనో, వర్క్ సరిగ్గా చెయ్యకపోతే మీ అమ్మా నాన్నలకు చెప్తాననో బెదిరించారనుకోండి. సెలవుల తర్వాత ఆ టీచర్లు స్కూలుకు రారు. స్టాఫ్ రూములో ఫొటోకి దండ ఉంటుందేమో చెప్పలేం!
టీచర్ మరణించింది కాబట్టి సానుభూతితో ఇది రాయడం లేదు నేను. చాల్రోజుల బట్టీ corporal punishment గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. పిల్లల్ని కొట్టడం, అవమానించే మాటలు మాట్లాడ్డం, మెడలో బోర్డులు కట్టడం ఇవన్నీ ఎవరూ అంగీకరించరు. తల్లిగా నేనూ అంగీకరించను.
ఎల్కేజీలో (ఎల్కేజీలో...!!) సంగీతం క్లాసులో మా పాప పక్క పిల్లతో కబుర్లు చెప్తోందని సంగీతం టీచరు దాన్ని ఎండలో నిలబెట్టింది. I will attend music class properly! అని పది సార్లు చెప్పించిందని తెల్సి స్కూలుకు వెళ్ళి ఆ సంగీతం టీచర్ని ప్రిన్సిపాల్ దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడాను. తర్వాత ఏదో అయిందనుకోండి!
మా నాన్నగారు ప్రభావతి టాన్యా టీచర్ కనపడితే చాలు "మా వాడిని (మా చిన్నన్నయ్య)బాగా తన్నండి! మీరసలు ఏమీ భయం చెప్తున్నట్టు లేదు" అని టీచర్ని కూకలేసేవారు. ఆడపిల్లలం కాబట్టి, మాకు మినహాయింపు ఉండేది.
మాది ఆడపిల్లల హైస్కూలైనా, టీచర్లు ఏవీ మినహాయింపులు ఇచ్చేవారు కాదు. అసలు ఎక్కడైనా సరే, పిల్లల్ని కొట్టే అవకాశం లెక్కల మేష్టార్లదీ, పీ ఈ టీలదీనూ!మా అత్తగారు, మామగార్లు కూడా టీచర్లే! వాళ్లనడితే వాళ్ళూ పిల్లల్ని రెండు దెబ్బలు వెయ్యకుండా ఎలా కుదురుతుందన్నారు. :-))
మా చిన్నన్న తిన్నన్ని దెబ్బలు ఇంట్లోనూ స్కూల్లోనూ కూడా మా ఇంట్లో ఎవరూ తిన్లేదు. అయినా సరే ప్రభావతీ టాన్యా మేడమ్ కనపడితే ఈ రోజుకీ వాడు మోకాళ్ళ వరకూ వంగి నమస్కరిస్తాడు. హైద్రాబాదు నుంచి ప్రత్యేకం స్వీట్లు,గుంటురు జిల్లా చలికే ఆవిడేదో వణికిపోతున్నట్టు శాలువాలూ పట్టుకెళ్తాడు. కొట్టిన క్షణంలోనో, తిట్టిన క్షణంలోనో కోపం ఎవరికైనా వస్తుంది కానీ చంపి పారేసేంత కసి గూడు కట్టుకుంటుందా? ఏమోనబ్బా మరి!
చంపడమా?... ప్రాణం తీయడమా? ఒక మనిషి ని లేకుండా చేయడమా?
ఇప్పుడు ప్రైవేటు స్కూళ్లు బాగా వేళ్ళూనుకున్నాక శారీరక శిక్షలు ఉండకూడదని రూలు! వారి మనో భావాలు గాయపడేట్లు ఏమీ మాట్లాడకూడదు.
పిల్లలు మాత్రం ఆరో క్లాసు నుంచే టాయ్ లెట్ల గోడల మీద సృష్టికార్యాల చిత్రాలు గీయవచ్చు, సెల్ ఫోన్లు తెచ్చి పాఠం చెప్తున్న టీచర్ల నడుములను ఫొటోలు తీయవచ్చు, వాటిని సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలోనూ పెట్టొచ్చు, టీచర్లకు భయంకరమైన నిక్ నేములు పెట్టి వాళ్లని ఈ సైట్లలో తిట్టనూ వచ్చు, ఆడపిల్లలు కూడా మగ పిల్లలకు ఫోన్లలో ప్రేమ సందేశాలు పంపవచ్చు,అదేమిటంటే టీచర్లను వేసెయ్యనూ వచ్చు!
ఇద్దరు ముగ్గురు టీచర్లతో మాట్లాడాక చెప్తున్నా..ఇవాళ ప్రైవేట్ స్కూళ్లలో పని చేసే టీచర్లు ఎదుర్కొనే ఒత్తిడి అంతా ఇంతా కాదు. కోపం మనవ సహజం! రోజంతా పిల్లల మధ్య గడిపి, వారికి పాఠాలు చెప్తూ, వెనక పడిన విద్యార్థుల మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, వాళ్ళ అల్లరిని భరిస్తూ ఉండే టీచర్లు ఈ కోపాన్ని అణచి పెట్టాలి. నాకు తెలిసిన ఒక స్కూల్లో టీచర్ సెల్ఫోన్ తో ఆడపిల్లల్ని వీడియో తీసిన ఒక విద్యార్థి నుంచి ఆ ఫోన్ లాక్కుని "ఇంకోసారి ఇలా చేశావంటే తోలు తీస్తాను" అనడంతో ఆ పిల్లాడు "టీచర్ తనను చంపుతానని బెదిరించిందని ఇంట్లో చెప్పడంతో పెద్ద గోలైపోయింది.
ఒకప్పుడు టీచర్లు కొట్టడమనేది సమస్యే కాదు. ఇపుడు ఇంటికి ఒకరో ఇద్దరో యువరాజులూ, యువరాణులూ బయల్దేరారు కాబట్టీ, లక్షల కొద్దీ డబ్బు పోసి స్కూళ్లలో సీట్లూ, చదువులూ కొనేస్తున్నాం కాబట్టి పిల్లల్ని ఒక మాట అనడానికి వీల్లేదు, ఒక దెబ్బ వేయడానికి వీల్లేదు.
ఏమన్నా అన్నారనుకోండి, ఉన్నాయిగా మన ఛానెళ్ళూ డైరెక్ట్ గా వాళ్ల దగ్గరికెళ్ళిపోతే సరి! "ఆచార్య దేవో భవ అనిపించుకోవలసిన ఉపాధ్యాయులే రాక్షసుడైన వేళ.." అంటూ హృదయ విదారకంగా హెడ్ లైన్స్ పెట్టి ఇంటి చుట్టు పక్కల వాళ్ళనీ, ఎరక్కపోయి ఆ దార్లో పోయే వారినీ కూడా మొహాల్లో కెమెరాలు పెట్టి ఇంటర్వ్యూలు చేసి "టీచర్లు నశించాలి" అని బలవంతంగా వాళ్ల చేత అనిపించేసి "హమ్మయ్య, ఇవాళ ౩౦ మినిట్స్ కి టాపిక్ వెదుక్కోక్కర్లేదు" అని సంతోషించి, వీలైతే ఆ మర్నాడు కూడా పొద్దున్నే ఏడున్నరకు చర్చ పెట్టి, దానికి ఇర్రెలవెంట్ గా మహిళా సంఘాల వాళ్ళని కూడా పిల్చి...ష్ అబ్బా! ఇదో పెద్ద స్ట్రెస్సూ!
అసలు పోలీసుల కంటే, ప్రభుత్వం కంటే, ఏ డిపార్ట్ మెంట్ కన్నా కూడా మీడియా వాళ్లే బోల్డు బాధ్యత మీద వేసేస్కుని (ఎవరు అడిగారనో) ఎక్కువ పని చేసేస్తూ ఉంటారు. మన జీవితాల్లో మనకంటే వీళ్ళ ప్రమేయమే ఎక్కువ.
పిల్లలకు ఆరేడు క్లాసుల నుంచే సెల్ ఫోన్లు ఎందుకివ్వాలో, పోనీ ఇస్తే దానితో వాళ్ళేం చేస్తున్నారో, స్కూల్లో వాళ్ల ప్రవర్తన ఎలా ఉందో,టీనేజర్లుగా వాళ్ళ మనసులో రేగే ఆలోచనలేమిటో పట్టించుకునే తీరిక తల్లిదండ్రులకు లేదాయె!
ఏం చేస్తాం? కర్ణుడి చావుకున్నట్టు ఇలాంటి సమస్యలకు ఒక కారణం కాదు.వందల్లో ఉన్నాయి.
పిల్లలు పసి మొగ్గలే! వాళ్ళని కొట్ట కూడదు, నిజమే! కానీ టీచర్లను కూడా అర్థం చేసుకోండి. మన డబ్బుల్తో వాళ్ళకు జీతాలిస్తున్నంత మాత్రాన వాళ్ళని పిల్లల పాలిట రాక్షసులుగా చిత్రించి చూడ్డం మానండి!
ఇవాళ టీచరు! రేప్పొద్దున మార్కులు సరిగా రాలేదనో,అల్లరిచేస్తున్నావనో గద్దించే ఏ తల్లికో తండ్రికో ఈ గతి పట్టదని ఎవరం హామీ ఇవ్వగలం?
విద్యా వ్యవస్థలో మార్పు రావాలి________అని కాకుండా ఈ పరిస్థితి ఎందుకేర్పడిందో, ఎలా నివారించుకోవాలో ఏమైనా సలహాలివ్వండి..తల్లిదండ్రులుగా మీకు తోచిన నాలుగు మంచి మాటలు చెప్పండి. తల్లి దండ్రులు కాని వాళ్ళు కూడా చెప్పండి.. మంచి మాటలేగా!
41 comments:
ఇవాళ టీచరు! రేప్పొద్దున మార్కులు సరిగా రాలేదనో,అల్లరిచేస్తున్నావనో గద్దించే ఏ తల్లికో తండ్రికో ఈ గతి పట్టదని ఎవరం హామీ ఇవ్వగలం?...
>>>>
హ్మ్మ్.. నేను సలహాలివ్వలేను కానండీ ఇక్కడే కూర్చొని చూస్తూ ఉంటాను.
ఉపాధ్యాయురాలు తన మీద రిపోర్ట్ వ్రాయడం వల్లే తన తల్లితండ్రులు తనని కొట్టారని ఆ విద్యార్థి ఆ ఉపాధ్యాయురాలిని హత్య చేసి ఉంటాడు. ఉపాధ్యాయురాలు విద్యార్థిని కొట్టకపోయి ఉండొచ్చు. అదే నిజమైతే అది ఆ విద్యార్థి తల్లితండ్రుల తప్పే అవుతుంది కానీ విద్యార్థి తప్పు కాదు.
చాలా బాగా రాసారు సుజాత గారు !
ఈ పరిస్థితి ఎందుకేర్పడిందో, అంటే నా వరకు నాకైతే మాత్రం ఒకటి తోస్తుంది . ప్రస్తుతం ఉన్న పరిస్తితులు చూస్తుంటే పిల్లలకి సమాజం నుంచి ఏదన్నా నేర్చుకునే అవకాశాలు చాలా తక్కువ అనిపిస్తుంది . దానితో ఇంట్లో తల్లిదండ్రుల బాధ్యత పెరుగుతుంది , వాళ్ళేమో బిజీ బిజీ . ఇక పిల్లలకి దొరికే మాధ్యమం నిజ జీవితానికి దూరం గా ఉండే కధనాలు చూపించే టీవీ , వాళ్ళు చూస్తున్న దానిలో ఇది మంచి , చెడు అని విచక్షణ తెలుసుకునే పరిస్తితులు లేవు .
ఇక టీచర్ల పైన విపరీతమైన ఒత్తిడి , దానిలో వాళ్ళు తెగ ప్రేమాభిమానాలు ప్రతి పిల్లాడు లేదా పిల్ల మీద చూపించాలని ఆశించటం దురాశే.
మొత్తం మీద ఏమి చేస్తే బావుంటుందో నాకైతే ఏమి తోచటం లేదు :(((
రాజ్ కుమార్, అలా వీల్లేదబ్బాయి, ఏదో ఒకటి చెప్పాల్సిందే! ఒక పదేళ్ళు ముందుకెళ్ళిపోండి. మీ పిల్లల్ని స్కూల్లో దింపే రోజులకి...! అదిగో,... అయిడియాలొచ్చేస్తున్నాయి. ఇప్పుడు చెప్పేయండి!
ప్రవీణ్ శర్మ, మీ కామెంట్ అర్థవంతంగా ఉంది. పిల్లల్ని తప్పు పట్టలేం! ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టలేం!
జ్యోతిర్మయి గారూ, నిన్నటి నుంచీ ఆలోచిస్తున్నా! వంద రకాల అయిడియాలొచ్చి..ఇక లాభం లేదని మీ అందర్నీ పిలిచా! :-)
శ్రావ్యం,, మీరు చెప్పింది అక్షరాలా నిజం! సమాజం నుంచి ఏమీ నేర్చుకోలేకపోవడం ఎంత నీచమైన పరిస్థితో కదా!
టీచర్ల మీద ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది!చాలా ఎక్కువగా! అది వాళ్ళు పిల్లల మీద చూపించడానికి వీల్లేదు ఇవాళ!
ఒకచోట చదివాను, ఆ పిల్లవాడు ఇటీవల విడుదలైన ఒక హిందీ సినిమా ప్రేరణతో ఆ హత్య చేశానని చెప్పాడట. నిజమే చెప్పాడో,ఊరికే చెప్పాడో మరి!
ఏం చేయాలో మీకూ తోచడం లేదా? :-)))
nijame...chaalaa baadagaa undi udayam nundi ee varta ..aa teacher poto choosi...ee job kooda katti meeda saamu chesinatle undi
సుజాత గారు,
నాకైతే తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించడం లేదనిపిస్తోంది.మొన్న బస్సులో వేరే వూరికి వెళ్తుంటే పక్క సీట్లో ఒక టీచర్ ఉన్నారు. ఆవిడ ఏదో ఇంటర్నేషనల్ స్కూల్లో చేస్తున్నారంట. ఆవిడ చెప్తున్నారు పిల్లలు అసలు మాట వినరని టీచర్లకు రకరకాల నిక్నేంలు పెట్టి అవహేళన చేస్తున్నారు అని చెప్పారు.
ఇప్పుడు అందరి ఇంట్లో ఒకరిద్దరు పిల్లలు అవడం వల్ల వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా ఉంది వ్యవహారం.
ఎ,బి,సి,డి ఎలాగైనా నేర్చుకుంటారు తల్లిదండ్రులుగా మనం బాధ్యతగా ప్రవరించడం నేర్పాలి.
శశికళ గారూ, థాంక్యూ! టీచర్ ఉద్యోగం అంటే బోల్డు సెలవులొస్తాయనీ, పెందలాడే ఇంటికి రావొచ్చనీ అనుకుంటారు కానీ ఇవాళ్టి రోజున ఇది కత్తి మీద సామే అయింది , నిజమే
మాతృదేవో భవ,పితృ దేవో భావ, ఆచార్య దేవో భవ అని పిల్లలకి నేర్పించడమే కాదు పిల్లలని క్రమశిక్షణలో పెట్టడానికి, మంచి మార్గంలో నడిపించడానికి అవసరమైతే వాళ్ళని తగు మోతాదులో దండించే అధికారం తల్లిదండ్రుల స్థాయిలోనే గురువులకి కూడా ఉంటుందని సమాజం కూడా గుర్తించాలి.
(మీరన్నట్టు రేప్పొద్దున్న తప్పు చేస్తే ఓ దెబ్బ వేశారని అమ్మ, నాన్నలపై కూడా పిల్లలు కేసులు పెట్టె, దాడులు చేసే రోజు వస్తే ఇక తూర్పు తిరిగి దండం పెట్టడమే :( )
మీరు చెప్పిన క్లాస్ రూం ఘటనలో ఆ పిల్లాడు వీడియో తీయడాన్ని తప్పుబట్టను. స్కూలుకెళ్ళే కుర్రాడికి సెల్ ఫోన్ కొనిచ్చిన తల్లిదండ్రులదే తప్పు.
ఇక మీడియా తమ అవసరాలకు అనుగుణంగా ప్రవర్తించడాన్ని గొప్పగా సమర్ధించడం మానుకోవాలి. వాళ్ళ ౩౦ నిమిషాల ప్రోగ్రాం కోసం చేసే అనవసర రభస వలన ఆ ప్రభావం ఎన్ని స్కూళ్ళ మీద, ఎంత మంది తల్లిదండ్రుల, పిల్లల మీద పడుతుందో ఒక్క సారి అర్ధం చేసుకోవాలి. ఉదాహరణకి స్కూలుకి ఆలశ్యంగా వచ్చాడని ఓ పిల్లాడికి క్లాస్ లో టీచర్ పనిష్మెంట్ ఇచ్చినా దాన్నో న్యూస్ చేసేసి రోజంతా ఆ ఖండనలు, బ్రేకింగ్ న్యూస్ లు అంటూ చెప్పడం ద్వారా సమాజానికి మీడియా ఎలాంటి సందేశం ఇవ్వదలచిందో నాకు అర్ధం కాదు. స్కూల్ కి లేటయినా పరవాలేదనా?
సుజాత గారు ఇంకో విషయం ఏమిటంటే ఇవాళ టీచర్లు అన్నవాళ్ళలో చాలామంది ఇది ఆడవాళ్ళకు సరైన ఉద్యోగం పిల్లలతో పాటు వెళ్ళి వాళ్ళతో పాటు తిరిగి రావచ్చని, సెలవులు బాగా ఉంటాయనో ఇలా అనేక తప్పుడు కారణాలతో టీచర్లుగా మారుతున్నారు తప్ప ఇష్టపడి టీచర్లుగా మారిన వాళ్ళు తక్కువ.
నా ముందు కామెంట్ ఏమైందండి. :-(
స్నేహ గారూ, అది ఎంచేతో స్పాం లోకి పొయిందండీ! అసలు నేను స్పాం చెక్ చేయను. ఎందుకో చూస్తే మీ కామెంట్ ఉంది. వెంటనే పబ్లిష్ చేశాను. :-)
విద్యార్థులు ఇలా మారడానికి మన తెలుగు
సినిమాలే కారణమని నా అభిప్రాయం. అదేవిధంగా టీవీ చానర్లు ప్రసారం చేసే సీరియల్స్ ప్రభావం కూడా సమాజంపై తీవ్రంగా పడడంతో పిల్లలు తల్లితండ్రుల
మాటలు వినడం లేదు. ఉపాధ్యాయులను
గౌరవించడం లేదు. అందుకే ముందుగా
సినిమాలు, టీవీ సీరియల్స్ నిర్మించే వాళ్ళు
మారాలి.
>>పిల్లలకు ఆరేడు క్లాసుల నుంచే సెల్ ఫోన్లు ఎందుకివ్వాలో, పోనీ ఇస్తే దానితో వాళ్ళేం చేస్తున్నారో, స్కూల్లో వాళ్ల ప్రవర్తన ఎలా ఉందో,టీనేజర్లుగా వాళ్ళ మనసులో రేగే ఆలోచనలేమిటో>>
ముందుగా ఇలాంటివాటి గురించి ఆలోచించాలేమో నండీ..అసలు మూలం అక్కడ దొరుకుతుంది.
సుజాత గారూ ఈ పోస్టులో మీరు చాలా విషయాల గురించి ఆలోచింప చేశారు.
ఇలాంటి విషయాలు (ఏసిడ్ దాడులు, కాలేజీ విద్యార్థుల గూండాయిజం, ఇంకా ఎన్నో విపరీత సంఘటనలు) సంచలనాత్మకముతాయి. అన్ని మీడియాలూ స్పందిస్తాయి. ఇళ్ళల్లో మాట్లాడుకుంటాము. బ్లాగుల్లోనూ స్పందిస్తాము.
ప్రస్తుతం ఇంకో పోస్టు ఇదే విషయం మీద చదివి ఆ తర్వాత మీ పోస్టు చదివాను. ఈ వ్యాఖ్య వ్రాసే ముందు ఈనాడులో వార్త చూశాను.
నాకు ఇప్పుడు అనిపిస్తున్నది మాటల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాను.
ఇది విపరీత సంఘటన. విపరీతము (exception) అన్నది ప్రధానంగా నా అభిప్రాయం. ఈ సంఘటనలు తల్లి దండ్రులనూ, ఉపాధ్యాయులనూ, విద్యా సంస్థల యాజమయాలనీ ఆలోచింప చేయాలి. బహుశా ఆలోచిస్తాము. ఎవరికి వారు వారి చుట్టూ ఉన్న పరిస్థితులను ఒక సారి తరిచి చూసుకుంటారనే అనుకుంటాను. సంఘటన విపరీతమైనా, దానికి బీజమైన సమస్య గురించి తప్పకుండా శోధించాలి. ఐతే ఆ ప్రత్యేక సంఘటన యొక్క ప్రత్యేక వివరాలు తెలియకుండా generalised వ్యాఖ్యలు పెద్దగా ఉపయోగపడవు అనిపిస్తుంది. అన్ని పరిస్థితులనీ పోగేసుకుని ఇవన్నీ కారణాలు, ఇక మనమే చెయ్యలేం బాబోయ్ అని చేతులెత్తెయ్యడం తప్ప ఏం చెయ్యగలమనిపిస్తుంది, అలా వ్యాఖ్యానించుకుంటూ పోతే?
ఈ వార్త చూసి టీచర్లు భయపడాలన్నట్టు మీరు వ్రాశారు. వ్యాఖ్యలు చూసి తల్లి దండ్రులు తాము తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం గురించీ భయపడుతూ ఆలోచించుకోవాలనిపించేలా ఉంది నాకు. ఇప్పటికే ప్రతిదీ భయమేసే పరిస్థితిలో ఉన్నాము. అన్ని రకాల మీడీయా తెగ ఆడేసుకుంటుంటాయి, అందరినీ అందరూ ఝాడించేస్తుంటారు ఇటువంటి విషయాలు జరిగినప్పుడు.
ఇలాంటప్పుడు ఈ విపరీతాలు కాకుండా "సామాన్య" పరిస్థితులను గురించి కూడా మాట్లాడుకోవడం మంచిది. ఇంత జనాభాలో మంచి వాళ్ళూ, చెడ్డ వాళ్ళూ, బలవంతులూ, బలహీనులూ అందరూ ఉంటారు. మూకుమ్మడిగా మనం భయాలు, ఆవేశాలు పెంచుకోకుండా వార్త బాధ కలిగించిందని పంచుకుంటూ మన చుట్టూ నిజంగా ఎలా ఉందో కూడా reality (not utopian nor apocalyptic) విశ్లేషించుకుంటే బావుంటుంది కదా?
ఇదంతా చెప్పాక, మనసులో భయం పీకుతూనే ఉంటుంది. నిన్న ఎవరో చిన్న అమ్మాయిని షాపులోంచి ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తుంటే ఆ అమ్మాయి తెలివిగా తప్పించుకుంది. ఆ విషయం, దాని మీద వ్యాఖ్యలూ చదివి సహజంగా ఉండే భయాలు పెరిగాయి. అమ్మాయి తప్పించుకోగలిగింది అన్న దాని మీద focus చెయ్యడానికి కష్టపడి ప్రయత్నించాను. ఇంకా ఎన్నో భయంకరమైన విషయాలు జరుగుతున్నాయి. చాలా మంది బానే ఉన్నా ఆ విపరీతం మన దగ్గర, మన వాళ్ళకు, మన వాళ్ళ వల్ల కలలో కూడా జరగకూడదు అన్న ఆలోచన చాలా anxiety కి గురి చేస్తుంది.
ఉదాహరణకి కొంతమంది పిల్లలు సెల్ ఫోనుని బడికి పట్టుకెళ్తారు. స్కూళ్ళో ఉపయోగించకూడదు రూల్స్ ప్రకారం. స్కూల్ తర్వాత తల్లిదండ్రులని కాంటాక్ట్ చెయ్యడానికి, ముఖ్యంగా ఒక్కరే ఇంటికి వస్తున్నప్పుడు అది ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు నాకు ఆ విషయం గురించి కూడా తప్పేమో అని ఆలోచించాలా, భయపడాలా అనిపిస్తోంది. మరి లేక ఆ కాంటాక్ట్ లేకపోతే రోడ్దు మీద ఏ చెడ్డవాడో ఏడో చేస్తేనో అన్న భయం సంగతేంటి?
భయం, భయం, భయం... వ్యక్తిగా, సమాజంగా మనం ఈ భయాని ఎదుర్కోవాలి ముందు.
ఏదో నాకు తోచింది చెపుతున్నా .....
ముందుగా తల్లితండ్రులు ప్రతిరోజూ పిల్లలితో స్కూల్ విషయాలు మాట్లాడటం అలవాటుగా మార్చుకోవాలి .
పిల్లలికి ఏదైనా ఇబ్బంది ఉందని తెలిస్తే రేపు మాపు అంటూ వాయిదా వెయ్యకుండా సమస్య పరిష్కరించటం మొదటి పనిగా పెట్టుకోవాలి
పిల్లలు కంప్లైట్ చేసారు కదా అని నేరుగా టీచర్ తో గొడవ పడ్డట్టు కాకుండా , వీలయినంత సామరస్యంగా వ్యవరించాలి .
అన్నిటికన్నా ముఖ్యంగా పిల్లలి ముందు వారి టీచర్ల పట్ల అమర్యాదగా మాట్లాడకూడదు. అలాగే పిల్లలినీ మాట్లాడనివ్వకూడదు.
టీచర్లూ పిల్లలిని హింసించాలని కంకణం కట్టుకుని రారు . వాళ్ళూ మనలాంటి మానవ మాత్రులే కదా . ఒక్కోసారి వారూ సహనం కోల్పోవటం , అతిగా ప్రవర్తించడం వంటివి జరిగినప్పుడు మనం కొంత సహనం చూపించాలి. కానీ అదే తప్పు వారు మళ్ళీ మళ్ళీ చేస్తుంటే మాత్రం వెంటనే స్పందించాలి
ఆవేదన, వ్యంగ్యం కలగలిపి ఆలోచనాత్మకంగా పదునైన టపా సంధించారు. అభినందనలు !
మనం ఇంటిల్లపాదీ చూసే ఆనందంగా చూసే టీవీ కార్యక్రమాలూ, ఇష్టంగా చూసే సినిమాలూ, ముచ్చటగా చదివే మ్యాగజీన్ల ద్వారా స్లో పాయిజన్ లా సంస్కృతీ కాలుష్యం విస్తరిస్తోంది. ఇలాంటి దుర్ఘటనలకు ప్రత్యక్ష, పరోక్ష నేపథ్యం అదే.
నిన్నటి ఘాతుకానికి పాల్పడిన కుర్రాడు తాజాగా విడుదలైన హిందీ సినిమా సీన్ చూసి ప్రేరణ పొందటం చూస్తుంటే సినిమాల ప్రభావం భావి పౌరులపై ఎంత ప్రబలంగా ఉంటోందో అర్థం చేసుకోవచ్చు. అందరు పిల్లలూ ఇలా చేయ(లే)కపోవచ్చు. కానీ టీచర్లూ, విద్యార్థుల మధ్య ఆరోగ్యకర సంబంధాలు నశించిపోయి, ఇలా విద్వేషాలు పెరిగే పరిస్థితులను తక్కువ అంచనా వేయకూడదు!
lalitag గారూ,
ఈ సంఘటనలు తల్లి దండ్రులనూ, ఉపాధ్యాయులనూ, విద్యా సంస్థల యాజమయాలనీ ఆలోచింప చేయాలి___________ఇప్పుడు ప్రతి స్కూల్లోనూ జరుగుతున్న చర్చ ఇదేనండీ ఇక్కడ ఆంధ్ర ప్రదేశ్ లో!బహుశా మీ వరకూ వచ్చే వార్తల్లో ఇలాంటివి ఉండకపోవచ్చు. ఎందుకంటే మీడియా ఇలాంటివి కవర్ చేయవు.
ఈ వార్త చూసి టీచర్లు భయపడాలన్నట్టు మీరు వ్రాశారు_________నిజంగానే అలా అనిపించిందా మీకు? టీచర్లను అర్థం చేసుకోమని రాశానని( మొత్తం మీద ఎసెన్స్) అని నేను అనుకుంటున్నా!. -కాస్త వ్యంగ్యం తో రాశాను! అది నిజమని మీకనిపించిందంటే......డైరెక్ట్ గా పాయింట్ రాస్తే మంచిదని తోస్తోంది! ఇకపై జాగ్రత్తగా ఉంటా ఈ విషయంలో!
ఇక్కడ నేనైనా, ఇతర వ్యాఖ్యాతలైనా వ్యక్తం చేస్తున్న భయాలూ, ఆవేశాలూ ఇవన్నీ కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో అనే విశ్లేషించుకోడంలో భాగమే తప్ప ఇదేదో కరెంట్ అఫైర్స్ గురంచి మాట్లాడుకోడం కాదు. నేను నా టపాలోనే చెప్పాను, ఇది కేవలం టీచర్ హత్య పై సానుభూతితో రాసింది కాదనీ, కార్పొరల్ పనిష్మెంట్ గురించి చాలా రోజులుగా ఆలోచిస్తున్నాననీ! ఈ కార్పొరల్ పనిష్మెంట్ మీద నేను కొన్ని వ్యాసాలు కూడా రాశాను. పిల్లల్ని అర్థం చేసుకోవాలని కోరుతూ!
సెల్ ఫోన్ పిల్లలకు ఇవ్వాల్సిన పరిస్థితి గురించి కూడా ఆలోచిస్తూనే ఉన్నాం అందరమూనూ! అత్యవసర పరిస్థితి ఎదురైతే పిల్లలు ఏం చేయాలని! అసలు ఈ అత్యవసర పరిస్థితి,ఎందుకు ఏర్పడుతుంది? ఎందుకింతగా దిగజారి పోయింది ఈ పరిస్థితి అనే దాని గురించి కూడా మరో వైపు ఆలోచించాల్సిన అవసరం కనిపించడం లేదూ?
సెల్ ఫోన్ ఇవ్వడం నేరం కాకపొవచ్చు, అందులో కెమెరా,మ్యూజిక్ వంటి సదుపాయాలు లేకుండా చూసి దాన్ని అవసరానికి మాత్రమే వాడాలని తల్లిదండ్రులు సూచించాలా వద్దా?
ఇంకోటి, "విపరీత" పరిస్థితులు జరిగినపుడే సహజంగా అందరమూ ముందుకొచ్చి స్పందిస్తాం! సామాన్య పరిస్థితుల గురించి చర్చ జరిగినపుడు దాని ఎఫెక్ట్ అంతగా ఉండదు. ఇలాంటపుడు జరిగే చర్చ గానీ, వ్యక్తమైన అభిప్రాయాలు కానీ ఎక్కువ రోజులు నిలిచి ఉంటాయని నా అభిప్రాయమూ, అనుభవమూ కూడా!
మొత్తం మీద ఈ టపా ఉద్దేశల్లో ఒకటి, టీచర్లను కూడా కాస్త అర్థం చేసుకోండి..అని చెప్పడమే!
మంచి పోస్టు ఆలోచింపచేసేదిగా ఉంది.
విద్యా వ్యవస్థలో రాంకింగులు, పెర్సెంటేజెస్ పెంచమని టార్గెట్లు పెడుతూ టీచర్లపై వత్తిడులు తీసుకురావటాలు (ఏదో సేల్స్ టార్గెట్స్ పెంచమన్నట్లు) కూడా చర్చనీయాంశాలే.
సుజాత గారూ, మీ జవాబు చూశాక నా వ్యాఖ్యలో ఈ వాక్యం"ఈ వార్త చూసి టీచర్లు భయపడాలన్నట్టు మీరు వ్రాశారు." లో నేను చెప్పదల్చుకున్నది పొరపాటుగా చెప్పాను అని అర్థమయ్యింది. ప్రస్తుతానికి నేను అక్కడ చెప్పదల్చుకున్న దానిని సరిగా వివరించలేను. కానీ అది పొరపాటు అని ఒప్పుకుంటున్నాను.
ఇక,"ఈ సంఘటనలు తల్లి దండ్రులనూ, ఉపాధ్యాయులనూ, విద్యా సంస్థల యాజమయాలనీ ఆలోచింప చేయాలి___________ఇప్పుడు ప్రతి స్కూల్లోనూ జరుగుతున్న చర్చ ఇదేనండీ ఇక్కడ ఆంధ్ర ప్రదేశ్ లో!బహుశా మీ వరకూ వచ్చే వార్తల్లో ఇలాంటివి ఉండకపోవచ్చు. ఎందుకంటే మీడియా ఇలాంటివి కవర్ చేయవు" మా వరకూ బ్లాగర్లు చేరిస్తే బావుంటుందేమో :)
ఇంకో విషయం పిల్లలని తల్లి దండ్రులు కూడా ఎక్కువ కట్టుబాట్లలో ఉంచగలిగే రోజులు కావు ఇవి. మరీ గట్టిగా ఉంటే, ఎప్పుడూ వాళ్ళని (వాళ్ళ రక్షణ కోసమే అని) మనం గమనిస్తూ ఉంటే, వారిని మనతోటే తిప్పుకుంటూ మనం వాళ్ళతోటే ఉంటూ ఉంటే, వాళ్ళకి కలిగించే సదుపాయాలను ఎక్కువగా నియంత్రిస్తే కూడా మొదటికే మోసం వస్తుంది.
నేను ఇలాంటి విషయాలలో చాలా "భయస్తురాలిని" :( అందుకే నా భయాన్ని ఎదుర్కోవలనే పాఠం అందరికీ చెప్తున్నట్లు నాకు నేను చెప్పుకుంటూ వ్రాశాను ఆ వ్యాఖ్య. మనసులో బరువు కాస్త తగ్గించుకునే ప్రయత్నం. మీ space అందుకు ఉపయోగపడింది. Thanks.
Point is, parenting (life) works by trial and error. We will all make mistakes. ఇది వీరి బాధ్యత, వారి బాధ్యత, సమాజం పాడైపోతోంది అనుకోకుండా మనం మాట్లాడేటప్పుడు మనం అనుభవాలను పంచుకుంటే ఆలోచన పెరుగుతుంది అని నా ఉద్దేశ్యం అనుకుంటాను. నేనైతే ఇలా చేస్తాను అనకుండా ఇలా చేశాం. ఇది ఫలితం చూపించినట్లనిపించింది. ఇది బెడిసికొట్టింది వగైరా. ఏదో, అవతల పని బోలెడు పెట్టుకుని ఇక్కడ చాలా వ్రాసేస్తున్నాను. ఇప్పటికి ఇంతే.
Sujatha gaaru,
Appreciate your post and invoking people to think about.
Here are my two cents.
1. A Teacher should be a real teacher, not just like I came , I teached my subject and I'am done. They should feel the responsibility of their job. They are the ones who are going to build the future society.
2. What you sow is what you reep. Fill the kids life with love and affection you will get the same. Give respect and Take respect should be teachers policy. I'am totally aware and understand the societal distractions and how tough it is to deal but one should not give up.
3. when we say something good or about discipline, or culture or moralities, may be at first glance it feels that the kids are not taking it or not interested and they may feel it as sodhi but you know unknowingly it sinks in to their mind and next time before they react they may think.
Thanks for letting us to share our thoughts
తల్లిగా నా మాటలు ఓ రెండు. అభద్రత, న్యూనతాభావం - పిల్లల్లో తావుచేసుకుంటే అవి క్రమేణా కోపం, ద్వేషం వైపుగా దారితీస్తాయి. ఒక అపజయాన్నో, అవమానాన్నో సహించటం ముందుగా నేర్పాలి. ఇక, ఇవి నా మాటలు కాదు షేక్స్పియర్ కోట్ అని గుర్తు - "తోటమాలి మొక్క ఏపుగా ఎదిగి, పుష్పించటానికే కొమ్మల్ని కత్తిరించేది. " ఎదిగే పసిమనసులకి అమ్మానాన్నలు, గురువులే ఆ వనమాలి వంటివారు.
అలాగే నా పిల్లలిద్దరికీ నేను చెప్పే మాటలివి.
Your mind is a garden,
Your thoughts are the seeds,
You can grow flowers or
You can grow weeds.
వాళ్ళిద్దరూ ఇంట్లో ఉండే సమయంలో నాతో ఎక్కువగా గడిపే బంధం ఏర్పడటానికి, బళ్ళో మంచి విద్యార్థులుగా గుర్తించబడటానికి నేను నా కృషి ఉందనే చెప్తాను.
వెలుపలి ప్రభావాన్ని తట్టుకోవాలంటే ఇంట్లో అనుకూల పరిస్థితులు, ఉపాధ్యాయుల పట్ల గౌరవాభిమానాలు పిల్లలకి కల్పించటంలో ముందుగా అమ్మా నాన్నలదే పాత్ర.
మీరన్న వార్త పూర్వాపరాలు, వివరాలు తెలియవు కానీ పిల్లలు, టీచర్స్ అనుబంధం ఒక సంఘటన తో మారదు. ఇవి అడపాదడపా వార్తలు కావచ్చు.
నాగేంద్ర గారూ, మీరు చెప్పిన మార్పులు మనం బతికుండగా జరిగేవి కాదు. సమాజాన్ని ప్రతిబింబిస్తున్నాయని వాళ్లంటారు. వ్యాపా విషయాలు మారాలని చూడ్డం అత్యాశే!
లలిత గారూ, అవునుజ్! మీరు చెపిపినవాటితో ఏకీభవిస్తున్నాను! డబ్బు "పడేస్తున్నాం" కాబట్టి టీచర్లే మొత్తం బాధ్యత తీసుకోవాలన్న ధోరణి చాలా మంది తల్లిదండ్రుల్లో గమనిస్తున్నాను.కొన్ని స్కూళ్ళ యాజమాన్యాలు ఈ రకమైన ప్రామిస్ లు కూడా చేస్తున్నాయి. దానివల్ల టీచర్ల మీద ఎంత ఒత్తిడి పడుతుందో ఆలోచించాలి.
వేణు గారూ,
అవును, ప్రసార మాధ్యమాలు, సినిమాల ప్రభావం టీనేజర్ల మీద చూపే ప్రభావం అంతా ఇంతా కాదు. కానీ ఏం చేద్దాం? అవి మన లివింగ్ రూముల్లోకీ, సెల్ ఫోన్లలోకీ,పెన్ డ్రీవుల్లోకీ వచ్చేశాక! అవి ఇంత దూరం వ్యాపించక ముందే జాగ్రత్త పడాలి కాదూ!
బాబా గారూ,
ఈ మార్కులు, రాంకులు టార్గెట్లు టీచర్లను ఎంతో ఒత్తిడికి గురి చేస్తున్నాయది కఠిన సత్యం!మరో వైపు ఈ ఒత్తిడి వల్లే వాళ్లు పిల్లల మీద ఒత్తిడి తీసుకురావడం, అవమానించడం వంటి దుష్ఫలితాలు! విద్యార్థులు చేసుకునే ఆత్మహత్యలకు ఇవి కూడా మూలకారణాలు. ఈ విష వలయం నుంచి ముందు తల్లి దండ్రులు బయట పడితే....కొద్ది కొద్దిగా ఈ పరిస్థిని మెరుగు పరచవచ్చేమో!
lalitag గారూ,వార్తా ఛానెళ్ళు గానీ,ఇతర పత్రికలు గానీ సేలబిలిటీ ఉన్న వాటికే ప్రాధాన్యం ఇస్తారు. మూల కారణాలని విశ్లేషిస్తూ, స్కూళ్లలో జరిగే ఆసక్తి కర చర్చలను ప్రసారం చేస్తే నిజంగానే దానికి సేలబిలిటీ లేదు ఇక్కడ. చర్చలు జరుగున్న సంగతి మీడియాకు తెలిసినా అవి కవర్ కావు.(నేనే ఒక ఫీచర్ రాయలనుకుంటున్నా) ఈ సంఘటన జరిగాక హైద్రాబాదులో కొన్ని స్కూళ్లు తల్లిదండ్రులతో ప్రత్యేకంగా పేరెంట్స్ టీచర్ మీటింగ్స్ పెట్టాలని యోచిస్తున్నాయని తెల్సింది.కొంత రిలీఫ్ అనిపించింది నాకు!
మీరు అంటున్న భయం నాకూ అనుభవమే! ఆ భయం సర్కిల్లో నేనున్నాను. ఒక పక్క పిల్లలను స్వేచ్ఛగా పెరగనివ్వాలని మనసులో ఆశలున్నా, వాస్తవ పరిస్థితులు చూసి భయపడకుండా ఎలా ఉండగలను? స్కూలు బస్సు పావుగంట లేటైతే చెయ్యకూడని ఆలోచనలన్నీ నా ప్రమేయం లేకుండానే చేస్తుంది మనసు! మీరు చెప్పింది నాకు అర్థమవుతోంది.
ఇన్ని విపత్కర పరిస్థితుల మధ్య పిల్లలని మనం అనుకున్నట్లుగా వంద శాతం ఉంచాలంటే అది ఏ తల్లిదండ్రులకీ సాధ్యం కాదు. సమాజం ప్రభావం లేకుండా పిల్లలు పెరగడం అసాధ్యం! పైగా, ఇంట్లో కంటే ఎక్కువగా బయటే పెరుగుతారు కదా!
పేరెంటింగ్ అనుభవాలను పంచుకునే ఆలోచన మంచిదే! నా వరకూ నేను వీలైనంత వరకూ టీచర్లతో టచ్ లో ఉంటాను. పాపతో సరే అనుకోండి. సమస్య ఏది వచ్చినా స్కూలుకెళ్ళి మాట్లాడి సానుకూలంగా పరిష్కరించే ప్రయత్నమే చేస్తాను. పైన చెప్పిన సంగీతం టీచర్ విషయం మినహా ఇంతవరకూ పెద్ద సమస్యలేవీ రాలేదు.
social perspective వృద్ధి అయేలా, empathy తో ఆలోచించగలిగేలా మా అమ్మాయిని ప్రిపేర్ చేయాలని అనుకుంటాను.ఇద్దరు ముగ్గురు టీచర్లంటే భయం అంటుంది తరచుగా! అది ఎందుకో నెమ్మది మీద తెలుసుకోవాలని అనుకుంటున్నా ప్రస్తుతం!
Surabhi garu,
Thanks very much for saying a few good things about teachers and kids!
I completely agree with! The only problem is practicality. Most parents are ready to think, analyze, but don't come forward to implement.
They have no time in hand to go through these things, by the time they are really serious, its out of thier hands.
Thanks for the comment.
ఉష గారూ, మీరు మీ పిల్లలకు చెప్పడం చాలా బాగుంది. పిల్లల కోసం, వారి ఆలోచనలని అర్థం చేసుకోడానికి ఎక్కువ టైము కేటాయించగలగడం తల్లి దండ్రులు వారికి ఇవ్వగలైగిన పెద్ద బహుమతి అని భావిస్తున్నా నేను!
మీ అనుభవాలను పంచుకోవడం బాగుంది. ప్రతి తల్లీ ఇలా గర్వంగా చెప్పుకోగలిగిన రోజొస్తే బాగుండు
పిల్లలు, టీచర్స్ అనుబంధం ఒక సంఘటన తో మారదు. ఇవి అడపాదడపా వార్తలు కావచ్చు.___________లేదు ఉష గారూ! పరిస్థితిలో చాలా చాలా మార్పు వచ్చింది. బేసిగ్గా టీచర్,విద్యార్థి మధ్య బంధం నిర్వచించడానికి సులభంగానే ఉండొచ్చు. అది అలాగే ఉండొచ్చు. కానీ విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పు మూలంగా వాళ్ళిద్దరి మధ్యా ఉన్న బంధం కేవలం బంధమే తప్ప అందులో అనుబంధం పాళ్ళు తగ్గిపోవడం ఎప్పుడో మొదలైంది.
దీనికి చాలా కారణాలున్నాయి. కార్పోరేట్ స్కూళ్ళు, జూనియర్ కాలేజీలు రాంకుల పంటల్ని పండించడంలో పడటం వల్ల సహజంగానే టీచర్ల మీద,లెక్చరర్ల మీద బాధ్యత అపరిమితంగా పడుతుంది. యావరేజ్ విద్యార్థికి కూడా 550/600 తెప్పించాల్సిన కఠోర పరీక్ష వాళ్ళకు ఎదురైన వేళ, విద్యార్థుల సంఖ్య అపరిమితంగా ఉన్న వేళ, ప్రతి విద్యార్థినీ బుజ్జగించి, సరదాగా మాట్లాడుతూ డీల్ చేయడం సాధ్యమవుతుందా?
జూనియర్ కాలేజీల్లో వందల విద్యార్థులు చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వేళ, టీచర్ విద్యార్థి మధ్య బంధం మారదనీ, మారలేదనీ,మార బోదనీ చెప్పుకోగలిగే ధైర్యం చేయలేమండీ!
ఇది చాప కింద నీరు లాగా తెలియకుండా ఇప్పటికే విస్తరించి పోయింది. మామూలుగా మనకు ఇలాంటి వాటి గురించి చర్చించుకునే అవకాశం ఇలాంటి అడపా దడపా సంఘటనలు జరిగినపుడే రావడం దురదృష్టకరం!
స్నేహ గారూ, పిల్లల గురించి మీరు చెప్పేదెపుడూ balanced గానే ఉంటుందని నా అబ్జర్వేషన్!:-)
ఎ,బి,సి,డి ఎలాగైనా నేర్చుకుంటారు తల్లిదండ్రులుగా మనం బాధ్యతగా ప్రవరించడం నేర్పాలి.__________ ఇదే నా మొత్తుకోలు కూడానూ!
ఇకపోతే కొన్ని స్కూళ్లలో సరైన అర్హత లేని వాళ్ళు కూడా టీచర్లుగా మారడం గమనించే ఉంటారు. MCA చేసారనుకోండి, బీ ఎడ్ లేకపోయినా మంచి స్కూళ్ళలో చేరి లెక్కల సబ్జెక్ట్ చెప్పెయ్యడం..ఇలా! ఈ పరిస్థితి చాలా చోట్ల ఉంది. ప్రైవేట్ స్కూళ్ళకు తక్కువ జీతానికి టీచర్లు కావాలి, ఎక్కువ ఫలితాలు కావలి.
ఇంటర్నేషనల్ స్కూళ్లలో జీతాలు ఎక్కువే! సరదాగా చేద్దామనుకునే వాళ్ళకు కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీల్లో అవకాశం తక్కువే! వాళ్ళు వీధి చివరి స్కూళ్లకు పరిమితం కాక తప్పదు. ఎందుకంటే సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో లాగే, ప్రైవేట్ స్కూళ్ళలో కూడా సామర్థ్యాన్ని నిరూపించుకుంటేనే ఉద్యోగంలో ముందడుగు అనే స్థితి వచ్చేసింది.
ఈ మార్పంతా మన కళ్ళ ముందే జరిగిపోయింది. సాక్షులుగా మిగిలిపోయాం మనం!
SHANKAR.S గారూ,
మీడియా అతి ని తల్లిదండ్రులు చాలా వర్కు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారన్నది నిజం! అలాగే తల్లిదండ్రులు కూడా తగినంత సమయాన్ని పిల్లల కొసం కేటాయించి తీరాలి. స్కూల్లో చదువు మాత్రమే దొరుకుతుందన్న చేదు నిజాన్ని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పకపోయినా కనీసం తల్లిదండ్రులు అర్థం చేసుకుని పిల్లలకు మంచేదో, చెడోదో చెప్పాలి.
మంచి చెడులను బోధించే విషయంలో టీచర్లకు కొంత స్వేచ్ఛ ఇవ్వాలి. అది దుర్వినియోగం అయిందని అనిపించినపుడు వెంటనే ప్రిన్సిపాల్ తో మాట్లాడాలి.
ఈ మార్పులన్నీ ఎప్పుడు జరుగుతాయో, అసలు జరుగుతాయో లేదో కూడా తెలీని అయోమయ స్థితిలో ఉన్నాం మనం!
వ్యాఖ్యలకు నేను వరస క్రమంలో ప్రతిస్పందిచలేదు. అలాగే కొన్ని వ్యాఖ్యల్లో అచ్చు తప్పులు దొర్లాయి. క్షమించగలరు
సుజాత గారూ, నాతరపునుండి కొన్ని ఆలోచనలు ఈ విషయమై,
మా తల్లిదండ్రులు మమ్మల్ని చిన్నప్పటి నుండి ఇది తప్పు, ఇది ఒప్పు, మితముగా మాట్లాడాలి, పెద్దలను గౌరవించాలి ఎట్సెట్రా ఎట్సెట్రా చాలానే నేర్పే వారు, కానీ అదే సమయంలో ఉపాధ్యాయులు కూడా చాలా సన్నిహితంగా ఉండే వారు. ఎలాంటి ప్రెషర్ ఉండేది కాదు, అయినా సరే మార్కులలో ఎటువంటి తగ్గులూ ఉండేవే కాదు. మన మాట ఎదుటివారిని ఎంతలా ప్రభావం చేస్తుందో అనుభవపూర్వకంగా విద్యార్థులకు నేర్పాలి, అలానే కొంచెం మెచ్యూర్ గా ఆలోచించేలా చెయ్యాలి. సినిమాల ప్రభావం ఎంత మేరకు దారి తీస్తుందో ఈ చెన్నయ్ ఉదంతం ఆక్షాత్కరింపచేసింది. నా విద్యార్థి జీవితంలో పనిష్మెంట్ అనేది చాలా కొద్ది సార్లే వచ్చింది. నిజమే మా స్కూలింగ్ లైఫ్ అలాంటిది 7 నుండి 2 వరకు స్కూల్, ఆ పై అంతా ఖాళీ, హోం వర్కు నాలుగు సార్లు చేసిన ఆడుకునేండుకు బోల్డంత సమయముండేది. బహుశా అందువలనే హోం వర్క్ చెయ్యకపోవటాలు, బాగా చదవకపోవటాలు లేవు. అలానే పనిష్మెంట్ తీస్కున్నపుడు కూడా, ఇది నా తప్పు అందుకే నాకు పనిష్మెంట్ అని మనసులో ధృఢంగా అనుకోవడం కూడా జరిగేది.
చదువుకొనే రోజులు పోయి చదువు "కొనే" రోజులు వస్తే ఇలాగే అవుతుందేమో మరి.
మరువం ఉష గారు,
మిల్లియన్ డాలర్ మాటన్నారు. చాలా బాగా చెప్పారు పిల్లలని ఎలా పెద్ద చేసి తీర్చి దిద్దాలో అని.
జిలేబి.
సుజాత గారు,
ఈ విషయం గురించి ఆలోచిస్తుంటే నాకు తట్టిన కొన్ని ఆలోచనలు ఇక్కడ పంచుకుందామని రాస్తున్నా. మనం ఒక సమాజంగా పిల్లల పెంపకం అనేది అతి ముఖ్యమైనదిగా భావించడంలేదనిపిస్తోంది. ఇలాంటి విపరీత సంఘటనలు జరిగినప్పుడు తప్ప మనం పిల్లల గురించి ఆలోచించమేమో. అప్పుడు కూడా చర్చ ఇలా జరగడానికి బాధ్యత ఎవరిది తల్లిదండ్రులదా లేక టీచర్లదా అనే తప్ప ఒక సమాజంగా మాత్రం ఆలోచించలేకపోతున్నాం. అన్ని విషయాల్లోనూ మార్పులను వంటబట్టించుకుటున్న మనం పిల్లల పెంపకంలో మాత్రం ఏమి మారట్లేదు. పిల్లలు మాట వినలేదా నాలుగు తగిలిస్తే చాలు అన్నట్టుగానే ఉన్నది ధోరణి. మా కాలంలో దెబ్బలు తిని పెరిగాము మాకు ఏమి నష్టం రాలేదు కదా ఇప్పుడు మాత్రం ఏమిటి నష్టం అనే వాళ్ళున్నారు. కాని అప్పటి సమాజానికి ఇప్పటి సమాజానికి చాలా మార్పు ఉంది అది గమనించాలి.
ఇప్పటి పిల్లలలో చాలామందిలో ఏదో ఒక ప్రవర్తనా పరమైన సమస్యలు కనపడతాయి.తల్లిదండ్రులు అది గమనించకుండా నాలుగు తగిలించడం మాత్రమే పరిష్కారం అనుకుంటున్నారు. తల్లిదండ్రులు పిల్లలలో ఉన్న సమస్యలను చర్చించేందుకు ముందు రావాలి అప్పుడే ఇలాంటి సమస్యలకు మూలాలు కనిపెట్టవచ్చు.
సుజాత గారు,
చాలా బాగా రాసారు. I agree with your line of thought on the issue.
Its an issue we should start thinking about.
రహమాన్, నిజమే! సినిమాల ప్రభావం ఉందన్నమాట నిజమే కానీ, ఆ పిల్లాడి మాటల్లో ఎంత విశ్వసనీయత ఉందో ఆలోచించాలి. టీచర్ని చంపి పారేయాలన్న కసి మనసులో పెంచుకున్న వాడికి జనరల్ నాలెజ్ లేదని, మీడియాను పరిశీలించడం లేదని అనుకోలేం! ఇలాంటి సంఘటనలు జరిగినపుడు మీడియా,సామాన్యులు కూడా "సినిమాల ప్రభావం" గురించి మాట్లాడుతుంటారు కాబట్టి తన మీదినుంచి అటెన్షన్ "సినిమాల్లో చెడు" మీదికి మళ్ళేలా చేయడానికి కూడా ఆ బాబు అలా చెప్పి ఉండే అవకాశాన్ని తోసి పుచ్చలేం! ఒకవేళ నిజంగానే ఆ సినిమాతో ప్రేరేపితమైనా అయి ఉండొచ్చు.'
ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లలూ, టీచర్లూ,తల్లిదండ్రులూ అందరూ ఒత్తిడిలో పడి మగ్గిపోయే రోజులివి. దీని ఫలితాలను ఇంతకంటే మెరుగ్గా ఊహించలేం!
స్నేహ గారూ, లేదండీ, పిల్లల గురించి ,వాళ్ళ ప్రస్తుత జీవన శైలి,ఒత్తిడి వీటి గురించి నిరంతరం ఆలోచిస్తూ ఒక పక్క గాభరా పడుతునే మరో పక్క ఈ పరిస్థితిని ఎలా టాకిల్ చేయాలా అని ఆలోచించే వారు చాలామందే ఉన్నారండీ! కానీ పంచుకోడానికి ఒక వేదిక మాత్రం....ఇదిగో ఇలాంటి వైపరీత్యాలు జరిగినపుడే దొరుకుతుంది. ఇది దురదృష్ట కరం.
కొడవటి గంటి కుటుంబరావు గారొ కథలో పిల్లల పెంపకం ఒక పాత్ర అంటుంది.."మా ఇంట్లో రెండే పద్ధతులు! అతి గారాబం చేసి నెత్తి కెచ్చించుకోవడమూ,లేదా చావగొట్టి చెవులు మూయడమూ" అని! అయితే ఈ రోజులు కూడా ఇప్పుడు లేవు. పిల్లల్ని కొట్టి శిక్షించే తల్లి దండ్రులు అరుదే ఇప్పుడు. మనం చెప్పుకున్నట్లు ఒకరో ఇద్దరో కదా ఇంటికి. అందుకే స్కూల్లో కూడా టీచర్ ఒక దెబ్బ వేస్తే సహించలేని స్థితి.
అందుకే నేను ఈ టపాలో అడిగింది________ఎవరు మంచి ఎవరు చెడు అని కాకుండా ఈ పరిస్థితి రావడానికి, కారణమేమిటో,దీన్ని కొంత వరకూ రిపేర్ చేసుకోడానికి ఏం చేయవచ్చనో మాత్రమే అడిగాను. టీచర్లను కూడా అర్థం చేసుకోమని అర్థించాను.
Weekend pilitician garu,
Yes, we should start thinking! At least now,....!
Thank you
కామేశ్వర శర్మ గారు,జిలేబీ గారు
ధన్యవాదాలు
పిల్లల కంటే ముందు తల్లి తండ్రులు తమ బిహేవియర్ మార్చుకోవాలి. "చదివితే ఆఫీసర్ అవుతావు, చదవకపోతే రిక్షా తొక్కుతావు లేదా మూటలు మోస్తావు" లాంటి మాటలు ఆడితే పిల్లలకి తమని పెద్దలు గాడిదల్ని చూసినట్టు చూస్తున్నారు అని అనిపిస్తుంది. నెల్లూరు స్కూల్లో చేసినట్టు మెడకి గాడిద అని బోర్డ్ పెట్టకుండానే పిల్లల్ని వాటితో సమానం చేసే విధంగా అవమానించొచ్చు. ఆ టీచర్ విద్యార్థిని కొట్టినట్టు ఎక్కడా వ్రాయలేదు. కానీ "చదవకపోతే హొటెళ్ళలో ప్లేట్లు కడుగుతావనో, రైల్వే స్టేషన్లలో మూటలు మోస్తావనో" అని ఉండొచ్చు. తల్లితండ్రులు కొట్టడం వల్ల కూడా తనని తల్లితండ్రులు కొట్టడానికి కారణం టీచర్ వ్రాసిన రిపోర్ట్లే అనిపించి హత్య చేసి ఉండొచ్చు.
ప్రవీణ్, ఈ మధ్య కాలంలో మీరు రాసిన మరో మంచి వ్యాఖ్య! అవును, అలా అని ఉండే అవకాశం ఉంది. ఇలాంటి మాటలు పిల్లల్లో ఎంత అలజడిని సృష్టిస్తాయో తల్లిదండ్రులు ఒక్కోసారి ఊహించలేరు. ఆ పరిస్థితిలో వాళ్ల కోపం స్థాయి అలాగ ఉంటుందన్నమాట!
చాలా ఆలోచింపచేశారు మీరు ఈ టపా తో...రోజులు ప్రస్తుతానికి దొర్లిపోతున్నా రేపు ఎలా వుంటుందో అన్న బెంగే ఎప్పుడూ భయపెడుతూ వుంటుంది.
ఇప్పటికి స్కూలుకి పంపట్లేదు కాబట్టి మా పిల్ల ఆ అంటే ఆగుతోంది...బయట ప్రపంచం నుంచి నేర్చుకునే మంచికన్నా చెడే ఎక్కువగా కనిపిస్తోంది. మనం పోనీ క్రమశిక్షణలో పెడదామన్నా...చుట్టూ ఎవర్ని చూసినా అతి గారాబం...పిల్లలు తానా అంటే తందానా అనడమే కనబడుతోంది..ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళిళ్ళల్లో అల్లరి చేస్తుంటే నేనొక్కర్దాన్నే పాపని కేకలేస్తున్నానా అనిపిస్తోంది...కాస్త జ్ఞానం వస్తే నువ్వే ఎందుకు కేకలేస్తున్నవ్..అని అడిగేస్తుంది...క్రమశిక్షణ అన్నది మనం ఒకళ్ళమే implement చేద్దామన్నా అయ్యేది కాదనిపిస్తుంది...అందరిలో మార్పు రావాలి. రోజంతా బిజీ బిజీ గా వుండే తల్లిదండ్రులకి లోలోపల పిల్లలతో సమయం గడపట్లేదన్న ఒక గిల్టీ ఫీలింగు ని తృప్తిపరచడం కోసం వాళ్ళడిగినవి లేదనకుండా తెచ్చిచ్చేస్తున్నారనిపిస్తోంది. చేసిన పాపాలకి గుళ్ళో డబ్బులు వేసి తృప్తి పడిపోయినట్టు. దానితో వాళ్ళనుకున్నది జరగకపోతే తట్టుకునే లక్షణం అస్సలుండట్లేదు పిల్లల్లో...ఇది ఎన్ని విపరీతాలకైనా దారి తీస్తుంది...
స్ఫురిత గారూ,
నా మనసులో రేగే ఆలోచనలు కూడా ఇవి. పిల్లలతో ఎక్కువ సమయం గడపటం అనేది ఇవాళ తప్పని సరి. మన జనరేషన్ లో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఇంట్లో ఉండటం వల్ల వాళ్ళకు "కంపెనీ" సమస్య, మనసులో భావాలని "పంచుకోడం" సమస్య అంతగా ఉండేది కాదు...తోబుట్టువులు ఉంటారు కాబట్టి. ఇప్పుడలా కాదు.
ఈ అతి గారాబానికి కూడా కారణం ఇదేనేమో అనిపిస్తుంది నాకు. ఎక్కడైనా పదిమంది పిల్లలు అల్లరి చేస్తుంటే, ఆ పది మందిలో మా అమ్మాయి ఉంటే అక్కడ వినపడే తల్లి గొంతు నాదొక్కటే. ఒక్కోసారి నేను కూడా మీలాగే "నేనొక్కదాన్నే కేకలేస్తున్నానా" అని గిల్టీగా ఫీలైపోతుంటాను. కానీ అది అవసరమే అనిపిస్తుంది నాకు!
పిల్లల్ని పెంచడం కత్తిమీద సాములా తయారంది.
సుజాత గారు
"దండం దశగుణం భవేత్" అని కదా నానుడి. నా చిన్నప్పుడు ఎండలో ఇసక మీద మోకాళ్ళ కుర్చీ వేయించేవారు, అది తల్లితండ్రులకు తప్పుగా అనిపించక, బిడ్డలు సరైన మార్గంలో, మంచి నడవడిక తో ఉండాలంటే అలా చేయడంలో తప్పు లేదు అనిపించేది. కాని ఇప్పుడు పిల్లలను యెంత సుకుమారంగా పెంచుతున్నారంటే, లోకంలో పిల్లలంటే వాళ్ళ పిల్లలే అన్నట్లుగా..! ఆ సుకుమారత్వం, సున్నితత్వం ఎలాంటి వాటికి దారి తీస్తుందంటే ఏదైనా పరీక్షలో ఉత్తీర్ణులు కాకపొతే , జీవితంలో సర్వం కోల్పోయాము అన్నట్లుగా, ప్రాణం తీసుకోవడానికి ప్రేరేపించే విధంగా పరిణమిస్తుంది.
నేను మాత్రం ఈ తరహా పెంపకానికి పూర్తీ వ్యతిరేకిని..! అయితే కొంతమంది ఈ కాలం ఉపాధ్యాయులు కుడా విద్యార్ధికి విదించవలసిన దండన ఏ విధంగా ఉండాలో తెలియని వారు ఉన్నారు. వారు విధించే దండన ఒకోసారి హాస్యాస్పదంగాను, మరోసారి బాధాకరంగాను (అవమానకరంగాను) ఉంటుంది.
మేడమ్
మీ పోస్టు ఆలస్యంగా చూశాను. బాగా రాశారు. టీచర్లు ఒకటి రెండు దెబ్బలు కొట్టకుండా ఉండరు కానీ ఇతరేతర కారణాలతో కసిగా, పగబట్టినట్లు వెంటాడి ఆత్మవిశ్వాసం దెబ్బతీయడం దారుణం. ఉద్యోగాలు కల్పించడమే పనిగా డీఎస్సీల మీద డీఎస్సీలు వేయడం...తాలు సరుకును కూడా టీచర్ ఉద్యోగాలకు ఎంపికచేయడం కూడా సమస్యకు కారణమని నాకనిపిస్తున్నది.
నేను యూనివర్శిటీల గురించి, అక్కడి ప్రొఫెసర్ల ధోరణి గురించి చెబితే మీరు ఆశ్చర్యపోతారు. అక్కడ మరొక రకమైన హింస జరుగుతోంది.
రాము
Post a Comment