February 15, 2013

Well Done Abba...ఒక మంచి సినిమా




మీ పెరట్లో బావి ని సడన్ గా ఎవరైనా  దొంగ తనం చేస్తే ఎలా ఉంటుంది? నమ్ముతారా ఎవరైనా ఈ విషయాన్ని?  పోలీస్ కంప్లైంట్ ఇస్తారా మీరు? తీసుకుంటారా వాళ్ళు? ఆ సంఘటన ఆధారంగా ప్రభుత్వం పడి పోయే దాకా పరిస్థితి వెళ్తుందా?   ఒకవేళ వెళ్తే?  ఫలితంగా తెల్లారే సరికి మీ బావి మీ పెరట్లో ఉంటే?

అవును ఇలాంటి కథతోనే తయారైంది Well done abba సినిమా! 2010 లో శ్యాం బెనెగల్ తీసిన గొప్ప సినిమా! ఈ మధ్య చూసిన సినిమాల్లో ఇది నాకు బాగా నచ్చేసింది. ముఖ్యంగా నేను బొమన్ ఇరానీ అభిమానిని. తెలుగులో కోట శ్రీనివాస రావు లాగా గ్లాస్ లో పోసిన  నీటిలా ఏ పాత్ర ధరించినా పాత్ర తప్ప తను కనిపించనే కనిపించడు.  ఖోస్లా కా గోస్లా, త్రీ ఇడియట్స్   లో పాత్రలు ఎంతో డిఫరెంట్ గా భలే నచ్చుతాయి నాకు. తెలుగు నిర్మాతలకు, దర్శకులకు  ఈయన్ని ఆశిష్ విద్యార్థి లాగా మూస విలన్ పాత్రలకు తీసుకు రావాలనే ఆలోచన రాకుంటే బాగుండు!! 



హైద్రాబాద్ సమీపంలోని చీకట్ పల్లి గ్రామం నుంచి ముంబాయి వెళ్ళి ఒక ప్రైవేట్ డ్రైవర్ గా పని చేస్తున్న అర్మాన్ అలి, నెల రోజుల సెలవు మీద వెళ్ళి మూడు నెలల తర్వాత తిరిగి డ్యూటీలో జాయిన్ అవడానికి వస్తాడు. సహజంగానే యజమానికి ఒళ్ళు మండి  ఉద్యోగం ఊడింది పొమ్మంటాడు.  తన ఆలస్యానికి  కారణాలు చెప్పి బతిమాలుకుంటూ
"బావిలో పడ్డాను సార్, మరీ లోతుగా పడ్డాను...అది మామూలు బావి కాదు సార్ , సర్కారీ బావి  " అంటూ జరిగిన కథ  చెప్పనారంభిస్తాడు.

ముంబాయి నుంచి చీకట్ పల్లి వెళ్ళిన అర్మాన్ అలీ కి ఊళ్ళో నీటి సమస్య తీవ్రంగా ఉందని తెలుస్తుంది. భార్య ను పోగొట్టుకున్న అతడు చీకట్ పల్లి లో తన తమ్ముడు మరదలు దగ్గర కూతుర్ని ఉంచి చదివిస్తుంటాడు. సోమరి పోతులైన తమ్ముడు మరదలు ఊళ్ళో వాళ్ళ బావిలో నీళ్ళు దొంగతనం చేసి నలుగురి చేతా చీవాట్లు తింటున్నారని , సొంత బావి ఉంటే ఆ బాధలేవీ ఉండవనీ కూతురు ముస్కాన్ (మినిషా లాంబా) తండ్రితో చెప్తుంది.

కపిల ధార పథకం కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి ప్రభుత్వం ఉచితంగా బావి తవ్వించుకోడానికి గ్రాంట్ ఇస్తుందని తెలిసి దరఖాస్తు   చేయడానికి వెళ్తాడు.  సర్పంచ్ పేరుకి పాపం బాలమ్మే అయినా పెత్తనం మాత్రం బాలమ్మ మొగుడిదే!  తను సహాయం చేస్తా పదమని  తహసిల్దార్ ఆఫీసుకు వెంట పెట్టుకు వెళ్తాడు .



దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వాడిగా సర్టిఫికేట్   సంపాదించడంతో మొదలైన లంచం ( ఈ సందర్భం లో చేతి వాచీ కూడా క్లర్క్ కి సమర్పించుకో వలసి వస్తుంది) అలా అలా అలా..ప్రతి చోటికీ పాకుతుంది.  పంచాయితీ  అధికారిక ఫొటో గ్రాఫర్ నుంచి, తహసిల్దార్, MPDO,  పొలాన్ని రిజిస్టర్ చేసే పట్వారీ, సర్వే చేసి సర్టిఫికేట్ ఇచ్చే సబ్ ఇంజనీర్, బావి తవ్వించే కాంట్రాక్టర్ వరకూ ప్రతి ఒక్కరికీ మొదటి విడత గ్రాంట్ నుంచి లంచాలు శాతాల ప్రకారం పంచాల్సి వస్తుంది. చేతిలో 8 వేలు మిగుల్తాయి.

తవ్వకం మొదటి దశ పూర్తయితే కాని రెండో విడత గ్రాంట్ ఇవ్వరు.  సబ్ ఇంజనీర్ సలహా ప్రకారం ఫొటో గ్రాఫర్ దగ్గరికి వెళ్తే...మొదటి దశ పూర్తయినట్లు (అర్మాన్ అలీ పొలం లోనే) ఫొటో షాప్ తో తపుడు ఫొటో ఇస్తాడు,. రెండో విడత గ్రాంట్ లో మళ్ళీ లంచాల పంపకం మొదలు, అలాగే రెండో దశ పూర్తయిందని మరో తప్పుడు ఫొటో తో మూడో విడత గ్రాంట్.....దాంట్లో మళ్ళీ అందరికీ పంపకాలు!

ఈ తంతు అంతా పూర్తయ్యే సరికి అర్మాన్ అలీ చేతిలో కొద్ది పాటి డబ్బు, బావి తాలూకు తవ్వకం పూర్తయినట్లు ఫొటోలు, అధికారులు ఇచ్చిన అధికారిక సర్టిఫికెట్లు, బావి నీళ్ళు బహు తియ్యగా ఉన్నాయని, తానూ తాగి మరీ చూసాను అని  సర్పంచ్ బాలమ్మ స్వహస్తాలతో (అంటే బాలమ్మ భర్త) రాసిచ్చిన కాయితం మాత్రం మిగుల్తాయి. బావి మాత్రం ఉండదు. కేవలం కాయితాల్లో ఉంటుంది.



ఏం చేయాలో తోచని  అర్మాన్ అలీకీ.... పన్నెండో తరగతి చదువుతున్న అతని కూతురు పాదరసం లా ఆలోచించి సలహా ఇస్తుంది.  ఇద్దరూ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తారు. "మా బావి ని ఎవరో ఎత్తుకు పోయారు, దొంగిలించారు" అని!

" పిచ్చా మీకు?" అన్న సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ రెడ్డి(రజిత్ కపూర్) కి బావి ఫొటోలు, సర్టిఫికెట్లు మొత్తం చూపిస్తారు.  ఫొటోల్లో అర్మాన్ పొలంలోనే కానుగ చెట్టు కింద చక్కని గిలక బావి!!  ఇద్దరు కానిస్టేబుల్స్ వెళ్లి పరిశీలిస్తే  మాత్రం పొలం, చెట్లు అన్నీ ఉంటాయి.  కానీ...చెట్టు కింద బావి మాత్రం ఉండదు. ఫిర్యాదు తీసుకోక తప్పదు ఇన్స్పెక్టర్ కి !!

ఫిర్యాదు తో తహసిల్దార్ నుంచి సబ్ ఇంజనీర్ వరకూ ఎవరి దగ్గరకి వెళ్ళి విచారించినా, అందరు తొట్రు పడతారు కానీ బయట మాత్రం పడరు !!  ప్రతి ఒక్కరూ.... "బావి మాత్రం తవ్వించాం,. ఎవరెత్తుకెళ్లారో మాకు తెలీదు" అని చెప్తారు. నోరు జారితే నెత్తి మీదికి వస్తుందని!



అర్మాన్ తమ్ముడికి అప్పిచ్చిన పాపానికి  వసూలు కోసం ఇంటి చుట్టూ తిరుగుతుండే కుర్రాడు ఆరిఫ్ వీళ్లకు సహాయం చేస్తాడు. అతని సలహా ప్రకారం ముస్కాన్ తండ్రి తో కల్సి MPDO ఆఫీస్ లో RTI ప్రకారం మొత్తం మండలం లో ఎన్ని బావులకు ఈ గ్రాంట్ లభించిందో సమాచారం సేకరిస్తుంది.

 మొత్తం 75 బావులు.

అన్నీ అర్మాన్ అలీ బావి లాగే కాగితం లో మిలిగి పోయిన బావులే!

ముస్కాన్, అర్మాన్ , ఆరిఫ్  అందరినీ తీసుకుని పట్నంలో సంబంధిత మంత్రి ఇంటికి వెళ్తారు. ఎన్నికలు సమీపంలో ఉండటం తో మంత్రి (రాజేంద్ర గుప్తా) గాభరా పడి....చీకట్ పల్లి ని దర్శిస్తాడు. దాంతో 76 మంది బావులు దొంగిలించ బడిన వార్త మీడియా చానెళ్లకు ఎక్కుతుంది.  తమ బావి తమకు దొరికే వరకూ పచ్చి మంచి నీళ్ళు ముట్టబోమని,, తమ బావి నీళ్ళు మాత్రమే ఇక పై తాగుతామని అర్మాన్ ముస్కాన్ లు నిర్జల దీక్షకు కూచుంటారు. విషయం మరింత వేడెక్కి ఆ సెగ అసెంబ్లీ ని తాకుతుంది. ఎన్నికల వేడి వల్ల ఒకరి అవినీతి మరొకరు బయట పెట్టుకుంటారు, అధికార ప్రతి పక్షాల వాళ్ళు.

చివరికి ఏమైంది? ఆ బావులు కోల్పోయిన వాళ్ళకి తిరిగి బావులు దక్కాయా? దక్కితే ఎలా దక్కాయి? ఇదంతా బుల్లి తెర మీద ఈ సినిమా వేస్తే తప్పక చూసి తెలుసుకోవాలి. లేదా యూ ట్యూబ్ లో చూడండి. లభ్యమవుతోంది (నేను netflix లో చూసాను.)

జీలానో బానో రాసిన "నరసయ్య కి బావ్ డీ " అనే కథ ఆధారంగా శ్యాం బెనెగల్ ఈ సినిమా తీశారు.  ఇది మరాఠీ లో 2007 లో "జౌ టీతే ఖౌ " పేరుతో వచ్చింది. చిన్న చిన్న పాత్రలే అయినా మంచి మంచి నటులు నటించారు. (ఇలా అరుణ్, మినిషా లాంబా, సొనాలి జోషి, సమీర్ దత్తాని, ప్రీతి నిగమ్, టివి సీత దీపిక, రజిత్ కపూర్ అయేషా జలీల్...)
మహా మహా స్కాములు చేసే వాళ్ల గురించి ఘోషించే మీడియా పంచాయితీ స్థాయిలో, బహిరంగ రహస్యం లా నిర్భయం గా జరిగి పోయే అవినీతిని పట్టించుకోదు. అక్కడ పేదవారికి ఎలా అన్యాయం జరుగుతుందో వివరిస్తూ ఇది ప్రభుత్వ వ్యవస్థ మీద సంధించిన వ్యంగ్యాస్త్రం!

లంచాల్ని ఒక్కో చోట ఒక్కో రకంగా పేరు పెట్టి పిలవడం (తహసిల్దార్ ఆఫీసులో దీపావళి, దసరా అనడం, మరో చోట ఇన్ని గంటలు కొట్టాలి అని చెప్పడం, ఇన్ని గ్లాసుల నీళ్ళు తాగుతా అని చెప్పడం....), ఫొటోగ్రాఫర్ సైతం నిర్భయంగా తప్పుడు ఫోటోలను ఒక్కో కాపీ వెయ్యేసి రూపాయలకు అమ్మడం, మహిళా సర్పంచ్ బాలమ్మ తరఫున సకల పనులనూ బాలమ్మ భర్తే చక్క బెడుతూ ఉండటం, ఇలా ఏ ఒక్క దాన్నీ వదలడు దర్శకుడు.

మాట మాట్లాడితే "బాలమ్మా, నువ్వు లోపలికి పో" అనడం, చివరికి "బావి రత్న" బిరుదును సైతం బాలమ్మ తరఫున భర్తే అందుకోవడం....బాలమ్మ నిప్పులు కక్కే కళ్లతో ఆ దృశ్యాన్ని కసి గా, నిస్సహాయంగా చూస్తూ ఉండి పోవాల్సి రావడం...ఇవన్నీ వాస్తవానికి అద్దం పడతాయి.

సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ రెడ్డి కి కూడా ఆ పోలీస్ స్టేషన్ లో పోస్టు వాళ్ళ మామ గారు 3 లక్షలకు కొని పెట్టాడని, త్వరగా లంచాలు పట్టి ఆ అప్పు తీర్చేయాలని అతని భార్య (దీపిక) ఒత్తిడి చేస్తూ ఉండటం మరో సెటైర్!!

"నువ్వు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నావా ఎగువన ఉన్నావా?" అని  MPDO అర్మాన్ అలీ ని అడిగినపుడు "జీతం వచ్చిన మొదటి వారం ఎగువన ఉంటా...వారమయ్యాక దిగువకు వస్తా" అని అమాయకంగా చెప్పడం నవ్వు తెప్పించినా...ఇది అతడికే కాదు మధ్య తరగతి కొంపలన్నింటికీ వర్తించే సంగతే !!


 దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నట్లు   లంచం ఇచ్చి సర్టిఫికెట్ తీసుకున్నందుకు , తనను ఒక గంట పాటైనా లాకప్ లో పెట్టమని చివర్లో మళ్ళీ పోలిస్ స్టేషన్ కి వచ్చి ఇన్స్పెక్టర్ ని బతిమాలుకునే అర్మాన్ అలీ నిజాయితీ కూడా నవ్విస్తుంది.

అర్మాన్ అలీగా, అతడి కవల తమ్ముడు గా బొమన్ ఇరానీ కి ఫుల్ మార్కులు ఇచ్చేయొచ్చు.  ఒక్కగానొక్క కూతురి మీద అమితమైన ప్రేమను పెంచుకున్న అమాయక తండ్రి గా, తల అయోమయంగా తిప్పుతూ ..బొమన్ ఇరానీ అద్భుతంగా నటిస్తాడు.

నిజం చెప్పాలంటే మున్నాభాయి ఎంబీబీఎస్ ద్వారా ప్రచారమైన గాంధీ గిరి కంటే ఇదిగో..ఇలాంటి తెలివైన తిరుగుబాట్లు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి సత్వరమే ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి లోకి నెడతాయి !! కొంత వరకూ , కదలిక తెచ్చేందుకు ఉపయోగ పడతాయి.  ముల్లు ని ముల్లు తోనే తీయాలన్న అతి సామాన్య సూత్రాన్ని తెలివిగా ఉపయోగించుకున్న ఒక తెలివైన ఆడపిల్ల ఆలోచన ఇది. ఈ ఆలోచన చాటునే ఆడపిల్లలు బాగా చదువుకోవాలన్న సందేశం కుడా ఉంది ఈ సినిమాలో!


కథ చివరి వరకూ ఎవరూ నాటకం తమకు తెలీనట్లే "ఏమో బావి ఎటు పోయిందో" అన్నట్లు మాట్లాడగా సర్పంచ్ బాలమ్మ మాత్రం మంత్రి ప్రశ్నించినపుడు "ఏమి చెప్పమంటారు సార్? పోలిసులు, ప్రభుత్వం,మొత్తం వ్యవస్థే విఫలమై పోయింది" అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్తుంది.

సినిమాకు పేరు మాత్రం చమత్కారంగా కుదరడం మంచి అయిడియా.!!
చిన్న కథే అయినా, మంచి మంచి పాత్ర ధారులతో ఆద్యంతం ఆసక్తి కరంగా వదలకుండా చూసేలా చేస్తుద్ని దర్శకుడి ప్రతిభ!

చూడాలనుకునే వారికి ఇది యూ ట్యూబు లో  అందుబాటులో ఉంది

మంచి సినిమా! తప్పక చూడండి ...




25 comments:

Indian Minerva said...

చూద్దామనికొని మర్చిపోయానండి. ఇవ్వాళ చూస్తాను. గుర్తుచేసినందుకు Thank you.

tnsatish said...

Did you watch "Raaja vaari chepala cheruvu" by Posani Krishna Murali? It is also of the very similar story.

కాయ said...

మీరో పదేళ్ళు పుస్తకాల్లో మునిగి నట్లున్నారు..ఇప్పుడు చూశారీ సినిమా ని..

సుజాత వేల్పూరి said...

Indian Minerva....చూశారా మరి?

tnsatish గారు,
నిజమా? అయితే ఈ కాన్సెప్ట్ ని మన వాళ్లు తెలుగులో తీసేశారన్న మాట. ఆ సినిమా నేను చూడలేదు

సుజాత వేల్పూరి said...

వేణు గారు,

అవునండీ శ్యాం బెనగల్ లాంటి వారే తీయగలరు ఇలాంటి సినిమాలని!

తెలుగులో కుదర్దు లెండి!

సుజాత వేల్పూరి said...

కాయ గారూ,

ఈ సినిమా 2010 లో వచ్చిందండీ! అందికని నేను పదేళ్ళ క్రితం చూడలేక పోయాను:-))

tnsatish said...

"Raaja Vaari Chepala Cheruvu" is of the same concept. But, instead of well, it was a lake. Posani Krishna Murali bribes everyone for a lake for fishing. Later, he files a complaint that, his lake is missing and produces all the certificates that different government officials gave certifying the lake.

Posani Krishna Murali has delivered full of blunt facts in that movie, and obviously a common man cannot accept the blunt facts.

In telugu also, we get good movies, if not direct, atleast as dubbed or remade movies. It is just that, we are not accepting those movies. We like only the big heros killing the corrupted people etc. We never like the movies, which gives actual practical solutions.

Mauli said...

తమిళ్ లో ఇదే ఒక కామెడి సిన్మా ఉంది, కాకపోతే ఇక్కడ హీరో పొలం కోసం బావి తవ్వించుకోవాలనుకొంటాడు.

బాగా వ్రాసారు.

Vajra said...

నాకు చాల మంది చెప్పారు..సినిమా బాగుంటుంది అని..పోయిన వారమే netflix లో చూసాను. This kind of satirical movies should be made to influence rulers of our country to know how pathetic our schemes are available in terms of reaching the common man wishes..విడ్డురం ఏమిటి అంటే ఇలాంటి సినిమా బెంగాల్ సామ్రాట్ Shyam Benegal గారు తీసారు కానీ మన తెలుగు director's తీయలేదు.అవునులెండి మన వాళ్ళు కమర్షియల్ ఎనిగ్మా లో మునిగి తేలుతున్నారు కదా..! . BTW this is Vajra..Mee blogki nutana parichayam..:):).Thank you for spreading about this social oriented kind of movie to others.

రాధిక said...

తెలుగులో పోసాని రాజావారి చేపల చెరువు అని ఒక సినిమా తీసాడు.కాస్త ఇలాంటి స్టోరీనే.

..nagarjuna.. said...

మొదటగా పోసాని ’రాజావారి చేపల చెరువు’ వచ్చింది.. ఆ తరువాత శ్యాం బెనగల్ తీసారు. నేను ముందుగా ’వెల్ డన్ అబ్బా’ చూసా పోసాని సినిమా ఇక చుడాలనిపించలేదు రాజును చూసిన కళ్ళతో మొగుణ్ణి చూడలేమోనని :)

సుజాత వేల్పూరి said...

సతీష్ గారు,
నేను రాజావారి చేపల చెరువు చూడలేదు. పోసాని సినిమా ఒకటి ఇంతకు ముందు చూసి భయం వేయడమే అందుకు కారణం.

As you said, in Telugu, there are some good movies who don't get public appreciation which is very unfortunate. But, compared to other languages, in Telugu, movies related to social issues are really less. And Telugu audience also do not encourage such films..as most of us are got used to so called commercial time pass movies...

Mouli గారు,
నిజమా! కామెడీ అయినా అది సెటైరికల్ గానే ఉండి ఉంటుంది కదా, ఆ తమిళ సినిమా!

థాంక్యూ!

సుజాత వేల్పూరి said...

Vajra గారు, నా బ్లాగ్ కి స్వాగతం!

తెలుగులో మూస సినిమాలకు బాగా అలవాటు పడి మనం కూడా మూస ప్రేక్షకులమై పోయాం. కొత్త దనాన్ని ఆస్వాదించలేం! సోషల్ సమస్యల మీద సినిమాలొస్తే కనీసం స్పందించం! అది మన పని కాదనుకుంటాం! సినిమా అంటే రెండు గంటల టైం పాస్ అని, కేవలం వినోదమే దాని లక్ష్యం అనే మైండ్ సెట్ మనది. ప్చ్!

శ్యాం బెనగల్ బెంగాలీ ఏంటండీ, హైద్రాబాదు లో పుట్టిన పక్కా హైద్రాబాదీ! మన వాడే! ఈ సినిమా క్రెడిట్ మనమే తీసుకుందాం!:-)

సుజాత వేల్పూరి said...

Sahi గారు,
మిగతా మిత్రులు చెప్పాక ఈ కాన్సెప్ట్ తో పోసాని చేపల చెరువు తీశాడని తెల్సింది. థాంక్యూ! ఆ సినిమా నేను చూడలేదు.

నాగార్జున...(చారి)

మంచి పని చేశారు. ఇక్కడ బొమన్ ని చూసాక పోసానిని జీర్ణించుకోవడం కష్టమే

థాంక్యూ

Vajra said...

Sujatha Garu...

My bad...Nenu inni rojulu Shyam benegal garu bengali dir staying in Hyderabad anukunna...Kani wiki chusaka telisindi thanu pakka hydi ne ani...Tnq once again fr clarification..

Nijam chepparu andi.Mana vallu manchi cinemalani encourage cheyyaru kani..commercial cinemalani encourage chestunnaru. Oka rakamga maname manchi cinemalni champestunnam...:) :)

Vasu said...

-- విడ్డురం ఏమిటి అంటే ఇలాంటి సినిమా బెంగాల్ సామ్రాట్ Shyam Benegal గారు తీసారు కానీ మన తెలుగు director's తీయలేదు ---

శ్యాం బెనగల్ని తెలుగు డైరెక్టర్ కిందే లెక్క కట్టచ్చు :) పుట్టి పెరిగినది చదువుకున్నది, మొదటి సినిమా తీసినది అంతా హైదరాబాద్ లోనే .

మరి ఆయన మాతృ భాష ఏంటో తెలియదు

సుజాత వేల్పూరి said...

Vasu and Vajra....

అగ్నిగీతం అని ముదిగొండ శివ ప్రసాద్ గారి నవల్లో త్రిమూర్తి అని ఒక పాత్ర అంటుంది "శ్యాం బెనగల్ ఏమిటయ్యా...అతగాడి పేరు బెనగల శ్యాం సుందర్ రావు. దాన్ని స్టైఇలుగా శ్యాం బెనగల్ అని పెట్టుకున్నాడు" అని! మాతృభాష ఏదైనా, తెలుగింట పుట్టాడు కాబట్టి తెలుగోడి కింద లెక్కేసేద్దాం..

తృష్ణ said...

"వెల్డన్ అబ్బా" మిస్సయిపోయానండి..:( "బొమన్ ఇరాని" గురించి నాదీ మీ మాటే. ఎంతైనా థియేటర్ ఆర్టిస్ట్ ల తీరే వేరు.క్రిందటేడు ఓరోజు రాత్రి టివీలో వస్తూంటే సగానికి పైనే చూసాం "చేపల చెరువు" సినిమా. ఆసక్తికరంగా ఉంది కానీ బాగా లేటయిపోయిందని ఇక కట్టేసాం. చాలా బాగా తీసారు.

శ్యాం బెనెగల్ నాకు ఇష్టమైన దర్శకుల్లో ఒకరు ! ఆయన, లాస్ట్ వీక్లో అనుకుంటా నాగేశ్వరరావు ప్రతి ఏడూ తన పేరుపై ఇచ్చే "అక్కినేని అవార్డ్" ను కూడా హైదరాబాద్ లో అందుకున్నారు కదా..అందుకని ఈ సినిమా గురించి రాసారనుకున్నా ! ఆ విషయం కూడా ప్రస్తావించాల్సిందండీ టపాలో.
http://timesofindia.indiatimes.com/videos/entertainment/regional/telugu/Akkineni-Nageswara-Rao-award-for-Shyam-Benegal/videoshow/17926688.cms

Kottapali said...

Nice. saw it last night by coincidence.

Vajra said...

చాలా చమత్కారంగా compare చేసారు Sujata Garu. Telugu vadu kakapoyina teluginta undi throughout the nation thana talent ni spread chestu manchi cinemalu tistunna Benegal garu hydi/telugu vade ani lekkaloki teesukoka tapaddu..:) :)

సుజాత వేల్పూరి said...

తృష్ణ గారూ,

ఈ సారి వీలైతే యూ ట్యూబ్ లో చూడండి. పోసాని ని నేను భరించలేనండీ! బహుశా చేపల చెరువు చూడ్డం నా వల్ల కాదు :-))

థాంక్యూ!

సుజాత వేల్పూరి said...

Narayana Swamy garu

Hope you liked it!! :-)

Vajra :-))

రామ్ said...

సుజాత గారూ

ఎందరో మహాను 'బావులు' !!

మంచి సినిమాని బ్రహ్మాండం గా పరిచయం చేసారు - అర్జెంటు గా చూడాలని మా ఇంట్లో "బావి" భారత పౌరులు అందరికి చెప్పాను .

Unknown said...

సుజాత గారికి నమస్కారం మీరు చెప్పినwell done abbaసినిమా చాలా బావుంది.ఈసినిమా 26మార్చి2010రిలీజ్ పోసాని గారి రాజావారి చేపలచెరువు29మార్చి 2009ఒక మరాఠి సినిమా ఇన్స్పిరేషన్ తో ఈసినిమా తీస్తున్నాసని పోసాని ఇంటర్వ్యూలో చెప్పినట్లు గుర్తు

venkat said...

ఇప్పుడే మీ పోస్ట్ ఆంధ్రజ్యోతి లో చదివాను.
ఇంతకు ముందు చదివాను మీ బ్లాగ్ లో, మళ్ళీ చదివినా బాగుంది.
కంగ్రాట్స్. కుదించి రాసారు , పూర్తిగా ఉంటె బాగుండేది.

Post a Comment