Showing posts with label జ్ఞాపకాలు. Show all posts
Showing posts with label జ్ఞాపకాలు. Show all posts

August 2, 2010

టీచరమ్మ మొగుడు

నేను మూడో క్లాసు చదువుతున్నపుడు ఆ క్లాసుకు అన్ని సబ్జెక్టులూ చెప్తూ క్లాస్ టీచర్ గా శ్రీమతి శ్రద్ధా దేవి ఉండేవారు.అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు పాఠం చెప్పడమే కాక మాతో బోలెడన్ని ఆటలు ఆడి,వీలైతే హోమ్ వర్క్ కూడా స్కూల్లోనే చేయించేసి,"ఇంటికిపోయి హాయిగా ఆడుకోని తిని పడుకొండి"అని భరోసా ఇచ్చేది ఆమె.అందుకని ఆమె అంటే భలే ప్రాణంగా ఉండేది మాకు.ఒక్కరోజు కూడా స్కూలు ఎగ్గొట్టకూడదని తపించేంతగా! సన్నగా తెల్లగా, పెద్ద జడతో(అంటే జడకాదు తెల్లగా ఉండేది),జడలో ఎర్రని గులాబీతో, ఇస్త్రీ చేసిన లేతరంగు కాటన్ చీరెల్లో మెరుపుతీగలా ఉండేది ఆమె.




ఒకరోజు మధ్యాహ్నం లంచ్ టైమ్ లో నల్లగా లావుగా ఉండే ఒకాయన వచ్చి చెట్టు కింద ఆడుకుంటున్న మమ్మల్ని "శ్రద్ధా టీచరుందా" అనడిగాడు.

అంతలో ఆమె చిరునవ్వుతో ఆయన వద్దకు ఎదురెళ్ళి కాసేపు మాట్లాడి పంపేసింది. తర్వాత తెలిసింది ఆయన టీచర్ గారి భర్త అని!

గొప్ప షాక్ తగిలింది.

టీచర్ గారికి మొగుడేంటి అని తెల్లబోయాము!  ఎందుకంటే అప్పటిదాకా అసలు టీచర్ గారికి భర్త పిల్లలు,వంటివి ఉండొచ్చని మాకు తట్టలేదు.పైగా టీచర్ గారికి ఆయన తగిన మొగుడుగా అనిపించలేదు.

తర్వాత ఆయన ఎప్పుడు స్కూలుకొచ్చినా చూడలేక కుమిలిపోయేవాళ్ళం! ఆయన రాగానే ఇంత అందమైన టీచరమ్మ పరుగెత్తుకుంటూ వెళ్ళడం నచ్చేది కాదు!పెద్ద పొసెసివ్ నెస్ తో రగిలిపోయేవాళ్లం!ఆయనకు వేరే వూరు ట్రాన్స్ ఫర్ అయిపోవాలని కోరుకునేవాళ్ళం!



కానీ అలా జరగలేదు..పైగా వాళ్ళు స్కూలుకు దగ్గర్లోనే ఇల్లు కట్టుకుని సెటిల్ కావడంతో ఆయన రోజూ స్కూలు ముందునుంచే పదిసార్లు తిరుగుతూ కనపడేవాడు.


తర్వాత హైస్కూల్లో తెలుగు మేడమ్ అవివాహిత. తల్లితో కల్సి ఉండేది.ఎప్పుడూ మాకు బోలెడన్ని పుస్తకాలు ఇస్తూ, మమ్మల్ని వ్యాసరచన పోటీలకు ప్రిపేర్ చేస్తూ ఎక్కడా ఎవరికీ బహుమతులు రాకుండా మా స్కూలుకే అన్నీ వచ్చేలా ఎంతో కృషి చేస్తుండేది.

ఒక ఫ్రెండ్ లా మాతో కల్సిపోయి పాటలు కూడా పాడుతుండేది.మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళి టిఫిన్లు పెట్టేది. ఒకరోజు పిడుగులాంటివార్త తెల్సింది!

ఆమెకు పెళ్లి కుదిరిందని!

ఇక మేము ఎంతగా ఏడ్చామంటే ఆమె పెళ్ళి ఆగాలని ఎంతో కోరుకున్నాం గానీ ఈసారి కూడా అలా జరగలేదు.పెళ్ళి అయిపోయింది.ఈ సారి పెళ్ళికొడుకు అందంగా ఉన్నా మాకు నచ్చలేదు. "ఏడిసినట్టున్నాడు"అని తిట్టుకున్నాం.అసలు టీచర్లకు పెళ్ళి పెటాకులేమిటని విసుక్కున్నాం!

మాకు లెక్కలు,పీ ఎస్ చెప్పడానికి మగపిల్లల హైస్కూలు నుంచి ఒక మాస్టార్ని  డెప్యుటేషన్ మీద పంపారు.ఆయన చలవతో లెక్కలంటే భయం పోయింది.అంత బాగా చెప్పేవారు. ఖాళీ పీరియడ్లు ఉంటే స్టాఫ్ రూములో కూచోకుండా క్లాసుకు వచ్చి ఎక్ స్ట్రా క్లాసులు తీసుకునేవారు. అలాంటిది మా స్కూల్ డే రోజు మాత్రం ఆయన్ని చూస్తే "ఈయనెవరో మాకు తెలీ"దనిపించింది.

అప్పటివరకూ ఆయనకోభార్య ఉంటుందని తల్చుకోని కూడా తల్చుకోని మేము ఆయన ఏకంగా ఒక పిల్లను నడిపించుకుంటూ మరో పిల్లనో పిల్లాడినో ఎత్తుకుని వాళ్ళకు డ్రింకులూ అవీ ఇవ్వడం,కర్చీఫ్ తో వాళ్ళ ముక్కులూ మూతులూ తుడవడం,ఒకట్లకీ రెండ్లకీ బాత్ రూములకేసి తీసుకెళ్లడం వంటి "సామాన్యమైన పనులు " చేస్తుంటే తెల్లబోయాం.మా "ఐడియల్ హి"  అసలు స్వరూపం ఇదా అనిపించింది.ఆయన్ని మాస్టారు పాత్రలో తప్ప ఇలా మొగుడు,తండ్రి పాత్రల్లో  ఊహించుకోకపోడం వల్ల ఆయన సంసార తాపత్రయం చూస్తుంటే చీదర పుట్టింది. టీచర్లూ,మాస్టార్లు పెళ్ళి చేసుకోకుండా ఉంటే బావుంటుందనిపించింది.


ప్రతి విద్యార్థి దశలోనూ టీచర్లు మన సొంతం అనే ఫీలింగ్ ప్రతొక్కరికీ ఉంటుందేమో!వాళ్ళకంటూ పర్సనల్ లైఫ్,పిల్లలు, సంసారం ఉంటాయని తోచదెందుకో! చాసో రాసిన ఒక కథలో(రథ యాత్ర అనుకుంటాను) తిరణాలకు పెళ్ళాం పిల్లల్తో వచ్చిన మాష్టారిని చూసి విస్తుపోతాడు ఆరేళ్లకుర్రాడు."మాష్టారికీ పెళ్ళాముంటుందా"అని ఆశ్చర్యపోతాడు.



 రెండో క్లాసు చదూతున్న మా   పాపాయి నిన్న స్కూలు నుంచి వస్తూనే"ఇవాళ మా విద్యా మేమ్ హజ్బెండ్ వచ్చారు స్కూలుకు"అంది సంభ్రమంగా! "ఏం వస్తే?" అనడిగితే కొంచెం సిగ్గుపడి కాసేపు నానుస్తూ "మరేంటంటే...విద్యా మేమ్‌కి హజ్బెండ్ ఉంటాడని మేమెవరమూ అనుకోలేదు" అంది.



తర్వాత లోపలికెళుతూ వెనక్కి చూసి"ప్చ్,ఆయనసలేం బాలేదు. మా మేడమే బాగున్నారు"అని నిరాశపడుతూ వెళ్ళిపోయింది.

దానితో ఇదంతా గుర్తొచ్చింది! :-))

December 2, 2009

ఆలిండియా రేడియో ఆర్కైవ్స్ సీడీలు


పుస్తకాలు మరియు స్నేహితురాళ్ళూ అంటూ హుషారుగా మొదలై జోరుగా పరుగులెడుతోన్న యూత్ ఫుల్ బ్లాగులో ఈ మధ్య ఏమీ రాయడం లేదని నిన్న మా సత్యాన్వేషి ఫోన్ చేసి ఖోపం పడ్డాడు నా పైన!




అందుకే ఆ మధ్య ఆలిండియా రేడియో స్టేషన్లో నాకు దొరికిన ఆర్కైవుల సీడీల గురించి చిన్న టపా ఒకటి అందరితో పంచుకున్నాను. మీక్కూడా ఆ సీడీల గురించి చదవాలని, స్వంతం చేసుకోవాలని ఉంటే...చూడండి ఇక్కడ...!.

August 25, 2009

నా ఆటోగ్రాఫ్ బుక్-స్వీట్ మెమొరీస్





నిన్న ఒక పుస్తకాల కొట్లో సెలోఫెన్ టేపు కొని వందరూపాయల నోటు ఇచ్చాను. బదులుగా కొట్టబ్బాయి ఇచ్చిన చిల్లరలో ఒక యాభై రూపాయల నోటు వెనక తెల్లని భాగంలో ఇలా రాసి ఉంది




"తెలియక కలిశాము, తెలిసి విడిపోతున్నాము. మరల ఎప్పుడైనా కనపడితే మాత్రం ఎవరని మాత్రం అడగకు ప్రియతమా" పాపం ఆ నోటు అందుకున్న ప్రియుడో, ప్రియురాలో ఈ మాటకు, నోటుకు కూడా పెద్ద విలువ ఇవ్వకుండా మార్కెట్లో మార్చేసినట్లున్నారు.



ఇంటికొచ్చాక, సరదాగా నా పాత ఆటోగ్రాఫ్ పుస్తకం తీసి చూస్తే కొంత మంది మిత్రులు రాసిన వాక్యాలు, మెసేజ్ లు భీభత్సంగా కనపడ్డాయి.



పదోక్లాసు అయ్యాక తలా ఒక కాలేజీ కి వెళ్ళిపోతాం కాబట్టి ఫేర్వెల్ పార్టీ కి వస్తూ దార్లో "స్టూడెంట్స్ ఫ్రెండ్స్"(ఇది మా వూర్లో చాలా పేరున్న పురాతన స్టేషనరీ షాపు) టోకున కొనేశాం ఆటోగ్రాఫ్ పుస్తకాలు! అప్పట్లో అమ్మాయిలు గులాబి రంగుని ఇష్టపడాలని తెలీకపోవడం వల్ల నచ్చిన డిజైన్లలో కొన్నాం! నా స్నేహితులంతా (ఆడపిల్లల స్కూలు) కవితాత్మకంగా ఉండాలని సినిమా పాటలన్నీ వెదికి కొన్ని లైన్లు బట్టీ కొట్టి వచ్చారు రాయడానికి.



ఎవరూ వేరే ఊరెళ్ళి చదివే సీన్ లేదు. ఇక విడిపోయే ఛాన్సెక్కడ? ఏదో ఒక రోడ్లో కనపడుతూనే ఉంటారుగా! అసలు సీట్లు దొరికితే అందరం ఒకే కాలేజీలో చేరాలని కూడా నిర్ణయించుకున్నామాయె! అయినా కూడా ఎప్పటికైనా విడిపోతాం కాబట్టి, పోయాక మాకంటూ పదో తరగతి తీపి గుర్తులు ఉండాలని ఆటోగ్రాఫ్ పుస్తకాల్లో మెసేజ్ లు రాసుకున్నాం.



అసలు ఆటోగ్రాఫ్ పుస్తకం ఏమిటో, ఎందుకో తెలీని వాళ్ళు కూడా ఉంటారని ఆ రోజే తెలిసింది. విమల అనే అమ్మాయి (ఇది భలే మొద్దు. వాళ్లకి రెండో పదో బస్సులుండేవి) తన మరో ఫ్రెండ్ పుస్తకంలో "టిట్ ఫర్ టాట్" అని రాసిచ్చింది. అవతలి పిల్ల మండిపడుతూ P.E.T రాజేశ్వరి టీచర్ గారికి ఫిర్యాదు చేసింది. ఆవిడ నిలదీస్తే విమల అమాయకంగా "అంటే ఏంటసలు! ఏదో ఎప్పుడూ వింటూ ఉంటాం కదాని రాశాను " అని చెప్పింది.

నాకో అమ్మాయి
"మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట, నీ బ్రతుకంత కావాలి పూల తోట" అని రాసింది. "ఏ పాట?" అనడిగితే "నువ్వెప్పుడూ ఇంతే, నీకసలు కవితా హృదయం లేదు" అని తిట్టింది.





కొన్ని అద్భుత మెసేజ్ లు మీ కోసం..

"సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ"

"స్నేహబంధమూ ఎంత మధురమూ"

(ఇలా రాసిన వాళ్ళు పక్క వాళ్లకి ఒక్క మార్కు ఎక్కువొస్తే యూనిట్ టెస్టుల్లో కూడా రీ వాల్యుయేషన్ అడిగే రకాలు)



చాలా మంది "All that glitters is not gold" అని రాసిచ్చారు. మాథమాటిక్స్ ట్యూషన్ క్లాసులో కలిసే ఒక తెలుగు మీడియమ్ బాబు All that "glitters" అంటున్నాం కదా అప్పుడు glitters  "is"  కాకుండా glitters "are" అని ఉండాలేమోరా, నాకు డౌటుగా ఉందన్నాడు. అతడిపేరు శ్రీను!



ఇక కాలేజీలో ప్లస్ టూ అయ్యాక కొందరు వేరే వూళ్ళకి, వేరే కాలేజీలకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ సందర్భం లో కూడా ఫేర్ వెల్ రోజు ఆటోగ్రాఫ్ పుస్తకాలెక్కడ ఉన్నాయో దుమ్ము దులిపి తీసుకెళ్ళాం, వీళ్లు రాసే గోల్డెన్ వర్డ్స్ కోసం!



మా క్లాసులోని 132 మందిలో భావ కవిత్వం రాయాలనే కోరిక ఎంతమందిలో అంతర్లీనంగా పాతుకుపోయి ఉందో ఆ రోజు బయట పడింది. కొందరు లాజికల్ గా, మరికొందరు మాథమాటికల్ గా మరికొందరు మరో "కల్ " గా రాశారు. మొత్తం మీద ఈ ఎపిసోడ్ కూడా భీభత్స రస ప్రధానంగానే జరిగింది.(ఇప్పుడు చూస్తే అనిపిస్తోంది అలా)

పూజారి గారబ్బాయి గోపాల కృష్ణా చార్యులు ఇలా రాశాడు చాలా మందికి, నాతో సహా...



"Forget the word Gopal..!

Forget the word krishna..!

Forget the word charyulu...!

But don't forget Gopala krishna charylu"

అది చూసి అందరూ "ఓర్ని, గోపీ భలే రాశాడే"అని ఆశ్చర్యం పడ్డారు. ఈ గోపి ఇప్పుడు టెక్సాస్ లో ఉన్నాడు. ఆ మధ్య మెయిల్లో "నా ఆటోగ్రాఫ్ పుస్తకం దొరికింది గోపీ" అని తను రాసింది చెప్తే ఎంత సిగ్గుపడిపోయాడో తర్వాతి మెయిల్లో!  "అబ్బా, నీకిదేం పాడు బుద్ధి? ఎప్పటెప్పటివో అన్నీ దాస్తావు" అని సరదాగా చిరాకు పడ్డాడు.



నాతో ప్రతి సబ్జెక్టులోనూ స్కూలు రోజులనుంచీ పోటీ పడుతుండే శ్రీధర్  "నువ్వు ప్రతి పరీక్షలోనూ తప్పాలి" అని రాసి, "ప్రతిపరీక్షలోనూ నాకంటే ఒక్క మార్కు నీకు తక్కువ రావాలి" అని నేను రాసేలా చేశాడు.
శ్రీధర్ ఇప్పుడు ఢిల్లీలో Ministrey of external affaris లో ఉన్నాడు. 




ఎవరితోనూ మాట్లాడకుండా పుస్తకాల్లో తల దూర్చి అంతర్ముఖుడిగా ఉండే చంద్ర శేఖర్ అనే అబ్బాయి ఒక్కొక్కరికీ రాసిన వాక్యాలు చూస్తే కళ్ళు తిరిగాయి మాకు.



నా పుస్తకంలో ఇలా రాశాడు.

"పరిచయం అనే మొక్కకు స్నేహం అనే నీరు పోస్తే


మమతలనే రెమ్మలతో పెరిగి


అనురాగమనే పుష్పం పూసి, ప్రేమ అనే ఫలాన్నిస్తుంది"



మరొక అమ్మాయికో, అబ్బాయికో గుర్తు లేదు గానీ

"మనం ప్రేమించిన వారు దొరికితే అనురాగం వెల్లివిరుస్తుంది


మనల్ని  ప్రేమించే వారు దొరికితే మమకారం మొగ్గలేస్తుంది


నిన్ను ప్రేమించిన వారు, నువ్వు ప్రేమించిన వారు ఒకరే అయి


నీ జీవితం నందనవనం కావాలని..."



ఇలాగే అందరి పుస్తకాల్లోనూ కవిత్వాన్ని ఇష్టం వచ్చినట్లు కుమ్మరించి పారేశాడు. ఎలాగో మేం తేరుకుని "అదిరిందయ్యా చంద్రం,, ఇంత కవివా నువ్వు? ఇవన్నీ ఎప్పుడు రాశావు?"అనడిగాం!

దానికి చంద్రం "ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర" ఒక ఫైలు తీసి  "ఇందులోవే.." అని చూపించాడు.



దాంట్లో పత్రికల్లో వచ్చే భావకవితల పేపర్ కటింగ్స్ రెండు మూడు కట్టలున్నాయి. వాళ్ల అన్నయ్య రాసినవి కూడా అందులో ఉన్నాయిట. ఆ ఫైలు వాళ్ల అన్నయ్యదే!

చంద్ర శేఖర్ ఇప్పుడు గుంటూర్లోనో, ఒంగోలు లోనో కామర్స్ లెక్చరర్!



మరికొంతమంది రాసిన ఆణిముత్యాలు చూడండి..

"love is like a flower, but friendship is like a sheltering tree"



వివేకానందుడి "Arise, awake, and stop not till the goal is reached" అనే వాక్యాన్ని కనీసం పది మంది రాశారు తమ స్వంత కవితా స్ఫూర్తి మీద నమ్మకం లేక!



రాజ శేఖర్  అనే కుర్రాడు

W                      words

A                       Action

T       your         Thinking

C                      Character

H                       Heart



అని రాశాడు ఎక్కడనుంచి పట్టి తెచ్చాడో గానీ!

మరొక హాస్య ప్రేమికుడు...

"Observe -Four

choose -Three

Love  -Two

marry - One,,"  అని అబ్బాయిలకూ, అదే వూపులో అమ్మాయిలకూ రాసి చీవాట్లు తిన్నాడు!



"Life is not a bed of roses"  అని ఒకరూ,


"To gain something, you have to lose something"  అని ఒకరూ,



"ఓర్పు కన్నా సముద్రం చాలా చిన్నది"అని ఒకరూ



"If you turn your face towards sun, you can't see your shadow" అని మరొకరూ,



ఇలా ఏదో ఒక సందేశం ఇవ్వకపోతే లాభం లేదన్నట్లు చాలా చాలా రాశారు.

తిరుమల గుప్తా అనే షరాబు గారబ్బాయి వెరైటీగా

"ఎందుకొచ్చిన చదువులు? అందరూ తలా ఒక బిజెనెస్ చేసి బాగా డబ్బు సంపాదించండోయ్" అని రాశాడు.(ఇతడు ఇంటర్లో ఉండగానే షేర్లలో డబ్బు పెట్టి లాభాలు గడిస్తుండే వాడు) అప్పట్లో అది మాకు హృదయం లేని బండగాడిద రాతలా అనిపించినా ఇప్పుడు చూస్తే

"తిరుమల బాగానే చెప్పాడు" అనిపిస్తుంది. తిరుమల ఇప్పుడు మా వూర్లోనే బంగారు నగల షాపు పెట్టి మూడు బిల్డింగులు కట్టాడు. షాపుకు వెళ్తే, స్నేహితులన్న చిన్నపాటి కన్ సర్న్ కూడా లేకుండా  కమ్మగా కబుర్లు చెపుతూనే  మాక్కూడా 16% వేస్టేజ్ వేసుకుంటాడు. టూ ప్రాక్టికల్!



ఇంటర్లో అనుకుంటా, సుభాష్ అనే అబ్బాయి కి ఈ పుస్తకం ఇచ్చి ఆటోగ్రాఫ్ ఇవ్వమంటే...మొత్తం తిరగేసి..



"My sincere advice ..., please do not keep this book with you"  అని రాసిచ్చాడు.



టీచర్లు,లెక్చరర్లు రాసేవాటికి పెద్ద ప్రాధాన్యం లేదు. ఎంచేతంటే వాళ్ళెప్పుడూ "wish you all the best" అనో,

"wish you success in your life" అనో రాస్తారు కాబట్టి మళ్ళీ మళ్ళీ చదివేలా ఉండవు. కవి, రచయిత నాగభైరవ కోటేశ్వర రావు గారు మాత్రం (సందర్భం గుర్తు లేదు ఎప్పుడో),

"దీపం నీ ధ్యేయం" అని రాసి అర్థం కాకుండా సంతకం పెట్టారు.



డిగ్రీలోకొచ్చాక, ఇక వీటిమీద ఆసక్తి పోయింది. ఆ మధ్య Planet M లోనో , లాండ్ మార్క్ లోనో ఎస్సెమ్మెస్ ల  పుస్తకం చూశాను. అలాగే ఆటోగ్రాఫ్ పుస్తకాల్లో రాయడానిక్కూడా అప్పట్లో ఏవైనా పుస్తకాలుండి ఉంటే నా ఈ తీపి జ్ఞాపకాల పుస్తకంలో ఇంకొంచెం బెటర్ మెసేజ్ లు ఉండేవేమో గానీ అవి వీటంత మధురంగా ఉండేవి కాదేమో!























"

June 17, 2009

క్విజ్ టైమూ, సిద్దార్థ బసూ, నేనూ!




వేసవి సెలవులు ముగుస్తుండగా మా కాలనీలో మాకు ఒక అద్భుతమైన అయిడియా వచ్చింది.

 ఇక కొద్ది రోజుల్లో పిల్లలు ఎలాగూ స్కూళ్ళకు బయల్దేరతారు "Happy days are here again"  అని పాడుకుంటూ! ఇప్పటికీ సమ్మర్ కాంపులతో బిజీగానే ఉన్నారు. కాసింత సరదాలూ, పాడూ ఏమీ లేకుండా అయిపోతున్నాయి వీళ్ళ జీవితాలు..అని కళాత్మకంగా ఒక క్విజ్ ప్రోగ్రాం నిర్వహించాలని అనుకున్నాం! (ఇల్లాంటి కళాత్మకాలోచనలు(సవర్ణ దీర్ఘ సంధి) నాకే వస్తాయని వేరే చెప్పాలిటండీ)!




ఈ ఆలోచన బయట పెట్టగానే పెద్దవాళ్లంతా

"మాకూ ఉండాల్సిందే క్విజ్! ఎప్పుడో కాలేజీ రోజుల్లో ఉండేవి క్విజ్ లు! అంతకు ముందు సిద్దార్ధ బసు రోజుల్లో! మేమూ పాల్గొంటాం సీనియర్లు, జూనియర్లు,సబ్ జూనియర్లు ఇలా కేటగిరీలు ఉండాల్సిందే"  నన్నారు.
మాకూ సరదా వేసి ఒప్పేసుకున్నాం! పేపర్ సెట్టర్లకు, వారి కుటుంబ సభ్యులకు(పిల్లలకు మినహాయింపు) క్విజ్ లో పాల్గొనే అవకాశం లేదు. పదిమంది తెలివైన మేధావులు(ఇదేదో దుష్ట సమాసంలాగా ఉంది) కూచుని ప్రశ్నలు తయారు చేశాం. ఒక్కొక్కళ్ళూ సిద్ధార్థ బసు, అనితా బసుల్లాగా ఫీలవుతూ జాగ్రత్తగా ప్రశ్నావళి తీర్చి దిద్దాము!



ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో ఉండగా క్విజ్ టైమూ, ఇండియా క్విజ్ కార్యక్రమాలు దూరదర్శన్లో వచ్చేవి చూడండి. సిద్దార్థ బసు నేతృత్వంలో! రాత్రి తొమ్మిదయ్యేసరికి హైదరాబాదు దూరదర్శన్ కార్యక్రమాలకు అసలు సేల్సు ఉండేవా బుధవారం రోజు?(బుధవారమేనా ఇంతకీ) అయినా మనవాళ్ళు ఎనిమిదిన్నరకే "Over to Delhi" అనే పాత బోర్డు పెట్టేసి చాపలు చుట్టి దుకాణం సర్దేసేవాళ్ళుగా? పిల్లలూ, పెద్దలూ అందరూ క్విజ్ టైమ్ కోసమే వేయికళ్ళతో ఎదురు చూస్తుండేవాళ్ళు. సిద్దార్థ బసు, పక్కనే చక్కని చిరునవ్వుతో ,మార్కులు వేస్తూ అనితా బసు..! ఒక్కోసారి సిద్ధార్ధ బసు స్థానంలో ఇంగ్లీషు వార్తలు చదివే భాస్కర్ భట్టాచార్జి క్విజ్ మాస్టర్ గా వచ్చేవాడు. ఆయన కర్లింగ్ హెయిర్ భలే ఉండేది.పిల్లలు సరైన సమాధానం చెప్పగానే భాస్కర్ చాలా స్టైలుగా "కొఱ్ఱెక్ట్"అనేవాడు గుర్తుందా?, "కరెక్ట్"అనడానికి! నాకైతే ఏ క్విజ్ ప్రోగ్రాం చూసినా క్విజ్ మాస్టర్ భాస్కర్ భట్టాచార్జి అంత సొగసుగా "కరెక్ట్"అనేవాళ్ళు ఆ తర్వాత ఇంతవరకూ కనపళ్ళా!



ఆ క్విజ్ కార్యక్రమాల్లో పాల్గొనే పిల్లలు ఎక్కడినుంచి వచ్చేవాళ్ళో కానీ మెరికల్లాగా ఎంతటి ప్రశ్నలకూ ఇట్టే జవాబులు చెప్పేవాళ్ళు కాదూ! (అప్పుడూ సరిగ్గా ఇదే అనుకునేవాళ్లం)క్విజ్ మాస్టర్ అడిగే ప్రశ్నల్ని జాగ్రత్తగా  నోట్ చేసి పెట్టుకోవడం, మర్నాడు కలిసిన స్నేహితులతో కలిసి వాటి జవాబులు అందరూ ఒకటే రాశారా లేదా అని సరి చూసుకోడం, ఒక ఫైలు తయారు చేయడం ఇదో పెద్ద అసైన్మంట్! 



మా వూర్లో అందరూ చదువు,కళల పట్ల బోలెడంత ప్రేమ, ఆదరణ కలవారవటం చేత వివిధ క్లబ్బులు, కళా సాంస్కృతిక సంఘాల వాళ్ళు ఎప్పుడూ వ్యాసరచన,వక్తృత్వం,క్విజ్ పోటీలు పెట్టి యధాశక్తి మాకు బహుమతులిచ్చేస్తూ ఉండేవాళ్ళు.

ఒకసారి పది టీముల్తో హోరాహోరీ తలపడి చివరికి మిగిలిన రెండు టీముల్లో ఒకటి మా స్కూలు! ఒక్క ప్రశ్నా అవతలి టీముకు పోకుండా జాగ్రత్తగా జవాబులు చెప్పి ఇక్కడ కూడా సమ ఉజ్జీలుగా నిలిచాయి రెండు టీములూ! మరి కాసేపట్లో బహుమతి ప్రదానం కోసం నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ కూడా వచ్చి ఉన్నారు. విజయాన్ని నిర్ణయించే చివరి రౌండ్ ప్రశ్న ఆయన్నే అడగమంటే ఆయన చాలా స్పాంటేనియస్ గా అవతలి టీము వైపు చూస్తూ
"నలుగురు పద్మశ్రీలు ఉన్న తెలుగు సినిమా పేరు చెప్పండి"అనేసి కూచున్నారు.
వాళ్ళు ఇటువంటి ప్రశ్న ఎదురు చూడకపోవడంతో పద్మశ్రీ అవార్డులు  ఎవరెవరికి వచ్చాయో లెక్కెట్టే లోపు మాకు టైము కలిసి వచ్చింది. వాళ్ళు చెప్పలేకపోయే సరికి నేను, చిత్ర, రాజకుమారి కూడబలుక్కుని "మాయా బజార్"అని చెప్పేశాం!
(నిజానికి మాకూ కంగారు వేసింది కానీ అంతమంది హేమా హేమీలు ఉన్న సినిమాలో నలుగురు పద్మశ్రీలు ఉండకపోతారా అని చీకట్లో బాణం వేశామంతే! ).


ఆయన చల్లగా "తప్పు" అన్నారు.
 
"తెనాలి రామకృష్ణ రైటాన్సరు! రామారావు, నాగేశ్వర్రావు,భానుమతి, నాగయ్య..నలుగురు పద్మశ్రీలు"అని జవాబు కూడా చెప్పారు.



మళ్ళీ "టై" అని నీరసం వచ్చింది.

కానీ మాకు వెంటనే ఒక గొప్ప లాజిక్కు దొరికి "మేం ఒప్పుకోం! మీరు నలుగురు పద్మశ్రీలు "ఉన్న" తెలుగు సినిమా అన్నారు కానీ "నటించిన"అన్లేదు.అందుకని మేము రామారావు, నాగేశ్వర్రావు, రేలంగి,ఘంటసాల"అని లెక్కేశాం! ఘంటసాల సినిమాలో నటించకపోతేనేం, ఉన్నారా లేదా"అని వాదించాం ఉత్సాహంగా!

"నిజమే కదా" అన్నట్లు చూశారు నిర్వాహకులు ప్రైజు మాకే ఇచ్చేయలనే ఉత్సాహంతో! ప్రొఫెసర్ గారు మా లాజిక్ మెచ్చుకుని (మనసులో మాత్రం "వీళ్ళ మొహాలు ఈడ్చా! నా కొశ్చెన్ కే ఎదురా?" అనుకుంటూ)బహుమతి మాకు ప్రకటించారు. అలాంటి క్విజ్ లు ఎన్నో, లెక్కేలేదు. మా స్కూలు హెచ్చెమ్ రూములో మేం సంపాదించిన షీల్డులు లెక్కెట్టాలంటే ఒక పూట పడుతుంది.



మా కాలనీ క్విజ్ లో పిల్లల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది కానీ, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి మరీ పేదగా అంటే పూర్ గా ఉందని చెప్పక తప్పదు. జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలంటే

 "జపాన్ దేశం కరెన్సీ ఏది"

"ఈ రోజున డాలర్ కెన్ని రూకలు?గుప్పెడేనా?"
"
NDTV profit ఛానెల్లో పొద్దున్న ఎనిమిదింటికి వచ్చే అనలిస్ట్ ఎవరు?"


అని అడుగుతామేమో అనుకుని బాగా ప్రిపేర్ అయి వచ్చారు. కానీ పేపర్ సెట్టర్ ఎవరు మరి?అందుకే

"మీ దగ్గర్లోని పోస్టాఫీసు ఎక్కడుంది?"

"వోటర్ ఐడీ కార్డులకు ఎక్కడ అప్లయి చేయాలి"

"కరెంట్ బిల్లు కరెంటాఫీసులో కట్టాలా? ఈ-సేవా లోనా"

"సమీపంలో ఈసేవా కేంద్రం ఎక్కడుంది?"

"ఇక్కడినుంచి సికిందరాబాదు వెళ్ళు సిటీబస్ నంబర్ ఎంత"

"దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రి చిరునామా చెప్పుము"

"మోర్ సూపర్ మార్కెట్లో సోనా మసూరి రైస్ కిలో ఎంతకు దొరుకును?"

"మాదాపూర్ ఆంధ్రా బాంక్ శాఖ కొండాపూర్ లో ఎందుకుందో తెలుసా?(నల్లకుంట పోలీస్ స్టేషన్ అడిక్ మెట్ లో ఉన్నట్లు)


"రోజుకు టాంకర్ రు. 400 చొప్పున నెలకు 78 టాంకర్లు నీళ్ళు తెప్పిస్తే ఒక్కో ఫ్లాట్ కి ఎంత బిల్లు పడుతుంది?"

"మొబైల్ ఫోన్ చూడకుండా, మీరు గుర్తుంచుకున్న ఒక అయిదు ఫోన్ నంబర్లు చెప్పండి"

వంటి ఎదురు చూడని ప్రశ్నలకు   జవాబులు చెప్పలేక,  కనిష్టమార్కులు తెచ్చుకుని  దారుణంగా ఫెయిలై పూడ్చారు.


 ప్రేక్షకుల్లోని వాచ్ మన్ లు మాత్రం ఈ ప్రశ్నలకు కు మంచి నీళ్ళు తాగినంత ఈజీగా జవాబులు చెప్పేసి ప్రోత్సాహక బహుమతులు గెల్చుకుని ఇకపై తమను కూడా టీముల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. రెండో మాట లేకుండా వాళ్ల డిమాండ్ ని అంగీకరించేశాం!



ఇకనుంచి వీలున్నపుడల్లా ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకోవాలని అనుకుంటూ ఆ సరదా నుంచి తేరుకోకముందే కొంపలు మునిగినట్లు మొన్న సోమవారం నుంచీ స్కూళ్ళు మొదలు! వీపున బస్తాలతో హమాలీల్లాగా పిల్లలు తయారు!

October 26, 2008

ఆరోజులికముందు రావేమి నేస్తం!


పిల్లలకు ఇష్టమైన రెండు పండగలు చెప్పండంటే ఏం చెప్తాం...వినాయక చవితి, దీపావళి అని తప్పించి? పిల్లలందరూ కలిసి పార్టిసిపేట్ చేసి..అనుభవించి, ఆనందించే పండగలు ఈ రెండూ! కానీ మా చిన్నప్పుడు మేము జరుపుకున్న దీపావళికీ, ఇప్పుడు పిల్లలు జరుపుకుంటున్న దీపావళికీ పోలికే లేదు.


అసలు వినాయక చవితికి పత్రి "కొనడం" అనే concept ఏమిటో పెద్దయ్యాక నాకు చాల్రోజులు అర్థం కాలేదు. పిల్లలంతా కలిసి తోటల మీద పడి, చెట్లెక్కి అక్కడినించీ పడి...పత్రి సేకరించడం అన్నది ఇవాళ పల్లెటూర్లలో కూడా కనపడదు.


దీపావళి మందులు ఇంట్లో తయారు చేయడం అన్నది కూడా ఇవాళ టౌన్లలో, పల్లెటూర్లలో లేదు. ప్రతిదీ డబ్బు "పారేసి" కొనడమే!

నిన్న టపాసులు (పటాసులు అనాలా టపాసులే కరెక్టా) కొనడానికి వెళితే ధరల ధాటికి కళ్ళు తిరిగి వాటర్ బాటిల్ కొనవలసి వచ్చింది.(మళ్ళీ ఇదో ఖర్చు)
 కాకర పువ్వొత్తుల పాకెట్టు అనగా పన్నెండు కాకర పువ్వొత్తుల గల పాకెట్ అక్షరాలా 120 రూపాయలు. మతాబులు ఒక్కోటీ పదిహేను రూపాయలు.
 రెండు సెకన్లు వెలిగే చిచ్చు బుడ్డి ఒక్కోటీ పది రూపాయలు,
ఐదు సెకన్లు పని చేసేదైతే నలభై రూపాయలు.
మట్టి ప్రమిదలు ఒక్కోటి ఆరు రూపాయలు. అవి టెర్రకోటవైతే పదిరూపాయల నుంచి మొదలు ఒక్కోటీ!
కరెంట్ తీగలు, వెన్నముద్దలు చివరికి అగ్గిపుల్లలు కూడా భగ్గున మండిపోయే రేట్లోనే ఉన్నాయి.
ఇక 5 thousand waala, 10 thousand wala గురించి ఆలోచించే ధైర్యం వస్తుందా వీటి రేట్లు వింటుంటే! ఒక్క స్టాక్ మార్కెట్ తప్పించి అన్నీ పై పై కే! అసలు నిజంగా దీపావళి మందులు ఉత్పత్తి వ్యయం+లాభం కులుపుకుంటే కూడా ఇంతింత ధరలు ఉండడం న్యాయమేనా అనిపిస్తోంది నాకు!

కాసేపు చిన్నప్పటి రోజుల తల్చుకుని రిలాక్స్ అయితే తప్పించి ఈ ధరల షాక్ నించి తేరుకోవడం కష్టం!

చిచ్చు బుడ్లు,మతాబులు వగైరాలు బయట మార్కెట్లో కొనడం మా ఇంటా వంటా ఉండేది కాదు. మామయ్యలు, పిన్ని, పెద్దమ్మ(మేము ఆమ్మ అంటాం పెద్దమ్మను) మేనత్త అంతా ఒకే వూళ్ళో ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటంటే కజిన్స్ అందరూ తరచుగా కలుసుకోవడం ! ఇది వాళ్ల మధ్య ఎంతటి ప్రేమను, స్నేహ భావాన్ని, ఆప్యాయతల్ని పెంచి, పంచుతుందో ...నాకు బాగా తెలుసు.ఇప్పుడు మేమంతా ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీగా ఉన్నా, అందరం  కలిసినపుడు ఒక్క సారిగా చిన్న పిల్లలమై పోయి..మా పిల్లల్ని కూడా మర్చిపోతాం. పైగా వాళ్లందరిలోనూ నేనూ, మా చెల్లి చిన్న పిల్లలం కావడంతో వాళ్ళు మమ్మల్ని ఇంకా పసివాళ్ళుగానే చూడ్డం భలే 'కిక్' ఇస్తుంది.


మా చిన్నన్నయ్య, వాడి వయసు కజిన్స్ దసరాకు ముందు నించే చిచ్చు బుడ్లు, మతాబులు,సిసింద్రీలు,తారాజువ్వలు,(అవ్వాయి చువ్వాయిలు),తాటాకు టపాకాయలు

తయారు చేయడం లో బిజీ అయిపోయే వాళ్ళు. "అంత శ్రద్ధ వాళ్ళు చదువు మీద పెట్టడం ఈ పాపిష్టి కళ్ళతో ఎప్పుడు చూస్తానో" అని మా అత్త వాపోతుండేది.


 కోమట్లబ్బాయి గుప్తా తో కల్సి సూరేకారం, గంధకం(రెండూ ఒకటి కాదు కదా) ఇంకా ఏవేవో సరుకులు తెచ్చి పడేసే వాళ్ళు. వాటిని డాబా మీద ఎండబెట్టడం! మా పని ఏమిటంటే ఎండబెట్టిన వాటికి వెధవ కాపలా కాయడం! కుమ్మరి బజారుకెళ్ళి చిచ్చుబుడ్లకోసం,మట్టి కంటైనర్లు(ముంతలంటే అర్థం కావొద్దూ)ఆర్డరిచ్చి తయారు చేయించేవాళ్ళు.


తయారు చేసేటపుడు ఎంత హడావుడి చేసేవాళ్ళో తల్చుకుంటే మండిపోతుంది. చిన్న పిల్లలమనే వంకతో మమ్మల్ని అటువైపు రానిచ్చేవాళు కాదు. మతాబులు చుట్టడానికి మాత్రం పేపర్లు కత్తిరించి ఇచ్చేవాళ్లం.వీళ్ళు తయారు చేసిన టపాసులని మేం దొంగిలించి  స్నేహితులకు కొన్ని ఇచ్చి వితరణ వెలగబెట్టేవాళ్ళం కూడా!



చీపురు పుల్లలు లేకుండా తయారు చేసిన తారాజువ్వలు(వీటికి బోడి జువ్వలని పేరు)వెలిగించి వదిలేస్తే అవి దిక్కు తెలీకుండా పరిగెత్తేవి. అందుకే అన్నయ్యలు, ఇతర కజిన్స్ అందరూ పాంట్లు వేసుకుని జాగ్రత్తగా ఉండేవాళ్ళు.


పండగ లోపుగా ఎర్రని మందు బిళ్ళలు(ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి),వాటి రోల్స్ చిన్ని తుపాకుల్లో పెట్టి మధ్యాహ్నం ఎవరికీ మనశ్శాంతి లేకుండా "ఢాం ఢాం " అని పేల్చేస్తుండేవాళ్ళం. ఇవి కాకుండా నాన్నారు తెచ్చిన మందులు చేటల్లో న్యూస్ పేపర్లు వేసి ఎండబెట్టి వాటికి కాపలా కాయడం గొప్ప సరదా కలిగించే బాధ్యత.


పండగ సాయంత్రం నిమిషాల కొద్దీ చిచ్చు బుడ్లు పువ్వులు చిమ్ముతుంటే, వాటిని తయారు చేసిన కళాకారుల మొహం లో సంతోషం ఆ వెలుగులకు పదింతలు ఉండేది.కొన్ని మందులు దాచిపెట్టి కార్తీక పౌర్ణమి రోజు మళ్ళీ కాల్చేవాళ్ళం.


ఆ మధ్య అత్తయ్య కొడుకు  కలిసినపుడు "ఈసారి దీపావళికి చిచ్చుబుడ్లు తయారు చేద్దాం రా " అంటే వాడు మా వారివైపు చూస్తూ.."మీ ఆవిడకు భలే తింగరి అయిడియాలు వస్తాయండీ! రోజు ఇంట్లో కూడా ఇంతేనా" అనడిగాడు!



ఫెస్టివ్ ఆఫర్ల గోల,వాకిలికి కట్టే మావిడాకుల నుంచీ మార్కెట్లో కొనాల్సిన దుస్థితి,"హాపీ దివాలీ " అంటూ పెదాల చివరినుంచీ రాలే పొడి పొడి శుభాకాంక్షలతో నార్త్ ఇండియన్ చెమికీలద్దుకున్న 'దివాలీ ' ని దివాలా తీసిన మొహాలతో (టపాసులు కొనే సరికి ఎలాగూ దివాలా తీసి ఉంటాం కదా) జరుపుకోడానికి సిటీలో పూర్తిగా అలవాటుపడిపోయాము.


అందరికీ దీపావళి శుభాకాంక్షలు!

June 12, 2008

బడి గంట మోగింది

ఇవాళ స్కూళ్ళు తెలిచే రోజు! కొన్ని ప్రైవేటు స్కూళ్ళు మినహా, ప్రతి యేడూ ప్రభుత్వ పాఠశలలన్నీ తెరిచే రోజు! పిల్లలంతా ఆసక్తిగానూ, కొంచెం నిరాశగానూ (అప్పుడే సెలవులైపోయాయా అని) ఎదురు చూసే రోజు!

ప్రతి జూన్ పన్నెండునా స్నేహితులందరినీ మళ్ళీ కలుసుకోబోతున్నామన్న సంతోషంతో స్కూలుకి వెళ్ళేవాళ్ళం మేము! ఇప్పట్లాగా ఇన్ని కమ్యూనికేషన్లు అప్పుడు లేవు పదిహేను పదహారేళ్ళ క్రితం! అందువల్ల ఏప్రిల్ 23(చివరి పని దినం)న విడిపోతే మళ్ళీ జూన్ పన్నెండునే పునర్దర్శనం! పైగా సెలవులిచ్చిన రోజునే, (లేదంటే ఆ మర్నాడన్నా) మామయ్య వాళ్ళింటికో అమ్మమ్మ వాళ్ళింటికో చెక్కేస్తాం కదా!

స్కూలు పునఃప్రారంభం రోజు స్కూలంతా కొత్త కొత్తగా ఉంటుంది అది మన స్కూలే అయినా! అవే క్లాసు రూములు, వాళ్ళే టీచర్లు! అయినా సరే! టీచర్లు కనపడగానే 'అమ్మయ్య ' అనిపిస్తుంది. ఎందుకో కొంచెం భయం కూడా వేస్తుంది. ఆ రోజు టీచర్లందరూ కొత్త చీరలు (సెలవుల్లో కొన్నవి) కట్టుకొస్తారు! మనం మాత్రం యూనిఫాం లోనే వెళ్ళాలి. కొత్త అడ్మిషన్ వాళ్ళకి కొంచెం సడలింపు!
టీచరమ్మని వాళ్ళాయన బండి మీద దింపితే 'టీచరు గారికి కూడా మొగుడూ, పిల్లలూ ఉంటారా' అని తెల్లబోయే వాళ్ళం మేము!ఉంటారని అంతకు ముందు తట్టదు ఎంచేతో!

మా వూరి ఆడపిల్లల హైస్కూలు మేము చదువుకున్నపుడు(ఇప్పుడెలా ఉందో తెలియదు)మార్కుల్లోనూ, ఇతర extra curricular activities కీ చాలా పేరు పొందింది! టీచర్లు అంతా మమ్మల్ని స్నేహితుల్లాగానే చూస్తూ, తగిన క్రమశిక్షణలో ఉంచేవారు! పొరపాటున జడలు ముందుకు పడినా మా N.S టీచర్ జోసెఫిన్ గారు 'జెళ్ళు జెళ్ళు ' అని హెచ్చరిస్తూ ఉండేది! పైగా మా కాంపౌండులోనే బాయ్స్ హైస్కూలు మా పక్క బిల్డింగ్ లోనే ఉండేది!(ఈ హైస్కూల్లోనే నాయని సుబ్బారావు గారు హెడ్ మాస్టర్ గా పని చేసారు. వారి అమ్మాయి నాయని కృష్ణ కుమారి గారు మా నాన్న గారి క్లాస్ మేట్) అందువల్ల మమ్మల్ని టీచర్లు సొంత పిల్లలకంటే జాగ్రత్తగా చూసే వాళ్ళు!

కొత్త యూనిఫాం కుట్టించుకోవడం ఒక పెద్ద పండగలా ఉండేది మాకు!ఇప్పట్లా స్కూల్లోనే అమ్మేవాళ్ళు కాదు! బయటే కుట్టించుకోవాలి!కొత్త షూలు కొనుక్కోవడం, వాటిని మొదటి నెలరోజుల పాటు రోజూ అవసరమున్నా లేకపోయినా పాలిష్ చేయడం..సాక్సులు ఉతకడం బలే సరదాగా ఉండేది!ఇక లేపాక్షి నోట్సులు కొనుక్కోవడం మరో సరదా! అవి బాయ్స్ హైస్కూలు స్టాఫ్ రూం దగ్గర దగ్గర అమ్మేవాళ్ళు! 200 పేజీల ఒక్కో నోట్సు ఒక రూపాయి తొంభై పైసలు! (నిన్ననే మా పాపకి 180 పేజీల నోట్సు 23 రూపాయలు పెట్టి తెచ్చాను) దాని మీద నంది బొమ్మ ఉండేది. పుస్తకాలకు బ్రౌన్ కలర్ కవర్లు వేయాలనే నిబంధన ఉండేది కాదు. నా ఫ్రెండ్స్ కొందరు సితార, జ్యోతి చిత్ర మొదలైన పుస్తకాల్లోంచి కలర్ ఫుల్ గా సినిమా బొమ్మల కవర్లు వేసుకొచ్చేవాళ్ళు! అలాంటివి వేస్తే మా నాన్న గారు చంపి ఉప్పు పాతర వేస్తారు కాబట్టి నేను, మా చిన్నన్నయ్య, మా చెల్లెలు చచ్చినట్టు బ్రౌన్ కలర్ అట్టలు వేసుకునేవాళ్లం మనసులో ఏడుస్తూ!

సెక్షన్లు చేయక ముందు అందరం కలిసి ఒక పెద్ద హాల్లో కూచునే వాళ్ళం! మా ఫ్రెండ్స్ అందరం ఒకే సెక్షన్లో ఉండాలని 'మమ్మల్ని విడగొట్టద్దని ముందే క్లాస్ టీచర్ ఎవరో కనుక్కుని ఆవిణ్ని బెదిరిస్తూ వేడుకునే వాళ్ళం! 'నోళ్ళు ముయ్యకపోతే మాళ్ళు పగుల్తాయి '(ఇది మా జోసెఫిన్ గారి డవిలాగే, నాకు గుర్తుంది)అని ఏ మాటా ఇవ్వకుండానే మా గుంపుని ఒకటే సెక్షన్లో వేసేవారు! టెంత్ క్లాసులో మాత్రం అందరం బి సెక్షను, లెనినా మాత్రం ఏ సెక్షన్లో పడటంతో అది వెక్కి వెక్కి యాడవటం మొదలు పెట్టింది, ఒక రోజంతా! దానితో దాన్ని మళ్ళీ మా సెక్షన్లో వేసారు. పిల్లల మనో భావాలకు, భావోద్వేగాలకు అంత విలువ ఇచ్చేవాళ్ళు మా బంగారు టీచర్లు!

సెక్షన్లు చేయగానే మేము 80 శాతం పైగా మార్కులు ఎవరు సంపాదించగలరో వారికి మా గ్రూపులో ఉదారంగా చోటిచ్చే వాళ్ళం!ఇహ అప్పటి నుంచే పోటీ మొదలు! కానీ మా మీద ఎటువంటి వత్తిడీ ఉండేది కాదు! ట్యూషన్ కి కూడా వెళ్ళే అవసరం మాకెప్పుడూ రాలేదు. అంత బాగా ఉండేవి పాఠాలు! స్కూలునీ, చదువునీ ఇష్టమైన పనిగా నిర్వహించాం అప్పుడు!

ఈ ఏడాది కొన్ని ప్రైవేటు స్కూళ్ళు మే చివరి వారంలోనే స్కూళ్ళు మొదలెట్టేశాయి మండుటెండల్లో! 'ఇంట్లో కూచుని ఏం చేస్తారు పిల్లలు? కాస్త సిలబస్ అన్నా కవర్ అవుతుంది, మొదలెట్ట 'మని తల్లి దండ్రులే అడిగారని వాళ్ళు చెపుతున్నారు. ఆరో క్లాసు నుంచే IIT కోచింగ్ ఇచ్చే కొన్ని స్కూళ్ళైతే అసలు వేసవి సెలవులివ్వడానికే ఆసక్తి చూపించట్లేదు! ఏ మాత్రం సిగ్గు పడకుండా 'ఆరో తరగతి నుంచే చదివే ప్రతి పాఠం వెనకా IIT ఆశయం, రాసే ప్రతి టెస్టు లోనూ IIT కోణం అని FM రేడియోలో కూడా ఊదరగొట్టేస్తున్నారు! ఎంతమంది గొర్రెలమంద లాంటి పేరెంట్స్ లేకపోతే వాళ్ళకంత ధైర్యమొస్తుంది?

సెలవులూ, ఆటలూ,వెన్నెలా, అమ్మమ్మ గారి ఊరూ, తాతయ్యతో షికార్లూ కాలవలో స్నానాలూ, ఆరుబయట వేసవి నిద్రలూ ఇవేవీ అక్కర్లేదన్నమాట పిల్లలకి! వాళ్ల మనసుల్నీ, ఆలోచనలనీ,సృజనాత్మకతనీ, చివరకి వాళ్ళ మనసుల్లోని ప్రేమని కూడా చంపి IIT గోతిలో పాతిపెట్టడానికి ఈ కార్పొరేట్ స్కూళ్ళు సిద్ధం! వారికి పలుగు పారా అందించడానికి వేలకొద్దీ తల్లిదండ్రులు సిద్ధం!

రండి, చూడండి, కూకట్ పల్లిలో, దిల్ సుఖ్ నగర్లో...గుంటూర్లో, విజయవాడలో .. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా..వీరే...వీరే!
చదువులా...చావులా ఇవి?

April 1, 2008

వెన్నెల

ఈ మధ్య అందరూ వేసవి సెలవుల గురించి, వెన్నెల గురించి రాస్తుంటే, నాకూ రాయాలనిపించింది. వెన్నెల ఎవరికి నచ్చదూ? వెన్నెల అమ్మ లాంటిది. "అమ్మ ఎవరికైనా అమ్మే" లాగా వెన్నెల ఎవరికైనా అభిమాన విషయమే!

మామూలు రోజుల్లో వెన్నెలకీ, వేసవి సెలవుల వెన్నెలకీ తేడా ఉంటుంది. ఆరుబయట వెన్నెల్లో డిన్నర్లు , వెన్నెలా-నీడా ఆటలు( దొంగ అయిన వాళ్ళు వెన్నెల్లో ఉన్నవాళ్లని పట్టుకునే లోగా వాళ్ళు ఏ చెట్ల నీడల్లోకో తప్పుకోవాలి)ఆలిండియా రేడియో వాళ్ళ నాటకోత్సవాల తాలూకూ నాటకాలు, ఆ తర్వాత వివిధ భారతిలో ఛాయా గీత్ వినడం (నా చిన్నప్పుడు ఛాయా గీత్ కి వచ్చే అనౌన్సర్లకి మంచి టేస్ట్ ఉండేది. వెన్నెల రోజుల్లో తప్పని సరిగా వారానికి రెండు సార్లన్నా ' బహారో ఫూల్ బరసావో " పాట వేసేవాళ్ళు.), వెన్నెల్లో పెద్ద పువ్వు లాగ పడ్డ కొబ్బరి చెట్టు నీడ ను గమనించడం, కొబ్బరాకుల టప టపలు...ఇవన్నీ చాలా మందికి అనుభవైకవేద్యాలే!
ఈ మధ్య బెంగుళూరు నుండి, సకలేష్ పూర్ లోని స్నేహితుల ఇంటికి డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ, ఒక అడవి లాంటి (లాంటి ఏమిటి..అడవే) చోట కొద్ది సేపు ఆగాము. రోడ్డుకి కొంచెం దూరంగా ఒక ఏనుగు పిల్ల చెట్టు ఆకులు అందుకుంటుండగా, రెండు కుందేళ్ళు ఎంచక్కా ఎవరి భయమూ లేక హాయిగా ఆడుకుంటుంటే అనిపించింది....అడవి గాచిన వెన్నెల వ్రుధా కాదు....సిటీ గాచిన వెన్నెలే పరమ వేస్టు అని.నిశ్శబ్దంగా గమనించి నిష్క్రమించాము. టివి సీరియల్స్ పుణ్యమా అని టౌనుల్లో , పల్లెల్లో కూడా వెన్నెల్ని ప్రేమించే మనుషులు తగ్గిపోతున్నారు.
మనసుకి మాటలు లేకుండా చేసే మనోహరమైన వెన్నెల్ని ఒకసారి అమరావతిలో క్రిష్ణా నది మీద చూశాను. ఈ మాట మా శ్రీవారితో చెప్పానే అనుకోండి.." ఏమిటీ, మా పాపి కొండల దగ్గర గోదావరి మీద వెన్నెల కంటేనా..! అసలు వెన్నెల్లో గోదావరిని తప్ప ఇక ఏ నదినీ, చెరువునీ, కాలవనీ కూడా చూడ్డానికి వీల్లేదు " అని అడ్డంగా వాదిస్తారు. (వాళ్ళది వెస్ట్ గోదావరి లెండి) పైగా, "అసలు పసలపూడి కథల్లో గోదావరిని వంశీ వర్ణించినట్టు, మీ క్రిష్ణా నదిని ఎవరైనా ఎప్పుడైనా వర్ణించారా.. " అని సవాల్ చేస్తారు. "నాయనా! ఆ పని మనిద్దరం పుట్టకముందే శంకరమంచి సత్యం అనే ఒక పెద్దాయన చెశారు! చదువుడు..అమరావతి కథలు " అని తనకి డవిలాగుల్లేకుండా చేస్తాను.
ఆ మధ్య సెలవుల్లో మా వూరికి వెళ్ళినపుడు , వెన్నెల్లో కూచుందామని బయటికి వస్తే చుట్టు పక్కల డాబాల మీద గాని, వాకిళ్ళలో గాని ఒక్క పురుగు లేదు. ఎవ్వరికీ వెన్నెల అక్కర్లేదు...! ఏక్తా కపూర్ ' కళ్యాణి ' సీరియలే కావాలి.కాసేపు నాతోపాటు (బలవంతంగా అనుకుంటా) కూచున్న మా అమ్మ కూడా ఎనిమిదిన్నర కాగానే లేచి, 'రేపు కూచుందాంలే వెన్నెల్లో! చక్రవాకం చూడవూ....'అని కళ్లజోడు వెతుక్కుంటూ లోపలికి వెళ్ళింది. పైగా, ఇదివరలో లాగా వెన్నెలకి కాంబినేషన్ గా చల్లగాలి లేదు ఇప్పుడు. పీల్చి పిప్పి చేసే రాక్షస దోమలు, ఉక్క!
ఇక సిటీ సంగతి చెప్పేదేముంది! కనీసం కరెంటు పోయినప్పుడన్నా పది నిమిషాలు ఆరు బయట వెన్నెల నీడలు చూద్దామంటే, కరెంటు పోయిన ఆరున్నరో సెకనులో జెనరేటర్ చప్పుడు మొదలవుతుంది.
సో , మంచి నిఖార్సయిన, కల్తీ లేని వెన్నెల చూడాలంటే, నిజంగానే ఏదన్నా (క్రూర జంతువులు లేని)అడవికి పోవాల్సిందే!