Showing posts with label సినిమా. Show all posts
Showing posts with label సినిమా. Show all posts

November 5, 2012

"టుడేస్ స్పెషల్"




పరదేశం పోయి ఏళ్ళ తరబడి నువ్వు అక్కడ నివసించినా..నీ మూలాలు మాత్రం నువ్వు బయలు దేరిన చోటే ఉంటాయి.  నువ్వెక్కడ పుట్టావో అదే నీ వూరు! వూరు మారినా ఉనికి మారదు..... చెప్పడానికి వాక్యం చిన్నదే అయినా తవ్వి తీస్తే ఈ వాక్యం వెనుక బోల్డు కథలు ఉంటాయి. ఆ కథలు బతకడానికి పరదేశం పోయిన ఏ మనిషి వైనా కావొచ్చు! అలాంటి ఒక పరదేశీయుని కథే "టుడేస్ స్పెషల్"! సినిమా! అంతే కాదు, కమ్మని భారతీయ వంటకాల చుట్టూ , ఒక తందూరీ రెస్టరెంట్ చుట్టూ నడిచే ఈ సున్నితమైన హాస్య కథ ఈ మధ్య కాలంలో నేను చూసిన ఒక సరదా సినిమా!మంచి సినిమా కూడా!

నల్లని మబ్బులు కమ్మి, ఊరంతా చీకటై పోయి, సన్నని జల్లులు కురిసే ఒక సాయంత్రం వేళ నెట్ ఫ్లిక్స్ లో ఏదైనా మంచి సినిమా చూద్దామని వెదుకుతుంటే దొరికింది ఈ సినిమా! వంట శ్రద్ధగా ,ఇష్టంగా చేసేవారికి ఈ సినిమా మరింత ఆసక్తి కరంగా ఉండే అవకాశం లేకపోలేదు. వంట అంటే మొదట్లో ఎవరికైనా విసుగే! కానీ...ఏళ్ళు గడిచే కొద్దీ ఒక పక్కన విసుగేస్తున్నా..మరో పక్క   ఏ రోజుకారోజు కొత్తగా అనిపించే పని ఇదేనేమో!

 నా వరకు నేను వంట మాలతీ చందూర్ గారి పుస్తకం చదివి మాస్టర్ షిప్ సంపాదించినా...శ్రద్ధగా, ఇష్టంగా, వండటాన్ని ఎంజాయ్ చేయడం మాత్రం సంజీవ్ కపూర్ దగ్గరా, తర్లా దలాల్ దగ్గరా నేర్చుకున్నాను. ముఖ్యంగా సంజీవ్ కపూర్ చిటికెలో అద్భుతమైన వంటకాలు సృష్టిస్తుంటాడేమో....వాహ్ వాహ్ అని మాటి మాటికీ ఆశ్చర్య పోతుంటాను. ఇప్పటికీ కొంచెం స్పెషల్స్ కావాలంటే యూ ట్యూబ్ లో పడి సంజీవ్ కపూర్ వంటలు వెదుకుతాను.  

ఇహ ఈ సినిమా విషయానికొస్తే ఇదొక ఇండో అమెరికన్ సినిమా! మన్ హటన్ లో సాగే ఒక చిన్న కథ!


మూడు దశాబ్దాలకు పూర్వమే భారత దేశం నుంచి అమెరికా వచ్చిన ఒక ముస్లిం కుటుంబానికి మన్ హటన్ లో నష్టాల్లో నడిచే ఒక చిన్న రెస్టరెంట్ ఉంటుంది. వాళ్లబ్బాయి సమీర్....మరో చోట ఒక పెద్ద రెస్టారెంట్ లో చెఫ్ గా పని చేస్తూ..హెడ్ చెఫ్ అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. "నువ్వు మహా గొప్ప కుక్ వి" అని ప్రశంసలు పొందిన మర్నాడే అనుకోని పరిస్థితుల్లో అతడు తన ఉద్యోగాన్ని వదిలి వేయాల్సి వస్తుంది.  పారిస్ వెళ్ళి ఒక ఫ్రెంచ్ రెస్టారెంట్ లో అప్రెంటిస్ గా చేరాలని నిర్ణయించుకుని...తండ్రికి ఆ విషయం చెప్పాలని వస్తాడు. పెద్ద కొడుకు మరణించగా...ఒక్క ఒక్క కొడుకూ తనకు అండగా ఉండక పారిస్ వెళ్తాననడంతో ఆవేశపడిన తండ్రి (హరీష్ పటేల్) కి అక్కడే హార్ట్ అటాక్ వస్తుంది.  


విధి లేని పరిస్థితిల్లో తండ్రి నడుపుతున్న ఆ చిన్న పాటి ఇండియన్ రెస్టరెంట్ పగ్గాలు చేతిలోకి తీసుకోవాల్సి వస్తుంది సమీర్! పుస్తకాలు తిరగేస్తే అన్నీ నష్టాలే...అప్పులే! అక్కడ సరదా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చెయ్యడానికి వచ్చే తండ్రి స్నేహితులు ముగ్గురు తప్ప..ఒక్క కస్టమర్ ఉండడు రెస్టరెంట్ లో!


కిచెన్లో చూస్తే బొత్తిగా ఇంగ్లీష్ రాని అసిస్టెంట్ ఒకడు, ప్లాస్టిక్ గ్లాసోటి పక్కన పెట్టుకుని పాన్ నముల్తూ  నిమిషానికోసారి అందులో ఉమ్మేస్తూ పరమ అసహ్యంగా కనిపించే హెడ్ కుక్ !! అతన్ని అలా పాన్ ఉమ్మేయద్దని సమీర్ వార్నింగ్ ఇవ్వడంతో అతడు కోపగించి వెళ్లిపోతాడు. దిక్కు తోచని ఆ స్థితిలో సమీర్ ని ఆదుకుంటాడు అక్బర్...అనగా నసీరుద్దీన్ షా!  నిజానికి అక్బర్ ఒక టాక్సీ డ్రైవర్. ఒకసారి సమీర్ అతని టాక్సీ ఎక్కినపుడు తాను ఇండియాలో వంట వాడిగా పని చేశానని తన పరిచయం చెప్పుకుంటాడు. ఆ పరిచయంతో సమీర్ అతన్ని వెదికి పట్టుకుంటాడు. 


టిపికల్ ఇండియన్ స్టైల్లో అక్బర్ గా అడుగు పెడతాడు నసీరుద్దిన్ షా! చేతిలో ఒక డబ్బా టేప్ రికార్డరూ, అందులో మోగే పాత హిందీ పాటలు, మసాలాలు నూరడానికి ఒక కల్వం....మసాలా పొడులూ...వీటితో సహా! వంట చేయడం లో "ఆత్మ" ఉండాలని, ప్రేమ, పాషన్ ఉండాలనీ అతడిని చూసి తెలుసుకుంటాడు సమీర్.

సమీర్ చెఫ్ గా ఉన్నపుడు అందులో హార్డ్ వర్క్ తప్ప "కళ" లేదు మరి! ఆడుతూ పాడూతూ వంట చేయడమే కాక, నాటు కోళ్ళని తెప్పించి రెస్టరెంట్ వెనక వాటిని కోయడం వంటి "ఇల్లీగల్" పన్లు కూడా చేస్తాడు అక్బర్.  రెస్టరెంట్ కి కష్టమర్లు విపరీతంగా పెరుగుతారు.  దాంతో రెస్టరెంట్ ని చక్కగా తీర్చి దిద్దాలని కోరికతో తన గర్ల్ ఫ్రెండ్ తో(ఈమె ఇంతకు ముందు సమీర్ తో కల్సి పని చేసిన చెఫ్ కూడా) ఆ రెస్టరెంట్ కి రంగులు వేసి అందంగా తీర్చి దిద్దుతాడు.

తండ్రిని తీసుకొచ్చి చూపించి సర్ప్రైజ్ చేయాలనుకుంటాడు. తండ్రి అదంతా చూసి ఆశ్చర్య పడినా... "ఎందుకు చేసావ్ ఇదంతా? ఇప్పటికే పీకలోతు అప్పుల్లో ఉంది ఇది. దీన్ని అమ్మకానికి పెట్టేయడం, బేరం దాదాపుగా కుదిరి పోవడం జరిగి పోయింది...." అని చెప్పి వెళ్ళి పోతాడు బాధ పడుతూనే! 

చేసేది లేక సమీర్ రెస్టరెంట్ మూసేయక తప్పదని అక్బర్ తో సహా అందరికీ చెప్పి పంపేసి ఈడ్చుకుంటూ తను పని చేసిన పాత రెస్టరెంట్ కే వెళ్తాడు ఉద్యోగం అర్థించేందుకు. అతడు అక్కడికి ఎందుకొచ్చాడో తెలీని అతడి గర్ల్ ఫ్రెండ్ "ఇక్కడేం చేస్తున్నావ్. పేపర్ చూశావా? మీ తందూరీ పాలస్ కి New york Times వాళ్లు రివ్యూ లో మూడు స్టార్లు ఇచ్చారు" అని చెప్తుంది. ఆ పేపర్ పట్టుకుని అక్బర్ దగ్గరికి పరిగెడతాడు. కానీ ఆ సరికే అక్బర్ మరో వూరికి మకాం మార్చేయడానికి సామాను అంతా సర్దేసుకుని సిద్ధమై పోతాడు. తన ప్రయాణం మానుకోడానికి అతడు సిద్ధంగా లేడు.

సమీర్ తిరిగి వచ్చేసరికి ......రివ్యూ చదివి.....ఎంతో మంది కస్టమర్లు తందూరీ పాలస్ ముందు గుమికూడి ఉంటారు. తప్పని సరి పరిస్థితుల్లో సమీర్ వంటలోకి దిగుతాడు.

తను ఎన్నడూ వండని, వండుతానని ఉహించని  భారతీయ వంటలోకి!

అక్బర్ ని తల్చుకుని ఇష్టంతో, అదొక ఆర్ట్ గా భావించి మొదలు పెడతాడు. కొద్ది సేపట్లోనే అద్భుతమైన భారతీయ వంటకాల్ని అతిధులకు  వడ్డిస్తాడు ఆ అంతర్జాతీయ చెఫ్.

తండ్రి వచ్చి ఆ వంటను రుచి చూసి అదిరి పోయి కొడుకుని ఆలింగనం చేసుకోడంతో కథ సుఖాంతం!

హడావుడేమీ లేకుండా మన్ హట్టన్ వీధుల వెంట, ఎక్కువ సేపు రెస్టరెంట్లోనూ,సమీర్ ఇంట్లోనూ సాగే ఈ సినిమా  ఇందులో సమీర్ గా నటించిన ఆసిఫ్ మాండ్వి సొంతగా రాసిన నాటకం "సకినాస్ రెస్టరెంట్" ఆధారంగా తయారైంది. అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలూ, అవార్డులూ దక్కించుకుంది కూడా! ఇందులో సమీర్ తల్లిగా నటించిన మాధుర్ జాఫ్రీ స్వయంగా వంటల పుస్తకాల రచయిత్రి కావడం విశేషమే! 

ఈ సినిమాలో మార్కులన్నీ ఆసిఫ్ మాండ్వి, నసీరుద్దీన్ షా పంచేసుకుంటారు. మొదటి తరానికి చెందిన భారతీయులుగా ఆ సంప్రదాయాల్ని, మత సంప్రదాయాల్ని వదులుకోలేని తల్లి దండ్రులకు, వాటిని పెద్దగా పట్టించుకోనక్కర్లేదని భావించే అమెరికన్ సిటిజెన్లు...అంటే ఆ తర్వాతి తరానికి చెందిన పిల్లలకు మధ్య ఏర్పడే చిన్న చిన్న విభేదాలు, సాంస్కృతిక భేదాలు...అతి సున్నితంగా ఈ సినిమాలో ఆవిష్కృతమవుతాయి.

వంట చేయడం అంటే ఇష్టపడే వాళ్ళు, వంటని ఆర్ట్ గా భావించే వారికి మాత్రమే కాదు..ఎవరికైనా నచ్చుతుంది ఈ సినిమా!
నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. లేదా డీవీడీ గా కూడా దొరుకుతోంది..
వీలుంటే చూడండి...సరదాగా! 





March 28, 2012

నాలాగా ఎందరో!



సినిమా లో కేవలం వినోదం ఉంటే చాలా సందేశం ఉండాలా అనే పాయింట్ అప్పుడప్పుడూ ఎంత వద్దనుకున్నా చర్చకు వస్తూనే ఉంటుంది.ఈ ప్రశ్న ఏ మాధ్యమానికైనా వర్తిస్తుందేమో   ! అయితే సినిమా అనేది బహుళ ప్రజాదరణ పొందిన కళారూపం కాబట్టి,దీనిమీద ప్రజలకు ఆసక్తి ఎక్కువ! దీని ప్రభావం మాత్రం ఎంతో కొంతమంది ప్రేక్షకుల  మీద ఉండి తీరుతుంది కాబట్టి గొప్ప సందేశాలివ్వకపోయినా జనాల  బుర్రల్లో పురుగు పుట్టించే సినిమాలు తీయకపోతే  కొంతలో కొంత నయం!

పెద్ద హడావుడి,హంగూ ఆర్భాటం లేకుండా నిశ్శబ్దంగా విడుదలై ప్రేక్షకుల మెదళ్లలో మాత్రం కోటి ప్రశ్నలు రేపే సినిమాలు కొన్ని ఉంటాయి. "అంకురం" ఇంకా మరికొన్ని సినిమాలు! అలాంటి సినిమాల కోవలోదే
"నాలాగా ఎందరో"!

1978లో విడుదలైన ఈ నలుపు తెలుపు సినిమా మధ్యతరగతి ప్రేక్షకుల ఆలోచనల్ని సుడిగుండంలోకి నెట్టిపారేసింది.

పక్షవాతం వచ్చి కచేరీలు మానేసిన వైణికుడు పార్వతీశానికి ఇద్దరు కూతుళ్ళు. పెద్దమ్మాయి కళ్యాణి ని చిన్నప్పటి నుంచీ మేనత్త కొడుకు చలపతి పెళ్ళాంగా పిలుస్తుంటారు.ఆమె ఇంట్లోనే ఉంటుంది. రెండో పిల్ల కాలేజీలో చదువు!
తనతో చనువుగా ఉండటానికి ఒప్పుకోని కళ్యాణి మీద కోపంతో చలపతి మరో అమ్మాయిని పెళ్ళాడతాడు. చలపతి నే భర్త గా ఉహించుకున్న కల్యాణి హతాశురాలై పోతుంది.






 అప్పటి నుంచీ కళ్యాణికి బయట సంబంధాలు చూడటం మొదలుపెడతాడు పార్వతీశం! ఒకడు అవడానికి ఎమ్మెల్యే కొడుకే కానీ మూర్ఛ రోగం,ఒకడికి బోల్డు కట్నం కావాలి,ఒకడికి ఇది రెండో పెళ్ళని పెళ్ళి చూపుల్లో తెలుస్తుంది,మరొకడు మరొకటీ! ఇలా ఎన్ని సంబంధాలు చూసినా పెళ్ళి కుదర్దు. ప్రతి పెళ్ళి చూపుల్లోనూ మధ్య తరగతి కళ్యాణి ఇదే కుదిరి పోతుందని భావిస్తూ పెళ్ళి కొడుకు ఫొటో ని ఫ్రేమ్ లో తన ఫొటో పక్కన పెట్టుకుని కాబోయే భర్త గా ఊహించుకుంటుంది.

ఏదీ కుదరదు. ఈ లోపు చలపతి భార్య చనిపోతుంది. కొడుకు మేనకోడల్ని చేసుకోలేదన్న కోపంతో అతడి తల్లి ఆస్తి అంతా కళ్యాణి పేర రాస్తుంది. వాడు ఆస్తి మీద ప్రేమతో వచ్చి పార్వతీశం ఇంట్లో మకాం పెడతాడు. ఎలాగూ ఇంతకు ముందే అనుకున్న సంబంధం కాబట్టి, ఎలాగు  ఇప్పుడు అతనికి  భార్య లేదు కాబట్టీ ..అతడీకే కళ్యాణిని ఇచ్చి చేస్తేనో.. అన్న ఆలోచన కళ్యాణి తల్లికి వస్తుంది.

కానీ అతడి ప్రేమ కళ్యాణి పేరు మీద ఉన్న ఆస్తి మీదే అని రుజువైపోతుంది. అతడు వెళ్ళిపోతాడు..

ఆస్తి తీసుకుని.....కళ్యాణిని వదిలేసి..!



ఈ లోగా పక్కింట్లోకి అద్దెకి వచ్చిన ఒకాయనకు ఒక గుడ్డి తమ్ముడు ఉంటాడు.(నారాయణ రావు)వీణలో ప్రవేశం ఉండటంతో పార్వతీశం వద్ద వీణ నేర్చుకోడానికి వస్తుంటాడు.  మంచి మనసున్న అతడు కళ్యాణి ప్రతి పెళ్ళి చూపుల్లోనూ ఇది కుదిరిపోతుందనే ఆశతోనే ఉంటాడు.




ఇంతలో కళ్యాణి చెల్లెలు వీణ ఎవరినో ప్రేమించి గర్భవతి అవుతుంది.. కళ్యాణికి కాకుండా రెండోపిల్లకు పెళ్ళి కావడం మంచిది కాదు కాబట్టి కళ్యాణికి వెంటనే సంబంధం చూడాల్సిన అవసరం ఏర్పడుతుంది.  ఒక్క సంబంధమూ  కుదరదు.

గుడిలో కూచుని రాగాలు సాధన చేస్తున్న ప్రభాకరాన్ని చూసి కళ్యాణి మనసులో ఆలోచన వెల్గుతుంది."ఆణిముత్యం లాంటి ప్రభాకరాన్ని కళ్ళ ముందే ఉంచుకుని ఎన్ని సంబంధాలు చూస్తున్నాం?"అని "నన్ను పెళ్ళి చేసుకుంటావా ప్రభాకరం" అని అడుగుతుంది. ఇష్టం తోనే!

ప్రభాకరం అన్నా వదినా పార్వతీశం ఇంటికొచ్చి కళ్యాణిని ప్రభాకరానికి ఇచ్చి పెళ్ళిచేయమని అడుగుతారు. పార్వతీశం కూతురు మీద ఉన్న ప్రేమతో మండిపడి "తాను అసమర్థుడైతే కావొచ్చు కానీ దారే పోయే కుంటి వాళ్ళకీ గుడ్డి వాళ్ళకీ ఇవ్వనని తెగేసి చెప్పి పరుషంగా మాట్లాడి వాళ్లను వెళ్ళగొట్టినంత పని చేస్తాడు. తర్వాత కళ్యాణి ద్వారా ఆమే ప్రభాకరాన్ని ఇష్టపడి పెళ్ళి ప్రస్తావన తెచ్చిందని తెలుసుకుని కూతురు ఇష్టాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తాడు.

ఈ వార్త ప్రభాకరం కుటుంబానికి తెలిసే లోపే_______పార్వతీశం మాటలకు మనసు గాయపడిన ప్రభాకరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటాడు.

వీణ పెళ్ళిలోనే కళ్యాణికి మతి చలిస్తుంది. రోజూ దగ్గర్లోని రైల్వే ట్రాక్ మీద నుంచి రైలు వెళ్ళే సమయానికి జుట్టు పీక్కుంటూ పరిగెత్తుకెళ్ళి "నువ్వే చంపావు నా ప్రభా ని! చావు ! చావు!"అని రైలు మీద రాళ్ళు విసురుతూ ఉంటుంది.
ఇదే కథ! 
కళ్యాణికి పిచ్చి కుదిరితే గానీ పెళ్ళి కాదు.పెళ్ళి అయితే కానీ పిచ్చి కుదరదు.
ఉత్తమ కుటుంబ విలువలని ఈ సినిమాలో దర్శకుడు ఈరంకి శర్మ ఆర్భాటం లేకుండా చూపిస్తారు.
 మేనల్లుడు వేరే పిల్లను పెళ్ళి చేసుకొచ్చినపుడు అక్కడే ఉన్న పార్వతీశం ఆవేశపడి శాపనార్థాలు పెట్టడానికి సర్వ హక్కులూ అవకాశాలూ ఉన్నా ,"అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు చలపతీ"అని సంయమనం పాటించడం,
కూతుర్ని చేసుకోమని అడగడానికి వెళ్ళినపుడు, టైప్ రైటింగ్ మాస్టారు తన కూతురి స్నేహితురాలినే ఆ ముందు రోజే వివాహం చేసుకున్నాడని తెలిసి కొండంత నిరాశను  దాచి "దీర్ఘ సుమంగళీ భవ"అని దీవించడం ఇవి అద్భుతంగా తోస్తాయి.
రెండో సారి చలపతి తనను ఆస్తి కోసమే వివాహం చేసుకోవాల్ని భావించిన కళ్యాణి మేనత్త రాసి ఇచ్చిన ఆస్తిని అతని పేర రాసేస్తే తల్లీ దండ్రీ "పోన్లెమ్మా, మంచి పనే చేశావు. అసలు ఆస్థి ఎవరిక్కావాలి? అనడం.....
..ఇవన్నీ మనుషుల్లో ఇంకా మిగిలి ఉన్న మానవీయ కోణాల్ని స్పృశిస్తాయి.
నిజంగా ఇలాంటి పాత్రలన్నీ ఏమైపోయాయి? ఏ కమర్షియల్ సినిమాల జోరులో అదృశ్యమై కొట్టుకుపోయాయి?
ఈ సినిమా పూర్తిగా పార్వతీశం గా నటించిన హేమ సుందర్ దే! ఇందులో రూప కి కూడా నటనకు అంత పెద్ద అవకాశమేమీ లేదు. విలువల్ని పాటించే మధ్య తరగతి తండ్రిగా హేమ సుందర్ నటన ఆకాశాన్ని తాకుతుంది. అందుకే ఆ ఏడాది ఆయన్ని నంది అవార్డు వరించింది.
అభిమానం,కూతుళ్ళ మీద ప్రేమ,నిస్సహాయత,మంచితనం,సంయమనం ఇవన్నీ అద్భుతంగా పండిస్తాడు.
ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా నంది అవార్డు దక్కడమే కాక,హేమ సుందర్ కి కూడా నంది అవార్డు వచ్చింది. బాల సుబ్రహ్మణ్యానికి తొలి నంది ఈ చిత్రంతోనే దక్కింది.   రూప,పల్లవి ఇద్దరు ఈ చిత్రంతోనే పరిచయం! రూప చాలా బాగా చేసింది .
ఇవాళ చెణుకుల వంటి పంచ్ డైలాగులకు ఆహా ఓహో అనేస్తున్నాం. ఈ సినిమాలో పాత్రోచితంగా, సందర్భోచితంగా చెంప దెబ్బల్లా తగిలే గణేష్ పాత్రో డైలాగులు అద్భుతంగా అమరిపోయాయి.
సామాజిక సమస్యల మీద వచ్చిన సినిమాల్లో కొన్ని సమస్యను స్పర్శించడమే కాక,దానికి పరిష్కారాలను కూడా సూచిస్తాయి..రుద్రవీణ,అంకురం..బలిపీఠం,కాలం మారింది, ఇలాంటి సినిమాలు!
 కొన్ని సినిమాలు మాత్రం సమస్యల్ని చర్చించి వదిలేస్తాయి.
ఈ వదిలేయడంలోనే ఒక పరిష్కారం ఉంది. సమస్యకు పరిష్కారాన్ని పరిస్థితిని  బట్టి, సమస్యను బట్టి మనమే వెదుక్కోవాలనేదే ఆ పరిష్కారం!
నిజానికి సామాజిక సమస్యను గుర్తించి, దాని మీద చర్చ లేపి వదిలేయడం రచయితలు,దర్శకులు చేసే పని. ఎందుకంటే కొన్ని సమస్యలకు ఒకే పరిష్కారం ఉండదు. అనేక పరిష్కరాలు ఉండొచ్చు. వాటిలో ఏది సరైనదో ఎంచుకునే స్వేచ్ఛ పాఠకుడికో,ప్రేక్షకుడికో ఉండాలి.అందుకే సమస్యను చర్చించి వదిలేయడం
ఈ సినిమాలో కూడా అంతే! కళ్యాణి పిచ్చిదై పోవడంతో కథ ముగుస్తుంది. ఆమె రైలు మీద రాళ్ళు విసురుతూ గోడల మీద "భరత మాతా, నీకు పెళ్ళయిందా? నాకు కాలేదు" లాంటి రాతలు రాస్తూ ఉండగా వెనుక నుంచి వ్యాఖ్యానం వినిపిస్తుంది. సమస్యకు పరిష్కారమేమిటని ప్రశ్నిస్తుంది. పెళ్ళి చూపులంటే నలుగురి ముందూ పది సార్లు కూతుళ్ళను కూచో బెట్టి ఆ ఆడపిల్లల మనసుల్లో "ఇతడే నా భర్తేమో" అన్న ఊహలని కల్పించే సంప్రదాయాన్ని, కూడా ప్రశ్నిస్తుంది.
కళ్యాణి గోడల మీద రాసే రాతల్ని "మసి గీతలు కావివి, ఆమె కసి గీతలు" అని వ్యాఖ్యానిస్తుంది.
కళ్యాణమే ఎరగని,జరగని పాత్రకు కళ్యాణి అని పేరు పెట్టడం దర్శకుడి ఐరనీ!
ఇందులో రెండు మంచి పాటలున్నాయి. గుడ్డి వాడైన ప్రభాకరం "నిన్ను చూడాలని ఉంది కళ్యాణీ, నువ్వు ఎలా ఉంటావో చెప్పవూ?" అన్నపుడు కళ్యాణి పాడే పాట.."కళ్యాణినీ...కనులున్న మనసుకు కనిపించు రూపాన్ని,చెవులున్న మనసుకు వినిపించు రాగాన్ని"
ఈ పాటఇక్కడ..వినండి
అలాగే అనుభవాలకు ఆది కావ్యం ఆడదాని జీవితం అనే మరో మంచి పాట. ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీతంలో ముచ్చటగా రూపు దిద్దుకున్న ఈ రెండు పాటలూ ఎప్పటికీ ఆణిముత్యాలే! టిపికల్ ఎమ్మెస్ స్టైల్ పాటలు.కళ్యాణి నీ పాటలో బాలు ఆలాపనలు మధురాతి మధురం!
అయితే కల్యాణి పెళ్లి తప్ప మరో ఊసు లేక ఉహల్లో గడపటం, చదువుకున్నా,కనీసం ఉద్యోగ ప్రయత్నం లాంటిది చేయకపోవడం ఇవాల్టి రోజుల్లో కాస్త ఎబ్బెట్టుగా అనిపించినా సినిమా  ముప్ఫై ఐదేళ్ళ నాటిది కాబట్టి పెద్దగా పట్టించుకోక వదిలేయాల్సిందే!
ఈ వీడియో బయట ఎక్కడా లభ్యం కావడం లేదు, కళా ఖండాల్ని భద్రంగా దాచుకునే ఒక మిత్రుడి నుంచి నాకు దొరికింది. ఎపుడైనా టీవీలో చూసే అవకాశం లభిస్తే చూడండి.ఇలాంటి పాపులారిటీ లేని సినిమాలు వీక్ డేస్ లో ఉదయం వేళల్లో వేస్తుంటారు.



January 17, 2011

అనగనగా ఒక మంచు ఐరేంద్రి !




 ఏడుమల్లెలెత్తు రాకుమారి, ధీరుడైన ఒక యువకుడు,ఒక మాంత్రికుడు ఆవిడనెత్తుకుపోడం, లేదా  రాక్షసి ఆవిణ్ణి బంధించడం, మన యువకుడు అది దుష్ట శక్తి కాబట్టి దార్లో కనపడ్డ ఏ మునీశ్వరుడినో అడిగి ప్రాణాల రహస్యం తెలుసుకోవడం ...వాణ్ణి చంపి ఆవిణ్ణి రక్షించడం,పెళ్ళాడ్డం! ఎన్ని వేల కథలు చదివుంటాం? ఇక్కడా అదే కథ! కాకపోతే ఎప్పుడో మరణించిన మాంత్రికురాలు ప్రేతాత్మగా తిరిగి అవతరించి ఊరిమీద పడ్డం కొంచెం కొత్త!

ఈ మధ్య సినిమాలెక్కువయ్యాయి కాబట్టి, ఈ సీజన్ కి ఇదే లాస్టు సినిమా.. అని చెప్పుకుని కనుమ రోజు (మా అమ్మాయి కి చేసిన ప్రామిస్ ప్రకారం)ఐనాక్స్ లో  అనగనగా ఒక ధీరుడు సినిమాకెళ్ళాము!

కన్నీటి    బిందువు ఆకారంలో ఉండే (శ్రీలంకేమో) ఉండే రాజ్యం మీద ఎప్పుడో , తన వంశస్థురాలి మెడలోనే ఉండే ఒక లాకెట్ లో  ప్రవేశించి గుప్తంగా ఉండిపోయిన ఒక ప్రేతాత్మ ఐరేంద్రి తిరిగి పునరుత్తేజం పొంది లేచి, రాజ్యం మీద పడుతుంది. తన వంశంలో ఆఖరిదైన ప్రియను బంధించి రోజుకో రక్తపు బొట్టు ఆమెనుంచి తీసుకుని ఏ రోజుకారోజు జీవం పొందుతుంటుంది. ఆమె తిరిగి జీవశక్తి పొందాలంటే మోక్ష అనే పసి పిల్లను చంపి ఆమె రక్తాన్ని, ప్రియ రక్తాన్ని కలిపి తీసుకోవాలి. మరో పక్క ఐరేంద్రి ని అంతం చేయాలన్నా మోక్షకే సాధ్యం!

రాజ్యంలో ఐరేంద్రి అనుచరులైన సర్పాల బారిన పడి అచేతనంగా పడిపోయిన పిల్లలను రక్షించడానికి మోక్షను తీసుకుని అంధుడైన ఒక వీర యువకుడు ఆ రాజ్యానికొస్తాడు.

ప్రియకూ ఆ యువకుడికీ ఉన్న బంధం ఏమిటో,ఐరేంద్రి అసలు మళ్ళీ ఎలా పునరుజ్జీవం పొందిందో,మోక్ష ఐరేంద్రిని చంపగలిగిందా లేదా, వీరుడికి కళ్ళెలా పోయాయో, ఇవన్నీ తెరమీద చూడ్డమే మిగిలిన కథ!

నిస్సందేహంగా ఈ సినిమాలో నటనకు కొద్దిగా అవకాశం ఉంది ఐరేంద్రి పాత్ర వేసిన మంచు లక్ష్మికే! పెద్దగా అందచందాలు డిమాండ్ చేసే పాత్ర కాదు కాబట్టి మరింత బాగా రాణించింది ఈ పాత్రలో మంచమ్మాయి!(మంచు+అమ్మాయి)! ఆమెకు వేసిన మేకప్, మొహంలో ఆ కౄరత్వం,  ఇవన్నీ బాగా పండాయనే చెప్పాలి. అసలే విలక్షణమైన తెలుగు మాట్లాడుతుందాయె! డబ్బింగ్ ఆవిడే చెప్తుందంటే భయం వేసింది కానీ జీ టాక్ షో లోని "అసలు తెలుగుని" కాస్త నివారించి పాత్రకు తగ్గట్టు బాగానే చెప్పింది. అక్కడక్కడా "వివ్ రించి  షెప్పు"(వివరించి చెప్పు )  " కొండ్లూ, కోన్లూ(కొండలూ కోనలూ) అడువులూ తిర్గి ఖనిపెట్ట్ ండి" వంటి మాటలు మాత్రం తప్పించుకోలేం! కానీ అంతకంటే ఘోరంగా ఊహించుకుంటాం కాబట్టి రిలీఫ్ గానే ఉంది డబ్బింగ్! దీన్ని బట్టి అర్థమైందేమిటంటే ప్రయత్నిస్తే ఆ కృతకమైన భాషను వదిలించుకోగలదని!:-))


సినిమా మొత్తం మీద మార్కులెక్కువ పడేది లక్ష్మీ ప్రసన్నకే!

ఆమె చీటికీ మాటికీ చేసే వికటాట్టహాసాలు తెలుగు టీవీ ప్రేక్షకులకు అలవాటే కాబట్టి సినిమాలో వాటిని బాగానే ఎంజాయ్ చేశారు..పైగా పాత్రకి అవసరం కూడా కదా!

సిద్దార్థ పాత్ర చాలా లైట్ గా ఉంది. కోరమీసం లేనివాడిని తెలుగు ప్రేక్షకులు "ధీరుడిగా" ఎలా అంగీకరిస్తారసలు? అది పెద్ద లోపం! కొన్ని ఫైట్లు మినహా అతడి ధీరత్వాన్ని నిరూపించే దృశ్యాలేమీ ఉండవు.పైగా ఎప్పుడెప్పుడు సారా తాగుదామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. పోనీ అలాగని చిలిపిదనం ఉందాంటే అదీ లేదు.ధీరుడి పాత్రకు అల్లు అర్జున్ అయితే కొంచెం రొమాంటిక్ గా ఉండేదనిపించింది నాకు.(అందం సంగతి పక్కన పెట్టండి)

ఇక శృతి హాసన్ ఒక గాజు బొమ్మలా ఉంది! ఈ హీరోయిన్ల డైటింగ్ లేమో కానీ మరీ శవాకారాలు దాలుస్తున్నారు. మొహంలో కళా కాంతీ లేవు. గట్టిగా పట్టుకుంటే ఎముకలు విరిగి ఢామ్మని కిందపడుతుందేమో అన్నంత బలహీనంగా పాలిపోయి ఉంది. కొన్ని సార్లైతే ఆమె ధరించిన బరువైన దుస్తుల్ని కూడా మోయలేదేమో అన్నంతగా వంగిపోయింది(మోడల్ ఆ అయితే బాగా రాణిస్తుందేమో) మేకప్ కూడా అంతంత మాత్రంగా చేశారు. కళ్ళ నిండా కాటుక పెట్టి ఉంటే కాస్త బావుండేదనిపించింది. ఇంత లేత మొగ్గకి సునీత డబ్బింగ్ సరిగ్గా అమరలేదు. చిన్మయి చేతో సౌమ్య చేతో చెప్పిస్తే బాగుండేది. సునీత కమలిని లెవెల్లో హావభావాలు గొంతులో పలికించడం, శృతి నటనకు మాచ్ కాలేదు.

మొత్తం సినిమా లో గ్రాఫిక్స్ దాదాపు గంటంబావు సేపు ఉన్నాయి. గ్రాఫిక్స్  చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాయి నిజంగా! క్లైమాక్స్ లో ఐరేంద్రి మహా సర్పంగా మారే దృశ్యాలు చూపు తిప్పుకోనివ్వవు. (మహా సర్పానికి ఐరేంద్రి మొహం ఉంచితే బాగుండేది కానీ సర్పం మొహమే ఉంచేశారు) అలాగే ఐరేంద్రి నీటి కొలనులో దిగినప్పుడల్లా ఆమె కేశాలు సర్పిణి రూపం దాల్చి మాట్లాడ్డం,అలల్లా చుట్లు తిరుగుతూ సర్పాల్లా మెలితిరగడం..ఇవన్నీ చాలా బాగా నచ్చాయి నాకు!


అంతటి మహాసర్పంతో జరిగిన భీకర పోరాటంలో, (అదీ మంత్ర గత్తెతో )హీరో కి పెద్దగా దెబ్బలు తగలకపోగా చివరికి అతడు కొట్టిన ఒకే దెబ్బతో మంత్రగత్తె ఠప్పున నేలకూల్తుంది. తన మంత్రాలేవీ ప్రయోగించదు. హీరో హీరోయిన్లకు కుటుంబాలున్నాయో లేవో చూపించరు. గాలికి తిరుగుతుంటారు.  అలాగే కన్నీటి బిందువు ఆకారంలో ఉన్న రాజ్యాన్ని ఐరేంద్రి స్వాధీనపరుచుకుంటే ఆ రాజ్యం తాలూకు రాజు , మంత్రి ఏమయ్యారో చూపిస్తే బాగుండేది.  విలను రవి బాబు ఒక బలమైన త్రిశూలం లాంటి ఆయుధంతో హీరో రెండు కళ్ళలోనూ సుటీగా పొడిచేస్తాడు.(లేదా కళ్ళు పెకలిస్తాడు)కానీ తర్వాతి దృశ్యాల్లో హీరోకి చూపు పోయి అంధుడవుతాడే కానీ కళ్ళు మాత్రం ఏ మాత్రం దెబ్బ తినవు.చక్కగా పుచ్చ పువ్వుల్లా ఉంటాయి!

ఇలాంటి చిన్న చిన్న(?) లోపాలు తప్పించి ప్రకాష్ దర్శకత్వం బాగానే ఉంది

సినిమాలో హాస్యం కోసం చూడకూడదు. ఒక్క సీను బ్రహ్మానందంతో పెట్టి దాన్ని కాస్తా  అపహాస్యం చేసేశారు.  పాటలు బాగానే ఉన్నాయి. ఒకపాట లో హర్మోనియం వాడటం నాకు బాగా నచ్చింది.

మొత్తం మీద సినిమా బావుంది. పిల్లలు మరీ బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లల సినిమాలు ఎంజాయ్ చేసే పెద్దాళ్ళు కూడా!
పైసా వసూల్ అనే అనిపించింది
భయపడకుండా హాయిగా చూసి రావొచ్చు  .