Showing posts with label బ్లాగులు. Show all posts
Showing posts with label బ్లాగులు. Show all posts

August 8, 2011

బ్లాగా? బజ్జా?





ఒకరోజు మెయిల్ బాక్స్ లో ఉన్న ఒకటో పదహారో మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉండగా ఎడమ పక్కన నాలుగు రంగుల్లో ఒక అర్థ వృత్తాకారం కనపడి ఏమిటాయని దాని మీద నొక్కాను. హాచ్చెర్యం, .....ఆలిస్ ఇన్ వండర్ లాండ్ లా ఫీలైపోయాను. అక్కడ మన వాళ్ళు (అంటే బ్లాగర్లు) హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. హోరినీ ఇదేవిటా అని ఆరా తీస్తే దాన్ని బజ్ అంటారని తెల్సింది.

కొద్ది రోజులూ వాళ్లవీ వీళ్లవీ బజ్జులు చదివి నేను ఒక చిన్న కొటేషన్ బజ్జులో రాసినట్టు గుర్తు!దాన్ని నలుగురో ఎంతమందో లైక్ చేయడం, ఇద్దరో ముగ్గురో కామెంట్లు రాయడం ఇలాంటిదేదో జరిగింది. తర్వాత మరీ ఎక్కువగా కాకపోయినా అడపా దడపా బుల్లి సైజులో బజ్జులు రాశా నేను కూడా! రాస్తున్నా!

కానీ ఈ మధ్య చాలామంది బజ్జులొచ్చి బ్లాగుల్ని పడగొట్టాయని,బజ్జుల వల్ల బ్లాగుల్లో కామెంట్లే లేకుండా పోయాయని విచారం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంత వరకూ కరెక్టే!

ఈ మధ్య నేను రాసిన ఒక బజ్జులో మిత్రులమంతా దూరదర్శన్ కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటూ జ్ఞాపకాల పూలు ఆఘ్రాణిస్తూ ఉండగా తాడేపల్లి గారొచ్చి "ఇక్కడ కాలక్షేపం బాగానే అవుతుంది కానీ అక్కడ మీ బ్లాగు బజ్జుంది చూశారా?" అని చనువుతో కేకలేశారు.

మరో ఫ్రెండ్ ఈ మధ్య "ఏమిటండీ, ఈ మధ్య మీరసలు బ్లాగు రాయడం లేదు? ఫలానా బ్లాగర్ చూడండి, రోజూ ఏదో ఒక అంశం మీద టపాయిస్తారు?" అని దబాయించారు. ఇక్కడే చెప్తున్నా జవాబు.."నేను ఫలానా బ్లాగర్ని కాదు! రోజూ బ్లాగు రాసే కోరిక,ఓపిక ముఖ్యంగా తీరిక నాకు లేవు. బ్లాగు కంటే ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి నాకు! ఇష్టమైతే, కుదిరితే రాస్తాను.మొదటినుంచీ అల్లాగే చేస్తున్నా! బిజీగా లేనపుడే నెలకు నాలుగో ఐదో మించి రాయలేదు...ఇహ రోజూ ఎక్కడ రాయమంటావు నాయనా?"

నా పనులు నేను చేసుకుంటూనే అప్పుడప్పుడు బజ్జులో ఒకటి రెండు వాక్యాలు రాయడం,లేదా నచ్చిన ఫొటోలు పెట్టడం..అంతే!

బ్లాగు విలువ బ్లాగుకుంటే బజ్ విలువ బజ్ కుంది! ఒక చిన్న కవితో,నచ్చిన కొటేషనో, ఫొటోనో మరో జోకో పంచుకోవాలన్నా బజ్జే బాగుంటుంది.ప్రతి చిన్న విషయానికీ బ్లాగు రాయాల్సినంత ప్రాముఖ్యం లేకపోవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా కొంతమందికి బ్లాగు రాసే సమయం లేక ఒక చిన్న విషయాన్ని పంచుకోవాలనుకున్నపుడు క్లుప్తంగా బజ్ లో పెట్టొచ్చు!

బజ్జులో సమయం వృధా మాత్రం బాగానే జరుగుతుంది.ఒక్కోసారి బజ్  టాపిక్ ఏమిటో,,చివరికి వ్యాఖ్యలు ఎటునుంచి ఎటు పోతాయో చెప్పడం కష్టం కూడా! ఒకసారి అప్పటికే రెండొందల వ్యాఖ్యలు వచ్చిన ఒక బజ్ లో మన రహ్మానుద్దీన్ అడుగు పెట్టి "బాబూ ప్రతి వంద వ్యాఖ్యలకోసారి బజ్ సారాంశం ఏమిటో తెలపాలని కోరుతున్నా"అని విజ్ఞప్తి చేశాడు.

అయితే ఒక్కోసారి బ్లాగు కంటే బజ్జులో మంచి విషయాల గురించి చర్చలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. మంచి సంగీతం గురించి,సాహిత్యం గురించి,భాష గురించి,కవిత్వం గురించి మంచి మంచి కబుర్లు దొర్లుతాయి అక్కడ! అందరివీ నేను కోట్ చేయలేను..నా బజ్జులోనే ఒకసారి భగవద్గీత మీద సురేష్ కొలిచాల గారు,నాగరాజు పప్పు గార్ల మధ్య ఎంతో మంచి చర్చ జరిగింది.అలాగే,వేణూశ్రీకాంత్,మాయా సౌమ్య...ఛ కాదు, ఆలమూరు సౌమ్య,రహ్మానుద్దీన్ ల బజ్జుల్లో మంచి విషయాలు పంచుకున్నాం!

ఇంకో ముఖ్యమైన సంగతి...బ్లాగుల్లో ఉన్నపుడు కేవలం పరిచయస్థులుగా ఉన్నవారు బజ్జులో అతి దగ్గరి స్నేహితులుగా మారడం నేను చూశాను.సరదా కబుర్ల మూలంగా కావొచ్చు,కలిసిన అభిరుచుల మూలంగా కావొచ్చు! ఎందుకంటే బజ్జు స్వభావం వేరు. అదొక నిరంతర సంభాషణా ప్రక్రియ వంటిది కాబట్టి!


బజ్జులో అనానిమస్ కామెంట్స్ రాసే అవకాశం కూడా లేదు.(రకరకాల ఐడీలతో రాసే అవకాశం ఉంది. కానీ బజ్జులో అసభ్యంగా ఎవరూ  కామెంట్స్ రాయగా చూళ్ళేదు ఇంతవరకూ)

బ్లాగర్లు బజ్జుల్లో గంటల తరబడి గడుపుతూ బ్లాగుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని కొందరి ఆరోపణ!బ్లాగులు రాసేవాళ్ళు బజ్జుల్లో ఉండకూడదని,బజ్జుల్లో గడిపేవాళ్ళు బ్లాగులు రాయకూడదనీ రూలేమీ లేదుగా! బజ్జులో యాక్టివ్ గా ఉంటూనే బ్లాగులు కూడా తగు మాత్రంలో రాసేవాళ్ళు బులుసు గారు,మధురవాణి,రాజ్ కుమార్,ఆ.సౌమ్య...వీళ్ళంతా కనపడుతూనే ఉన్నారు! ఇంకా చాలామంది ఉండొచ్చు కానీ నేను ఎక్కువమంది బజ్ లు అనుసరించకపోవడం వల్ల అంతగా తెలీదు. ఎవరైనా బజ్జర్లు చెప్పండి!


నిన్న ఒక బజ్ లో ఒక వ్యాఖ్యను చూసి అక్కడి నుంచి శరత్ గారి బ్లాగుకెళ్ళి చూశా!   బజ్జుల వల్ల బ్లాగులకు లాభమా నష్టమా అనే పోస్టు కనపడింది.అందులో శరత్ గారు  " చెత్తంతా బజ్జుల్లో కొట్టుకుపోయిన్దనుకోవాలా లేక మేరునగ దీరులందరూ బ్లాగులని నిర్లక్ష్యమ్ చేస్తున్నారు అనుకోవాలా? అనే చఖ్ఖని ప్రశ్న వేసుకున్నారు.

అలా ఏమీ బేరీజులు వేయక్కర్లేదండీ!ఎవరి ఆసక్తి వాళ్ళది అనేసుకోండి చాలు! ఎవరు చెత్తో ,ఏది చెత్తో నిర్ణయించుకునే అవకాశం చదివే వాళ్ళకిచ్చేద్దాం!! ఎవరికి ఎందులో ఆసక్తి ఉంటే అందులో ఉంటారు! చెత్త రెండు చోట్లా ఉండొచ్చు,మంచి విషయాలూ రెండు చోట్లా ఉండొచ్చు! ఏవంటారు?

కాకపోతే బజ్జులో కెవ్వులూ కేకలూ మాత్రం ఎక్కువే!:-))

కామెంట్ల విషయానికొస్తే ఇప్పటికీ చాలా మంది కామెంట్ల సంఖ్యను బట్టే బ్లాగు పోస్టు విలువను నిర్థారించడం విచారం! అద్భుతంగా ఉంది అనిపించిన పోస్టుకి  మూడే కామెంట్లొస్తాయి. అంతగా ప్రాముఖ్యం లేని విషయం మీద చర్చను మొదలుపెట్టిన మొదటి కామెంట్ కి కొనసాగింపుగా  ఒక్కో బ్లాగుకి వంద కామెంట్లూ రావొచ్చు!

కానీ బ్లాగు పోస్టు లింకు ని బజ్ లో ఇస్తే మాత్రం ఆన్ లైన్లో ఉన్నవారు రాసే వ్యాఖ్య కాస్తా బజ్ లోనే రాసేస్తున్నారు. అందువల్ల బజ్ లో బ్లాగ్ పోస్టు లింక్ ఇచ్చేవాళ్ళు అక్కడ వ్యాఖ్యలను అచేతనం (commentsని disable చేయమని అర్థం) చేస్తే వ్యాఖ్యలు బ్లాగుల్లోనే పడతాయి.బ్లాగు నచ్చినపుడో, నచ్చనపుడో అభిప్రాయం మాత్రం తప్పక రాయాల్సిందే!

బజ్జులు మాత్రమే రాస్తూ బ్లాగుని నిర్లక్ష్యం చేస్తున్న మిత్రులు (అబ్బ, వేణూ శ్రీకాంత్ కి ఎంత కోపం వస్తోందో)మాత్రం బ్లాగు ని కూడా ఒక కంట కనిపెట్టి ఉంటూ పోస్టులు రాస్తూ ఉండాలి(నేనూ భుజాలు తడుముకుంటూ...)శంకర్ గారూ, మీరు కూడా! (అంచేత మీరు చెప్పొచ్చేదేమైనా ఉందా ఈ సందర్భంలో?)

ఎంతైనా బ్లాగులో రాసినవి భద్రంగా ఉంటాయి,వాటికో రిఫరెన్స్ గా చూసుకోనూ వచ్చు! అంశాల వారీగా విలువా ఉంది!
నేను  బజ్జు లో సమయం దాదాపుగా తగ్గించేశాను.

బ్లాగు మిత్రులు,బజ్జు మిత్రులు ఏవంటారు?



December 19, 2010

పుస్తకాల సంతలో వారాంతం ......కాసిన్నికబుర్లు!




వారాంతం రెండు రోజులూ పుస్తకాల సంతకి వెళ్ళాలని ముందే అనుకున్నాను కాబట్టి, శనాదివారాలు రెండురోజులూ సాయంత్రాలూ అక్కడే గడిపాను.ఇవాళైతే మధ్యాహమే వెళ్ళాను. ఎందుకంటే నిన్న పుస్తకాల స్టాళ్లన్నీ చూడ్డం కుదరలేదు.పైగా నిన్న నాతో సంకీర్తన ఉంది. ఆవిడను తీసుకెళితే కనపడ్డ యాక్టివిటీ పుస్తకాలన్నీ కొనమంటుంది. మరో పక్క భయపెడుతూ "ఛోటా భీమ్" వాళ్ళ స్టాలు! అందుకే నిన్న కొన్ని పుస్తకాలు మాత్రమే కొన్నాను. నిజానికి నా పుస్తకాల కొనుగోలు ఎప్పటికప్పుడు నవోదయలోనో, విశాలాంధ్రలోనో అప్ డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి తెలుగు పుస్తకాలు అంతగా కొనాల్సినవి కనపడలేదనే చెప్పాలి.

ఇవాళ తీరిగ్గా తిరిగి, కొన్ని పుస్తకాలు కొన్నాను. నేను స్టాళ్ల పేర్లు పట్టింపు లేకుండా(అంటే నిజానికి పట్టించుకోకుండా) అన్నీ తిరిగి చూశాను."కన్ను దిష్టి గణపతి" స్టాల్ తో సహా! (ధర చాలా ఎక్కువ ఉండటంతో కొనలేదు)తల్లి అవతారమెత్తాక పుస్తకాలనే కాదు, ఎక్కడికెళ్ళినా పిల్లలకు పనికొచ్చేవి ఏమున్నాయో చూడ్డం ఒక దైనందిన చర్యగా మారిపోతుందిగా! అందుకే స్పైడర్ బుక్స్ స్టాల్లో మంచి యాక్టివిటీ పుస్తకాలు,క్రాస్ వర్డ్ పజిల్సు పుస్తకాలు కొన్నాను. ఈ స్టాల్లో మంచి కలెక్షన్ ఉంది. అలా వెళ్తోంటే నవోదయ వాళ్లు 'ఏవండోయ్, ఇల్లా చూడకుండా పోతున్నారేం?" అని కేకేశారు. కొమ్మూరి వేణుగోపాలరావు గారి పుస్తకాలన్నీ వచ్చాయి, చూస్తారా అన్నారు. చూశాను గానీ వాటిలో నాకు కావలసిన 'ఈ దేశంలో ఒక భాగమిది" నవల లేదు. ఈ నవల చాలా అద్భుతంగా ఉంటుంది.



అందరితో పాటే నేనూ నా 'నా ఇష్టం" కొన్నాను.పిలకా గణపతి శాస్త్రి గారి "విశాలనేత్రాలు" చినవీర భద్రుడి 'సత్యాన్వేషణ" తీస్కున్నా! ఈ సారి మంచిపుస్తకం, జనవిజ్ఞానవేదిక వాళ్ళు కల్సి నిర్వహిస్తున్నారు స్టాల్. వాళ్ళ దగ్గర గిజుభాయి పుస్తకాలు తీసుకున్నాను.

నన్ను బాగా ఆకర్షించిన మరో స్టాలు 'సేతు సాఫ్ట్ వేర్ సిస్టమ్" వాళ్ళది. My drona పేరుతో ఒక వీడియో డివైస్ ని అందిస్తున్నారు. ఫెయిర్ కి వెళ్ళినవాళ్లు తప్పక చూడండి.బాగా ఉపయోగంగా కనిపించిన మరో స్టాలు "కినిగె"!.స్నేహితులందరికీ ఈ స్టాలు గురించి మెయిల్ పంపాను చూడమని!

మరికొన్ని పుస్తకాలు తీసుకుని , ఛోటా భీమ్ స్టాల్లో ఒక టీ షర్టూ(పిల్లదానికి), ఒక కప్పూ,కీ చైనూ తీసుకుని బయటపడ్డాను.

ఈ లోపల రామ్ గోపాల్ వర్మ తో ముఖాముఖి ప్రారంభమైంది. సభికులు అడిగిన కొన్ని తింగరి ప్రశ్నలకే కాక,సీరియస్ ప్రశ్నలకు కూడా రాము తింగరి,వెటకారపు సమాధానాలే చెప్పి "నా ఇష్టం" అనిపించుకున్నాడు.(పుస్తకంలో కొన్ని భాగాలు నాకు చాలా నచ్చాయి)



ఆదివారం కావడం వల్ల ఇవాళ చాలామంది బ్లాగర్లు ఈ తెలుగు స్టాల్ కి వచ్చారు. శ్రీనివాస్ రాజు దాట్ల భార్గవ్,కట్టా విజయ్,రవిచంద్ర,కత్తి మహేష్,నవతరంగం వెంకట్,అరిపిరాల సత్యప్రసాద్,బూదరాజు అశ్విన్,వికాసధాత్రి అరుణ,కస్తూరి మురళీకృష్ణ,చావా కిరణ్, వేణు, గీతాచార్య,యోగి,జాన్ హైడ్ కనుమూరి,శ్రీనివాస కుమార్,సీబీరావు,బాలు(కోతికొమ్మచ్చి)  గార్లు కాక.....

కొత్తగా వీకెండ్ పొలిటీషియన్,కొడవటిగంటి రోహిణీప్రసాద్ గార్లు ఇవాళ్టి ప్రత్యేక అతిథులు.జ్యోతిగారు వచ్చి అరంగంట ఉండివెళ్ళిపోయారు.(ఇంకెవరైనా వచ్చారా? నేను గమనించలేదు)

వీళ్ళుకాక రోజూ స్టాల్లో ఉండటానికి (గుంటూరునుంచీ )వచ్చిన కౌటిల్య,రహమానుద్దీన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి.

అన్నట్లు వీవెన్ కూడా!:-))

స్టాలు సందర్శకులు కూడా అధిక సంఖ్యలోనే ఉన్నారివాళ. రామకృష్ణమఠం వారు నడిపే శ్రీ రామకృష్ణ ప్రభ పత్రికకు   ఆన్ లైన్ లో తెలుగువ్యాసాలు ఎలా టైప్ చేసుకోవాలో  పత్రిక నిర్వాహకులు పరిజ్ఞాయేంద్ర స్వామి కి రెహమాన్ వివరించారు.

ఇద్దరు ముగ్గురు బ్లాగర్లు "మలక్పేట్ రౌడీ హైద్రాబాదులోనే ఉన్నారా?నిజంగానే వస్తారా"అని ఆసక్తి ప్రదర్శించారు.(ఆయన ఇంతకు ముందు టపాలో "నేనూ రానా బుక్ ఫెయిర్ కి?" అని వ్యాఖ్య రాశారు)

స్టాల్లోని బ్లాగర్లకి మిర్చి బజ్జీలు సత్యప్రసాద్ గారూ, స్వీట్లు కౌటిల్యా స్పాన్సర్ చేశారు.:-))

ఇంకా కొనాల్సిన పుస్తకాలు,చూడాల్సిన స్టాళ్ళూ కొన్ని మిగిలిపోయాయి. వచ్చే వారాంతంలోపు వాటి సంగతీ చూడాలి.

హైద్రాబాదు బ్లాగర్లు తీరిక చూసుకుని ఒక రోజు బుక్ ఫెయిర్ కీ, పన్లోపనిగా స్టాలుకీ వచ్చేయండి!

December 13, 2010

తెలుగు బ్లాగర్లకు విజ్ఞప్తి!

           నిన్నటి బ్లాగర్ల సమావేశానికి వచ్చిన కొందరు బ్లాగర్లు.



ఈ నెల పదహారో తారీకు నుంచి నెక్లెస్ రోడ్డు లోని పీపుల్స్ ప్లాజాలో పుస్తకాల సంత ప్రారంభం కానున్న సంగతి మీ అందరికీ తెలుసు! ఇది 26 వరకూ కొనసాగుతుంది.

ఎప్పటిలాగానే ఈ తెలుగు సంస్థ ఈ సంతలో  ఒక స్టాలుని నిర్వహించబోతోంది. పోయినేడాది ఈ తెలుగు స్టాల్ కి అనూహ్య స్పందన లభించింది. అనేకమంది కవులు, రచయితలు, కళా కారులు,జర్నలిస్టులు స్టాలుని సందర్శించి కంప్యూటర్లో తెలుగుని ఎలా ఉపయోగించాలో నేర్చుకుని సీడీలు పట్టుకుని వెళ్ళారు. శ్రీయుతులు తనికెళ్ల భరణి,బీ వీ పట్టాభిరామ్,జయప్రభ, భారవి, భాస్కర భట్ల రవి కుమార్,తెలకపల్లి రవి,ఇంకా అనేకులు కంప్యూటర్లో తెలుగు వికాసాన్ని తెలుసుకోవటం పట్ల అమితాసక్తిని చూపించారు.

దీనివల్ల మాకు అర్థమైందేమిటంటే ఈ మెయిల్సూ, సోషల్ నెట్ వర్కింగ్ సైట్లూ ఉపయోగించే అనేకమంది ప్రముఖులు ఈ పనులన్నీ తెలుగులో చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారనీ, స్టాలుని సందర్శించే దాకా అవి తెలుగులో కూడా చేయొచ్చని వారికి తెలీదనీ!

తెలుగు బ్లాగర్లను మినహాయిస్తే చాలామంది  తెలుగువారు ఆన్ లైన్లో వార్తా పత్రికలు చదువుకోవడం తప్ప ఇంటర్నెట్ లో తెలుగు వికాసానికీ, తెలుగు విజ్ఞాన సర్వస్వం వికీ పీడియా, బ్లాగులు మొదలైన వాటికి చాలా దూరంలో ఉన్నారు.

స్టాల్ కి లభించిన ఆదరణకు మరో నిదర్శనం...ఆ తర్వాత ఈ తెలుగు నిర్వహించిన రచయితల అవగాహనా సదస్సుకు తెలుగు రచయితలు  వెల్లువెత్తినట్లు రావడం. ఏర్పాటు చేసిన హాలు చాలక మరో రెండు గదుల్లో విడివిడిగా ఏర్పాట్లు చేయవలసి వచ్చింది.

ఈ ఏడాది కూడా పుస్తకాల సంతలో ఈ తెలుగు నిర్వహించబోతున్న స్టాలుకు కొంతమంది వలంటీర్లు కావాలి. ఈ తెలుగు సభ్యులే కాక ఔత్సాహిక తెలుగు బ్లాగర్లు కూడా ఇందులో పాలు పంచుకుంటే బాగుంటుందని సంస్థ భావిస్తోంది. ఇప్పటికే కొంతమంది తెలుగు బ్లాగర్లు ప్రతి రోజూ సాయంత్రం వేళ వచ్చి స్టాలు లో ఉండటానికి సంసిద్ధతను తెలియజేశారు. అక్కడ చేయాల్సిన పనల్లా..సందర్శకులకు కంప్యూటర్లో తెలుగుని ఎలా ఉపయోగించవచ్చో సంక్షిప్తంగా వివరించడం!సీడీలు ఎలాగూ ఉంటాయి!

ఈ తెలుగు సభ్యులు ప్రతి రోజూ అక్కడ ఉంటారు. సంత ఎలాగూ సాయంత్రం నాలుగు తరవాతే ఊపందుకుంటుంది కాబట్టి ఆ సమయానికి ఆసక్తి గల తెలుగు బ్లాగర్లు స్టాలులో ఉంటే బాగుంటుంది. రెండు వారాంతాలూ నేను రాగలను. వీలు చూసుకుని ఈ మధ్యలో కూడా!

అక్కడికి వచ్చే రచయితలు, కవులు, కళా కారుల్ని కలుసుకుని వారికి సాంకేతికాల్ని వివరించే అవకాశం ఉంటుంది. పన్లో పనిగా పుస్తకాలూ కొనుక్కోవచ్చు! అంతే కాదు..అక్కడ పోయినేడాది లాగానే ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్నాము. వచ్చిన వారు తమ బ్లాగు పేరుని అక్కడ స్వయంగా రాసి ప్రదర్శించుకోవచ్చు!

ఇంకోటి..సరదాగా అందరమూ కల్సి కాసిన్ని మంచి కబుర్లు చెప్పుకోవచ్చు:-))

ఏమంటారు? హైద్రాబాదు బ్లాగర్లకే కాక ఇతర ప్రాంతాల నుంచి వచ్చే తెలుగు బ్లాగర్లకు కూడా ఆహ్వానం! (ఫణిబాబు బాబాయి గారు చదువుతూ ఉండాలి ఈ టపా)

ఎవరెవరొస్తున్నారో చేతెలెత్తండి! అంతటితో సరిపెట్టక ఇక్కడ వ్యాఖ్య రాయండి!

January 16, 2010

ఈనాడులో తెలుగోడు.... అబ్రకదబ్ర!



బ్లాగ్లోకంలో తెలుగోడంటే అబ్రకదబ్రే! పరిచయం అవసరం లేదు.



బ్లాగర్ నుంచి కథా రచయిత ప్రమోషన్ తెచ్చుకున్న  ఈ అసలు సిసలు తెలుగోడిని బ్లాగ్లోకంలోనే కాక తెలుగు పాఠక ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నంగా.... బుల్లి సమీక్ష ఈనాటి....ఈనాడులో!


ఇంత మంచి రచయితను తెలుగు పత్రికలు నిజంగా మిస్ అవుతున్నాయని నా అభిప్రాయం. ఈ మాట ఇక్కడెందుకు రాశానంటే ఈ లైను ఈనాడు రివ్యూలో ఎడిట్ అయిపోయింది మరి!



అనిల్...ది అబ్రకదబ్ర........!



మీ బ్లాగును ప్రపంచం నలుమూలలా అసంఖ్యాక పాఠకులు చదవాలనీ,మీరు ఈ వూపుని కొనసాగిస్తూ ఎన్నెన్నో మంచి టపాలు రాసి అందర్నీ అలరింపజేయాలని,త్వరలో మీ బ్లాగు లక్ష హిట్ల మైలు రాయిని దాటాలనీ...ఎన్నెన్నో మంచి కథలు సృష్టించి తెలుగు సాహితీ ప్రపంచాన్ని సస్యశ్యామలం చేయాలనీ(అబ్బ, మరీ పొయెటిక్ గా రాసేస్తున్నా కదూ)కోరుతున్నా!

October 10, 2009

అటెన్షన్ లేడీస్..ఈ రోజు ఈనాడు వసుంధరలో మనం.....!










"బ్లాగులందు మహిళా బ్లాగులు వేరయా"అన్నట్లు(ఎవరైనా అన్నారా లేదా? అనే ఉంటార్లెండి)బ్లాగులు రాసే మహిళల సంఖ్యతో పాటు వాటిలో వైవిధ్యం కూడా పెరుగుతూనే ఉంది. అందుకే పత్రికల్లో తరచుగా బ్లాగుల ప్రసక్తి వచ్చినపుడు ప్రత్యేకించి మహిళల బ్లాగుల్ని గురించి పేర్కొనడం కూడా చూస్తున్నాం!


ఈ రోజు ఈనాడు "వసుంధర"లో ఆన్ లైన్ లో అక్షర  శరాలు సంధిస్తున్న తెలుగు మహిళా బ్లాగర్ల గురించి ఒక వ్యాసం వచ్చింది. అందులో కాస్త నా చెయ్యి కూడా పడింది.


ఎలా ఉంది?

బొమ్మల కొలువు దసరా అయిపోయాక పెట్టినట్లుంది కదూ!

July 22, 2009

చందమామల్లాంటి బ్లాగులు!


పిల్లల కథలంటే నాకు ప్రాణం ఇప్పటికీ! బాలజ్యోతి, బాలమిత్ర,బొమ్మరిల్లు ,బుజ్జాయి వంటి ఎన్ని పిల్లల పత్రికలు "కొసరు"గా చదివినా,అల్టిమేట్ కథలంటే చందమామ కథలే! బాలమిత్ర స్టాండర్డ్ చిన్నప్పుడే నచ్చేది కాదు.చందమామ లో వచ్చే జానపద సీరియల్స్ చదవడం కోసం చందమామ ఇంటికొచ్చే సమయానికి మా ఇంట్లో (నాన్నతో సహా) ఎన్ని జతల కళ్ళు కాచుకుని ఉండేవో,నేను ముందంటే నేను ముందని ఎంతెంత యుద్ధాలు జరిగేవో తల్చుకుంటే ఉత్తేజం పొంగివస్తుంది.ఆ యుద్ధాల్లో నేను గెల్చిన సందర్భాలు గుర్తొచ్చి విజయహాసం ఇప్పటికీ మొహాన వికసిస్తుంది.



పాత చందమామల బైండ్లు బంధువుల ఇళ్ళలో కానీ, పాత పుస్తకాల షాపుల్లోగానీ, ఫుట్ పాత్ మీద పరిచిన పుస్తకాల దుకాణాల్లో గానీ ఎక్కడన్నా దొరుకుతాయేమో ఎంత డబ్బయినా పర్లేదు, కొనెయ్యాలని ప్రయత్నించి విఫలమయ్యాను ....బోల్డు సార్లు. కొందరిళ్ళలో ఉన్నాయి కానీ ఇవ్వమనేశారు. నేనైతే మాత్రం ఇస్తానా చెప్పండి? త్రివిక్రమ్ అబ్దుల్ కలామ్ గారికి ఇస్తారట గానీ మన్మోహన్ సింగ్ అడిగినా ఇవ్వరట. నేనైతే వాళ్ళిద్దరికీ ఇవ్వను..ఏం చేసుకుంటారూ? ఇద్దరికీ తెలుగు రాదుగా?



ఇలా వేట సాగిస్తుండగా....

ఆన్లైన్లో పాత చందమామలు ఉన్నాయన్న వెన్నెల లాంటి చల్లని కబురు నాగమురళి గారు తెచ్చారు.

నాగమురళి గారు పాత చందమామలు చదువుతారా ?. అంటూ పలకరించగానే ప్రాణం లేచొచ్చి అక్కడికి పరిగెత్తి ఆ యులిబ్ లో ఉన్న పాత చందమామలు వీలైనన్ని చదివాను. ఈ లోపు ఈ చందమామ దాహాన్ని మరింత పెంచుతూ

త్రివిక్రం గారు "చంపి" క్లబ్బు.స్థాపించి, పాత చందమామల గురించి మరో సారి టపా రాశారు.మరోసారి అక్కడికి పరుగు.ఆర్కుట్లో చందమామ కమ్యూనిటీ కూడా ఏర్పాటు చేశారంటే ఇక చూసుకోండి మరి!ఆ టపా చదువుతుంటే ఎంతో ఆశ్చర్యమేసింది. త్రివిక్రమ్ గారినే తలదన్నే మహానుభావుడొకాయన హైదరాబాదులో ఉన్నారని త్రివిక్రం గారి మాటల్లోనే తెలిశాక, ఇక చంపి ల్లో మనం చివరి లైన్లో ఉంటే మంచిదని అర్థమైంది.



ఈ లోపు బ్లాగాగ్ని ఫణి గారు ఇవికాకుండా "ఇవిగో అందుకోండి"అంటూ డౌన్ లోడ్ చేసుకోడానికి చందమామ సీరియల్స్ ని అందించారు.

 ఇక్కడా..

ఇంకా ఇక్కడా..!

ఇక్కడ కూడా...!

దానితో తల తిరిగిపోయింది.



అవి డౌన్ లోడ్ చేసుకుంటూ ఉండగా ఆ బ్లాగులోకి చుట్టపు చూపుగా వచ్చిన కప్పగంతు శివరామ ప్రసాద్ గారు "ఓసింతేనా!   నా బ్లాగు. చూడండొకసారి"అన్నారు. దానితో అక్కడికి పరుగు.(చందమామలు దొరుకుతాయంటే చందమామ వరకైనా ప్రయాణానికి రెడీ) అక్కడికి వెళ్ళి చూస్తే శివరామ ప్రసాద్ గారికి "చంపి మిత్ర" బిరుదు ఇవ్వాలనిపించేన్ని అద్భుతాలు అక్కడ కనపడ్డాయి. పాత జానపద సీరియల్స్ అనీ సిద్ధం... నోరూరిస్తూ!


 ఆ పాత మధురాలై, మనల్ని ఒక్కసారిగా బాల్యంలోకి విసిరేసే అనాటి సీరియల్స్ ని అందించడమే లక్ష్యంగా కాక బొమ్మలన్నింటినీ ఫొటో ఎడిటర్లో డిజిటలైజ్ చేసి రంగుల్ని చాలా వరకూ పునరుద్ధరించడం,సరిగా స్కాన్ కాని చందమామ పేజీలను సరి చేయడం వంటివి చేసి మంచి క్వాలిటీతో చందమామ సీరియల్స్ ని అందుబాటులో ఉంచారు శివరామ ప్రసాద్ గారు!



ఇంతలో ఈ మధ్యనే చంపి క్లబ్బులో సభ్యత్వం తీసుకున్న వేణు గారు తానేం తక్కువ తినలేదంటూ చందమామ లోని జానపద సీరియల్స్ రచయిత దాసరి సుబ్రహ్మణ్యం గారిని మొన్న ఆదివారం ఈనాడులో పరిచయం చేశారు. తన బ్లాగులోనూ .ఇచ్చారు. అంత గొప్ప సీరియల్స్ రాసిన సుబ్రహ్మణ్యం గారి ఫొటో చూడ్డం, ఆయన గురించి తెలుసుకోవడం మరో సంబరం.



శివరామ ప్రసాద్ గారు ఇంతవరకూ అందించిన పాత చందమామ సీరియల్స్ వివరాలు ఇవీ!

పేరు మీద క్లిక్ చేస్తే అది మిమ్మల్ని ఆయన బ్లాగులో ఆ సీరియల్ ఉన్నచోటుకు తీసుకెళుతుంది.



1.సింద్ బాద్ యాత్రలు.

2.అరణ్య పురాణం.

3.మాయదారి ముసలిది.

4.ఆలీబాబా నలభై దొంగలు.

5.అలీ నూర్, ఆలీబాబా, మాయ వర్తకుడు .

6.అల్లాద్దీన్ అద్భుత దీపం.

7. వడ్డాది పాపయ్యగారి అద్భుత చిత్రాలు.(అరణ్య పురాణం సీరియల్ ముఖ చిత్రాల ఆల్బమ్)

8. ప్రహ్లాద చరిత్ర .   (వడ్డాది గారి చిత్రాలతో సహా)

9.పురాణ గాథలు.

10.దుర్గేశ నందిని, నవాబు నందిని.

11.పరోపకారి పాపన్న కథలు .



ఈ సీరియల్స్ లో కొన్నింటిని నేను డౌన్ లోడ్ చేశాను. మరి కొన్ని చేస్తున్నాను.



ఇంటర్నెట్ లో చందమామ అందుబాటులో ఉందని తెలిసే ఎంతో సంబరపడ్డ చంపి  లు ఈ సీరియల్స్ అన్నింటినీ చూస్తే ఇంకెంత సంబరపడతారో! కానీ శివరామ ప్రసాద్ గారి బ్లాగు ఇటీవల వరకూ కూడలిలో జత చేయకపోవడం వల్ల వారు అప్ డేట్ చేసిన సీరియల్స్ వివరాలు ఆయన బ్లాగుకెళ్ళి చూస్తే తప్ప తెలియడానికి లేకుండా పోయింది.



చందమామ సీరియల్సే కాక సాహిత్య అభిమాని బ్లాగులో అనేక ఆసక్తికర విషయాలపై టపాలున్నాయి.ఇంతకుముందు అవన్నీ మిస్ అయిపోయిన వారు వారి బ్లాగులో పాత టపాలు చదవొచ్చు!


చందమామ అభిమానులంతా ఈ బ్లాగులోని జానపద సీరియల్స్ ని డౌన్ లోడ్ చేసుకుని దాచుకుంటే భవిష్యత్తులో అవి దొరకకపోయే పరిస్థితి వచ్చినా మనకేం ఢోకా లేదన్నమాటే!ఇప్పటివరకూ డౌన్ లోడ్ చేసుకోని వారెవరైనా ఉంటే సాహిత్య అభిమాని బ్లాగు నుంచి వీటిని డౌన్ లోడ్ చేసుకోండి మరి!

వీటిలో కొన్ని సీరియల్స్ నేను పుట్టకముందు ప్రచురించబడ్డవి కూడా ఉన్నాయి.అప్పటి చందమామలు పుస్తకాల రూపంలో అయితే సంపాదించడం అసంభవమే! వీళ్ళందరి పుణ్యమా అని వాటిని చదవగలుగుతున్నాను.


ఈ "చందమామ"ల్లాంటి బ్లాగు రచయితలందరికీ ఎన్నెన్నో ధన్యవాదాలు.

January 27, 2009

పొద్దు గడి కి ఈ సారి స్లిప్పుల సర్వీసు ఇక్కడ!

స్లిప్పుల సుగాత్రి(సుగాత్రి గారూ, ఈ పేరు నేను కాదండీ పెట్టింది)ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు.ఎంత పిలిచినా వినడం లేదు.  ఈ సారి(కూడా) గడి సొంతగా పూర్తయ్యేలా లేదు.  స్లిప్పులు కావలసిందే! (అత్తగారు కూడా ఊర్లో లేరు)అందువల్ల గడి పూర్తి చేసే వారు నా బ్లాగులో స్లిప్పులు ఇచ్చి పుచ్చుకుంటే ఉభయతారకంగా ఉంటుందని నా అవిడియా! చన్నీళ్లకు వేణ్ణీళ్ళు లాగా నేను కొన్ని స్లిప్పులిస్తున్నా......! అందుకుని నాక్కొన్ని స్లిప్పులివ్వండి దయగల ప్రభువులు...!

1 అడ్డం - అర్జునుల కాలం కూడా ఇదే!


4 అడ్డం -చారులో కంపల్సరీ


5 నిలువు - వేజు

10 నిలువు - గద్దర్ పక్కనే ఉంటాడెక్కువగా


27 నిలువు - crab అనగా పీత..

21 నిలువు - భోగి మర్నాడే!

38 అడ్డం - ఇన్నర్ సీక్రెట్ .....



నాకు స్లిప్పులు కావలసినవి..



22 నిలువు

17 అడ్డం

12 నిలువు



మిగిలినవి తరవాత చెప్తాను...!

December 25, 2008

ఈ-తెలుగు స్టాల్లో మేము- కొన్ని విశేషాలు

క్రిస్మస్ ఆటవిడుపు రోజు వీలైనంత మంది మహిళా బ్లాగర్లు పుస్తకాల పండగ లో ఈ-తెలుగు స్టాల్ లో కలుసుకోవాలనుకుని అనుకున్నాం! నేను, వరూధినిగారు, పూర్ణిమ, స్వాతి(ఊసులు),విరజాజి శిరీష గారు, జ్ఞానప్రసూన గారు,జ్యోతి గారు, రమణి గారు,అరుణ గారు కొంచెం ముందూ వెనుకలు గా అక్కడ కలుసుకున్నాం! స్టాలు కి మేము చేసిన సేవలు ఏమీ లేకపోయినా అందరం కలుసుకోవడం మాత్రం మరపురాని అనుభూతినే మిగిల్చింది.




చక్రవర్తి(భవదీయుడు)గారు,రవిగారు,తాడేపల్లి గారు,భార్గవ్, శ్రీనివాస్ కుమార్, హరివిల్లు శ్రీనివాస్,శ్రీధర్ గారు,మహేష్ కుమార్ గారు, పద్మనాభంగారు,నామాల మురళీధర్(మురళీగానం),దైవానిక(బెంగుళూరు నుంచి ఈ తెలుగు స్టాల్ కోసమే ప్రత్యేకంగా వచ్చారు)..వీరందరినీ కలుసుకున్నాం! కస్తూరి మురళీకృష్ణ గారి పుస్తకాలు,కొల్లూరి సోమ శంకర్ గారి మనీ ప్లాంట్ వారిద్దరి ఆటోగ్రాఫులతో సహా కొనేసుకున్నాం నేనూ, వరూధిని గారూ!



జ్ఞానప్రసూన గారు, జ్యోతి గారు ఆప్యాయత నింపి తెచ్చిన పూర్ణాలు,సున్నుండలు మొహమాటం లేకుండా ఖాళీ చేశాము. కంపెనీ గా ఉంటుందని బయట నుంచి మిర్చి బజ్జీలు కూడా వీటికి జత చేశాము.



జ్ఞానప్రసూన గారు ఆమె రాసిన పుస్తకాలు, వారి నాన్నగారు రాసిన పుస్తకం మా అందరికీ ప్రేమతో ఇచ్చారు.
ఇంతలో కలహార స్వాతికుమారి గారు మెరుపులా వచ్చి మమ్మల్ని పలకరించి మాయమైపోయారు


తాడేపల్లి గారు, శ్రీధర్ గారు, శ్రీనివాస్ గార్లు,పద్మనాభం గారు సందర్శకులతో బిజీగా ఉండగా మరి కాసేపు అందరం కలిసి గడిపి కొన్ని ఫొటోలు తీసుకుని వీడ్కోలు చెప్పుకుని బయలు దేరాం.
అప్పటివరకూ ఊహల్లో వేరే రూపాలు ఉన్నా, కలుసుకున్న తర్వాత వెంటనే ఎప్పటినుంచో స్నేహితులుగా మసలుతున్న అనుభూతితో ముచ్చటించుకున్నాం అందరం! రూపాలకు ప్రాముఖ్యం లేదని తేలిపోయింది.
నిజంగా ఈ క్రిస్మస్ మరపురానిదే మా అందరికీ!