మధ్యాహ్నం మా పిన్ని కొడుకు బొకారో నుంచి ఫోన్ చేశాడు. పిచ్చాపాటీ కబుర్లయ్యాక టాపిక్ సెలవులవైపు మళ్ళింది. "వెళ్తున్నారా మన వూరికి" అన్నాడు వాడు. "అక్కడ రోజంతా కరెంట్ ఉండదురా, అంత ఎండలు కూడా ఇప్పుడు భరించలేం కదా" అన్నాను."మన చిన్నప్పుడు ఇలా అనుకునే వాళ్ళం కాదు కదే! సెలవుల కోసం ఎంత ఎదురు చూసేవాళ్ళం?" అన్నాడు వాడు గత స్మృతుల్లోకి జారుతూ! నేనూ యధాశక్తి సహకరించి అవి నెమరేసుకున్నాను.
చివరి పరీక్ష ముగుస్తూనే అర్జెంటుగా ఎవరో టెలిగ్రామ్ ఇచ్చినట్లు అందుబాటులో ఉన్న చెత్త సినిమా అయినా సరే చూసేసేవాళ్ళం! మర్నాటి నుంచీ ఏదో పెద్ద ఖాళీగా ఉన్నట్లు పోజులు! కానీ కొద్దిగా కూడా తీరిక దొరికేది కాదు. ఊళ్ళో ఉన్న చుట్టాల పిల్లలూ,కజిన్లూ,విజయవాడ నుంచి మావయ్య కొడుకూ కూతురూ వచ్చేసేవాళ్ళు.
అందరం కల్సి ఎంత హడావుడి, ఓపెన్ గా చెప్పాలంటే భీభత్సం సృష్టించే వాళ్ళమో ! రోజంతా బాదం చెట్టు (ఇప్పుడు లేదు) కింద మడత మంచాలు, నవారు మంచాలు వేసి సీతారాములు(చీట్లు వేసి ఆడే ఆట! స్కోరు గుర్తుందా, రాముడికి వెయ్యి,సీతకి సున్నా! రాముడు సీతను కనుక్కుంటేనే వెయ్యి...)వగైరాలు ఆడేవాళ్ళం.
ఆకలి దప్పులు తెలిసేవి కాదు. అమ్మ పిలిచినపుడు వెళ్ళి తినడం, మళ్ళీ ఆటల్లో పడటం. సాయంత్రాలు బావి దగ్గర మగపిల్లలంతా వరసబెట్టి స్నానాలు చేయడం,(బట్టలు ఉతకలేక సీతారావమ్మ చచ్చిపోయేదనుకోండి...) ఆడపిల్లలకు అమ్మ,అత్తయ్య(మా పక్కిల్లే) కూచోబెట్టి జడలు వేయడం....ఇల్లంతా ఏదో పెద్ద తిరణాల్లా ఉండేది.
ఆకలి దప్పులు తెలిసేవి కాదు. అమ్మ పిలిచినపుడు వెళ్ళి తినడం, మళ్ళీ ఆటల్లో పడటం. సాయంత్రాలు బావి దగ్గర మగపిల్లలంతా వరసబెట్టి స్నానాలు చేయడం,(బట్టలు ఉతకలేక సీతారావమ్మ చచ్చిపోయేదనుకోండి...) ఆడపిల్లలకు అమ్మ,అత్తయ్య(మా పక్కిల్లే) కూచోబెట్టి జడలు వేయడం....ఇల్లంతా ఏదో పెద్ద తిరణాల్లా ఉండేది.
ఎన్ని కిరాణా సరుకులు, చిరుతిళ్ళు తెచ్చినా ఇట్టే అయిపోయేవి. ఆటల్లో పడి తెలీకుండానే రాక్షసుల్లా తినేవాళ్ళమనుకుంటా! అమ్మ ఎంతెంత వంటలు చేసేదో పాపం..విశ్రాంతే ఉండేది కాదు! అప్పుడు తెలీలేదు అమ్మను పట్టించుకోవాలని!
ఎండగా ఉన్నా, బాదం చెట్టు కింద నుంచి కదిలేవాళ్ళం కాదు.రస్నా కలుపుకుని తాగడాలు,అమ్మ ఆవకాయ కలిపిన రోజు ఆవకాయ కలిపిన బేసిన్ లో అన్నం కలిపి ముద్దలు పెడితే (ఇది దాదాపు అందరికీ అనుభవమే) ఎగబడి తినడాలు ఇలా గడిచిపోయేవి.
వీళ్ళల్లో ఇంజనీరింగ్ ఫైనలియర్,డిగ్రీ ఫైనలియర్ చదివే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. కజిన్లందరితో కల్సి సెలవులు మా ఇంట్లో గడపడం ఒక మజా అన్నమాట. పేకాట,వగైరా ఆటల్లోకి పిల్లలమైన మమ్మల్ని రానిచ్చేవాళ్ళు కాదు. ఆ సమయాల్లో మేము దాడి,పరమపద సోపాన పటం వంటివి ఆడాల్సివచ్చేది.
వెన్నెల రాత్రులు మరీ అందంగా ఉండేవి. వెన్నెలా నీడా ఆటలాడటం, వెన్నెల్లో పెద్ద పువ్వులాగ పడ్డ కొబ్బరి చెట్టు నీడలో మంచం వేసుకుని వెన్నెల్ని పరిశీలించడం, జామచెట్టెక్కి దూకడాలు,గేటెక్కి అక్కడ అల్లుకున్న సన్నజాజి పందిరి మీద మొగ్గలు కోయడం,దానితో పాటే ఎర్రచీమల చేత కుట్టించుకోడం అన్నీ బాగుండేవి.
రాత్రుళ్ళు ఆరుబయటే నిద్రలు కాబట్టి అమ్మ ఎర్రని కూజాలో నీళ్ళు నింపి పెట్టేది.(దాన్ని కమండలం అనాలిట) సింహం మూతి ఉండేది దానికి. దాహమైనా కాకపోయినా అందులో నీళ్ళు వంచుకుని తాగడం ఒక ఫాసినేషన్!
నెలన్నర ఇలాగే గడిచేది. వచ్చే క్లాసు పుస్తకాలు కొనడాలు,యూనిఫారాలు కుట్టించుకోడాలు ఇవన్నీ జూన్ 13 తర్వాతే! వీళ్ళలో మగపిల్లలు ఎంత అల్లరి చేసేవాళ్ళంటే వాళ్ళు ఎప్పుడొస్తారా అని ఎంతగానో ఎదురు చూసి చూసి, వాళ్ళు వచ్చిన మర్నాడే "వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతార్రా బాబూ"అనిపించేంత ఘోరమైన అల్లరి.
సెలవులు ముగిశాక వీడుకోలు చాలా ఉద్వేగ భరితంగా ఉండేది. ఏడుపులు....దిగుళ్ళు, నాన్నగారి తిట్లు...అదో పెద్ద గోల!
* * * *
ఇదంతా చెప్పుకుని నేనూ మా అన్నయ్యా ఫోన్లోనే బెంగ పడ్డాం!"ఆ రోజులు భలే ఉండేవిరా! ఇప్పుడు చూడు...పిల్లలకు సెలవులిచ్చినా లాభం లేదు.ఏదో ఒక యాక్టివిటీ,సమ్మర్ కాంపులు,లేదా మరోటి! ఏప్రిల్లోనే కొత్త పుస్తకాలూ,యూనిఫారాలు, ఎంత బర్డెనో వీళ్ళకి. వచ్చే అకడమిక్ ఇయర్ కి ఇప్పటినుంచే తయారు కావడం! ఏవేవో కోచింగులు!ట్యూషన్లు! ప్రతొక్కరూ పండితుడో, పండితురాలో కావాలని అందరికీ ఆశే" అని నేనూ.....
"ఏమి కోచింగులో ఏమో! అమ్మమ్మ ఇంటికో బామ్మ ఇంటికో వెళ్ళి సిటీలకు దూరంగా కొన్నాళ్ళు గడిపే చాన్సే లేదు వీళ్ళకి. రిటైర్ కాగానే బామ్మలూ,తాతయ్యలూ కూడా ఇక్కడికే వస్తున్నారుగా! పిల్లల్ని ఇంట్లోంచి బయటికి పంపాలంటే భయమాయె! ఎవరేం చేస్తారో తెలీదు. ఎంత సేపూ కంప్యూటర్ గేములో, లేక టీవీ చూడ్డమో....పిల్లలు సహజత్వానికి కొద్ది కొద్దిగా దూరమైపోతున్నారని బెంగగా ఉంది నాకు.."అని వాడూ ఒకరి బాధ ఒకరు చెప్పుకున్నాం!
ఏదో సీడీ కావాలని మా ఇంటికి వచ్చిన మా బంధువులమ్మాయి మైథిలి (ఇంటర్మీడియెట్ పరీక్షలు రాస్తూంది) ఇదంతా వింటూ కూచుంది.
నేను ఫోన్ పెట్టేసి ఇంకా ఆపాత మధురిమల్లోంచి తేరుకోకముందే గొంతు సవరిచుకుని ఇలా అంది.....(ఇంకో మాటలో నాకు క్లాసు తీసుకున్దన్నమాట)
"నాకు తెలీకడుగుతానూ, మీరంతా(తల్లిదండ్రులు) ఈకాలం పిల్లలమీద ఎందుకింత జాలిపడుతుంటారు? మాకేం తక్కువైందని? హాయిగా చదువుకుంటున్నాం,ఇష్టమైన పనులు చేయడానికి డబ్బు మీరు ఎంతోకొంత ఖర్చు పెడుతున్నారు! మీరు తొటల్లో,దొడ్లలో ఆడుకుంటే మేము పార్కుల్లో,ప్లే గ్రౌండ్స్ లో ఆడుకుంటున్నాం! మీరు పదిమంది ఉంటే మేము ఇద్దరమో ముగ్గురమో ఉంటాం!అయితే ఏంటి?
ఏదైనా సరే నేర్చుకోడానికి మాకు ఉన్నన్ని అవకాశాలు మీకున్నాయా? కంప్యూటర్ అనేది మీ చిన్నప్పుడే ఉంటే మీరు ఇంకా ఎన్నో నేర్చుకునేవాళ్ళు కాదూ? అన్నింటిలోనూ ముందుండాలనీ,ఏదో ఒకటి నేర్చుకోవాలని అనుకునే పిల్లలకు మీ మాటలు ఎంత నిరాశ కల్గిస్తాయో తెలుసా?
సెలవుల్లో అమ్మమ్మ ఇంటికో,బామ్మ ఇంటికో వెళ్ళి నెలల తరబడి వాళ్ళను పట్టుకు వేలాడితేనే సెలవులు ఎంజాయ్ చేసినట్లా? అసలు మాకున్నన్ని అవకాశాలు మీకు లేవని బెంగ పడరే?
మా బాల్యాలు కూడా మీ బాల్యం లాగే గడవాలని మీరు కోరుకోవడం ఏమిటి?మా అమ్మ కూడా ఇంతే!ఎప్పుడూ మాకేదో అన్యాయం జరిగిపోయినట్టు "వీళ్ళకసలు జీవితమే తెలీట్లేదు" అని ఓ..బాధపడుతూ ఉంటుంది.
మీ జీవితాలని మీరు ఎంజాయ్ చేసినట్లే మా జీవితాలు మేమూ ఎంజాయ్ చేస్తున్నాం! మా యాక్టివిటీలు,ఫ్రెండ్స్,కంప్యూటర్ గేములు, సిటీ లైఫ్ అన్నీ బాగానే ఉన్నాయి మాకు.
మీకూ మాకూ ఉన్న ఇంటర్ జనరేషన్ గాప్ ని మీరు ఎందుకు అర్థం చేసుకోరు?"మీలాగే"మేమూ ఉండాలని "మీలాగే" మేమూ బతకాలని ఎందుకు కోరుకుంటారు?
మీ మాటలు వింటుంటే గొప్ప గందరగోళంలో పడిపోతున్నాం మేము! మేము బతికేది సరైన పద్ధతి కాదా?అని మళ్ళీ మళ్ళీ ఆలోచించుకునేలా చేస్తున్నాయి మీ మాటలు.మేము సుబ్బరంగా ఉన్నాం! జీవితాల్ని కోల్పోడం లేదు.
ఎప్పుడూ "ఆ రోజులు" అంటూ పాతకాలంలోకి వెళ్ళిపోతూ.. మమ్మల్నీ అటు లాక్కుపోయే ప్రయత్నం చేయకండి. మేము రాము...." అంది
అంటే ఇదంతా ఆ పిల్ల ఇలాంటి తెలుగులో చెప్పలేదు. చదివే వాళ్ళకు అనుకూలంగా ఉండాలని నేనే అనువదించాను.
ఆ అమ్మాయితో నేను త్వరలో మాట్లాడతాను, పరీక్షలయ్యాక! దాని మాటలు నన్ను ఆలోచనలో పడేశాయన్నది ఒప్పుకుంటున్నాను!(అంటే నన్ను మార్చేసాయని కాదు)
మైథిలి మాటలని మీరైతే ఎలా అర్థం చేసుకుంటారు?ఏమని జవాబిస్తారు? తెలుసుకోవాలని ఉంది.
రాసేముందు ..ఒక్కసారి మీ చిన్నప్పుడు మీ వేసవి సెలవులు ఎలా గడిచాయో గుర్తు చేసుకుని రాయండి.
