Showing posts with label సమాజం. Show all posts
Showing posts with label సమాజం. Show all posts

February 10, 2012

టీచర్లూ ఇకపై జాగ్రత్త!!


అదీ సంగతి!

ఇహ నుంచి టీచర్లు రోజూ వొణికి ఛస్తూ ఉండాలి! ఏ పిల్లాడు ఏ కత్తి పొట్టలో గుచ్చుతాడో, ఏ పిల్ల ఏ బాణం గుండెలో విసురుతుందో అని!

ఎందుకంటే ఒక్కోసారి ఇలాంటి సంఘటనలు గొలుసుకట్టులాగా వరసాగ్గా జరుగుతాయి.

 కాబట్టి కొన్నాళ్లు టీచర్లు పిల్లల్ని గారాబం చేస్తూ గడిపెయ్యాలి.పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి శ్రద్ధగా చదవాలనో, వర్క్ సరిగ్గా చెయ్యకపోతే మీ అమ్మా నాన్నలకు చెప్తాననో బెదిరించారనుకోండి. సెలవుల తర్వాత ఆ టీచర్లు స్కూలుకు రారు. స్టాఫ్ రూములో ఫొటోకి దండ ఉంటుందేమో చెప్పలేం!

టీచర్ మరణించింది కాబట్టి సానుభూతితో ఇది రాయడం లేదు నేను. చాల్రోజుల బట్టీ corporal punishment గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. పిల్లల్ని కొట్టడం, అవమానించే మాటలు మాట్లాడ్డం, మెడలో బోర్డులు కట్టడం ఇవన్నీ ఎవరూ అంగీకరించరు. తల్లిగా నేనూ అంగీకరించను.

ఎల్కేజీలో (ఎల్కేజీలో...!!) సంగీతం క్లాసులో మా పాప పక్క పిల్లతో కబుర్లు చెప్తోందని సంగీతం టీచరు దాన్ని ఎండలో నిలబెట్టింది. I will attend music class properly! అని పది సార్లు చెప్పించిందని తెల్సి స్కూలుకు వెళ్ళి ఆ సంగీతం టీచర్ని ప్రిన్సిపాల్ దగ్గరికి  తీసుకెళ్ళి మాట్లాడాను.  తర్వాత ఏదో అయిందనుకోండి!

మా నాన్నగారు  ప్రభావతి టాన్యా టీచర్ కనపడితే చాలు "మా వాడిని (మా చిన్నన్నయ్య)బాగా తన్నండి! మీరసలు ఏమీ భయం చెప్తున్నట్టు లేదు" అని టీచర్ని కూకలేసేవారు. ఆడపిల్లలం కాబట్టి, మాకు మినహాయింపు ఉండేది.

మాది ఆడపిల్లల హైస్కూలైనా, టీచర్లు ఏవీ మినహాయింపులు ఇచ్చేవారు కాదు.  అసలు ఎక్కడైనా సరే, పిల్లల్ని కొట్టే అవకాశం లెక్కల మేష్టార్లదీ, పీ ఈ టీలదీనూ!మా అత్తగారు, మామగార్లు కూడా టీచర్లే! వాళ్లనడితే వాళ్ళూ పిల్లల్ని రెండు   దెబ్బలు వెయ్యకుండా ఎలా కుదురుతుందన్నారు. :-))

మా చిన్నన్న తిన్నన్ని దెబ్బలు ఇంట్లోనూ స్కూల్లోనూ కూడా మా ఇంట్లో ఎవరూ తిన్లేదు. అయినా సరే ప్రభావతీ టాన్యా మేడమ్ కనపడితే ఈ రోజుకీ వాడు మోకాళ్ళ వరకూ వంగి నమస్కరిస్తాడు. హైద్రాబాదు నుంచి ప్రత్యేకం స్వీట్లు,గుంటురు జిల్లా చలికే ఆవిడేదో వణికిపోతున్నట్టు శాలువాలూ పట్టుకెళ్తాడు. కొట్టిన క్షణంలోనో, తిట్టిన క్షణంలోనో కోపం ఎవరికైనా వస్తుంది కానీ చంపి పారేసేంత కసి గూడు కట్టుకుంటుందా? ఏమోనబ్బా మరి!

చంపడమా?... ప్రాణం తీయడమా? ఒక మనిషి ని లేకుండా చేయడమా?

ఇప్పుడు ప్రైవేటు స్కూళ్లు బాగా వేళ్ళూనుకున్నాక శారీరక శిక్షలు ఉండకూడదని రూలు! వారి మనో భావాలు గాయపడేట్లు ఏమీ మాట్లాడకూడదు.

పిల్లలు మాత్రం ఆరో క్లాసు నుంచే టాయ్ లెట్ల గోడల మీద సృష్టికార్యాల చిత్రాలు గీయవచ్చు, సెల్ ఫోన్లు తెచ్చి పాఠం చెప్తున్న టీచర్ల నడుములను ఫొటోలు తీయవచ్చు, వాటిని సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలోనూ పెట్టొచ్చు, టీచర్లకు భయంకరమైన నిక్ నేములు పెట్టి వాళ్లని ఈ సైట్లలో తిట్టనూ వచ్చు, ఆడపిల్లలు కూడా మగ పిల్లలకు ఫోన్లలో ప్రేమ సందేశాలు పంపవచ్చు,అదేమిటంటే టీచర్లను వేసెయ్యనూ వచ్చు!

ఇద్దరు ముగ్గురు టీచర్లతో మాట్లాడాక చెప్తున్నా..ఇవాళ ప్రైవేట్ స్కూళ్లలో పని చేసే టీచర్లు ఎదుర్కొనే ఒత్తిడి అంతా ఇంతా కాదు. కోపం మనవ సహజం! రోజంతా పిల్లల మధ్య గడిపి, వారికి పాఠాలు చెప్తూ, వెనక పడిన విద్యార్థుల మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, వాళ్ళ అల్లరిని భరిస్తూ ఉండే టీచర్లు ఈ కోపాన్ని అణచి పెట్టాలి. నాకు తెలిసిన ఒక స్కూల్లో టీచర్ సెల్ఫోన్ తో ఆడపిల్లల్ని వీడియో తీసిన ఒక విద్యార్థి నుంచి ఆ ఫోన్ లాక్కుని "ఇంకోసారి ఇలా చేశావంటే తోలు తీస్తాను" అనడంతో ఆ పిల్లాడు "టీచర్ తనను చంపుతానని బెదిరించిందని  ఇంట్లో చెప్పడంతో పెద్ద గోలైపోయింది. 

ఒకప్పుడు టీచర్లు కొట్టడమనేది సమస్యే కాదు. ఇపుడు ఇంటికి ఒకరో ఇద్దరో యువరాజులూ, యువరాణులూ బయల్దేరారు కాబట్టీ, లక్షల కొద్దీ డబ్బు పోసి స్కూళ్లలో సీట్లూ, చదువులూ కొనేస్తున్నాం కాబట్టి పిల్లల్ని ఒక మాట అనడానికి వీల్లేదు, ఒక దెబ్బ వేయడానికి వీల్లేదు.

ఏమన్నా అన్నారనుకోండి, ఉన్నాయిగా మన ఛానెళ్ళూ డైరెక్ట్ గా వాళ్ల దగ్గరికెళ్ళిపోతే సరి!  "ఆచార్య దేవో భవ అనిపించుకోవలసిన ఉపాధ్యాయులే రాక్షసుడైన వేళ.."  అంటూ హృదయ విదారకంగా హెడ్ లైన్స్ పెట్టి ఇంటి చుట్టు పక్కల వాళ్ళనీ, ఎరక్కపోయి ఆ దార్లో పోయే వారినీ కూడా మొహాల్లో కెమెరాలు పెట్టి ఇంటర్వ్యూలు చేసి "టీచర్లు నశించాలి" అని బలవంతంగా వాళ్ల చేత అనిపించేసి "హమ్మయ్య, ఇవాళ ౩౦ మినిట్స్ కి టాపిక్  వెదుక్కోక్కర్లేదు" అని సంతోషించి, వీలైతే ఆ మర్నాడు కూడా పొద్దున్నే ఏడున్నరకు చర్చ పెట్టి, దానికి ఇర్రెలవెంట్ గా మహిళా సంఘాల వాళ్ళని కూడా పిల్చి...ష్ అబ్బా! ఇదో పెద్ద స్ట్రెస్సూ! 

అసలు పోలీసుల కంటే, ప్రభుత్వం కంటే, ఏ డిపార్ట్ మెంట్ కన్నా కూడా మీడియా వాళ్లే బోల్డు బాధ్యత మీద వేసేస్కుని (ఎవరు అడిగారనో) ఎక్కువ పని చేసేస్తూ ఉంటారు. మన జీవితాల్లో మనకంటే వీళ్ళ ప్రమేయమే ఎక్కువ.

పిల్లలకు ఆరేడు క్లాసుల నుంచే సెల్ ఫోన్లు ఎందుకివ్వాలో, పోనీ ఇస్తే దానితో వాళ్ళేం చేస్తున్నారో, స్కూల్లో వాళ్ల ప్రవర్తన ఎలా ఉందో,టీనేజర్లుగా వాళ్ళ మనసులో రేగే ఆలోచనలేమిటో పట్టించుకునే తీరిక తల్లిదండ్రులకు లేదాయె!

ఏం చేస్తాం? కర్ణుడి చావుకున్నట్టు ఇలాంటి సమస్యలకు ఒక కారణం కాదు.వందల్లో ఉన్నాయి.
పిల్లలు పసి మొగ్గలే! వాళ్ళని కొట్ట కూడదు, నిజమే! కానీ టీచర్లను కూడా అర్థం చేసుకోండి. మన డబ్బుల్తో వాళ్ళకు జీతాలిస్తున్నంత మాత్రాన వాళ్ళని పిల్లల పాలిట రాక్షసులుగా చిత్రించి చూడ్డం మానండి!

ఇవాళ టీచరు! రేప్పొద్దున మార్కులు సరిగా రాలేదనో,అల్లరిచేస్తున్నావనో గద్దించే ఏ తల్లికో తండ్రికో ఈ గతి పట్టదని ఎవరం హామీ ఇవ్వగలం? 

విద్యా వ్యవస్థలో మార్పు రావాలి________అని కాకుండా ఈ పరిస్థితి ఎందుకేర్పడిందో, ఎలా నివారించుకోవాలో ఏమైనా సలహాలివ్వండి..తల్లిదండ్రులుగా మీకు తోచిన నాలుగు మంచి మాటలు చెప్పండి. తల్లి దండ్రులు కాని వాళ్ళు కూడా చెప్పండి.. మంచి మాటలేగా!



December 10, 2010

యదార్థ వాది -లోక విరోధి!(జేపీ)



చాలా రోజుల తర్వాత ఇవాళ జేపీ మాటలు నాకు చాలా చాలా నచ్చాయి!ఎందుకంటే ఈ మధ్య జేపీ అసలేమీ మాట్లాడకుండా, తెలంగాణా మీద ఏ వైఖరీ తేల్చకుండా ఉండటం నాకు నచ్చడం లేదు.

"రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు ఉద్యమాల పేరుతో బలవంతపు వసూళ్ళకు పాల్పడుతున్నాయని లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ్ ఆరోపించారు. చట్టాలకు లోబడి మాత్రమే కేసులు ఎత్తివేయాలన్న ఆయన  హింసాత్మక బలవంతపు వసూళ్ళకు పాల్పడిన వాళ్లకు మినహాయింపు ఇవ్వడం సరికాదన్నారు." (ఈనాడు.నెట్ ) 


ఉద్యమాల సమయంలో హింస, విధ్వంసాలకు పాల్పడినవారిపై కేసులు ఎత్తివేయాలనటం సమంజసం కాదని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ చట్టాన్ని ఉల్లంఘించే అధికారం ప్రభుత్వానికి కూడా లేదన్నారు. ప్రభుత్వం ఉన్నది ఇలాంటి చర్యలను ప్రోత్సహించేందుకు కాదన్నారు. ఉద్యమాల సమయంలో విద్యార్థులు, ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని హోంమంత్రి చిదంబరం ప్రకటన సరికాదన్నారు. 


ఉద్యమాల ముసుగులో కొందరు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఇటువంటివి జరుగుతున్నా ప్రభుత్వం నిస్తేజంగా ఉందని ఆయన విమర్శించారు. భయంతోనే వసూళ్ల బాధితులు  ఫిర్యాదు చేయటం లేదన్నారు --సాక్షి

ఈ మాటల్లో తప్పుందో లేదో పార్టీలకతీతంగా ఆలోచిస్తే  ఎవరికైనా అర్థమవుతుంది. నిజానికి ఆయన ఏ పార్టీ పేరూ ఎత్తలేదు. కానీ  ఆయన వ్యాఖ్యలు తగిలిన వారు మాత్రం వీరంగాలు వేసి "సో కాల్డ్ మేధావి గారు" అంటూ ఎద్దేవా చేస్తూ వసూళ్ళకి సాక్ష్యాలు చూపించమని సవాళ్ళు విసిరారు. అప్పుడే లోక్ సత్తా ఆఫీసుల్లో విధ్వంసానికి కూడా దిగారు.

ఇలాంటి వసూళ్ళు ఎవరైనా ఆడియో, వీడియో సాక్ష్యాలు పెట్టుకుని చేస్తారా? పోనీ సినిమా నిర్మాతలో,వ్యాపార సంస్థలో ముందుకొచ్చి సాక్ష్యం చెప్పే పరిస్థితి ఉందా?

ఉద్యమం సరైన దారిలో నడవటం లేదనీ, అక్రమ వసూళ్ళ వంటివి ఎక్కువై సరైన నాయకత్వమే లేకుండా పోతోందనీ తెలంగాణా వాదులే నిస్పృహ చెందిన సందర్భాలున్నాయి.

"Do question, when some thing is wrong అని చెప్పే జేపీ ఇవాళ దాన్ని చేసి చూపించారు.


దోపిడీ, అత్యాచారం వంటి సంఘటనల పట్ల కూడా ఇవాళ రాజకీయ నాయకులు "పార్టీ దృక్పథంతో" ఆలోచించి లాభ నష్టాలు బేరీజు వేసుకుని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో పార్టీ స్పృహ లేకుండా ఒక మామూలు మనిషిగా మాట్లాడాడు జేపీ! ఒకే ఒక్కడనిపించాడు  !

వీడియో చూడండి, జేపీ ఏ ఒక్క ప్రాంతాన్నీ, ఉద్యమాన్నీ ఉద్దేశించలేదు. పైగా "ప్రాంతాలకతీతంగా" హింసను ప్రేరేపించే వ్యక్తుల మీద చర్య తీసుకోవాలన్నారు.

ఒక సామాన్య పౌరులుగా ఆలోచించి చెప్పండి, జేపీ మాటల్లో తప్పుందా?

 "సో కాల్డ్ మేధావి గారి అడ్డగోలు మాటలు"గా వాటిని వీళ్ళు నిర్ణయించేశారు !


ఆయన వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే హైద్రాబాదులో తిరగనివ్వరట.
ఏమిటీ బెదిరింపులు? ఎంతవరకు ఇలా?

ఇది నేను లోక్ సత్తా మెంబర్ గానో, జేపీ అభిమానిగానో రాయడం లేదు. నేనసలు ఈ మధ్య   పార్టీ పద్ధతులు కొన్ని నచ్చక  లోక్ సత్తాలో యాక్టివ్ గా లేను  :-)) 







May 19, 2010

ఇక్కడ ఎవరి ప్రాణాలు వాళ్ళు రక్షించుకోవాల్సిందే!

భయం భయం! అనుక్షణం భయంతో బతకడం ఏం బావుంటుంది? తిండి నీళ్ళు లేకపోయినా బతకొచ్చు గాని మనశ్శాంతి లేకుండా ఎలా?

షాపింగ్ మాల్స్ లో మల్టీ ప్లెక్సుల్లో లోపలికి వెళ్లగానే నిలేసి ఒళ్ళంతా తడిమి రక్షణ పరీక్షలు చేయడం మొదలైన రోజుల్లో నేను చాలా అవమాన పడేదాన్ని!"నాకా? నాకా ఈ పరీక్షలు!ఈ దేశ పౌరురాలిని, నన్నా, మీరు అనుమానిస్తున్నది?"అని కుమిలేదాన్ని!తర్వాత కన్వీనియెంట్ గా అలవాటు పడిపోయాను.




లోపల అడుగు పెడుతుండగానే మనల్ని ఎక్స్ రే కళ్ళతో అనుమానంగా చూస్తూ

"నువ్వు తీవ్రవాదివా? ఏదీ నీ బాగ్ లో ఏముందో చూపించు! ఆయుధాలేమీ తేలేదు కదా! కొంపదీసి నీ తోటి పౌరుల్ని చంపే ప్లానేదీ లేదు కదా!నీ మొహం చూస్తే అలాగే ఉంది గానీ కాస్త పక్కకి రా! నీ సంగతేంటో చూడాలి"  "అని షాపింగ్ మాల్స్ వద్దా, సరదాగా సినిమా చూద్దామని వెళితే అక్కడా,చివరికి బియ్యం, కందిపప్పు కొందామని వెళితే కూడా నిలువెల్లా పరీక్షలు చేసే పరిస్థితికి హైదరాబాదీయులు (మిగతా నగరాల్లో ఉన్నా, ఇంత తీవ్రంగా భయోత్పాత వాతావరణం ఉండదని నా విశ్వాసం)బాగా అలవాటు పడిపోయారు.



పోనీ అవేమన్నా సక్రమంగా జరుగుతాయా అంటే అదీ లేదు. జీవీకే వన్ వంటి మాల్ వద్ద కూడా మహిళలని చెక్ చేసే మహిళా సెక్యూరిటీ గార్డులు చాలా అలసత్వంతో ఉంటారు. ఇద్దరు ఉంటారు కాబట్టి సమకాలీన రాజకీయాల గురించో,వాళ్ల వీధిలో మంజీరా నీళ్ళెప్పుడొస్తాయో మాట్లాడుకుంటూ బాగ్ తెరిచి చూపిస్తున్నా, "సర్లే పదండి"అని పంపేస్తారు. రద్దీగా ఉంటే కొందరు చెకింగ్ లేకుండానే లోపలికి వెళ్ళిపోతుంటారు.

కొన్ని చోట్ల ఈ మాత్రం కూడా పట్టించుకోరు. బంజారా హిల్స్ లోని సినీమాక్స్ లోకి నాలుగైదు సార్లు నన్ను చెక్ చేయకుండానే పంపేశారు. కోకొల్లలు గా ఉన్న ఫలానా ఫలానా బ్రదర్స్ అయితే అసలు పట్టించుకోరు.వాళ్ళ సెక్యూరిటీ అంతా మాల్ లో సరుకు బయటికి పోకుండా ఉండేందుకే తప్ప, లోపలికి ఏం వెళుతున్నాయో అనే దాని మీద కాదు. అది ఈ మధ్యనే ఒక మాల్ లోకి పోలీసులు విజయవంతంగా లోపలికి పేలుడు పదార్థోలో ఆయుధాలో పంపడంతో రుజువైంది.

పరిస్థితి ఇంతగా విషమించి, పక్కన పోయే ప్రతి వాడినీ  "ఎవరు నువ్వు?కొంపదీసి తీవ్రవాదివా" అని అనుమానిస్తూ తొలగిపోయే రోజులొచ్చాయి!
అసలు ........
విపరీతమైన వాహనాల రద్దీ, ట్రాఫిక్ సమస్యలు, జన సమ్మర్థం ఉన్న చోట గ్రోసరీ సామాన్లు సైతం అమ్మే షాపింగ్ మాల్స్ కి అనుమతి ఇవ్వ కూడదు.

ఇక్కడ పార్కింగ్ దొరకదు,
వాలెట్ పార్కింగ్ ఉండదు,
పార్కింగ్ లో సరైన పర్యవేక్షణ గానీ, ఒక గార్డు కానీ ఉండడు.
చుట్టూ బోల్డన్ని షాపులు.
పైగా వీళ్ళు నెలకోసారి "సబ్ సే సస్తా వీక్" లాంటి స్కీములు, డిసెంబర్ నెలాఖరులో  "క్లియరెన్స్ సేలు"వగైరాలు ప్రకటిస్తుంటారు.

దానితో జనం విరగబడి వస్తారు.అలాంటపుడు ఏ బాంబైనా పేలితే? పోయిన ప్రాణాలకు ఎవరు జవాబుదారీ?

అంతా జరిగాక, ఆ భవనానికి అసలు అనుమతే లేదనీ,పార్కింగ్ తగినంతగా లేదనీ, ఏవేవో తవ్వి తీస్తారు, చేతులు కాలాక!

లేటెస్ట్ గా శ్రీమాన్ వికారుద్దీన్ గారి చొరవతో జరిగిందని భావిస్తున్న కానిస్టేబుల్ హత్య తర్వాత ఇక పోలీసుల హడావుడి చెప్పనలవి కాదు.

ఇందులో ముఖ్య బాధితులు టూ వీలర్స్, అందునా యువకులు!ఆ బండి నడిపేవాడి వద్ద ఒక బాక్ పాక్ ఉందంటే దాదాపుగా పక్కకి ఈడ్చుకెళ్ళినంత పని చేయడమే! లైసెన్సులూ వగైరాలన్నీ చెక్ చేసి అన్నీ సక్రమంగా ఉంటే పంపిస్తారా అంటే అదీ లేదు! ట్రాఫిక్ వాళ్ళ లాగా డబ్బు వసూలు చేయడం! నిర్లక్ష్య ధోరణిలో మాట్లాడ్డం,ఏకవచనంలో సంబోధించడం,విసురుగా బాగులు లాక్కుని చెక్ చేయడం ఇవన్నీ నిన్న ఒక కూడలిలో రెడ్ సిగ్నల్ వద్ద కారాగినపుడు తీరిగ్గా గమనించాను.


ఇదంతా ఎన్నాళ్ళంటే మరో నాల్రోజులు! ఈ లోపు అందరూ నెమ్మదిగా ఈ విషయాన్ని మర్చిపోతారుగా!మళ్ళీ మామూలే! మళ్ళీ ఏదన్నా హత్యో,బాంబు బెదిరింపులో రాగానే కథ మళ్ళీ మొదలు!
అంత "కాజువల్" గా మొక్కుబడిగా అయిపోయింది వ్యవహారం!

తీవ్రవాదుల  బెదిరింపులు నిత్యజీవితంలో ఒక భాగం అయిపోయినట్టు భయంతో  బతకడం మామూలైపోయింది.
ఎవరన్నా అదేపనిగా మనకేసి చూస్తుంటే భయం, రోడ్డు మీద ఏదన్నా ప్లాస్టిక్ సంచి చూస్తే భయం, నలుగురు ఉన్న చోట నిలబడాలంటే భయం!


వరసగా దాడులు జరుగుతున్నా, ప్రాణాలు గాలి బుడగల్లా పేలిపోతున్నా,  రక్షణ విషయాన్ని ఎందుకు ఎవరూ సీరియస్ గా తీసుకోరంటారు? కానిస్టేబుల్ హత్య తర్వాత అందుబాటులొ ఉన్న ఒక పోలీసు అధికారిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు.

అయితే ఇహ ఎవరి ప్రాణాల్ని వారు రక్షించుకోవలసిందేనా?
ఎన్ని సంఘటనలు వరసగా జరిగినా మనం వాటినుంచి ఏమీ నేర్చుకోలేమా? 9/11 దుర్ఘటన తర్వాత అమెరికా లొ ఒక్క తీవ్రవాద చర్యా జరిగినట్లు నాకు తెలీదు!

మనకెందుకు ఈ అలసత్వం? వరుసగా ఎన్ని దుర్ఘటనలు జరిగినా(అవి చేసింది తీవ్రవాదులా, మావోయిస్టులా అనేదిపక్కన పెట్టండి! ఏ రాయి అయితేనేం జనం పళ్ళు రాలగొట్టుకోడానికి?)ఎంత రక్తం పారినా,మన కేంద్ర,రాష్ట్ర హోమ్ మంత్రులకేం పట్టదు.

ఎంతటి దుర్ఘటన జరిగిందని తెల్సినా ఏ మాత్రం గాభరా పడకుండా,షాక్ తినకుండా ఏ భావమూ ప్రకటించకుండా,అతి నెమ్మదిగా స్పందించగలిగే హోమ్ మంత్రిని మీరెక్కడైనా చూశారా?..ఇక్కడ తప్ప!

కొన్నేళ్ళ క్రితం వరకూ యుద్ధ వాతారణం ఉన్న హాలీవుడ్ సినిమాల్లో మిడిల్ ఈస్టు దేశాల్లో వాతావరణం చూసి "అబ్బ,ఇలాంటి దేశాల్లో జనం ఎలా బతుకుతారో!అక్కడినుంచి వేరే చోటికి పోవచ్చుగా"అనుకునేదాన్ని!

ఈ మధ్య హర్ట్ లాకర్ సినిమా చూసినపుడు ఒకవ్యక్తిని బాంబులతో కట్టిపడేసి పేల్చేసిన దృశ్యం చూసినా పెద్దగా భయం వేయకపోగా ఇలాంటివి మనదేశంలోకూడా మొదలవుతాయేమో అని సందేహం కూడా కల్గింది.


 ఇక్కడ ఎవరి ప్రాణాలు వాళ్ళు రక్షించుకోవాల్సిందే! ప్రభుత్వం ఉందో లేదో తెలీని చోట వేరే ఛాయిస్ లేదు.

February 13, 2010

ఈ బలవంతపు పెళ్ళిళ్ళకు విలువెంత?








ప్రేమ రోడ్డెక్కి చాలా రోజులైంది. అంతకు మించి ఈ మధ్య ప్రేమ మరీ బహిరంగ కార్యకలాపమై పోయి గర్వంగా పబ్లిక్ ప్లేసుల్లో పరుగులెత్తడం మొదలెట్టి కూడా చాలా రోజులైంది.

 "ప్రేమకు పరాకాష్ట(లేదా గమ్యం) పెళ్ళి కాదు" అనే చాలా మంది అభిప్రాయం! వీరితో నేను వాదించబోవడం లేదు.




చల్లని సాయంకాలం ఏ ఇందిరా పార్కో, టాంక్ బండో,నెక్లెస్ రోడ్డో పిల్లలతో కలిసి పోయి కాసేపు మురుక్కాలవ మీదనుంచి వచ్చే మలయ మారుతం ఆస్వాదించాలనుకుంటే కుటుంబాలు చచ్చేంత భయపడే దృశ్యాలు కళ్ళబడతాయి! తల ఎటు తిప్పుదామన్నా ఛాయిస్ లేదు. దుర్గం చెరువు  వైపు పొరపాటున ఏ వీకెండో వెళితే... శివ శివా! సెన్సార్ వాళ్ళు కట్ చేసిన సీన్లన్నీ అక్కడ కనపడతాయి.



దీనికి కారణమేమిటని ఇప్పుడు బాధపడి లాభం లేదు. గ్లోబలైజేషనూ, వివిధ సంస్కృతుల కలయికగా మారిన నగరాలు,కాల్ సెంటర్లూ(ఇవొకటి పాపాల భైరవులు పాపం),ఎక్కడ ఏం చేస్తున్నారో కూడా చూడకుండా పిల్లలకు దండిగా డబ్బులిచ్చే తల్లి దండ్రులూ...ఒకటా రెండా.. కర్ణుడి చావుకున్నన్ని కారణాలు! మొత్తంగా కళ్ళముందే మారిపోయిన సమాజ ముఖ చిత్రం!




వాళ్లెవరో సమాజ పరిరక్షకులు ప్రేమికుల దినం రోజు జంటగా రోడ్డుమీద కనపడిన ప్రేమికులకు పెళ్ళిళ్ళు చేసి పారేస్తామని బెదిరింపు జారీ చేశారు. బానే ఉంది ప్లాన్!



వీళ్ళమీద నాకు దురభిప్రాయం ఏమీ లేదు గానీ కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు వస్తున్నాయి.



బాబూ, ...ప్రేమికుల రోజు మన సంస్కృతి కాదు...నిజమే! ఇంకా మన సంస్కృతి కాని అనేక అంశాలు, ముదనష్టపు విషయాలు అనేకం మన సంస్కృతిలో భాగమైపోయాయి. మీకు ఏ డిసెంబర్ 31 న పబ్బుల్లో అమ్మాయిలు కనపడినపుడో,ఏ ప్రేమికుల దినం రోజు రోడ్లమీద జంటలు కనపడినపుడో ఈ సంస్కృతీ పరిరక్షణ అర్జెంటుగా ఎందుకు గుర్తొస్తుంది? ఏడాదంతా మీరేం చేస్తుంటారు? మీ కార్యకలాపాలేమిటి? ఏదో ఒక రాజకీయ పార్టీకి ఒకానొక శాఖగా ఉండటమేనా?



పిజ్జాలు,బర్గర్లు,మల్టీప్లెక్స్ లు మన దేశానికి కొట్టుకొచ్చినపుడు "ఇది మన సంస్కృతి కా"దని ఎందుకు ఉద్యమాలు చేపట్టలా మీరు?(మీలో ఎంతమంది పిజాలు , బర్గర్లు తినని వారున్నారోమరి)



"ఇదీ మన సంస్కృతి గొప్పదనం"అని యువతరానికి తెలియజెప్పే కార్యాచరణ ప్రణాళిక ఏనాడైనా చేపట్టారా మీరు?

 భారతీయ సంస్కృతి లో శీలానికెంత (శీలమంటే సత్ప్రవర్తన అని అర్థం చేసుకోండి దయచేసి) ప్రాముఖ్యం ఉందో కాలేజీల్లోనూ,యువత ఎక్కువగా ఉండే ఇతర ప్రదేశాల్లోనూ చాటే కార్యక్రమం ఏదైనా ఇంతవరకూ అమలు చేశారా?ఇకముందు చేసే ప్లాను ఏదైనా ఉందా?



"సంస్కృతి"ని ఏమని నిర్వచిస్తారు మీరు?

"మీది టైమ్ పాస్  వ్యవహారమైతే నాలుగ్గోడలమధ్యా ఉంచుకోండి.వీధినపడొద్దు"అని ఏ జంటకైనా చెప్పి చూశారా మీరు?



గాలితో పాటు కొట్టుకుపోయే ఎంగిలాకుల్లా తయారైన కొద్ది శాతం యువతని,వెర్రి తలలు వేస్తున్న వారి అశ్లీల సంస్కృతిని కళ్ళారా చూస్తూ ఏడాదంతా కూచుని ఫిబ్రవరి 13 రాత్రి హఠాత్తుగా నిద్ర లేచి జూలు విదిలిస్తారన్నమాట!



మీ వాదన ఒప్పుకుంటాను!

ప్రేమ అన్న పదానికి తలవంపులు తెచ్చేలా చాలామంది ప్రవర్తిస్తున్నారు.
 ఇక్కడ మీకు ఒక విషయం స్పష్టంగా అర్థం కావడంలా?
 వాళ్ళ ప్రేమలో సీరియస్ నెస్ లేదనీ, అది టైమ్ పాస్ వ్యవహారమనీ తెలీడంలేదా?
ప్రేమ మీద గౌరవం లేనివాళ్ళు మీరు చేసే బలవంతపు పెళ్ళిని గౌరవిస్తారా?

 మీరటు పోగానే ఆ పెళ్ళినీ విదిలించి అవతల పారేస్తారు తప్ప పాతకాలపు తెలుగు సినిమా హీరో హీరోయిన్లలా సూత్రాలు కళ్లకద్దుకుని పారా,తట్టా నెత్తినపెట్టుకుని పొలం పని చేసుకుంటూ పాట పాడుకోరు.

అంటే  , ప్రేమికులకు బుద్ధి చెప్పి సంస్కృతిని రక్షించబోయి చివరికి మీరు చేసే నిర్వాకం ఏమిటంటే భారతీయ వివాహ వ్యవస్థకు అవమానం తెచ్చి పెట్టడం. !

అయ్యవారిని చెయ్యబోతే కోతి అయిందంటే ఇదేనేమో!



ఇంకో మాట!



పేమంటే ఒకరి సాహచర్యాన్ని, సాన్నిహిత్యాన్ని మరొకరు కోరుకోవడం! ఈ సాన్నిహిత్యం జీవితాంతం కావాలని కోరుకునే సీరియస్ ప్రేమికులు కూడా ఉంటారు. జీవితంలో స్థిరపడ్డాక పెళ్ళి చేసుకుని టెన్షన్ లేకుండా జీవించాలనుకునే వారుంటారు. వారి ఉదాత్త ప్రేమను గుర్తించరా? వారిక్కూడా మీకిష్టమైనపుడే  పెళ్ళా? అందర్నీ ఒకే గాటన కట్టి పోలోమని పెళ్ళి పెద్దలుగా అవతారమెత్తితే సరిపోయిందా?



అసలు ప్రేమించుకున్న వాళ్ళంతా పెళ్ళి చేసుకుని తీరాలా అని ప్రశ్నించింది ఒక మీడియా ఛానెల్ ఇవాళ పొద్దున!



ఈ బలవంతపు పెళ్ళిళ్ళ వల్ల మీకొరిగేదేమిటి? రోడ్లమీద జనానికి వినోదం,యువతీ యువకులు భయభ్రాంతులు కావడం తప్ప? ప్రేమించుకున్నవాళ్ళు ఒకరోజు కలుసుకుని బహుమతులిచ్చుకుంటే నష్టమేమిటి?



కాబట్టి, మీకు డబ్బులెక్కువుంటే కనీసపు పెళ్ళి ఖర్చు పెట్టుకోలేని పేదవారెవరైనా ఉంటే వారికి పెళ్ళి చేయించి నాలుగు అక్షింతలు వేయండి!



పెడదారి పట్టిన పిల్లలకు నచ్చజెప్పే పద్ధతి, బుద్ధి చెప్పే పద్ధతి ఇది కాదు! కురుపు లేస్తే దానికి మూలకారణం ఎక్కడుందో వెదికి యాంటీ బయాటిక్ వాడాలి కానీ,కురుపు బారినపడ్డవారిని వేపమండలు తీసుకుని బాదడం కాదు మీరు చేయాల్సిన పని.(చిత్రంగా...యాంటీ బయాటిక్ విదేశీ, వేపమండలు స్వదేశీ...)



పౌరోహిత్యం మీరు చేయాల్సిన పని కాదు కానీ బుద్ధిగా మీ పన్లు మీరు చూసుకోండి!



హాపీ వాలంటైన్స్ డే ప్రేమికులూ!

February 3, 2010

"మనిషి" ఇంకా చావలేదు.

మూడు రోజుల వ్యవధిలో ఒక పచ్చని కుటుంబం మనమంతా నిర్ఘాంతపోయి చూస్తుండగానే కుప్పకూలిపోయింది.దుఃఖ తీరాన దీనంగా నిలిచింది.




వైష్ణవి ని చంపిన తీరు, ఆమె తండ్రి మరణం ఇవన్నీ మనల్ని అందర్నీ కదిలించి వేశాయి. కన్నీళ్ళు పెట్టేలా చేశాయి.హంతకుల్ని ఉరితీయాలని కొందరు, నరికి ముక్కలు చేయాలని కొందరు, చెప్పుతో కొట్టి ఊరంతా తిప్పాలని కొందరు, పెట్రోలు పోసి తగలెట్టాలని కొందరు, పాపను వేసిన బాయిలర్లోనే వేసి కాల్చాలని కొందరు ... టీవీల్లో కూడా సామాన్య ప్రజలు ఆవేశం, ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. "అవును, వాళ్లనలాగే శిక్షించాలి" అని నాకూ అనిపించింది.



ఇక మీడియా ఛానెళ్ళ సంగతి చెప్పక్కర్లేదు. "చేతులు ముడుచుక్కూచున్న మా ఖాకీల్ని క్షమించమ్మా" అని కవిత్వం ఏడుపు గొంతులు పెట్టి మరీ  ఒలకపోశారు. అసలు ప్రతి నేరంలోనూ పోలీసులకంటే ముందే అత్యుత్సాహంతో సగం దర్యాప్తు వీళ్ళే చేసేస్తారుగా!మరి ఈ కేసులో ఏం చేస్తున్నారో!



సమాజం ఇంతగా కుళ్ళిపోవడానికి కారణం ఎవరు?

ఈ రాక్షస సమాజంలో, ఈ జాలి లేని లోకంలో, ఈ ప్రేమ లేని ప్రపంచంలో, ఈ నీతి రహిత సమాజంలో...ఇదీ వరస!

ఈ నేరాలు ఇలా జరగడానికి కారణమెవరు?అని ప్రశ్నలు..పాపం వాళ్ళకేం తెలీనట్లు!వాళ్లకేం భాగం లేనట్లు!



మానవత్వం మంటకలిసింది. సమాజం కుళ్లిపోయింది. రాక్షసంగా మారిపోయింది.మానవ సంబంధాలకు విలువ లేదు.సాటి మనిషనే కన్ సర్న్ లేదు.ఎవరి నోట చూసినా ఇవే మాటలు. బ్లాగుల్లో కూడా ఆవేదన ఇదే స్థాయిలో ఉంది.ఎవర్నీ తప్పుపట్టడం లేదు.ఎందుకంటే నిన్న సాయంత్రం వరకూ నా ఆలోచన్లూ ఇదే బాటలో ఉన్నాయి.


తర్వాత ఆలోచిస్తుంటే కొత్త బాటలో ఆలోచనలు పరిగెట్టాయి.

పసి పాప అన్న జాలి, విచక్షణ లేకుండా చంపిన దుర్మార్గులు నివసిస్తున్న సమాజంలోనే మనమూ ఉన్నాం!


మనం..అంటే..?



పాపతో గానీ, ఆమె తండ్రితో గానీ, ఎటువంటి పరిచయమూలేని పరాయివాళ్ళం!

పాప గుప్పెడు బూడిదగా మారిందని తెలిసి కన్నీరు వర్షించిన వాళ్ళం!

పాప తండ్రి కూడా మరణించాడని తెలిసి భోరున విలపించిన వాళ్లం!


అంత్యక్రియలు చూస్తూ "ఈ బంధాలింతేనా"అని వైరాగ్యానికి గురైన వాళ్లం

అవి ముగిశాక "ఇప్పుడు ఆ తల్లి పరిస్థితి ఏమిటి? బంధువులు బతకనిస్తారా?"అని ఆలోచనలో పడ్డవాళ్లం!


ఆడపిల్లలమీద యాసిడ్ దాడి జరిగితే మన చెల్లికో,కూతురుకో జరిగినంతగా తల్లడిల్లినవాళ్లం!

ఎవరం మనమంతా?
సాటి మనుషులం!


రోడ్డుమీద ఎవరినా బైక్ మీదనుంచి కిందపడితే "అరె!"అని పదిమంది పరిగెడతాం లేపడానికి!

ఈ మధ్య 108 పుణ్యమా అని యాక్సిడెంట్ అయినా వెంటనే పౌరులు స్పందిస్తున్నారు.

అర్జెంట్ గా ఒక పేషంట్ కి ఫలానా గ్రూపు రక్తం కావాలంటే పరిగెత్తుకొచ్చేవారున్నారు.

చికిత్స కోసం డబ్బు లేని పేద రోగుల వివరాలు పేపర్లో చూసి డబ్బు ఇచ్చేవారెంతోమంది.

అనాధ పిల్లలకోసం సహాయం చేసేవారు కొందరైతే ఆ పిల్లల కోసం సమయాన్ని,డబ్బును కూడా వెచ్చించేవారెంతోమంది.(వీరికి ఉదాహరణలు మన బ్లాగర్లలోనే ఉన్నారు.).


ఇటువంటి ఘోరానికి పాల్పడ్డ నేరస్థులు ఎంతోమంది దయార్దృ హృదయులు నివసిస్తున్న ఈ సమాజంలో ఒక చిన్న భాగం! వాళ్ళు కేవలం కాన్సర్ సోకి కుళ్ళిపోయిన ఒక చిన్న భాగం!

ఆ భాగాన్ని మందులతో బాగన్నా చేసుకోవాలి.లేదా నిర్దాక్షిణ్యంగా కత్తిరించి(Amputation)అవతలన్నా పారేయాలి.అది మనచేతుల్లోనే ఉంది.



జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైనదే! కారణాలనేకం కావొచ్చు!


 ఉమ్మడికుటుంబవ్యవస్థ చిన్నాభిన్నం కావడం వల్ల "నాది"అనే స్వార్థం పెరిగిపోవడం, ఇదివరలో విలాసాలుగా ఉన్నవి ఇప్పుడు అవసరాలుగా మారడం,డబ్బు చుట్టూ జీవితాలు గిరికీలు కొట్టడం!

ప్రభాకర్ స్వయంకృతాపరాధం కూడా కొంత కారణం కావొచ్చు.ఇప్పుడు ఆ విషయాన్ని చర్చించలేం!

ఏమైనా,మమతానుబంధాలతో పెనవేసుకున్న రెండు జీవితాలు నిర్దాక్షిణ్యంగా చిదిమివేయబడ్డాయి! ప్రాంతాలతో సంబంధం లేకుండా రాష్ట్రమంతా  కన్నీటితో తడిసి ముద్దయిపోయింది. కన్నీరు మున్నీరైపోయింది.



అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవాళ్ళు,డబ్బుకోసం ఎంత నీచాకైనా దిగేవారు మామూలు జనంతో పోల్చుకుంటే సమాజంలో చాలా స్వల్ప భాగం!(కానీ ఈ స్వల్ప భాగమంటేనే మనకు భయం)



వీళ్లున్నంత మాత్రాన "రాక్షస సమాజం" "కుళ్లిన సమాజం"  "మానవతలేని సమాజం"  "పనికిమాలిన సమాజం" "మృగాళ్లసమాజం" (కొంతమంది అయితే టీవీల్లో దీన్ని మహిళలపై జరిగిన దాడిగా అభివర్ణిస్తూ నేరస్థులకంటే నీచంగా స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు).

వాళ్ల కౄరత్వాన్ని సమాజం మొత్తానికీ ఆపాదించడం ఏ పాటి న్యాయం?



సాటి మనిషి కష్టానికి స్పందించే మనసులు,మనుషులు సమాజంలో ఉన్నంతకాలం ఈ సమాజం రాక్షస సమాజం కాదు.

ఒక తల్లి కన్నీరు తుడవడానికి, ఆమెతోపాటు కన్నీరు పెట్టుకోడానికి ఇన్ని కోట్లమంది ఉన్నపుడు ఈ సమాజం కుళ్లిందని ఎలా అనుకుంటాం!

కష్టంలో ఉన్న మనిషికి ఆసరాగా మనచేయి సాచగలిగినంత కాలం ఈ సమాజం ప్రేమరహితమైంది కాదు.

మనిషి గుండెలో తడి ఉన్నంత కాలం ఈ సమాజం పనికి మాలింది కానే కాదు!

ఎదుటి మనిషి బాధకు మన కంటిలో నీటి చుక్క ఊరినంత కాలం ఈ సమాజం కుళ్ళిపోకుండానే ఉన్నట్లు!


సమాజమంటే మనం! నేరస్థులు కాదు!

ఆ నలుగురు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఒక డైలాగ్ చెప్తాడు."మనిషిని నమ్మాలయ్యా!"అని!
చివర్లో కూడా అంటాడు "ఈ సమాజాన్ని నడిపించేది ప్రేమే అని నాకు తెలుసు, నేనే గెలిచాను"అని!


అవును, ఒక కుటుంబాన్నైనా, మనుషుల మధ్య స్నేహ సంబంధాలనైనా , ఒక సమాజంలో మనుషుల మధ్య బంధాలనైనా నడిపించేదీ, నిలబెట్టేదీ నమ్మకం, ప్రేమలే!

అవి మానవజాతిలో మిగిలి ఉన్నంత కాలం "మనిషి"కి మరణం లేదు

"మనిషి" ఇంకా చావలేదు.


చిన్నారి వైష్ణవి,ఆమె తండ్రి ప్రభాకర్,వారి డ్రైవర్ లక్ష్మణరావుల ఆత్మలకు శాంతి లభించాలని కోరుకుంటున్నాను.

November 23, 2009

వోట్లు- చెప్పరాని పాట్లు!

"చోద్యం చూస్తారా? కదలి వోటు వేస్తారా?"


"మంచివారు వోటు వెయ్యకపోతే దోపిడీదారులదే గెలుపు"


"అవినీతి పాలనను అంతమొందించాలంటే ఓటు వేసి తీరాలి"


"అవకాశం మీది. ఓటు వేయండి. సమర్థులను ఎన్నుకోండి"


"సామాన్యుడి చేతిలో పాశుపతాస్త్రం వోటు"


ఊహూ! ఎంత మంది ఎన్ని రకాలు గా చెప్పినా హైద్రాబాదు వోటరు చెవికెక్కలా!



విద్యాధికులైన వోటర్లు ఎక్కువగా కేంద్రీకృతమైన డివిజన్లలో నిజంగానే చోద్యం చూస్తూ ఇంట్లో ఉండిపోయారు కానీ పోలింగ్ స్టేషన్ కి వచ్చి ఓట్లు వేసిన వారే తక్కువ! హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న వార్డుల్లో పోలింగ్ 30 శాతం దరిదాపుల్లో ఉందంటే వోటరు మనోగతం ఏమనుకోవాలి?



నిరాసక్తతా?

బద్ధకమా?


నిర్లక్ష్యమా?


నిర్వేదమా?



ఇతర కారణాలు...



లాంగ్ వీకెండా?

ఇతర రాష్ట్రాలకు చెందిన నాన్ లోకల్స్ "మనం ఇక్కడ వోటేస్తే మనకు ఒరిగేదేం ఉందిలే"అనుకోడమా?



దాదాపు 40 ఖరీదైన అపార్ట్ మెంట్ భవనాలు  ఉన్న కాలనీలో(ఖరీదైన అని ఎందుకు వాడానంటే అంతా అధికంగా చదూకున్నవాళ్ళే ఇక్కడ ఉండేది అని చెప్పడానికి) అరవై డెబ్భై ఓట్లున్న ఒక్కో బిల్డింగ్ నుంచీ పోలయిన ఓట్లు ఆరు-ఏడు..మాగ్జిమమ్ 10 దాటలేదు ఒక డివిజన్లో!



కొంతమంది లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకుని జామ్మని వెళ్ళిపోయారు. మరికొంత మంది ఇంట్లోనే ఉండి కూడా దగ్గర్లోని పోలింగ్ స్టేషన్ కి రావడానికి "అబ్బ,పోనిద్దూ" అని బద్ధకించారు.



మరోపక్క ఉత్సాహంగా ఓట్లు వేయడానికి వచ్చిన వారికి ఎదురైన చేదు అనుభవాలు..

.వాళ్ళ పేర్లు జాబితాలో లోనుంచి సడన్ గా మాయమైపోవడం,

ఫొటోలు ఎవరివో ఉండటం వల్ల పోలింగ్ అధికారులు అంగీకరించకపోవడం,

లిస్టులో పేర్లున్నా కార్డు చేతికి రాకపోవడం!

 పేర్లలో భయంకరమైన తప్పులు, (కొన్ని చోట్ల మరీ ఘోరంగా) ఉండటం !


కొంతమంది చదువుకున్నవాళ్ళు కూడా , జాబితాలో పేరుంటే  ఫొటో ఐడీ ఏదైనా సరే పనికొస్తుందని తెలీక చేతులూపుకుంటూ వచ్చి వెనక్కి పోవడం!

--------------

ప్రతి ఎన్నికల ముందూ ఓటర్ల లిస్టుని తప్పకుండా "అప్ డేట్" చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ కి ఉందా లేదా నాకర్థం కావడం లేదు.

ఒక పోలింగ్ స్టేషన్ ఓటర్ల జాబితాను పరిశీలిస్తే..రెండేళ్ళ క్రితం ఇల్లు ఖాళీ చేసి దేశమే వదిలి వెళ్ళిపోయిన అనేకమంది పేర్లు భద్రంగా జాబితాలోనే ఉన్నాయి. అలాగే ఇక్కడినుంచి వేరే చోటికి వెళ్ళిన వాళ్ళు అక్కడ జాబితాలో పేరు నమోదు చేయించుకున్న తర్వాత కూడా వాళ్ల పేర్లు ఇక్కడ అలాగే ఉన్నాయి.

అంతెందుకు కొంతమందికి ఒకే జాబితాలో ఒక్కొక్కరికి మూడేసి వోట్లు ఉన్నాయి. మా వాచ్ మనే అందుకు సాక్ష్యం! అతనికి, అతని భార్యకు కలిపి 6 వోట్లు ఉన్నాయి...ఒకటే జాబితాలో! ఇక పేర్లలో, ఫొటోల్లో అవకతవకలకు అంతే లేదు! అదొక మహా సముద్రం!


ఒక ఇంట్లో అద్దెకున్నవాళ్ళకు, ఇంటి వోనర్లకు కూడా అదే చిరునామా మీద వోట్లు జారీ!


నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ జరగకముందున్న పాత కార్డులను మార్చుకోవాలని చా.....లా మంది ఓటర్లకు తెలీదు. ఆ కార్డులను గుర్తించి వాటి స్థానే కొత్త కార్డులను జారీ చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిది కాదా? ఎన్నికలప్పుడు ఊదర గొట్టడం తప్పించి రాజకీయ పార్టీలు ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టకపోవడం న్యాయంగా ఉందా?



ఒక వృద్ధాశ్రమానికి చెందిన అనేకమంది వృద్ధులు ఎంతో బాధ్యతతో ఉత్సాహంగా వోటు హక్కు వినియోగించుకోడానికి వస్తే ...వారి దగ్గరున్నవి పాత గుర్తింపు కార్డులు. అంత శ్రమ పడి చేతి కర్ర సహాయంతో  మరీ వచ్చిన వారిని "మీ పేర్లు జాబితాలో లేవు పొండి" అని చెప్పడం ఎంత బాధాకరం! వారు ఓపిగ్గా "ఇంతకు ముందు ఇవే కార్డులతో వేశాం వోట్లు! మేము వెదుక్కుంటాం"అని జాబితా తీసుకుని వెదుక్కుంటుంటే చూడ్డం ఎంత బాధాకరం!


ప్రతి జాబితాలోనూ సగానికి సగం బోగస్ వోట్లు!


ఈ లెక్కన నిజమైన genuine వోటర్ల జాబితా ఎప్పటికి తయారవుతుంది? అసలు అది జరిగే పనేనా?


ఇలాంటి వాతావరణంలో ఏ మాత్రం నిజాయితీ లేని, నిజం కాని వోటర్ల జాబితాలతో జరిగిన ఎన్నికలకు విలువ ఎంత? ఈ ఎన్నికల ఫలితాలకు మాత్రం విలువ ఎంత?

వోట్లు అడుక్కోడమే కానీ ఇంతవరకూ ఏ పార్టీ అయినా వీటిమీద దృష్టి పెట్టిందా?





కేవలం శాశ్వత చిరునామా కోసం ఒక గుర్తింపు కార్డుగా మాత్రమే ఓటర్ ఐడీ కార్డుని ఉపయోగించుకుంటున్న విద్యాధికుల ఉదాశీనతను ఏమని వర్ణించాలి?


ప్రభుత్వం మారాలనీ, బాగుపడాలనీ, సామాన్యుల వెతలను పట్టించుకోవాలని డిమాండ్ చేసే హక్కు ఇటువంటి ఉదాసీన ప్రజలకెక్కడిది ?వోటు తప్పకుండా వేయాలనే బాధ్యత తెలియని వాళ్లకు   నిలదీసే హక్కు మాత్రం ఎక్కడినుంచి వస్తుంది?

ఇదంతా ఎవరి బాధ్యతా రాహిత్యానికి చిహ్నం? దీనివల్ల చివరికి నష్టపోయేదెవరు?


ఏమిటో, ఇవాళ నాకన్నీ ప్రశ్నలే!

May 19, 2009

పాత పేపర్లతో పసి పిల్లలకు జీవితం!

పొద్దున్నే ఈనాడు పేపరు చూడకపోతే నాకు కాఫీ కూడా తాగాలనిపించదు. ఎంత చెత్తగా వార్తలు రాసినా సరే! దాని తర్వాత   Economic Times, Times of India, ఇవి కాకుండా ఆదివారం ఎడిషన్ కోసం ఆదివారం ఆంధ్ర జ్యోతి, సాహిత్యం పేజీ కోసం సోమ వారం సాక్షి..ఇలా నెల తిరిగే సరికి మా ఇంట్లో బస్తాడు పేపర్లు తయారవుతాయి. ఏం చెయ్యాలి వాటిని? "ఏం చెయ్యడమేం? అమ్మి పారెయ్యొచ్చుగా?" అంటారా!


నిజమే, కానీ చెప్పిన టైముకు డ్రెస్ కుట్టి డెలివరీ ఇచ్చే టైలర్ ని కానీ, పాత పేపర్లు సరిగా తూచే పేపర్ వాడిని కానీ మీరెక్కడైనా చూశారా? నేనైతే ఇంతవరకూ చూళ్ళేదు. కనీసం 30 కిలోల పేపర్లను కళ్లెదురు గానే పేపర్ల వాడు 10 కిలోలు లేక అంతకంటే తక్కువగా చూపించిన సందర్భాలు కోకొల్లలు.



దీన్ని ఒప్పుకోలేక నేను పాత పేపర్లను నెల నెలా మా పనమ్మాయి లక్ష్మికి ఇచ్చేయడం మొదలెట్టాను.'ఎన్ని కిలోల పేపర్లైనా ఎలాగూ అతడు తక్కువగానే తూస్తాడు. ఆ వచ్చే డబ్బులు ఆ అమ్మాయి తీసుకుంటుంది, ఇలాగైనా డుమ్మాలు కొట్టకుండా ఉంటుం'దనే ఆశతో!ఆ పిల్ల లైట్ తీసుకుందనుకోండి.


కొద్ది రోజులు ఇలా గడిచాక మా వాచ్ మన్ కి ఈ విషయం తెలిసింది."ప్రతి నెలా లక్ష్మికేనా మేడమ్, ఈ నెల నాకివ్వండి" అని అడిగాడు. సరే తీసుకోమని ఇచ్చేశాను.


ఇంకేముంది? ఆ రోజు సాయంత్రం కింద పెద్ద గొడవ వినపడి ఏమిటా అని కారిడార్ లోకెళ్ళి తొంగిచూస్తే లక్ష్మి, వాచ్ మన్ దెబ్బలాడుకుంటున్నారు.పేపర్ల గురించే అని అర్థమై సర్ది చెప్దామని కిందకెళితే

 "ఇచ్చే వాళ్లకు బుద్ధి లేకపోతే తీసుకునే వాళ్లకుండాలి" అని లక్ష్మి నన్ను,వాచ్ మన్ ని కలేసి తిట్టింది.
 వాచ్ మన్ కూడా తగ్గకుండా  "మరదే, ఇచ్చే వాళ్లకు లేని నొప్పి నీకేంటి మధ్యలో"
అని నన్ను లక్ష్మి ని కలిపి చీవాట్లేశాడు.

అదండీ సంగతి!రెండు వైపులా నాకే తిట్లు, ఉత్త పుణ్యానికి పేపర్లు ఇచ్చి మరీ!

ఈ నేపధ్యంలో నాల్రోజుల క్రితం ఒక చిన్న బుక్ లెట్ చూశాను. అది Hyderabad Council of Human Welfare కి సంబంధించింది. ఇదొక స్వచ్ఛంద సంస్థ!వీధి బాలల పునరావాసానికి అవిరళ కృషి చేస్తున్న సంస్థ! వీధి బాలలని, ఇతర దుర్భర పరిస్థితుల్లో ఉన్న పిల్లని వీళ్ళు తమ కార్య కర్తల ద్వారా గుర్తించి వారిని చేరదీస్తారు. ఒక తాత్కాలిక హోమ్‌లో వారికి నీడనిచ్చి తమ భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకునే దిశగా వారికి చదువు సంధ్యలను కల్పిస్తారు. కౌన్సిలింగ్ ఇస్తారు. మానసిక వికాసానికి తగిన వాతావరణాన్ని అక్కడ ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత తగిన వృత్తిని చేపట్టి, సమాజంలో గౌరవనీయ జీవితాన్ని గడిపే విధంగా వారికోసం పని చేస్తుందీ సంస్థ!పట్టణాల్లో ఉండే మురికివాడల్లోని స్త్రీలు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారి జీవన స్థితిగతులను మెరుగుపరచే దిశగా కూడా HCHW పని చేస్తోంది.



వీరికీ పాత పేపర్లకీ సంబంధం ఏమిటనేగా ప్రశ్న!


ఈ సంస్థ ఇప్పటివరకూ శ్రేయోభిలాషులు, సహృదయుల విరాళాలతో నడుస్తోంది. అందువల్ల ఈ సంస్థ ఒక వినూత్న పద్ధతిలో విరాళాలు సేకరించాలని తలపెట్టింది. పాత వస్తువులను సేకరించడం.మన ఇంట్లో పోగుపడిన పాత వార్తాపత్రికలు, మాగజైన్లు,ఆటవస్తువులు, ప్లాస్టిక్ బాటిల్స్ మొదలైన వస్తువులను వీళ్ళు మన ఇంటికి వచ్చి సేకరిస్తారు. వాటిని రీ సైక్లింగ్ యూనిట్స్ కి పంపి తద్వారా వచ్చే డబ్బుని పిల్లల సంక్షేమానికి వినియోగిస్తారు. హైదరాబాదు, సికింద్రాబాదు ప్రాంతాలకు మాత్రమే ఇది  పరిమితం!


దీనికోసం ఈ సంస్థ ఆటో డ్రైవర్ని పంపిస్తుంది. అతడు మన ముందే మన ఇంట్లోని పాత పేపర్లను తూకం వేసి రిజిస్టర్ లో నమోదు చేసి మన సంతకం తీసుకుని (దుర్వినియోగం కావని మనకు నమ్మకం కలిగేందుకు) మరీ వాటిని తీసుకెడతాడు. నెల నెలా లేదా రెండు నెలలకోసారి....ఇలా ఇవ్వవచ్చు!ఎప్పుడైనా వారి రికార్డులను మనం కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఈ పనంతా చాలా పారదర్శకంగా జరుగుతుంది.

ఇలాంటి సంస్థలకు సాయం చేయాలని మనసున్నా, ఒకోసారి చేతిలో డబ్బు ఉండకపోవచ్చు! ఇంట్లోని పాత వస్తువులను వారికి డొనేట్ చేయడం ద్వారా కూడా వారికి సాయపడవచ్చని తెలిశాక అనేకమంది ముందుకువచ్చి ఈ సంస్థను ఆదరిస్తున్నారు, తద్వారా వీధి బాలల ను కూడా!


ఇటువంటి పనిలో పాలుపంచుకోవడం,పనికి రాని పాత వస్తువులను ఇవ్వడం ద్వారా వారికి సహాయం చేయడం ...ఒక చిన్న కన్ సర్న్!
ఈ నెల నుంచి మా ఇంట్లో పాత న్యూస్ పేపర్లు,మాగజైన్లు,ఆటవస్తువులు,ఇంకా ఇతరాలు వీళ్లకే! మీరూ చేయికలపాలనుకుంటే వారి వెబ్ సైటు చూడండి.
http://www.hchw.org/

వారి ఫోన్ నంబర్లు 040-23526554 ,040-65505827

ఇలా చేశాక, ఒక చిన్న మంచి పని చేశామనే ఫీలింగ్ మీకు కలగకపోతే చూడండి మరి!

March 9, 2009

"వేలం" వెర్రి !

 



బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 లో రెండు పాత ఫర్నిచర్, మరియు ఇతర పాత వస్తువులు అమ్మే షాపులు

ఉంటాయి. ఎప్పటెప్పటివో వస్తువులు. ఆ షాపులు చూస్తే నాకు విచారంగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి మనింట్లోని సరికొత్త సోఫాసెట్  కూడా అక్కడి పా....త పడక్కుర్చీ అంత విలువ చెయ్యదు.అక్కడ ఒక నగిషీలు చెక్కిన పాత చెక్క పార్టిషన్ అడిగితే(నేను కాదు లెండి) 35 వేలు చెప్పారు ధర. మొన్నీమధ్య మా కాలనీలో ఒక బిల్డింగ్ లో తాపీ పని చేస్తూ అయిదో అంతస్థు నుంచి కాలు జారి పడి ఒక పనివాడు మరణిస్తే 'తాగి ఉన్నాడని" రాయించి అతని భార్యకు 15 వేలు ఇచ్చి ఊరికి పంపించేసారు. ఒక జీవితం కంటే విలువైనదన్నమాట ఆ చెక్క వస్తువు.






నాకు మ్యూజియాలు చూడ్డం ఇష్టం ఉండదు.(వేరే ఊళ్లనుంచి స్నేహితులు వచ్చినపుడు సాలార్జంగ్ మ్యూజియం కి తీసుకెడతాను కానీ నేను రెబెక్కా దగ్గరే ఉండి మొత్తం మీరు తిరిగి రండని వాళ్లను పంపుతాను.) ఆనాటి చరిత్రను తెలిపే వస్తువులు(పుస్తకాలు, వగైరా) తప్పించి, వాళ్ళే గిన్నెల్లో వొండుకున్నారో, కంచాల్లో తిన్నారో, ఏ చెప్పులు వాడారో తెలుసుకోవాలని ఉండదు. అందరూ ఇలా ఉండాలని రూలేం లేదనుకోండి.



ఇలా పాత వస్తువులు వేలం వేసి వాటిని లక్షల్లో కోట్లలో వేలం పాడినపుడు ఇంత విలువుందా వాటికి, ఇంత పాత వాటికి అని ఆశ్చర్యమేస్తుంది. ఎవరు వాడినవైనా సరే! పాత పెయింటింగ్స్,పాత హుక్కాలు, ఎవడో రాజు యుద్ధంలో వాడాడో లేదో తెలీని కత్తులు (టిప్పు సుల్తాను కత్తి ఒక పెద్ద జోకు నాకు)వీటన్నిటినీ కోట్లు పెట్టి వేలం పాడటం ఏమిటి? వాటి విలువ ఎంత? అది మామూలు మనుషుల లెక్కలో ఏ విధంగా లెక్క గడతారు?(పురావస్తు శాఖ లెక్కలు వదిలెయ్యండి).



మనుషుల పట్ల ఉన్న సెంటిమెంట్ వాళ్ళు వాడిన వస్తువుల మీద ఉండదా ఏమిటి? అన్నాడు మా అన్నయ్యొకడు ఈ విషయం ఎత్తితే! మనుషుల మీద సెంటిమెంట్ ఉంటే ఆ మనుషులు బతికినంత కాలం ఎలా జీవించారో, వారి ఆదర్శాలేమిటో,సమాజం పట్ల వారి దృక్పథం ఏమిటో,వారి సుగుణాలేమిటో...అవి కదా మనం అనుసరించాల్సినవి. వాళ్ళ చెప్పులూ,గిన్నెలూ, కళ్ళజోళ్ళూ భద్రపరుచుకుంటే వాళ్ళను గౌరవించినట్లా? సెంటిమెంట్ నిలుపుకున్నట్లా?



ఇప్పుడూ...నేనున్నానండీ!మా మేనత్త అంటే నాకెంతో ఇష్టం. ఆవిడ సుమంగళిగా పోయినపుడు ఆవిడ పట్టుచీరలు నాక్కూడా ఇవ్వబోతే తీసుకోలేదు. అంతంత భారీ పట్టుచీరలు నేను కట్టుకోలేను, బీరువాలో పెట్టి పూజించలేను. అందుకే వద్దన్నాను.



ఆవిడ నా పెళ్ళప్పుడు నాకో మాట చెప్పింది.

"అమ్మలూ,అత్తారింట్లో దేనికీ వాదనలు పెట్టుకోకూడదు. అన్నింటికీ చిర్నవ్వుతూ ఉండాలి. కానీ మనం  అనుకున్నదే చెయ్యాలి. తర్వాత అవతలి వాళ్ళు ఎంత గింజుకున్నా మళ్ళీ చిర్నవ్వుతూ ఉండాలి. దీనికి తిరుగులేదు" ఆవిడ మీద ఉన్న సెంటిమెంట్ తో నేను ఈ సూత్రాన్ని పాటించట్లా? అదీ సెంటిమెంట్ అంటే!



గాంధీ మీద ప్రేమతో, ఆయన వస్తువులు విదేశీయులకు దక్కకూడదని మన ప్రభుత్వం బోలెడన్ని ప్రయత్నాలు తీవ్ర స్థాయిలో చేసి, (ఎంత తీవ్రంగా అంటే వీళ్ళ ప్రయత్నాల వల్ల వాటి వేలం రేటు ఏకంగా మూడు లక్షల డాలర్ల వద్ద మొదలెట్టేంతగా)చివరకు విజయ్ మాల్యా గారు 9 కోట్ల 30 లక్షలు పెట్టి కొనడంతో ఊపిరి పీల్చుకుంది. అక్షరాలా తొమ్మిది కోట్ల ముప్ఫై లక్షలు! ఆ వస్తువులకు భౌతికంగా ఎంత విలువుందో నాకు తెలీదు.



కానీ గాంధీ మీద అంత ప్రేముంటే మనం దాచుకోవలసినవి చెప్పులూ, కళ్ళజోడూ కాదేమో అనిపిస్తోంది నాకు. ఆయన మనకోసం వదిలి వెళ్ళినవి చెప్పులూ, కంచమూనా ? అవి భౌతికంగా ఎవరైనా వదిలి వెళ్ళక తప్పదు. మన కోసం గాంధీ వదిలి వెళ్ళీన ఆదర్శాలు, అహింస, సత్య శీలం, నిరాడంబరత,వీటన్నిటికంటే "పదార్థ విలువ" తప్ప లేని తోలు చెప్పులు, ఇత్తడిగెన్నెకే విలువ ఎక్కువ.



9 కోట్ల 30 లక్షలతో విజయమాల్యా తల్చుకుంటే ఎన్ని పనులైనా చేసి ఉండొచ్చు. బెంగుళూరులోనే ఒక మురికివాడ ను అభివృద్ధి చేసి ఉండొచ్చు. ఆయనకు ఆ మొత్తం ఒక లెక్కలోనిది కాదు. టిప్పు సుల్తాను ఖడ్గానికే కోటీ అరవై లక్షలు పెట్టిన దేశ ప్రేమికుడు కదా!



బీరు బాటిల్స్ తయారు చేసే ఒక కంపెనీ పేరు దాని యజమాని పేరు దేశవ్యాప్తంగా,ఇంకా మాట్లాడితే ప్రపంచ వ్యాప్తంగా భారతీయుల నోళ్ళలో పది రోజులు నానాలన్నా,ప్రైం టైం లో వార్తా ఛానెళ్లలో కనిపించి వినిపించాలన్నా (IPL టోర్నమెంటూ, మరియూ వేసవీ దగ్గర పడుతున్న కీలక సందర్భంలో) ఎంత డబ్బు ఖర్చవుతుందంటారు? పది కోట్ల కంటే ఎక్కువే అనుకుంటా!



ఏదేమైనా గాంధీ గారి వస్తువుల్ని తిరిగి దేశానికి తెస్తున్న "కింగ్ ఫిషర్" అధినేత శ్రీ విజయమాల్యా గారికీ జాతి రుణపడి ఉంటుంది.ఆ వస్తువుల్ని ఏ సబర్మతి ఆశ్రమంలోనో పెడితే, పిల్లలతో ఎప్పుడైనా వెళ్ళి(ఆ చుట్టుపక్కల వెకేషన్ పెట్టుకున్నపుడు) చూసి, "చూశారా, గాంధీ గారి గడియారమూ ,కళ్ళజోడూ,  నమస్కారం చెయ్యండి" అని గౌరవం ప్రకటిద్దాం.(గాంధీ ఎవరో, జాతిపిత ఎందుకయ్యాడో మాత్రం చెప్పకుండా)

December 13, 2008

ఆటవిక న్యాయం అమలైంది!

సరే, వాళ్ళు ఆ యువతుల మీద యాసిడ్ పోశారు. పోలీసులు "ఆత్మ రక్షణ" కోసం వాళ్ళను ఎన్ కౌంటర్ చేశారు. వాళ్ళకు తగిన శిక్షే పడింది."ఇంకెవ్వరూ ఇలాంటి పని చేయరు".అని జనం అభిప్రాయపడుతున్నారు. దుష్ట సంహారం జరిగిందని పండగ చేసుకుంటున్నారు.


ముగ్గురు సామాన్య యువకుల నుంచి ఆత్మ రక్షణ చేసుకోవడం కోసం ఎన్ కౌంటర్ చేయాల్సి వస్తుందా అనే డౌటు నాకు రావట్లేదు. అంతే కాదు.
"పోలీసుల కస్టడీ లో ఉన్న నిందితులకు తుప్పు పట్టిన కత్తులు, తుపాకీలు ఎలా వచ్చాయి? దొంగిలించిన వాహనాన్ని వెతకడానికి అర్థ రాత్రి ఎందుకు వెళ్లారు? "లాంటి ప్రశ్నలు కూడా నేనడగను. జవాబులు తెలిసిన ప్రశ్నలు మళ్ళీ అడగటం దేనికి?

ఆ ముగ్గురు నిందితులు చేసింది మామూలు నేరం కాదు. అమానుషమైన చర్య! యాసిడ్ పోసి ఆడపిల్లల రూప లావణ్యాలను చిదిమి చిదిమి కసి తీర్చుకోవాలనుకున్నారంటే వారిలో ప్రతీకార వాంఛ ఎంతగా ప్రజ్వరిల్లి పోయిందో అర్థం చేసుకోవచ్చు. పాపం హాస్పటల్లో నరక యాతన అనుభవిస్తున్న ఆ పిల్లలు కూడా "వాడిని యాసిడ్ పోసి ఆ బాధలోనే వరంగల్ రోడ్లనీ తిప్పి రోడ్డు మీద వదిలేయాలి" అని తమ ఆగ్రహాన్ని,ఆవేదనను వెళ్ళగక్కారు. చావు బతుకుల మధ్య ఉన్న వాళ్ల ముందు మైకు పెట్టి ఇలాంటి భీకర ప్రతిజ్ఞలు చేయిస్తున్న మీడియా మీద ఎనలేని అభిమానం కలిగింది.


దీన్ని రాజకీయం చేయకుండా కేవలం తల్లులుగా, తండ్రులుగా వచ్చి ఆ ఇద్దరు యువతుల్ని పరామర్శిస్తున్న రాజకీయ నాయకుల్ని చూసి కూడా "పాపం, ఎంత బాధ పడుతున్నారో" అనిపించింది.

నిందితులకు కఠిన   శిక్ష పడాలని నేనూ కోరుకున్నాను. అంతకు ముందు నేను ఇంకో విషయం కూడా ఆలోచించదల్చుకున్నాను. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు ఒక సారి కాకపోతే ఒక సారైనా ఆడపిల్లల పాత్ర ఉంటుందా ఉండదా అని ప్రశ్నించుకోవాలని అనుకుంటున్నాను. ఆ పిల్లలిద్దరూ దారుణమైన బాధకు గురవుతూ బతుకుతారో లేదో కూడా తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు కాబట్టి, ఇలాంటి పరిస్థితిలో 'వారి పాత్ర ఏమిటి " అనే ప్రశ్న లేవనెత్తడం నాకే అమానుషంగా అనిపిస్తుంది కానీ   తప్పని సరి పరిస్థితుల్లో ఈ ప్రశ్నను వేసుకుని జవాబు కోసం వెదుక్కుంటున్నాను.

ఈ రోజు పేపర్లో వచ్చిన కథనం ప్రకారం ప్రధాన నిందితుడు దాదాపు 25 వేల రూపాయల విలువైన బహుమతులు స్వప్నిక కు ఇచ్చాడు. అతడంటే ఇష్టం లేనప్పుడు ఆ బహుమతుల్ని ఆమె ఎలా తీసుకుంది? ఆ అమ్మాయి తండ్రి "మా అమ్మాయి జోలికి రావొద్దు" అని అతడిని హెచ్చరించాడట. "బహుమతులెందుకు తీసుకున్నావు?" అని కూతుర్ని ఎందుకు మందలించలేదు? పక్కా కమర్షియల్ అయిన ఆ నిందితుడు "అయితే నా డబ్బు నాకిచ్చేయమ"ని పేచీ కి దిగాడు. దానికి అమ్మాయి తండ్రి సరిగ్గా సమాధానం చెప్పలేదు. ఎందుకని? "తీసుకో, నీ ముష్టి బహుమతులు" అని వాడి మొహాన్న కొట్టలేదెందుకని?


స్వప్నిక తన వద్దనుంచి బహుమతుల్ని తీసుకుని కార్తీక్ అనే మరో యువకుడితో చనువుగా ఉంటోందని శ్రీనివాస్ కి ఖోపం వచ్చింది. గట్టిగా నిలదీసి అడిగితే "డబ్బు తిరిగిచ్చే విషయమై మాట్లాడ్డానికి కాలేజీ వద్దకు రమ్మన్నది"ట. కార్తీక్ సంగతి ఆమె తల్లిదండ్రులకు తెలుసా తెలియదా? యండమూరి ఏదో పుస్తకంలో రాసినట్టు పిల్లల ప్రేమ వ్యవహారాలు ఆఖరున తెలిసేది తల్లిదండ్రులకేనేమో!


ఇంతకు ముందు జెమిని టీవీ యాంకర్, రేడియో జాకీ లక్ష్మి సుజాత కూడా ఇలాంటి పనే చేసి హత్యకు గురైంది.హంతకుడితో డబ్బు కోసం 'చనువు" గా ఉంటూ, అవసరం తీరగానే మరొకరితో చనువు వెలగబెట్టడం ఆమె చేసిన పని.(పేపర్లలో వచ్చిన కథనాల ప్రకారం) ఆడపిల్లలు జీవితాల్ని ఎందుకింతా ఈజీగా తీసుకుంటున్నారో అంతుపట్టడం లేదు. "సులభంగా" చేతికందే డబ్బుకోసం, విలాసాల కోసం అబ్బాయిలతో చనువుగా ఉండటం, బహుమతుల వంటివాటిని ఆశించడం, తీసుకోవడం ఎక్కడికి దారి తీస్తుందో ఊహ తెలిసిన యువతులు గ్రహించలేరా? ఖరీదైన బహుమతుల్ని ఇవ్వడానికి సిద్ధపడిన యువకులు "ఏమీ" ఆశించకుండానే ఇస్తారా? ఈ విషయాన్ని అమ్మాయిలు గ్రహించలేరా?



ముసుగేసుకున్న మందుపాతరల లాంటి అబ్బాయిలతో స్నేహాన్ని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచడం ఎప్పటికి నేర్చుకుంటారు వీళ్ళు? నిన్న టీవీలో చూశాను, ఒక రాజకీయ నాయకురాలైన నటి, కొడుకుల్ని సరిగా పెంచలేదని శ్రీనివాస్, అతడి మిత్రుల తల్లి దండ్రుల్ని శాపనార్థాలు పెడుతోంది. మగపిల్లలకేనా కావాలి సరైన పెంపకం?


తను కోరుకుంది ఇంకొకరికి దక్కనివ్వకపొవడం, తనకు దక్కకపోతే దాన్ని నాశనం అయినా సరే చేయడానికి ఒడిగట్టడం ..ఇవాల్టి యువకుల్లో , చాలా మందిలో అభివృద్ధి చెందుతున్న వైరస్! శ్రీలక్ష్మి, లక్ష్మి సుజాత, మరొకరు, మరొకరు ...ఎంతో మంది బలైన తర్వాత కూడా అలవి కాని స్నేహాలు ఎటు దారి తీస్తాయో గ్రహించలేని అమాయకులైన ఆడపిల్లని చూసి జాలి పడాలో కోపం తెచ్చుకోవాలో తెలీడం లేదు.

కాలి బూడిదైన ఇద్దరు ఆడపిల్లల జీవితాలు భవిషత్తులో ఏమైపోతాయో ఎవరికి పడుతుంది? ఒక వారం రోజులు ఈ మీడియా హడావుడి, రాజకీయ నేతల పరామర్శలు! ఆ తర్వాత స్వప్నిక, ప్రణీతల సంగతి ఏమిటి?

అసలు జనం ఆగ్రహావేశం చూసి పోలీసులు వాళ్లని ఎన్ కౌంటర్ చేసారు గానీ,వాళ్ళకు పడిన శిక్ష ఎంతని? క్షణంలో ప్రాణాలు పోయాయి. విచారణ తర్వాత వాళ్ళకు జీవితాంతం (14 యేళ్ళు కాదు)కఠిన జైలు శిక్ష విధించాలి. కళ్ళముందే భవిష్యత్తు మంచులా కరిగి పోయి, జీవితం సర్వ నాశనం కావడం అంటే తెలిసేలా చేయాలి. ఒకటో అరో కాకుండా ఆడపిల్లల్ని వేధించే ప్రతి వారికీ కఠిన శిక్షలు విధించాల్సిందే! కానీ ఉన్న పళంగా ప్రాణాలు హరించడమా శిక్ష?

కానీ ఈ ఎన్ కౌంటర్ వల్ల మరొక ప్రేమోన్మాది ఇలాంటి పనులు చేయడానికి వెనకడతాడన్నది మాత్రం నిజం కాదు !ఏమైనా సరే, తనను కాదన్నందుకో, తనతో "తిరగనందుకో" ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని నిశ్చయించుకుని బయలు దేరిన ఉన్మాది 'గతంలో ఇలాంటి పనులెవరు చేసారు, వారికి పడ్డ శిక్షలేంటి? ఎన్నాళ్ళు విచారణ జరిగింది" వంటి విషయాలు ఆలోచిస్తూ కూచోడు. కక్ష తీరాలంతే! ఇలాంటి తక్షణ శిక్షల వల్ల ఆటవిక న్యాయం అమలవుతుందే కానీ మనుషుల ప్రవృత్తిలో మార్పు వస్తుందనుకోవడం భ్రమ.

స్వప్నిక హింస అనుభవించాలని శ్రీనివాస్ కోరుకున్నాడు, అతడు చావాలని మనం కోరుకున్నాం! "అమ్మయ్య, వాళ్లను చంపేశారు, వాళ్ళ ప్రాణాలు తీశారు" అని చెప్పుకుని టపాసులు కాల్చుకునే స్థితిలో మనమున్నామంటే , ఆ ముగ్గురు నిందితులకీ, మనకీ పెద్ద తేడా లేదనిపిస్తోంది.

చర్మం కాలి,మాంసం ఉడికి రూపం చెరిగి పోయిన స్వప్నిక ను చూసినపుడు .."వాళ్ళకీ ఇలా జరిగితే గానీ ఈ బాధ తెలియదు" అని నాకూ అనిపించింది. కానీ ఇలా వెంటనే చంపేస్తారు అని ఊహించలేదు.ఎన్ కౌంటర్ ఎలా జరిగింది అన్న ప్రశ్నకు కూడా ఎస్పీ సజ్జనార్ అవకాశం ఇవ్వడం లేదు. "చట్టం తన పని తను చేసింది. people should "understand" that" అని మీడియా వాళ్ళను గద్దించాడు. చట్టం పని అధికారం తో ఇష్టమొచ్చిన వాళ్లను హత్యలు చేయడం అన్నమాట!ఇదే పని ఏ రాజకీయ నాయకుడి చుట్టమో పక్కమో చేస్తే చట్టం ఏం చేస్తుందో ఆయేషా కేసులో చూసాం!



నేను కాలేజీలో ఉన్నపుడు మా అమ్మమ్మ ఎపుడైనా "అరిటాకు- ముల్లు" సామెత చెప్తే "ఆపు నీ గోల" అని మండిపడేదాన్ని. అప్పుడు సమాజం ఇంత దరిద్రంగా తయారవలేదు. ప్రస్తుతం గుర్రపు డెక్క ఆకులా విస్తరించిన కలుష సంస్కృతి లో, ఉన్మాద స్థాయికి చేరిన ప్రేమ చరిత్రల నేపథ్యంలో ఇప్పుడు ఎవరైనా ఆ సామెత గురించి చెప్తే,కొంచెం ఆలోచించాలనిపిస్తుంది. చదువుకున్న వాళ్ళు కూడా ఇలా మాట్లాడితే ఎలా అనిపిస్తుందొక్కోసారి! కానీ వాస్తవ జీవితం నుంచి నేర్చుకునే పాఠాలకంటే పుస్తకాల్లో నేర్చుకునేది ఎక్కువేం కాదు.



మరో పక్క రాజకీయ పార్టీలకు, మహిళా సంఘాలకు చెందిన మహిళా మణులు ఒక టీవీ ఛానెల్లో ఇదే విషయం మీద భేదాభిప్రాయాలతో కాట్లకుక్కల్లా పోట్లాడుకుంటున్నారు. ఏమిటో, అంతా గొప్ప కన్ ఫ్యూజన్ గా ఉంది.

September 29, 2008

మీ చదువులే మా చావులు!

మా అమ్మాయి సంకీర్తనకి కేజీ వయసు (కిండర్ గార్టెన్ వయసు) రాగానే అందరు తల్లి దండ్రుల్లాగే మేం కూడా ఆమెను "టాప్" స్కూల్లో వెయ్యాలని ఆశపడ్డాము. బెంగుళూరు నుంచి జూన్లో రావడం వల్ల రాగానే అడ్మిషన్స్ కోసం పెద్ద పెద్ద స్కూళ్ళన్నీ తిరిగాము. స్కూళ్ళ విషయంలో, స్కూలు ఫీజుల విషయంలో సిటీలు అడ్డూ, అదుపూ లేకుండా ప్రవర్తిస్తున్నాయని అప్పటిదాకా నాకు సరిగా తెలియదు.(క్షవరం అయితే గానీ వివరం తెలీదని సామెత ఉంది లెండి)


తిరుగుతూ మేం అందరూ గొప్పగా చెప్పుకునే "గల్లీ పబ్లిక్ స్కూల్" కి వెళ్ళాం! రిసెప్షన్ లో అమ్మాయి లిప్ స్టిక్ సరిచూసుకుంటూ

"అడ్మిషన్ కోసం " అని వినగానే

"ఇప్పుడు కాదు, అక్టోబర్ లో రావాలి" అంది.

"అదేంటి, లేటై పోతుంది కదా, అకడమిక్ ఇయర్ మొదలవ్వాల్సింది జూన్లో కదా" అన్నాను. ఆ అమ్మాయి నన్ను ఎంత విచిత్రంగా చూసిందో తల్చుకుంటే ఇప్పుడు సిగ్గేస్తోంది మళ్ళీ!

"నేను చెప్పేది వచ్చే ఏడాది అడ్మిషన్ల సంగతి! ఈ ఏడాది అడ్మిషన్లు పోయిన అక్టోబర్లోనే అయిపోయినై" అంది నాలాంటి నిరక్షర కుక్షికి జ్ఞానోదయం కలిగిస్తున్న ఉత్సాహంలో, విచారంగా జాలిపడుతూ!

తర్వాత మా సంగతి చూడ్డానికి ఒక కౌన్సిలర్ వచ్చి, ఈ ఏడాది కోసమే వచ్చామని తెలుసుకుని, రిలాక్స్ అయి కూచుంది. "ఎంతివ్వ గలరు?" అంది. ఒక్క క్షణం నాకేం అర్థం కాలేదు. కట్నం ఇవ్వాలా ఏమిటిక్కడ? ఇప్పుడేనా అని మళ్ళీ ఆశ్చర్యపడదామని ఆలోచిస్తుండగా మా వారికి ఆమె భాష అర్థమై, "ఎంత" అనడిగారు.

"మీరు సకాలంలో వస్తే 50 వేల నుంచి మాట్లాడొచ్చు! కానీ ఇంత లేటుగా వచ్చారు గాబట్టి మూడున్నర అడగాలనుకుంటున్నాం! మీకు రసీదు ఇవ్వమన్న సంగతి మీకు తెలుసనుకుంటాను" అంది మా వారి విజిటింగ్ కార్డు పరిశీలిస్తూ!

అప్పటికి  విషయం అర్థమైంది నాకు!

మూ-డు-న్న-ర లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వాలట...యూకేజీలో సీటు ఇచ్చినందుకు!

తను "ఇవ్వగలను గానీ,సారీ, ఇవ్వను" అని లేచి నిలబడ్డారు! ఇలాంటపుడు మరీ నచ్చేస్తుంటారు నాకు!



మాకు దగ్గర అనిపించే మరో స్కూలు 'రిచెక్" పబ్లిక్ స్కూలు కెళ్ళాం! ఈ స్కూలు వర్కింగ్ మదర్స్ పాలిట వరం అని పేరు! ఎందుకంటే పాపం ఈ స్కూలు పిల్లలకు హోం వర్కులుండవు, ఆరో క్లాసు వరకు అసలు పరీక్షలే ఉండవు!ఈ స్కూల్లో విశేషమేమిటంటే మన పిల్లల్ని వాళ్ల దగ్గర ఉంచి మనమే డిపాజిట్ గా డబ్బు కట్టాలి. దాని పేరు "కాషన్ డిపాజిట్" అట.


"మరి మిగతా ఫీజు వివరాలు..." అంటుండగానే కౌన్సిలర్ పాప, చెపితే నా గుండె, వింటే మీ గుండె ఆగిపోయే అంకె ఒకటి చెప్పి "చదువుల గురించి మీరడగ్గూడదు, పిల్లల సేఫ్టీ గురించి మేం చెప్పకూడదు. మాకు చెప్పడానికి ఆర్డర్లు లేవు" అంది.
ఈ స్కూల్లో కొన్నేళ్ళ క్రితం ఒక తొమ్మిదో తరగతి విద్యార్థి స్విమ్మింగ్ పూల్ లో పడి మరణిస్తే ఆ పిల్లాడు డిప్రెషన్ లో ఉన్నాడనీ, వాడికి కుటుంబ సమస్యలున్నాయనీ..ఇలాంటివే ఏవో కారణాలు చెప్పి స్కూలు బాధ్యత ఏమీ లేదని చెప్పి తప్పించుకున్నారు.


"పలక" అనే పాఠశాలలో కూడా ఇలాంటి సంఘటనే జరిగిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. స్కూలు బస్సు డోర్ మూయకుండా నడుపుతుండటం వల్ల సడన్ బ్రేక్ వేయడంతో ఒక విద్యార్థి బస్సు లోంచి కింద పడి మరణించాడు.


సైబర్ టవర్స్ కి కూతవేటు దూరంలో ఉండే మరో కార్పొరేట్ స్కూల్ కి అవడానికి రేకుల కప్పే అయినా పాపం ఏసీ చేసార్లెండి. ఈ స్కూల్లో నర్సరీ చదివించాలంటే 98,500(రూపాయలే)ఉండాలి చేతిలో!

'కోక్ రిడ్జ్" స్కూలు కూడా ఇదే కోవ! ఎల్కేజీ లో చేరాలంటే రెండు లక్షలు మనవి కావనేసుకోవాలి మనం!పైగా ఇక్కడ స్కూలు బస్సు చార్జీలకే కళ్ళు తిరగాలి, ఎందుకంటే వాళ్లవి ఏసీ బస్సులు!

మరో స్కూల్లో నెలకు దాదాపు 7,500 ట్యూషన్ ఫీజ్ కట్టాలి! (అడ్మిషన్,డొనేషన్ వగైరాలు కాకుండా)దానితో పాటు పిల్లలకు టేబుల్ మానర్స్, పాటీ ట్రైనింగ్,టాయిలెట్ కి వెళ్ళినపుడు సొంతంగా బట్టలు వేసుకోవడం, లంచ్ సొంతంగా తినడం (చపాతీలు కూడా స్పూన్ తో తినాలి) నేర్పి పంపాలని వారి డిమాండ్!

"మరి మీ ఆయాలేం చేస్తారు? చెట్టు కింద కూచుని పేలు చూసుకుంటారా?" అని అడగకుండా నిగ్రహించుకోడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.


మియాపూర్ లోపల, బాచుపల్లి దగ్గర ఉన్న మరో మరో స్కూలుకు వెళ్ళాను. వాళ్ళు ఫీజ్ ఎంతో చెప్పరట.

"వచ్చే ఏడాది పెంచుతాం కదండీ, ఇప్పుడే ఎలా చెప్తామండీ? మీకు అడ్మిషన్ ఖరారు అయ్యాక చెప్తాం లెండి" అన్నారు. వీళ్ళు మరీ ప్రమాదకరంగా ఉన్నారు. సడన్ గా షాక్ ఇస్తారన్నమాట.


కుకట్ పల్లి మెయిన్ రోడ్ లో ఉన్న కొన్ని concept స్కూళ్లకెళ్ళి చూశాను.
మీరెప్పుడైనా కోల్డ్ స్టొరేజ్ బిల్డింగ్స్ చూశారా? కిటికీలు ఏమీ ఉండవు.ఒకటే పెద్ద బిల్డింగ్! అంతే !
ఈ కాన్సెప్ట్ స్కూళ్ళూ ఇంతే!కనీసం పార్కింగ్ స్థలమే ఉండదు, ఇక గ్రౌండ్ సంగతి మర్చిపొండి! (అదే ఉంటే ఇంకో నాలుగు రూములు వేస్తారు).
నిరంతరం తిరిగే ఫాన్ గాలి తప్ప తాజా గాలి పీల్చుకునే అవకాశం(బయటికొస్తే గుండెలనిండా నిండే కాలుష్యం ఉచితం ఆ రోడ్లో)కూడా లేదు పిల్లలకు!



కాస్త మంచి స్కూలు కావాలనుకోవడం దురాశగా మారిపోయింది! దాదాపు అన్ని స్కూళ్ళూ ఇలాగే ఉన్నాయి.టౌన్లలోకంటె ఇక్కడ అత్యుత్తమ విద్య బోధిస్తారని హామీ ఏమీ లేదు(స్పోకెన్ ఇంగ్లీష్ తప్పించి).


ఇక ప్లే స్కూళ్ళంత పచ్చి మోసం ఎక్కడా ఉండదు.మా అమ్మాయిని రెండున్నరేళ్ల వయసులో "క్యూరో కిడ్స్" అనే ప్లే స్కూల్లో చేర్చాము. నిజానికి ప్లే స్కూల్లో పిల్లల్ని చేర్చడానికి నేను వ్యతిరేకిని. అయినా చేర్చానంటే పరిస్థితి నా చేతిలో లేదన్నమాట. అది చాలా పెద్ద పేరు , బోల్డన్ని ఫ్రాంచైజీలు ఉన్న స్కూలు.



అత్యంత పరిశుభ్రంగా ఉండాల్సిన ప్రదేశాల్లో ప్లే స్కూలు ఒకటి.
కానీ, అక్కడ పైకి చెప్పేది ఒకటి, లోపల పరిస్థితి ఒకటి. వంట్లో బాగాలేని పిల్లల్ని వేరేగా ఉంచాల్సిన బాధ్యత వారిది.అందరినీ ఒకటే చోట ఉంచటం,టాయిలెట్ , బేబీ కమ్మోడ్ వంటివి ఒకటే వాడటం వంటి పరిస్థితులు! అక్కడ ఉన్న ఏడాదిలో మా పాపకి "Urinery infection" తో సహా రాని రోగం లేదు.
 చాలా ప్లే స్కూళ్ళు రంగు రంగుల బొమ్మలతో, బొమ్మరిళ్లతో,ఆటవస్తువులతో ఉండగానే చూసి,మోసపోతాం!

ఆ ఒక్క స్కూలే కాక మరి కొన్ని ప్లే స్కూళ్ళు చూశాను. పిల్లల్ని పడుకోబెట్టే పరుపుల మీద దుప్పట్లు కూడా రోజూ మార్చరు. తిండి కూడా అక్కడే పెట్టే పధ్ధతి ఉంటే కనుక వారానికి నాలుగు రోజులు "వెజిటబుల్ ఉప్మా" నే గతి ! అది చవక,ఈజీగా తయారు చేయొచ్చు! ఈ స్కూళ్ళలో వార్షిక ఫీజు ఎంతో తెలియని వాళ్ళు ఊహించండి! నలభై వేల నుంచి ఎనభై వేల వరకు! ట్రాన్స్ పోర్ట్ అదనం! ఇంత డబ్బు కడితే ఉదయం 9 నుంచి 11-30 వరకు పిల్లల్ని "కూచోబెట్టుకుని" పంపిస్తారన్నమాట.



ఇదీ నగరాల్లో స్కూళ్ళ పరిస్థితి! ఇద్దరు పిల్లలు ఉన్నారంటే తిండి మానేసైనా వాళ్ల కేజీ చదువుల కోసం డబ్బు కూడబెట్టాలన్నమాట!


ఇవాళ ఏ ఇంట్లో చూసినా ఒకరిద్దరు పిల్లలకంటే ఉండరు! ప్రతి రెండు వీధులకొక స్కూలు ఉంటుంది. అయినా దేనిలోనూ అడ్మిషన్లు లేవంటారు. కావాలంటే లక్షలు కట్టాలంటారు. దీన్నేమనాలో మరి!


చెప్పుకుంటే సిగ్గు చేటు,నాచదువుఖర్చు ,యూనివర్సిటీ వరకూ కూడా మొత్తం లక్ష కాలేదు. ఇప్పటి కార్పొరేట్ స్కూళ్లతో పోల్చుకుంటే ఏదో వీధి అరుగు బడిలోనో చదివినట్టు ఉంది. టౌన్లలో పరిస్థితి ఇంత అన్యాయంగా లేదని చెప్పగలను. మా వూరెళ్ళినపుడు "మీ అమ్మాయి స్కూలు ఫీజెంత" అని ఎవరైనా అడుగుతారేమో అని ఆ టాపిక్ రాకుండా జాగ్రత్త పడతాను. చెప్పాలంటే సిగ్గుతో చచ్చినంత పనవుతుంది మరి!


అసలు సర్కారీ స్కూళ్లలో విద్యా ప్రమాణాలెందుకు పడిపోయాయి? ఎందుకు పడిపోవాలి?

చదువు ఎందుకింత ప్రియం అయింది?


సర్కారీ బళ్ళలో సరిగా చెప్పకపోవడం వల్ల అందరూ ప్రైవేటు స్కూళ్లకు ఎగబడటం వల్లనా?

ఉన్న ఒకరిద్దరు పిల్లలకూ విద్య 'అత్యుత్తమం' గా ఉండాలని తల్లి దండ్రులు ఎంత ఖర్చుకైనా వెనకాడకపోవడం వల్లనా?

ఐటీ వాళ్ళకు,(ఈ స్కూళ్ళలో చదివే పిల్లల్లో ఎక్కువమంది ఐటీ తల్లిదండ్రుల పిల్లలే) జీతాలెక్కువ కాబట్టి ఎల్లాగైనా వాళ్ళను లూటీ చేసి పారేద్దామనే స్కూలు యాజమాన్యాల దురాలోచనా?


లేకపోతే నిజంగానే చదువు "విలువ" అంతగా పెరిగిపోయిందా?



ఈ ప్రశ్నలన్నింటికీ కనీసం కొన్నింటికి ఎవరైనా జవాబు తెలిసి చెప్తే తెలుసుకుంటాను. ఎందుకంటే నిజంగానే నాకు జవాబులు దొరకలేదు.



స్కూళ్ళు తిరిగి ఇంటికి వస్తుండగా నేను ఏదో ఆలోచిస్తూ "లక్షకెన్ని రూపాయలు" అని అడిగాను మా వారిని. నాకు గానీ స్కూళ్ల "రేట్లు" విని మతి భ్రమించిందనుకుని తను కంగారు పడుతూ "చ, ఊరుకోమ్మా, ఏమీ ఆలోచించకు, ఊళ్ళో ఇల్లు అమ్మేద్దాంలే, పాపాయిని కేజీ చదివించడానికి" అని ధైర్యం చెప్పాడు..

June 18, 2008

అమ్మ, నాన్న, ఓ వృద్ధాశ్రమం

అమ్మ, నాన్న!కడుపులోంచి వొడిలో పడ్డప్పటి నుంచి బిడ్డలే ప్రాణం అమ్మకి. పొత్తిళ్లలోని పాపని, పెంచి ప్రయోజకుణ్ణి చేయడానికి అమ్మకి ఎంత టైము పట్టి ఉంటుంది? గాలికి పెరగలేం గా? పసితనంలో ఒకట్లు, రెండ్లు శుభ్రం చేయడాలు, అన్నం తిననని మారాము చేస్తే ఎత్తుకుని చందమామని చూపిస్తూ తినిపించడాలు! బిడ్డకి చిన్న సుస్తీ చేసినా అన్నం మానేసి కళ్లల్లో వొత్తులేసుక్కూచునే అమ్మ,పెద్దయ్యాక కూడ పిల్లలకోసం ఎన్నో త్యాగాలు చేసే అమ్మ(అవి త్యాగాలని ఆమె గుర్తించదు) !
మరి నాన్నో! ప్రయోజకులైన వ్యక్తులున్నారంటే వారి వెనక తండ్రుల శ్రమ, బాధ్యత, త్యాగం ఇవేవీ లేకుండానే తయారైపోతారా?(స్వయం శక్తితో పైకొచ్చిన వారు నూటికో కోటికో ఉండొచ్చు) మన పరీక్షల ఫలితాల కోసం మనకంటే టెన్షన్ గా ఎదురు చూసే నాన్న! మన విజయాలను తన విజయాలుగా చెప్పుకునే నాన్న! మన కోసం రెండు ఉద్యోగాలు చేసిన నాన్న! మన 'కంఫర్ట్స్ ' కోసం తన అవసరాలను వాయిదా వేసే నాన్న!
పై వాళ్ళిద్దరికీ పిల్లలెప్పుడూ 'బర్డెన్ ' కాదు! అనవసరపు 'లగేజీ ' కాదు! వారి సౌకర్యాల తర్వాతే తమ అవసరాలు!
మరి ఇప్పుడు మన జీవితాలు మన చేతుల్లో ఉన్నప్పుడు, అమ్మ, నాన్న మనకెందుకు 'బరువై 'పోతున్నారు? మన 'కుటుంబం 'లో వారికెందుకు చోటు లేదు? వీధికో బస్టాపులా గా ఏరియాకు నాలుగైదు వృద్ధాశ్రమాలు ఎందుకు వెలుస్తున్నాయి. అవేమైనా ఖాళీగా ఉన్నాయా అంటే ...లేవే?
భార్యా భర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న కుటుంబంలో ఇంట్లో వృద్ధులుంటే వారి పరిస్థితి ఏమిటి? ఆరోగ్యం సరిగా ఉంటే సరే! లేనివారైతే? ఇద్దరిలో ఒకరు ఉద్యోగం మాని ఇంట్లో కూచోలేని పరిస్థితి అయితే? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా వెలిసినవే 'రెటైర్మెంట్ హోం లు '!
ఇటువంటి పరిస్థితి లేని కుటుంబాల నుంచి కూడా వృద్ధులు స్వచ్చందంగా ఆశ్రమాల్లో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరి దాని వెనక ఏముంది? నిస్సందేహంగా పెద్ద వారికి కావలసిన ఆదరణ (వేళకు తిండి, పడక కాదు ఆదరణంటే) ఆ ఇంట్లో దొరక్కపోవడమే!
నాకు తెలిసిన ఒక రెటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నారు. భార్య పోయింది. పెద్ద కొడుకు ఉన్న ఇల్లు ఆయనదే! ఆయన అక్కడే ఉంటారు. ఆయన ఒక ఫైన్ మార్నింగ్ 'నేను ఫలానా ఆశ్రమంలో చేరుతున్నానని ప్రకటించి వెళ్ళిపొయారు. అక్కడ ఆయన స్నేహితులున్నారు. కొడుకు, కోడలు వెర్షన్ల ప్రకారం ,చుట్టుపక్కల వాళ్ళ వెర్షన్ల ప్రకారమూ, కూడా ఆయనకు ఆ ఇంట్లో ఏ కష్టమూ లేదు.

అక్కడ ఆయనకు కావలసింది తిండి, బట్ట మాత్రమే కాదు, తన మనుషులు కూడా! కోడలు తమ్ముడు చదువుకోడానికి సిటీకి రాగానే, ఆవిడ బాల్కనీ కి sliding glass shutters పెట్టించి దానికి 'గది ' కళ తెప్పించి ఈయన కోసం ఒక మడత మంచం కొని అందులో వేసింది. ఆయన తన గది వదిలి అందులో ఉండాల్సి వచ్చింది. పేపరు పొద్దున్నే ఆయన చేతికి రాదు. అందరూ ఆఫీస్ కి , స్కూళ్లకు వెళ్ళాక చదవాలి. ఇంట్లో వాళ్ళు(పిల్లలతో సహా) ఏ చానల్ పెడితే అదే చూడాలి! ఏదన్నా విషయంలో కల్పించుకుని మాట్లాడబోతే 'మీరూరుకోండి, మేము మాట్లాడుతున్నాంగా, అంతా చాదస్తం " అని ఈసడింపులూ! స్నానం పూజ అన్నీ అందరూ వెళ్ళాకే! ఎవరికీ అడ్డం కాకూడదన్న వాళ్ళ మనసులో భావాన్ని ఆయన ఎవరూ చెప్పకుండానే గ్రహించి తన అలవాట్లు మార్చుకున్నారు.

అన్నింటికంటే ముఖ్యంగా రెండో సారో, మూడో సారో కాఫీ తాగాలనిపిస్తే అడిగే స్వతంత్రం కూడా ఈయనకు లేకపోవడం! భార్య పోయిన మగాళ్ల దుస్థితి ఇక్కడ బయట పడుతుంది.
ఈ పరిస్థితిలో ఆయన తన మిత్రుడిని కలుసుకోడానికి ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళి సాయంత్రం వరకూ అక్కడ హాయిగా గడిపి...వెంటనే ఒక నిర్ణయానికొచ్చారు. పొద్దున్నే వాకింగ్, కాఫీ, టిఫిన్, ధ్యానం,నాలుగైదు రకాల పేపర్లు, మంచి మిత్రులు, అందుబాటులో డాక్టరు! వృద్ధాప్యంలో ఇంతకంటే ఏం కావాలి? 'ప్రేమ? ' ! కరక్టే, ప్రేమ కావాలి! అది దొరకదని నిర్థారణ అయ్యాక, భౌతికం గా దొరికే మిగతా వాటితో తృప్తి చెందడం కరక్టేగా!

ఇంకొకరి విషయం! భార్యా భర్తా ఇద్దరూ డాక్టర్లు! కొడుకూ, కూతురూ ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో అమెరికాలో స్థిరపడ్డారు. డబ్బుతో పాటు ప్రేమ కూడా ఉంది వాళ్ళకి! కానీ ముసలావిడకి అక్కడి వాతావరణం పడకపోవడంతో ఇండియా వచ్చేసారు. ఇద్దరూ ఒంటరిగా ఉండలేకపోయారు..ఆరోగ్య కారణాల రీత్యా! అందుకే హోం లో చేరారు.వాళ్ళు దగ్గర లేరన్న చింత తప్ప పిల్లలకు వారి బాగోగుల గురించి చింత లేదు.ఇదొక పరిస్థితి!

ప్రేమాభిమానాలు పిల్లల దగ్గర లభిస్తే తప్ప, 'వృద్ధాప్యంలో కొడుకు దగ్గరే ఉండాలి ' అని నిర్ణయించుకోవడం, సమాజం ఏమనుకుంటుందో (కొడుకు గురించి) అనే ఒక false concernతోనో పిల్లల దగ్గర పడుండక్కర్లేదని నా అభిప్రాయం!

ఈ మధ్య వచ్చిన కొత్త చట్టం..వృద్ధులైన తల్లి దండ్రుల బాధ్యతను పిల్లలు తిరస్కరిస్తే 3 నెలలు జైలు తప్పదని హెచ్చరిస్తోంది! ఎంత మంది తల్లులు, తండ్రులు ముందుకు వచ్చి పిల్లల గురించి ఫిర్యాదు చేస్తారు? తల్లి దండ్రుల నుంచి ఆస్థులను పొందిన తర్వాత వారిని నిర్లక్ష్యం చేస్తే, తిరిగి వారినుంచి ఆస్థులను స్వాధీనం చేసుకునే అవకాశాన్ని కూడా ఈ చట్టం కల్పిస్తుందట! ఈ చట్టాన్ని ఎంతమంది తల్లి దండ్రులు ఉపయోగించుకుంటారో చూడాలి!
ఇక ప్రతి వృద్ధాశ్రమంలోనూ ప్రేమగా చూస్తారా, ప్రశాంత వాతావరణం ఉంటుందా అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కష్టం! సిటీ మధ్యలో చుట్టూ పెద్ద స్థలం కూడా లేకుండా నడిపే ఆశ్రమాలున్నాయి.ఇక్కడ మనం 'పిండి కొద్దీ రొట్టె ' సామెత గుర్తు చేసుకోవాలి!

అయితే ఒక విషయం! ఎంత విశాలమైన ఆశ్రమం అయినా, ఎన్ని వసతులున్నా, డాక్టరు పక్కనే ఉన్నా పిల్లల (ప్రేమ పూర్వక)సాహచర్యం, సాన్నిధ్యాన్ని మించింది ఉంటుందా? కనీసం వొంట్లో నలతగా ఉన్నపుడైనా 'పిల్లలుంటే ఇప్పుడు ?' అనిపించదంటారా? (అక్కడ చేరిన పరిస్థితులేవైనా కానివ్వండి)