Showing posts with label సంగీతం. Show all posts
Showing posts with label సంగీతం. Show all posts

October 30, 2012

ఇదిగిదిగో వేటూరి తొలి పాట




వేటూరి రాసిన తొలి సినిమా పాట చాలా రోజులుగా నెటిజన్లకు, అభిమానులకూ అందని పండుగానే మిగిలింది. "భారత నారీ చరితము.." అంటూ మొదలయ్యే ఈ పాట ఓ సీత కథ సినిమాలోది! అయితే ఈ పాట ఇన్నాళ్ళుగానూ ఆన్ లైన్లో ఎక్కడా వినపడదూ లేదు. కనపడనూ లేదు. ఆడియొ, వీడియో రెండూ లభ్యం కాకుండా పోయాయి. దీనికి రెండు కారణాలు ఉన్నాయి.




ఒకటి...సినిమా దాదాపుగా ఎక్కడా లభ్యం కాకపోవడం. లభ్యమైతే వేటూరి అభిమానులు ఎవరో ఒకరు ఏదో ఒక చోట ఈ పాటను ఆన్ లైన్లో అందుబాటులో ఉంచే వారు. ఇంకోటి....సినిమాలో ఈ పాట రెండు భాగాలుగా..రెండు వేర్వేరు సన్నివేశాల్లో చిత్రీకరించడం వల్ల, ఈ రెంటినీ కలిపి పెట్టడం ఇబ్బంది కావడం మరో  సమస్య!!

ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంటే ఇన్నాళ్ళకు ఈ పాట ఆడియో వీడియోలు పట్ట గలిగాము! అది కూడా సినిమా వీడియో (వీసీడీ) దొరకడం వల్ల సాధ్యమైంది. మనీషా వీడియోస్ సంస్థ ఈ సినిమాని వీడియో గా అందించారు. సినిమా వేటూరి పాటతోనే మొదలవుతుంది కానీ,అన్నీ జర్కులూ,జంపులూనూ!  రెండు సన్నివేశాల్లో విడి విడిగా ఉండే ఆ పాటను అతికించి యు ట్యూబ్ లో పెట్టాల్సి వచ్చింది.



అంతే కాదు, పాట సాహిత్యం లో ఎలాంటి తప్పులూ పొరపాట్లు లేకుండా ఉండేందుకు గాను ఆ నాటి ఆ సినిమా పాటల పుస్తకాన్ని దొరక బుచ్చుకుని...ఒరిజినల్ సాహిత్యాన్ని కూడా సంపాదించాం!



పాట విషయానికొస్తే ఈ పాట ని ఓ సీత కథ (1974) సినిమా  కోసం వేటూరి తన తొలి పాట గా రాశారు. వేటూరి మరణానంతరం ప్రచురితమైన "వేటూరి నవరస గీతాలు" లో ఈ పాటను ప్రచురించి సాహిత్యాన్ని అందుబాటులో ఉంచారు. ఈ పాటను పాడింది శ్రీమతి పి. లీల గారు!

పాట సాహిత్యానికి, రికార్డ్ అయిన నాటికీ కొన్ని స్వల్ప మార్పులు జరిగాయి. పాట మొదట్లో వచ్చే "యత్ర నార్యస్తు పూజ్యంతే" అనే మనువు కొటేషన్ పాట సాహిత్యంలో లేదు...రికార్డింగ్ లో కలిపారు. అలాగే "కీచక వధ" భాగంలో కూడా కొన్ని లైన్లలో స్వల్ప మార్పులు కనిపిస్తాయి.

తన తొలి పాట గురించి వేటూరి ఏమన్నారో చూడండి (కొమ్మ కొమ్మకో సన్నాయి నుంచి ధారా వాహిక 2003 జులై హాసం పత్రిక నుంచి)






‘‘నా తొలి సినిమా పాటకు స్వరాలు దిద్దింది- మామ గారు శ్రీ మహదేవన్. ‘ఓ సీత కథ’ చిత్రంలో ‘భారతనారీ చరితము’ అనే మకుటంతో సాగే హరికథ అది.

ఆ సుముహూర్తమెటువంటిదో అది 25 వసంతాలపాటు పుష్ఫించి ఫలించింది. ఆయనతోనూ, ఆయన మానసపుత్రుడు శ్రీ పుగళేంది తోనూ నా అనుబంధాన్ని జీవితంలో మరపురాని మధురఘట్టంగా నిలిపింది.

నా తొలిపాట ట్యూన్ చేసిననాడే ఆయన ఎంత గొప్ప సంగీత దర్శకుడో తెలిసింది. అప్పటికి నాకు సినీ భాష అంతగా పట్టుబడలేదు. సంస్కృత సమాస భూయిష్ఠంగా రచన-

‘‘ భారతనారీ చరితము మధుర కథా భరితము
పావన గుణ విస్ఫురితము పతిసుతానుమతము సతము
శీల జ్యోత్స్నా పులకిత హేలా శారద రాత్రము
అతి పవిత్ర మఘలవిత్ర మీ ధరిత్రి కనవరతము ’’

అంటూ సాగింది.
దానిని అవలీలగా సంగీతీకరించిన క్షణాలు నేను మరిచిపోలేను. హరికథ అంటే ఏదో పురాణగాథ ఆధారంగా సాగే సంగీత సాహితీ రచన. ఇక్కడ అటువంటిదేమీ లేదు. స్త్రీ గొప్పతనం భారత స్త్రీ యొక్క విశిష్టత, పవిత్రత ఇందులో వస్తువు. సాంఘిక చిత్రం (ఓ సీత కథ) లో రాయాలి.

దానికీ భాషేమిటి? నోరు తిరిగినా చెవిలోకి ఎక్కినా అర్థం కాదే..! అయినా ఆ రచనను అంగీకరించిన దర్శకుడి ధైర్యం ఎంత గొప్పది..! మామ ఆ రచనని కాంభోజి, కేదారం మొదలైన రాగాలలో పదిహేను నిముషాలలో స్వరబద్ధం చేసిన తొలి అనుభవం మరువలేను- ఈ పాటను శ్రీమతి పి.లీల గానం చేశారు. ఈనాటికీ అది చెవులకు చెందినట్లు వినిపిస్తూ వుంటుంది.

అటు తర్వాత ‘సిరిసిరిమువ్వ’ చిత్రంలో అన్ని పాటలూ నేను రాయడం, ఆయన స్వరపరచడం ఎన్నెన్నో మధురానుభూతులను కలిగించింది.

పాటల రచయితగా నా ఎదుగుదలకు పునాదులు వేసిన గురువులలో ఒకరు మహదేవన్.
... సినీ కవిగా అప్పుడే కళ్ళు తెరుస్తున్న చిన్నవాడిని తల్లిలా కడుపులో పెట్టుకుని, తండ్రిలా కాపాడిన ఉత్తమ కళా సంప్రదాయానికి చెందిన మహా వ్యక్తి మహదేవన్. ’’

అదీ సంగతి! ఇన్నాళ్ళకి..వేటూరి తొలి పాట ఏదని వెదికే వారికి ఇక పై ,వీడియో యూ ట్యూబ్ లో దొరుకుతుంది...

వేటూరి అభిమానులూ.....ఆనందించండి...నాతో కలసి!! :-)





October 4, 2012

ఒక మంచి పాట...మౌనమే ప్రియా

ప్రేయసీ ప్రియులు కల్సి పాడుకునే డ్యూయెట్స్ సినిమాల్లో మామూలే!

ప్రియుడి మీద ప్రేమను వ్యక్తీకరిస్తూ ప్రేయసి పాడుకునే పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాంటి పాటలు తెలుగు సినిమాల్లో అడపా  దడపానే నే ఉన్నా..కొన్ని మాత్రమే మనసుకు బాగా నచ్చి అలా గుర్తుండి పోతాయి.

ఏ ఏకాంత సమయంలోనో మనకు తెలీకుండానే హమ్ చేస్తూ ఉండేలా వెంటాడతాయి.
జంధ్యాల సినిమా "చిన్ని కృష్ణుడు" సినిమాలో జానకి పాడిన "మౌనమే ప్రియా" పాట ఆ కోవలోదే!

ఈ సినిమాలో ఆశా భోంస్లే పాడిన పాట "జీవితం సప్త సాగర గీతం" అంటూ సాగే అమెరికా ఆవిష్కృత గీతం జనాదరణ పొందినా.... దాని కంటే ఈ పాట నాకు చాలా చాలా నచ్చుతుంది.




అతి సున్నితంగా, సుకుమారమైన భావాలతో తన భావాల్ని వెల్లడించే నాయికను హీరో కూడా  ఆరాధిస్తూ ఆ భావ సౌందర్యాన్ని పంచుకోడం అద్భుతంగా ఉంటుంది ఈ పాటలో!

రమేష్ ఎంత అందంగా ఉన్నాడో ఈ పాటలో! ఖుష్బూ మాత్రం....ఎంత సొగసు....!!

ఇద్దరూ ఆ రోజుల్లో ఎంతో సన్నగా..మెరుపు తీగల్లా ఉన్నారు :-)

ఈ సినిమాకి సంగీత దర్శకత్వం ఆర్.డి బర్మన్!! ఈ ట్యూన్ ని బర్మన్ ఇంతకు ముందే ఒక బెంగాలీ పాటకు వాడి ఆషా చేత పాడించారు.




బహుళ ప్రజాదరణ పొందిన ఆ పాటను మళ్ళీ శ్రేయా ఘోసల్ కూడా పాడింది.

కానీ తెలుగు పాట  సాహిత్యం వల్లా, జంధ్యాల చిత్రీకరణ వల్లా...జానకి స్వర సౌందర్యం వల్లా...తెలుగు పాటకే మొగ్గు చూపాను నేను.

నిజానికి ఆశ, శ్రేయ కూడా అద్భుతంగా పాడారు.

ఆశా , శ్రేయా ఇద్దరూ బాగా పాడారు.



ఈ పాట వీడియో కావాలని అడగగానే, సినిమా సంపాదించి, ఆ పాటను యు ట్యూబ్ లో అప్ లోడ్ చేసి పంపిన మిత్రులు వేణు సి.హెచ్ గారికి ధన్యవాదాలు

 

August 10, 2012

సంగీత సాగరంలో తప్పి పోయిన వేళ......!



ఒక చల్లని సాయంత్రం వేళ...వీనుల విందైన సంగీతం వింటూ, ఆ తీయని స్వప్నంలోకి జారిపోతూ పరిసరాలు మరచి పరవశించడం కంటే జీవితానికి సార్థకత ఏముంది?

అలాటి అవకాశాలు నిజానికి నేను ఒక్కటీ వదులుకోను.సంగీతం విషయంలో మరీ ముఖ్యంగా!
God of Indian violin శ్రీ ఎల్ సుబ్రహ్మణ్యం, వారి కుమారుడు అంబి సుబ్రహ్మణ్యంల   కచేరీ చూసే అదృష్టం నాకు మొన్న ఆదివారం వరకూ పట్టలేదు.




నిజానికి నేను ఆయన కంటే ఆయన కొడుకు అంబి ప్రోగ్రాం చూడాలని కలవరిస్తున్నాను చాలా రోజులుగా!
హైద్రాబాదు లో ఇలాంటి అవకాశాలు కొద్దిగా అరుదనే చెప్పాలి.
అంబి ని నాకు పరిచయం చేసింది మిత్రులు శ్రీ శ్రీనివాస కుమార్ గారు(జీవితంలో కొత్తకోణం బ్లాగర్) .

యూ ట్యూబ్ వీడియోలు పంపి, అంబి ని తెచ్చి మా నట్టింట్లో సింహాసనం వేసి ప్రతిష్టించారు. అంబి వయొలిన్ తో మేము పీకల్లోతు ప్రేమలో కూరుకు పోయాం!
ఆయన పంపిన వీడియో ని నా ముఖ పుస్తకం గోడ మీద ఈ మధ్య పంచుకున్నపుడు, త్వరలోనే మాకు అతి దగ్గర్లోనే శ్రీ ఎల్ సుబ్రహ్మణ్యం, అంబి సుబ్రహ్మణ్యం ల వయొలిన్ కచేరీ జరగబోతోందని శుభవార్త చెవిన వేసి పుణ్యం కట్టుకున్నారు శ్రీ జంపాల చౌదరి!
ఆగస్టు 5 సాయంత్రం నా స్వప్నం నిజమైంది. నాకు పదడుగుల దూరంలో కూచున్న అంబి సాక్షాత్తూ తుంబురుడో నారదుడో దిగి వచ్చినట్టు తానే సంగీత స్వరూపమై భాసిస్తూ అంబి వయొలిన్ తరంగాలలో ముంచెత్తి, మంత్ర ముగ్ధురాల్ని చేసి కట్టి పడేసిన ఆ అనుభూతి ఇంకా మనసు ఫలకం మీద అలాగే నిలిచి ఉంది.
ఇంతింతై, వటుడింతయై అన్నట్లు పసివాడుగా కనిపిస్తున్న ఆ సంగీతాంబుధి కచేరీ మొదలైన కాసేపటికీ సభికులందరినీ తనలో ఐక్యం చేసేసుకున్నాడు. సందేహం లేదు, సంగీత జగత్తుని ఈ యువరాజు రారాజై,చక్రవర్తై  పరిపాలించి  తీరతాడు ! The whole program was just an eternal journey into the ocean of music..! . శ్రీ సుబ్రహ్మణ్యం గురించి ఇక ప్రత్యేకంగా చెప్పేదేముంది...
I wish there is a  language to narrate the remarkable power of movement of Maestros fingers on his Violin , how his music escapes the worldly boalders and enters inner layers of human heart and flow sublime.....!!  Undoubtedly, it was a great experience.. !   నా స్వప్నం నిజం చేసిన SAPNA (Sree Annamaacharya Project of North America) కి తల వంచి అభివాదం!     

January 29, 2012

యమహా నగరి కలకత్తా పురి..!

ఇవాళ వేటూరి పుట్టినరోజు ట

వేటూరి సినీ సాహిత్యంలో ఒక లక్షణం ఉంటుంది.(అనిపిస్తుంది నా వరకూ)! మొదటి సారి విన్నపుడు "బాగుంది"
అనిపించి, ఆ తర్వాత అదొక వ్యామోహం లాగా పట్టుకుని వదలదు. తరచి చూసే కొద్దీ అద్భుత సౌందర్యాలు రత్న మాణిక్యాల్లా దొరుకుతూనే ఉంటాయి.

అలాటి పాటల్లో ఈ మధ్య వచ్చిన వాటిలో ఒకటి యమహా నగరి అయితే మరోటి అర్జున్ సినిమాలో "మధుర మధుర తర మీనాక్షీ "కంచి పట్టు" న కామాక్షి!

వింటున్న కొద్దీ మరిన్ని సౌందర్యాలు తోచి,శోభిల్లే పాటలు ఇవి.

యమహా నగరి కలకత్తా పురి___________కలకత్తా నగరాన్ని ఏ బెంగాలీ కవి అయినా కూడా ఇంత అందంగా, అలతి   పదాలతో సమ్మోహనం గా వర్ణించలేడని బల్ల గుద్ది, వీలైతే విరక్కొట్టి మరీ చెప్పేస్తా నేను. :-)



యమనా నగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి
చిరు త్యాగరాజు నీ కృతినె పలికెను మది

నేతాజీ పుట్టిన చోట గీతాంజలి పూసిన చోట
పాడనా తెలుగులో

ఆ హంస పాడిన పాటే ఆనందుడు చూపిన బాటే సాగనా
పరుగులో పరుగు తీసింది పట్నం
బ్రతుకు తో వెయ్యి పందెం కడకు చేరాలి గమ్యం
కదలి పోరా
ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు
దొరకని క్షణముల బిజి బిజి బ్రతుకుల
గజిబిజి ఉరుకుల పరుకులలో


బెంగాలీ కోకిల బాల
తెలుగింటి కోడలు పిల్ల
మానినీ సరోజినీ
రోజంతా సూర్యుడి కింద రాంత్రంతా రజనీ గంథ సాగనీ
పద  గురూ ,ప్రేమలే లేని లోకం  దేవదా మార్కు మైకం
శరన్నవలాభిషేకం తెలుసుకోరా
కథలకు నెలవట కళలకు కొలువట
తిథులకు సెలవట అతిథుల గొడవట
కలకట నగరపు కిట కిటలో


వందే మాతరమే అన్న వంగ భూతలమే మిన్న
జాతికే గీతిరా
మాతంగి కాళీ నిలయా చౌరంఘీ రంగుల దునియా నీదిరా
విను గురూ, సత్య జిత్ రే సితారా, ఎస్ డి బర్మన్ కి థారా
థెరిసా కీ కుమారా కదలి రారా
జనగణమనముల స్వర పద రవముల హృదయపు లయలను
శృతిపరచిన ప్రియ శుక పిక ముఖ  సుఖ  రవళులలో

ఎంత గొప్పసాహిత్యం!!

బెంగాల్ తో ప్రతి భారతీయుడికి ఉండే అనుబంధమంతా ఈ పాటలో ప్రతిఫలిస్తుంది. ఆ వాతావరణమంతా కళ్ళ ముందు కదలాడుతుంది ఈ పాట వింటున్నపుడు

బెంగాలీ కోకిల తెలుగింటి కోడలని గుర్తు చేయడం,వందేమాతరం అక్కడ పుట్టింది కాబట్టి వంగ దేశం జాతికే గీతి అనడం, "జనగణమన" ముల  అనడం  జనగణమన కూడా అక్కడే పుట్టిందని తల్చుకోడం..

ఎంత సౌందర్య భరితం!!

శరన్నవలాభిషేకం__________అనే మాట ఎక్కడైనా విన్నామా అసలు ఇంతకు ముందు? గుండె ఝల్లుమనే ప్రయోగం కదా!
 దేవదా మార్కు మైకం, చౌరంగీ రంగుల దునియా, ఎస్.డి బర్మన్ కి ధారా...థెరిసా కీ కుమారా...!

ఈ పాట ఇంకెవరూ రాయలేరు! అంతే ! ఇది శిలా శాసనం!

చిరంజీవి కూడా ఈ పాటలో ఒక  క్లాసిక్ లుక్ తో ఎంత హాండ్సమ్ గా ఉంటాడో చూడండి(పాట తాలూకు మైకంలో మనకలా కనిపిస్తాడా?)


హరి హరన్ పాటలో(అది రాక్ అయినా,సినిమా పాట అయినా , ఘజల్ అయినా) "సోల్" ఉంటుంది. అది మనకు వినిపిస్తుంది.ఈ పాటకు హరి హరన్ ని ఎంచుకోవడం గొప్ప ఎన్నిక!

ఈ పాటలో తళుక్కున మెరిసే గిటార్,సాక్సో ఫోన్, వయొలిన్ లో ఎంత అందమో!


తబలాతో కల్సి ఆడుకునే Rythm pads లో ఎంత మాధుర్యమో


రఘు వంశ సుధాంబుధి కీర్తనలో స్వరాలు పడాల్సిన చోట్లో రాసిన పదాలో...!

"చిరు" త్యాగరాజు నీ కృతినె పలికెను మది...!

వేటురి పాటల్లో అసంఖ్యాకమైన పాటలు ఇష్టమైనవే అయినా ఈ పాట సాహిత్యం మాత్రం అనితర సాధ్యం,అద్భుత సౌందర్యం,అనన్య సామాన్యం!



ఎన్ని సార్లు విన్నా, అప్పుడే మొదటి సారి వింటున్నంత సంతోషం, సంభ్రమం ఈ పాటలో నాకు!

మీకో?










February 8, 2011

బజే సర్గమ్ ....భారతీయ కళలు,సంస్కృతి ఔన్నత్యాన్ని కళ్ళకు కట్టే గీతం


మిలే సుర్ మేరా ఐక్యతా గీతం తర్వాత దూరదర్శన్ బంగారు రోజుల్ని గుర్తుకు తెచ్చే మరొక గీతం "బజే సర్ గం"! మీలో చాలామంది చూసే ఉంటారు.

వీలైనంత మంది భారతీయ సంగీత కళాకారుల,నాట్యకారుల సేవలని ఇందులో ఉపయోగించుకున్నారు.గీతం ఉద్దేశం కూడా వివిధ కళలకు ఆలవాలమైన భారతీయ సంస్కృతి ఎంత ఉన్నతమైనదో,చెప్పడమే! దానివల్ల ఐక్యత వెల్లివిరియాలనే!

మొదలే తండ్రీ కొడుకులు అల్లా రఖా,జాకీర్ హుస్సేన్ ల తో అద్భుతంగా ప్రారంభమయ్యే ఈ పాటలో ఉస్తాద్ అంజాద్ అలీ ఖాన్,మల్లికా సారాభాయి,స్వప్న సుందరి,ప్రతిమా గౌరి బేడి, కవితా కృష్ణ మూర్తి,భీమ సేన్ జోషి,బాల మురళి,హరిప్రసాద్ చౌరసీయా,పండిట్ రవిశంకర్, పండిట్ శివకుమార్ శర్మ ఇంకా అనేకమంది కళాకారులు పాలు పంచుకున్నారు.




భరతనాట్యం,కూచిపూడి,మోహినీ అట్టం,కథాకళి,ఒడిస్సీ,మణీపురి నాట్యరీతులు,వీణ,వయొలిన్,సారంగి,కర్ణాటక హిందుస్థానీ గాత్ర సంగీతాలు, అన్నీ ఈ గీతంలో ప్రతిబింబిస్తాయి.

బాలమురళి మిలే సుర్ మేరా లో తమిళ గీతం ఆలపించినా ఇందులో మాత్రం

 "నలుదెసల రాగముదయించెను
గజ్జెలు ఘల్లన లయగ పలికెను 
గొంతులెల్ల భావముగ పాడెను
ఇది దేశ రాగ భావ సమ్మేళనం" అంటూ భావయుక్తంగా పాడి,ముక్తాయింపుగా వయొలిన్ మీద ఒక చెణుకు విసురుతారు చూడండి!  అద్భుతం నిజంగా



అయితే ఈ గీతం మిలే సుర్ పాటలాగా జనంలోకి చొచ్చుకుపోలేకపోవడానికి కారణం ఇందులో జన జీవిత రీతులు కాక,కళా రూపాలు మాత్రమే చోటు చేసుకోవడమే అనుకుంటాను.

అయితేనేం, ఈ గీతాన్ని చూస్తుంటే మన కళా వారసత్వం,భిన్నత్వం,ఔన్నత్యం ఇంకెక్కడా లేవంటే లేవని గర్వపడేలా కళ్ళు చెమరుస్తాయి.

భీమ్ సేన్ జోషి స్వరంలో పరవళ్ళు తొక్కిన గమకాలు,బాలమురళి గొంతులో పలికిన భావాలు,రవిశంకర్ సితార ఒలికించిన హొయలు,...ఎంత గొప్పగా ఉన్నాయో ఆస్వాదించండి.

హరిప్రసాద్ వేణువు నుంచి వెలువడే ఆ తరంగాలు మన హృదయాలలోకి ప్రవహిస్తుంటే "మురళీ ధరా నీ స్వర లహరులలో మరణమైనా మధురమురా" అనిపించక మానదు

ఈ కళలన్నీ భారత దేశ సంప్రదాయమనే సాగరంలో కలిసే నదులే అన్న సందేశం ఈ పాటలో ఉంటుంది. అందుకేనేమో ఈ పాటని "దేశ్" రాగంలో రూపొందించారు.

ప్రతి కమర్షియల్ ఛానెల్ లోనూ కనీసం వారానికి రెండు సార్లైనా ఈ గీతాలు మళ్ళీ మళ్ళీ ప్రసారం చేస్తే ఎంత బాగుంటుంది!అలా చేసి తీరాలని ఒక జీవో నో పాడో తెస్తే ఎంత బాగుంటుంది!

ఒక్కసారి ఈ పాటను అవలోకించి చెమర్చిన కళ్ళతో భారతీయ సంగీత, నాట్య రీతులకు  సలామ్ కొట్టండి

January 24, 2011

అయ్యో....భీమ్ సేన్ జోషి మరిక లేరు!


                                            photo:  from www.chembur.com


సరిగ్గా పదినిమిషాలైంది భీమ్ సేన్ జోషి మరణ వార్త టీవీ లో చూసి! :-(

మిలే సుర్ మేరా పాటతో  భారత దేశంలోని మారు మూల గ్రామాలకు   సైతం ఆయన స్వరం పరిచయమైంది. నిజానికి అంతకు ముందు సంగీత ప్రియులకు తప్ప ఆయనెవరో సామాన్యులకు అంతగా తెలీదు. మిలే సుర్ ..గీతాన్ని  టీవీలో చిన్నప్పుడు చూసి  "ఈయనెవరూ?అలా శూన్యంలోకి చూస్తూ పాడతాడేం?కెమెరా వైపు చూడొచ్చుగా  " అని నేను అన్నప్పుడు నెత్తి మీద  చిల్లు పడేలా మొట్టికాయ పడింది. వేసింది మా చిన్నక్క!

నిజమే!ప్రేక్షకుల్నీ,కెమెరానూ బాలమురళి పట్టించుకోవడం అక్కడక్కడా చూశాను గానీ ఈయనకు ఎక్కడా ఎప్పుడూ ఆ రెండూ(కెమెరా, ప్రేక్షకులూ) ఎదురుగా ఉన్నాయన్న స్పృహే కనపడదు. అందుకే చాలా ఫొటోలు extreme expressions తో కనపడతాయి ఆయనవి.


బాలమురళీ కృష్ణ, భీమ్ సేన్ జోషి ల అద్భుతమైన జుగల్ బందీ

తర్వాత తర్వాత , కర్ణాటక సంగీతం నేర్చుకునే రోజుల్లో ఆయన కచేరీలు విన్నపుడు  హిందూస్థానీ శైలి నచ్చేది కాదు. "బాలమురళి, సుబ్బులక్ష్మీ వీళ్ళే గొప్ప" అనుకునే దాన్ని! కానీ తర్వాత తర్వాత ఆయన కలెక్షన్లు కొనడం మొదలు పెట్టాను. అలా అలా హిందూస్థానీ అంటే ఇష్టపడటం అలవాటైంది.

భీమ్ సేన్ జోషి గురించి రాఘవేంద్ర స్వామి చరిత్ర లో ఒక అధ్యాయం ఉంటుంది..... అది ఎంతవరకూ నిజమో కానీ! గుర్తున్నంత వరకూ రాస్తున్నాను. భీమ్ సేన్ జోషి సంగీతం నేర్చుకుంటున్న రోజుల్లో కొన్నాళ్ళకు ఆయనకు ఏకాగ్రత లేకుండా పోయిందట. ఏది నేర్చుకోవాలన్నా విరక్తి కల్గేదట.అలా తిరుగుతూ తిరుగుతూ ఆయన మంత్రాలయం వచ్చారట. మఠంలో రాత్రి నిద్ర చేసేవారు. కొద్ది రోజులకే ఆయనకు రోజూ రాత్రి కలలో ఒక వృద్ధుడు కనపడి ఒక కొత్త రాగం బోధించేవారట. మెలకువ వచ్చాక కూడా ఆ రాగం, రాగ లక్షణాలు అన్నీ ఈయనకు బాగా గుర్తుండేవి. తెల్లవారుజామున తుంగభద్ర నదీ తీరానికి వెళ్ళి ఆ రాగాన్ని సాధన చేసే వారుట. సరిగ్గా అదే సమయానికి ఎక్కడినుచో ఒక కుక్క వచ్చి ఈయన సాధన చేస్తున్నంత సేపూ ఎదురుగా కూచుని, అపస్వరం పడగానే  తిరిగి  సరిగా పాడేవరకూ మొరుగుతూ ఉండేదిట. అలా ఎన్నో రాగాలను  సాక్షాత్తూ రాఘవేంద్ర స్వామి( వద్దనే జోషి  అభ్యసించారని  ఆ చరిత్ర చెప్తుంది.



భీమ్ సేన్ జోషి గారికి తొంభయ్యేళ్ళు! అయితే ఏం? ఇలాంటి అపురూప వ్యక్తులు ఒక రెండొందలేళ్ళు  జీవిస్తే మాత్రం ఏమి? వీళ్ళకు కూడా మామూలు మనుషుల్లాగే గరిష్టంగా వందేళ్ళేనా? ఎన్ని తరాలకు సరిపడా సంగీతామృతాన్ని పంచారో కదా! వీళ్ళకేమీ మినహాయింపులుండవా  ? అలా ఉంటే ఎంత బాగుండు !....బిస్మిల్లా ఖాన్ మరణించినపుడు కూడా ఇలాగే అనుకున్నాను నేను!

అత్యాశే కానీ అన్యాయం కాదుగా!








September 24, 2010

వంశీ గాన మాధురి......తప్పక ఆస్వాదించండి..!




అంతకు ముందు వారమే గోపి గోపిక గోదావరి టీవీలో చూశానేమో, పోయినాదివారం మావారు,పాపాయి సరదాగా కాసేపు సినిమాకెళ్దామంటే వణుక్కుంటూ బయలుదేరాను. నవతరంగంలో రివ్యూ  లో వర్ణించినంత  నీరసంగా లేదు గానీ గో గో గో మీద చాలా రెట్లు బెటరే అనిపించింది. రివ్యూ రాయడం లేదు గానీ ఆ సినిమా సంగీతం గురించి, వంశీ పాడిన పాటల గురించి రెండు ముక్కలు రాద్దామని....!

వంశీ సినిమాల్లో పాటలు చాలా మందికి నచ్చుతాయి. మెలొడీకి నా వోటే కాకుండా రిగ్గింగు కూడా చేసి మరీ ఓట్లు వేసే నాకు మరీ నచ్చుతాయి. సినిమాలో అన్ని పాటలూ కాకపోయినా చాలా వరకూ నచ్చుతాయి.సితార,ప్రేమించు పెళ్లాడు,చెట్టుకింద ప్లీడరు,అన్వేషణ,ఆలాపన ...ఇలా ! అసలు ఇళయరాజా,వంశీ కల్సి మెలొడీ ప్రేమికులతో చాలా ఆటలు ఆడుకున్నారు.   అనుమానాస్పదం సినిమా ఎప్పుడొచ్చి ఎప్పుడు పోయిందో తెలీదు(ఆర్యన్ రాజేష్ అనగానే పాపం చాలా సినిమాలకు ఇలాగే జరుగుతుంటుంది)  కానీ అందులో......
ప్రతి దినం నీ దర్శనం.

నిను వెదికి వెదికి. .ఈ రెండు పాటలూ ఎంతో బావుంటాయి.

వాటన్నింటి సంగతి వదిలేస్తే..ఇప్పుడు సరదాగా కాసేపు సినిమాలో వంశీయే రెండు పాటలు పాడటం విశేషం! అవి అంత చక్కగా పాడటం నాకో పెద్ద ఆనందాశ్చర్యం!  వంశీ మంచి భావుకుడనీ,సంగీతం పట్ల మంచి అభిరుచి ఉందనీ, కొంత పరిజ్ఞానం కూడా ఉందనీ తెలుసు గానీ ఇంత చక్కని గాయకుడని మాత్రం ఇప్పుడే తెల్సింది నాకు!

పాడిన రెండు పాటలూ (ఇప్పుడు వస్తున్న తెలుగు సినిమా పాటలతో పోలిస్తే) రెండు ఆణిముత్యాలు!  అంజనా సౌమ్య తో కల్సి పాడిన "ఊహలో సుందరా" పాట లో పాట మొదట్లో   వంశీ ఆలాపన ఎంత ప్రొఫెషనల్ గా ఉందంటే.... విని తీరాల్సిందే!   మరో పాట చైత్రతో కల్సి పాడిన " మగధీరా"..! ఇదీ అంతే! చక్కని మెలొడీ ఉన్న పాట.

రెండు పాటలూ ఎంతో ఆర్దృంగా , ఫీల్ తో పాడిన వంశీనీ అభినందించకుండా ఉండలేకపోయాను, అంజనా సౌమ్య స్వరం లో శ్రేయా ఘోసల్ , అనూరాధా శ్రీరామ్ ల స్వరాల ఛాయలు కనిపిస్తున్నాయి. గాయకులను చూస్తూ వారి పాట వినడంకంటే ఇలా రికార్డ్ లో విన్నపుడు మరింత క్లారిటీ వస్తుంది.

ఈ పాటలు ఇంత మధురంగా ఉండటానికి సంగీత దర్శకత్వం కూడా కారణమనుకోండి. వంశీ ఇన్నాళ్ళూ పాడకుండా ఉండటం అన్యాయమని ఆరోపిస్తూ...ఇకపై తీసే సినిమాల్లో అప్పుడప్పుడైనా పాడుతూ ఉండాలని గాఠ్ఠిగా డిమాండ్ చేస్తున్నాను!

ఇక్కడ వంశీ పాడిన పాటలు వినండి...రాగా లో!

ఊహలో సుందరా....!

మగధీరా..! సుకుమారా .

September 5, 2010

జీవితమే(మోహన) కృష్ణ సంగీతము ....!

పేపర్లోనో,పత్రికలోనో ప్రచురణ అయిన ప్రతి ముక్కా తెచ్చి బ్లాగులో పెట్టేంత ఓపిక నాకు లేదు. అంత అవసరమూ కనిపించదు. కానీ ఈ మధ్య చేసిన ఒక ఇంటర్వ్యూ ఎంతో ఇష్టంతో చేశాను. బాలమురళీ కృష్ణ గారి  ప్రియ శిష్యుడు శ్రీ డీవీ మోహన కృష్ణ గారి ఇంటర్వ్యూ ఈనాడు ఆదివారం సంచికకోసం!

ఆయన రేడియోలో సంగీత పాఠాలు నేర్చుకునేటపుడు మా చిన్నక్క శ్రద్ధగా కూచుని తనూ నేర్చుకునేది. మనకంత శ్రద్ధ లేదు కాబట్టి అటో ఇటో పోతూ అక్కడక్కడా గొంతు కలుపుతూ ఉండేదాన్ని. పైగా ఈయన బాలమురళి వద్ద పాఠం నేర్చుకుంటున్నపుడు ఎవరు గురువో, ఎవరు శిష్యుడో తెలిసేది కాదు. అంత సారూప్యత ఉంటుంది ఇద్దరి గొంతుల మధ్యా!


ఎన్నో సంగతుల్ని ఓపిగ్గా వివరించిన మోహన కృష్ణ గారిని అడగ్గానే కొన్ని పాటలు కూడా భేషజం లేకుండా పాడి వినిపించారు. ఇంటర్వ్యూ అనుకున్నది ఆత్మీయ మిత్రుల సమావేశంగా మారింది కాసేపటికి.




మోహన కృష్ణ ఒక అపురూపమైన శిష్యుడు. బాలమురళి ఒక అద్వితీయమైన గురువు గారు. గురుపూజోత్సవం సందర్భంగా ఈ రోజు ఈనాడు ఆదివారం లో వచ్చిన ఈ ఇంటర్వ్యూ ఇక్కడ ఇస్తున్నాను. కింద "వి.ఎల్.సుజాత" అని ఉంటుంది. నా పేరేలెండి అది! అన్ని రికార్డుల్లోనూ అలాగే ఉంటుంది మరి!

జీవితమే కృష్ణ సంగీతము అంటూ బాలమురళి పాడిన రాగమాలిక చిమట మ్యూజిక్ లో వినండి  ఇక్కడ!

June 4, 2010

డియర్ బాలూ..ఇదిగో నీకోలేఖ!



ప్రియమైన బాలూ,


ఏం చేస్తున్నావు? ఈ పాటికే బోలెడన్ని శుభాకాంక్షలు వచ్చేసి ఉంటాయి! ఏమిటో, నిన్ను మీరు అనాలనిపించదు మరి! నువ్వే అలా చేసుకున్నావు. గంభీరంగా ఉండవు, పండితారాధ్యుడవైనా పండితుడి భేషజాలు చూపించవు,పండితులతోనూ,పామరులతోనూ కలిసిపోగలవు....మరి నిన్ను మీరు అని గౌరవిస్తూ పదడుగుల దూరంలో నిలబడాలని ఎలా అనిపిస్తుంది?



అన్నట్లు ఎన్నో పుట్టినరోజు ఇది? ఎన్నోదైతే ఏం లే గానీ ఎప్పుడూ పాడుతూనే ఉంటాననీ అమృతాన్ని మా అందరికీ పంచుతూనే ఉంటాననీ మాటివ్వరాదూ?

అమృతం తాగినవాళ్ళు దేవతలూ దేవుళ్లైతే...నువ్వు దేవుడివే!సందేహం లేదు.


నిజానికి ఇలా నీలాంటి ప్రముఖుల పుట్టినరోజు నాడో, అవార్డులు వచ్చిన నాడో మాత్రమే వాళ్ళ గురించి తల్చుకోవడం నాకిష్టం ఉండదు. కానీ రాత్రి నీ పాటలు వింటూ ఉంటే ఇవాళ నీ పుట్టినరోజని గుర్తొచ్చింది. సరే నీకో ఉత్తరం రాయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా! అడ్రసా ..తెలీదు! రాసి పబ్లిగ్గా నా బ్లాగులో పెట్టేస్తే నువ్వు చదవకపోయినా పర్లేదు, బోల్డుమంది చదివేస్తారని పొద్దున్నే రాస్తున్నా!



అసలేంటి నీ స్వర మాధుర్యం రహస్యం చెప్పు! ఏం తింటావు? ఏం తాగుతావు? అమృతమా?(కేవలం అమృతమైతే ఆ సైజులో ఎందుకుంటావులెద్దూ)

ఏ దేవుడు ఇంతటి వరమిచ్చాడు నీకు?ఏ దేవత కరుణించింది ఇంత దయతో!



ఇక నువ్వు ఎక్కాల్సిన ఎత్తుల్లేవు! ఇంత ఎత్తుకెదిగినా "శాస్త్రీయ సంగీతం నేర్చుకోకపోవడమొక్కటే లోటు! ఇప్పటికైనా నేర్చుకుంటాను"అని చెప్పగలిగే వినయం ఎక్కడినుంచి వచ్చిందోయ్ నీకు!మన రియాలిటీ షోల్లో చూడు,పదేళ్ల పసి గుడ్లు సైతం శ్రుతులూ,నొటేషన్ల గురించి ఎంత అలవోగ్గా మాట్లాడేస్తారో?వాళ్ళను చూసైనా నేర్చుకోవూ!అంతేనా ..!జడ్జీలు మాత్రం...!పాడే పిల్లల్ని ఏడిపించి,వాళ్ళ కంట నీరు చూసి గానీ వదలరు.

వాళ్ళలా నువ్వుండవెందుకని?నీ ముఖాన చిరునవ్వు ఎప్పుడూ చెరగదెందుకని?



పాట సాహిత్యంలోని మాధుర్యాన్ని,భావాన్ని అర్థం చేసుకుని అనుభవించి ఆస్వాదిస్తూ పాడే నీలాంటి గాయకులు లేక,ప్రతి పదాన్నీ ఒత్తొత్తి పలికే ఉత్తుత్తి నారాయణుల పాలిట పడి అలమటిస్తున్నాం!వాళ్లకు తగ్గట్లే కాన్ టెంపరరీ సాహిత్యాలూ,నెట్లో దొరికే ఇంగ్లీషు విడియోల నుంచి ఎత్తేసిన బాణీలూ!



నీకు భాషంటే ప్రాణం! "శ"ని "ష"అని పలికేవాళ్ళంటే మంట!

సంగీతమంటే జీవితం!సాహిత్యమంటే ఆరాధన!



నువ్వొక లెజెండ్ వి!సంగీత సరస్వతి ముద్దు బిడ్డవి!

నువ్వు మా అందరివాడివి!


ఎవరన్నారు శాస్త్రీయ సంగీతమే గొప్పదని!

జనహృదయాన్ని గెల్చేదేదైనా గొప్పదే!



కుశలమా....నీవు కుశలమేనా అని శృంగారాన్ని పలికించినా

ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా అంటూ విషాదాన్ని ఒలికించినా


సిరిమల్లె నీవే విరిజల్లు కావే అంటూ ప్రేమను పండించినా

ఓయబ్బో ఏమి సింగారం...ఓయబ్బో లేతబంగారం అంటూ వెటకారం వడ్డించినా..


శివానీ భవానీ..అంటూ  ఎలుగెత్తి ఆలపించినా


లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను..అంటూ వినమ్రంగా లాలిత్యాన్ని వెలిగించినా



నీకు నువ్వే సాటి! నీకెవరూ లేరు పోటీ!ఎప్పటికీ!

ఇదే నిజం!నిఝంగా నిజం!



నీ మాటలు ఛలోక్తులు వింటుంటే నువ్వెవరో పరాయివాడివనిపించదు.

ఇంట్లో మనిషివనిపిస్తుంది.బాబాయో,మావయ్యో,అన్నయ్యో పక్కన కూచుని మాట్లాడుతున్నట్లనిపిస్తుంది.ఒక్కోసారి "అచ్చం మనలాగే మాట్లాడుతున్నాడే"అనిపిస్తుంది.



అందుకే నిన్ను మీరనాలనిపించదు.దూరం చేసుకున్నట్లుంది మరి!



నువ్వు భారంగా నడిచి వస్తున్నపుడు,కుర్చీలోంచి లేవడానికి ఇబ్బంది పడుతూ నీ "లావు" మీద నువ్వు జోకులేసుకుంటుంటే నాకేం నవ్వు రాదు తెలుసా!



భయమేస్తుంది.దిగులేస్తుంది. కంగారు పుడుతుంది

నీ మీద కోపం వస్తుంది. నిన్ను నాలుగు చీవాట్లేయాలనిపిస్తుంది


"అమ్మో,బాలూకేమైనా అయితే" అన్న ఊహ వణికిస్తుంది.



దానిగురించి ఏమీ చేయవా నువ్వు? అద్నాన్ సమీ చూడు!ఎలాంటివాడు ఎలా ఐపోయాడో!నువ్వు కూడా కాస్త ఒళ్ళు తగ్గించుకోరాదూ!

 నీకోసం కాదు, నీకోసం చూసే మాకోసం!



సంగీతాన్ని ఆస్వాదించి అనుభవించేవారి గుండె ఎప్పుడూ పదిలంగా ఉంటుంది.నీ గుండెకేం ఢోకా లేదు.

కానీ ఈ చిన్న సర్దుబాటుతో సమాధానపరచుకోవడం కష్టంగా ఉందోయ్! ఆలోచించుమరి!


బాలూ ఎప్పుడూ పాడుతూ ఉండాలి హాయిగా, తీయగా!


బాలూ చల్లగా ఉండాలి.

నీ పాటల లింకులేవీ ఇక్కడివ్వట్లేదు!

ఎవరు వినలేదని?ఎవరికి తెలీవని?


ఏమిటో సంగీత కారులంతా జూన్ లోనే పుట్టినట్లున్నారు..నువ్వూ,ఇళయరాజా,నేనూ...:-))

హాపీ బర్త్ డే బాలూ!

February 22, 2010

"కృష్ణా నీ బేగనే బారో....!"

90 ల్లో కొలొనియల్ కజిన్స్ పేరుతో వచ్చిన ఆల్బమ్ లో ఈ కీర్తన ని హరిహరన్ లెస్లీ లూయిస్ తో కలిసి పాడినపుడు ప్రతి సంగీతాభిమానినీ ఉర్రూతలూగించింది. వ్యాసతీర్థుల వారు రచించిన ఈ కన్నడ సంకీర్తనలో చిన్ని కృష్ణుడి సౌందర్యాన్ని వర్ణిస్తూ రారమ్మని పిలవడం జరుగుతుంది.



కొలోనియల్ కజిన్స్ ఆల్బం తర్వాత ప్రతి శాస్త్రీయ సంగీత కచేరీలోనూ "కృష్ణా నీ  బేగనే బారో" తప్పనిసరై పోయిందిట.

ఆ ఆల్బం లో లెస్లీ, హరి హరన్ లు ఇద్దరూ అద్భుతంగా పాడారు. ఇంగ్లీష్ సాహిత్యం కూడా భలే ఉంటుంది. ఏ కాలానికైనా సరిపోయేట్టుగా ! ఇదిగో చూడండి....



Krishna nee begane baro
Krishna nee begane baro
Darkness coming round
And everybody fighting with their brothers
Everybody wants control
Don't hesitate to kill one another
So come back as Jesus


Come back and save the world
That's all the future
Of every boy and girl
Come back as Rama
Forgive us for what we've done Come back as Allah
Come back as anyone


Krishna nee begane baro
krishna nee begane baro




Religion is the reason
The world is breaking up into pieces
Colour of the people
Keeps us locked in hate please release us


hmm..


So come down and help us
Save all the little ones
They need a teacher
And you are the only one


We can rely on
To build a better world
A world that's for children
A world that's for everyone


Krishna nee begane baro
Krishna nee begane baro


Time is the healer
Time moves on
Time don't wait for anyone
You tell you'll be back
But that will take some time


I'm waiting...


ahh......


I'm waiting...
Waiting...

I'm waiting...
I'm waiting


Yea.... Yea...


Come back as Jesus
Come back and save the world
We need a teacher
You are the only one
Come back as Rama
Forgive us for what we've done


Come back as Allah
Come back as anyone


Krishna nee begane baro
Krishna nee begane baro


Jesus!
Come back and save the world
That's all the future
Of every boy and girl
Come back as Rama


Forgive us for what we've done
Come back as Allah
Come back for everyone
Govinda bolo hare Gopal bolo...

వీడియో కూడా చాలా నచ్చింది నాకు!

ఆ మధ్య హైదరాబాదు లో హరిహరన్ లైవ్ షో జరిగినపుడు ఈ పాట పాడాలని కోరగానే వెంటనే పాడాడు. మామూలుగా అయితే చివర్లో I'm waiting.." తో పాట పూర్తవుతుంది.

లైవ్ లో I'm waiting.."అంటూ హరిహరన్ నెమ్మదిగా గొంతు తగ్గిస్తూ వెళ్ళి కూచోగానే percussionist(పేరు తపన్ ఘోష్ అని గుర్తుంది ....)అందుకుని దాదాపు 35 నిమిషాల సేపు రకరకాల బీట్స్ తో ఒక ఆట ఆడుకున్నాడు ప్రేక్షకుల్ని! ఎంతగా అంటే ఆ పాట హరిహరన్ మొదలెట్టాడని అందరూ మర్చిపోయేంతగా!



అంతా ఊపిరి బిగపట్టి ఆ బీట్స్ లో లీనమైపోయి ఉండగా చివర్లో హటాత్తుగా హరిహరన్ వచ్చి "I'm waiting" అని అందుకునేసరికి ఉలిక్కిపడి తెప్పరిల్లిన ప్రేక్షకుల నుంచి చప్పట్లు కుంభవృష్టిగా కురిశాయి.

ఈ పాట ను శ్రీ కృష్ణ దర్శనం ఆల్బమ్ కోసం ఉన్ని కృష్ణన్ పాడిన వెర్షన్ ఇక్కడ. వినండి.
"బారో..." అనడంలో ఎంత లాలన, గారాబం పలికిస్తాడంటే బాల కృష్ణుడు వెన్న చేతిని నాక్కుంటూ
పరుగెత్తుకు రావలసిందే! (ఉన్ని కృష్ణన్ గురించి ఒక టపా రాయాలి)

కద్రి గోపాలనాథ్ గారి శాక్సో ఫోన్ లో ఇక్కడ .వినండి!

January 19, 2010

వాహ్ ఉస్తాద్! వాహ్!


జాకీర్ హుస్సేన్ అనేవాడు లేకపోతే భారతీయ సంగీతంలో తబలా అనేది కేవలం పక్క వాయిద్యంగానే మిగిలిపోయేదేమో!




ఢిల్లీ దూరదర్శన్ లేకపోతే ఇటువంటి కళాకారులు సామాన్య కళారాధకులకు ఎప్పటికీ తెలియకుండానే ఉండిపోయేవారేమో!



రెండు దశాబ్దాల క్రితం దూర దర్శన్ ప్రభ వెలుగుతున్న రోజుల్లో తండ్రి ఉస్తాద్ అల్లా రఖాతో కలిసి జాకీర్ హుస్సేన్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన కార్యక్రమాలనెవరు మర్చిపోగలరు? అలల్లాగ అతని జుట్టు నుదుటిమీద పడుతుంటే అది దూరదర్శన్ కెమెరా స్లో మోషన్లో చూపి మనల్ని మంత్ర ముగ్ధుల్ని చేసిన క్షణాలు ఎవరికి మరుపుకొస్తాయి?



తబలా అనేది కేవలం పక్క వాయిద్యం కాదనీ,దానితో అద్భుతాలు సృషించవచ్చనీ జాకీర్ నిర్ధారణ చేశాక,
అతని అభిమానిగా మారకుండా ఉండటం అసాధ్యమే అయింది.అందుబాటులో అతని కచేరీలు ఉంటే వెళ్ళకుండా ఉండటమూ అసాధ్యమే అయింది.





మొన్న జనవరి 16 శనివారం సాయంత్రం హైదరాబాదు ప్రేక్షకులు అతడి వేళ్ళు చేసే మాజిక్ కి కట్టుబడి బందీలై పోయేందుకు హోటల్ నొవోటెల్ ప్రాంగణంలోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ కి పరుగు పరుగున వచ్చారు. వారిలో మేమూ!



ఈ కచేరీలో జాకీర్ తో పాటు ఆయన సోదరుడు తాఫిక్ ఖురేషి(Drums),సితార్ మేస్ట్రో నీలాద్రి కుమార్,సారంగి కళాకారుడు సాబిర్ ఖాన్ కూడా పాల్గొన్నారు.



తాఫిక్ మొదటగా వచ్చి కేవలం నోటితో చేసే "హ" అనే శబ్దంతోనే ఒక పెద్ద కంపోజిషన్ దాదాపు ఇరవై నిమిషాల సేపు ఉచ్ఛ మంద్ర స్థాయిల్లో వినిపించి, అందులోంచి తేరుకునేలోపుగా ఉచ్ఛస్థాయిలో ఉంది భార్య గొంతనీ, మంద్రస్థాయిలో మొహమాటపడుతోంది భర్త గొంతనీ తేల్చి నవ్వించాడు. (మగవాళ్ళను నవ్వించడానికి ఇంతకంటే మంచి జోకు ఉంటుందా? ) 



రెండు మూడు జోకుల తర్వాత అతి సామాన్యంగా వచ్చి సారంగి తో రాగాలాపన మొదలుపెట్టిన సాబిర్ ఖాన్ మరి కొద్ది నిమిషాల్లోనే ప్రేక్షకులను తనతో పాటు మరోలోకానికి తీసుకెళ్ళిపోయాడు.

అక్కడ, ఆ రసలోకపు తీరాల్లో అతని సారంగి తరంగాలు తప్ప మరేమీ లేవు. అసలు సారంగి వాద్యమే ఒక గొప్ప విషాదంలా, మనల్ని చుట్టేస్తూ ఏవేవో గతజన్మ స్మృతుల్ని శృతిచేస్తూ ఆనందమూ, దుఃఖమూ కలగలిసిన తీరాలకు తోడ్కుపోయేలా ఉంటుంది.

 సాబిర్ ఖాన్ కుటుంబంలో సారంగి వాద్యం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం కాగా ఇతడు ఏడో తరం కళాకారుడట. పట్టుమని పాతికేళ్ళు లేని ఆ యువకుడి అసమాన ప్రతిభ చూసి నిజంగా కొద్దిగా ఈర్ష్య వేసింది.అతడి వాద్యంలో ప్రేక్షకులు ఎంతగా లీనమైపోయారంటే మధ్యలో నిశ్శబ్దంగా వచ్చి కూచుని తబలాతో శృతి కలిపేదాకా ఎవరూ జాకీర్ ని గమనించనే లేదు.






ఆ తర్వాత జాకీర్ చేసిన అద్భుతాలు ఎన్నని? సారంగికి పక్క వాయిద్యంలా ఉన్న తబలాకి కాసేపటికే సారంగి పక్క వాయిద్యంగా మరిపోయింది!అద్భుతమైన అతడి వేళ్ల కదలికలు సృష్టించిన మాయాజాలానికి అంతే లేకుండా పోయింది.

 రాధాకృష్ణుల చిలిపి తగాదా,అడవిలో లేడిపిల్ల గంతులు,రుద్ర తాండవం,ట్రాఫిక్ జామ్ వంటి అనేకాంశాలను, సంఘటనలను, సంభాషణలను తబలా కంపోజిషన్ లో మలిచి వినిపించారు(ఇది ఆయన దాదాపు ప్రతి కచేరిలోనూ చేస్తారు)

రుద్రతాండవం లో తబలా మీద శంఖ ధ్వనిని సృష్టించి అబ్బురపరిచాడు.ప్రేక్షకులెవరూ ఇది ఊహించనిది కావడంతో ఆ శంఖ ధ్వనికి ఆడిటోరియమంతా "హా" అన్న శబ్దంతో ఒక్కసారిగా అబ్బురపడిపోయింది.



తరవాత వచ్చి కలిసిన నీలాద్రి కుమార్ సితారతో ప్రతి ఒక్కరి గుండెనూ మీటి మంత్ర ముగ్ధుల్ని చేశాడు.కొన్ని కొన్ని తారాస్థాయిల్లో... రసానుభూతి అంటే ఇదీ అని నిర్వచించిన అనుభూతి! రస సిద్ధి అంటే ఇదే అని నిశ్చయించిన అపురూప క్షణాలు. అతని ప్రతిభకు జాకీర్ సైతం తలవంచి అభివాదం చేశాడు.నీలాద్రి కుమార్ కూడా వారి కుటుంబంలో అయిదో తరం సితార ప్రవీణుడట.





చివర్లో నలుగురూ కలిసి సృష్టించిన ఫ్యూజన్ ఒక మధురానుభూతి. దాన్ని వర్ణించడానికి ప్రయత్నించడం సాహసమే! విన్నవారికి అనుభవైకవేద్యం కావలసిందే తప్ప ఇంత బావుందని చెప్పడం పేలవంగా ఉంటుంది.



అద్భుతమై, రస ప్రవాహంలో తేలియాడించి ఉర్రూతలూగించిన ఆ సాయంత్రాన్ని పదిలంగా మదిలో దాచుకుని భారంగా తిరిగి రాక తప్పింది కాదు.... కళ్ళముందే మూడుగంటల కాలం మంచులా కరిగిపోగా!



కొసమెరుపు: "ఆ తబలా అంకుల్ జుట్టు "అపరిచితుడి" జుట్టులా ఉంది" అంటూ మా పాప కితాబిచ్చింది వస్తూ వస్తూ!

Note: ఫ్లాష్ ఉపయోగించకుండా ఫొటో తీయవలసి రావడంతో ఫొటోలు ఇలా చీకట్లో కాంతులీనుతున్నాయి.

September 9, 2009

ఇంకా పాడాలా?


సినిమా గాయకుల్లో నాకు శ్రీమతి పి.సుశీల గారి స్వరం అంటే చెప్పలేనంత అభిమానం! ఆరాధన,ఇష్టం, పిచ్చి! శాస్త్రీయ సంగీతాన్ని కొన్నాళ్ళు నేర్చుకున్నా, నాకు అటువైపు కంటే పాత సినిమా పాటల మీద మనసు పీకుతూ ఉండేది,(ఇప్పటికీ అనుకోండి)! దానికి ఇతోధికంగా దోహదం చేసింది విజయవాడ ఆలిండియా రేడియో! వాళ్లెప్పుడూ పా........త పాటలు తప్ప కొత్త పాటలు వెయ్యకూడని కంకణం కట్టేసుకుని ఉంటారు రెండు చేతులకీ!

అలా పాత సినిమా పాటల మీద వ్యామోహం పెంచుకుని  ఆనాటి సుశీల గారి పాటలు విని(ఈనాటికీ) పరవశించడం జీవితంలో ఒక భాగంగా మారిపోయింది.నా శాస్త్రీయ సంగీత సాధన చెట్టెక్కడానికి సుశీల గారే కారణం అని ఆరోపించడానికి కూడా సిద్ధమే!


పాత తెలుగు సినిమా పాటల్లో జానకి కి అంత ప్రాధాన్యం లేకపోవడం వల్లనో, మంచిపాటలు ఆమెకు దక్కకపోవడం వల్లనో ఇళయరాజా శకం వచ్చేదాకా జానకిపాటలు అంతగా నచ్చేవి కాదు. మొత్తం మీద ఇద్దర్లో ఎవరికి వోటంటే నిస్సందేహంగా నా వోటు సుశీలకే!


మహా కవి కాళిదాసు సినిమాలో జయ జయ జయ శారదా పాట వింటే సరస్వతి లేచి పరిగెత్తుకుంటూ వస్తుందేమో అనిపిస్తుందిప్పటికీ!



రాజేశ్వర రావు గారి సంగీత దర్శకత్వంలో సుశీల స్వరంలో ప్రాణం పోసుకున్న అమృత ధారలు కోకొల్లలు. ఆమెకు పెద్దగా పోటీ లేకపోవడం వల్ల,ఆమె గొంతులో ఉన్న క్వాలిటీ మిగిలిన గాయనీమణుల గొంతుల్లో లేకపోవడం వల్ల కాబోలు కొన్ని వేల పాటల్ని అలవోకగా పాడి తెలుగు సినీ సంగీత సామ్రాజ్యానికి దశాబ్దాల పాటు మహరాణిగా వెలుగొందారు సుశీల!



ఆమె స్వరంలో ఉన్న మాధుర్యం మెత్తదనం, మృదుత్వం,సౌకుమార్యం, భావ ప్రకటనా సామర్థ్యం,..అనితర సాధ్యం! సుశీల గారి పాటల్లో నేను ప్రాణాలిచ్చేపాటలు కొన్ని....(కొన్ని మాత్రమే)


కనరాని దేవుడే కనిపించినాడే.(రంగుల రాట్నం)


ఏమని పాడెదనో ఈ వేళ.(భార్యా భర్తలు)


మోగింది వీణ పదే పదే .(జమీందారు గారి అమ్మాయి)



జోరు మీదున్నావు తుమ్మెదా. (శివరంజని)



లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను. (కళ్యాణి)


ఇంకా అనేకం, సమయానికి గుర్తు రావు కానీ!



సుశీల గారి తర్వాత స్థానం జానకి కే! లతా మగేష్కర్ పాత హిందీపాటలన్నా సుశీల గారి తెలుగుపాటల స్థాయిలోనే మనసు పారేసుకుంటాను.


ఇక విషయానికొస్తే....


వృద్ధాప్యం ఎవరినైనా జయించి తీరుతుంది, మనసును కాకపోయినా , కనీసం శరీరాన్ని!



లతా మంగేష్కర్, సుశీల, జానకి వీళ్లంతా తెలుగు సినీ సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించి,సంగీత ప్రపంచాన్ని జయించినవారే! సందేహమే లేదు. కానీ వీరు వృద్ధాప్యం తమ స్వరంలో ప్రవేశించి దాన్ని జయించిందన్న కఠిన సత్యాన్ని అంగీకరించకపోవడం ఆశ్చర్యాన్ని, ఒకింత బాధను కల్గిస్తుంది నాకు!



ఏదొ ఒక సన్మాన సభలోనో, సంగీత కార్యక్రమం  లో న్యాయనిర్ణేతలుగా వచ్చినపుడో నిర్వాహకులు పాడమని అడిగినపుడు వీరు పాడాలని ప్రయత్నిస్తే  శ్రోతలకు(లేదా వీక్షకులకు)ఆ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది.



దానికి ఇంకో కారణం కూడా ఉంది.తమ అభిమాన గాయనీమణుల మీద అవధులు లేని అభిమానంతోనో, సభా మర్యాద కోసమో ఇప్పటికీ సంగీత దర్శకులు, సభ నిర్వాహకులు "ఆమె స్వరంలో ఇంకా మాధుర్యం లేశమైనా తగ్గలేదు"అని ఇచ్చే మొహమాటపు స్టేట్ మెంట్స్ వారి ఆత్మవిశ్వాసాన్ని "బూస్టప్" చేస్తుండవచ్చు!



ఆమధ్య జానకి గారు ఒక స్టేజ్ మీద  సిరి మల్లె పూవా. పాట పాడడానికి ఎంతో ప్రయాస పడటం చూసి చెప్పలేనంత విచారం వేసింది.నిజానికి కళ్ళు ముసుకుని ఆ పాట వింటుంటే పదహారేళ్ళ శ్రీదేవి ఊహల్లోకి పరుగెత్తుకు రావలసిందే! కానీ ఆమె ఆనాటి "స్థాయి"(pitch)ని అందుకోలేకపోయారు.



లతా మంగేష్కర్ పరిస్థితీ ఇదే! అలాగే ఆశా భోంస్లే  ఈ మధ్య చందమామ సినిమ కోసం పాడిన నాలో ఊహలకు. పాట వింటే ఆమె స్వరంలో మార్పు గమనించవచ్చు.


ఈ మధ్యనే ఒక టీవీ ఛానెల్లో గాయని, యాంకర్ సునీత "ఝుమ్మంది నాదం" అనే కార్యక్రమాన్ని సుశీల గారితో నిర్వహించడం చూశాను.(ఈ కార్యక్రమం పేరు కూడా సుశీల గారి సూపర్ హిట్ పాటే) అందులో శ్రీమతి సుశీల "ఏమని పాడెదనో" పాట పాడి వినిపించారు. (ఒరిజినల్ పాట పైన విన్నారుగా)



ఎంతో అద్భుతమైన పాట! చక్కని భావ ప్రకటన, అతి చక్కని సింపుల్ గమకాలతో అందంగా సుశీల గారు పాడిన పాట!



సుశీల ఈ పాటను "సరిగా" పాడాలని ఎంత ప్రయత్నించినా, ప్రయాస పడినా శ్రుతి, లయ తప్పనే తప్పాయి! . ఊపిరి తీసుకోడానికి మధ్యలో ఆగి,ఎలాగో మేనేజ్ చేయవలసి వచ్చింది, ఆర్కెస్ట్రా ఎంతగానో సహకరించినా!

అంతకు ముందే ఒరిజినల్ పాట చూసి ఉండటంతో ఈ పాట విని మనసు వికలమైపోయింది.

సునీత అతిశయోక్తులతో అ పాటను మెచ్చుకుని మళ్ళీ మళ్ళీ పాడించింది.

నా బాధాపూర్వక వినతి ఏమిటంటే 

"మీరంతా ఒకప్పుడు సంగీత ప్రపంచాన్ని ఏలి, అభిమానుల్ని పాదాక్రాంతుల్ని చేసుకున్నవారు! అమృతాన్ని తాగి మాకు పంచిన వారు! వయసు పైబడ్డ కారణంగా, వృద్ధాప్యం మీ స్వరం పై తన ప్రభావాన్ని నిస్సంకోచంగా చూపిస్తోందని గ్రహించండి. మీరు ఒకప్పుడు కర్ణపేయంగా పంచిన మధుర స్వరాలను మా మనసులో, ఊహల్లో,  మా చెవుల్లో నిలిచిపోనివ్వండి! ఆ పాటలను ఇపుడు  మళ్ళీ పాడాలనే ఉత్సాహంతో, మా కలలను చెదరగొట్టకండి!






ఏ స్టేజ్ మీదో మిమ్మల్ని పాడమని అభిమానులో, నిర్వాహకులో కోరితే స్వరం సహకరించడం లేదని చెప్పి సున్నితంగా తిరస్కరిస్తే మీ గౌరవం హెచ్చుతుందే గానీ తగ్గదు!మీ అద్భుతమైన గళంలో ఈ అనూహ్యమైన మార్పును అభిమానులు ఊహించుకోలేరు మరి!"

"జీవితపు చివరి క్షణాల వరకూ పాడుతూ ఉండాలనే"  కోరిక గాయకులందరికీ ఉండొచ్చు కానీ(వృద్ధాప్యం మీద పడ్డాక) అందులోని సాధ్యా సాధ్యాలను, అభిమానుల మనోభావాలను కూడా పట్టించుకుంటే బాగుంటుందేమో!



ఝుమ్మంది నాదం వీడియో క్లిప్పింగ్ నా దగ్గరుంది. కానీ అదొక బాధాకరమైన అనుభవం! దాన్ని అందరితో పంచుకోవడానికి కూడా మనస్కరించక  ఇక్కడ అప్ లోడ్ చేయలేదు!

ఈ గాయనీమణుల మీద నాకెలాంటి ఫిర్యాదూ లేదు. హద్దులు లేని అభిమానంతో రాసిందే ఈ టపా!

January 24, 2009

"లలిత" ప్రియ కమలం విరిసినది....!

హైదరాబాద్ మొత్తం సంగీత వర్షంలో తడిసి ముద్దయి పరవశించింది. సంగీత ప్రియులంతా ఒక్క చోట కూడి కురిపించిన వేల వేల చప్పట్ల మధ్య సంగీతం నాట్యం చేసింది.




ఆయన కనపడగానే "అసలే కనులలో నీవు, ఆ పై కన్నీరు, తీరా దయ జేయగ నీ రూపు తోచదయ్యయ్యో" అన్నట్లు, దుఃఖమో, సంతోషమో, ఉద్విగ్నమో తెలియని స్థితిలో నీటితో కళ్ళు నిండిపోయి చూపు మసకేసిపోయింది.



ఆయన స్వరాన్ని వింటూ మైమరచి శిలలైపోయిన శ్రోతలకు రాల్గరిగించే అమరగానంతో జీవం పోసి,వారిని కరిగించి ప్రాణాలు తీసుకుని మళ్ళీ అమృతం పోసి అమరత్వాన్ని ప్రసాదిస్తూ, సంగీత రసాంబుధిని వేయి చేతుల కార్తవీర్యార్జునుడిలా ఈదుతూ, శ్రోతలని తనతో పాటు తీసుకెళ్ళి, ఆ స్వర రాగ గంగా ప్రవాహంలో తిప్పి తిప్పి మంత్ర నగరి సరిహద్దులకు విసిరి కొట్టాడా సంగీత మాంత్రికుడు.





(జేసుదాస్ గారు మీడియా కూడా తన కచేరీని రికార్డ్ చేయకూడదని నిబంధన విధించడంతో ఫొటోలు తీయలేకపోయాను. ఇది చివర్లో కచేరీ ముగిసాక మొబైల్ లో తీసింది).



లలిత కళా తోరణం ఈ సాయంత్రం పరవశించి పులకించి పోయింది.అద్భుతమైన సాయంత్రపు ఆవిష్కరణకు వేదికై నిలిచింది. శ్రీ జేసుదాస్ శాస్త్రీయ సంగీత కచేరీ హైదరాబాదు సంగీత ప్రియుల దాహాన్ని కొంత వరకు తీర్చింది.



సంగీత సరస్వతి సాక్షాత్కారం అంటే ఏమిటో అనుభవానికొచ్చింది. ఈ సంగీత సరస్వతి కా గురువాయూరప్ప దర్శనాన్ని తిరస్కరించింది? దురదృష్టం!అవును దురదృష్టమే....ఆ గురువాయూరప్పది! జేసుదాస్ పాటను వినలేకపోయాడు.



మధుర స్వరానికి మతం లేదు. సంగీతానికి కులం లేదు. జేసుదాస్ కచేరీ ముందు మాట్లాడిన రెండు మాటలు కూడా ఇవే! "మతాలన్నింటిలో దేవుడున్నాడు, కానీ దేవుడికి మతం లేదు. అందర్నీ ప్రేమించండి" ఇవే ఆయన మాట్లాడిన మాటలు.!



సరసాంగి రాగంలో వర్ణం తో మొదలు పెట్టి "హరివరాసనం" అన్న అయ్యప్ప పాటతో ముగిసిన స్వర రాగ గంగా ప్రవాహం రెండు గంటలు సాగింది. అతిథుల కోరికపై చిత్ చోర్ చిత్రంలోని "జబ్ దీప్ జలే ఆనా" కూడా పాడి వినిపించారు. ఆయన రామప్రియ రాగానికి, పంతువరాళి రాగానికి స్వరస్థానాల్లోని తేడాలు ఒక కీర్తన పాడుతూ వివరిస్తుండగా దగ్గర్లోని నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఒక రైలు రెండు సార్లు రెండు శ్రుతుల్లో కూత పెట్టింది. వెంటనే జేసుదాస్ ఆ స్థాయిల్లోని తేడాలను రామప్రియ రాగం స్వరస్థానాలకు అన్వయించి చెప్పి రక్తి గట్టించారు.



చివరగా...శిశుర్వేత్తి పశుర్వేత్తి అన్న నానుడి ఈ కచేరీలో నిజమైంది. సరసాంగి వర్ణం ఆయన పాడుతుండగా ఆశ్చర్యంగా వింటున్న నా అయిదున్నరేళ్ల కూతురు వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెట్టింది.నాకు ఎందుకో అర్థం కాక బుజ్జగించి అడిగితే "ఆ పాట వింటుంటే ఊరికే ఏడుపు వస్తోంది. ఏదోగా ఉంది,ఏమిటో తెలియడం లేదు" అని చెప్పింది.

December 23, 2008

ఎల్లలెరుగనివారము!

చిన్నప్పుడు 80' ల్లో స్కూల్లో ఉన్నరోజుల్లో ప్రతి ఆదివారం ఉదయం 8-30 కి శ్రీ చిత్తరంజన్ గారు హైదరాబాదు రేడియో కేంద్రంలో "కలసి పాడుదాం" అనే కార్యక్రమాన్ని నిర్వహించే వారు. కొంత మంది పాడు పిల్లలని(పాడే పిల్లలని లెండి) తీసుకుని వారికి భారతీయ భాషల్లో ఒక పాటని నేర్పించడం. ప్రతి నెలా ఒక్కో పాట! అలా ఈ కార్యక్రమం రెండు, మూడేళ్ళు కొనసాగినట్టు గుర్తు! నేను ఆరోక్లాసులోనో, ఏడో క్లాసులోనో ఉండగా ఈ పాట "ఎల్లలెరుగని వారము.." ను ప్రపంచ బాలల గీతం పేరుతో చిత్తరంజన్ గారు నేర్పించారు. మేము దాదాపు ప్రతి పాటా రేడియో ముందు కదలకుండా కూచుని, శ్రద్ధగా రాసుకుని నేర్చుకునే వాళ్ళం. ఎందుకంటే మేమూ పాడు పిల్లలమే కాబట్టి! అన్ని బహుమతులూ అమ్మాయిల హైస్కూలుకే రావాలనీ, బాయ్స్ హై స్కూలుకు ఒక్క బహుమతీ రాకుండా చేయాలనే దుగ్ధ కూడా మా ఆసక్తికి,శ్రద్ధకు కొంత వరకు కారణం!



ఎంతమందికి గుర్తున్నాయో గానీ ఆ పాటల్లో కొన్ని



హోంగే కామియాబ్(హింది)

మిల్కే చలో(హింది)

ఎక్ లా చలోరే(బెంగాలి)

ఆకాశ్ గంగా సూర్య చంద్ర తారా(అస్సామీ)

ఓడి విళయాడు పాపా(తమిళం)

జయ జయహే భగవతి సుర భారతి(సంస్కృతం)

జయ జన భారత్, జనమన్ అభిమత్(ఇదీ సంస్కృతమే)

పిల్లల్లారా పాపల్లారా రేపటి భారత పౌరుల్లారా(తెలుగు)

ఎల్లలెరుగని వారము(తెలుగు)



ఇంకా కొన్ని పాటలు మెదడులో కొట్టుకుంటున్నాయి గానీ బయటకు రావట్లేదు.

వీటిలో ప్రపంచ బాలల గీతాన్ని ప్రపంచ భాషలన్నింటిలోనూ రాసి ఆయా దేశాల్లోని పిల్లలు పాడుకుంటారని చిత్తరంజన్ గారు అప్పట్లో చెప్పిన గుర్తు. ఆ పాట సాహిత్యం ఎవరి దగ్గరన్నా ఉంటే కావాలని చిత్తజల్లు అంజని గారు నా బ్లాగులో వ్యాఖ్యానిస్తూ కోరారు. ఆ పాట స్కూలు రోజుల నాటి పాత పుస్తకాల్లో ఎక్కడుందో వెతికి పట్టుకునే సరికి ఇన్నాళ్లయింది. ఆ పాట ఇది.



పల్లవి: ఎల్లలెరుగని వారము కల్లలెరుగని వారము

బాలలం మేం ఒక్కటే లోకమూ మాకొక్కటే :ఎల్లలెరుగని:



చరణం 1 : అన్నం పప్పు చారు కూర శాకాహారం తినువారైతే

గుడ్డు, చేప కోడి కూర మాంసాహారం తినువారైతే

తిండేదైనా తీరేదైనా, తినగోరే ఆ రుచులేవైనా

బాలలం మేం ఒక్కటే, లోకమూ మాకొక్కటే





చరణం 2 :గోధుమ రంగున కొందరు పసుపు రంగు ఇంకొందరు

తెలుపు నలుపు యాపిల్ ఎరుపు ఏ రైంగైనా ముచ్చట గొలుపు

రంగేదైనా రూపేదైనా నివసించే ఆ చోటేదైనా

బాలలం మేం ఒక్కటే లోకమూ మాకొక్కటే



చరణం 3: ఔనందురు యెస్ అందురు కొందరు ఓకే దాదా అందురు కొందరు

సీ, దేఖో, జావ్ అంటూ కొందరు పలు విధాలుగా పలుకుచుందురు

మాటేదైనా పాటేదైనా, మాట్లాడే ఆ భాషేదైనా

బాలలం మేం ఒక్కటే, లోకమూ మాకొక్కటే

ఈ పాట ఆడియో నాకు ఎక్కడా దొరకలేదు అంతర్జాలంలో! ఎవరికన్నా దొరికితే అప్ లోడ్ చేస్తే విని ఆనందిస్తాను.

June 26, 2008

అమ్మాయిలు - ఆంటీలు

తెలుగులో కొన్ని కొన్ని మాటలు ఇతర భాషల నుండో, లేక సరదా కోసం పుట్టించినవో లేక మరో రకంగానో వచ్చి చాలా జెన్యూన్ గా చెలామణి అయిపోతుంటాయి. 'సుత్తి ' , 'అంత సీన్ లేదు ' 'కాలింది '(మండిపోయింది) మొదలైనవి..ఇంకా చాలా ఉన్నాయి గాని ఇప్పుడు విషయం వాటి గురించి కాదు.

ఇలా పుట్టిన మాటల్లో నాకు ఒళ్ళు మండించే మాట ఒకటుంది. అదే "ఆంటీ" ! ఆ మధ్య ఒక బ్లాగులో 'ఆంటీ 'అని పిలవడం పట్ల కొందరు స్త్రీ బ్లాగర్లు బాధ పడ్డారు కూడా! కేవలం బాధ బాధ పడి ఊరుకుంటె లాభం లేదని, ఒక టపా రాసేయాలని అనిపించి రాస్తున్నాను.

నా చిన్నప్పుడు మా అమ్మ స్నేహితుల్ని 'సుశీలత్త ''రాధత్త ' 'కమలత్త 'ఇలాగే పిల్చేదాన్ని! హైస్కూలుకొచ్చాక ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మల్ని 'అత్తా 'అని పిలుద్దామంటె కొంచెం సంకోచంగా ఉండేది.పైగా నా ఫ్రెండ్స్ అన్నలెవరూ అంత పెద్ద అందగాళ్ళు కుడా కాదని తెలిసిపోయింది. ఈ లోపు నా స్నేహితురాళ్ళు మా అమ్మను 'ఆంటీ ' అని పిలిచి నాకు దారి చూపించారు.

ఆడవాళ్ళను గౌరవంగా పిలవడానికి ఉపయోగించే మాటగా దీనికేమైనా నిఘంటువు అర్థం ఉందేమో గానీ నాకు మాత్రం భలే మంట! ముక్కూ, మొహం తెలియనివాళ్ళు వచ్చి 'ఆంటీ' అని పిలవడమేంటి?

మొదట నన్ను మా ఇంటి వోనర్ గారి అమ్మాయి, నా ఈడుదే, పెళ్లైన కొత్తలో వాళ్ళింట్లో చేరిన నాల్రోజుల కల్లా "ఆంటీ అమ్మ మీకు ఇమ్మంది 'అని పాయసమో నా పిండాకూడో ఏదో ఇచ్చి శుభారంభం చేసింది. ఆ రోజు నుండి ఆంటీగా ఫిక్సయి పోయాను. నేను అప్పుడే నన్ను అక్కా అని పిలవమని చెప్పాను సౌమ్యంగానే!

ఆ పిల్ల 'సరే అక్కా ' అని సంతోషంగా ఒప్పేసుకుంది. ఆ మర్నాడు నుంచి మా వారు ఆఫీసు నుంచి రాగానే
' బావా, అక్క నీకు తాళాలియ్యమంది ' అనగానే పాపం తను ఎగిరి పడి పారిపోయారు.
అయినా ఆ అమ్మాయి రూటు మార్చుకోక,
' బావా, అక్క ఇంకా రాలేదా,
బావా అక్క ఆఫీస్ ఎక్కడ,
'బావా ఏడికెల్లొస్తున్నవ్ ' అంటూ బావా బావా బావా అని ఊదరగొట్టేసింది.!
నేను కనపడితే 'అక్కా, బావ డ్యూటీకి పొద్దున్నే పోతడా?'
'బావ నీకంటె స్మార్ట్ కొడుతున్నడు కదా, నిన్నెట్ల షాది చేసుకుంటుండె?' అని మాట్లాడ్డం మొదలెట్టింది.
దీనితో తను ఆఫీస్ అయిపోయాక రోడ్లమ్మట తిరిగి అర్థ రాత్రులు ఆ పిల్ల నిద్రపోయాక ఇంటికి వచ్చి, తిరిగి మరదలు నిద్ర లేవకముందే ఆఫీస్ కి పారిపోవడం ప్రాక్టీస్ చేసాడు.
దానితో నేను మళ్ళీ ఆంటీగా మారడానికి నిశ్చయించుకున్నాను. అదే మొదలు!

సిటీ బస్సులో అయిటే స్కూలు పిల్లలు, కాలేజీ పిల్లలు, పరిచయం లేని మగవాళ్ళు అందరూ 'ఆంటీ ' అనే పిలవడం! పెళ్ళి వల్ల జరిగే నష్టాల్లో ఇదొకటన్నమాట! ఇక లాభం లేదని, వాడుతున్న సబ్బు మానేసి, సంతూర్ సబ్బు మొదలెట్టాను.వాళ్ళూ ఆ మోడల్ కి ఎంత డబ్బిచ్చారో గానీ, సబ్బు వాడాక కూడా నన్ను మాత్రం ఒక్కళ్ళు కూడా ఆంటీ అనడం మానలేదు.

ఇక మా పాప పుట్టాక పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఇదివరలో ఎవరో ఒక్కళ్లన్నా, 'దీదీ' అనో, మేడం అనో పిలిచేవాళ్ళు! ఇప్పుడు చాలా మామూలుగా అదేదో నా పేరన్నట్టు నన్ను 'ఆంటీ' ని చేసేశారు.
పెళ్ళవగానే 'శ్రీమతి ' తో పాటుగా 'ఆంటీ' కూడా బోనస్ గా వచ్చి చేరుతుందని అనుభవ పూర్వకంగా తెలిశాక, ఇహ ఏమీ చెయ్యలేకపోయాను. ఎంతమందికని చెప్పడం "నన్ను పేరుతో పిలవండి ' 'నన్ను ఆంటీ అని పిలవకండి ' అని?

పాలు, పేపరు వేసే వాడు (వయసు నలభై కి తక్కువుండవు) 'ఆంటీ , సారు లేరా? " అని అడిగినపుడు ఒళ్ళు మండి పోతుంది! నేనేమో ఆంటీ, ఆయనేమో 'సారు '!
బయటి నుంచి వస్తుంటే,సెక్యూరిటీ 'ఆంటీజీ,ఆప్ కేలియే కొరియర్ " ఆంటీజీ !,ఇందులో బోడి మర్యాదొకటి!
ఎల్కేజీ చదువుతున్న పాపను స్కూల్లో దింపడానికి వెళితే పదేళ్ళ కొడుకుని తీసుకునొచ్చిన చిన్ని నాయన 'ఆంటీ, వేర్ కెన్ ఐ మీట్ ద ప్రిన్సిపాల్?" అనడుగుతాడా?
మా ఇంటి దగ్గర కడుతున్న ఒక బిల్డింగ్ లో పని చేసే తాపీ పని వాడు "ఆంటీ టైమెంత?" అని అడుగుతాడు.పాతిక నిండకుండానే పదివేల మంది నన్ను ఆంటీ అని పిల్చేసారు.

ఇక చెత్త తీసుకెళ్ళే వాడైతే బెల్లు కొట్టి "చెత్తాంటీ!" (చెత్త ఉందా.ఆంటీ అనడం అన్నమాట) అని అరుస్తాడు. ఇదీ మరీ భయంకరంగా అనిపించింది నాకు. ఎన్ని సార్లు చెప్పినా ప్రతి ఇంటి ముందూ ఇదే కేక! గట్టిగా చీవాట్లేసానొకరోజు "చెత్తాంటీ ఏమిటి నీ మొహం " అని!
మర్నాటినుంచీ వాడు "ఆంటీ, చెత్త " అనరవడం మొదలు పెట్టాడు. "ఒరే నాయనా, చెత్తాంటీ అన్నా, ఆంటీ చెత్త అన్నా తేడా లేదురా " అని చెపితే ఈ లాజిక్ వాడికర్ధం కాలేదు.
పైగా విసుక్కుని "అబ్బ ఏంటాంటీ మీరు, ఒక పని చేయండి మీరంతా, నా బండి పదింటిదాకా ఈ ఏరియాలోనే ఉంటది.తొమ్మిదింటికి మీరు నాకో missed call ఇయ్యండి, నేనొచ్చి చెత్త దీస్క పోతా'నన్నాడు.
అందువల్ల వాడు పైకి రాకుండా చెత్త అంతా కింద కలెక్ట్ చేసుకునే పద్ధతి పెట్టి వాడి నుంచి తప్పించుకున్నాం!

కూరల వాడు, బస్టాప్ లో పక్కన నిల్చున్న కాలేజీ అమ్మాయిలు,పాత పేపర్లు కొనేవాడు,పక్కింటి సాఫ్ట్ వేర్ ఇంజనీర్, (వాళ్ళు నార్త్ ఇడియన్స్ అయితే వాళ్ళ నాన్న కూడా),పై ఇంటి పిల్లల తల్లి, కిందింటి కొత్తగా పెళ్ళైన జంట(ఇద్దరూ) ...అరె ఒకళ్ళా ఇద్దరా!

మగవాళ్ళ కి 'అంకుల్ ' పిలుపు ప్రాబ్లం ముప్ఫై కూడా నిండకుండా ఇంత తీవ్రంగా ఉంటుందనుకోను. అందుకే వాళ్ళు మరణ మృదంగం నవల్లో బిలహణుడిలాగా 'అల్లనల్లన జుట్టు తెల్ల బడినా, ఏ పిల్లా నన్నింత వరకూ అంకులనలేదు ' అని మురిసి పోతుంటారనుకుంటా!

నన్ను ఆంటీ అని పిలిచేవాళ్ళెవరూ మా ఆయన్ని 'అంకుల్ ' అని పిలవగా నేను చూళ్ళేదు. పోయిన వేసవి లో నాలుగేళ్ళ మా అమ్మాయిని స్విమ్మింగ్ క్లాసులకి తీసుకెళ్ళినపుడు ఒక ప్రబుద్ధుడు ఒడ్డున ఉన్న నాతో 'your daughter is an excellent swimmer aunty, where is her dad? అనడిగాడు. అతని పదేళ్ల కొడుకు దున్నపోతులా ఈదుతున్నాడో పక్క!పళ్ళు నూరుతూ 'అదిగో అక్కడున్నార 'ని చూపించాను.
' పేరేంటీ అనడిగి మరీ వెళ్ళి 'మిస్టర్ శ్రీనివాస్, యువర్ డాటరీజ్ గోయింగ్ టు బి ఏ చాంపియన్ ' అని అభినందిస్తుంటే నాకు నిజంగా మండిపోయింది.
ఇలా సింపుల్ గా ఉంటే లాభం లేదు, మా బిల్డింగ్ నిండా లుక లుక లాడుతూ ఉండే నార్త్ ఇండియన్స్ లాగే మనమూ ఫాషన్ గా ఉండాలని నిశ్చయించుకుని VLCC కి వెళ్ళి, బ్యూటి 'ఫుల్లు 'గా మారిపోయి (మారిపోయాననుకుని) ఇంటికొచ్చి బెల్లు కొట్టాను.మా ఆయనఒచ్చి తలుపు తీసి "ఓహ్, సారీ అండి , మా ఆవిడ ఇంట్లో లేదు, తర్వాత రండి! sorry for the inconvenience అని తలుపేశాడు..!
తర్వాత విషయం తెల్సుకుని విసుగ్గా 'అబ్బ, ఎవరేమని పిలుస్తే ఏముందిలెద్దూ!నువ్వెంచక్కా ఎప్పటి లాగా హాండ్లూం చీరెలూ, డ్రెస్సులూ వేసుకో"అన్నాడు.
మనకు ఇంట్లోనే ప్రోత్సాహం లేకపోతే బయటివాళ్లననుకుని ప్రయోజనం ఏముందని నిరాశగా సర్దిచెప్పుకున్నాను!

ఇలా ఉండగా వినాయక చవితి కి మా కమ్యూనిటీలోనే ఒక మండపం పెట్టి కనీసం 5 రోజులు పూజ జరపాలని కాలనీవాళ్ళు నిర్ణయించారు!

అందుకని వినాయకుడు పుట్టినప్పటి నుంచి (అదేలెండి తయారైనప్పటినుంచి) చంద్రుడు పగలబడి నవ్వేంత వరకు పదిహేను సీన్లతో ఒక నాటకం తయారు చేసి పిల్లలతో ప్రాక్టీస్ చేయించి విజయవంతంగా ప్రదర్శించాము! పైగా నాటకం హిందీలో! (ఇక్కడంతా వాళ్ళే ఎక్కువ! మేమేదో సొంత ఇళ్ళల్లోనే చత్రపతి సినిమాలో శరణార్ధుల్లా బతికేస్తున్నాం) తెలుగులో రాసి, దాన్ని ఒక గుజరాతీ అమ్మాయికి ఇంగ్లీషులో వివరించగా ఆవిడ హిందీలో తిరగ రాసింది. నాకు హిందీలో ఇరవై వరకు నెంబర్లే మధ్యలో ఎవరన్నా అందించాలి.


ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్న లలిత్ చోప్రా కి ఇంకా పెళ్ళి కాలేదు.ఎందుకు చెప్పానంటే నన్ను ఆంటీ అనడానికి చోప్రాకి సర్వ హక్కులూ ఉన్నాయన్నమాట!రోజూ సాయంత్రం mind space నుంచి డైరెక్టుగా ప్రాక్టీస్ కి వచ్చి కావాలని ఒకటికి పది సార్లు 'బలే ఉందాంటీ నాటకం ' అనేవాడు. '
'ఇదిగో చోప్రా, నన్ను ఆంటీ అని పిలిచావంటే నిన్ను చంపుతాను ' అని బెదిరించి చూసాను.

చివరి రోజున నాటకం పూర్తయ్యాక, పిల్లలందరికీ బహుమతులు ఇచ్చి, 'మేకప్ చేసిన రాధాంటీ కి, లైట్లు పోకుండా చూసిన సుమన్ ఆంటీకి....అంటూ పిలిచి ఏవో మెమెంటోలు ఇచ్చాడు. నేను స్టేజీ కిందనుంచే 'నన్ను ఆంటీ అని పిలిచావో.....చూడు" అని సైలెంట్ గా తర్జని చూపించాను.

లలిత్ గాడు నవ్వుతూ.."చివరగా ఈ కార్యక్రమం విజయవంతంగా నడిపించిన బేబీ సుజాతని వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాను " అన్నాడు. 'పార్వతిగా వేసినమ్మాయి వల్ల నాటకం రక్తి గట్టిందనుకున్నాం గానీ ఆ పాప పేరు అది కాదే ' అని ఆలోచిస్తుండగా , మా వారు నన్ను చూసి నవ్వుతూ "లలిత్ నిన్నే పిలుస్తున్నాడు ,నువ్వు ఆంటీ అనొద్దన్నావుగా ' అని ముందుకు నెట్టారు.
ఈలోపుగా లలిత్ నాలుగైదు సార్లు 'బేబీ సుజాత , ఎక్కడున్నా స్టేజీ మీదికి రావలెను ' అని అనౌన్స్ చేసాడు. ఆడాళ్లంతా వాడిని కొట్టినంత పని చేసారు. 'మేమంతా ఆంటీలా,తనేమో బేబీనా ' అని!
నేనేమో 'ఓరి దొంగ చచ్చినాడా " అనుకుంటూ లేచాను.
ఆ దెబ్బతో ఒక నాలుగైదు నెల్ల పాటు నేను 'బేబీ' గానే చెలామణి అయ్యాను.
సో, మొత్తానికి పెళ్ళై పిల్ల(లు) పుట్టాక ఎంతటివారలైనా ఆంటీలు అయిపోతారనడానికి ఎంతమాత్రమూ సందేహం లేదు. మీ వయసెంతైనా సరే! మీలో ఎంతమంది ఆంటీలున్నారో, లేక 'ఆంటీ' అని పెళ్లైన ఆడవాళ్లని పిలిచేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులెత్తండి!