Showing posts with label భాష. Show all posts
Showing posts with label భాష. Show all posts

August 30, 2010

తాడేపల్లి గారు రాసిన తెలుగుభాషా ప్రతిజ్ఞ

 తెలుగు బాట కార్యక్రమం కోసం శ్రీ తాడేపల్లి గారు స్వయంగా రాసి, సభికులందరి చేతా చేయించిన తెలుగు భాషా ప్రతిజ్ఞ!  




నా మాతృభాష తెలుగు! నేను నా మాతృభాషను ప్రేమిస్తున్నాను. అందరు తెలుగు 
కవులను,కళాకారులను ,రచయితలను నేను బేషరతుగా గౌరవిస్తాను. తెలుగులో ఉన్న అన్ని 
మాండలికాలూ,శైలులూ నాకు సమానమే! 


తెలుగు గడ్డ మీద అన్ని రంగాలలోనూ తెలుగే వ్యవహారంలో ఉండటానికి నేను అంగీకరిస్తున్నాను.
నేను నా సహోదర తెలుగువారితో ఎల్లప్పుడూ తెలుగులోనే మాట్లాడతాను. 
వారికి తెలుగులోనే లేఖలు రాస్తాను.తెలుగు రానివారు అది నేర్చుకోవడానికి నా ఇతోధిక సహకారాన్ని అందజేస్తాను.తెలుగుభాషకు,వారసత్వానికీ ఎక్కడా, ఏ సందర్భంలోనూ, ఎవరి వలనా అవమానం 
జరగకుండా అన్ని విధాలుగా జాగరూకత వహిస్తాను.


 తెలుగు భాష గురించిన సరియైన పరిజ్ఞానాన్ని 
సంపాదించే నిమిత్తం ప్రేరణ ప్రోత్సాహాలు కలుగజేస్తాను.నా తెలుగు భాషా వారసత్వాన్ని భావి తరాలకు 
యథా తథంగా అందించడానికి ఉద్దేశించిన ప్రతి కార్య కలాపానికీ నా మద్దతు ప్రకటిస్తాను.


రెండు వేల సంవత్సరాల చరిత్ర,సంస్కృతి,సాహిత్య సంప్రదాయమూ కలిగిన తెలుగు 
భాషా వారసత్వం నాకు చాలా గర్వ కారణం! ఈ వారసత్వాన్ని సగర్వంగానూ,బహిరంగంగానూ 
ప్రకటించుకోవడం నా కర్తవ్యం!  శాయశక్తులా దాన్ని నిలబెట్టడానికి కృషి చేయడం నా విధ్యుక్త ధర్మం! 


జై తెలుగు భారతి!

August 26, 2010

తెలుగు బ్లాగర్లకు విజ్ఞప్తి!

(ఈ కార్టూన్ ప్రముఖ కార్టూనిస్టు శ్రీ సరసి గారిది. వారి "సరసి కార్టూనులు-2" నుంచి తీసుకున్నాను.వారికి ధన్యవాదాలు)


ఈ కార్టూన్ చూశారా? దీన్ని మొదటి సారి చూసినపుడు నాకు నవ్వు రాలేదు. "అవును, ఇలాగే ఉన్నాం"అనిపించింది. కొంతకాలానికిది నిజమై పోతుందేమో అని భయమేసింది. మీకూ అలాగే అనిపిస్తోందా?

మాటల్లోనూ రాతల్లోనూ నెమ్మది నెమ్మదిగా నిర్లక్ష్యానికి గురవుతోన్న మాతృభాషను కాపాడుకునేందుకు, భాష గురించిన చైతన్యాన్ని రగిలించేందుకు, భాష గురించి కొందరినైనా ఆలోచింపజేసేందుకు  etelugu సంకల్పించిన "తెలుగు బాట" కార్యక్రమంలో పాల్గొని అందరం కలిసి భాషా చైతన్యం దిశగా భావావేశంతో, నాలుగడుగులు వేద్దాం!

వ్యావహారిక భాషా ఉద్యమకర్త గిడుగు రామమూర్తి గారి జన్మదినమైన ఆగస్టు 29న మాతృభాషా దినోత్సవం జరుపుకుంటున్నాం! ఆ రోజు తెలుగు భాష వినియోగం  పై చైతన్యాన్ని కలిగించేందుకు,పెంచేందుకు "తెలుగుబాట"అనే వినూత్న కార్యక్రమానికి eతెలుగు శ్రీకారం చుట్టింది. సెక్రటేరియట్ ( సచివాలయం )ముందు ఉన్న తెలుగు తల్లి విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డు లో గల పీ.వీ జ్ఞానభూమి వరకు ఒక "నడక"  కార్యక్రమం ఇది!

తెలుగు పై అభిమానం గల మాతృభాషాభిమానులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనేకమంది ప్రముఖులు ,భాషాభిమానులు ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ఇప్పటికే సందేశాలు పంపారు. మీడియా భాగస్వామిగా HMTV ఉన్నందున ఈ సందేశాల వీడియోలను ప్రొమోలు గా మీరు HMTV లో చూడవచ్చ్చు.

 ఈ కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించేందుకు, మరింత ఎక్కువ సంఖ్యలో భాషాభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గత పది రోజులుగా ఈ తెలుగు సభ్యులంతా అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆర్థిక వనరులు లేనందున ఇది సంస్థ సభ్యులకు కొంత భారంగానే తోస్తున్నా తెలుగు మీద ప్రేమతో ముందుకు సాగుతున్నాం!


 తెలుగు బాటకి నేను వెళ్తున్నాను!



హైదరాబాదు బ్లాగర్లంతా ఆ రోజు ఆదివారం కాబట్టి కొద్దిగా వీలు చేసుకుని ఈ నడకలో పాల్గొనమని విజ్ఞప్తి చేస్తున్నాం! 

ఈ నడక ఉద్దేశం ముందుగానే చెప్పినట్లు భాష పట్ల ఒక చైతన్యాన్ని కల్గించేందుకే! ఆ నడకకు వచ్చిన కొందరైనా మాతృభాష గురించి,భాషాభివృద్ధి గురించి ఆలోచిస్తే,కొందరైనా తమ పిల్లలు తెలుగులోనే మాట్లాడేలా చూస్తే,కొందరైనా తమ పిల్లలకు తెలుగులో(రాయడం తెలీని పిల్లలకు  ) రాయడం  నేర్చుకోమని చెపితే మా ప్రయత్నం సఫలమైనట్లే!

 అంతర్జాలంలో తెలుగు భాష వాడకం పై ఇంతకు ముందు ఈ తెలుగు జర్నలిస్టులకు,రచయితలకు రెండు అవగాహనా సదస్సులను విడివిడిగా నిర్వహించింది.వాటికి ఎంతో ఆదరణ లభించింది.ఈ కార్యక్రమానికి కూడా అదే   విధంగా ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నాం!

రండి,అచ్చ తెలుగులో మాట్లాడుకుంటూ ఒక ఆదివారం ఆహ్లాదకరమైన ఉదయాన్ని శోభాయమానంగా తెలుగు కోసం గడుపుదాం! మనతో పాటు నలుగురిని తీసుకువచ్చి నాలుగడుగులు వేయిద్దాం!

మీ పేర్లు నమోదు చేయించుకోండి.

ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యే ఈ నడక దాదాపు తొమ్మిది, తొమ్మిదిన్నరకల్లా ముగుస్తుంది. మీ ఆదివారం వ్యక్తిగత ప్రత్యేక కార్యక్రమాలకు ఏ మాత్రం అడ్డురాని సమయం!

తప్పక రండి,మాతో కలిసి నాలుగడుగులు వేయండి

హైద్రాబాదు తెలుగు బ్లాగర్లు అంతా తప్పక రావాలని కోరుతున్నాం! మిగతా ప్రాంతాల వాళ్ళు వస్తే మాకు మరింత
 సంతోషం

December 28, 2009

మా తెలుగు తల్లికి మల్లెపూదండ!


ఉపయోగకరమైన ఒక అంశం గురించి మనం చెప్పాలనుకున్న విషయం, సందేశం సూటిగా అవతలివారికి చేరితే ఎంత సంతృప్తిగా ఉంటుంది. పుస్తకాల సంతలో ఈ తెలుగు స్టాల్ ద్వారా ఈ అనుభూతి కల్గింది నాకు. ఈ తెలుగులో నాకు సభ్యత్వం ఏమీ లేదు. సెలవుల (ఎటన్నా పొదామంటే బస్సుల్లేవుగా మరి) కారణంగానూ,కొంచెం తీరిక ఉన్న కారణంగానూ స్టాల్ లో స్వచ్ఛందంగా పని చేయడానికి మూడు రోజుల పాటు వెళ్లగలిగాను.




ఎంతోమంది సందర్శకులు, ఎన్నెన్నో ప్రశ్నలు,ఆసక్తులు,అనురక్తులు,మరెన్నో..ప్రశంసలు!





అంతర్జాలంలో తెలుగు వెలగాలన్న లక్ష్యంతో ఈ తెలుగు హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్ కి ఇంత ఆదరణ ఉంటుందని నేను ఊహించలేదు.



ఇంగ్లీష్ మీడియం చదువుల క్రీనీడలో తెలుగు మసకబారుతోన్న సంగతి గుర్తించి, వారి పిల్లలు తప్పకుండా తెలుగు నేర్చుకోవాలన్న కోరికతో తల్లిదండ్రులు స్టాల్ కి వచ్చి చాలా విషయాలు వాకబు చేయడం సంతోషాన్ని కల్గించింది.



పోయిన సారి స్టాల్ కి వచ్చినవారు మళ్ళీ ఈ సారి కూడా వచ్చి తాము బరహ, లేఖిని వంటి ఉపకరణాలను వాడుతున్న సంగతిని పంచుకున్నారు. బ్లాగులు రాయడానికి ఈ సారి ఎంతోమంది ఉత్సాహం చూపించారు. ఏం రాయాలి, కూడలిలో ఎలా చేర్చాలి అన్న విషయాలపై ప్రశ్నలు వేశారు.

కొంతమంది "లేఖిని ఎవరు తయారు చేశారు? ఇక్కడ వీవెన్ ఎవరు?"అని అడిగి తెలుసుకున్నారు.
అవును, వేలకొలది బ్లాగర్లను ఒకచోట చేర్చిన వీవెన్ గురించి అందరూ తెలుసుకోవల్సిందే!



తెలుగు సాఫ్ట్ వేర్లు, ఇతర సాంకేతిక విషయాలతో తయారు చేసిన సీడీలను ప్రత్యేకంగా అడిగి మరీ ఈ తెలుగు స్టాల్ నుంచి వందల కొద్దీ సందర్శకులు అడిగి తీసుకున్నారు. సీడీ కోసం కేవలం ఐదు రూపాయలు ఆపైన మాత్రమే సంస్థ విరాళం తీసుకుంటుందని తెలిసి తెల్లబోయిన వారున్నారు.
"మాతృభాషకోసం చేస్తున్న
ఈమంచిపని కోసం మీరు అడిగి మరీ తీసుకోవాలి విరాళం"అని ఉద్విగ్నంగా అన్నవారున్నారు.
"మీలాంటి వారు ఇప్పుడు తప్పక కావాలి"అని ప్రోత్సాహకరంగా మాట్లాడినవారూ ఉన్నారు.అందుకే ఐదు రూపాయల సీడీకోసం వందరూపాయలిచ్చి తీసుకున్నవారూ ఉన్నారు.





ఎంతోమంది ప్రముఖులు స్టాల్ కి వచ్చి అంతర్జాలంలో తెలుగును గురించిన వివరాలపై ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. వారిలో మెజీషియన్ బి.వి.పట్టాభిరామ్ ,కవయిత్రి జయప్రభ,,శ్రీ బుద్ధ ప్రసాద్,సినీ రచయితలు సుద్దాల అశోక్ తేజ,భాస్కర భట్ల,సీనియర్ జర్నలిస్టు తెలికపల్లి రవి,మరెంతోమంది ఉన్నారు.



ఆసక్తి చూపిన వారి వివరాలను నమోదు చేసిన కాగితంలో "సలహాలు-సూచనలు"అన్న కాలమ్ కూడా ఉంది.అందులో శ్రీ పట్టాభిరామ్ "ఇంకా కావాలా?(సలహాలు?)"అని రాయడం చాలా సంతోషపెట్టిన విషయం!



ఈ తెలుగు సభ్యులు కృపాల్ కశ్యప్, చక్రవర్తి,నాగమురళి,సతీష్ ఈ స్టాల్ విజయానికి చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. ఎవరి వ్యక్తిగత జీవితాలు, ఉద్యోగాలు, బాధ్యతలు వారికున్నా ఒక మాతృభాషా వికాసానికై నెలకొల్పిన ఒక లాభాపేక్ష లేని సంస్థ కొసం ఒక పది రోజులపాటు పక్కనపెట్టి, పూర్తి సమయాన్ని స్టాల్ కోసం కేటాయించిన ఈ నలుగురూ అభినందనీయులు.





వీరితో పాటు స్టాల్ కోసం అంతర్వాహిని బ్లాగర్ రవిచంద్ర కూడా గరిష్టంగా తన సమయాన్ని కేటాయించారు.కేవలం బ్లాగులు చదివి, ఈ తెలుగు స్టాల్లో పని చేయడానికి గుంటూరు నుంచి వచ్చిన డాక్టర్ కౌటిల్య ను విస్మరించలేం!ఎంతైనా అభినందనీయులు. ఇంకా శ్రీహర్ష, హరివిల్లు శ్రీనివాస రాజు, శ్రీనివాస కుమార్(జీవితంలో కొత్తకోణం) నందం నరేష్,విజయ్ శర్మ,వరూధిని,పి.ఎస్.ఎం లక్ష్మిగార్లు కూడా స్టాల్ కోసం తమ సమయాన్ని కేటాయించారు. (ఇంకా ఎవరినైనా మర్చిపొతే తిట్టొద్దు! చెప్పండి చాలు)



స్టాల్ ని సందర్సించిన బ్లాగర్లు ఎంతోమంది.



తెలుగు వారందరికీ తెలుగు రావాలి! తెలుగు అందరిదీ కావాలి.



మా తెలుగు తల్లికి మల్లెపూదండ!

December 24, 2009

విజ్ఞానం......కొంటారా కేజీల్లో?

మొన్నొక రోజు బుక్ ఫేర్ కి వెళ్లానా పుస్తకాలు కొనుక్కుందామని..! అక్కడ ఒక స్టాల్ ముందు ఈ ఫ్లెక్సీ వేలాడదీసి ఉంది. పెద్ద బాల శిక్ష గురించిన ఒక ప్రకటన!






ప్రకటనేమో అచ్చతెలుగు పెద్ద బాల శిక్షకి! అది తెలుగు వారి "మెగా" పెద్ద బాల శిక్ష అట.



అది పక్కన పెడితే కేవలం Rs.116 లకే "ఒకటిన్నర కేజీల విజ్ఞానం" అట! కవర్ పేజీ మీద ఉన్న సరస్వతి సిగ్గుతో తల దించుకోవాలన్నమాట ఈ ఒక్క మాటకీ!



పుస్తకం ఒకటిన్నర కేజీల బరువుందనీ, అంటే ఎక్కువ పేజీలున్నాయనీ చెప్పాలనీ ప్రకాశకుల అభిప్రాయం అనుకుంటాను!



అందువల్ల అత్యుత్సాహంతో అందులో ఉన్న విజ్ఞానమంతా కూడా కలిపి కేవలం ఒకటిన్నర కేజీలు "మాత్రమే"నని వంకాయల లెక్కో ఉల్లిపాయల లెక్కో వేసి తేల్చారు.



విజ్ఞానం ! కేజీల్లెక్కన!




సిగ్గేస్తోంది తెలుగు పుస్తకాలమ్మే వారి తెలుగు పరిజ్ఞానానికి, సృజనాత్మక ఆలోచనలకీ!

గమనిక: ఫొటో బాగా రాలేదు కదూ! తీసింది నేను కాదులెండి! :-))

October 19, 2009

మీకు "ళ" గుణింతం వచ్చా?

ఆ మధ్య ఒకరోజు మా ఎదురింటావిడ బోల్డన్ని నగల్తో కారు దిగి లోపలికొస్తూ పలకరింపుగా నవ్వితే ఎలాగూ ఇంటికొచ్చేసింది కదాని "ఏమిటి విశేషం" అన్నాను.(వెళ్ళేటపుడైతే ఎక్కడికి అని అడక్కుడదంటారుగా)


'పెల్లికెల్లొస్తున్నాను" అంది. "ఎక్కడికీ"అని రెట్టిస్తే మళ్ళీ అదే చెప్పింది. 'ఎవరి పెళ్ళి"అనడిగితే

"మా మురలీ లేడూ,  వాడి పెల్లాం చెల్లెలిది" అని చెప్పింది. ఆవిడనని లాభం లేదు. తెలుగు దేశంలోని తెలుగు వాళ్లలో(బయట కూడా ) "ళ" పలకని వాళ్ళు కోకొళ్ళలు..ఛ..కోకొల్లలు!

వీళ్ళలో ఈ తరం పిల్లలు ఎక్కువ శాతమైతే ప్రాంతాన్ని బట్టి కూడా "ళ" ని "ల"అని పలకాలి కాబోలనుకునే వారు మరికొందరు!ఈ తరం వాళ్లలో ప్రైవేటు న్యూస్ ఛానెళ్ళలో వార్తలు చదివే సీతాకోక చిలకలు అగ్రస్థానంలో ఉంటారు.వరదలు తగ్గాక అక్కడి ప్రజల పరిస్థితుల గురించి ఒక ఛానెల్ లో న్యూస్ రీడర్ ఇలా చదివింది



"వాల్లు నిర్భాగ్యులు! ఊల్లకు ఊల్లు ముంచేసిన వరద తాకిడికి సర్వం కోల్పోయిన వాల్లు! కల్ల ముందే కుల్లిపోతున్న కలేబరాల ను చూసి కల్ల నీల్లు పెట్టుకుంటూ, ఆకలికి ఆగలేక కుల్లి కుల్లి ఏడుస్తున్న పిల్ల గాల్లను చూసి నిస్సహాయులై మల్లీ తిరిగి చూడని అధికార్ల అలసత్వం మీద ఆగ్రహాన్ని వెల్ల గక్కుతూ..." అసలేమైనా బోధపడిందా? ఇది తెలుగా?

ఆమెకు "ళ" పలకదని గ్రహించిన సబెడిటర్లు పాపం ఈ పేరాలో ఇన్ని "ళ"లు లేకుండా చూసుకోవద్దూ!



"మల్లీ ఊల్ల మీద పడ్డ నీల్లు"(వరదల సందర్భంగా)


"కల్ల నీల్లు పెట్టుకున్న తెలుగు తమ్ముల్లు"


" టిటీడీ ఆధ్వర్యంలో పెల్లిల్లు."

"రాష్ట్రంలోని పేదలందరికీ పక్కా ఇల్లు" (రాష్ట్రంలోని పేదలందరికీ ఒకటే ఇల్లు కాదులెండి, పక్కా "ఇళ్ళు" అని వారి ఉద్దేశం)

"బాలగోపాల్ లాంటి జనహితం కోరే వాల్లు"


ఒకటేమిటి.."ళ"పలకాల్సిన ప్రతిచోటా శక్తి వంచన లేకుండా "ల"పలుకుతారు! అసలు ఇంకో ఆణిముత్యం చదవాలి మీరు! "డెడ్ బాడీ నుంచి కల్లు తీసిన యాంకరమ్మ". గురించి చదివారా? కల్లు, సారాయి కాదులెండి, పాపం ఐ బాంక్ వాళ్ళు "కళ్ళు"తీసుకున్న వైనం గురించి చెప్పబోయింది పాపాయి!

మీలో "ళ" గుణింతం ఎంతమందికి వచ్చు? రాయడం కాదు, చదవడం!


ఈ మధ్య ఒక సినిమా చూశాను టీవీలో! సినిమా పేరు అబద్ధం  ! దర్శకుడు బాలచందర్. ఇద్దరు హీరోల్లో ఒకడు ఉదయ్ కిరణ్! అసలు ఉదయ్ కిరణ్ పేరు తల్చుకోగానే ఎవరికైనా గుర్తొచ్చేది ఏమిటి? "ఈ పెద్దోల్లున్నారే"అన్న పేడి డైలాగేగా! ఇందులోనూ అదే పాత్ర అయ్యవారిది. హీరోయిన్ వెంటపడి వేధిస్తూ ఫొటో తీస్తుంటే తెలివి గల ఆ పిల్ల "కొంచెం వెనక్కి వెళ్ళి తియ్యి" అని ఉదయ్ వెనక ఉన్న పదడుగుల గోతిలో పడేలా చేస్తుంది. అప్పుడు హీరో  "గీతా(నిజంగా ఆ అమ్మాయి పేరు ఇది కాదనుకుంటా ! అది రాధ అయ్యుంటే రాదా..అంటాడుగా హీరో! అది రాయడం ఇష్టం లేక...) ప్రేమని నీ చుట్టూ తిరుగుతుంటే నన్ను "పాతాలం" లో పడేశావేంటి"అనడుగుతాడు.



హీరోవిను వాడిని  "అది పాతాలం కాదురా ఫూల్! పాతా"ళం"! "ళ"  పలకటం రాదు, మళ్ళీ తెలుగు వాడినని సొల్లు కబుర్లు చెప్తావు. ముందు "ళ"నేర్చుకోరా గాడిదా"  అని  పిచ్చి తిట్లు తిట్టి వెళ్ళిపోతుంది. ఇలాంటి దృశ్యం ఒకటి తెలుగు సినిమాలో  ఉంటుందని నేనెప్పుడూ కల కూడా కనలేదు. (అది తమిళ సినిమా, తెలుగులోకి డబ్ చేశారు. ఈ లెక్కన "ళ" పలకడం రానివారు తమిళనాడులో కూడా ఉన్నారన్నమాట )

 ఒకరోజంతా హీరో ఆ గోతిలోనే ఉండి "ళ" ప్రాక్టీస్ చేసి మొత్తం "ళ" లు ఉండే పాట పాడతాడు. ఆ పాట
 ఇక్కడ వినండి..(ఆ మాటకొస్తే ఈ పాటలో కూడా తప్పులున్నాయి. అనవసరమైన చోట  కూడా  "ళ" ఉపయోగించారు ఈ పాటలో)



"ళ" పలకవలసిన చోట "ల" పలుకుతుంటే చాలా చిరాకేస్తుంది.


ఇలా "ళ" పలకడానికి బద్ధకించే వాళ్ళు నిత్యం తారసపడుతూనే ఉంటారు. (అవును బద్ధకమే, ఆ అక్షరం మన అక్షరమాలలో ఉన్నపుడు, దానికి "ల" కీ తేడాని స్పష్టంగా చిన్నపుడు నేర్చుకున్నపుడు పలకడం 'రాదు"అంటే ఎందుకొప్పుకోవాలి?)



"కుల్లు మోతు వాల్లు"


"కల్లెం లేని గుర్రం"


"యాపిల్ పల్లు"


"పల్లు రాలగొట్టిన యువతి"(ఈ పళ్ళు వేరు)


"మల్లీ మల్లీ చెప్పినా లాభం లేదు"


"గులాబి ముల్లు"(సింగిల్ ముల్లు కాదు, ముళ్ళు)


"మురలీ రవలి"


"జీవన సరలి"


"చోల రాజుల నాటి శాసనం"


"వీధికెక్కిన ఇల్లాల్లు(ఇల్లాళ్ళు)

 "లలిత కలలు" (లలిత కన్న కలలు అని అర్థం చేసుకోవాలా?)




ఈ మధ్య ఒకచోట "ముల్లు" అని ఉండాల్సిన చోట "ముళ్ళు"అని ఉండటం చదివి తెల్లబోయాను. చాలా మంది జర్నలిస్టులు కూడా ఆర్నెల్లు అని రాయడానికి  "ఆర్నెళ్ళు" అని రాస్తారు."మౌలిక" అని రాయాల్సిన చోట "మౌళిక" అనీ  "మెలకువలు"అని రాయాల్సిన చోట "మెళకువలు" అనీ రాయడం చాల చోట్ల గమనించవచ్చు!



ఒరియా వాళ్ళను ఎప్పుడైనా గమనించారా?వీళ్ళలో దాదాపు చాలా మందికి "ష" పలకడం రాదు. స్టేసన్, ఎమోసన్,ఎగ్జామినేసన్,కరప్సన్...ఇదీ వరస!

దీపక్ మహాపాత్రో అనే ఒక ఫ్రెండ్ ని అడిగితే  "మాకసలు "ష" లేదు"అన్నాడు.  ఉదయ్ సాహు అనే మరో పొరుగాయన అతడిని సమర్థించాడు. (ఎంతవరకు నిజమో నాకు తెలీదు!ఒరియా అక్షర మాల లో ష ఉందో లేదో తెలిసిన వారు చెప్పాలి)



ఇలా అక్షర మాలలో లేని అక్షరాలు పలకలేని వారిని క్షమించవచ్చు. హిందీ మాతృభాష గా గల వారు "ళ"సరిగా పలకలేదంటే ఒప్పుకోవచ్చు గానీ "ళ"పలకడం రాని దక్షిణభారతీయుల్ని చూస్తే ఏమనాలో అర్థం కాదు.



ఇక "శ"ను "ష"లాగా పలికేవాళ్ళను లెక్కపెట్టలేం కాబట్టి వాళ్లగురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది..!



"షిల్పం'

"షషి"


"షరం" (హిందీ సిగ్గనుకునేరు...శరం అని చదూకోండి)

"దేషం"


"దోష"(దోశ)


"దషదిషలు"


"విషాల హృదయం"(భలే కామెడీ కదూ..విషాల..)

వీటికి మీరు కూడా మీకు తట్టిన కొన్ని పదాలు కలుపుకోండి!



భాషను ఎవరైనా సరే ఖూనీ చేయడం సహించకూడని విషయం!  అందునా, ప్రజా జీవితంలో, ముఖ్యంగా మీడియా లో ఉండే వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని నా అభిప్రాయం! . ఎందుకంటే జబర్దస్తీగా మన జీవితాల్లోకి చొచ్చుకొచిన మీడియా ఛానెళ్ల ప్రభావం రేపటి పౌరులమీద తప్పకుండా ఉంటుంది కాబట్టి! ఎంతసేపూ 'ఎవరు ముందుగా వార్తను అందించారన్న పోటీయే తప్ప ఎంత ప్రామాణికమైన భాషను ఉపయోగిస్తున్నామన్న స్పృహే లేకుండా పోయింది ఎలక్ట్రానిక్ మీడియాలో!



"ఇలాంటి సంకర మైన భాషను వినలేకపోతున్నాం! ఇటువంటి అపభ్రంశపు తెలుగు మాకొద్దు!   దీనివల్ల మా పిల్లలకు మాతృభాష మీద విరక్తి కలుగుతోంది. నష్టం కలుగుతోంది ...చర్యలు తీసుకోండి"అంటూ హైకోర్టులో ఒక PIL వేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా?


నాకైతే నమ్మకం లేదు! మీకో?